16, ఫిబ్రవరి 2022, బుధవారం

ఊర్ధ్వ శ్వాసపథము



 

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )



                     ఊర్ధ్వ శ్వాసపథము 

                     ( Upper Airway )


                                                                             డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి                 

     మనము ఉచ్ఛ్వాసములో ముక్కుద్వారా తీసుకొనే గాలి ఊపిరితిత్తులకు చేరుతుంది. నిశ్వాసములో ఊపిరితిత్తుల నుంచి గాలి ముక్కు ద్వారా విసర్జింపబడుతుంది. ముక్కునుంచి స్వరపేటిక వఱకు గల శ్వాసమార్గము ఊర్ధ్వ శ్వాసపథము ( ఎగువ శ్వాసమార్గము / upper airway ). స్వరపేటిక నుంచి ఊపిరితిత్తుల వఱకు ఉన్న శ్వాసమార్గము అధో శ్వాసపథము (దిగువ శ్వాసమార్గము / lower airway).

ముక్కు 

    ముక్కు ముందున్న రెండు రంధ్రములతో ( పూర్వ నాసికా రంధ్రములు / anterior nares ) వాతావరణముతో అనుబంధము కలిగి ఉంటుంది.    ముక్కులో ఉన్న మధ్య గోడ ( septum ) ముక్కును రెండు భాగములుగా విభజిస్తుంది. ముక్కులోపల ప్రతిపక్కా ప్రక్క గోడలో మూడు నాసికాశుక్తులు ( nasal turbinates / nasal conchae ) ఒకదాని క్రింద వేఱొకటి ఉంటాయి. ఆ శుక్తులు క్రింద నాసికాకుహరముల ( paranasal sinuses ) ద్వారములు తెరుచుకొని ఉంటాయి.

     ముక్కు  వెనుక ఉన్న రంధ్రముల ( పర నాసికారంధ్రములు / posterior nares ) ద్వారా గొంతుతో కలుస్తుంది. గొంతునే గళము , సప్తపథ ( pharynx ) అని కూడా పిలుస్తారు. ముక్కుకు నోటికి మధ్య అంగిలి ( తాలువు / palate ) ఉంటుంది. తాలువు ముందు భాగము కఠినతాలువులో ఎముక ఉంటుంది. తాలువు వెనుక భాగము మృదుతాలువులో ఎముక ఉండదు.

                        సప్తపథ ( గళము )                                స్వరపేటిక - స్వరతంత్రులు
   
                                                         

సప్తపథ ( గళము / Pharynx ) 

    గొంతు ( గళము ; సప్తపథ - Pharynx ) ముక్కును స్వరపేటిక తోను, ఊపిరితిత్తులతోను, నోటిని అన్ననాళముతోను కలిపే కండరపు గొట్టము. గొంతు లోపలి భాగము శ్లేష్మపుపొరతో ( mucous membrane ) కప్పబడి ఉంటుంది. ముక్కు వెనుక రెండు రంధ్రములు ( పర నాసికారంధ్రములు / posterior nares ), మధ్య చెవులను గొంతుతో కలిపే రెండు శ్రవణ గళ నాళికల ద్వారములు ( Eustachian tubes ), నోటి ద్వారము ( వక్త్రగళ ద్వారము / fauces ), స్వరపేటిక, అన్ననాళము, మొత్తము ఏడు మార్గములు సప్తపథతో కలిసి ఉంటాయి.

నాసికాగళము ( ( Nasopharynx )


    గొంతు లేక గళములో మూడు భాగములు ఉంటాయి. ముక్కు వెనుకను, మృదుతాలువునకు (soft palate) పైనా ఉండు గొంతు భాగము నాసికాగళము ( Nasopharynx ). నాసికాగళములోనికి రెండు ప్రక్కలా శ్రవణగళ నాళికల (Eustachian tubes ) ద్వారములు తెరుచుకుంటాయి. ఈ శ్రవణగళ నాళికలు మధ్యచెవులను ( middle ears ) గొంతుతో కలుపుతాయి. నాసికాగళము ముందు భాగములో ముక్కు వెనుక రంధ్రములు ( posterior nares ) తెరుచుకుంటాయి. వెనుక భాగములో శ్లేష్మపు పొర క్రింద దళసరి రసికణజాల రాశులు ( lymphoid tissue / adenoids  ) ఉంటాయి.

వక్త్రగళము ( Oropharynx )


   నోటి వెనుక ఉండు గొంతు భాగము వక్త్రగళము ( Oropharynx ). ఈ భాగము అంగిలి ( తాలువు / palate) నుంచి కంఠికాస్థి ( hyoid bone ) వఱకు ఉండే గళభాగము. మృదుతాలువు నుంచి రెండు పక్కలా నాలుక మూలమునకు ఒకటి, గళమునకు ఒకటి  తెరలు ( tonsillar pillars ) క్రిందకు దిగుతాయి. ఈ తెరల నడిమిలో (గళ) రసికణజాల గుళికలు ( tonsils ) ఉంటాయి. మృదుతాలువు మధ్యభాగము నుంచి కొండనాలుక ( ఉపజిహ్వ / uvula ) గొంతులోనికి వ్రేలాడుతుంది.

అధోగళము ( Hypo pharynx )


     కంఠికాస్థి ( hyoid ) నుంచి అన్ననాళ ప్రవేశద్వారము వఱకు ఉండు గొంతు భాగము అధోగళము ( Hypo pharynx ). దీనిలో ముందుభాగములో స్వరపేటిక ఉంటుంది. స్వరపేటికకు మీద నాలుక మూలములో స్వరపేటిక మూత ( epiglottis ) ఉంటుంది. ఆహారమును శ్వాసపథమునుంచి తప్పించి అన్ననాళమువైపు మరలించుటకు ఈ స్వరపేటిక మూత తోడ్పడుతుంది. స్వరపేటికకు ఇరుప్రక్కల కాయల ఆకారపు గుంతలు ( pyriform fossae ) ఉంటాయి. 

   సప్తపథము స్వరపేటిక క్రింద ఉండే ముద్రికా మృదులాస్థి ( cricoid cartilage ) వెనుక, ముద్రికా గళ నియంత్రణ కండరము ( crico pharyngeal sphincter ) క్రింద అన్ననాళముగా కొనసాగుతుంది. ముద్రికా మృదులాస్థి ( cricoid cartilage ) ఉంగరపుటాకారములో ఉంటుంది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి