16, అక్టోబర్ 2019, బుధవారం

అసహన నాసికాతాపము ( Allergic Rhinitis

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో  )

                         అసహన నాసికా తాపము

                             ( Allergic Rhinitis )

                                         

                               డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి                                                                                  .





                                     ముక్కుతోడ మున్ను మూర్కొన్న నవపుష్ప                                 
                                     రజము మిక్కుటముగ  రట్టు సేసె ;
                                     వచ్చుననగ రాదు, వారింపగాఁ బోదు,
                                     తుమ్ము ;  దాని సొమ్ము వమ్ము గాను !

      ( మూర్కొను = వాసన చూచు ; రజము = పుప్పొడి ; రట్టు = అలజడి , చికాకు ; వమ్ము = వ్యర్థము )

        వివిధ పదార్థముల వలన  అసహనములు ( allergies ) కలిగి  ముక్కులో తాపము కొన్ని ఋతువులలో కాని లేక సంవత్సరము పొడవునా కాని కలుగవచ్చును.


ఋతు అసహనములు ( Seasonal allergies ) 


    పూల పుప్పొడులు ( pollen ), శిలీంధ్రబీజములు ( fungal spores ), గాలిద్వారా ముక్కులోనికి ప్రవేశించినపుడు  వాటికి అసహనము ( allergy ) కల వారిలో తాప లక్షణములు కలుగుతాయి. కీటకములద్వారా పరాగసంపర్కము జరిగే పూల పుప్పొడుల పరిమాణము హెచ్చుగా ఉండుటచే అవి త్వరగా నేలపైకి రాలిపోతాయి. గాలిచే పరాగసంపర్కము చెందే  పూల పుప్పొడులు తేలికగా ఉండి గాలితో ఎగురుకొని ముక్కులోనికి శ్వాసపథము లోనికి చొచ్చుకొనగలుగుతాయి. మొక్కలు, చెట్లు, పుష్పించు కాలము బట్టి ఆ యా అసహనములు ( allergies ), వాటి వలన నాసికా తాపములు ( rhinitis ) కలుగుతాయి.


వార్షిక అసహనములు  ( perennial allergies ) 


    ధూళి క్రిములు ( dust mites ), పెంపుడు జంతువుల శిథిల కణములు ( animal dander ), ఇళ్ళలో వసించు బొద్దింకలు, యితర కీటకముల విసర్జనలు, ఇళ్ళలో ఉండే శిలీంధ్రముల వలన సంవత్సర మంతా అసహనములు కలిగి నాసికా తాపము ( rhinitis ) కలుగవచ్చును.


వ్యాధి విధానము ( Pathogenesis ) 


    నాసికా తాపము కలిగించే పరాగములు ( pollen ), ధూళిక్రిముల వంటి తాప జనకములు ప్రతిజనకములుగ ( antigens ) శరీరము లోనికి ప్రవేశించి శరీర రక్షణ వ్యవస్థను ప్రేరేపించి ప్రతిరక్షకములు ( antibodies ) ఇమ్యునోగ్లాబ్యులిన్- ఇ  (Immunoglobulin- E ) ల ఉత్పత్తికి  కారణము అవుతాయి.

    ఈ ఇమ్యునోగ్లాబ్యులిన్ - ఇ ముక్కు శ్లేష్మపు పొరలోను ( mucosa ) శ్వాసపథ శ్లేష్మపు పొరలోను ఉండే స్తంభ కణములతో ( mast cells ) సంధానమవుతాయి. ప్రతిజనకములు ( antigens ) మఱల ముక్కు, శ్వాసపథముల లోనికి ప్రవేశించినపుడు  అవి శ్లేష్మపు పొరలోనికి చొచ్చుకొని అచ్చటి స్తంభ కణములకు అంటుకొని ఉన్న ఇమ్యునోగ్లోబ్యులిన్ - ఇ ( immunoglobulin - E ) ప్రతిరక్షకములతో  కూడుకొని స్తంభకణముల నుంచి హిష్టమిన్ ( histamine  ), లూకోట్రయీన్స్ ( leukotrienes ),  ప్రోష్టాగ్లాండిన్స్ ( prostaglandins ), కైనిన్స్ ( Kinins ) వంటి తాపము కలిగించే రసాయనముల విడుదలకు కారణము అవుతాయి. వాటివలన రక్తనాళములు వ్యాకోచము చెందుతాయి. కేశరక్తనాళికలలో పారగమ్యత ( capillary permeability ) పెరుగుతుంది. శ్లేష్మపుపొర పొంగుతుంది. శ్లేష్మము ( mucous )  అధికముగా ఉత్పత్తి అవుతుంది. ఆమ్లాకర్షణ కణములు ( eosinophils ), క్షారాకర్షణ కణములు ( basophils ), తటస్థ కణములు ( neutrophils ), ఏకకణములు ( monocytes ) కూడా శ్లేష్మపు పొరలోనికి రసాయన ఆకర్షణ ( chemotaxis ) వలన కూడి తాప ప్రక్రియకు దోహదపడుతాయి. తాపము వలన ముక్కులో దురద, తుమ్ములు, ముక్కు నీరుకారుట కలుగుతాయి.


వ్యాధి లక్షణములు 


    అసహనములు గల వారు అసహనము కల పదార్థముల బారి పడినపుడు వారికి అసహన నాసికా తాప ( allergic rhinitis ) లక్షణములు  కలుగుతాయి. ముక్కు దిబ్బడ కట్టుట, ముక్కు నుంచి నీరు కారుట ( rhinorrhoea ), ముక్కులోను గొంతులోను అంగుటిలోను దురద, తఱచు తుమ్ములు కలుగుతాయి. ముక్కులోని స్రావకములు గొంతులోనికి దిగుటచే దగ్గు, కఫము, గొంతు బొంగురు పోవుట కూడా కలుగవచ్చును. నాసికా కుహరముల ( Paranasal sinuses ) పైన నొప్పి, తలనొప్పి  కలుగవచ్చును. కనుఱెప్పల లోపొరలలో ( conjunctiva ) దురద , కళ్ళు నీరుకారుట కూడా కలుగవచ్చును.

    వైద్యులు పరీక్షించినపుడు ముక్కులో తేమ, నీటిని పోలిన స్రావకములు, ముక్కు శ్లేష్మపు పొరలో( mucosa ) వాపు, కనిపిస్తాయి. వివర్ణమై  శ్లేష్మపుపొర లేత గులాబి రంగులో ఉంటుంది . ముక్కు వెలుపలి గోడలపై ఉండు నాసికా శుక్తులలో ( nasal turbinates ) వాపు కనిపిస్తుంది. గొంతు కూడా లేతగులాబి వర్ణములో ఉంటుంది. గొంతులో కూడా తేమ, ముక్కు నుంచి వెనుకకు కారు స్రావకములు కనిపించవచ్చును. దీర్ఘకాల అసహన నాసికా తాపములు గలవారిలో క్రింద కనుఱెప్ప చర్మములో కనుగుంటల సమీపములో   నలుపుదనము కలుగవచ్చును.
ముక్కుదిబ్బడ ఎక్కువగా ఉన్న వారు నోటితో గాలి పీల్చుకొనుట చూస్తాము. దుఱద ఉండుట వలన ముక్కును పిల్లలు తఱచు అరచేతితో పాముకొంటుంటారు. దీనిని allergic salute గా వర్ణిస్తారు.

వ్యాధి నిర్ణయము 


    ఋతు అసహనములు ( seasonal allergies ) నిర్ణీత ఋతువులలో చెట్లు, మొక్కలు, గడ్డి పుష్పించునపుడు కలుగుతాయి. ముక్కులో దుఱద, ఎక్కువగా తుమ్ములు, కళ్ళలో దుఱద, కళ్ళు నీరు కారుట వంటి లక్షణములు, ముక్కు నుంచి స్రావకములు పలుచగా ఉండుట అసహనములను ( allergies ) సూచిస్తాయి. ధూళి వలన కలిగే అసహన లక్షణములు ధూళి సోకగానే కనిపిస్తాయి.

పరీక్షలు 


    నాసికా స్రావకములను గాజు పలకపై పూతగా పూసి, తగిన వర్ణకములతో ( Wright’s stain ) సూక్ష్మదర్శినితో పరీక్షించినపుడు ఆమ్లాకర్షణ కణములు ( eosinophils ) గుమికూడి కనిపించవచ్చును. కనిపించిన శ్వేతకణములలో 10 శాతము మించి ఆమ్లాకర్షణ కణములు ఉంటే అసహనమును సూచిస్తాయి.

    రక్తపరీక్షలో ఆమ్లాకర్షణ కణములు 10 శాతము మించి ఉండవచ్చును. ఘన మిల్లీ మీటరు రక్తములో ఆమ్లాకర్షణ కణములు 700 మించి ఉండవచ్చును.

    రక్తద్రవములో ( plasma ) ప్రతిరక్షకము - ఇ ( Immunoglobulin E ) ప్రమాణములు అసహనములు కలిగినపుడు, ఉబ్బస వ్యాధిలోను, దేహములో పరాన్నభుక్తులు చేరినపుడును  హెచ్చుగా ఉంటాయి.

    కొన్ని నిర్ణీత ప్రతిజనకములకు ( specific antigens )  నిర్దిష్ట ప్రతిరక్షకములు - ఇ లను (specific IgE s ) రక్తద్రవములో వివిధ పరీక్షల ద్వారా కనుగొని  ఏ ప్రతిజనకములకు ( antigens ) అసహనములు ఉన్నవో నిర్ణయించవచ్చును.  ఈ పరీక్షలలో వ్యాధిగ్రస్థులకు ఎట్టి ప్రమాదము కలుగదు.

పైచర్మపు పరీక్షలు ( epicutaneous tests ) 


    పైచర్మములో సూదులతో వివిధ  విలీన ప్రతిజనకములను ( antigens ) నిలిపి చర్మపు స్పందనముల (  దద్దురు - ఎఱుపు - wheal and flare ) బట్టి ఏ ప్రతిజనకములకు ( antigens ) అసహనములు ( allergies ) ఉన్నవో నిర్ణయించవచ్చును.

లోచర్మపు పరీక్షలు  ( intra dermal tests ) 


    పైచర్మపు పరీక్షలలో చర్మము స్పందించక పోయినా, లేక స్పందన తక్కువగా ఉన్నా, వినీల ప్రతిజనకములను లోచర్మములో ( Intra dermal )  సూదితో నిలిపి స్పందన బట్టి అసహనములను నిర్ణయించవచ్చును. కాని ఈ పరీక్షలలో అసహనములు కలవారిలో ప్రమాదకర రక్షణ వికటత్వము  ( anaphylaxis ) కలిగే అవకాశము హెచ్చు. ఈ పరీక్షల వాడుక అరుదు .

అంటింపు పరీక్షలు  ( patch tests ) 


    ప్రతిజనకములు ( antigens ) కల పత్రములను నడ్డిపై  చర్మమునకు అంటించి చర్మపు స్పందనను రెండు దినములు, నాలుగు దినములలో పరిశీలించి అసహనములను నిర్ణయించవచ్చును.

తొలగింపు / సవాలు పరీక్షలు (  Elimination  / challenge tests  ) 


    ఆహార పదార్థములకు, ఔషధములకు, యితర పదార్థములకు అసహనములను అనుమానించినపుడు ఆ పదార్థములను పూర్తిగా తొలగించి, అసహన లక్షణములు పూర్తిగా తగ్గిపోయాక, ఒక్కొక్క పదార్థమును తర్వాత  చేర్చి ఆ పదార్థము వలన అసహనము కలిగిందో లేదో నిర్ధారించవచ్చును.

    అసహనములకు పరీక్షలు  వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తగా చెయ్యాలి. రక్షణ వికటత్వము ( anaphylaxis ) వంటి విపరీత పరిణామములను ఎదుర్కొనుటకు  వైద్యులు సంసిద్ధులై ఉండాలి.

ఇతర నాసికా తాపములు ( Rhinitis from other causes ) 


    విషజీవాంశములు ( viruses ), సూక్ష్మజీవుల వలన కలిగే జలుబు, నాసికా తాపములు తఱచు కాక అప్పుడప్పుడే కలుగుతాయి. వీటిలో తుమ్ములు కంటె ముక్కు కారుట ఎక్కువగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు, నీరసము, జ్వరము వంటి లక్షణములు శరీరపు అస్వస్థతను సూచిస్తాయి. ముక్కు నుంచి కారు స్రావకములు చీమును పోలి ఉంటాయి. ముక్కు , గొంతుకలలో ఎఱ్ఱదనము ఎక్కువగా ఉంటుంది.

    గర్భిణీ స్రీలలో ముక్కు కారుట, తుమ్ములు కలుగవచ్చును ( Rhinitis of Pregnancy ).

    ముక్కులో సాంద్రత తగ్గించే ఔషధములు ( decongestants ) పెక్కుదినములు వాడి మానివేసినపుడు నాసికాతాప లక్షణములు కనిపించవచ్చును ( Rhinitis medicamentosa ).

    వాతావరణ కాలుష్యములు, సుగంధ ద్రవ్యములు అసహనము కలిగించకుండా ముక్కులో తాప లక్షణములను కలిగించవచ్చును (non allergic irritant rhinitis ).

చికిత్సలు 


అసహనము గల పదార్థముల నుంచి తప్పించుకొనుట 


    అసహనములు గలవారు అసహనములు కలిగించే పూల పుప్పొడులు, శిలీంధ్ర బీజములు ( fungal spores ), ధూళిక్రిములు, జంతువుల శిధిల కణములకు ( animal dander ) దూరముగా ఉండుటకు ప్రయత్నించాలి. ఇళ్ళలో వాయు నియంత్రణులు ( air conditioners ), పరమాణువు జల్లెడలు ( electronic filters ), ఆర్ద్ర సాధనములు ( humidifiers ) గాలిలో పరాగములను, శిలీంధ్ర బీజములను ( mold spores ), తొలగించుటకు ఉపయోగపడుతాయి. గాలిలో తగినంత తేమను సమకూరుస్తాయి. ఈ పరికరములు లేనివారు, బయటకు వెళ్ళేటపుడు ముక్కు , నోటి కప్పులు ( masks ) వాడితే అవి గాలిని వడకట్టి పీల్చే గాలిలో ప్రతిజనకములను ( allergens ) అడ్డగిస్తాయి.

ఔషధములు 


హిష్టమిన్ గ్రాహక అవరోధకములు  ( Histamine receptor blockers ; antihistamines ) 


    అసహన నాసికా తాపములను అరి కట్టుటకు హిష్టమిన్ అవరోధకములను ( Histamine receptor blockers ) విరివిగా ఉపయోగిస్తారు. అవసరమయినపుడు వీటిని ప్రతిజనకములు ( antigens ) పీల్చుటకు ముందే తీసుకోవాలి. నిర్ణీత సమయములలో వీటిని  క్రమము తప్పక తీసుకొని అసహన నాసికా తాపములను ( allergic rhinitis ) చాలా వఱకు నివారించవచ్చును.

    ఇవి ముక్కులో దురద, నీరుకారుట ( rhinorrhoea ), తుమ్ములు, వంటి బాధలను నివారిస్తాయి. ఎజెలాష్టిన్ ( azelastine ) తుంపర మందుగా లభ్యము. ముక్కు లోపలి గోడలపై యీ మందును తుంపరులుగా చల్లుకుంటే గంటలో ఉపశమనము కలుగవచ్చును. కంటి పైపొరలో అసహన తాప లక్షణములు ( allergic conjunctivitis  ) కలిగితే కంటిలో ఎజెలాష్టిన్ ను చుక్కలమందుగా వాడవచ్చును.

    అనేక హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ( Histamine receptor blockers ) నోటి ద్వారా తీసుకొనుటకు  లభ్యము. డైఫెన్ హైడ్రమిన్ ( diphenhydramine ) వంటి మొదటి తరము హిష్టమిన్ గ్రాహక అవరోధకములు మెదడుకు కూడా చేరుట వలన వాటివలన కొందఱిలో మత్తు, నిద్ర, నిద్రలేమి ( insomnia ), కళ్ళుతిరుగుట వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును.

    సెట్రిజిన్ ( cetrizine ), లొరాటడిన్ ( loratadine ) వంటి రెండవ తరము మందుల వలన మత్తు కలిగే అవకాశములు తక్కువ. ఇవి మెదడుకు చేరవు. 
   ఈ మందుల వలన మసక చూపు, నోరు పిడచకట్టుట,  మూత్రవిసర్జన అలసత్వము వంటి అవాంఛిత ఫలితములు కలుగ వచ్చును.

ఆల్ఫా ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు ( alpha adrenergic receptor agonists ) 


    ఇవి ముక్కు  శ్లేష్మపు పొరలో ఉన్న రక్తనాళికలను సంకోచింపజేసి నీరుకారుటను అరికడుతాయి.
ఆక్సిమెటజోలిన్ ( oxymetazoline ) ముక్కులో వాడుటకు తుంపర మందుగా లభ్యము. దీనిని ఎక్కువ దినములు వాడకూడదు. ఎక్కువ దినములు వాడి మందు మానివేసినపుడు ముక్కులో సాంద్రత ( nasal congestion ) విజృంభించవచ్చును ( rhinitis medicamentosa ).

    నోటి ద్వారా తీసుకొందుకు ఫెనిలెఫ్రిన్ ( phenylephrine ), సూడోఎఫిడ్రిన్ ( pseudoephedrine ) వంటి  ఆల్ఫా ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు ( alpha adrenergic agonists ) లభ్యము. వీటి వలన గుండెదడ, గుండెవేగము హెచ్చుట, మానసిక ఆందోళన, చీకాకు, రక్తపు పోటు హెచ్చుట, నిద్రపట్టక పోవుట, తలనొప్పి  వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. అధిక రక్తపుపోటు గలవారు ఈ మందులను వాడకపోవుట మంచిది.

క్రొమొలిన్ సోడియం ( Cromolyn sodium  ) 


    క్రొమొలిన్ సోడియం స్తంభ కణములను ( mastocytes ) సుస్థిరపరచి తాప జనకముల ( inflammatory mediators ) విడుదలను అరికడుతుంది. ఆమ్లాకర్షణ కణముల ( eosinophils ), తటస్థ కణముల ( neutrophils ), ఏకకణముల ( monocytes ) ఉత్తేజమును కూడా ఇది తగ్గిస్తుంది. క్రొమొలిన్ సోడియం తుంపరమందుగా లభ్యము. దీని వలన అవాంఛిత ఫలితములు తక్కువ. మత్తు కలిగించదు. కొందఱిలో ( 10 శాతము లోపల మందిలో ) దీని వలన  ముక్కులో మంట, తుమ్ములు  కలుగవచ్చును

 నెడొక్రొమిల్ సోడియం ( Nedocromil sodium )


    నెడొక్రొమిల్ సోడియం కూడా స్తంభ కణములను, ఇతర తాప కణములను సుస్థిరపఱచి వాటి నుంచి తాప జనకముల ( inflammatory mediators ) విడుదలను అరికడుతుంది.

కార్టికోష్టీరాయిడులు (  Corticosteroids  )


    అసహనము వలన కలిగే నాసికా తాపములు తీవ్రముగా ఉన్నపుడు, దీర్ఘకాలము ఉన్నపుడు,మిగిలిన ఔషధములకు తగ్గనపుడు వాటి నివారణకు స్థానికముగా పనిచేసే కార్టికోష్టీరాయిడులు ( locally acting corticosteroids ) తుంపర మందులుగా వాడవచ్చును. బెక్లోమిథసోన్  ( beclomethasone ), ఫ్లునిసొలైడ్ ( flunisolide ), మోమెటసోన్ ( mometasone ), ఫ్లుటికసోన్ ( fluticasone ), ట్రయామ్ సినొలోన్ ( triamcinolone ), బ్యుడిసొనైడ్ ( budesonide ) లు తుంపర మందులుగా వాడుకలో ఉన్నాయి. ఈ మందులు ముక్కు శ్లేష్మపు పొర ( mucosa ) ఉపరితలముపై పనిచేస్తాయి. వీటి వలన శరీరము అంతటా అవాంఛిత ఫలితములు కలుగవు. త్వరగా విచ్ఛేదనము పొందుతాయి. వీటి ఫలితములు కనిపించుటకు కొద్ది దినములు పడుతుంది. ఋతు అసహనముల నివారణకు వీటిని ఋతుకాలము అంతా పూర్తిగా వాడుట మేలు.

    వీని వాడకము వలన తుమ్ములు, ముక్కు మంట, ముక్కునుంచి రక్తస్రావము ( epistaxis ) వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. అరుదుగా  శ్లేష్మపు పొరలో ( mucosa ) మధుశిలీంధ్ర తాపము ( Candidial infection ),  శ్లేష్మపుపొర పుండుపడుట కలుగవచ్చును.

    తాప లక్షణముల తీవ్రత అధికముగా ఉన్నపుడు ప్రెడ్నిసోన్ ( prednisone ) నోటి ద్వారా నియమిత కాలము వాడవచ్చు. ఎక్కువ దినములు వాడితే శరీరములో అవాంఛిత ఫలితములు కలిగే అవకాశములు హెచ్చు.
      
    సూదిమందుగా ట్రయామ్సినొలోన్ ( triamcinolone ), బీటామిథసోన్ లు ( betamethasone ) వాడవచ్చును. వీటి ఫలితములు అల్పకాలమే ఉంటాయి. తఱచు వాడితే అవాంఛిత ఫలితములు కలిగే అవకాశములు పెరుగుతాయి.

ఇప్రట్రోపియమ్ బ్రోమైడు ( Ipratropium bromide ) 


    దీనిని తుంపరమందుగా ముక్కు నుంచి నీరుకారుటను నివారించుటకు వాడవచ్చును. ఇది ఎసిటైల్ ఖొలీన్  గ్రాహకములను (acetyl choline receptors  ) అవరోధిస్తుంది.

ప్రతిజనక రక్షక చికిత్స ( allergen immunotherapy AIT ) 


    పుప్పొడి ( pollen ), శిలీంధ్ర బీజములు ( fungal spores ), ధూళి క్రిములు ( dust mites ) వంటి ప్రతిజనకములకు ( antigens ) ప్రతిరక్షకము - ఇ ల ( immunoglobulin E ) ద్వారా అసహనములు కలుగుచున్నట్లు నిరూపణ అయితే, ఆ యా ప్రతిజనకములను ( antigens ) నోటిలో నాలుక క్రిందకాని, చర్మము క్రింద సూదిమందుగా గాని అనుభవజ్ఞులయిన వైద్యుల పర్యవేక్షణలో చాలా తక్కువ మోతాదులలో మొదలు పెట్టి క్రమముగా మోతాదులను  పెంచి ఇస్తూ, సహనమును ( tolerance ) పెంపొందించవచ్చును. రక్షణ వికటత్వము ( anaphylaxis ) కలిగితే చికిత్సకు సిద్ధపడాలి. 


పదజాలము :


Paranasal sinuses = నాసికా కుహరములు ( గ.న )
Seasonal allergy  = ఋతు అసహనము ( గ.న )
Nasal turbinates ; Nasai Conchae = నాసికా శుక్తులు ( గ.న )
Chemotaxis = రసాయన ఆకర్షణ ( గ.న )
Anaphylaxis = రక్షణ వికటత్వము ( గ.న )
Air- conditioner = వాయు నియంత్రణి (గ.న ) 
Humidifier = ఆర్ద్ర సాధనము ( గ.న )
Receptor agonists = గ్రాహక ఉత్తేజకములు (గ.న )
Receptor blockers = గ్రాహక అవరోధకములు గ.న )
  

(  వైద్యవిషయములను తెలుగులో నా శక్తి కొలది వివరించుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను సంప్రదించవలెను. ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా నా  వ్యాసములు  పంచుకొనవచ్చును. )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...