21, ఏప్రిల్ 2020, మంగళవారం

సత్వర మూత్రాంగ విఘాతము ( Acute kidney injury )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )


           సత్వర మూత్రంగ విఘాతము

                                       ( Acute Kidney Injury )

       
                                                                                       డా. గన్నవరపు నరసింహమూర్తి.                        .

                         
    శరీరములో వివిధ అవయవముల కణజాలములో జరిగే జీవవ్యాపార ప్రక్రియలో
( metabolism ) వ్యర్థ పదార్ధములు ఉత్పత్తి అయి రక్తములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థ పదార్థాలను రక్తము నుంచి ఎప్పటి కప్పుడు తొలగించి రక్తమును శుద్ధిచేసి శరీర అవయవములను పరిరక్షించి శరీర వ్యాపారమును ఆరోగ్యకరముగా నడిపించుట చాలా అవసరము. జంతుజాలములోను పక్షులలోను ఆ బాధ్యత మూత్రాంగములు ( Kidneys ) నిర్వహిస్తాయి.

    మూత్రాంగములు వివిధ కారణముల వలన ఘాతములకు ( injuries & insults  ) లోనయితే వాటి నిర్మాణములో మార్పులతో పాటు  వాటి వ్యాపారము కూడా మందగించవచ్చును. ఈ మూత్రాంగ విఘాతము తక్కువ కాలములో త్వరగా ( 7 దినములలో ) కలిగితే దానిని  సత్వర మూత్రాంగ విఘాతము ( Acute Kidney Injury ) లేక సత్వర మూత్రాంగ వైఫల్యముగా ( Acute Renal Failure )  పరిగణిస్తారు.

    తక్కువ సమయములో రక్తద్రవములో  క్రియటినిన్ ( serum creatinine  ) ప్రమాణములు పెరుగుట కాని, మూత్రవిసర్జన ( urine output ) పరిమాణము బాగా తగ్గుట కాని సత్వర మూత్రాంగ విఘాతమును సూచిస్తాయి.

కారణములు 


    సత్వర మూత్రాంగ విఘాతమునకు ( Acute Kidney Injury ) కారణములు మూత్రాంగములకు ముందు గాని ( Prerenal ), మూత్రాంగములలో గాని ( Renal parenchyma ), మూత్రాంగముల తరువాత గాని ( Post renal) ఉండవచ్చును.

మూత్రాంగ పూర్వ ( మూత్రాంగములకు ముందు ఉండు ) కారణములు ( Pre renal causes ) 


    మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుట వలన మూత్రాంగ వైఫల్యము, మూత్రాంగ విఘాతము కలుగగలవు . వాంతులు, విరేచనములు, రక్తస్రావము ( hemorrhage) వలన ), ఇతర కారణముల వలన రక్త ప్రమాణము తగ్గితే ( hypovolemia ) మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది.

    హృదయ వైఫల్యము ( Congestive Heat Failure ), కాలేయ వైఫల్యము ( Hepatic Failure  ), నెఫ్రాటిక్ సిండ్రోమ్ లలో ( Nephrotic syndrome ) శరీర ద్రవ ప్రమాణము పెరిగినా, వివిధ అవయవాలకు సమర్థవంతముగా ప్రసరించు రక్త ప్రమాణము ( effective circulatory volume ) తగ్గి మూత్రాంగములకు కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది. ఉదర శస్త్రచికిత్సల తర్వాత శరీర ద్రవములు కణజాలముల ( Tissues ) లోనికి ఎక్కువగా చేరుట వలన అవయవాలకు ప్రసరించు రక్త ప్రమాణము తగ్గుతుంది. నారంగ కాలేయవ్యాధిలో ( cirrhosis of Liver ) ఉదరకుహరములో ( peritoneal cavity ) ద్రవము చేరుకొని జలోదరమును ( ascites ) కలిగించునపుడు కూడా సమర్థముగా ప్రసరించు రక్త పరిమాణము ( effective circulating volume ) తగ్గుతుంది. జలోదరము ( ascites ) విశేషముగా ఉండి ఉదరకుహరములో పీడనము ఎక్కువయినపుడు మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది. మూత్రసిరల నుంచి ప్రసరించు రక్త ప్రమాణము కూడా తగ్గుతుంది.
      
    కాలేయ వ్యాధుల వలన సత్వర కాలేయ వైఫల్యము ( acute hepatic failure ) కలగిన వారిలో hepatorenal syndrome కలుగుతే మూత్రాంగ ధమనులు సంకోచిస్తాయి. మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది.

    మూత్రాంగములకు రక్తప్రసరణ లోపించుట వలన మూత్రాంగముల నిర్మాణ, వ్యాపారములలో మార్పులు జరిగి సత్వర మూత్రాంగ విఘాతముగా ( acute Kidney Injury ) పరిణమించ వచ్చును. దాని వలన సత్వర మూత్రాంగ వైఫల్యము కలుగుతుంది.

మూత్రాంగ కారణములు ( Renal parenchymal causes ) 


    సత్వర మూత్రాంగ వైఫల్యమునకు కారణములు మూత్రాంగముల ( Kidneys ) లోనే ఉండవచ్చును.


    1). సత్వర మూత్ర నాళికా కణధ్వంసము ( acute tubular necrosis ) : మూత్రాంకముల నాళికలలో ( tubules of nephrons ) కణముల విధ్వంసము జఱిగి సత్వర మూత్రాంగ విఘాతము కలుగవచ్చును. సూక్ష్మజీవులు శరీరమును ఆక్రమించుకొనుట వలన రక్తము సూక్ష్మజీవ విషమయము (bacterial sepsis ) అయితే అది మూత్రనాళికల కణవిధ్వంసమునకు దారి తీయవచ్చును.

    2). మూత్రాంగ విషములు ( nephrotoxins ), వేంకోమైసిన్ ( vancomycin ), జెంటామైసిన్
 ( Gentamicin ), టోబ్రామైసిన్  ( Tobramycin ) వంటి ఎమైనోగ్లైకొసైడ్ సూక్ష్మజీవి వినాశక ఔషధములు ( amino glycoside antibiotics ), ఏంఫోటెరిసిన్ -బి ( amphotericin B ), సిస్ ప్లాటిన్ ( cisplatin ), సిరల ద్వారా ఇవ్వబడు  వ్యత్యాస పదార్థములు (  I.V. contrast materials ), ఇతర ఔషధముల వలన మూత్రనాళికలలో సత్వర కణధ్వంసము ( acute tubular necrosis ) కలుగ వచ్చును.

    3). లింఫోమా ( lymphoma ), లుకీమియా వంటి కర్కట వ్రణ ( cancer ) వ్యాధిగ్రస్థులలో రసాయనక చికిత్స పిదప కర్కటవ్రణ కణధ్వంసము ( lysis of cancer cells  ) జరుగుటచే  రక్తములోను, మూత్రములోను యూరికామ్లపు  ( uric acid ) విలువలు పెరిగి అవి మూత్రనాళికలలో ( tubules ) పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ వైఫల్యమును కలిగించగలవు.

    4). Multiple myeloma వ్యాధిగ్రస్థులలో ఇమ్యునోగ్లాబ్యులిన్ల భాగములు మూత్రనాళికలలో పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ విఘాతము కలిగించవచ్చును. 

    5) ఎసైక్లొవీర్ ( acyclovir ), ఇండినవీర్, సల్ఫానమైడులు వంటి  ఔషధములు కూడా మూత్రనాళికలలో పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ విఘాతమును కలిగించవచ్చును.

    6). రక్తనాళ పరీక్షలు, చికిత్సలలో ( vascular procedures ), ప్రమాదవశమున ధమనీ ఫలకములు ( atheromas ) ఛిద్రమయి రక్త ప్రవాహములో మూత్రాంగములకు చేరి మూత్రాంగ విఘాతమును కలిగించగలవు.

    7). అస్థికండర కణవిచ్ఛేదనము ( Rhabdomyolysis ) జరిగిన వారిలో కండర వర్ణకము ( myoglobin ) విడుదలయి మూత్రనాళికలలో పేరుకుంటే మూత్రాంగ విఘాతము కలుగవచ్చును.

    8). స్వయంప్రహరణ వ్యాధులు ( autoimmune diseases ) వలన  కేశనాళికా గుచ్ఛములలో ( glomeruli )  తాపము ( glomerulo nephritis ) కలిగి మూత్రాంగ విఘాతము కలిగించవచ్చును.

    9). కొన్ని వ్యాధుల వలన, కొన్ని ఔషధముల వలన  మూత్రాంగములలో మూత్రాంకముల ( nephrons ) మధ్యనుండు కణజాలములో తాపము ( interstitial nephritis )  కలిగి మూత్రాంగ వైఫల్యము కలిగించవచ్చును.

    మూత్రాంగ విఘాతములను రెండుగా విభజించవచ్చును. దినమునకు 500 మి.లీ లోపు మూత్రమును విసర్జిస్తే మితమూత్ర మూత్రాంగ విఘాతము ( oliguric AKI ). 500 మి.లీ కంటె ఎక్కువగా మూత్ర విసర్జన ఉంటే అది అమిత మూత్ర మూత్రాంగ విఘాతము ( non oliguric AKI ). మితమూత్ర మూత్రాంగ విఘాతము తీవ్రమైనది.

 మూత్రాంగ పర ( మూత్రాంగములు తర్వాత) కారణములు ( post renal causes ) 


    మూత్రాంగములలో ఉత్పత్తి అయే మూత్ర ప్రవాహమునకు, విసర్జనకు అవరోధములు ఏర్పడితే మూత్ర నాళములలో పీడనము పెరిగి ఆ పీడనము వలన  మూత్రాంగ విఘాతము కలుగుతుంది. వయస్సు పెరిగిన పురుషులలో ప్రాష్టేటు గ్రంథి ( prostate gland ) పెరుగుదలలు, పిల్లలలో జన్మసిద్ధముగా మూత్ర పథములో కలుగు వైపరీత్యములు ( congenital urinary tract abnormalities ), మూత్ర పథములో శిలలు (calculi in urinary tract ), కటిస్థలములో కర్కట వ్రణములు మూత్ర ప్రవాహమునకు అవరోధము కలిగించి సత్వర మూత్రాంగ విఘాతమునకు ( acute kidney injury ) దారితీయగలవు.

సత్వర మూత్రాంగ విఘాత లక్షణములు 


    మూత్రాంగ విఘాతము వలన మూత్రంగ వ్యాపారము మందగించి రక్తములో యూరియా ( urea ), క్రియటినిన్ ( creatinine ) వంటి వ్యర్థ పదార్థముల పరిమాణములు త్వరితముగా పెరుగుతాయి. అందువలన వ్యాధిగ్రస్థులలో ఒంట్లో నలత, అరుచి, వాంతి కలిగే వికారము, వాంతులు, నీరసము, అలసట, కలుగుతాయి. తలనొప్పి ఉండవచ్చును. మూత్రాంగములలో తాపముచే మూత్రాంగముల పరిమాణము పెరుగుతే వాటిని ఆవరించు ఉండు పీచుపొర సాగుట వలన ఉదరములో పార్శ్వ భాగములలో నొప్పి కలుగ వచ్చును.

    మూత్రాంగ విఘాతమునకు మూలకారణముల వలన యితర లక్షణములు కలుగుతాయి.
 శరీర ఆర్ద్రత తగ్గుట ( dehydration ), రక్త ప్రమాణము తగ్గుట ( hypovolemia ) వలన మూత్రాంగ విఘాతము కలిగిన వారిలో దాహము పెరుగుట, నోరు పిడచకట్టుకొనుట, శరీరస్థితి మార్పులతో, ( పడుకొన్నవారు , కూర్చున్నపుడు, లేచి నిలుచున్నపుడు ) రక్తపీడనము తగ్గి ( postural hypotension  ) కళ్ళు తిరుగుట, ఒళ్ళు తూలుట కలుగవచ్చును. శరీర స్థితితో ధమని వేగములో మార్పులు కలుగుతాయి. వీరిలో నాలుక, నోటి శ్లేష్మపు పొరలలోను ( mucosa ), చర్మములోను ఆర్ద్రత ( తడి ) తగ్గి పొడిగా కనిపిస్తాయి. గుండె వేగము పెరుగుతుంది. రక్తపీడనము తక్కువగా ఉండవచ్చు. నిలుచున్నపుడు రక్తపీడనము తగ్గుతుంది.

    సూక్ష్మజీవుల వలన రక్తము విషమయము అయితే ( bacterial sepsis  ) వారిలో జ్వరము , నీరసము , సూక్ష్మజీవుల బారికి గుఱి అయిన అవయవములలో కలిగే లక్షణములు కనిపిస్తాయి.

     Systematic lupus erythematosis ( SLE ) వంటి స్వయంప్రహరణ వ్యాధులు ( auto immune diseases ) కలవారిలో కీళ్ళనొప్పులు, చర్మములో పొక్కులు, విస్ఫోటముల ( rashes )  వంటి లక్షణములు కనిపిస్తాయి.

    మూత్ర ప్రవాహమునకు అవరోధములు ఉన్నవారిలో మూత్ర విసర్జనలో యిబ్బంది,   నొప్పి, పొత్తికడుపులో నొప్పి, కడుపు పక్కలందు నొప్పి, మూత్రము విసర్జించునపుడు మంట, నొప్పి, మూత్రములో రక్తము ( hematuria ) వంటి లక్షణములు ఉండవచ్చు.

    ప్రాష్టేటు గ్రంథి పెరుగుదలలను, మూత్రాశయపు నిండుతనమును ( urinary bladder distension ), పొత్తికడుపులో పెరుగుదలలను వైద్యులు రోగులను పరీక్షించునపుడు గమనించగలరు. మూత్ర ప్రవాహమునకు అవరోధము కలుగుటచే మూత్రాశయము ( urinary bladder) పొంగి ఉంటే మూత్రాశయములోనికి కృత్రిమనాళము ( catheter ) రోగజనక రహితముగా  (sterile technique) చొప్పించి మూత్ర ప్రవాహమునకు సదుపాయము కల్పిస్తే మూత్రాంగ విఘాతమునకు కారణము తెలియుటే కాక చికిత్స కూడా సాధించగలము.

పరీక్షలు 


మూత్ర పరీక్ష 


    మూత్రాంగపూర్వ ( prerenal ) కారణములచే మూత్రాంగ విఘాతములు కలిగిన వారిలో మూత్ర పరీక్షలో  తేడా కనిపించదు.
    మూత్రనాళికల కణవిధ్వంసము ( acute tubular necrosis  ) గల వారిలో మూత్రమును సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించినపుడు మట్టిరంగు కణికలు గల మూసలు  (muddy granular casts ) కనిపిస్తాయి.

    ఎఱ్ఱరక్తకణముల మూసలు ( erythrocyte casts ), మూత్రములో మాంసకృత్తులు ( proteinuria ) కేశనాళికా గుచ్ఛముల వ్యాధిని ( glomerular disease ) సూచిస్తాయి.

    తెల్లకణముల మూసలు ( leukocyte casts, ఆమ్లాకర్షణ కణములు ( eosinophils  ) మూత్రాంగములలో అంతర కణజాల తాపమును ( Interstitial nephritis ) సూచిస్తాయి.

    మూత్రములో రక్తవర్ణకము ఉండి, రక్తకణములు లేకపోతే ఆ వర్ణకము కండర వర్ణకము ( myoglobin ) కావచ్చును.అది కండరములు విచ్ఛిన్నతను (Rhabdomyolysis )  సూచిస్తుంది.

    మూత్రమును సూక్ష్మదర్శినితో పరీక్షించునపుడు యూరికామ్లపు స్ఫటికములు ( uric acid crystals), యితర స్ఫటికములు ( ethylene glycol, ) కనిపిస్తే వ్యాధి కారణములు తెలుసుకొనవచ్చును.

రక్తపరీక్షలు 


    రక్తపరీక్షలలో యూరియా, క్రియటినిన్ ల ప్రమాణములు పెరుగుతాయి. యూరియా, క్రియటినిన్ లతో విద్యుద్వాహక లవణములు ( electrolytes ) సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేట్, కాల్సియమ్, ఫాస్ప్ ట్, యూరికామ్లముల విలువలు, చక్కెర, ఆల్బుమిన్ విలువలు, రక్తకణముల విలువలు వైద్యులు పరిశీలిస్తారు.


    మూత్రాంగపూర్వ ( prerenal ) మూత్రాంగ విఘాతములలో రక్తములో యూరియా / క్రియటినిన్ నిష్పత్తి 20: 1 కంటె హెచ్చుగా ఉంటుంది. మూత్రాంగ ( కారణ ) మూత్రాంగ విఘాతములలో ఈ నిష్పత్తి 20:1 కంటె తక్కువగా ఉంటుంది.

 మూత్రములో సోడియమ్, క్రియటినిన్ విలువలు, ఆస్మొలాలిటీ ( osmolality ) కూడా తెలుసుకోవాలి.


    మూత్రాంగ పూర్వ మూత్ర్రాంగ విఘాతములలో రక్తప్రమాణము తగ్గుట వలన శరీరములో వినాళగ్రంథులు స్పందించి నీరును, సోడియమ్ ను పదిల పఱుస్తాయి. అందుచే మూత్రపు సాపేక్ష సాంద్రత ( specific gravity ) 1.020  కంటె ఎక్కువగా ఉంటుంది ; మూత్రపు ఆస్మలాలిటీ ( urine osmolality ) 500 mOsm/kg కంటె ఎక్కువగా ఉంటుంది. మూత్రములో సోడియమ్ సాంద్రత 10 meq / L లోపల ఉంటుంది.

    మూత్రములో ఎఱ్ఱకణముల మూసలు ( erythrocyte casts ), ఎఱ్ఱకణములు, మాంసకృత్తులు ( proteins ) ఉంటే అవి కేశనాళికల గుచ్ఛములలో ( glomeruli ) వ్యాధిని సూచిస్తాయి. వారికి వివిధ స్వయంప్రహరణ వ్యాధులకు ( autoimmune diseases ), రక్తనాళికల తాపము ( vasculitis )  కలిగించే కాలేయ తాపములు ఎ, బి లకు ( hepatitis B & C ) పరీక్షలు చెయ్యాలి.

శ్రవణాతీత ధ్వని చిత్రీకరణము ( ultrasonography ) 


    శ్రవణాతీత ధ్వని చిత్రీకరణములతో  ( ultrasonography ), మూత్రనాళ శిలలను (ureteric calculi ), ఇతర అవరోధములను, మూత్రాశయములో వైపరీత్యములను, ప్రాష్టేట్ పెరుగుదలలను, అవరోధము వలన ఉబ్బిన మూత్రనాళములు ( ureters ), ఉబ్బిన మూత్రకుండిక ( మూత్రపాళియ ; renal pelvis ) మూత్రకుండిక ముఖద్వారములతో ( calyces of  kidneys) జల మూత్రాంగమును (hydronephrosis ),కటిస్థలములో ( pelvis ) పెరుగుదలలను కనుగొనవచ్చును.

చికిత్స 


    మూత్రాంగ విఘాతపు చికిత్స రెండు భాగములు. ప్రధమముగా మూత్రాంగ విఘాతానికి కారణములను పరిష్కరించాలి. అదేసమయములో మూత్రాంగ విఘాతము వలన కలిగిన ఉపద్రవములను కూడా పరిష్కరించాలి. 

మూత్రాంగ విఘాత కారణముల పరిష్కరణ  


    మూత్రాంగపూర్వ కారణములను, మూత్రాంగపర కారణములను సత్వరముగా పరిష్కరించుట వలన మూత్రాంగ విఘాతమును నిలువరించ గలుగుతాము.

మూత్రాంగపూర్వ కారణముల పరిష్కరణ 


     శరీరపు ఆర్ద్రక్షీణతను ( dehydration), రక్తపరిమాణ లోపములను ( hypovolemia ) దిద్దుబాటు చేసి మూత్రాంగముల రక్తప్రసరణ లోపమును సరిదిద్దాలి. దేహములో నీరు, ఉప్పు (sodium chloride) ఒకదానితో మరొకటి అనుబంధము కలిగి ఉంటాయి. అందువలన శరీరపు ఆర్ద్రత తగ్గినపుడు లవణ ద్రావణము  ( normal saline ) సిరల ద్వారా ఎక్కించి ఆర్ద్ర క్షీణతను ( dehyration ) సరిదిద్దాలి. రక్తహీనము ( anemia ) ఎక్కువగా ఉంటే రక్తకణ సముదాయములను ( packed redblood cells ) ఎక్కించాలి. నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో ( cirrhosis of liver ) రక్తములో ఆల్బుమిన్ ( albumin ) బాగా తగ్గి జలోదరము ( ascites ) ఉంటే ఆల్బుమిన్  సిరలద్వారా ఇవ్వాలి.

    మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గించు తాపహరముల ( nonsteroidal antiinflammatory agents ) వంటి ఔషధములను ఆపివేయాలి. శరీర ఆర్ద్రత తగ్గినపుడు మూత్రకారకములు ( diuretics ) ఆపివేయాలి. రక్తద్రవములో క్రియటినిన్ ( serum creatinine ) విలువలు 50 శాతము కంటె పెరుగుతే  Angiotensin Converting Enzyme Inhibitors, Angiotensin Receptor Blockers  మోతాదులను తగ్గించాలి. లేక పూర్తిగా మానివేయాలి. రక్తపీడనము తగ్గిన వారిలో ( hypotension ) రక్తపుపోటు మందులు తగ్గించాలి, లేక నిలిపివేయాలి.

మూత్రాంగపర కారణముల పరిష్కరణ 


    మూత్ర విసర్జనకు, మూత్ర ప్రవాహమునకు అవరోధములు ఉంటే వాటిని పరిష్కరించాలి. మూత్రాశయములో కృత్రిమ నాళము అమర్చి మూత్ర ప్రవాహము సుగమము చేయాలి. మూత్రనాళములలో శిలలు ఉంటే వాటిని తొలగించాలి. మూత్రాశయమునకు ( urinary bladder ) ఎగువ తొలగించలేని ఇతర అవరోధములు ఉంటే మూత్రకుండికకు ( renal pelvis ) శస్త్రచికిత్సతో కృత్రిమ ద్వారము ( nephrostomy ) బయటకు అమర్చి మూత్ర విసర్జనకు సదుపాయము కల్పించాలి. మూత్ర ప్రవాహము సుగమము చేయుట వలన మూత్రాంగములపై పీడనము తగ్గి మూత్ర విఘాతమును నిలువరించగలుగుతాము.

మూత్రాంగ కారణములకు చికిత్స 


    మూత్రాంగములపై విష ప్రభావము కలిగించు ఔషధములను ( aminoglycosides, cisplatin, amphoterin-b ) తప్పనిసరి కాకపోతే వెంటనే నిలిపివేయాలి. కండర విచ్ఛేదనము ( rhabdomyolysis ) జరిగిన వారికి సిరల ద్వారా లవణ ద్రావణము ( normal saline ) ఇచ్చి మూత్ర పరిమాణము పెంచి కండర వర్ణకము ( myoglobin ) మూత్రనాళికలలో ( tubules ) పేరుకుపోకుండా చెయ్యాలి. 

    మూత్రాంగముల కేశనాళిక గుచ్ఛములలో ( glomeruli ) వ్యాధి కలిగించు స్వయంప్రహరణ వ్యాధులను ( autoimmune disease ) ఇతర కొల్లజెన్ రక్తనాళిక వ్యాధులను ( collgen vascular diseases ) కనుగొని వాటికి తగిన చికిత్సలు చెయ్యాలి.

    జలోదరము ( ascites ) వలన ఉదరకుహరములో పీడనము అధికముగా ఉంటే ఉదరకుహరములో ద్రవమును తొలగించాలి.

    కారణములను పరిష్కరిస్తే మూత్రాంగములు విఘాతము నుంచి కోలుకొనే అవకాశము ఉంటుంది.

     మూత్రాంగవిఘాతము వలన కలిగే ఉపద్రవముల పరిష్కారము 

    
    ఇది చికిత్సలో చాలా ముఖ్యాంశము. మూత్రాంగ విఘాతము వలన వ్యాధిగ్రస్థులకు అరుచి కలిగి తగినంత ద్రవములు నోటితో తీసుకోలేకపోతే రక్తపరిమాణ లోపమును ( hypovolemia ), ఆర్ద్రక్షీణతను ( dehydration  ) సరిదిద్దుటకు సిరల ద్వారా లవణ ద్రవణములు ఇయ్యాలి. శరీర ద్రవభారము ( fluid overload ) అధికమయితే మూత్రకారకములతో ( diuretics ) దానిని పరిష్కరించాలి.

    రక్తద్రవపు పొటాసియమ్  ( serum Potassium ) విలువలు అధికమయితే ఆహారములో పొటాసియమ్  తగ్గించాలి. అరటిపళ్ళు, నారింజరసము, బంగాళదుంపలు, కొబ్బరినీళ్ళలో పొటాసియము ఎక్కువగా ఉంటుంది. వీటిని వాడకూడదు. 
      
    పొటాసియమ్ విలువలు ప్రమాదకర ప్రమాణములలో ఉండి ( 6 meq / dL మించి ), విద్యుత్ హృల్లేఖనములో ( electro cardiogram ) మార్పులు ఉంటే, హృదయ రక్షణకు కాల్సియమ్ గ్లూకొనేట్ ( calcium gluconate ) సిరల ద్వారా ఇస్తారు. రక్తద్రవములోని పొటాసియమును కణముల లోపలకు మళ్ళించుటకు ఇన్సులిన్ + గ్లూకోజుల మిశ్రమమును సిరలద్వారా ఇస్తారు. బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములను ( beta adrenergic receptor agonists ) పీల్పుసాధనముల ద్వారా ఇచ్చి పొటాసియమ్ ను కణములలోనికి మళ్ళించవచ్చును. రక్తము ఆమ్లీకృతము అయితే ( acidosis ) సోడియమ్ బైకార్బొనేట్ ( sodium bicarbonate ) కూడా ఇవ్వవచ్చును. ఆపై శరీరములో పొటాసియమును తగ్గించుటకు sodium polystyrene sulfonate  వంటి ఋణపరమాణు వినిమయ ఔషధములు ( cation echange resins ) వాడవలెను. ద్రవపరిమాణ లోపము ( hypovolemia ) లేనివారిలో మూత్రకారకములు వాడి పొటాసియము విసర్జనను పెంచవచ్చును.

    రక్తము ఆమ్లీకృతమయితే ( acidosis ) నోటి ద్వారా సోడియమ్ బైకార్బొనేట్ యిచ్చి దానిని సవరించవచ్చును. ఆమ్లీకృతము తీవ్రముగా ఉండి రక్తపు pH 7.2 కంటె తక్కువగా ఉన్నపుడు సోడియమ్ బైకార్బొనేట్ సిరల ద్వారా ద్రావణములతో ఇవ్వవచ్చును. కాని దాని వలన ద్రవభారము ( fluid overload ) కలుగకుండా, రక్తద్రవపు కాల్సియమ్ విలువలు పడిపోకుండా, రక్తము క్షారీకృతము ( alkalosis ) కాకుండాను తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  
    { ధమని రక్తపు pH 7.37 నుంచి 7.43 వఱకు ఉంటుంది. pH 7.37 కంటె తక్కువైతే ఆమ్లీకృతము ( acidosis ) గాను, 7.43 కంటె ఎక్కువైతే క్షారీకృతము ( alkalosis ) గాను పరిగణిస్తారు.}

    రక్తములో ఫాస్ఫేట్ విలువలు పెరుగుతే ఫాస్ఫేట్ బంధకములను ( phosphate binding agents - calcium carbonate, calcium acetate, aluminum hydroxide, sevelamer hydrochloride  ) వాడి వాటిని అదుపులో తేవలెను.

    మూత్రాంగ విఘాతము కల రోగులలో రక్తపీడనము కొద్దిగా పెరుగుతే ( ముకుళిత పీడనము 150 - 160 mmhg లోపు ) దానికి చికిత్సలు చేయకూడదు. రక్తపీడనము తీవ్రముగా పెరిగిన వారికి సగటు ధమనీ పీడనము ( mean arterial pressure ) 10- 15 శాతము తగ్గించుటకు చికిత్స అవసరము. వీరిలో ACE inhibitors, ARBs వాడకూడదు.

    మూత్రాంగ విఘాతము కలిగిన వారిలో మందుల విసర్జన తగ్గుతుంది కాబట్టి అవసరమయిన మందుల మోతాదులను సవరించాలి. అనవసరపు మందులు వాడకూడదు. వీరిలో నిరూపితము కాని ఔషధములు చికిత్సలో వాడకూడదు. అవి మూత్రాంగములపై కలిగించు శ్రమ వలన, మూత్రాంగములపై వాటి విష ప్రభావము ( toxicity ) వలన కలిగే నష్టమే ఎక్కువ.

మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( Renal replacement therapy ; Dialysis ) 


    సత్వర మూత్రాంగ విఘాతమునకు గుఱియగు వారిలో కొందఱికి మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స అవసరము కావచ్చును. 

   1). విశేషమైన అరుచి, వాంతికలిగే భావన, మందులకు తగ్గని వాంతులు పెక్కు దినములు ఉన్నవారికి,
   2). ఔషధములకు తగ్గని ప్రమాదకర రక్తద్రవపు పొటాసియమ్ ( serum potassium ) విలువలు కలవారికి,
   3). మూత్రకారకములకు ( diuretics ) తగ్గని ద్రవభారము ( fluid overload ) కలవారికి, 
   4). రక్తము ప్రమాదకరముగా ఆమ్లీకృతము ( acidosis  ) అయినవారికి, 
   5). యూరియా వంటి వ్యర్థ పదార్థములు ఎక్కువగా పెరిగి  మతిభ్రమణము, మతిలో యితర మార్పులు,  మూర్ఛలు కలిగిన వారికి,
   6). యూరియా వలన హృదయ వేష్టనములో తాపము (uremic pericarditis ) కలిగిన వారికి,               
   7) . మూత్రాంగ విఘాతము తీవ్రముగా ఉండి, నయము కాగల అవకాశము లేక రక్తద్రవపు క్రియటినిన్ (Serum creatinine ) విలువలు అధికస్థాయికి పెరుగుతున్న వారికి 

    మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( renal replacement therapy ; dialysis ) అవసరము.

    మెథనాల్  ( methanol ), ఎథిలిన్ గ్లైకాల్ (  ethylene glycol ; antifreeze ), సేలిసిలేట్స్ ( salicylates ) విషముల వలన మూత్రాంగ విఘాతము కలిగిన వారికి విషపదార్థములు తొలగించుటకై  రక్తశుద్ధిచికిత్స ( hemodialysis ) అవసరము అవుతుంది.


( ఈ వ్యాసము కొంచెము క్లిష్టమైనది . వైద్యుల ప్రమాణములో వ్రాయబడినది. అయినా సామాన్యప్రజలకు కొంతైనా అర్థము అవుతుంది.
    నా సామర్థ్యపు మేరకు తెలుగులో వైద్యవిషయాలను చెప్పడము నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను సంప్రదించ ప్రార్థన .
ఉపయుక్తమనుకుంటే నా వ్యాసములు నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )



12, ఏప్రిల్ 2020, ఆదివారం

దూరధమని వ్యాధి ( Peripheral arterial disease )


                                దూర( మేర ) ధమని వ్యాధి

                             ( Peripheral Arterial Disease )

                                                   డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి      .
( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) :

    దూర( మేర ) ధమనులలో రక్తప్రసరణకు అంతరాయము కలుగుతే దానిని దూర ( మేర ) ధమని వ్యాధిగా ( Peripheral Arterial Disease ) పరిగణిస్తారు. ఈ దూర ( మేర ) ధమని వ్యాధికి ముఖ్యకారణము ధమనీ కాఠిన్యత ( arteriosclerosis ).

                                        కాళ్ళ ధమనులు                                        

                                        ( Arteries of lower extremities )


    శరీరములో వివిధ అవయవాలకు ధమనుల ద్వారా రక్తప్రసరణ జరిగి వాటి కణజాలమునకు ప్రాణవాయువు, పోషకపదార్థములు అందించబడుతాయి. గుండె ఎడమజఠరిక ( left ventricle ) నుంచి బయల్వడు బృహద్ధమని ( aorta ) ఛాతి నుంచి ఉదరములో ఉదర బృహద్ధమనిగా ( abdominal aorta ) వివిధ శాఖలను ఇచ్చి, కటివలయములో ( pelvis ) రెండు శ్రోణి ధమనులుగా ( ileac arteries ) చీలుతుంది. ప్రతి శ్రోణిధమని బాహ్య శ్రోణిధమని ( external ileac artery ), అంతర శ్రోణిధమని ( internal ileac artery ) శాఖలను ఇస్తుంది. బాహ్య శ్రోణి ధమని తొడ లోనికి తొడ ధమనిగా ( ఊరుధమని femoral artery ; ఊరువు = తొడ )  ప్రవేశిస్తుంది. ఊరు ధమని నిమ్నోరు ధమని ( Profunda femoris artery ) శాఖను యిచ్చి బాహ్యోరు ధమనిగా ( Superficial femoral artery ) తొడలో కొనసాగి మోకాలి వెనుకకు జాను ధమనిగా ( Polpliteal artery ) ప్రవేశించి పూర్వ జంఘికధమని ( anterior tibial artery ), పృష్ఠ జంఘిక ధమని (Posterior tibilal artery ) శాఖలుగా చీలుతుంది. ఈ ధమనులు కాళ్ళకు, పాదములకు రక్త ప్రసరణ చేకూరుస్తాయి. 



    పూర్వ జంఘిక ధమని ( anterior tibial artery ) పైపాదములో ఊర్ధ్వపాద ధమనిగా ( Dorsalis pedis artery ) కొనసాగుతుంది. ఊర్ధ్వపాద ధమని ( dorsalis pedis artery ) నుంచి మధ్యపాద ధమని శాఖ ( metatarsal artery, ( or ) arcuate artery ) వెలువడి మధ్యస్థము ( medial ) నుంచి నడిపాదములో ఊర్ధ్వపాద చాపముగా ( dorsal plantar arch ) పార్శ్వభాగమునకు కొనసాగుతుంది. ఊర్ధ్వపాదధమని, ఊర్ధ్వపాద చాపముల నుంచి అంగుళిక ధమనులు ( digital arteries ) కాలివేళ్ళ పైభాగములకు రక్తప్రసరణ చేకూరుస్తాయి.
    పృష్ఠ జంఘికధమని ( posterior tibial artery ) అరపాదమునకు చేరి మధ్యస్థ పాదతల ధమని ( medial plantar artery ), పార్శ్వ పాదతల ధమనులుగా ( lateral plantar artery ) శాఖలు చెంది అరకాలికి రక్తప్రసరణ సమకూర్చుతాయి . పార్శ్వ పాదతల ధమని ( lateral plantar artery ) కాలి మడమనుంచి పాదములో ప్రక్క భాగమునకు పయనించి పిదప మధ్య భాగమువైపు పాదతల ధమనీ చాపముగా ( Plantar arterial arch ) విల్లు వలె సాగి పాదతలమునకు చొచ్చుకొను ఊర్ధ్వ పాదధమని శాఖయైన నిమ్నపాద ధమనితో ( deep plantar artery of dorslis pedis artery ) కలుస్తుంది. పాదతల ధమనీ చాపము ( plantar arterial arch) నుంచి అంగుళిక ధమనీ శాఖలు ( digital arteries ) కాలివేళ్ళకు రక్తప్రసరణ సమకూర్చుతాయి.

ధమనుల నిర్మాణము 


    ధమనుల గోడలలో బయటపొర ( tunica externa or advenitia ), మధ్యపొర ( tunica media ),లోపొర ( tunica interna or intima ) అనే మూడు పొరలు ఉంటాయి. బయట పొరలో సాగుకణజాలము ( elastic tissue ), పీచుకణజాలము ( fibrous tissue ) ఉంటాయి. మధ్య పొరలో మృదుకండరములు ( smooth muscles ), సాగుకణజాలము ( elastic tissue ), పీచుకణజాలము ( fibrous tissue ) పీచుపదార్థము ( collagen ) ఉంటాయి. నాళపు లోపొర పూతకణములు ( lining cells: endothelium ), సాగుపదార్థము ( elastin ), పీచుపదార్థముల ( collagen ) మూలాధారమును ( basement ) అంటిపెట్టుకొని ఉంటాయి. పెద్ద రక్తనాళములకు రక్తము సరఫరా చేసే రక్తనాళ రక్తనాళికలు ( vasa vasorum ) కూడా రక్తనాళపు గోడలలో ఉంటాయి.


                                     దూర ధమనుల వ్యాధి 


    ధమనీ కాఠిన్యత ( arteriosclerosis ) శైశవమునుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత కనిపించి వృద్ధాప్యములో తీవ్రతరము అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొరలో ( intima ) పూతకణముల క్రింద మాతృకలో (matrix) కొవ్వులు, కొలెష్టరాలు, కాల్సియం, తాపకణములు పేరుకొని ఫలకలుగా ( plaques ) పొడచూపుతాయి.
ఈ పలకలు రక్తనాళముల లోపలి పరిమాణమును తగ్గిస్తాయి. ధమనుల లోపలి పరిమాణము ఎక్కువగా తగ్గితే కణజాలమునకు రక్తప్రసరణ తగ్గుతుంది. ధమనుల లోపొరలోని పలకలు చిట్లుతే వాటిపై తాపప్రక్రియ కలిగి, రక్తపుగడ్డలు ఏర్పడి ( thrombosis ) రక్తప్రసరణకు ఆకస్మిక అవరోధము కలుగజేయగలవు. 
       దూరధమనుల వ్యాధి సాధారణముగా కాళ్ళలో చూస్తాము. ఈ వ్యాధివలన రక్తప్రసరణకు ఆటంకము ఏర్పడుతుంది. అమెరికాలో అరవై సంవత్సరాలు దాటిన వారిలో 12 నుంచి 20 శాతపు వారిలోను ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వారిలో 50 శాతపు వారిలోను దూరధమని వ్యాధి పొడచూపుతుంది. ప్రపంచములో 20 కోట్లమంది యీ వ్యాధిగ్రస్థులు ఉంటారు. 

కారణములు 


    వృద్ధాప్యము వలన ధమనీకాఠిన్యత కలిగినా పిన్నవయస్సులోనే యీ వ్యాధిని తీవ్రతరము చేసే కారణములను వైద్యులు , శాస్త్రజ్ఞులు చాలా సంవత్సరముల పూర్వమే పసిగట్టారు. ఇవి :

ధూమపానము 


    దూరధమని వ్యాధిని కలుగజేసే కారణములలో పొగత్రాగుట ప్రధమస్థానములో నిలుస్తుంది. దూరధమని వ్యాధి కలిగేవారిలో 80 నుంచి 90 శాతము మంది ప్రస్తుతపు, లేక పాత ధూమపానీయులే.
ఇతరుల నుంచి పొగ పీల్చినవారిలో కూడా యీ వ్యాధి కలిగే అవకాశములు ఉన్నాయి. వీరిలో రక్తనాళముల లోపొరలో జరిగే మార్పుల వలన ధమనీ కాఠిన్యత వేగము పెరుగుతుంది. దినమునకు కాల్చే పొగాకు, ధూమపానము చేసిన సంవత్సరములతో వ్యాధి అనుపాత నిష్పత్తితో ముడిపడి ఉంటుంది.

మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) 


    మధుమేహవ్యాధి కాలము, తీవ్రతతో దూరధమని వ్యాధి కలిగే అవకాశములు పెరుగుతాయి. మధుమేహవ్యాధి కలవారిలో దూరధమనివ్యాధి కలిగే అవకాశము రెండింతలు అవుతుంది.

కొవ్వులు, కొలెష్టరాలు 


    అల్ప సాంద్రపు కొలెష్టరాలు (low density lipoprotein ) హెచ్చుగా ఉన్నవారిలోను, అధిక సాంద్రపు కొలెష్టరాలు ( high density lipoprotein ) తక్కువగా ( 40 మి.గ్రా/ డె.లీ కంటె తక్కువ ) ఉన్నవారిలోను, ట్రైగ్లిసరైడులు హెచ్చుగా ఉన్న వారిలోను ఈ వ్యాధి ప్రాబల్యము హెచ్చు. రక్తపీడనము అధికమైన ( hypertension ) వారిలోను, దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిగ్రస్థులలోను ( chronic kidney disease ) దూరధమని వ్యాధి ప్రాబల్యము అధికముగా ఉంటుంది.

వ్యాధిలక్షణములు 


    దూరధమని వ్యాధిగ్రస్థులలో ప్రామాణిక లక్షణము సవిరామపు పోటు ( intermittent claudication ). ఈ పోటు కాలిపిక్కలో ( calf ) కొంతదూరము నడిచిన పిదప క్రమరీతిలో కలిగి, విశ్రాంతి తీసుకొన్న పది నిమిషములలో క్రమరీతిలో ఉపశమిస్తుంది. ఈ పోటు సలుపుగా గాని, నొప్పిగా గాని, పోటుగా గాని, నీరసము వలె గాని పొడచూపవచ్చును. నడిచేటపుడు కాలి కండరములకు రక్తప్రసరణ అవసరము పెరుగుతుంది. ధమనుల నాళ పరిమాణము తగ్గుటవలన అవసరములకు తగినంత రక్తప్రసరణ, ప్రాణవాయువు సరఫరా లోపించి కండరములలో నొప్పి, పోటు, కలుగుతాయి. కాని సుమారు పది శాతపు మందిలోనే యీ పోటు ప్రామాణికముగా ఉంటుంది. నలభై శాతము మందిలో నొప్పిగాని, బాధగాని ఉండదు. కొందఱిలో నొప్పి కాలి పిక్కలలో కలుగక పోవచ్చును. కొందఱిలో నొప్పి నడక ఆపివేయునంత తీవ్రముగా ఉండకపోవచ్చును. కొందఱిలో నొప్పి పది నిముషముల విశ్రాంతితో ఉపశమించక పోవచ్చును.
వ్యాధి తీవ్రత హెచ్చయినవారిలో నొప్పి విశ్రాంత సమయములలో కూడా కలుగుతుంది. సాధారణముగా యీ విశ్రాంతపు నొప్పి ( rest pain ) రాత్రుళ్ళు పడుకున్నప్పుడు కలిగి, కాలు క్రింద పల్లములో పెట్టాక తగ్గుతుంది. అపుడు కాలికి రక్తప్రసరణ కలిగి పాదములో ఎఱ్ఱదనము పొడచూపుతుంది. రక్తప్రసరణ లోపము వలన కణజాల నష్టము, పాదములలో ‘ బెజ్జములు కొట్టినట్లు ‘ కనిపించే మానని పుళ్ళు (non healing  ulcers with punched out appearance ) కలుగవచ్చును.
    రక్తప్రసరణకు పూర్తిగా ఆటంకము కలిగినపుడు కాలు చల్లబడుతుంది. నొప్పి విపరీతముగా ఉంటుంది. కాలు పాలిపోయి ఉంటుంది. కణజాలములు మరణిస్తే, వేళ్ళలోను, పాదములోను కుళ్ళుదల ( gangrene ) కలుగుతుంది. దూరధమని వ్యాధి కలవారిలో వ్యాధి ఉన్న కాలి చర్మములో రోమములు తగ్గిపోతాయి. చర్మము దళసరి తగ్గి నున్నబడి మెరుస్తూ ఉంటుంది. కండరములు క్షయము పొందుతాయి. ధాతునాడులు ( dorsalis pedis and posterior tibial artery pulses ) నీరసిస్తాయి. నాడి చేతికి తగలక పోవచ్చును. కాళ్ళు, పాదములు ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతాయి. వ్యాధి తీవ్రముగా ఉంటే కాలు పైకెత్తినపుడు పాలిపోయి క్రిందకు దింపాక ఎఱ్ఱబడుతుంది. బెజ్జములు కొట్టినట్లు ( punched out appearance) మానుదలలేని పుళ్ళు ఉండవచ్చు. కణజాలము రక్తప్రసరణ లేక చనిపోతే, ఆ భాగము నల్లబడి కుళ్ళుదల ( gangrene ) చూపవచ్చును.




పరీక్షలు ( investigations ) 


    కాళ్ళలో దూరధమని వ్యాధిని కనుగొనుటకు డాప్లర్ శ్రవణాతీతధ్వని సాధనముతో చీలమండ ( ankle ) వద్ద ఊర్ధ్వపాద ధమనిలో ( dorsalis pedis artery ) ముకుళిత రక్తపీడనమును ( systolic blood pressure ) బాహుధమనిలో ( brachial artery ) ముకుళిత రక్తపీడనమును కొలిచి వాని నిష్పత్తిని ( చీలమండ రక్తపీడనము / బాహు రక్తపీడనము = Ankle Brachial Index ABI index ) లెక్కకట్టాలి. ఆ నిష్పత్తి 0.9 కంటె తక్కువయితే దూరధమని వ్యాధిని సూచిస్తుంది. ఈ పరీక్ష సున్నితమైనది ( sensitive ) మఱియు నిశితమైనది ( specific ). తొంభైయైదు శాతపు వ్యాధిగ్రస్థులలో ఈ నిష్పత్తి వ్యాధిని పసిగట్టుతుంది.
    అధిక రక్తపీడనము ( hypertension ), మధుమేహవ్యాధి ( diabetes mellitus ), దీర్ఘకాల మూత్రాంగ వ్యాధుల ( chronic kidney disease ) వలన అతిసూక్ష్మ ధమనులు సంకోచించి ప్రసరణలోపము ( small vessel disease ) కలుగజేసినపుడు యీ నిష్పత్తి వ్యాధిని పసిగట్టక పోవచ్చును. 
    ధమనీ కాఠిన్యత హెచ్చయి రక్తనాళముల గోడలలో కాల్సియమ్ పేరుకొనుట వలన చీలమండ దగ్గఱ రక్తనాళములు అణచుటకు వీలుబడకపోతే ( Noncompressible vessels ) అంగుళి రక్తపీడనము / బాహు రక్తపీడనముల ( toe pressure / upper arm pressure ) నిష్పత్తిని వ్యాధి నిర్ణయమునకు పరిగణించవచ్చును. 
    వ్యాధి లక్షణములు ఉండి చీలమండ / బాహు రక్తపీడనముల నిష్పత్తి సాధారణ పరిమితులలో ఉంటే నడక యంత్రముపై ( treadmill ) ఐదు నిమిషముల వ్యాయామము చేయించిన తర్వాత ఆ యా రక్తపీడనములు కొలిచి చీలమండ / బాహువుల ముకుళిత రక్తపీడనముల నిష్పత్తిని తీసుకొని వ్యాధి నిర్ణయము చేయవచ్చును. వ్యాధిగ్రస్థులలో వ్యాయామము పిదప చీలమండ / బాహువుల నిష్పత్తి 20 శాతము తగ్గుతుంది.
    శ్రవణాతీతధ్వని చిత్రీకరణముతో ( ultrasonography )  రక్తనాళముల చిత్రములను గ్రహించి సంకుచితములు పొందిన భాగములను గుర్తించవచ్చును. రక్తనాళముల లోనికి సన్నని నాళికను ( catheter ) చొప్పించి దాని ద్వారా వ్యత్యాస పదార్థములను ( contrast material ) ఎక్కించి ఎక్స్ -రేలతో రక్తనాళములను చిత్రీకరించ వచ్చును. వ్యత్యాస పదార్థములు యిచ్చి గణనయంత్ర ( త్రిమితీయ ) ధమనీ చిత్రీకరణములను ( CT Angiograms ), అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణములను ( magnetic resonance Angiography ) చేసి వ్యాధిని ధ్రువీకరించ వచ్చును.

ఇతర సమస్యలు 


    దూరధమని వ్యాధిగ్రస్థులు ధమనీ కాఠిన్యత ప్రభావమువలన హృద్ధమని వ్యాధులకు ( Coronary artery disease ), మస్తిష్క రక్తనాళ విఘాతములకు ( cerebro vascular accidents ) అధిక సంఖ్యలో పాలవుతారు. ఉదర బృహద్ధమనిలో బుడగలు ( abdominal aortic aneurysms ) కూడా వీరిలో కలుగవచ్చును. అందువలన ఆ వ్యాధులను కనుగొను పరీక్షలు, వాటికి చికిత్సలు కూడా అవసరమే.

చికిత్స 


జీవనశైలిలో మార్పులు ( Life style modification ) 


ధూమపాన విరమణ 


    దూరధమని వ్యాధిగ్రస్థులు ధూమపానమును ( tobacco smoking ) తప్పక విరమించాలి. నా నలుబది సంవత్సరముల వైద్యవృత్తి ప్రత్యక్ష అనుభవములో రక్తప్రసరణ లోపము వలన కాళ్ళు కోల్పోయిన వారిలో 95 శాతము మంది ధూమపానీయులే. అందువలన పొగత్రాగుట తప్పకుండా మానాలి.

వ్యాయామము ( exercise ) 


    దూరధమని వ్యాధిగ్రస్థుల శిక్షణపూర్వక వ్యాయామము అవసరము. నడక యంత్రములపై గాని ( treadmills, exercise bicycles, and ellipticals ), నేలపైన గాని కాళ్ళలో నొప్పులు పుట్టే సమయమునకు కొంచెము సమయము తగ్గించి నడుస్తూ, విరామము తీసుకుంటూ దినమునకు 30 నుంచి 60 నిమిషముల వ్యాయమము చేస్తే సత్ఫలితములు కలుగుతాయి. కాళ్ళ వ్యాయామము వలన చిన్న ( శాఖలు ) ధమనుల పరిమాణము పెరిగి కణజాలమునకు ప్రత్యామ్నాయ ప్రసరణను ( collateral circulation ) పెంపొందిస్తాయి. వ్యాయామము వలన హృద్ధమని సంఘటనలు, ( cardiovascular events ), మస్తిష్క విఘాత సంఘటనలు ( cerebro vascular events ) కూడా తగ్గుతాయి. వీరు నొప్పి కలుగకుండా నడవగలిగే దూరము, సమయము కూడా పెరుగుతాయి.

    మధుమేహవ్యాధిని, ఆహారనియమముతోను, వ్యాయామముతోను, తగిన ఔషధములతోను అదుపులో పెట్టుకోవాలి.
    రక్తపుపోటు ఎక్కువయితే దానిని ఆహారనియమము, వ్యాయామము, ఔషధములతో అదుపులో పెట్టుకోవాలి.
    అల్పసాంద్రపు కొలెష్టరాలుని ( Low density Lipoprotein ) ఆహారనియమము, స్టాటిన్ (statins ) మందులతో తగ్గించుకోవాలి. అధికసాంద్రపు కొలెష్టరాలుని ( High Density Lipoprotein) పెంచుకోవాలి.
ట్రైగ్లిసరైడులను ( triglycerides ) ఆహారనియమము, మందులతో తగ్గించుకోవాలి.

ఏస్పిరిన్ ( Aspirin ) 


    దూరధమనివ్యాధి లక్షణములు కలవారిలో ఏస్పిరిన్ వాడుక వలన ధమనులలో రక్తపుగడ్డలు ఏర్పడుట తగ్గుతుంది. హృద్ధమని సంఘటనలు, మస్తిష్క విఘాత సంఘటనలు తగ్గుతాయి. ఏస్పిరిన్ రక్తఫలకలు గుమికూడుటను ( platelet aggregation ) నివారిస్తుంది. కణజాల విధ్వంసము తగ్గిస్తుంది.

క్లొపిడోగ్రెల్ ( Clopidogrel ) 


    ఏస్పిరిన్ వాడలేనివారిలో రక్తఫలకములు గుమికూడుటను నివారించి రక్తపు గడ్డలను అరికట్టుటకు క్లొపిడోగ్రెల్ ను ఉపయోగిస్తారు. ఏస్పిరిన్  క్లొపిడోగ్రెల్ రెండూ కలిపి వాడుట వలన పరిశోధనలలో అదనపు ప్రయోజనము కనబడలేదు. రెండిటి వాడకము వలన రక్తస్రావ ప్రమాదములు ఎక్కువయే అవకాశములు ఉన్నాయి.
    ఇదివరలో గుండెపోటు కలిగినవారిలో టికగ్రిలార్ ( ticagrelor ( Brilinta ) ) ప్రమాదకర హృదయ సంఘటనలను ( Major Adverse Cardiac Events - MACE ) తగ్గించుటకు ఏస్పిరిన్ తో పాటు ఉపయోగిస్తారు.

సిలొష్టజోల్ ( Cilostazol ) 


    సిలొష్టజోల్ వాడుక వలన దూరధమని వ్యాధిగ్రస్థులు నడవగలిగే దూరము పెరుగవచ్చును. కాని పరిశోధనలలో దీర్ఘకాలిక ప్రయోజనములు కనిపించలేదు. హృద్ధమని సంఘటనలు, మర్త్యత్వములలో ( mortality ) తేడా కనిపించలేదు. సిలోష్టజోల్ వలన కాళ్ళలో పొంగులు కలుగవచ్చును. 
    హృదయవైఫల్యపు లక్షణములు అధికము కావచ్చును. దీనివలన కళ్ళుతిరుగుట, కడుపు పీకు, వంటి విలక్షణములు కలుగవచ్చును
    పెంటాక్సిఫిలిన్ ( Pentoxifylline ) చాలా సంవత్సరములు వాడుకలో ఉన్నా దీనివలన ప్రయోజనము అనుమానాస్పదమే.
    విటమిన్ బి -12, ఫోలిక్ ఏసిడ్ ల వలన ప్రయోజనము కలుగదు.

ధమనీ పునరుద్ధరణ చికిత్సలు ( Revascularization procedures ) 


    దూర ధమనులలో వ్యాధి తీవ్రత హెచ్చయినప్పుడు, విరామ సమయములలో నొప్పి కలుగునపుడు ధమనీ పునరుద్ధరణ ( revascularization ) అవసరము.
    కృత్రిమ నాళికపు బుడగతో ధమనిలో సంకుచించిన భాగమును వ్యాకోచింపజేయవచ్చును ( balloon angioplasty). శ్రోణిధమని ( ileac artery ), ఊరుధమనులలో (femoral artery ) వ్యాధి ఉంటే యీ ప్రక్రియ వలన ప్రయోజనము కలుగవచ్చును. క్రింద ధమనుల వ్యాధిగ్రస్థులలో ఫలితములు తక్కువ. 
ధమనిని వ్యాకోచింపజేసిన ( angioplasty ) పిమ్మట వ్యాకోచ నాళికలు ( stents ) పొందుపఱచుట వలన ఫలితములు మెరుగుగా లేవు. ధమనీ కాఠిన్య ఫలకల తొలగింపు ( atherectomy ) వలన, ధమనిని వ్యాకోచింపజేయుటకంటె దీర్ఘకాలిక ఫలితములు మెరుగుగా లేవు.

అధిగమన శస్త్రచికిత్సలు ( bypass surgeries) 


    ధమనులలో సంకుచిత భాగమును దాటుకొని రక్తప్రసరణను పునరుద్ధరించుటకు అధిగమన శస్త్రచికిత్సలు ( bypass surgeries) అందుబాటులో ఉన్నాయి. రోగి దృశ్యసిరను కాని ( Great saphenous vein ), కృత్రిమ నాళమును ( Gore-Tex graft ) కాని, ధమనిలో సంకుచిత భాగమునకు ముందు ఒకకొనను, వెనుకను రెండవ కొనను కలిపి కణజాలమునకు రక్తప్రసరణను పునరుద్ధింప జేస్తారు.

రక్తపుగడ్డల తొలగింపు ( Embolectomy ) ; రక్తపుగడ్డల విచ్ఛేదన ( Thrombolytic therapy ) 


    ధమనులలో రక్తపు గడ్డలు ఏర్పడినా ( thrombosis ), ప్రవాహములో వచ్చి పేరుకొనినా ( emboli ) వాటిని శస్త్రచికిత్సతో కృత్రిమ నాళికపు బుడగలను ఉపయోగించి తొలగిస్తారు. అలా తొలగించ లేనపుడు రక్తపు గడ్డల విచ్ఛేదకములను ( tissue plasminogen activator- tPA / thrombolytic agents ) వాడి వాటిని కరిగింపజేస్తారు.

అంగవిచ్ఛేదనము ( amputation ) 


    రక్తప్రసరణ కోల్పోయి కణజాలము మరణించినపుడు  ( gangrene formation ), పుళ్ళుపడి సూక్ష్మజీవుల ఆక్రమణ అధ్వాన్నమయినపుడు, రక్తప్రసరణ పునరుద్ధరణ సాధ్యము కానప్పుడు బాధ ఉపశమునకు, ప్రాణరక్షణకు అంగవిచ్ఛేదన ( amputation ) అవసరము. రక్తప్రసరణకు అవరోధము ఎచట ఉన్నదో దానిని బట్టి ఎచ్చట విచ్ఛేదనము చెయ్యాలో వైద్యులు నిర్ణయిస్తారు.
    దూరధమని వ్యాధిగ్రస్థులలో హృద్ధమని వ్యాధులు, గుండెపోటులు, మస్తిష్క విఘాతములు వలన మృత్యువు కలిగే అవకాశములు, అంగనష్టము కలిగే అవకాశము కంటె హెచ్చు.
                                         
పదకోశము :

 Peripheral Arterial Disease = దూర ధమని వ్యాధి ( గ.న )
 abdominal aorta = ఉదర బృహద్ధమని ( గ.న )
 ileac arteries = శ్రోణి ధమనులు
 external ileac artery = బాహ్య శ్రోణిధమని 
 internal ileac artery = అంతర శ్రోణి ధమని
 femoral artery =  ఊరు ధమని ( గ.న )(ఊరువు = తొడ )
 Profunda femoris artery = నిమ్నోరు ధమని ( గ.న )
Superficial femoral artery = బాహ్యోరు ధమని ( గ.న )
Polpliteal artery = జానుధమని ( గ.న )
 anterior tibial artery = పూర్వ జంఘిక ధమని ( గ.న )
 Posterior tibilal artery = పృష్ఠ జంఘిక ధమని ( గ.న )
 Dorsalis pedis artery = ఊర్ధ్వపాద ధమని ( గ.న )
 metatarsal artery ,( or ) arcuate artery = మధ్యపాద ధమని శాఖ ( గ.న )
 dorsal plantar arch = ఊర్ధ్వపాదచాపము ( గ.న )
 digital arteries  = అంగుళిక ధమనులు ( గ.న )
medial plantar artery = మధ్యస్థ పాదతల ధమని ( గ.న )
 lateral plantar artery =  పార్శ్వ పాదతలధమని ( గ.న )
 deep plantar artery of dorslis pedis artery = నిమ్నపాద ధమని ( గ.న )
 plantar arterial arch = పాదతల ధమనీచాపము ( గ.న )
 elastic tissue = సాగుకణజాలము ( గ.న )
 fibrous tissue = పీచుకణజాలము ( గ.న ) , తంతుకణజాలము
 arteriosclerosis = ధమనీకాఠిన్యత
 intermittent claudication  = సవిరామపు పోటు ( గ.న )
 Ankle Brachial Index ABI index = చీలమండ రక్తపీడనము / బాహు రక్తపీడనము 
 treadmill = నడకయంత్రము
 magnetic resonance Angiography = అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణము ( గ.న )
 CT Angiogram  = గణనయంత్ర త్రిమితీయ ధమనీ చిత్రీకరణము ( గ.న )
 abdominal aortic aneurysms = . ఉదర బృహద్ధమని బుద్బుదము ( గ.న )
 collateral circulation = ప్రత్యామ్నాయ ప్రసరణ 
 Revascularization procedures = ధమనీ పునరుద్ధరణ చికిత్సలు ( గ.న )
 bypass surgeries = అధిగమన శస్త్రచికిత్సలు ( గ.న )

( గ.న ) : డా.గన్నవరపు నరసింహమూర్తిచే కూర్చబడిన పదములు )

( తెలుగులో వైద్యవిషయములపై సమాచారము నా శక్తిమేరకు అందించుట నా వ్యాసముల లక్ష్యము.
వ్యాధిలక్షణములు గలవారు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )

11, ఏప్రిల్ 2020, శనివారం

జలుబు ( Common cold )



జలుబు ( Common Cold )

     జలుబు 

     ( Common Cold )


                                                         డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.

   

 ( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )

    మనలో జలుబు రాని వారెవరూ ఉండరు. చాలా మందిలో జలుబు వచ్చి దానంతట అది కొద్ది దినాలలో తగ్గిపోతుంది. కాని కొద్ది మందిలో దాని పర్యవసానముగా మధ్య చెవిలో తాపము ( otitis media ), నాసికా కుహరములలో తాపము ( nasal sinusitis ), ఊపిరితిత్తులలో తాపము ( bronchitis ) కలుగ వచ్చును.

    జలుబు విషజీవాంశముల ( Virus;First recorded in 1590–1600; from Latin vīrus“slime, poison”; akin to Sanskrit viṣá- विष  )వలన కలుగుతుంది. ఎక్కువగా నాసికా విషజీవాంశములు ( Rhinoviruses ) జలుబుని కలిగించినా, యితర ఎంటరో వైరసులు ( Enteroviruses ), కొరోనా వైరసులు (Coronaviruses), ఎడినోవైరసులు ( Adenoviruses ), పారాఇన్ ఫ్లుయెంజా వైరసులు ( Parainfluenza viruses ), ఇన్ ఫ్లుయెంజా వైరసులు ( Influenza viruses ), హ్యూమన్ రెస్పిరేటరీ సిన్ సిషియల్ వైరసులు ( Human respiratory Syncytial  viruses ), జలుబుని కలిగించ గలవు.

    నాసికా విషజీవాంశములు ( Rhinoviruses ) పికోర్నా వైరసు సముదాయములో ఉన్న ఎంటెరో వైరసులకు చెందుతాయి. వీటి పరిమాణము అతి సూక్ష్మముగా ఉంటుంది. వీటి ఆకారము వింశతిఫలక ఆకారము ( Icosahedral ). ఇవి ఒంటిపోగు రైబోన్యూక్లియక్ ఆమ్లమును కలిగి ఉంటాయి. మానవ నాసికా విషజీవాంశములలో A, B, C అనే మూడు ప్రధాన తెగలలో, జన్యుపదార్ధములో మాంసకృత్తుల బట్టి 160 రకాలు ఉన్నాయి.

    ఈ విషజీవాంశములు జలుబు ఉన్నవారి నుంచి తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వెదజల్లబడుతాయి. వస్తువుల ఉపరితలములపై  పద్దెనిమిది గంటల వఱకు ధ్వంసము కాకుండా మనగలుగుతాయి. దగ్గఱలో ఉన్న వారు ఆ వెదజల్లబడిన విషజీవాంశములను పీల్చినా, లేక ఆ విషజీవాంశములు ఉన్న వస్తువులను తాకి ఆ చేతులతో ముక్కును ముట్టుకొన్నా, వ్యాధిగ్రస్థులను  కరచాలనములతోనో మరోలాగో తాకి పిదప ముక్కు, నోరు, స్పర్శించినా అవి ముక్కు, గొంతు, శ్వాస నాళముల శ్లేష్మపుపొర ( Mucosa ) లోని కణముల లోనికి ప్రవేశిస్తాయి. ఆపై త్వరగా ఆ కణములలో వృద్ధి చెందుతాయి. ఈ విషజీవాంశములచే ఆక్రమించబడిన కణముల నుంచి ఖీమోకైన్లు ( chemokines ), సైటోకైన్లు ( cytokines ) విడుదలయి  తాప ప్రక్రియను కలిగిస్తాయి. ఈ విషజీవాంశములు 32 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత ఒద్ద వృద్ధి చెందుతాయి. ఆ ఉష్ణోగ్రత ముక్కు, గొంతుక, శ్వాసనాళములలో ఉండుట వలన ఆ భాగములే తాప ప్రక్రియకు గురి అవుతాయి. నాసికా విషజీవాంశములు ( Rhinoviruses ) కణ విధ్వంసమును కలుగజేయవు. రెస్పిరేటరీ సిన్ సీషియల్ విషజీవాంశముల వలన శ్లేష్మపుపొర కణముల విధ్వంసము జరుగ వచ్చును.

    జలుబు కలిగించే విషజీవాంశములు చాలా త్వరగా మనుజుల మధ్య వ్యాప్తి చెందుతాయి. పాఠశాలలలోను, దినసంరక్షణ కేంద్రాలలోను పిల్లల నుంచి పిల్లలకు జలుబు ఎక్కువగా వ్యాప్తి చెంది, పిల్లల నుంచి పెద్దలకు సంక్రమించగలదు. కుటుంబములో ఒకరి నుంచి మరి ఒకరికి, కచేరీలలోను, కర్మాగారములలోను, పనిచేసేవారిలో ఒకరినుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

    శీతాకాలములలోను, ఆకురాల్చు కాలములోను, జలుబులు ఎక్కువగా కలుగుతాయి. వాతావరణ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి ముక్కు ఉష్ణోగ్రత ఈ విషజీవాంశముల వృద్ధికి దోహదపడుట, వ్యక్తుల వ్యాధినిరోధక శక్తి తగ్గుట దానికి కారణము కావచ్చును.

వ్యాధి లక్షణములు 


    మనలో అందఱికీ జలుబు ఎప్పుడో అప్పుడు కలుగుట వలన లక్షణాలు అందఱికీ అనుభవ వేద్యమే. ముందుగా గొంతు నొప్పి, ముక్కు, గొంతుకలలో దుఱద, ఒంటినొప్పులు, నలత, జ్వర భావము కలిగి, ఆపై ముక్కు కారుట, తుమ్ములు, దగ్గు, ముక్కు దిబ్బకట్టుట కలుగుతాయి. తలనొప్పి కొందఱికి కలుగుతుంది.  పిల్లలలో జలుబుతో   జ్వరము తఱచు చూస్తాము. వయోజనులలో జలుబుతో పాటు జ్వరము హెచ్చుగా కలుగదు.

    ఉబ్బస ఉన్నవారిలో జలుబు కలిగినప్పుడు ఉబ్బస ప్రకోపించవచ్చును. పిల్లలలో జలుబులు మధ్యచెవిలో తాపమునకు ( Otitis media ) దారి తీయవచ్చును. జలుబు తర్వాత తక్కువ శాతము మందిలో నాసికా కుహరములలోను ( Paranasal sinuses ) శ్వాస నాళికలలోను ( Bronchi ), తాపము కలుగవచ్చును.

    వీటికి గురైనవారిలో వ్యాధి లక్షణములు 20 గంటల నుంచి నాలుగు దినములలో కనిపిస్తాయి. చాలా మందిలో రెండు దినములలో వ్యాధి లక్షణములు పొడచూపుతాయి. వారము, పది దినములలో చాలా మందిలో వ్యాధి లక్షణములు తగ్గిపోయినా  కొంతమందిలో యీ లక్షణాలు రెండు, మూడు వారముల వఱకు ఉండగలవు. కొద్ది శాతము మందిలో దగ్గు రెండు మూడు వారముల వఱకు ఉండవచ్చు.

వ్యాధి నిర్ణయము 


     ఒంట్లో నలత, ఒంటి నొప్పులు, ముక్కు కారుట, తుమ్ములు, కొద్దిగా గొంతునొప్పి, పెద్దగా జ్వరము లేకపోవుట జలుబును సూచిస్తాయి. 
   వ్యాపక జ్వరాలు ( Influenza ) ఉన్నవారిలో జ్వరము, దగ్గు, ఒళ్ళునొప్పులు ఎక్కువగా ఉంటాయి. తుమ్ములు, ముక్కు కారుట  విపరీతముగా ఉండవు. 
   ధూళి, పుప్పొడులకు  అసహనములు ( allergies ) ఉండి వాటి బారి పడిన వారిలో తుమ్ములు, ముక్కు కారుట ఎక్కువగా ఉంటాయి. వీరికి జ్వరము, ఒళ్ళునొప్పులు, నలత తక్కువగా ఉంటాయి. కళ్ళలో దుఱద, కళ్ళు నీరు కారుట కూడా పదార్థాల అసహనమును ( Allergies )  సూచిస్తాయి. 
     జలుబు ఉన్నవారి నాసికా స్రావములలో విషజీవాంశములను ( viruses ) కనుగొనవచ్చును, కాని వ్యయముతో కూడుట వలన, ప్రయోజనము లేకపోవుట వలన ఆ పరీక్షలు సలుపరు.

చికిత్స 


    జలుబుకు ఉపశమన చికిత్సలే ఇప్పుడు లభ్యము. ముక్కు దిబ్బడ, నీరు కారుటలను తగ్గించడానికి నాసికా నిస్సాంద్రకములను (Nasal decongestants) వాడవచ్చును. ఇవి ముక్కులో చుక్కలుగాను ( Oxymetazoline nasal drops, Phenylephrine nasal spray, Ipratropium bromide nasal drops ), నోటితో తీసుకొనే ఔషధములు గాను ( Phenylephrine tablets, Pseudoephedrine tablets ) లభ్యము.

    ఒంటినొప్పులు, నలతలకు ఎసిటెమైనోఫెన్  ( Acetaminophen ),  పేరెసిటమాల్ ( Paracetamol ), ఐబుప్రొఫెన్ లు ( Ibuprofen ) వాడవచ్చును.

    లొరటడిన్ ( Loratadine ), డెస్ లొరటడిన్ ( Desloratadine ), సెట్రిజెన్ ( Cetrizine ) వంటి హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ( Histamine receptor blockers ) వలన తొలి, మలి దినములలో కొంత ఉపశమనము కలుగవచ్చును.

    గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలింతలు కొంత ఉపశమనమును కలిగించ వచ్చును.

    జింక్ ఖనిజలవణము వలన కొంత ప్రయోజనము కలుగ వచ్చును.

    జలుబులకు సూక్ష్మజీవి నాశకములను ( Antibiotics ) వాడకూడదు. వాటికి విషజీవాంశముల పైన ఎట్టి ప్రభావము ఉండదు. వాటి వలన అవాంఛిత ఫలితాలు, వికట ఫలితాలు కలుగవచ్చును. అనవసరముగా సూక్ష్మజీవి నాశకములు ( Antibiotics ) వాడుట వలన వాటికి లొంగని సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. చాలా సూక్ష్మజీవి నాశకములు  అందువలన నిష్ప్రయోజనము అవుతున్నాయి.

    విటమిన్ సి, విటమిన్ డి, తేనెల వలన ప్రయోజనములు నిరూపితము కాలేదు. అలాగే దగ్గుమందుల ప్రయోజనము కూడా శూన్యము. పిల్లలలో ప్రయోజనము లేక పోవుట వలన అవాంఛిత ఫలితాలు కలుగుట వలన డెక్స్ట్రోమిథార్ఫన్ ( Dextromethorphan ) అనే దగ్గుమందును పలు దేశాలలో నిషేధించారు. జలుబుకి కార్టికోష్టీరాయిడ్ తుంపర మందుల వలన ప్రయోజనము లేదు.

    జలుబుకు  విషజీవాంశ నాశకములు ( Antivirals ) పరిశోధన స్థాయిలో ఉన్నాయి. ప్లికొనారిల్ ( Pleconaril ) నాసికా విషజీవాంశములు ( rhinoviruses ) ముక్కులో శ్లేష్మపు పొర కణములతో సంధానమగుటను అరికడతాయి. అందువలన ఆ జీవాంశములు నాసికా కణముల లోనికి  చొచ్చుకొనవు. వృద్ధి చెందవు. ఉబ్బస వ్యాధిగ్రస్థులలో యీ మందు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.

నివారణ 


    జలుబు కలిగించే విషజీవాంశములు యితరులకు సులభముగా అంటుకోగలవు. వ్యాధి సోకిన తొలి మూడు దినములలో యివి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. జలుబు సోకిన మూడు దినములు పాఠశాలలకు, దిన సంరక్షక కేంద్రాలకు పిల్లలను పంపకపోవుట మంచిది. జలుబు ఉన్నవారు తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు నోటికి, ముక్కుకు ఆచ్ఛాదనలను ( masks ) ధరించడమో, లేక  మోచేతులను అడ్డు పెట్టుకొనుటో చెయ్యాలి. ఇతరులను స్పర్శించరాదు, ఇతరులతో కరచాలనములు చేయరాదు. తఱచు చేతులను కడుగుకొనుట, శుభ్రపఱచుకోని  చేతులతో ముక్కు, నోరు, కళ్ళు స్పర్శించక పోవుట వలన  జలుబులను అరికట్టే అవకాశములు ఉన్నాయి.

       జన్యు పరివర్తనాలు  ( genetic mutations ) ఎక్కువగా కలిగే ఈ జలుబు విషజీవాంశములను  టీకాలతో నివారించగలగడము దుస్సాధ్యము.

 పదజాలము :


Nasal sinuses = నాసికా కుహరములు ( గ.న )
Otitis media = మధ్య చెవి తాపము
Icosahedron = వింశతిఫలకము
decongestants =  నిస్సాంద్రకములు ( గ.న )
Histamine receptor blockers = హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ( గ.న )
Viruses = విషజీవాంశములు ( గ.న )

( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

పాండురోగము ( Anemia )


                                                                    పాండురోగము ( రక్తహీనత  )

                                                                                 Anemia )


( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో :)
                               
                                                              డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .

    జంతుజాలములోను, పక్షులలోను, జలచరములలోను జీవన వ్యాపారమునకు రక్తప్రసరణము మూలాధారము. రక్తప్రసరణము వలన వివిధ కణజాలమునకు ప్రాణవాయువు ( Oxygen ), పోషక పదార్థములు చేర్చబడుతాయి. కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు ( cabon dioxide ), తదితర వ్యర్థ పదార్థములు గ్రహింపబడి ఊపిరితిత్తులకు ( Lungs ), కాలేయమునకు ( Liver ), మూత్రాంగములకు ( Kidneys ) విసర్జన కొఱకై చేర్చబడుతాయి. హృదయము వివిధ అరల సంకోచ వ్యాకోచముల వలన రక్తమును గ్రహించి, మరల ఆ రక్తమును వివిధ అవయవములకు సరఫరా చేస్తుంది. హృదయము ఒక తోడు యంత్రము. రక్తనాళముల ద్వారా రక్తప్రసరణము జరుగుతుంది. రక్తములో ఎఱ్ఱకణాలు ( Red Blood Corpuscles), తెల్లకణాలు ( White Blood Cells ), రక్తఫలకములు ( Platelets ), రక్తద్రవములో ( Plasma)  కలిసి ఉంటాయి. ఇతర పోషక పదార్థములు, మాంసకృత్తులు, చక్కెర, క్రొవ్వు పదార్థములు, వినాళ గ్రంథుల స్రావములు ( Hormones ) యితర రసాయనములు రక్తద్రవములో కరిగి ఉంటాయి. ఎఱ్ఱకణములు ప్రాణవాయువును  కణజాలమునకు చేర్చుటకు, కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువును ఊపిరితిత్తులకు విసర్జనకు కొనిపోవుటకు, ఊపిరితిత్తులలో ప్రాణవాయువును గ్రహించుటకు ఉపయోగపడుతాయి.

ఎఱ్ఱకణములు ( Red blood corpuscles ) 


    ప్రాణవాయువు వాహక సమర్థత ( Oxygen carrying capacity ) ఎఱ్ఱకణాలు, ఆ కణాలలో ఇమిడిఉన్న హీమోగ్లోబిన్ అనే వర్ణకము ( Pigment ) యొక్క పరిమాణములపై ఆధారపడి ఉంటుంది. సాధారణముగా ఒక క్యూబిక్ మిల్లీమీటరు రక్తములో స్త్రీలలో 4-5 మిల్లియన్లు, పురుషులలో 5-6 మిల్లియన్ల ఎఱ్ఱకణాలు ఉంటాయి. ఎఱ్ఱకణాలు కోలగా ద్విపుటాకారపు పళ్ళెములవలె ఉంటాయి. ఒక్క ఎఱ్ఱకణపు పరిమాణము సుమారు 90 ఫెంటొ లీటర్లు ( fl )g ( ఒక ఫెంటో femto అంటే 0.000 000 000 000 001) కలిగి ఉంటుంది. రక్తకణాలు ఎముకల మజ్జలో ( Bone marrow ) ఉత్పత్తి అవుతాయి. ప్రారంభ దశలో ఎఱ్ఱకణాలలో న్యూక్లియస్లు ఉన్నా, పరిణామము చెందుతూ అవి న్యూక్లియస్ లను కోల్పోతాయి. అందువలన వాటిలో ఎక్కువగా హీమోగ్లోబిన్ నిక్షిప్తము అయే అవకాశము ఉంటుంది. పరిణామము చెందుతున్న దశలో న్యూక్లియస్ తొలగినా ఎఱ్ఱకణాలలో రైబోసోమల్ ఆర్. ఎన్. ఎ జల్లెడ కలిగి ( Ribosomal RNA reticulum), ఆ జాలిక కణాలు ( Reticulocytes ) క్రమేణా ఆ జాలికను కూడా కోల్పోతాయి. ప్రసరణలో ఉన్న ఎఱ్ఱ కణాలలో న్యూక్లియస్లు ఉండవు. కాని ప్రసరణలో సుమారు ఒక శాతపు జాలిక కణాలు ఉంటాయి. రక్తనష్టము జరిగినప్పుడు ఎఱ్ఱకణాల ఉత్పత్తి అధికము, త్వరితము అయి పరిణతి చెందని కణాలు ప్రసరణములోనికి విడుదల అయి జాలిక కణాల శాతము పెరుగుతుంది . పరిణతి చెందిన కణాలు పరిణతి చెందని కణాల కంటె చిన్నవిగా ఉంటాయి.

    ఎక్కువ పరిమాణము గల కణాలు ప్రసరణలో ఉంటే పృథుకణత్వము అని ( Macrocytosis ), తక్కువ పరిమాణము కల కణాలు ప్రసరణలో ఉంటే  లఘుకణత్వము ( Microcytosis ) అని అంటారు. సామాన్య పరిమాణ కణాలు ప్రసరణలో ఉంటే సామాన్య కణత్వము ( Normocytosis ) అని అంటారు.

    ఎఱ్ఱరక్త కణాలలో ఉండే రక్తవర్ణకము ( hemoglobin ) వలన వాటికి ఎఱుపు రంగు వస్తుంది. రక్తవర్ణకము వలన ఎఱ్ఱకణాలు ప్రాణవాయువును వహించగలుగుతాయి. రక్తవర్ణకము ( hemoglobin ) సాధారణముగా డెసి లీటరు రక్తములో పురుషులలో 13- 14 గ్రాములు, స్త్రీలలో 12- 13 గ్రాములు ఉంటుంది. హీమోగ్లోబిన్ సాధారణ పరిమితి కంటె తక్కువయితే దానిని రక్తహీనముగా ( Anemia ; పాండురోగము ) పరిగణిస్తారు. రక్తమును ఒక పరీక్షనాళికలో ఉంచి వికేంద్రీకరణ యంత్రములో ( Centrifuge ) వడిగా తిప్పుతే కణాలన్నీ క్రిందకు పేరుకొని రక్తద్రవము ( Plasma ) పైకి చేరుకుంటుంది. పేరుకొన్న కణ ఘనపరిమాణమును రక్త (కణ ) సాంద్రతగా ( Hematocrit) పరిగణిస్తారు. ఇది సాధారణముగా పురుషులలో 46 శాతము, స్త్రీలలో 42 శాతము ఉంటుంది. రక్తహీనము ఉన్న వారిలో రక్త  సాంద్రత తక్కువగా ఉంటుంది.
    రక్తకణములు ఎముకల మజ్జలో ఉత్పత్తి అవుతాయి. పిల్లలలో అన్ని ఎముకల మజ్జలలోను రక్తకణముల ఉత్పత్తి జరుగుతుంది. పెద్దలలో కపాల అస్థికలు, రొమ్ముటెముకలు, ప్రక్కటెముకలు, కటియెముకలు, దీర్ఘాస్థుల చివరి భాగముల మజ్జలలోను రక్తకణముల ఉత్పత్తి జరుగుతుంది. మూత్రాంగములలో ( kidneys ) ఉత్పత్తి అయే రక్తోత్పాదిని ( Erythropoietin ) అనే రసాయనము ఎఱ్ఱకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మూత్రాంగముల వ్యాధి, వైఫల్యము ఉన్న వారిలో రక్తోత్పాదిని ( Erythropoietin  ) ఉత్పత్తి తక్కువగుటచే వారిలో రక్తహీనత కలుగుతుంది.
    ఎఱ్ఱ రక్తకణాలలో ఉండే హీమోగ్లోబిన్ లో- హీం ( Heme ) అనే వర్ణకము ( Pigment ) గ్లోబిన్ అనే మాంసకృత్తితో సంయోగమయి ఉంటుంది. హీం ఉత్పత్తికి ఇనుము ( Iron ) అవసరము. ఎఱ్ఱకణాల ఉత్పత్తికి ఇనుము, ఫోలికామ్లము, విటమిన్ బి -12 లు అవసరము.

                                          పాండురోగ కారణములు


రక్తహీనము ఎఱ్ఱకణాల ఉత్పత్తి లోపము వలన, రక్తనష్టము ( Blood loss ) వలన, రక్తకణ విచ్ఛేదనము ( Hemolysis ) వలన కలుగుతుంది.

రక్తనష్టము 


    తరుణ స్త్రీలలో ఋతుస్రావము అధిక మయితే రక్తహీనము కలుగుతుంది. జీర్ణమండలము ( Alimentary tract ) ద్వారా రక్తనష్టము కలుగవచ్చును. జీర్ణాశయము ( Stomach ), ప్రథమాంత్రములలో ( Duodenum ) జీర్ణ వ్రణములు ( Peptic ulcers ), జీర్ణమండలములో వివిధ కర్కటవ్రణములు ( Cancers ), అన్ననాళములో ఉబ్బుసిరలు  [ Esophageal varices - ఇవి నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో ( Cirrhosis of Liver ) కలుగుతాయి ], జఠరతాపము ( Gastritis ) [ మద్యపానము , కీళ్ళనొప్పులకు వాడే మందులు, ఏస్పిరిన్, యితర ఔషధములు, హెలికోబాక్టర్ పైలొరై ( Helocobacter Pylori) అనే సూక్షజీవుల వలన జఠర తాపములు కలుగుతాయి ], పెద్దప్రేవులలో కలిగే ఆంత్ర బుద్బుదాలు ( Diverticulosis), కంతులు ( Polyps ), మూలవ్యాధి ( Haemerrhoids ), ఆంత్రములలో చేరిన కొంకి పురుగులు ( Hookworms ) వంటి పరాన్నభుక్తుల ( Parasites ) వలన దీర్ఘకాలములోను, త్వరితగతిలోను రక్తనష్టము కలుగ వచ్చును. ప్రమాదాల వలన కలిగే తీవ్రగాయాల వలన, శస్త్రచికిత్సలలోను రక్తనష్టము కలుగవచ్చును. 

అయస్సు లోప రక్తహీనత ( Iron deficiency anaemia ) 


     పైన పేర్కొన్న కారణాల వలన శరీరములో ఇనుము నిల్వలు తగ్గుటచే రక్తహీనత కలుగుతుంది. గర్భిణీ స్త్రీలలో రక్తపు అవసరము ఎక్కువయి రక్తపు ఉత్పత్తి పెరుగుతుంది. వారికి దైనందిక ఇనుము అవసరాలు పెరుగుతాయి. వారికి ఇనుము లవణరూపములో అదనముగా అందించకపోతే ఇనుము లోపించి  పాండురోగము కలుగుతుంది. శిశువులలో కూడా ఇనుము లోపము కలుగవచ్చును. 
    ఆంత్ర వ్యాధులు, క్లోమవ్యాధులు ( Pancreatic disorders), జఠరఛేదన ( Gastric resection), ఆంత్రఛేదన ( Gut resection ) చికిత్సల వలన అజీర్తి ( Malabsorption ) కలిగి ఇనుము ( iron ) గ్రహించబడకపోయినా అయస్సు లోపము కలుగుతుంది. 

లక్షణములు 


    ఇనుము లోపించి రక్తహీనత కలిగితే వారికి రక్తహీనత తీవ్రత బట్టి నీరసము, అలసట, ఆయాసము, ఒంట్లో నలతభావము, పొడచూపుతాయి. రక్తలోపము తీవ్రమయితే ఒంటిపొంగులు కలుగవచ్చును. వీరికి వింత రుచులు కలిగి మట్టి, పిళ్ళు, మంచుగడ్డలపై రుచి కలుగుతుంది. రక్తహీనత వలన వీరు వర్ణము కోల్పోయి తెల్లబడుతారు. అందువలనే రక్తహీనతకు పాండురోగము అనే పేరు ప్రశస్తి చెందింది. 
    రక్తపరీక్షలలో వీరి ఎఱ్ఱకణముల సంఖ్య తగ్గి ఉంటుంది. రక్తములో రక్తవర్ణకము ( hemoglobin ), రక్త సాంద్రత ( Hematocrit )  తగ్గి ఉంటాయి. ఎఱ్ఱరక్తకణాల పరిమాణము తగ్గుతుంది. వీరిలో లఘుకణత్వము ( Microcytosis ) ప్రస్ఫుటము అవుతుంది. ఎఱ్ఱకణములలో రక్తవర్ఱక ప్రమాణము తగ్గి వర్ణహీనత ( hypochromia ) కలుగుతుంది. రక్తములో ఇనుము విలువలు, ఫెరిటిన్ విలువలు తగ్గి ఉంటాయి. రోగుల చరిత్ర, భౌతిక పరీక్షలతో బాటు మలమును అగోచర రక్తమునకు ( Occult blood ), పరాన్నభుక్తులకు, వాటి అండములకు ( Ova and Parasites ) పరీక్షించాలి. జఠరాంత్రదర్శన, (Gastroduodenoscopy ) బృహదాంత్ర దర్శన ( Colonoscopy ) పరీక్షల వలన అన్నవాహికలోను, జఠరములోను, ఆంత్రములలోను జీర్ణవ్రణములు ( peptic ulcers ), కంతులు ( polyps ), కర్కటవ్రణములు ( cancers ), ఆంత్రబుద్బుదములు ( diverticuli )  కనుగొనబడుతాయి. మూలకారణముల చికిత్స వీరికి అవసరము. రక్తలోపము అతి తీవ్రమైనవారికి పరరక్తదానము ( Blood transfusion ) అవసరము. ఇతరులకు ఇనుము లవణరూపములలో ( iron salts  ) సరఫరా చెయ్యాలి.  ఫెఱ్ఱస్ సల్ఫేట్ ను సాధారణముగా వాడుతారు.  వాంతిభావన , కడుపులో వికారము , వాంతులు వచ్చి ఫెఱ్ఱస్ సల్ఫేట్ ను సహించలేనివారు ఫెఱ్ఱస్ గ్లుకొనేట్,  కాని ఫెఱ్ఱస్ ఫ్యుమరేట్ గాని వాడుకోవచ్చును. ఇనుముతో బాటు అధిక రక్తోత్పత్తికి అవసరమయిన ఫోలికామ్లమును కూడా వైద్యులు సరఫరా చేస్తారు.

    పృథుకణ రక్తహీనతలు ( Macrocytic anaemias ) ఫోలికామ్లము లోపము లేక విటమిన్  బి - 12 లోపముల వలన కలుగుతాయి

ఫోలికామ్లపు లోపము 


    గర్భిణీ స్త్రీలకు,  పిల్లలకు పాలిచ్చే తల్లులకు ఫోలికామ్లపు అవసరాలు మూడింతలు పెరుగుతాయి. అందువలన వారికి ఇనుముతో బాటు ఫోలికామ్లమును కూడా సరఫరా చెయ్యాలి. మద్యపానము హెచ్చయిన వారిలోను, వృద్ధులలోను, మానసిక వ్యాధిగ్రస్థులలోను, బరువు తగ్గుటకై విపరీతపు మితాహారములలో ఉన్నవారిలోను, అజీర్తి వ్యాధిగ్రస్థులలోను, ఫోలికామ్లపు లోపములు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఔషధముల ( Methotrexate, Triamterene , Sulphasalazine, Barbiturates , Carbamazepine, Pyrimethamine, Metformin, ) వలన ఫోలికామ్లపు లోపము కలుగవచ్చును. రక్తశుద్ధి ( Hemodialysis ) చికిత్స పొందే వారికి ఫోలికామ్లమును సరఫరా చెయ్యాలి. రక్తవిచ్ఛేదన రక్తహీన వ్యాధిగ్రస్థులకు ఫోలికామ్లమును అందజేయాలి. 

లక్షణములు 

    ఫోలికామ్లము లోపించిన వారి రక్తకణాల పరిమాణము ఎక్కువగా ( పృథుకణత్వము ; macrocytosis ) ఉంటుంది. అలసట, నీరసము, ఎక్కువ చిరాకు, నిద్రలేమి, మానసిక కుంగుదల, మతిమఱపు కొన్ని ఫోలికామ్లలోప వ్యాధి లక్షణాలు. వీరి రక్తపరీక్షలలో ఫోలికామ్లపు విలువలు తక్కువగా ఉంటాయి. ఫోలికామ్లమును సరఫరా చేసి లోపమును సరిదిద్దవచ్చును. ఫోలికామ్లమును కనుగొన్న శాస్త్రజ్ఞులు శ్రీ యెల్లాప్రగడ సుబ్బారావు గారు తెలుగువారే అగుట మనకు గర్వకారణము.


విటమిన్ బి -12 లోపము 


    విటమిన్ బి -12 లోపించిన వారిలో కూడా  పృథుకణ రక్తహీనత కలుగుతుంది. ఇది ప్రమాదకర రక్తహీనతగా ( Pernicious anaemia ) పేరు గడించింది. విటమిన్ బి-12 ని బాహ్యాంశముగా ( Extrinsic factor ) పరిగణిస్తారు. విటమిన్ బి -12 గ్రహించుటకు అవసరమయే అంతరాంశము ( Intrinsic factor ) జఠరములో ఉత్పత్తి అవుతుంది. బాహ్యాంశమైన బి - 12. అంతరాంశముతో కలిసి, చిన్నప్రేవుల చివరి భాగములో ( Ileum ) గ్రహించబడుతుంది. 
    ఆహారములో బి-12 విటమిన్ లోపించిన వారిలోను, జఠరఛేదన ( gastrectomy ), ఆంత్రఛేదన ( resection of small intestines ) చికిత్సలు జరిగిన వారిలోను బి-12 లోపము కలుగుతుంది. వృద్ధులలో జఠర క్షయము ( Gastric atrophy ) వలన అంతరాంశము ఉత్పత్తి జరుగక బి-12 గ్రహణమునకు అవరోధము కలుగవచ్చును. స్వయంప్రహరణ రక్షణ వ్యాధి ( Autoimmune disorder ) వలన కూడా అంతరాంశము ఉత్పత్తిలో లోపము కలుగవచ్చును. Diphillobothrium latum వంటి పరాన్నభుక్తుల వలన కూడా బి- 12 లోపము వస్తుంది.

లక్షణములు 


    విటమిన్ బి - 12 లోపించిన వారిలో నాడీమండల వ్యాధులు సాధారణముగా రక్తహీనత కంటె ముందుగా కనిపిస్తాయి. చేతులు, పాదములలో తిమ్మిరులు, ప్రకంపన స్పర్శ లోపము ( loss of vibratory sense ), స్పర్శ లోపము ( loss of touch sensation ), దూరనాడుల తాపములు ( Peripheral neuritis), అస్థిరత్వము ( Instability) బి -12 లోపము వలన రక్తహీనతకు ముందుగానే కనిపించవచ్చును.
    రక్త పరీక్షతో బి -12 విలువలు తెలుసుకొని, లోపము ఉంటే విటమిన్ బి -12 ని అధికమోతాదులలో బిళ్ళలుగా గాని, సూదిమందుగా గాని యిచ్చి లోపమును నివారించవచ్చును. 
    మౌలిక పదార్థములు ఇనుము, ఫోలికామ్లము, విటమిన్ బి-12 లోపముల వలన, మూత్రాంగ వ్యాధిగ్రస్థులలో రక్తోత్పాదిని ( Erythropoietin ) లోపము వలన, ఎముకలమజ్జ వ్యాధుల వలన రక్తపు ఉత్పత్తి తగ్గగలదు. కర్కట వ్రణముల వలన, శరీర రక్షణ వ్యవస్థ లోపములు ( Immune deficiency)  కలవారిలోను, దీర్ఘకాల వ్యాధులు గలవారిలోను రక్తపు ఉత్పత్తి తగ్గవచ్చును. థలసీమియా ( Thalassemia) జన్యుపరముగా సంక్రమించే వ్యాధి. ఈ వ్యాధిగ్రస్థులలో గ్లోబిన్ గొలుసుల ఉత్పత్తి లోపము వలన రక్తహీనత కలుగుతుంది. 

రక్తవిచ్ఛేదన రక్తహీన వ్యాధులు ( Hemolytic anaemias )  


    జన్యుపరముగా వచ్చే విరూప రక్తకణ వ్యాధులు అయిన లవిత్రకణ రక్తహీన వ్యాధిలోను ( Sickle cell anemia ) , వంశపారంపర్య గోళకణవ్యాధి లోను ( Hereditary Spherocytosis ), అసాధారణపు హీమోగ్లోబినుల ( Hemoglobinopathies ) వలన, రక్తకణముల ఆయువు తగ్గి అవి త్వరితముగా విచ్ఛేదించబడతాయి. శరీర రక్షణ వ్యవస్థ ( Immunological system) కు స్వ ( Self ) పర ( External ) విచక్షణా లోపము కలుగుతే స్వయంప్రహరణ వ్యాధులు ( Autoimmune diseases) వలన రక్తకణముల విచ్ఛేదనము విశేషముగా జరుగవచ్చును. ఆ వ్యాధులలో రక్తహీనత కలుగుతుంది. కృత్రిమ హృదయ కవాటములు ఉన్న వారిలో రక్తకణ విచ్ఛేదనము కలుగవచ్చును. గ్లూకోజ్-6 ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ లోపము ఉన్న వారిలో కొన్ని మందుల వలన,  ఫావా చిక్కుళ్ళ వలన ఎఱ్ఱకణముల ఛేదనము కలిగి రక్తహీనత కలుగవచ్చును. రక్తవిచ్ఛేదనము విశేషముగా జరిగినపుడు రక్తహీనముతో ( anemia ) బాటు బిలిరుబిన్ విలువలు పెరిగి పచ్చకామెరులు ( jaundice ) కూడా కలిగే అవకాశము ఉన్నది.

    ఇచ్చట పేర్కొన్న కారణాలే గాక అనేక యితర వ్యాధుల వలన కూడా రక్తహీనత కలుగవచ్చును. ఇనుము లోపము వలన కలిగే రక్తహీనతను తఱచు చూస్తాము.
    వివిధ శోధన పరీక్షలు, ఎముక మజ్జ కణపరీక్షలు ( Bone marrow biopsy) రక్తహీనత కలిగిన వారికి అవసరము కావచ్చును. కారణము కనుగొన్న పిదప వైద్యులు తగిన చికిత్సలు చేస్తారు.

ఆహార పదార్థాలు 


    సాధారణముగా మనకు వివిధ ఆహార పదార్థాల ద్వారా మన అవసరములకు కావలసిన ఇనుము, ఫోలికామ్లము, బి 12 విటమినులు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు అవసరాలు పెరుగుట వలన, ఇనుము, ఫోలికామ్లములను మందుల రూపములో యివ్వవలసి ఉంటుంది.
    ఇనుము తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుళ్ళు , పప్పులు, వేరుసెనగ, గుమ్మడి విత్తులు, ఫలములు, మాంసము, చేపలు, గ్రుడ్లు ద్వారా లభ్యమవుతుంది.
    ఫోలికామ్లము ఆకుకూరలు, కాబేజీ, బ్రాకెలీ, చిక్కుళ్ళు, పప్పులు, నారింజ, అరటి , మిగిలిన ఫలముల ద్వారా లభ్యమవుతుంది.
    విటమిన్ బి -12 పాలు, పెరుగు, వెన్న, గ్రుడ్లు, మాంసము, చేపల ద్వారా  లభ్యమవుతుంది. పాలు వంటి పాడిపదార్థములు కూడా భుజించని సంపూర్ణ శాకాహారులు విటమిన్ బి -12 మాత్రలు వినియోగించాలి.

పదకోశము :

Blood transfusion =. పరరక్త ప్రదానము
Platelets  = రక్త ఫలకములు    ( గ.న )
Hormones = వినాళగ్రంధుల రసములు 
Oxygen carrying capacity = ప్రాణవాయువు వాహక సమర్థత ( గ.న )
Reticulocytes = జాలిక కణాలు ( గ.న )
Macrocyte = పృథుకణము
( Macrocytosis = పృథు కణత్వము ( గ.న )
Microcyte = లఘుకణము
 Microcytosis = లఘు కణత్వము ( గ.న )
 Normocytosis = సామాన్యకణత్వము ( గ.న )
Hypochromia = వర్ణహీనత (గ.న )
Centrifuge = వికేంద్రీకరణ యంత్రము ( గ.న )
 Plasma = రక్తద్రవము ( గ.న )
 Hematocrit =  రక్త (కణ ) సాంద్రత ( గ.న )
Erythropoietin = రక్తోత్పాదిని ( గ.న )
 Hemolysis = రక్తకణ విచ్ఛేదనము ( గ.న )
 Esophageal varices = అన్నవాహిక ఉబ్బుసిరలు ( గ.న )
Varicose veins = ఉబ్బుసిరలు ( గ.న )
 Gastroscopy = జఠరాంతరదర్శనము, ( గ.న )
 Gastroscope = జఠరాంతరదర్శిని ( గ.న )
 Colonoscopy = ఆంత్రాంతరదర్శనము ( గ.న )
 Colonoscope = ఆంత్రాంతరదర్శిని ( గ.న )
 Pernicious anaemia = ప్రమాదకర రక్తహీనత ( గ.న )
 Extrinsic factor = బాహ్యాంశము ( విటమిన్ B12 ) గ.న 
 Intrinsic factor = అంతరాంశము ( గ.న )
 Gastric atrophy = జఠర క్షయము ( గ.న )
 Autoimmune disorder = స్వయంప్రహరణ  వ్యాధి ( గ.న )
Peripheral neuritis = దూరనాడుల తాపము ( గ.న )
 Hemolytic anaemias = రక్తవిచ్ఛేదన రక్తహీనము ( గ.న )
 Sickle cell anemia = లవిత్రకణ రక్తహీనత ( గ.న )
 Sickle cell disease = లవిత్రకణ వ్యాధి ( గ.న )
 Hereditary Spherocytosis = వంశపారంపర్య గోళకణవ్యాధి ( గ.న )

( గ.న . డా గన్నవరపు నరసింహమూర్తిచే కూర్చబడిన పదములు )

( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి . )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...