26, ఆగస్టు 2020, బుధవారం

నిమ్నసిర రక్తఘనీభవనము ( Deep Vein Thrombosis ) ; పుపుస ధమనిలో అవరోధకము ( Pulmonary Embolism )

 


తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో : )


          నిమ్నసిర రక్తఘనీభవనము ( Deep Vein Thrombosis )

                     పుపుసధమనిలో అవరోధకములు ( Pulmonary Embolism )



                                                                         డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .

రక్తఘనీభవనము ( Coagulation of blood ) 



    శరీరమునకు గాయములు కలిగినపుడు రక్తస్రావమును నిలిపి అదుపుచేయుటకు రక్తము గడ్డకడుతుంది. రక్తస్రావ నిరోధము ( hemostasis ) రెండు దశలలో జరుగుతుంది.

    ప్రాథమిక రక్తస్థిరత్వ దశలో ( Primary hemostasis  ) రక్తఫలకములు ( platelets ), వాన్ విల్లీబ్రాండ్ ( Von Willebrand factor ) అంశముతో కూడి గాయమునకు అంటుకొని బిరడా వలె రక్తస్రావమును అరికడుతాయి.

    అదేసమయములో ద్వితీయ రక్తస్థిరత్వ దశ ( secondary hemostasis ) కూడా మొదలవుతుంది. ఈ దశలో రక్తనాళపు లోపొర ( intima ) ఛిద్రమగుట వలన లోపొర క్రిందనున్న కణజాలము నుండి కణజాల అంశము ( tissue factor ) విడుదలై వివిధ రక్తఘనీభవన అంశముల ( clotting factors ) ప్రేరేపణను ఆరంభిస్తుంది. చివరకు రక్తములోని తాంతవజని ( fibrinogen ) తాంతవము ( fibrin ) అనే  పోగులుగా మారి కణములను సంధించుకొని గుజ్జుగా రక్తమును ఘనీభవింపజేస్తుంది. రక్తపుగడ్డలు గాయమునకు అంటుకొని రక్తస్రావమును అరికడుతాయి. ఈ ప్రక్రియలో  ప్రోథ్రాంబిన్ అనే రక్త ఘనీభవన అంశము  
( prothrombin - factor 2 ) > థ్రాంబిన్ గా ( thrombin ) మారుతుంది. ఆపై థ్రాంబిన్ ( thrombin ) వలన తాంతవజని ( fibrinogen ) > తాంతవముగా ( fibrin ) మారుతుంది. 


    రక్తము గడ్డకట్టే ప్రక్రియలో లోపములు ఉంటే రక్కస్రావము అధికము కావచ్చును, లేక రక్తపుగడ్డలు ఏర్పడి రక్తప్రసరణకు అవరోధము కలిగించవచ్చును.

    రక్తపుగడ్డలు సిరలలో ( veins ) గాని, ధమనులలో ( arteries ) గాని, హృదయములో గాని ఏర్పడవచ్చును. 
ఈ గడ్డలు రక్తప్రవాహములో కొట్టుకుపోయి దూరముగా రక్తప్రసరణకు అవరోధకములుగా ( emboli ) అంతరాయము కలిగించవచ్చును.


 కాళ్ళ సిరలు ( Veins of lower extremity ) 


    సిరలు రక్తమును హృదయమునకు కొనిపోతాయి. చర్మమునకు దిగువ, కండర ఆచ్ఛాదనమునకు 
( కండరములను ఆవరించి ఉండే గట్టి పొర - deep fascia  ) పైన ఉండు సిరలు బాహ్యసిరలు ( Superficial veins ).

    కండర ఆచ్ఛాదనమునకు లోపల ఉండు సిరలు నిమ్నసిరలు ( deep veins ).

    కాళ్ళలో బాహ్యసిరలు పాదముల నుంచి బయలుదేరుతాయి. పాదము పైభాగములో ఊర్ధ్వపాద సిరచాపము ( dorsal venous arch of foot ) మధ్యస్థముగా ( medially ) చీలమండ (ankle - medial malleolus ) ఎముకకు ముందుగా కాలిపైకి  గరిష్ఠ దృశ్యసిరగా ( great saphenous vein ) ఎగబ్రాకుతుంది. తొడకు మధ్యస్థముగా ( medially ) యీ గరిష్ఠ దృశ్యసిర (  great saphenous vein ) పయనించి తొడ పైభాగములో  దృశ్యసిర రంధ్రము ( saphenous orifice ) ద్వారా కండర ఆచ్ఛాదనము ( deep fascia ) లోనికి చొచ్చి ఊరుసిరతో 
( femoral vein ) కలుస్తుంది.

    ఊర్ధ్వపాద సిరచాపము (dorsal venous arch of foot ) పార్శ్వభాగమున చిటికెనవేలు పైభాగపు అంగుళిక సిరతో ( digital vein ) కలిసి కనిష్ఠ దృశ్యసిరగా ( Lesser Saphenous vein ) చీలమండలము పార్శ్వభాగపు ఎముకకు ( lateral malleolus ) వెనుకగా పైకి ప్రాకి కాలు వెనుక భాగములో పయనిస్తుంది. కాలి పై భాగములో మోకాలు వెనుక ఈ సిర కండర ఆచ్ఛాదనము ( deep fascia ) లోనికి చొచ్చి జానుసిరతో ( popliteal vein ) కలుస్తుంది. జానుసిర, ఊరుసిరగా ( femoral vein ) తొడలోపల పైకి పయనిస్తుంది.

    కాలిలో ఉన్న పూర్వజంఘిక సిర ( Anterior tibial vein ), పృష్ఠజంఘిక సిరల ( Posterior tibial vein ) కలయిక చేత జానుసిర ( Popliteal vein ) ఏర్పడుతుంది. ఇది మోకాలు వెనుక ఉంటుంది. జానుసిర తొడలో ఊరుసిర ( Femoral vein ) అవుతుంది.

    కటివలయములో ( pelvis ) ఊరుసిర  బాహ్య శ్రోణిసిరయై ( external ileac vein ), అంతర శ్రోణిసిరతో 
( internal ileac vein ) సంధానమయి శ్రోణి సిరను ( common ileac vein ) ఏర్పరుస్తుంది.

    వామ, దక్షిణ శ్రోణిసిరల సంధానము వలన అధోబృహత్సిర ( inferior venacava )  ఏర్పడుతుంది.  అధోబృహత్సిర హృదయపు  కుడి కర్ణికకు రక్తమును చేర్చుతుంది.


బాహ్యసిరతాప రక్తఘనీభవనము ( Superficial thrombophlebitis ) 


    బాహ్య సిరలలో తాపము ( inflammation ) వలన రక్తము గడ్డకట్టవచ్చును. సాధారణముగా సిరల ద్వారా మందులను, ద్రవములను, ఇచ్చుట వలన సిరలలో తాపము కలిగి రక్తము గడ్డకడుతుంది. తాపము కలిగిన బాహ్యసిరలలో తాప లక్షణములు కనిపిస్తాయి. తాకుతే నొప్పి, ఎఱ్ఱదనము, వెచ్చదనము కలిగి ఈ సిరలు నులక తాడులులా తగులుతాయి. బాహ్యసిరలలో తాపము కలిగి రక్తము గడ్డకడితే ఆ గడ్డలు సిరలకు అంటుకొని ఉంటాయి. ఇవి గుండెకు, పుపుస ధమనులకు వెళ్ళవు. ఇవి ప్రమాదకరము కావు.

              నిమ్నసిరలలో రక్తము గడ్డకట్టుట ( Deep vein thrombosis ) 


    నిమ్నసిరలలో ( deep veins ) రక్తము గడ్డకడితే రక్తఘనీభవనము ముందుకు వ్యాపించగలదు. 
రక్తపుగడ్డలు ప్రవాహములో ముందుకు సాగి పుపుస ధమనులలో ( pulmonary arteries  ) ప్రసరణకు అవరోధము ( Pulmonary embolism ) కలిగించవచ్చును. పుపుస ధమనులలో రక్తపుగడ్డలు, యితర ప్రసరణ అవరోధకములు ( emboli ) రక్తప్రసరణకు విశేషముగా భంగము కలిగిస్తే  ప్రాణహాని కలిగే అవకాశము ఉన్నది. అందువలన జానుసిర ( popliteal vein  )  పైన సిరలలో రక్తఘనీభవనము జరుగుతే చికిత్స అవసరము.

నిమ్నసిరలలో రక్తఘనీభవనమునకు కారణములు 


    సిరలలో రక్త నిశ్చలత ( stasis ), రక్తపు అధిక ఘనీభవన లక్షణము ( hyper coagulability ), రక్తనాళపు లోపొరలో మార్పులు ( endothelial changes ) రక్తనాళములలో రక్తము ఘనీభవించుటకు కారణము అవుతాయి.

    కదలకుండా, నడవకుండా ఉండుట, ఎల్లపుడు పక్కలపై పడుకొని ఉండుట ( immobility ) రక్తపుగడ్డలు ఏర్పడుటకు ముఖ్యకారణము. శస్త్రచికిత్సలు, క్షతములు ( trauma ), వార్ధక్యము, స్థూలకాయము, కర్కటవ్రణములు ( cancers ), రక్తనాళపు వ్యాధులు ( collagen vascular diseases ), ఎస్ట్రొజెన్ ల వాడుక , గర్భనిరోధక ఔషధముల వాడుక , ధూమపానము, రక్తఘనీభవనమును ఇనుమడింపజేస్తాయి. గర్భిణీ స్త్రీలలో, కాన్పు తర్వాత రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశము హెచ్చు.

    జన్యుపరముగా కొందఱిలో రక్తఘనీభవనమును అరికట్టు మాంసకృత్తుల లోపము వలన రక్తపుగడ్డలు ఏర్పడే అవకాశములు పెరుగుతాయి. మాంసకృత్తి ‘ సి’ , మాంసకృత్తి ‘ఎస్’  ( Protein C, Protein S, ) ఏన్టి థ్రాంబిన్ ( Antithrombin AT ) లోపములు ఉన్నవారిలో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశములు హెచ్చుఈ లోపములు factor V Leiden, prothrombin gene G20210A అనే జన్యువు మార్పుల ( mutation ) వలన కలుగుతాయి. సిష్టాథయొనిన్ బి సింథేజ్ (  cystathionine B synthase ) అనే జీవోత్ప్రేరకపు ( enzyme ) లోపము వలన రక్తములో హోమోసిష్టిన్ ప్రమాణములు పెరిగిన వారిలో రక్తఘనీభవనము ధమనులలోను, సిరలలోను కూడా త్వరితము కాగలదు. వీరు మూత్రములో హోమోసిష్టిన్ విసర్జిస్తుంటారు  ( Homocysteinuria ).

    Paroxysmal nocturnal hemoglobinuria ( PNH ) ( సంవిరామ నిశా రక్తవర్ణక మూత్రము ) అనే వ్యాధి కలవారు అప్పుడప్పుడు రక్తవర్ణకమును ( hemoglobin ) మూత్రములో విసర్జిస్తుంటారు. వీరిలో రక్తపుగడ్డలు అసాధారణపు తావులలో ( ex : cavernous sinus, mesenteric vein, portal vein thrombosis )  కలిగే అవకాశములు హెచ్చు.

    Anti phospholipid antibody syndrome APS  అనే వ్యాధిగ్రస్థులలో స్వయంప్రహరణ ప్రతిరక్షకములు ( auto antibodies) వలన రక్తపుగడ్డలు ఏర్పడే అవకాశములు ఎక్కువ. ఈ వ్యాధి గల స్త్రీలలో గర్భస్రావము, మృతపిండ స్రావములు ( stillbirths ) కలిగే అవకాశములు హెచ్చు. 

నిమ్న సిరలలో రక్తఘనీభవన లక్షణములు 


    కాళ్ళ నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఎక్కువగా ఏర్పడుతాయి. చేతుల సిరలలో చికిత్సలకై కృత్రిమ నాళికలు ఉన్నపుడు, సిరల రక్తప్రవాహమునకు ఇతర అవరోధములు ఉన్నపుడు భుజసిరలలో కూడా రక్తపుగడ్డలు ఏర్పడవచ్చును.

    నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఏర్పడినప్పుడు రక్తప్రవాహము మందగించి సిరలలో రక్తసాంద్రత ( congestion ) పెరుగుతుంది. అందువలన ఆ కాలు ( లేక చేయి ) పొంగుతుంది. నొప్పి, సిరలను తాకినపుడు, నొక్కినపుడు నొప్పి కలుగుట ( tenderness ), వెచ్చదనము, ఎఱ్ఱదనము కూడా పొడచూపితే పొడచూపవచ్చు. పొంగు ఒక కాలిలోను లేక ఒక చేతిలోను కనిపించినపుడు నిమ్నసిర రక్తఘనీభవనమును వైద్యులు దృష్టిలో ఉంచుకొని పరిశోధించాలి..

    హృదయ వైఫల్యము ( Congestive heart failure ), కాలేయ వైఫల్యము ( liver failure ), మూత్రాంగముల వైఫల్యము ( renal failure ), పాండురోగము ( anemia ), రక్తపు మాంసకృత్తులు తగ్గుట ( hypoproteinaemia ) వంటి వ్యాధులలో పొంగు రెండు కాళ్ళలోను కనిపిస్తుంది. 

    బూరకాలు  వంటి రసినాళికలలో( lymphatics ) ప్రవాహమునకు అవరోధము కలిగించే వ్యాధులు సాధారణముగా దీర్ఘకాలిక వ్యాధులు.


పుపుసధమనులలో  అవరోధక పదార్థములు

  ( Pulmonary arterial embolism ) 




    కాళ్ళ నిమ్నసిరలలోను, చేతుల నిమ్న సిరలలోను ఏర్పడే రక్తపుగడ్డలు బృహత్ సిరల ద్వారా హృదయపు కుడిభాగమునకు, ఆపై పుపుస ధమని, దాని శాఖలకు చేరి ఊపిరితిత్తుల రక్తప్రసరణకు అవరోధము కలిగించినపుడు ఊపిరితిత్తులలో పుపుసగోళముల ( alveoli ) నుంచి ప్రాణవాయువు రక్తమునకు చేరదు. రక్తములో బొగ్గుపులుసు వాయువు విసర్జింపబడదు. పుపుస ధమనిలో రక్తపు పోటు పెరిగి  కుడి జఠరికపై పని ఒత్తిడి పెరుగుతుంది. 

    వీరిలో ఆయాసము, ఛాతినొప్పి, దగ్గు, కఫములో రక్తము ( hemoptysis ), గుండెదడ, గుండెవేగము పెరుగుట, అల్ప రక్త ప్రాణవాయు ప్రమాణము ( hypoxemia ), కుడి జఠరిక వైఫల్యపు లక్షణములు, కాళ్ళలో గాని, చేతులలో గాని నిమ్నసిర రక్తఘనీభవన లక్షణములు ( signs of deep vein thrombosis ) కనిపిస్తాయి. రక్తపుగడ్డలు విస్తృతముగా పుపుస ధమనికి చేరినపుడు ఆకస్మిక ప్రాణహానికి అవకాశములు ఉన్నాయి. 

    క్రిందకాలులో సూక్ష్మజీవుల వలన కలిగే కణతాపము ( cellulitis ) లోను, జానుభస్త్రిక బుద్బుదము ( Baker’s cyst of gastrocnemio- semimembranosus bursa ) విచ్ఛిన్నమయినపుడు, పిక్క కండరములు తెగినపుడు ( rupture of gastrocnemius muscle ), చర్మము క్రింద గాని కండరములలో గాని రక్తనాళములు చిట్లి రక్తము గూడుకట్టినపుడు ( hematoma ), చీము తిత్తులు ( abscesses), రసిపొంగులు ( lymphedema ), ధమని బుద్బుదములు ( aneurysms ) వలన, ఉబ్బుసిరల వలన సాంద్రత ( congestion ) పెరిగినపుడు నిమ్నసిరల రక్తఘనీభవన లక్షణములను వంటి లక్షణములు పొడచూపవచ్చును. 

    రోగిని పరీక్షించుట వలన, రక్త పరీక్షలు, శ్రవణాతీతధ్వని పరీక్షల ( ultrasonography & Doppler studies ) వలన వైద్యులు సరియైన వ్యాధి నిర్ణయము చేయగలుగుతారు.

    ఊపిరితిత్తుల తాపము ( pneumonia ), హృద్ధమనీ వ్యాధులు ( Coronary artery diseases ), బృహద్ధమని విదళనము ( dissecting aortic aneurysm ), పుపుసవేష్టన వ్యాధులు ( pleural diseases ), హృత్కోశ తాపము ( pericarditis ), ప్రక్కటెముకల విఱుగుళ్ళు ( rib fractures  ), పక్కటెముకల మృదులాస్థులలో తాపములు ( costochondrtis ) ఛాతినొప్పి, ఆయాసములను కలిగించి పుపుసధమనులలో రక్తప్రసరణ అవరోధకములను ( pulmonary arterial embolism ) పోలి ఉండవచ్చును. 

పరీక్షలు 


 డి- డైమర్ పరీక్ష  ( D- dimer ) 


    శరీరములో రక్తపు గడ్డలను  ప్లాస్మిన్ ( Plasmin ) విచ్ఛేదిస్తుంది. తాంతవ ( fibrin ) విచ్ఛేదనము వలన వచ్చే డి డైమర్ ల ( D- dimer ) విలువలు నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఉన్నవారిలోను, పుపుస ధమనులలో రక్తపుగడ్డలు చేరిన వారిలోను హెచ్చుగా ( 500 మైక్రోగ్రాములు / లీటరునకు మించి ) ఉంటాయి.

    మిగిలిన రోగలక్షణములు లేక, శరీర నిశ్చలత ( Immobility ), సమీపకాలములో  రక్తపుగడ్డల అవకాశములు పెంచే శస్త్రచికిత్సలు, క్షతములు వంటి కారణములు లేనివారిలో డి - డైమరు విలువలు  తక్కువగా ఉంటే వారి నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఉండే అవకాశములు చాలా తక్కువ.

శ్రవణాతీత ధ్వని పరీక్షలు ( Ultrasonography, Doppler studies ) 


    శ్రవణాతీత ధ్వనితరంగ పరీక్షలతో సిరలను చిత్రీకరించినపుడు సిరలలో రక్తపుగడ్డలు కనిపించవచ్చును. రక్తపుగడ్డలు లేని సిరలు ఒత్తిడికి అణుగుతాయి ( compressible ). రక్తపుగడ్డలు ఉన్న సిరలు ఒత్తిడికి అణగవు ( non compressible ). డాప్లర్ పరీక్షతో రక్తగమనమును చిత్రీకరించవచ్చును. నిమ్నసిరలలో రక్తపుగడ్డలు నిరూపించబడకపోతే అవసరమని అనిపిస్తే పరీక్షలను కొద్ది దినముల పిదప మరల చేయవచ్చును.

సిర చిత్రీకరణములు ( Contrast venography )


    వ్యత్యాస పదార్థములను సిరలలోనికి ఎక్కించి సిరలకు  ఎక్స్- రే లు, గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము ( Computerized Axial Tomography ), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు ( Magnetic Resonance Imaging ) చేయవచ్చును. ఈ పరీక్షలను విరివిగా వాడరు.
    పుపుస ధమనులలో రక్తపుగడ్డల వంటి ప్రసరణ అవరోధక పదార్థములు ( pulmonary emboli ) కనిపెట్టుటకు గణనయంత్ర  పుపుస ధమనీ చిత్రీకరణమును ( Computerized axial Tomography Pulmonary Angiograms ) విరివిగా వాడుతారు. 

శ్వాస / ప్రసరణ చిత్రములు ( Ventilation / Perfusion scans ) 


    రేడియోధార్మిక పదార్థములను ఊపిరి ద్వారాను, సిరలద్వారాను ఇచ్చి ఊపిరితిత్తులలో శ్వాసించు భాగములను, రక్తము ప్రసరించు భాగములను చిత్రీకరించవచ్చును ( Ventilation, Perfusion lung scan ; V / Q scan. ). పుపుసధమని శాఖలలో ప్రసరణ అవరోధకములు ( emboli ) ఉన్నపుడు ఊపిరితిత్తులలో ప్రసరణ లోపములు ( perfusion defects ) కనిపిస్తాయి. ఊపిరితిత్తులలో శ్వాసించు భాగములలో లోపములు ( ventilation defects ), శ్వాసనాళికలలో అవరోధకములను కాని, ఊపిరితిత్తులలో తాపమును ( pneumonia ) కాని సూచిస్తాయి. 
    మూత్రాంగ వైఫల్యము ( renal insufficiency ) గలవారిలోను, ఇతర కారణముల వలన ఎక్స్ రే వ్యత్యాస పదార్థములు వాడలేనప్పుడు రేడియోధార్మిక  శ్వాస / ప్రసరణ ( V / Q scans ) చిత్రీకరణములు ఉపయోగపడుతాయి.
    పుపుసధమని చిత్రీకరణము ( catheter Pulmonary angiogram ) ఉపయోగకరమే కాని గణనయంత్ర పుపుస ధమనీ చిత్రీకరణములనే ( CT  Pulmonary Angiogram ) విరివిగా వాడుతారు.

ఇతర పరీక్షలు 


    విద్యుత్ హృల్లేఖములు ( electrocardiography ), ఛాతి ఎక్స్ రేలు, ధమనీ రక్త వాయుపరీక్షలు (arterial blood gas studies ), జీవవ్యాపార రక్త పరీక్షలు (metabolic blood tests), రక్తములో ట్రొపోనిన్ ( troponin ),  శ్రవణాతీత ప్రతిధ్వని హృదయ చిత్రీకరణములు ( echocardiography ) పరోక్షముగా ఉపయోగపడుతాయి. 

చికిత్స 


    బాహ్య సిరలలో తాపమునకు, రక్తము గడ్డకట్టుటకు రక్తఘనీభవన అవరోధకములను ( anticoagulants ) వాడరు. నొప్పికి తాప నివారణులను ( anti inflammatory agents ) వాడవచ్చును. 

    మోకాలి క్రింద జానుసిరకు ( popliteal vein ) క్రింద ఉన్న  నిమ్నసిరలలో రక్తము ఘనీభవనము చెందుతే నొప్పికి ఉపశమన చికిత్స సరిపోతుంది. కాని రక్తఘనీభవనము తొడలో ఊరుసిరకు ( femoral vein ) వ్యాపిస్తే రక్తఘనీభవన అవరోధకములతో ( anticoagulants ) చికిత్స అవసరము .

రక్తఘనీభవన అవరోధకములు ( Anticoagulants ) 


    నిమ్నసిరలలో రక్తము గడ్డకట్టినా, పుపుస ధమని దాని శాఖలలో రక్తపుగడ్డలు ప్రసరణ అవరోధకములుగా ( pulmonary artery embolism ) చేరినా, నొప్పి, కాళ్ళపొంగులు, వ్రణములు, పుపుస ధమనిలో అధిక రక్తపుపోటు ( Pulmonary hypertension ), ఆకస్మిక మరణము వంటి పరిణామములు నివారించుటకు  చికిత్స అవసరము. చికిత్సకు ముందు రోగమును ధ్రువీకరించాలి.

    చికిత్సకు ముందు, ప్రాథమిక రక్తపరీక్షలు అవసరము. రక్తకణ గణనములు, జీవవ్యాపార పరీక్షలు ( metabolic blood tests ), రక్తఘనీభవన పరీక్షలు (  ProTime / International Normalised Ratio ; PT/ INR ), Activated Partial Thromboplastin Time ( APTT ) అవసరము.

    చికిత్సను హెపరిన్ తో ( Unfractionated Heparin ) గాని, తక్కువ అణుభారపు హెపరిన్ తో  ( Low Molecular Weight Heparin ( LMWH ) గాని, ఫాండాపేరినక్స్ తో ( fondaparinux ) గాని  ప్రారంభించి అదేసమయములో విటమిన్ ‘ కె ‘అవరోధకము వార్ఫెరిన్ ( Warfarin ) కూడా మొదలు పెడుతారు. 

    హెపరిన్ ను సిర ద్వారా ఇస్తారు. APTT విలువలు గమనిస్తూ మోతాదును సరిదిద్దుతారు. తక్కువ అణుభారపు హెపరిన్ ను ( Low Molecular Weight Heparin )  చర్మము దిగువ సూదిమందుగా ఇస్తారు. మూత్రాంగ వైఫల్యము  ( Renal insufficiency ) ఉన్నవారిలో దీని మోతాదును తగ్గించాలి. మూత్రాంగ వైఫల్యము తీవ్రముగా ఉంటే LMWH ను వాడకూడదు.

    Fondaparinux ను కూడా చర్మము క్రింద సూదిమందుగా ఇస్తారు. మూత్రాంగ వైఫల్యము ఉన్నవారిలో దీని మోతాదును తగ్గించాలి.

    హెపరిన్, తక్కువ అణుభారపు హెపరిన్ , fondaparinux లను కనీసము 5 దినములు వాడాలి. విటమిన్ కె అవరోధకము వార్ఫరిన్ ( నోటి ద్వారా ) మొదలు పెట్టి PT / INR రక్తపరీక్షలతో  మోతాదును సరిదిద్దుతు INR విలువ 2 కు వచ్చాక హెపరిన్, LMWH, fondaparinux లను మానివేస్తారు. 

    రక్తఘనీభవన అంశము Xa (10 a ) కు అవరోధకములు ( Factor X a inhibitors ) ఎపిక్సబాన్ ( apixaban ), రివరోక్సబాన్  ( rivaroxaban ), ఎండోక్సబాన్ (  endoxaban ), వార్ఫరిన్ కు ( Warfarin  ) బదులుగా వాడుటకు యిపుడు ప్రాచుర్యములో ఉన్నాయి. మూత్రాంగ వ్యాపారము బాగున్నవారిలో వీటి  మోతాదులను సరిదిద్దవలసిన అవసరము లేదు. PT / INR పరీక్షల అవసరము లేదు.

    డాబిగాట్రన్ ( dabigatran ) థ్రాంబిన్ అవరోధకము ( Thrombin inhibitor ) వార్ఫరిన్ బదులు రక్తము గడ్డకట్టుటను అరికట్టుటకు వాడవచ్చును.
 
    రక్తఘనీభవనము కలిగించే యితర వ్యాధులు లేనివారిలో రక్తఘనీభవన అవరోధకములను ( anticoagulants ) మూడు మాసములు వాడుతారు.

    రక్తఘనీభవనము శీఘ్రతరము కావించు వ్యాధులు ఉన్నవారిలో చికిత్స నిరంతరముగా  వాడవలసి ఉంటుంది. 

    చికిత్స వలన రక్తస్రావములు అధికముగా కలుగుతే రక్తఘనీభవన అవరోధకములను (anticoagulants ) తాత్కాలికముగా ఆపివేయాలి.

 అధోబృహత్సిరలో జల్లెడలు ( inferior vena cava filter devices ) 


    కాళ్ళ నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఏర్పడిన వారిలో రక్తస్రావ ఉపద్రవములు ( hemorrhage complications ) ఉండుట వలన రక్తఘనీభవన అవరోధకములు ( anticoagulants) వాడలేనపుడు వారి అధో బృహత్సిరలో ( inferior vena cava ) జల్లెడ పరికరములను అమర్చి పుపుస ధమనులలోనికి రక్తపుగడ్డలు చేరకుండా నిరోధిస్తారు.

రక్తపుగడ్డల విచ్ఛేదన చికిత్స ( Thrombolytic therapy ) 


    పుపుస ధమని, దాని శాఖలలో విస్తృతముగా రక్తపుగడ్డలు చేరుకొని ( massive pulmonary arterial embolism ) రక్తపీడనము పడిపోతే ( hypotension ) వ్యాధిగ్రస్థులకు అధిక రక్తస్రావ ప్రమాదము లేనప్పుడు సిర ద్వారా recombinant tissue plasminogen activator ( alteplase ) ని ఎక్కించి రక్తపుగడ్డలను విచ్ఛేదించు యత్నము చేస్తారు. 

    హృదయపు కుడి భాగము వైఫల్యము పొందినపుడు, పుపుస ధమనిలో రక్తపుగడ్డలను విచ్ఛేదించుటకు rtpa ను ( alteplase ) వాడవచ్చును.

ఇతర చికిత్సలు 


    నిమ్నసిరలలో రక్తపుగడ్డల వలన కాళ్ళలో పొంగులు ఉంటే కాళ్ళను ఎత్తుగా ఉంచుతే పొంగు తగ్గే అవకాశము ఉన్నది. ( హృదయవైఫల్యము ( congestive heart failure ) వలన రెండు కాళ్ళు, రెండు పాదములలో పొంగులు ఉన్న రోగులు కాళ్ళను ఎత్తుగా పెట్టుకో కూడదు. అలా చేస్తే కాళ్ళలోను, పాదముల లోను చేరిన ద్రవము గుండెకు, ఊపిరితిత్తులకు చేరి ఆయాసము హెచ్చయే అవకాశము ఉంది. )
   
    సాగు మేజోళ్ళు ( graduated elastic stockings ) కాళ్ళ పొంగులు తగ్గించుటకు ఉపయోగపడుతాయి.

చలనము ( ambulation ) 


    నిశ్చలత వలన నిమ్న సిరలలో రక్తపుగడ్డలు ఏర్పడుతాయి. అందువలన వ్యాధిగ్రస్థులను నడవమని ప్రోత్సహించాలి. నడవగలిగిన వారు ఎల్లప్పుడు మంచము పట్టుకొని ఉండకూడదు. 

    ప్రాణాపాయ పరిస్థితులలో మందులతో రక్తపుగడ్డల విచ్ఛేదన జరగనపుడు, కృత్రిమనాళములతో పుపుస ధమనిలోని రక్తపుగడ్డలను తొలగించుట ( catheter embolectomy ), శస్త్రచికిత్సతో పుపుస ధమనిలోని రక్తపుగడ్డలను తొలగించుట ( surgical embolectomy ) వంటి ప్రక్రియలు అనుభవజ్ఞులు చేపట్టవచ్చును.

నివారణ       


    నడక, కాలి పిక్కల వ్యాయామము ( calf exercises ), చలనము ( ambulation ), నిమ్నసిరలలో రక్తపుగడ్డలను నివారించుటకు తోడ్పడుతాయి. శస్త్రచికిత్సల తర్వాత రోగులను త్వరితముగా నడిపించుటకు యత్నించాలి. కాలి పిక్కలపై విరామములతో ఒత్తిడి పెట్టు సాధనములు, కాళ్ళకు వ్యాయామము చేకూర్చు సాధనములు రక్తపుగడ్డలను నివారించుటకు తోడ్పడుతాయి.

    కృత్రిమ కీళ్ళ శస్త్రచికిత్సల తర్వాత రక్తఘనీభవన అవరోధకములను కొన్ని వారములు వాడుతారు. రక్తఘనీభవన అవకాశములు హెచ్చుగా ఉన్నవారిలో కూడా రక్తము గడ్డకట్టుట నివారించు ఔషధములను జాగ్రత్తగా వాడాలి. 


పదజాలము 


Abscess = చీము తిత్తి ( గ.న )
Alveoli = పుపుసగోళములు ( గ.న )
Aneurysm = ధమని బుడగ ; ధమనీ బుద్బుదము ( గ.న )
Anterior tibial vein = పూర్వజంఘిక సిర ( గ.న )
Arterial blood gas studies = ధమనీరక్త వాయుపరీక్షలు ( గ.న )
Anti inflammatory agents = తాప నివారణులు (గ.న )
Anticoagulants = రక్తఘనీభవన అవరోధకములు ( గ.న )
Auto antibodies = స్వయంప్రహరణ ప్రతిరక్షకములు ( గ.న )
Baker’s cyst of Gastrocnemio- semimebranosus bursa  = జానుభస్త్రిక బుద్బుదము ( గ.న )
Cancers = కర్కటవ్రణములు ( గ.న )
Clotting factors = రక్తఘనీభవన అంశములు ( గ.న )
Common ileac vein  = శ్రోణిసిర ( గ.న )
Computerized Axial Tomography = గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము ( గ.న ) ; గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము ( గ.న )
Coronary artery diseases = హృదయధమనీ వ్యాధులు 
costochondrtis = పార్శ్వాస్థి-మృదులాస్థి తాపము ( గ.న )
Deep fascia = కండర ఆచ్ఛాదనము ( గ.న )
Deep veins = నిమ్నసిరలు ( గ.న )
Deep vein thrombosis = నిమ్నసిర రక్తఘనీభవనము ( గ.న )
Digital vein  = అంగుళిక సిర ( గ.న )
Dissecting aortic aneurysm = బృహద్ధమని విదళన వ్యాకోచము ( గ.న )
Dorsal venous arch of foot = ఊర్ధ్వపాద సిరచాపము  ( గ.న )
Echocardiography =  ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము ( గ.న )
Emboli = రక్తప్రసరణ అవరోధక పదార్థములు ( గ.న )
External ileac vein = బాహ్యశ్రోణిసిర ( గ.న )
Femoral vein  = ఊరుసిర 
Fibrin = తాంతవము 
Fibrinogen = తాంతవజని 
Great saphenous vein = గరిష్ఠ దృశ్యసిర ( గ.న )
hematoma = కణజాలపు రక్తపుగడ్డ ( గ.న )
Hemoptysis  =  రక్త కఫము
Hemostasis = రక్తస్రావ నివారణ ; రక్తస్థిరత్వము ( గ.న )
Hyper coagulability =  అధిక ( శీఘ్ర ) రక్త ఘనీభవనము ( గ.న )
Inferior venacava = అధోబృహత్సిర 
Internal ileac vein = అంతర శ్రోణిసిర 
Intima = రక్తనాళపు లోపొర  ( గ.న )
Lesser saphenous vein = కనిష్ఠ దృశ్యసిర ( గ.న )
Magnetic Resonance Imaging = అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న )
Medially = మధ్యస్థముగా 
Perfusion defects = రక్త ప్రసరణ లోపములు ( గ.న )
Paroxysmal nocturnal hemoglobinuria ( PNH ) = సంవిరామ నిశా రక్త ( వర్ణక ) మూత్రము ( గ.న )
Pericarditis = హృత్కోశ తాపము ( గ.న )
Platelets = రక్తఫలకములు ( గ.న )
Pleural diseases = పుపుసవేష్టన వ్యాధులు 
Popliteal vein = జానుసిర ( గ.న )
Posterior tibial vein = పృష్ఠజంఘిక సిర ( గ.న )
Primary hemostasis  = ప్రాథమిక రక్తస్థిరత్వము ( గ.న )
Pulmonary arteries = పుపుస ధమనులు
Pulmonary arterial embolism = పుపుసధమనిలో( రక్తప్రసరణ ) అవరోధకము ( గ.న )
Saphenous orifice  = దృశ్యసిర రంధ్రము ( గ.న )
Secondary hemostasis  = ద్వితీయ రక్తస్థిరత్వము ( గ.న )
Superficial veins = బాహ్యసిరలు
Thrombolytic therapy = రక్తపుగడ్డల విచ్ఛేదన చికిత్స ( గ.న )
Ultrasonography = శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ ( గ.న )
ventilation defects = శ్వాస లోపములు ( గ.న )


( వైద్యవిషయములను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )

17, ఆగస్టు 2020, సోమవారం

గుల్ల ఎముకలవ్యాధి ( Osteoporosis )



 ( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ):


    గుల్ల ఎముకల వ్యాధి

     ( Osteoporosis )


                                                                      డాక్టరు గన్నవరపు నరసింహమూర్తి .



  గుల్ల ఎముకల వ్యాధి ( అస్థిసాంద్ర క్షీణత ; Osteoporosis   ) 
 
    గుల్ల ఎముకల వ్యాధిలో  ఎముకల  సాంద్రత తగ్గి ఎముకలు బలహీనమవుతాయి. బలహీనమయిన ఎముకలు ప్రమాదములలో తక్కువ శక్తికే సులభముగా విఱుగుతాయి. ఈ వ్యాధి బారికి  వెన్నుపూసలు ( vertebrae ), తుంటి ఎముకలు ( hip bones ), ముంజేతి ఎముకలు ( forearm bones ) ఎక్కువగా గుఱి అయి చిన్న చిన్న ప్రమాదములకే విఱుగుతుంటాయి. 




    గుల్ల ఎముకల వ్యాధి ( అస్థిసాంద్ర క్షీణత ) వయస్సు పైబడిన వారిలో కనిపిస్తుంది. ఏబది సంవత్సరముల వయస్సు దాటిన వారిలో సుమారు 30 శాతము మందిలోను ఎనుబది సంవత్సరములు మించిన వారిలో సుమారు 70 శాతము మందిలోను అస్థిసాంద్ర క్షీణత పొడచూపుతుంది. ఋతుస్రావములు తప్పిన స్త్రీలు వారితో  సమాన వయస్సు గల పురుషులు కంటె అస్థిసాంద్ర క్షీణత బారికి ఎక్కువగా గుఱి అవుతారు. అందువలన వీరిలో ఎముకలు విఱుగుట అధికముగా చూస్తాము.

    అందఱిలోను యౌవనములో ఉన్నపుడు ఎముకలు బలముగా ఉంటాయి. ఎముకలలో ఉండే సజీవకణములు వలన ఎముకలలో నిత్యము నిర్మాణ ప్రక్రియ ( bone formation  ), శిథిల ప్రక్రియ (bone resorption ) జరుగుతుంటాయి. 

    ఎముకల నిర్మాణ ప్రక్రియలో అస్థినిర్మాణ కణములు ( osteoblasts  ), ఎముకల శిథిల ప్రక్రియలో అస్థిశిథిల కణములు ( osteoclasts ) పాల్గొంటాయి.

    గరిష్ఠ అస్థిరాశి ( peak bone mass ) తక్కువగా ఉన్నవారిలోను, ఎముకల నిర్మాణ ప్రక్రియ తగ్గిన వారిలోను, ఎముకల శిథిల ప్రక్రియ హెచ్చయిన వారిలోను ఎముకలు బలహీనపడుతుంటాయి. 

కారణములు 

    వయస్సుతో కలిగే  గుల్ల ఎముకల వ్యాధిని ప్రాథమిక అస్థిసాంద్ర క్షీణత గా ( Primary Osteoporosis  )  పరిగణిస్తారు. ఆహారములో కాల్సియం, విటమిను డి లోపములు ఈ వ్యాధి కలుగుటకు దోహదపడుతాయి.

    ఇతర వ్యాధుల వలన కలిగే గుల్ల ఎముకల వ్యాధిని ద్వితీయ అస్థిసాంద్ర క్షీణత గా ( Secondary Osteoporosis ) పరిగణిస్తారు.

 గుల్ల ఎముకల వ్యాధిని కలిగించు ఇతర వ్యాధులు 

1 . వినాళగ్రంథి వ్యాధులు ( Endocrine disorders ) 


సహగళగ్రంథి ఆధిక్యత ( Hyperparathyroidism  ) 


    కంఠములో ఉండే గళగ్రంథులకు ( Thyroid glands ) వెనుక భాగములో ఆనుకొని చెఱి ఒకపక్క మీది భాగములో ఒకటి, క్రింద భాగములో ఒకటి, మొత్తము నాలుగు సహగళ గ్రంథులు ( Parathyroid glands ) ఉంటాయి. ఇవి పరిమాణములో 6 మి.మీ పొడవు 4 మి.మీ. వెడల్పు, 2 మి.మీ మందము కలిగి ఉంటాయి. ఈ గ్రంథులు శరీరములోను రక్తములోను కాల్సియమ్ ( Calcium  ), ఫాస్ఫేట్ ( Phosphate  ) ప్రమాణములను వాటి వినాళ స్రావకముతో ( Parathyroid hormone ) నియంత్రిస్తాయి. ఎముకల జీవవ్యాపారము ( metabolism ) కూడా సహగళ గ్రంథి స్రావకముపై ఆధారపడి ఉంటుంది.

    ఈ సహగళ గ్రంథుల చైతన్యము ఎక్కువయినచో వాటి స్రావక ప్రభావము వలన ఎముకల నుంచి కాల్సియమ్ ఎక్కువగా సంగ్రహించబడుతుంది. రక్తములో కాల్సియమ్ ప్రమాణములు పెరుగుతాయి. ఎముకలలో సాంద్రత తగ్గి గుల్ల ఎముకల వ్యాధి ( osteoporosis ) కలుగుతుంది. 

ఇతర వినాళగ్రంథుల వ్యాధులు 


    ఎడ్రినల్ గ్రంథులలో వెలుపలి భాగపు ( adrenal cortex  ) స్రావకములు కార్టికోష్టీరాయిడులు ఎక్కువయి వచ్చే కుషింగ్ సిండ్రోమ్ ( Cushing syndrome ), గళగ్రంథి ఆధిక్యత ( hyperthyroidism), బీజగ్రంథులహీనత ( hypogonadism ), పిట్యూటరీ గ్రంథి స్రవించు ప్రవర్ధన స్రావకపు ( Growth hormone ) ఆధిక్యత, పిట్యూటరీ గ్రంథిలో కలిగే  ప్రొలాక్టినోమా ( Prolactinoma ) అనే పెరుగుదల  వలన కూడా గుల్ల ఎముకల వ్యాధి  కలుగవచ్చును.

    అండాశయములు ( ovaries ) తొలగించిన స్త్రీలలోను, ఋతుస్రావములు తప్పిన స్త్రీలలోను గుల్ల ఎముకల వ్యాధి  ఎక్కువగా కలుగుతుంది.

2. రక్తోత్పాదన వ్యాధులు ( hematopoietic disorders ) 


    ఎముకల మజ్జలో ( bone marrow ) రక్తము ఉత్పత్తి అవుతుంది. లవిత్రకణ వ్యాధి ( sickle cell disease), థలసీమియా ( thalassemia ), Multiple myeloma, leukemias, lymphomas, polycythemia vera వంటి వ్యాధులలో అస్థిసాంద్ర క్షీణత ( Osteoporosis  ) కలుగవచ్చును.

3. సంధాన కణజాల వ్యాధులు ( connective tissue disorders ) 


a). అస్థికణజాల ఉత్పత్తి దోషము ; పెళుసు ఎముకల వ్యాధి ( Osteogenesis imperfecta ; Brittle bone disease ) 


    ఈ వ్యాధి జన్యుపరముగా సంక్రమిస్తుంది. ఈ వ్యాధిలో ఎముకల మాతృక ( matrix ) లోను, ఇతర అవయవములలోను కొల్లజెన్-1 ( collagen-1 ) అనే సంధానపు మాంసకృత్తి ( connective tissue protein ) ఉత్పత్తిలో దోషము ఉండుట వలన గుల్ల ఎముకల వ్యాధి కలిగి, ఎముకలు పెళుసుగా ఉండి,  సులభముగా విఱుగుతుంటాయి. వీరి కన్నుల శ్వేతపటలములు కొల్లజెన్-1 లోపము వలన  నీలివర్ణములో ఉంటాయి, వీరిలో వినికిడి లోపములు, వదులు కీళ్ళు, దంతములలో లోపములు, శ్వాసలో ఇబ్బంది మొదలగు ఇతర లక్షణములు వ్యాధి నిర్ధారణకు తోడ్పడుతాయి. 

 b).  మూత్రములో హోమోసిష్టిన్  విసర్జన  ( homocystinuria  )


    జన్యుపరముగా కలిగే ఈ సంధానకణజాల వ్యాధిలో ( connective tissue disorder ) హోమోసిష్టిన్ అను ఎమైనో ఆమ్లము ( amino acid ) మూత్రములో అధికముగా విసర్జింపబడుతుంది. వీరిలో గుల్ల ఎముకల వ్యాధి తఱచు కలుగుతుంది.

4. మూత్రాంగ వ్యాధులు ( Renal disorders ) 

     
    దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము ( Chronic renal failure ), మూత్ర నాళికలలో ఆమ్లవిసర్జన లోపము వలన కలుగు మూత్రనాళిక ఆమ్లీకృతము ( Renal tubular acidosis ), కాల్సియమ్ అధిక విసర్జన ( hypercalciurea ) వ్యాధులలో కాల్సియమ్ విసర్జన ఎక్కువగా ఉండి కాల్సియమ్ నష్టము కలిగి అస్థిసాంద్ర క్షీణత ( osteoporosis  ) కలుగుతుంది.

5. జీర్ణమండల వ్యాధులు ( gastrointestinal disorders ) 


    జఠర ఖండనము ( gastrectomy ) జరిగిన వారిలోను, సీలియక్ వ్యాధి ( celiac disease ), ప్రాథమిక  పైత్యనాళిక నారంగ కాలేయవ్యాధి ( primary biliary cirrhosis ), ఇతర అజీర్తి ( indigestion  ), సంగ్రహణ వ్యాధులు ( assimilation  ) కలవారిలోను ప్రేవులలో కాల్సియమ్  సంగ్రహణము ( absorption ) తగ్గుతుంది . వీరిలో గుల్ల ఎముకల వ్యాధి  కలిగే అవకాశములు హెచ్చు .

6. ఔషధములు 

a ). కార్టికోష్టీరాయిడులు ( corticosteroids ) 


    హైడ్రొకార్టిసోన్ ( hydrocortisone  ) దినమునకు 30 మి.గ్రాములు, ప్రెడ్నిసొలోన్ ( prednisolone )  7.5 మి.గ్రాములకు సమానమయిన కార్టికోష్టీరాయిడులు మూడు మాసములకు మించి  దీర్ఘకాలము వాడే వారిలో  అస్థిసాంద్ర క్షీణత ( osteoporosis  ) కలుగుతుంది. వీరి ప్రేవులలో  కాల్సియమ్ సంగ్రహణము ( absorption ) తగ్గుతుంది. అస్థినిర్మాణ కణముల ( osteoblasts ) చైతన్యము తగ్గి, అస్థిశిథిల కణముల ( osteoclasts  ) చైతన్యము పెరిగి ఎముకల నుంచి కాల్సియమ్ ఎక్కువగా సంగ్రహించబడుతుంది. మూత్రములో కాల్సియమ్ విసర్జన పెరుగుతుంది. అందుచే వీరిలో గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశము హెచ్చు.

b). ఆమ్లయంత్ర అవరోధకములు ( Proton pump inhibitors ) 


    జీర్ణాశయములో ఆమ్ల స్రావమును ( acid secretion ) నిరోధించు ఆమ్లయంత్ర అవరోధకములను ( proton pump inhibitors  ex ; omeprazole, esomeprazole, lansoprazole ) వాడేవారి జీర్ణాశయములో ఆమ్లము తగ్గుట వలన  కాల్సియమ్ కార్బొనేట్ సంగ్రహణము ( absorption ) మందగిస్తుంది. దీర్ఘకాలము ఈ మందులు వాడే వారిలో అస్థిసాంద్ర  క్షీణత ( osteoporosis  ) కలిగే అవకాశము ఉన్నది. వీరు కాల్సియమ్ సిట్రేట్ ( calcium citrate ) వాడి కాల్సియమ్ లోటును భర్తీచేసుకోవచ్చును.

c) . మూర్ఛ నివారిణులు ( anticonvulsants ) 


    మూర్ఛ నివారిణులు  కాలేయములో విటమిన్ డి విచ్ఛేదనను పెంచి కాల్సియమ్, ఫాస్ఫేట్ ప్రమాణముల లోపమునకు దారితీసి గుల్ల ఎముకల వ్యాధిని కలిగిస్తాయి. 

7. జన్యు వ్యాధులు ( Genetic disorders ) 


   జన్యుపరముగా వచ్చే Turner syndrome, Klinefelter syndrome  లు ఉన్నవారిలో గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశములు హెచ్చు.

    గుల్ల ఎముకల వ్యాధి కలగించు ఇతర కారణములు :

వ్యాయామ లోపము 


    శరీర భారము వహించే వ్యాయామములు నడక, త్వరిత నడక, పరుగులు, మెట్లు ఎక్కుట గుల్ల ఎముకల వ్యాధిని అరికట్టుటకు తోడ్పడుతాయి. వ్యాయామము లేకపోయినా, చాలా ఎక్కువయినా అస్థిసాంద్ర  క్షీణత త్వరితమవుతుంది.

    విటమిన్ డి, కాల్సియమ్ ల వాడుక తగ్గినపుడు అస్థిక్షీణత కలుగుతుంది. ఆహారములో కాల్సియమ్, విటమిన్ డి లు లోపించినవారు, సూర్యరశ్మి శరీరమునకు తగినంత సోకని వారు కాల్సియమ్, విటమిన్ డి లు ప్రత్యేకముగా తీసుకోవాలి.

    పొగత్రాగే వారిలోను, మితము మీఱి మద్యపానము సలిపేవారిలోను గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశము హెచ్చు.

    శరీర భారము తక్కువగా ఉన్నవారిలో గుల్ల ఎముకల వ్యాధి అధికముగా కలుగుతుంది.

    తెల్ల జాతీయులలోను, ఆసియాఖండ ప్రజలలోను గుల్ల ఎముకల వ్యాధి తఱచు కనిపిస్తుంది. నల్ల జాతీయులలో అస్థిసాంద్ర క్షీణత తక్కువగా చూస్తాము.

 గుల్ల ఎముకల వ్యాధి లక్షణములు 

    చాలా మందిలో అస్థిసాంద్ర క్షయము ఏ లక్షణములను చూపకుండా క్రమముగా హీనమవుతుంది. వ్యాధి తీవ్రమయిన వారిలో చిన్న చిన్న ప్రమాదములలోను, పడిపోవుటల వలన వెన్నుపూసలు ఒత్తిడికి గుఱయి కుచించుకుపోవుట ( compression fractures ), తుంటి ఎముకలు, ముంజేతి ఎముకలు, భుజపు టెముకలు విఱుగుట సంభవిస్తాయి. ఆపై ఎముకల నొప్పులు, కీళ్ళనొప్పులు కలుగుతాయి.  
    
    ఉరస్సులో క్రింది వెన్నుపూసలు, నడుములో వెన్నుపూసలు వాటికి  పైన, క్రింద ఉన్న వెన్నుపూసల మధ్య  అణచబడి కుచించినపుడు, వాటిని  సంపీడన అస్థి భంగములుగా ( compression fractures )  పరిగణిస్తారు. వాటి వలన దీర్ఘకాలపు నడుము నొప్పులు, ఎత్తు తగ్గుట, గూని, చలనములో ఇబ్బంది  కలుగ గలవు. వెన్నుపాము , వెన్నునాడులు ఒత్తిడికి గుఱి అయే అవకాశము కూడా ఉన్నది.

    వైద్యులు పరీక్ష చేసినపుడు రోగి ఎత్తు తగ్గిఉండుట, అంగస్థితిలో మార్పు, గూని ( kyphosis  ),  వెన్నెముకలో పక్క వంకరలు ( scoliosis  ), వెన్నెముకలో నొప్పులు కనుగొనే అవకాశము ఉన్నది. 

 పరీక్షలు 

   రక్తపరీక్షలతో రక్తకణముల గణనములు, కాల్సియమ్, ఫాస్ఫేట్ లతో సహా విద్యుద్వాహక లవణముల ( electrolytes  ) విలువలు, మూత్రాంగ వ్యాపార ప్రమాణములు ( blood urea nitrogen and creatinine ), ఆల్కలైను ఫాస్ఫటేజ్ ( serum Alkaline Phosphatase ) విలువ, కాలేయ వ్యాపార పరీక్షలు ( liver function tests ), గళగ్రంథి వ్యాపార పరీక్షలు ( thyroid function tests ), 25- హైడ్రాక్సీ విటమిన్ డి విలువలు, పురుషులలో టెష్టోష్టెరోన్ విలువలు తెలుసుకోవాలి.

    సీలియక్ వ్యాధి నిర్ణయమునకు tissue transglutaminase antibodies విలువలకు రక్తపరీక్షలు చేయాలి. 
    
    రక్తద్రవములో  కాల్సియమ్ ( serum calcium ) విలువలు పెరిగి ఉంటే రక్తద్రవములో సహగళగ్రంథి స్రావకపు  ( parathyroid hormone ) విలువలు పరీక్షించాలి. 
    
    రక్తపరీక్షలు అన్నీ బాగుంటే ఇతర వ్యాధి లక్షణములు లేనపుడు గుల్ల ఎముకల వ్యాధిని ప్రాథమిక వ్యాధిగా పరిగణించవచ్చును.

అస్థిసాంద్రత చిత్రీకరణము ( Bone Mineral Densitometry  )


    శరీరములో ఎముకల చిత్రీకరణము చేసి అస్థిసాంద్రతను ( Bone density ) నిర్ణయించి అస్థి ( సాంద్ర ) క్షీణత ( osteoporosis ) గల వారిని గుర్తించవచ్చును. ఈ చిత్రీకరణము Dual Energy X-ray absorptiometry Scan తో ( DEXA Scan ) చేస్తారు. ఎక్స్ రేలను రెండు భిన్న మోతాదులలో వాడి తుంటి ఎముకలను (hips ), వెన్నెముకను ( spine ) చిత్రీకరిస్తారు. చిత్రములతో ఎముకల సాంద్రతను ( bone density  ) గణించి సాంద్రతకు T score, Z score లను ఆపాదిస్తారు.

    ఒక వ్యక్తి అస్థిసాంద్రతకు ( Bone density ), యువజనుల సగటు అస్థిసాంద్రతకు,  గల ప్రమాణ వ్యత్యాసము ( standard deviation ) ఆ వ్యక్తి T- score తెలియపరుస్తుంది . 
       
T- score, - 2.5  కంటె తక్కువ ఉంటే అస్థిసాంద్ర క్షీణత ( osteoporosis ; గుల్ల ఎముకల వ్యాధి )  నిర్ధారిస్తారు. 

T - score,  -1 నుంచి -2.5 వఱకు ఉంటే అది ఎముకల బలహీనతను ( osteopenia ) ధ్రువపఱుస్తుంది.

    ఒక వ్యక్తి అస్థిసాంద్రతకు, ఆ వ్యక్తికి సమాన వయస్సు, బరువు, లింగములకు చెందిన మనుజుల సగటు అస్థి సాంద్రతకు, కల  ప్రమాణ వ్యత్యాసము ( standard deviation ) ఆ వ్యక్తి  Z- score తెలుపుతుంది . 

     40 సంవత్సరముల వయస్సు లోపలి వారిలో గుల్ల ఎముకల వ్యాధిని నిర్ధారించుటకు  Z- scores పరిగణనలోనికి తీసుకుంటారు. 

    గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశములు ఉన్నవారిలో అస్థిసాంద్ర చిత్రీకరణము ( Bone Mineral Densitometry ) అవసరము. 65 సంవత్సరములు పైబడిన స్త్రీలలోను, 70 సంవత్సరములు పైబడిన పురుషులు అందఱిలోను అస్థిసాంద్ర చిత్రీకరణములు చేసి పరిశీలించుట వలన గుల్ల ఎముకలవ్యాధి ( osteoporosis  ) కలవారిని ఎముకలు విఱుగక మున్నే గుర్తించి వారికి చికిత్సలు చేయుట వలన ఎముకలు విఱుగుట ( అస్ధిభంగములు, fractures ) తగ్గించగలుగుతాము. 

చికిత్స 

    కాల్సియమ్ :  గుల్ల ఎముకల వ్యాధిని నివారించుటకు, చికిత్సకు కూడా తగినంత కాల్సియమ్  వాడవలసి ఉంటుంది. కాల్సియమ్ ఎంత అవసరమో వయస్సు, లింగములపై ఆధారపడుతుంది. 

    25-65 సంవత్సరముల మధ్య  పురుషులకు దినమునకు 1000 మి.గ్రా ల కాల్సియమ్ అవసరము.
 
    65 సంవత్సరములు దాటిన పురుషులకు దినమునకు 1200 మి.గ్రా ల కాల్సియమ్ అవసరము.

    25-50 సంవత్సరముల మధ్య స్త్రీలకు దినమునకు 1000 మి.గ్రాములు , 

    50 సంవత్సరములు దాటిన స్త్రీలకు దినమునకు 1200 మి.గ్రా. ల కాల్సియమ్ అవసరము.

    మనము తీసుకునే ఆహారములో పాలు , పెరుగులలో కప్పుకు ( 240 మి.లీ ) 300 మి.గ్రా ల కాల్సియమ్ ఉంటుంది. మిగిలిన ఆహార పదార్థములతో మనకు సుమారు 250 మి.గ్రాల కాల్సియమ్ లభిస్తుంది . ఆహారము వలన తగినంత కాల్సియమ్ వినియోగించని వారు  కాల్సియమ్ అదనముగా తీసుకొని లోపమును భర్తీ చెయ్యాలి. 
   
    కాల్సియమ్ కార్బొనేట్ సంగ్రహణకు జీర్ణాశయపు ఉదజ హరికామ్లము ( hydrochloric acid ) అవసరము. ఆమ్ల నిరోధకములు ( antacids ), కడుపులో ఆమ్లపు ఉత్పత్తిని అరికట్టు మందులు వాడేవారు, జఠర ఖండన శస్త్రచికిత్స ( gastric resection  ) అయినవారు  కాల్సియమ్ సిట్రేట్ ను ( Calcium Citrate ) వాడుకోవాలి.

విటమిన్  డి 

    చాలా మందిలో విటమిన్ డి లోపము సాధారణము. రక్తములో 25-  హైడ్రాక్సీ వైటమిన్ డి ప్రమాణములు  ( serum 25- hydroxy vitamin D ) 30 నానో గ్రాములు / మి. లీ లకు మించి ఉండాలి. 

    50 సంవత్సరములు దాటిన వారికి దినమునకు 600 - 800 IU ( International Units ) విటమిన్ డి అవసరము. ఆహారమునకు అదనముగా 200-400 IU విటమిన్ డి అవసరము అవవచ్చును. విటమిన్ డి లోపము హెచ్చుగా ఉన్నవారికి హెచ్చు మోతాదుల విటమిన్ డి అవసరము. సూర్యరశ్మి సోకేవారి చర్మములో విటమిన్ డి ఉత్పత్తి కొంత జరుగుతుంది.

వ్యాయామము  : చేయగలిగేవారు తగినంత వ్యాయామము చేయాలి. 

ఔషధములు 

    అస్థిసాంద్ర క్షీణత కలవారిలో డెక్సా టి విలువ ( DEXA T Score ) -2 కంటె తక్కువ ఉన్నవారిలోను ; 
    బలహీనులలోను, అదివఱకు తుంటి ఎముక, వెన్నుపూసలు విఱిగిన వారిలోను DEXA T Score -1.5  కంటె తక్కువ ఉంటే ఎముకలు విఱుగుట ( fractures ) అరికట్టుటకు ఔషధ చికిత్స అవసరము.

బైఫాస్ఫొనేటులు ( Biphosphonates ) 
                      
    గుల్ల ఎముకల వ్యాధి కలవారిలో బైఫాస్ఫొనేటులు ఎముకలు విఱుగుటను ( fractures ) 30-60 శాతము వఱకు తగ్గిస్తాయి. ఇవి ఎముకల నుంచి కాల్సియమ్ సంగ్రహణము ( absorption ) అరికట్టి ఎముకల శిథిలమును ( bone resorption ) మందగింపచేస్తాయి. 

    ఎలెన్డ్రోనేట్  ( Alendronate ), రిసెడ్రొనేట్ ( Risedronate ), ఐబాన్డ్రొనేట్ ( Ibandronate ) నోటి ద్వారా తీసుకుందుకు అందుబాటులో ఉన్నాయి. 

    ఈ బైఫాస్ఫొనేటులను ఉదయము నిద్ర లేచాక ఖాళీ కడుపుతో  240 మి.లీ ( 8 ఔన్సులు ) మంచినీళ్ళతో తీసుకోవాలి. తర్వాత 30 నిమిషముల వఱకు ఆహారము, యితర పానీయములు తీసుకోరాదు. మందు తీసుకున్నాక 30 నిమిషములు నిటారు స్థితిలో ఉండాలి. అలా ఉండకపోతే మందు అన్ననాళిక లోనికి తిరోగమనము చెంది అక్కడ తాపము ( esophagitis ), వ్రణములు ( esophageal ulcers ) కలిగించవచ్చును . ఈ మందులతో పాటు కాల్సియమ్, విటమిన్ డి లు ఆహారముతో అదనముగా ఇవ్వాలి.

    ఈ మందులు దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము కలవారిలోను, అన్ననాళ వ్యాధులు ( esopgageal diseases )  గలవారిలోను వాడకూడదు.

    సిరల ద్వారా ఇచ్చుటకు ఐబాన్డ్రొనేట్ ( Ibandronate, మూడు మాసములకు ఒకసారి ఇస్తారు), జొలెన్డ్రొనేట్ ( Zolendronate ) సంవత్సరమునకు ఒకసారి ఇస్తారు.) మందులు లభ్యము.  

    ఎముకలకు వ్యాపించిన కర్కట వ్రణములు ( metastatic bone cancers ) కలవారిలో   బైఫాస్ఫొనేటులు వాడినపుడు  దవడ ఎముక శిధిలమయే ( osteonecrosis ) అవకాశము ఉన్నది.

రలోక్సిఫీన్ ( Raloxifene ) 


    రలోక్సిఫీన్ ఎష్ట్రొజెన్ గ్రాహకములను ( estrogen receptors ) సవరించు ఔషధము. ఎముకలలో ఇది ఎష్ట్రొజెన్ కు అనుకూలముగాను, స్తనములు, గర్భాశయములపై ఎష్ట్రొజెన్ కు ప్రతికూలముగాను పనిచేస్తుంది. ఇది ఎముకల సాంద్రత పెంచుటకు ఉపయోగపడుతుంది. బైఫాస్ఫొనేటులు తీసుకోలేని వారికి ఈ మందు ఉపయోగకరము. ఈ ఔషధము వలన రక్తనాళములలో రక్తపుగడ్డలు ( thrombosis ) ఏర్పడే అవకాశము ఉన్నది. 

    ఎష్ట్రొజెన్ లు ( estrogens  ) గుల్ల ఎముకల వ్యాధిని అరికట్టగలిగినా వాటిని వాడిన వారిలో హృద్రోగములు, మస్తిష్క విఘాతములు ( cerebrovascular accidents ), నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ( deep vein thrombosis ) కలిగే అవకాశములు  హెచ్చగుట వలన ఎష్ట్రొజెన్ల వాడుక పోయింది.

టెరిపెరటైడ్ ( Teriparatide ) 

    టెరిపెరటైడ్ ఒక సహగళగ్రంథి స్రావక సమధర్మి ( parathyroid hormone analog ). ఇది అస్థి నిర్మాణ కణములను ( osteoblasts ) అస్థిశిథిల కణముల ( osteoclasts  ) కంటె ఎక్కువగా ఉత్తేజపఱచి అస్థి నిర్మాణమును పెంచుతుంది. టెరిపెరటైడ్ వాడుక వలన ఎముకల  సాంద్రత పెరుగుతుంది. గుల్ల ఎముకల వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలోను, మిగిలిన ఔషధములు  తీసుకోలేని వారిలోను దీనిని వాడుతారు. టెరిపెరటైడ్ ని చర్మము క్రింద సూదిమందుగా దినమునకు ఒకసారి చొప్పున 18 నెలల వఱకు ఇస్తారు. ఎక్కువ కాలము వాడేవారిలో ఎముకలలో ప్రమాదకరమైన పెరుగుదలలు ( malignant growths ) కలిగే అవకాశము ఉండుట వలన 18 మాసములకు మించి దీనిని వాడరు.

కాల్సిటోనిన్ ( Calcitonin ) 

    కాల్సిటోనిన్ ఎముకల శిధిలతను ( resorption  ) మందగింపజేస్తుంది. దినమునకు ఒక ప్రక్క చొప్పున మారుస్తూ ముక్కులో తుంపరులుగా కాల్సిటోనిన్  వాడుతారు. ఇతర ఔషధములు వాడలేని వారిలో కాల్సిటోనిన్ వాడుతారు. బైఫాస్ఫొనేటులు కలుగజేసినంత ప్రయోజనమును కాల్సిటోనిన్ కలుగజేయదు.

డెనోసుమాబ్ ( Denosumab ) 
              
    డెనోసుమాబ్ ఒక ఏకరూపక ప్రతిరక్షకము ( monoclonal antibody ). ఇది అస్థిశిథిల కణముల ( osteoclasts ) చైతన్యమును నిరోధించి ఎముకల శిథిలతను ( bone resorption ) తగ్గించి అస్థిసాంద్రతను పెంచుతుంది. దీనిని చర్మము కింద సూదిమందుగా ఆరుమాసములకు ఒకసారి ఇస్తారు. ఇది ఋతుస్రావములు తప్పిన ( post menopausal  ) గుల్ల ఎముకల వ్యాధిగ్రస్థులైన స్త్రీలలో  వెన్నెముక, తుంటె ఎముకల విఱుగుటలు ( fractures ) తగ్గిస్తుంది . 
   
    గుల్ల ఎముకల వ్యాధిగ్రస్థులైన స్త్రీ, పురుషులు, గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశములు ఎక్కువగా ఉన్నవారు, ఇతర మందులు సహించలేనపుడు, లేక  ఇతర మందుల వలన ప్రయోజనము పొందనపుడు డెనోసుమాబ్ వాడుతారు. డెనోసునాబ్ రక్తపు కాల్సియమ్ ప్రమాణాలను తగ్గించే అవకాశము ఉన్నది కావున కాల్సియమ్ విలువలను పరిశీలిస్తూ, కాల్సియమ్ లోపములను సరిదిద్దుతు ఉండాలి.

పర్యవేక్షణ 

    గుల్ల ఎముకల వ్యాధి కల వారికి తగిన చికిత్స అందజేస్తూ సంవత్సరము , రెండు సంవత్సరములకు ఒకసారి వారి అస్థిసాంద్రతను DEXA Scan తో గమనిస్తూ ఉండాలి. 

పదజాలము :

 Antacids = ఆమ్ల నిరోధములు 
Anticonvulsants = మూర్ఛ నివారిణులు ( గ.న )
Bone formation  = ఎముకల నిర్మాణ ప్రక్రియ ( గ.న )
Bone Mineral Densitometry = అస్థిసాంద్ర చిత్రీకరణము ( గ.న )
Bone resorption = ఎముకల శిథిలత ( గ.న )
Cancers = కర్కట వ్రణములు ( గ.న )
Chronic renal failure = దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము ( గ.న )
Compression fractures = సంపీడన అస్థిభంగములు ( గ.న )
Connective tissue disorders = సంధాన కణజాలవ్యాధులు ( గ.న )
Connective tissue protein = సంధానపు మాంసకృత్తి ( గ.న )
Electrolytes = విద్యుద్వాహక లవణములు
Endocrine disorders = వినాళగ్రంథి వ్యాధులు 
Esophagitis  = అన్నవాహిక తాపము ( గ.న )
Fractures of bones = అస్థి భంగములు 
Gastrectomy = జఠర ఖండనము ( గ.న )
Gastrointestinal disorders = జీర్ణమండల వ్యాధులు 
Growth hormone  = ప్రవర్ధన స్రావకము ( గ.న )
Genetic disorders = జన్యు వ్యాధులు 
Hips = తుంటి ఎముకలు
Kyphosis = గూని 
Hematopoietic disorders = రక్తోత్పాదన వ్యాధులు ( గ.న )
Hyperparathyroidism = సహగళగ్రంథి ఆధిక్యత ( గ.న )
Hyperthyroidism = గళగ్రంథి ఆధిక్యత 
Hypogonadism = బీజగ్రంథుల హీనత 
Liver function tests = కాలేయ వ్యాపార పరీక్షలు
Matrix = మాతృక 
Monoclonal antibody = ఏకరూపక ప్రతిరక్షకము ( గ.న )
Osteoblasts  = అస్థినిర్మాణ కణములు ( గ.న )
Osteoclasts = అస్థిశిథిల కణములు ( గ.న )
Osteopenia  = ఎముకల బలహీనత (గ.న )
Osteoporosis = గుల్ల ఎముకల వ్యాధి ; అస్థిసాంద్రక్షీణత ( గ.న )
Parathyroid glands  = సహగళ గ్రంథులు ( గ.న )
Parathyroid hormone = సహగళగ్రంథి స్రావకము ( గ.న )
Peak bone mass = గరిష్ఠ అస్థిరాశి ( గ.న )
Proton pump inhibitors = ఆమ్లయంత్ర అవరోధకములు ( గ.న )
Renal disorders = మూత్రాంగ వ్యాధులు ( గ.న )
Renal tubular acidosis = మూత్రనాళిక ఆమ్లీకృతము ( గ.న )
Standard deviation = ప్రమాణ వ్యత్యాసము (గ.న )
Sickle cell disease = లవిత్రకణ వ్యాధి ( గ.న )
Scoliosis = పక్క వంకరలు 
Spine = వెన్నెముక 
Thyroid function tests = గళగ్రంథి వ్యాపార పరీక్షలు ( గ.న )


( వైద్యవిషయములను తెలుగులో నా శక్తి మేరకు తెలియపఱచుట నా వ్యాసముల ఉద్దేశము . ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. వ్యాధిగ్రస్తులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి . )
      






3, ఆగస్టు 2020, సోమవారం

మానసికస్థితి వైపరీత్యములు ( Mood disorders )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) :

                                     మానసిక స్థితి వైపరీత్యాలు 

                                         ( Mood disorders )

                                          డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి. 
    మనమంతా ఎవరికి వారు తాము ప్రత్యేక వ్యక్తులమని భావిస్తుంటాము. ప్రతి జీవి ఒక తల్లి, ఒక తండ్రి నుంచి ఉద్భవించి, తనచుట్టూ ఉన్న పరిసరములను అర్థము చేసుకొని, వాటికి అనుగుణముగా వర్తించి మనుగడ సాగించడానికి యత్నిస్తుంది. మరి జంతువులలోను, మనుజులలోను అవయవ పుంజము, జీవితము మస్తిష్కముతో ముడిపడి ఉంటాయి. మస్తిష్కము విభిన్న ఆలోచనలకు, భావోద్రేకములకు స్థానమయి ఉంటుంది. ఈ మస్తిష్క కణజాలములో ఉత్పత్తి, రవాణా, ధ్వంసమయే రసాయన పదార్థములపై మనోప్రవృత్తులు, మానసిక స్థితులు ఆధారపడి ఉంటాయి. మన అందఱి మానసిక స్థితులు కాల,పరిసర పరిస్థితులకు అనుగుణ్యముగా మార్పులు చెందినా కొందఱిలో ఆ స్థితులు విపరీతము అగుటయో, చాలా కాలము స్థిరముగా ఉండుటయో జరిగినపుడు మనోస్థితి వైపరీత్యములు, మానసిక రుగ్మతలు కలుగుతాయి. మానసిక రుగ్మతలకు జీవిత కాలములో సుమారు 25 శాతము మంది కొద్దిగానో, హెచ్చుగానో గుఱి అవుతారు. అట్టి వారిలో కొంతమంది దిగులుతో ఆత్మహత్యలకు పాల్పడుతారు. కొందఱు భావోద్రేకములతో  హింసా ప్రవృత్తులను అలవరచుకుంటారు. మానసిక శాస్త్రము ఒక శాస్త్రముగాను, నవీన వైద్యములో ఒక భాగముగాను పరిణామము చెందినది.

                                        దిగులు ( Depression)



    మనందఱికీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కారణాల వలన విచారము కలిగినా, ఆ కారణాలు తొలగుట వలన, లేక కాలము మాన్పుట వలనో ఆ విచారము క్రమముగా మరుగవుతుంది. అది సహజ సిద్ధమైన విచారమే కాని రుగ్మత కాదు. ఆ విచార సందర్భములను ఎదుర్కొని, సంబాళించుకొని చాలామంది జీవితమును కొనసాగిస్తారు. అది సహజము. అట్లు కాక దిగులు జీవన వృత్తికి ప్రతిబంధకము  కావచ్చును. అప్పడు ఆ విషాదమును రుగ్మతగా పరిగణించవలసి ఉంటుంది.

  పెనుదిగులు  ( Major depression )  


    ఈ మానసికపు దిగులునకు గుఱి అయిన వారిలో విచారము, అనాసక్తి, ఆందోళన, చిరాకు, ఎక్కువగా ఉంటాయి. వీరికి  జీవితములో సుఖముల పైనా సంతోషకరమైన విషయాలపైనా ఆసక్తి ఉండదు. బంధుమిత్రులకు దూరమయి ఒంటరులు అవుతారు. నిరాశ, నిస్పృహ, నిరుత్సాహములకు లోనవుతారు. వీరి ఆత్మవిశ్వాసము సన్నగిల్లుతుంది. తాము నిరుపయోగులమనే భావన కలిగి ఉంటారు. ఏదో అపరాథ భావనలచే పీడితులవుతారు. ఏవిషయము పైన నిమగ్నత చూపించలేరు. నిర్ణయాలు చెయ్యలేరు. మఱపు పెరుగుతుంది. విపరీతపు కుంగు ఉన్నవారిలో మతిభ్రంశము కూడా కలుగవచ్చును.  విపరీతమైన నీరసము, నిద్ర ఎక్కువ అగుట, లేక నిద్ర పట్టకపోవుట, ఆకలి తగ్గుట, లేక హెచ్చగుట, బరువు తగ్గుట, లేక  పెఱుగుట కలుగుతాయి. రాత్రింబవళ్ళ తేడా జీవితములో తగ్గుతుంది. వీరికి మరణపు ఆలోచనలు తఱచు కలుగుతుంటాయి.

    కొందఱు  మాదకద్రవ్యాలు, మద్యపాన దుర్వినియోగాలకు పాల్పడుతారు. కొందఱిలో దిగులు లక్షణాలు పొడచూపక, వేఱే బాధలతో వారు వైద్యులను సంప్రదిస్తారు. అలసట, నీరసము, తలనొప్పి, కడుపునొప్పి, నడుము నొప్పి ,ఆయాసము, గుండెదడ వంటి బాధలు చెబుతారు. కాని ఆ బాధలు ఒక వ్యాధి లక్షణాలలో ఇమడవు. సాధారణ వ్యాధులకు ఇచ్చే ఔషధాలతో ఆ బాధలు నివృత్తి చెందవు. కొందఱు ఆందోళనతో వస్తారు. ప్రతి చిన్న విషయానికి గాభరా, భయము, ఆందోళన పడతారు. వీరి ఆందోళన అవసరానికి మించి ఉంటుంది.

    మంద చలనము, విచార వదనము, కళ్ళలో అశ్రువులు వీరి మానసిక ప్రవృత్తిని తెలుపుతాయి. విశేష మానసికపు క్రుంగు జీవితకాలములో 20 శాతపు స్త్రీలలోను 10 శాతపు పురుషులలోను పొడచూపుతుంది. ఈ రుగ్మత కలిగిన వారిలో సుమారు 10 శాతపు మంది జీవితకాలములో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ రుగ్మత 25 శాతము వారిలో  ఏదైనా బలవంతమైన కారణముచే ప్రస్ఫుటము అవుతుంది. చిన్నతనపు పెంపకములో అశ్రద్ధ, శారీరక క్షోభ, మానసిక క్షోభ, లైంగిక వేధింపులకు గుఱి అగుట, నిత్యజీవితములో ఒత్తుళ్ళకు గుఱి అగుట, నిరుద్యోగము, విద్యారంగములో వైఫల్యాలు, సహచరుల, కుటుంబసభ్యుల వేధింపులు యీ దిగులుకు దారితీయవచ్చును. మాదక ద్రవ్యాలు, కొన్ని మందులు అకస్మాత్తుగా మానివేసినా దిగులు కలుగవచ్చును. చాలా మందిలో పెద్ద కారణాలు ఉండక పోవచ్చును.

చిన్న కుంగు  ( Minor Depression )     


    కొందఱిలో ఆత్ములను, తల్లిదండ్రులను, జీవిత భాగస్వాములను కోల్పోయినప్పుడు, ఉద్యోగము పోయినా, ఆరోగ్యము సడలినా కలిగే విచారము దీర్ఘకాలము నిలువవచ్చును. మానసికపు కుంగు లక్షణాలు పరిమితముగా దీర్ఘకాలము ఉంటాయి. వీరిలో మద్యము, మాదకద్రవ్యాల దుర్వినియోగము కూడా ఉండవచ్చును.

ప్రసవానంతరపు దిగులు ( Postpartum Depression ) 



    కానుపు పిమ్మట 10 - 15 శాతము మందిలో దిగులు వ్యాధి కనిపిస్తుంది. కానుపు అయిన రెండు వారముల నుంచి ఒక నెల లోపుల సాధారణముగా యీ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆందోళన, ఆకలి నిద్రలలో మార్పులు, చిరాకు, కన్నీళ్ళు, నిస్సత్తువ వీరికి కలుగుతాయి.
   బంధుమిత్రుల తోడ్పాటు, సహకారము, స్మృతివర్తన చికిత్సలు ( Cognitive Behavioral Therapy), అవసరమైనపుడు ఔషధములతో యీ దిగులును  నివారించ వచ్చును.

 ఋతు సంబంధపు దిగులు ( Seasonal Depression) 


    కొంత మందిలో కొన్ని కాలములలో విచారము పొడచూపుతుంది. అమెరికాలో ప్రత్యేకముగా శీతా కాలములో చాలామంది విచారగ్రస్తులము అవుతామని చెబుతారు. వసంత కాలము రాగానే 
ఆ విషాదము తగ్గిపోతుంది.

                                      ద్విధ్రువ వ్యాధి ( Bipolar disorder ) 


    కొందఱిలో ఉన్మాదపు పొంగు ( Mania ), అప్పుడప్పుడు విపరీతమైన దిగులు ( Depression) కలుగుతుంటాయి. నిమ్న, ఉన్నతాలు కలిగే యీ వ్యాధిని  ద్విధ్రువ వ్యాధిగా పరిగణిస్తారు. సుమారు 1 శాతము మంది ప్రజ యీ మానసిక వ్యాధికి గుఱి అవుతారు. ఈ వ్యాధి పురుషులు, స్త్రీలలో సమాన నిష్పత్తిలో కలుగుతుంది. పొంగు ఎక్కువయినప్పుడు వీరికి ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉంటుంది. భావములు పరంపరలుగా కలుగుతాయి. ఒక ఆలోచన నుంచి మరియొక ఆలోచనకు మస్తిష్కము ఉఱకలు పెడుతుంది. ఎక్కడలేని శక్తి వీరికి వస్తుంది. నిద్ర అవసరము తగ్గుతుంది. ఆకలి తగ్గుతుంది. ఉద్రేకము ఎక్కువగా ఉంటుంది. గట్టిగా మాట్లాడడము, అనవసరపు వాదనలకు, కయ్యాలకు  దిగడము చేస్తారు. ఇతరులు తమకు హాని చేస్తున్నారు అనే ఆలోచనలు కలిగి సంశయ వర్తనముతో (Paranoid behaviour ) నిత్యము ఉంటారు. వీరికి శ్రవణ, దృశ్య భ్రమలు 
( Auditory and Visual hallucinations) మతిభ్రాంతి కూడా కలుగవచ్చును. వీరిలో మాదకద్రవ్యాలు, మద్యముల వినియోగము ఎక్కువగా ఉంటుంది. వీరికి వారి పోట్లాట తత్వము వలన  న్యాయ వ్యవస్థతో గొడవలు ఎక్కువగా ఉంటాయి. వీరు మధ్య మధ్యలో మానసికముగా కుంగిపోతుంటారు. అప్పుడు వీరి ప్రవృత్తి పూర్తిగా మారిపోతుంది. దిగులు లక్షణాలు అప్పుడు ప్రస్ఫుటమవుతాయి. ఈ ద్విధ్రువ వ్యాధి వంశపరముగా రావచ్చును. ఈ ద్విధ్రువ వ్యాధిగ్రస్థులలో కుంగుదల  కలిగినప్పుడు  ఆత్మహత్యల అవకాశము పెరుగుతుంది. ఇరువది సంవత్సరాల కాలములో సుమారు ఆరు శాతపు వ్యాధిగ్రస్థులు ఆత్మహత్యకు పాల్పడుతారు.


                                              పిచ్చి  (Schizophrenia  ) 


         
    పిచ్చి వ్యాధి గలవారి  మానసికస్థితి వాస్తవానికి వైరుధ్యముగా ఉంటుంది. దృశ్య భ్రాంతులు ( లేని విషయాలు గోచరించడము ; Visual hallucinations ), శ్రవణ భ్రాంతులు ( లేనివి వినిపించడము ; Auditory hallucinations ) కలగడము వలన వీరు నిజ ప్రపంచములో కాక వేఱే లోకములో ఉంటారు. జీవిత కాలములో వెయ్యిమందిలో మూడు నుంచి ఏడుగురు వ్యక్తులలో యీ రుగ్మత వేఱు వేఱు స్థాయిలులో  కనిపించవచ్చు. వీరిలో కూడా కుంగుదల కలిగే అవకాశాలు మెండు. ఆత్మహత్యలకు వీరు కూడా పాల్పడవచ్చును.

    మానసిక వ్యాధులు యితర వ్యాధుల వలన కూడా కలుగవచ్చును. మెదడు, ఊపిరితిత్తులు, క్లోమములలో కర్కట వ్రణముల ( Cancers ) వలన మానసిక విభ్రాంతి కలుగవచ్చును.

    సూక్ష్మజీవులు కలిగించే, న్యుమోనియా, టైఫాయిడ్ జ్వరము, సిఫిలిస్, మెదడువాపు ( Encephalitis ), కాలేయ తాపము వలన, 

    గర్భనిరోధపు మందులు ( Oral contraceptives ), రిసెర్పిన్ ( రక్తపుపోటుకు వాడే వారు. ఈ దినములలో దీని వాడకము లేదు ) బీటా గ్రాహక అవరోధకములు ( beta blockers ), కార్టికోస్టీరాయిడులు, మూర్ఛమందులు, మైగ్రేను తలనొప్పి మందులు, మానసిక వ్యాధుల మందులు, హార్మోనుల వంటి ఔషధముల వలన,.

    గళగ్రంథి ఆధిక్యత ( hyperthyroidism  ), గళగ్రంథి హీనత ( hypothyroidism ), సహగళగ్రంథి ఆధిక్యత ( hyper parathyroidism ), ఎడ్రినల్ కార్టికోస్టీరాయిడులు ఎక్కువ అగు కుషింగ్ సిండ్రోము 
 ( Cushing syndrome ) వంటి వినాళగ్రంధి వ్యాధులు వలన,

    విటమిన్ బి 3 ( నయాసిన్ ) లోపము వలన వచ్చే పెల్లాగ్ర  ( pellagra ) అనే వ్యాధి వలన, మానసిక ప్రవృత్తులలో మార్పులు కలుగ వచ్చును..

చికిత్సలు 


    మానసిక వ్యాధులను తేలికగా తీసుకొని, నిర్లక్ష్యము చేయుట మంచి విషయము కాదు. ముందుగానే వ్యాధిగ్రస్థులపై కాని, వ్యాధులపై కాని, చికిత్సలపై గాని సరియైన అవగాహన లేక స్థిరాభిప్రాయములు  ఏర్పఱచుకొనుట తగదు. మానసిక శాస్త్రము, మానసిక వ్యాధుల శాస్త్రము దినదినము పరిణతి చెందుతునే ఉన్నాయి. పూర్తిగా నివారించలేకపోయినా యీ వ్యాధులను అదుపులో ఉంచవచ్చును.

    విషాద వర్తన కలిగిన వారికి కుటుంబ సభ్యుల, మిత్రుల, సహచరుల అవగాహన, ఆదరణ, ఆలంబనము, భరోసా చాలా అవసరము. దిగులు స్వల్పకాలము, పరిమితముగా ఉన్నప్పుడు చికిత్సలు అవసరము కాకపోవచ్చును. దిగులు అధికమైనా, ఆత్మహత్య లక్షణాలు ఏ మాత్రము కనిపించినా అత్యవసర చికిత్సలు అవసరము. దీర్ఘకాల విషాదమునకు, దీర్ఘకాల  ఆందోళనకు, పెనుదిగులుకు, ద్విధ్రువవ్యాధులకు చికిత్సలు అవసరము. పిచ్చి ( Schizophrenia) గలవారికి చికిత్స తప్పనిసరి.

    మనస్తత్వవేత్తలు ( Psychologists ), మనోవ్యాధి వైద్యులు ( Psychiatrists ) యీ వ్యాధులకు సాధారణముగా చికిత్సలు చేస్తారు. స్మృతివర్తన చికిత్సల ( Cognitive Behavioral Therapy) వంటి చికిత్సలతో వారి ఆలోచనలను, బాహ్యప్రేరణలను ఏ విధముగా ఎదుర్కొని స్పందించాలో శిక్షణ గఱపుతారు. వ్యాయామము, యోగాభ్యాసములు, కొంత తోడ్పడవచ్చును.

మందులు 


    అవసరమైనపుడు దిగులు చికిత్సకు ఔషధములను వాడుతారు. ఇవి :

    1. సెలెక్టివ్  సీరోటోనిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్లు ( Selective Seotonin Reuptake Inhibitors SSRI s) :(ఫ్లుఆక్సెటిన్ ( fluoxetin ), పెరాక్సిటిన్ ( paroxetin ), సెర్ట్రలిన్ ( sertralin ), సిటలోప్రమ్ ( citalopram ) మొదలైనవి.

    2. సీరోటోనిన్ నారెపినెఫ్రిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్లు, ( SNRI s) : వెన్లఫాక్సిన్ ( venlafaxine), డులోక్సిటిన్ ( duloxetine ), డెస్వెన్లఫాక్సిన్ (desvenlafaxine )మొదలైనవి.

    3. నారెపినెఫ్రిన్ డోపమిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్లు ( NDRIs ) ఉద : బ్యుప్రోపియాన్( bupropion ).

    4. ట్రైసైక్లిక్ ఏంటి డిప్రెసెంట్లు   ( Tricyclic antidepressants ): ఎమిట్రిప్టిలిన్ ( amitriptyline ), నార్ ట్రిప్టిలిన్ ( nortriptyline ), డెసిప్రమిన్ ( desipramine ) మొదలైనవి.

    5. మొనోఎమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్లు ( Monoamine Oxydase Inhibitors ).

    6. టెట్రాసైక్లిక్ ఏంటి డిప్రస్సెంట్లు ( Tetracyclic Antidepressants ):ఉద ; మిర్టజపిన్ ( mirtazapine ), సాధారణంగా వాడే మందులు.

      వాడే మందుల మోతాదులను సవరించుట, దుష్ఫలితములను గమనించుట, వ్యాధిగ్రస్థులను అవసరము బట్టి జాగ్రత్తగా గమనించుట వైద్యుల బాధ్యత. సామాన్య వైద్యులు ( General Doctors ) చికిత్సకులైతే అవసరమైనపుడు నిపుణులను సంప్రదించాలి.

    ద్విధ్రువ వ్యాధికి ( Bipolar disorder) దిగులు మందులు కుదరవు. మానసికవేత్తల సలహా చికిత్సకు తోడుగా , మానసిక స్థితిని కుదుటపరచే  ( Mood Stabilisers )  లిథియమ్ ( Lithium) ; వేల్ప్రోయిక్ ఏసిడ్ ( Valproic acid ), లామిక్టాల్ ( Lamictal ) టెగ్రటాల్ ( Tegretol ), వంటి మూర్ఛ మందులు; ఒలాంజపిన్ ( Olanzapine ), రిస్పెరిడోన్ ( Risperidone ) వంటి అసాధారణ మానసిక ఔషధములు ( Atypical antipsychotics) ద్విధ్రువవ్యాధికి వాడుతారు. ఆందోళన ఎక్కువైన వారికి ఆందోళన తగ్గించే మందులు వాడుతారు. మానసిక వ్యాధులకు కొత్తమందులు లభ్యమగుట చక్కని పరిణామము.

విద్యుత్ ప్రేరణ  మూర్ఛచికిత్స  (  Electro Convulsive Therapy  ) 


    ఔషధములకు లొంగని వ్యాధులకు, మానసిక చలన మాంద్యము ( Psychomotor retardation ) తీవ్రముగా ఉన్నపుడు, ప్రాణాపాయ పరిస్థితులలోను, మందులకు లొంగని మానసిక వ్యాధులకు విద్యుత్ ప్రేరణ మూర్ఛచికిత్స పూర్తిగా మత్తుమందు ఇచ్చి చేస్తారు. ఈ చికిత్స పలు పర్యాయములు చేయవచ్చును. సత్ఫలితములు కలిగిన వారిలో సంవత్సరములో ఏబది శాతపు మందిలో వ్యాధి లక్షణములు మరల కనిపించవచ్చును .

    ఈ భూమిపై జన్మించిన వారందఱూ అదృష్టవంతులు కారు. మనోవ్యాధికి గుఱైనవారు బంధు, మిత్ర, సహచరులలో ఉంటే వారి వ్యాధులను అర్థము చేసుకొని వారికి బాసటగా నిలిచి, వారి చికిత్సకు తోడ్పడాలి. సమాజము, ప్రభుత్వము కూడా చికిత్స బాధ్యత తీసుకోవాలి.

   పదజాలము :


Bipolar disorder = ద్విధ్రువ వ్యాధి
Cognitive behavioral therapy = స్మృతివర్తన చికిత్స ( గ.న )
Depression = మానసికపు దిగులు
Electro convulsive therapy = విద్యుత్ ప్రేరణ మూర్ఛచికిత్స ( గ.న )
Major depression = పెను దిగులు  ( గ.న )
Minor depression = చిన్న కుంగు ; చిన్న దిగులు ( గ.న )
Mania = ఉన్మాదపు పొంగు ( గ.న )
Mood disorders = మానసికస్థితి వైపరీత్యములు ( గ.న )
Paranoid behavior = సంశయ వర్తన ( గ.న )
psychomotor retardation =  మానసిక చలనమాంద్యము ( గ.న )


      ( ఉపయుక్తమనుకుంటే యీ వ్యాసమును నిస్సంకోచముగా పంచుకొండి )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...