16, జనవరి 2022, ఆదివారం

రభస వ్యాధి ( Rabies )





 ( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో )

                               రభస వ్యాధి ( Rabies )



                                                                      డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.

     రభస వ్యాధి ( Rabies ) ; లాటిన్ లో rabere ( to rave ప్రలాపించు ) సంస్కృతములో  రభస తో సంబంధము కలిగి కోపమును , ఉద్వేగమును సూచిస్తుంది. మనుజులలోను, ఇతర క్షీరదములలోను ( mammals ) లిస్సా సమూహమునకు చెందిన రేబ్డోవైరిడే ( Rhabdoviridae ) కుటుంబమునకు చెందిన ఒంటి పోగు ఆర్. ఏన్.ఎ విషజీవాంశముల ( RNA viruses ) వలన కలుగుతుంది. ఈ విషజీవాంశములు ( viruses ;from Latin vīrus“slime, poison”; akin to Sanskrit viṣá-,विष ) వ్యాధి గల జంతువుల లాలాజలము నుంచి కాట్ల గుండా కాని, కన్ను, ముక్కు, నోరు శ్లేష్మపుపొరల ద్వారా గాని శరీరములోనికి చొరబడి మెదడుకు చేరితే రభసవ్యాధి ( Rabies )  కలుగుతుంది. 


రభస వ్యాధి వన్యమృగములు నక్కలు , గబ్బిలాలు, రాకూనులు ( racoons ), స్కంకులలో( skunks ) కలుగుతుంటుంది. కుక్కలకు, పిల్లులకు ఈ వ్యాధి వ్యాధి గల ఇతర జంతువుల నుంచి గాని, వన్యమృగాల నుంచి గాని సంక్రమిస్తుంటుంది. మనుజులకు కుక్కల నుంచి ఎక్కువగాను, అమెరికా వంటి దేశాలలో గబ్బిలాల నుంచి కాటుల వలన సోకుతుంటుంది. జంతువులు కఱచిన తరువాత, వ్యాధిలక్షణములు పొడచూపక ముందు టీకాలు వేసి వ్యాధిని పూర్తిగా నివారించవచ్చును. 

టీకాలు ( vaccines ) లభ్యమగుట వలన, పెంపుడు కుక్కలకు, పిల్లులకు టీకాలు తప్పనిసరిగా వేయించుట వలన, సమాజములలో జంతువుల తిరుగుళ్ళను నియంత్రించుట వలన, వన్యమృగముల కాట్లకు, టీకాలు వేయబడని కుక్కల, పిల్లుల కాట్లకు గురి అయి రభసవ్యాధి కలిగే అవకాశములు గల మనుజులకు టీకాలు వేయుట వలన రభస వ్యాధిని ( Rabies ) పూర్తిగా నిర్మూలించవచ్చును.

    లక్షణములు పొడచూపిన పిమ్మట రభస వ్యాధి సర్వసాధారణముగా (100%) మరణమునకు దారితీస్తుంది. 


రభస విషజీవాంశములు ( Rabies Viruses )

     రభస వ్యాధి కలిగించు జీవాంశములు లిస్సావైరస్ ( Lyssa Viruses ) సమూహములో రాబ్డోవైరిడే ( Rhabdoviridae ) కుటుంబానికి చెందిన కణుపులు లేని ( non segmented ) ఒంటిపోగు ఆర్ఎన్ఎ విషజీవాంశములు. జన్యుపదార్థము ఒక కోశములో ఉంటుంది. ఈ విషజీవాంశములు తుపాకి గుండు ఆకారములో ఉంటాయి.

రభస వ్యాధి కలిగించు జంతువులు 


     రభసవ్యాధి సోకిన కుక్కలు, నక్కలు, గబ్బిలాలు, స్కంకులు,  రాకూనులు, పిల్లుల నుంచి మనుజులకు రభస వ్యాధి సంక్రమించగలదు. రభసవ్యాధి బారి పడిన జంతువులలో వ్యాధి లక్షణములు ఏమీ కనిపించకపోవచ్చును. నలతగా ఉండుట, మింగుట కష్టముగా ఉండుట , నురుగుతో చొంగ ఎక్కువగా కార్చుట, కనిపించిన వాటిని ప్రేరణ లేకుండా కఱచుచుండుట, ఏవైనా శరీరభాగములు చలనము లేక వాతము స్థితిలో ఉండుట, ఊరికే కలియబడి దాడిచేయుట, లేక మఱీ మెతకగా పడిఉండుట, వ్యాధిని సూచిస్తాయి. నేలపై పడిన గబ్బిలాలు కూడా రభస వ్యాధిని సూచిస్తాయి.

   భారతదేశములో 62000,000 ల ఊరకుక్కలు ఉన్నాయని అంచనా. ఏటా 17600,000 మంది కుక్కకాట్లకు గుఱి అవుతారని రభసవ్యాధి నియంత్రణ సంఘము వారి అంచనా. వీరికి వైద్యము ఖర్చుతో కూడిన పని.

పెంపుడు జంతువుల రక్షణ 

      పెంపుడు జంతువులకు రభస వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తే మనుష్యులకు కూడా రక్షణ చేకూరుతుంది. పెంపుడు కుక్కలకు, పిల్లులకు రభస వ్యాధి టీకాలు వేయించుట తప్పనిసరి చెయ్యాలి.పెంపుడు జంతువులను వన్యమృగముల బారి నుంచి, ఇతర జంతువుల బారి నుంచి కాపాడుకోవాలి. పెంపుడు జంతువులను విచ్చలవిడిగా అదుపులో లేకుండా బయట తిరగనీయకూడదు. వాటిని మనుష్యులను ఇతర జంతువులను కఱవనీయకుండా యజమానులు వారి ఇంటి లేక పొలము ప్రాంగణాలలో అదుపులోఉంచుకోవాలి. పెంపుడు జంతువుల వృషణములు , అండములు తొలగించో వాటికి కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు చేయించో వాటి సంఖ్య వృద్ధిపొందకుండా చూసుకోవాలి. యజమానులు లేని వీధి కుక్కలను, పిల్లులను బాధ్యత తీసుకొని పోషించుటకు, వాటికి రభసవ్యాధి ( Rabies ) టీకాలను వేయిస్తూ తమ అదుపులో ఉంచుకొనుటకు ఎవరూ దొఱకనప్పుడు వాటిని వీధులనుంచి  తొలగించి జంతుశాలలలోనో, జంతు పరిరక్షణశాలలలోనో ఆశ్రయము కల్పించుట, వాటికి రభసవ్యాధి టీకాలు వేయించి పోషణ చేకూర్చుట, కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుట అందఱికీ ఆమోదకరము కావాలి. ప్రభుత్వ సంస్థలు, ప్రజాహిత సంస్థలు జీవకారుణ్యసంస్థలు ఆ బాధ్యత తీసుకోవాలి. కుక్కల సగటు జీవనప్రమాణము 11 సంవత్సరములు కాబట్టి పై సూచనలను అమలుపరుస్తే ఒక దశాబ్దములో వీధి కుక్కల సంఖ్య బాగా తగ్గిపోవాలి. చాలా దేశాలలో వన్యమృగాలకు కూడా ఆహారము ద్వారా నీరసింపజేసిన రభసవ్యాధి ( attenuated Rabies virus ) విషజీవాంశములను టీకాలుగా ఇచ్చి వాటికి చైతన్యరక్షణ ( active immunity ) సమకూర్చుతున్నారు. 

               భారతదేశములో జీవకారుణ్యసంఘము వారి అభ్యర్ధన మేరకు , అత్యున్నతన్యాయస్థానము వారు ఊర కుక్కలను పిల్లులను చంపరాదని తీర్పు ఇచ్చారు. అందువలన పురపాలక సంఘాలు వాటిని అదుపులో ఉంచుటకు శ్రద్ధ చూపుట లేదు. అందుచే మనుష్యులలో కుక్కకాట్లు, రభసవ్యాధులు , వాటి వలన మరణాలు పెరిగాయి. ఆ తీర్పును గౌరవిస్తూనే శునక శాలలు, పిల్లుల ఆశ్రమాలు నడుపుకొంటూ వాటిని పట్టణ వీధులలోంచి తొలగించి వాటికి, ప్రజలకు రక్షణ చేకూర్చుటకు ప్రభుత్వాలు, ప్రజాసంఘాలు, ప్రజలు సమిష్టిగా కృషి చెయ్యాలి. 

   
     రభసవ్యాధి వలన భారతదేశములో సంవత్సరానికి సుమారు 20,000 మంది మరణిస్తున్నారు. వీరిలో పెక్కుమంది పిల్లలు. అమెరికాలో ఒకరో ఇద్దఱో గబ్బిలాల కాట్ల వలన వచ్చిన రభసవ్యాధితో మరణిస్తున్నారు. కుక్కకాట్ల వలన ఎవరికీ రభసవ్యాధి రావడము లేదు. అభివృద్ధి చెందిన చాలా దేశాలు రభసవ్యాధిని ( Rabies ) పూర్తిగా నివారించ గలుగుతున్నాయి.

రభస వ్యాధి వ్యాప్తి 


      రభసవ్యాధి ( Rabies ) సోకిన జంతువుల నుంచి ఇతర జంతువులకు, మనుజులకు రభసవ్యాధి ( Rabies ) సంక్రమించగలదు.సామాన్యముగా ఆ జంతువులు కఱచుట వలన వ్యాధి బారి పడుతారు. రేబీస్ గల జంతువుల లాలాజలము గాయములు, ఒరిపిడులు , ఱక్కుళ్ళపై పడినప్పుడు కూడా విషజీవాంశములు శరీరములోనికి ప్రవేశించి రభసవ్యాధిని కలిగించగలవు. రభస విషజీవాంశములు ఆ జంతువుల మెదడులోను, నాడీకణజాలములోను కూడా ఉంటాయి. ఆ కణజాలములు గాయములపై చేరినా వ్యాధి రాగల అవకాశము ఉంటుంది. వ్యాధిగ్రస్థ జంతువుల రక్తము, మలమూత్రముల ద్వారా వ్యాధి సంక్రమించదు. వ్యాధిగ్రస్థ జంతువులను తాకుట వలన, తట్టుట వలన వ్యాధి రాదు. వ్యాధిగ్రస్థుల అవయవ పరదానాలు ( organ transplantation ) వలన వ్యాధి వ్యాపించిన సంఘటనలు ఉన్నా అవి చాలా అఱుదు. రభసవ్యాధి ( Rabies ) సోకిన మనుజులు కఱచుట చేత, వారి లాలాజలము వలన వారి వ్యాధి ఇతరులకు సంక్రమించే అవకాశము ఉన్నా అట్టి సంఘటనలు నమోదు కాలేదు. రభస విషజీవాంశములు సూర్యరశ్మి సోకినపుడు, ఆర్ద్రత కోల్పోయినపుడు నిర్వీర్యము అవుతాయి. 

రభసవ్యాధి లక్షణములు 

     రభసవ్యాధి ( Rabies ) విషజీవాంశములు శరీరములో ప్రవేశించిన తర్వాత అవి మెదడుకు చేరేవఱకు ఎట్టి లక్షణములు కనిపించవు. అవి మెదడుకు చేరిన పిదప రోగలక్షణములు కలుగుతాయి. ఈ అగోచరస్థితి / మఱుగుపాటు సమయము ( incubation period ) సాధారణముగా కొద్ది వారములు నుంచి కొద్ది నెలలపాటు ఉంటుంది. అగోచరస్థితి కాలము కాటుబడిన తావుకు మెదడుకు కల మధ్య దూరము పైన, విషజీవాంశముల పైన, శరీర రక్షణ వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది.
    తొలి లక్షణములు వ్యాపకజ్వరము ( Flu ) లక్షణములను పోలి ఉంటాయి. జ్వరము, తలనొప్పి, నీరసము, ఒంట్లో నలత, ఒళ్ళునొప్పులు, గొంతునొప్పి, ఆకలి లేకపోవుట, వమన భావన, వాంతులు, పొడిదగ్గు ఉంటాయి. కాటు స్థలము వద్ద తిమ్మిరి, సూదులు గుచ్చినట్లు నొప్పి, కండరాలలో జలదరింపులు కలుగవచ్చును. ఈ లక్షణములు 1-4 దినములు ఉంటాయి.
     విషజీవాంశములు మెదడుకు చేరి మెదడువాపు ( encephalitis ) కలిగించేటపుడు ఆ మెదడువాపు ( encephalitis )  లక్షణములు కనిపిస్తాయి. గందరగోళము, ఆందోళన, ఉద్వేగము, కలియబడుదనము, నిద్రపట్టకపోవుట, మతిభ్రంశము, భ్రాంతులు, కలుగుతాయి. కండరములలో ప్రకంపనములు, దుస్సంకోచములు ( spasms ), మూర్ఛలు, కొన్ని కండరములలో వాతము కలిగి చలన నష్టము ( paralysis) కలుగవచ్చును. కన్నీళ్ళు ఎక్కువగా కారుట, లాలాజలము ఎక్కువగా స్రవించుట, ఎక్కువ చెమటపట్టుట, స్థితి సంబంధ అల్పరక్తపీడనము ( postural hypotension ) వీరిలో కనిపిస్తాయి. 
    ఆపై మస్తిష్కమూల ( brain stem ) విలక్షణములు కనిపిస్తాయి. ద్విదృష్టి (ఒక వస్తువు రెండుగా కనిపించుట / diplopia ), ముఖకండర పక్షపాతములు ( facial palsy ), నేత్రనాడిలో వాపు ( optic neuritis ), మింగుటలో కష్టము, పదార్థములు మింగుటకు యత్నించునపుడు మింగు కండరములలోను ( muscles of deglutition ), స్వరపేటిక కండరములలోను, శ్వాసకండరములలోను, ఉదరవితానములోను దుస్సంకోచములు, నొప్పులు కలుగుట కలుగుతాయి. 



   రభస వ్యాధి ( Rabies ) విశ్రుత లక్షణము జలభయము ( hydrophobia). వీరు నీటిని, ద్రవపదార్థములను చూసేటపుడు, మింగుటకు యత్నించునపుడు మింగు కండరములు పనిచేయక, వాటిలో నొప్పి కలిగించు దుస్సంకోచములు ( spasms ) కలిగి ఆ కండరములు బిగుసుకుపోతాయి. అందువలన వీరు నీటిని చూసి భయపడుతారు. పదార్థములు మింగలేకపోవుట, లాలాజలము ఎక్కువగా స్రవించుట, నురుగుతో చొంగలు కారుట వీరిలో కనిపిస్తాయి.

 లక్షణములు పొడచూపిన రెండు నుంచి పది దినములలో రభస వ్యాధిగ్రస్థులు సర్వసాధారణంగా మరణిస్తారు. 

       రభస వ్యాధి సోకిన జంతువులలో కూడా ఇటువంటి లక్షణములే కనిపిస్తాయి. ప్రేరణ లేకుండా దాడి చేసి కఱచుట, పెంపుడు జంతువుల ప్రవర్తనలో మార్పులు, చైతన్యము పోయి మూల పడిఉండుట వ్యాధిని సూచించగలవు.

రోగ నిర్ణయము 


     మనుజులలో రభస వ్యాధిని మరణమునకు ముందు నిర్ణయించుటకు పలు పరీక్షలు అవసరము. లాలజలము నుంచి విషజీవాంశములను వేర్పఱచ వచ్చును. RT-PCR పరీక్షతో (reverse transcription followed by polymerase chain reaction) విషజీవాంశములను గుర్తించే అవకాశము గలదు. రక్తద్రవము ( serum ), వెన్నుద్రవములలో ( spinal fluid ) రభస విషజీవాంశములకు ప్రతిరక్షకములను ( antibodies ) గుర్తించవచ్చును. చర్మకణపరీక్షలతో కేశకూపముల క్రింద చర్మనాడులలో విషజీవాంశ ప్రతిజనకములను ( antigens ) గుర్తించే అవకాశము గలదు. విషజీవాంశ ప్రతిజనకములను ( antigens ) ప్రత్యక్ష ప్రతిదీప్త ప్రతిరక్షక పరీక్షతో ( Direct Fluorescent Antibody test ) గుర్తిస్తారు.
     కఱచిన జంతువులు వన్యమృగములయి అవి పట్టుబడినప్పుడు, కుక్కలు, పిల్లులు, పెంపుడు జంతువులయి అవి వ్యాధి లక్షణములు కలిగి ఉన్నపుడు వాటిని బాధ లేకుండా మానవతా దృష్టితో చంపి వాటి మెదడును ( ముఖ్యముగా చిన్నమెదడు, మస్తిష్క మూలములను ) ప్రత్యక్ష ప్రతిదీప్త ప్రతిరక్షక పరీక్షలతో ( Direct Fluorescent Antibody test ) విషజీవాంశములకై పరిశోధించాలి. మస్తిష్క కణపరీక్షలలో నెగ్రీబాడీస్ ( Negri bodies ) కనిపించినా వ్యాధిని నిరూపించవచ్చును. 

వ్యాధి నివారణ 

    జంతువులు కఱచినపుడు, లేక ఱక్కినపుడు, వాటి లాలాజలము ఱక్కులపైన, గాయములపైన చేరినపుడు ఆ జంతువులు వన్యమృగములైతే వాటిని బాధ లేకుండా చంపి వాటి మెదడులను రభస వ్యాధి పరీక్షలకు పంపాలి. మెదడులు రభసవ్యాధిని సూచిస్తే టీకాల చికిత్స ( vaccination ) అవసరము. ఆ జంతువులు దొఱకక పారిపోయినా టీకాల చికిత్సలు అవసరము.
   ఆ జంతువులు ఊరకుక్కలు, పిల్లులు అయినా, పెంపుడు జంతువులు అయినా వాటిని పది దినములు నిర్బంధించి వాటిలో రోగ లక్షణములు కనిపిస్తే వాటిని బాధ లేకుండా చంపి వాటి మెదడులను రభసవ్యాధి పరిశోధనలకు పంపాలి. రభసవ్యాధి నిరూపితమయితే టీకా చికిత్సలు 
( vaccines ) అవసరము. పది దినముల తరువాత కూడా అవి ఆరోగ్యముగా ఉంటే రభస వ్యాధి టీకాల అవసరము లేదు. వీధి జంతువులు దొఱకక పారిపోతే టీకాలు అవసరము.
     జంతువులు కఱచినపుడు, ఱక్కినపుడు గాయములను సబ్బునీళ్ళతోను, వినీల పొవిడోన్ ఐయొడిన్ తోను శుభ్రపఱచాలి. ధనుర్వాతము ( tetanus ) రక్షణకు పది సంవత్సరములలో టీకాలు తీసుకొనని వారికి ధనుర్వాతపు టీకాలు వేయాలి. అవసరమయిన సూక్షాంగజీవ నాశకములు ( antibiotics ) వాడాలి. గాయములకు తగిన చికిత్స కొనసాగించాలి.
     రభస వ్యాధి సంక్రమించు అవకాశాల బారి పడినవారికి వ్యాధి నివారణ చికిత్స అవసరము ( Post exposure prophylaxis ). 
     వీరికి  మనుజుల రభస వ్యాధి ప్రతిరక్షకములను ( Human Rabies Immune Globulin - HRIG ) 20 units / Kg శరీర బరువు మోతాదును వీలయినంత కఱచిన గాయములోనికి , గాయము చుట్టూ ఇచ్చి మిగిలినది కండరములో సూదిమందుగా వెంటనే ఇయ్యాలి. దీని వలన వెంటనే అచేతన రక్షణ ( పరదాన రక్షణ / passive immunity ) కలుగుతుంది. HRIG ని కాటుకు 7 దినముల తర్వాత ఈయకూడదు.
    రభస వ్యాధి టీకా ( Rabies vaccine ) 1 మి.లీ ను 0, 3, 7, 14 దినములలో మొత్తము నాలుగు మోతాదులు భుజ కండరములలో ( అధిస్కంధ స్నాయువు / Deltoid muscle ) సూదిమందుగా ఇయ్యాలి. రక్షణ వ్యవస్థ లోపములు ఉన్నవారిలో ఐదవ మోతాదు కూడా  28 వ దినమున ఇయ్యాలి. టీకాల వలన చైతన్య రక్షణ ( శరీర రక్షణ వ్యవస్థ చేకూర్చు స్వీయరక్షణ / active immunity ) చేకూరుతుంది.
       అది వఱకు టీకాలు తీసుకొని రక్షణ పొందిన వారు రభస వ్యాధి కలిగే అవకాశాలకు గుఱి అయినపుడు ( Post exposure, previously immunized persons ) రెండు మోతాదుల టీకాను 0, 3 దినములలో తీసుకుంటే సరి పోతుంది. వీరికి HRIG అవసరము లేదు.
       పశువుల వైద్యులు, జంతువులతోను, వన్యమృగములతో పనిచేసేవారు, రభసవ్యాధి పరిశోధకులు, రభసవ్యాధి కలిగే అవకాశములకు ముందుగానే ( Pre exposure prophylaxis ) 0, 7, 21 ( లేక 28 ) దినములలో రభస వ్యాధి టీకాలు మూడు మోతాదులలో తీసుకోవాలి

    రభస వ్యాధి లక్షణములు కలవారు సాధారణముగా మరణము పాలవుతారు. వారికి ఆలంబన చికిత్సలు ( supportive treatment ), ఉపశమన చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. అందువలన రభసవ్యాధిని నివారించు చర్యలు తప్పక తీసుకోవాలి.


        సెప్టెంబరు 28 ప్రపంచ రభసవ్యాధి దినముగా ( World Rabies Day ) గా పరిగణించి ప్రజలకు రభసవ్యాధి గుఱించి దాని నివారణ గుఱించి సమాచారమును వ్యాపింప చేస్తారు.
   
( వైద్య విషయములను తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము . వ్యాధిగ్రస్థులు, వ్యాధుల అవకాశములకు గుఱి అయినవారు మీ మీ వైద్యులను సంప్రదించ ప్రార్థన . నా వ్యాసములు స్వేచ్ఛగా పంచుకొనవచ్చును. )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...