25, నవంబర్ 2019, సోమవారం

తెలుగు లిపిలో ముద్రణ



                                                 తెలుగు లిపిలో ముద్రణ



                                                                            డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .

        తెలుగు భాషను సరళీకృతము చేసుకోవాలనే వాదన తరతరాలుగా ఉంది. భాషకు లిపి, పదజాలము, వ్యాకరణము ఉండి వాటిపై వాడుక ,సాహిత్యము ఆధారపడుతాయి.
లిపికి అక్షరాలు కావాలి. తెలుగు లిపిలో 

అచ్చులు 

అ  ఆ  ఇ ఈ  ఉ  ఊ  ఋ  ౠ  ఌ  ౡ  ఎ  ఏ  ఐ  ఒ  ఓ  ఔ  అం  అః 

హల్లులు

క  ఖ  గ  ఘ  ఙ్  
చ  ఛ  జ  ఝ  ఞ
ట  ఠ  డ  ఢ  ణ   
త  థ  ద  ధ  న  
ప  ఫ  బ  భ  మ 
య  ర  ల  వ  స  శ  ష  హ  ళ  క్ష  ఱ

గుణింత చిహ్నాలు ;

ా   ి   ీ   ు   ూ  ృ   దీర్ఘ ృ     ె   ే   ై   ొ   ో   ౌ  ం   ః

పితౄణము వంటి పదముల ముద్రణకు దీర్ఘ ృ ను చేర్చుకోవాలి . నా ఐ పాడ్ లో ప్రస్తుతము దీర్ఘ ృ లేదు.

వీనిలో ఌ ౡ లో వాడుకలో లేక ఇప్పటికే తొలగించబడి పుస్తకాలలో భద్రాక్షరాలుగా ఉన్నాయి. 

ఇపుడు కొందఱు ఋ బదులు రు ని ఱ బదులు ర ను వాడుకుంటే రెండక్షరాలు తగ్గుతాయంటారు. 

 ౠ ౠ లు అచ్చులు.  ఱ ద్రావిడ భాషా పదాల ప్రత్యేకతను సూచిస్తుంది. ర , ఱ ఉచ్చారణలు వేఱు. 
అందుచే వాటిని తొలగించకపోవుటే మేలు.

( సంపూర్ణ అక్షరమాలను ఆడుతూ , పాడుతూ   నేర్చుకొనుటకు చిన్నతనములో నాకు నెల దినములు  కంటె తక్కువే  పట్టింది. మా పిల్లలకు వారాంతములలో నేర్పడానికి ఆరు వారములు పట్టింది. అందువలన అది శ్రమగా పరిగణించను. )

అక్షరాలు నిజంగా తగ్గించుకొందామనుకుంటే నా సూచనలు.

1). హల్లులకు గుణింతాల వలె ’ అ ‘ కు గుణింతపు సంజ్ఞలు

 ా ి ీ ు ూ ృ , దీర్ఘ ృ , ె ే ై ొ ో ౌ లను 

చేర్చుకుంటే   ఆ ఇ ఈ ఉ ఊ ఋ  ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ   13 అక్షరాలు తగ్గుతాయి.


2) క  గ  జ  ట  త  లకు  ఛ   ఢ  ధ  ఫ  భ  ల వలె   వత్తులు గాని క్రింద చుక్కలు గాని తగిలించుకుంటే 

వత్తు అక్షరాలు  ఖ   ఘ   ఝ   ఠ   థ     లు 5 అక్షరాలు తగ్గిపోతాయి.


  పై సూచనల వలన 18 అక్షరములు తగ్గుతాయి.  కాని పాత అక్షరమాలలో మార్పులు చాలా మందికి 

ఆమోదయోగ్యము కాకపోవచ్చును. దంత్య చ ఛ జ  లు తొలగించుటే కొందఱికి కష్టముగా నున్నది.

ఱ శ లు తొలగించుట అందఱికీ  ఆమోదము కాదు.

ఆ  ఇ  ఈ  ఉ  ఊ  ఋ  ౠ  ఎ  ఏ  ఐ  ఒ ఓ ఔ   లను 

అా  అి  అీ  అు  అూ  అృ  అె  అే  అై  అొ  అో  అౌ లుగా  చదువుకొనుటకు అందఱూ ఇష్టపడక 

పోవచ్చును. 

కాని సాంకేతికాభివృద్ధి వలన పుస్తకాల ముద్రణ ఎలక్ట్రానిక్ గాను, గణన యంత్రముల ద్వారా జరుగుతుండడము వలన ముద్రణలోను , తప్పులు సవరించడములోను చాలా సౌకర్యాలు ఏర్పడినాయి. 

అక్షరాలు తగ్గించడములో నా సూచనలను ముద్రణ మీటలకే పరిమితము చేసుకొని ముద్రించిన లిపిలో మార్పు లేకుండా చేసుకోవచ్చును.

 అ కు గుణింతపు సంజ్ఞలు

 ా     ి     ీ     ు     ూ,   ృ,    దీర్ఘ ృ ,   ె     ే     ై     ొ     ో     ౌ  లను  చేర్చి

ఆ   ఇ   ఈ   ఉ  ఊ   ఋ    ౠ   ఎ   ఏ   ఐ   ఒ   ఓ   ఔ  లు ముద్రణ జరుగునట్లు సాంకేతిక మార్పులు చేసుకుంటే  

ముద్రణ లిపి మారకుండానే 13  మీటల తావులు ( స్థలాలు ) కలసివస్తాయి.

వత్తు సంజ్ఞకు (హ్)    మార్పు మీట-  ( modifier key  ) సమకూర్చుకొని,    క   గ   చ  జ  ట  డ  త  ద  ప  బ  అక్షరములకు ( హ్) మార్పు మీటను జతపఱచుకొని  ఖ  ఘ  ఛ  ఝ  ఠ  ఢ  థ  ధ  ఫ  భ  లు ముద్రణ అయే సౌకర్యమును సమకూర్చుకుంటే (హ్) మార్పు మీట పోను  9  మీటల తావులు  ( spaces ) కలసి వస్తాయి.

ఇప్పుడు గణనయంత్రాలలో ద్విత్వాక్షరాలను, సంయుక్తాక్షరాలను హల్లుకు పొల్లు మీట    ్   ను జతపఱచుకొని ఆపై క్రింద వ్రాయవలసిన అక్షరమును చేర్చుతున్నాము. గణనయంత్రాలలో సంయుక్తాక్షరముల చిహ్నాలకు  మీటలు లేవు. ఖ ఘ ఛ ఝ థ ధ ఫ భ మ అక్షరాలకు కూడా అటువంటి సౌఖ్యమును ఏర్పఱచుకోవచ్చును.

న  మీటకు మార్పు మీటను ( modifier key ) జత పఱచుకొని   ణ  ను 

ర  మీటకు మార్పు మీట జతపఱచుకొని     ఱ   ను  , 

ల  మీటకు  మార్పు మీట జతపఱచి   ళ   ను 

స  మీటకు మార్పు మీట జతపఱచి  ష   ను  ముద్రించుకుంటే  మరో  4  మీటల తావులు కలసి వస్తాయి.

ం  కు మార్పు మీట కలిపి  ః  ను ముద్రించుకుంటే  మరో మీట తగ్గుతుంది.

పై సూచనల వలన తెలుగులిపి ముద్రణలో  27  మీటల తావులు ( spaces ) తగ్గించుకుంటూనే
ముద్రించిన లిపిని యథాతథముగా ఉంచుకొనే అవకాశ మున్నది.


హిందీ లిపిలో అ గుణింతముతో అచ్చులన్నీ వ్రాసుకొనే వెసులుబాటు కల్పించుకుంటే

अ।   आ   अि ( इ )   अी   ( ई )   अु ( उ )   अू ( ऊ)    अृ ( ऋ )   अे (ए )  अै  ( ऐ )   अो   औ

అచ్చులలో 7 మీటల తావులు కలసివస్తాయి.

మార్పు అక్షర మీట ( ह्) జతపఱచి    क  ग  च  ज  ट  ड  त  द  प  ब   स   न  లను

                                          ख  घ  छ  झ  ठ  ढ  थ  ध  फ  भ  श  ण  లుగా  ముద్రించుకొనే 

వెసులుబాటు కల్పించుకుంటే  మార్పు మీట పోతే 11 మీటల తావులు మిగులుతాయి. 

क + ष। = क्ष  చేసుకుంటే మరో మీట మిగులుతుంది

మొత్తము 19 మీటల తావులను మిగుల్చుకొనవచ్చును.

  కన్నడభాషలో తెలుగు సూచనలనే అనుసరించు కొనవచ్చును. మిగిలిన భారతీయ భాషల లిపులలో కూడా యీ సూచనలను అనుసరించుకొని ముద్రణ మీటలను తగ్గించుకొనవచ్చును.

కన్నడ తెలుగు లిపులను కలుపుకొని రెండుభాషలకు సామాన్యలిపిని సమకూర్చుకొనాలనే ఆలోచన తరతరాలుగా ఉన్నది

 భారతీయ భాషలన్నిటికీ దేవనాగరలిపిని వాడుకుంటే దేశమంతటా ఒకే లిపి ఉంటుంది. కాని యీ సూచన దక్షిణరాష్ట్ర ప్రజలకు , ఆయా భాషాభిమానులకు ఆమోదయోగ్యము కాకపోవచ్చును. అలా అయే పక్షములో తరతరాల క్రితమే భారతీయభాష లన్నిటికీ  ఒకే ఒక లిపి ఉండి ఉండేది. సాంకేతికాభివృద్ధి వలన లిప్యంతరి వంటి ఉపయుక్తములు అందుబాటులో ఉండడము వలన లిపులను వేఱు భాషలలోనికి మార్చుకొనుట , అనువాదములు చేసుకొనుట సులభతరము అయ్యాయి.

  తెలుగుభాషకు రోమన్ లిపిని కొందఱు పెద్దలు సూచించారు. శ్రీ శ్రీ కూడా సూచించారు. నా ఉద్దేశములో అది అనువు కాదు. ట ఠ త థ డ ఢ ద ధ ప ఫ వంటి అక్షరాలకు ఇబ్బంది. తెంగ్లీషు చదవడానికి చాలా యిబ్బందిగా ఉంటుంది. దీర్ఘాక్షరాలు , హ్రస్వాక్షరాలు గుర్తించడములో చాలామందికి  యిబ్బంది ఉంది.
పదజాలము :

       ఏ భాషైనా మార్పులు చెందుతూ కొత్త పదాలు చేరుతాయి. మాండలిక వైవిధ్యము వలన చాలా పదాలు ఉంటాయి. పాత సాహిత్యములోనున్న పదాలు అంత త్వరగా పోవు. పోవలసిన అవసరము లేదు. నిత్యము వాడని పదాలకు నిఘంటువుల సాయము సాంకేతిక అభివృద్ధి వలన సులువుగా లభ్యమయింది.

కఠినపదాలు కఠినసాహిత్యములు ఎవరి పైనా ఎవరూ బలవంతముగా రుద్దలేరు. ఇష్టపడిన వారే చదువుకుంటారు.
మాండలికాలు అన్యభాషాపదాలు కూడా అంతే. పదజాలమును ఎవరూ నియంత్రించ లేరు.

వ్యాకరణము :

    వ్యావహారిక భాషకైనా వ్రాత భాషకు కనీసపు వ్యాకరణము అవసరమే. కర్త , కర్మ , క్రియలు, లింగ వచన, కాల , భేదములు , పదాలను సరిగ్గా వ్రాయడము, రాని సంధులను చేర్చకపోవడము వంటి కనీసపు నియమాలను పాటించాలి.

  కాని శిష్టవ్యావహారికపు భాషలో సంధులు వాడకపోవడము మంచిది. సంధులు వాడితే తెలియని పదములకు నిఘంటువులలో అర్థాలు చూసుకోవడము కష్టము.

మఱి గ్రాంథిక భాష , ఛందోబద్ధకవిత్వము ఉండకూడదనే అభిప్రాయము కూడదు. ఏ భాషైనా వేఱు వేఱు అంతస్థులలో ఉంటుంది. ఆంగ్లభాషా నైపుణ్యము కూడా అందఱికీ ఒకేలా ఉండదు. నాకు తెలియని పదాలెవరైనా వాడుతే కావాలంటే నిఘంటువు చూసుకొంటా. లేకపోతే నా కెందుకులే అని పట్టించుకోను. మాండలికాలు , జానపదాలు వలె భాషకు వైవిధ్యముండుట తప్పు కాదు. భాషను నియంత్రించే హక్కు ఎవఱికీ లేదు. కుదఱదు

గ్రాంథికభాషపై అభిలాష ఉన్నవారికి సంధులు, సమాసాల పరిజ్ఞానము అవసరమే, కాని అభిలాష ఉన్నవారు నేర్చుకోవచ్చును. పాఠశాలలలో కొంత పరిచయము చేస్తే సరిపోతుంది

23, నవంబర్ 2019, శనివారం

సూక్ష్మజీవులు కలిగించు కొన్ని చర్మవ్యాధులు ( Some Bacterial skin diseases )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )

                 సూక్ష్మజీవులు కలిగించు కొన్ని చర్మవ్యాధులు

                                ( Some Bacterial Skin diseases )


                                                                         డాక్టరు . గన్నవరపు నరసింహమూర్తి. 


    మనకు  కొన్ని వ్యాధులు యితర జీవరాశుల వలన కలుగుతాయి. వీనిలో సూక్ష్మాంగ జీవులు
( bacteria ) శరీరముపై దాడిచేసి కొన్ని వ్యాధులకు కారణము అవుతాయి. సూక్ష్మజీవులు ఏకకణ జీవులు. వీటికి కణ కవచము ( cell wall ), కణ వేష్టనము ( cell membrane ) ఉన్నా, పొరలలో అమరిన న్యూక్లియస్లు, మైటోఖాండ్రియాలు ఉండవు. సూక్ష్మజీవులను గ్రామ్స్ వర్ణకము ( Gram’s stain ) చేర్చి సూక్ష్మదర్శిని క్రింద చూసి అవి గ్రహించు వర్ణకముల బట్టి గ్రామ్ పోజిటివ్, గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులుగా విభజిస్తారు. గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు ఊదా రంగులో ఉంటాయి. గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులు గులాబి రంగులో ఉంటాయి. ఆకారమును బట్టి వీనిని గోళములు ( cocci ), కోలలు ( rods ), సర్పిలములుగా ( spirals ) వర్ణిస్తారు. చాలా సూక్ష్మజీవులు మన శరీరముపైన, శరీరము లోపల హాని కలిగించకుండా జీవిస్తున్నా, కొన్ని  అవకాశము చిక్కినపుడు శరీర అవయవములు, కణజాలముల లోనికి ప్రవేశించి వ్యాధులు కలిగిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు కలుషిత ఆహారము, కలుషిత పానీయములు, లేక కలుషిత వాయువు ద్వారా శరీరములోనికి చొచ్చుకొని వ్యాధులకు కారణము అవుతాయి.

    గ్రామ్ పోజిటివ్ గోళ సూక్ష్మజీవులలో ష్టాఫిలోకోక్సై ( staphylococci ) గుంపులుగా రెండు, నాలుగు లేక అధిక సంఖ్యలో గుమికూడి సూక్ష్మదర్శిని క్రింద ద్రాక్ష గుత్తుల వలె కనిపిస్తాయి. ఇవి విరివిగా చర్మముపైన, శ్వాస పథములోను నివసిస్తాయి.

    ష్ట్రెప్టోకోక్సై కూడా గోళాకారపు గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు. ఇవి వరుసలలో గొలుసుల వలె ఉంటాయి. కొన్ని జాతుల ష్ట్రెప్టోకోక్సై చర్మముపైన, శ్వాస పథములోన, ప్రేవులలోన హాని కలిగించక ఉంటాయి. కొన్ని అవకాశము చిక్కినపుడు వ్యాధులకు కారణము అవుతాయి. శరీర కణజాలముపై ఇవి దాడి చేసినపుడు వీటి నుంచి పుట్టే  జీవ విషములు ( toxins ) వ్యాధులను కలుగజేస్తాయి.

    చర్మము, చర్మాంతర కణజాలములలో ( subcutaneous tissue ) సూక్ష్మజీవులు కలిగించు కొన్ని సామాన్య వ్యాధుల గురించి చెప్పుకుందాము.


అంటుపెచ్చులు ( Impetigo ) : కోపవ్రణములు ( Ecthyma ) 



   ష్టాఫిలోకోక్సై వలన కాని ష్ట్రెప్టోకోక్సై వలన కాని ఈ చర్మవ్యాధులు కలుగుతాయి. ఇవి చర్మము మీద వ్యాపించే వ్యాధులు.


 అంటుపెచ్చులు ( Impetigo ) 




    ఈ వ్యాధిలో చర్మము మీద  నీటి పొక్కులు ( vesicles ), చీము పొక్కులు ( pustules ) ఏర్పడుతాయి.  ఇవి చిట్లినపుడు చర్మముపై తేనె రంగులో పెచ్చులు ఏర్పడుతాయి. కొందఱిలో నీటి పొక్కులు పెద్దవయి బొబ్బలు ( bullae ) ఏర్పడుతాయి, బొబ్బలు పగిలినపుడు తేనెరంగులో పెచ్చుకడుతుంది.

 కోప వ్రణములు ( Ecthyma ) 

    ఈ వ్యాధిలో చిన్న చిన్న  చీము కారే పుళ్ళు బాహ్యచర్మములో  ఏర్పడుతాయి. వాటిపై నల్లని పెచ్చులు ఏర్పడి,  చుట్టూ ఎఱుపు కట్టి ఉంటాయి. వీటి వలన నొప్పి, దుఱద, ఇబ్బంది కలుగుతాయి. కారిన రసి వలన వ్యాధి పరిసర ప్రాంతములకు, ఇతర ప్రాంతములకు వ్యాప్తి చెందుతుంది. ఇతరులకు కూడా ఇవి అంటు వ్యాధులుగా వ్యాప్తి చెందగలవు.


      ఈ వ్యాధులు ఎవరికైనా సోకవచ్చును. శరీర శుభ్రత తక్కువగా ఉన్నవారిలోను, ముక్కు , నాసికా కుహరములు ( para nasal sinuses ), శ్వాస పథములలో ఈ సూక్ష్మజీవులను దీర్ఘకాలము వహించే వారిలోను ( దీర్ఘకాల వాహకులు; chronic carriers ) వీటిని ఎక్కువగా చూస్తాము. పిల్లలలో ఒకరి నుంచి మరిఒకరికి ఈ వ్యాధులు వ్యాపించగలవు.



    అనుభవజ్ఞులైన  వైద్యులు వీటిని చూచి వ్యాధి నిర్ణయము చేయగలరు. 20 శాతము మందిలో మిథిసిలిన్ ను ప్రతిఘటించే ష్టాఫిలోకోక్సై  ( Methicillin Resistant Staphylococcus Aureus ) ఈ వ్యాధులను కలిగిస్తాయి. సామాన్య చికిత్సలకు లొంగని ఎడల రసి, చీములతో  సూక్షజీవుల పెంపకము ( culture ) ఔషధ నిర్ణయ ( sensitivity to antibiotics ) పరీక్షలు సలిపి తగిన  ఔషధములను ఉపయోగించి చికిత్సలు  చేయవలెను.

చికిత్సలు 

    అంటు పెచ్చుల వ్యాధి ( Impetigo  ), కోపవ్రణముల ( Ecthyma ) వ్యాధి  కలవారు ఆ యా భాగముల  చర్మమును గోరువెచ్చని మంచినీటితోను, సబ్బుతోను శుభ్రపఱచి సూక్ష్మజీవ నాశక లేపనములను దినమునకు మూడు, నాలుగు పర్యాయములు పూతగా పూయాలి.

    మ్యుపిరోసిన్ ( Mupirocin ), ఒజినాక్ససిన్ ( Ozenoxacin ), ఫ్యుసిడిక్ ఏసిడ్ ( fusidic acid ) లేపనములు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా మ్యుపిరోసిన్ లేపనము  వాడుతారు.

    వ్యాధులు విస్తృతముగా వ్యాపించి ఉన్నపుడు, తీవ్రముగా ఉన్నపుడు నోటి ద్వారా సూక్ష్మజీవ నాశకములను ( antibiotics ) వాడవలసి ఉంటుంది.

    పెనిసిలిన్ ( Penicillin  ) కనుగొనబడిన కొత్తలో చాలా సూక్ష్మజీవులు, స్టాఫిలోకోక్సైలు పెనిసిలిన్ కు లొంగేవి. పెనిసిలిన్ సూక్ష్మజీవుల కణములు విభజన పొందునపుడు కణకుడ్యముల నిర్మాణమునకు అంతరాయము కలిగిస్తాయి. అందువలన సూక్ష్మజీవులు వృద్ధి చెందజాలవు. శరీర రక్షణ వ్యవస్థచే ఉన్న సూక్ష్మజీవులు కబళించబడుతాయి. 

    కొద్ది సంవత్సరములలో పెనిసిలినేజ్ ( Penicillinase ) అనే రసాయనమును ఉత్పత్తి చేసి, పెనిసిలిన్ లోని బీటా లాక్టమ్ చక్రమును ధ్వంసము చేసే, పెనిసిలిన్ కు లొంగని  ష్టాఫిలోకోక్సైలు  విరివిగా వ్యాప్తి చెందాయి. వాటికి విరుగుడుగా శాస్త్రజ్ఞులు పెనిసిలినేజ్ కు ( Penicillinase  / beta lactamase ) విచ్ఛిన్నము కాని పెనిసిలిన్లను  ( penicillinase resistant Penicillins  ) కనుగొన్నారు. వీటిలో మిథిసిలిన్ ( methicillin ) మొదటిది. ఆక్సాసిల్లిన్ ( Oxacillin ), క్లాక్సాసిల్లిన్ ( Cloxacillin ), డైక్లాక్సాసిల్లిన్ లు ( dicloxacillin ) ఈ కోవకు చెందినవి.
         
    కొన్నేళ్ళకు మిథిసిల్లిన్ కు లొంగని ష్టాఫిలోకోక్సై ( Methicillin-Resistant Staphylococcus Aureus  - MRSA ) వృద్ధి పొందాయి. వీటిలో సూక్ష్మ జీవుల కణకుడ్యముల నిర్మాణమునకు తోడ్పడు  ట్రాన్స్ పెప్టైడేజులపై ( meca అనే జన్యువుల వలన ) బీటాలాక్టమ్ ల ప్రభావము ఉండదు. అందువలన బీటాలాక్టమ్ ఏంటిబయాటిక్స్ ల సమక్షములో కూడ MRSA  కణవిభజన జరిగి వృద్ధి  పొందుతాయి. వీటిని ఎదుర్కొనుటకు యితర సూక్ష్మజీవ నాశకములను వాడుతారు.

    సాధారణముగా అంటుపెచ్చుల వ్యాధికి ( Impetigo ), కోప వ్రణములకు ( Ecthyma )  సెఫలెక్సిన్ ( cephalexin ), సెఫడ్రోక్సిల్ ( cefadroxil ), డాక్సీసైక్లిన్ ( Doxycycline ), ఎరిథ్రోమైసిన్ ( erythromycin ), క్లిండామైసిన్ ( Clindamycin ), ట్రైమిథోప్రిమ్ / సల్ఫామిథాక్సజోల్  ( Trimethoprim / Sulfamethoxazole ) వంటి ఔషధములలో ఒకదానిని  ఎంపిక చేసుకొని వాడుతారు.

    మిథిసెలిన్ ను ప్రతిఘటించు ష్టాఫిలోకోక్సైలు ( Methicillin  Resistant Staphylococcus Aureus MRSA ) వ్యాధి కారకములైనచో  డాక్సీసైక్లిన్ కాని,  క్లిండామైసిన్  కాని, ట్రైమిథాప్రిమ్ / సల్ఫామిథాక్సజోల్ కాని ఎంచుకొవాలి. వ్యాధిగ్రస్థుల అసహనములు ( allergies ) కూడా పరిగణన లోనికి తీసుకోవాలి.

    ష్ట్రెప్టోకోక్సై చాలా సూక్ష్మజీవ నాశకములకు లొంగుతాయి.

    చికిత్స చేయనిచో ఈ వ్యాధుల తీవ్రత పెరిగి, రసిగ్రంధులకు ( lymph nodes ) వ్యాధి వ్యాపించవచ్చు. చర్మపు దిగువ కణజాలమునకు సూక్ష్మజీవులు వ్యాపించి కణజాల తాపమునకు ( cellulitis ), చీము తిత్తులకు ( abscesses) దారితీయవచ్చును.
        
    చిన్నపిల్లలలో కొన్ని  ష్రెప్టోకోక్సైల వలన [ nephritogenic strains of group A Strptococci ( types 49, 55, 57, 59)] చర్మవ్యాధులు కలిగితే, వాటి వలన మూత్రాంగముల కేశనాళికా గుచ్ఛములలో తాపము ( post streptococcal glomerulonephritis ) కలిగే అవకాశము ఉంది.

    అసహనము వలన చర్మతాపము ( atopic dermatitis ) కలిగిన వారికి కార్టికోష్టీరాయిడ్ లేపనములతోను ( corticosteroid creams ), శుష్క చర్మవ్యాధి ( Xerosis ) బాధితులకు  ఆర్ద్ర ఔషధములతోను ( moisturizers ) చికిత్సలు చేసి చర్మపు సమగ్రతను ( skin integrity ) పరిరక్షించాలి.


సెగగడ్డ ( Boil ; Furuncle ) : రాచకురుపు ( Carbuncle )


    ష్టాఫిలోకోక్సై ( staphylococci ) వెండ్రుకల మూలములలో ( రోమకూపములలో hair follicles ) వృద్ధి చెంది కణ ధ్వంసము, తాపము కలిగించుట వలన సెగగడ్డలు ( furuncles ) కలుగుతాయి. ఇవి తొలుత ఎఱ్ఱని గడ్డలుగా పొడచూపి పిదప చీము తిత్తులుగా ( abscesses ) మారుతాయి. ఇవి చర్మములో ఎచ్చటైనా రావచ్చును కాని సాధారణముగా ముఖము, మెడ, పిరుదులు, రొమ్ములు పైన కలుగుతాయి. సెగగడ్డలు పెరుగుతున్న కొలది నొప్పి, సలుపు పెరుగుతాయి. ఇవి పగిలినపుడు చీము, రక్తము స్రవిస్తాయి.

    సెగగడ్డలు గుంపులుగా ఒకచోట ఏర్పడి, తాప ప్రక్రియ ( inflammation ) చర్మమునకు, చర్మాంతర కణజాలమునకు ( subcutaneous tissue ) వ్యాపించి అచట చీము తిత్తులు ( abscesses ) ఏర్పడుట వలన రాచకురుపులు ( Carbuncles ) ఏర్పడుతాయి. రాచకురుపులులో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉంటుంది. వీరిలో నొప్పి , వాపులతో పాటు, జ్వరము, నీరసము కూడా కలుగుతాయి. రాచకురుపులు పైమెడ వెనుక భాగములో ( nape of the neck ) ఎక్కువగా చూస్తాము. రాచకురుపులు కలిగిన వారు మధుమేహ వ్యాధిగ్రస్థులైనచో మధుమేహ తీవ్రత కూడా పెరుగుతుంది.



    సెగగడ్డలు పిల్లలు, యువకులలో కలిగినా, ఎక్కువగా శరీర రక్షణ వ్యవస్థ సన్నగిల్లిన వారిలోను, వృద్ధులలోను, స్థూలకాయులలోను, తెల్లకణముల వ్యాధులు కలవారిలోను, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను, దీర్ఘకాలముగా చర్మము, నాసికా పుటములలో ష్టాఫిలోకోక్సై స్థిరవాసము ఏర్పఱుచుకొన్న  వారిలోను ( colonization ) కలుగుతాయి. వేసవిలో చెమట ఎక్కువైనపుడు, రోమ కూపములు పూడుకొన్నపుడు సెగగడ్డలు ఎక్కువగా చూస్తాము.

    రాచకురుపులు శరీర రక్షణవ్యవస్థ సన్నగిల్లిన వారిలోను, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను ఎక్కువగా పొడచూపుతాయి.

     సెగగడ్డలను సామాన్య ప్రజలు కూడా చూచి పోల్చగలరు. చూచి, పరీక్షించుట వలన రాచకురుపులను వైద్యులు కనిపెట్టగలరు. చీమును సూక్ష్మజీవుల పెంపకము, ఔషధ నిర్ణయ పరీక్షలకు ( culture and sensitivity ) గ్రహించాలి.

చికిత్స 

       సెగగడ్డలను శుభ్రపఱచి కాపడము పెడితే కొంత ఉపశమనము కలుగుతుంది. చీముతిత్తులను  శస్త్రచికిత్సతో కోసి చీమును తొలగించాలి.
    
    రాచకురుపులు కలవారిలో  చీముతిత్తులను ( abscesses  ) శస్త్రచికిత్సతో కోసి చీమును తొలగించాలి. వ్యాధి తగ్గక మునుపు గాయము పూడిపోకుండా ఉండుటకై చీముతిత్తుల గాయములలో జీవరహితపు ( sterile )  గాజుపట్టీ ( gauze ribbon ) ఇమిడ్చి కట్లు కట్టాలి. చీము గాయములు లోనుంచి మానాలి. పుండు మానేవఱకు ప్రతిదినము గాయమును శుభ్రపఱచి కట్టు మార్చాలి.

    5 మి.మీ పరిమాణము కంటె తక్కువ పరిమాణపు సెగగడ్డలకు ఔషధముల అవసరము ఉండదు. సెగగడ్డల పరిమాణము 5 మి.మీ కంటె హెచ్చుగా ఉన్నవారికి, దేహ రక్షణ వ్యవస్థ లోపములు ( compromised immune system ) ఉన్నవారికి, కణజాల తాపము ( cellulitis ) వ్యాపించి ఉన్నవారికి, రాచకురుపులకు సూక్ష్మజీవ నాశకములు ( antibiotics ) అవసరము. మిథిసిలిన్ ను ప్రతిఘటించు  ష్టాఫిలోకోకస్ ఆరియస్ కు ( Methicillin Resistant Staphylococcus Aureus -MRSA ) తగిన ఔషధములు వాడుట మంచిది .

    ట్రైమిథోప్రిమ్ / సల్ఫామిథోక్సజోల్ ( Trimethoprim / Sulfamethoxazole ), క్లిండామైసిన్ ( Clindamycin ), డాక్సీసైక్లిన్ ( Doxycycline ), లినిజోలిడ్ ( Linezolid ) మందులు నోటి ద్వారా ఇచ్చుటకు అందుబాటులో ఉన్నాయి.

    సిరల ద్వారా ఇచ్చుటకు  డాక్సీసైక్లిన్ ( Doxycycline ), క్లిండామైసిన్ ( Clindamycin ), వేంకోమైసిన్ ( Vancomycin  ), లినిజోలిడ్ ( Linezolid ), డాప్టోమైసిన్ ( Daptomycin ), టెలవాన్సిన్ ( Telavancin ) మందులు లభ్యము. వ్యాధి తీవ్రముగా ఉన్నపుడు, కణజాల తాపము ( cellulitis ) విస్తృతముగా ఉన్నపుడు, జ్వరము ఉన్నవారికి  యీ మందులు సిరల ద్వారా వాడుట మేలు.

    మఱల, మఱల సెగగడ్డలు వచ్చేవారు క్లోర్ హెక్సిడిల్ సబ్బులు వాడి చర్మము శుభ్రపఱచుకోవాలి. రెండు ముక్కు పుటములలో మ్యుపిరోసిన్ ( mupirocin ) లేపనమును దినమునకు రెండు మూడు పర్యాయములు అద్దుకొవాలి. అలా చేయుట వలన ముక్కు పుటములలో వసించు సూక్ష్మజీవులు నిర్మూలించబడతాయి.  ఒకటి, రెండు నెలలు సూక్ష్మజీవ నాశక ఔషధములను వాడవలసిన అవసరము రావచ్చును.

    మధుమేహము, స్థూలకాయము వంటి రుగ్మతలను కూడా అదుపులో పెట్టుకోవాలి.


పదజాలము :

Antibiotics = సూక్ష్మజీవ నాశకములు 
Atopic dermatitis =  అసహన చర్మతాపము 
Bacteria  = సూక్ష్మాంగజీవులు
Bullae = బొబ్బలు 
Carbuncle = రాచకురుపు
Cell membrane = కణ వేష్టనము ( గ.న ) ; కణ పటలము
Cell wall = కణ కవచము 
Chronic carriers = దీర్ఘకాల వాహకులు ( గ.న )
Ecthyma  = కోప వ్రణములు ( గ.న )
Furuncle = సెగగడ్డ
Glomerulonephritis = కేశనాళికాగుచ్ఛ ( మూత్రాంగ ) తాపము ( గ.న )
Hair follicles = రోమ కూపములు
Impetigo = అంటు పెచ్చులు ( గ.న )
Moisturizers = ఆర్ద్ర ఔషధములు ( గ.న )
Para nasal sinuses = నాసికా కుహరములు ( గ.న )
Pustules = చీము పొక్కులు ( గ.న )
Subcutaneous tissue = చర్మాంతర కణజాలము ; అధః చర్మకణజాలము ( గ.న )
Vesicles = నీటి పొక్కులు 
Xerosis = శుష్క వ్యాధి ( గ.న ) 

( వైద్యవిషయములు తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. ఉపయుక్తము అనుకుంటే నా వ్యాసములను నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...