4, జులై 2023, మంగళవారం

అన్ననాళంలో అతుకు మచ్చ (Esophageal Inlet patch)

 


అన్ననాళంలోనికి జీర్ణాశయం నుండి ఆమ్లం తిరోగమించి తాపం కలిగించడం వైద్యులు తఱచు చూస్తారు. అంతర్దర్శినితో పరీక్షించినపుడు ఈ తాప లక్షణాలు సాధారణంగా అన్ననాళం క్రింద భాగంలో కనిపిస్తాయి. వీటికి విరుద్ధంగా కొందఱిలో అన్ననాళం తొలిభాగంలో మచ్చలు అతికించినట్లు కనిపిస్తాయి. ఈ అతుకు మచ్చలు అన్నవాహిక కణజాలానికి బదులు జీర్ణాశయ కణజాలం కలిగి ఉంటాయి. చాల అరుదుగా వీటి వలన లక్షణాలు కాని ఉపద్రవాలు కాని కలుగుతాయి. 

అన్ననాళ ద్వారంలో అతుకు మచ్చ (Esophageal Inlet patch)

 

సుమారు 1-12 శాతము మందిలో అన్ననాళపు తొలి భాగంలో లోపొరలో ఎఱ్ఱని ముకమలు వలె అతుకు పెట్టినట్లు కనిపించే మచ్చలు (ఇన్ లెట్ పాచెస్) ఉంటాయి. వీటి వలన చాలా మందిలో ఏ లక్షణాలు కాని ఇబ్బందులు కాని ఉండవు. ఇతర కారణాల వలన అంతర్దర్శిని పరీక్ష (ఎండోస్కొపీ) చేసినపుడు ఇవి కనిపిస్తాయి. వీటితో బాటు కొందఱిలో అన్ననాళములో పలుచని పొరల కవాటాలు ఉండవచ్చు.


                                               అన్ననాళంలో అతుకు మచ్చ

కారణాలు 


గర్భంలో పిండం వృద్ధి చెందుచున్నప్పుడు కంఠభాగంలో ఉండే జీర్ణాశయపు శ్లేష్మపుపొరలో కొన్ని భాగాలు  అన్ననాళంలో అవశేషాలుగా మిగిలిపోయి పరస్థానం చెందడం వలన ఈ అతుకు మచ్చలు పుట్టుకతో ఉండవచ్చు. కొందఱిలో జీర్ణాశయంలోని ఆమ్లము తిరోగమనం చెందడం వలన అన్ననాళపు శ్లేష్మపు పొర కణజాలం మార్పు చెందడం వలన ఈ అతుకు మచ్చలు కలుగవచ్చు.


లక్షణాలు


పెద్దశాతం మందిలో ఈ మచ్చల వలన ఏ లక్షణాలు ఉండవు. ఏ ఇబ్బంది ఉండదు. ఏ ఉపద్రవాలు కలుగవు. చాలా అరుదుగా కొందఱిలో గొంతుకలో అడ్డున్నట్లు, నిండుతనము కలుగవచ్చు. కొందఱిలో మింగుటలో ఇబ్బంది కలుగవచ్చు. దగ్గు రావచ్చును. చాలా అరుదుగా ఈ అతుకు మచ్చలలో కర్కటవ్రణాలు (కేన్సర్లు) కలిగే అవకాశం ఉంది.

 

వ్యాధి నిర్ణయం


 అంతర్దర్శినితో


ఇతర లక్షణాలకు అంతర్దర్శిని (ఎండోస్కొపీ) పరీక్ష చేసినపుడు అన్ననాళంలో ఎఱ్ఱని ముకములులా కనిపించే మచ్చ అతుకు పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ అతుకుమచ్చ భాగం నుంచి చిన్నముక్కలు సేకరించి కణపరీక్షకు పంపవచ్చు. కణపరీక్షలో పొలుసుల అన్ననాళ కణములకు బదులు స్తంభాకారపు జీర్ణాశయ కణములు కనిపిస్తాయి. జఠర మూలంలో వలె వీటిలో శ్లేష్మం స్రవించు గ్రంథులుండవచ్చు, లేక జీర్ణాశయపు మధ్యభాగంలో వలె ఆమ్లము స్రవించే గ్రంథులుండవచ్చు.


బేరియం ఎక్స్ రే పరీక్షతో


వీరిచే బేరియం మ్రింగించి ఎక్స్- రే చిత్రం తీసినపుడు అన్ననాళంలో నొక్కులు కనిపించవచ్చు. ఆ నొక్కులు కనిపించినపుడు అంతర్దర్శిని పరీక్ష, కణపరీక్షలతో అతుకు మచ్చలు నిర్ధారించవచ్చును.

 

చికిత్స


పెక్కుశాతం మందిలో ఈ అతుకు మచ్చలకు చికిత్స అనవసరం. ఈ మచ్చలలో ఆమ్లము స్రవించే గ్రంథులుండి గుండె మంట, మింగుటలో ఇబ్బంది ఉంటే ఒమిప్రజాల్ వంటి ప్రోటాన్ యంత్ర అవరోధకాలు వాడవచ్చు. అన్ననాళంలో సంకోచాలు ఉన్నా, పొరలు ఉన్నా వ్యాకోచ చికిత్సలు చెయ్యాలి.


శ్లేష్మగ్రంథులు ఉండి గొంతుకలో అడ్డుపడినట్లు, నిండుతనం ఉన్నవారిలో విద్యుద్దహన చికిత్సతో కాని, ఆర్గాన్ వాయువుతో నిర్మూలన చికిత్సతో కాని, రేడియో తరంగాలతో కాని ఈ అతుకు మచ్చలను తొలగించవచ్చు

 

 

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...