15, మార్చి 2022, మంగళవారం

నిద్రలో అవరోధ శ్వాసభంగములు ( Obstructive Sleep Apnea )

 ( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )

నిద్రలో అవరోధ శ్వాసభంగములు 

( Obstructive Sleep Apnea)

డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి

నిద్రపోతున్నపుడు కొందఱిలో ఎగువ శ్వాసపథము ( ఊర్థ్వ శ్వాసపథము ) అణగిపోయి శ్వాసకు అవరోధము కలుగుట వలన శ్వాస ప్రయత్నములు జరిగినా మధ్యమధ్యలో కొన్నిసారులు ఊపిరి పూర్తిగా ఆగిపోయి శ్వాసభంగములు ( apneas ), కొన్నిసారులు శ్వాస పరిమాణము తక్కువై అల్పశ్వాసలు (hypopneas ) కలుగవచ్చు. కొన్ని సారులు ఊపిరి తీసుకొనుట శ్రమతో కూడుకున్నదై నిద్ర చెదిరి మెలకువలు రావచ్చును. ఈ శ్వాససంక్షోభాలు వయోజనులలో సుమారు 4 శాతము మందికి కలుగుతాయి. ఇవి పురుషులలో స్త్రీల కంటె రెట్టింపు సంఖ్యలో కలుగుతాయి. ఈ వ్యాధి కలవారిలో పగటిపూట నిద్రమత్తు ఎక్కువగా ఉంటుంది.
గొంతులో మృదుకణజాలము ( soft tissue ) పెరుగుట వలన, లేక నిర్మాణాత్మకమైన కారణముల వలన, గళవ్యాకోచ కండరముల బిగుతు తగ్గుట వలన శ్వాసమార్గము సన్నబడుట, లేక పూర్తిగా అణగిపోవుట వలన ఊపిరికి అడ్డంకి కలిగి ఈ సంక్షోభాలు కలుగుతాయి. స్థూలకాయము కలవారిలోను, నాసికామార్గములో అవరోధముల వలన, నాసికాగళములో ( nasopharynx ) రసికణజాలములు ( adenoids ) పెద్దవగుట వలన, గొంతులో రసికణ గుళికల ( tonsils ) పెరుగుదల వలన, మృదుతాలువు, కొండనాలుకలు బాగా క్రిందకు దిగుట వలన, నాలుక మందము పెరుగుట వలన, క్రింది దవుడ పరిమాణము స్థానములలో మార్పుల వలన, పొగత్రాగుట వలన, కుటుంబపరముగా శ్వాసావరోధములు కలుగుట వలన ఈ సంక్షోభములు కలుగుతాయి. ఎక్కువ బరువు / స్థూలకాయములు నిద్రలో శ్వాసావరోధములు కలుగుటకు ముఖ్యకారణము.

కేంద్ర నాడీమండల శ్వాసభంగములు ( Central apneas ) 


కేంద్రనాడీమండలములో శ్వాసకేంద్రముపై, మాదకద్రవ్యములు, సారాయి, వ్యాధులు, గాయముల ప్రభావము వలన లేక ఏ కారణము లేకుండానే నిద్రలో శ్వాసభంగములు కలుగవచ్చును. కేంద్ర శ్వాసభంగములలో శ్వాసప్రయత్నములు జరుగవు. అవరోధ శ్వాసభంగములలో శ్వాస ప్రయత్నములు జరుగుతాయి.

ఇతర రుగ్మతలు , ఉపద్రవములు

నిద్రలో అవరోధ శ్వాసభంగములు కలవారిలో అధిక రక్తపుపోటు, హృదయవైఫల్యము ( congestive heart failure ), హృదయలయలో మార్పులు, గుండెపోటులు, మస్తిష్కవిఘాతాల ( Cerebrovascular accidents ) వలన పక్షవాతములు, రక్తములో ప్రాణవాయువు సంతృప్తత ( oxygen saturation ) తగ్గుట, బొగ్గుపులుసు వాయువు ప్రమాణములు పెరుగుట, పుపుసధమనులలో రక్తపుపోటు పెరుగుట ( pulmonary hypertension ), దీర్ఘకాల శ్వాసవైఫల్యములు ( chronic respiratory failure ) కలుగగలవు. వీరిలో మధుమేహవ్యాధి ఎక్కువగా ఉంటుంది. వీరు వాహనములు నడిపేటపుడు ప్రమాదాలకు గురి అయే అవకాశము హెచ్చు. సామాన్యజనులలో కంటె వీరిలో మరణములు కలిగే అవకాశము హెచ్చు.
వీరిలో శస్త్రచికిత్స అనుబంధ మరణములు హెచ్చుగా ఉంటాయి. మత్తుమందు ఇచ్చుటకు శ్వాసనాళములో కృత్రిమనాళము అమర్చేటపుడు ఇబ్బందులు, నిద్రమందులు / మత్తుమందుల నుంచి కోలుకొనుటలో ఇబ్బందులు దీనికి కారణము.

లక్షణములు

నిద్రపోతున్నపుడు గట్టిగా గురకలు పెట్టడం, నిద్రలో ఉక్కిరిబిక్కిరి అవడం, ఊపిరి ఆడక తఱచు మేలుకొనడం, పగటిపూట నిద్రమత్తు కలిగిఉండడం, పనులలో నిమగ్నత చూపించలేకపోవడం, వాహనములు నడిపేటపుడు నిద్రలోనికి జారుకొనడం వీరిలో కనిపించే ప్రధాన లక్షణములు. వ్యక్తిత్వములో మార్పులు, మేధక్షీణత, ఉదయము పూట తలనొప్పి, దీర్ఝకాలపు అలసట, రాత్రుళ్ళలో గుండెనొప్పులు, లైంగికవాంఛ తగ్గుట వీరిలో కలిగే ఇతర లక్షణాలు.
వైద్యులు రోగిని పరీక్షించునపుడు ముక్కు, నోరులలో అవరోధములకు శోధిస్తారు. ముక్కులో మధ్య గోడ ఒక పక్కకు ఒరిగి ఉండుట ( septal deviation ), నాసికాశుక్తులు ( nasal turbinates ) పెద్దవై ఉండడం, ముక్కు శ్లేష్మపు పొరలో వాపు, సాంద్రత హెచ్చుగా ఉండడం, నాలుక మందముగా ఉండడం, గొంతుకలో రసికణ గుళికలు ( tonsils ) పెద్దవై ఉండడం, మృదుతాలువు ( soft palate ), కొండనాలుకలు బాగా క్రిందకు ఉండడం, నోరు ఇరుకుగా ఉండడం, కనుగొనగలరు. కొందఱిలో తాలువు ( palate ) బాగా క్రిందగా ఉండి నోరు ఇరుకై కొండనాలుక, మృదుతాలువు నుంచి నాలుకకు, గొంతుకు దిగే తెరలు, గొంతు వెనుకభాగము నోరు తెఱచినపుడు కనిపించకపోవచ్చును. వీరి మెడ చుట్టుకొలత హెచ్చుగా ఉండవచ్చు.

పరీక్షలు

బహుళాంశ నిద్ర పరీక్ష ( polysomnogram ) : ఈ పరీక్షలో వీరు నిద్రిస్తున్నపుడు రాత్రి అంతా విద్యుత్ మస్తిష్క లేఖనము ( electroencephalogram ), నిద్రాసమయము, నిద్రలో కలిగే శ్వాస అంతరాయములు ( apneas ), అల్పశ్వాసలు ( hypopnoea ), శ్వాస ప్రయత్నము వలన కలిగే మెలకువలు నమోదు చేస్తారు. శ్వాసభంగ / అల్పశ్వాసల సూచిక ( Apnea / Hypopnoea Index, AHI ) గంటకు 5 మించుతే నిద్రావరోధ శ్వాసభంగ వ్యాధిని ధ్రువీకరించవచ్చును. వీరిలో AHI, పగటిపూటల మత్తు, అధిక రక్తపుపోటు, హృదయవైఫల్యము, పక్షవాతము వంటి ఉపద్రవముల బట్టి వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తారు.

ఇతర పరీక్షలు

రక్తకణ గణనములతో ఎఱ్ఱరక్తకణములు ఎక్కువై అప్రధాన బహుళ రక్తకణత్వము ( secondary polycythemia ) ఉంటే పసిగట్టవచ్చును. గళగ్రంథి స్రావకముల పరీక్షలతో గళగ్రంథి హీనత ( hypothyroidism ) పసిగట్టవచ్చును. ప్రాణవాయువు సంతృప్తతను ( oxygen saturation ) తెలుసుకొని అది తక్కువగా ఉంటే ధమనీ వాయు పరీక్షలు ( arterial blood gases ) చేసి బొగ్గుపులుసు వాయువు పాక్షిక పీడనము ( Pco2 ) 45 మి.మీ పాదరసము మించితే స్థూలకాయ శ్వాసహీనతను ( Obesity hypoventilation syndrome ) రూఢీ పఱచవచ్చు. ఛాతికి x- ray పరీక్ష , విద్యుత్ హృల్లేఖన పరీక్షలతో హృదయవైఫల్యము, ఇతర హృదయవ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు కనుగొనవచ్చును.

చికిత్స

నిద్రలో కలుగు శ్వాసకు అవరోధములు తొలగించి శ్వాసలను సరిచేయుట, రాత్రుళ్ళు నిద్రకు భంగము వాటిల్లకుండా చేయుట, పగళ్ళు నిద్రమత్తు కలుగకుండా చేయుట, ఉపద్రవములను సరిచేయుట చికిత్స లక్ష్యములు.
అవరోధ శ్వాసభంగములకు ప్రత్యేక ఔషధములు లేవు. పగటిపూట నిద్రమత్తు తగ్గించుటకు మొడాఫినిల్ ( Modafinil ) ఉపయోగపడవచ్చును.
గళవ్యాకోచ కండరముల బిగుతు తగ్గించి, శరీర బరువు పెంచే గళగ్రంథి హీనత వంటి వ్యాధులను మందులతో సరిదిద్దాలి.
అవరోధ శ్వాసభంగములు తక్కువ స్థాయిలో ఉన్నపుడు కారణములను సరిదిద్దుటకు ప్రయత్నాలు చేయాలి. వ్యాధిగ్రస్థులు బరువు తగ్గి స్థూలకాయములను తగ్గించుకోవాలి. తినే కాలరీలు తగ్గించుకొని నడక, వ్యాయామము పెంచుకోవాలి. పది శాతము బరువు తగ్గినా ప్రయోజనము చేకూరుతుంది. స్థూలకాయులు బరువు హెచ్చుగా ఉండి ( భారసూచిక / BMI 40 kg / m2 మించిన వారు ) శస్త్రచికిత్సలతోనైనా బరువు తగ్గుట మంచిది.
మత్తు, నిద్ర కలిగించు ఔషధములు, మద్యము పడుక్కొనే ముందు నాలుగు గంటల లోపల సేవించకూడదు. ధూమపానము చేయకూడదు.
నాసికాపథములో సాంద్రత తగ్గించే మందులు ( decongestants ), కార్టికోష్టీరాయిడు జల్లుమందులు ముక్కులో ఊపిరికి అడ్డంకులు తొలగించగలవు. వీరిలో కొందఱికి క్రింది దవుడను, నాలుకను ముందుకు జరిపి గొంతును ( వక్త్రగళము / oropharynx ) ) తెరిచి ఉంచే సాధనములు ఉపయోగపడవచ్చును. ప్రక్కకు తిరిగి పడుక్కొనుట వలన శ్వాసకు అవరోధము తగ్గే అవకాశము కలదు. నిద్రమత్తు గలవారు వాహనములు నడుపరాదు.

నిరంతర శ్వాసపథ సంపీడన సాధనములు (Continuous Positive Airway Pressure devices)

ఈ సాధనములు శ్వాసపథములోనికి నిర్ణీత పీడనముతో నిరంతరము గాలిని పంపి శ్వాసపథమును తెరచి ఉంచుతాయి. నోరు, ముక్కులపై కప్పుతో ( mask ) గాని,లేక ముక్కుపై కప్పు సాధనముతో గాని గాలిని శ్వాసపథములోనికి రోగులకు అనుకూలము అయేటట్లు పంపవచ్చును. శ్వాసకు అడ్డంకులు తొలగించేటట్లు, గుఱకలు లేకుండేటట్లు, రక్తపు ప్రాణవాయువు సంతృప్తత ఆమోదకరముగా ఉండేటట్లు వాయు పీడనమును అంచెలుగా పెంచి సరిదిద్దుతారు. నిరంతరము శ్వాసపథములోనికి గాలిని తగిన పీడనముతో పంపుట వలన శ్వాసక్రియ మెరుగయి రాత్రుళ్ళు నిద్ర బాగాపట్టి పగళ్ళు మత్తు లేకుండా ఉంటుంది. అధిక రక్తపుపోటు, హృదయవైఫల్యము, కాళ్ళపొంగులు, రాత్రులలో అధిక మూత్రవిసర్జన, బహుళ రక్తకణత్వము ( polycythemia ) వంటి ఉపద్రవములు తగ్గుతాయి.
నిరంతర వాయుపీడన సాధనములను శ్రద్ధగా విడువక వాడుటకు కొందఱు ఇష్టపడరు. వీటి ఉపయోగములు బోధించుట వలన, గాలిని వెచ్చపరచి, ఆర్ద్రీకరించుట ( humidify ) వలన, కప్పుసాధనములను సౌకర్యకరముగా చేయుట వలన వాడుకలు పెంచే అవకాశము కలదు.
ప్రసరణ ( flow ), పీడనములను ( pressure ) తగునట్లు వాటంతట అవే సరిదిద్దుకొనే సాధనములు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కువమందికి అవి ఆమోదకరము కావచ్చును.

ద్విస్థాయి శ్వాసపథ సంపీడన సాధనములు ( Bilevel Positive Airway Pressure devices )

నిరంతరవాయుపీడన సాధనములను సహించలేని వారికి, 15- 20 సెం.మీ నీటి పీడనము మించిన పీడనము అవసరమైనవారికి, శ్వాస సరిపోదు అనుకున్నపుడు ఊచ్ఛ్వాస నిశ్వాసములలో వేఱు వేఱు పీడనములతో గాలిని అందించు సాధనములు ఉపయోగకరము.
ఈ సాధనముల వాడుక వలన ముక్కు, నోరు ఎండిపోవుట, ముక్కులో సాంద్రత ( congestion )కలుగుట, ముక్కు కారుట, ముక్కునుంచి రక్తస్రావము కలుగుట వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చు. గాలిని ఆర్ద్రీకరించుట ( humidify ) వలన, ముక్కులో సాంద్రత తగ్గించు మందులు వాడుట వలన, ముక్కులో లవణద్రవము (saline) వాడుట వలన ఈ అవలక్షణములను నివారించవచ్చును.
ప్రాణవాయువు సంతృప్తత తక్కువగా ( 90% కంటె తక్కువ ) ఉన్నవారికి ప్రాణవాయువు ఈ సాధనములతో అందించాలి.

శస్త్రచికిత్సలు

గళ వ్యాకోచ చికిత్స ( Uvulo palato pharyngoplasty ) 


ఈ శస్త్రచికిత్స వక్త్రగళ ( oropharynx ) పరిమాణము తగ్గిన వారిలో, శ్వాసపథ సంపీడన చికిత్సతో ఫలితములు చేకూరనపుడు ఉపయోగపడవచ్చును. ఇందులో కొండనాలుకను, మృదుతాలువులో ( soft palate ) వెనుక భాగమును మృదుతాలువు నుంచి నాలుక, గొంతులకు క్రిందకు దిగు తెరలను, రసిగుళికలను ( tonsils ) తొలగించి వక్త్రగళ ( oropharynx ) పరిమాణమును పెంచుతారు. ఈ శస్త్రచికిత్స చేసిన వారిలో 50 శాతము మందిలో సత్ఫలితాలు కలుగుతాయి. వీరిలో మాటమార్పు , మ్రింగునపుడు ఆహారపదార్థములు ముక్కులోనికి తిరోగమనము చెందుట, నాసికా గళము కుచించుకుపోవుట వంటి అవాంఛిత ఫలితాలు కలుగవచ్చు. సత్ఫలితాలు దీర్ఘకాలము ఉండకపోవచ్చును.

శ్వాసనాళ కృత్రిమ ద్వార చికిత్స ( Tracheostomy ) :

 
ఇతర చికిత్సలతో ఫలితములు చేకూరనపుడు, నిద్రావరోధ శ్వాసభంగము తీవ్రతరమైనపుడు, ప్రాణాపాయ పరిస్థితులు ( శ్వాసరోగ సంబంధ హృదయవైఫల్యము (carpulmonale), హృదయ లయ తప్పుట, శ్వాసవైఫల్యము) ఏర్పడినపుడు శ్వాసనాళములో కృత్రిమద్వారము ఏర్పరచి శ్వాసావరోధములను అధిగమించవచ్చును.
శ్వాసపథములో వాయుసంపీడన చికిత్సలు చాలా మందిలో సత్ఫలితాలు ఇవ్వడం వలన ఈ కృత్రిమద్వార చికిత్సల అవసరము తగ్గిపోయింది.
క్రింది, పై దవుడలను ముందుకు జరుపుట, క్రిందిదవుడలో కొంతభాగము ఛేదించుట, కంఠాస్థి కండర ఛేదనము ( hyoid myotomy ) వంటి శస్త్రచికిత్సలు ప్రయోగపరముగా లభ్యము.

( వైద్యవిషయాలు తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము . వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను సంప్రదించాలి. )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...