30, ఏప్రిల్ 2021, శుక్రవారం

త్రొక్కిసలాట మరణాలు ( Stampede deaths )

                    త్రొక్కిసలాట మరణాలు

                                  ( Stampede deaths )


                                                                                    డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.


   త్రొక్కిసలాట మరణాలు ప్రపంచపు నలుమూలలా జరుగుతూ ఉన్నా అవి ఎక్కువగా మూడవ ప్రపంచపు దేశాలలోనే జరుగుతాయి. అధిక జనాభా, ఎక్కువ మంది గుమికూడుట , ప్రభుత్వాధికారులకు గుంపుల నిర్వహణలలో తగిన శిక్షణ లేకపోవుట ( అందుచే వారికి ఏర్పడే అశక్తత, ఉదాసీనత ), ముందుగా త్రొక్కిసలాటలను నిరోధించుటకు ప్రణాళికలు, ముందు జాగ్రత్తలు లేకపోవుట , ప్రజలలో క్రమశిక్షణారాహిత్యము దీనికి కారణాలు కావచ్చును.

   21 వ శతాబ్దములో  జరిగిన ప్రసిద్ధ త్రొక్కిసలాటల మరణాలు ; 

(1) ఏప్రిల్ 12 2004 లో లక్నో నగరములో ఉచిత చీరల పంపిణీలో 21 మంది స్త్రీలు  మరణించారు.

(2) జనవరి 2005 లో మహారాష్ట్రలో ఒకగుడి వద్ద త్రొక్కిసలాటలో 265 మంది హిందూ యాత్రికులు మరణించారు.

(3) డిసెంబరు 2005 లో 42 మంది వఱద బాధితులు వస్తువుల పంపిణి సందర్భములో దక్షిణ భారతములో మరణించారు.

(4) అక్టోబర్ 3 2007 న ఉత్తర భారతములో 14 మంది స్త్రీలు ఒక రైల్వే స్టేషనులో మరణించారు.

(5) మార్చి 27  2008 న ఒక గుడిలో 8 మంది మరణించారు.

(6) ఆగష్టు 3 2008లో హిమాచల్ ప్రదేశ్ లో నైనాదేవి గుడి వద్ద 162 మంది భక్తులు మరణించారు .

(7) సెప్టెంబరు 30 2008  న జోధ్ పూరులో చాముండేశ్వరి దేవి గుడి వద్ద 224 మంది భక్తులు మరణించారు. ప్రజలు బాంబు ఉందనే పుకారు విని పరుగులు పెట్టడము వలన యీ ప్రమాదము జరిగింది.

(8) మార్చి 4 2010 న రాం- జానకి గుడి వద్ద కుందా లో 71 మంది మరణించారు.

(9) జనవరి 15 2011 న శబరిమల గుడి వద్ద 102 మంది భక్తులు మరణించారు.

(10) నవంబరు 8 , 2011 న హరిద్వార్ లో గంగానదీ తీరములో 16 గురు మరణించారు.

(11) ఫిబ్రవరి 10 ,2013లో అలహాబాద్ లో కుంభమేళా ఉత్సవాలలో 36 మంది మరణించారు

(12) అక్టోబర్ 13 2013 న నవరాత్రి ఉత్సవాలలో రత్నాఘర్ మాత గుడి ,మధ్యప్రదేశ్ లో 115 మంది మరణించారు.

(13) అక్టోబర్ 3 2014 న పాట్నా గాంధీ మైదానములో దశరా ఉత్సవాలలో 32 మంది మరణించారు.

(14) జూలై 14 2015 న గోదావరి పుష్కరాల ప్రారంభ దినమునాడు రాజమండ్రిలో 27 మంది యాత్రికులు మరణించారు. 

(15 ) ఆగష్టు 10, 2015 ఝార్ఖండ్ రాష్త్రము దియోగఢ్ లో దుర్గామాత ఆలయములో  తొక్కిసలాటలో     11 మంది మృత్యువాత పడ్డారు.

(16 ) సెప్టెంబరు 24 2015 నాడు   మక్కాలో 769 మంది హాజ్ యాత్రికులు త్రొక్కిసలాటలో మరణించారు. 2006 తర్వాత హాజ్ యాత్రలో మరల అధిక సంఖ్యలో యింతమంది యాత్రికులు మరణించడము అనేకులు గాయపడడము జరిగింది. యాత్రికులను గుంపులుగా విభజించి, జనసందోహమును నియంత్రిచడములో సౌదీ రక్షకభటులు, కార్యకర్తలు వైఫల్యము చెందారు. 

( 17 ) సెప్టెంబరు 29, 2017 నాడు ముంబాయి ఎల్ఫిన్ స్టోన్ ట్రైన్ స్టేషన్ వద్ద కాలివంతెనపై జరిగిన త్రొక్కిసలాటలో 22 మంది మరణించారు. వంతెన కూలిపోతుందేమో అనే భయముతో ప్రజలు తోపులాట ప్రారంభించారు.

( 18 ) జనవరి 7 , 2020 నాడు ఇరాన్ లో ఖాసిం సోలైమని అంత్యక్రియల ఊరేగింపు త్రొక్కిసలాటలో 56 మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.

( 19 ) ఆగష్టు 22 , 2020 నాడు లాస్ ఒలివోస్ , లిమా , పెరూ లో చట్ట వ్యతిరేకముగా జనులు గుమికూడిన నైట్ క్లబ్ పై పోలీసులు దాడి చేసినపుడు త్రొక్కిసలాటలో 13 గురు చనిపోయారు. కోవిడ్ ను నియంత్రించుటకు జనులు గుమికూడుటను అచటి ప్రభుత్వము నిషేధించింది.

( 20) ఏప్రిల్ 30, 2021 న , మౌంట్ మేరన్ , ఇజ్రాయిల్ లో మత సంబంధ ఉత్సవములో జరిగిన త్రొక్కిసలాటలో 45 మరణించారు, 150 మంది గాయపడ్డారు.

( 21) నవంబరు 5 , 2021 న ఉత్తర అమెరికా దేశము హ్యూష్టన్ నగరములో ‘ ఆష్ట్రో వరల్డ్ ‘ గాన కచేరీ సభలో జరిగిన త్రొక్కిసలాటలో 9 మంది మరణించారు , 300 మంది గాయపడ్డారు. 

22) అక్టోబరు 29, 2022 న దక్షిణ కొరియా, సియోల్ లో హేలొవిన్ ఉత్సవ వేడుకల సందర్భముగా జరిగిన త్రొక్కిసలాటలో 151 మంది మృతిచెందారు. ఒక సినిమానటి వచ్చారనే వార్తతో ఆమెను చూడటానికి ప్రజలు తోసుకొని ముందుకు వెళ్ళాలని ప్రయత్నించడము వలన ఈ ప్రమాదము జరిగింది.

23). డిసెంబరు 28, 2022 న భారతదేశము ఆంధ్రప్రదేశ్ నెల్లూరుజిల్లా కందుకూరులో ఒక రాజకీయపక్ష సభలో తొక్కిసలాట వలన కొందఱు కాలువలో పడగా ఎనమండుగురు మృతిచెందారు. మరికొందఱు గాయపడ్డారు.

24). జనవరి 1, 2023 న ఆంధ్రప్రదేశ్, గుంటూరులో ఒక రాజకీయపక్ష సభలో చీరలు, వస్తువులు కానుకలు పంపిణీ సందర్భములో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందారు.

25). ఫిబ్రవరి 4 వ తారీఖున చెన్నై తిరుపత్తూరు జిల్లాలో వాణియంబాడి ప్రాంతములో మురుగన్ తైపూసం   ఉత్సవాల సందర్భములో ఒక ప్రైవేటు సంస్థ తలపెట్టిన ఉచిత చీరలు ధోవతీల పంపిణి కార్యక్రమములో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మహిళలు మరణించారు. పదిమంది గాయపడ్డారు.

         వెనుక నుంచి ఆత్రుత పడే జనులకు ముందు వారి అవస్థ తెలియదు. సరియైన శిక్షణ, ముందుచూపు, ప్రణాళికా లోపించడము వలన యీ ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాలు నివారించ దగినవే ! ఈ ప్రమాదాలలో యాత్రికులను, ప్రజలను నిందించుట పొరబాటు.

      ఇలాంటి ప్రమాదాలలో కొన్ని అనివార్యమైనా , చాలా త్రొక్కిసలాటలను ముందు జాగ్రత్త చర్యలతో నివారించ వచ్చును .

 1. అధికారులకు , స్వయంసేవకులకు ముందుగానే జనసందోహాలను గౌరవపూర్వకముగా నియంత్రించడములో తగిన శిక్షణలు ఇచ్చి వారిని గుంపులను నియంత్రించుటకు నియోగించాలి.

2. అట్టి శిక్షణ గల అధికారులను, స్వయంసేవకులను, నిర్వాహకులను  ప్రజలు గుమికూడే సందర్భాలలో తప్పక వినియోగించుకోవాలి.

3. జనసందోహములను నిర్ణీత సమయయములలోను, నిర్ణీత స్థలములలోను గుంపులుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో ముందుకి నడిపించాలి. 

4. యాత్రికులు వారంతట వారొక చోటికి చేరుకోలేరు కాబట్టి అదుపులో ఉంచగలిగిన అంత మందినే నిర్వాహకుకులు ఆ యా స్థలములకు  నిర్ణీత సమయాలలో విభజించి చేర్చాలి.

5. తగిన ఉక్కు అడ్డుకట్టలు , త్రాళ్ళుతో , గుంపులను నియంత్రించాలి. 

6. విపరీతమైన ఎండ , చలి వంటి వాతావరణ పరిస్థితుల నుంచి కొంత రక్షణ కలిపించాలి.

ప్రజలు అసహనానికి లోనవకుండా చూసుకోవాలి. 

7. వరుసలలో నిలబడుట ఇష్టము లేనివారు బయట పడడానికి అవకాశాలు కల్పించాలి.

 8. పిల్లా పాప ఉన్నవారిని , వృద్థులను, వికలాంగులను గౌరవముతో పరిరక్షించుకోవాలని ప్రజలకు హెచ్చరికలు చేస్తూ  ఉండాలి. స్వయంసేవకులు గాని , రక్షకభటులు గాని వారి రక్షణకు పూనుకోవాలి.

9. సభలు జరిపేటప్పుడు, జనసందోహమును సమీకరించేటప్పుడు విశాలమైన ప్రదేశాలను ఎన్నుకొని జన సాంద్రతను నివారించాలి.

10). జనసందోహములను అదుపులో పెట్టు బాధ్యత తీసుకొన్న పిదపనే జనసమీకరణలకు అనుమతులు ఇవ్వాలి.

     ఈ ప్రమాదాలు జరిగినపుడు  రాజకీయాలు , పరస్పర నిందలు చేస్తే సాధించేది లేదు.

ఈ ప్రమాదాలను అరికట్టే సత్తా నిర్వాహకులకు, ప్రభుత్వ యంత్రాంగాలకే ఉంటుంది కాబట్టి, ప్రజలకు క్రమశిక్షణ లేదని నిందిస్తే ప్రయోజనము లేదు. వ్యక్తిగతముగా బాధ్యతాపరులైనా, గుంపులో ఉన్న జనులకు క్రమశిక్షణ ఉండదు, వ్యక్తులకు గుంపులపై ఆధీనము ఉండదు . ఆ భావనతోనే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

      ఈ త్రొక్కిసలాటలను కావాలని ఎవరూ ప్రారంభించరు. ముందుకు పోదామని వెనుక ఉన్నవారు తొందఱపడుతారు. మనుజుల వత్తిడితో ముందున్నవారు ఉక్కిరి బిక్కిరయి  ఊపిరి ఆడక ( Compressive Asphyxiation ) మరణించడమో , సొమ్మసిల్లడమో జరుగుతుంది. మనుష్యులపై మనుష్యులు పడినప్పుడు కూడా క్రిందవారికి ఊపిరి ఆడదు. పడిపోవుట వలన గాయాలు తగులుతాయి.

      ముందున్నవారి పరిస్థితి వెనుక ఉన్నవారికి తెలియదు. వెనుక ఉన్నవారికి ముందున్న వారి పరిస్థితిని తెలియ పఱచి తోపులాటలు అరికట్టాలి. ముఖ్యముగా ప్రజలను చిన్న చిన్న గుంపులుగా విభజించాలి.

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...