16, ఫిబ్రవరి 2020, ఆదివారం

శిలీంధ్ర చర్మవ్యాధులు -2 ( Fungal skin diseases-2 )

   శిలీంధ్ర చర్మ వ్యాధులు - 2

             ( Fungal skin diseases - 2 )

                                                                            
                                                                                  డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.
                                                

   
     ఇది వఱకు కొన్ని శిలీంధ్ర వ్యాధులను వర్ణించాను. ఇపుడు మరి కొన్నిటి గుఱించి వ్రాస్తాను.


                                     గడ్డపు తామర ( Tinea barbae  )


    గడ్డపు తామర, చర్మాంకురములు ( Dermatophytes )  ట్రైఖోఫైటన్ మెన్టగ్రోఫైట్స్  ( Trichophyton  mentagrophytes ), ట్రైఖో ఫైటన్ వెర్రుకోసమ్  (Trichophyton verrucosum ) వలన కలుగుతాయి. ఇవి మనుజుల నుంచి మనుజులకు లేక జంతువుల నుంచి మనుజులకు,  వ్యాప్తి చెంది రుగ్మతలను కలిగిస్తాయి. ఒకరి గడ్డపు కత్తె మరొకరు ఉపయోగించుట వలన కూడా శిలీంధ్రములు వ్యాపించగలవు.

    రైతులలో ఎక్కువగా ఈ వ్యాధులు పొడచూపుతాయి. ఉష్ణ ప్రాంతములలో నివసించే వారిలో గడ్డపు తామర కలిగే అవకాశములు ఎక్కువ. గడ్డము, మీసపు ప్రాంతములలో చర్మమును, రోమ కూపములను, రోమములను ఆశ్రయించి శిలీంధ్రములు తాపము కలిగిస్తాయి.

వ్యాధిలక్షణములు 




    గడ్డపు చర్మములో ఇవి తామర కలుగ జేసినపుడు ఎఱుపు లేక గులాబి రంగు గుండ్రని మచ్చలు కలుగుతాయి. కొందఱిలో వ్యాధి రోమ కూపములలోనికి చొచ్చుకొని తాపము కలుగజేసి చిన్న చీము పొక్కులను ( pastules ), పుళ్ళను ( furuncles ) కలిగిస్తాయి. కొందఱిలో తాప ప్రక్రియ హెచ్చయి పుళ్ళతో మెత్తని ‘రోమ కూప శిలీంధ్ర వ్రణములు ( Kerions ) ‘ఏర్పడుతాయి. చర్మపు లోపలి భాగములలో తాపము వ్యాపించినపుడు ఎఱ్ఱని దళసరి కణుతులు ( nodules ) ఏర్పడవచ్చును. ఈ వ్యాధి వలన దురద కలుగుతుంది. తాపము గడ్డపు క్రింద రసి గ్రంధులకు ( lymph glands ) వ్యాపిస్తే అవి వాచుతాయి. జ్వరము కూడా రావచ్చును.

వ్యాధి నిర్ణయము 


    అనుభవజ్ఞులైన వైద్యులు చూచి వ్యాధిని చాలా పర్యాయములు నిర్ణయించగలరు. చర్మమును శస్త్రకారుల  చురకత్తితో గోకి వచ్చిన పొట్టును గాని, వెండ్రుకలను పీకి గాని వాటికి పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు వేసి సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి శిలీంధ్రపు పోగులను ( hyphe ) గుర్తించి వ్యాధిని నిర్ణయించవచ్చును. చర్మము నుంచి, వెండ్రుకల నుంచి  ప్రయోగశాలలలో శిలీంధ్రములను పెంచవచ్చును (fungal cultures ). వ్యాధికి లోనైన చర్మ భాగములతో కణ పరీక్షలు ( biopsies ) చేసి కూడ వ్యాధిని నిర్ణయించవచ్చును.

చికిత్స 

   
    గడ్డపు తామర ఆరంభదశలో ఉన్నపుడు ఆ ప్రాంతమునకు , పరిసర ప్రాంతములకు క్లోట్రిమజాల్ ( Clotrimazole ) గాని, మికనొజాల్ ( micanozole ), గాని, టెర్బినఫిన్ ( terbinafine ) గాని లేపనములను  ( anti fungal creams ) రెండు నుంచి నాలుగు వారములు  రాస్తే వ్యాధి నయము కావచ్చును. గడ్డము గీసినపుడల్లా కొత్త బ్లేడులు వాడాలి, లేకపోతే శుభ్రపఱచిన వాటిని వాడుకోవాలి. పెంపుడు జంతువులను జంతు వైద్యులచే పరీక్ష చేయించి వాటికి శిలీంధ్ర వ్యాధులు ఉంటే తగిన చికిత్స చేయించాలి.

    సాధారణముగా గడ్డపు తామర  లేపనములకు నయము కాదు. రెండు వారములలో సత్ఫలితములు కలుగకపోయినా, వ్యాధి తీవ్రత అధికముగా ఉన్నా నోటి ద్వారా మందులు అవసరము.
  
     గ్రైసియోఫల్విన్ ( Griseofulvin ) దినమునకు 500 మి.గ్రా. నుంచి ఒక గ్రాము వఱకు రెండు మూడు వారములు వాడితే ఫలితములు కనిపిస్తాయి. టెర్బినఫిన్ ( Terbinafine ) దినమునకు 250 మిల్లీ గ్రాములు గాని, ఇట్రాకొనజోల్ ( Itraconazole ) దినమునకు  200 మి.గ్రాలు  గాని రెండు మూడు వారములు వాడినా సత్ఫలితములు కలుగుతాయి.

    తాప ప్రక్రియ ( inflammation ) అధికముగా ఉన్నపుడు తాపమును తగ్గించుటకు  శిలీంధ్ర నాశకములతో పాటు ప్రెడ్నిసోన్ ( Prednisone ) 40 మి.గ్రాలు దినమునకు మొదలుపెట్టి క్రమేణా వైద్యుల పర్యవేక్షణలో  తగ్గిస్తూ మానివేయాలి.

     శిలీంధ్ర నాశకములను నోటి ద్వారా ఎక్కువ దినములు వాడినపుడు రక్తకణ పరీక్షలు, కాలేయ వ్యాపార పరీక్షలు నెలకు ఒకసారైనా చేయించుకొవాలి.


            సోబి ; సుబ్బెము ( Tinea versicolor : Pityriasis versicolor ) 





    సోబి లేక సుబ్బెముగా వ్యవహారములో ఉన్న వ్యాధి  మలస్సీజియా ఫర్ ఫర్ ( Malassezia  furfur ), లేక మలస్సీజియా గ్లోబోజా ( Malassezia globosa )  అనే మధు శిలీంధ్రములు ( yeast ) వలన కలుగుతుంది.

    మలస్సీజియా ద్విరూపి ( dimorphic ). ఇది మొగ్గలు తొడిగే ( budding ) మధు శిలీంధ్రపు రూపములో గాని, శాఖలు కట్టే  పోగుల ( branching hyphae ) శిలీంధ్ర రూపములో గాని, రెంటిగా గాని ( spaghetti  and meat ball appearance ) సూక్ష్మదర్శిని క్రింద కనిపిస్తుంది.
       
    మలస్సీజియీ చాలామందిలో చర్మము పై హాని కలిగించకుండా మనుగడ సాగిస్తాయి. కొందఱిలో మాత్రము ముఖ్యముగా, వ్యాధి నిరోధక శక్తి లోపించిన వారిలోను, కార్టికోష్టీరాయిడులు ( corticosteroids ) వాడే వారిలోను, గర్భిణీ స్త్రీలలోను, ఆహార లోపములు ఉన్నవారిలోను, మధుమేహ వ్యాధి కలవారిలోను, సోబిని కలిగించవచ్చును. వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు, వాతావరణములో తేమ అధికముగా ఉన్నపుడు చెమట ఎక్కువగా పట్టే వారిలోను సోబి తఱచు కనిపిస్తుంది .

    సోబి  కలిగిన వారిలో చర్మముపై  గోధుమరంగు, గులాబి రంగు , ఎఱుపు రంగు, రాగి రంగు మచ్చలు పొడచూపుతాయి. ఈ మచ్చలు విడివిడిగా కాని కలిసిపోయి కాని కనిపించవచ్చును. మచ్చల అంచులు నిర్దుష్టముగా ఉంటాయి. వీటిపై సన్నవి పొలుసులు ( scales ) ఏర్పడి బూడిదలా పొట్టు రావచ్చును. తెల్లగా ఉన్నవారిలో వేసవి కాలములో చర్మపు రంగు ఎక్కువ అగుటచే , సోబి మచ్చలు బాగా కనిపిస్తాయి.

    కొందఱిలో మలాస్సీజియా ఫర్ ఫర్ ఎజెలైక్ ఆమ్లము  ( azelaic acid ) ఉత్పత్తి చేయుట వలన ఆ ఆమ్లము టైరొసినేజ్ ( tyrosinase ) అనే జీవోత్ప్రేరకమును ( enzyme ) నిరోధించి, మెలనిన్ ( melanin ) అను చర్మ వర్ణకపు ఉత్పత్తిని తగ్గించుట వలన  సోబి మచ్చలు వర్ణహీనత ( hypopigmentation ) పొందుతాయి.

వ్యాధి నిర్ణయము 


    సోబిని ( Tinea versicolor ) సాధారణముగా చూసి పసిగట్టవచ్చును. అతినీలలోహిత దీపముతో ( Wood’s ultraviolet light ) చర్మమును పరీక్షించునపుడు సోబి మచ్చలు తెల్లని బంగారు రంగులో ప్రతిదీప్తిస్తాయి.

    చర్మపు పై పొరలను గాజు పలకతో కాని, శస్త్రకారుల చురకత్తితో కాని గోకి వచ్చిన పొట్టుకు పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు కలిపి సూక్ష్మదర్శినితో పరీక్షించి మధు శిలీంధ్రమును ( yeast ), శిలీంధ్రపు పోగులను ( hyphae ) గుర్తించి వ్యాధిని నిర్ణయించవచ్చును.

చికిత్స 


    సోబికి సెలీనియమ్ సల్ఫైడు ( selenium sulphide ) షాంపూ 2.5 % ను గాని, 2 % కీటోకొనజోల్ ని ( Ketoconazole ) గాని పొడి చర్మపుపై లేపనముగా ప్రతిదినము ఒకసారి పూసి పది నిముషములు ఉంచి పిదప కడిగివేస్తూ వారము పది దినములు  చికిత్స చేస్తే సోబి తగ్గుతుంది. సైక్లోపిరాక్స్ ( ciclopirox ), మికొనజోల్ ( miconazole ), టెర్బినఫిన్ ( terbinafine ), క్లోట్రిమజాల్ ( clotrimazole ) వంటి శిలీంధ్రనాశక లేపనములకు సోబి తగ్గుతుంది. జింక్ పైరిథియోన్ ( zinc Pyrithione ) సబ్బుతో స్నానము వలన సోబిని అదుపులో ఉంచవచ్చును.

    నోటి ద్వారా ఫ్లుకొనజోల్ ( fluconazole ) 150 మి.గ్రా. కాని,  కీటోకొనజోల్ ( ketoconazole ) 200 మి.గ్రాలు కాని  ఒకే ఒక్క మోతాదుగా గాని, లేక తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి  వారమునకు ఒక సారి చొప్పున నాలుగు వారముల విరామ చికిత్స గాని ( Pulse therapy ) చేయవచ్చును .


               గోటి తామర ; నఖ శిలీంధ్రవ్యాధి ( Tinea unguium ) 



    శిలీంధ్రములు గోళ్ళను కాని గోటి క్రింద చర్మమును ( నఖక్షేత్రము ) కాని లేక రెంటినీ కాని ఆక్రమించి గోటి తామర ( నఖ శిలీంధ్రవ్యాధి ) కలుగజేస్తాయి. చేతి గోళ్ళలో కంటె కాలి గోళ్ళలో శిలీంధ్ర వ్యాధిని ఎక్కువగా చూస్తాము.



    వృద్ధులలోను, పురుషులలోను, అదివరకు సోరియాసిస్ ( psoriasis  ) వంటి గోటి వ్యాధులు కలవారిలోను, దూరధమని వ్యాధిగ్రస్థులలోను ( peripheral arterial disease  ), మధుమేహ ( diabetes mellitus ) వ్యాధిగ్రస్థులలోను, పాదములలో తామర కలవారిలోను, వ్యాధి నిరోధకశక్తి లోపించిన వారిలోను గోటి తామర తఱచుగా చూస్తాము.

    ట్రైఖోఫైటాన్ రూబ్రమ్ ( Trichophyton rubrum ) వంటి చర్మాంకురములు ( dermatophytes ) 60-75 శాతపు గోటి తామరలను కలుగజేస్తాయి. ఏస్పర్జిల్లస్ ( Aspergillus ), స్కోప్యులారియోప్సిస్ ( Scopulariopsis ), ఫ్యుసేరియమ్ ( Fusarium ) వంటి శిలీంధ్రములు, మధు శిలీంధ్రములు ( Candidiasis ) వలన యితర నఖ శిలీంధ్ర వ్యాధులు కలుగుతాయి.

వ్యాధి లక్షణములు 


    నఖములు శిలీంధ్ర వ్యాధికి లోనగునపుడు వాటిపై తెల్లని, లేక పసుపు పచ్చని, లేక నల్లని మచ్చలు పొడచూపుతాయి. ఆ గోళ్ళు దళసరి కట్టి వికారము అవుతాయి. గోళ్ళు పెళుసుకట్టి సులభముగా విఱిగిపోతుంటాయి. గోళ్ళ తామర మూడు విధములుగా కనిపించవచ్చును.

    1). గోటి చివర వ్యాధి కనిపించి గోరు దళసరి కట్టి, వివర్ణత చెంది, కెరటిన్ , యితర శిధిలములు గోటి క్రింద చేరి , గోరు దిగువ చర్మము నుంచి ఊడిపోవచ్చును ( Onycholysis  ).

    2). నఖ మూలములో వ్యాధి కనిపించవచ్చును. వ్యాధి నిరోధక శక్తి తగ్గినవారిలో నఖమూలములలో వ్యాధి ఎక్కువగా కలుగుతుంది.

    3). కొందఱిలో తెల్లని సుద్ద వంటి పొట్టు గోటి క్రింద కనిపిస్తుంది.

    చాలా మందిలో నొప్పి, బాధ ఉండవు, కాని కొందఱిలో చర్మములో కణ తాపము ( cellulitis ) కలిగే అవకాశము కలదు.

వ్యాధి నిర్ణయము 


    అనుభవజ్ఞులైన వైద్యులు చూసి వ్యాధిని పసిగట్టగలరు.  కత్తిరించిన గోళ్ళను, గోటి క్రింద భాగములను గోకి వాటిని పొటాసియమ్ హైడ్రాక్సైడ్ తో శిలీంధ్రములకై సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించ వచ్చును. కత్తిరించిన గోళ్ళను, గోళ్ళ క్రింద చర్మమును గోకి ఆ భాగములతో శిలీంధ్రములను ప్రయోగశాలలో పెంచి ( fungal cultures ) వ్యాధిని నిర్ణయించ వచ్చును. వాటితో పొలిమెరేజ్ గుణకారచర్య ( polymerase chain reaction  PCR ) పరీక్షతో శిలీంధ్రములను త్వరగా గుర్తించవచ్చును. కత్తిరించిన గోళ్ళను, నఖ శిధిలములను  పెర్ ఐయోడిక్ ఏసిడ్ స్కిఫ్ ( Periodic acid schiff  ) వర్ణకముతో సూక్ష్మదర్శినితో పరీక్షించి శిలీంధ్ర వ్యాధిని నిర్ణయించవచ్చును.

    సోరియాసిస్ ( psoriasis  ) నఖవ్యాధి, లైఖెన్ ప్లానస్ ( lichen planus ) నఖవ్యాధి, యితర నఖ వ్యాధులు శిలీంధ్ర వ్యాధులను పోలి ఉండవచ్చు. కాబట్టి తగిన పరీక్షలతో చికిత్సకు పూర్వము  వ్యాధిని నిర్ణయించవలసిన అవసరము ఉన్నది.

చికిత్స 


      గోటి తామరలు అన్నిటికీ చికిత్స అవసరము లేదు. వ్యాధి తీవ్రత లేనప్పుడు, రోగికి బాధ లేనప్పుడు, యితర ఉపద్రవములు కలుగనప్పుడు , చికిత్స అవసరము లేదు.  చికిత్స వలన అందఱికీ సత్ఫలితములు కనిపించవు. ఫలితములు చేకూరినా, వ్యాధి మఱల వచ్చే అవకాశములు ఎక్కువ.

    టెర్బినఫిన్ ( terbinafine ), కీటోకొనజోల్ ( ketoconazole ) వంటి మందులు దీర్ఘకాలము వాడినపుడు కాలేయ పరీక్షలు, రక్త పరీక్షలు చేస్తూ అవాంఛిత ఫలితములు రాకుండా జాగ్రత్త పడాలి. అందువలన వృద్ధులైన నా రోగులలో బాధ పెట్టని నఖ శిలీంధ్ర వ్యాధుల చికిత్స విషయములో ( గోటితో పోయే దానికి. పోయేది గోరే కదా ? కాలేయమును సురక్షితముగా ఉంచుదాము  అనుకుంటూ ) రోగులు కూడా నాతో అంగీకరించినపుడు నేను  చాలా సంయమనము పాటిస్తాను. 

    కాని కణ తాపము ( cellulitis  ) కలిగిన వారిలోను, మధుమేహవ్యాధి ( diabetes ) కలిగి కణ తాపము వంటి ఉపద్రవములు కలిగే అవకాశము ఉన్న వారిలోను, ఇతర బాధలు ఉన్న వారిలోను, రోగులు చికిత్స కావాలని కోరినపుడు చికిత్సలు అవసరము.

    గోళ్ళకు 8 %  సైక్లోపిరాక్స్ (  ciclopirox ) కాని, 10 % ఎఫినకొనజోల్ ( efinaconazole ) కాని, 5 % ఎమొరోల్ఫిన్ ( amorolfine ) కాని, పూతగా పూయుట వలన 30 శాతము మందిలో ఫలితములు కనిపిస్తాయి.

    టెర్బినఫిన్ నోటి ద్వారా దినమునకు 250 మి. గ్రాములు చొప్పున చేతి గోళ్ళకు 6 వారములు, కాలి గోళ్ళకు 12 వారములు కాని, లేక నెలలో దినమునకు 250 మి. గ్రాములు చొప్పున ఒక వారము మాత్రము ఇస్తూ విరామ చికిత్సను ( pulse therapy ) ఫలితములు కనిపించే వరకు కొనసాగిస్తే 70 - 80 శాతము మందిలో ఫలితములు కనిపిస్తాయి.
 
    ఇట్రాకొనజోల్ ( Itraconazole ) దినమునకు 200 మి.గ్రాములు రెండు సారులు చొప్పున నెలలో ఒక వారము చొప్పున మూడు నెలలు చికిత్స చేస్తే 40-50 శాతము మందిలో ఫలితములు కనిపిస్తాయి.

    ఫలితములు కలిగినా 10 నుంచి 40 శాతము మందిలో వ్యాధి తిరిగి రావచ్చును. రోగులు గోళ్ళను పొట్టిగా కత్తిరించుకోవాలి. వారు పాత పాదరక్షలను మరల వాడకూడదు. చెమటను పీల్చే కాలి తొడుగులు వాడుకోవాలి.  పాదములకు గాలి బాగా సోకనీయాలి. చేతులు పొడిగా ఉంచుకొనుటకు ప్రయత్నించాలి.

   ( చిత్రములను అభిమానముతో అందజేసిన నా ఆప్తమిత్రులు, చర్మవ్యాధి నిపుణులు డాక్టరు. గండికోట రఘురామారావు గారికి కృతజ్ఞతలతో .)


పదజాలము :

Abscesses  = చీముతిత్తులు ( గ.న )
Alopecia = బట్టతల మచ్చలు ( గ.న )
Antibiotics = సూక్ష్మజీవ సంహారకములు ( గ.న )
Antifungals = శిలీంధ్ర నాశకములు ( గ.న )
Biopsies = కణపరీక్షలు 
Bullae = బొబ్బలు ( గ.న )
Cellulitis = కణతాపము ( గ.న )
Dermatophytes = చర్మాంకురములు ( గ.న )
Dimorphic  = ద్విరూపి 
Enzyme = జీవోత్ప్రేరకము ( గ.న )
Hyphae = శిలీంధ్రపు పోగులు 
Hypopigmentation = వర్ణహీనత ( గ.న )
Intertriginous tinea pedis = అంగుళాంతర వ్యాధి ( గ.న )
Fungal Spores = శిలీంధ్ర బీజములు
Fungi = శిలీంధ్రములు 
Furuncles = సెగగడ్డ
Kerions =   రోమకూప శిలీంధ్ర వ్రణములు ( గ.న )
Nail bed = నఖక్షేత్రము ( గ.న )
Nodules = కణుతులు ( గ.న )
Pastules = చీము పొక్కులు ( గ.న )
Peripheral arterial disease  = దూరధమని వ్యాధి ( గ.న )
Pulse therapy = విరామ చికిత్స ( గ.న )
Scales = పొలుసులు
Tinea barbae  = గడ్డపు తామర ( గ.న )
Tinea capitis = తల తామర ( గ.న )
Tinea carporis = ఒంటి తామర ( గ.న )
Tinea cruris = తొడమూలపు తామర ( గ.న )
Tinea Pedis = పాదశిలీంధ్ర వ్యాధి ( గ.న )
Tinea unguium ; Onychomycosis = గోటి తామర ; నఖ శిలీంధ్రవ్యాధి ( గ.న )
Tinea versicolor = సోబి ; సుబ్బెము ( Pityriasis versicolor )
 Ultraviolet light = అతినీలలోహిత దీపము ( గ.న )
Ultraviolet rays = అతినీలలోహిత కిరణములు ( గ.న )
Vesicles = నీటి పొక్కులు
Yeast ; Candida = మధుశిలీంధ్రము

( వైద్య విషయములను తెలుగులో నా శక్తి మేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించవలెను. వైద్యులు ప్రత్యక్షముగా చూసి తగిన పరీక్షలు చేసి వ్యాధి నిర్ణయము చేసి చికిత్స చేయుట నైతికము , ధర్మము. ఉపయుక్తము అనుకుంటే నా వ్యాసములను నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )
 

                                     

                                           

                                           

Sent from my iPad

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...