26, జనవరి 2020, ఆదివారం

శిలీంధ్ర చర్మవ్యాధులు ( Skin diseases caused by fungi )


                                  శిలీంధ్ర చర్మవ్యాధులు - 1

                             ( Fungal skin diseases - 1 )


                                                              డాక్టరు గన్నవరపు నరసింహమూర్తి.


( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో  )


    శిలీంధ్రములు వృక్షజాతులకు జంతుజాలమునకు విభిన్నమైన జీవరాశులు. ఇవి ఆహారమునకు ఇతర జీవులపై ఆధారపడుతాయి. వీని కణ కవచములు ఖైటిన్ అను బహుళ శర్కరను కలిగి ఉంటాయి. ఇవి మృతకణములపై జీవిస్తాయి. 

    చర్మ శిలీంధ్రములు పైచర్మము ( epidermis ) పొరలోను గోళ్ళలోను ఉండు  కెరటిన్ ( keratin  ) లోని మృత కణములపైన, కేశములపైన జీవించి వ్యాధులను కలిగిస్తాయి. ఇవి ఒకరి నుంచి వేఱొకరికి, జంతువుల నుంచి మనుజులకు, ఒక్కోసారి మట్టినుంచి మనుజులకు సంక్రమించగలవు. 
  
    కణ రక్షణ వ్యవస్థలో లోపములు ఉన్నవారిలో [ ప్రాధమిక రక్షణ లోపము ( Primary immune deficiency ) గలవారిలోను, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను, హెచ్ ఐ వి వ్యాధిగ్రస్థులలోను ] శిలీంధ్రవ్యాధులు ఎక్కువగా కలుగుతాయి.

    మధు శిలీంద్రము ( yeast, Candida ), Epidermophyton, Microsporum, Trichophyton జాతుల చర్మాంకురములు ( Dermatophytes), శిలీంధ్ర వ్యాధులను కలుగజేస్తాయి. స్థానముల బట్టి  వ్యాధులను వర్ణిస్తారు.

                                 తొడమూలపు తామర ( Tinea cruris ) 


    వేసవి కాలములో, చెమట ఎక్కువగా పట్టి, గజ్జలలో తేమ అధికముగా ఉన్నపుడు, ఇరుకైన వస్త్రములు ధరించువారిలోను, స్థూలకాయులలోను, ఒరిపిడులు కలుగు వారిలోను, ఈ వ్యాధి ప్రాబల్యము ఎక్కువ. పురుషులలో ఈ వ్యాధిని ఎక్కువగా చూస్తాము. Trichophyton rubrum, Trichophyton mentagrophytes గజ్జల తామరను ఎక్కువగా కలుగజేస్తాయి. 



    దీని వలన దురద కలుగుతుంది. తామర గుండ్రని రాగి రంగు మచ్చలుగ తొడమూలములో  లోపలి భాగములో పొడచూపుతాయి. ఇవి అంచులలో వ్యాప్తి చెందుతూ, మధ్య భాగములో నయము అవుతూ కనిపిస్తాయి. మచ్చలలో గఱుకుదనము కనిపిస్తుంది. ఒరిపిడి, చెమట ఎక్కువయి నానుడుతనము ఉండవచ్చును. దీర్ఘకాలము వ్యాధి ఉన్నవారిలో మచ్చలు గట్టిపడి తోలువలె దళసరి కట్టవచ్చును.

    అనుభవజ్ఞులైన వైద్యులు చూసి వ్యాధిని నిర్ణయించగలరు.  గాజు పలకతో గాని, శస్త్రకారుని చురకత్తి అంచుతో గాని జాగ్రత్తగా మచ్చల అంచులను గోకి వచ్చిన పొట్టును గాజు పలకపై  పొరగా నెఱపి పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు వేసి పది పదిహైను నిమిషముల తరువాత సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి గడలు వలె ఉండి శాఖలు కలిగిన శిలీంధ్రపు పోగులను ( hyphae ) గుర్తించి వ్యాధి నిర్ణయము చేయవచ్చును.

చికిత్స 


    శిలీంధ్రములను అరికట్టు కీటోకొనజాల్ ( ketoconazole ), క్లోట్రిమజాల్ ( Clotrimazole ),ఎకొనజోల్ ( Econazole ), మికొనజాల్ ( Miconazole ),టెర్బినఫిన్ ( Terbinafine ), సైక్లోపిరాక్స్ ( Ciclopirox ) లేపనములలో దేనినైనా దినమునకు రెండు సారులు పూచి మర్దనా చేస్తూ రెండు మూడు వారములు వాడితే ఫలితము చేకూరుతుంది

    దీర్ఘకాలము వ్యాధి ఉన్నవారిలోను, వ్యాధి విస్తారముగా ఉన్నవారిలోను, పూతల చికిత్సకు లొంగని వారిలోను ఇట్రాకొనజాల్ ( Itraconazole ) రోజుకు 200 మి.గ్రాలు గాని టెర్బినఫిన్ ( Terbinafine ) దినమునకు 250 మి.గ్రాలు గాని నోటి ద్వారా 3 నుంచి 6 వారములు వాడితే ఫలితములు కనిపిస్తాయి.

    నోటి ద్వారా మందులు వాడేటప్పుడు తఱచు ( మూడు నాలుగు వారములకు ఒకసారి ) రక్త కణముల పరీక్షలు, కాలేయ వ్యాపార పరీక్షలు చేయాలి.

                                     ఒంటి తామర ( Tinea carporis ) 


    ఒంటి తామర దేహములో ముఖము, ఛాతి, వెన్ను, బొజ్జ, కాళ్ళు, చేతులలో పొడచూపవచ్చును. ఇది ఎఱుపు, లేక గులాబి రంగులో గుండ్రని పొలుసుల మచ్చలుగా గాని, పలకలుగా గాని కనిపిస్తుంది. ఈ మచ్చల అంచులలో చిన్న పొక్కులు ఉండవచ్చును. ఇవి మధ్యలో మానుతూ అంచులలో వ్యాప్తి చెందుతాయి. Trichophyton rubrum, Trichophyton mentagrophytes, Microsporum canis లు ఈ వ్యాధిని కలిగిస్తాయి. 



    మచ్చలు, పలకల లక్షణములబట్టి వ్యాధి నిర్ణయము చేయవచ్చును. చర్మమును గోకి వచ్చిన పొట్టును పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలతో గాజు పలకపై సన్నని పొరగా నెఱపి సూక్షదర్శినితో పరీక్షించి శిలీంధ్రపు పోగులను ( hyphae ) గుర్తించవచ్చును.

చికిత్స 


    సైక్లోపిరాక్స్ ( Ciclopirox ) లేపనమును కాని, టెర్బినఫిన్ (Terbinafine ) లేపనమును కాని రోజుకు రెండుసారులు పూసి మర్దించి, రెండు లేక మూడు వారములు వాడి ఫలితములు పొందవచ్చును. 

    వ్యాధి విస్తారముగా ఉన్నపుడు, లేపనములకు లొంగనపుడు, నోటిద్వారా ఇట్రాకొనజాల్ ( Itraconazole ) దినమునకు 200 మి.గ్రాలు లేక టెర్బినఫిన్ ( Terbinafine ) రోజుకు 300 మి.గ్రాలు 3 నుంచి 6 వారములు వాడవలసి ఉంటుంది. 

                                పాద శిలీంధ్ర వ్యాధి ( Tinea Pedis ) 




    పాదములలో తామర సోకినపుడు వ్యాధి నాలుగు విధములుగా కనిపించ వచ్చును. 

    1) అరికాళ్ళలో చర్మము దళసరి కట్టి, పొలుసులు కట్టి వ్యాధి అరికాళ్ళలో ముందు వ్యాపించి ఆపై పాదముల ప్రక్కలకు, మీదకు కూడా వ్యాపించ వచ్చును. Trichophyton rubrum తఱచు యీ వ్యాధికి కారణము.

    2).అంగుళాంతర వ్యాధి ( Intertriginous tinea pedis ): ఈ వ్యాధిలో తేమ వలన పాదములో వేళ్ళ మధ్య  ఒరుపులు కలిగి తెల్లని పొరలుగా చర్మము చిట్లుతుంది. ఎఱ్ఱదనము కూడా పొడచూపుతుంది.

    3) వేళ్ళ మధ్య ఒరుపులతో పుళ్ళు కలిగి ( ulcerative tinea pedis ) తాపము చర్మము క్రింద కణజాలమునకు ( cellulitis ), రసి నాళములకు ( lymphangitis ) వ్యాపించవచ్చును. T. mentagrophytes var. interdigitale ఇట్టి తీవ్ర వ్యాధిని కలిగిస్తుంది.   

    4). కొందఱిలో చిన్న చిన్న పొక్కులు ఏర్పడి అవి బొబ్బలు కడుతాయి ( vesiculobullous tinea pedis ). వాతావరణపు ఉష్ణము, తేమ ఎక్కువగా ఉన్నపుడు ఇరుకైన పాదరక్షలు ధరించే వారిలో ఈ బొబ్బలు కలుగుతాయి.

    వైద్యులు  పాదములను పరీక్షించి వ్యాధి నిర్ణయము చేయగలుగుతారు. అవసరమయితే చర్మపు పై పొరలను గోకి వచ్చిన పొట్టును పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలతో సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి శిలీంధ్రపు పోగులను ( hyphae ), బీజములను ( spores ) గుర్తించి వ్యాధిని నిర్ణయించవచ్చును.

చికిత్స 


    శిలీంధ్ర వ్యాధులను అరికట్టు లేపనములను పూతగా వాడుతారు. వేళ్ళ మధ్య తేమ ఉన్నపుడు మికొనొజాల్ ( miconazole ) పొడిని వాడవచ్చును. తేమను తగ్గించుటకు 5% అల్యూమినియమ్ సబ్ ఎసిటేట్ లేక 20% అల్యూమినియమ్ క్లోరైడు ద్రావకములను పూతగా పూయవచ్చును.
           
    వ్యాధి తీవ్రత ఎక్కువయిన వారిలోను పదే పదే వ్యాధి కలిగే వారిలోను  నోటి ద్వారా ఇట్రాకొనజోల్ ( itraconazole ) దినమునకు 200 మి.గ్రా లు చొప్పున నెల దినములు లేక, టెర్బినఫెన్ ( Terbinafine ) దినమునకు 250 మి.గ్రాలు చొప్పున నెల నుంచి ఆరు వారములు వాడుతారు.

    పాదములలోను పాదరక్షలలోను తేమ లేకుండాను, గాలి ప్రసరణ బాగున్నట్లు చూసుకోవాలి. బూట్ల కంటె చెప్పులు ధరించుట మంచిది. స్నానము తరువాత అరికాళ్ళను, వేళ్ళ మధ్యను పొడి తువ్వాళ్ళతో  వత్తుకోవాలి .

                        శిరస్సు శిలీంధ్ర వ్యాధి ; తల తామర ( Tinea capitis ) 


    శిరస్సుపై శిలీంధ్ర వ్యాధులను చర్మాంకురములు ( Dermatophytes ) కలిగిస్తాయి. Trichophyton tonsurans, Microsporum canis, Microsporum audouinii, Trichophyton schoenleinii, Trichophyton violaceum జాతుల శిలీంధ్రములు ఈ వ్యాధులను కలిగిస్తాయి. ఇవి పిల్లలలో తఱచు కలుగుతాయి. ఒకరి నుంచి వేఱొకరికి అంటు వ్యాధులుగా సంక్రమిస్తాయి. వ్యాధి కలిగిన వారిలో తలపై పొలుసులతో గుండ్రని మచ్చలు కాని, చుండు మచ్చలు ( dandruff ) కాని, లేక గుండ్రని బట్టతల మచ్చలు ( alopecia ) కాని అగుపిస్తాయి. బట్టతల మచ్చలు కలవారిలో కేశములు తల మట్టములో కాని, తలకు కొంచెము ఎగువగా కాని తెగిపోయి నల్లని బట్టతల మచ్చలు కాని, నెరసిన బట్టతల మచ్చలు కాని కలిగిస్తాయి. కొందఱిలో చిన్న చిన్న పుళ్ళు కలుగుతాయి. 



   కొందఱిలో పుళ్ళు పుట్టి తాప ప్రక్రియ వలన మెత్తని కాయలు ‘ రోమకూప శిలీంధ్ర వ్రణములు ( Kerions ) ‘ ఏర్పడుతాయి. ఈ కాయలపై చీము పొక్కులు, పెచ్చులు ఉండుట వలన  వైద్యులు కూడా  వాటిని చూసి చీము తిత్తులుగా ( abscesses ) భ్రమించవచ్చును. చీము తొలగించుట వలన, సూక్ష్మజీవ సంహారకముల ( antibiotics ) వలన  యివి నయము కావు. 


                                                            రోమకూప శిలీంధ్రవ్రణము

 వ్యాధి నిర్ణయము 


    అనుభవజ్ఞులయిన వైద్యులు తలపై పొడచూపు శిలీంధ్ర వ్యాధులను చూసి నిర్ధారించగలరు. ఆ ప్ర్రాంతములో వెండ్రుకలు పెఱికి గాని, పొలుసులను, పెచ్చులను గ్రహించి గాని, వాటికి పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు కలిపి సూక్ష్మదర్శిని క్రింద చూసి శిలీంధ్రముల పోగులను ( hyphae ), శిలీంధ్ర బీజములను ( spores ) పోల్చి వ్యాధులను నిర్ణయించవచ్చు. వెండ్రుకలు, పొలుసులు, పెచ్చులను గ్రహించి ప్రయోగశాలలలో శిలీంధ్రములను పెంచి ( fungal cultures ) వ్యాధులను నిర్ణయించవచ్చును.

    అతి నీలలోహిత దీపకాంతిని ( ultraviolet rays from Wood’s lamp ) ప్రసరించినపుడు Microsporum canis, Microsprum audouinii ల వలన కలిగే మచ్చలు నీలాకుపచ్చ రంగులను ప్రతిదీప్తిస్తాయి. 

చికిత్స 


    శీర్ష శిలీంధ్ర చర్మవ్యాధులకు శిలీంధ్ర నాశక ఔషధములు ( antifungals ) నోటి ద్వారా వాడవలసి ఉంటుంది. పిల్లలలో గ్రైసియోఫల్విన్ ( Griseofulvin ) కాని, టెర్బినఫిన్ ( terbinafine ) కాని వాడుతారు. మందులు వ్యాధి పూర్తిగా నయమయే వఱకు సుమారు 4- 6 వారములు వాడవలసి ఉంటుంది. పెద్దలలో టెర్బినఫిన్ కాని, ఇట్రాకొనజాల్ ( Itraconazole ) కాని వాడుతారు. 

    తలపై సైక్లోపిరాక్స్ ( ciclopirox ) లేపనము గాని, సెలీనియమ్ సల్ఫైడు ( Selenium sulphide ) కాని పూతగా పూసి వ్యాధి వ్యాప్తిని నిరోధించగలము.

    తాపము ( inflammation ) అధికమయి పుళ్ళతో కాయలు ( kerions ) ఏర్పడితే తాపము తగ్గించుటకు కొన్ని దినములు శిలీంధ్ర నాశకములతో బాటు ప్రెడ్నిసోన్ ( prednisone ) వాడి దాని మోతాదును క్రమముగా తగ్గిస్తూ రెండు వారములలో  ఆపివేయాలి.


( వైద్యవిషయాలను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి . )


విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...