26, ఆగస్టు 2020, బుధవారం

నిమ్నసిర రక్తఘనీభవనము ( Deep Vein Thrombosis ) ; పుపుస ధమనిలో అవరోధకము ( Pulmonary Embolism )

 


తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో : )


          నిమ్నసిర రక్తఘనీభవనము ( Deep Vein Thrombosis )

                     పుపుసధమనిలో అవరోధకములు ( Pulmonary Embolism )



                                                                         డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .

రక్తఘనీభవనము ( Coagulation of blood ) 



    శరీరమునకు గాయములు కలిగినపుడు రక్తస్రావమును నిలిపి అదుపుచేయుటకు రక్తము గడ్డకడుతుంది. రక్తస్రావ నిరోధము ( hemostasis ) రెండు దశలలో జరుగుతుంది.

    ప్రాథమిక రక్తస్థిరత్వ దశలో ( Primary hemostasis  ) రక్తఫలకములు ( platelets ), వాన్ విల్లీబ్రాండ్ ( Von Willebrand factor ) అంశముతో కూడి గాయమునకు అంటుకొని బిరడా వలె రక్తస్రావమును అరికడుతాయి.

    అదేసమయములో ద్వితీయ రక్తస్థిరత్వ దశ ( secondary hemostasis ) కూడా మొదలవుతుంది. ఈ దశలో రక్తనాళపు లోపొర ( intima ) ఛిద్రమగుట వలన లోపొర క్రిందనున్న కణజాలము నుండి కణజాల అంశము ( tissue factor ) విడుదలై వివిధ రక్తఘనీభవన అంశముల ( clotting factors ) ప్రేరేపణను ఆరంభిస్తుంది. చివరకు రక్తములోని తాంతవజని ( fibrinogen ) తాంతవము ( fibrin ) అనే  పోగులుగా మారి కణములను సంధించుకొని గుజ్జుగా రక్తమును ఘనీభవింపజేస్తుంది. రక్తపుగడ్డలు గాయమునకు అంటుకొని రక్తస్రావమును అరికడుతాయి. ఈ ప్రక్రియలో  ప్రోథ్రాంబిన్ అనే రక్త ఘనీభవన అంశము  
( prothrombin - factor 2 ) > థ్రాంబిన్ గా ( thrombin ) మారుతుంది. ఆపై థ్రాంబిన్ ( thrombin ) వలన తాంతవజని ( fibrinogen ) > తాంతవముగా ( fibrin ) మారుతుంది. 


    రక్తము గడ్డకట్టే ప్రక్రియలో లోపములు ఉంటే రక్కస్రావము అధికము కావచ్చును, లేక రక్తపుగడ్డలు ఏర్పడి రక్తప్రసరణకు అవరోధము కలిగించవచ్చును.

    రక్తపుగడ్డలు సిరలలో ( veins ) గాని, ధమనులలో ( arteries ) గాని, హృదయములో గాని ఏర్పడవచ్చును. 
ఈ గడ్డలు రక్తప్రవాహములో కొట్టుకుపోయి దూరముగా రక్తప్రసరణకు అవరోధకములుగా ( emboli ) అంతరాయము కలిగించవచ్చును.


 కాళ్ళ సిరలు ( Veins of lower extremity ) 


    సిరలు రక్తమును హృదయమునకు కొనిపోతాయి. చర్మమునకు దిగువ, కండర ఆచ్ఛాదనమునకు 
( కండరములను ఆవరించి ఉండే గట్టి పొర - deep fascia  ) పైన ఉండు సిరలు బాహ్యసిరలు ( Superficial veins ).

    కండర ఆచ్ఛాదనమునకు లోపల ఉండు సిరలు నిమ్నసిరలు ( deep veins ).

    కాళ్ళలో బాహ్యసిరలు పాదముల నుంచి బయలుదేరుతాయి. పాదము పైభాగములో ఊర్ధ్వపాద సిరచాపము ( dorsal venous arch of foot ) మధ్యస్థముగా ( medially ) చీలమండ (ankle - medial malleolus ) ఎముకకు ముందుగా కాలిపైకి  గరిష్ఠ దృశ్యసిరగా ( great saphenous vein ) ఎగబ్రాకుతుంది. తొడకు మధ్యస్థముగా ( medially ) యీ గరిష్ఠ దృశ్యసిర (  great saphenous vein ) పయనించి తొడ పైభాగములో  దృశ్యసిర రంధ్రము ( saphenous orifice ) ద్వారా కండర ఆచ్ఛాదనము ( deep fascia ) లోనికి చొచ్చి ఊరుసిరతో 
( femoral vein ) కలుస్తుంది.

    ఊర్ధ్వపాద సిరచాపము (dorsal venous arch of foot ) పార్శ్వభాగమున చిటికెనవేలు పైభాగపు అంగుళిక సిరతో ( digital vein ) కలిసి కనిష్ఠ దృశ్యసిరగా ( Lesser Saphenous vein ) చీలమండలము పార్శ్వభాగపు ఎముకకు ( lateral malleolus ) వెనుకగా పైకి ప్రాకి కాలు వెనుక భాగములో పయనిస్తుంది. కాలి పై భాగములో మోకాలు వెనుక ఈ సిర కండర ఆచ్ఛాదనము ( deep fascia ) లోనికి చొచ్చి జానుసిరతో ( popliteal vein ) కలుస్తుంది. జానుసిర, ఊరుసిరగా ( femoral vein ) తొడలోపల పైకి పయనిస్తుంది.

    కాలిలో ఉన్న పూర్వజంఘిక సిర ( Anterior tibial vein ), పృష్ఠజంఘిక సిరల ( Posterior tibial vein ) కలయిక చేత జానుసిర ( Popliteal vein ) ఏర్పడుతుంది. ఇది మోకాలు వెనుక ఉంటుంది. జానుసిర తొడలో ఊరుసిర ( Femoral vein ) అవుతుంది.

    కటివలయములో ( pelvis ) ఊరుసిర  బాహ్య శ్రోణిసిరయై ( external ileac vein ), అంతర శ్రోణిసిరతో 
( internal ileac vein ) సంధానమయి శ్రోణి సిరను ( common ileac vein ) ఏర్పరుస్తుంది.

    వామ, దక్షిణ శ్రోణిసిరల సంధానము వలన అధోబృహత్సిర ( inferior venacava )  ఏర్పడుతుంది.  అధోబృహత్సిర హృదయపు  కుడి కర్ణికకు రక్తమును చేర్చుతుంది.


బాహ్యసిరతాప రక్తఘనీభవనము ( Superficial thrombophlebitis ) 


    బాహ్య సిరలలో తాపము ( inflammation ) వలన రక్తము గడ్డకట్టవచ్చును. సాధారణముగా సిరల ద్వారా మందులను, ద్రవములను, ఇచ్చుట వలన సిరలలో తాపము కలిగి రక్తము గడ్డకడుతుంది. తాపము కలిగిన బాహ్యసిరలలో తాప లక్షణములు కనిపిస్తాయి. తాకుతే నొప్పి, ఎఱ్ఱదనము, వెచ్చదనము కలిగి ఈ సిరలు నులక తాడులులా తగులుతాయి. బాహ్యసిరలలో తాపము కలిగి రక్తము గడ్డకడితే ఆ గడ్డలు సిరలకు అంటుకొని ఉంటాయి. ఇవి గుండెకు, పుపుస ధమనులకు వెళ్ళవు. ఇవి ప్రమాదకరము కావు.

              నిమ్నసిరలలో రక్తము గడ్డకట్టుట ( Deep vein thrombosis ) 


    నిమ్నసిరలలో ( deep veins ) రక్తము గడ్డకడితే రక్తఘనీభవనము ముందుకు వ్యాపించగలదు. 
రక్తపుగడ్డలు ప్రవాహములో ముందుకు సాగి పుపుస ధమనులలో ( pulmonary arteries  ) ప్రసరణకు అవరోధము ( Pulmonary embolism ) కలిగించవచ్చును. పుపుస ధమనులలో రక్తపుగడ్డలు, యితర ప్రసరణ అవరోధకములు ( emboli ) రక్తప్రసరణకు విశేషముగా భంగము కలిగిస్తే  ప్రాణహాని కలిగే అవకాశము ఉన్నది. అందువలన జానుసిర ( popliteal vein  )  పైన సిరలలో రక్తఘనీభవనము జరుగుతే చికిత్స అవసరము.

నిమ్నసిరలలో రక్తఘనీభవనమునకు కారణములు 


    సిరలలో రక్త నిశ్చలత ( stasis ), రక్తపు అధిక ఘనీభవన లక్షణము ( hyper coagulability ), రక్తనాళపు లోపొరలో మార్పులు ( endothelial changes ) రక్తనాళములలో రక్తము ఘనీభవించుటకు కారణము అవుతాయి.

    కదలకుండా, నడవకుండా ఉండుట, ఎల్లపుడు పక్కలపై పడుకొని ఉండుట ( immobility ) రక్తపుగడ్డలు ఏర్పడుటకు ముఖ్యకారణము. శస్త్రచికిత్సలు, క్షతములు ( trauma ), వార్ధక్యము, స్థూలకాయము, కర్కటవ్రణములు ( cancers ), రక్తనాళపు వ్యాధులు ( collagen vascular diseases ), ఎస్ట్రొజెన్ ల వాడుక , గర్భనిరోధక ఔషధముల వాడుక , ధూమపానము, రక్తఘనీభవనమును ఇనుమడింపజేస్తాయి. గర్భిణీ స్త్రీలలో, కాన్పు తర్వాత రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశము హెచ్చు.

    జన్యుపరముగా కొందఱిలో రక్తఘనీభవనమును అరికట్టు మాంసకృత్తుల లోపము వలన రక్తపుగడ్డలు ఏర్పడే అవకాశములు పెరుగుతాయి. మాంసకృత్తి ‘ సి’ , మాంసకృత్తి ‘ఎస్’  ( Protein C, Protein S, ) ఏన్టి థ్రాంబిన్ ( Antithrombin AT ) లోపములు ఉన్నవారిలో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశములు హెచ్చుఈ లోపములు factor V Leiden, prothrombin gene G20210A అనే జన్యువు మార్పుల ( mutation ) వలన కలుగుతాయి. సిష్టాథయొనిన్ బి సింథేజ్ (  cystathionine B synthase ) అనే జీవోత్ప్రేరకపు ( enzyme ) లోపము వలన రక్తములో హోమోసిష్టిన్ ప్రమాణములు పెరిగిన వారిలో రక్తఘనీభవనము ధమనులలోను, సిరలలోను కూడా త్వరితము కాగలదు. వీరు మూత్రములో హోమోసిష్టిన్ విసర్జిస్తుంటారు  ( Homocysteinuria ).

    Paroxysmal nocturnal hemoglobinuria ( PNH ) ( సంవిరామ నిశా రక్తవర్ణక మూత్రము ) అనే వ్యాధి కలవారు అప్పుడప్పుడు రక్తవర్ణకమును ( hemoglobin ) మూత్రములో విసర్జిస్తుంటారు. వీరిలో రక్తపుగడ్డలు అసాధారణపు తావులలో ( ex : cavernous sinus, mesenteric vein, portal vein thrombosis )  కలిగే అవకాశములు హెచ్చు.

    Anti phospholipid antibody syndrome APS  అనే వ్యాధిగ్రస్థులలో స్వయంప్రహరణ ప్రతిరక్షకములు ( auto antibodies) వలన రక్తపుగడ్డలు ఏర్పడే అవకాశములు ఎక్కువ. ఈ వ్యాధి గల స్త్రీలలో గర్భస్రావము, మృతపిండ స్రావములు ( stillbirths ) కలిగే అవకాశములు హెచ్చు. 

నిమ్న సిరలలో రక్తఘనీభవన లక్షణములు 


    కాళ్ళ నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఎక్కువగా ఏర్పడుతాయి. చేతుల సిరలలో చికిత్సలకై కృత్రిమ నాళికలు ఉన్నపుడు, సిరల రక్తప్రవాహమునకు ఇతర అవరోధములు ఉన్నపుడు భుజసిరలలో కూడా రక్తపుగడ్డలు ఏర్పడవచ్చును.

    నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఏర్పడినప్పుడు రక్తప్రవాహము మందగించి సిరలలో రక్తసాంద్రత ( congestion ) పెరుగుతుంది. అందువలన ఆ కాలు ( లేక చేయి ) పొంగుతుంది. నొప్పి, సిరలను తాకినపుడు, నొక్కినపుడు నొప్పి కలుగుట ( tenderness ), వెచ్చదనము, ఎఱ్ఱదనము కూడా పొడచూపితే పొడచూపవచ్చు. పొంగు ఒక కాలిలోను లేక ఒక చేతిలోను కనిపించినపుడు నిమ్నసిర రక్తఘనీభవనమును వైద్యులు దృష్టిలో ఉంచుకొని పరిశోధించాలి..

    హృదయ వైఫల్యము ( Congestive heart failure ), కాలేయ వైఫల్యము ( liver failure ), మూత్రాంగముల వైఫల్యము ( renal failure ), పాండురోగము ( anemia ), రక్తపు మాంసకృత్తులు తగ్గుట ( hypoproteinaemia ) వంటి వ్యాధులలో పొంగు రెండు కాళ్ళలోను కనిపిస్తుంది. 

    బూరకాలు  వంటి రసినాళికలలో( lymphatics ) ప్రవాహమునకు అవరోధము కలిగించే వ్యాధులు సాధారణముగా దీర్ఘకాలిక వ్యాధులు.


పుపుసధమనులలో  అవరోధక పదార్థములు

  ( Pulmonary arterial embolism ) 




    కాళ్ళ నిమ్నసిరలలోను, చేతుల నిమ్న సిరలలోను ఏర్పడే రక్తపుగడ్డలు బృహత్ సిరల ద్వారా హృదయపు కుడిభాగమునకు, ఆపై పుపుస ధమని, దాని శాఖలకు చేరి ఊపిరితిత్తుల రక్తప్రసరణకు అవరోధము కలిగించినపుడు ఊపిరితిత్తులలో పుపుసగోళముల ( alveoli ) నుంచి ప్రాణవాయువు రక్తమునకు చేరదు. రక్తములో బొగ్గుపులుసు వాయువు విసర్జింపబడదు. పుపుస ధమనిలో రక్తపు పోటు పెరిగి  కుడి జఠరికపై పని ఒత్తిడి పెరుగుతుంది. 

    వీరిలో ఆయాసము, ఛాతినొప్పి, దగ్గు, కఫములో రక్తము ( hemoptysis ), గుండెదడ, గుండెవేగము పెరుగుట, అల్ప రక్త ప్రాణవాయు ప్రమాణము ( hypoxemia ), కుడి జఠరిక వైఫల్యపు లక్షణములు, కాళ్ళలో గాని, చేతులలో గాని నిమ్నసిర రక్తఘనీభవన లక్షణములు ( signs of deep vein thrombosis ) కనిపిస్తాయి. రక్తపుగడ్డలు విస్తృతముగా పుపుస ధమనికి చేరినపుడు ఆకస్మిక ప్రాణహానికి అవకాశములు ఉన్నాయి. 

    క్రిందకాలులో సూక్ష్మజీవుల వలన కలిగే కణతాపము ( cellulitis ) లోను, జానుభస్త్రిక బుద్బుదము ( Baker’s cyst of gastrocnemio- semimembranosus bursa ) విచ్ఛిన్నమయినపుడు, పిక్క కండరములు తెగినపుడు ( rupture of gastrocnemius muscle ), చర్మము క్రింద గాని కండరములలో గాని రక్తనాళములు చిట్లి రక్తము గూడుకట్టినపుడు ( hematoma ), చీము తిత్తులు ( abscesses), రసిపొంగులు ( lymphedema ), ధమని బుద్బుదములు ( aneurysms ) వలన, ఉబ్బుసిరల వలన సాంద్రత ( congestion ) పెరిగినపుడు నిమ్నసిరల రక్తఘనీభవన లక్షణములను వంటి లక్షణములు పొడచూపవచ్చును. 

    రోగిని పరీక్షించుట వలన, రక్త పరీక్షలు, శ్రవణాతీతధ్వని పరీక్షల ( ultrasonography & Doppler studies ) వలన వైద్యులు సరియైన వ్యాధి నిర్ణయము చేయగలుగుతారు.

    ఊపిరితిత్తుల తాపము ( pneumonia ), హృద్ధమనీ వ్యాధులు ( Coronary artery diseases ), బృహద్ధమని విదళనము ( dissecting aortic aneurysm ), పుపుసవేష్టన వ్యాధులు ( pleural diseases ), హృత్కోశ తాపము ( pericarditis ), ప్రక్కటెముకల విఱుగుళ్ళు ( rib fractures  ), పక్కటెముకల మృదులాస్థులలో తాపములు ( costochondrtis ) ఛాతినొప్పి, ఆయాసములను కలిగించి పుపుసధమనులలో రక్తప్రసరణ అవరోధకములను ( pulmonary arterial embolism ) పోలి ఉండవచ్చును. 

పరీక్షలు 


 డి- డైమర్ పరీక్ష  ( D- dimer ) 


    శరీరములో రక్తపు గడ్డలను  ప్లాస్మిన్ ( Plasmin ) విచ్ఛేదిస్తుంది. తాంతవ ( fibrin ) విచ్ఛేదనము వలన వచ్చే డి డైమర్ ల ( D- dimer ) విలువలు నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఉన్నవారిలోను, పుపుస ధమనులలో రక్తపుగడ్డలు చేరిన వారిలోను హెచ్చుగా ( 500 మైక్రోగ్రాములు / లీటరునకు మించి ) ఉంటాయి.

    మిగిలిన రోగలక్షణములు లేక, శరీర నిశ్చలత ( Immobility ), సమీపకాలములో  రక్తపుగడ్డల అవకాశములు పెంచే శస్త్రచికిత్సలు, క్షతములు వంటి కారణములు లేనివారిలో డి - డైమరు విలువలు  తక్కువగా ఉంటే వారి నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఉండే అవకాశములు చాలా తక్కువ.

శ్రవణాతీత ధ్వని పరీక్షలు ( Ultrasonography, Doppler studies ) 


    శ్రవణాతీత ధ్వనితరంగ పరీక్షలతో సిరలను చిత్రీకరించినపుడు సిరలలో రక్తపుగడ్డలు కనిపించవచ్చును. రక్తపుగడ్డలు లేని సిరలు ఒత్తిడికి అణుగుతాయి ( compressible ). రక్తపుగడ్డలు ఉన్న సిరలు ఒత్తిడికి అణగవు ( non compressible ). డాప్లర్ పరీక్షతో రక్తగమనమును చిత్రీకరించవచ్చును. నిమ్నసిరలలో రక్తపుగడ్డలు నిరూపించబడకపోతే అవసరమని అనిపిస్తే పరీక్షలను కొద్ది దినముల పిదప మరల చేయవచ్చును.

సిర చిత్రీకరణములు ( Contrast venography )


    వ్యత్యాస పదార్థములను సిరలలోనికి ఎక్కించి సిరలకు  ఎక్స్- రే లు, గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము ( Computerized Axial Tomography ), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు ( Magnetic Resonance Imaging ) చేయవచ్చును. ఈ పరీక్షలను విరివిగా వాడరు.
    పుపుస ధమనులలో రక్తపుగడ్డల వంటి ప్రసరణ అవరోధక పదార్థములు ( pulmonary emboli ) కనిపెట్టుటకు గణనయంత్ర  పుపుస ధమనీ చిత్రీకరణమును ( Computerized axial Tomography Pulmonary Angiograms ) విరివిగా వాడుతారు. 

శ్వాస / ప్రసరణ చిత్రములు ( Ventilation / Perfusion scans ) 


    రేడియోధార్మిక పదార్థములను ఊపిరి ద్వారాను, సిరలద్వారాను ఇచ్చి ఊపిరితిత్తులలో శ్వాసించు భాగములను, రక్తము ప్రసరించు భాగములను చిత్రీకరించవచ్చును ( Ventilation, Perfusion lung scan ; V / Q scan. ). పుపుసధమని శాఖలలో ప్రసరణ అవరోధకములు ( emboli ) ఉన్నపుడు ఊపిరితిత్తులలో ప్రసరణ లోపములు ( perfusion defects ) కనిపిస్తాయి. ఊపిరితిత్తులలో శ్వాసించు భాగములలో లోపములు ( ventilation defects ), శ్వాసనాళికలలో అవరోధకములను కాని, ఊపిరితిత్తులలో తాపమును ( pneumonia ) కాని సూచిస్తాయి. 
    మూత్రాంగ వైఫల్యము ( renal insufficiency ) గలవారిలోను, ఇతర కారణముల వలన ఎక్స్ రే వ్యత్యాస పదార్థములు వాడలేనప్పుడు రేడియోధార్మిక  శ్వాస / ప్రసరణ ( V / Q scans ) చిత్రీకరణములు ఉపయోగపడుతాయి.
    పుపుసధమని చిత్రీకరణము ( catheter Pulmonary angiogram ) ఉపయోగకరమే కాని గణనయంత్ర పుపుస ధమనీ చిత్రీకరణములనే ( CT  Pulmonary Angiogram ) విరివిగా వాడుతారు.

ఇతర పరీక్షలు 


    విద్యుత్ హృల్లేఖములు ( electrocardiography ), ఛాతి ఎక్స్ రేలు, ధమనీ రక్త వాయుపరీక్షలు (arterial blood gas studies ), జీవవ్యాపార రక్త పరీక్షలు (metabolic blood tests), రక్తములో ట్రొపోనిన్ ( troponin ),  శ్రవణాతీత ప్రతిధ్వని హృదయ చిత్రీకరణములు ( echocardiography ) పరోక్షముగా ఉపయోగపడుతాయి. 

చికిత్స 


    బాహ్య సిరలలో తాపమునకు, రక్తము గడ్డకట్టుటకు రక్తఘనీభవన అవరోధకములను ( anticoagulants ) వాడరు. నొప్పికి తాప నివారణులను ( anti inflammatory agents ) వాడవచ్చును. 

    మోకాలి క్రింద జానుసిరకు ( popliteal vein ) క్రింద ఉన్న  నిమ్నసిరలలో రక్తము ఘనీభవనము చెందుతే నొప్పికి ఉపశమన చికిత్స సరిపోతుంది. కాని రక్తఘనీభవనము తొడలో ఊరుసిరకు ( femoral vein ) వ్యాపిస్తే రక్తఘనీభవన అవరోధకములతో ( anticoagulants ) చికిత్స అవసరము .

రక్తఘనీభవన అవరోధకములు ( Anticoagulants ) 


    నిమ్నసిరలలో రక్తము గడ్డకట్టినా, పుపుస ధమని దాని శాఖలలో రక్తపుగడ్డలు ప్రసరణ అవరోధకములుగా ( pulmonary artery embolism ) చేరినా, నొప్పి, కాళ్ళపొంగులు, వ్రణములు, పుపుస ధమనిలో అధిక రక్తపుపోటు ( Pulmonary hypertension ), ఆకస్మిక మరణము వంటి పరిణామములు నివారించుటకు  చికిత్స అవసరము. చికిత్సకు ముందు రోగమును ధ్రువీకరించాలి.

    చికిత్సకు ముందు, ప్రాథమిక రక్తపరీక్షలు అవసరము. రక్తకణ గణనములు, జీవవ్యాపార పరీక్షలు ( metabolic blood tests ), రక్తఘనీభవన పరీక్షలు (  ProTime / International Normalised Ratio ; PT/ INR ), Activated Partial Thromboplastin Time ( APTT ) అవసరము.

    చికిత్సను హెపరిన్ తో ( Unfractionated Heparin ) గాని, తక్కువ అణుభారపు హెపరిన్ తో  ( Low Molecular Weight Heparin ( LMWH ) గాని, ఫాండాపేరినక్స్ తో ( fondaparinux ) గాని  ప్రారంభించి అదేసమయములో విటమిన్ ‘ కె ‘అవరోధకము వార్ఫెరిన్ ( Warfarin ) కూడా మొదలు పెడుతారు. 

    హెపరిన్ ను సిర ద్వారా ఇస్తారు. APTT విలువలు గమనిస్తూ మోతాదును సరిదిద్దుతారు. తక్కువ అణుభారపు హెపరిన్ ను ( Low Molecular Weight Heparin )  చర్మము దిగువ సూదిమందుగా ఇస్తారు. మూత్రాంగ వైఫల్యము  ( Renal insufficiency ) ఉన్నవారిలో దీని మోతాదును తగ్గించాలి. మూత్రాంగ వైఫల్యము తీవ్రముగా ఉంటే LMWH ను వాడకూడదు.

    Fondaparinux ను కూడా చర్మము క్రింద సూదిమందుగా ఇస్తారు. మూత్రాంగ వైఫల్యము ఉన్నవారిలో దీని మోతాదును తగ్గించాలి.

    హెపరిన్, తక్కువ అణుభారపు హెపరిన్ , fondaparinux లను కనీసము 5 దినములు వాడాలి. విటమిన్ కె అవరోధకము వార్ఫరిన్ ( నోటి ద్వారా ) మొదలు పెట్టి PT / INR రక్తపరీక్షలతో  మోతాదును సరిదిద్దుతు INR విలువ 2 కు వచ్చాక హెపరిన్, LMWH, fondaparinux లను మానివేస్తారు. 

    రక్తఘనీభవన అంశము Xa (10 a ) కు అవరోధకములు ( Factor X a inhibitors ) ఎపిక్సబాన్ ( apixaban ), రివరోక్సబాన్  ( rivaroxaban ), ఎండోక్సబాన్ (  endoxaban ), వార్ఫరిన్ కు ( Warfarin  ) బదులుగా వాడుటకు యిపుడు ప్రాచుర్యములో ఉన్నాయి. మూత్రాంగ వ్యాపారము బాగున్నవారిలో వీటి  మోతాదులను సరిదిద్దవలసిన అవసరము లేదు. PT / INR పరీక్షల అవసరము లేదు.

    డాబిగాట్రన్ ( dabigatran ) థ్రాంబిన్ అవరోధకము ( Thrombin inhibitor ) వార్ఫరిన్ బదులు రక్తము గడ్డకట్టుటను అరికట్టుటకు వాడవచ్చును.
 
    రక్తఘనీభవనము కలిగించే యితర వ్యాధులు లేనివారిలో రక్తఘనీభవన అవరోధకములను ( anticoagulants ) మూడు మాసములు వాడుతారు.

    రక్తఘనీభవనము శీఘ్రతరము కావించు వ్యాధులు ఉన్నవారిలో చికిత్స నిరంతరముగా  వాడవలసి ఉంటుంది. 

    చికిత్స వలన రక్తస్రావములు అధికముగా కలుగుతే రక్తఘనీభవన అవరోధకములను (anticoagulants ) తాత్కాలికముగా ఆపివేయాలి.

 అధోబృహత్సిరలో జల్లెడలు ( inferior vena cava filter devices ) 


    కాళ్ళ నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఏర్పడిన వారిలో రక్తస్రావ ఉపద్రవములు ( hemorrhage complications ) ఉండుట వలన రక్తఘనీభవన అవరోధకములు ( anticoagulants) వాడలేనపుడు వారి అధో బృహత్సిరలో ( inferior vena cava ) జల్లెడ పరికరములను అమర్చి పుపుస ధమనులలోనికి రక్తపుగడ్డలు చేరకుండా నిరోధిస్తారు.

రక్తపుగడ్డల విచ్ఛేదన చికిత్స ( Thrombolytic therapy ) 


    పుపుస ధమని, దాని శాఖలలో విస్తృతముగా రక్తపుగడ్డలు చేరుకొని ( massive pulmonary arterial embolism ) రక్తపీడనము పడిపోతే ( hypotension ) వ్యాధిగ్రస్థులకు అధిక రక్తస్రావ ప్రమాదము లేనప్పుడు సిర ద్వారా recombinant tissue plasminogen activator ( alteplase ) ని ఎక్కించి రక్తపుగడ్డలను విచ్ఛేదించు యత్నము చేస్తారు. 

    హృదయపు కుడి భాగము వైఫల్యము పొందినపుడు, పుపుస ధమనిలో రక్తపుగడ్డలను విచ్ఛేదించుటకు rtpa ను ( alteplase ) వాడవచ్చును.

ఇతర చికిత్సలు 


    నిమ్నసిరలలో రక్తపుగడ్డల వలన కాళ్ళలో పొంగులు ఉంటే కాళ్ళను ఎత్తుగా ఉంచుతే పొంగు తగ్గే అవకాశము ఉన్నది. ( హృదయవైఫల్యము ( congestive heart failure ) వలన రెండు కాళ్ళు, రెండు పాదములలో పొంగులు ఉన్న రోగులు కాళ్ళను ఎత్తుగా పెట్టుకో కూడదు. అలా చేస్తే కాళ్ళలోను, పాదముల లోను చేరిన ద్రవము గుండెకు, ఊపిరితిత్తులకు చేరి ఆయాసము హెచ్చయే అవకాశము ఉంది. )
   
    సాగు మేజోళ్ళు ( graduated elastic stockings ) కాళ్ళ పొంగులు తగ్గించుటకు ఉపయోగపడుతాయి.

చలనము ( ambulation ) 


    నిశ్చలత వలన నిమ్న సిరలలో రక్తపుగడ్డలు ఏర్పడుతాయి. అందువలన వ్యాధిగ్రస్థులను నడవమని ప్రోత్సహించాలి. నడవగలిగిన వారు ఎల్లప్పుడు మంచము పట్టుకొని ఉండకూడదు. 

    ప్రాణాపాయ పరిస్థితులలో మందులతో రక్తపుగడ్డల విచ్ఛేదన జరగనపుడు, కృత్రిమనాళములతో పుపుస ధమనిలోని రక్తపుగడ్డలను తొలగించుట ( catheter embolectomy ), శస్త్రచికిత్సతో పుపుస ధమనిలోని రక్తపుగడ్డలను తొలగించుట ( surgical embolectomy ) వంటి ప్రక్రియలు అనుభవజ్ఞులు చేపట్టవచ్చును.

నివారణ       


    నడక, కాలి పిక్కల వ్యాయామము ( calf exercises ), చలనము ( ambulation ), నిమ్నసిరలలో రక్తపుగడ్డలను నివారించుటకు తోడ్పడుతాయి. శస్త్రచికిత్సల తర్వాత రోగులను త్వరితముగా నడిపించుటకు యత్నించాలి. కాలి పిక్కలపై విరామములతో ఒత్తిడి పెట్టు సాధనములు, కాళ్ళకు వ్యాయామము చేకూర్చు సాధనములు రక్తపుగడ్డలను నివారించుటకు తోడ్పడుతాయి.

    కృత్రిమ కీళ్ళ శస్త్రచికిత్సల తర్వాత రక్తఘనీభవన అవరోధకములను కొన్ని వారములు వాడుతారు. రక్తఘనీభవన అవకాశములు హెచ్చుగా ఉన్నవారిలో కూడా రక్తము గడ్డకట్టుట నివారించు ఔషధములను జాగ్రత్తగా వాడాలి. 


పదజాలము 


Abscess = చీము తిత్తి ( గ.న )
Alveoli = పుపుసగోళములు ( గ.న )
Aneurysm = ధమని బుడగ ; ధమనీ బుద్బుదము ( గ.న )
Anterior tibial vein = పూర్వజంఘిక సిర ( గ.న )
Arterial blood gas studies = ధమనీరక్త వాయుపరీక్షలు ( గ.న )
Anti inflammatory agents = తాప నివారణులు (గ.న )
Anticoagulants = రక్తఘనీభవన అవరోధకములు ( గ.న )
Auto antibodies = స్వయంప్రహరణ ప్రతిరక్షకములు ( గ.న )
Baker’s cyst of Gastrocnemio- semimebranosus bursa  = జానుభస్త్రిక బుద్బుదము ( గ.న )
Cancers = కర్కటవ్రణములు ( గ.న )
Clotting factors = రక్తఘనీభవన అంశములు ( గ.న )
Common ileac vein  = శ్రోణిసిర ( గ.న )
Computerized Axial Tomography = గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము ( గ.న ) ; గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము ( గ.న )
Coronary artery diseases = హృదయధమనీ వ్యాధులు 
costochondrtis = పార్శ్వాస్థి-మృదులాస్థి తాపము ( గ.న )
Deep fascia = కండర ఆచ్ఛాదనము ( గ.న )
Deep veins = నిమ్నసిరలు ( గ.న )
Deep vein thrombosis = నిమ్నసిర రక్తఘనీభవనము ( గ.న )
Digital vein  = అంగుళిక సిర ( గ.న )
Dissecting aortic aneurysm = బృహద్ధమని విదళన వ్యాకోచము ( గ.న )
Dorsal venous arch of foot = ఊర్ధ్వపాద సిరచాపము  ( గ.న )
Echocardiography =  ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము ( గ.న )
Emboli = రక్తప్రసరణ అవరోధక పదార్థములు ( గ.న )
External ileac vein = బాహ్యశ్రోణిసిర ( గ.న )
Femoral vein  = ఊరుసిర 
Fibrin = తాంతవము 
Fibrinogen = తాంతవజని 
Great saphenous vein = గరిష్ఠ దృశ్యసిర ( గ.న )
hematoma = కణజాలపు రక్తపుగడ్డ ( గ.న )
Hemoptysis  =  రక్త కఫము
Hemostasis = రక్తస్రావ నివారణ ; రక్తస్థిరత్వము ( గ.న )
Hyper coagulability =  అధిక ( శీఘ్ర ) రక్త ఘనీభవనము ( గ.న )
Inferior venacava = అధోబృహత్సిర 
Internal ileac vein = అంతర శ్రోణిసిర 
Intima = రక్తనాళపు లోపొర  ( గ.న )
Lesser saphenous vein = కనిష్ఠ దృశ్యసిర ( గ.న )
Magnetic Resonance Imaging = అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న )
Medially = మధ్యస్థముగా 
Perfusion defects = రక్త ప్రసరణ లోపములు ( గ.న )
Paroxysmal nocturnal hemoglobinuria ( PNH ) = సంవిరామ నిశా రక్త ( వర్ణక ) మూత్రము ( గ.న )
Pericarditis = హృత్కోశ తాపము ( గ.న )
Platelets = రక్తఫలకములు ( గ.న )
Pleural diseases = పుపుసవేష్టన వ్యాధులు 
Popliteal vein = జానుసిర ( గ.న )
Posterior tibial vein = పృష్ఠజంఘిక సిర ( గ.న )
Primary hemostasis  = ప్రాథమిక రక్తస్థిరత్వము ( గ.న )
Pulmonary arteries = పుపుస ధమనులు
Pulmonary arterial embolism = పుపుసధమనిలో( రక్తప్రసరణ ) అవరోధకము ( గ.న )
Saphenous orifice  = దృశ్యసిర రంధ్రము ( గ.న )
Secondary hemostasis  = ద్వితీయ రక్తస్థిరత్వము ( గ.న )
Superficial veins = బాహ్యసిరలు
Thrombolytic therapy = రక్తపుగడ్డల విచ్ఛేదన చికిత్స ( గ.న )
Ultrasonography = శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ ( గ.న )
ventilation defects = శ్వాస లోపములు ( గ.న )


( వైద్యవిషయములను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )

3 కామెంట్‌లు:

  1. Telugu vyaasam chala bagunnadi, maximum sanscrit words unnavi, anuvaada rachayita ga meeru pari poorna siddha hastulu💐🙏🏼,meeku Vijaya prapti kalagaalani aasistu,Mee dr kvv subrahmanyam

    రిప్లయితొలగించండి
  2. గన్నవరపు నరసింహమూర్తి30 డిసెంబర్, 2022 4:30 PMకి

    ధన్యవాదములు డా.సుబ్రహ్మణ్యం గారూ !

    రిప్లయితొలగించండి
  3. గన్నవరపు నరసింహమూర్తి30 డిసెంబర్, 2022 4:34 PMకి

    ధన్యవాదములు డా. సుబ్రహ్మణ్యం గారూ !

    రిప్లయితొలగించండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...