1, జూన్ 2019, శనివారం

కొవ్వులు ; కొలెష్టరాలు ( Fats & Cholesterol )

( తెలుగుతల్లి- కెనడా లో ప్రచురించబడిన నా వ్యాసము. వారికి ధన్యవాదములతో ) :

                                  క్రొవ్వులు - కొలెష్ట్రాలు


                                                                             డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.


ధమనీకాఠిన్యము ( Atherosclerosis ) 



    పాతదినాలలో తరచు వినేవారము కాదు గాని యీ తరములో చాలామంది అధిక కొలెష్ట్రాలు ( Cholesterol ) గురించి వినే ఉంటారు. గుండెపోటులు ( Heart attacks ), మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro vascular accidents ) దూర రక్తప్రసరణ లోపాలకు ( Peripheral vascular diseases  ), ధమనీకాఠిన్యము ( Atherosclerosis ) కారణమని వైద్యశాస్త్రజ్ఞులు గ్రహించిన తరువాత, ధమనులు బిరుసు ఎక్కడానికి క్రింది హేతువులను పరిశీలనల వలన, గణాంకముల వలన వైద్యులు గ్రహించారు.

    1). రక్తపు పోటు ( Hypertension)
    2) మధుమేహవ్యాధి ( Diabetes mellitus )
    3) పొగత్రాగడము
    4) అధిక కొలెష్ట్రాలు ( Hypercholesterolemia )
    5) ఊబకాయము ( Obesity)
    6) వ్యాయామలోపము
    7) వంశానుగతము
    8). వృద్ధాప్యముల

    వలన ధమనులు బిరుసెక్కడము, సన్నబడడము, ఇరుకుబడుట  జరిగి దుష్ఫలితములు కలుగవచ్చును.

    వయస్సుతో బాటు పైన పేర్కొన్న కారణాల వలన ధమనుల లోపొర ( Intima ) క్రింద కొలెష్ట్రాలు, కొవ్వులు  క్రమేణ పేరుకొంటాయి. రక్తములో ఉన్న కొవ్వులను భక్షక కణములు ( macrophages ) మింగి ధమనుల లోపొర క్రింద చేరుకుంటాయి. కొవ్వులు, కొలెష్ట్రాలను మింగిన భక్షణ కణాలు ఫేనకణములుగా ( Foam cells ) మారుతాయి. ఈ కణాలు విచ్ఛిన్నమయినపుడు ఆ కొవ్వులు బయటకు రావడము వాటిని మరల కబళించడానికి మరికొన్ని తెల్లకణాలు, భక్షక కణాలు చేరడము, ఆ ప్రాంతములో తాప ప్రక్రియ ( Inflammation) కలగడము జరుగుతాయి. కాల్షియం కూడా క్రమేణ  చేరి ఫలకలు ( Plaques) ఏర్పడుతాయి. ఈ విధముగా ధమనులు బిరుసెక్కి నాళముల లోపలి పరిమాణము కుచించుకు పోతుంది. ఈ ఫలకములు పగుళ్ళు పెట్టినపుడు అచ్చట రక్తము గడ్డకడితే రక్తప్రసరణకు అంతరాయము కలుగుతుంది. హృదయ ధమనులలో ఈ ప్రక్రియ కలుగుతే గుండెపోటులు, మస్తిష్క రక్తనాళాలలో యీ ప్రమాదము జరిగినపుడు మస్తిష్క రక్తనాళ విఘాతాలు ( Cerebro vascular accidents ) కలుగుతాయి.

    ఈ ధమనీ కాఠిన్యమును అదుపులో పెట్టాలంటే ఆ కారణాలను అదుపులో పెట్టాలి కదా! రక్తపుపోటును అదుపులో ఉంచడము, మధుమేహవ్యాధిని నియంత్రించడము, ధూమపానము మాని వేయడము, తగినంత వ్యాయామము చేయడము, శరీరపు బరువును అదుపులో ఉంచడము అవసరము. రక్తములో ఉన్న కొలెష్ట్రాలు, ట్రైగ్లిసరైడులు ( Triglycerides) అనే  కొవ్వులు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నాలను చెయ్యాలి

కొలెష్ట్రాలు ( Cholesterol) 


    ఇది ఒక రకమైన కొవ్వు. పైత్యరసము( Bile ) లోను, పిత్తాశయములో ( Gallbladder) ఏర్పడే రాళ్ళలోను ఉన్న దీనిని తొలుత కనుగొన్న తరువాత కొలెష్ట్రాలు వివరాలను శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. వృక్షములలో కొలెష్ట్రాలు చాలా చాలా అరుదు. కాని జంతుజాతులలో కాలేయములో ( Liver ) విరివిగాను, అన్ని కణాలలోను కొలెష్ట్రాలు ఉత్పత్తి జరుగుతుంటుంది. వృక్షజాతి కణాలకు కణకుడ్యాలు ( Cell Walls ) ఉన్నట్లు జంతువుల కణాలకు స్థిరమైన గోడలు ఉండవు. జంతుకణాలకు పైపొరలే  ( Cell membranes ) ఉండడము వలన కణాల ఆకారము మారుటకు, చలనానికి , కావలసిన సారళ్యము, మృదుత్వము చేకూరుతుంది. జంతుకణముల పైపొరలు, కొలెష్ట్రాలు, ఫాస్ఫోలైపిడులు ( Phospholipids), ఎపోప్రోటీనులుతో ( apoproteins) నిర్మితమవుతాయి. పైత్యరస ఉత్పత్తికి, ఎడ్రినల్ వినాళగ్రంధుల స్రావకాల ఉత్పత్తికి, స్త్రీ, పుంస్త్వ హార్మోనుల ( Estrogen and Testosterone ) ఉత్పత్తికి, కొలెష్ట్రాలు అవసరమే. కొంత కొలెష్ట్రాలు ఆహారము వలన సమకూడినా, కాలేయములోను, వివిధ కణములలోను ఉత్పత్తి జరిగి కూడా కొలెష్ట్రాలు రక్తములోనికి ప్రవేశిస్తుంది. పైత్యరసము ద్వారా కొంత కొలెష్ట్రాలు ప్రేవులలోనికి చేరినా, అందులో చాలా భాగము చిన్నప్రేవులద్వారా  గ్రహించబడి తిరిగి కాలేయమునకు చేరుతుంది. రక్తములో కొలెష్ట్రాలు ఎక్కువయితే అది ధమనీ కాఠిన్యమునకు దారితీస్తుంది.


ట్రైగ్లిసరైడులు ( Triglycerides ) 


    గ్లిసరాలుతో ( Glycerol) వసామ్లములు ( Fatty acids )  సంయోగము చెందుట వలన  ట్రైగ్లిసరైడులు అనే క్రొవ్వు పదార్థాలు  ఏర్పడుతాయి. మనము తినే కొవ్వుపదార్థాలలో యివి ఉంటాయి. శరీరములో కూడా ఉత్పత్తి అవుతాయి. శరీరమునకు శక్తి చేకూర్చడానికి  ఇవి ఉపయోగపడుతాయి. అవసరానికి మించిన కొవ్వులు శరీర అవయవములలోను, కొవ్వుపొరలలోను నిలువ ఉంటాయి. రక్తములో ట్రైగ్లిసరైడుల ప్రమాణము పెరుగుతే అవి ధమనుల బిరుసుతనానికి తోడ్పడుతాయి.


లైపోప్రోటీనులు ( Lipoproteins ) 


    కొవ్వుపదార్థములు నీటిలో కరుగవు. వాటికి జలవికర్షణ ( Hydrophobia ) ఉండుటచే రక్తములో ఎపోప్రోటీనులనే ( Apoproteins ) వాహక మాంసకృత్తులతో కలిసి అవయవాలకు కణజాలానికి కొనిపోబడుతాయి. ఆ మాంసకృత్తులు, కొవ్వుల సంయోగములను లైపోప్రోటీనులు ( lipoproteins ) అంటారు. ఈ లైపోప్రోటీను నలుసులులో కొలెష్ట్రాలు, ట్రైగ్లిసరైడులు, యితర కొవ్వులు లోపల నిక్షేపమయి ఉంటే, వాటిని ఆవరించి ఒక ఫాస్ఫోలైపిడు, కొలెష్ట్రాలుపొర ఎపోప్రోటీనులతో ఉంటుంది. ఈ ఫాస్ఫోలైపిడులకు జలాపేక్షక ( Hydrophilic ) ధ్రువములు వెలుపలి వైపును, జలవికర్షణ ( Hydrophobic) ధ్రువములు లోపలివైపున ఉంటాయి. అందువలన లైపోప్రోటీనులు రక్తముతో కలిసి అవయవములకు చేర్చబడ గలుగుతాయి.

    ఈ లైపోప్రోటీనులను  సాంద్రత బట్టి ఐదు తరగతులుగా విభజిస్తారు.

    1) ఖైలోమైక్రానులు, ( Chylomicrons )  వీనిలో 90 శాతము ట్రైగ్లిసరైడులు, కొలెష్ట్రాలు 3 శాతము ఉంటాయి )

    2) అల్పతమ సాంద్ర లైపోప్రోటీనులు  ( Very low density lipoproteins) : వీనిలో ట్రైగ్లిసరైడులు 55 % కొలెష్ట్రాలు 20 శాతము ఉంటాయి.

    3) అల్పతర సాంద్ర లైపోప్రోటీనులు. ( Intermediate density lipoproteins): వీటిలో ట్రైగ్లిసరైడులు 30% కొలెష్ట్రాలు 35 % ఉంటాయి.

    4) అల్పసాంద్ర లైపోప్రోటీనులు ( Low density lipoproteins): వీటిలో ట్రైగ్లిసరైడులు 10 శాతము కొలెష్ట్రాలు 50 శాతముంటాయి.

    5) అధిక సాంద్ర లైపోప్రోటీనులు ( High density lipoproteins); వీటిలో ట్రైగ్లిసరైడులు 5 శాతము  కొలెస్ట్రాలు 20 % ఉంటాయి.

    ఇవి కాక Lp (a) అనే మరి ఒక లైపోప్రోటీనును కూడా వర్ణించారు. ఇది అల్పసాంద్ర, అధికసాంద్ర లైపోప్రోటీనుల మధ్య యిముడుతుంది.

    కాలేయములోను, అవయవాలలోను, కణజాలములోను లైపేసు ( Lipase ) అనే జీవోత్ప్రేరకము ( enzyme ) వలన గ్లిసరాలు ( Glycerol), వసామ్లములు ( fatty acids ) తొలగించబడి అల్పతమ సాంద్ర లైపోప్రోటీనులు ( VLDLs ) అల్పసాంద్ర లైపోప్రోటీనులుగా ( LDL s )  మారుతాయి.

    అల్పసాంద్ర లైపోప్రోటీనుల వలన ధమనీకాఠిన్యత ( atherosclerosis ) కలుగుతుంది కాబట్టి వీటిని చెడు కొలెష్ట్రాలుగా పరిగణిస్తారు.

    అధికసాంద్ర లైపోప్రోటీను లేశములు కణజాలము నుంచి క్రొవ్వులను తొలగించి కాలేయమునకు చేరుస్తాయి. ఇవి ధమనీకాఠిన్యము నివారించుటకు సహాయపడుతాయి కావున వీటిని మంచి కొలెష్ట్రాలుగా పరిగణిస్తారు.

    పరగడుపున ( పన్నెండు గంటల ఉపవాసము తర్వాత ) చేసే రక్తపరీక్షలతో వివిధ లైపోప్రోటీనుల పరిమాణ విలువలు తెలుసుకోవచ్చును.

    జన్యువులు, భోజన విధానాలు, వ్యాయామము, మద్యపానముల వినియోగము, ధూమపానము యితర ఔషధులు ఈ పరిమాణ విలువలపై ప్రభావము చూపిస్తాయి.

    ధమనీ కాఠిన్యము కలిగించే యితర ప్రమాదహేతువులను అనుసరించి అల్పసాంద్ర లైపోప్రోటీనులు ( LDL ), టైగ్లిసరైడులు ఏ పరిమాణములలో ఉంటే ప్రమాదకరమో నిర్ణయించి వాటిని తగ్గించే ప్రక్రియలను, మందులను వాడుకోవాలి

    గుండెపోటులకు గురియైన వారిలో 90 శాతము మందిలో అల్పసాంద్ర లైపోప్రోటీనులో ( LDL ), Lp(a) వో, ట్రైగ్లిసరైడులోఎక్కువవడమో, లేక అధికసాంద్ర లైపోప్రోటీనులు ( HDL ) తక్కువవడమో కనిపిస్తుంది. ఈ క్రొవ్వు విపరీతములను ( Dyslipidemias ) పిన్నవయస్సులోనే రక్తనాళ వ్యాధులను కలుగజేస్తాయి. అందువలన రక్తపరీక్షలతో వీటిని కనిపెట్టి చికిత్సకు పూనుకొనాలి.

    ఇరువది సంవత్సరాల వయస్సు తరువాత తొలిసారి రక్తపరీక్షలు జరపాలని, ఎట్టి లోపాలు లేకపోతే ఆ తరువాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొవ్వుపదార్థాలకై పరగడపు రక్తపరీక్షలు చేయాలని హృదయ వైద్య నిపుణులు సూచనలు ఇస్తారు.

    కొవ్వులు, కొలెష్ట్రాలు ఎక్కువయితే జీవనశైలిలో మార్పులు, ఔషధాలు అవసరము.


జీవనశైలి మార్పులు 

       
    ఆహారములో కొవ్వుపదార్థాలను తగ్గించుట, సంతృప్త వసామ్లములు ( Saturated fatty acids ) గల తైలములు తగ్గించి అసంతృప్త వసామ్లములు ( Unsaturated fatty acids ) గల తైలముల వాడుక పెంచుట, ఎక్కువ బరువుంటే బరువు తగ్గుట, తగినంతగా వ్యాయామము చేయుట, పొగత్రాగుట మానుట, మద్యము వినియోగము తగ్గించుట, రక్తపుపోటు, మధుమేహవ్యాధులను అదుపులో పెట్టుట చాలా అవసరము. కుసుమనూనె ( safflower oil ), పొద్దుతిరుగుడు నూనె, ద్రాక్షవిత్తుల నూనె, ఆలివ్ నూనెలలో అసంతృప్త వసామ్లములు ఎక్కువగా ఉంటాయి. వాటి వాడుక మేలు. జంతు సంబంధపు కొవ్వులలో కొలెష్ట్రాలు, సంతృప్త వసామ్లములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి వాడుకను తగ్గించుకొనుట మంచిది. 

   హృద్ధమని వ్యాధి చరిత్ర ఉండి, పెక్కు ప్రమాద హేతువులు ( risk factors ) ఉంటే, అల్పసాంద్ర లైపోప్రోటీనుల ( LDL ) పరిమితి 70 మి .గ్రా / డె .లీ కంటె తక్కువకు తీసుకురావాలి.

    రెండుకి మించి ప్రమాద హేతువులు ఉన్నవారిలో అల్పసాంద్ర లైపోప్రోటీనులను 100 మి.గ్రా. / డె.లీ కంటె తక్కువకు తీసుకురావాలి.

    ప్రమాదహేతువులు లేని వారిలో అల్పసాంద్ర లైపోప్రోటీనుల పరిమితి 160 మి.గ్రా. / డె.లీ కంటె తక్కువకు దించాలి.

    ఈ పరిమితుల కంటె ఎక్కువగా చెడు కొలెష్ట్రాలు ( LDL ) ఉంటే మందులు అవసరము.

ఔషధములు 

స్టాటినులు ( Statins )  


    స్టాటినులుగా ప్రాచుర్యములో ఉన్న  3- హైడ్రాక్సీ, 3- మెథైల్ గ్లుటరిల్  కోఎంజైం - ఎ రిడక్టేజ్  అవరోధకములను ( HMG-CoA reductase (3-hydroxy-3-methyl-glutaryl-coenzyme A reductase inhibitors ) విరివిగా యిప్పుడు వైద్యులు వాడుతారు. ఇవి ప్రమాదకర హృద్రోగముల సంఖ్యలను బాగా తగ్గించడము వైద్యులు గమనించారు. పెక్కు సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉన్న నేను యీ స్టాటినుల సత్ఫలితాలకు ప్రత్యక్ష సాక్షిని. నా వద్ద వైద్యము చేయించుకొనే రోగులలో సత్ఫలితాలను నిత్యము చూస్తున్నాను. ప్రావస్టాటిన్ (pravastatin ), సింవాస్టాటిన్ ( simvastatin ), అటోర్వస్టాటిన్ ( atorvastatin ), రొసువాస్టాటిన్ ( rosuvastatin ), లోవాస్టాటిన్ ( lovastatin ), ఫ్లూవాష్టాటిన్ లు (fluvastatin ) ఉదాహరణలు.

    కండరాల నొప్పులు, కండరాల నీరసము, కీళ్ళనొప్పులు వంటి విపరీత పరిణామాలు వీటి వలన కలుగ వచ్చును. కండరకణ విచ్ఛేదనము ( Rhabdomyolysis ) జరిగి క్రియటినిన్ కైనెజ్ ( creatinine kinase ) విలువలు పెరుగ వచ్చును. ఈ పరిణామాలు కలుగుతే ఆ మందులను ఆపివేయాలి. వేఱొక స్టాటిన్ ని తక్కువ మోతాదుతో ప్రయత్నించవచ్చును.

    ఈ స్టాటిన్ లను వాడేటప్పుడు కాలేయ జీవోత్ప్రేరకములను  ( Liver enzymes ) రెండు మూడు నెలలకు ఒకసారి ఒక ఆరు మాసములు ఆపై ప్రతి ఆరుమాసములకు పరీక్ష చేయాలని సూచిస్తారు. ఆవి రెండు మూడు రెట్లు పెరుగుతే స్టాటిన్లను మానవలసిన అవసరము కలుగవచ్చును. ఈ స్టాటినుల వలన తీవ్ర కాలేయవ్యాధులు చాలా, చాలా అరుదు. గుండెవ్యాధులు అరికట్టబడి ఆయుస్సు పెరిగే అవకాశమే చాలా ఎక్కువ .

    స్టాటినులు cytochrome - P 450 ఎంజైముల ద్వారా ఛేదింపబడి విసర్జింపబడుతాయి కనుక
 P 450 ఎంజైముల ద్వారా విసర్జింపబడే  ఔషధాలను వాడవలసి వచ్చేటప్పుడు స్టాటిన్లను తాత్కాలికముగా ఆపివేయాలి. ఎరిత్రోమైసిన్ ( erythromycin ) సంబంధ ఔషధులు, జెమ్ ఫైబ్రొజిల్ ( gemfibrozil ), కీటోకొనజాల్ ( ketoconazole ), ఇట్రాకొనజాల్ ( itraconazole ), మందులు కొన్ని ఉదాహరణలు. వీనిని వాడునపుడు స్టాటినులను తాత్కాలికముగా ఆపివేయాలి. 

    పైత్యరసామ్లములను వేఱ్పరచు మందులు  ( Bile acid sequestrant resins ); కొలిస్టరమిన్ ( cholestyramine ), కొలిస్టిపొల్ ( colestipol ), వంటి మందులు పైత్యరసామ్లములతో కూడి, ఆంత్రములద్వారా కొలెష్ట్రాల్ మరల గ్రహించబడకుండా చూస్తాయి.

    నయాసిన్ ( niacin ), ఎజెటిమైబ్ ( ezytimibe ) మందులు కూడా కొలెస్ట్రాల్ తగ్గించుటకు ఉపయోగ బడుతాయి.

PCSk9 అవరోధకము


       ఎవొలోకుమాబ్ ( Evolocumab ) అను ఔషధము  pro protein convertase subtilisin / kexin type 9 అనే మాంసకృత్తిని అవరోధించు ఏకరూప ప్రతిరక్షకము ( monoclonal antibody ). PCSK9  కాలేయములో LDL విచ్ఛేదన గ్రాహకములను నిరోధించి కాలేయకణములలో చెడు కొలెష్ట్రాలు విచ్ఛేదనమును మందగింపజేస్తుంది. PCSK9 ని అవరోధించి ఎవొలోకుమాబ్ చెడు కొలెష్ట్రాల్ విచ్ఛేదనమును ఇనుమడింపజేసి రక్తములో LDL కొలెష్ట్రాల్ విలువలు తగ్గిస్తుంది. ఈ మందు చాలా ఖరీదైనది కావున అరుదైన పరిస్థితులలో దీనిని వాడుతారు. 


ట్రైగ్లిసరైడుల ఆధిక్యము  ( Hyper triglyceridemia )  

         
    రక్తములో ట్రైగ్లిసరైడులు 200 మి.గ్రాములు మించితే చికిత్స అవసరము. బరువు తగ్గుట, వ్యాయామము పెంచుట, మద్యము వినియోగము మానుట, మితాహారము, మధుమేహవ్యాధిని అరికట్టుట, వంటి జీవనశైలి మార్పులు ట్రైగ్లిసరైడులను తగ్గించుటకు తోడ్పడుతాయి.

          నయాసిన్ ( niacin ), ఫిబ్రేటులు ( fibrates ), జెంఫైబ్రొజిల్ ( gemfibrozil ), ఒమెగా - 3 వసామ్లములు ( omega-3 fatty acids ) జీవనశైలి మార్పులతో తగ్గని ట్రైగ్లిసరైడులను తగ్గించుటకు వాడుతారు.



పదజాలము :

Atherosclerosis = ధమనీకాఠిన్యము
 Dyslipidemias =  కొవ్వు విపరీతములు
 Fatty acids = వసామ్లములు ; కొవ్వుఆమ్లములు
Foam cells = ఫేనకణములు (గ.న )
 Hydrophilic = జలాపేక్షక 
 Hydrophobic = జలవికర్షణ 
Intima = రక్తనాళపు లోపొర ( గ.న )
Macrophages = పృథు భక్షకకణములు ( గ.న )
Very low density lipoproteins = అల్పతమ సాంద్ర లైపోప్రోటీనులు  ( గ.న )
 Intermediate density lipoproteins = అల్పతర సాంద్ర లైపోప్రోటీనులు (గ.న )
 Low density lipoproteins = అల్పసాంద్ర లైపోప్రోటీనులు (గ.న )
 High density lipoproteins = అధిక సాంద్ర లైపోప్రోటీనులు (గ.న )

( వైద్యవిషయములు నా శక్తిమేఱకు తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్త మనుకుంటే నిరభ్యంతరంగా పంచుకొండి, ప్రతులు తీసుకొండి )

కర్కటవ్రణములు ( Cancers )



  కర్కట వ్రణములు

 ( Cancers )


                               
( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )                                                                  

                                                                                   
                                                                                             డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.

    శరీరానికి కలిగే రుగ్మతలలో కొత్త పెరుగుదలలకు ( Growths ) ప్రాముఖ్యత ఉన్నది. ఈ పెరుగుదలలు నెమ్మదిగా పెరిగే నిరపాయకరమైన బోళాగడ్డలు ( Benign tumors ) కావచ్చును. త్వరితముగా పెరిగి పరిసర కణజాలములలోనికి మూలములతో ఎండ్రకాయల వలె చొచ్చుకుపోయే ప్రమాదకరమైన కర్కట వ్రణములు ( Malignant tumors  ) కావచ్చును. ఇవి కాన్సరులుగా అందుకే ప్రాచుర్యములో ఉన్నాయి. ఈ పెరుగుదలలు పుట్టల వలె పెరుగుట వలన వీటిని పుట్టకురుపులు అని కూడా అంటారు.

    కణముల జన్యువులలో ( genes ) మార్పు జరుగుటవలన (Genetic Mutations ) ఆ కణములు అతిత్వరగా పెరుగుతూ, అతిత్వరగా విభజన చెందుట వలన ఈ పెరుగుదలలు కలుగుతాయి. కర్కట వ్రణములలో కణములు పూర్తిగా ఆయా అవయవ కణజాలములలోని కణముల వలె పరిపక్వత చెందవు. అందుచే అవి ఆ అవయవాల కణములను పోలి ఉండవు. ఈ కణాలలో న్యూక్లియస్ పరిమాణము హెచ్చుగా ఉండి, సైటోప్లాజము పరిమాణము తక్కువగా ఉంటుంది. ఈ కణాల మధ్య సంధానము కూడా తక్కువగా ఉంటుంది. పరిపక్వత పొందకపోవుటచే ఈ కణాలు ఆ యా అవయవ ధర్మాలను నిర్వర్తించవు.

    ఈ కణ బీజములు రసినాళముల ( lymphatics ) ద్వారా రసిగ్రంథులకు ( lymph glands ), రక్తనాళముల ద్వారా యితర అవయవములకు వ్యాప్తి చెందగలవు. ఈ కర్కట వ్రణాలు త్వరగా పెరుగుతూ పోషక పదార్థాలను విరివిగా సంగ్రహించుట వలనను, ఈ వ్రణముల నుంచి విడుదల అయ్యే రసాయన పదార్థముల వలనను, ఆకలి క్షీణించుట చేతను  బరువు తగ్గి దేహ క్షయము కలుగుతుంది. ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది ఆ అవయవ వ్యాపారములకు ప్రతిబంధకము కూడా కలుగ జేస్తాయి. ఈ పుట్టకురుపులు చివరి దశలలో ఉన్నప్పుడు శరీర వ్యాధి నిరోధక శక్తి తగ్గి సూక్ష్మాంగజీవుల వలన వివిధ రోగములు కూడా కలుగ వచ్చును

కర్కటవ్రణములు కలుగుటకు కారణాలు 


    కర్కట వ్రణములు కలుగుటకు  కారణము కణముల జన్యువులలో మార్పు రావటమే కదా! ఈ జన్యు వ్యత్యాసము తొంబయి శాతము, కణములపై పరిసరముల ప్రభావము వలన జరిగితే ఒక పది శాతము వరకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువుల వలన కలుగుతాయి. వృద్ధాప్యములో శరీర వ్యాధినిరోధక శక్తి తగ్గి అసాధారణ కణములు తొలగింపబడవు. ఆ కణాలు వృద్ధిచెందుట వలన పెరుగుదలలు పొడచూపుతాయి.

    పొగత్రాగుట, యితర విధాల పొగాకు వినియోగము, ఊబకాయము, వ్యాయామ లోపము, సూక్ష్మజీవులు కలిగించే వ్యాధులు, ఆహారపుటలవాట్లు, వాతావరణ కాలుష్యము, రేడియో ధార్మిక కిరణాల వంటి  భౌతిక కారణాలు అవయవాల కణములను ప్రభావితము చేస్తాయి.

    పొగత్రాగుట, పొగాకు వినియోగములు 25 శాతపు పుట్టకురుపులకు కారణము. తొంబై శాతపు శ్వాసకోశ కర్కటవ్రణములు ( Lung Cancers ) పొగత్రాగే వారిలోనే సంభవిస్తాయి. మూత్రాశయ కర్కటవ్రణములు ( Urinary bladder cancers ), మూత్రాంగముల కర్కటవ్రణములు ( Kidney cancers), స్వరపేటికలో వచ్చే కర్కటవ్రణములు ( Laryngeal cancers ) అధికశాతములో పొగత్రాగే వారిలోనే కలుగుతాయి. జీర్ణాశయము ( Stomach ), క్లోమము ( Pancreas ), కంఠము, అన్ననాళములలో ( esophageal cancers ) పుట్టే  పుట్టకురుపులు పొగత్రాగే వారిలోనే ఎక్కువ. పొగాకులలో నైట్రోసమైన్లు ( Nitrosamines ), పోలీసైక్లిక్ హైడ్రోకార్బనులు ( Polycyclic Hydrocarbons) అనే కర్కటవ్రణజనకములు ( Carcinogens) ఉంటాయి. 
    
    పొగాకు నమిలే వారిలోను, పోకచెక్కలు విరివిగా నమిలే వారిలోను నోటిలో కాన్సరులు ఎక్కువగా వస్తాయి. కాలుతున్న అంచు నోటిలో పెట్టి చుట్టలు కాల్చే వారిలో ( విశాఖ, శ్రీకాకుళపు ప్రాంతాలలో యీ  అడ్డపొగ అలవాటు ఉన్నది. ) అంగుట్లో కర్కటవ్రణములు ( palatal cancers ) రావచ్చును. జపాను దేశములో జీర్ణాశయపు పుట్టకురుపులు ( gastric carcinomas ) ఎక్కువయితే అమెరికాలో పెద్దప్రేవుల పుట్టకురుపులు ( colon cancers ) ఎక్కువ. నా ఆత్మీయులలోను, నెయ్యులలోను పెద్దప్రేవుల కర్కటవ్రణములు చూసాక భారతీయులలో  అంతా అనుకునే కంటె ఎక్కువ మందికే  బృహదంత్ర కర్కటవ్రణములు ( Colon Cancers ) కలుగ వచ్చునేమో అనే సందిగ్ధము నాకు కలుగుతున్నది.

    అతినీలలోహిత కిరణాల ( Ultraviolet rays ) వలన చర్మపు పుట్టకురుపులు, మెలనోమాలు ( Melanomas) కలుగుతాయి. రేడియో ధార్మిక కిరణాలకు ( Radio active rays ) లోనైతే పుట్టకురుపులు రావచ్చు.

    ఱాతినార  ( Asbestos ) వాడే పరిశ్రమల్లో పనిచేసే వారికి శ్వాసకోశపుపొరలో ( Pleura ) మీసోథీలియోమా ( Mesothelioma) అనే కాన్సరు కలిగే అవకాశము ఎక్కువ.

    హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ( Human Papilloma Virus ) వలన  గర్భాశయ ముఖములలో పుట్టకురుపులు ( Uterine Cervical Cancers ) కలుగుతాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వలన కాలేయపు పుట్టకురుపులు కలుగవచ్చును. హెలికోబాక్టర్ పైలొరై ( Heliocobacter pylori ) అనే సూక్ష్మజీవుల వలన జీర్ణాశయ కర్కటవ్రణములు ( Gastric cancers )  కలుగుతాయి.

    వంశపారంపర్యము వలన మూడు నుంచి పది శాతపు కర్కట వ్రణములు సంభవిస్తాయి. జన్యు వైపరీత్యములతో  బి ఆర్ సి ఎ 1 , 2 ( BRCA 1 BRCA 2 ) జన్యువులు వంశానుగతముగా వస్తే రొమ్ము పుట్టకురుపులు ( breast cancers ) వచ్చే  అవకాశములు ఎక్కువ.

    కర్కటవ్రణములు ప్రమాదకరమైన వ్యాధులు. వాటిని కనుగొన్న సమయానికి అవి ఇతర అవయవాలకు బహుళముగా వ్యాపించకపోతే అవి చికిత్సకు లొంగే అవకాశములు ఉంటాయి. వివిధ అవయవాలకు వ్యాప్తి చెందిన పుట్టకురుపులను పూర్తిగా నయము చేయుట కుదరక పోవచ్చును. ఆ స్థితులలో వైద్యులు  ఉపశమన చికిత్సలే  ( palliative care ) చేయగలుగుతారు. శస్త్రచికిత్స, వికిరణచికిత్సలు ( Radiation therapy ), రసాయన ( ఔషధ ) చికిత్సలు ( Chemotherapy ), ప్రతిరక్షిత చికిత్సలు ( Immunotherapy) వ్యాధి నివారణకు, ఉపశమన చికిత్సలకు వాడుతారు.

    కర్కటవ్రణములను ( cancers ) పూర్తిగా నయము చెయ్యాలంటే  తొలిదశలలోనే వ్యాధిని పసిగట్టాలి. అంతే కాక కర్కటవ్రణములు రాకుండా జాగ్రత్తపడాలి.

కర్కటవ్రణముల నివారణ 

    
    పొగ త్రాగుట, పొగాకు నములుట, హెచ్చుగా పోక చెక్కలు నమలుట, జర్దాకిళ్ళీ వంటి  వాడుకలు లేకుండా చూసుకోవాలి. మద్య వినియోగమును చాలా అదుపులో ఉంచుకోవాలి. హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరస్ వ్యాధులు రాకుండా పిన్నవయస్సులోనే H.P.V టీకాలు (Vaccine) వేయించాలి. మితాహారము తీసుకొనుట, శరీరపు బరువును అదుపులో ఉంచుకొనుట, శారీరక వ్యాయామము, కాయగూరలు, పళ్ళు, పూర్ణధాన్యముల వినియోగము పుట్టకురుపులను నివారించుటకు తోడ్పడుతాయి. హెపటైటిస్ బి సోకకుండా టీకాలు వేయించుకొనుట, హెపటైటిస్ సి రాకుండా  తగిన జాగ్రత్తలలో ఉండుట, రేడియో ధార్మిక కిరణాలకు గుఱి కాకుండా జాగ్రత్తపడుట కర్కట వ్రణములను నివారించుటకు తోడ్పడుతాయి.

    పుట్టకురుపులు త్వరితముగా కనుగొని వాటికి సత్వర చికిత్స చేయుట వలన వాటిని నయము చేసే అవకాశము ఉన్నది. ఎవరికి వారు వారి శరీరమును శోధన చేసుకునుట వలన కొన్ని కాన్సరులను త్వరగా గుర్తించ వచ్చును. దేహమును, చర్మమును పరీక్షించుకుంటే చర్మముపై కలిగే వ్రణములు కనిపిస్తాయి. అసాధారణపు పుట్టుమచ్చలు కలిగినా, ఉన్న పుట్టుమచ్చలు పెరిగినా, లేక వాటి వర్ణములో మార్పులు జరిగినా, లేక వాటి వలన  దురద, నొప్పి వంటి లక్షణములు పొడచూపినా, లేక వాటి చుట్టూ వలయములు ఏర్పడినా, మరే యితర మార్పులు కలిగినా వైద్యులను సంప్రదించి, వాటిని శస్త్రచికిత్సచే తొలగించుకొని వాటికి కణ పరీక్ష ( Biopsy ) చేయించుకోవాలి.  స్త్రీలు కనీసము నెలకు ఒకసారైనా  వారి రొమ్ములను స్వయముగా పరీక్షించుకోవాలి. అనుమానాస్పదమైన పెరుగుదలలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. స్తనచిత్రీకరణలు ( Mammograms) రొమ్ములోని కర్కటవ్రణములను సత్వరముగ కనుగొనుటకు తోడ్పడుతాయి. నలభై నుంచి డెబ్భై సంవత్సరముల వయస్సులో ఉన్న స్త్రీలకు ఈ పరీక్షలు  ప్రతి రెండు లేక మూడు సంవత్సరములకు ఒక పర్యాయము వైద్యులు సూచిస్తారు. పురుషులు వారి వృషణములను నెలకు ఒకసారైనా పరీక్షించుకోవాలి.

    గర్భాశయముఖ కర్కటవ్రణములు కొన్ని హ్యూమన్ పాపిల్లోమేటస్ విషజీవాంశములు ( Human papilloma viruses) వలన కలుగుతాయి. హెచ్.పి.వి ( HPV Vaccine ) టీకాలను పిల్లలకు వేసి ఈ పుట్టకురుపులను నివారించవచ్చు. ఇరవై సంవత్సరాల నుంచి అరవైయైదు సంవత్సరముల వయస్సు గల స్త్రీలలో గర్భాశయ ముఖము నుంచి పాప్ స్మియర్ తో ( Pap smear ) గ్రహించిన కణముల పరీక్షలను ( Pap Smears ) సంవత్సరమునకు ఒకసారి వైద్యులు సిఫారసు చేస్తారు. ఈ పరీక్షలు  కర్కటవ్రణములను తొలిదశలలో కనుగొందుకు ఉపయోగపడుతాయి.

    ఉత్తర అమెరికా ఖండములో వైద్యులు ఏభై సంవత్సరములు నిండిన వారికి బృహదంత్ర ( పెద్దప్రేవుల ) అంతర్దర్శన పరీక్షలను ( Colonoscopies) ప్రతి ఐదు పది సంవత్సరములకు ఒకసారి సూచిస్తారు. ఈ పెద్దప్రేవుల అంతర్దర్శన పరీక్షలు చేసినప్పుడు పాలిప్స్ ( Polyps) అనే అంగుష్టాకారపు కంతులు కనిపిస్తే వాటిని సమూలముగా విద్యుద్దహన చికిత్సతో  ( Electro cauterization ) తొలగించి కణపరీక్షకు పంపిస్తారు. ఈ కంతులు తొలిదశలలో  నిరపాయకరమైన బోళాగడ్డలైనా (benign tumors) తరువాత అపాయకరమైన కర్కట వ్రణములుగా పరిణామము చెందవచ్చు. ఈ నిరపాయకరమైన ఆంత్రపు పెరుగుదలలను తొలగించుటచే వైద్యులు అపాయకరమైన కర్కటవ్రణములను నివారించ గలుగుతారు. తొలిదశలలో కనుక్కోబడిన పెద్దప్రేవుల కర్కటవ్రణములు ( Colon cancers ) చికిత్సలకు సాధారణముగా లొంగుతాయి. భారతదేశములో యీ కొలొనోస్కోపులు శోధన పరీక్షలుగా ( screening tests ) ప్రాచుర్యము పొందినట్లు లేదు. దీర్ఘకాలిక పరిశోధనలు చేస్తే వీటి ఉపయుక్తత తెలిసే అవకాశము ఉంది.

                               
                                         పురీషనాళములో కర్కటవ్రణము ( Colon cancer )

  పొగత్రాగే వారిలో తరచు శ్వాసకోశపు చిత్రాలు  తీస్తే శ్వాసకోశ కర్కటవ్రణములను తొలిదశలలో కనుక్కొనే అవకాశము కొంత ఉండవచ్చును. సంవత్సరానికో సారి ఊపిరితిత్తులకు గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణములు ( Low dose Computerized Axial Tomography Scan ) చేస్తే యీ కాన్సరులను త్వరగా కనుక్కొనే అవకాశము పెరుగుతుంది. కాని చాలా మందిలో శ్వాసకోశ  కర్కటవ్రణాలు ( Lung Cancers) బయటపడేటప్పటికే అవి వ్యాప్తి చెంది ఉంటాయి. ఒక పదిహైను శాతము మందిలో శస్త్రచికిత్సకు అవకాశము ఉండవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తొలిదశలలో కనుక్కోబడక పోవుటచే నయమయే శ్వాసకోశ కర్కటవ్రణములు చాలా తక్కువ ఉంటాయి.

    రక్తములో ఉన్న ప్రాష్టేట్ స్పెసిఫిక్  ఏంటిజెన్ ( Prostate Specific Antigen ) పరీక్ష ప్రతి రెండు సంవత్సరములకు 55 - 69 సంవత్సరముల వయస్సులో ఉన్న పురుషులలో చేస్తే  ప్రాష్టేట్ కర్కటవ్రణములను ( Prostatic Cancers) సకాలములో గుర్తించ వచ్చును.చాలా మందిలో ప్రాష్టేట్ కాన్సరులు నెమ్మదిగా పెరుగుటచే పెక్కుశాతము మంది చికిత్స లేకపోయినా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశము ఉన్నది. P.S.A పరీక్షలతో సత్వరముగా కనుక్కొని చికిత్స చేస్తే మరింత ప్రయోజనము చేకూరవచ్చును.

    కర్కట వ్రణములు ఆరంభదశలో ఉన్నపుడు యే బాధా కలిగించక పోవచ్చును. అవి పెరుగుతున్న గొలది వివిధ లక్షణాలు పొడచూపుతాయి. సాధారణముగా అవి ఏ అవయవాలలో ఉంటాయో ఆ అవయవాలకు సంబంధించిన లక్షణాలు కలుగుతాయి. ఆకలి తగ్గుట, బరువు తగ్గుట, కర్కటవ్రణ లక్షణాలు. ఏ అవయవ సంబంధమైన వ్యాధి లక్షణాలు కనిపించినా తగిన శోధన పరీక్షలు చేయుట వలన అవి ప్రస్ఫుటము అవవచ్చును. రక్త పరీక్షలు, ఎక్స్ రేలు, గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము ( computerized axial tomography ), శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ ( ultrasonography), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము ( magnetic resonance imaging ), పెట్స్కానులు, పెద్దప్రేవుల అంతర్దర్శన పరీక్ష ( colonoscopy), అన్నవాహిక జఠర అంతర్దర్శన ( esophago gastroscopy ), పుపుసనాళ అంతర్దర్శన పరీక్ష ( bronchoscopy ),  కర్కటవ్రణములను కనుగొనుటకు ఉపయోగ పడుతాయి.                                         
                    
    వ్రణములు, కనుక్కొన్నాక వాటినుంచి కణపరీక్షలు ( Biopsies) చేసి వ్యాధిని నిర్ణయిస్తారు. వివిధ పరీక్షలతో ఈ కర్కట వ్రణములు యితర అవయవములకు వ్యాపించాయో లేదో నిర్ణయించి తగిన చికిత్సలు చేస్తారు.

    మిగిలిన వైజ్ఞానిక శాస్త్రాల ఆలంబనముగా వైద్యశాస్త్రము అభివృద్ధి చెందుతుంది. ప్రపంచము అంతటా వైజ్ఞానిక పరిశోధకులు విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. ఆరంభ దశలో కనుగొనబడిన  కర్కట వ్రణములు చికిత్సకు లొంగే అవకాశము ఉన్నది. అంత్యదశలలో కనుగొన్న కర్కట వ్రణములకు సంపూర్ణ చికిత్సలు సాధ్యము కావు. అటువంటి పరిస్థితులలో ఉపశమన చికిత్సలకే అవకాశము ఉంటుంది.


పదజాలము :

Benign tumors = బోళా గడ్డలు
Biopsy  = కణపరీక్ష ( గ.న )
Bronchoscopy = పుపుసనాళాంతర దర్శనము ( గ.న )
Cancers = కర్కట వ్రణములు 
Carcinogens = కర్కటవ్రణ జనకములు ( గ.న)
Chemotherapy = రసాయన ( ఔషధ ) చికిత్స
Colonoscopy = బృహదంత్ర ( పెద్దప్రేవుల ) అంతర్దర్శనము (గ.న )
Electro cauterization = విద్యుద్దహన చికిత్స ( గ.న )
Gastroscopy = జఠరాంతరదర్శనము ( గ.న )
Genes = జన్యువులు 
Genetic mutations = జన్యువుల మార్పులు 
Immunotherapy = ప్రతిరక్షిత చికిత్స ( గ.న )
Mammograms = స్తనచిత్రీకరణలు ( గ.న )
Palliative care = ఉపశమన చికిత్స
Radiation therapy  =  వికిరణ చికిత్స ( గ.న )
Screening tests = శోధన పరీక్షలు ( గ.న )
 

( ఉపయుక్త మనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

పచ్చకామెరలు ( Jaundice )

                                            పచ్చకామెరలు

                                               (Jaundice )


 ( తెలుగుతల్లి కెనడా వారికి కృతజ్ఞతలతో )                                                            

                                         డా . గన్నవరపు నరసింహమూర్తి                                                              .

పచ్చకామెర్లు 


    పచ్చకామెర్లు, కామెర్లు, పసరికలు  ( Jaundice) అనే మాట చాలా మంది వినే ఉంటారు. ఒంటికి పచ్చరంగు రావడాన్ని పచ్చకామెర్లు కలుగుట అంటారు. ఈ పసుపురంగు కామెర్లు ఉన్నవారి  కళ్ళ తెల్లగుడ్డుపై ( శ్వేతపటలము ; Sclera ) బాగా కనిపిస్తుంది. ఈ పసుపు వర్ణమునకు కారణము బిలిరుబిన్ అనే వర్ణకము ( pigment ). రోగుల రక్తములో బిలిరుబిన్ ( Bilirubin) హెచ్చయి చర్మము, కంటి తెల్లగుడ్డుపైన చేరుట వలన ఆ వర్ణము కలుగుతుంది. రక్తములో ఏ ఏ కారణాల వలన బిలిరుబిన్ పెరుగుతుందో చర్చించే ముందు ఆ బిలిరుబిన్ ఎలా వస్తుందో వివరిస్తాను.

బిలిరుబిన్ ఉత్పత్తి, విసర్జన 


    రక్తములో ఎఱ్ఱకణాల వలన రక్తమునకు ఎఱ్ఱరంగు కలుగుతుంది. ఎఱ్ఱ రక్తకణాలు ప్రాణవాయువును ( Oxygen) ఊపిరితిత్తుల నుంచి గ్రహించి శరీరములో వివిధ కణజాలమునకు చేర్చి వివిధ అవయవాల కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువుని ( Carbon dioxide) గైకొని ఊపిరితిత్తులకు విసర్జనకై చేర్చుటకు తోడ్పడుతాయి. ఎఱ్ఱరక్తకణాలలో హీమోగ్లోబిన్ అనే వర్ణకము ( Pigment ) ఉంటుంది. ఈ వర్ణకము  వాయు సంవాహనమునకు తోడ్పడుతుంది.
    
    హీమ్ ( Heme ) అనే రసాయనము  గ్లోబిన్ అనే మాంసకృత్తితో సంయోగము  చెందుట వలన హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. హీమ్ లో పార్ఫిరిన్  అనే రసాయన పదార్థము, ఇనుప అయనము ( Ion ) కలిసి ఉంటాయి. ఇనుప అయన ప్రభావముతో హీమోగ్లోబిన్  ప్రాణవాయువు, బొగ్గుపులుసు వాయువు, యితర వాయువులను సంధించుకొని ఆ వాయువులకు వాహనముగా పనిచేస్తుంది. ఎఱ్ఱ రక్తకణాలు శరీరములో ఎముకల మజ్జలో ( Bone marrow ) ఉత్పత్తి అవుతాయి. రక్త ప్రవాహములో సుమారు మూడునెలల కాలము మని, వృద్ధకణములు ప్లీహములోను ( Spleen) కాలేయములోను ( Liver ) భక్షక కణములచే ( Phagocytes ) విచ్ఛేదనము పొందుతాయి. విచ్ఛేదనము పొందిన ఎఱ్ఱ రక్తకణముల నుంచి విడుదలయే హీమోగ్లోబిన్ హీమ్ గాను, గ్లోబిన్ గాను ఛేదింపబడుతుంది.
   
    హీమ్ లో ఉన్న ఇనుము అయము తొలగించబడి శరీరములో నిక్షేపమయి మరల ఉపయోగపడుతుంది. ఇనుము పోగా మిగిలిన పార్ఫిరిన్ చక్రఛేదనము పొందుటవలన బిలిరుబిన్ ఏర్పడుతుంది. ఈ విధముగా ఏర్పడిన బిలిరుబిన్ బంగారు పసిడి ఛాయలో ఉంటుంది. ఈ బిలిరుబిన్ కాలేయ కణములలో గ్లూకొరోనికామ్లముతో  ( Glucoronic acid ) సంయోగము పొంది కాలేయము నుంచి పైత్యరసముతో ( Bile ) పైత్య నాళములకు ( Bile ducts ), పిత్తాశయమునకు ఆపై చిన్నప్రేవులకు విసర్జింపబడుతుంది. పెద్దప్రేవులలో, సూక్షాంగజీవులు గ్లూకొరోనికామ్లమును తొలగించి బిలిరుబిన్ ని యూరోబిలినోజన్ గా ( Urobilinogen ) మారుస్తాయి. యూరోబిలినోజెన్ కొంత రక్తములోనికి గ్రహించబడి ఆమ్లజనీకరణముచే ( Oxidation ) యూరోబిలిన్ గా ( Urobilin ) మార్పుచెంది మూత్రము ద్వారా విసర్జితమవుతుంది. యూరోబిలిన్ వలన మూత్రమునకు ఎండుగడ్డి రంగు కలుగుతుంది. పెద్ద ప్రేవులలో యూరోబిలినోజెన్ లో చాలాభాగము  స్టెర్కోబిలిన్ గా ( Stercobilin )  మార్చబడుతుంది. స్టెర్కోబిలిన్ మలమునకు గోధుమరంగు యిస్తుంది.

    గ్లూకరానికామ్లముతో కాలేయకణములలో సంయోగమైన బిలిరుబిన్  ( Conjugated Bilirubin ) ని ‘ పత్యక్ష  బిలిరుబిన్ ‘ ( Direct Bilirubin) గా వ్యవహరిస్తారు. సంయోగముకాని బిలిరుబిన్ ( Unconjugated Bilirubin ) పరోక్ష బిలిరుబిన్ (Indirect Bilirubin). పరోక్ష బిలిరుబిన్ కి జలద్రావణీయత ( Water solubility) ఉండదు. అది పైత్యరసములోనికి రాదు. ప్రేవులకు చేరదు. సంయోగ బిలిరుబిన్ కి జలద్రావణీయత ఉండుటచే ప్రేవులకు పైత్యరసముతో చేరుతుంది. రక్తములో  బిలిరుబిన్ పరిమాణము 2 మి.గ్రా / డె.లీ కంటె ఎక్కువైతే పచ్చ కామెరలు పొడచూపుతుంది.

పచ్చకామెర్లకు కారణాలు


రక్తకణ విచ్ఛేదనపు / కాలేయ పూర్వపు కామెరలు ( Hemolytic / Prehepatic jaundice) 


    ఎఱ్ఱ రక్తకణాలు సుమారు 90 దినాల ఆయువు కలిగి ఉంటాయి. అవి త్వరితముగా అధిక ప్రమాణములలో విచ్ఛేదనమయితే వాటి నుంచి అధిక మోతాదులలో హీమోగ్లోబిన్ > హీమ్ > బిలిరుబిన్ లు విడుదల అవుతాయి. అధిక ప్రమాణములో విడుదల అయే బిలిరుబిన్ ను కాలేయము త్వరితముగా గ్లూకరానికామ్లముతో సంయోగపఱచ జాలనపుడు రక్తములో అసంయోగపు బిలిరుబిన్ (uncojugated - Indirect bilirubin) ప్రమాణము 2 మి.గ్రా. కంటె ఎక్కువైతే పసరికలు కలుగుతాయి.

    జన్యుపరముగా వచ్చే రక్తకణ విరూప వ్యాధులు ; లవిత్రకణ వ్యాధి ( Sickle cell anemia ), వంశపారంపర్య గోళకార కణవ్యాధి ( Hereditary Spherocytosis ), అసాధారణపు హీమోగ్లోబినుల ( Hemoglobinopathies ) వలన  రక్తకణముల ఆయువు తగ్గి అవి త్వరితముగా విచ్ఛేదన పొందవచ్చును.

    శరీర రక్షణ వ్యవస్థకు ( Immunological system) స్వ ( Self ), పర ( External ) విచక్షణాలోపము కలుగుతే స్వయంప్రహరణ వ్యాధులు ( Autoimmune diseases) కలిగి రక్తకణ విచ్ఛేదనము విశేషముగా జరుగవచ్చును. అందువలన రక్తక్షీణత (Autoimmune hemolytic Anemia ), కామెరలు కూడా కలుగుతాయి. 

      అసంయోగపు బిలిరుబిన్ రక్తములో హెచ్చయినా దానికి జలద్రావణీయత ( నీటిలో కరుగుట ) లేకపోవుటచే మూత్రములో బిలిరుబిన్ ఉండదు. కాని కాలేయములో సంయోగ ప్రక్రియ ( Conjugation ) వలన ప్రేవులకు సంయోగపు బిలిరుబిన్ ఎక్కువగా చేరి యూరోబిలినోజెన్ ఎక్కువగా ఉత్పత్తి అయి మూత్రములో యూరోబిలినోజెన్ ఎక్కువగా ఉంటుంది.

కాలేయపు కామెరలు  (  Hepatic / Hepatocellular jaundice ) 


    కాలేయపు కణాలలో బిలిరుబిన్ గ్లూకొరోనికామ్లముతో సంయోగము చెంది ( Conjugate) జలద్రావణీయత పొంది పైత్యరసములో ( Bile ) స్రవించబడి పైత్య నాళముల ( Bile ducts) ద్వారా చిన్న ప్రేవుల మొదటిభాగమైన డుయోడినమునకు ( Duodenum) చేరుతుంది. కాలేయపు వ్యాధులు ఉన్న వారిలో బిలిరుబిన్ గ్లూకొరోనికామ్లముల సంయోగమునకు, సంయోగమైన బిలిరుబిన్ యొక్క స్రావమునకు, అంతరాయము కలుగుట వలన, రక్తములో బిలిరుబిన్ ప్రమాణములు పెరుగుతాయి. విషజీవాంశముల ( Viruses ) వలన, సూక్షాంగజీవులు వలన, పరాన్నభుక్తులు వలన వచ్చే కాలేయ తాపములు ( Hepatitis ), మద్యము, విషపదార్థములు, కొన్ని ఔషధములు వలన కలిగే కాలేయ వ్యాధులు, నారంగ కాలేయ వ్యాధి ( Cirrhosis of liver ), కాలేయములో కర్కటవ్రణములు ( Cancers ) కాలేయపు పచ్చకామెర్లు కలిగిస్తాయి.

 అవరోధక కామెరలు : కాలేయ అనంతరపు కామెరలు  ( Obstructive jaundice : Post hepatic Jaundice )


    కాలేయములో గ్లూకొరోనికామ్లముతో సంయోగమయిన బిలిరుబిన్ పైత్యరసములో స్రవించబడి పైత్యనాళముల ( bile ducts ) ద్వారా ప్రథమాంత్రమునకు ( duodenum ) చేరుతుంది. పైత్య ప్రవాహమునకు అవరోధము కలుగుతే సంయోగపు బిలిరుబిన్  ( Conjugated bilirubin ) తిరోగమనమయి రక్తములో ప్రసరించబడుతుంది. ఈ సంయోగపు బిలిరుబిన్ చర్మము, శ్వేతపటలములలో చేరి కామెరలు కలిగిస్తుంది, మూత్రములో విసర్జించబడి మూత్రమునకు పచ్చరంగు కలిగిస్తుంది, చెమటలో స్రవించబడి దుస్తులకు పచ్చరంగు చేకూరుస్తుంది. ప్రేవులకు బిలిరోబిన్ చేరకపోవుట వలన  మూత్రములో యూరోబిలినోజెన్ ఉండదు.  మలము సుద్దరంగులో ఉంటుంది. పైత్య నాళములలో రాళ్ళు ( Biliary stones ), పైత్య నాళములలో పెరుగుదలలు ( Growths ), క్లోమములోని కర్కటవ్రణములు ( Pancreatic cancers) యితర నాళ బంధనములు, యీ అవరోధక పచ్చకామెర్లు ( Obstructive jaundice ) కలుగచేస్తాయి.

    వైద్య పరీక్షలతో బాటు, రక్త పరీక్షలు, శ్రవణాతీతధ్వని చిత్రీకరణలు ( Ultrasonography ), గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణములు ( cat scans ), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు ( magnetic resonance imaging ), హెపటైటిస్ పరీక్షలు, కణపరీక్షలు ( Biopsies), అంతర్దర్శన పరీక్షలు ( Endoscopic examinations), రోగనిర్ణయానికి తోడ్పడుతాయి.

కాలేయ తాపము ( Hepatitis) 


    కాలేయ తాపము విషజీవాంశములు ( viruses ) వలన, సూక్షాంగజీవులు ( bacteria ) వలన, పరాన్నభుక్తులు ( parasites ) వలన, మద్యపానము వలన, కొన్ని ఔషధాల వలన, కలుగవచ్చును. కాలేయ కణములు కొన్ని విచ్ఛిన్నము అగుటచే  రక్తములో కాలేయ జీవోత్ప్రేరకముల ( Liver enzymes ) పరిమాణములు పెరుగుతాయి. కామెరలు కూడా కలుగ వచ్చు.

విషజీవాంశముల ( Viruses) వలన వచ్చే కాలేయ తాపములు 


హెపటైటిస్ ఎ ( Hepatitis A ) 


    ఈ  విషజీవాంశములు కలుషిత జలము, కలుషిత ఆహారములు తీసుకొనుట వలన ( పురీష వదన మార్గము  / fecal-oral route  ) శరీరములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యాధి సోకినవారు వ్యాధి లక్షణములు కనిపించుటకు కొద్ది వారముల ముందుగాను, వ్యాధి కలిగిన  కొద్దివారములు తరువాత కూడా విషజీవాంశములను ( viruses ) మలములో విసర్జిస్తారు. అట్టి మలముతో కలుషితమైన నీరు, ఆహారములను గ్రహించుట వలన వ్యాధి సోకుతుంది. పచ్చకామెర్లు ప్రధాన లక్షణము. కొంత మందిలో ఏ లక్షణాలు పొడచూపవు. ఈ వ్యాధి 99 శాతము మందిలో ఒకటి, రెండుమాసములలో సంపూర్ణముగా దానికదే నయమవుతుంది. వీరికి ఏ మందులు అవసరము ఉండవు. చక్కని ఆహారము సమకూర్చి శుష్కించకుండా చూస్తే చాలు. ఒక శాతపు మందిలో ప్రమాదకర  కాలేయవైఫల్యము ( Fulminant hepatic failure) కలుగవచ్చును. అట్టివారికి పరకాలేయ దానము  ( Liver Transplantation ) అవసరము కావచ్చు. దీనిని అరికట్టుటకు టీకాలు లభ్యము. అందఱికీ ఆ టీకాలు వెయ్యాలి.

హెపటైటిస్ బి ( Hepatitis B ) 


     ఈ విషజీవాంశములు ( viruses ) ఆంత్రేతర మార్గముల ( Parenteral routes ) ద్వారా శరీరములోనికి ప్రవేశిస్తాయి. వ్యాధిగ్రస్త పరరక్త దానముల ( Blood transfusions) వలన, విషజీవాంశములతో కలుషితమైన  సూదులు వాడుట వలన, వ్యాధిగ్రస్థులతో సంభోగించుట వలన, ఈ వ్యాధి వ్యాపిస్తుంది.ఈ వ్యాధిగ్రస్థులలో 95 నుంచి 99 శాతము మందిలో వ్యాధి దానంతట అదే  రెండు నుంచి నాలుగు మాసములలో తగ్గిపోతుంది. వీరికి ఆలంబన చికిత్స ( Supportive treatment ) అవసరము, వీరికి సరియైన పోషక ఆహారము, ద్రవములు అందేటట్లు చూడాలి. వీరు మద్యము, కాలేయానికి హాని కలిగించు ఔషధములు వినియోగించకూడదు. వ్యాధి తీవ్రముగా ఉంటే విషజీవాంశ నాశకములను ( antivirals ) వాడాలి. ఆరు మాసములకు వ్యాధి తగ్గకపోతే దానిని దీర్ఘకాలిక కాలేయ తాపముగా ( Chronic Hepatitis ) పరిగణించాలి. హెపటైటిస్ బి  2 - 5 శాతము మందిలో దీర్ఘకాలిక వ్యాధిగా పరిణామము చెందుతుంది. వీరికి విషజీవాంశ నాశకములను ( antivirals ) వాడుతారు. దీర్ఘకాలిక కాలేయ తాపము కలిగిన వారిలో కొందఱికి నారంగ కాలేయ వ్యాధి ( Cirrhosis of liver ), కాలేయ కర్కటవ్రణములు ( hepatic cancers ) రావచ్చు.

    ఈ వ్యాధి రాకుండా టీకాలు ఉన్నాయి. అందఱికీ ఆ టీకాలు అవసరము. వ్యాధిగ్రస్థులైన తల్లులకు పుట్టిన పిల్లలకు పుట్టిన 12 గంటలలో టీకాతో బాటు ప్రతిరక్షకములను  ( immunoglobulin )  కూడా వ్యాధి నివారణకై యివ్వాలి.

హెపటైటిస్ సి ( Hepatitis C ) 


    హెపటైటిస్ సి విషజీవాంశములు ( viruses ) వ్యాధిగ్రస్తమైన రక్తము, రక్తాంశములు, శరీర ద్రవములతో రక్త గ్రహణముల ద్వారా గాని, సూదుల ద్వారా గాని, సంభోగము వలన గాని, శరీరములోనికి ప్రవేశించి కాలేయ తాపము కలిగిస్తాయి. కాలేయ కణముల నుంచి కాలేయ జీవోత్ప్రేరకములు ( liver enzymes ) విడుదలయి రక్తములో వాటి పరిమాణములు పెరుగుతాయి. హెపటైటిస్ సి వలన కాలేయపు వ్యాధి కలిగిన వారందఱిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. కామెరలు కూడా కలుగక పోవచ్చును. విషజీవాంశములకు ప్రతిరక్షకాలను ( Antibodies) రక్తపరీక్షలో కనుక్కొనుట వలన వ్యాధి నిర్ణయము చేయవచ్చు. విషజీవాంశములను కూడా రక్తపరీక్షలతో కనుక్కోవచ్చును. విషజీవాంశములు ( viruses ) రక్తములో పొడచూపిన వారికి మందులతో చికిత్స చేయగలిగే అవకాశాలు ఎక్కువే. ఈ వ్యాధి  దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమిస్తే  నారంగ కాలేయ వ్యాధికి ( Cirrhosis of liver ), కాలేయ కర్కటవ్రణములకు ( Liver Cancers) దారి తీయవచ్చును. హెపటైటిస్ సి కి టీకాలు లభ్యముగా లేవు. వ్యాధిగ్రస్థులను మందులతో నయము చేయుట వలన, వారి సంఖ్యను తగ్గించవచ్చు. రక్తదానము చేసే వారికి హెపటైటిస్ బి, సి, వ్యాధులు లేవని నిర్ధారించుట వలన, సురక్షిత రక్తము, రక్తాంశములనే వాడుటవలన, సూదులతో మాదకద్రవ్యాల వినియోగము అరికట్టుట వలన, సురక్షితమైన సూదులు, క్షురికలను వాడుట వలన, సురక్షిత సంభోగము వలన హెపటైటిస్  బి, సి వ్యాధులను నివారించ వచ్చును.

హెపటైటిస్ డి ( Hepatitis D ) 


    దీనిని కలిగించు నలుసులు విషజీవాంశముల ( viruses ) కంటె చిన్నవి. హెపటైటిస్ బి ఉన్నవారికే ఈ వ్యాధి  కలుగుతుంది. రక్తము, రక్తాంశములు, శారీరక ద్రవముల ద్వారా ఈ నలుసులు శరీరములోనికి ప్రవేశిస్తాయి. చాలా మందిలో ఈ వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. దీనికి టీకాలు లభ్యముగా లేవు.

హెపటైటిస్ ఇ ( Hepatitis E ) 


    ఆసియాఖండములో ఈ వ్యాధి ఉన్నది. ఢిల్లీ, కాశ్మీరు, మయినమారులలో  ఈ వ్యాధి అలలుగా కొన్ని పర్యాయములు పెచ్చుమీరింది. ఈ విషజీవాంశములు ( viruses ) కలుషిత ఆహార పానీయముల ద్వారా శరీరములోనికి చేరుతాయి. దీర్ఘకాలిక వ్యాధికి దారి తీయక పోయినా, గర్భిణీ స్త్రీలలో ఈ వ్యాధి తీవ్రమయి సుమారు 20 శాతము మందిలో మృత్యువునకు దారితీస్తుంది. చైనాలో ఈ వ్యాధికి టీకా లభ్యము. పందులలో ఈ వ్యాధి ప్రబలముగా ఉంటుంది. హెచ్చు ఉష్ణోగ్రతలలో ఉడికించని పందిమాంసపు వినియోగము వలన ఈ వ్యాధి రావచ్చును.

    సూక్షాంగజీవులు, పరాన్నభుక్తులు ( మలేరియా, అమీబా, ట్రిపనోజోమా, లీష్మానియా, ఎఖినోకోకస్ గ్రాన్యులోసస్ , కాలేయపు క్రిమి ఫాషియోలా హెపాటికా లు ) కాలేయవ్యాధులు కలిగిస్తాయి.

    కలుషిత ఆహార పానీయముల వలన కాలేయపు వ్యాధులే గాక అనేక యితర వ్యాధులు వ్యాప్తి చెందుతాయి కాబట్టి ప్రజలు అందఱికీ పాశ్చాత్యదేశపు మరుగుదొడ్లను సమకూర్చి మలములను కలుషరహితము చెయ్యాలి. అందఱికీ సురక్షిత జలము లభ్యము అగునట్లు చూడాలి. ఇది అన్ని ప్రభుత్వాల, అన్ని నాగరిక సమాజాల బాధ్యత.


పదజాలము :


Antibodies = ప్రతిరక్షకములు
Autoimmune diseases = స్వయంప్రహరణ వ్యాధులు ( గ.న )
Bile = పైత్యరసము
Bile ducts = పైత్యనాళములు
Biopsies = కణపరీక్షలు 
Blood transfusions = పరరక్తదానములు ( గ.న )
Bone marrow  = ఎముకల మజ్జ
Cancers = కర్కటవ్రణములు ( గ.న )
Cirrhosis of liver = నారంగ కాలేయ వ్యాధి ( గ.న )
Conjugated Bilirubin = సంయోగపు బిలిరుబిన్ ( గ.న )
Direct Bilirubin = పత్యక్ష  బిలిరుబిన్ 
Endoscopic examinations = అంతర్దర్శన పరీక్షలు ( గ.న )
Fecal-oral route = పురీష వదన మార్గము ( గ.న )
Liver enzymes = కాలేయ జీవోత్ప్రేరకములు ( గ.న )
Hemolytic /Prehepatic jaundice = రక్తకణ విచ్ఛేదనపు / కాలేయ పూర్వపు కామెరలు ( గ.న )
Hepatic / Hepatocellular jaundice = కాలేయపు కామెరలు ( గ.న )
Hepatitis = కాలేయ తాపము ( గ.న )
Hereditary Spherocytosis = వంశపారంపర్య గోళకార కణవ్యాధి (గ.న )
Indirect Bilirubin = పరోక్ష బిలిరుబిన్ 
Immunological system = శరీర రక్షణవ్యవస్థ ( గ.న )
Jaundice = పచ్చకామెర్లు , కామెర్లు , పసరికలు  
Liver = కాలేయము 
Obstructive jaundice / Post hepatic Jaundice = అవరోధక కామెరలు / కాలేయానంతరపు కామెరలు ( గ.న )
Oxidation = ఆమ్లజనీకరణము
Parasites = పరాన్నభుక్తులు
Parenteral routes = ఆంత్రేతర మార్గములు ( గ.న )
Phagocytes = భక్షక కణములు
Sclera = శ్వేతపటలము 
Sickle cell anemia = లవిత్రకణ వ్యాధి ( గ.న )
Spleen = ప్లీహము
Supportive treatment = ఆలంబన చికిత్స ( గ.న )
Ultrasonogram = శ్రవణాతీతధ్వని చిత్రీకరణ ( గ.న )
Viruses = విషజీవాంశములు ( గ.న )
Water solubility = జలద్రావణీయత 

      ( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

ఎక్కువ బరువు ( Overweight ) , స్థూలకాయము ( Obesity )

తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో:

                            ఎక్కువ బరువు ; స్థూలకాయము

                                  ( Overweight; Obesity )



                                                                                           డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.


        
    గత నాలుగు దశాబ్దములుగా ప్రపంచము అంతటా ప్రజలలో బరువు ఎక్కువగుట ( overweight ), స్థూలకాయములు ( obesity ) బాహుళ్యముగా వ్యాప్తి చెందుతున్నాయి. ఆహార పదార్థములు విరివిగా లభ్యమగుట, వ్యాయామము తగ్గుట, వాహనాల వాడుక హెచ్చి నడకలు తగ్గుట, దానికి కారణములు. ఎక్కువ బరువు, స్థూలకాయములు అనారోగ్యమునకు దారితీస్తాయి.

భార సూచిక ( Body Mass Index )


    ఒక వ్యక్తి బరువు ఎక్కువో, కాదో, స్థూలకాయము ఉన్నదో, లేదో తెలుసుకొనుటకు భార సూచిక ( Body Mass Index  BMI ) తోడ్పడుతుంది. ఒక వ్యక్తి  కిలోగ్రాముల బరువును ఆ వ్యక్తి యొక్క మీటర్ల ఎత్తు  వర్గముతో భాగిస్తే  ( Weight in kilograms/ Square of height in meters.  kg/m2 ) ఆ వ్యక్తి భారసూచిక తెలుస్తుంది.

వర్గీకరణము 

    భార సూచిక 18.5 కంటె తక్కువ ఉంటే భార హీనతగా ( Under weight ) పరిగణిస్తారు.

            18.5 నుంచి 25 లోపల ఉంటే అది సామాన్యపు బరువు

            25 నుంచి 30 లోపల ఉంటే  అది ఎక్కువ బరువు ( Over weight)

            30  పైన భార సూచిక ఉంటే స్థూలకాయముగా పరిగణిస్తారు. ( Obesity)


    స్థూలకాయులను మరల మూడు తరగతులుగా విభజించ వచ్చును

             30- 35 వరకు భార సూచిక ఉంటే ప్రథమవర్గము గాను

             35 నుంచి 40 వరకు ద్వితీయ వర్గము గాను

             40 పైన ఉంటే తృతీయ వర్గములోను చేరుస్తారు.


    భార సూచిక శరీరపు కొవ్వుని సూచించదు కాని శరీరములో ఉన్న కొవ్వుతో అన్యోన్య సంబంధము కలిగి ఉంటుంది. హెచ్చు భార సూచిక అనారోగ్యమును తెలుపదు కాని అనారోగ్యములకు దారి తీస్తుంది. శరీరపు బరువును కోశాగారములో ధనముతో పోలుస్తే అర్థము చేసుకొనుట తేలిక అవుతుంది. కోశాగారములో ఎంత ధనము చేరుస్తే  ధనము అంతగా పెరుగుతుంది. ఎంత ఖర్చు పెడితే అంత క్షీణిస్తుంది. ఎక్కువ డబ్బు చేర్చి తక్కువ ఖర్చు పెడితే ధనము పెరుగుతుంది. ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ చేరుస్తే ధనము తగ్గుతుంది. తిని, త్రాగే కాలరీలు ( కాలరీ వివరణ క్రింద తెలియజేయబడింది ), ఖర్చయే కాలరీల కంటె హెచ్చయితే బరువు పెరుగుతారు. దేహము గ్రహించే కాలరీలు తగ్గి ఖర్చు చేసే కాలరీలు పెరుగుతే బరువు తగ్గుతారు.

    “ ఎక్కువ బరువు ఉన్నవారిలో జీవ వ్యాపారము ( Metabolism) మందముగా ఉంటుంది, వారు తక్కువ తిన్నా బరువు పెరుగుతారు” అన్నది వాస్తవము కాదు. శరీరపు బరువు ఎక్కువగా ఉండుట వలన నిజానికి వారి నిత్య జీవన వ్యాపారమునకు ఎక్కువ కాలరీలే ఖర్చవుతాయి. హృదయము, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రాంగముల వంటి ముఖ్య అవయవములపై పనిభారము వీరిలో హెచ్చు. నడిచేటప్పుడు కూడా వీరు ఎక్కువ బరువును మోయాలి కాబట్టి ఎక్కువ కాలరీలు ఖర్చుపెడతారు. 

    ఆహార పదార్థాలను అవి యివ్వగలిగే శక్తిని బట్టి కాలరీలలో కొలుస్తారు. ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను  వాతావరణ పీడనము వద్ద ఒక సెంటీగ్రేడు డిగ్రీ పెంచుటకు కావలసిన శక్తిని ఒక కాలరీగా పరిగణిస్తారు. ఆహార పదార్థాల విషయములో శక్తిని కిలో కాలరీలలో ( 1 కిలో కాలరీ = 1000 కాలరీలు ) వ్యక్త పరుస్తారు. వాడుకలో కాలరీలన్నా వాస్తవానికి అవి కిలో కాలరీలుగా అర్థము చేసుకోవాలి.

    ఓక గ్రాము కొవ్వు పదార్థాలలో సుమారు 9 కాలరీల ( కిలో కాలరీలు ) శక్తి నిగూఢమై ఉంటుంది. ఓక గ్రాము పిండిపదార్థాలు, మాంసకృత్తులలో సుమారు 4 ( కిలో ) కాలరీలు ఉంటాయి. దైనందిక అవసరాలకు మించి తీసుకున్న ఆహార పదార్థాలు శరీరపు పెరుగుదలకు, బరువు పెరుగుటకు తోడ్పడుతాయి. ఆహార వినియోగము పెరిగి, చేసే వ్యాయామము తగ్గుతే బరువు హెచ్చుతాము. ఆహార వినియోగము, జీవన వ్యాపారము + వ్యాయామపు అవసరముల కంటె తక్కువయితే బరువు తగ్గుతాము. అవసరాలకు ఆహారము సరి అయితే బరువు స్థిరముగా ఉంటుంది.

అధిక భారము , స్థూలకాయములకు కారణాలు 

    పాతదినములలో ధనవంతులయిన కొద్ది మందిలో ఎక్కువ బరువు ఉండుట కనిపించేది. నవీన కాలములో ఆహార విప్లవము వలన ఆహార పదార్థాల ఉత్పత్తి పెరిగి అవి విరివిగా లభ్యము అవుతున్నాయి. చిల్లర తిళ్ళ దుకాణాలు ఎక్కువయ్యాయి. చక్కెర సహిత శీతల పానీయాలు, చక్కెర సహిత ఫలరసాల వాడుక పెరిగింది. వేడుకలు పెరిగి శక్తిసాంద్ర ఆహార పదార్థములు ( Energy rich foods ) తీపి వస్తువులు, పానీయాలు, మద్యము, మిగిలిన చిరుతిళ్ళ వినియోగము అన్ని సమాజాలలోను పెరిగింది. భోజనము హెచ్చయితే జీర్ణాశయము సాగుతూ పరిమాణము పెరిగి వారిలో ఆకలి కూడా పెరుగుతుంది. చక్కెర సహిత పానీయాలు, పదార్థాలు సేవిస్తే వారి రక్తములో చక్కెర విలువలు పెరిగి దానికి స్పందనగా  ఇన్సులిన్ విడుదలయి  దాని ప్రభావము వలన రక్తములో చక్కెర తగ్గగానే వారికి నీరసము ఆకలి పెరుగుతాయి. అపుడు వారు మరికొంత ఆహారమునో, పానీయములనో సేవిస్తారు. ఈ విషచక్రము అలా కొనసాగుతుంది.

    సమాజములలో మార్పుల వలన వాహనాలు పెరిగి పిల్లలు పాఠశాలలకు నడిచి వెళ్ళరు. పెద్దలు ఉద్యోగాలకు నడిచి వెళ్ళరు. దూరదర్శినులు, గణన యంత్రాలు, చరవాణుల వాడుక హెచ్చి పిల్లలు, పెద్దలు క్రీడలకు, వ్యాయామములకు వెచ్చించే కాలము తగ్గిపోయింది. పాఠశాలలలో క్రీడలకు, వ్యాయామములకు ప్రోత్సాహము తగ్గింది.

జన్యు కారణాలు 


    పరిసరాలు, జీవన శైలులలో మార్పులకు వేఱు వేఱు వ్యక్తులు వేఱు వేఱుగా స్పందిస్తారు. జడత్వము, వ్యాయామపు కొఱత, అధిక ఆహార వినియోగములు కొందఱిలో ఎక్కువగా ఉంటాయి . వాటికి జన్యువులు కారణము కావచ్చును.

    కేవలము జన్యు కారణముల వలనే సంక్రమించే స్థూలకాయములు చాలా అరుదు. చాలామందిలో స్థూలకాయములకు వివిధ కారణాలు, పెక్కు జన్యువులు కారణము అవుతాయి. కొన్ని కుటుంబాలలో ఎక్కువ బరువు, స్థూలకాయములు సంభవించినా దానికి వారి జీవన శైలి, పరిసరాల ప్రాబల్యమే ప్రధాన కారణము. జీవన శైలులలో మార్పుల వలన వారు స్థూలకాయములను నిరోధించ వచ్చును.

 రుగ్మతలు 


    కుషింగ్ సిండ్రోము ( Cushing Syndrome), పాలీ సిస్టిక్ ఓవరీలు ( Polycystic Ovaries), మానసిక వ్యాధులు  అధిక భారమును కలిగిస్తాయి.

ఔషధములు 


    కుంగువ్యాధులు, యితర మానసిక వ్యాధులకు వాడే ( Atypical antipsychotics ) మందులు, ఎడ్రినల్ కార్టికో ష్టీరాయిడులు ( Adrenal Corticosteroids), మధుమేహవ్యాధి మందులు, గర్భనిరోధక ఔషధములు, కొన్ని మూర్ఛ మందులు బరువు పెరుగుటకు తోడ్పడ వచ్చును. ఆకలి ఎక్కువయి ఎక్కువగా భుజించుట దానికి కారణము.

 స్థూలకాయము వలన పరిణామములు 

    ఎక్కువ బరువు, స్థూలకాయము కొన్ని రుగ్మతలకు దారి తీస్తాయి. ఎక్కువ బరువు ఉన్న వారిలో అధిక రక్తపీడనము కలిగే అవకాశములు  ఎక్కువ. మధుమేహ వ్యాధి, అల్ప సాంద్రపు కొలెష్టరాలు ఎక్కువగుట ( Low density lipoproteins ), అధిక సాంద్రపు కొలెష్టరాలు  ( High density lipoproteins) తక్కువగుట, ట్రైగ్లిసెరైడులు ఎక్కువ అవుట ఎక్కువగా సంభవిస్తాయి.  హృద్రోగములు, హృద్ధమనుల వ్యాధులు ( Coronary artery disease), మస్తిష్క విఘాతములు ( Cerebro vascular accidents), పిత్తాశయ వ్యాధులు ( Gall bladder diseases), కీళ్ళ వాతములు ( ముఖ్యముగా మోకాళ్ళ నొప్పులు, తుంటి సంధుల నొప్పులు ), ఒళ్ళు నొప్పులు ఎక్కువగా సంభవిస్తాయి. కాలేయములో కొవ్వు చేరి కాలేయపు కొవ్వు వ్యాధి ( Fatty Liver disease) సంభవిస్తుంది. స్థూలకాయులలో ఆమ్ల తిరోగమనము ( Acid Reflux ) ఎక్కువ. మూత్రాంగ వైఫల్యములు, కుంగుదల వంటి మానసికవ్యాధులు వీరిలో ఎక్కువ. జడత్వము, నిశ్చలత్వము, మందకొడితనము ఎక్కువయి జీవన రీతులు అసంపూర్ణముగా ఉంటాయి. కొన్ని కర్కట వ్రణములు ( Cancers ; పెద్దప్రేవుల, కాలేయపు, పిత్తాశయపు, మూత్రాంగముల కర్కట వ్రణములు, స్త్రీలలో రొమ్ము, బిడ్డసంచీ కర్కట వ్రణములు ) కూడా స్థూలకాయులలో ఎక్కువగా కలుగుతాయి. వీరిలో నిద్రావరోధ శ్వాసభంగములు ( Obstructive Sleep Apnea ) ఎక్కువగా కలుగుతాయి.

    తామర, ఒరుపులు ( Intertrigo ), సూక్ష్మాంగజీవులు కలిగించే వాపులు, పుళ్ళు ( Boils) వంటి చర్మవ్యాధులు కూడా స్థూలకాయములు కలవారిలో ఎక్కువ.

    ఫైన పేర్కొన్న వివిధ కారణముల వలన బరువు ఎక్కువగా కలవారిలోను, స్థూలకాయులలోను ఆయుః ప్రమాణము తగ్గుతుంది.

 స్థూలకాయము, ఎక్కువ బరువులను నివారించు మార్గములు 

    తక్కువ  ఆహారము తక్కువ కాలరీలను గ్రహించుట వలన, వ్యాయామముతో ఎక్కువ కాలరీలను ఖర్చు పెట్టుట వలన బరువు తగ్గుతారు. కాలరీలు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయాల ద్వారా దేహానికి చేరుతాయి. చక్కెరతో కూడిన శీతల పానీయాలు, చక్కెర, వెన్న, నేతులతో చేసిన చిల్లర తిళ్ళు వలన, తఱచు వివిధ రకాల చిరుతిళ్ళు తినుటవలన, అధిక పరిమాణములలో భోజనములు భుజించుట  వలన కాలరీలు ఎక్కువగా  గ్రహించుట జరుగుతుంది. దేహము ఖర్చు పెట్టని కాలరీలు ఏ రూపములో వెళ్ళినా చివరకు కొవ్వుగా దేహములో నిలువ ఉంటాయి.

ఆహారములో కాలరీల తగ్గింపు 

    అందువలన ఊబ కాయము తగ్గాలంటే చక్కెర సహిత శీతలపానీయాలు మాని మంచినీటి వాడుకను పెంచుకోవాలి. చక్కెర లేని శీతల పానీయములు 0 కాలరీలవి వాడుకొనవచ్చును. కొవ్వులు, చక్కెర, పిండిపదార్థాలతో సహా తీసుకొనే కాలరీలు మితపరచుకోవాలి. ఆరోగ్యానికి తోడ్పడే ఫలాలు. ఆకుకూరలు, కూరగాయలు, పీచుపదార్థములు, చిక్కుళ్ళు, పప్పులు పూర్ణ ధాన్యములు ( Whole grains ) వినియోగించుకొని సంస్కరణ ధాన్యాల ( refined grains ) వినియోగము తగ్గించుకోవాలి. కొవ్వుతో కూడిన మాంసము బదులు చిక్కిన మాంసాలను ( Lean meats ) వినియోగించుకోవాలి. తిని, త్రాగే మొత్తపు కాలరీలను పరిమితము చేసుకోవాలి. మద్యము వాడుకను మితపరచుకోవాలి.

వ్యాయామముతో కాలరీల ఖర్చు పెంచుట 

    జీవన శైలిని మార్చుకొని నడక, వ్యాయామము, యోగా, క్రీడలద్వారా శరీరములో నిలువ ఉన్న కాలరీలను కరిగించి ఖర్చు చెయ్యాలి. వీలయినంతగా వాహనముల వాడుక తగ్గించుకోవాలి. బయట నడచుటకు అవకాశము లేనియెడల వ్యాయామ సాధనములను యింట్లోనే వినియోగించుకోవాలి. దండీలు, బస్కీలు, యోగా, మొదలైన ప్రక్రియలతో స్వంత కండరములకు  ఎదురుగా కసరత్తులు చేసుకొనవచ్చును. ఒంటరిగా వ్యాయామము చేసుకోలేనివారు సమూహములుగా చేసుకోవాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో, క్రమశిక్షణతో బరువు తగ్గగలరు.

ఔషధములు 


    ఆకలిని తగ్గించుటకు బరువు తగ్గుటకు కొన్ని మందులు ఉన్నాయి. వాడుకలో ఉన్న మందులు ఆర్లిస్టాట్ ( Orlistat ), లార్కసెరిన్ ( Lorcaserin ), లిరగ్లూటైడ్ ( Liraglutide ), ఫెంటెరమిన్ / టోపిరమేట్, ( Phentermine/ Topiramate ),  నల్ ట్రెక్సోన్ / బూప్రోపియన్ ( Naltrexone / Bupropion) లు. ఆర్లిస్టాట్ కొవ్వుపదార్థాల జీర్ణమును అరికడుతుంది. కొవ్వుపదార్థాలు భుజించినపుడు అవి జీర్ణము కాక విసర్జింపబడుతాయి. ఔషధాల వలన విపరీత ఫలితాలు కలిగే అవకాశము ఉన్నది. ఈ మందుల వలన దీర్ఘకాలిక ప్రయోజనము, దీర్ఘకాలము వాడుట వలన కలిగే నష్టముల వివరాలు పూర్తిగా తెలియవు.

శస్త్రచికిత్సలు 


    బరువు విపరీతమైనప్పుడు ఎక్కువ బరువు వలన హృద్రోగములు, మధుమేహము యితర రుగ్మతలు ఉన్నప్పుడు బరువు తగ్గించుటకు శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి.  

జఠర బంధన చికిత్స  ( Laparoscopic Gastric Banding )


    భార సూచిక 40 దాటిన వారికి, లేక 35- 40 లో ఉండి హృద్రోగము, అదుపు కాని మధుమేహవ్యాధి ఉన్నవారికి మిత ఆహార, వ్యాయామ చికిత్సలు విఫలమైనప్పుడు జఠర బంధన చికిత్సలు అవసరము అవవచ్చును. ఉదరాంతర దర్శనము ద్వారా ( Laparoscopy ) జీర్ణాశయము (Stomach) చుట్టూ వ్యాకోచింపగల పట్టీ అమర్చి జీర్ణాశయమును రెండు తిత్తులుగా విభజించుట వలన పై భాగపు తిత్తి  కొద్ది ఆహారముతోనే నిండి ఆకలి తీరుతుంది. జఠరము, ఆంత్రములు ఉండుట వలన విటమినులు ఖనిజ లవణముల గ్రహించబడుతాయి. జఠర బంధన పరిమాణమును  మార్చుతూ జీర్ణాశయపు తిత్తుల పరిమాణములు మార్చవచ్చును.

 జఠర ఛేదన ( Gastric Resection )


    ఈ శస్త్రచికిత్సలో, జీర్ణాశయములో చాలా భాగమును తొలగిస్తారు. జఠరములో చిన్న తిత్తినే ఉంచి దానిని ఆంత్రములకు జతపరుస్తారు. ( Partial Gastrectomy with Gastro jejunal anastomoses). లేక నిలువుగా చాలా భాగమును తొలగించి ( Vertical Gastric resection) జీర్ణాశయ పరిమాణములో కొంత భాగమునే ఉంచవచ్చును. ఈ చికిత్సలు పొందిన వారికి విటమినులు, ఖనిజ లవణములను సమకూర్చాలి. ఆంత్రములలో కొంత భాగమును తొలగించే శస్త్ర చికిత్సలు అఱుదు అయిపోయాయి.

కడుపు బుడగ ; జఠర బుద్బుదము ( Gastric Balloon ) 


    తాత్కాలికముగా జీర్ణాశయములో వ్యాకోచింపగలిగే బుడగను అంతర్దర్శిని ( Endoscope ) ద్వారా నిలిపి ఆరు మాసములలో తొలగించి ఆకలి తగ్గించి బరువును తగ్గింపవచ్చును.

    ఎక్కువ బరువు లక్షణాలు పిన్నవయస్సులోనే పొడచూపుతాయి కనుక తల్లిదండ్రులు పూనుకొని పిల్లలను  ఆరోగ్యకరమైన మితాహారములో ఉంచి, వారికి తగిన వ్యాయామము, క్రీడలు సమకూర్చి శ్రద్ధ వహిస్తే చాలా వఱకు అధిక భారములను, స్థూలకాయములను నివారింపగలుగుతాము.



పదజాలము :


Acid Reflux = ఆమ్ల తిరోగమనము ( గ.న )
Body Mass Index  BMI = భార సూచిక  ( గ.న )
Cancers = కర్కట వ్రణములు ( గ.న )
Cerebro vascular accidents = మస్తిష్క విఘాతములు  ( గ.న )
Coronary artery disease = హృద్ధమనుల వ్యాధులు 
Endoscope = అంతర్దర్శిని ( గ.న )
Energy rich foods = శక్తిసాంద్ర ఆహారపదార్థములు ( గ.న )
Fatty Liver disease = కాలేయపు కొవ్వు ( వస ) వ్యాధి ( గ.న )
Gastric Balloon = కడుపు బుడగ ( గ.న )
Gastric Banding = జఠర బంధన చికిత్స  ( గ.న )
Gastric Resection = జఠర ఛేదనము ( గ.న )
Gastro jejunal anastomoses = జఠరాంత్ర సంధానము ( గ.న )
High density lipoproteins = అధిక సాంద్రపు కొలెష్టరాలు  ( గ.న )
Laparoscopy = ఉదరాంతర దర్శనము ( గ.న )
Low density lipoproteins = అల్ప సాంద్రపు కొలెష్టరాలు ( గ.న )
Metabolism = జీవవ్యాపారము 
Obesity = స్థూలకాయము
Obstructive Sleep Apnea = నిద్రావరోధ శ్వాసభంగములు ( గ.న )
Over weight = ఎక్కువ బరువు , అధికభారము
Under weight = భార హీనత

( ఉపయుక్త మనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి. )

హృదయవైఫల్యము ( Congestive Heart Failure )

  హృదయవైఫల్యము

 ( Congestive Heart Failure )


    (  తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో  )

                                                                                  డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి


     నిర్మాణములో లోపముల వలన గాని, వ్యాపారములో లోపముల వలన కాని గుండె వివిధ అవయవములకు అవసరమయిన రక్తమును అందించలేక పోవుటను హృదయ వైఫల్యముగా పరిగణిస్తారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోవుట, లేక గుండెపోటు అని కాని అపార్థము చేసుకోకూడదు. హృదయ వైఫల్యము సాధారణముగా క్రమేణా ముదిరే దీర్ఘకాలిక వ్యాధి. గుండెపోటు వంటి కారణముల వలన హృదయ వైఫల్యము త్వరితముగా పొడచూపవచ్చును.
    హృదయవైఫల్యపు రోగులు ప్రపంచములో సుమారు నాలుగు కోట్లమంది ఉంటారు. అరవై యైదు సంవత్సరాలకు పై బడిన వారిలో ఐదు నుంచి పది శాతము మంది దీనికి గుఱి అవుతారు.

కారణాలు 


    హృదయ ధమనుల కాఠిన్యత ( atherosclerosis of coronary arteries ), హృదయ రక్తప్రసరణ లోపము ( coronary insufficiency ), రక్తపుపోటు ( hypertension ), మధుమేహవ్యాధి, రుమేటిక్ గుండెజబ్బు వలన కలిగే హృదయ కవాటవ్యాధులు ( valvular heart diseases ) హృదయవైఫల్యమునకు ముఖ్యకారణములు.
    మితిమీరి మద్యము త్రాగుట, కొకైన్, మిథాంఫిటమిన్ వంటి మాదకద్రవ్యములు, విషపదార్థములు, కొన్ని ఔషధములు, విషజీవాంశములు ( viruses ), సూక్ష్మాంగజీవులు, స్వయంప్రహరణ వ్యాధుల ( autoimmune diseases ) వలన హృదయ కండరములలో కలిగే బలహీనత, తాపములు, హృదయ కండరములో యితర పదార్థములు పేరుకొనుట వలన కలిగే బలహీనత హృదయవైఫల్యమును కలిగించగలవు.

    గళగ్రంథి ఆధిక్యత ( hyperthyroidism ), ధమనులు  సిరల మధ్య సంధానములు ( arteriovenous fistulas ), విటమిన్ -బి-1 థయమిన్ లోపము వలన కలిగే బెరిబెరి, పేజెట్స్ వ్యాధి ( Paget‘s disease ) వంటి అధికప్రసరణ వైఫల్య వ్యాధులు ( high output  failure ) హృత్కోశ ఆకుంచనము ( pericardial constriction ), కర్ణికా ప్రకంపనము ( atrial fibrillation ) హృదయ వైఫల్యమును కలిగిస్తాయి.
    
    హృదయ రక్తప్రసరణ లోపాలు, రక్తపుపోటు, హృదయకవాట వ్యాధులు వీనిలో ముఖ్యమైనవి. ఇవి అధికశాతపు మందిలో హృదయ వైఫల్యమును కలిగిస్తాయి.

వ్యాధిప్రక్రియ ( Pathogenesis )

    హృదయము రక్తప్రసరణకు సహాయపడే ప్రధానమైన తోడు యంత్రము. శరీరములో యితర కండరములు సిరల నుంచి రక్తమును గుండెకు చేర్చుటకు కొంత తోడ్పడుతాయి. హృదయ కండరముల ముకుళిత ( systole ) వికాసముల ( diastole ) వలన రక్తప్రసరణ జరుగుతుంది. హృదయములో నాలుగు అరలుంటాయి. పై గదులు కుడి ఎడమ కర్ణికలు ( atria ). క్రింది అరలు కుడి ఎడమ జఠరికలు ( ventricles). దేహము నుంచి రక్తము ఊర్ధ్వ, అధో, బృహత్ సిరల ద్వారా కుడి కర్ణికకు చేరుతుంది. కుడి కర్ణిక నుంచి రక్తము త్రిపత్ర కవాటము ( tricuspid valve ) ద్వారా కుడి జఠరికకు  చేరుతుంది. కుడి జఠరిక నుంచి పుపుస కవాటము ( pulmonary valve), పుపుస ధమనుల ( pulmonary artery) ద్వారా ఊపిరితిత్తులకు చేరి అచట ప్రాణవాయువును గ్రహించుకొని బొగ్గుపులుసు వాయువుని విసర్జించుకొని పుపుస సిరల ( pulmonary veins) ద్వారా రక్తము ఎడమ కర్ణికకు చేరుతుంది. ఎడమ కర్ణిక నుంచి ద్విపత్ర కవాటము ( bicuspid valve ) ద్వారా ఎడమ జఠరికకు, ఎడమ జఠరిక ముకుళించుకున్నపుడు బృహద్ధమని కవాటము ( aortic valve ) ద్వారా బృహద్ధమనికి ( aorta ), దాని శాఖల ద్వారా వివిధ అవయవాలకు రక్తము చేరి కణజాలమునకు ప్రాణవాయువును పోషకపదార్థములను చేర్చి కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువును వ్యర్థపదార్థములను గ్రహిస్తుంది. వ్యర్థపదార్థములను విచ్ఛిన్నము చేయుటకు, విసర్జించుటకు కాలేయము, మూత్రాంగములు తోడ్పడుతాయి.

    కర్ణికలు ముకుళించుకున్నపుడు జఠరికలు వికసించుకొని రక్తమును కర్ణికలనుంచి గ్రహించుకుంటాయి. జఠరికలు ముకుళించుకొన్నపుడు కర్ణికలు జఠరికల మధ్య ఉండు కవాటములు మూసుకొని రక్త తిరోగమనమును నిరోధిస్తాయి. రక్తము పుపుస ధమని, బృహద్ధమనులకు నెట్టబడుతుంది.

    హృదయ కండరములు బలహీనపడినా, హృదయముపై అధికప్రసరణ భారము కలిగినా గుండె దేహమునకు తగినంత రక్తమును ప్రసరించలేనప్పుడు హృదయ వైఫల్యము కలుగుతుంది. దానిని అధిగమించుటకు శరీరములో ఇతర పరిణామములు కలుగుతాయి. హృదయనిర్మాణములో అవాంఛిత పరిణామములు కలుగుతాయి. హృదయ కండరములో ఉబ్బుదల ( cardiac hypertrophy ), హృదయ పరిమాణములో పెరుగుదల ( cardiac dilatation ) కలిగి హృదయము స్తూపాకారము పొందుతుంది. స్తూపాకారము వలన జఠరికల సంకోచ సామర్థ్యము ( efficiency ) తగ్గుతుంది.

    రెనిన్ ఏంజియోటెన్సిన్ - ఆల్డోష్టిరోన్ వ్యవస్థ ( renin angiotensin aldosterone system ), మూత్ర ఉత్పత్తిని తగ్గించే వాసోప్రెస్సిన్ లు ( Vasopressin -  Anti diuretic hormone ADH  ) ఉత్తేజింపబడుటచే దేహములో దూర రక్తనాళములు సంకోచిస్తాయి ( Peripheral vasoconstriction ). ఉప్పు, నీరుల నిలువలు పెరిగి శరీరములో రక్తపు ఘనపరిమాణము కూడా పెరుగుతుంది. అందువలన గుండెపై ఒత్తిడి కూడా హెచ్చవుతుంది.

    సహవేదన నాడీమండల ఉధృతి వలన రక్తములో ఎడ్రినలిన్, నారెడ్రినలిన్ వంటి కాటిఖాలమైనులు ( catecholamines ) పెరిగి గుండె వేగమును, హృదయకండరముల ముకుళింపును ( contractility )  పెంచుతాయి. అందువలన హృదయమునకు ప్రాణవాయుపు అవసరము కూడా పెరుగుతుంది.

    నాడీ ప్రసారిణుల ( neurotransmitters ) ప్రభావము వలన గుండెలో కణవిధ్వంసము, తంతీకరణము ( fibrosis), అసాధారణ లయలు ( cardiac arrhythmias ), బలహీనతలు కలిగి, హృదయ వైఫల్యమునకు దారితీస్తాయి.శరీరములో లవణ పరిమాణము జలపరిమాణము  పెరిగి సిరలలో సాంద్రత ( congestion ) పెరుగుతుంది. వివిధ అవయవములకు రక్తప్రసరణ తగ్గుటచే అవయవముల క్రియాశక్తి కూడా తగ్గే అవకాశము ఉంది.

హృదయవైఫల్య లక్షణములు 

    హృదయ వైఫల్యము గలవారు ఆయాసము గమనిస్తారు. తొలుత ఆయాసము శ్రమతో మొదలిడినా, హృదయ వైఫల్యము తీవ్రతరమయినపుడు విశ్రాంతి సమయాలలో కూడా ఆయాసము కలుగుతుంది. నీరసము, త్వరగా అలసిపోవుట, వ్యాయామమునకు, శారీరక శ్రమకు ఓర్చుకోలేకపోవుట, రాత్రులందు ఆకస్మికముగా ఆయాసము కలుగుట, బల్లపరపుగా పడుకున్నపుడు ఊపిరి ఆడకపోవుట ( orthopnea ) కలుగుతాయి.

    సిరలలో రక్తపు సాంద్రత ఎక్కువై శరీరపు క్రింది భాగములలో నీరుపట్టి, కాళ్ళు, చేతులు పొంగుట, పుపుస సిరలలో రక్తపు సాంద్రత పెరుగుట వలన పుపుస గోళములలో ( alveoli  ) నీరు పట్టి దగ్గు, ఆయాసము, ఊపిరితో పిల్లికూతలు ( wheezing ) కలుగుతాయి.

    గుండెదడ, కళ్ళుతిరుగుట, నిలుచున్నపుడు తాత్కాలిక అపస్మారము రావచ్చును. గుండెనొప్పి కూడా కలుగవచ్చును.

    గుండెలో అసాధారణ లయలు ( arrhythmias ) కలుగుతే వాటి లక్షణములు ( గుండెదడ, అపస్మారక స్థితి, ఆకస్మికముగా గుండె ఆగిపోవుట ) కలుగ వచ్చును.

    హృదయ వైఫల్యము తీవ్రతరమైనపుడు, మూత్రాంగముల వ్యాపారము మందగించి వ్యర్థపదార్థముల విసర్జన, మూత్రపరిమాణము తగ్గవచ్చును. అపుడు శరీరములో లవణము, నీటి నిలువలు పెరిగి  పొంగులు ( edema ), ఊపిరితిత్తులలో నీటి ఉబ్బు ( pulmonary edema ) అధికమవుతాయి.

    కాలేయములో ద్రవసాంద్రత పెరిగితే ( hepatic congestion ) కాలేయ వ్యాపారము మందగించవచ్చును. కాలేయ జీవోత్ప్రేరకముల ( liver enzymes ) విలువలు పెరుగవచ్చును. పచ్చకామెర్లు కూడా కలుగవచ్చును. ఉదరకుహరములో నీరు పట్టి జలోదరము ( ascites ) కలిగించవచ్చును.

    వైద్యులు పరీక్షలో పాదములలోను,  చీలమండ వద్ద నీటిపొంగును గుర్తించగలరు. చీలమండవద్ద వేలితో నొక్కిపెట్టి ఉంచితే లొత్త పడుతుంది. ( ఇతర కారణములు కూడా నీటిపొంగును కలిగించవచ్చును.). ఈ పొంగు కాళ్ళ క్రింది భాగములకు వ్యాపించవచ్చును. 

    వినికిడి గొట్టముతో విన్నపుడు సామాన్యముగా వినిపించే మొదటి, రెండవ గుండెశబ్దములతో బాటు మూడు లేక నాల్గవ శబ్దములు కూడా వినిపించవచ్చును. గుండె శబ్దములు గుఱ్ఱపు దాట్ల వలె ( galloping ) ఉండవచ్చును. త్రిపత్ర ద్విపత్ర కవాటముల పరిమాణము పెరిగి తిరోగమన రక్తప్రవాహము ( regurgitation ) కలిగితే మర్మర శబ్దములు ( murmurs ) కూడా వినిపించవచ్చును. ఛాతిపై విన్నపుడు క్రిందిభాగములలో చిటపట శబ్దములు వినిపించవచ్చును. కంఠసిరలలో ఉబ్బుదల కనిపెట్టగలరు. పుపుసవేష్టనములో నీరు ( జల పుపుసవేష్టనము ; pleural effusion) పట్టవచ్చును. సాధారణము కాకపోయినా, హృదయకోశములో కూడా నీరు పట్టవచ్చును ( జల హృత్కోశము ; pericardial effusion). కాలేయములో సాంద్రత పెరుగుట వలన కాలేయ పరిమాణము పెరుగవచ్చును. నెమ్మదిగా కాలేయభాగములో చేతిని అదిమితే కంఠసిరలలో ఉబ్బుదల గమనించగలరు ( hepato jugular reflux ).

పరీక్షలు ( Investigations ) 

రక్తపరీక్షలు 

    హృదయవైఫల్య లక్షణములు కలవారికి రక్తకణ పరీక్షలు, రక్తవర్ణకము ( Haemoglobin ), రక్తములో రక్తకణ పరిమాణ శాతము ( hematocrit ) పరీక్షించి రక్తహీనత లేదని నిర్ధారణ చేసుకోవాలి. రక్తములో సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేట్ల ( విద్యుద్వాహక లవణముల ) విలువలను, మూత్రాంగ వ్యాపారమును తెలిపే యూరియా నైట్రొజెన్, క్రియటినిన్ విలువలను తెలుసుకొనుట అవసరము. చికిత్స పొందుతున్న వారిలో యీ పరీక్షలను మధ్య మధ్యలో పరిశీలించుట కూడా  చాలా అవసరము.

      కాలేయ వ్యాపారపరీక్షలు ( liver function tests ), గళగ్రంథి స్రావక పరీక్షలు ( thyroid hormones ), రక్తములో చక్కెర విలువలు, కొలెష్ట్రాలు, యితర కొవ్వుపదార్థాల పరీక్షలు కూడా అవసరమే.


బి- నేట్రియురెటిక్ పెప్టైడ్  (B type Natriuretic Peptide) 


    హృదయ వైఫల్యము కలవారిలో  రక్తఘనపరిమాణము పెరిగి గుండె అరలు సాగి, వాటి పరిమాణములు పెరిగినపుడు హృదయ కండరకణములు బి- నేట్ర్రియురెటిక్ పెప్టైడ్ అనే రసాయనమును అధికముగా ఉత్పత్తి చేస్తాయి. హృదయవైఫల్యము గలవారిలో బి నేట్రియురెటిక్ పెప్టైడు విలువలు 400 మించి ఉంటాయి. ఆ విలువ 100 కంటె తక్కువైతే హృదయ వైఫల్యము లేదని నిర్ధారించవచ్చును. మూత్రాంగ వ్యాపార లోపము ఉన్నవారిలో యీ విలువలు ఎక్కువగా ఉండవచ్చును.

ఛాతి ఎక్స్-రే 


    వీరికి ఛాతి ఎక్స్ రే అవసరము. ఊపిరితిత్తులలో ఎక్కువ సాంద్రతను ( congestion ), నీటి ఉబ్బును ( Pulmonary edema ) కనుగొనుటకు ఆయాసము కలిగించే ఊపిరితిత్తుల తాపము ( Pneumonia ), పుపుసవేష్టనములో గాలి ( వాయు పుపుసవేష్టనము ; Pneumothorax) వంటి ఊపితిత్తుల వ్యాధులను, జల పుపుసవేష్టనము ( Pleural effusion ) కనుగొనుటకు ఎక్స్ రే చిత్రములు ఉపయోగపడుతాయి.

    హృదయవైఫల్యము గలవారి ఎక్స్- రే చిత్రములలో హృదయ పరిమాణము పెరుగుట, ఊపిరితిత్తులలో ద్రవ సాంద్రత పెరుగుట, ఊపిరితిత్తుల పై భాగములలో రక్తనాళికలు ప్రస్ఫుటమగుటచే, కెర్లీ ‘ బి ‘, రేఖలను వైద్యులు గమనించగలరు .

హృదయవిద్యుల్లేఖ ( Electrocardiogram ) 

        
    విద్యుత్ హృల్లేఖనములు హృదయ ధమనుల వ్యాధిని ( Coronary artery disease ) సూచించవచ్చు. హృదయ లయలో భేదములను, ( arrhythmias ), హృదయములో (విద్యుత్ప్రేరణ ) ప్రసార మాంద్యములను ( conduction delays ) కనుగొనుటకు విద్యుత్ హృల్లేఖనములు ఉపయోగపడుతాయి.

హృదయప్రతిధ్వని చిత్రీకరణము ( Echocardiogram )


    శ్రవణాతీతధ్వని చిత్రీకరణ సాధనముతో హృదయ ప్రతిధ్వని చిత్రీకరణము ( echocardiogram) చేసి హృదయ నిర్మాణమును, హృదయములో రక్త చలనమును, కవాటముల వ్యాపారములను తెలుసుకొనవచ్చును. ఎడమ జఠరిక సంపూర్ణ వికాసము పొందినపుడు రక్త పరిమాణమును ( end diastolic volume ), సంపూర్ణముగా ముకుళించుకొన్నపుడు  రక్తపరిమాణమును ( end systolic volume) గణించి ఎడమ జఠరిక నుంచి బృహద్ధమనికి ప్రసరించు  రక్తశాతమును ( ఎడమ జఠరిక ప్రసరణ శాతము / left ventricular  ejection fraction ) కనుగొన వచ్చును. సాధారణముగా వయోజనులలో ఈ ప్రసరణ శాతము 55 % నుంచి 65 % శాతము ఉంటుంది.

    హృదయ కండర వికాసలోపము వలన హృదయ వైఫల్యము ( diastolic failure) కలిగిన వారిలో జఠరిక నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తశాతపు విలువలు సాధారణ పరిమితులలో ( 50 % శాతముకంటె ఎక్కువగా ) ఉంటాయి. 

    జఠరికలో కండర నష్టము, లేక కండర వ్యాపారములో లోపము ఉన్నవారిలో  ఎడమ జఠరిక ముకుళించుకొనుటలో లోపము కలిగి  ( systolic failure ) బృహద్ధమనికి ప్రసరించు రక్తశాతము ( ejection fraction ) తగ్గుతుంది.

    హృదయ వైఫల్యము ముకుళిత లోపము ( Systolic heart failure ) వలన కలిగిందో, లేక వికాస లోపము వలన ( Diastolic heart failure ) కలిగిందో నిశ్చయించుటకు ప్రసరణ శాతము ( ejection fraction ) తోడ్పడుతుంది.

    హృదయ ధమనుల వ్యాధి లక్షణములు ఉన్నవారికి హృద్ధమనీ చిత్రీకరణ ( Coronary  angiogram) అవసరము.

    హృదయమునకు  అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము చేసి ( Magnetic Resonance Imaging Scan  ) హృదయ నిర్మాణ, వ్యాపారాలను, వ్యాధులను  కనుగొనవచ్చును.

హృదయవైఫల్యపు అంతస్థులు 

    1 వ శ్రేణి :  వీరికి హెచ్చు శరీరపు శ్రమతో ఆయాసము కలుగుతుంది.

    2 వ శ్రేణి :   వీరికి మధ్య తరహా శ్రమతో ఆయాసము కలుగుతుంది

    3 వ శ్రేణి :   వీరికి కొద్దిపాటి శ్రమకే ఆయాసము కలుగుతుంది.

    4 వ శ్రేణి :  వీరికి విశ్రాంతి సమయములో కూడా ఆయాసము ఉంటుంది.

చికిత్స 

    హృదయ వైఫల్యము వలన శరీరములో కలిగే అవాంఛిత పరిణామాలను అవరోధించుట చికిత్సలో ముఖ్యభాగము. సహవేదన నాడీమండలము ( sympathetic nervous system )  ఉత్తేజము పొందుట వలన విడుదల అయే కాటిఖాలైమన్లను ( catecholamines ) అవరోధించుటకు బీటా గ్రాహక అవరోధకములను ( beta adrenergic blockers ), రెనిన్ ఏంజియోటెన్సిన్ ఆల్డోష్టిరోన్ వ్యవస్థతో విడుదల అయే ఆల్డోష్టిరోన్ ఫలితములను అరికట్టుటకు  ఏంజియోటెన్సిన్ 1 ని ఏంజియోటెన్సిన్ 2 గా మార్చే జీవోత్ప్రేరకపు  నిరోధకములను ( Angiotensin Converting Enzyme inhibitors ), ఆల్డోష్టిరోన్ గ్రాహక అవరోధకములను ( aldosterone receptor blockers ), రక్తనాళములను వ్యాకోచింపజేసి గుండె శ్రమను తగ్గించే ఔషధములను ( vasodilators ), శరీరములో లవణము, నీరు ఎక్కువ అయి కాళ్ళు, పాదములలో పొంగులు, ఊపిరితిత్తులలో నీటి ఉబ్బు కలిగినపుడు మూత్రకారకములను ( diuretics ) వైద్యులు ఉపయోగిస్తారు.

బీటా గ్రాహక అవరోధకములు ( Beta receptor blockers ) 

    హృదయ వైఫల్యములో సత్ఫలితాలను ఇచ్చేవి కార్వెడిలాల్ ( carvedilol ), మెటోప్రొలాల్ ( metoprolol ), బిసోప్రొలాల్ ( besoprolol ). ఇవి గుండెపై ఒత్తిడిని, గుండె వేగమును తగ్గిస్తాయి. రక్తనాళములలో పోటుని తగ్గించి గుండె శ్రమను తగ్గిస్తాయి. ఎడమ జఠరిక నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించే రక్తశాతమును ( ejection fraction ), జఠరిక వ్యాపార నైపుణ్యమును పెంచి వ్యాయామ సహనమును ( exercise tolerance ) పెంచుతాయి. లయ భేదములను అదుపులో ఉంచి జీవిత కాలమును పెంచుతాయి. వీటిని తక్కువ మోతాదులలో మొదలుపెట్టి రక్తపుపోటు, గుండె వేగము, రోగ లక్షణములను గమనిస్తూ అవాంఛిత ఫలితములు రానంత మేరకు మోతాదులను క్రమముగా పెంచుతారు .

ఏంజియోటెన్సిన్ ను మార్చే జీవోత్ప్రేరకపు అవరోధకములు ( Angiotensin Converting Enzyme inhibitors ) 

    ఏంజియోటెన్సినోజెన్ ( angiotensinogen ) కాలేయములో ఉత్పత్తి అయి మూత్రాంగములలో ఉత్పత్తి అయే రెనిన్ ( Renin ) వలన ఏంజియోటెన్సిన్ -1 గా మారుతుంది. ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్  ఏంజియోటెన్సిన్ -1 ని ఏంజియోటెన్సిన్ -2 గా మారుస్తుంది. ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్లు ఆ జీవోత్ప్రేరకమును ( enzyme ) నిరోధించి ఏంజియోటెన్సిన్ -2 ఉత్పత్తిని తగ్గిస్తాయి. అందువలన రక్తనాళముల బిగుతు తగ్గి రక్తపీడనము తగ్గుతుంది.గుండెకు శ్రమ తగ్గుతుంది. ప్రధాన అవయవములకు రక్తప్రసరణ పెరుగుతుంది. రెనిన్ - ఏంజియోటెన్సిన్ వ్యవస్థ వలన సమకూడే లవణపు నిలువలు, నీటి నిలువలు తగ్గి రక్తపరిమాణము తగ్గుతుంది. హృదయముపై పనిభారము, హృదయపు శ్రమ తగ్గుతాయి. ఈ ఔషధముల వలన హృదయ వైఫల్య లక్షణములు తగ్గి, రోగుల ఆయుఃప్రమాణము పెరుగుతుంది.

    హృదయ వైఫల్య లక్షణములు పొడచూపకపోయినా ఎడమ జఠరిక వ్యాపారము మందగించిన వారిలోను ( జఠరిక నుంచి బృహద్ధమనికి ప్రసరించు రక్తశాతము ( ejection fraction ) తగ్గిన వారిలో ), హృదయ ధమనుల వ్యాధి ( Coronary artery disease ) కలవారిలోను, అధిక రక్తపీడనము, మధుమేహవ్యాధి కలవారిలోను ACE Inhibitors హృదయ వైఫల్యమును అరికట్టుటకు ఉపయోగపడుతాయి. తక్కువ మోతాదులలో మొదలుపెట్టి క్రమముగా రక్తపీడనమును, మూత్రాంగ వ్యాపార పరీక్షలను, రక్తములో పొటాసియం విలువలను,  రక్తకణ గణనములను గమనిస్తూ మోతాదులను సర్దుబాటు చెయ్యాలి.

    కొందఱిలో వీటివలన దగ్గు కలుగవచ్చును. రక్తద్రవములో పొటాసియమ్ విలువలు ఎక్కువ కావచ్చును.    నాలుక, పెదవులు, కనురెప్పలలో  అసహనపు పొంగు ( Angio edema ) కలుగుతే ఈ మందుల వాడుకను వెంటనే మానివేయాలి.

ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు ( Angiotensin Receptor Blockers ) 

    ఇవి ఏంజియోటెన్సిన్ గ్రాహకములను అవరోధిస్తాయి. ACE Inhibitors ని దగ్గు మొదలైన కారణాల వలన  సహించలేని వారికి ఇవి తోడ్పడుతాయి. ఈ మందులు వాడేవారిలో మూత్రాంగ వ్యాపారమును, పొటాసియమ్ విలువలను గమనిస్తూ ఉండాలి.

రక్తనాళ వ్యాకోచకములు ( Vasodilators ) 

హైడ్రాలజిన్ ( Hydralazine ) 


    హైడ్రాలజిన్ ధమనులను వ్యాకోచింపజేసి వానిలో పీడనము తగ్గిస్తుంది. అందువలన గుండెకు శ్రమ తగ్గుతుంది.

నైట్రేట్లు ( nitrates ) 


    ఇవి సిరలను వ్యాకోచింపజేసి వాటిలో సాంద్రతను ( venous congestion ) తగ్గిస్తాయి. పుపుస సిరలలో  కూడా సాంద్రతను ( pulmonary congestion ) తగ్గిస్తాయి. జఠరికలలో పూరక పీడనమును ( ventricular filling pressure ) తగ్గించి గుండెకు శ్రమను తగ్గిస్తాయి. హృద్ధమనులను వ్యాకోచింపజేసి హృదయానికి రక్తప్రసరణ పెంచుతాయి. వీటి వలన  రక్తపీడనము బాగా తగ్గే ( hypotension) అవకాశము ఉన్నది. అందువలన మోతాదులను సవరించవలసిన అవసరము కలుగవచ్చును.

డిజోక్సిన్  ( Digoxin ) 

    డిజిటాలిస్ ఉపక్షారములు ( alkaloids ) హృదయ ముకుళితమును ( contractility ) పెంపొంద జేస్తాయి. హృదయ వేగమును తగ్గిస్తాయి. హృదయ వైఫల్యమునకు ఒకప్పుడు తప్పనిసరిగా వాడే డిజాక్సిన్ మెరుగైన మందులు రావడము వలన, దీని అవాంఛిత ఫలితముల వలన ఈ దినములలో ఎక్కువగా వాడబడుట లేదు. కర్ణికా ప్రకంపనము ( atrial fibrillation) కలవారిలో జఠరికల వేగమును అదుపులో పెట్టుటకు, వారి హృదయ వైఫల్యపు చికిత్సలోను డిజాక్సిన్ కు స్థానము ఉంది. రక్తములో దీని విలువలను తఱచు పరీక్షించాలి. విలువలు అధికమైతే వికారము, వాంతులు, హృదయ వేగము మందగించుట, లయ తప్పుట వంటి అవాంఛిత ఫలితములు కలుగుతాయి.

మూత్రకారకములు ( Diuretics ) 

    హృదయ వైఫల్యము వలన ఉప్పు, నీరు శరీరములో అధికమయి, కాళ్ళలో నీటిపొంగులు ( edema ) కలిగిన వారిలోను, ఊపిరితిత్తులలో నీటిపొంగు, సాంద్రత ( congestion ) ఎక్కువయి ఆయాసము వంటి బాధలు కలిగిన వారిలోను ఆ లక్షణములను నివారించుటకు మూత్రకారకములను ఉపయోగించవలసి ఉంటుంది. ఇవి మూత్ర ఉత్పత్తిని పెంచి శరీరములో నీటిని, ఉప్పును తగ్గిస్తాయి. వీటిని ఉపయోగించునపుడు రక్తములో విద్యుద్వాహక లవణముల ( electrolytes ) విలువలను, యూరియా నైట్రొజెన్ /  క్రియటినిన్  విలువలను, రక్తపీడనమును తఱచు గమనించాలి.

    రక్తప్రమాణము విపరీతముగా తగ్గకుండా జాగ్రత్త పడాలి. రక్తప్రమాణము బాగా తగ్గినపుడు ( hypovolemia ) నిటారు స్థితిలో రక్తపీడనము తగ్గి కళ్ళుతిరుగుట, సొమ్మసిల్లుట వంటి లక్షణములు కలుగవచ్చును. శరీరపు బరువును గమనించి, పాదములు, కాళ్ళలో పొంగులను గమనిస్తూ, రోగులను తఱచు పరీక్షిస్తూ తగిన రక్తపరీక్షలు చేస్తూ వైద్యులు మూత్రకారకముల మోతాదును సరిచేస్తుంటారు.

థయజైడు మూత్రకారకములు  ( thiazide diuretics )  


    హైడ్రోక్లోర్ థయజైడ్ ( Hydrochlorthiazide ), క్లోర్ థాలిడోన్ ( Chlorthalidone ) సాధుమూత్రకారకములు. మితముగా నీటిపొంగులు ఉండి, మితముగా  నీటి నిలువలు పెరిగి, మూత్రాంగముల వ్యాపారము బాగున్నవారిలో ఇవి ఉపయోగపడుతాయి.

మెటోలజోన్ ( metolazone ) 


    మెటోలజోన్  థయజైడ్ మూత్రకారకమే గాని మూత్ర నాళికల ( renal tubules ) ప్రథమ, అంతిమ భాగాలపై పనిచేసి, మెలిక మూత్రకారకములతో ( loop diuretics ) కలిపి వాడేటపుడు మూత్రాంగ వ్యాపారము ( renal function ) మందగించినవారిలో ఉపయోగపడుతుంది.

 మెలిక మూత్రకారకములు (  Loop diuretics ) 


    ఫ్యురొసిమైడ్ ( furosemide), టోర్సిమైడ్ ( torsemide ), బ్యుమటిడిన్ ( bumetanide ), ఎథాక్రినిక్ ఏసిడ్ ( ethacrynic acid ) : వీనిని లూప్ డైయూరెటిక్స్ అని అంటారు. మూత్రాంగములలో మూత్రనాళికల ( Nephrons ) మెలికలపై ( loops ) పనిచేసి మూత్ర ఉత్పత్తిని అధికము చేస్తాయి. వీటిని వాడే వారిలో పొటాసియమ్ కూడ వ్యర్థమవుతుంది. కాబట్టి పొటాసియం ని , పొటాసియమును పొదుపు చేసే మూత్రకారకములను కూడా సాధారణముగా వీటితో బాటు వాడవలసి ఉంటుంది. మూత్రాంగముల వ్యాపారము తగ్గినవారిలో కూడా ఇవి పనిచేస్తాయి.

పొటాసియము పొదుపు పఱచే మూత్రకారకములు ( potassium sparing diuretics )

              
    ఇవి ఆల్డోష్టిరోన్ గ్రాహకములను ( aldosterone receptors ) నిరోధించి మూత్రము అధికము చేస్తాయి. పొటాసియమును పొదుపుచేస్తాయి. ఇవి సాధుమూత్ర కారకములు . అందువలన సాధారణముగా లూప్ మూత్రకారకములతో బాటు వాడుతారు.

    స్పైరనోలేక్టోన్ ( spironolactone ), ఎప్లిరినోన్ ( eplirenone ) వాడుకలో ఉన్నవి. వీటి వాడుక వలన రక్తములో పొటాసియము పెరిగే అవకాశము ఉన్నది. మూత్రాంగముల వ్యాపారము బాగా మందగించినపుడు, ఏంజియోటెన్సిన్ కన్వెర్టింగ్ ఎంజైమ్ నిరోధకములను ( ACE inhibitors ) వాడునపుడు, ష్టీరాయిడులు కాని  తాపహరులను ( non steroidal anti inflammatory agents ) వాడేవారిలోను పొటాసియము అధికమయే అవకాశము ఎక్కువ. పొటాసియమ్ విలువలను తఱచు పరిశీలించాలి. హృదయ వైఫల్యము తీవ్రమయిన వారిలో యివి రోగ లక్షణములు నివారించుటకు, ఆయువును పెంచుటకు ఉపయోగపడుతాయి.

ఇతర ఔషధములు 

    జఠరికల ముకుళింపును పెంపొందించే డోపమిన్ ( dopamine ), డోబ్యుటమిన్ ( dobutamine ) మిల్రినోన్ ( milrinone ) హృదయవైఫల్యము తీవ్రతరమైన వారిలో ఉపయోగపడుతాయి. వీటిని సిరల ద్వారా రోగులను నిత్యము గమనిస్తూ వైద్యశాలలలో వాడుతారు.
  

సాక్యుబిట్రిల్ / వాల్సార్టన్ ( Sacubitril / Valsartan  ) 


    దీనిలో వాల్సార్టన్ ఏంజియోటెన్సిన్ గ్రాహక నిరోధకము ( angiotensin receptor blocker ). సాక్యుబిట్రిల్ హృదయ కండర కణములు ఉత్పత్తి చేసే నేట్రియురెటిక్ పెప్టైడు విధ్వంసమును అడ్డుకుంటుంది. ఆ రెండు రసాయనములు రక్తపీడనమును తగ్గిస్తాయి. మూత్రపు ఉత్పత్తిని పెంచి రక్తపరిమాణమును తగ్గిస్తాయి. ఈ ఔషధ మిశ్రమము ప్రసరణ శాతము ( ejection fraction ) తగ్గిన వారికి ఉపయోగపడుతుంది.

    రక్తహీనము ( anemia  ), గళగ్రంథి ఆధిక్యత, గళగ్రంథిలోపము, బెరిబెరి వంటి వ్యాధులు ఉన్నవారికి ఆ యా వ్యాధుల చికిత్సలు అవసరము.

జీవనశైలి మార్పులు 

    హృదయ వైఫల్యము ఉన్నవారు ఉప్పును పరిమితముగా వాడుకోవాలి. త్రాగే నీటిని కూడా దినమునకు ఒకటిన్నర, రెండు లీటర్లకు పరిమితము చేసుకోవాలి. మూత్రకారకములు వాడుతూ నీళ్ళు ఎక్కువగా త్రాగేవారిలో సోడియమ్ విలువలు బాగా తగ్గిపోయే అవకాశము ఉన్నది.

    పొగత్రాగరాదు. విపరీత లక్షణములు లేని వారు తగినంత వ్యాయామము చెయ్యాలి. ఊబకాయము ఉన్నవారు బరువు తగ్గుటకు కృషి చెయ్యాలి. కొలెష్టరాలును అదుపులో ఉంచుకోవాలి. మధుమేహవ్యాధిని అదుపులో పెట్టుకోవాలి. హృదయముపై వ్యతిరేకముగా పనిచేసే ఔషధాల వాడుకను నియంత్రించుకోవాలి.

    మద్యము, కొకైన్, మిథేంఫిటమిన్ వంటి మాదక ద్రవ్యాల వాడుకను మానివేయాలి.

ప్రాణవాయువు ( Oxygen ) 

     ప్రాణవాయువు సంతృప్తత ( capillary oxygen saturation ) తగ్గిన వారికి, ఆయాసము గలవారికి ప్రాణవాయువును కృత్రిమముగా అందించాలి.

    ఊపిరితిత్తులలో నీటిపొంగు ఔషధములకు త్వరగా తగ్గక, రక్తపు ప్రాణవాయువు విలువలు బాగా తగ్గినపుడు, బొగ్గుపులుసు వాయువు ప్రమాణములు బాగా పెరిగినపుడు , కృత్రిమ శ్వాసపరికరములను ( ventilators ) ఉపయోగించవలసి ఉంటుంది.

రక్తశుద్ధి ( Dialysis ) 

    హృదయ వైఫల్యముతో బాటు మూత్రాంగముల వైఫల్యము చివరి దశలో ఉన్నవారికి రక్తశుద్ధి చేస్తూ వ్యర్థపదార్థములను, ఎక్కువైన జల లవణములను కూడా తొలగించాలి. అందఱిలో యీ రక్తశుద్ధి సాధ్యము కాదు.

శస్త్రచికిత్సలు 

    హృద్ధమనుల వ్యాధి ఉన్నవారికి ధమనుల వ్యాకోచ ప్రక్రియలు (  angioplasty with stent placement), లేక ధమనీ అవరోధ అధిగమన శస్త్రచికిత్సలు ( Arterial bypass surgery ) చేసి హృదయమునకు రక్తప్రసరణను పునరుద్ధింపజేయాలి.

    హృదయములో విద్యుత్ప్రేరణ ఉత్పత్తి లోను ( generation of electrical impulse ), విద్యుత్ప్రేరణ ప్రసరణలలో ( conduction of electrical impulse ) భంగము ఏర్పడి కర్ణికల, జఠరికల వేగము మందగించిన వారికి కృత్రిమ హృదయ విద్యుత్ ప్రేరకములు ( cardiac pacemakers ) అమర్చాలి.

    హృదయ కవాట పరిమాణములు బాగా తగ్గిన వారికి ( valvular stenosis), పరిమాణములు పెరిగి రక్త తిరోగమనము ( valvular regurgitation ) విపరీతముగా ఉన్నవారికి కొత్త కవాటములను అమర్చాలి.

    హృదయకోశములో నీరు చేరితే ( pericardial effusion ) ఆ నీటిని తొలగించాలి. హృదయకోశపు తాపము (pericarditis ) వలన హృదయ ముకుళిత వికాసములకు భంగము ఏర్పడిన వారికి శస్త్రచికిత్సతో హృదయకోశమును తొలగించాలి ( pericardiectomy ).

    ఎడమ జఠరిక నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తశాతము - ప్రసరణశాతము ( ejection fraction ) 35 % కంటె తక్కువైతే, ఔషధములతో చికిత్స చేసి తగిన ప్రగతి కనిపించకపోతే, వారికి ప్రకంపన నివారణి ( defibrillator) అమర్చి ఆకస్మిక హృదయ మరణములను తగ్గించవచ్చును.

    జఠరిక సహాయ పరికరములు  ( ventricular assist devices ) తాత్కాలిక ప్రయోజనమునకు లభ్యము. హృదయ వ్యాపారము బాగా క్షీణించినచో ఇతర అవయవ వ్యాపారములు బాగుండి, వయోవృద్ధులు కాని వారికి గుండె మార్పిడి చికిత్స ( cardiac transplantation ) పరిశీలించాలి.

    హృదయవైఫల్యమును వైద్యులు నిత్యము చూస్తారు. కొందఱికి అత్యవసర చికిత్స అవసరము.
చికిత్సలో రక్తపరీక్షలు, బాధితులను తఱచు పరీక్షించుట, చాలా అవసరము. ఇదివరలో లక్షణములకే చికిత్సలు ఉండేవి. ఇప్పుడు హృదయ వ్యాపారమును మెరుగు పఱచే చికిత్సలు లభ్యమయి హృదయ వైఫల్యము గలవారి ఆయుః ప్రమాణములలో పెరుగుదల, లక్షణములకు మెరుగుగా ఉపశమనము లభించుట గమనిస్తున్నాము.

పదజాలము :

Alveolus  = పుపుసగోళము ; ఊపిరి బుడగ  ( గ.న )
Angiotensin Receptor Blockers = ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు ( గ.న )
Aorta = బృహద్ధమని
Aortic valve = బృహద్ధమని కవాటము 
Arrhythmias = అసాధారణ లయలు ( గ.న )
Arterial bypass surgery =  ధమనీ అవరోధ అధిగమన శస్త్రచికిత్స ( గ.న )
Arteriovenous fistulas = ధమనీ సిర సంధానములు (గ.న )
Ascites = జలోదరము
Atria = కర్ణికలు 
Atrial fibrillation = కర్ణికాప్రకంపనము ( గ.న )
Autoimmune diseases = స్వయంప్రహరణ ప్రతిరక్షణ వ్యాధులు ( గ.న )
Beta receptor blockers = బీటా గ్రాహక అవరోధకములు ( గ.న )
Bicuspid valve = ద్విపత్ర కవాటము 
cardiac arrhythmias = అసాధారణ హృదయలయలు ( గ.న )
Congestive Heart Failure = హృదయవైఫల్యము 
Contractility = ముకుళింపు
Coronary artery disease = హృదయధమనుల వ్యాధి 
Defibrillator) = ప్రకంపన నివారణి ( గ.న )
Dialysis = రక్తశుద్ధి 
Diastole = హృదయ వికాసము ( గ.న )
Diuretics = మూత్రకారకములు 
Echocardiogram = ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము ( గ.న )
Ejection fraction = ప్రసరణ శాతము ( గ.న )
Electrolytes = విద్యుద్వాహక లవణములు
Electrocardiogram = హృదయవిద్యుల్లేఖ ; విద్యత్ హృల్లేఖ
Fibrosis = తంతీకరణము 
High output  failure  = అధిక ప్రసరణ వైఫల్యము ( గ.న )
Murmurs = మర్మర శబ్దములు 
Nephrons = మూత్రనాళికలు ( గ.న )
Neurotransmitters = నాడీ ప్రసారిణులు
Cardiac pacemaker = హృదయ విద్యుత్ ప్రేరకము ( గ.న )
Oxygen saturation =  ప్రాణవాయు సంతృప్తత ( గ.న )
Pericardial constriction = హృత్కోశ ఆకుంచనము ( గ.న )
Pericarditis = హృత్కోశ తాపము ( గ.న )
Pericardial effusion = జల హృత్కోశము ( గ.న )
Pulmonary artery = పుపుస ధమని
Pulmonary edema = ఊపిరితిత్తుల నీటి ఉబ్బు .
Pulmonary valve = పుపుస కవాటము 
Pulmonary veins = పుపుస సిరలు
Regurgitation = తిరోగమన ప్రసరణ ( గ.న )
Sympathetic nervous system = సహవేదన నాడీమండలము 
Systole = హృదయ ముకుళితము ( గ.న )
Vasodilators = రక్తనాళ వ్యాకోచకములు ( గ.న )
Ventricles = జఠరికలు 
Ventricular assist devices = జఠరిక సహాయ పరికరము ( గ.న )
Ventricular filling pressure = జఠరిక పూరక పీడనము ( గ.న )
Tricuspid valve = త్రిపత్ర కవాటము 


( నా వ్యాసముల లక్ష్యము వైద్యవిషయములను తెలుగులో చెప్పుట , తగిన సమాచారమును చేకూర్చుట  , వైద్యవిషయములపై అవగాహన నా శక్తిమేరకు చేకూర్చడము మాత్రమే. వ్యాధిగ్రస్తులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. )

( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...