5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

                                           సత్వర హృద్ధమని వ్యాధులు

                       Acute Coronary Syndrome)

                                                            -డా. గన్నవరపు నరసింహమూర్తి .


    హృదయమునకు మిగిలిన అవయవముల వలె ప్రాణవాయువు, పోషకపదార్థములు అందించుటకు రక్తప్రసరణ అవసరము. హృదయము నిరంతరముగా జీవితకాలము అంతా తోడు యంత్రముగా ( pump ) పనిచేయాలి. అందువలన దానికి నిరంతరము రక్తప్రసరణ చేకూరాలి. హృదయ ధమనులు ( హృద్ధమనులు ; Coronary arteries ) హృదయమునకు రక్తము కొనిపోతాయి. హృత్సిరలు రక్తమును తిరిగి హృదయములో కుడికర్ణికకు ( right atrium ) చేరుస్తాయి.


    హృదయమునకు రక్తప్రసరణ తగినంత లోపిస్తే గుండెనొప్పి ( angina pectoris ), ఆ లోపము చాలా తీవ్రము అయినపుడు గుండెపోటు ( Heart attack ) కలుగుతాయి. గుండెపోటు కలిగినపుడు కొంత హృదయ కండర కణజాలము ప్రసరణరహిత మరణము ( infarction ) పొందుతుంది. అందువలన ప్రాణనష్టముతో బాటు ఇతర ఉపద్రవములు కలిగే అవకాశము ఉన్నది. ప్రపంచములో 30 శాతపు మరణములు హృదయ రక్తప్రసరణ లోపముల వలన కలుగుతాయి.                                                                     


    హృదయమునకు రక్తప్రసరణ వామ (ఎడమ) హృద్ధమని ( Left coronary artery) దక్షిణ ( కుడి ) హృద్ధమని ( Right coronary artery ) సమకూరుస్తాయి. 


వామ హృద్ధమని ( Left Coronary artery)  


    ఎడమ లేక వామ హృద్ధమని బృహద్ధమని ( aorta ) నుంచి ఎడమ బృహద్ధమని కవాటము పైన మొదలవుతుంది. ఇది  వామ పరిభ్రమణ ధమని ( left circumflex artery ), వామ పూర్వ అవరోహణ ధమని ( left anterior descending artery ) అను రెండు శాఖలుగా చీలుతుంది. కొంతమందిలో మధ్యస్థ ధమని ( intermediate artery  ) అనే మూడవ శాఖ కూడా ఉంటుంది. వామ పూర్వఅవరోహణ ధమని రెండు జఠరికల మధ్య ముందుభాగములో ఉన్న గాడిలో ( పూర్వ జఠరికాంతర గర్తము ; anterior inter ventricular sulcus ) క్రిందకు పయనిస్తుంది. దీని కుడ్య శాఖలు ( septal branches ) రెండు జఠరికల మధ్య ఉన్న గోడ ( జఠరికాంతర కుడ్యము ; inter ventricular septum ) ముందు రెండు భాగములకు రక్తప్రసరణ సమకూరుస్తాయి. ఈ వామ పూర్వ అవరోహణ ధమని ( left anterior descending artery ) నుంచి వచ్చే వక్ర శాఖలు ( diagonal branches ) ఎడమ జఠరిక పార్శ్వభాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తాయి. వామపూర్వ అవరోహణధమని గుండె ఎడమ జఠరికకు సుమారు 50 శాతపు రక్తప్రసరణను సమకూరుస్తుంది.

    వామ పరిభ్రమణ ధమని ( left circumflex artery ) ముందు ఎడమ దిశలో అడ్డముగా పయనించి గుండె వెనుక కుడి దిశలో పర జఠరికాంతర గర్తము ( posterior inter ventricular sulcus ) వఱకు పయనించి దక్షిణ హృద్ధమని శాఖతో కలుస్తుంది. 15 శాతము మందిలో పర అవరోహణ ధమని posterior descending artery ) ఏర్పడుటలో వామ పరిభ్రమణ ధమని  ముఖ్యపాత్ర వహిస్తుంది. 85 శాతము మందిలో  పర అవరోహణ ధమని ఏర్పాటునకు దక్షిణ హృద్ధమని ముఖ్యపాత్ర వహిస్తుంది. వామ పరిభ్రమణధమని ఎడమ జఠరిక వెనుక భాగమునకు, పక్క భాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తుంది. పర అవరోహణ ధమని ( posterior descending artery ) కుడి జఠరిక ఎడమ జఠరికల మధ్య ఉన్న గోడలో ( జఠరికాంతర కుడ్యము ; inter ventricular septum )  వెనుక మూడవవంతు భాగమునకుజఠరికల క్రిందిభాగములకు రక్తప్రసరణ  సమకూరుస్తుంది. 


దక్షిణ హృద్ధమని  ( Right coronary artery ) 


    దక్షిణ హృద్ధమని బృహద్ధమని ( aorta ) నుంచి కుడి కవాట పత్రము మీద మొదలవుతుంది. ఇది కుడికర్ణిక కుడిజఠరికల మధ్య ఉన్న గర్తములో పర జఠరికాంతర గర్తము ( posterior inter ventricular sulcus ) వఱకు పయనిస్తుంది. ఇది కుడి మేరధమని ( right marginal artery), పర అవరోహణ ధమని (posterior descending artery) అను శాఖలుగా చీలుతుంది. దక్షిణ హృద్ధమని కుడి జఠరికకుఎడమ జఠరికలో 25-35 శాతపు భాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తుంది. ధమనుల గోడలలో బయటపొర ( tunica externa or adventitia ), మధ్యపొర ( tunica media ), లోపొర ( tunica interna or intima ) అనే మూడు పొరలు ఉంటాయి. బయటపొరలో సాగుకణజాలము ( elastic tissue ), పీచుకణజాలము fibrous tissue ) ఉంటాయి. మధ్యపొరలో మృదుకండరములు ( smooth muscles ), సాగుకణజాలము ( elastic tissue ), పీచుపదార్థము ( collagen ) ఉంటాయి. నాళముల లోపొర పూతకణములు ( lining cells ), సాగుపదార్థము ( elastin ), పీచుపదార్థముల ( collagen ) మూలాధారమును అంటిపెట్టుకొని ఉంటాయి. 

                                                             హృద్ధమనుల వ్యాధి ( Coronary artery disease ) 


    హృద్ధమని వ్యాధి అంటే పరోక్షముగా హృద్ధమనుల కాఠిన్యతగా ( Atherosclerosis ) భావించాలి. ధమనీకాఠిన్యత (arteriosclerosis) శైశవము నుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత ప్రస్ఫుటమయి వృద్ధాప్యములో తీవ్రతరము అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొర ( intima ) క్రింద కొవ్వులు, కొలెష్టరాలు , కాల్సియంతాపక కణములు పేరుకొని ఫలకలుగా ( plaques ) పొడచూపుతాయి. ధమనుల గోడలోని మృదుకండరముల మధ్య కాల్సియమ్ ఫాస్ఫేట్ నిక్షేపములు కూడుకున్నపుడు హృద్ధమనులు బిఱుసెక్కుతాయి. ధమనీకాఠిన్యపు ఫలకలు ధమనులలోనికి ఉబుకుట వలన ధమనుల లోపలి పరిమాణము తగ్గి అవి సంకుచితము అవుతాయి. ఈ ఫలకలు హృద్ధమనులలో ఒకటి రెండు చోట్లే ఉండవచ్చునులేక ఎక్కువగా ఉండవచ్చును. ధమనులలో హెచ్చుభాగము కాఠిన్యత పొందవచ్చును. హృద్ధమనులు, వాటి శాఖలలో నాళాంతర పరిమాణము 40 శాతము కంటె తక్కువగా  తగ్గినపుడు రక్తప్రవాహమునకు చెప్పుకోదగ్గ అవరోధము కలుగదు. రక్తనాళములలో ఫలకలు స్థిరముగ ఉండి నాళాంతర  పరిమాణము 40- 70 శాతము తగ్గినపుడు రక్త ప్రవాహమునకు అవరోధము కలిగి శ్రమవ్యాయామములతో హృదయమునకు ప్రాణవాయువు అవసరాలు పెరిగినపుడు,ఆ అవసరములు తీరక గుండెనొప్పి ( Angina ) కలుగుతుంది. రక్తప్రసరణ లోపము ( ischemia ) తీవ్రతరము అయినపుడు హృదయపు లయ తప్పే అవకాశము ఉన్నది. జఠరికలు లయ తప్పి జఠరిక ప్రకంపనము ( ventricular fibrillation ) లోనికి వెళ్తే ప్రాణాపాయము కలుగుతుంది.

    ఒక్కోసారి ఒక హృద్ధమని పూర్తిగా మూసుకుపోవచ్చును. ధమనిలో ఫలక ఏర్పడి ఆ ఫలక చిట్లి దానిపై రక్తము గడ్డకట్టి రక్తప్రసరణకు తీవ్ర అవరోధము కలిగితే, హృదయ కండరజాలములో కొంత భాగము ప్రాణవాయువుపోషకపదార్థములు అందక మరణిస్తే గుండెపోటు ( myocardial infarction ) కలుగుతుంది. మానుదల ప్రక్రియలో ఆ మరణించిన కండర కణజాలమునకు బదులు పీచుకణజాలము ఏర్పడుతుంది. అపుడు హృదయ వ్యాపారము క్షీణిస్తుంది. 


హృద్ధమనీ వ్యాధులకు కారణములు  (Risk factors for coronary artery disease)              


    వయస్సు పెరుగుతున్న కొలది ధమనులలో కాఠిన్యత పెరుగుతుంది. రక్తపీడనము హెచ్చుగా ఉన్నవారిలో హృద్ధమనివ్యాధులు ఎక్కువగా కలుగుతాయి. మధుమేహవ్యాధిగ్రస్థులలోనుఅల్పసాంద్రపు లైపోప్రోటీనులు (Low Density Lipoproteins) అధికముగా ఉన్నవారిలోనుఅధికసాంద్రపు లైపోప్రోటీనులు ( High Density Lipoproteins ) తక్కువగా ఉన్నవారిలోనుట్రైగ్లిసరైడులు బాగా ఎక్కువగా ఉన్నవారిలోనుపొగత్రాగేవారిలోను, స్థూలకాయము గలవారిలోను (భారసూచిక 18.5-24.9 పరిమితులలో ఉండుట మేలు. నడుము చుట్టుకొలత పురుషులలో 40 అంగుళముల లోపు స్త్రీలలో 35 అంగుళముల లోపు  ఉండుట మేలు. ), దగ్గఱి కుటుంబసభ్యులలో పిన్నవయస్సులోనే ( పురుషులలో 55 సంవత్సరములలోనుస్త్రీలలో 65 సంవత్సరములలోను ) హృదయ రక్తప్రసరణలోప వ్యాధులు ( ischemic heart diseases ) కలిగిన వారిలోను హృద్ధమనీవ్యాధులు కలిగే అవకాశములు హెచ్చు.ధూమపానము సలిపేవారు ధూమపానము పూర్తిగా 15 సంవత్సరములు మానివేస్తే వారిలో హృద్ధమనీ వ్యాధులు కలిగే అవకాశము ధూమపానము సలుపని వారితో సమానము అవుతాయి. రక్తపరీక్షలలో reacttive protein 2 mgm /dl మించినవారిలోను, హృద్ధమనులలో కాల్సియం ప్రమాణములు పెరిగిన వారిలోనుదూరధమని వ్యాధులు ( Peripheral Arterial Diseases ) కలవారిలోను హృద్ధమని వ్యాధులు కలిగే అవకాశములు హెచ్చు. హృదయ ధమనులలో కాఠిన్యఫలకలు ఏర్పడి వాని లోపల పరిమాణము తగినంత ( 40- 70 శాతము ) తగ్గినపుడు శ్రమతోను, వ్యాయామముతోను హృదయమునకు ప్రాణవాయువు, పోషకపదార్థముల అవసరములు పెరిగి అవి తీరనపుడు గుండెనొప్పి ( angina pectoris ) కలుగుతుంది. ధమనీకాఠిన్య ఫలకలు స్థిరముగా ఉన్నపుడు హృద్ధమనివ్యాధి స్థిరమని ( stable angina ) పరిగణిస్తారు. 

    హృద్ధమనులలో ధమనీకాఠిన్య ఫలకలు ( atherosclerotic plaques ) చిట్లినపుడుఆ ఫలకలపై సూక్ష్మరక్తఫలకములు ( platelets ) అంటుకొని వానిపై రక్తపుగడ్డలు ( thrombi ) ఏర్పడి నాళములో రక్తప్రసరణకు అవరోధము కలిగించినపుడు తీవ్రమైన గుండెనొప్పి (unstable angina) కాని గుండెపోటు ( heart attack; Myocardial infarction ) కాని కలుగుతాయి. వీటిని సత్వర హృద్ధమని వ్యాధులుగా ( Acute Coronary Syndrome ) వర్గీకరిస్తారు. 

    హృద్ధమనిలో ప్రసరణ అవరోధము పాక్షికము అయినా, తాత్కాలికము అయినా హృదయకండర కణజాలములో ప్రసరణరహిత మరణము ( infarction ) కలుగకపోయినా, అసాధారణముతీక్ష్ణము అయిన గుండెనొప్పి కలిగి హెచ్చు సమయము ( 20 నిముషములు మించి ) ఉండుట, హెచ్చు తీవ్రత కలిగి ఉండుట, తక్కువ శ్రమతో కాని, విశ్రాంత సమయములోనే కలుగుట వంటి లక్షణములు ఉండుట వలన దానిని అస్థిరపు గుండె నొప్పిగా ( Unstable Angina  ) వైద్యులు పరిగణిస్తారు. వీరికి త్వరితముగా ఔషధములతో చికిత్స చేసి ఆపై వారికి ( చర్మము ద్వారా ) హృదయ ధమనుల వ్యాకోచ చికిత్సలు ( Percutaneous Coronary Intervention ) అవసరమో కాదో నిర్ణయించాలి.

    కొందఱిలో ఈ నొప్పితో హృదయ విద్యుల్లేఖనములో ( electrocardiogram ) S T భాగము మూలరేఖ ( baseline ) మీదకు లేవకపోయినా, రక్తములో ట్రొపోనిన్ ( troponin ), క్రియటినిన్ కైనేజ్ ( Creatinine Kinase ), వంటి హృదయ సూచకములు ( Cardiac markers ) పెరుగుతే దానిని NSTEMI గా ( Non S T Elevation Myocardial Infarction ) వర్ణిస్తారు. వీరికి చికిత్స అస్థిరపు గుండెనొప్పి ( unstable angina ) కలిగిన వారి చికిత్స పంథాలోనే  అందిస్తారు. 

    ఆ రక్తపుగడ్డలు హృదయధమనులలో రక్తప్రసరణకు పూర్తిగా అడ్డుపడితే ప్రాణవాయువుపోషక పదార్థములు అందక ఆ యా ధమనులనుంచి ప్రసరణ పొందే హృదయ కండర కణజాలము కొంత ప్రసరణరహిత మరణము ( infarction ) పొందుతుంది. అపుడు గుండెపోటు కలుగుతుంది. గుండెపోటు కలిగి హృదయకండర కణజాలము మృతి పొంది, హృదయ విద్యుల్లేఖనములో భాగము మూలరేఖపైకి ఎత్తుగా లేచి ఉన్నపుడు దానిని STEMI గా ( ST Elevation Myocardial Infarction ) వర్ణిస్తారు. STEMI చికిత్సలో రక్తప్రసరణను అతిత్వరగా పునరుద్ధరించి హృదయ కండర కణజాల మరణమును Myocardial Infarction ) తగ్గించు ప్రయత్నములు చేయాలి.

    కొందఱిలో హృద్ధమని కండర దుస్సంకోచము ( spasm ), వలనకొకైన్ ( cocaine ) దుర్వినియోగము కలిగించే హృద్ధమని కండర దుస్సంకోచము వలన, పాండురోగము ( anemia ) వలన , గళగ్రంథి ఆధిక్యత ( Hypothyroidism ) వలన, రక్తపు ప్రాణవాయువు సంతృప్తత ( Oxygen saturation ) తగ్గుట వలన, రక్తపీడనము హెచ్చుట వలన సత్వర హృద్ధమనివ్యాధులు కలుగవచ్చును.


                                                             సత్వర హృద్ధమని వ్యాధి లక్షణములు  


    సాధారణముగా గుండెనొప్పిగుండెపోటు కలిగినవారిలో రొమ్ముటెముక వెనుక భాగములో తీక్ష్ణమైన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి భుజములకుభుజదండములకుమెడకుక్రింది దవడకు వ్యాపించవచ్చు. నొప్పితో బాటు చెమటలు, ఊపిరి అందకపోవుట ( shortness of breath ), వాంతిభావన ( nausea  ), వాంతులు కూడా కలుగవచ్చును. కొందఱిలో ఛాతినొప్పి కాక అసాధారణమైన గుండెకు సంబంధించని లక్షణములు కలుగవచ్చును. ఊపిరి అందకపోవుట, పై కడుపులో నొప్పివికారము, కళ్ళుమసకబారి స్మృతితప్పుట ( syncope ), నీరసము వంటి అసాధారణ లక్షణములే సుమారు 25 శాతము మందిలో కలుగుతాయి.  

    స్త్రీలలోనుమధుమేహ వ్యాధిగ్రస్థులలోను, వృద్ధులలోను, మూత్రాంగ వైఫల్యము అంత్యదశలలో ఉన్నవారిలోనుశస్త్రచికిత్సలు సమీపకాలములో జరిగిన వారిలోను  అసాధారణ లక్షణములు ఎక్కువగా కనిపిస్తాయి. వీరిలో ఛాతిలో నలత ఉండవచ్చు.

    ఛాతినొప్పి తీవ్రముగా ఉండుటఎక్కువ సమయము ఉండుట, కొత్తగా కలుగుట అస్థిరపు గుండెనొప్పిని ( Unstable Angina ) సూచిస్తాయి. ఊపిరితో కలిగే నొప్పి, భుజముల చలనముతో కలిగే నొప్పిఛాతిపైన, పక్కటెముకలు ( ribs ) - ఛాతిఎముక సంధానముల ఒద్ద నొక్కుతే కలిగేనొప్పి గుండెనొప్పిని సూచించవు. కొద్ది సెకండులు మాత్రమే ఉండే నొప్పులు గుండెపోటును సూచించవు. వైద్యులు పరీక్షలో రక్తపీడనపు తగ్గుదల, వినికిడి గొట్టముతో విన్నపుడు గుండెలో క్రొత్త మర్మర ధ్వనులుఊపిరితిత్తుల క్రిందిభాగములలో చిటపట శబ్దములు ఉన్నాయేమో పరిశీలిస్తారు . 

    హృదయవైఫల్య లక్షణములకు కూడా పరిశోధించాలి. హృదయకండరమునకు (myocardium) రక్తప్రసరణ తగ్గినపుడు ఎడమ జఠరిక సంకోచము తగ్గి బృహద్ధమని లోనికి నెట్టబడే రక్తపరిమాణము తగ్గి రక్తపీడనము తగ్గగలదు. హృదయ సామర్థ్యము తగ్గుటచే రక్తపీడనము తగ్గి శరీర కణజాలమునకు రక్తప్రసరణ తగ్గుటను ‘ హృదయ జనిత ఘాతము / హృదయ జనిత ఉపద్రవము ( Cardiogenic shock )‘ గా వ్యవహరిస్తారు. కుడి జఠరిక కండరజాలమునకు రక్తప్రసరణ తగ్గి కుడిజఠరిక ( right ventricle ) సమర్థత తగ్గుతే, పుపుసధమనికి ( pulmonary artery ) చేరే రక్తపరిమాణము తగ్గి > ఎడమ కర్ణికకు పుపుససిరలు కొనిపోయే రక్తపరిమాణము >  ఎడమ జఠరికకు  > బృహద్ధమనికి ( aorta ) చేరే రక్తపరిమాణములు కూడా తగ్గుతాయి. అందువలన రక్తపీడనము తగ్గగలదు.ఎడమ జఠరిక వైఫల్యము వలన ఊపిరితిత్తులలో ద్రవసాంద్రత ( congestion ) పెరిగి వైద్యులు ఊపిరితిత్తుల దిగువ భాగములలో చిటపట శబ్దములు వినగలుగుతారు.

    గుండెపోటు వలన ఎడమ కర్ణిక, ఎడమ జఠరికల మధ్య ఉండు ద్విపత్రకవాటములో తిరోగమన రక్తప్రసరణము ( Mitral Regurgitation ) కలిగినారెండు జఠరికల నడిమిగోడలో రంధ్రము Ventricular Septal Defect ) ఏర్పడినా జఠరికలు ముకుళించుకున్నపుడు మర్మర శబ్దములు వినిపిస్తాయి. 

    ఛాతినొప్పిని కలిగించు ఇతర కారణములకు కూడా వైద్యులు పరిశోధించాలి.

    బృహద్ధమని విదళనము ( dissecting aortic aneurysm  ) అరుదైనా దీనివలన ఛాతినొప్పి కలుగుతుంది. ఈ నొప్పి చాలా తీవ్రముగా ఉంటుంది. ఛాతినొప్పితో బాటు నాడీమండలములో లోపములు, అవలక్షణములు కూడా వీరిలో కనిపించవచ్చు. హృదయవేష్టనములో తాపము pericarditis ) వలన ఛాతినొప్పి కలుగవచ్చును. వీరిలో హృదయవేష్టనపు పొరల రాపిడిశబ్దము pericardial rub ) వైద్యులు వినే అవకాశము ఉన్నది.


పరీక్షలు   


    ఛాతినొప్పి కలవారికి రక్తకణముల గణనము, రక్తరసాయన పరీక్షలురక్తములో కొవ్వుల పరీక్షలు అవసరము. 


విద్యుత్ హృల్లేఖనము ( Electrocardiogram )  


    ఛాతినొప్పి కలిగిన వారికి హృదయ విద్యుల్లేఖనము వెంటనే తీయాలి. విద్యుత్ హృల్లేఖనములో మార్పులు వెనువెంటనే కనిపించక పోవచ్చును. అందువలన ప్రతి 20 నిముషములకు ఒకసారి చొప్పున రెండు గంటలు విద్యుత్ హృల్లేఖనములు తీసి మార్పులకై శోధించాలి.

STEMI ( ST Elevation Myocardial Infarction ) గుండెపోటు కలిగినవారిలో విద్యుత్ హృల్లేఖనములో కనీసము రెండు సమీప స్థానములలో  S T భాగము మూలరేఖకు కనీసము  1 మి.మీ పైకి ఎత్తుగా ఉంటుంది. కొందఱిలో కొత్తగా Left bundle branch block ( వీరిలో ఎడమ జఠరిక కండరజాలమునకు విద్యుత్ ప్రేరణ  ఆలస్యముగా చేరుతుంది ) కనిపిస్తుంది. గుండె వెనుకభాగము రక్తప్రసరణ లోపమునకు గుఱి అయినపుడు S T భాగము మూలరేఖకు దిగువకు పోయి V1, V2 , V3 స్థానములలో  R waves  పొడవుగా ఉంటాయి. అస్థిరపు గుండెనొప్పి ( unstable angina ), NSTEMI ( Non ST Elevation Myocardial Infarction ) గుండెపోటులు కలిగినపుడు విద్యుత్ హృల్లేఖనములలో ST భాగము మూలరేఖకు దిగువన ఉండవచ్చు, లేక ఏ మార్పులు ఉండవు . 


హృదయ సూచకములు ( Cardiac markers ) 


    హృదయకండర కణములకు రక్తప్రసరణ ఎక్కువ సమయము లోపించినపుడు ఆ కణ పటలముల cell membranes ) అభేద్యత దెబ్బతిని ఆ కణముల నుంచి క్రియటినిన్ కైనేజ్ ( Creatinine kinase ),  మయోగ్లోబిన్ ( myoglobin), ట్రొపోనిన్ ( Cardiac troponin  ) అనే హృదయ సూచకములు ( Cardiac markers) బయటకు చింది రక్తములో కనిపిస్తాయి. ఛాతినొప్పి కలిగిన వారిలో ఈ సూచకములకు వెంటనేను6 గంటలు, 12 గంటల తరువాతను పరిశోధించాలి. విద్యుత్ హృల్లేఖనములలో ST భాగము ఎత్తుగా ఉన్నవారిలో ఈ హృదయ సూచకములు ( Cardiac markers ) పెరుగకపోయినావారికి అతిత్వరగా రక్తప్రసరణను పునరుద్ధించు (revascularisation ) ప్రయత్నములు చేయాలి. ST భాగము మూలరేఖకు ఎత్తులో లేక హృదయసూచకములు మాత్రము పెరిగినవారిలో NSTEMI (Non-ST Elevation Myocardial Infarction) కలిగినట్లు నిర్ణయించాలి. 


ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము  ( Echocardiogram )


    ఛాతినొప్పి కొనసాగుతున్నవారిలో ప్రతిధ్వని హృదయ చిత్రీకరణములు ఉపయోగపడుతాయి. ప్రతిధ్వని హృదయ చిత్రీకరణములు Echocardiograms) రక్తప్రసరణ లోపించిన హృదయభాగములో హృదయ కుడ్యపు చలనములో మందకొడితనమును చూపిస్తాయి. హృదయకుడ్య చలనములో లోపములు లేనివారిలో గుండెపోటు కలుగలేదని నిర్ధారించజాలము కాని, తీవ్రమైన నష్టము కలుగలేదని చెప్పగలము. ప్రతిధ్వని హృదయ చిత్రీకరణములు ఛాతినొప్పిని కలిగించు ఇతర కారణములు, హృదయకండరములో తాపమును ( myocarditis ), బృహద్ధమని కవాట సంకీర్ణతను ( Aortic stenosis ), బృహద్ధమని విదళనమును ( Aortic dissection ) పసిగట్టగలవు. గుండెపోటు వలన కలిగే ద్విపత్రకవాటములో తిరోగమన ప్రసరణ ( mitral regurgitation ), జఠరికాంతర కుడ్యములో రంధ్రములు ( Ventricular septal defects ) వంటి ఉపద్రవములు కూడా  ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము వలన తెలుస్తాయి.


హృద్ధమనుల చిత్రీకరణ  ( Coronary angiography )


    ఊరుధమని ( femoral artery ) లేక ముంజేతి వెలుపలి ధమని ( Radial artery ) ద్వారా బృహద్ధమనిలోనికి ఆపై హృద్ధమనులలోనికి  కృత్రిమనాళమును చొప్పించి ఎక్స్ -రే వ్యత్యాసపదార్థములతో హృద్ధమనుల చిత్రీకరణము Coronary angiography ) చేసి హృద్ధమనుల నిర్మాణమునుఆ ధమనులలో సంకుచితములను, అవరోధములను కనుగొనవచ్చును. ధమనుల సంకుచితములను వ్యాకోచింపజేసి ( angioplasty ) అచట వ్యాకోచ సాధనములను ( stents ) అమర్చుట వంటి ప్రక్రియలు కూడా అవసరమయితే చేయగలరు. STEMI (ST Elevation Myocardial Infarction) ఉన్నవారిలోను, కొత్తగా Left bundle branch block కనిపించినవారిలోనుగుండె వెనుక భాగములో గుండెపోటు కలిగిన వారిలోను, NSTEMI (Non ST Elevation Myocardial Infarction) అస్థిరపు గుండెనొప్పి ( unstable angina ) ఉన్నవారిలో ప్రాణాపాయ లక్షణములు ఉన్నపుడుఔషధములతో గుండెనొప్పులను అరికట్టలేకపోయినపుడురక్తప్రసరణను పునరుద్ధరించు ధ్యేయముతో హృద్ధమనీ చిత్రీకరణములు చేస్తారు .

చికిత్స 


    ఛాతినొప్పి కలిగిన రోగులకు త్వరితముగా పరీక్షలు చేస్తూనే, చికిత్స కూడా సత్వరముగ అందించాలి. అస్థిరపు గుండెనొప్పి ( unstable angina ), లేక గుండెపోటు myocardial infarction ) లక్షణములు కలవారికి,

ప్రాణవాయువు ( Oxygen ) నాసికా నాళముల ద్వారా అందించాలి. 


మార్ఫిన్ సల్ఫేట్ ( Morphine sulfate ) నొప్పిని నివారించుటకు తఱచు వాడుతారు. ఇది నొప్పిని నివారించుటే కాక ఆందోళనను తగ్గించి సహవేదన నాడీమండల తీవ్రతను తగ్గిస్తుంది. వేగస్ నాడి (vagus nerve ) ద్వారా గుండెవేగమును తగ్గిస్తుంది. సిరలను వ్యాకోచింపజేసి హృదయముపై భారమును ( pre systolic load ) తగ్గించి హృదయమునకు ప్రాణవాయువు అవసరములను తగ్గిస్తుంది. 


ఏస్పిరిన్ ( aspirin ) 


    ఏస్పిరిన్ సూక్ష్మరక్తఫలకముల (platelets ) గుమికూడుటను నివారిస్తుంది. 325 మి.గ్రా ఏస్పిరిన్ ను నమిలిస్తే అది త్వరితముగా పనిచేస్తుంది. 

థీనోపైరిడిన్లు ( Thienopyridines ) 

    క్లొపిడోగ్రెల్ ( clopidogrel ), ప్రాసుగ్రెల్ ( prasugrel ) ఈ వర్గమునకు చెందిన ఔషధములు. ఇవి రక్తఫలకములపై ఉన్న ఎడినొసైన్ డైఫాస్ఫేట్ గ్రాహకములను ( adenosine di phosphate receptors )  నిరోధించి రక్తఫలకములు గుమిని అరికడుతాయి. రక్తస్రావ ప్రమాదము లేనివారిలో ఏస్పిరిన్ తో బాటు క్లొపిడోగ్రెల్ కాని, ప్రాసుగ్రెల్ కాని వాడుతారు. శస్త్రచికిత్సతో రక్తప్రసరణను పునరుద్ధరించవలసి వస్తే  రక్తస్రావము అధికము కాకుండుటకై  క్లొపిడోగ్రెల్ ను శస్త్రచికిత్సకు ఐదు దినములకు ముందు, ప్రాసుగ్రెల్ ను ఏడు దినములకు ముందు ఆపివేయాలి.


నైట్రోగ్లిసరిన్  


    గుండెనొప్పి ( angina ), గుండెపోటు ( Myocardial Infarction ) కలిగిన వారికి నాలుక క్రింద నైట్రోగ్లిసరిన్ ను అందించాలి. గుండె క్రిందిభాగముకుడి జఠరిక ( right ventricle ) గుండెపోటుకు లోనయినప్పుడు, రక్తపీడనము తక్కువగా ఉన్నపుడు నైట్రోగ్లిసరిన్ వాడకూడదు. వీరిలో రక్తపీడనము బాగా తగ్గిపోయే అవకాశము ఉన్నది. రక్తపీడనము తక్కువగా లేనప్పుడు గుండెనొప్పి కొనసాగుతున్నపుడు  నైట్రోగ్లిసరిన్ ను సిరల ద్వారా బొట్లుబొట్లుగా ఇస్తారు. నైట్రేటుల వలన ప్రసరణరహిత మరణము పొందు భాగము ( infarct size ) తగ్గుతుంది. గుండెవ్యాపారము మెరుగవుతుంది. 


బీటా గ్రాహక అవరోధకములు  ( beta receptor blockers )   


    బీటా గ్రాహక అవరోధకములను అస్థిరపు గుండెనొప్పి, గుండెపోటు ఉన్నవారికి వాడుతారు. ఇవి గుండె వేగమును తగ్గించి గుండెకు ప్రాణవాయువు అవసరమును తగ్గిస్తాయి. ఇవి రక్తపీడనము తగ్గించి గుండెకు శ్రమను తగ్గిస్తాయి. వీటిని గుండెవేగము నిమిషమునకు 50 కంటె తక్కువ ఉన్నా, ముకుళిత రక్తపీడనము ( systolic blood pressure) 90 మి.మీ.పాదరసము కంటె తక్కువగా ఉన్నాహృదయ వైఫల్యము ప్రస్ఫుటముగా ఉన్నా, కర్ణిక జఠరికల మధ్య విద్యుత్ ప్రేరణ ప్రసరణకు  2 వ డిగ్రీ అవరోధము ఉన్నా ( 2nd degree atrioventricular block ) వాడకూడదు. కొకైను వాడకము వలన గుండెపోటు కలిగిన వారిలోనుహృద్ధమనుల దుస్సంకుచితము ( spasm ) వలన గుండెనొప్పి కలిగివారిలోను బీటాగ్రాహక అవరోధకములను వాడకూడదు. బీటాగ్రాహక అవరోధకములు వాడలేని పరిస్థితులలో గుండెనొప్పి కొనసాగుతున్నపుడు నైఫిడిపిన్ తక్క మిగిలిన కాల్సియమ్ ఛానెల్ బ్లాకర్లను వాడవచ్చును.


హెపరిన్ ( Heparin ) 


    అస్థిరపు గుండెనొప్పి ( unstable  angina ), NSTEMI ( Non ST Elevation Myocardial Infarction ) కలవారిలో అవిభాగ హెపరిన్ ( unfractionated heparin) కాని, అల్ప అణుభారపు హెపరిన్ ( Low Molecular Weight Heparin ) కాని వాడుతారు. స్థూలకాయులలోనుదీర్ఘకాల మూత్రాంగ వ్యాధిగ్రస్థులలోను అల్ప అణుభారపు హెపరిన్ ను LMWH ) వాడకూడదు. అవిభాగ హెపరిన్ ను వాడునపుడు రక్తపరీక్షలతో ( Partial Thromboplastin Time ) మోతాదును సరిదిద్దుతుండాలి. అల్ప అణుభారపు హెపరిన్ ( LMWH ) వాడేటపుడు రక్తపరీక్షలు, మోతాదు సవరణలు అవసరము ఉండవు. 

    అస్థిరపు గుండెనొప్పి ( unstable angina ), NSTEMI ( NonST Elevation Myocardial Infarction ) కలవారిలో ఔషధములతో చికిత్స చేస్తూ హృల్లేఖనములతో జాగ్రత్తగా వైద్యులు పర్యవేక్షిస్తుంటారు. ఔషధములతో గుండెనొప్పులు అదుపులోనికి వచ్చి ఇతర ఉపద్రవములు కలుగనపుడు, హృదయసూచకములు ( cardiac markers ) ట్రొపోనిన్ ( troponin ), క్రియటినిన్ కైనేజ్ ( creatinine kinase ) సాధారణ పరిమితులలో ఉన్నపుడు కూడా వారికి గుండెపోటులకు కాని ఆకస్మిక మరణములకు కాని అవకాశములు ఉంటే హృద్ధమనుల చిత్రీకరణము చేసి అవసరమయితే, ధమనుల వ్యాకోచము ( angioplasty ), వ్యాకోచ సాధనములతో ( Coronary stents ) చికిత్సలకు పూనుకోవాలి.       

     అంతిమదశ దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము, కాలేయ వైఫల్యముఅంతిమదశలో ఉన్న ఊపిరితిత్తుల వ్యాధులు, చికిత్సలకు అవకాశములేని వ్యాప్తిచెందిన కర్కటవ్రణములు ( metastatic cancers ) వంటి వ్యాధులు వలన ఆయుఃప్రమాణము పరిమితమయినవారికి  ఔషధ చికిత్సలనే కొనసాగించుట మేలు. 

        గుండెనొప్పులు అదుపులో ఉండకపోయినా, వాటి తీవ్రత హెచ్చినా, రక్తపీడనము బాగా తగ్గి శరీర రక్తప్రసరణకు భంగము చేకూరినాప్రమాదకర హృదయలయలు కలిగినా, కొత్తగా Left bundle branch block ఏర్పడినా, కొత్తగా ద్విపత్రకవాటములో తిరోగమన రక్తప్రసరణ ( mitral regurgitation ) కలిగినావారికి సత్వరముగ చర్మము ద్వారా హృద్ధమనుల చిత్రీకరణతో బాటు  రక్తప్రసరణ పునరుద్ధరణ ప్రయత్నములను చెయ్యాలి. 


ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్లు ( ACE Inhibitors )  


    గుండెనొప్పిగుండెపోటులు కలిగిన వారిలో ఏస్ అవరోధకములు ( ACE inhibitors  ) హృదయ ఆకృతి మార్పుదలలను   remodeling ) తగ్గించి హృదయ వైఫల్యములను  తగ్గించుటకు తోడ్పడుతాయి. గుండెపోటులను తగ్గించుటకు కూడా ఇవి తోడ్పడుతాయి. ఏస్ అవరోధకములను వాడలేనివారిలో ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములను ( Angiotensin Receptor Blockers ) వాడుతారు.

స్టాటిన్స్ ( Statins ) 


    గుండెపోటులుగుండెనొప్పులు కలిగినవారికి స్టాటిన్ మందులు చాలా త్వరగా మొదలుపెట్టాలి. ఇవి హృద్ధమని లోపలిపొర ( endothelium ) వ్యాపారమునుకాఠిన్య ఫలకలను ( atherosclerotic plaques ) సుస్థిరపరచి గుండెపోటులను తగ్గిస్తాయి. స్టాటిన్ మందులు అల్పసాంద్ర కొలెష్టరాలును తగ్గించి దీర్ఘకాలములో కూడా హృద్ధమని వ్యాధులను తగ్గిస్తాయి.

ఆల్డోష్టిరోన్  అవరోధకములు ( Aldosterone blockers ) 


    గుండెపోటులు కలిగినవారిలో ఎడమ జఠరిక వ్యాపారములో లోపములు ఉన్నచో ఆల్డోష్టిరోన్ అవరోధకములు స్పైరొనోలాక్టోన్ spironolactone), కాని ఎప్లెరినోన్ ( eplerenone ) కాని ఉపయోగిస్తారు. ఇవి పీచుకణజాలము ఏర్పడుటను ( collagen formation  ) తగ్గించి హృదయాకృతి మార్పుదలను ( Remodeling ) తగ్గించిహృదయ వైఫల్యమును తగ్గిస్తాయి. మూత్రాంగ వ్యాధులు కలవారిలోను రక్తద్రవములో పొటాసియం ఎక్కువగా ఉన్నవారిలోను ఆల్డోష్టిరోన్ అవరోధకములను వాడినచో చాలా జాగ్రత్తగా వాడాలి.


చర్మము ద్వారా రక్తప్రసరణ పునరుద్ధరణ ( Percutaneous intervention ; PCI )  


    చర్మము ద్వారా ఊరుధమని ( femoral artery ) లోనికి గానివెలుపలి ముంజేతి ధమని ( Radial artery ) లోనికి గాని కృత్రిమ నాళమును ( catheter ) చొప్పించిబృహద్ధమని ( aorta ) లోనికి ఆపై హృద్ధమనుల లోనికి ప్రవేశించి వ్యత్యాస పదార్థములతో హృదయ ధమనుల చిత్రములు తీసుకొని సంకుచిత భాగములను వ్యాకోచింపజేసి వ్యాకోచ సాధనములను ( stents ) అమర్చి రక్త ప్రసరణను పునరుద్ధరించు ప్రక్రియలు విశేషముగా వ్యాప్తిలోనికి వచ్చాయి. STEMI ( ST elevation myocardial infarction ) కలవారిలోనుకొత్తగా left bundle branch block కలవారిలోనుగుండె వెనుక భాగములో గుండెపోటు కలిగిన వారిలోను అతిత్వరగా ( 90 నిముషములలో ) హృద్ధమనులను వ్యాకోచింపజేసి ( angioplasty ) అవరోధములను తొలగించివ్యాకోచ సాధనములను ( stents ) అమర్చి రక్తప్రసరణను పునరుద్ధరించు  ( Percutaneous intervention  ) ప్రక్రియ మొదలుపెట్టు ప్రయత్నము చెయ్యాలి. సత్వర PCI ప్రక్రియ వలన మరణముల సంఖ్యనుతదుపరి ఉపద్రవములను వైద్యులు తగ్గించగలుగుతున్నారు.


రక్తపుగడ్డల విచ్ఛేదన చికిత్స ( Thrombolytic therapy )  


    హృదయ ధమనులను వ్యాకోచింపజేసి (angioplasty) వ్యాకోచ సాధనములను (stents) అమర్చు సౌలభ్యము లేనియెడల హృద్ధమనులలో ఏర్పడిన రక్తపుగడ్డలను ఔషధములతో విచ్ఛేదించి రక్తప్రసరణను ఉద్ధరించగలిగితే హృదయములో ప్రసరణ రహిత మరణభాగము ( infarct area ) తగ్గిరోగులు బ్రతికే అవకాశములు మెరుగుపడుతాయి. దీనికి రెటిప్లేజ్ ( Reteplase ), టెనెక్టిప్లేజ్ ( Tenecteplase  ) వంటి ఔషధములను వాడుతారు. అదివరలో మస్తిష్కములో రక్తస్రావము (intracerebral hemorrhage) జరిగిన వారిలోనుగత మూడునెలలలో మస్తిష్క విఘాతములు ( cerebrovascular accidents ) కలిగినవారిలోను, మస్తిష్క రక్తనాళపు వ్యాధులు ( cerebrovascular lesions ) ఉన్నవారిలోనుబృహద్ధమని విదళనపు ( aortic dissection ) అవకాశములు ఉన్నవారిలోను, ఇతర రక్తస్రావ వ్యాధులు ఉన్నవారిలోనుగత మూడు నెలలలో తలకు దెబ్బలు తగిలినవారిలోను రక్తపుగడ్డలను విచ్ఛేదించు ఔషధములను ( thrombolytics ) వాడకూడదు. హృద్ధమనులలో రక్తపుగడ్డలను ఔషధములతో విచ్ఛేదనము చేసిన రోగుల పరిస్థితి స్థిరపడిన తరువాత వారికి హృద్ధమని చిత్రీకరణము చేసి ఆపై అవసరమయిన చికిత్సలు చెయ్యాలి. అస్థిరపు గుండెనొప్పి, NSTEMI వ్యాధిగ్రస్థులలో గుండెపోటు కలిగే అవకాశములు ఉన్నచో వారికి Glycoprotein 2b  / 3a inhibitors ఉపయోగపడుతాయి. 


హృద్ధమని అవరోధ అధిగమన శస్త్రచికిత్స (Coronary artery bypass surgery )  


    వామ హృద్ధమని ( left main coronary artery ) కానివామపూర్వ అవరోహణ ధమని ( left anterior descending artery ) కానిపెక్కు ధమనులు కాని వ్యాధిగ్రస్తము అయినపుడు ఆ అవరోధములను అతిక్రమించు శస్త్రచికిత్సలు అవసరము అవుతాయి. ఈ శస్త్రచికిత్సలో దృశ్యసిరలను ( saphenous veins ), అంతర స్తనధమనులను ( internal mammary arteries ) ఉపయోగిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్థులలో అవరోధ అధిగమన శస్త్రచికిత్సలు మెఱుగయిన ఫలితములను ఇస్తాయి. దృశ్యసిర ( saphenous vein ) భాగములను వాడునపుడు వాటి ఒక కొనను బృహద్ధమనికిరెండవకొనను హృద్ధమనిలో అవరోధము ఉన్న భాగమునకు ఆవలి పక్కన సంధానించి హృదయమునకు రక్తప్రసరణను పునరుద్ధరిస్తారు. గుండెపోటు ( Myocardial Infarction ) కలిగి ఎడమ జఠరిక గోడకు ద్విపత్ర కవాటమును సంధించే పాపిల్లరీ కండరములకు హాని జరిగి ద్విపత్ర కవాటములో రక్తము తిరోగమనము చెందుట, జఠరికల నడిమి గోడలో రంధ్రము ( Ventricular Septal Defect ) ఏర్పడుట వంటి ఉపద్రవములు కలుగుతే సత్వర శస్త్రచికిత్సలు అవసరము. 


బృహద్ధమనిలో బుడగ ( Intra aortic balloon pump ) 


    పై సందర్భములలోను, గుండెపోటుల వలన, ఎడమ జఠరిక బృహద్ధమనికి సమర్థవంతముగా రక్తమును ప్రసరించలేనపుడు, రక్తపీడనము తగ్గి ( హృదయజనిత ఘాతము / హృదయ జనిత ఉపద్రవము  Cardiogenic shock ) శరీర కణజాలమునకు రక్తప్రసరణ తగ్గుతే బృహద్ధమనిలో జఠిరికల ముకుళిత వికాసములకు ప్రతికూలముగా ముకుళిత వికాసములు పొందు బుద్బుద సాధనమును ( counter pulsating intra aortic bulb ) అమరుస్తారు. జఠరికలు ముడుచుకున్నపుడు ఈ బుడగ సాధనములో గాలి ( హీలియమ్ ) తీసివేయబడుటచే గుండెకు శ్రమ తగ్గుతుంది ( after load reduction ). శరీరమునకు రక్తప్రసరణ సమర్థమంతమవుతుంది. జఠరికలు వికాసము పొందినపుడు బుడగ సాధనములో గాలి ( హీలియమ్ ) చేరి బుడగ వ్యాకోచించి హృద్ధమనులకుశరీరమునకు రక్తప్రసరణను అందజేయుటకు ఉపకరిస్తుంది .


హృదయ లయసవరణి ( Implantable Cardioverter - Defibrillator ; ICD )          


    గుండెపోటు కలిగిన 48 గంటల తర్వాత జఠరిక అతివేగము ( ventricular tachycardia ) కలిగినవారిలోను, ఎడమ జఠరిక ప్రసరణశాతము ( ejection fraction ) 35% కంటె తక్కువ ఉన్నవారిలోను జఠరిక ప్రకంపనము కలిగి [ventricular fibrillation ; జఠరికలు ముకుళ వికాసములు చెందుట బదులుప్రకంపిస్తే రక్తప్రసరణ జరుగదు] ఆకస్మిక మరణములకు దారితీసే అవకాశములు ఉంటాయి. వీరికి హృదయ లయ సవరణి (Implantable Cardioverter-Defibrillator అమర్చుటచే అట్టి మరణావకాశములను తగ్గించగలుగుతారు .

 

గుండెపోటు నుంచి కోలుకొన్న వారికి చికిత్స 


    అస్థిరపు గుండెనొప్పి, గుండెపోటుల నుంచి కోలుకొన్నవారిలో రక్తపుపోటును, మధుమేహ వ్యాధిని నియంత్రించాలి. వారిచే ధూమపానము మాన్పించాలి. వారి రక్తములో అల్పసాంద్రపు కొలెష్ట్రాలను 70 మి.గ్రాలు లోపల ఉండునట్లు నియంత్రించాలి. వారికి తగిన వ్యాయామచికిత్స, వ్యాయామపు అలవాట్లు అలవఱచాలి. వారు ఏస్పిరిన్ నుబీటాగ్రాహక అవరోధకములను ( beta receptor blockers ), ఏస్ అవరోధకములను ( ACE inhibitors  ), స్టాటిన్ (statins ) ఔషధములను నిరంతరముగా కొనసాగించాలి. థీనోపైరిడిన్ ను తగినంతకాలము కొనసాగించాలి. గుండెపోటు కలిగిన వారిలో 20 శాతము మందికి మానసిక క్రుంగుదల ( దిగులు ) కలిగే అవకాశము ఉన్నది . వారి క్రుంగుదలకు తగిన చికిత్స సమకూర్చాలి.



  ( వైద్యవిషయములను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తము అనుకుంటే నా వ్యాసములను నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును) 

16, అక్టోబర్ 2020, శుక్రవారం

హృదయ రక్తప్రసరణ లోపము ( Ischemic heart disease )

 


( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )


                                              హృదయ రక్తప్రసరణలోపము
                                                ( Ischemic heart disease )


                                                                         డా. గన్నవరపు నరసింహమూర్తి


    హృదయమునకు మిగిలిన అవయవముల వలె ప్రాణవాయువు, పోషకపదార్థములు అందించుటకు రక్తప్రసరణ అవసరము. హృదయము నిరంతరముగా జీవితకాలము అంతా తోడు యంత్రముగా ( Pump ) పనిచేయాలి. అందువలన దానికి నిరంతరము రక్తప్రసరణ చేకూరాలి. హృదయ ధమనులు ( హృద్ధమనులు ; Coronary arteries ) హృదయమునకు రక్తము కొనిపోతాయి. హృత్సిరలు రక్తమును తిరిగి హృదయములో కుడికర్ణికకు ( right atrium ) చేరుస్తాయి.
    
    హృదయమునకు రక్తప్రసరణ తగినంత లోపిస్తే గుండెనొప్పి ( angina pectoris ), ఆ లోపము చాలా తీవ్రము అయినపుడు గుండెపోటు ( Heart attack ) కలుగుతాయి. గుండెపోటు కలిగినపుడు కొంత హృదయ కండరకణజాలము ప్రసరణ రహిత మరణము ( infarction ) పొందుతుంది. అందువలన ప్రాణనష్టముతో బాటు ఇతర ఉపద్రవములు కలిగే అవకాశము ఉన్నది. ప్రపంచములో 30 శాతపు మరణములు హృదయ రక్తప్రసరణ లోపముల వలన కలుగుతాయి. ఈ వ్యాసములో గుండెనొప్పి ( Angina pectoris ) గుఱించి చర్చిస్తాను.

హృద్ధమనులు  

    
    హృదయమునకు రక్తప్రసరణ వామ ( ఎడమ ) హృద్ధమని ( Left coronary artery ) దక్షిణ ( కుడి ) హృద్ధమని ( Right coronary artery ) సమకూరుస్తాయి. 



వామ హృద్ధమని ( Left Coronary artery  ) 

    ఎడమ లేక వామ హృద్ధమని  బృహద్ధమని ( aorta ) నుంచి ఎడమ బృహద్ధమని కవాటము పైన మొదలవుతుంది. ఇది  వామ పరిభ్రమణ ధమని ( left circumflex artery ),వామ పూర్వ అవరోహణ ధమని ( left anterior descending artery ) అని రెండు శాఖలుగా చీలుతుంది. కొంతమందిలో మధ్యస్థ ధమని ( intermediate artery  ) అనే మూడవ శాఖ కూడా ఉంటుంది.

    వామ పూర్వఅవరోహణ ధమని రెండు జఠరికల మధ్య ముందుభాగములో ఉన్న గాడిలో ( పూర్వ జఠరికాంతర గర్తము ; anterior inter ventricular sulcus ) క్రిందకు పయనిస్తుంది. దీని కుడ్య శాఖలు ( septal branches ) రెండు జఠరికల మధ్య ఉన్న గోడ ( జఠరికాంతర కుడ్యము ; inter ventricular septum ) ముందు రెండు భాగములకు రక్తప్రసరణ సమకూరుస్తాయి. ఈ వామ పూర్వ అవరోహణ ధమని ( left anterior descending artery ) నుంచి వచ్చే వక్ర శాఖలు ( diagonal branches ) ఎడమ జఠరిక పార్శ్వభాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తాయి. వామపూర్వ అవరోహణధమని గుండె ఎడమ జఠరికకు సుమారు 50 శాతపు రక్తప్రసరణను సమకూరుస్తుంది.

    వామ పరిభ్రమణ ధమని ( left circumflex artery ) ముందు ఎడమ దిశలో అడ్డముగా పయనించి గుండె వెనుక కుడి దిశలో పర జఠరికాంతర గర్తము ( posterior inter ventricular sulcus ) వఱకు పయనించి దక్షిణ హృద్ధమని శాఖతో కలుస్తుంది. 15 శాతము మందిలో పర అవరోహణ ధమని ( posterior descending artery ) ఏర్పడుటలో వామ పరిభ్రమణ ధమని  ముఖ్యపాత్ర వహిస్తుంది. 85 శాతము మందిలో  పర అవరోహణ ధమని ఏర్పడుటకు దక్షిణ హృద్ధమని ముఖ్యపాత్ర వహిస్తుంది . వామ పరిభ్రమణ ధమని ఎడమ జఠరిక వెనుక భాగమునకు, పక్క భాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తుంది.

    పర అవరోహణ ధమని ( posterior descending artery ) కుడి జఠరిక ఎడమ జఠరికల మధ్య ఉన్న గోడలో ( జఠరికాంతర కుడ్యము ; inter ventricular septum ) వెనుక మూడవవంతు భాగమునకు, జఠరికల క్రిందిభాగములకు రక్తప్రసరణ  సమకూరుస్తుంది. 

దక్షిణ హృద్ధమని  ( Right coronary artery ) 

    దక్షిణ హృద్ధమని బృహద్ధమని ( aorta )  నుంచి కుడి కవాట పత్రము మీద మొదలవుతుంది. ఇది కుడి కర్ణిక కుడిజఠికల మధ్య ఉన్న గర్తములో పర జఠరికాంతర గర్తము ( posterior inter ventricular sulcus ) వఱకు పయనిస్తుంది. ఇది కుడి మేరధమని ( right marginal artery ), పర అవరోహణ ధమని ( posterior descending artery ) అను శాఖలుగా చీలుతుంది. దక్షిణ హృద్ధమని కుడి జఠరికకు, ఎడమ జఠరికలో 25-35 శాతపు భాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తుంది.

        ధమనుల గోడలలో బయటపొర ( tunica externa or adventitia ), మధ్యపొర ( tunica media ), లోపొర ( tunica interna or intima ) అనే మూడు పొరలు ఉంటాయి. బయటపొరలో సాగుకణజాలము ( elastic tissue ), పీచుకణజాలము ( fibrous tissue ) ఉంటాయి. మధ్యపొరలో మృదుకండరములు  ( smooth muscles ), సాగుకణజాలము ( elastic tissue ), పీచుపదార్థము ( collagen ) ఉంటాయి. నాళముల లోపొర పూతకణములు ( lining cells ), సాగుపదార్థము ( elastin ), పీచుపదార్థముల ( collagen ) మూలాధారమును అంటిపెట్టుకొని ఉంటాయి. 

హృద్ధమనుల వ్యాధి ( Coronary artery disease ) 

        
    హృద్ధమని వ్యాధి అంటే పరోక్షముగా హృద్ధమనుల కాఠిన్యతగా ( Atherosclerosis ) భావించాలి. ధమనీ కాఠిన్యము ( arteriosclerosis ) శైశవము నుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత ప్రస్ఫుటమయి వృద్ధాప్యములో తీవ్రతరము అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొరలో ( intima ) పూతకణముల క్రింద మాతృకలో  కొవ్వులు, కొలెష్టరాలు, కాల్సియం, తాపకణములు ( inflammatory cells ) పేరుకొని ఫలకలుగా ( plaques ) పొడచూపుతాయి. మృదుకండరముల మధ్య కాల్సియమ్ ఫాస్ఫేట్ నిక్షేపములు కూడుకున్నపుడు హృద్ధమనులు బిఱుసెక్కుతాయి. ధమనీ కాఠిన్యపు ఫలకలు ధమనుల లోనికి ఉబుకుట వలన ధమనుల లోపలి పరిమాణము తగ్గి అవి సంకుచితము అవుతాయి. ఈ ఫలకలు హృద్ధమనులలో ఒకటి రెండు చోట్లే ఉండవచ్చు, లేక ఎక్కువగా ఉండవచ్చును. ధమనులలో హెచ్చుభాగము కాఠిన్యము పొందవచ్చును . హృద్ధమనులు, వాటి శాఖలలో నాళాంతర పరిమాణము 40 శాతము కంటె తక్కువగా  తగ్గినపుడు రక్తప్రవాహమునకు చెప్పుకోదగ్గ అవరోధము కలుగదు. రక్తనాళములలో ఫలకలు స్థిరముగ ఉండి నాళాంతర పరిమాణము 40- 70 శాతము తగ్గినపుడు రక్తప్రవాహమునకు అవరోధము కలిగి శ్రమ, వ్యాయామములతో హృదయమునకు ప్రాణవాయువు అవసరాలు పెరిగినపుడు ఆ అవసరములు తీరక గుండెనొప్పి ( Angina ) కలుగుతుంది. రక్తప్రసరణ లోపము ( ischemia ) తీవ్రతరము అయినపుడు హృదయపు లయ తప్పే అవకాశము ఉన్నది . జఠరికల లయ తప్పి ప్రకంపన స్థితి ( ventricular fibrillation ) లోనికి వెళ్తే ప్రాణాపాయమునకు దారితీయవచ్చును. 

    ఒక్కోసారి ఒక హృద్ధమని పూర్తిగా మూసుకుపోవచ్చును. ధమనిలో ఫలక ఏర్పడి ఆ ఫలక చిట్లి దానిపై రక్తము గడ్డకట్టి రక్తప్రసరణకు తీవ్ర అవరోధము కలిగితే, హృదయ కండరజాలములో కొంత భాగము ప్రాణవాయువు, పోషకపదార్థములు అందక మరణిస్తే గుండెపోటు ( myocardial infarction ) కలుగుతుంది. మానుదల ప్రక్రియలో ఆ మరణించిన కణజాలమునకు బదులు పీచుకణజాలము ఏర్పడుతుంది. అపుడు హృదయ వ్యాపారము క్షీణిస్తుంది. 

హృద్ధమనీ వ్యాధులకు కారణములు  ( Risk factors for coronary artery disease ) 

    వయస్సు పెరుగుతున్న కొలది ధమనులలో కాఠిన్యత పెరుగుతుంది. రక్తపీడనము హెచ్చుగా ఉన్నవారిలో హృద్ధమనివ్యాధులు ఎక్కువగా కలుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్థులలోను, అల్పసాంద్రపు లైపోప్రోటీనులు ( Low Density Lipoproteins ) అధికముగా ఉన్నవారిలోను, అధికసాంద్రపు లైపోప్రోటీనులు ( High Density Lipoproteins ) తక్కువగా ఉన్నవారిలోను, ట్రైగ్లిసరైడులు బాగా ఎక్కువగా ఉన్నవారిలోను, పొగత్రాగేవారిలోను, స్థూలకాయము గలవారిలోను ( భారసూచిక 18.5-24.9 పరిమితులలో ఉండుట మేలు. నడుము చుట్టుకొలత పురుషులలో 40 అంగుళముల లోపు స్త్రీలలో 35 అంగుళముల లోపు  ఉండుట మేలు.), దగ్గఱి కుటుంబసభ్యులలో పిన్నవయస్సులోనే ( పురుషులలో 55 సంవత్సరములలోను, స్త్రీలలో 65 సంవత్సరములలోను ) హృదయ రక్తప్రసరణలోప వ్యాధులు ( ischemic heart diseases ) కలిగినవారిలోను హృద్ధమనీవ్యాధులు కలిగే అవకాశములు హెచ్చు.

    ధూమపానము సలిపేవారు ధూమపానము పూర్తిగా 15 సంవత్సరములు మానివేస్తే వారిలో  హృద్ధమనీ వ్యాధులు కలిగే అవకాశము ధూమపానము సలుపని వారితో సమానము అవుతాయి. 

    రక్తపరీక్షలలో C reacttive protein 2 mgm /dl మించినవారిలోను, హృద్ధమనులలో కాల్సియం ప్రమాణములు పెరిగిన వారిలోను, దూరధమని వ్యాధులు ( Peripheral Arterial Diseases ) కలవారిలోను హృద్ధమని వ్యాధులు కలిగే అవకాశములు హెచ్చు.

రక్తప్రసరణలోప హృదయవ్యాధి లక్షణములు 

    హృద్ధమనులలో  కాఠిన్యపు ఫలకలు ( plaques  ) స్థిరముగా ఉండి రక్తప్రసరణకు తగినంత అవరోధము కలిగిస్తే ప్రసరణలోప లక్షణములు శ్రమతో పొడచూపుతాయి. శారీరక శ్రమ చేసినపుడు  శరీరమునకు రక్తప్రసరణను పెంచవలసిన భారము హృదయముపై పడుతుంది. అపుడు హృదయవేగము పెరుగుతుంది. హృదయమునకు ప్రాణవాయువు, పోషకపదార్థముల అవసరములు పెరుగుతాయి. అందుచే హృదయమునకు రక్తప్రసరణ అవసరాలు పెరుగుతాయి, కాని హృద్ధమనులలో అవరోధములు ఉండుట వలన ఆ అవసరాలు తీరవు. ఆ కారణమున హృద్ధమన వ్యాధి లక్షణములు ప్రస్ఫుటమవుతాయి. ముకుళిత రక్తపీడనము ( systolic blood pressure ) పెరిగినపుడు కూడా హృదయమునకు శ్రమ  పెరుగుతుంది. హృదయ కండరమునకు ( myocardium ) రక్తప్రసరణ హృదయము వికసించినపుడు ( diastole ) హెచ్చుగా సమకూడుకుంది. హృదయవేగము పెరిగినపుడు హృదయవికాస సమయము తగ్గి హృదయమునకు రక్తప్రసరణ తగ్గుతుంది. 

    హృదయమునకు రక్తప్రసరణ చాలనపుడు ఛాతిలో రొమ్ము ఎముకకు ( ఉరోస్థి ; sternum ) వెనుక నొప్పి గాని, అసౌఖ్యత గాని కలుగుతుంది. కొందఱిలో ఛాతిలో బిగుతు, ఛాతిపై భారము, ఛాతిని పిండునట్లు భావము, లేక ఛాతిలో తిమ్మిరి కలుగుతాయి. ఈ బాధ ఎడమ భుజమునకు, దవడకు ప్రాకవచ్చును. కొందఱిలో గుండెనొప్పిగా కాక రక్తప్రసరణ లోపము ఆయాసము, నీరసము, ఒళ్ళు తూలుట, అనిశ్చలత, మస్తిష్కములో మార్పులుగా కనిపించవచ్చును. ఈ లక్షణములు నియమిత శ్రమవలన కలిగి, నియమిత విరామము తర్వాత గాని, నాలుక క్రింద  నైట్రోగ్లిసరిన్ తీసుకొనుట వలన గాని తొలగుతాయి.

    హృద్ధమనులలోని మృదుకండరముల దుస్సంకోచము ( spasm ) వలన, బృహద్ధమని కవాటముల సంకుచితము ( aortic stenosis  ) వలన, ముకుళిత రక్తపీడనము ( systolic blood pressure ) బాగా పెరిగినపుడు, హృదయకండర అతివృద్ధి వ్యాధి  ( hypertrophic cardiomyopathy  ) కలవారిలోను, ధమనీకాఠిన్యత లేకపోయినా గుండెనొప్పి, గుండెనొప్పి లక్షణములు కలుగ వచ్చును.

       వైద్యులు రోగులను పరీక్షించునపుడు  అధిక రక్తపుపోటును,  దూరధమని వ్యాధులను ( Peripheral Arterial Diseases ), మస్తిష్క ధమనుల వ్యాధులను ( Cerebro vascular insuffciencies  ) , హృదయ కవాట వ్యాధులను, కనుగొనగలరు. ఈ వ్యాధులు కలవారిలో హృద్ధమని వ్యాధులు కలిగే అవకాశములు ఎక్కువ. 

పరీక్షలు 

        హృద్ధమని వ్యాధికి కారణములు లేనపుడు గుండెనొప్పి ( angina ) లక్షణములు లేనివారిలో, వ్యాయామపు ఒత్తిడి పరీక్షలు ( exercise stress testing ) ఊఱకే చేయుట వైద్యులు ప్రోత్సహించరు. అట్టి పరీక్షల వలన వ్యాధికి తప్పుడు అనుకూల ఫలితములు ( false positive results ) తఱచు రావడము  దీనికి కారణము.

    హృద్ధమని వ్యాధి లక్షణములు కలవారిలో హృదయ విద్యుల్లేఖనము ( electrocardiogram ) చేయాలి. ఛాతిలో నొప్పి , ఆయాసము కలిగించు ఇతర వ్యాధులను కనిపెట్టుటకు ఛాతికి ఎక్స్- రే చిత్రములు తియ్యాలి. రక్తకణ పరీక్షలతో పాండురోగము ( anemia ; వీరిలో రక్తకణముల ప్రాణవాయువు వహనము తగ్గుతుంది ), బహుళ రక్తకణ వ్యాధిని ( polycythemia vera ; వీరిలో ఎఱ్ఱరక్తకణముల సంఖ్య ఎక్కువయి రక్తసాంద్రత, జిగట పెరుగుతుంది. వీరిలో చిన్న ధమనులలోను , రక్తకేశనాళికలలోను రక్తప్రసరణ మందము అవుతుంది.) కనుగొనవచ్చును. గళగ్రంథి స్రావక ( thyroxine  ) పరీక్షలతో గళగ్రంథి ఆధిక్యతను ( hyperthyroidism ) తెలుసుకొనవచ్చును. రక్తరసాయనక పరీక్షలతో మధుమేహ వ్యాధిని, మూత్రాంగముల వ్యాపారమును తెలుసుకొనవచ్చును.

 ప్రతిధ్వని హృదయచిత్రీకరణము ( echocardiography  ) 


    హృదయవైఫల్యము ( Congestive heart failure ), హృదయ కవాటవ్యాధులు ( valvular heart diseases ), గుండెపోటులు కలిగిన వారిలో తగిన సమాచారమును సమకూర్చగలదు. ఎడమ జఠరిక రక్తప్రసరణ శాతము ( left ventricular ejection fraction  ), హృదయ వ్యాపారములు  ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము వలన తెలుస్తాయి. 

  వ్యాయామపు ఒత్తిడి పరీక్షలు ( Exercise Stress Tests ) 


    గుండెనొప్పి కలిగినవారిలో విరామ విద్యుత్ హృల్లేఖనములో మార్పులు హెచ్చుగా లేనపుడు, వ్యాయామము చేయగలిగిన వారికి వ్యాయామ  హృదయవిద్యుల్లేఖన ( exercise electrocardiography ) పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు  65 %  మందిలో వ్యాధి గ్రహణత ( sensitivity ; వ్యాధిని కనుగొనుట ), 75 శాతము మందిలో వ్యాధి నిర్దిష్టత ( specificity ; వ్యాధిని రూఢీకరించుట ) కలిగి ఉంటాయి. 

    వ్యాయామముతో హృదయకండరములో రక్తప్రసరణ లోపములను ( myocardial perfusion defects ) రేడియోధార్మిక పదార్థములు ( థాలియం 201 ) ఉపయోగించి చిత్రీకరించవచ్చును. 

    వ్యాయామముతో ప్రతిధ్వని హృదయచిత్రీకరణములు ( exercise echocardiography ) కూడా ఉపయోగకరమే. వ్యాయామ ప్రతిధ్వని హృదయ చిత్రీకరణములు, వ్యాయామ హృదయప్రసరణ  చిత్రీకరణములు ( exercise myocardial perfusion imaging ) 80- 85 శాతపు వ్యాధిగ్రహణతను ( sensitivity ) 77-88 % వ్యాధి నిర్దిష్టతను ( specificity )  కలిగి ఉంటాయి.

    వ్యాయామము చేయలేని వారిలో  హృదయసంకోచమును పెంచు ( inotropic agent ) డోబుటమిన్ ( dobutamine ) ఔషధము ఉపయోగించి ప్రతిధ్వని హృదయ చిత్రీకరణముతో  ఒత్తిడి పరీక్షలు చేస్తారు. రక్తప్రసరణ లోపించిన భాగములలో సంకోచము పరిమితముగా ఉంటుంది.

డైపిరిడమాల్ ( dipyridamole ), ఎడినొసైన్ ( adenosine ), రెగడినొసన్ ( regadenoson ) వంటి రక్తనాళ వ్యాకోచక ఔషధములను ( vasodilators ) ఇచ్చి, రేడియోథార్మిక పదార్థములతో హృదయకండర ప్రసరణ పరీక్షలు ( myocardial perfusion studies ) చేస్తారు. 

    సాధారణముగా ఒత్తిడి పరీక్షల ఫలితములు బాగున్నపుడు హృదయమునకు రక్తప్రసరణ బాగున్నట్లు నిర్ణయించవచ్చును. ఈ పరీక్షలలో  అసాధారణములు చాలా ఉన్నపుడు బహుళ హృద్ధమనులలో ధమనీకాఠిన్యత , సంకుచితములు ( coronary disease with narrowings ) ఉండే అవకాశములు ఎక్కువ. వారికి వ్యత్యాస పదార్థములతో ( contrast materials ) హృద్ధమనుల చిత్రీకరణము ( Coronary angiography ), ఆపై  అవసరమయితే హృద్ధమనుల వ్యాకోచ చికిత్సలు  చేస్తారు . 

గణనయంత్ర హృద్ధమనీ చిత్రీకరణ ( CT Coronary angiography ) 


    ఈ పరీక్ష వలన హృద్ధమనుల నిర్మాణములో అసాధారణములు తెలుస్తాయి. రక్త ప్రసరణలోపములు ( ischemia ) ప్రస్ఫుటము కావు. 

    వ్యాయామముతో కాని ఔషధములతో కాని  అయస్కాంతప్రతిధ్వని హృదయప్రసరణ చిత్రీకరణములు ( Magnetic resonance perfusion imaging ) చేసి రక్తప్రసరణ లోపములను, ఇతర అసాధారణములను కనుగొనగలరు.

హృద్ధమనుల చిత్రీకరణము ( Coronary angiography )  


    ఈ పరీక్షలలో, ఊరుధమని ( Femoral artery ) లేక ముంజేతి బహిర్ధమని ( radial artery ) ద్వారా కృత్రిమనాళమును ( catheter ) బృహద్ధమని లోనికి, ఆపై హృద్ధమనులలోనికి చొప్పించి వ్యత్యాస పదార్థములను చిమ్మి, ఎక్స్ రే చిత్రములతో హృద్ధమనులను, వాటి శాఖలను చిత్రీకరిస్తారు. ఈ పరీక్షలు ధమనులలో సంకుచితములను, వాటి తీవ్రతను, తెలుసుకొనుటకే కాక వాటికి చికిత్సామార్గములను నిర్ణయించుటకు కూడా ఉపయోగపడుతాయి. ఎడమ జఠరికలోనికి వ్యత్యాసపదార్థములను చిమ్మి, ఎడమ జఠరిక పరిమాణమును, వ్యాపారమును, కవాటములలో అసాధారణములను కనుగొనుటకు ఈ పరీక్షలు తోడ్పడుతాయి. అవసరమయిన వారికి హృద్ధమనుల వ్యాకోచ చికిత్సలు చేసి వ్యాకోచ సాధనములను ( stents ) అమర్చవచ్చును.

    ఈ పరీక్షల వలన వ్యత్యాస పదార్థములకు వికటత్వము ( anaphylaxis  ) కలుగుట, సత్వర మూత్రాంగ విఘాతము ( Acute Kidney Injury ), దూరధమనులలోనికి కొలెష్ట్రాలు ప్రసరణ అవరోధకములు ( emboli ) చేరుట, రక్తస్రావము ( hemorrhage ) వంటి ఉపద్రవములు కలిగే అవకాశములు ఉన్నాయి. హృద్ధమనుల వ్యాధి నిర్ణయమునకు హృద్ధమనుల చిత్రీకరణము ప్రామాణిక పరీక్ష.

    ఛాతినొప్పి కలిగిన వారిలో హృదయ రక్తప్రసరణ లోపము ( ischemia ), పుపుస ధమనిలో ప్రసరణ అవరోధకములు ( Pulmonary embolism ), పుపుసవేష్టనములో వాయువు ( Pneumothorax  ), విచ్ఛేదన బృహద్ధమని బుద్బుదములు ( Dissecting aortic aneurysms ), వంటి ప్రాణాపాయకరమైన  వ్యాధులకై  వైద్యులు శోధించాలి.

చికిత్స 

    హృద్ధమని వ్యాధిగ్రస్థులు వారి వ్యాధికి కల కారణములను అదుపులో పెట్టుకోవాలి. పొగత్రాగుట పూర్తిగా మానివేయాలి. మధుమేహవ్యాధిని ( Diabetes mellitus ), రక్తపు పోటును ( hypertension ) అదుపులో పెట్టుకోవాలి. భోజనములో కొలెష్ట్రాలు, సంతృప్తపు కొవ్వుపదార్థముల ( saturated fats ) వాడుకను నియంత్రించుకోవాలి. అల్పసాంద్ర లైపోప్రోటీనుల ( low density lipoproteins ) విలువలు 100 మి.గ్రాలు / డె.లీ కంటె తక్కువ ఉండునట్లు స్టాటిన్ మందులను వాడుకోవాలి. వీరికి దినమునకు అరగంట నుంచి గంట వఱకు వ్యాయామము అవసరము. స్థూలకాయులు బరువు తగ్గే ప్రయత్నాలు చేయాలి.

ఔషధములు 

    హృద్ధమనివ్యాధి స్థిరముగా ఉన్నవారిలో ( Chronic stable angina ) ఔషధ చికిత్స ఫలితములు ధమనీవ్యాకోచ చికిత్సల ( angioplasty ) ఫలితములతో సమతుల్యముగా ఉంటాయి.

    హృదయమునకు ప్రసరణ లోపములు ఉన్నవారికి గుండెనొప్పులను తగ్గించుట, గుండెపోటులు  ( myocardial infarctions ) నివారించుట, మృత్యువాత పడకుండా చేయుట చికిత్స లక్ష్యము. 

    గుండెనొప్పి వచ్చినపుడు నొప్పి నివారణకు విరామముతో బాటు, నాలుక క్రింద నైట్రోగ్లిసరిన్  బిళ్ళల రూపములో కాని, జల్లుగా ( తుంపర సాధనములతో ) గాని, వాడుకోవాలి. 

    గుండె నొప్పులను ( angina ) నివారించుటకు వివిధ ఔషధముల సమన్వయము వాడుతారు.

బీటా గ్రాహక అవరోధకములు ( beta blockers )

    బీటా ఎడ్రినెర్జిక్ అవరోధకములు హృదయ వేగమును, హృదయ సంకోచమును ( contractility ) తగ్గించి హృదయమునకు ప్రాణవాయువు అవసరాలు తగ్గిస్తాయి. గుండెనొప్పుల ( angina ) తఱచుదనమును, గుండెనొప్పుల తీవ్రతను, గుండెపోటులను  ( heart attacks ), గుండెపోటులచే కలుగు మరణములను తగ్గిస్తాయి. మెటోప్రొలోల్ ( metoprolol ) తఱచు వాడబడే ఔషధము. విరామ సమయములలో గుండెవేగము 50-60 లో ఉండునట్లు బీటా గ్రాహక అవరోధకముల మోతాదును సవరించాలి. తీవ్రమైన ఉబ్బస ( Bronchial Asthma ), తీవ్ర దీర్ఘకాల శ్వాస అవరోధక వ్యాధి ( Chronic obstructive pulmonary disease ), హృదయమాంద్యము ( bradycardia ), హృదయవైఫల్యము ( Congestive heart failure ) ప్రస్ఫుటమై ఉన్నపుడు బీటా అవరోధకములను జాగ్రత్తగా వాడాలి. రక్తపీడనమును కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

కాల్సియమ్  మార్గ అవరోధకములు ( Calcium channel blockers )  

    ఈ ఔషధములు కణముల కాల్సియం మార్గములను బంధించి కాల్సియం గమనమును అరికట్టి రక్తనాళములలో మృదుకండరముల సంకోచమును తగ్గించి ధమనులను వ్యాకోచింపజేసి హృదయమునకు రక్తప్రసరణ పెంచుతాయి. రక్తపీడనమును తగ్గించి జఠరికలపై భారమును తగ్గిస్తాయి. హృదయ సంకోచమును ( contractility ) కూడా తగ్గిస్తాయి. బీటా అవరోధకములను వాడలేనివారిలోను , బీటాఅవరోధకములు గుండెనొప్పులను ( angina ) అరికట్టలేనపుడు వాటికి తోడుగాను కాల్సియం మార్గ అవరోధకములను వాడుతారు. డైహైడ్రోపైరిడిన్  ( Dihydropyridine  ) తరగతికి చెందని ( ఉదా : వెరాపమిల్  ( Verapamil ), డిల్టియజెమ్ ( diltiazem ) కాల్సియం మార్గ అవరోధకములు హృదయవేగమును తగ్గిస్తాయి, హృదయసంకోచమును కూడా తగ్గిస్తాయి. కాబట్టి హృదయ మాంద్యము ( bradycardia ) కలవారిలోను, హృదయవైఫల్యము కలవారిలోను వీటిని వాడకపోవుట మంచిది. డైహైడ్రోపైరిడిన్ తరగతికి చెందిన కాల్సియం మార్గ అవరోధకములు రక్తనాళములను వ్యాకోచింపజేస్తాయి . హృదయ సంకోచమును తగ్గించవు, హృదయ మాంద్యమును కలుగజేయవు. వీటిని బీటా అవరోధకములతోను, హృదయవైఫల్యము గలవారిలోను వాడవచ్చును. సత్వర కాల్సియమ్ మార్గ అవరోధకములు ( short acting calcium channel blockers ) గుండెపోటులు, మరణములు కలుగజేయగలవు కావున వీటిని వాడకూడదు. దీర్ఘకాలిక కాల్సియమ్ మార్గ అవరోధకములు వాడుట మేలు .

దీర్ఘకాలపు నైట్రేటులు ( long acting nitrates ) 

    ఇవి హృద్ధమనులను వ్యాకోచింపజేస్తాయి, సిరలను వ్యాకోచింపజేసి జఠరికలలో వికాసము చివర ఉండే ( రక్త ) ప్రమాణమును ( end diastolic volume ) తగ్గించి హృదయ భారమును తగ్గిస్తాయి. అధికమోతాదులలో ధమనుల పీడనమును కూడా తగ్గిస్తాయి. గుండెనొప్పులను తగ్గిస్తాయి. ఈ నైట్రేటులకు దేహపు సహనము ( tolerance ) పెరుగకుండుటకై వీటిని 12 గంటల విరామముతో వాడుట మేలు.  Phosphodiesterase -5 inhibitors ( sildenafil, vardenafil, tadalafil ) లను వాడేవారు నైట్రేటులను వాడకూడదు.

రెనొలజిన్ ( Ranolazine  )  

    పై మందులతో గుండెపోటులు తగ్గనివారికి రెనొలజిన్ వాడవచ్చును. గుండెవేగము పైన రక్తపీడనము పైన రెనొలజిన్ ప్రభావము ఉండదు. కాని వెరాపమిల్, డిల్టియజిమ్ లు వాడే వారిలో విద్యుత్ హృల్లేఖనములలో qt విరామమును పెంచగలవు కావున తగిన పరిశీలన, జాగ్రత్త అవసరము .

ఏస్పిరిన్ ( Aspirin )  

    హృద్ధమనీ వ్యాధి కలవారిలో  ఏస్పిరిన్ రక్తఫలకములు ( platelets ) గుమికూడుటను అరికట్టి గుండెపోటులను, మరణములను తగ్గిస్తుంది. జీర్ణమండలములో రక్తస్రావములు ( bleeding ) లేనివారిలోను, ఏస్పిరిన్ అసహనములు లేనివారిలోను ఏస్పిరిన్ తప్పక వాడాలి.

థీనోపైరిడిన్ ఉత్పన్నములు ( theinopyridine derivatives ) 

    ఇవి కూడా రక్తఫలకములు గుమికూడుటను అరికడుతాయి. వీటిని ఏస్పిరిన్ పడని వారిలోను, గుండెపోటుల వంటి సత్వర హృద్ధమని వ్యాధులలోను ( acute coronary syndrome ), హృద్ధమనులలో వ్యాకోచసాధనములను ( stents ) కొత్తగా అమర్చినవారిలోను వాడుతారు. క్లొపిడోగ్రెల్ ( Clopidogrel ), టైక్లోపైడిన్ ( Ticlopidine ), ప్రాసుగ్రెల్ (  Prasugrel ) ఈ తరగతిలోని కొన్ని మందులు. 

ఏంజియోటెన్సిన్ కన్వెర్టింగ్ ఎంజైమ్ అవరోధకములు ( Ace inhibitors )

    హృద్ధమని వ్యాధిగ్రస్థులలో మధుమేహము, రక్తపుపోటు, హృదయవైఫల్యము  ఉన్నవారిలో ఇవి చాలా ఉపయోగకరము. ఏస్ అవరోధకములు వాడలేనివారిలో ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములను ( Angiotensin receptor blockers ) వాడుతారు.

చర్మము ద్వారా హృద్ధమని వ్యాకోచ చికిత్సలు ( Percutaneous Coronary Intervention ) 

    ఔషధములతో గుండెనొప్పులు తగ్గని వారిలో చర్మము ద్వారా కృత్రిమనాళపు ( catheter ) బుడగలతో హృద్ధమనులలోనికి వెళ్ళి వాటిని వ్యాకోచింపజేస్తారు. ఆ వ్యాకోచమును నిలుపుటకు వ్యాకోచసాధనములను ( stents ) హృద్ధమనులలో అమర్చగలరు.

 హృద్ధమని అవరోధ అధిగమన శస్త్రచికిత్స ( Coronary artery bypass grafting ) 

    హృద్ధమని వ్యాధి విస్తృతముగా ఉన్నపుడు, వామహృద్ధమని ( left main coronary artery ), వామ పూర్వఅవరోహణ ధమనులలో ( left anterior descending artery ) తీవ్రసంకుచితములు ఉన్నపుడు , బహుళ హృద్ధమనులలో వ్యాధి సంకుచితములు తీవ్రముగా ఉన్నపుడు తొడలు, కాళ్ళ నుంచి గ్రహించిన దృశ్యసిరల ( saphenous vein ) భాగములను కాని, అంతరస్తన ధమనిని ( internal mammary artery ) కాని అవరోధముల తరువాత భాగములో హృద్ధమనులకు శస్త్రచికిత్సతో సంధానించి హృదయమునకు రక్తప్రసరణను పునరుద్ధింపజేయవచ్చును. దృశ్యసిరల ( saphenous vein ) భాగములను వాడునపుడు వాటి ముందు కొనలను బృహద్ధమనికి సంధానిస్తారు. ఈ చికిత్సల వలన గుండెపోటులు, మరణములు తగ్గుతాయి. 


పదజాలము :

Acute Kidney Injury  = సత్వర మూత్రాంగవిఘాతము ( గ.న )
Anaphylaxis  = రక్షణ వికటత్వము ( గ.న )
Anemia = పాండురోగము 
Anterior inter ventricular sulcus = పూర్వ జఠరికాంతర గర్తము ( గ.న )
Angina pectoris = గుండెనొప్పి
Angioplasty  = ధమనీవ్యాకోచ చికిత్స ( గ.న )
Aortic stenosis = బృహద్ధమని కవాట సంకుచితము ( గ.న )
Arteriosclerosis = ధమనీకాఠిన్యత
Bradycardia = హృదయమాంద్యము ( గ.న )
Catheter = కృత్రిమనాళము ( గ.న )
Congestive heart failure = హృదయవైఫల్యము 
Coronary angiography  = హృద్ధమనుల చిత్రీకరణము ( గ.న )
Coronary arteries = హృద్ధమనులు ; హృదయధమనులు
Coronary artery bypass grafting = హృద్ధమని అవరోధ అధిగమన శస్త్రచికిత్స  ( గ.న )
Coronary veins = హృత్సిరలు
Diagonal branches = వక్రశాఖలు ( గ.న )
Diastole = హృదయవికాసము ( గ.న )
Disease sensitivity = వ్యాధి గ్రహణత ( గ.న )
Disease Specificity = వ్యాధి నిర్దిష్టత ( గ.న )
Dissecting aortic aneurysms  = విచ్ఛేదన బృహద్ధమని బుద్బుదములు ( గ.న )
Echocardiography = ప్రతిధ్వని హృదయచిత్రీకరణము ( గ.న )
Elastic tissue = సాగుకణజాలము 
Electrocardiogram = హృదయవిద్యుల్లేఖనము 
End diastolic volume = వికాసాంతర ( రక్త )ప్రమాణము ( గ.న )
Exercise electrocardiography = వ్యాయామ  హృదయవిద్యుల్లేఖనము ( గ.న )
Exercise stress testing  = వ్యాయామపు ఒత్తిడి పరీక్ష గ.న )
False positive results = తప్పుడు అనుకూలఫలితములు ( గ.న )
Femoral artery = ఊరుధమని 
Fibrous tissue = పీచుకణజాలము 
Heart attack  ( myocardial infarction ) = గుండెపోటు
High Density Lipoproteins = అధికసాంద్రపు లైపోప్రోటీనులు ( గ.న )
Hyperthyroidism = గళగ్రంథి ఆధిక్యత (గ.న )
Hypertrophic cardiomyopathy  = హృదయకండర అతివృద్ధివ్యాధి  ( గ.న )
Infarction = ప్రసరణరహిత మరణము ( గ.న )
Intermediate artery = మధ్యస్థ ధమని ( గ.న )
Internal mammary artery = అంతరస్తన ధమని ( గ.న )
Inter ventricular septum = జఠరికాంతర కుడ్యము 
Ischemia = రక్తప్రసరణ లోపము ( గ.న )
Ischemic heart diseases = హృదయ రక్తప్రసరణలోప వ్యాధులు ( గ.న )
Left anterior descending artery = వామ పూర్వఅవరోహణ ధమని ( గ.న )
Left circumflex artery = వామ పరిభ్రమణధమని ( గ.న )
Left ventricular ejection fraction = ఎడమ జఠరిక రక్తప్రసరణ శాతము ( గ.న )
Lining cells = పూతకణములు ( గ.న )
Low Density Lipoproteins  = అల్పసాంద్రపు లైపోప్రోటీనులు ( గ.న )
Magnetic resonance perfusion imaging = అయస్కాంతప్రతిధ్వని హృదయప్రసరణ చిత్రీకరణములు ( గ.న )
Myocardial perfusion defects  = హృదయకండరములో రక్తప్రసరణ లోపములు ( గ.న )
Myocardial perfusion imaging = హృదయప్రసరణ  చిత్రీకరణము (గ.న )
Plaques  = ఫలకలు
Peripheral Arterial Diseases = దూరధమని వ్యాధులు ( గ.న )
Pneumothorax  = పుపుసవేష్టన వాయువు ( గ.న )
Polycythemia vera  = బహుళ రక్తకణ వ్యాధి ( గ.న )
Posterior descending artery = పర అవరోహణధమని ( గ.న )
Posterior inter ventricular sulcus = పర జఠరికాంతర గర్తము ( గ.న )
Radial artery = ముంజేతి బహిర్ధమని ( గ.న )
Right marginal artery = కుడి మేర ధమని (గ.న )
Saphenous vein = దృశ్యసిర ( గ.న )
Septal branches = కుడ్యశాఖలు ( గ.న )
Smooth muscles = మృదుకండరములు  
Spasm = దుస్సంకోచము 
Systolic blood pressure = ముకుళిత రక్తపీడనము ( గ.న )
Tunica externa or adventitia = రక్తనాళపు గోడలో బయటపొర ( గ.న )
Ventricular fibrillation = జఠరిక ప్రకంపన ( గ.న )
Tunica media =  రక్తనాళపు మధ్యపొర  ( గ.న )

    ( వైద్యవిషయములను తెలుగులో నా శక్తిమేరకు తెలియపఱచుట నా వ్యాసముల లక్ష్యము . వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తము అనుకుంటే నా  వ్యాసములను నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )




 

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...