6, మే 2022, శుక్రవారం

శతాధిక కాఫీ పద్యాలు

 



1. కాఫీకి గురుఁడు గొఱ్ఱె   

కం. కాపరి గాచిన గొఱ్ఱెలు
కాఫీ యాకులను మేసి గంతులు వైచెన్ ;
కాఫీ ద్రాగిరి మనుజులు
కాపరితోఁ గూడి ; గొఱ్ఱె కాదే గురుఁడున్ !


2. భారతదేశములో కాఫీ పంట 

కం. గడ్డపు నెఱసిన వెండ్రుక
లడ్డంబుగఁ బెట్టి, విత్తు లరుదుగఁ దెచ్చెన్ ,
గడ్డపు సాహెబు కెడ్డమ ?
దొడ్డగ మనదేశమునకు దొఱికెను గాఫీ !

( అరుదుగ = ఆశ్చర్యముగా ; ఎడ్డము = అడ్డంకి ; దొడ్డగ = ఘనముగ )


16 వ శతాబ్దములో శ్రీ బాబా బుడాన్ సాహెబ్ గారు హాజ్ యాత్ర ముగించుకొని మోఖా ( Mocha  ) నుంచి తిరిగివస్తూ ఏడు కాఫీ విత్తనాలను తన గడ్డములో దాచి, రహస్యముగా చిక్కమగలూర్, మైసూరుకు తీసుకువచ్చారుట. కాఫీ వ్యాపారములో గుత్తాధిపత్యము తమకు ఉండాలని, పచ్చి కాఫీ విత్తనాలను సౌదీ అరేబియా, యేమెన్ దేశాలనుంచి బయటకు తీసుకువెళ్ళడము ఆ కాలములో నిషేధించారుట. ఆ నిషేధము మన సాహెబు గారికి వారి గడ్డము వలన అడ్డంకి కాలేదు. భారతదేశములో కాఫీ పెంపకము ఆయనతో మొదలయింది.

3. ఓటుకు కాఫీ  
( ఇతరములు పుచ్చుకున్నా కాఫీలు మానకుడు )

కం. ఎన్నికల సమయమందున
వెన్నాడిన వారు, వీరు, వెఱవక హృదిలో
నెన్నుకొనుఁడు వారిచ్చెడి
మిన్నగుఁ గాఫీలు ద్రాగి మీ మది సాక్షిన్ !

( వెన్నాడు = వెంటబడు; మిన్న = శ్రేష్ఠము )

4. పడకలో కాఫీ



కం . లేచిన వెంటనె పీల్చుమ
వేఁచిన గింజల ఘుమఘుమ వేకువజామున్  ;
యోచింపక పాఁచియనుచుఁ
గాచిన కాఫీనిఁ ద్రాగు కమలాక్షి  యిడన్  !

5. సాగుదల కాఫీ



కం.అంగడి బండీవాలా
బంగారపుఁ దీగవోలె బారెఁడు పొడవున్
హంగుగఁ జాపిన కాఫీ
యంగుటికిం దగులువేళ నందించుఁ జవుల్ !

( చాపు = సాగదీయు : చవి = రుచి )

6. కొందఱికి నల్లని కాఫీ ఇష్టం.  
( నేను కప్పుడు పాలలో కొంచెము కాఫీతేట , గరిటెడు పంచదార కలుపుకొని తాగుతా. )

కం. నల్లని కాఫీ చేదుగ
నల్లల్లనఁ ద్రాగ జిహ్వ కదియేమి రుచో ?
పిల్లలు వలె నేఁ ద్రాగుదుఁ
దెల్లని పాలునకుఁ  గొంత తేటను జేర్చన్ !

అల్లల్లన = నెమ్మదిగా

7. చెన్నపట్టణపు కాఫీ   


ఒక పర్యాయము మేము చెన్నపురములో బంగారం దుకాణానికి వెళ్ళినపుడు ;

కం. అత్తఱిఁ దత్తఱపడుచుం
బుత్తడి యంగడికిఁ బోవఁ బొలుపగు కాఫీ
నిత్తడి పాత్రల నిచ్చిరి ;
చిత్తము గడు హరుసమొందెఁ  జెన్నపురములో !



(  అత్తఱి = ఆ సమయములో :  తత్తఱపడు = తొందఱపడు :  పుత్తడి = బంగారము : 
పొలుపు = ఒప్పైన :  హరుసము = సంతోషము )

8. వేడివస్తువులు వేడిగను చల్లని వస్తువులు చల్లగను ఉంచు గాజు కుప్పెలో కాఫీ !

కం. నిచ్చలు నుష్ణము గాసెడి
పొచ్చెము లేనట్టి కుప్పెఁ బొందికఁ బోయన్
నెచ్చెలి యిచ్చెడు కాఫీ
వెచ్చని రుచులెన్నొ కూర్చు వేడ్క గొలుపుచున్ !


( నిచ్చలు = ఎల్లప్పుడు )

9. క్రొత్త ఒక వింత కాఫీ

కం. ఇంపగుఁ గాఫీ పెట్టగఁ
గుంపటి రాఁజేసె నత్త ; గొండిక కోడల్
ఱంపపుఁబొట్టుం, బొయ్యను
సొంపుగఁ గొనితెచ్చి , పెట్టె సొబగుల కాఫీ  !

( కొండిక = చిన్నది )

10. చెప్పా,పెట్టకుండా దిగే అతిథులకు అర్జెంట్ కాఫీస్  

కం. అతిథులు సేరఁగ నింటికిఁ
బతిదేవుడు పరుగులెత్తుఁ బాలు గొనుటకున్
సతి వెదుకును జక్కెరకును
వెత లట్టులఁ బెట్టదగున ? వెచ్చని కాఫీ !

వెత = కష్టము 

11. గురజాడ అడుగుజాడల్లో కాఫీ  



కం. గరుడుం డమృతము తేగా
గిరగిర యని పొరలి నీలగిరిపై, కాఫీ
తరువై వెలసెను ; బుణ్యులు
తరియించిరి జగతిలోనఁ ద్రాగుచు కాఫీ !

12. పాతకాలపు మనిషికి పాతకాలపు కొలతలు .

కం. పరగడుపున నొక సోలెఁడుఁ
దరువాతను నొక్క తవ్వ ద్రాగుదు నేమో ,
పరహితు లొసగెడు కాఫీ
మరచెంబుకుఁ దగ్గదెపుడు మర్మము సెపితిన్ !

( తవ్వ = రెండుసోలలు : మర్మము = రహస్యము )

13. మన కాఫీ అంటే మనకెంతో మోజు !


కం. కేజీహెచ్ కాంటిన్లో
సాజాత్యము లేనియట్టి సౌరభ కాఫీ
రోజూ త్రాగేవారము
మోజిప్పుడుఁ గలిగెఁ ద్రాగ మురిపెము దోడన్ !

సాజాత్యము = పోలిక 

14. పావన్ బేకరీలోకి దూరితే దొరభావముతో  బన్+ బటర్+ జామ్ ఆర్డరు చేసేవాళ్మము కదా , కాఫీతోబాటు .

కం. పావన్ బేకరి కాఫీ
పావనులనుఁ జేసె మనలఁ బ్రత్యూషములన్
దావది బన్ బిస్కట్లకు
సేవించిన వాని, మీరు శ్వేతప్రభులే !

( ప్రత్యూషము = ప్రభాత సమయము  ; తావు = స్థానము  : శ్వేతఃప్రభులు = తెల్ల దొరలు )

15. సముద్రతీరములో వెచ్చని కాఫీ

కం. నాణ్యత కాంగ్లపుఁ బేరునఁ
బుణ్యాత్ములు నెలకొలిపి రెపుడొ యొక కాఫీ
పణ్యస్థలి నీరధితటి
గణ్యముగా సంధ్య లెన్నొ గడిపితి మచటన్ !

( పణ్యస్థలి = అంగడి : నీరధితటి= సముద్రతీరము : గణ్యము = ఎన్నదగిన
సంధ్య = సూర్యోదయ లేక సూర్యాస్తమయముల సమయము )


( Kwality )


16. విశాఖలో గుండయ్యరు అనే  ప్రముఖుడు  1950 - 60 లలో పూర్ణా మార్కెట్ దగ్గఱలో కాఫీ ఫలహారశాల నడిపేవారు. గుండయ్యరు జనులిచ్చిన బిరుదు. 

కం. ముండన మెన్నఁడు నెఱుగం
డుండదు తన మొగము,దలల నొక వెండ్రుకయున్
దండములై ప్రజ గూడఁగ
గుండయ్యరు ఘనుఁడు గూర్చు ఘుమఘుమ కాఫీ !

( ముండనము = క్షురకర్మ :  తండము = గుంపు )

17. వడపోత కాఫీ  


కం. తడబడక ముందురాతిరి
వడబోసిన తేటతోడఁ బడసిన కాఫీ
బుడిబుడిఁ ద్రాగిన వేకువ
కడచవులను ముట్టినట్లె కాఫీలందున్  !

( బుడిబుడి = మెల్లమెల్లగా ;  కడ = చివరి ; చవులు = రుచులు )

18. ఉత్ప్రేరక కాఫీ

కం. విద్యార్థుల కధ్యయమున
నుద్యోగుల పనులలోన నుత్ప్రేరకమై
ఉద్యమములు నడిపించును
బద్యములకుఁ బ్రాస లిచ్చుఁ  బ్రణతులు కాఫీ !

( ఉద్యమము = ప్రయత్నము ; ప్రణతులు = నమస్కారములు )

19. భాగపు 1 / 2 :

కొందఱు దయామయులు చాలా తక్కువ కాఫీ త్రాగుతారు .
అపుడు ఒక కప్పు కాఫీనే చాలామందికి పంచినా  గౌరవము, సంతోషము కలుగుతాయి . 
విద్యార్థి దశలో  జేబులో చిల్లర కొఱత ఉన్నపుడు  ఒక కప్పు కాఫీ ఇద్దఱము పంచుకొనేవారము. 

కం. అక్కటిక జనులు గొందఱు
దక్కువ కాఫీని గొనుచుఁ దనివోవుటచే
ఒక్కటి కప్పుడు కాఫీ
పెక్కండ్రుకుఁ బంచు నెడలఁ బెంపింపొదవున్.

( అక్కటికము= దయ , కృప , కరుణ;  తనివోవు  = తృప్తి పొందు ; ఒక్కటి = ఒకటి ;
పెంపు = గౌరవము ; ఇంపు = ఆనందము ; ఒదవు = లభించు )


20. జాగరముల కాఫీ  


కం. శివరాత్రుల జాగరములఁ
బ్రవహించును రాత్రివేళఁ బావన నదియై
కువలయమున గంగకు సరి
స్తవనీయము భక్తకోటి జాగృత కాఫీ 

( కువలయము = భూమి ; స్తవనీయము = స్తుతింపదగినది ; జాగృతి = మెలకువ)

21. వైఫల్యపు కాఫీ 

కాఫీలు తాగి కూడా చదివే విద్యార్థులకు సఫలత సిద్ధించాలి కదా ! 


కం . సాఫల్యము నర్థించుచుఁ
గాఫీలను గ్రోలి చదువఁ గౌతూహలమున్
‘ మా ఫల ‘ మని విద్యార్థుల
వైఫల్యులు సేయదగున వక్రహృదయులున్ ?

( కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోఽస్త్వకర్మణి ‖ ) 

ఆ దినములలో బాగా చదివిన వైద్యవిద్యార్థులు కూడా తఱచు పరీక్షలు తప్పేవారు.కొంతమంది  పరీక్షాధికారులు దుర్మార్గముగా వ్యవహరించేవారు. 

22. శుభోదయపు కాఫీ


కం. హాలికుల శ్రమఫలంబున
నీలగిరుల చఱియలందు నెగడెడు కాఫీ
పాలించును జనులెల్లర ;
మేలుకొలిపి , మీకుఁ బలుకు మే లుదయమ్ముల్ !

నెగడు = వర్ధిల్లు : మేలు = శుభము

23. మధ్యాహ్నపు కాఫీ  

కం. సాపాటయినం బిమ్మట
నే పాటున నోపలేని యెసగెడు నిద్రన్
మాపును నిమిషము లందున
నైపుణ్యులు పెట్టి యిచ్చు నాడెపుఁ గాఫీ !

( సాపాటు = భోజనము : ఓపు = ఓర్చు : ఎసగు = విజృంభించు : మాపు = పోగొట్టు : 
నాడెపు = శ్రేష్ఠమైన , నాణ్యమైన )

24. మైత్రీ కాఫీ

కం. కలియుగ మందలి మనుజులు
గలహింతురు గనక , యెట్టి కారణమైనన్
గలుపగ వారలఁ గాఫీ
నలువయె సృజియించె భువిని నలుదెస లందున్ !

( కనక = కనుగొనక  ( లేకపోయినా ) : నలువ = బ్రహ్మ , సృష్టికర్త : నలుదెసలు = నాలుగు దిక్కులు )

కలియుగములో మనుజులు నిష్కారణముగా పోట్లాడుకొంటారు . వారిమధ్య మైత్రి సమకూర్చుటకు బ్రహ్మ కాఫీ సృష్టించాడు.

25. సంగీతజ్ఞుల కాఫీ

కం. కాఫీ దేవినిఁ గొలిచినఁ
గాఫీ రాగంబు దోడఁ గమనీయముగా
సాఫల్యమగును గోర్కెలు
వైఫల్యము లెందు రావు, వసుమతి యందున్ !


26. సూక్ష్మతరంగాల పొయ్యి కాఫీ


కం. అయ్యా ! సూక్ష్మతరంగపుఁ
బొయ్యినిఁ గొనిపెట్టుకొనినఁ బురుషులు కాఫీ
సెయ్యగలరు నిమిషములో
నియ్యకొనఁగ స్త్రీలు మిమ్ము నిమ్మగుఁ బ్రీతిన్ !

( ఇయ్యకొను = సమ్మతించు : ఇమ్ము = ఇంపు )

27. మా అజంతా కాఫీ


విశాఖపట్నములో కె.జి.హాస్పిటలు ఎదురుగా  నాలుగురోడ్ల కూడలిలో అజంతా హోటెల్ దశాబ్దాలుగా ఉండేది ( ఇపుడూ ఉండవచ్చు ). ఆసుపత్రి ఉద్యోగులు అక్కడ వారి విరామ సమయాలు కాఫీలతో గడిపేవారు. 

కం. వైద్యాలయమున విడుపుల
నుద్యోగు లజంతఁ జొచ్చి యూఱటఁ ద్రాగన్
సద్యోజాతపుఁ గాఫీ,
ఖద్యోతుఁడు వోలె వారి కన్నులు మెఱయున్ !

( సద్యోజాతము = అప్పటికప్పుడు పుట్టినది ; ఖద్యోతుడు = సూర్యుడు. )

28. కృష్ణుడి కాఫీ


కం. కృష్ణుడి వేషపు నటుడట,
జిష్ణువు రూపంబువాఁడు చీరుచు నొసగం
దృష్ణగఁ గాఫీ గైకొని
యుష్ణముగా నుండెననుచు నూదుచుఁ ద్రాగెన్ !

( జిష్ణువు = అర్జునుడు / కృష్ణుడు ; చీరు = పిలుచు ; తృష్ణ =  కోరిక ) 

29. మందుకు విరుగుడు  కాఫీ

కం. ముందటి రాతిరి విందున
మందెక్కువ గ్రోలు నునికి మత్తు మిగలగా
మందము సేతురు మత్తును
బొందుగఁ గాఫీనిఁ ద్రాగి పురజను లెలమిన్ !

( ఎలమి = ప్రీతి )

30. వియత్తలములో  ✈️  కాఫీ


కం. సీమాంతర యానంబుల
వైమానిక సఖు లనంగ భామలు ప్రీతిన్
క్షేమము లడుగుచుఁ గాఫీ
వ్యోమంబునఁ దెచ్చి యిడుట యోగ్యత సతమున్ !

( వ్యోమము = ఆకాశము : సతము = ఎల్లపుడు )


31. సాయంసంధ్యల కాఫీ

కం. సూర్యాస్తమయ సమయములఁ
గార్యమ్ములు పూర్తి చేసి కౌతుకమతులై
భార్యాభర్తలు, కాఫీ
మర్యాదలు సేసుకొనుట మహితము మహిలో !

32. పేకాటల కాఫీ


కం. పేకాటలు సరదాగా
మూకలు గూర్చుండి యాడ ముచ్చట యగునే ?
ఆకడఁ గాఫీ సేర్చిన,
పేకకు సిద్ధించు రక్తి, పెంపగు నాటల్ !

( ఆకడ = అక్కడ : పేర్మి = గౌరవము : పెంపు = వృద్ధి )

33. ఊటీ హొటల్ కాఫీ

కం. చీటికి మాటికిఁ దఱచుగ
నూటీ కేగుట యదెట్లు నూహింపంగాఁ ?
బాటిగఁ గాఫీ కొఱకై
ఊటీహొట లేగ నడరు నుత్సాహంబున్ !

( పాటి = సామాన్యము ; ఏగు = పోవు ; అడరు = అతిశయించు )

( విశాఖపట్నములో  సరస్వతీ టాకీస్ ప్రక్కన ఊటీ హోటెల్ ఉండేది. ఊతప్పం, కాఫీలకు ప్రసిద్ధి )

34. పెండ్లివారింట కాఫీ

కం. వైవాహికోత్సవంబుల
లావణ్యపు లలన లిచ్చు లాలిత కాఫీ
సేవించి వధూవరులను
దీవించుడు తనివితీర ధీయుతులారా  !

35. కల్ల చక్కెరల కాఫీ



కం. చక్కెర నలతలు గలిగియుఁ
జక్కెర తియ్యనలు గోరు సఖులకుఁ బ్రీతిన్
జక్కెర చవులన్ బొంకుల 
చక్కెరలనుఁ గలిపి యిడరె జాణలు కాఫీ !

( నలత = వ్యాధి  :  చవి = రుచి )

36. విత్తులపాల కాఫీ

కం. జంతువుల పాలు వలదను
బంతమునుం బూనిరేని పాయున కాఫీ ?
వింతగు విత్తుల పాలట !
చెంతను గల విపణులందుఁ జిక్కును నెమ్మిన్ !

( పాయు = విడుచు : చిక్కు = దొఱకు : విపణి = అంగడి ;  విఱివి = విస్తృతము )

( సంపూర్ణ శాకాహారుల కాఫీలకు బాదం పాలు , ఓట్ల పాలు, సోయా పాలు లభ్యము.)

37. సర్వాంతర్యామి కాఫీ



కం. ఇందుఁ గల దందు లేదను
సందేహము వలదు, ధరణి సర్వోపగతం
బెందెందు వెదకి చూచిన
నందందే గోచరించు నాదృత కాఫీ !

( ఉపగతము = ప్రాప్తము ;  ఆదృతము = ఆదరింపబడినది )

( శ్రీ పోతనామాత్యుల వారికి ప్రణతులు  )

38.ఏ ఎండ కా  ☂  కాఫీలు 



కం. రేపకడలఁ గాఫీలను
మాపునఁ దేనీరు లడిగి మాన్యులు గ్రోలన్ ;
ఏ పూట కట్టి పానము
నెపమెన్నక కూర్చు స్త్రీలు నేర్పరు లిలలో !

( రేపకడ = ప్రాతఃకాలము; మాపు= సాయంకాలము : క్రోలు = త్రాగు ; నెఱజాణ = నేర్పరి ;
 ఇల = భూమి )

39. అరుకు కాఫీ -1


కం. త్వరపడి యిపుడే తెమ్మనఁ
బరువెత్తుచు విపణి కిపుడుఁ బౌరుష మెసగన్
బెరగాని యరుకు కాఫీ
సరసమ్ముగఁ దెచ్చిపెడుదు సౌహార్దముతో !

( విపణి = అంగడి ; ఎసగు = అతిశయించు ; పెర = అన్యము )

40. బెల్లపు కాఫీ


కం. తొల్లిటి చక్కెర, అనకా 
పల్లి జనంబులకు నిదియుఁ బసిడి యనంగా,
బెల్లము గలిపిన కాఫీ
యుల్లము రంజింపఁజేయు నుదయమ్ములలో  !

( తొల్లిటి చక్కెర = ముందు వచ్చిన చక్కెర , బెల్లము ;  పసిడి = బంగారము ; ఉల్లము = హృదయము )

( భారతదేశపు  బెల్లము వ్యాపారములో అనకాపల్లిది రెండవ స్థానము. విశాఖపట్టణమునకు ఉపనగరమైన అనకాపల్లి శారాదనది ఒడ్డున ఉంది.)

41. వర్షములో చెట్టు క్రింద కాఫీ 

( విశాఖపట్టణములో  కలెక్టర్ ఆఫీసు జంక్షనులో చెట్టు కిందో తాత కాఫీ అంగడి ఉండేది.)

కం. చిటపట చినుకులు విఱివై
తటాకములు నింపువేళఁ దలగక కాఫీ
కిటకిట లాడెడి జనులకు
విటపము దరి నిచ్చు తాత వెల యింతింతా ?

( తటాకము = చెఱువు; తలగు = తొలగు ; విటపము = చెట్టు : దరి = దగ్గర )

42. శీతకాలపు మాంద్యానికి కాఫీ

కం. చలికాలపు టుదయమ్ములఁ
దలపోయదు తల యొకింత తలపొకటైనా
చలియింపదు మేనించుక
పొలయించుమ !  తలను, మేనుఁ  బున్నెపుఁ గాఫీ !

( తలపోయు = ఆలోచించు : మేను = ఒడలు =  శరీరము : పొలయించు = చలింపజేయు )

43. చోదక వేళల నెయ్యుడు కాఫీ


కం. వాహన చోదన వేళల
నాహావము లేని నిద్ర నవరోధించన్
స్నేహితుడై చను కాఫీ
సాహాయ్యము గరము వలయు  జనులందఱికిన్ !

ఆహావము = ఆహ్వానము

వాహనములు నడిపేటప్పుడు పిలువని పేరంటంలా వచ్చే నిద్రను ప్రతిఘటించుటకు కాఫీ స్నేహితుడి సాయం కావాలి. 

44. కుక్కుటము కాఫీ




కం. మిక్కుటపు నిద్ర వలదని
కొక్కురుకో యంచు మేలుకొలుపుల గీతిన్
గుక్కుటము శుభోదయమని
చిక్కని కాఫీలు దెచ్చెఁ జెచ్చెరఁ ద్రాగన్ !

( కుక్కుటము = కోడి ; చెచ్చెర = శీఘ్రముగ )

45. కృకవాకువు కాఫీ 

కాఫీలు తెచ్చియిచ్చినంత మాత్రాన పలావులోకి వెళ్ళవా ? భ్రమ వీడుము !

కం. చొచ్చితివి వంటయింటిం,
దెచ్చినఁ గాఫీలు నీవు ; దెరలున వేటున్ ?
గ్రచ్చఱ యో కృకవాకువ !
ఎచ్చోటుకొ యెగిరిపొమ్ము హెచ్చరికించన్ !

( తెరలు = తొలగు : క్రచ్చర = శీఘ్రము ; హెచ్చరికించు = హెచ్చరించు )

46. స్నేహ సల్లాపముల కాఫీ


కం. రెక్కల గుఱ్ఱము నెక్కుచుఁ
జుక్కలను స్పృశించు నటుల, సుఖముగ హితులున్
జొక్కుచుఁ గాఫీ ద్రాగుచుఁ
జక్కగ ముచ్చటలనాడ సౌఖ్యత యొదవున్ !” 

( చొక్కు = పరవశించు ; ఒదవు = కలుగు )

47. పొగబండిలో కాఫీ


కం. పొగబండి పోవుచుండగ
సెగ గ్రక్కుచుఁ  జవులుపుట్టు చిక్కటి కాఫీ
భుగభుగ లాస్వాదించరె !
మగనాలును మగడు గలసి మరులుప్పతిలన్ !

( సెగ = వేడిమి ; చవులు = రుచి ; భుగభుగలు = పరిమళములు ; మగనాలు = భార్య ; 
మరులు = మోహము ; ఉప్పతిలు = ఉద్భవించు )


48. కాఫీ తత్వము 

కం. కోపము పూనిన వేళలఁ
దాపముతో మనసు క్రుంగు  తరుణములందున్
గాఫీ గొని యోచించుడు
ప్రాపించగ శాంతి, దమము, ప్రాజ్ఞత లెల్లన్ !

( ప్రాజ్ఞత = విజ్ఞత )

49. పొగ ❎  కాఫీ  ✅

కం. పొగ ద్రాగిన శ్వాస చెడును
పొగ ద్రాగిన గుండె చెడును, పొగ త్రాగంగాఁ
బగబట్టి కేన్సరిచ్చును ;
పొగ బదులుగఁ ద్రాగదగును భువిపై కాఫీ !

50. భిన్నత్వములో ఏకత్వపు కాఫీ



కం. మీ దైవము పస యేమిటి ?
మా దైవము మేటి యనుచు మనుజులు వేఱై,
వాదాడుచు వారంతా
నీ దరిలో నేకమవరె నిచ్చలు కాఫీ !

( నిచ్చలు = ఎల్లప్పుడు )

51. మతసామరస్యపు కాఫీ  

కం. బౌద్ధమొ, జైనమొ, హైందమొ
శ్రద్ధాళువు మదిఁ దలంచి షట్శత్రుచయం
బుద్ధృతి జయించి వీడిన
సిద్ధార్థుడు దానె యగును’, జెప్పుమ కాఫీ !

( శ్రద్ధాళువు = ఆసక్తి గలవాడు ( గలది ) ; ఆరుగురు శత్రువుల సముదాయము - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు  - అరిషడ్వర్గము )

52. కల కాఫీ

కం. గాజుల సవ్వడి సేయుచు
రాజీవదళాయతాక్షి రాగమలరగాఁ
దాజా కాఫీ దెచ్చిన
భ్రాజితమగు దినము నాడు రంజిలు  శుభముల్ !

( రాజీవము = ఎఱ్ఱకలువ ; రాజీవదళాయతాక్షి = ఎఱ్ఱకలువ రేకులవంటి దీర్ఘమైన కన్నులు గలది ; 
రాగము = అనురాగము ;  భ్రాజితము = ప్రకాశవంతము )

53. అరకులోయ కాఫీ 



కం. అందాల యరుకు లోయకు
బృందారక తరువు వోలె బెళుకుల కాఫీ
మందముగా దిగె నెప్పుడొ
విందుల సౌగంధ్య మలరు విమల రుచులతో !

(బృందారక తరువు = దేవతావృక్షము , కల్పతరువు ; బెళుకు = వెలుగు , మెఱుపు ;
సౌగంధ్యము = పరిమళము ; అలరు = ఒప్పు)

54. పాండవుల అరణ్యవాసపు కాఫీ



కం. అక్షయముగ మునివరులకుఁ
గుక్షులు నింపంగఁ దొడగి కుంతీసుతుడున్
అక్షయపాత్రను బడయగ
నా క్షణమున్ స్థాలి గురిసె నరుణపుఁ గాఫీ !

( అక్షయము = తఱుఁగులేనిది ; కుక్షి = కడుపు , జఠరము ; పడయు = పొందు ; 
క్షణము = సమయము  స్థాలి = వంటకుండ ; అరుణము = నలుపు కలిసిన ఎఱుపు )

అరణ్యవాసము ఆరంభములో ధర్మరాజు మునుల పోషణార్థము సూర్యభగవానుని తపస్సు చేసి మెప్పించి ఒక తామ్రస్థాలి, అక్షయపాత్రను పొందగా వెనువెంటనే ఆ రాగిపాత్ర ఎఱుపు నలుపుల రంగులో కాఫీ వర్షించింది .

55. కష్టే ఫలే ! ఎందఱి కష్టముతో మనకీ కాఫీ
 
కం. చక్కని కాఫీ గింజలు,
చక్కెర, క్షీరములు గూర్చ శ్రమకార్యంబే !
పెక్కురు కష్టించనిచోఁ
జిక్కున మన చేతిలోనఁ జిక్కటి కాఫీ  ?

56.  జీవనభృతి కాఫీ

కం. ఏ పనిపాటులు రావా ?
ఓపికతో నూరు కెడగ నొప్పగుఁ గాఫీ
లా పురజనులకుఁ గూర్చుచు
నాపై సరికొత్తదారి నరయుట మేలౌ !

( అరయు = వెదకు : విపణము = విక్రయము )

57. చదరంగపు కాఫీ 



కం. చదరంగపు టాటలలోఁ
గుదురుగ నొక పావు కూడఁ గులుకుచుఁ జనదో
అదనుగఁ గాఫీ ద్రాగినఁ ,
దుది గెలుపును బొందు వాడు, దురగము లుఱుకన్ !

( చను = వెళ్ళు , సాగు ; అదనుగ = సమయమునకు ; తురగము =గుఱ్ఱము )

58. మగడి కాఫీ


కం. ఇల్లాలు గినుకఁ బూనుచు
నొల్లదొ కాఫీని బెట్టి యొసగగఁ బతికిన్ ;
దల్లడిలి మగడు సే యది
గల్లల నాడంగ నగునె కమనీయంబున్ ??

( కినుక = కోపము :  ఒల్లు = ఇష్టపడు )

( ఈ పద్యము ప్రియమిత్రుడు డా. పానకాలరావు ప్రేరణ)

59. జలాంతర్గామిలో కాఫీలు 



కం. జలగర్భనావ లోపల
జలములలో బ్రతుకుబాట సాగగ నొసటన్
జలజాసనుడే వ్రాసెనొ,
జలజాక్షులు గూర్చఁ గొనుడు చక్కని కాఫీల్ !

( జలగర్భనావ =  నీళ్ళలో మునిగి నడిచే నావ , జలాంతర్గామి; జలజాసనుడు = బ్రహ్మ;
జలజాక్షులు =  కమలముల వంటి కన్నులు గల స్త్రీలు )

60. వైతాళిక కాఫీ  

కం. వృద్ధాప్యము క్రమియించినఁ,
గ్రుద్ధుండై యూగి ధిషణ గోల్పోయినచో,
సిద్ధుడు భంగుకు లొంగఁగ
బుద్ధిని మేల్కొలుపుఁ గదర పుడిసెడు కాఫీ ! 

( క్రమియించు = ఆక్రమించు ; క్రుద్ధుడు = కోపము పూనినవాడు : ధిషణ = బుద్ధి ; భంగు = గంజాయి )

61. సౌరిక కాఫీ

నారద మునీంద్రుడు  ధర్మరాజున కిట్లనియె;


కం. “ మీ రాజ్యపుఁ గాఫీ గొని
ఏ రాజో  తొల్లిఁ దెచ్చె, నింపుగ సురలున్
సౌరికమని త్రాగెదరని ” 
నారదముని పలికెఁ బ్రీతి నరపతి తోడన్ .

( తొల్లి = పూర్వము ; సురలు = దేవతలు ; సౌరికము = సుర ; నరపతి = రాజు  )

62. వెన్నెలలో  కాఫీ


కం. పున్నమి చంద్రుడు రాతిరి
కన్నులకును విందుసేయఁ, గాంచుచుఁ దారల్
చెన్నుగ మిసమిస కాఫీ
వెన్నెలలోఁ ద్రాగినపుడు విచ్చుగ  మనముల్ !

( తారలు = నక్షత్రాలు )

63. జై హనుమాన్ ! సంజీవనిగిరి కాఫీ  



కం.రంజన చెడి లక్ష్మణు డరి
భంజనుడై తీవ్రమూర్ఛ పాలైనపుడున్ ,
సంజీవని కాఫీగిరి
అంజనసుతు డెగసి దెచ్చె ; హనుమాన్ జయహో !

( రంజన = సంతోషము , ఆనందము ; అరి = శత్రువు ; భంజనుడు = కొట్టబడినవాడు ; అంజనసుతుడు = అంజనాదేవి కుమారుడు, ఆంజనేయుడు ;ఎగయు = ఎగురు )

64. గంజాయి వద్దు, కాఫీ గ్రోలుడు

‘ రంజన చెడి ‘ కాఫీ పద్యము చదివి మా మిత్రులు ‘గంజాయి’ తో మొదలిడే కాఫీ పద్యము కోరగా వ్రాసిన పద్యము. 

కం. గంజాయి యేలనొ, అరబ్
సంజాతంబైన నట్టి  సౌరభ కాఫీ
మంజీర రవము లొలయుచుఁ
గంజాక్షులు దెచ్చి యొసగ గారవమబ్బున్ !

( ఆరబ్ సంజాతము = ఆరబ్ దేశములో పుట్టిన ; మంజీర రవములు = అందెల ధ్వనులు 
ఒలయు = వ్యాపించు ; కంజాక్షులు = పద్మముల వంటి కన్నులు కలవారు ; గారవము = గొప్పతనము )

అల్లసాని పెద్దన గారు కవిత్వం వ్రాయటానికి తమ అవసరాలు ఇలా తెలిపారు.




చం. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె మాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త
ప్పరయ రసజ్ఞు లూహఁ దెలియం గల లేఖక పాఠకోత్తముల్
దొరికినఁ గాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే !

( నిరుపహతి = బాధలేని ( అసౌఖ్యము కాని ):  విడెము = తాంబూలము )

మఱి ఆయన ఆంధ్రకవితాపితామహుడు . శ్రీకృష్ణదేవరాయలచే గండపెండేరము 
తొడిగించుకొన్న మహానుభావుడు . మనుచరిత్ర గ్రంథకర్త  🙏🏻🙏🏻 . 


65. అల్పసంతుష్టుడి కాఫీ 

కం. పెద్దన గోర్కెలు పెద్దవి,
పెద్దవి కావ్యములు గూడ, పెద్ద కవులలో;
గిద్దెడు కాఫీ వోసిన,
నొద్దిక నరసింహమూర్తి యొలకడె కవితల్ ? 

( గిద్దె = సోలలో నాల్గవ భాగము ; ఒద్దిక = వినయము , నమ్రత ; ఒలుకు = చిందించు )

66. స్వయంవర కాఫీలు  



కం. ధన్యులు గాఫీ ద్రాగక
అన్యముపై నాశపడుట యది యెట్లనినన్,
మాన్యుడు సన్నిధి నిలువగ
శూన్యములో వరుని వెదకు సుందరి యట్లున్ !

సన్నిధి = సమీపము

67. 
కం. ధన్యులు గాఫీ గ్రోలక
అన్యముపై నాశపడుట యది యెట్లనినన్,
గన్య సమక్షము నుండగ
శూన్యములో వధువు వెదకు సుందరుడట్లున్ ! 

సమక్షము = కన్నులకు ఎదురుగా 

68. ఎగిరే దోసెకు తోడుగ కాఫీ 

( దోసెలు చేసి గాలిలో దూరముగా పళ్ళెములో పడునట్లు ఎగరేసే ప్రతిభ చూసి వ్రాసిన పద్యము )

కం. ఎగసే దోసెకుఁ దోడుగ
భగీరథుడు దెచ్చినటులఁ బావని భువికిన్
సెగతోఁ గాఫీ లిచ్చిన
నగవులు చిందించుఁ గదర నలువురి మొగముల్ !

( పావని = గంగ : ఎగయు = ఎగురు ; చిందించు = ఒలుకు )


69. కొండలపై కాఫీలు 

కం. గిరు లలయక యెక్కినఁ దఱిఁ
బరమిత్రులు క్షణములోన బంధువు లవగా,
విరబూయవె యెదతమ్ములు
తరుఛాయలఁ గూడి సఖులు ద్రాగగఁ గాఫీల్ !

( ఎదతమ్ములు = హృదయకమలములు ; తరుఛాయ = చెట్టునీడ )

విశాఖ వచ్చినపుడు కంబాలకొండ , సింహాచలంకొండ , కైలాసగిరులు   కొత్తమిత్రులతో ఎక్కడం కాఫీలు త్రాగడాలు పరిపాటి . తిరుపతి కొండ ఎక్కినపుడు కూడా ఎవరెవరో స్నేహితులయిపోతారు.

70. పట్టాలబండి చోదకులకు కాఫీలు



కం. పట్టాల బళ్ళ నెక్కుచు
గుట్టుగఁ బయనంబు సేయు గుణనిధులారా !
పట్టాలు దప్పకుండగఁ
బట్టదగును జోదకులకు భద్రపుఁ గాఫీల్  !

( చోదకుడు = బండి నడిపేవాడు )

71. వైద్యసేవకులకు కాఫీలు




కం. గజగజ లాడించెడి ఘన
రుజలెన్నియొ పాపుకొనగ  రోగులు చేరన్ 
అజు డంపిన దివిజులు వలె
సుజనులు దమ సేవలిడగఁ జొనుపరె కాఫీల్ !

( రుజ = రోగము ; పాపుకొను = తొలగించుకొను ; అజుడు = బ్రహ్మ ; అంపు = పంపు ;
దివిజులు = వేల్పులు : చొనుపు = సమకూర్చు )

పెద్దపెద్ద రోగములు తొలగించుకొనుటకు వచ్చే రోగులకు బ్రహ్మదేవుడు పంపిన దేవతల వలె సేవలు చేయు  సుజనులు వైద్యసంరక్షకులు సంస్తవనీయులు. 

72. వాహన గాహన కాఫీలు 


కం. ఆహా ! యేమని చెప్పుదు ?
వాహనముల స్నానమంట! బాగుందనుచున్
వాహన మిచ్చెద, వేచెద,
‘స్వాహా’లను జెప్పి క్రోల సౌరభ కాఫీల్ !

( గాహనము = స్నానము ; క్రోలు = త్రాగు )

( ఓం , కేశవాయ స్వాహా ! నారాయణాయ స్వాహా ! మాధవాయ స్వాహా  ! )

వాహనాలు అమ్మేవారు వాటిని కడుగుతుంటారుకూడా. అక్కడే విశ్రాంతి తీసుకొని కారు తిరిగిచ్చే వఱకు మధ్య మధ్య కాఫీలు సేవించవచ్చును. 

73. కుంభకోణపు కాఫీ



కం. శంభుడు నిలిపెను నిర్జర
కుంభము నిట, బుధులు కుంభకోణం బనగా ;
రంభాదులు కాఫీ యని
దంభము వెలయ నమృతమ్ము  ద్రాగుదు రిచటన్ !

నిర్జరము = అమృతము ; కుంభము = కుండ ; బుధులు = పండితులు ; దంభము = గర్వము ;
వెలయు = ప్రకాశితమగు ( తెలియు )

ప్రళయకాలములో కొట్టుకుపోతున్న అమృతభాండమును ఈశ్వరుడు నిలుపుట వలన ఈ స్థలమునకు కుంభకోణము అనే పేరు వచ్చిందట. రంభ మొదలైన దేవతలు గర్వముతో ఆ అమృతమునే కాఫీ రూపములో ఇచట త్రాగుతారు.

74. పాదోదక కాఫీ




కం. బలి కడిగినఁ బాదద్వయ
నలిని జలములింకి క్రింద నాగపురములో
బలిమందిర భూజంబై
తొలి కాఫీ యెదిగె భువికి ద్యుతినివహముతో .

( నలిని = కమలము ; నాగపురము = పాతాళలోకము ; భూజము = చెట్టు ; 
ద్యుతి నివహము = కాంతి సమూహము )

( వామనుడికి మూడడగుల భూమి దానము చేస్తూ బలిచక్రవర్తి ఆతని పాదయుగ కమలములు కడిగిన నీరు పాతాళమునకు ఇంకి అచట బలిగృహ తరువై  కాంతులతో భూమికి కాఫీ మొక్కగా ఎదిగింది. )

75. కాశీలో కాఫీ



కం. కాశీపుణ్యక్షేత్రము
వాసిగ నది యన్నపూర్ణ వాసంబగుటన్
ఏ సమయము మీరేగిన
నా సమయము దొఱకుచుండు నన్నము కాఫీల్ !

( వాసి = ప్రసిద్ధి ; వాసము = నివాసము )

పదవిలో ఉన్నపుడు, పోయినపుడు  కావాలి కాఫీ


76. కం. అధ్యక్ష పదవి నిండుగ
బాధ్యతతోఁ గూడుకొన్న వర్తనమనుచున్
దధ్యము దలంచి కాఫీ
విధ్యుక్తముగా గ్రహింప వీడును వెతలున్ .

( తధ్యము = సత్యము ; వర్తనము = నడవడి : వెత =  కష్టము )

77. నాగలోకపు ( పాతాళలోకపు ) కాఫీ

కం. భూగర్భమందు లోతుగ
దాగొని మఱుగున్న సంపదలు వెలిఁగొనగా
నా గనులు ద్రవ్వు ఘనులకు
నాగేంద్రుడు పనిచె నెపుడొ నవ్యపుఁ గాఫీల్ ! 


 ( గని కార్మికులకు కాఫీలు పంపమని మా సహాధ్యాయుడు డా. నాగేంద్రప్రసాద్ కోరారు. గనులు అంటే నాగలోకమే కదా ! )

78. కర్షకసోదరులకు కాఫీలు

కం. తెలవాఱక మున్నే, వడిఁ
బొలములకును సాగుబడికిఁ బోదురు తమ్ముల్ ;
చలుదులఁ దోడుగ వారికి
నలితిండ్లను బెట్టి యిడరె నచ్చెడి కాఫీల్ !

నలితిండి = చిరుతిండి

79. మా చోడవరపు కాఫీ


కం. చూడగ మా పినతండ్రిని
వేడుకగాఁ బోయి కొంటి వీథిమలుపులో
బేడాపరకకుఁ గాఫీ
చోడవరము నదియు మిన్న  క్షోణితలములో !

( బేడాపరక పదునైదు పైసలకు సమానము ; క్షోణీతలము = భూతలము )

80. యద్వచనమ్ తత్  కాఫీ

కం. కాఫీ చక్కగ దక్కును
సాఫల్యము నొంద నీదు సౌమ్య వచనముల్ ! 
కాఫీ చిక్కుట కల్లే
శాపంబులు పెట్టిరేని శౌర్య వనితలన్ !! 

( శాపము = తిట్టు )

81. ఏకేశ్వర తత్వపు కాఫీ


కం. ఘటములు మారినఁ గాఫీ
ఘటాకృతినిఁ బొందుఁగాని గణనీయంబౌ
పటురుచి గోల్పోవని గతి
నిటలాక్షుం డొక్కడేను నెలవేదైనా !

( ఘటము = పాత్ర ; నిటలాక్షుడు = ఫాలాక్షుడు  = పరమేశ్వరుడు ( పరమాత్మ );నెలవు = స్థానము )

82. భారత 🇮🇳 సైనికులకు ప్రణామములతో కాఫీలు


కం. భారత సైనిక శూరులు
పోరులఁ దమ తనువులొడ్డి పుడమిని సతమున్
ధీరత్వముతోఁ బ్రోచరె !
వీరులకును గూర్చవలయు వెచ్చని కాఫీల్ !



83. ఉపవాస దినములలో కాఫీ

కం. ఉపవాసపు దినములలో
నుపచర్యలు సేయువార లొసగెడు కాఫీ
శపథములు మాని క్రోలిన
నుపశమనము గలుగఁజేయు నుదరాగ్ని వెసన్ !

84. కర్షకజనులకు కాఫీలు

కం. పొలములు హలముల దున్నుచు
నిలజనులనుఁ బ్రోచునట్టి యెల్ల హలికులున్
ఇలవేలుపులని తలచుచుఁ
బలు విధముల సత్కరించి పంచరె కాఫీల్ !

( ఇల = భూమి ; ప్రోచు = పోషించు; హలికుడు = కర్షకుడు; పంచు = ఆజ్ఞాపించు )



కం. బలదేముడు మా దేవర
హలమును భుజమున ధరించి యసురులఁ ద్రుంచన్ ;
హలములు ద్రొక్కుచు నన్నము
పొలములఁ బండించువారు పుడమిన వేల్పుల్ !

85. అరకులోయలో మఱో కాఫీ



కం. అందాల యరకు లోయల
సౌందర్యము మదికిఁ గూర్చు సంతస మెపుడున్ ;
విందులు గుడుచుచుఁ గాఫీల్
సందడిగాఁ గ్రోల నచట సౌఖ్యం బెసగున్ !

( ఎసగు = అతిశయించు )

86. చిత్రాలయ కాఫీలు


కం. చిత్రాలయముల కేగుచుఁ
జిత్రమ్ములు సూచువేళఁ జిత్తం బెపుడున్
జిత్రమ్ముగఁ గాఫీకే
ఆత్రముగా నెదురుచూచు నబ్బుర మేమిన్ !

అబ్బురము = ఆశ్చర్యము

చిత్తం శివుడి పైన భక్తి నైవేద్యము పైన అన్నట్లు సినిమా కాదు , పాప్కార్న్ , కాఫీల పైనే ధ్యాస. విశాఖపట్నము చిత్రాలయలో చాలా సినిమాలు చూసాము.


87. ఏ దేశమేగినా, ఎందు త్రాగిన కాఫి


కం. స్థిరముగ స్వదేశ మందునొ
పరదేశములకుఁ జని యట వాసంబున్నా 
వరకాఫీ యుపరితలముఁ
బరికించుడు ! ప్రీతి తోడ భారత ధాత్రిన్ !

( వాసము = నివాసము ; వరము = శ్రేష్ఠము ; పరికించు = చూచు )

భారతదేశములో ఉన్నా, పరదేశములో ఉన్నా  శ్రేష్ఠమైన కాఫీ త్రాగేటపుడు భారతదేశమును సందర్శించండి .



అభినవ అభిజ్ఞాన శాకుంతలము 

88. కణ్వాశ్రమ కాఫీ 



కం. అణ్వణువున దాహముతోఁ
గణ్వాశ్రమమునకు వెడలెఁ గాఫీ వాంఛన్
దన్వి శకుంతల గని, మో
హాన్విత దుష్యంతు డామె హస్తము గొనియెన్ !

తన్వి = స్త్రీ : మోహాన్వితుడు =  మోహముతో కూడినవాడు : కొను = గ్రహించు

దుష్యంతుడు వేటలో అలసి తన శరీరపు అణువు అణువునా దాహము కలిగినవాడై కాఫీపై కోరిక కలిగి కణ్వాశ్రములోనికి ప్రవేశించెను. అచట లతాన్వి  శకుంతలను చూసి ఆమెను మోహించి  పాణిగ్రహణ మాడెను. ( ఇంతకీ కాఫీ త్రాగాడా , లేదా అన్నది ..... ఉత్కంఠ )

89. జ్ఞాపక కాఫీ


కం. " ఈ కోమలి నే నెఱుగను
శాకుంతల నొల్లననుట  శాప ఫలంబే !
ఓ కాఫీ మతి నిడు " నని
ఆకసమున వాణి పలికె నవనీపతితో !

( కోమలి = స్త్రీ ; శాకుంతల = శకుంతల కొడుకు , భరతుడు ;ఒల్లను = ఒప్పను ;  నుడువు = పలుకు ; మతి = జ్ఞానము ; అవనీపతి =  రాజు , దుష్యంతుడు )


90. ఉపవాస దినముల కాఫీ


కం. ఉపవాసదినము లందునఁ
గపర్దిని మనస్సు నునిచి కైకొనఁ గాఫీ
కపటము లేదుగ యించుక ,
ఉపశమనము సేయవలదె యుదరాగ్ని వెసన్ ? 

( కపర్ది = శివుడు ; ఉనుచు = ఉంచు ; ఉదరాగ్ని = జఠరాగ్ని ; వెస = వేగము )

ఉపవాసము ఉండే దినములందు ఈశ్వరుని ధ్యానించుకొని కాఫీ త్రాగితే దోషము లేదు. జఠరాగ్నిని శాంతపఱచాలి కదా !

91. పరీక్షాధికారులకు కాఫీలు 

కం. కరములఁ బట్టా కొఱకై
పరీక్షలను గైకొనంగ, వారల జ్ఞానం
బరసెడు వారికిఁ గాఫీల్
పరచింతలు పొందకుండఁ బంచుడు విరివిన్ !

( అరయు = పరీక్షించు, విచారించు)

( పరీక్షలలో వారడిగిన ప్రశ్నలకు సమాధానము చెబుతుంటే కొంతమంది పరీక్షాధికారులు మరేదో ఆలోచిస్తున్నట్లు అనిపించేది. )

92. న్యాయాధికారి గారికి ఔషధ కాఫీ


కం. నిత్యము కల్లల బ్రతుకుచు
‘సత్యం’బని నుడువ న్యాయసభలన్ సాక్షుల్,
గత్యంతరంబ ? తగవరి
కత్యవసరమపుడుఁ ద్రాగ నౌషధ కాఫీ !

( నుడువు = పలుకు ; తగవరి = న్యాయాధిపతి )

వృత్తిపరంగా సాక్షులుంటారు.  వేఱు వేఱు కేసులలో అన్నిచోట్లా వారు ఉన్నట్లు , అన్నీ వాళ్ళు చూసినట్లు దొంగసాక్షాలు ఇచ్చి ‘నిజం ‘ ‘ నిజం’ అంటుంటే న్యాయాధిపతిగారు నెత్తి నోరూ కొట్టుకొని తలనొప్పికి మంచి కాఫీ’ త్రాగుట అవసరము . 

93. భ్రమరక కాఫీ.    

  

కం. మధుపమ్ములు మందారపు
మధువులు రహిఁ గ్రోలునపుడు మత్తును బడయున్ ;       
మధుపమ్ములు కాఫీవిరి
మధువులు లలిఁ గ్రోలునపుడు మత్తది వీడున్ !

( భ్రమరకము =  మధుపము = తేనెటీగ ; మధువు = తేనె ; రహి = సంతోషముగ ; పడయు = పొందు ; కాఫీవిరి = కాఫీ పూవు ; లలి = ఉత్సాహము )

తేనెటీగలు మందారపుష్పముల తేనెలు సంతోషంగా త్రాగినపుడు మత్తు పొందుతాయి. ఆ తేనెటీగలే కాఫీ పూలలోని తేనెలు ఉత్సాహంతో త్రాగితే ఆ మత్తుకోల్పోయి ఉత్తేజము పొందుతాయి.
( భోజనం చేయగానే నాకు కూడా నిద్ర వస్తుంది. కాఫీ త్రాగితే ఆ నిద్ర వదులుతుంది . )

94. మిరియాలపొడి కాఫీ

కం. స్వరపేటిక జలు బూనిన,
మిరియపుఁ బొడి కొంత చేర్చి మితముగఁ గ్రోలన్
గరదీపికయౌ కాఫీ 
సరిగమలను బాడు గొంతు సంగీతముతో !

( ఊను = పొందు, వహించు ; కరము = చేయి )

95. శీతాకాలపు కాఫీ

కం. సప్తాశ్వుడు ధాత్రేయిని
దప్తంబుగఁ జేయలేని తరుణము లందున్
దప్తంబౌ కాఫీలను
నాప్తులు గొనితెచ్చి నపుడు నరుసం బొదవున్ !

( సప్తాశ్వుడు = సూర్యుడు; ధాత్రేయి = భూమి ; తప్తము = వేడి ; అరుసము = హర్షము ; 
ఒదవు = కలుగు )

96. గోదావరి దరి కాఫీ 


కం. గోదావరి నదిలో దిగి
మోదంబుగ మున్కలేయు పుణ్యజనులకున్
ఖాదనములు, కాఫీలను
సాదరముగఁ గూర్చ నెలమి, సఖ్యత యెసగున్ !

( ఖాదనము = ఆహారము; సాదరము = గౌరవముతో ; ఎలమి = సంతోషము ; 
ఎసగు = అతిశయించు )

కాటన్ దొఱ సంస్మరణ 🙏🏻🙏🏻


కం. గోదావరి నదిలో దిగి
మోదంబుగ మున్కలేయు పుణ్యఘడియలన్
సాదరముగఁ గాటన్ దొఱ
నీ దినముల  జ్ఞప్తి నెంచ, నెంతటి ఘనుడో ! 

( ఎంచు = గణించు, నుతించు )

పండితులు గోదావరిలో స్నానమాచరించునపుడు గోదావరిపై ఆనకట్ట కట్టిన కాటన్ దొఱను స్మరిస్తారు.

నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః 
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం

(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరను  స్మరిస్తున్నాము.)

97. సప్తచషకముల కాఫీ

కం. సప్తపదమ్ములు గలిసిన
సాప్తపదీనమ్ముగఁ జను సఖ్యత ధరణిన్
సప్త చషకముల కాఫీ 
ఆప్తులఁ గట్టును బలముగ నవనీతలమున్ !

( సాప్తపదీనము = స్నేహము ; చషకము = పానపాత్ర , గిన్నె ; ధరణి = అవని = భూమి )

( చషకము అనే పదమును సూచించిన ప్రియమిత్రుడు విజయసారథికి కృతజ్ఞతలు . )

ఏడు మాటలు గాని ఏడడుగులు  గాని కలిస్తే భువిలో ‘సాప్తపదీనముగా ‘ చెలిమి నడుస్తుంది. ఏడు పాత్రల కాఫీ  ఆప్తులను బలముగా కట్టివేస్తుంది.

98. పునరుత్తేజిత కాఫీ

కం. చరవాణి మూగఁబోయినఁ
ద్వరపడి తగుఁ బసను గూర్చుఁ బటువిద్యుత్తున్
గొఱతపడిన నుత్సాహము ,
నరులకు నుత్తేజ మొసగు నవ్వుల కాఫీ ! 

(పస = శక్తి , సత్తా )

చరవాణిలో శక్తి క్షీణించి పలుకకపోతే విద్యుచ్ఛక్తి మఱల శక్తి సమకూరుస్తుంది. మనుజులకు ఉత్సాహం తగ్గితే  కాఫీ ఉత్తేజము  సమకూరుస్తుంది.

99. మనుమడి ముద్దుల కాఫీ


కం. వద్దన వినడే యించుక,
కొద్దిగఁ గాఫీ నొసగినఁ గొసరుల నడుగున్
దద్దయుఁ దానే ద్రాగుచు 
ముద్దుల మనుమండు సూపు మురిపెము లెన్నో !

( తద్దయు = ఎక్కువ )


100. కోలా లేల ? కావలె కాఫీ



కం. చాలీ చాలని కేఫీన్
గోలాలో నున్నదనుచుఁ గోడిగ మేలన్ ?
బోలున కాఫీ పోడిమి ?
మేలౌ కాఫీలె యిమ్ము మెచ్చగ జనులున్ !

( పోడిమి = చక్కదనము ;కోడిగము = మోసము )

101. కాఫీలోకపు కాఫీ

కం. కాఫీతో నెయ్యంబులు,
గాఫీతోఁ జుట్టరికము, గార్యము లొదవుం ;
గాఫీలకు వెనుకాడిన
సాఫల్యము నొందగలవె చర్యలు ధరణిన్ ?

( ఒదవు = కలుగు ; నెయ్యము = స్నేహము ; ధరణి = భూమి )


102. అసంకల్పిత కాఫీ 

కం. అల్పాహారంబులు గొని
స్వల్పము చవిచూడకుండఁ జనునా కాఫీ ?
అల్పాహారముల కసం
కల్పితముగఁ జేర్చవలదె కాఫీ లెలమిన్ ?

( చవి = రుచి ; అసంకల్పితము = ఆలోచన లేకుండా జరిగే చర్య ; ఎలమి = సంతోషము )

ఇడ్లీ,  దోసె, పెసరెట్ ఏమి పెట్టినా తరువాత కాఫీ  అడగకుండా ఇవ్వాలి కదా !


103. వ్యాపక వ్యాధిగ్రస్తులకు కాఫీలు

కం. వ్యాపక రుజములు ప్రబలినఁ
దాపము వడి బాధలొందు తప్తజనులకున్
ఓ పూట కూడు, కాఫీ
భూపతులకు నోపతరమె భువి గూర్చంగా !

( రుజములు = వ్యాధులు ; ఓపు = ఓర్చు )

104. స్వయంసేవక కాఫీలు

కం . తలకో విధముగఁ గాఫీ
కలిపింతురు గుంపులందుఁ గాంక్షలు వేఱై
కలుపుడు మీ కాఫీకని
శలాకముల నొసగ మేలుఁ, జక్కెర, పాలున్ !

( తలకు = ఒక్కొక్కరికి, ప్రత్యేకముగ ; శలాకము  = పుడక ( కలుపుడు పుడక ) 

ఒక్కొక్కరికి ఒకలా కాఫీ ఇష్టం. అందువలన మీకు కావలసిన విధముగ కలుపుకొండని నల్ల కాఫీతో పాలు, పంచదార, ఒక పుడక పెట్టేస్తున్నారు చాలా చోట్ల .

105. వరద బాధితులకు కాఫీలు 

కం. వరదలు వ్రంతలఁ బాఱగఁ
ద్వరితముగా నిళ్ళు వీడు బాధిత జనులన్
బరగృహములలోఁ బ్రోచుచుఁ
జిరుతిండ్లును, వాటి తోడఁ జిలుకరె కాఫీల్ !  

106. ఒల్లనోయి సామీ ! నీ డీకాఫ్ కాఫీ !


కం. కాఫీలకుఁ బ్రాణంబది
కేఫీనే లేకయున్న ‘ గీఫీ ‘ గాదా ??
గేఫీన్ విరహిత ‘డీకాఫ్
కాఫీ’లవి నల్లనీళ్ళు, గైకొన నొల్లన్ ! 😡

( విరహితము = లేనిది ; కైకొను = తీసికొను ; ఒల్లను = ఇష్టపడను )

107. యాంత్రిక కాఫీ


కం. మంత్రముల మహిమ గాదది,
తంత్రముల సమన్వయంబు, దత్క్షణ మందే
యంత్రము సేయదె కాఫీ
యాంత్రికజీవన యుగమున నాధునికంబుగా !

( సమన్వయము = కూడిక )

108. బదులు వస్తువులతో కాఫీ 

కం. ఇల్లక్కడఁ గాఫీపొడి
నల్లక్కడఁ బాలు పిదప, హరుసం బొదవన్ 
ఉల్లక్కడఁ జక్కెరయున్
ఇల్లడ యిడుమనగ నమరు నింపగు కాఫీ 

( ఇల్ల = ఇచట ; అల్ల = అచట ( దూరపు స్థలము ) : ఉల్ల = మరీ దగ్గఱ కాని దూరము కాని స్థలము;
హరుసము = సంతోషము ; ఇల్లడ  = పదిలపఱచి అడిగినప్పుడు ఇమ్మని యేదేని యొక వస్తువును ఒకరి వద్ద దాచుట )

109. ఖరీదు కాఫీ



కం. అగ్గలముగఁ గాఫీకై
దగ్గఱ గల స్టారుబక్సు తావుకుఁ బోవన్
దగ్గించిరి తెగ సొమ్ములు
లగ్గని మఱి యేగలేదు లటపట మేలన్ ?

( అగ్గలము = అతిశయము ; తావు = స్థానము ; లగ్గు = శుభము , స్వస్తి ;



 లటపటము = గప్పాలుకొట్టుట )

110. ప్రసూతివైద్యులకు కాఫీలు


ప్రసూతివైద్యము అతిక్లిష్టమైనది. ఒకేసమయములో రెండుప్రాణాల రక్షణ కర్తవ్యముతో వారు బాధ్యత నిర్వహిస్తారు. కొత్తప్రాణిని భూమాతకు, భూమాతకు కొత్త శిశువును పరిచయము చెయ్యడములో అనిర్వచనీయమైన ఆనందం ఉంది. మనలో ప్రసూతివైద్యులకు వందనములతో,

కం. దుర్భరమని తలపోయక
గర్భిణులను గాచుకొనుచు గారాబముతో
నర్భకుల నవనిఁ  దెచ్చెడి
గర్భిణుల భిషక్కులకివె  కాఫీ ప్రణతుల్  !

( అర్భకులు = శిశువులు ; అవని = భూమి ; భిషక్కు = వైద్యుడు )

111. కాఫీ మహిమ 

కం. నెయ్యంబులు వర్ధిల్లును
గయ్యంబులు మఱుగుఁజొచ్చుఁ గాఫీ లొసగం
దొయ్యలులకు మంగళమగు
వియ్యంబులు విరివిగాను వికసించు ధరన్ !

( తొయ్యలి = స్త్రీ ; ధర = భూమి. )

112. వైజ్ఞానిక వైద్య సభలలో కాఫీలు 

కం. ఎల్లప్పుడు వైద్యములోఁ
గొల్లలుగా మార్పులొదవుఁ ; గ్రొత్త విషయముల్
వెల్లడి యగు ఘన సభలం
దెల్లరుకును జ్ఞానమొదవు నేర్పడఁ గాఫీల్

( ఒదవు = కలుగు; ఏర్పడు = కలుగు , లభించు )

గంటల తరబడి  క్రొత్త విషయాలు బోధించే వైజ్ఞానిక సభలలో మధ్యమధ్యలో కాఫీలు పోస్తే ఉత్తేజవంతులై అంతా ఆ విషయాలను నేర్చుకొంటారు.

113. హెచ్చరిక కాఫీ 

కం. ‘ ఉగ్రోష్ణంబగు కాఫీ 
జాగ్రత్తగఁ జిందకుండ స్వస్థతఁ గొనుడున్,
శీఘ్రత వలద’ని నుడువగ
నగ్రమ్మున , నప్రమత్తు లరయుట మేలున్ !

( స్వస్థత = నింపాదిగ , క్షేమము ; అగ్రము = మీద , ముందు ; అప్రమత్తులు = జాగరూకత గలవారు ; అరయు = చూచు , గ్రహించు )

‘ చాలా వేడి కాఫీలను జాగ్రత్తగా మీద ఒలిపేసుకోకుండ నెమ్మదిగా తీసుకువెళ్ళాలి. తొందఱ కూడదని ‘ కాఫీ కప్పులమీద, మూతల మీద హెచ్చరికలు ఉంటాయి. అది క్రయ విక్రయదారులకు రక్షణ అట !

( 1994 లో ష్టెల్లా లీబెక్ అనే 79 సంవత్సరముల వనిత మెక్ డోనాల్డ్ రెష్టరెంటులో  $ 0.49  కాఫీ కొనుక్కొని దానికి పంచదార , పాలు కలుపుకొందుకు మూత తీసినపుడు కాఫీ ఆమె ఒడిలో ఒలికిపోయి చర్మము కాలిపోయి చర్మమార్పిడితో సహా  చికిత్స  హాస్పిటల్ లో తీసుకొన్నారు. మెక్ డోనాల్డ్ కంపెనీ నుంచి  2.39 మిలియన్ డాలర్లు గెలుచుకొన్నారు. కాఫీని 82-88 సెంటీగ్రేడు ఉష్ణోగ్రతతో అమ్ముటచేత చర్మములో మూడవ శ్రేణి కాల్పులు జరిగాయని అభియోగము . చివరకు $ 640,000 కు ఒప్పందము చేసుకొన్నారు.  )

114. లంచపు కాఫీ

కం. అంచెలుగా నెగఁబ్రాకెడి
లంచాలకు హద్దులేద ? లక్షల రూకల్
పంచెదరో కాఫీలకుఁ ?
గించిత్తును సిగ్గుపడరొ కేలును జాపన్ ?

( కేలు = చేయి )

కాఫీలకని వందలు , వేలు లంచాలు అడుగుతారుట . ఇక లక్షలకు చేరినా ఆశ్చర్యము అక్కరలేదు.


115. శస్త్రచికిత్సకులకు కాఫీలు 


( మా ప్రియతమ మిత్రుడు డా. చినబాబు, ఎమ్.ఎస్. శస్త్రచికిత్సకులకు కాఫీలు కావాలంటే వెనువెంటనే పంపించా.)

కం. శస్త్రచికిత్సల నలసిన
శస్త్రచికిత్సకులకుఁ దమ శ్రమ పాపుటకై
శస్త్రగృహములకుఁ గాఫీ
లస్త్రరయముతోఁ బనిచితి , నందెన బాబూ ?

( అస్త్రము = బాణము ; రయము = వేగము ; పాపు = తొలగు ; పనుచు = పంపు )

116. సుబ్బు - స్కూపీ  కాఫీ

మా సుబ్బుకు ( మా సహాధ్యాయి, ఆత్మీయమిత్రుడు డా. కట్టమూరి వెంకట సోమేశ్వర సూర్యభాస్కర రామకృష్ణ సుబ్రహ్మణ్యం )  వాళ్ళ స్కూపీకి చక్కని స్నేహమట. అడిగిమరీ  కాఫీ తన పళ్ళెములో  పోయించుకొని నాకుచు సంతోషముగా సుబ్బుతో  నడక , పరుగులు పెట్టేదట విశాఖపట్టణపు సొగసులు చూడడానికి. పాపం 18 సంవత్సరాలు బ్రతికి 2020 ఆగష్టులో ‘సరమ ‘ దగ్గఱకు వెళ్ళిపోయిందట. మా సుబ్బు కోరికపై వ్రాసిన పద్యము.


కం. సుబ్బుకు  శ్వానము స్కూపీ

కబ్బెను నెయ్యమి, యొసంగ  నాతడు కాఫీ
దబ్బున నాకుచు, హేపీ
సుబ్బడుతోఁ గాంచుఁ  బురపు సొగసులు స్కూపీ !

( శ్వానము = కుక్క ; దబ్బున = శీఘ్రముగా ; సరమ = దేవతల కుక్క )
( ఈ పద్యము స్కూపీకి అంకితము )

117. భక్తజనులకు కాఫీలు

కం. కొండలఁ గోనల దైవమ !
‘దండము నీ’కనుచుఁ గొలువ దవ్వులు సాగే
తండములకుఁ గాఫీలను,
దండిగ సమకూర్చు జనులు ధన్యులు ధరలో !

( దవ్వులు = దూరదేశాలు ; తండము  = ప్రజాసమూహము )

( తన అమర్ నాథ్ యాత్రానుభవాలు చెప్పిన ప్రియతమ సుబ్బుకు ధన్యవాదములు )

118. అమావస్య కాఫీ

కం. అమవస రాతిరి కన్నులఁ
దిమిరము గడుదట్టమయినఁ, దెరలుదెరలుగాఁ
దమి గొని కాఫీ గ్రోలిన
శమియించును, మది వెలుంగు సంతోషముతో .

( తిమిరము = చీకటి; తమి = మోహము; శమియించు = శాంతిబొందు )

119. వార్తల కాఫీ



కం. మార్తాండుం డుదయించగ
వార్తాపత్రికలు చేరు వాసంబులలో ;
వార్తలు చదువుచుఁ గాఫీ
కర్తవ్యంబనుచుఁ గ్రోలి కదలదె జగతిన్ !

( మార్తాండుడు = సూర్యుడు : వాసము = ఇల్లు )

120. చికమగళూర్ కాఫీ

విజయవాడలో చికమగళూర్ కాఫీ అంగడి 

కం. ఒక కప్పుడు కాఫీకై
చికమగళూర్ పోవనేలఁ జిఱుచిఱుమనుచున్ ?
జకచక చని బెజవాడకుఁ
జికమగళూర్ గాంచ దక్కుఁ జిక్కని కాఫీ ☕️ !

(బొమ్మ ప్రియమిత్రుడు డా. తాతా సాంబశివరావుది. పద్యము తనకే అంకితము)

121. ప్రేమతో కాఫీ


కం. హృదయములో పలు వీణెలు
ముదమారగ మీటుచుండ మోహన గీతుల్,
పెదవులవి మూగఁబోయిన,
నెద విప్పుచుఁ బ్రేమఁ జూపు నింపగు కాఫీ !

ముదము = సంతోషము ; ఎద = హృదయము

(బొమ్మ పంపించి, పద్యానికి ప్రేరణ అయిన ప్రియమిత్రుడు డా. అడుసుమిల్లి సుబ్రహ్మణ్యేశ్వర రావుకు కృతజ్ఞతలు.)

122. సెగ కాఫీ

కం. ధగధగ మెఱసే బొగ్గులు
భగభగ మని మండుచుండ భాసురలీలన్
సెగకాఫీ సేవించే
మగటిమికిని మాఱు గలదె మహిలోఁ దలపన్ !

( భాసురము = ప్రకాశవంతము ; మగటిమి = శౌర్యము  ; మాఱు = సాటి ; మహి = భూమి.)


https://www.youtube.com/watch?v=VNiiMaiux-0


123. ☕️ దానఫలం 


కం . ప్రతి దినమును బదిమందికి
వ్రతముగఁ గాఫీల నొసగఁ బడసెడి ఫలముల్
శత గోదానములకు సరి ;
హితములు సేకూర్చు మీకు నీశ్వరుడు గృపన్ . 

🙏🙏🙏🙏🙏🙏 

( అంతర్జాలము నుంచి కొన్ని చిత్రములు సంగ్రహించాను. చిత్రకారులెవరో తెలియదు. ఆ అజ్ఞాత  చిత్రదాతలకు నా కృతజ్ఞతలు. పద్యాలకు కారకులైన మా సహాధ్యాయులకు , పాఠకమహాశయులకు ధన్యవాదములు. నా పద్యాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చును. 🙏🙏 ).


15, మార్చి 2022, మంగళవారం

నిద్రలో అవరోధ శ్వాసభంగములు ( Obstructive Sleep Apnea )

 ( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )

నిద్రలో అవరోధ శ్వాసభంగములు 

( Obstructive Sleep Apnea)

డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి

నిద్రపోతున్నపుడు కొందఱిలో ఎగువ శ్వాసపథము ( ఊర్థ్వ శ్వాసపథము ) అణగిపోయి శ్వాసకు అవరోధము కలుగుట వలన శ్వాస ప్రయత్నములు జరిగినా మధ్యమధ్యలో కొన్నిసారులు ఊపిరి పూర్తిగా ఆగిపోయి శ్వాసభంగములు ( apneas ), కొన్నిసారులు శ్వాస పరిమాణము తక్కువై అల్పశ్వాసలు (hypopneas ) కలుగవచ్చు. కొన్ని సారులు ఊపిరి తీసుకొనుట శ్రమతో కూడుకున్నదై నిద్ర చెదిరి మెలకువలు రావచ్చును. ఈ శ్వాససంక్షోభాలు వయోజనులలో సుమారు 4 శాతము మందికి కలుగుతాయి. ఇవి పురుషులలో స్త్రీల కంటె రెట్టింపు సంఖ్యలో కలుగుతాయి. ఈ వ్యాధి కలవారిలో పగటిపూట నిద్రమత్తు ఎక్కువగా ఉంటుంది.
గొంతులో మృదుకణజాలము ( soft tissue ) పెరుగుట వలన, లేక నిర్మాణాత్మకమైన కారణముల వలన, గళవ్యాకోచ కండరముల బిగుతు తగ్గుట వలన శ్వాసమార్గము సన్నబడుట, లేక పూర్తిగా అణగిపోవుట వలన ఊపిరికి అడ్డంకి కలిగి ఈ సంక్షోభాలు కలుగుతాయి. స్థూలకాయము కలవారిలోను, నాసికామార్గములో అవరోధముల వలన, నాసికాగళములో ( nasopharynx ) రసికణజాలములు ( adenoids ) పెద్దవగుట వలన, గొంతులో రసికణ గుళికల ( tonsils ) పెరుగుదల వలన, మృదుతాలువు, కొండనాలుకలు బాగా క్రిందకు దిగుట వలన, నాలుక మందము పెరుగుట వలన, క్రింది దవుడ పరిమాణము స్థానములలో మార్పుల వలన, పొగత్రాగుట వలన, కుటుంబపరముగా శ్వాసావరోధములు కలుగుట వలన ఈ సంక్షోభములు కలుగుతాయి. ఎక్కువ బరువు / స్థూలకాయములు నిద్రలో శ్వాసావరోధములు కలుగుటకు ముఖ్యకారణము.

కేంద్ర నాడీమండల శ్వాసభంగములు ( Central apneas ) 


కేంద్రనాడీమండలములో శ్వాసకేంద్రముపై, మాదకద్రవ్యములు, సారాయి, వ్యాధులు, గాయముల ప్రభావము వలన లేక ఏ కారణము లేకుండానే నిద్రలో శ్వాసభంగములు కలుగవచ్చును. కేంద్ర శ్వాసభంగములలో శ్వాసప్రయత్నములు జరుగవు. అవరోధ శ్వాసభంగములలో శ్వాస ప్రయత్నములు జరుగుతాయి.

ఇతర రుగ్మతలు , ఉపద్రవములు

నిద్రలో అవరోధ శ్వాసభంగములు కలవారిలో అధిక రక్తపుపోటు, హృదయవైఫల్యము ( congestive heart failure ), హృదయలయలో మార్పులు, గుండెపోటులు, మస్తిష్కవిఘాతాల ( Cerebrovascular accidents ) వలన పక్షవాతములు, రక్తములో ప్రాణవాయువు సంతృప్తత ( oxygen saturation ) తగ్గుట, బొగ్గుపులుసు వాయువు ప్రమాణములు పెరుగుట, పుపుసధమనులలో రక్తపుపోటు పెరుగుట ( pulmonary hypertension ), దీర్ఘకాల శ్వాసవైఫల్యములు ( chronic respiratory failure ) కలుగగలవు. వీరిలో మధుమేహవ్యాధి ఎక్కువగా ఉంటుంది. వీరు వాహనములు నడిపేటపుడు ప్రమాదాలకు గురి అయే అవకాశము హెచ్చు. సామాన్యజనులలో కంటె వీరిలో మరణములు కలిగే అవకాశము హెచ్చు.
వీరిలో శస్త్రచికిత్స అనుబంధ మరణములు హెచ్చుగా ఉంటాయి. మత్తుమందు ఇచ్చుటకు శ్వాసనాళములో కృత్రిమనాళము అమర్చేటపుడు ఇబ్బందులు, నిద్రమందులు / మత్తుమందుల నుంచి కోలుకొనుటలో ఇబ్బందులు దీనికి కారణము.

లక్షణములు

నిద్రపోతున్నపుడు గట్టిగా గురకలు పెట్టడం, నిద్రలో ఉక్కిరిబిక్కిరి అవడం, ఊపిరి ఆడక తఱచు మేలుకొనడం, పగటిపూట నిద్రమత్తు కలిగిఉండడం, పనులలో నిమగ్నత చూపించలేకపోవడం, వాహనములు నడిపేటపుడు నిద్రలోనికి జారుకొనడం వీరిలో కనిపించే ప్రధాన లక్షణములు. వ్యక్తిత్వములో మార్పులు, మేధక్షీణత, ఉదయము పూట తలనొప్పి, దీర్ఝకాలపు అలసట, రాత్రుళ్ళలో గుండెనొప్పులు, లైంగికవాంఛ తగ్గుట వీరిలో కలిగే ఇతర లక్షణాలు.
వైద్యులు రోగిని పరీక్షించునపుడు ముక్కు, నోరులలో అవరోధములకు శోధిస్తారు. ముక్కులో మధ్య గోడ ఒక పక్కకు ఒరిగి ఉండుట ( septal deviation ), నాసికాశుక్తులు ( nasal turbinates ) పెద్దవై ఉండడం, ముక్కు శ్లేష్మపు పొరలో వాపు, సాంద్రత హెచ్చుగా ఉండడం, నాలుక మందముగా ఉండడం, గొంతుకలో రసికణ గుళికలు ( tonsils ) పెద్దవై ఉండడం, మృదుతాలువు ( soft palate ), కొండనాలుకలు బాగా క్రిందకు ఉండడం, నోరు ఇరుకుగా ఉండడం, కనుగొనగలరు. కొందఱిలో తాలువు ( palate ) బాగా క్రిందగా ఉండి నోరు ఇరుకై కొండనాలుక, మృదుతాలువు నుంచి నాలుకకు, గొంతుకు దిగే తెరలు, గొంతు వెనుకభాగము నోరు తెఱచినపుడు కనిపించకపోవచ్చును. వీరి మెడ చుట్టుకొలత హెచ్చుగా ఉండవచ్చు.

పరీక్షలు

బహుళాంశ నిద్ర పరీక్ష ( polysomnogram ) : ఈ పరీక్షలో వీరు నిద్రిస్తున్నపుడు రాత్రి అంతా విద్యుత్ మస్తిష్క లేఖనము ( electroencephalogram ), నిద్రాసమయము, నిద్రలో కలిగే శ్వాస అంతరాయములు ( apneas ), అల్పశ్వాసలు ( hypopnoea ), శ్వాస ప్రయత్నము వలన కలిగే మెలకువలు నమోదు చేస్తారు. శ్వాసభంగ / అల్పశ్వాసల సూచిక ( Apnea / Hypopnoea Index, AHI ) గంటకు 5 మించుతే నిద్రావరోధ శ్వాసభంగ వ్యాధిని ధ్రువీకరించవచ్చును. వీరిలో AHI, పగటిపూటల మత్తు, అధిక రక్తపుపోటు, హృదయవైఫల్యము, పక్షవాతము వంటి ఉపద్రవముల బట్టి వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తారు.

ఇతర పరీక్షలు

రక్తకణ గణనములతో ఎఱ్ఱరక్తకణములు ఎక్కువై అప్రధాన బహుళ రక్తకణత్వము ( secondary polycythemia ) ఉంటే పసిగట్టవచ్చును. గళగ్రంథి స్రావకముల పరీక్షలతో గళగ్రంథి హీనత ( hypothyroidism ) పసిగట్టవచ్చును. ప్రాణవాయువు సంతృప్తతను ( oxygen saturation ) తెలుసుకొని అది తక్కువగా ఉంటే ధమనీ వాయు పరీక్షలు ( arterial blood gases ) చేసి బొగ్గుపులుసు వాయువు పాక్షిక పీడనము ( Pco2 ) 45 మి.మీ పాదరసము మించితే స్థూలకాయ శ్వాసహీనతను ( Obesity hypoventilation syndrome ) రూఢీ పఱచవచ్చు. ఛాతికి x- ray పరీక్ష , విద్యుత్ హృల్లేఖన పరీక్షలతో హృదయవైఫల్యము, ఇతర హృదయవ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు కనుగొనవచ్చును.

చికిత్స

నిద్రలో కలుగు శ్వాసకు అవరోధములు తొలగించి శ్వాసలను సరిచేయుట, రాత్రుళ్ళు నిద్రకు భంగము వాటిల్లకుండా చేయుట, పగళ్ళు నిద్రమత్తు కలుగకుండా చేయుట, ఉపద్రవములను సరిచేయుట చికిత్స లక్ష్యములు.
అవరోధ శ్వాసభంగములకు ప్రత్యేక ఔషధములు లేవు. పగటిపూట నిద్రమత్తు తగ్గించుటకు మొడాఫినిల్ ( Modafinil ) ఉపయోగపడవచ్చును.
గళవ్యాకోచ కండరముల బిగుతు తగ్గించి, శరీర బరువు పెంచే గళగ్రంథి హీనత వంటి వ్యాధులను మందులతో సరిదిద్దాలి.
అవరోధ శ్వాసభంగములు తక్కువ స్థాయిలో ఉన్నపుడు కారణములను సరిదిద్దుటకు ప్రయత్నాలు చేయాలి. వ్యాధిగ్రస్థులు బరువు తగ్గి స్థూలకాయములను తగ్గించుకోవాలి. తినే కాలరీలు తగ్గించుకొని నడక, వ్యాయామము పెంచుకోవాలి. పది శాతము బరువు తగ్గినా ప్రయోజనము చేకూరుతుంది. స్థూలకాయులు బరువు హెచ్చుగా ఉండి ( భారసూచిక / BMI 40 kg / m2 మించిన వారు ) శస్త్రచికిత్సలతోనైనా బరువు తగ్గుట మంచిది.
మత్తు, నిద్ర కలిగించు ఔషధములు, మద్యము పడుక్కొనే ముందు నాలుగు గంటల లోపల సేవించకూడదు. ధూమపానము చేయకూడదు.
నాసికాపథములో సాంద్రత తగ్గించే మందులు ( decongestants ), కార్టికోష్టీరాయిడు జల్లుమందులు ముక్కులో ఊపిరికి అడ్డంకులు తొలగించగలవు. వీరిలో కొందఱికి క్రింది దవుడను, నాలుకను ముందుకు జరిపి గొంతును ( వక్త్రగళము / oropharynx ) ) తెరిచి ఉంచే సాధనములు ఉపయోగపడవచ్చును. ప్రక్కకు తిరిగి పడుక్కొనుట వలన శ్వాసకు అవరోధము తగ్గే అవకాశము కలదు. నిద్రమత్తు గలవారు వాహనములు నడుపరాదు.

నిరంతర శ్వాసపథ సంపీడన సాధనములు (Continuous Positive Airway Pressure devices)

ఈ సాధనములు శ్వాసపథములోనికి నిర్ణీత పీడనముతో నిరంతరము గాలిని పంపి శ్వాసపథమును తెరచి ఉంచుతాయి. నోరు, ముక్కులపై కప్పుతో ( mask ) గాని,లేక ముక్కుపై కప్పు సాధనముతో గాని గాలిని శ్వాసపథములోనికి రోగులకు అనుకూలము అయేటట్లు పంపవచ్చును. శ్వాసకు అడ్డంకులు తొలగించేటట్లు, గుఱకలు లేకుండేటట్లు, రక్తపు ప్రాణవాయువు సంతృప్తత ఆమోదకరముగా ఉండేటట్లు వాయు పీడనమును అంచెలుగా పెంచి సరిదిద్దుతారు. నిరంతరము శ్వాసపథములోనికి గాలిని తగిన పీడనముతో పంపుట వలన శ్వాసక్రియ మెరుగయి రాత్రుళ్ళు నిద్ర బాగాపట్టి పగళ్ళు మత్తు లేకుండా ఉంటుంది. అధిక రక్తపుపోటు, హృదయవైఫల్యము, కాళ్ళపొంగులు, రాత్రులలో అధిక మూత్రవిసర్జన, బహుళ రక్తకణత్వము ( polycythemia ) వంటి ఉపద్రవములు తగ్గుతాయి.
నిరంతర వాయుపీడన సాధనములను శ్రద్ధగా విడువక వాడుటకు కొందఱు ఇష్టపడరు. వీటి ఉపయోగములు బోధించుట వలన, గాలిని వెచ్చపరచి, ఆర్ద్రీకరించుట ( humidify ) వలన, కప్పుసాధనములను సౌకర్యకరముగా చేయుట వలన వాడుకలు పెంచే అవకాశము కలదు.
ప్రసరణ ( flow ), పీడనములను ( pressure ) తగునట్లు వాటంతట అవే సరిదిద్దుకొనే సాధనములు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కువమందికి అవి ఆమోదకరము కావచ్చును.

ద్విస్థాయి శ్వాసపథ సంపీడన సాధనములు ( Bilevel Positive Airway Pressure devices )

నిరంతరవాయుపీడన సాధనములను సహించలేని వారికి, 15- 20 సెం.మీ నీటి పీడనము మించిన పీడనము అవసరమైనవారికి, శ్వాస సరిపోదు అనుకున్నపుడు ఊచ్ఛ్వాస నిశ్వాసములలో వేఱు వేఱు పీడనములతో గాలిని అందించు సాధనములు ఉపయోగకరము.
ఈ సాధనముల వాడుక వలన ముక్కు, నోరు ఎండిపోవుట, ముక్కులో సాంద్రత ( congestion )కలుగుట, ముక్కు కారుట, ముక్కునుంచి రక్తస్రావము కలుగుట వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చు. గాలిని ఆర్ద్రీకరించుట ( humidify ) వలన, ముక్కులో సాంద్రత తగ్గించు మందులు వాడుట వలన, ముక్కులో లవణద్రవము (saline) వాడుట వలన ఈ అవలక్షణములను నివారించవచ్చును.
ప్రాణవాయువు సంతృప్తత తక్కువగా ( 90% కంటె తక్కువ ) ఉన్నవారికి ప్రాణవాయువు ఈ సాధనములతో అందించాలి.

శస్త్రచికిత్సలు

గళ వ్యాకోచ చికిత్స ( Uvulo palato pharyngoplasty ) 


ఈ శస్త్రచికిత్స వక్త్రగళ ( oropharynx ) పరిమాణము తగ్గిన వారిలో, శ్వాసపథ సంపీడన చికిత్సతో ఫలితములు చేకూరనపుడు ఉపయోగపడవచ్చును. ఇందులో కొండనాలుకను, మృదుతాలువులో ( soft palate ) వెనుక భాగమును మృదుతాలువు నుంచి నాలుక, గొంతులకు క్రిందకు దిగు తెరలను, రసిగుళికలను ( tonsils ) తొలగించి వక్త్రగళ ( oropharynx ) పరిమాణమును పెంచుతారు. ఈ శస్త్రచికిత్స చేసిన వారిలో 50 శాతము మందిలో సత్ఫలితాలు కలుగుతాయి. వీరిలో మాటమార్పు , మ్రింగునపుడు ఆహారపదార్థములు ముక్కులోనికి తిరోగమనము చెందుట, నాసికా గళము కుచించుకుపోవుట వంటి అవాంఛిత ఫలితాలు కలుగవచ్చు. సత్ఫలితాలు దీర్ఘకాలము ఉండకపోవచ్చును.

శ్వాసనాళ కృత్రిమ ద్వార చికిత్స ( Tracheostomy ) :

 
ఇతర చికిత్సలతో ఫలితములు చేకూరనపుడు, నిద్రావరోధ శ్వాసభంగము తీవ్రతరమైనపుడు, ప్రాణాపాయ పరిస్థితులు ( శ్వాసరోగ సంబంధ హృదయవైఫల్యము (carpulmonale), హృదయ లయ తప్పుట, శ్వాసవైఫల్యము) ఏర్పడినపుడు శ్వాసనాళములో కృత్రిమద్వారము ఏర్పరచి శ్వాసావరోధములను అధిగమించవచ్చును.
శ్వాసపథములో వాయుసంపీడన చికిత్సలు చాలా మందిలో సత్ఫలితాలు ఇవ్వడం వలన ఈ కృత్రిమద్వార చికిత్సల అవసరము తగ్గిపోయింది.
క్రింది, పై దవుడలను ముందుకు జరుపుట, క్రిందిదవుడలో కొంతభాగము ఛేదించుట, కంఠాస్థి కండర ఛేదనము ( hyoid myotomy ) వంటి శస్త్రచికిత్సలు ప్రయోగపరముగా లభ్యము.

( వైద్యవిషయాలు తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము . వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను సంప్రదించాలి. )

16, ఫిబ్రవరి 2022, బుధవారం

ఊర్ధ్వ శ్వాసపథము



 

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )



                     ఊర్ధ్వ శ్వాసపథము 

                     ( Upper Airway )


                                                                             డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి                 

     మనము ఉచ్ఛ్వాసములో ముక్కుద్వారా తీసుకొనే గాలి ఊపిరితిత్తులకు చేరుతుంది. నిశ్వాసములో ఊపిరితిత్తుల నుంచి గాలి ముక్కు ద్వారా విసర్జింపబడుతుంది. ముక్కునుంచి స్వరపేటిక వఱకు గల శ్వాసమార్గము ఊర్ధ్వ శ్వాసపథము ( ఎగువ శ్వాసమార్గము / upper airway ). స్వరపేటిక నుంచి ఊపిరితిత్తుల వఱకు ఉన్న శ్వాసమార్గము అధో శ్వాసపథము (దిగువ శ్వాసమార్గము / lower airway).

ముక్కు 

    ముక్కు ముందున్న రెండు రంధ్రములతో ( పూర్వ నాసికా రంధ్రములు / anterior nares ) వాతావరణముతో అనుబంధము కలిగి ఉంటుంది.    ముక్కులో ఉన్న మధ్య గోడ ( septum ) ముక్కును రెండు భాగములుగా విభజిస్తుంది. ముక్కులోపల ప్రతిపక్కా ప్రక్క గోడలో మూడు నాసికాశుక్తులు ( nasal turbinates / nasal conchae ) ఒకదాని క్రింద వేఱొకటి ఉంటాయి. ఆ శుక్తులు క్రింద నాసికాకుహరముల ( paranasal sinuses ) ద్వారములు తెరుచుకొని ఉంటాయి.

     ముక్కు  వెనుక ఉన్న రంధ్రముల ( పర నాసికారంధ్రములు / posterior nares ) ద్వారా గొంతుతో కలుస్తుంది. గొంతునే గళము , సప్తపథ ( pharynx ) అని కూడా పిలుస్తారు. ముక్కుకు నోటికి మధ్య అంగిలి ( తాలువు / palate ) ఉంటుంది. తాలువు ముందు భాగము కఠినతాలువులో ఎముక ఉంటుంది. తాలువు వెనుక భాగము మృదుతాలువులో ఎముక ఉండదు.

                        సప్తపథ ( గళము )                                స్వరపేటిక - స్వరతంత్రులు
   
                                                         

సప్తపథ ( గళము / Pharynx ) 

    గొంతు ( గళము ; సప్తపథ - Pharynx ) ముక్కును స్వరపేటిక తోను, ఊపిరితిత్తులతోను, నోటిని అన్ననాళముతోను కలిపే కండరపు గొట్టము. గొంతు లోపలి భాగము శ్లేష్మపుపొరతో ( mucous membrane ) కప్పబడి ఉంటుంది. ముక్కు వెనుక రెండు రంధ్రములు ( పర నాసికారంధ్రములు / posterior nares ), మధ్య చెవులను గొంతుతో కలిపే రెండు శ్రవణ గళ నాళికల ద్వారములు ( Eustachian tubes ), నోటి ద్వారము ( వక్త్రగళ ద్వారము / fauces ), స్వరపేటిక, అన్ననాళము, మొత్తము ఏడు మార్గములు సప్తపథతో కలిసి ఉంటాయి.

నాసికాగళము ( ( Nasopharynx )


    గొంతు లేక గళములో మూడు భాగములు ఉంటాయి. ముక్కు వెనుకను, మృదుతాలువునకు (soft palate) పైనా ఉండు గొంతు భాగము నాసికాగళము ( Nasopharynx ). నాసికాగళములోనికి రెండు ప్రక్కలా శ్రవణగళ నాళికల (Eustachian tubes ) ద్వారములు తెరుచుకుంటాయి. ఈ శ్రవణగళ నాళికలు మధ్యచెవులను ( middle ears ) గొంతుతో కలుపుతాయి. నాసికాగళము ముందు భాగములో ముక్కు వెనుక రంధ్రములు ( posterior nares ) తెరుచుకుంటాయి. వెనుక భాగములో శ్లేష్మపు పొర క్రింద దళసరి రసికణజాల రాశులు ( lymphoid tissue / adenoids  ) ఉంటాయి.

వక్త్రగళము ( Oropharynx )


   నోటి వెనుక ఉండు గొంతు భాగము వక్త్రగళము ( Oropharynx ). ఈ భాగము అంగిలి ( తాలువు / palate) నుంచి కంఠికాస్థి ( hyoid bone ) వఱకు ఉండే గళభాగము. మృదుతాలువు నుంచి రెండు పక్కలా నాలుక మూలమునకు ఒకటి, గళమునకు ఒకటి  తెరలు ( tonsillar pillars ) క్రిందకు దిగుతాయి. ఈ తెరల నడిమిలో (గళ) రసికణజాల గుళికలు ( tonsils ) ఉంటాయి. మృదుతాలువు మధ్యభాగము నుంచి కొండనాలుక ( ఉపజిహ్వ / uvula ) గొంతులోనికి వ్రేలాడుతుంది.

అధోగళము ( Hypo pharynx )


     కంఠికాస్థి ( hyoid ) నుంచి అన్ననాళ ప్రవేశద్వారము వఱకు ఉండు గొంతు భాగము అధోగళము ( Hypo pharynx ). దీనిలో ముందుభాగములో స్వరపేటిక ఉంటుంది. స్వరపేటికకు మీద నాలుక మూలములో స్వరపేటిక మూత ( epiglottis ) ఉంటుంది. ఆహారమును శ్వాసపథమునుంచి తప్పించి అన్ననాళమువైపు మరలించుటకు ఈ స్వరపేటిక మూత తోడ్పడుతుంది. స్వరపేటికకు ఇరుప్రక్కల కాయల ఆకారపు గుంతలు ( pyriform fossae ) ఉంటాయి. 

   సప్తపథము స్వరపేటిక క్రింద ఉండే ముద్రికా మృదులాస్థి ( cricoid cartilage ) వెనుక, ముద్రికా గళ నియంత్రణ కండరము ( crico pharyngeal sphincter ) క్రింద అన్ననాళముగా కొనసాగుతుంది. ముద్రికా మృదులాస్థి ( cricoid cartilage ) ఉంగరపుటాకారములో ఉంటుంది.



విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...