23, డిసెంబర్ 2019, సోమవారం

కణతాపము ( Cellulitis )

తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో :

                                       కణతాపము 

                                    ( Cellulitis )

                                        
                                                                                   డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.
                                                                                                   

    మనకు  కొన్ని వ్యాధులు యితర జీవరాశుల వలన కలుగుతాయి. వీనిలో సూక్ష్మాంగ జీవులు ( bacteria ) శరీరముపై దాడిచేసి కొన్ని ఆక్రమణ వ్యాధులకు ( infections ) కారణము అవుతాయి .

     
సూక్ష్మాంగ జీవులు ( Bacteria ) 


    సూక్ష్మాంగ జీవులు ఏకకణ జీవులు. వీటికి కణ కవచము, కణ వేష్టనము ఉన్నా, పొరలలో అమరిన న్యూక్లియస్లు , మైటోఖాండ్రియాలు ఉండవు. సూక్ష్మ జీవులను గ్రామ్స్ వర్ణకము చేర్చి సూక్ష్మదర్శిని క్రింద చూసి అవి గ్రహించు వర్ణకముల బట్టి గ్రామ్ పోజిటివ్, గ్రామ్ నెగెటివ్ సూక్ష్మ జీవులుగా విభజిస్తారు. గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు ఊదా రంగులో ఉంటాయి. గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులు గులాబి రంగులో ఉంటాయి. ఆకారమును బట్టి వీనిని గోళ సూక్ష్మజీవులు ( cocci ), కోలలు ( rods ), సర్పిలములుగా ( spirals ) వర్ణిస్తారు. చాలా సూక్ష్మాంగ జీవులు మన శరీరము పైన, శరీరము లోపల హాని కలిగించకుండా జీవిస్తున్నా, కొన్ని  అవకాశము చిక్కినపుడు శరీర అవయవములు, కణజాలముల లోనికి చొచ్చుకొని వ్యాధులు కలిగిస్తాయి. కొన్ని సూక్ష్మ జీవులు కలుషిత ఆహారము, కలుషిత పానీయములు, లేక కలుషిత వాయువు ద్వారా శరీరము లోనికి ప్రవేశించి వ్యాధులకు కారణమవుతాయి.

    గ్రామ్ పోజిటివ్ గోళ సూక్ష్మజీవులలో ష్టాఫిలోకోక్సై ( staphylococci ) గుంపులుగా రెండు, నాలుగు లేక అధికసంఖ్యలో గుమికూడి సూక్ష్మదర్శిని క్రింద ద్రాక్ష గుత్తుల వలె కనిపిస్తాయి. ఇవి విరివిగా చర్మముపైన, శ్వాస పథములోను నివసిస్తాయి.

     ష్ట్రెప్టోకోక్సై కూడా గోళాకారపు గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు. ఇవి వరుసలలో గొలుసుల వలె ఉంటాయి. కొన్ని జాతుల ష్ట్రెప్టోకోక్సై చర్మము పైన, శ్వాస పథములోన, ప్రేవుల లోను హాని కలిగించక ఉంటాయి. కొన్ని అవకాశము చిక్కినపుడు వ్యాధులకు కారణము అవుతాయి. శరీర కణజాలముపై ఇవి దాడి చేసినపుడు వీటి నుంచి జనించే  జీవ విషములు ( toxins ) వ్యాధులను కలుగజేస్తాయి.


కణ తాపము ( Cellulitis ) 


    చర్మము లోనికి సూక్ష్మాంగజీవులు చొచ్చుకొని, వృద్ధిచెంది లోపలి చర్మములోను, అధశ్చర్మ ( చర్మము కింద ) కణజాలములోను తాపము ( inflammation ) కలిగించగలవు. గ్రూప్ ఎ హీమొలైటిక్  ష్ట్రెప్టోకోకై  ( group A hemolytic streptococci ), ష్టాఫిలోకోకస్ ఆరియస్ ( Staphylococcus aureus ) సూక్ష్మజీవులు వలన సాధారణముగా ఈ చర్మాంతర కణజాల తాపము ( Cellulitis  ) కలుగుతుంది.

    స్ట్రెప్టోకోక్సై ( streptococci ) వలన కలిగే కణజాల తాపము త్వరితముగా వ్యాప్తిచెందుతుంది. ఈ సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే స్ట్రెప్టోకైనేజ్ ( streptokinase ), హయలురానిడేజ్ ( hyaluronidase ), డి ఎన్ ఏజ్ ( Dnase ) వంటి జీవోత్ప్రేరకములు ( enzymes  ) కణజాల బంధనములను విచ్ఛేదించి సూక్ష్మజీవుల కట్టడికి ఆటంకము కలుగజేస్తాయి.

    స్టాఫిలోకోక్సై ( staphylococci ) వలన కలిగే కణ తాపము త్వరగా వ్యాపించక కొంత ప్రాంతమునకు, గాయములకు, చీము తిత్తులకు ( abscesses ) పరిమితమై ఉంటుంది.
      


    లో చర్మము ( dermis ), అధశ్చర్మ కణజాలములో ( subcutaneous tissue ) కలిగే ఈ తాపము వలన ఉష్ణము, ఎఱ్ఱదనము, వాపు, నొప్పి వంటి తాప లక్షణములు ( signs of inflammation  ) కనిపిస్తాయి. ఆ శరీర భాగమును తాకితే నొప్పి ( tenderness ) కలుగుతుంది. ఆ భాగములో మృదుత్వము తగ్గి గట్టితనము ( induration ) ఏర్పడుతుంది. రోగులకు  జ్వరము కలుగవచ్చును. సూక్ష్మజీవులు రసినాళికల ( lymhatics ) ద్వారా సమీపపు రసిగ్రంథులకు ( lymph glands ) వ్యాపిస్తే ఆ గ్రంథులు తాపముతో పెద్దవయి నొప్పి కలిగించవచ్చును. ఆ గ్రంథులలో చీముతిత్తులు ( abscesses ) ఏర్పడవచ్చును.

    కణ తాపమునకు సత్వర చికిత్స అవసరము. చికిత్సలో ఆలస్యము జరిగితే కణ తాపము వ్యాపించి సూక్ష్మజీవులు రక్తములోనికి ప్రవేశించి యితర అవయవములకు చేరగలవు. స్థానికముగా తెల్లకణములు ( Leukocytes ), యితర భక్షక కణములు ( phagocytes ) సూక్ష్మజీవులను కబళించి, వాటిని చంపుట వలన, అవి మరణించుట వలన, ఆ ప్రాంతములో కణముల విధ్వంసము వలన, చీము ఏర్పడి చీముతిత్తులు ( abscesses ) ఏర్పడగలవు. రక్తములో సూక్ష్మజీవులు చేరి రక్తమును సూక్ష్మజీవ విషమయము ( bacterial sepsis ) చేయవచ్చును.

      కణజాల తాపము సాధారణముగా గ్రూప్ బి హీమొలైటిక్ స్ట్రెప్టోకోక్సై ( gropup B hemolytic streptococci. eg . Streptococcus pyogenes ) వలన కలుగుతుంది. కొందఱిలో Staphylococcus aureus వలన కలుగుతుంది. ఈ స్టాఫిలోకోక్సై ఆరియస్ మిథిసిల్లిన్ కు లొంగనివి ( Methicillin resistant  Staphylococcus Aureus MRSA ) కావచ్చును

    పెనిసిలిన్ కనుగొనబడిన కొత్తలో చాలా సూక్ష్మజీవులు, స్టాఫిలోకోక్సైలు పెనిసిలిన్ కు లొంగేవి. సూక్ష్మజీవుల కణములు విభజన పొందునపుడు కణకుడ్యముల ( Cell walls ) నిర్మాణమునకు పెనిసిలిన్ అంతరాయము కలిగిస్తుంది. అందువలన సూక్ష్మజీవులు వృద్ధి చెందజాలవు. శరీర రక్షణ వ్యవస్థ  ఉన్నవాటిని ధ్వంసం చేస్తుంది. 

    కొద్ది సంవత్సరములలో పెనిసిలినేజ్ ( Penicillinase ) అనే జీవోత్ప్రేరకమును ఉత్పత్తి చేసి, పెనిసిలిన్ లోని బీటా లాక్టమ్ చక్రమును ( beta-lactam ring ) ధ్వంసము చేసి, పెనిసిలిన్ కు లొంగని స్టాఫిలోకోక్సై విరివిగా వ్యాప్తి పొందాయి. వాటికి విరుగుడుగా శాస్త్రజ్ఞులు పెనిసిలినేజ్ కు ( Penicillinase, also known as beta lactamase )  విచ్ఛిన్నము కాని పెనిసిలిన్లను ( penicillinase resistant Penicillins ) కనుగొన్నారు. వీటిలో మిథిసిలిన్ ( methicillin ) మొదటిది. ఆక్సాసిల్లిన్ ( Oxacillin ), క్లాక్సాసిల్లిన్ ( Cloxacillin ), డైక్లాక్సాసిల్లిన్ లు (dicloxacillin ) ఈ కోవకు చెందినవి.

    కొన్నేళ్ళకు మిథిసిల్లిన్ కు లొంగని స్టాఫిలోకోక్సై ( Methicillin-Resistant Staphylococcus Aureus : MRSA ) వృద్ధిచెందాయి. వీటి కణకుడ్యముల నిర్మాణమునకు తోడ్పడు  ట్రాన్స్ పెప్టైడేజులపై ( meca అనే జన్యువుల  వలన ) బీటాలాక్టమ్ ల ప్రభావము ఉండదు. అందువలన బీటాలాక్టమ్ ల సమక్షములో కూడ MRSA కణ విభజనతో వృద్ధి  పొందుతాయి.


కణజాల తాపమును ( Cellulitis ) అరుదుగా కలిగించు సూక్ష్మజీవులు 


     వృద్ధులలోను, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను గ్రూప్ బి ష్ట్రెప్టోకోక్సై ( స్ట్రెప్టోకోకస్ ఏగలక్టియా, Streptococcus agalactiae ) వలన, పిల్లలలో హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా ( Haemophilus influenza ) వలన, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను, తెల్లకణముల హీనత ( Leukopenia ) కలవారిలోను, వేడినీటి తొట్టెలలో స్నానము చేసేవారిలోను సూడోమొనాస్ ఏరుజినోసా ( Pseudomonas aeruginosa ) వలన చర్మాంతర కణజాల తాపములు కలుగగలవు.

    పిల్లి కాట్లు పిదప పాస్ట్యురెల్లా మల్టోసిడా ( pasteurella multocida ) వలన, కుక్కకాట్లు పిమ్మట కాప్నోసైటోఫగా Capnocytophaga వలన, మంచినీటి కొలనుల మునకలలో గాయముల తర్వాత Aeromonas hydrophila వలన, ఉప్పునీటి మునకలలో గాయముల పిదప Vibrio Vulnificus వలన కణజాల తాపములు కలుగవచ్చును.

    ఒరుపులు, దెబ్బలు, శిలీంధ్ర వ్యాధులు ( fungal infections ) గలవారిలోను, ఉబ్బుసిరలు గలవారిలో చర్మ తాపము కలుగునపుడు, బోదకాలు వ్యాధిగ్రస్థులలో చర్మము చిట్లినపుడు సూక్ష్మజీవులు చర్మములోనికి చొచ్చుకొని చర్మాంతర కణతాపము ( cellulitis ) కలిగించే అవకాశము ఉన్నది.


 కణజాలతాప లక్షణములు 


    చర్మాంతర కణతాపము శరీరములో ఎచటనైనా కలుగవచ్చు. కాని సాధారణముగా కాళ్ళలో కలుగుతుంది.దీని వలన  చర్మము ఎఱ్ఱబారుతుంది. వాపు కనిపిస్తుంది. వాపుతో చర్మము దళసరి చెంది నారింజ పండు తొక్కను ( peu d’ orange ) పోలి ఉంటుంది. రక్తప్రసరణ హెచ్చగుట వలన ఆ భాగము వెచ్చగా ఉంటుంది. రోగికి నొప్పి ఉంటుంది. తాకినా, అదిమినా చాలా నొప్పి కలుగుతుంది. ఆ భాగము నుంచి ముందు దిశలో ఎఱ్ఱగా ఉబ్బిన రసినాళములు ( lymphatics ) గీతలు వలె కనిపించవచ్చు. తాపము బారి పడిన భాగపు అంచులు స్పష్టముగా ఉండవు. కేశరక్తనాళికల నుంచి రక్తము స్రవించుటచే ఎఱ్ఱని చిన్న మచ్చలు కనిపించవచ్చును. చర్మముపై నీటిపొక్కులు ( vesicles ), బొబ్బలు ( bullae ) ఏర్పడవచ్చును. బొబ్బలు చిట్లి రసి కారవచ్చును. సూక్ష్మజీవులు రసినాళికల ( lymphatic channels) ద్వారా ఆ ప్రాంతీయపు  రసిగ్రంథులకు ( lymph nodes ) ( గజ్జలలోను, చంకలలోను, దవడ కింద )  వ్యాపిస్తే ఆ రసిగ్రంథులు ( lymph nodes ) వాచి, నొప్పి కలిగించవచ్చును. చికిత్స ఆలస్యమయితే చీముపొక్కులు ( pustules ), చీముతిత్తులు ( abscesses ) ఏర్పడవచ్చును.

    జ్వరము, తలనొప్పి, చలి, వణుకు, మతిభ్రంశము ( Delerium ), రక్తపీడనము తగ్గుట ( hypotension  ) రక్తములో సూక్ష్మజీవుల వ్యాప్తిని ( sepsis ), వ్యాధి తీవ్రతను సూచిస్తాయి.


 వ్యాధి నిర్ణయము 


    రోగిని పరీక్షించి వైద్యులు రోగ నిర్ణయము చేయగలరు. ఎఱ్ఱదనము, ఉష్ణము, వాపు, నొప్పి తాప లక్షణములు వీరిలో ఉంటాయి. వాపు వలన గట్టితనము కలుగుతుంది. మధ్యలో మృదుత్వము చీమును సూచిస్తుంది. అవసరమయినపుడు శ్రవణాతీతధ్వని చిత్రీకరణముతో ( ultrasonography  ) చీముతిత్తులను నిర్ధారించవచ్చును.

    వ్యాధి నిర్ణయమునకు  సాధారణముగా సూక్ష్మజీవుల పెంపకము ( Bacterial cultures ) అవసరము ఉండదు. జ్వరము, వణుకు ఉన్నవారిలోను, రక్షణ వ్యవస్థ లోపములు ( immune deficiency ) ఉన్నవారిలోను వారి రక్తముతో సూక్ష్మజీవుల పెంపకపు పరీక్షలు ( blood cultures ) సలుపవచ్చును. కణజాలము నుంచి కూడా సూక్ష్మజీవుల పెంపకము  ( tissue cultures ) చేయవచ్చును.

 
చికిత్స 


    చర్మాంతర కణజాల తాపమునకు చికిత్స సూక్ష్మజీవ నాశకములు ( Antibiotics ). సూక్ష్మజీవ నాశకములను త్వరగా మొదలు పెట్టుట వలన ఫలితములు బాగుంటాయి. వ్యాధి పూర్తిగా తగ్గే వఱకు వాటిని వాడాలి. ఆ శరీర భాగమును ఎత్తుగా ఉంచుట వలన, చల్లని తేమ కట్లు కట్టుట వలన ఉపశమనము కలుగుతుంది.
   
    పిండి కట్లు, తేనెకట్లు, మెగ్నీషియమ్ సల్ఫేట్ + గ్లిసరాల్ ( magnesium sulfate + glycerol ) కట్లు  ఆ శరీర భాగములో తేమను తీసుకొని  వాపు తగ్గించి ఉపశమనము కలిగిస్తాయి.

    డైక్లాక్సాసిల్లిన్ ( Dicloxacillin ), సెఫలెక్సిన్ ( cephalexin ), ఎజిథ్రోమైసిన్ ( Azithromycin ), క్లరిథ్రోమైసిన్ ( Clarithromycin ), లీవోఫ్లాక్ససిన్  ( Levofloxacin ), మోక్సీఫ్లాక్ససిన్ ( Moxifloxacin ), క్లిండామైసిన్ ( Clindamycin ) లలో ఒకదానిని ఎన్నుకొనవచ్చును.

    కుక్కకాట్లు, పిల్లికాట్లు వలన కణతాపము కలిగితే ఎమాక్ససిలిన్ / క్లావ్యులనేట్ ( Amoxicillin  / clavulanate ) ని వాడుతారు. పెనిసిలిన్ అసహనము ( sensitivity ) కలిగిన వారికి క్లిండామైసిన్ + సిప్రోఫ్లాక్ససిన్ ( Ciprofloxacin ) లేక మరో ఫ్లోరోక్వినలోన్ ( fluoroquinolone ) గాని, ట్రైమిథాప్రిమ్ / సల్ఫామిథాక్సజోల్ ( Trimethoprim / Sulfamethoxazole ) గాని వాడవచ్చును.

    స్టాఫిలోకోక్సై కణతాపము కలిగించునపుడు చీముపొక్కులు ( pastules ), చీముతిత్తులు ( abscesses ) ఏర్పడే అవకాశము హెచ్చు. చీముతిత్తులను శస్త్రచికిత్సతో కోసి, చీమును వెలువరించాలి. ఆక్సాసిల్లిన్ ( Oxacillin ), క్లాక్సాసిల్లిన్ ( Cloxacillin ), డైక్లాక్సాసిల్లిన్ ( Dicloxacillin ) వంటి పెనిసిలినేజ్ కు విచ్ఛిన్నము కాని పెనిసిలిన్ లను గాని, సెఫలెక్సిన్ ( Cephalexin ), సెఫడ్రాక్సిల్ ( Cefadroxil ) వంటి మొదటి తరము సెఫలోస్పోరిన్లను గాని వాడవచ్చును.
                 
    మిథిసిలిన్ కు లొంగని స్టాఫిలో కోక్సైలు ( Methicillin-Resistant Staphylococcus Aureus ) విరివిగా ఉండు సమాజములలోను, లేక పరిశోధన శాలలలో సూక్ష్మజీవుల పెంపకపు పరీక్షలలో  మిథిసెలిన్ కు లొంగని స్టాఫిలోకోక్సై ( MRSA ) పెరిగినపుడు, ట్రైమిథాప్రిమ్ / సల్ఫామిథాక్సజోల్ ( trimethoprim / slfaamethoxazole ), డాక్సీసైక్లిన్ ( doxycylnine ), క్లిండామైసిన్ ( Clindamycin ) లలో ఒక సూక్ష్మజీవి నాశకమును ఎంచుకోవాలి.
                  
    వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉన్నపుడు సిరల ద్వారా వేంకోమైసిన్ ( Vacomycin ) గాని, లినిజోలిడ్ ( Linezolid ) గాని, డాప్టోమైసిన్  ( Daptomycin ) గాని వాడుతారు.


పదజాలము :

Abscesses = చీము తిత్తులు ( గ.న )
Antibiotics = సూక్ష్మజీవ నాశకములు ( గ.న )
Bacteria = సూక్ష్మాంగజీవులు , సూక్ష్మజీవులు 
Bacterial cultures = సూక్ష్మజీవుల పెంపకము 
Bullae = బొబ్బలు 
Cellulitis = కణ తాపము (గ.న )
Cell walls = కణ కుడ్యములు ( గ.న )
Cocci  = గోళ సూక్ష్మాంగజీవులు ( గ.న )
Delerium = మతిభ్రంశము 
Enzymes  = జీవోత్ప్రేరకములు ( గ.న )
Fungal infections = శిలీంధ్ర వ్యాధులు 
Hypotension = రక్తపీడన హీనత ( గ.న )
Induration = గట్టితనము 
Infection = సూక్ష్మజీవుల దాడి ( గ.న )
Leukocytes = తెల్లకణములు 
Phagocytes = భక్షక కణములు 
Peau d’ orange = నారంగ చర్మము ( గ.న )
Pustules = చీము పొక్కులు ( గ.న )
Rods = కోలలు 
Sepsis = సూక్ష్మజీవ విషమయ రక్తము ( గ.న )
Signs of inflammation = తాప లక్షణములు 
Subcutaneous tissue = చర్మాంతర కణజాలము ; అధశ్చర్మ కణజాలము ( గ.న )
Spirals  = సర్పిలములు 
Toxins = జీవ విషములు 
Ultrasonography = శ్రవణాతీత ధ్వని చిత్రీకరణము ( గ.న )
Vesicles = నీటి పొక్కులు 

( వైద్యవిషయములను నా శక్తిమేరకు తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...