21, ఏప్రిల్ 2020, మంగళవారం

సత్వర మూత్రాంగ విఘాతము ( Acute kidney injury )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )


           సత్వర మూత్రంగ విఘాతము

                                       ( Acute Kidney Injury )

       
                                                                                       డా. గన్నవరపు నరసింహమూర్తి.                        .

                         
    శరీరములో వివిధ అవయవముల కణజాలములో జరిగే జీవవ్యాపార ప్రక్రియలో
( metabolism ) వ్యర్థ పదార్ధములు ఉత్పత్తి అయి రక్తములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థ పదార్థాలను రక్తము నుంచి ఎప్పటి కప్పుడు తొలగించి రక్తమును శుద్ధిచేసి శరీర అవయవములను పరిరక్షించి శరీర వ్యాపారమును ఆరోగ్యకరముగా నడిపించుట చాలా అవసరము. జంతుజాలములోను పక్షులలోను ఆ బాధ్యత మూత్రాంగములు ( Kidneys ) నిర్వహిస్తాయి.

    మూత్రాంగములు వివిధ కారణముల వలన ఘాతములకు ( injuries & insults  ) లోనయితే వాటి నిర్మాణములో మార్పులతో పాటు  వాటి వ్యాపారము కూడా మందగించవచ్చును. ఈ మూత్రాంగ విఘాతము తక్కువ కాలములో త్వరగా ( 7 దినములలో ) కలిగితే దానిని  సత్వర మూత్రాంగ విఘాతము ( Acute Kidney Injury ) లేక సత్వర మూత్రాంగ వైఫల్యముగా ( Acute Renal Failure )  పరిగణిస్తారు.

    తక్కువ సమయములో రక్తద్రవములో  క్రియటినిన్ ( serum creatinine  ) ప్రమాణములు పెరుగుట కాని, మూత్రవిసర్జన ( urine output ) పరిమాణము బాగా తగ్గుట కాని సత్వర మూత్రాంగ విఘాతమును సూచిస్తాయి.

కారణములు 


    సత్వర మూత్రాంగ విఘాతమునకు ( Acute Kidney Injury ) కారణములు మూత్రాంగములకు ముందు గాని ( Prerenal ), మూత్రాంగములలో గాని ( Renal parenchyma ), మూత్రాంగముల తరువాత గాని ( Post renal) ఉండవచ్చును.

మూత్రాంగ పూర్వ ( మూత్రాంగములకు ముందు ఉండు ) కారణములు ( Pre renal causes ) 


    మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుట వలన మూత్రాంగ వైఫల్యము, మూత్రాంగ విఘాతము కలుగగలవు . వాంతులు, విరేచనములు, రక్తస్రావము ( hemorrhage) వలన ), ఇతర కారణముల వలన రక్త ప్రమాణము తగ్గితే ( hypovolemia ) మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది.

    హృదయ వైఫల్యము ( Congestive Heat Failure ), కాలేయ వైఫల్యము ( Hepatic Failure  ), నెఫ్రాటిక్ సిండ్రోమ్ లలో ( Nephrotic syndrome ) శరీర ద్రవ ప్రమాణము పెరిగినా, వివిధ అవయవాలకు సమర్థవంతముగా ప్రసరించు రక్త ప్రమాణము ( effective circulatory volume ) తగ్గి మూత్రాంగములకు కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది. ఉదర శస్త్రచికిత్సల తర్వాత శరీర ద్రవములు కణజాలముల ( Tissues ) లోనికి ఎక్కువగా చేరుట వలన అవయవాలకు ప్రసరించు రక్త ప్రమాణము తగ్గుతుంది. నారంగ కాలేయవ్యాధిలో ( cirrhosis of Liver ) ఉదరకుహరములో ( peritoneal cavity ) ద్రవము చేరుకొని జలోదరమును ( ascites ) కలిగించునపుడు కూడా సమర్థముగా ప్రసరించు రక్త పరిమాణము ( effective circulating volume ) తగ్గుతుంది. జలోదరము ( ascites ) విశేషముగా ఉండి ఉదరకుహరములో పీడనము ఎక్కువయినపుడు మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది. మూత్రసిరల నుంచి ప్రసరించు రక్త ప్రమాణము కూడా తగ్గుతుంది.
      
    కాలేయ వ్యాధుల వలన సత్వర కాలేయ వైఫల్యము ( acute hepatic failure ) కలగిన వారిలో hepatorenal syndrome కలుగుతే మూత్రాంగ ధమనులు సంకోచిస్తాయి. మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది.

    మూత్రాంగములకు రక్తప్రసరణ లోపించుట వలన మూత్రాంగముల నిర్మాణ, వ్యాపారములలో మార్పులు జరిగి సత్వర మూత్రాంగ విఘాతముగా ( acute Kidney Injury ) పరిణమించ వచ్చును. దాని వలన సత్వర మూత్రాంగ వైఫల్యము కలుగుతుంది.

మూత్రాంగ కారణములు ( Renal parenchymal causes ) 


    సత్వర మూత్రాంగ వైఫల్యమునకు కారణములు మూత్రాంగముల ( Kidneys ) లోనే ఉండవచ్చును.


    1). సత్వర మూత్ర నాళికా కణధ్వంసము ( acute tubular necrosis ) : మూత్రాంకముల నాళికలలో ( tubules of nephrons ) కణముల విధ్వంసము జఱిగి సత్వర మూత్రాంగ విఘాతము కలుగవచ్చును. సూక్ష్మజీవులు శరీరమును ఆక్రమించుకొనుట వలన రక్తము సూక్ష్మజీవ విషమయము (bacterial sepsis ) అయితే అది మూత్రనాళికల కణవిధ్వంసమునకు దారి తీయవచ్చును.

    2). మూత్రాంగ విషములు ( nephrotoxins ), వేంకోమైసిన్ ( vancomycin ), జెంటామైసిన్
 ( Gentamicin ), టోబ్రామైసిన్  ( Tobramycin ) వంటి ఎమైనోగ్లైకొసైడ్ సూక్ష్మజీవి వినాశక ఔషధములు ( amino glycoside antibiotics ), ఏంఫోటెరిసిన్ -బి ( amphotericin B ), సిస్ ప్లాటిన్ ( cisplatin ), సిరల ద్వారా ఇవ్వబడు  వ్యత్యాస పదార్థములు (  I.V. contrast materials ), ఇతర ఔషధముల వలన మూత్రనాళికలలో సత్వర కణధ్వంసము ( acute tubular necrosis ) కలుగ వచ్చును.

    3). లింఫోమా ( lymphoma ), లుకీమియా వంటి కర్కట వ్రణ ( cancer ) వ్యాధిగ్రస్థులలో రసాయనక చికిత్స పిదప కర్కటవ్రణ కణధ్వంసము ( lysis of cancer cells  ) జరుగుటచే  రక్తములోను, మూత్రములోను యూరికామ్లపు  ( uric acid ) విలువలు పెరిగి అవి మూత్రనాళికలలో ( tubules ) పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ వైఫల్యమును కలిగించగలవు.

    4). Multiple myeloma వ్యాధిగ్రస్థులలో ఇమ్యునోగ్లాబ్యులిన్ల భాగములు మూత్రనాళికలలో పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ విఘాతము కలిగించవచ్చును. 

    5) ఎసైక్లొవీర్ ( acyclovir ), ఇండినవీర్, సల్ఫానమైడులు వంటి  ఔషధములు కూడా మూత్రనాళికలలో పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ విఘాతమును కలిగించవచ్చును.

    6). రక్తనాళ పరీక్షలు, చికిత్సలలో ( vascular procedures ), ప్రమాదవశమున ధమనీ ఫలకములు ( atheromas ) ఛిద్రమయి రక్త ప్రవాహములో మూత్రాంగములకు చేరి మూత్రాంగ విఘాతమును కలిగించగలవు.

    7). అస్థికండర కణవిచ్ఛేదనము ( Rhabdomyolysis ) జరిగిన వారిలో కండర వర్ణకము ( myoglobin ) విడుదలయి మూత్రనాళికలలో పేరుకుంటే మూత్రాంగ విఘాతము కలుగవచ్చును.

    8). స్వయంప్రహరణ వ్యాధులు ( autoimmune diseases ) వలన  కేశనాళికా గుచ్ఛములలో ( glomeruli )  తాపము ( glomerulo nephritis ) కలిగి మూత్రాంగ విఘాతము కలిగించవచ్చును.

    9). కొన్ని వ్యాధుల వలన, కొన్ని ఔషధముల వలన  మూత్రాంగములలో మూత్రాంకముల ( nephrons ) మధ్యనుండు కణజాలములో తాపము ( interstitial nephritis )  కలిగి మూత్రాంగ వైఫల్యము కలిగించవచ్చును.

    మూత్రాంగ విఘాతములను రెండుగా విభజించవచ్చును. దినమునకు 500 మి.లీ లోపు మూత్రమును విసర్జిస్తే మితమూత్ర మూత్రాంగ విఘాతము ( oliguric AKI ). 500 మి.లీ కంటె ఎక్కువగా మూత్ర విసర్జన ఉంటే అది అమిత మూత్ర మూత్రాంగ విఘాతము ( non oliguric AKI ). మితమూత్ర మూత్రాంగ విఘాతము తీవ్రమైనది.

 మూత్రాంగ పర ( మూత్రాంగములు తర్వాత) కారణములు ( post renal causes ) 


    మూత్రాంగములలో ఉత్పత్తి అయే మూత్ర ప్రవాహమునకు, విసర్జనకు అవరోధములు ఏర్పడితే మూత్ర నాళములలో పీడనము పెరిగి ఆ పీడనము వలన  మూత్రాంగ విఘాతము కలుగుతుంది. వయస్సు పెరిగిన పురుషులలో ప్రాష్టేటు గ్రంథి ( prostate gland ) పెరుగుదలలు, పిల్లలలో జన్మసిద్ధముగా మూత్ర పథములో కలుగు వైపరీత్యములు ( congenital urinary tract abnormalities ), మూత్ర పథములో శిలలు (calculi in urinary tract ), కటిస్థలములో కర్కట వ్రణములు మూత్ర ప్రవాహమునకు అవరోధము కలిగించి సత్వర మూత్రాంగ విఘాతమునకు ( acute kidney injury ) దారితీయగలవు.

సత్వర మూత్రాంగ విఘాత లక్షణములు 


    మూత్రాంగ విఘాతము వలన మూత్రంగ వ్యాపారము మందగించి రక్తములో యూరియా ( urea ), క్రియటినిన్ ( creatinine ) వంటి వ్యర్థ పదార్థముల పరిమాణములు త్వరితముగా పెరుగుతాయి. అందువలన వ్యాధిగ్రస్థులలో ఒంట్లో నలత, అరుచి, వాంతి కలిగే వికారము, వాంతులు, నీరసము, అలసట, కలుగుతాయి. తలనొప్పి ఉండవచ్చును. మూత్రాంగములలో తాపముచే మూత్రాంగముల పరిమాణము పెరుగుతే వాటిని ఆవరించు ఉండు పీచుపొర సాగుట వలన ఉదరములో పార్శ్వ భాగములలో నొప్పి కలుగ వచ్చును.

    మూత్రాంగ విఘాతమునకు మూలకారణముల వలన యితర లక్షణములు కలుగుతాయి.
 శరీర ఆర్ద్రత తగ్గుట ( dehydration ), రక్త ప్రమాణము తగ్గుట ( hypovolemia ) వలన మూత్రాంగ విఘాతము కలిగిన వారిలో దాహము పెరుగుట, నోరు పిడచకట్టుకొనుట, శరీరస్థితి మార్పులతో, ( పడుకొన్నవారు , కూర్చున్నపుడు, లేచి నిలుచున్నపుడు ) రక్తపీడనము తగ్గి ( postural hypotension  ) కళ్ళు తిరుగుట, ఒళ్ళు తూలుట కలుగవచ్చును. శరీర స్థితితో ధమని వేగములో మార్పులు కలుగుతాయి. వీరిలో నాలుక, నోటి శ్లేష్మపు పొరలలోను ( mucosa ), చర్మములోను ఆర్ద్రత ( తడి ) తగ్గి పొడిగా కనిపిస్తాయి. గుండె వేగము పెరుగుతుంది. రక్తపీడనము తక్కువగా ఉండవచ్చు. నిలుచున్నపుడు రక్తపీడనము తగ్గుతుంది.

    సూక్ష్మజీవుల వలన రక్తము విషమయము అయితే ( bacterial sepsis  ) వారిలో జ్వరము , నీరసము , సూక్ష్మజీవుల బారికి గుఱి అయిన అవయవములలో కలిగే లక్షణములు కనిపిస్తాయి.

     Systematic lupus erythematosis ( SLE ) వంటి స్వయంప్రహరణ వ్యాధులు ( auto immune diseases ) కలవారిలో కీళ్ళనొప్పులు, చర్మములో పొక్కులు, విస్ఫోటముల ( rashes )  వంటి లక్షణములు కనిపిస్తాయి.

    మూత్ర ప్రవాహమునకు అవరోధములు ఉన్నవారిలో మూత్ర విసర్జనలో యిబ్బంది,   నొప్పి, పొత్తికడుపులో నొప్పి, కడుపు పక్కలందు నొప్పి, మూత్రము విసర్జించునపుడు మంట, నొప్పి, మూత్రములో రక్తము ( hematuria ) వంటి లక్షణములు ఉండవచ్చు.

    ప్రాష్టేటు గ్రంథి పెరుగుదలలను, మూత్రాశయపు నిండుతనమును ( urinary bladder distension ), పొత్తికడుపులో పెరుగుదలలను వైద్యులు రోగులను పరీక్షించునపుడు గమనించగలరు. మూత్ర ప్రవాహమునకు అవరోధము కలుగుటచే మూత్రాశయము ( urinary bladder) పొంగి ఉంటే మూత్రాశయములోనికి కృత్రిమనాళము ( catheter ) రోగజనక రహితముగా  (sterile technique) చొప్పించి మూత్ర ప్రవాహమునకు సదుపాయము కల్పిస్తే మూత్రాంగ విఘాతమునకు కారణము తెలియుటే కాక చికిత్స కూడా సాధించగలము.

పరీక్షలు 


మూత్ర పరీక్ష 


    మూత్రాంగపూర్వ ( prerenal ) కారణములచే మూత్రాంగ విఘాతములు కలిగిన వారిలో మూత్ర పరీక్షలో  తేడా కనిపించదు.
    మూత్రనాళికల కణవిధ్వంసము ( acute tubular necrosis  ) గల వారిలో మూత్రమును సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించినపుడు మట్టిరంగు కణికలు గల మూసలు  (muddy granular casts ) కనిపిస్తాయి.

    ఎఱ్ఱరక్తకణముల మూసలు ( erythrocyte casts ), మూత్రములో మాంసకృత్తులు ( proteinuria ) కేశనాళికా గుచ్ఛముల వ్యాధిని ( glomerular disease ) సూచిస్తాయి.

    తెల్లకణముల మూసలు ( leukocyte casts, ఆమ్లాకర్షణ కణములు ( eosinophils  ) మూత్రాంగములలో అంతర కణజాల తాపమును ( Interstitial nephritis ) సూచిస్తాయి.

    మూత్రములో రక్తవర్ణకము ఉండి, రక్తకణములు లేకపోతే ఆ వర్ణకము కండర వర్ణకము ( myoglobin ) కావచ్చును.అది కండరములు విచ్ఛిన్నతను (Rhabdomyolysis )  సూచిస్తుంది.

    మూత్రమును సూక్ష్మదర్శినితో పరీక్షించునపుడు యూరికామ్లపు స్ఫటికములు ( uric acid crystals), యితర స్ఫటికములు ( ethylene glycol, ) కనిపిస్తే వ్యాధి కారణములు తెలుసుకొనవచ్చును.

రక్తపరీక్షలు 


    రక్తపరీక్షలలో యూరియా, క్రియటినిన్ ల ప్రమాణములు పెరుగుతాయి. యూరియా, క్రియటినిన్ లతో విద్యుద్వాహక లవణములు ( electrolytes ) సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేట్, కాల్సియమ్, ఫాస్ప్ ట్, యూరికామ్లముల విలువలు, చక్కెర, ఆల్బుమిన్ విలువలు, రక్తకణముల విలువలు వైద్యులు పరిశీలిస్తారు.


    మూత్రాంగపూర్వ ( prerenal ) మూత్రాంగ విఘాతములలో రక్తములో యూరియా / క్రియటినిన్ నిష్పత్తి 20: 1 కంటె హెచ్చుగా ఉంటుంది. మూత్రాంగ ( కారణ ) మూత్రాంగ విఘాతములలో ఈ నిష్పత్తి 20:1 కంటె తక్కువగా ఉంటుంది.

 మూత్రములో సోడియమ్, క్రియటినిన్ విలువలు, ఆస్మొలాలిటీ ( osmolality ) కూడా తెలుసుకోవాలి.


    మూత్రాంగ పూర్వ మూత్ర్రాంగ విఘాతములలో రక్తప్రమాణము తగ్గుట వలన శరీరములో వినాళగ్రంథులు స్పందించి నీరును, సోడియమ్ ను పదిల పఱుస్తాయి. అందుచే మూత్రపు సాపేక్ష సాంద్రత ( specific gravity ) 1.020  కంటె ఎక్కువగా ఉంటుంది ; మూత్రపు ఆస్మలాలిటీ ( urine osmolality ) 500 mOsm/kg కంటె ఎక్కువగా ఉంటుంది. మూత్రములో సోడియమ్ సాంద్రత 10 meq / L లోపల ఉంటుంది.

    మూత్రములో ఎఱ్ఱకణముల మూసలు ( erythrocyte casts ), ఎఱ్ఱకణములు, మాంసకృత్తులు ( proteins ) ఉంటే అవి కేశనాళికల గుచ్ఛములలో ( glomeruli ) వ్యాధిని సూచిస్తాయి. వారికి వివిధ స్వయంప్రహరణ వ్యాధులకు ( autoimmune diseases ), రక్తనాళికల తాపము ( vasculitis )  కలిగించే కాలేయ తాపములు ఎ, బి లకు ( hepatitis B & C ) పరీక్షలు చెయ్యాలి.

శ్రవణాతీత ధ్వని చిత్రీకరణము ( ultrasonography ) 


    శ్రవణాతీత ధ్వని చిత్రీకరణములతో  ( ultrasonography ), మూత్రనాళ శిలలను (ureteric calculi ), ఇతర అవరోధములను, మూత్రాశయములో వైపరీత్యములను, ప్రాష్టేట్ పెరుగుదలలను, అవరోధము వలన ఉబ్బిన మూత్రనాళములు ( ureters ), ఉబ్బిన మూత్రకుండిక ( మూత్రపాళియ ; renal pelvis ) మూత్రకుండిక ముఖద్వారములతో ( calyces of  kidneys) జల మూత్రాంగమును (hydronephrosis ),కటిస్థలములో ( pelvis ) పెరుగుదలలను కనుగొనవచ్చును.

చికిత్స 


    మూత్రాంగ విఘాతపు చికిత్స రెండు భాగములు. ప్రధమముగా మూత్రాంగ విఘాతానికి కారణములను పరిష్కరించాలి. అదేసమయములో మూత్రాంగ విఘాతము వలన కలిగిన ఉపద్రవములను కూడా పరిష్కరించాలి. 

మూత్రాంగ విఘాత కారణముల పరిష్కరణ  


    మూత్రాంగపూర్వ కారణములను, మూత్రాంగపర కారణములను సత్వరముగా పరిష్కరించుట వలన మూత్రాంగ విఘాతమును నిలువరించ గలుగుతాము.

మూత్రాంగపూర్వ కారణముల పరిష్కరణ 


     శరీరపు ఆర్ద్రక్షీణతను ( dehydration), రక్తపరిమాణ లోపములను ( hypovolemia ) దిద్దుబాటు చేసి మూత్రాంగముల రక్తప్రసరణ లోపమును సరిదిద్దాలి. దేహములో నీరు, ఉప్పు (sodium chloride) ఒకదానితో మరొకటి అనుబంధము కలిగి ఉంటాయి. అందువలన శరీరపు ఆర్ద్రత తగ్గినపుడు లవణ ద్రావణము  ( normal saline ) సిరల ద్వారా ఎక్కించి ఆర్ద్ర క్షీణతను ( dehyration ) సరిదిద్దాలి. రక్తహీనము ( anemia ) ఎక్కువగా ఉంటే రక్తకణ సముదాయములను ( packed redblood cells ) ఎక్కించాలి. నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో ( cirrhosis of liver ) రక్తములో ఆల్బుమిన్ ( albumin ) బాగా తగ్గి జలోదరము ( ascites ) ఉంటే ఆల్బుమిన్  సిరలద్వారా ఇవ్వాలి.

    మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గించు తాపహరముల ( nonsteroidal antiinflammatory agents ) వంటి ఔషధములను ఆపివేయాలి. శరీర ఆర్ద్రత తగ్గినపుడు మూత్రకారకములు ( diuretics ) ఆపివేయాలి. రక్తద్రవములో క్రియటినిన్ ( serum creatinine ) విలువలు 50 శాతము కంటె పెరుగుతే  Angiotensin Converting Enzyme Inhibitors, Angiotensin Receptor Blockers  మోతాదులను తగ్గించాలి. లేక పూర్తిగా మానివేయాలి. రక్తపీడనము తగ్గిన వారిలో ( hypotension ) రక్తపుపోటు మందులు తగ్గించాలి, లేక నిలిపివేయాలి.

మూత్రాంగపర కారణముల పరిష్కరణ 


    మూత్ర విసర్జనకు, మూత్ర ప్రవాహమునకు అవరోధములు ఉంటే వాటిని పరిష్కరించాలి. మూత్రాశయములో కృత్రిమ నాళము అమర్చి మూత్ర ప్రవాహము సుగమము చేయాలి. మూత్రనాళములలో శిలలు ఉంటే వాటిని తొలగించాలి. మూత్రాశయమునకు ( urinary bladder ) ఎగువ తొలగించలేని ఇతర అవరోధములు ఉంటే మూత్రకుండికకు ( renal pelvis ) శస్త్రచికిత్సతో కృత్రిమ ద్వారము ( nephrostomy ) బయటకు అమర్చి మూత్ర విసర్జనకు సదుపాయము కల్పించాలి. మూత్ర ప్రవాహము సుగమము చేయుట వలన మూత్రాంగములపై పీడనము తగ్గి మూత్ర విఘాతమును నిలువరించగలుగుతాము.

మూత్రాంగ కారణములకు చికిత్స 


    మూత్రాంగములపై విష ప్రభావము కలిగించు ఔషధములను ( aminoglycosides, cisplatin, amphoterin-b ) తప్పనిసరి కాకపోతే వెంటనే నిలిపివేయాలి. కండర విచ్ఛేదనము ( rhabdomyolysis ) జరిగిన వారికి సిరల ద్వారా లవణ ద్రావణము ( normal saline ) ఇచ్చి మూత్ర పరిమాణము పెంచి కండర వర్ణకము ( myoglobin ) మూత్రనాళికలలో ( tubules ) పేరుకుపోకుండా చెయ్యాలి. 

    మూత్రాంగముల కేశనాళిక గుచ్ఛములలో ( glomeruli ) వ్యాధి కలిగించు స్వయంప్రహరణ వ్యాధులను ( autoimmune disease ) ఇతర కొల్లజెన్ రక్తనాళిక వ్యాధులను ( collgen vascular diseases ) కనుగొని వాటికి తగిన చికిత్సలు చెయ్యాలి.

    జలోదరము ( ascites ) వలన ఉదరకుహరములో పీడనము అధికముగా ఉంటే ఉదరకుహరములో ద్రవమును తొలగించాలి.

    కారణములను పరిష్కరిస్తే మూత్రాంగములు విఘాతము నుంచి కోలుకొనే అవకాశము ఉంటుంది.

     మూత్రాంగవిఘాతము వలన కలిగే ఉపద్రవముల పరిష్కారము 

    
    ఇది చికిత్సలో చాలా ముఖ్యాంశము. మూత్రాంగ విఘాతము వలన వ్యాధిగ్రస్థులకు అరుచి కలిగి తగినంత ద్రవములు నోటితో తీసుకోలేకపోతే రక్తపరిమాణ లోపమును ( hypovolemia ), ఆర్ద్రక్షీణతను ( dehydration  ) సరిదిద్దుటకు సిరల ద్వారా లవణ ద్రవణములు ఇయ్యాలి. శరీర ద్రవభారము ( fluid overload ) అధికమయితే మూత్రకారకములతో ( diuretics ) దానిని పరిష్కరించాలి.

    రక్తద్రవపు పొటాసియమ్  ( serum Potassium ) విలువలు అధికమయితే ఆహారములో పొటాసియమ్  తగ్గించాలి. అరటిపళ్ళు, నారింజరసము, బంగాళదుంపలు, కొబ్బరినీళ్ళలో పొటాసియము ఎక్కువగా ఉంటుంది. వీటిని వాడకూడదు. 
      
    పొటాసియమ్ విలువలు ప్రమాదకర ప్రమాణములలో ఉండి ( 6 meq / dL మించి ), విద్యుత్ హృల్లేఖనములో ( electro cardiogram ) మార్పులు ఉంటే, హృదయ రక్షణకు కాల్సియమ్ గ్లూకొనేట్ ( calcium gluconate ) సిరల ద్వారా ఇస్తారు. రక్తద్రవములోని పొటాసియమును కణముల లోపలకు మళ్ళించుటకు ఇన్సులిన్ + గ్లూకోజుల మిశ్రమమును సిరలద్వారా ఇస్తారు. బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములను ( beta adrenergic receptor agonists ) పీల్పుసాధనముల ద్వారా ఇచ్చి పొటాసియమ్ ను కణములలోనికి మళ్ళించవచ్చును. రక్తము ఆమ్లీకృతము అయితే ( acidosis ) సోడియమ్ బైకార్బొనేట్ ( sodium bicarbonate ) కూడా ఇవ్వవచ్చును. ఆపై శరీరములో పొటాసియమును తగ్గించుటకు sodium polystyrene sulfonate  వంటి ఋణపరమాణు వినిమయ ఔషధములు ( cation echange resins ) వాడవలెను. ద్రవపరిమాణ లోపము ( hypovolemia ) లేనివారిలో మూత్రకారకములు వాడి పొటాసియము విసర్జనను పెంచవచ్చును.

    రక్తము ఆమ్లీకృతమయితే ( acidosis ) నోటి ద్వారా సోడియమ్ బైకార్బొనేట్ యిచ్చి దానిని సవరించవచ్చును. ఆమ్లీకృతము తీవ్రముగా ఉండి రక్తపు pH 7.2 కంటె తక్కువగా ఉన్నపుడు సోడియమ్ బైకార్బొనేట్ సిరల ద్వారా ద్రావణములతో ఇవ్వవచ్చును. కాని దాని వలన ద్రవభారము ( fluid overload ) కలుగకుండా, రక్తద్రవపు కాల్సియమ్ విలువలు పడిపోకుండా, రక్తము క్షారీకృతము ( alkalosis ) కాకుండాను తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  
    { ధమని రక్తపు pH 7.37 నుంచి 7.43 వఱకు ఉంటుంది. pH 7.37 కంటె తక్కువైతే ఆమ్లీకృతము ( acidosis ) గాను, 7.43 కంటె ఎక్కువైతే క్షారీకృతము ( alkalosis ) గాను పరిగణిస్తారు.}

    రక్తములో ఫాస్ఫేట్ విలువలు పెరుగుతే ఫాస్ఫేట్ బంధకములను ( phosphate binding agents - calcium carbonate, calcium acetate, aluminum hydroxide, sevelamer hydrochloride  ) వాడి వాటిని అదుపులో తేవలెను.

    మూత్రాంగ విఘాతము కల రోగులలో రక్తపీడనము కొద్దిగా పెరుగుతే ( ముకుళిత పీడనము 150 - 160 mmhg లోపు ) దానికి చికిత్సలు చేయకూడదు. రక్తపీడనము తీవ్రముగా పెరిగిన వారికి సగటు ధమనీ పీడనము ( mean arterial pressure ) 10- 15 శాతము తగ్గించుటకు చికిత్స అవసరము. వీరిలో ACE inhibitors, ARBs వాడకూడదు.

    మూత్రాంగ విఘాతము కలిగిన వారిలో మందుల విసర్జన తగ్గుతుంది కాబట్టి అవసరమయిన మందుల మోతాదులను సవరించాలి. అనవసరపు మందులు వాడకూడదు. వీరిలో నిరూపితము కాని ఔషధములు చికిత్సలో వాడకూడదు. అవి మూత్రాంగములపై కలిగించు శ్రమ వలన, మూత్రాంగములపై వాటి విష ప్రభావము ( toxicity ) వలన కలిగే నష్టమే ఎక్కువ.

మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( Renal replacement therapy ; Dialysis ) 


    సత్వర మూత్రాంగ విఘాతమునకు గుఱియగు వారిలో కొందఱికి మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స అవసరము కావచ్చును. 

   1). విశేషమైన అరుచి, వాంతికలిగే భావన, మందులకు తగ్గని వాంతులు పెక్కు దినములు ఉన్నవారికి,
   2). ఔషధములకు తగ్గని ప్రమాదకర రక్తద్రవపు పొటాసియమ్ ( serum potassium ) విలువలు కలవారికి,
   3). మూత్రకారకములకు ( diuretics ) తగ్గని ద్రవభారము ( fluid overload ) కలవారికి, 
   4). రక్తము ప్రమాదకరముగా ఆమ్లీకృతము ( acidosis  ) అయినవారికి, 
   5). యూరియా వంటి వ్యర్థ పదార్థములు ఎక్కువగా పెరిగి  మతిభ్రమణము, మతిలో యితర మార్పులు,  మూర్ఛలు కలిగిన వారికి,
   6). యూరియా వలన హృదయ వేష్టనములో తాపము (uremic pericarditis ) కలిగిన వారికి,               
   7) . మూత్రాంగ విఘాతము తీవ్రముగా ఉండి, నయము కాగల అవకాశము లేక రక్తద్రవపు క్రియటినిన్ (Serum creatinine ) విలువలు అధికస్థాయికి పెరుగుతున్న వారికి 

    మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( renal replacement therapy ; dialysis ) అవసరము.

    మెథనాల్  ( methanol ), ఎథిలిన్ గ్లైకాల్ (  ethylene glycol ; antifreeze ), సేలిసిలేట్స్ ( salicylates ) విషముల వలన మూత్రాంగ విఘాతము కలిగిన వారికి విషపదార్థములు తొలగించుటకై  రక్తశుద్ధిచికిత్స ( hemodialysis ) అవసరము అవుతుంది.


( ఈ వ్యాసము కొంచెము క్లిష్టమైనది . వైద్యుల ప్రమాణములో వ్రాయబడినది. అయినా సామాన్యప్రజలకు కొంతైనా అర్థము అవుతుంది.
    నా సామర్థ్యపు మేరకు తెలుగులో వైద్యవిషయాలను చెప్పడము నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను సంప్రదించ ప్రార్థన .
ఉపయుక్తమనుకుంటే నా వ్యాసములు నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )



2 కామెంట్‌లు:

  1. అందరికి తేలికగా అర్ధమగునట్లు చక్కగా విషయ విశదీకరణ చేసినందుకు అభినందనలు డాక్టర్ గారు... సామాన్యులకు ఇది ఉపయుక్తం అనుటలో ఎలాంటి సందేహం లేదు.
    - డాక్టర్ తాతా సాంబశివరావు.

    రిప్లయితొలగించండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...