16, జనవరి 2022, ఆదివారం

రభస వ్యాధి ( Rabies )





 ( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో )

                               రభసవ్యాధి (Rabies)



                                                                      డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.


రభస వ్యాధి (Rabies) ; లాటిన్ లో rabere (to rave ప్రలాపించు) సంస్కృతంలో  రభసతో సంబంధం కలిగి కోపాన్ని, ఉద్వేగాన్ని సూచిస్తుంది. మనుషులలోను, ఇతర క్షీరదాలలోను (mammals) లిస్సా సమూహానికి చెందిన రేబ్డోవైరిడే (Rhabdoviridae) కుటుంబానికి చెందిన ఒంటి పోగు ఆర్. ఏన్.ఎ విషజీవాంశాల (RNA viruses) వలన కలుగుతుంది. ఈ విషజీవాంశాలు (viruses; from Latin vīrus“slime, poison”; akin to Sanskrit viṣá-,विष) వ్యాధి గల జంతువుల లాలాజలం నుంచి కాట్ల గుండా కాని, కన్ను, ముక్కు, నోటి శ్లేష్మపుపొరల ద్వారా గాని శరీరంలోనికి చొరబడి మెదడుకు చేరితే రభసవ్యాధి (Rabies)  కలుగుతుంది. 


రభస వ్యాధి వన్యమృగాలు నక్కలు , గబ్బిలాలు, రాకూనులు (racoons), స్కంకులలో(skunks) కలుగుతుంటుంది. ఈ వ్యాధి కుక్కలకు, పిల్లులకు వ్యాధి గల ఇతర జంతువుల నుంచి గాని, వన్యమృగాల నుంచి గాని సంక్రమిస్తుంటుంది. మనుషులకు కుక్కల నుంచి ఎక్కువగాను, అమెరికా వంటి దేశాలలో గబ్బిలాల నుంచి కాట్ల వలన సోకుతుంటుంది. జంతువులు కఱచిన తరువాత, వ్యాధిలక్షణాలు పొడచూపక ముందు టీకాలు వేసి వ్యాధిని పూర్తిగా నివారించవచ్చును. 

రభసవ్యాధికి టీకాలు (vaccines) లభ్యమవడం వలన, పెంపుడు కుక్కలకు, పిల్లులకు టీకాలు తప్పనిసరిగా వేయించడం వలన, సమాజాలలో జంతువుల తిరుగుళ్ళను నియంత్రించడం వలన, వన్యమృగాల కాట్లకు, టీకాలు వేయబడని కుక్కల, పిల్లుల కాట్లకు గురి అయి రభసవ్యాధి కలిగే అవకాశాలు గల మనుషులకు టీకాలు వేయడం వలన రభసవ్యాధిని (Rabies) పూర్తిగా నిర్మూలించవచ్చును.

లక్షణాలు పొడచూపిన పిమ్మట రభసవ్యాధి సర్వసాధారణంగా (100%) మరణానికి దారితీస్తుంది. 


రభస విషజీవాంశములు (Rabies Viruses)

రభసవ్యాధి కలిగించు విషజీవాంశాలు లిస్సావైరస్ (Lyssa Viruses) సమూహములో రాబ్డోవైరిడే (Rhabdoviridae) కుటుంబానికి చెందిన కణుపులు లేని (non segmented) ఒంటిపోగు ఆర్ఎన్ఎ విషజీవాంశాలు. వీటి జన్యుపదార్థము ఒక కోశంలో ఉంటుంది. ఈ విషజీవాంశాలు (వైరసులు) తుపాకిగుండు ఆకారములో ఉంటాయి.

రభస వ్యాధి కలిగించు జంతువులు 


రభసవ్యాధి సోకిన కుక్కలు, నక్కలు, గబ్బిలాలు, స్కంకులు,  రాకూనులు, పిల్లుల నుంచి మనుష్యులకు రభసవ్యాధి సంక్రమించగలదు. రభసవ్యాధి బారి పడిన జంతువులలో వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించకపోవచ్చును. నలతగా ఉండడం, మింగుట కష్టంగా ఉండటం, నురుగుతో చొంగ ఎక్కువగా కార్చడం, కనిపించిన యితర జంతువులను, మనుషులను ప్రేరణ లేకుండా కఱవడం, ఏవైనా శరీరభాగాలు చలనం లేక, వాతపు స్థితిలో ఉండడం, ఊరికే కలియబడి దాడిచేయడం, లేక మఱీ మెతకగా పడిఉండడం, వ్యాధిని సూచిస్తాయి. నేలపై పడిన గబ్బిలాలు కూడా రభసవ్యాధిని సూచిస్తాయి.

భారతదేశంలో 62,000,000 ల ఊరకుక్కలు ఉన్నాయని అంచనా. ఏటా 17600,000 మంది కుక్కకాట్లకు గుఱి అవుతారని రభసవ్యాధి నియంత్రణ సంఘము వారి అంచనా. వీరికి వైద్యం చేయడం చాలా ఖర్చుతో కూడిన పని.

పెంపుడు జంతువుల రక్షణ 

పెంపుడు జంతువులకు రభస వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తే మనుష్యులకు కూడా రక్షణ చేకూరుతుంది. పెంపుడు కుక్కలకు, పిల్లులకు రభస వ్యాధి టీకాలు వేయించుట తప్పనిసరి చెయ్యాలి. పెంపుడు జంతువులను వన్యమృగాల బారినుంచి, ఇతర జంతువుల బారినుంచి కాపాడుకోవాలి. పెంపుడు జంతువులను విచ్చలవిడిగా అదుపులో లేకుండా బయట తిరగనీయకూడదు. వాటిని మనుష్యులను ఇతర జంతువులను కఱవనీయకుండా యజమానులు వారి ఇంటి లేక పొలం ప్రాంగణాలలో అదుపులో ఉంచుకోవాలి. పెంపుడు జంతువుల వృషణాలు , అండాలు తొలగించో, వాటికి కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు చేయించో వాటి సంఖ్య వృద్ధిపొందకుండా చూసుకోవాలి.

యజమానులు లేని వీధి కుక్కలను, పిల్లులను బాధ్యత తీసుకొని పోషించుటకు, వాటికి రభసవ్యాధి (Rabies) టీకాలను వేయిస్తూ తమ అదుపులో ఉంచుకొనుటకు ఎవరూ దొఱకనప్పుడు వాటిని వీధులనుంచి  తొలగించి జంతుశాలలలోనో, జంతు పరిరక్షణశాలలలోనో ఆశ్రయం కల్పించడం, వాటికి రభసవ్యాధి టీకాలు వేయించి పోషణ చేకూర్చుట, కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు చేయించడం అందఱికీ ఆమోదకరం కావాలి. ప్రభుత్వ సంస్థలు, ప్రజాహిత సంస్థలు జీవకారుణ్యసంస్థలు ఆ బాధ్యత తీసుకోవాలి. కుక్కల సగటు జీవనప్రమాణము 11 సంవత్సరాలు కాబట్టి పై సూచనలను అమలుపరుస్తే ఒక దశాబ్దములో వీధి కుక్కల సంఖ్య బాగా తగ్గిపోవాలి. 

చాలా దేశాలలో వన్యమృగాలకు కూడా ఆహారం ద్వారా నీరసింపజేసిన రభసవ్యాధి (attenuated Rabies virus) విషజీవాంశాలను టీకాలుగా ఇచ్చి వాటికి చైతన్యరక్షణ (active immunity) సమకూర్చుతున్నారు. 


భారతదేశములో జీవకారుణ్యసంఘం వారి అభ్యర్ధన మేరకు , అత్యున్నతన్యాయస్థానము వారు ఊర కుక్కలను పిల్లులను చంపరాదని తీర్పు ఇచ్చారు. అందువలన పురపాలక సంఘాలు వాటిని అదుపులో ఉంచుటకు శ్రద్ధ చూపించడం లేదు. అందుచే మనుష్యులలో కుక్కకాట్లు, రభసవ్యాధులు , వాటి వలన మరణాలు పెరిగాయి. ఆ తీర్పును గౌరవిస్తూనే శునక శాలలు, పిల్లుల ఆశ్రమాలు నడుపుకొంటూ వాటిని పట్టణ వీధులలోంచి తొలగించి వాటికి, ప్రజలకు రక్షణ చేకూర్చడానికి ప్రభుత్వాలు, ప్రజాసంఘాలు, ప్రజలు సమిష్టిగా కృషి చెయ్యాలి.    


రభసవ్యాధి వలన భారతదేశంలో సంవత్సరానికి సుమారు 20,000 మంది మరణిస్తున్నారు. వీరిలో పెక్కుమంది పిల్లలు. అమెరికాలో ఒకరో ఇద్దఱో గబ్బిలాల కాట్ల వలన వచ్చిన రభసవ్యాధితో మరణిస్తున్నారు. అమెరికాలో కుక్కకాట్ల వలన ఎవరికీ రభసవ్యాధి రావడం లేదు. అభివృద్ధి చెందిన చాలా దేశాలు రభసవ్యాధిని (Rabies) పూర్తిగా నివారించగలుగుతున్నాయి.

రభస వ్యాధి వ్యాప్తి 


రభసవ్యాధి (Rabies) సోకిన జంతువుల నుంచి ఇతర జంతువులకు, మనుషులకు రభసవ్యాధి (Rabies) సంక్రమించగలదు. సామాన్యంగా ఆ జంతువులు కఱవడం వలన వ్యాధి బారి పడతారు. రేబీస్ గల జంతువుల లాలాజలం గాయాలు, ఒరిపిడులు, ఱక్కుళ్ళపై పడినప్పుడు కూడా విషజీవాంశాలు శరీరంలోనికి ప్రవేశించి రభసవ్యాధిని కలిగించగలవు. రభస విషజీవాంశాలు ఆ జంతువుల మెదడులోను, నాడీకణజాలంలోను కూడా ఉంటాయి. ఆ కణజాలాలు గాయాలపై చేరినా వ్యాధి రాగల అవకాశం ఉంటుంది. 

రభసవ్యాధి సోకిన జంతువుల రక్తం, మలమూత్రాల ద్వారా వ్యాధి సంక్రమించదు. వ్యాధి సోకిన జంతువులను తాకుట వలన, తట్టుట వలన వ్యాధి రాదు. రభసవ్యాధి సోకినవారి పర అవయవ దానాల (organ transplantation) వలన వ్యాధి వ్యాపించిన సంఘటనలు ఉన్నా అవి చాలా అఱుదు. రభసవ్యాధి (Rabies) సోకిన మనుషులు కఱవడంచేత, వారి లాలాజలం వలన వారి వ్యాధి ఇతరులకు సంక్రమించే అవకాశం ఉన్నా అట్టి సంఘటనలు నమోదు కాలేదు. రభస విషజీవాంశాలు (వైరసులు) సూర్యరశ్మి సోకినపుడు, ఆర్ద్రత కోల్పోయినపుడు నిర్వీర్యం అవుతాయి. 

రభసవ్యాధి లక్షణములు 

 రభసవ్యాధి (Rabies) విషజీవాంశాలు శరీరంలో ప్రవేశించిన తర్వాత అవి మెదడుకు చేరేవఱకు ఏ లక్షణాలు కనిపించవు. అవి మెదడుకు చేరిన పిదప రోగలక్షణాలు కలుగుతాయి. ఈ అగోచరస్థితి / మఱుగుపాటు సమయము (incubation period) సాధారణంగా కొద్ది వారాలు నుంచి కొద్ది నెలలపాటు ఉంటుంది. ఈ మఱుగుపాటు సమయం కాటుబడిన స్థలానికి, మెదడుకు గల మధ్య దూరం పైనా, విషజీవాంశాల పైనా, శరీర రక్షణ వ్యవస్థ పైనా ఆధారపడి ఉంటుంది.

తొలి లక్షణాలు వ్యాపకజ్వరము (Flu) లక్షణాలను పోలి ఉంటాయి. జ్వరము, తలనొప్పి, నీరసము, ఒంట్లో నలత, ఒళ్ళునొప్పులు, గొంతునొప్పి, ఆకలి లేకపోవుట, వమన భావన, వాంతులు, పొడిదగ్గు ఉంటాయి. కాటు స్థలము వద్ద తిమ్మిరి, సూదులు గుచ్చినట్లు నొప్పి, కండరాలలో  కుదుపులు, జలదరింపులు కలుగవచ్చును. ఈ లక్షణాలు 1-4 దినములు ఉంటాయి.

విషజీవాంశాలు మెదడుకు చేరి మెదడువాపు (encephalitis) కలిగించేటపుడు ఆ మెదడువాపు (encephalitis)  లక్షణాలు కనిపిస్తాయి. గందరగోళము, ఆందోళన, ఉద్వేగము, కలియబడుదనము, నిద్రపట్టకపోవడం, మతిభ్రంశము, భ్రాంతులు, కలుగుతాయి. కండరాలలో ప్రకంపనాలు, దుస్సంకోచాలు (spasms), మూర్ఛలు, కొన్ని కండరాలలో వాతము కలిగి చలన నష్టము (paralysis) కలుగవచ్చును. కన్నీళ్ళు ఎక్కువగా కారడం, లాలాజలము ఎక్కువగా స్రవించడం, నోటినుంచి నురుగుతో చొంగకారడం, ఎక్కువ చెమటపట్టుట, స్థితి సంబంధ అల్పరక్తపీడనం (postural hypotension- పడుకొని ఉన్నవారు కూర్చున్నపుడు, కూర్చున్నవారు  నిటారుగా నిలుచున్నపుడు రక్తపీడనం తగ్గుట) వీరిలో కనిపిస్తాయి. 

ఆపై మస్తిష్కమూల (brain stem) విలక్షణాలు కనిపిస్తాయి. ద్విదృష్టి (ఒక వస్తువు రెండుగా కనిపించుట / diplopia ), ముఖకండర పక్షపాతాలు (facial palsy), నేత్రనాడిలో వాపు (optic neuritis), మింగుటలో కష్టము, పదార్థాలు మింగుటకు యత్నించేటప్పుడు మింగు కండరాలలోను (muscles of deglutition), స్వరపేటిక కండరాలలోను, శ్వాసకండరాలలోను, ఉదరవితానంలోను దుస్సంకోచాలు, నొప్పులు కలుగుట కలుగుతాయి. 



రభస వ్యాధి (Rabies) ప్రసిద్ధ లక్షణం జలభయము (hydrophobia). వీరు నీటిని, ద్రవపదార్థాలను చూసేటపుడు, మింగుటకు యత్నించేటప్పుడు మింగు కండరాలు పనిచేయక, వాటిలో నొప్పి కలిగించు దుస్సంకోచాలు (spasms) కలిగి ఆ కండరాలు బిగుసుకుపోతాయి. అందువలన వీరు నీటిని చూసి భయపడుతారు. పదార్థాలు మింగలేకపోవడం, లాలాజలము ఎక్కువగా స్రవించడం, నురుగుతో చొంగలు కారడం వీరిలో కనిపిస్తాయి.

 లక్షణాలు పొడచూపిన రెండు నుంచి పది రోజుల్లో రభసవ్యాధిగ్రస్థులు నూటికి నూరుశాతం సర్వసాధారణంగా మరణిస్తారు. 

రభస వ్యాధి సోకిన జంతువులలో కూడా ఇటువంటి లక్షణాలే కనిపిస్తాయి. ప్రేరేపించకుండా  దాడిచేసి కఱవడం, పెంపుడు జంతువుల ప్రవర్తనలో మార్పులు, చైతన్యం పోయి మూల పడిఉండడం వ్యాధిని సూచించగలవు.

రోగ నిర్ణయము 


మనుషులలో రభసవ్యాధిని మరణానికి  ముందు నిర్ణయించడానికి పలు పరీక్షలు చేస్తారు. లాలజలంనుంచి విషజీవాంశాలను వేర్పఱచవచ్చును. RT-PCR పరీక్షతో (reverse transcription followed by polymerase chain reaction) విషజీవాంశాలను గుర్తించే అవకాశం ఉంది. రక్తద్రవం (serum), వెన్నుద్రవాలలో (spinal fluid) రభస విషజీవాంశాలకు ప్రతిరక్షకాలను (antibodies) గుర్తించవచ్చు. చర్మపుకణపరీక్షలతో కేశకూపాల క్రింద చర్మనాడులలో విషజీవాంశ ప్రతిజనకాలను (antigens) గుర్తించే అవకాశం ఉంది. విషజీవాంశ ప్రతిజనకాలను (antigens) ప్రత్యక్ష ప్రతిదీప్త ప్రతిరక్షక పరీక్షతో (Direct Fluorescent Antibody test) గుర్తిస్తారు.

కఱచిన జంతువులు వన్యమృగాలయి అవి పట్టుబడినప్పుడు, కుక్కలు, పిల్లులు, పెంపుడు జంతువులయి అవి వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు వాటిని బాధ లేకుండా మానవతా దృష్టితో చంపి వాటి మెదడును (ముఖ్యంగా చిన్నమెదడు, మస్తిష్క మూలాలను) ప్రత్యక్ష ప్రతిదీప్త ప్రతిరక్షక పరీక్షలతో (Direct Fluorescent Antibody test) విషజీవాంశాలకై పరిశోధించాలి. మస్తిష్క కణపరీక్షలలో నెగ్రీబాడీస్ (Negri bodies) కనిపించినా వ్యాధిని నిరూపించవచ్చును. 

వ్యాధి నివారణ 

జంతువులు కఱచినపుడు, లేక ఱక్కినపుడు, వాటి లాలాజలం ఱక్కులపైన, గాయాలపైన చేరినపుడు ఆ జంతువులు వన్యమృగములైతే వాటిని బాధ లేకుండా చంపి వాటి మెదడులను రభసవ్యాధి పరీక్షలకు పంపాలి. వాటి మెదడులు రభసవ్యాధిని సూచిస్తే టీకాల చికిత్స (vaccination) అవసరము. ఆ జంతువులు దొఱకక పారిపోయినా టీకాల చికిత్సలు అవసరమే.

కఱచిన జంతువులు ఊరకుక్కలు, పిల్లులు అయినా, పెంపుడు జంతువులు అయినా వాటిని పది రోజులు నిర్బంధించి వాటిలో రోగ లక్షణాలు కనిపిస్తే వాటిని బాధ లేకుండా చంపి వాటి మెదడులను రభసవ్యాధి పరిశోధనలకు పంపాలి. రభసవ్యాధి నిరూపితమైతే టీకా చికిత్సలు (vaccines) అవసరం. పదిదినాల తరువాత కూడా అవి ఆరోగ్యంగా ఉంటే రభసవ్యాధి టీకాల అవసరం లేదు. వీధి జంతువులు దొఱకక పారిపోతే టీకాలు అవసరం.

గాయాలకు చికిత్స

జంతువులు కఱచినపుడు, ఱక్కినపుడు గాయాలను సబ్బునీళ్ళతోను, పొవిడోన్ ఐయొడిన్ తోను శుభ్రపఱచాలి. ధనుర్వాతం (tetanus) రక్షణకు పది సంవత్సరములలో టీకాలు తీసుకొనని వారికి ధనుర్వాతపు టీకాలు వేయాలి. అవసరమయితే సూక్షజీవ నాశకాలు (antibiotics) వాడాలి. గాయాలకు తగిన చికిత్స కొనసాగించాలి.

రభసవ్యాధి సంక్రమించు అవకాశాల బారి పడినవారికి వ్యాధి నివారణ చికిత్స అవసరము (Post exposure prophylaxis). 

ఇమ్యూన్ గ్లాబ్యులిన్

వీరికి  మనుజుల రభసవ్యాధి ప్రతిరక్షకాలను (Human Rabies Immune Globulin - HRIG) 20 units / Kg శరీర బరువు మోతాదును వీలయినంత కఱచిన గాయంలోనికి , గాయం చుట్టూ ఇచ్చి మిగిలినది కండరంలో సూదిమందుగా వెంటనే ఇయ్యాలి. దీని వలన వెంటనే అచేతన రక్షణ (పరదాన రక్షణ / passive immunity) కలుగుతుంది. HRIG ని కాటుకు 7 రోజులు తర్వాత ఈయకూడదు.

టీకా

రభసవ్యాధి టీకా (Rabies vaccine) 1 మి.లీ ను 0, 3, 7, 14 దినములలో మొత్తం నాలుగు మోతాదులు భుజ కండరాలలో (అధిస్కంధ స్నాయువు / Deltoid muscle) సూదిమందుగా ఇయ్యాలి. రక్షణ వ్యవస్థ లోపాలు ఉన్నవారిలో ఐదవ మోతాదు కూడా  28 వ రోజు ఇయ్యాలి. టీకాల వలన చైతన్య రక్షణ (శరీర రక్షణ వ్యవస్థ చేకూర్చు స్వీయరక్షణ / active immunity) చేకూరుతుంది.

అదివఱకు టీకాలు తీసుకొని రక్షణ పొందిన వారు రభసవ్యాధి కలిగే అవకాశాలకు గుఱి అయినప్పుడు (Post exposure, previously immunized persons) రెండు మోతాదుల టీకాను 0, 3 దినాలలో తీసుకుంటే సరిపోతుంది. వీరికి HRIG అవసరం లేదు.

పశువుల వైద్యులు, జంతువులతోను, వన్యమృగాలతో పనిచేసేవారు, రభసవ్యాధి పరిశోధకులు, రభసవ్యాధి కలిగే అవకాశాలకు ముందుగానే (Pre exposure prophylaxis) 0, 7, 21 (లేక 28) దినాలలో రభసవ్యాధి టీకాలు మూడు మోతాదులలో తీసుకోవాలి.

 రభసవ్యాధి లక్షణాలు కలవారు సాధారణంగా మరణిస్తారు. వారికి ఆలంబన చికిత్సలు (supportive treatment), ఉపశమన చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. అందువలన రభసవ్యాధిని నివారించు చర్యలు తప్పక తీసుకోవాలి.


సెప్టెంబరు 28 ప్రపంచ రభసవ్యాధి దినంగా (World Rabies Day) గా పరిగణించి ప్రజలకు రభసవ్యాధి గుఱించి దాని నివారణ గుఱించి సమాచారాన్ని వ్యాపింప చేస్తారు.
   
( వైద్య విషయాలను తెలుగులో చెప్పుట నా వ్యాసాల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు, వ్యాధుల అవకాశాలకు గుఱి అయినవారు మీ మీ వైద్యులను సంప్రదించ ప్రార్థన . నా వ్యాసాలు స్వేచ్ఛగా పంచుకొనవచ్చును.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విషయసూచిక

   1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogs...