20, ఫిబ్రవరి 2024, మంగళవారం

నీటి ప్రమాదాలు (వికీపీడియాలో నిలిపిన వ్యాసము)

 

  ప్రమాదవశమున నీటిలో మునిగిపోయి ఊపిరాడకపోవుట వలన మరణాలు తఱచు కలుగుతుంటాయి. ఎవరైనా గమనించి వారిని బయటకు తీసి త్వరగా పునరుజ్జీవింపజేస్తే కోలుకొన్నవారిలో ఊపిరి ఇబ్బందులు, వాంతులు, గందరగోళము, అపస్మారకత వంటి ఇబ్బందులు కొన్నిగంటల తర్వాత కూడ పొడచూపగలవు. పిల్లలలోను, యవ్వనంలో ఉన్నవారిలోను కలిగే మొత్తం మరణాలలో నీటి ప్రమాదాలు ఒక ముఖ్యకారణం. వయోజనులలో కూడా నీటి ప్రమాదాల మరణాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. చాలా ప్రమాదాలు నీటిలో మునిగిపోవుట వలన కలిగినా, కొన్ని పరిశ్రమలలో ఇతర రసాయనిక ద్రవాలలో మునిగిపోవు ప్రమాదాలు జరుగుతాయి. తగు జాగ్రత్తలతో చాలా ప్రమాదాలు నివారించవచ్చు. ప్రతియేటా ప్రపంచంలో సుమారు 236,000 మరణాలు ప్రమాదవశాత్తు మునిగిపోవుట వలన కలుగుతాయని ఐక్యరాజ్యసమితి అంచనా. జూలై 25 వ తేదీ ప్రపంచ నీటి ప్రమాదాల నివారణ దినముగ ఐక్యరాజ్యసమితి 2021 లో ప్రకటించింది. భారతదేశములో ప్రతియేటా సుమారు 38,000 మంది నీటి ప్రమాదాలలో మునిగిపోయి మరణిస్తుంటారు. నీటి ప్రమాదాల వలన కలిగే మరణాలలో 85% మించి ఈత పాఠాలు, పర్యవేక్షణ, ప్రజలలో అవగాహన పెంచుట, నియమావళి, సాంకేతికతల వలన నివారించ గలిగినవే

  ఒక వ్యక్తి నీటిలో కాని మరో ద్రవంలో గాని ముక్కు, నోరు మునిగిపోయి ఊపిరి ఆడక తగినంత సమయం ఉండి, ఊపిరి తీసుకొనుటకు బయటకు రాలేనపుడు రక్తంలో ప్రాణవాయువు విలువలు తగ్గిపోతాయి (ప్రాణవాయువు హీనత / hypoxia), బొగ్గుపులుసువాయువు విలువలు పెరిగిపోతాయి (hypercapnea). ప్రాణవాయువు హీనత, పలు అవయవాలపై తీవ్రనష్టము కలిగిస్తుంది. ద్రవాలలో మునిగిపోవుట వలన మరణాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. బయటపడి బ్రతికినవారిలో దీర్ఘకాలిక రుగ్మతలు కూడ కలుగవచ్చు. కొందఱు పూర్తిగా కోలుకొంటారు.

  నీటిలో మునిగిపోవుటలు తొంబై శాతము మంచినీళ్ళలో (చెరువులు, సరస్సులు, నదులు, ఈతకొలనులలో) జరుగుతాయి. పదిశాతము ప్రమాదాలు సముద్రపు నీటిలో జరుగుతాయి. చాలా తక్కువ శాతపు ప్రమాదాలు ఇతర ద్రవాలలో పారిశ్రామిక ప్రమాదాలలో జరుగుతాయి. వ్యక్తులు జలాశయాలలో స్నానం చేయుటకు గాని, ఈతకు గాని దిగినపుడు మునిగిపోవచ్చు. పడవలు మునిగిపోవడం వలన కొందఱు మునిగిపోతారు. వఱదలలో కొందఱు మునిగిపోతారు. ప్రమాదవశాత్తు చిన్నపిల్లలు కొందఱు నీటికొలనులులలో పడిపోతారు. ఇళ్ళలో స్నానపు తొట్టెలలోను, బొక్కెనలలోను, మరుగుదొడ్లులోను చిన్నపిల్లలు మునిగిపోవు ప్రమాదాలు జరుగగలవు. చిన్నపిల్లలు, నీటితొట్టెలు, నీటికొలనులలో మునిగిపోయే అవకాశాలు ఎక్కువయితే, యువకులు వయోజనులు ప్రకృతిలో గల జలాశయాలలో మునిగిపోయే అవకాశం హెచ్చు.


ప్రమాదావకాశాలు



* ఈత పాఠాలలో శిక్షణ పొందని పిల్లలలో మునిగిపోయే ప్రమాదాలు ఎక్కువ.పిల్లలకు 1 సంవత్సరం నుండి 4 సంవత్సరాల వయస్సులోపల ఈతలో శిక్షణ ఇవ్వడం మేలు.

* 5 సంవత్సరాల లోపు పిల్లలలోను, 15 నుండి 24 సంవత్సరాల వయస్సు యౌవనంలో ఉన్నవారిలోను నీటిప్రమాదాలు హెచ్చుగా జరుగుతాయి. 4 సంవత్సరముల లోపు పిల్లలు ఇళ్ళలో ఉన్న ఈతకొలనులలో మునిగిపోయే అవకాశాలు హెచ్చు. యౌవనంలో ఉన్నవారు, వయోజనులు ప్రకృతిలో గల జలాశయాలలో హెచ్చుగా మునిగిపోతుంటారు.

* సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన పిల్లలలో నీటి ప్రమాదాల అవకాశాలు హెచ్చు. కారణం వారికి అనుభవజ్ఞులచేత ఈత పాఠాలలో శిక్షణ లేకపోవుట, వారు నీటిలోనికి వెళ్ళినపుడు పర్యవేక్షణ లేకపోవుట. ఉత్తర అమెరికా దేశములో నల్లజాతీయులలో నీటిలో మునిగిపోయే ప్రమాదాలు ఎక్కువ.

* మగపిల్లలలో హెచ్చు శాతం ప్రమాదాలు జరుగుతాయి.

* మద్యం, మాదకద్రవ్యాలు సేవించిన వారిలో చురుకుదనం లోపించి సమయస్ఫూర్తి తక్కువగుటచే ప్రమాదాలు హెచ్చు.

* మూర్ఛరోగం వంటి రోగాలవలన తాత్కాలికంగా స్పృహ కోల్పోయే వైకల్యాలు ఉన్నవారిలో మునిగిపోవు ప్రమాదాలు ఎక్కువ.

* హృదయ లయల రుగ్మతలు (cardiac arrhythmias) కలవారిలోను, జన్యుపరంగా ఆకస్మిక హృదయ మరణాల అవకాశాలున్నవారిలోను నీటిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. వీరు చల్లనీటిలో మునిగినపుడు, నీటిలో వ్యాయామం చేసినపుడు హృదయపు లయ తప్పి, స్పృహ కోల్పోయే అవకాశం ఉంది.

* బాగా అలసిపోయిన పిదప నీటిలోనికి ప్రవేశించినపుడు మునిగిపోయే అవకాశాలు హెచ్చు. భయం, ఆందోళనల వలన కలిగే కదలికలు అలసటను పెంచుతాయి. మితిమీరిన సాహసంతో చాలాదూరం నేల తగలని లోతు స్థలాలలోనికి చొచ్చుకుపోతే వెనుకకు తిరిగిరావడం కష్టమయి మునిగిపోయే అవకాశం ఉంది.

* నీటిలోపల అపాయకరమైన శ్వాసస్తంభన ప్రక్రియలు చేసేవారిలో మునిగిపోయే అవకాశాలు హెచ్చు.

* పర్యవేక్షణ లోపం ఉన్నపుడు పిల్లలు నీటిలో మునిగిపోయే అవకాశం హెచ్చు.

* చిన్నపిల్లలకు స్వతంత్రంగా నీటిలో ప్రవేశించే అవకాశాలు ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. ఈతకొలనుల ప్రవేశానికి కంచెలు, దడులవంటి అడ్డంకులు ఉండాలి.

* పడవ ప్రయాణీకులు ప్రాణకవచాలు (Life jackets) ధరించకుండా ప్రయాణాలు చేసినపుడు ప్రమాదాలు జరిగితే చాలా మంది మునిగిపోతుంటారు. ప్రతిదినము సుమారు 80 మంది మత్స్యకారులు ప్రపంచంలో నీటిప్రమాదాలలో చనిపోతారని అంచనా.

* మత్స్యకారులు, మత్స్యపారిశ్రామిక కార్మికులు నీటిలో దూకునపుడు, పడవ ప్రమాదాలలో చిక్కుకొన్నపుడు ప్రాణకవచాలు ధరించకపోతే మునిగిపోయే అవకాశాలు హెచ్చు. మత్స్యకారులలో వృత్తిపరముగా ఇతర వృత్తులలో కంటె ఎక్కువ మరణాలు కలుగుతాయి



వ్యాధి విధానం


ప్రాణవాయువు హీనత


  నీటిలో ( లేక ఇతర ద్రవాలలో) మునిగిపోయినపుడు ఊపిరాడక స్తంభించిపోతుంది. అందువలన రక్తపు ప్రాణవాయువు విలువలు క్షీణిస్తాయి. మెదడులో ప్రాణవాయువు హీనత (హైపాక్సియా) వలన మెదడువాపు కలుగగలదు. మెదడులో కణజాల నష్టం, మెదడు వ్యాపారంలో శాశ్వత లోపాలు కలుగగలవు. గుండెలో ప్రాణవాయువు హీనత వలన హృదయపు లయ తప్పుట, గుండెపోటులు, గుండె ఆగిపోవుట కలుగగలవు.

  శరీర కణజాలమునకు తగినంత ప్రాణవాయువు అందకపోవుట వలన రక్తంలో లాక్టికామ్లపు విలువలు పెరిగి జీవవ్యాపార సంబంధ ఆమ్లీకృతం (metabolic acidosis) కలుగుతుంది. 

  నీటిలో మునిగిపోయినపుడు తొలిదశలో ఊపిరి స్తంభించి ప్రాణవాయువు హీనత (హైపాక్సియా) కలుగుతుంది. ఆపై రక్తంలో బొగ్గుపులుసు వాయువు విలువలు క్రమంగా ఒక స్థాయికి పెరిగి శ్వాసక్రియను ప్రేరేపిస్తాయి. అప్పుడు ఊపిరిని బిగపెట్టుట కుదరదు. నీటిలో మునిగి ఊపిరి తీసుకొనే ప్రయత్నంలో కొంత నీరు శ్వాసపథంలోనికి ప్రవేశిస్తుంది. అపుడు దుస్సంకోచం కలిగి స్వరపేటిక మూసుకుపోతుంది. ఈ స్థితిలో నీటిలో మునిగిన వారిని రక్షించి బయటకు తీసుకురాగలిగితే వారు బాగా కోలుకొనే అవకాశాలు ఎక్కువ.  

శ్వాసపథంలో నీటి ప్రవేశం


  కాని ఇంకా నీటిలో మునిగిఉంటే కొంతసేపటికి స్వరపేటిక సంకోచం సడలిపోయి నీరు శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. ఇంకా నీటిలో మునిగిఉంటే ప్రాణవాయువు హీనత వలన స్పృహతప్పి శ్వాసక్రియ ఆగిపోతుంది. తరువాత గుండె కూడ లయ తప్పి ఆగిపోతుంది. 

  నీటిలో మునిగిపోయి, బయటపడినవారిలో మూడవవంతు మంది ఉపద్రవాలకు గురి అవుతారు. వీరిలో ఊపిరితిత్తులలోనికి  నీటితోబాటు ఇతర రేణువులు కూడా  ప్రవేశించి ఉండవచ్చు. కడుపులోని పదార్థాలు కూడ తిరోగమనం చెంది శ్వాసపథంలోనికి ప్రవేశించగలవు. వీటి వలన అపుడు ఊపిరితిత్తులలో తాపం (న్యుమోనియా), ఊపిరితిత్తులలో నీటిఉబ్బు (pulmonary edema), ఇతర పదార్థ రేణువుల వలన ఊపిరితిత్తులలో రసాయనిక తాపం (chemical pneumonitis) కూడ కలుగగలవు. ఊపిరితిత్తులలో నీరు, యితర పదార్థాలు ప్రవేశించుట వలన గాలిబుడగలలో (alveoli) సర్ఫేక్టంట్ అనే రసాయనపు ఉత్పత్తి మందగించి అవి మూసుకుపోగలవు. వికాసం తగ్గి ఊపిరితిత్తులు బిరుసెక్కగలవు. అప్పుడు వాటిలో వాయుచలనం తగ్గి శ్వాసవైఫల్యం కలుగుతుంది. సూక్ష్మజీవుల వలన ఊపిరితిత్తుల తాపం కూడ కలుగగలదు. ఈ కారణాలచే కూడ ప్రాణవాయువుహీనత (hypoxia), రక్తంలో బొగ్గుపులుసు వాయువు విలువలు పెరుగట (hypercapnea) జరుగగలవు. శ్వాసవైఫల్యంతో రక్తపు బొగ్గుపులుసు వాయువు విలువలు పెరుగుటచే  శ్వాసవ్యాపార ఆమ్లీకృతం (respiratory acidosis) కలుగుతుంది.

అల్పోష్ణగ్రత


  చన్నీళ్ళలో మునిగిపోయినపుడు శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గి అల్పోష్ణోగ్రత (35 డిగ్రీల సెంటీగ్రేడు లేక తక్కువకు/ హైపోథెర్మియా) స్థాయికి పడిపోవచ్చు. అల్పోష్ణగ్రత  మరో సమస్య అయినా, దాని వలన కొన్ని ప్రయోజనాలు కలుగగలవు. 21 డిగ్రీల సెంటీగ్రేడ్ (70 డిగ్రీల ఫారెన్ హీట్) కంటె చన్నీళ్ళలో ముఖం మునిగినపుడు గాలి పీల్చుకొను క్షీరదాలలో జరిగే ‘మునుగుటకు ప్రతిక్రియ’ (డైవింగ్ రిఫ్లెక్స్) చైతన్యమవుతుంది. దాని ప్రభావం పరానుభూత నాడీమండలంపై ఉంటుంది. అపుడు గుండె వేగం తగ్గుతుంది, దూరధమనుల సంకోచించి రక్తప్రవాహం కాళ్ళు, చేతులు, ప్రేవులనుంచి ప్రధాన అవయవాలైన గుండెకు, మెదడుకు మళ్ళించబడుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుట వలన అవయవాల ప్రాణవాయువు అవసరాలు తగ్గి ప్రాణవాయువు హీనత పరిణామాలు మందగించబడుతాయి. బ్రతకగల సమయం పెరుగుతుంది. అవయవాలలో కణనష్టం మందగించబడుతుంది. పిల్లలలో చన్నీళ్ళ రక్షణప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాని ఈ రక్షణప్రభావం నీటి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటె తక్కువైనపుడే కనపడుతుంది.

  చాలా శీతల జలాలలో మునిగినపుడు దేహం శీతల విఘాతానికి (cold shock) గుఱి అవుతుంది. దీని ప్రభావం సహవేదన నాడీమండలంపై (sympathetic nervous system) ఉంటుంది. శీతల విఘాతం వలన గుండె వేగం పెరుగుతుంది. ఆపుకోలేని అధికశ్వాసలు (hyperventilations) కలుగుతాయి.నీరు శ్వాసపథంలోనికి పీల్చుకోబడుతుంది. రక్తపుపోటు పెరుగుతుంది. చేతుల, భుజాల, కాళ్ళకండరాలు శక్తిని, సమన్వయాన్ని కోల్పోయి నిస్సత్తువతో నిశ్చేష్టత పొందుతాయి. అందువలన ఈదలేక మనుజులు మునిగిపోతారు. శరీరం ఉష్ణం కోల్పోయి అల్పోష్ణ స్థితి (hypothermia) పొందుటకు సుమారు గంటసేపు పట్టవచ్చును.

  వ్యక్తిగత ప్లవన సాధనాలు  (personal floating devices) ధరించినవారు చన్నీళ్ళలో మునిగిపోయే అవకాశాలు తక్కువ. వారు రక్షించబడుటకు అవకాశాలు హెచ్చు.


హృదయంలో అసాధారణ లయలు


  చన్నీళ్ళలో మునిగిపోయినవారిలో అసాధారణ హృదయ లయలు కలుగవచ్చు. అసాధారణ హృదయ లయల వలన మునిగిపోయే అవకాశం కలదు.

అపాయకర శ్వాసబంధనాలు


  ఈతగాళ్ళు కొన్నిసార్లు నీటిలో ప్రమాదకరంగా ఊపిరి బిగపెట్టే ప్రయత్నాలు తెలియక చేస్తారు.

అధిక దీర్ఘశ్వాసలు (Hyperventilations)


   కొందఱు నీళ్ళలో మునిగేముందు రక్తంలో ప్రాణవాయువు విలువలు పెంచుకొనే ఉద్దేశంతో ఎక్కువసార్లు పెద్ద ఊపిర్లు తీసుకుంటారు. సామాన్యపు ఊపిర్లతోనే రక్తంలో ప్రాణవాయువు సంతృప్తత నూరు శాతంకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వీరిలో అధికశ్వాసల వలన ప్రాణవాయువు విలువలు అదనంగా హెచ్చుగా పెరిగిపోవు. కాని అధికశ్వాసల వలన రక్తంలో బొగ్గుపులుసువాయువు విలువలు బాగా పడిపోతాయి. రక్తంలో బొగ్గుపులుసువాయువు విలువలు మళ్ళీ ఒక స్థాయికి పెరిగినపుడే శ్వాసక్రియ ప్రేరేపించబడుతుంది. అధికశ్వాసలు తీసుకొని నీటిలో మునిగి ఈదినపుడు ఊపిరి బిగపెట్టుట వలన ప్రాణవాయువు విలువలు బాగా పడిపోయినా బొగ్గుపులుసువాయువు ప్రమాణాలు త్వరగా పెరగవు, శ్వాసక్రియ ప్రేరేపించబడదు. ప్రాణవాయువు హీనత వలన స్పృహకోల్పోయి మునిగిపోయే ప్రమాదం ఉంది.

ప్రాణవాయువు హీనత శిక్షణలు


  వీరు ఊపిరి బిగపెట్టి నీటిక్రింద ఎక్కువదూరం ఈదే ప్రయత్నాలు చేస్తారు. వీరిలో ప్రాణవాయువు విలువలు బాగా క్షీణించి ప్రాణవాయువు హీనత వలన స్పృహకోల్పోయే ప్రమాదం ఉంది.

నిశ్చల శ్వాసబంధనాలు


  వీరు నీటి క్రింద మునిగి నిశ్చలంగా ఉండి ఊపిరి బిగపెట్టే ప్రయత్నం (పందేలు వేసుకొని) చేస్తారు. వీరిలో ప్రాణవాయువు హీనత కలిగి స్పృహకోల్పోయి, నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది.

గాయాలు, ఇతర దెబ్బలు


  నీటిలో పడిపోవుట వలన తలకు, మెడకు, ఎముకలకు, చర్మానికి, అంతర్గత అవయవాలకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది.

మునిగిపోవుట లక్షణాలు



  నీటిలోను ఇతర ద్రవాలలోను మునిగిపోతున్నపుడు ఆందోళన, భయం, ఆయాసం కలుగుతాయి. ఈతరాని చిన్నపిల్లలు చాలా తక్కువ కాలంలో, ఒక నిమిషంలోపునే మునిగిపోతారు. నీటిలోనుంచి తీసిన తర్వాత గాభరా, ఆందోళన, వాంతులు, ఊపిరితీసుకొన్నపుడు పిల్లికూతలవంటి శబ్దాలు, అపస్మారకం కలుగవచ్చు. శ్వాసలో ఇబ్బంది, శ్వాసవేగం ఎక్కువగుట, గుండెదడ, ప్రక్కటెముకల మధ్యభాగాలు ఊపిరితో లోనికిపోవుట, దేహం నీలబడుట మొదలగు లక్షణాలు శ్వాసవైఫల్యాన్ని సూచిస్తాయి. ఈ లక్షణాలు కొన్ని గంటల పిమ్మట పొడచూపవచ్చు. దెబ్బలు గాయాల లక్షణాలు కూడా గమనించాలి.

పరీక్షలు


  నీటిలో(ఇతరద్రవాలలోను) మునిగిపోయి బయటపడినవారిని త్వరగా పూర్తిగా పరీక్షించాలి. గాయాలకై శోధించాలి. ప్రాణవాయువు సంతృప్తత పరీక్షించి లోపముంటే ధమనీరక్తపు పరీక్షలు చేయాలి. ఛాతికి ఎక్స్-రే, హృదయ విద్యల్లేఖనాలు కూడ అవసరమే. శరీరాంతర ఉష్ణోగ్రత తీసుకోవాలి. మూర్ఛ, మద్యం, గుండెపోటు, తక్కువ చక్కెరవిలువల వంటి కారణాలకు శోధించాలి. రక్తకణ గణనలు, విద్యుద్వాహక లవణ పరీక్షలు (electrolytes) చెయ్యాలి. తలకు, మెడకు దెబ్బలు తగిలిన అవకాశాలుంటే, గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణలు (cat scans) అవసరం.

చికిత్స


పునరుజ్జీవన యత్నాలు


నీటిలో మునిగినవారిని నీటిపైకి తీసుకురాగానే వారు ఊపిరితీసుకొనకపోతే వెంటనే కృత్రిమశ్వాసలు అందించాలి. కృత్రిమశ్వాసలు అందిస్తూనే వారిని నీటి బయటకు తీసుకురావాలి. కృత్రిమశ్వాసలు  ఇచ్చేటపుడు దవడను ముందుకు జరిపి, మెడను వంచకుండా, చిబుకాన్ని ఎత్తకుండా ఇవ్వాలి. మెడలో వెన్నెముక దెబ్బతిన్నదను అనుమానముంటే మెడను తటస్థస్థితిలో కదలనీయకుండ పట్టీ అమర్చాలి. కృత్రిమ శ్వాసలతో రోగి కోలుకొనకపోయినా, గుండె ఆగిపోయినా  రక్తప్రసరణను పునరుద్ధరించడానికి ఛాతిపై అదుముడులు కూడా మొదలుపెట్టాలి. పునరుజ్జీవన ప్రయత్నాలు కొనసాగిస్తూనే అత్యవసర వైద్యసేవకులను పిలిపించాలి.  ఉదరంపై అదుముట వంటి నీటిని కక్కించి ప్రయత్నాలు చేయకూడదు. ఉదరంనుంచి తిరోగమించు పదార్థాలు ఊపిరితిత్తులలోనికి ప్రవేశించే ప్రమాదముంది. అవకాశం రాగానే ప్రాణవాయువును అందించాలి. రోగి తనంతట తాను ఊపిరి తీసుకోలేకపోయినా, శ్వాసవైఫల్య లక్షణాలు ఉన్నా శ్వాసనాళంలో కృత్రిమనాళం చొప్పించి దానిద్వారా కృత్రిమశ్వాసలు కొనసాగించాలి. అల్పోష్ణగ్రత ఉంటే రోగిని వెచ్చబెట్టు ప్రయత్నాలు చెయ్యాలి. తడిబట్టలు తొలగించి, శరీరాన్ని పొడిగా తుడిచి దుప్పటితో కప్పాలి. చన్నీళ్ళలో మునిగినవారికి పునరుజ్జీవన ప్రయత్నాలు చాలాసేపు కొనసాగించాలి. త్వరగా విరమించకూడదు.

వైద్యాలయాలలో 


  ప్రాణవాయువు హీనత గల వారిని, ఇతర అవలక్షణాలున్న రోగులను వైద్యాలయాలలో చేర్చి జాగ్రత్తగా పర్యవేక్షించాలి. వారికి ప్రాణవాయువు అందించి ప్రాణవాయువు సంతృప్తత విలువలు సంతృప్తికరంగా ఉంచాలి. ధమనీ రక్త వాయుపరీక్షలు జరిపి ప్రాణవాయువు విలువలు, బొగ్గుపులుసువాయువు విలువలు సంతృప్తికరంగా లేకపోతే కృత్రిమశ్వాస యంత్రంతో శ్వాసలు అందించాలి[5]. తగిన పీడనంతో గాలిబుడగలు మూసుకుపోకుండా చూడాలి. శ్వాసయంత్రంతో  ప్రాణవాయువు సంతృప్తత సాధించలేకపోతే దేహమునకు వెలుపల ప్రాణవాయువు అందించు యంత్రంతో రక్తానికి ప్రాణవాయువు అందించాలి. శ్వాసనాళికలలో సంకోచం తొలగించుటకు శ్వాసనాళికా వ్యాకోచకాలు (బ్రాంకో డైలేటర్స్) వాడాలి. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిలో సర్ఫేక్టంట్ అనే ఉపరితల రసాయనికం వాడి గాలిబుడగలను తెఱచి ఉంచాలి. ఊపిరితిత్తుల తాపం గలవారిలో తగిన సూక్ష్మజీవనాశకాలు వాడాలి.

దేహాంతర్గత ఉష్ణోగ్రతను గమనిస్తూ అల్పోష్ణోగ్రతను సరిచెయ్యాలి. దెబ్బలకు, గాయాలకు ఇతర రుగ్మతలకు చికిత్సలు చెయ్యాలి.

రోగి కుశలత


  చాలా తక్కువ కాలం మాత్రమే నీటిలో మునిగిపోయిన వారిలోను, పునరుజ్జీవన ప్రయత్నాలు త్వరగా చేపట్టబడిన వారిలోను, చన్నీళ్ళలో మునిగిపోయినవారిలోను, పిన్నవయస్కులలోను, ఇతర రుగ్మతలు తీవ్రగాయాలు లేనివారిలోను, రసాయనికాలు, రేణువులు ఊపిరితిత్తులలో చేరనివారిలోను కోలుకొనే అవకాశాలు హెచ్చు.

నీటి ప్రమాదాల నివారణ


  నిప్పున్నచోట అగ్నిప్రమాదాల అవకాశాలు ఉన్నట్లే, నీరున్నచోట మునిగిపోయే ప్రమాదాలు జరుగగలవనే స్పృహ కలిగి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి ప్రమాదాలు వాటి నివారణల గుఱించి ప్రజలలో అవగాహన పెంచాలి. 

మద్యం, మాదకద్రవ్యాలు వాడకపోవుట


ఈతకు వెళ్ళేవారు, పడవ ప్రయాణాలు చేసేవారు, పిల్లలను పర్యవేక్షించేవారు మద్యం, మాదక ద్రవ్యాలు వాడకూడదు.

ఈతలో జాగ్రత్తలు తీసుకొనుట


  ఈతగాళ్ళు వాతావరణాన్ని, నీటి పరిస్థితిని తెలుసుకొని విచక్షణా జ్ఞానం ఉపయోగించాలి.  ప్రమాదకరమైన జలప్రవాహాలలో ఈతకు దిగకూడదు. చలివేసినప్పుడు ఈత మాని నీళ్ళబయటకు వచ్చేయాలి. చన్నీళ్ళలో దిగకూడదు. ఈత బాగా తెలిసినవారితో కలసి ఈదుట మేలు. ఒకరి కింకొకరు రక్షకులుగా ఉండాలి. నీళ్ళలో దిగేముందు అధిక శ్వాసలు తీసుకోకూడదు. ఊపిరి బిగపెట్టి నీటి క్రింద ఎక్కువసేపు ఈదకూడదు. నీళ్ళలో ఎక్కువ లోతులకు గెంతకూడదు. సముద్ర కెరటాలలో ఈదేటప్పుడు కెరటాలకు ఎదురీదకుండా, సమాంతరంగా ఈదాలి.

ఈతకొలనుల తూములకు మూతలు


  ఈతకొలనులలో ఉండే నీటిని పీల్చుకొను తూములకు తగిన మూతలు ఏర్పాటు చేయాలి. మూతలు లేకపోతే ఈదేవారి జుట్టు, ఇతర శరీర భాగాలు వాటిలో చిక్కుకొనే అవకాశం ఉంది. 

ప్రాణరక్షకులు


  జనావళి ఈతకొట్టే సముద్రపు టొడ్డుల దగ్గఱ, కొలనుల వద్ద, సరస్సుల వద్ద శిక్షణ పొందిన ప్రాణరక్షకులను ప్రభుత్వాలు కాని, ఇతర సంస్థలు కాని ఏర్పాటు చెయ్యాలి. వీరు నీటిలో మునిగిన వారిని బయటకు తీయుటలోను, పునరుజ్జీవన ప్రక్రియలు చేయుటలోను మంచి శిక్షణ పొందినవారై ఉండాలి. 
ప్రాణరక్షణకు ఉపయోగించు తేల్చుసాధనాలు, ప్రాణ కవచాలు (life jackets), కొక్కీకఱ్ఱలు, అత్యవసర శ్వాస పరికరాలు, ప్రంకపన నివారిణులు (defibrillators) అందుబాటులో ఉండాలి.

అత్యవసర వైద్యసేవకులను పిలవగలిగే ఏర్పాట్లు కూడ అవసరం. నీటిలో మునిగిపోతున్న లేక మునిగిన వారిని రక్షించేవారు తాము మునిగిపోకుండ జాగ్రత్తలు తీసుకోవాలి.

యాంత్రిక మనుజ రక్షకులు


  నీటిలో మునిగిపోతున్నవారిని, మునిగిపోయినవారిని రక్షించుటకు, వారిని బయటకు తీసుకొని వచ్చుటకు యాంత్రిక మనుజులను (robots), ఎగురు సాధనాలను (drones) సురక్షితంగా వాడగలిగే సాంకేతికత అందుబాటులో ఉంది. అవి వారికి రక్షణ కవచాలు, యితర తేల్చెడి సాధనాలను త్వరగా అందజేయడమే కాక  వారిని బయటకు చేర్చగలవు కూడా.

పిల్లల సంరక్షణ


  ఈతకొలనులలో పిల్లలకు నిరంతర పర్యవేక్షణ ఉండాలి. పిల్లలు రక్షక కవచాలను గాని, ఇతర తేల్చుసాధనాలను కాని ధరించాలి. పిల్లలకు 1-4 సంవత్సరములలోనే ఈత పాఠాలు నేర్పాలి. స్నానపు తొట్టెలవద్ద, మరుగుదొడ్ల వద్ద,  నీరున్న ప్రతిచోట పిల్లలకు సమీపంలోనే పెద్దలు ఉండి నిరంతరం వారిని కంటికి రెప్పలా కాచుకోవాలి.

ఈతకొలనులకు కంచెలు


  దడులు కాని, కంచెలు గాని చుట్టూ  ఏర్పాటు చేసి పిల్లలు వారంతట వారు ఈతకొలనులలోనికి ప్రవేశించలేనట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

పడవ ప్రయాణీకుల సంరక్షణ


  పడవ ప్రయాణీకులు ప్రతిఒక్కరు ప్రాణకవచం ధరించిన తర్వాతే పడవలోనికి ఎక్కనివ్వాలి[5]. ప్రాణకవచం లేకుండా ఎవరూ పడవ ప్రయాణం చేయకూడదు. వాతావరణ, నీటి ప్రవాహ పరిస్థితులు బాగున్నపుడే పడవ ప్రయాణాలకు అనుమతులివ్వాలి. పడవ నడిపేవారు సుశిక్షితులై ఉండాలి. ప్రయాణీకులు పడవలో వారికి కేటాయించిన స్థానాలలోనే ఉండాలని హెచ్చరించి వారు గుమికూడుటను అరికట్టాలి. పడవలలో నిర్ణీత సంఖ్యకు మించి ప్రయాణీకులను ఎక్కించకూడదు. పడవలు నడిపే తీరులను ప్రభుత్వాంగాలు గమనిస్తూ వారు ప్రయాణీకుల సంక్షేమ నియమాలు ఉల్లంఘించకుండా గమనించాలి. పడవలలో ప్రయాణించేవారు మద్యం, మాదక ద్రవ్యాలు వినియోగించకూడదు. పడవలు నడిపేవారికి, ప్రయాణీకులకు కూడ నీటిప్రమాదాల గుఱించి అవగాహన కలిగేటట్లు బోధించాలి. విమానాలలో వలె పడవలు బయలుదేరే ముందు సురక్షిత సందేశాలు బోధించాలి.

మత్స్యకారుల సంరక్షణ


మత్స్యకారులకు ప్రాణకవచాలు లేక ఇతర వ్యక్తిగత ప్లవనసాధనాల అవసరము బోధించి వాటిని ధరించుట అలవరచాలి. అత్యవసర పరిస్థితులలో సందేశములు పంపి సహాయము కోరుటకు అవసరమగు సాంకేతిక పరికరములు ఏర్పాటు చెయ్యాలి

ఆరోగ్య సమస్యలు కలవారికి రక్షణ


మూర్ఛ, హృదయ లయలలో సమస్యలు ఉన్నవారికి, ఈతకొలనులలోను, పడవలలోను ప్రత్యేక పర్యవేక్షణ అవసరము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...