ఆకాశాత్ పతితం తోయమ్
కందము.
జలధర పతిత జలమ్ములు
గలగల సెలయేళ్ళఁ బాఱి కడలిని జేరున్
గొలిచెడి వేల్పుల మొక్కులు
విలసితమై వేగఁ జేరు విశ్వంభరునిన్.
మొక్కు = నమస్కారము, ప్రార్థన ; విలసితము = ప్రకాశవంతము
విశ్వంభరుడు = ఈ విశ్వమును భరించేవాడు > అఖిల పరమాత్మ.
మేఘముల నుంచి క్రిందకు పడే నీళ్ళు గలగలా సెలయేళ్ళలో ప్రవహించి సముద్రమును చేరుకుంటాయి. మనము కొలిచే అందఱి దేవతల ప్రార్థనలు ఒకే పరమాత్మను చేరుకుంటాయి.
అందఱు దేముళ్ళు ఒక్కరే అనే భావము .
సంస్కృతమూలము :
ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి.
మా విశాఖపట్నపు ఘనత
కం .
కన్నులు రెండై యుండియు
నున్నది యొక్కటిగఁ జూచు నొక్క తెరువులో ;
ఉన్నను బహు మతపథములు
తెరువు = పథము = మార్గము, బాట; పన్నుగ = ఒప్పుగా, చక్కగా; బ్రహ్మము = సత్యము = పరమాత్మ
ఒక వస్తువును రెండు కన్నులు చూచినా మనకు ఒక వస్తువు గానే కనిపిస్తుంది. అనేక మతము లున్నను వాటి గమ్యము ఒక పరమాత్మ మాత్రమే.
వాగర్థావివ
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !
[శబ్దము, దాని అర్థము వలె నిత్యసంబంధము గలవారైన పార్వతీ పరమేశ్వరులను శబ్దార్థ జ్ఞానము కొరకు ప్రార్థించు చున్నాను]
రఘువంశ కావ్య ప్రారంభం లో అంటే మొదటి శ్లోకం లో కాళిదాసు చేసిన పార్వతీ పరమేశ్వరుల స్తుతి.
అర్హత లేకపోయినా అర్థించడములో తప్పు లేదు కదా ! నా అనుకరణ తెలుగు పద్యము;
ఆ.వె.
తలపు తోడఁ బలుకు, పలుకున దలపును
గలిసి నటులఁ , దలపు పలుకు లొలుక
జగతిఁ గన్నవారు జగదీశు డుమలకుఁ
గేలుమొగిచి నన్ను నేలు డనెద !
కేలు మొగొచు = రెండు చేతులు జోడించి నమస్కరించు ; ఏలు = పాలించు ; కన్నవారు = తల్లిదండ్రులు.
శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి సవరణ ;
ఆ.వె.
తలఁపు తోడఁ బలుకుఁ, బలుకునఁ దలఁపును
గలిసి నటులఁ దలఁపుఁ బలుకు లిడఁగ
జగతిఁ గన్న శైలజా పరమేశులఁ
గేలుమొగిచి నన్ను నేలుఁ డనెద !
మాతృభాషా దినోత్సవ సందర్భంగా:
ఆ.వె.
తల్లిబాస చిందు మల్లెల నెత్తావి
చెవులు గలయ నింపుఁ జెఱకు రసము ;
ఎదలు విరియ మీటు నింపైన సవ్వడుల్
నోట నోటఁ జిలుకుఁ గోటి చవులు !
మాతృభాష
ఆ.వె.
పొట్టకూటి కొఱకు పొన్నూరు చొచ్చినా
సొంత యూరు పైన స్వాంతముండు !
బ్రతుకు దెరువు కొఱకు పరభాష నేర్చినా
స్వాంతము = మనస్సు
మిత్రులందఱికీ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు !
శ్రీ గురుభ్యో నమః
సీసము.
చేత బలపమిచ్చి చెలువుగా దిద్దించి
గ్రంథపఠనమందుఁ గడవని యాసక్తి
చిగురింపఁ జేసిరి శ్రేష్ఠగురులు
గణితశాస్త్ర గరిమ గుణముతోఁ గఱపిరి
సాంఖ్య సదృశులైన సదయగురులు
బహు రుజలను బాపు వైద్యశాస్త్రము సెప్పి
పుడమిలో నిల్పిరి పుణ్యగురులు
తే.గీ.
భేషు భేషని ప్రేమతో వెన్ను దట్టి
తప్పు లొప్పులుగాఁ గని దరికిఁ జేర్చ
సకల గురులనుఁ జింతలో స్వాగతించి
ప్రణతు లొసగెద భక్తితో భాగ్యమలర
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కఱపు = నేర్పు ; సాంఖ్యుఁడు = శివుడు ;
సదృశులు = సమానులు ;
రుజలు = రోగములు ; పాపు = తొలగించు
సంగీతజ్ఞులకు కుసుమాంజలి
సీసం .
సప్తస్వరమ్ములు స్వరపేటికను నిల్పి
వీణతంత్రులపైన వేళ్ళు నడిపి
లయబద్ధముగ పదలాలిత్యమును బెంచి
రాగయుక్తమ్ముగా రమ్యత చేకూర్చి
నాద డోలికలందు సేద దీర్చి
మనసు రంజింపంగ మధురిమలను నింపి
మంజుభాషణముల మైల నూపి
తే. గీ.
గాన పేయూషధారల గళము దడిపి
శబ్దవాద్యము లందున స్వరము గలుపు
సరస గాయనీ గాయక సభ్యులార
అందుకొనుడీ హృదయ కమలాంజ లిపుఁడు !
మై = శరీరము ; పేయూషము = అమృతము
స్నేహితులకు శుభాకాంక్షలు:
కం.
చూచిన హృది పులకించును,
చాచిన హస్తమ్ము తాక శాంతించు మదిన్,
దాఁ జెవుల వినిన ముదమగు,
వాచించిన దనివి దీరు వాల్లభ్యములో.
స్నేహితులందఱికీ శుభాకాంక్షలు 

సంస్కృత మూలం
శ్లో. దర్శనే స్పర్శనే వాపి శ్రవణే భాషణేపివా
యత్ర ద్రవత్యంతరంగం , సస్నేహఇతి కథ్యతే .
మా ఊరిలో మంచు
సీసం .
పాలకడలి పొంగి నేల ముంచిన భంగి
వెల్లదనము పూచె పల్లె యంత
ధవళ ప్రభల రాశి ధరణి రాలు సరణి
సితము వఱలె నుర్వి సీమ యంత
కప్పురపు పొడులు కప్పెఁ గాశ్యపి నన
శ్వేతచూర్ణము చిందె భూతలమ్ము
వసుమతీజములందు కుసుమవల్లుల తీరు
శుక్లపుంజము విచ్చె సురభిపైన
తే.గీ. అంచపిండులఁ బోలుచు మంచు పొరలు
పంచదారలు కరణిని ముంచె నవని
హేమరాశుల పూర్ణమై యిలయు వెలయ
ధవళవస్త్రము గట్టె మా ధరణి మాత !
మా ఊరిలో హేమంతము:
సీసము.
శీతాద్రి చెంతకుఁ జేరెనో మా యూరు
శిశిరము క్రమియించె శీఘ్ర గతిని
హిమలేహ్యమున దూకి యీదులాడిన రీతి
కాయము కంపించి గడ్డ కట్టెఁ
బొగరెక్కి చలిగాలి రగిలించె వాతము
కీళ్ళుఁ జాచి ముడువఁ గ్లేశ మొదవె
వికటించి కరువలి వెతఁబెట్టె దేహము
సిరలందుఁ బ్రవహించె శీతకారు
తే.గీ.
.
గోప్య మనుచును దరిచేరి కొఱికి ప్రీతి
శష్కులులఁ బట్టి పీడించెఁ జలువ గాలి
వికల మొందిన ప్రాణుల బెగడు పఱచె
ఋజుత నెఱుగని హేమంత ఋతువు క్రీడ !!!
.
శీతాద్రి = హిమాలయము ; శిశిరము = శీతకారు = శీతాకాలము; క్రమియించు = ఆక్రమించు ; శీఘ్రగతి = త్వరగా;
హిమలేహ్యము = గడ్డపాఱించిన పాలు, చక్కెరల మిశ్రమపు చల్లని ముద్ద; కాయము = దేహము = శరీరము ; రగిలించు = రగులింప జేయు; వాతము = కీళ్ళలో మంట ; క్లేశము = బాధ ; వికటించు =. ప్రతికూలించు, వ్యతిరేకముగా వర్తించు; కరువలి = గాలి ; వెతబెట్టు = కష్టబెట్టు; సిరలు = రక్తనాళాలు ; గోప్యము = రహస్యము ; దరిచేరి = దగ్గఱకు వచ్చి; శష్కులి = బయటి చెవి ; చలువ గాలి = చల్లగాలి; వికలము = కలవరము ; ఒందు = పొందు; బెగడు పఱచు = భయపెట్టు ; ఋజుత = నిష్కపటము
హిమాలయాల దగ్గఱకు ఊరు జరిగిందా అన్నట్లు చలి అంతటా ఆవరించింది. ఐస్ క్రీములో గెంతి, ఈత కొట్టినట్లు శరీరము వణికి గడ్డకట్టింది. చలిగాలి పొగరుగా కీళ్ళవాతాన్ని రాజేసింది. చాచినా ముడిచినా కీళ్ళు నొప్పి పెడుతున్నాయి. ప్రతికూలించి గాలి దేహాన్ని కష్టబెడుతుంటే, రక్తనాళాలలో శీతాకాలము పాఱసాగింది.
రహస్యము చెబుతానంటూ చలిగాలి దగ్గఱగా వచ్చి చెవులను కొఱికి బాధించింది . వక్రగతే తక్క నిష్కపటత నెఱుగని హేమంత ఋతువు కలవరపడుతున్న ప్రాణులతోచెలగాటమాడుతు భయపెట్ట సాగింది. చలి అనుభవ వేద్యమే గాని వర్ణనాతీతము.
సంక్రాంతి
సీసము
హేమంత ఋతువులో హేమరాశులు వోలె
పచ్చనై కసవులు పరగె ధాత్రి
ముచ్చటఁ బెట్టిన ముంగిట ముగ్గులై
మంచు పిండులు గొన్ని మలఁగె ఛవుల
హరికీర్తనలు పాడు హరిదాసు లన్నట్లు
హరిణము లేతెంచి యఱులుఁ జాపె
భూరి నాందులుఁ బల్కు భూసుర చందంబు
ద్విజలు కొన్నియు వ్రాలె దివము నుండి
తే.గీ.
పెద్దలందఱు దీవింపఁ బెంపు దోడఁ
గూర్మి చేకూరె నారోగ్యకోటిఁ గూడి !
అవని కీవల నుండియు నాస దీఱ
సంక్రమణము ప్రదీప్తుల సాగె మాకు
కసవు = గడ్డి ; పరగు = వ్యాపించు ; అఱులు = కంఠములు ; ద్విజలు = పక్షులు ; దివము = ఆకాశము ; నాంది = ఆశీర్వచనము
మనబడి తెలుగు విద్యార్థులకు శుభాకాంక్షలతో
సీసము.
చెట్టుఁ జెట్టున వ్రాలి చివురు కొమ్మల నాడి
సంజ గూళ్ళకు నేగు శాబ రీతి
పూఁవు పూఁవునఁ దేలి పూఁ దేనియలు గ్రోలి
తెరలి తుట్టెలుఁ జొచ్చు తేంట్లు భంగి
అటవు లంతట మేసి యంభా రవమ్ముల
దుమికి తల్లులఁ జేరు దూడలు వలె
కెరలి గెంతులు వైచి క్రీడఁ దీరముఁ గని
తిరిగి సంద్రముఁ గూడు తరగ గతుల
తే.గీ.
వేరు దేశమ్ము లందునఁ బేరు గాంచు
తెలుగు సింగపుఁ గొదమలు తేజరిల్లి
మాతృ భాషకై చేరగ మన బడులకుఁ
జదువు లొసగును మనతల్లి శారదాంబ !
ఏగు = పోవు ; శాబములు = పక్షి పిల్లలు ; తెరలు = బయలుదేఱు ; తుట్టెలు = తేనెతుట్టియలు ; చొచ్చు = ప్రవేశించు ; తేంట్లు = తేనెటీగలు ; అంభారవము = అంబా అను పిలుపుల ; కెరలి = విజృంభించి ; క్రీడ = ఆటగా ; తీరము = ఒడ్డు ; కను = చూచి ; తరగము = కెరటము ;
రీతి = భంగి = వలె = గతి = అటుల = విధము
(చెట్ట్లపై వ్రాలి లేత కొమ్మలపై ఆడుకొని సాయంకాలము గూళ్ళకు చేరే పక్షి పిల్లల వలెను, పూలపై తేలి , మకరందమును త్రాగి తేనెపట్టులకు చేరే తేనెటీగల వలెను, అడవులలో మేత మేసి అంబా అనుకుంటూ తల్లి ఆవుల దగ్గరికి గెంతుకొని చేరే దూడల వలెను , అతిశయముతో గెంతుకుంటూ ఆటగా ఒడ్డును పరికించి తిరిగి సముద్రములోనికి పోయే అలల వలెను , ప్రవాసాంధ్ర సింహకిశోరములు పేరు తెచ్చుకొని మాతృభాషపై మమకారముతో తెలుగు నేర్చుకుందుకు మనబడులకు వస్తున్నారు. వారికి మన శారదాంబ చక్కని చదువుల నిచ్చు గాక !)
వసంతములో
సీసము.
చిగురాకు సందులఁ జెలువింప దాగెనో
సిగ్గుల ముకుళించు చిన్ని మొగ్గ
మందార మధువులు మనసార గ్రోలెనో
మధుపంబు పాడునో మధుర గీతిఁ
గ్రొంజీర సొగసులు మంజూష నుంచక
సీమలఁ దిరుగాడు సీతకోక
పూవింటి మొనగాడు పొదరింటఁ జేరితే
సరిజోడు నేనంచు సన్నజాజి
తే.గీ.
గగనతారలఁ దలపించు గఱికపూలు
తలిరుఁబోఁడుల రూపులై ధరణి యందు
గండుకోయిల కూయగ గళము కలుపు
శ్రావ్యనాదము తోడ వసంత వేళ !
చెలువము = అందము ; మధుపము = తుమ్మెద ; క్రొంజీర = క్రొత్త చీర ; మంజూష = పెట్టె ; పూవింటి మొనగాడు = మన్మధుడు; తలిరుబోడి = స్త్రీ ;
నెల్సెన్ మండేలా
నెల్సన్ మండెలా పై పద్యము వ్రాయమని మా చెల్లెమ్మ శ్రీమతి రాయవరపు లక్ష్మి అడిగింది. ఇదిగో నమ్మా !
సీసం.
రంగు భేదము జూపి రాజ్యమ్ము లేలెడి
జాత్యహంకారులు జంకు వడగ
అణగారి యల్లాడి యశ్రువుల్ తొరగెడి
అసిత జనావళి యభయ మొంద
మానవుల్ సము లను మహిత మంత్రమ్మును
మానవాళియె నేర్చి జ్ఞాన మొంద
హెచ్చుతగ్గులు లేవు హీను లెవ్వరు కారు
హక్కు లందఱి సొత్తు లనగ జగతి
తే.గీ.
భీషణాకృతి ధరియించి బెట్టిదముగ
గర్జనల్ యిడి గెంతాడి కదన రీతి
నల్ల సింహము విదిలించె నల్ల జూలు
తెల్ల యేనుగు భీతిల్లి తల్లడిల్ల !
అశ్రువులు = కన్నీళ్ళు , తొరగు = కారు , స్రవించు ; అసిత = నలుపు ; అసిత జనావళి = నల్ల ప్రజలు ; బెట్టిదము = ఉధ్ధతి ; కదనము = యుధ్ధము; విదిలించు = దులుపు ; అల్ల = ప్రసిధ్ధమైన
( విదిలించెను + అల్ల జూలు = విదిలించె నల్ల జూలు )
శ్రీ శ్రీనివాస రామానుజన్
కం.
అంకెలు రామానుజునకుఁ
బొంకముగా నీరు, పాలబువ్వలు, శ్వాసల్,
బింకపు శిఖి వరనాట్యము,
లోంకార రవళిమధువులు, హొయల కుసుమముల్ !
క్రయ వ్యాధి
కం.
అనుదినమును విపణికిఁ జని
అనవసరపు వస్తుచయము నత్యభిలాషన్
వెనుకాడక వెచ్చమునకు
‘ కొను జబ్బుకు ' మందు లేదు కువలయమందున్ !
కొనుజబ్బు చికిత్సలేని విషజీవాంశ ( virus )వ్యాధి వంటిది. విపణివీధిలో జేబులు ఖాళీ అయ్యాక ఇమ్యూనిటీ వచ్చి దానంతట అది నయము కావాల్సిందే. వైద్యుల చేతిలో నయమయే వ్యాధి కాదు! ఈ వ్యాధి అంతర్జాలము ద్వారా కూడ సోకే అవకాశము గలదు.
నయం చేస్తానంటే చాలా మంది వస్తారు , జబ్బుపోగొట్టుకోడానికి కాదు, డబ్బు ఖర్చుబెట్టే మనస్తత్వముతో !
యథా రాజా తథా ప్రజా
ఆ.వె.
నీతి లేని రాజు నిలువ దోపిడి సేయ
మంత్రి కేల గలుగు మంచితనము ?
భటులె చోరు లైన భద్రత యెడ నుండు ?
రాజు నడచు రీతి, ప్రజల నీతి !!
గీర్వాణ వాణి
యథా దేశ స్తథా భాషా,
యథా రాజా తథా ప్రజా
యథా భూమి స్తథా తోయం,
యథా బీజస్తథాంకురః.
దేశం ఎట్టిదో భాష అట్టిది. రాజు ఎలా ప్రవర్తిస్తే ప్రజలు అలా ప్రవర్తిస్తారు.నేల ఎటువంటిదో నీరు దానికి తగినట్టే ఉంటుంది. విత్తనం ఎలా ఉంటే మొలక అలా ఉంటుంది.
అక్షరాస్యతా దినోత్సవ శుభాకాంక్షలు !
ఆ.వె
అక్షరములఁ బలుకు లక్షయమ్ముగఁ బాఱి
పుస్తకముల నిలుచుఁ బుడమి పైన
జ్ఞానమొసగుఁ బెంపు మానవులకు .
అక్షయము = నాశనము
మొన్న పున్నమి నాడు
కం.
పున్నమి దినమున మెండుగ
వెన్నెల గాయంగఁ జెలగి విన్నుకు నుఱకం
చెన్నుగ నీ శశము పడెను జెచ్చెర క్షితికిన్ !
చెలగు = విజృంభించు ; విన్ను = ఆకాశము ; శశి = చంద్రుడు ;చెన్నుగ = మనోజ్ఞముగా ;
చెచ్చెర = శీఘ్రముగా ; శశము = కుందేలు ; క్షితి = భూమి
కోర్కె దీఱిన భకుడు గొల్లు మనియె
.
నా చిన్నతనములో మా నాన్నగారు అసూయ తగదని చెప్పిన కథ.
ఇరుగు పొరుగులు ఇద్దఱు వనములో తపస్సు చేసుకొనుటకు వెళ్ళారుట. భగవంతు డొకనిని నీకేమి కావాలొ కోరుకొనుమంటే రెండవ వాని వద్దకు వెళ్ళి వాని కోర్కె దీర్చి తరువాత తనకు దానికి రెట్టింపు ఫలితము నొసగ మని అడిగాడుట.అప్పుడు పొరుగు వాడు తన కొక కంటిలో అంధత్వమును కోరాడుట. అప్పుడు మొదటి వ్యక్తికి రెండు కళ్ళూ పోయాయిట .
.
ఈ దినము (అక్టోబర్ 11, 2016)శంకరాభరణములో సమస్య " కోర్కె దీఱిన భకుడు గొల్లు మనియె "
నా పూరణ మా నాన్నగారు చెప్పిన కధే ! శ్రీ కంది శంకరయ్య గారికి వందనములతో
తే.గీ.
“పొరుగు గంటెను రెట్టింపు - పొసగఁ దనకు”
వరము కోరిన భక్తుని - బరుఁడు గనుచు
చీఁకు నడిగెను నొక కంట,- చెడిన కండ్లఁ
" గోర్కె తీఱిన భక్తుఁడు - గొల్లు మనెను."
.
(చీకు = గుడ్డితనము ; పొసగు = కలుగు )
నా మతము
కం.
మనుజుల హితమును సతతము
మనమున బెంపొందఁ జేసి, మానవసేవే
మనవిభుసేవగ మప్పెడి
మనుజావళి మతము లోన మసలెద స్వామీ !
సాతాళించిన శనగలు
కం.
సాతాళించిన శనగలు
మోతాదుగఁ బెట్టి చూడ మోదం బలరన్
శ్వేతస్సుహృదుఁడు గటకట !
ప్రేతంబై కేక పెట్టెఁ బ్రేరణ మేదో ??
నీతి : శ్రావణ శుక్రవారపు శనగలు, కారాలు అందఱూ సహించలేరు. తెల్లవారితో జాగ్రత్త చాలా అవసరం .
చతురక్షి
చత్వారము వచ్చిన కొత్త రోజులలో సరదాగా వ్రాసుకున్న పద్యము !
కం.
జంటగ రెం డద్దంబులు
కంటికి కనుచూపు బెంచ, గాంచెడి మనుజున్
దుంటరి ' చతురక్షి ' యనియె !
కంటద్దము లెట్లు కళ్ళు కాగల విలలో ?
తుంటరి = అల్లరి పిల్లవాడు ; చతురక్షి = నాలుగు కళ్ళు గలవాడు ; ఇల = ప్రపంచము
వెనుదిరిగిన గడియారము, నిదురించిన మా కోడి
(నవంబరు 1, 2020)
ఈ దినము హేమంతంలో అలవాటు ప్రకారం మా గడియారాన్ని ఒక గంట వెనక్కు జరిపారు.
కం .
అదరక యెదలో బెదరక
నిదురించెను రాత్రియంత నిబ్బరమదితో
నుదయగతి మందగించగ
నదనుగ మాకోడి కూసె నాలస్యముగా !
అందువలన నేను కూడా మరో గంట పడుక్కొన్నాను .
జాలపు చదువులు
ఆ.వె.
అభ్యసించకుండ, యంత్రవిద్యల నెల్ల
చదివి, చదివి, నేర్చి జాలమందు ;
గోడమీద మేకు గొట్టజాలని వాడు
సుత్తి
కొట్ట నోపుఁ జోద్యముగను ! 
యంత్రవిద్య = engineering studies; జాలము = అంతర్జాలము ( internet ): ఓపు = సమర్థుడగు
ధర్మము
సనాతనమైనా , వినూతనమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ యుగమైనా ధర్మము ఒకటే.
కం.
ధర్మంబనగా సత్యము,
ధర్మమహింస, సమత, దయ, ధర్మము క్షమయే,
ధర్మము పరోపకార, మ
ధర్మము పరపీడనంబు ధర నెందెడలన్ !
కం.
గళమున గరళము నిల్పెడి
నెలతాలుపుఁ బోలి నీవు నిలుపవె, గోళీ
నిలకడ గళబిల మందున
గళము = కంఠము ; గరళము = విషము; నెలతాలుపు = నెల( చంద్రుడు )ను ధరించిన వాడు - ఈశ్వరుడు ;
గళబిలము = కంఠరంధ్రము ; ఇల = భూమి ;
ఈశ్వరుడు తన కంఠబిలములో గరళమును నిలుపు నట్లు సోడా కాయ తన కంఠబిలములో గోళీ నిల్పి భూజనులకు దాహము తీర్చుతుంది.
పెళ్ళి పందిరిలో ఊడిపోయిన వరుడి విగ్గు, పెళ్లి నిరాకరించిన వధువు.
కం.
నిగ్గుగఁ దలపై నుండక,
దగ్గినచోఁ గ్రిందపడుచుఁ దరుణుల మధ్యన్
అగ్గలముగ సిగ్గిచ్చెడి
విగ్గులు తెగ నెగ్గు గూర్చు వినరా న(వ)రుడా !
అగ్గలము = అధికము ; ఎగ్గు = కీడు
కరచాలనము
ఆ.వె.
అంటుకొనుట మాని యంటించి చేజోడి
నైదుపదిగఁ జేసి యాదరమ్ము
సేయుటదియు కరము క్షేమంబు సర్వత్ర
అందుచేతఁ గొనుడు వందనమ్ము ! 🙏
ఐదుపదిగఁ జేయు = నమస్కరించు ; ఆదరము = మన్నన.
మద్యపానీయుల దినమట
ఈ దినము (మార్చి 6, 2021) త్రాగేవారి దినమని మిత్రులొకరు సెలవిచ్చారు.
మద్యప్రియులు కొందఱు , పద్యప్రియులు కొందఱు , కొందఱు ఉభయప్రియులు .
ఉ.
పద్యము లిచ్చు హాయి మదిఁ బ్రాణము లేచును గైతలన్నచో,
గద్యములైనఁ బ్రీతి, యవి గంతులు వైచిన గంగవోలెయుం ,
జోద్యము ! మద్యపానముగఁ జొక్కుదుఁ బాడరె పద్యముజ్యతిన్ !
మద్య మదేల నాకుఁ? గడు మత్తును గొల్పగఁ బద్యరాశులున్ !
'పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్! '
సమస్య నిజానికి సమస్య కాదు , నిత్యము నేను చూసేదే ! నా సమస్యా పూరణము
కం.
వేదన నొందుట గంటెను
సాధనమున బ్రతుకు నీడ్చు సంకల్పముతో
చేదండము లూతగొనుచు
పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్!
పుత్రోత్సాహము
మా ఆప్తమిత్రుఁడు వెంకటరామయ్య కీ పద్యా లంకితము !
కం.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టియు, జనులా
పుత్రుని గనుగొని పొగడగఁ
బుత్రోత్సాహంబు నాఁడుఁ బూర్ణత నొందున్ !
కం.
అల్లుడు వచ్చిన దినమున
నుల్లము సంతసము నొంద నొల్లక జగతిన్
గొల్లగ ధనము గడించిన
నల్లుని గని మామ నాఁడు హ్లాదము నొందున్ ! 
ఉల్లము = హృదయము, మనస్సు ; ఒందు = పొందు ; ఒల్లక = ఇష్టపడక ; కొల్లగ = ఎక్కువగా ; హ్లాదము = సంతోషము
ఉర్దూ కవితలకు నా అనుసరణ
కీ. శే. శ్రీ ఉన్నవ నాగేశ్వరరావు గారు ఘాలిబ్ ఉర్దూ గేయాలను తెలుగు తాత్పర్యాలతో సహా మే 24, 2015 న నిలిపారు. వాటిని అనుసరించి నా పద్యాలు నిలిపాను.
ఉర్దూ కవిత--అరుదు హాస్య కవిత .
గోవిందుడు అందరివాడేలే
हम ने मोहबतों के नशे में आ कर उसे खुदा बना डाला ,
होश तब आया जब उसने कहा की खुदा किसी एक का नहीं होता
నేను ప్రేమ కైపు లో పడి ఆమెను ఒక దేవతను చేసి కూర్చోపెట్టాను
నాకు మత్తు ఎప్పుడు దిగిందంటే "దేవత యే ఒక్కరికే చెందదు కదా" అని ఆమె అన్నప్పుడు.
అరచేతిలో అదృష్టం
हाथों के लकीरों पे मत जाऐ ग़ालिब ,
नसीब उनके भी होते हैं जिनके हाथ नहीं होते
నీ అదృష్టం కోసం హస్తరేఖలు చూసుకుంటూనే పోవద్దు
చేతులు లేనివాళ్ళకు కూడా అదృష్టం ఉంటుందని మరువవద్దు.
ఉందిలే మంచీ కాలం
ये बुरे वख्त , ज़रा अदब से पेश आ
क्योंकि वख्त नहीं लगता,वख्त बदलने मे
యేయ్ చెడ్డ రోజులూ, కాస్త వొళ్ళు దగ్గర పెట్టుకోని రండి
చెడ్డ కాలం మారటానికి ఎక్కువ కాలం పట్టదు.
మీర్జా ఘాలిబ్
శ్రీ ఉన్నవ నాగేశ్వర రావు గారికి వందనములు. ఘాలిబ్ గేయాలకు శ్రీ ఉన్నవ నాగేశ్వర రావు గారి అనువాదానికి నా స్వేచ్ఛానువాదము.
వెల్లివిరిసిన ప్రేమతో విరులు దెచ్చి
దేవతను జేసి పూజింప దెలిపె నామె
సకల జనుల విత్తమునని ; వికలమైన
మనము తోడ నొంటరినయి మఱలి పోతి
చేతి రేఖలు జూచుచు జెప్పెదరట
హస్తసాముద్రికు లదృష్ట విస్తరములు
హస్తహీనుల భాగ్యమ్ము లాప గలరొ
లేని రేఖల నిత్తురో లేమి భువిని !
చేటు కాలమ ! మేనుపై చింత జూపు !
చేటు కాలమ ! యుండవు స్థిరము గాను !
చేటు నొందవ ? కాలమా ! మాట వినుము !
శుభము లొసగుము సద్భావ శుద్ధి గలుగ !
సంధ్యావందనము
శ్రీ అఫ్సర్ గారి ఆంగ్ల కవితకు నా స్వేచ్ఛానువాదము.
(శ్రీ అఫ్సర్ గారికి ధన్యవాదములతో)
Afsar
call this morning yourself
honking each word into your dead ears
hurling each breath into your blind eyes
waking up early to break certain things from the past and to wet hands, feet and face from their smelly filthiness with fresh water reciting the holy verses and performing the prayer turning towards any direction – not the fixed one.
I resist any fixation and
my direction is fluid and slips away like water.
mornings are well-written prefaces of a book,
a face that washes off its last night’s
dirtiness of mouth and heart too.
call this morning yourself
pouring several drops of purity into your senses
scrubs your present
from its dirty and tense limbs.
the world is empty out there,
call this morning yourself,
recite the morning verse deafeningly
right into your dead ear!
సంధ్యా వందనము
(మూలము- అఫ్సర్: అనువాదము- డాక్టర్. గన్నవరపు వరాహ నరసింహమూర్తి)
పిలువ రాదె నిన్ను పెందలకడ వేళ
చెవిటి చెవుల లోన చేసి రొదలు
శ్వాస విడచి నీదు మూసిన కళ్లందు
చాలు నిద్ర యనుచు మేలుకొనవె
ప్రాత విడుపు గాదె ప్రత్యూష వేళందు
కళ్ళు ముఖము కాళ్ళు కడుగ జలము
సంధ్య వేళ శ్రుతులు స్మరణ చేయగ బూన
నొక్క దిక్కు కేల మ్రొక్కు లీయ
ఒక్కటొక్క టంచు నొక్కయు దిక్కేల
ద్రవము నౌట నాదు దర్శనంబు
పాఱు నన్ని దిశల ప్రాజ్ఙత పెంపార
పవన రీతి నాదు ప్రార్ధనంబు
ప్రొద్దు పొడుచు వేళ ముద్దు ముందటి మాట
మాపటందు గూడు మలిన మూడె
మొము వాయి పాడ మోహన రాగమ్ము
ఎదయ తమ్మి విచ్చె నుదయ మందు
పిలువ రాదె మఱల పెందలకడ వేళ
తర్పణంబు జేసి తపము జలము
ఇంద్రియమ్ము లందు నిమ్ముగా నొలికించి
చక్షురాశి తెరుమ సంధ్య వేళ
శున్య మావరించె సుందర జగతంత
పిలువ రాదె నిన్ను వేకు వందు
చెవులు చిల్లు పడగ చేయుచు ప్రార్ధన
వింధ్య వోలె వంగి సంధ్య వేళ.






కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి