ఒక వ్యక్తి ఆరోగ్యస్థితి తెలుసుకోడానికి వైద్యులు తొలుత వారి ఆరోగ్య చరిత్ర తెలుసుకుని, ఆ వ్యక్తి శరీరాన్ని పరీక్షిస్తారు. ఆ పరీక్షను ‘శారీరక ‘ లేక వైద్యపరీక్షగా (ఫిజికల్ ఎగ్జామినేషన్) పరిగణించవచ్చు. రోగులు వారి వారి బాధల చికిత్సల కొఱకు వైద్యుల దగ్గఱకు వెళ్ళినప్పుడు కూడా వైద్యులు రోగులను సంగ్రహంగా పరీక్షిస్తారు. చాలా సమాజాలలో విద్యార్థులకు సాంవత్సరిక శారీరక పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ అయింది. ఆటల్లో పాల్గొనే విద్యార్థులకు, క్రీడాకారులకు శారీరక పరీక్షలు నిర్వహించడం కూడా సర్వసాధారణమైంది. ఉద్యోగులను కొత్తగా నియమించుకున్నప్పుడు వారి ఆరోగ్యవివరాలు తెలుసుకొనేందుకు వివిధ సంస్థలు వారికి శారీరక పరీక్షలు నిర్వహించడం కూడా సామాన్యమే.
వ్యాధులు శరీరంలో వివిధ అవయవాలపై వాటి ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి రోగులు వైద్యులను సంప్రదించినపుడు వైద్యులు వారి శరీరాన్ని పూర్తిగా పరీక్షించడం సాధారణం. ఈ పరీక్షలు అవసరం బట్టి సంగ్రహంగా కాని, సవివరంగా కాని ఉండవచ్చు. [1]
అనారోగ్యంతో బాధపడుతున్నవారికి శారీరక పరీక్షలు తప్పకుండా అవసరం. శరీరాన్ని పరీక్షించడం వలన రోగి పరిస్థితితో పాటు, శరీరంలో వివిధ అవయవాలలో గల నిర్మాణాత్మక లోపాలు, వాటి పనితీరు తెలుసుకోవచ్చు. వారిలో ప్రధాన జీవలక్షణాలైన (వైటల్ సైన్స్) ధమనివేగం, రక్తపీడనం, ఉష్ణోగ్రత, శ్వాసవేగం రోగి పరిస్థితిని తెలియజేస్తాయి. వివిధ వ్యవస్థలను పరీక్షించి వైద్యులు వ్యాధి నిర్ధారణ విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు, లేక ఆపై అవసరమైన పరిశోధన పరీక్షలను, చికిత్సలను నిర్ణయించగలుగుతారు.[1]
ఏ బాధలు లేనివారికి శారీరక పరీక్ష చేసినప్పుడు వారిలో మరుగుపడి ఉన్న రుగ్మతలు బయటపడే అవకాశం ఉంది. గుండెలో మర్మరశబ్దాలు, రక్తపీడనం ఎక్కువవడం, ఉదరంలో పెరుగుదలలు, హెర్నియాలు, స్త్రీలలో స్తనాలలో పెరుగుదలలు శారీరక పరీక్షలలో బయటపడే అవకాశం ఉంది. శారీరక పరీక్షలు నిర్వహించినపుడు ఆ వ్యక్తుల మానసికస్థితిగతుల గుఱించి తెలుసుకుంటే సమాజంలో ప్రాబల్యంగా ఉన్న మానసిక కుంగుబాటుతో పాటు యితర మానసిక వ్యాధులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వాటికి చికిత్స చేయడంవల్ల వారికి ఉపశమనం కలిగించడమే కాక ఆత్మహత్యలను, మానసికవ్యాధుల వలన వచ్చే అరిష్టాలను అరికట్టే అవకాశం ఉంది. విద్యార్థులలో కంటిపరీక్షలు నిర్వహిస్తే దృష్టిలోపాలు బయటపడి వాటిని సవరించే అవకాశం ఉంటుంది.[2]
శారీరక పరీక్షతో పాటు రక్తకణ గణనలు (బ్లడ్ సెల్ కౌంట్స్), జీవక్రియలు (మెటబాలిజం) తెలిపే రక్త రసాయనక పరీక్షలు కూడా చేస్తే తొలిదశలో ఉన్న రక్తహీనత, మధుమేహవ్యాధి, పెరిగిన కొలెస్ట్రాలు, గళగ్రంథిహీనత (హైపోథైరాయిడిజం) వంటి రుగ్మతలు బయటపడతాయి. వాటికి చికిత్స చేసే అవకాశం కలుగుతుంది.[3]
నలభై సంవత్సరాల వయసు మించినవారిలో కర్కటవ్రణాలకై శారీరక పరీక్షలతో పాటు ప్రత్యేక శోధనపరీక్షలు చేయాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తారు. [4]
కాకపోతే ఈ శారీరక పరీక్షలలో ప్రమాదకరం కానివి, వైద్యపరంగా ముఖ్యమైనవి కాని విషయాలు కనిపించి అనవసరపు పరిశోధన పరీక్షలకు, అనవసరపు ఆందోళనలకు దారితీసే అవకాశముంది. [5]
ఆరోగ్య చరిత్ర
శారీరక పరీక్షలలో వ్యక్తికి గల శారీరక బాధల (సింప్టమ్స) వివరాలు తెలుసుకోవడం వైద్యుల ప్రథమ కర్తవ్యం. బాధ ఎన్నాళ్లుగా ఉందో, ఎలా వృద్ధి చెందుతున్నదో, దానికి తోడుగా యింకేమి బాధలున్నాయో, బాధకు దేని వలన ఉపశమనం కలుగుతుందో, దేనిచే బాధ ఎక్కువ అవుతుందో మొదలగు వివరాలు బాధ వర్తమాన చరిత్రకు చెందుతాయి.[1]
ఆపై వైద్యులు వ్యక్తుల పాత వ్యాధుల గుఱించి, వారు వాడుతున్న మందులను గుఱించి, వారికి గల అసహనతలను (ఎలర్జీస్) గుఱించి, వారికి జరిగిన శస్త్రచికిత్సల గుఱించి వివరాలు సేకరించి గతచరిత్రగా నమోదు చేస్తారు. [1]
ధూమపానం, సారాయి వినియోగం, మాదకద్రవ్యాల వినియోగం యితర వ్యక్తిగత సమాచారాలు వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వైద్యులు ఆ వివరాలు వ్యక్తిగత చరిత్రలో పొందుపరుస్తారు.[6]
తల్లిదండ్రుల ఆరోగ్యసమస్యలు, తోబుట్టువుల ఆరోగ్యసమస్యలు, రక్తబంధువులలో గల ఆరోగ్యసమస్యలు వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి, కాబట్టి వాటిని సేకరించి కుటుంబ చరిత్రలో పొందుపరుస్తారు[6].
శారీరక పరీక్ష
వైద్యులు శారీరక పరీక్ష చేసేటప్పుడు సాధారణంగా కనిపించే విషయాలు పరిశీలిస్తూ, వ్యక్తిలో కనిపించే అసాధారణ చిహ్నాలను (సైన్స్) గమనిస్తారు.[1]
ప్రధాన జీవలక్షణాలు (వైటల్ సైన్స్):
ఇవి ఉష్ణోగ్రత, ధమనివేగం, రక్తపీడనం, శ్వాసవేగం . ఇవి వ్యక్తి ఆరోగ్యపరిస్థితిని తెలియజేస్తాయి. వాటిని ముందుగా వైద్యుల సహాయకులు, కాని వైద్యులు గాని గ్రహిస్తారు. వాటిలో తీవ్రమైన అసాధారణలు ఉన్నట్లయితే వైద్యులకు తెలిపి అవసరమైన అత్యవసర చికిత్సలు వెనువెంటనే అందించాలి.[7]
వైద్యులు వ్యక్తులను శారీరకంగా పరీక్షించేటప్పుడు రుచి తప్ప వారి మిగిలిన నాలుగు జ్ఞానేంద్రియాలు ఉపయోగిస్తారు. శరీరభాగాలను ఐదు ప్రక్రియలతో పరీక్షిస్తారు. ఇవి దర్శనం (చూచుట / ఇన్స్పెక్షన్), స్పర్శనం(తాకుట/పాల్పేషన్), వాదనం (వేలిమ్రోత/పెర్కషన్), శ్రవణం (వినికిడి/ఆస్కల్టేషన్), ఆఘ్రాణం (వాసన చూచుట/స్మెల్లింగ్)[8].
దర్శనం (ఇన్స్పెక్టన్)
ఇందులో వైద్యులు శిక్షణ పొంది శరీరంలో వివిధ భాగాలను పరిశీలించి సాధారణ విషయాలను, అసాధారణ విషయాలను కూడా వీక్షిస్తారు[8].
స్పర్శనం (పాల్పేషన్)
ఇందులో వైద్యులు తమ అరచేతి వేళ్లతో సున్నితంగా తాకుచు, నొక్కుచు శరీరపు భాగాలను పరీక్షిస్తారు. అరచేతివేళ్ళతో నొక్కినప్పుడు వ్యక్తి ముఖకవళికలను గమనించి నొప్పి కలిగిందో (పీడనవేదన/టెండర్ నెస్) లేదో గమనిస్తారు. శరీరం లోపల గల పెరుగుదలలను, వాటి లక్షణాలను కనుక్కుంటారు. [9]
వాదనం (పెర్కషన్)
ఈ ప్రక్రియలో వైద్యులు ఒక చేతి వేలును శరీరపు భాగానికి ఆనించి ఆ వేలుపై రెండవచేతి మధ్యవేలుతో మోది వచ్చే ప్రతిధ్వని ప్రమాణం బట్టి ఆ అవయవం లేదా శరీర భాగపు సాంద్రత తెలుసుకుంటారు. డొల్లతనం, గట్టితనం, బండతనాలను అంచనా వేస్తారు. గాలితో నిండిన ఊపిరితిత్తులపైన, ఉదరంలో గాలితో నిండిన జీర్ణాశయంపైన , ప్రేవులపైన వాదనం చేసినప్పుడు ప్రతిధ్వని ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తిని ఆవరించుకొని ఉన్న పుపుసవేష్టనం (ప్లూరా) రెండు పొరల మధ్య గాలి చేరుకున్నప్పుడు (న్యూమో థొరాక్స్), ఆ ఊపిరితిత్తిపై గల ఛాతిభాగంపై వాదనం చేసినప్పుడు ప్రతిధ్వని డప్పు మ్రోగినట్లు చాలా ఎక్కువగా ఉంటుంది. పుపుసవేష్టనంలో నీరు చేరితే (ప్లూరల్ ఎఫ్యూజన్) ప్రతిధ్వని తక్కువై మందంగా ఉంటుంది. సాంద్రత గల కండరాలు, గుండె, కాలేయం వంటి అవయవాలపై మోదినప్పుడు ప్రతిధ్వని తక్కువగా ఉండి గట్టితనాన్ని సూచిస్తుంది. గట్టి ఎముకల పైన వాదనం చేస్తే రాయిమీద మోతలా ప్రతిధ్వని ఏమీ రాదు. వైద్యులు వాదనం చేసి, అవయవాల సాంద్రత, పరిమాణం, అంచులు అంచనా వేయగలరు.[10]
శ్రవణం (ఆస్కల్టేషన్)
వినికిడి గొట్టం (స్టెతస్కోప్) ఉపయోగించి వైద్యులు గుండె శబ్దాలను (హార్ట్ సౌండ్స్) , మర్మర శబ్దాలను (మర్మర్స్), ఊపిరితిత్తుల ఉచ్ఛ్వాస నిశ్వాసాల శబ్దాలను (బ్రెత్ సౌండ్స్), ఊపిరితిత్తులలో పిల్లికూతల వంటి అసాధారణ శబ్దాలను, ప్రేగులలో శబ్దాలను (బవెల్ సౌండ్స్) వినగలుగుతారు. ఈ శబ్దాల లక్షణాలు వివిధ వ్యాధులను నిర్ధారించడానికి సహాయపడుతాయి.[11]
ఆఘ్రాణం
ఆఘ్రాణం వైద్యులకు అరుదుగా ఉపయోగపడుతుంది. మధుమేహం వ్యాధి గలవారిలో రక్తంలో కీటోన్లు ఎక్కువై రక్తం ఆమ్లీకృతమైనప్పుడు (కీటో ఎసిడోసిస్) వారినుండి మగ్గిన పళ్ళ వాసన రాగలదు. మూత్రపిండాల పనితీరు క్షీణించినవారిలో రక్తంలో యూరియా పరిమాణం పెరిగినప్పుడు వారినుండి చేపల వాసన రాగలదు. [12]
ప్రధమ వీక్షణ
వైద్యులు వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి భౌతికస్థితిని, మానసిక స్థితిని పరిశీలిస్తారు. వ్యక్తి పోషణ, పెరుగుదల, నడకతీరులలో అసాధారణలు గమనిస్తారు. దుస్తులు వదులుగా ఉంటే ఆ వ్యక్తి ఇటీవల కాలంలో బరువు తగ్గినట్లు గుర్తిస్తారు. ఒడలు పాలిపోయి ఉంటే గమనించి రక్తహీనతకు శోధిస్తారు. చేతుల్లో వణుకు ఉంటే గళగ్రంథి ఆధిక్యతకు, పార్కిన్సోనిజం వంటి నాడీమండల వ్యాధులకు శోధిస్తారు. వ్యక్తికి పచ్చకామెర్లు, నీటిఉబ్బు ఉన్నాయేమో పరిశీలిస్తారు.ఆపై శారీరక పరీక్షను తలతో మొదలుపెట్టి, పాదాలతో ముగిస్తారు[8].
కళ్ళను పరీక్షించేటప్పుడు కనుపాపలను పరీక్షిస్తారు. రెండు వైపులా కనుపాపలు గుండ్రంగాను, సమానంగాను ఉండాలి. కరదీపికతో కాంతిని కళ్లలోకి ప్రసరింపజేసినప్పుడు కనుపాపలు సంకోచించాలి. కాంతిని తొలగించాక అవి మఱల వ్యాకోచించాలి. ఇది కాంతికి కనుపాపల అసంకల్పిత ప్రతీకారచర్య (కాంతి స్పందన / లైట్ రిఫ్లెక్స్). కళ్ళకు ఎదురుగా దూరంగా చూపుడువేలు పెట్టి ఆ వేలును కళ్ళకు దగ్గరగా జరిపినప్పుడు కనుపాపలు సంకోచించాలి. వేలును దూరంగా జరిపితే కనుపాపలు మఱల వ్యాకోచం చెందాలి. ఇది చూచే వస్తువుల దూరానికి కనుపాపల సర్దుబాటు అసంకల్పిత ప్రతిస్పందన (సర్దుబాటు స్పందన/ఎకామొడేషన్ రిఫ్లెక్స్). [14]
నేత్రగుహలలో కళ్ళ కదలికలను (పైకి, క్రిందకు, రెండువైపులకు, నాలుగు మూలలకు) కూడా పరీక్షిస్తారు. కన్నుల కదలికలలో లోపాలు 3,4,6 కేంద్రనాడులలోను, కేంద్రనాడీమండలంలోను గల వ్యాధులను సూచిస్తాయి. ఆపై కనురెప్పలను (లోపల, బయట), వాటి కదలికలను పరిశీలిస్తారు. కనుగుడ్ల బయటి పొరలను (కంజన్ క్టైవే), శుక్లపటలాలను (స్క్లీరాస్), స్వచ్ఛపటలాలను (కార్నియాస్) పరీక్షిస్తారు. కృష్ణపటలాలను(ఐరిసెస్), కంటి ముందు అరలను కూడా చూస్తారు. అనుభవజ్ఞులు నేత్రదర్శినితో (ఆఫ్థాల్మోస్కోప్) కంటిలోపలి నేత్రాంతఃపటలాలను (రెటీనాస్), నేత్రగోళమూలాలను (ఫండై) కూడా పరీక్షిస్తారు.[15]
వైద్యులు మెడలో కండరాల బిగుతును పరిశీలిస్తారు. మెడ కదలికలను పరీక్షిస్తారు. మెడ ముందుభాగంలో శ్వాసనాళం మధ్యలో క్రిందికి దిగుతున్నదో లేక ఒక ప్రక్కకు ఒరుగుతున్నాదో చూస్తారు. గళగ్రంథి (థైరాయిడ్) పరిమాణం సాధారణంగా ఉందో లేక పెరిగిందో చూస్తారు. గళగండము (గాయిటర్) ఉంటే అది స్పష్టంగా కనబడుతుంది. రసిగ్రంథులు (లింఫ్ నోడ్స్) పెరిగి ఉన్నాయేమోనని పరిశీలిస్తారు. వ్యక్తిని తల 30 డిగ్రీల ఎత్తులో ఉంటున్నట్లు పడుకోబెట్టి అంతర కంఠసిరలలో ఉబ్బు (జుగులార్ వీనస్ డిస్టెన్షన్) ఉందేమో పరిశీలిస్తారు. ఆ ఉబ్బు హృదయవైఫల్యానికి సూచిక. మెడలో ఇతర పెరుగుదలలను కూడా పరీక్షిస్తారు. గళధమనుల (కెరాటిడ్ ఆర్టెరీస్) నాడులను వేఱు వేఱు తడవులలో (రెండు గళధమనులను ఒకేసారి పరీక్షించకూడదు) స్పృశించి పరీక్షించి ఆపై వినికిడి గొట్టంతో వాటిలో అసాధారణ మర్మర శబ్దాలకు పరీక్షిస్తారు[13].
ఛాతిలో గుండె, ఊపిరితిత్తులు, పెద్ద రక్తనాళాలు, అన్నవాహిక ముఖ్యమైన అవయవాలు. రసిగ్రంథులు, థైమస్ గ్రంథి కూడా ఛాతిలో ఉంటాయి. ఊపిరితిత్తులను ఆవరించి రెండుపొరల పుపుసవేష్టనము (ప్లూరా) ఉంటుంది. గుండెను ఆవరించి హృదయవేష్టనం (హృత్కోశము/పెరికార్డియమ్) ఉంటుంది[19].
దర్శనము
వైద్యులు ఛాతిని పరీక్షించినపుడు ఛాతి ఆకారం చూస్తారు. ఉబ్బసం, దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) గలవారిలో ఊపిరితిత్తులు ఉబ్బి ఉండడం వలన ఛాతి ముందు వెనుకల పరిమాణం పెరిగి పీపాయి ఆకారంలో ఉంటుంది. ప్రక్కటెముకల మధ్య ఖాళీలు పెరిగి ఉంటాయి. ఊపిరి తీసుకున్నప్పుడు ఛాతి పరిమాణం వివిధ భాగాల్లో ఎంత పెరుగుతుందో వైద్యులు గమనిస్తారు. ఊపిరితిత్తుల వ్యాధులు గలవారిలో ఆయా ప్రాంతాల్లో ఛాతి వ్యాకోచం తక్కువగా ఉంటుంది. ఛాతి ముందట గుండెమొన బాగా తాకే బిందువును (పాయింట్ ఆఫ్ మేక్సిమమ్ ఇంపల్స్) వైద్యులు గుర్తిస్తారు. వయోజనులలో సామాన్యంగా ఇది ఐదు, ఆరు ప్రక్కటెముకల మధ్యస్థలంలో, ఎడమ అక్షకాస్థి మధ్యస్థరేఖకు (మిడ్ క్లావిక్యులార్ లైన్) అర అంగుళం లోపల ఉంటుంది. హృదయపరిమాణం పెరిగినవారిలో ఈ బిందువు క్రిందకు, ఇంకా వెలుపలకు ఉంటుంది[19].
స్పర్శనం
వైద్యులు ఛాతిని స్పృశించి పరీక్షించునప్పుడు కూడా ఉచ్ఛ్వాసంతో ఛాతిలో వివిధభాగాలు ఎలా పెరుగుతాయో గమనిస్తారు. గుండెమొన ఛాతిని బాగా తాకే బిందువును గుర్తిస్తారు. గుండెపై ఉండే ఛాతి ముందటి భాగంపై అరచేతిని ఉంచి స్పర్శకు అందే మర్మరశబ్దాలకు (థ్రిల్స్) పరీక్షిస్తారు. [20]
వాక్కంపన స్పర్శ (వోకల్ ఫ్రెమిటస్)
ఈ పరీక్షలో వ్యక్తిచే ఒకపదాన్ని (ఉదా: పదిహైను, పదిహైను) పదే పదేపదే పలికిస్తూ ఆ పదం వలన వచ్చే కంపనాన్ని ఛాతిపై వివిధ భాగాలలో స్పర్శిస్తూ ఆ కంపనస్పర్శను పోలుస్తారు. ఊపిరితిత్తులలో తాపం (న్యుమోనియా) లేక కర్కటవ్రణాల (కేన్సర్స్) వంటి ఇతర వ్యాధులవలన ఘనీకరణం (కన్సాలిడేషన్) కలిగినా, ఊపిరితిత్తులలో తంతీకరణం (ఫైబ్రోసిస్) కలిగినా, ఊపిరితిత్తులలో నీటి ఉబ్బు (పల్మనరీ ఇడీమా) కలిగినా, కంపనస్పర్శ ఎక్కువవుతుంది. పుపుసవేష్టనంలో గాలిచేరినా (వాయుపూరిత పుపుసవేష్టనం/ న్యూమోథొరాక్స్), నీరు చేరినా ( ప్లూరల్ ఎఫ్యూజన్) వాక్కంపన స్పర్శ తగ్గిపోతుంది. ఏమీ ఉండకపోవచ్చును. ఊపిరితిత్తుల ఉబ్బులో (ఎంఫిసీమా) కంపనస్పర్శ తగ్గుతుంది.[21]
వాదనము:
ఛాతిపై వివిధ భాగాలలో వాదనం చేస్తూ వచ్చే ప్రతిధ్వనిని పోలుస్తారు. గుండెకు పైనుండే ఛాతినుంచి ప్రతిధ్వని తక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులలో తాపం వలన, కర్కటవ్రణాల వలన ఘనీకరణం (కన్సాలిడేషన్) జరిగితే ప్రతిధ్వని తగ్గుతుంది. ఊపిరితిత్తుల ఉబ్బు ఉన్నప్పుడు ప్రతిధ్వని హెచ్చుగా (హైపర్ రెసొనెన్స్) ఉంటుంది. పుపుసవేష్టనంలో గాలి చేరినప్పుడు (వాయుపూరిత పుపుసవేష్టనం/న్యూమోథొరాక్స్) వాదనంతో ప్రతిధ్వని చాలా ఎక్కువగా వస్తుంది. జలపూరిత పుపుసవేష్టనంలో (ప్లూరల్ ఎఫ్యూషన్) లో ప్రతిధ్వని మందంగా బండలా వస్తుంది.[22]
శ్రవణం
వైద్యులు వినికిడి గొట్టం (స్టెతొస్కోప్) ఉపయోగించి హృదయ శబ్దాలను, ఉంటే మర్మరశబ్దాలను వింటారు. హృదయంలో జఠరికలు ముడుచుకొనడం ప్రారంభించినప్పుడు కర్ణికలు జఠరికల మధ్య ఉండే ద్విపత్ర (మైట్రల్) త్రిపత్ర కవాటాలు మూసుకోవడంవలన హృదయపు మొదటి శబ్దం (లబ్) పుడుతుంది. హృదయంలో జఠరికలు వికసించుకొనుట ప్రారంభమయినప్పుడు బృహద్ధమని పుపుసధమనుల కవాటాలు మూసుకొనడం వలన హృదయపు రెండవ శబ్దం (డబ్) జనిస్తుంది. హృదయంలో మూడు, నాలుగు శబ్దాలు అసాధారణ శబ్దాలు.[23]
కవాటాల్లో ఇరకటాలు (స్టెనోసిస్) ఉన్నా, కవాటాలు పూర్తిగా మూసుకొనక తిరోగమన ప్రవాహాలు (రిగర్జిటేషన్) ఉన్నా రక్తప్రవాహపు కల్లోలం వలన మర్మరశబ్దాలు పుడతాయి. [24]
ఈ శబ్దాలే కాక హృదయవేష్టనంలో తాపం ఉంటే హృదయవేష్టనపు పొరల మధ్య పుట్టే రాపిడి శబ్దం (ప్లూరల్ రబ్) వినగలరు.[25]
శ్వాసశబ్దాలు
వైద్యులు ఊపిరితిత్తుల ఉచ్ఛ్వాస నిశ్వాస శబ్దాలను ఛాతి వివిధ భాగాలలో వింటారు. ఈ శ్వాసశబ్దాలు మూడు రకాలు[26].
వాయుగోళ శబ్దాలు (వెసిక్యులార్ సౌండ్స్): ఈ శబ్దాలు ఊపిరితిత్తుల నుండి వచ్చే సాధారణ శబ్దాలు. ఇవి మృదువుగా, హీనస్వరంలో వినిపిస్తాయి[26].
పుపుసనాళికా వాయుగోళ శబ్దాలు (బ్రాంఖోవెసిక్యులార్ సౌండ్స్): ఇవి మధ్యస్థ స్వరంలో గాలివీచునట్లు ఉంటాయి. ఇవి పుపుసనాళ శాఖలనుండి వచ్చే శబ్దాలు[26].
పుపుసనాళిక శబ్దాలు (బ్రాంఖియల్ సౌండ్స్): ఇవి గట్టిగా ఉచ్చస్వరంలో ఉంటాయి. స్వరపేటిక, శ్వాసనాళాల నుండి ఈ శబ్దాలు వస్తాయి.
సాధారణంగా ఉచ్ఛ్వాసం (గాలి ఊపిరితిత్తుల లోనికి తీసుకొనడం) నిడివి ఎక్కువగాను, నిశ్వాసం (గాలి ఊపిరితిత్తుల బయటకు వదలడం) నిడివి తక్కువగాను ఉంటుంది. ఉబ్బసం గలవారిలోను, దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) కలవారిలోను నిశ్వాసపు నిడివి పెరుగుతుంది.
అసాధారణ శ్వాసశబ్దాలు
చిటచిట శబ్దాలు (రేల్స్): ఇవి వెండ్రుకల మధ్య రాపిడిచే కలిగే శబ్దాలులాగ, తాటాకులు కాలినప్పుడు కలిగే శబ్దాలులాగ ఉంటాయి. ద్రవం చేరిన చిన్న చిన్న పుపుసనాళికలలోను, వాయుగోళాలలోను గాలి ప్రవేశించినప్పుడు అవి తెఱుచుకొనుట వలన కలిగే శబ్దాలు. ఊపిరితిత్తుల తాపం (న్యుమోనియా, బ్రోంకైటిస్) కలిగినప్పుడు, హృదయవైఫల్యం ఉన్నవారిలోను వైద్యులు ఈ శబ్దాలు వింటారు
పిల్లికూత ధ్వనులు ( వీజింగ్): ఇవి ఉచ్చస్వరంలో నిశ్వాసంలో వినిపించే సంగీత స్వరాలు. వైద్యులు వీటిని ఉబ్బసం వ్యాధి కలవారిలోను, దీర్ఘకాలిక శ్వాసావరోధవ్యాధిగ్రస్తులలోను, అసహనం వలన శ్వాసవ్యాధులు కలిగినవారిలోను వింటారు.
గురక శబ్దాలు (రోంఖై): ఇవి హీనస్వరంతో గురకలా వినిపించే శబ్దాలు. పెద్ద పుపుసనాళాలనుంచి పుపుసనాళాలలో తాపం (బ్రాంకైటిస్) కలవారిలో వచ్చే శబ్దాలు. వారి చేత దగ్గిస్తే ఇవి తగ్గే అవకాశం ఉంది.
పుపుసవేష్టనపు రాపిడి శబ్దం (ప్లూరల్ రబ్): పుపుసవేష్టనములో తాపం లేక ఇతర వ్యాధులు ఉన్నప్పుడు ఈ రాపిడి శబ్దం వినిపించవచ్చు.
గరగర శబ్దం (స్ట్రైడర్): గొంతుక, స్వరపేటిక, శ్వాసనాళాల్లో వస్తువులు ఇరుక్కున్నప్పుడు వ్యక్తి శ్వాస ఆడక ప్రమాద పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చే శబ్దం. వీరికి అత్యవసర చికిత్సతో ఇరుక్కొన్న వస్తువులు తొలగించుటకు, అత్యవసరంగా శ్వాస సమకూర్చుటకు ప్రయత్నించాలి. అత్యవసరంగా శ్వాసనాళంలో కృత్రిమ మార్గం (ట్రేకియాష్టమీ) ఏర్పాటుకు కూడా వైద్యులు సిద్ధపడాలి.
వాక్ ప్రతిధ్వని (వోకల్ రెసొనెన్స్): వ్యక్తచేత ఒక పదాన్ని (పదహైను పదిహైను) పదేపదే పలికిస్తూ వినికిడి గొట్టంతో ఛాతిమీద అన్ని భాగాల్లో ఆ పలుకుల ప్రతిధ్వనిని వైద్యులు వినుటకు ప్రయత్నిస్తారు. ఊపిరితిత్తులలో తాపం (న్యుమోనియా) లేక కర్కటవ్రణాల (కేన్సర్స్) వంటి ఇతర వ్యాధులవలన ఘనీకరణం (కన్సాలిడేషన్) కలిగినా, ఊపిరితిత్తులలో తంతీకరణం (ఫైబ్రోసిస్) కలిగినా, వాక్ ప్రతిధ్వని ఎక్కువగా ఉంటుంది. పుపుసవేష్టనంలో గాలిచేరినా (వాయుపూరిత పుపుసవేష్టనం/ న్యూమోథొరాక్స్), నీరు చేరినా ( ప్లూరల్ ఎఫ్యూజన్) వాక్ ప్రతిధ్వని తక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తుల ఉబ్బు (ఎంఫిసీమా) కలవారిలోను, ఊబకాయం గలవారిలోను కూడా వాక్ ప్రతిధ్వని తగ్గుతుంది[21].
వైద్యులు ఉదరాన్ని పరీక్షించేటప్పుడు ఉదరం లోపలికి అణగి ఉందో, బల్లపరుపుగా ఉందో, నిండుగా ఉందో లేక ఉబ్బి ఉందో ఆకారాన్ని పేర్కొంటారు. ఉదరంలో కొవ్వు ఎక్కువగా చేరినా, ప్రేవుల్లో గాలి ఎక్కువైనా, మలబంధనమైనా (ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్), నీరుపట్టినా (జలోదరము/ఎసైటిస్), స్త్రీలు గర్భవతులైనా ఉదరంలో ఉబ్బు ఉంటుంది. ఉదరకుడ్యంలో (అబ్డామినల్ వాల్) గళనరంధ్రాలను (హెర్నియల్ ఆరిఫైసిస్ - ఇవి ఉదరపు కుడ్యంలో (గోడలో) ఉండే నీరసించిన భాగాలు. వీనినుంచి ఉదరంలోని ప్రేవులు మొదలగు అవయవాలు ఉదరకుహరం (అబ్డామినల్ కేవిటీ) నుంచి చర్మం క్రిందకు జారిరావచ్చు.) వాటి పటుత్వానికి పరీక్షిస్తారు. అవి పటుత్వంగా లేనప్పుడు వ్యక్తిచేత దగ్గిస్తే దగ్గుకు స్పందనగా (కసన స్పందన / కాఫ్ ఇంపల్స్) ఉదరంలోనివి ఆ రంధ్రాల నుంచి బయటకు ఉబ్బుతాయి.
ఉదరకుడ్యంలో ఉబ్బుసిరలు
ఉదరకుడ్యంలో ఉబ్బుసిరలు (వేరికోస్ వీన్స్ / కేపట్ మెడుసే), ధమనీస్పందనలు (పల్సేషన్స్), కమిలిన రక్తపుచాయలు, పెరుగుదలలు వంటి అసాధారణలు ఉంటే వాటిని పేర్కొంటారు.
ఉదరకుడ్యం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో బాగుగా చలిస్తున్నదో లేదో గమనిస్తారు. ఉదరవేష్టన తాపం (పెరిటొనైటిస్) గలవారిలో ఊపిరితో ఉదరకుడ్యపు చలనాలు మందంగా ఉంటాయి. ఉదరంలో పెరుగుదలలు ఉండి అవి ప్రస్ఫుటంగా కనిపించినప్పుడు వాటి దర్శన లక్షణాలను కూడా వైద్యులు పేర్కొంటారు.
స్పర్శన
వైద్యులు ఉదరాన్ని నాలుగు భాగాలలోను అరచేతి వేళ్లతో అవసరమైనంత ఒత్తిడితో సున్నితంగా స్పర్శిస్తూ పరీక్షిస్తారు. ఉదరం మృదువుగా ఉందో, బిగుతుగా ఉందో స్పర్శతో తెలుసుకుంటారు. ఉదరాన్ని వివిధ భాగాల్లో నొక్కుచు వ్యక్తికి నొప్పి పుడుతుందేమో వ్యక్తి ముఖకవళికలు గమనిస్తూను అడిగి కూడా కనుక్కొంటారు. ఒత్తినప్పుడు కలిగే నొప్పిని పీడన వేదన(టెండర్నెస్) అంటారు. ఉదరాన్ని ఒత్తినప్పుడు ఉదరకుడ్యపు కండరాల బిగుతు హెచ్చవుతుందేమో (గార్డింగ్) గమనిస్తారు. నొక్కినప్పుడు నొప్పి (పీడనవేదన) కలిగి, ఉదరకుడ్యంలో బిగుతు ఎక్కువవుతూ ఉంటే ఆ లక్షణాలు ఉదరకుహరంలో తాపాన్ని (ఉదరవేష్టన తాపం / పెరిటొనైటిస్) సూచిస్తాయి.
ప్రతివేదన (రిబౌండ్ టెండర్ నెస్): వ్యక్తి ఉదరంపై అరచేతిని నిలిపి ఆ వ్యక్తి ఊపిరి తీసుకొని వదలినప్పుడల్లా అరచేతిని అంచెలంచెలుగా లోపలికి చొప్పించి పిమ్మట అకస్మాత్తుగా తీసివేసినప్పుడు వ్యక్తికి విపరీతమైన నొప్పి కలుగుతే ఆ నొప్పిని ‘ప్రతివేదన’ (రిబౌండ్ టెండర్ నెస్) గా వర్ణిస్తారు. ప్రతివేదన ఉదరవేష్టనంలో తాపానికి (పెరిటొనైటిస్) సంజ్ఞ.
ప్రక్కటెముకల క్రింద కుడివైపున కాలేయమును (లివర్), ఎడమవైపున ప్లీహమును (స్ప్లీన్) పరీక్షించి వాటి పరిమాణాలు సాధారణ పరిమితులలో ఉన్నాయో లేక పెరిగాయో గమనిస్తారు.
ఉదరకుడ్యంలో గజ్జల దగ్గఱ ( ఊరుమూలాలలో/ఇంగ్వైనల్ రీజియన్స్), బొడ్డు వద్ద గళనరంధ్రాలపై (హెర్నియల్ ఆరిఫైసెస్) అరచేతివేళ్ళను సున్నితంగా నొక్కి ఉంచి వ్యక్తిచే దగ్గించి స్పందనకు (కసన స్పందన / కాఫ్ ఇంపల్స్) పరీక్షిస్తారు. అవయవ గళనం (హెర్నియా) ఉంటే వేళ్లకు ఒత్తిడి తగులుతుంది.
వైద్యులు నాలుగు భాగాలను నొక్కి తాకుతూ ఉదరంలో పెరుగుదలలు ఉన్నాయేమో పరిశీలిస్తారు. పెరుగుదలలు ఉంటే వాటిని విస్తృతంగా పరీక్షించి సమాచారం సేకరిస్తారు. ఉదరంలో ధమనీస్పందనలకు (పల్సేషన్స్) కూడా వైద్యులు పరీక్ష చేస్తారు.
వాదనము (పెర్కషన్)
ఉదరంలో అంతటా గాలితో ఉండే కడుపు (జఠరం), ప్రేవులు ఉండడం వలన ఉదరంపై వాదనం (పెర్కషన్) చేసేటప్పుడు డొల్లతనం సూచిస్తూ ప్రతిధ్వని బాగానే ఉంటుంది. ప్రేవుల్లో ఇరకాటం ఏర్పడి మలబంధనం (ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్) కలిగినా, ప్రేవు మెలికలు తిరుగుటచే (వాల్వులస్) మలబంధనం, వాయుబంధనం జరిగినా ఉదరంమీద వాదనం చేస్తే ప్రతిధ్వని తప్పెట మ్రోతలా ఎక్కువగా ఉంటుంది.
కాలేయం, ప్లీహం వంటి సాంద్రత ఎక్కువగా గల అవయవాలు పరిమాణం పెరిగినప్పుడు వాటిపై వాదనం చేస్తే ప్రతిధ్వని మందంగా ఉంటుంది. వాదనం చేసి వాటి అంచులను గుర్తించవచ్చు. సాంద్రత ఎక్కువగా కల ఇతర పెరుగుదలలు ఉదరంలో ఉంటే వాటిపై కూడా వాదనం వలన ప్రతిధ్వని మందంగానే ఉంటుంది.
జలోదరం ఉన్నవారిలో ఉదరంలో పల్లంగా ఉండే ప్రక్కలంట నీరు చేరి ఉండడంవలన అక్కడ వాదనం చేసినపుడు ప్రతిధ్వని మొద్దుబారి మందంగా ఉంటుంది. ఆ వ్యక్తిని ఒక ప్రక్కకు తిప్పి పడుకోబెట్టినప్పుడు నీరు పల్లంగా ఉన్నవైపుకు చేరి గాలితో నిండిన ప్రేవులు ఎత్తుగా ఉన్నవైపుకు చేరుతాయి. అందువలన ఎత్తుగా ఉన్నవైపు వాదనంచేత ప్రతిధ్వని ఎక్కువగా వస్తుంది. పల్లంగా ఉన్నవైపు వాదనంచేత ప్రతిధ్వని మందంగా ఉంటుంది. ఆ వ్యక్తిని రెండోప్రక్కకు తిప్పి పడుకోబెట్టి పరీక్షిస్తే వాదనపు మాంద్యము పల్లంవైపుకు మారిపోతుంది. దీనిని చంచల మాంద్యంగా (షిఫ్టింగ్ డల్ నెస్) వర్ణిస్తారు.
శ్రవణం
ఉదరంపై వినికిడిగొట్టం (స్టెతొస్కోప్) పెట్టి ప్రేవుల్లో సంకోచ వ్యాకోచాల వలన కలిగే ‘ప్రేవుల శబ్దాలను’ (బవెల్ సౌండ్స్) వైద్యులు వింటారు. ప్రేవుల్లో కదలికలు ఎక్కువగా ఉంటే ఆ శబ్దాలు ఎక్కువగా వినిపిస్తాయి. ప్రేవుల్లో తాపం ఉన్నవారిలో ఈ శబ్దాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేవుల్లో ప్రతిబంధకాలు ఉన్నా ప్రేవుల శబ్దాలు ఎక్కువగా ఉంటాయి. చివరి దశలో ప్రేగులశబ్దాలు తగ్గుతాయి. ఉదరవేష్టనంలో తాపం (పెరిటోనైటిస్) ఉన్నప్పుడు, ప్రేవులలోను, లేక జఠరంలో చిల్లులు పడినప్పుడు ప్రేవులశబ్దాలు మరుగవుతాయి. ఉదరమౌనం ( సైలెంట్ అబ్డమెన్) ఉదరవేష్టన తాపానికి (పెరిటొనైటిస్) చిహ్నం.
ఉదరంలో రక్తనాళాలలో సంకుచితాలు (స్టెనోసిస్) ఏర్పడినప్పుడు వాటిలో రక్తం కల్లోలంగా ప్రవహిస్తే ఉష్షంటూ శబ్దం (బ్రూట్) వినికిడిగొట్టం తో వినగలరు. ఉదరబృహద్ధమని (అబ్డామినల్ అయోర్ట), మూత్రాంగ ధమనులు (రీనల్ ఆర్టెరీస్), శ్రోణి ధమనులలో (ఇలియక్ ఆర్టెరీస్) సంకోచాల వలన ఈ కల్లోల శబ్దాలు రావచ్చు.
వైద్యులు చేతులను కాళ్ళను పరీక్షించునపుడు చేతివేళ్ళ చివరల, నీలివర్ణానికి (సయనోసిస్) పరిశీలిస్తారు. ఈ నీలివర్ణం హృదయవ్యాధుల వలన, ఊపిరితిత్తుల వ్యాధుల వలన రక్తములో ప్రాణవాయురహిత రక్తవర్ణపు (డీ ఆక్సిజెనేటెడ్ హీమోగ్లోబిన్) విలువలు పెరిగినప్పుడు గోచరిస్తుంది.
వైద్యులు చేతులను డోలుకఱ్ఱల వేళ్ళకు (క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్) కూడా పరీక్షిస్తారు.
డోలుకఱ్ఱల వేళ్ళు
రక్తంలో ప్రాణవాయువు తక్కువగా ఉండే హృద్రోగులలోను, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులుు గలవారిలోను (ఊపిరితిత్తుల కర్కటవ్రణాలు, ఊపిరితిత్తులలో చీముతిత్తులు (లంగ్ ఏబ్సెస్), తాపం గలవారు) డోలు కఱ్ఱల వేళ్ళు చూస్తాము. ప్రేవుల్లో దీర్ఘకాలిక తాపవ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్) గలవారిలో కూడా డోలుకఱ్ఱల వేళ్ళు ఉండవచ్చు. వీరిలో వేళ్ళ చివరలు ఉబ్బి ఉంటాయి[27]. గోళ్ళు చిలుకముక్కులులా క్రిందకు వంగి ఉంటాయి.
కాళ్ళలో నీటిపొంగు
కాళ్ళు పరీక్షించేటప్పుడు చీలమండలం వద్ద, పాదాలలోను నీటిపొంగు (ఇడీమా) ఉందేమోనని పరిశీలిస్తారు. హృదయవైఫల్యం, మూత్రపిండ వ్యాధులు, నారంగకాలేయవ్యాధి (సిర్రోసిస్ లివర్), రక్తహీనతల వలన పాదాల పొంగు పొడచూపవచ్చు[28]. చీలమండ లోపలివైపు ఒకవేలుని అదిమిపెట్టి ఉంచితే సొట్టపడితే అది నీటిపొంగును సూచిస్తుంది.
Campbell, Earl W.; Lynn, Christopher K. (1990), Walker, H. Kenneth; Hall, W. Dallas; Hurst, J. Willis (eds.), "The Physical Examination", Clinical Methods: The History, Physical, and Laboratory Examinations (3rd ed.), Boston: Butterworths, ISBN978-0-409-90077-4, PMID21250202, retrieved 2026-03-18
Turner, John S. (1990), Walker, H. Kenneth; Hall, W. Dallas; Hurst, J. Willis (eds.), "An Overview of the Head and Neck", Clinical Methods: The History, Physical, and Laboratory Examinations (3rd ed.), Boston: Butterworths, ISBN978-0-409-90077-4, PMID21250067, retrieved 2026-03-18
"Reflexes & the Eye". NVISION (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-08-16. Retrieved 2026-03-18.