14, మార్చి 2020, శనివారం

గళగ్రంథిహీనత ( Hypothyroidism )

తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో:

                                    గళగ్రంథిహీనత

                              ( Hypothyroidism )


                                                                                     డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .


గళగ్రంథి ( Thyroid gland )


    నిత్యజీవన ప్రక్రియకు గళగ్రంథి స్రావకములు ( Thyroid hormones ) ఎంతగానో అవసరము. ఈ కంఠగ్రంథి ( Thyroid gland ) కంఠము ముందర స్వరపేటిక, శ్వాసనాళములను ఆనుకొని సీతాకోక చిలుక ఆకారములో ఉంటుంది. ఈ గ్రంథికి కర్ణికలు ( Lobes ) రెండుప్రక్కలా ఉండి ఆ రెండు కర్ణికలను కలుపుతూ నడిమిన సంధానము. ( Isthmus) ఉంటుంది. వయోజనులలో యీ గళగ్రంథి కర్ణిక పరిమాణము 5 సె.మీ ఎత్తు, 3 సె.మీ ,వెడల్పు 2 సె.మీ మందము గలిగి ఉంటుంది. గళగ్రంథి స్రావకములు థైరాక్సిన్ ( Thyroxin T-4 ), ట్రై అయిడో థైరొనిన్ ( Triiodothyronine, T-3 ), కణజాలముల జీవవ్యాపార క్రియకు ( Body metabolism ) దోహదకారిగా ఉంటాయి. శిశువుల వృద్ధికి, మనోవికాసమునకు కూడా థైరాక్సిన్ తోడ్పడుతుంది. జంతుజాలములో విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము ( Basal metabolic rate ) గళగ్రంథి స్రావకములపై ఆధారపడి ఉంటుంది.




    గళగ్రంథినుంచి అధికముగా థైరాక్సిన్, T4 ( సుమారు 80 శాతము ) ఉత్పత్తి జరుగుతుంది. ట్రై అయిడో థైరొనిన్, T3 సుమారు 20 శాతము ఉత్పత్తి జరుగుతుంది. కణజాలములో ట్రైఅయిడోథైరొనిన్ కు మాత్రమే చైతన్యము ఉంటుంది. అధికముగా థైరాక్సిన్ ఉత్పత్తి అయినా కాలేయములో ఒక అయొడిన్ అయము తొలగించబడి థైరాక్సిన్ ( T4 ) టైఅయిడో థైరొనిన్ గా ( T3 ) మార్పుజెందుతుంది.

    గళగ్రంథి స్రావకములు, థైరాక్సిన్ ( T4 ) అణువులో నాలుగు అయొడిన్ పరమాణువులు, ట్రైఅయిడో థైరొనిన్ ( T3 ) లో మూడు అయొడిన్ పరమాణువులు ఉంటాయి.

గళగ్రంథి స్రావకముల నియంత్రణ 


    గళగ్రంథి స్రావకముల ఉత్పత్తిని, రక్తములో వాటి విడుదలను పీనస గ్రంధి ( Pituitary gland ) నుంచి విడుదల అయే గళగ్రంథి ప్రేరేపకము ( Thyroid stimulating hormone ; Thyrotropin ) నియంత్రిస్తుంది. గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విడుదలను మెదడు క్రింది భాగములో ఉండే హైపోథలమస్ ( Hypothalamus) గళగ్రంథి ప్రేరేపక విమోచిని ( Thyrotropin releasing hormone) ద్వారా నియంత్రిస్తుంది. రక్తములో గళగ్రంథి స్రావకముల ( Thyroid hormones) ప్రమాణము పెరిగినప్పుడు, పీనసగ్రంథి ( Pituitary gland ) నుంచి గళగ్రంథిప్రేరేపకపు ( TSH ) విడుదల తగ్గుతుంది. గళగ్రంథి స్రావకముల ( T3, T4 ) ప్రమాణము తగ్గినపుడు గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విడుదల హెచ్చవుతుంది.ఆ విధముగా గళగ్రంథి ప్రేరేపకపు విడుదల రక్త ప్రసరణములో ఉండే గళగ్రంథి స్రావకముల ప్రతివర్తమానము ( Feed back) పై ఆధారపడి ఉంటుంది. 

    రక్తములో గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువ హెచ్చుగా ఉంటే అది గళగ్రంథి హీనతను ( Hypothyroidism ) సూచిస్తుంది. గళగ్రంథి చైతన్యము హెచ్చయి ( Hyperthyroidism) రక్తములో గళగ్రంథి స్రావకముల ప్రమాణాలు హెచ్చయితే గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువలు తక్కువగా ఉంటాయి.
    శరీరపు పెరుగుదల ఎక్కువగా ఉన్నపుడు శరీర అవసరాలకు తగినట్లు పీనసగ్రంథి నుంచి గళగ్రంథి ప్రేరేపకపు విడుదల అధికమవుతుంది. 
    గళగ్రంథి స్రావకములు థైరాక్సిన్ ( T4 ), ట్రైఅయిడో థైరొనిన్ లు ( T3 ) రక్తములో థైరాక్సిన్ బైండింగ్ గ్లాబ్యులిన్ ( TBG ) అనే మాంసకృత్తుకి అంటుకొని రవాణా చేయబడుతాయి. కొంత భాగము మాత్రము స్వేచ్ఛగా ఉంటాయి. గళగ్రంథిలో నాలుగు అణువులు అయొడిన్ గల థైరాక్సిన్ ( T4 ) నుంచి ఒక అణువు అయోడిన్ తొలగించబడి మూడు అణువుల ట్రైఅయుడో థైరొనిన్ ( T3 ) కొంత విడుదల అయినా 80 శాతపు థైరాక్సిన్ గళగ్రంథి నుంచి విడుదల అవుతుంది. కాలేయములో ( Liver ) యీ థైరాక్సిన్ ( T4 ) ట్రైఅయుడో థైరొనిన్ గా ( T3 ) మార్పు జెందుతుంటుంది. కణజాలములో ట్రైఅయుడో థైరొనిన్ ( T3 ) కే చైతన్యత ఉంటుంది.
    కణజాలములో జరిగే జీవప్రక్రియలు ( Metabolism ) అన్నిటికీ గళగ్రంథి స్రావకములు అవసరము. విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము ( Basal metabolic rate ) శరీరములో ఉన్న గళగ్రంథి ప్రభావమును సూచిస్తుంది. కణజాలముల వృద్ధికి, పరిపక్వతకు, పెరుగుదలకు గళగ్రంథి స్రావకములు అవసరము. వివిధ మాంసకృత్తుల సంకలనమునకు , పిండిపదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తుల జీవప్రక్రియలకు, శరీరములో ఉష్ణజనితమునకు గళగ్రంథి స్రవములు అవసరము. 

                                     గళగ్రంథి హీనత ( Hypothyroidism )


ప్రధాన గళగ్రంథి హీనత ( Primary hypothyroidism )


    గళగ్రంథి శరీర అవసరాలకు తగినంత స్రవములను అందించ లేనప్పుడు గళగ్రంథి హీనత ( Hypothyroidism) కలుగుతుంది. హెచ్చుశాతము మందిలో యీ లోపము గళగ్రంథులలోనే ఉంటుంది. గళగ్రంథి తగినంతగా నిర్నాళ రసములను ( Hormones) ఉత్పత్తి చేయక పోవుట వలన యీ లోపము కలుగుతుంది. గళగ్రంథుల లోపమే ప్రాథమిక కారణమయితే దానిని ప్రాథమిక గళగ్రంథి హీనతగా ( Primary Hypothyroidism) పరిగణిస్తారు. శరీరములో అయొడిన్ లోపము వలన ప్రపంచములో హెచ్చుమందికీ గళగ్రంథి హీనత కలుగుతుంది. పాశ్చాత్య దేశాలలో ఉప్పుకు అయొడిన్ ను సంధానపఱచుట వలన ప్రజలలో అయొడిన్ లోపము అఱుదు.

హషిమోటో గళగ్రంథి తాపము ( Hashimoto ‘s thyroiditis ) 


    గళగ్రంథి స్వయం ప్రహరణ వ్యాధి ( Autoimmune thyroiditis ) వలన గళగ్రంథి ధ్వంసము చెంది గళగ్రంథి హీనత కలుగవచ్చు. ఈ వ్యాథిలో టి- రసికణములు ( T Lymphocytes ; ఇవి శరీర రక్షణ వ్యవస్థలో ఒక భాగము. ) గ్రంథులను ఆక్రమిస్తాయి. థైరోగ్లాబ్యులిన్ ( గళగ్రంథులలో ఉండే మాంసకృత్తి. దీని నుంచి గళగ్రంథి స్రావకములు ఉత్పత్తి అవుతాయి ), థైరాయిడ్ పెరాక్సిడేజ్ ( Thyroid peroxidase ), గళగ్రంథిప్రేరేపక గ్రాహములకు ( TSH receptors ) ప్రతిరక్షకములు ( Antibodies) ఏర్పడి గ్రంథుల ధ్వంసమునకు దారితీస్తాయి. ఈ తాపక్రియ ( Inflammation) మందకొడిగా జరిగి క్రమేణా గళగ్రంథి హీనతను ( Hypothyroidism ) కలుగజేస్తుంది.

    ప్రసవము తర్వాత కొంతమంది స్త్రీలలో తాత్కాలికముగా గళగ్రంథి హీనత పొడసూపవచ్చును. కొద్దిమందిలో యీ లోపము శాశ్వతము కావచ్చును.

చికిత్సా జనితము ( Iatrogenic ) 


    గళగ్రంథిని శస్త్రచికిత్సతో సంపూర్ణముగా గాని, పాక్షికముగా గాని తొలగించినా, రేడియోధార్మిక అయొడిన్ తో ధ్వంసము చేసినా గళగ్రంథి హీనత కలుగుతుంది. 
అయొడిన్ గల ఔషధములు, లిథియం, ఆల్ఫా ఇంటెర్ఫెరాన్, ఇంటెర్లూకెన్ -2 , ఎమియోడరోన్, థాలిడోమైడు వంటి మందుల వలన గళగ్రంథి హీనత కలుగవచ్చును.

అప్రధాన గళగ్రంథిహీనత ( Secondary Hypothyroidism)  


    పీనస గ్రంథి వ్యాధులు ( Pituitary disorders), లేక ఘాతముల ( injuries ) వలన గళగ్రంథి ప్రేరేపకపు ( TSH) ఉత్పత్తి జరుగక, ప్రేరేపక లోపము ( TSH deficiency) వలన , గళగ్రంథి స్రావకముల ( T3,T4) ఉత్పత్తి తగ్గుతే గళగ్రంథి హీనత కలుగుతుంది. 

తృతీయ గళగ్రంథి హీనత ( Tertiary hypothyroidism) 


    మెదడులోని హైపోథలమస్ ( Hypothalamus) గళగ్రంథి ప్రేరేపక విమోచిని ని (Thyrotropin releasing hormone) విడుదల చేయలేని స్థితులలో తృతీయ గళగ్రంథి హీనత కలుగుతుంది.
    ద్వితీయ, తృతీయ గళగ్రంథి హీనములు అసాధారణము. వారిలో మెదడు, పీనస వ్యాధుల లక్షణాలు ప్రస్ఫుటముగా కనిపిస్తాయి.

గళగ్రంథి హీనత లక్షణములు 


    గళగ్రంథి హీనత ప్రస్ఫుటముగా ఉన్న వారిలో, అలసట, అతినిద్ర, నీరసము, శక్తిహీనత, చలికి తట్టుకోలేకపోవుట, మలబద్ధకము, జ్ఞాపకశక్తి క్షీణించుట, బొంగురుగొంతు, కండరాల సలుపు, కేశనష్టము, స్త్రీలలో రక్తప్రదరము ( metrorrhagia ) పొడచూపవచ్చును. ఈ లక్షణములు క్రమేణా కలుగుతాయి. కొందఱిలో ఏ బాధలు ఉండవు.
    వీరిలో పొడిచర్మము, ముఖములోను, కళ్ళచుట్టూ వాపు, హృదయ మాంద్యము ( Bradycardia), స్నాయువుల ప్రతిక్రియలు మందగించుట ( Decreased tendon reflexes ), గుంతపడని పొంగులు, కఱకు చర్మము, కనిపించ వచ్చును. శరీరపు బరువు కొంత హెచ్చినా విశేష స్థూలకాయమును గళగ్రంథి లోపము కలుగజేయదు. వీరిలో ఆకలి కొంత మందగించవచ్చును. అయొడిన్ లోపించిన వారిలో గలగండము ( Goitre) కనిపిస్తుంది. 
    గుండె పైపొరలో నీరుపట్టుట ( Pericardial effusion), పుపుసవేష్టనములో నీరుచేరుట ( Pleural effusion), మణికట్టు వాపు ( Carpal tunnel syndrome) వినికిడి తగ్గుట, అఱుదుగా కనిపించ వచ్చును. వ్యాధి తీవ్రమయిన వారిలో ఊపిరి మందగించవచ్చును. 
    గళగ్రంథిహీనత దీర్ఘకాలముగాను, తీవ్రముగాను  ఉన్నవారిలో మ్యూకోపాలీసాకరైడులు ( Mucopolysaccharides) చర్మము దిగువ చేరుకొని పొంగులు, వాపులు కనిపించవచ్చును. ఈ పొంగులు ఉన్నచోట వేలుతో నొక్కితే గుంతలు పడవు. చర్మము దళసరిగా ఉండే వీరి వ్యాధిని మిక్సిడీమా ( Myxedema) అంటారు.

    వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో శరీరము చల్లబడి, గుండెవేగము బాగా తగ్గి, గందరగోళము, బుద్ధిమాంద్యత, అపస్మారకము ( Myxedema coma ), శ్వాసమాంద్యము ( bradypnea ) కలిగి ప్రాణాపాయస్థితి కూడా కలుగ వచ్చును. ఇది అసాధారణము. 

    పుట్టిన పసికందులలో గళగ్రంథి హీనత ఉంటే అది క్రెటినిజం గా ( Cretinism) వర్ణిస్తారు. వారికి కండరముల బిగుతు సన్నగిల్లుతుంది. పుఱ్ఱె వెనుక భాగము పూడుకొనక మెత్తదనము చాలా మాసములు ఉండవచ్చును., ( సాధారణముగా యీ మెత్తదనము రెండు , మూడు మాసములలో పూడుకుంటుంది.. ముందుభాగములో మెత్తదనము 18 మాసములలో పూడుకుంటుంది. ) బొంగురు గొంతుకతో ఏడవడము, శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండుట, నాభి గోళకము ( Umbilical hernia ), దళసరి నాలుక యీ శిశువులలో కలుగుతాయి. వ్యాధిని నిర్ణయించి, గళగ్రంథి స్రావకములతో వైద్యము సమకూర్చకపోతే పెరుగుదల మందగించుటే కాక బుద్ధి వికాసము లోపించి వీరికి బుద్ధి మాంద్యత కలుగుతుంది.

వ్యాధి నిర్ణయము 


       గళగ్రంథి హీనత ఉన్నవారిలో వ్యాధి లక్షణాలు క్రమేణా పొడచూపుతాయి. పరిమిత లోపము ఉన్న వారిలో యే లక్షణములు కనిపించక పోవచ్చును. రక్తపరీక్షలు విరివిగా లభ్యము అవుతున్న ఈ దినములలో మిక్సిడీమా, లక్షణాలు బాగా కనిపించే గళగ్రంథి హీనతలను అఱుదుగా చూస్తాము.

రక్త పరీక్షలు  


    గళగ్రంథి హీనత ఉన్నవారిలో కొలెష్ట్రాలు, ట్రైగ్లిసరైడులు, క్రెయటినిన్ కైనేజ్ ల పరిమాణములు ఎక్కువగా ఉండవచ్చును. వీరిలో సోడియం ప్రమాణములు తక్కువ అవవచ్చును.రక్తములో గళగ్రంథి ప్రేరేపకపు విలువలు ( TSH ) ఎక్కువగా ఉంటాయి. గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువలు సాధారణ ప్రమాణములో ఉండి, థైరాక్సిన్ ( T4 ) విలువలు తక్కువగాని పక్షములో గళగ్రంథి హీనత లేదని నిర్ధారణ చెయ్యవచ్చును. 
    గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువ 20 మైక్రోయూనిట్లు / మి.లీ.రుకి మించి ఉంటే వ్యాధి లక్షణాలు లేకపోయినా గళగ్రంథి హీనత ఉన్నదని నిర్ధారణ చెయ్యవచ్చును. 
    గళగ్రంథి హీనత లేక యితర వ్యాధులు ఉన్నవారిలో గళగ్రంథి ప్రేరేపకపు విలువ సాధారణ పరిమితిని అతిక్రమించినా 20 మైక్రో యూనిట్ల లోపునే ఉంటుంది. 
    గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువ ఎక్కువయినా 20 మైక్రో యూనిట్ల లోనే ఉండి థైరాక్సిన్ ( T4 ) విలువ తక్కువగా ఉంటే దానిని విదిత గళగ్రంథి హీనతగా ( Overt hypothyroidism) పరిగణించి వారికి తగు పరిమాణములో లీవోథైరాక్సిన్ సమకూర్చాలి.
    గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువలు 5- 10 ( కొందఱు వైద్యులు 5 దాటినప్పుడు, కొందఱు 10 దాటినప్పుడు ) ప్లాస్మా థైరాక్సిన్ ( T4 ) విలువలు సాధారణ పరిమితులలో ఉన్నప్పుడు దానిని అగోచర గళగ్రంథి హీనతగా ( Subclinical hypothyroidism) పరిగణిస్తారు. వీరికి వైద్యము అవసరము లేదు, కాని సంవత్సరమునకు ఒక పర్యాయము రక్తపరీక్షలు చేసి గమనిస్తూ థైరాక్సిన్ ( T4 ) విలువలు తగ్గినా, గళగ్రంథి ప్రేరేపకపు విలువలు పెరిగినా లీవోథైరాక్సిన్ వైద్యము సమకూర్చవచ్చును. అగోచర గళగ్రంథిహీనత ఉన్నవారిలో సంవత్సరమునకు 2.5% మందిలో యీ హీనత ప్రస్ఫుటమవుతుంటుంది.
    గర్భిణీస్త్రీలలో గళగ్రంథి ప్రేరేపకపు విలువలు 10 మైక్రోయూనిట్లు దాటితే అది విదిత గళగ్రంథి హీనముగా పరిగణించి వైద్యము చెయ్యాలి. ఆ విధముగా శిశువులలో వ్యాధిని అరికట్టవచ్చును.
    అప్రధాన గళగ్రంథి ( Secondary hypothyroidism) హీనత ఉన్న వారిలో గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువలు హెచ్చు కావు. కావున వీరిలో గళగ్రంథి స్రావకముల విలువలు ( థైరాక్సిన్- T4 , స్వేచ్ఛపు థైరాక్సిన్ -Free T4 ) తక్కువగా ఉంటే గళగ్రంథి హీనతను ధ్రువీకరించవచ్చును. 
    గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములకు ( TSH Receptors ), థైరోగ్లాబ్యులిన్ కు, థైరాయిడ్ పెరాక్సిడేజ్ కు ప్రతిరక్షకముల ( Antibodies) పరీక్షతో స్వయంప్రహరణ గళగ్రంథి తాపమును ( Autoimmune thyroiditis ) ధ్రువీకరించ వచ్చును. కాని చికిత్సాపరముగా యీ పరీక్షల వలన చేకూరే ప్రయోజనము తక్కువ. 
    గళగ్రంథిలో గడ్డలు, పెరుగుదలలు ఉంటే శ్రవణాతీతధ్వని చిత్రీకరణ ( Ultrasonography) పరీక్షలు, కణపరీక్షలు అవసరము కావచ్చును. పెరుగుదలలు లేకపోతే ఆ పరీక్షలు అనవసరము.
    పీనసగ్రంథి, హైపోథలమస్, మెదడు వ్యాధుల లక్షణాలు ఉంటే అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణలు ( Magnetic resonance imaging ) తోడ్పడుతాయి.

చికిత్స 


    లీవోథైరాక్సిన్ ( Levothyroxine ) కృత్రిమముగా తయారు చేస్తున్నారు. తక్కువ ధరకు అందుబాటులో కూడా ఉంది . గళగ్రంథి హీనత ఏ కారణము వలన కలిగినా లీవోథైరాక్సినే చికిత్సకు వాడుతారు. తగిన మోతాదును వైద్యులు నిర్ణయిస్తారు. యౌవనములో ఉన్నవారికి తగిన మోతాదును ఒక్కసారే మొదలపెట్టవచ్చు. వృద్ధులలోను, హృద్రోగులలోను తక్కువ మోతాదు ( దినమునకు 25 మైక్రోగ్రాములు ) మొదలుపెట్టి ప్రతి మూడు, నాలుగు వారములకు మోతాదును క్రమేణా పెంచుతు అవసరమైన మోతాదు సమకూర్చాలి.
    లీవోథైరాక్సిన్ ని దినమునకు ఒక్కసారి యిస్తే సరిపోతుంది. పరగడుపుతో యీ మందును సేవించి మరి యే యితర మందులు మరొక రెండుగంటల వఱకు తీసుకొనకూడదు. అయనము ( iron ), కాల్సియం, అల్యూమినియం మృదుక్షారకములు, సుక్రాల్ఫేట్, కొలిస్టెరమిన్ వంటి మందులు లీవోథైరాక్సిన్ గ్రహణమునకు ( absorption ) అంతరాయము కలిగిస్తాయి.
    గళగ్రంథి ప్రేరేపక ( TSH ) పరీక్ష ఆరు వారములకు ఒకసారి చేస్తూ మందు మోతాదును సరిదిద్దవచ్చును. లీవోథైరాక్సిన్ మోతాదు స్థిరపడ్డాక, సంవత్సరమునకు ఒకసారి పరీక్ష సలుపుతే చాలు.

వైద్యవిషయములు నా శక్తిమేఱకు తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్త మనుకుంటే స్వేచ్ఛగా పంచుకొనండి )

గళగ్రంథి ఆధిక్యత ( Hyperthyroidism )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )



గళగ్రంథి ఆధిక్యత

 ( Hyperthyroidism)


                                                                                       డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి                                           
:

గళగ్రంథి 


        గళగ్రంథి ( Thyroid ) కంఠము ముందర స్వరపేటిక, శ్వాసనాళములను ఆనుకొని సీతాకోక చిలుక ఆకారములో ఉంటుంది. ఈ గ్రంథికి కర్ణికలు ( lobes ) రెండుప్రక్కలా ఉండి ఆ రెండు కర్ణికలను కలుపుతూ నడిమిన సంధానము. (Isthmus ) ఉంటుంది. వయోజనులలో యీ గళగ్రంథికర్ణిక పరిమాణము 5 సె.మీ ఎత్తు, 3 సె.మీ ,వెడల్పు 2 సె.మీ మందము గలిగి ఉంటుంది. గళగ్రంథి స్రావకములు, థైరాక్సిన్ ( Thyroxine, T-4), ట్రై అయిడో థైరొనిన్ ( Triidothyronine, T-3 ), కణజాలముల జీవవ్యాపార క్రియకు ( metabolism ) దోహదకారిగా ఉంటాయి. శిశువుల వృద్ధికి, మనోవికాసమునకు కూడా థైరాక్సిన్ తోడ్పడుతుంది. జంతుజాలములో విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము ( Basal metabolic rate ) గళగ్రంథి స్రావకములపై ఆధారపడి ఉంటుంది. గళగ్రంథి స్రావకముల ఉత్పత్తి ఎక్కువయితే గళగ్రంథి ఆధిక్యత ( Hyperthyroidism ) కలిగి ఆ లక్షణాలు పొడచూపుతాయి.



గళగ్రంథి స్రావక ఆధిక్యత లక్షణాలు 


        గళగ్రంధి స్రావకములు ఎక్కువయినప్పుడు జీవవ్యాపార ప్రక్రియ ( metabolism ) ఎక్కువ అగుటయే కాక, వాటి ప్రభావము వలన సహవేదన నాడీమండలము ( Sympathetic nervous system ) ప్రేరేపించబడి ఆ లక్షణములు కూడా అధికము అవుతాయి. నీరసము, శరీరపు బరువు తగ్గుట, ఆకలి పెరుగుట, గుండెదడ, గుండె వేగము పెరుగుట, మానసిక ఆందోళన, గాభరా, చిరాకు, హస్త కంపనములు ( tremors ), ఎక్కువ చెమట పట్టుట, కండరముల సత్తువ తగ్గుట, విరేచనములు, నిద్ర పట్టకపోవుట, ఉష్ణమును తట్టుకోలేకపోవుట, స్రీలలో ఋతుస్రావము మందగించుట ( Oligomenorrhea ) పొడచూపుతాయి. వృద్ధులలో హృదయ కర్ణికల ప్రకంపనము ( Atrial fibrillation), హృదయ వైఫల్యములు కలుగవచ్చును ( Congestive heart failure). చర్మపు మందము తగ్గుతుంది. పెళసరి వెండ్రుకలు, కేశనష్టము, కనుబొమలు సన్నబడుట, జ్ఞాపకశక్తి తగ్గుట, ఎముకలు బలహీనమగుట ( Osteoporosis ) మరికొన్ని లక్షణములు. మతిభ్రమణము అరుదుగా కొందఱిలో కలుగుతుంది. చేతుల వణుకుతో బాటు కొందఱిలో అనిచ్ఛా చలనములు ( Chorea ) కూడా పొడచూపవచ్చును.

        నేత్రగోళ కండరములు నీరసించి రెండు నేత్రముల చలనములలో సహకారము ( coordination ) లోపించుట వలన ఒక వస్తువు రెండుగా ( Diplopia ; ద్విదృష్టి ) కనిపించవచ్చును. పై కనురెప్పలు వెనుకకు ఎక్కువగా పోయి ( Lid retraction ) కళ్ళ మీది తెలుపు ( శ్వేతపటలము Sclera ) గోచరమవుతుంది. క్రింది వస్తువులపై దృష్టి సారించినపుడు కనుగుడ్లతో సమముగా కనురెప్పలు క్రిందకు కదలక ( Lid lag ) కళ్ళమీది తెల్ల భాగము తాత్కాలికముగా ఎక్కువగా కనిపించవచ్చును . 

         గళగ్రంథి ఆధిక్యత పరిమితముగా ఉన్నపుడు కొందఱిలో ఏ లక్షణములు కనిపించక పోవచ్చును. 

        అరుదుగా శరీరము సూక్ష్మాంగజీవుల ముట్టడికి గుఱైనపుడు, శస్త్రచికిత్సల పిదప, శరీరము ప్రమాదములకు గుఱి అయినపుడు, గళగ్రంథి స్రావకములను నిరోధించు మందులు ఉపసంహరించినపుడు గళగ్రంథిసంక్షోభము ( Thyroid storm) కలిగి, అధికఉష్ణోగ్రత, మానసిక సంభ్రమము, గందరగోళము, సన్నిపాతము ( Delirium) కలిగి మృత్యువునకు దారితీయవచ్చును. వీరికి అత్యవసర చికిత్స అవసరము.

        గ్రేవ్స్ సదృశగళగండ స్రావక ఉద్రేకత ( Diffuse toxic goiter from Grave’s disease ) కలిగిన వారిలో గళగండస్రావక ఆధిక్యతతో (Hyperthyroidism) బాటు వెలిగుడ్లు (Exopthalmos ), నేత్ర కండరముల నీరసము ( extraocular muscle weakness ), జంఘికాస్థుల ముందు ఉబ్బుదల ( pretibial myxedema ) కూడా కలుగుతాయి.

       గళగ్రంథి ఆధిక్యత కలిగిన వారిలో Myasthenia gravis అనే కండరముల తీవ్ర నీరసవ్యాధి అధికశాతము మందిలో కలిగే అవకాశములు ఉన్నాయి. 

గళగ్రంథి స్రావక ఆధిక్యతకు కారణములు 


       గళగ్రంథి ప్రమాణము వివిధ కారణముల వలన పెరిగి కంఠము ముందు గళగండముగా ( Goiter ) పొడచూపవచ్చును. గళగ్రంథి  అంతటా సమముగా పెరుగుతే దానిని సమ గళగండము లేక సదృశ గళగండముగా ( Diffuse goiter) పరిగణించవచ్చును.

       అసమానముగా కణుతులు పెరిగి బహుళ కిణ గళగండములు ( Multinodular goiters ) కొందఱిలో పొడచూపుతాయి. నిరపాయపు పెరుగుదలలు ( Adenomas ) కొందఱిలో కలిగి ఒక కర్ణికలోనే గళగండము పొడచూప వచ్చును. వీరిలో పరిమాణపు పెరుగుదలతో బాటు స్రావకముల ఉత్పత్తి  అధికమయినపుడు గళగ్రంథి ఆధిక్యత లక్షణములు కలుగుతాయి.

        గళగ్రంథి తాపముల ( Thyroiditis ) వలన తాత్కాలికముగా గళగ్రంథి స్రావకముల ఉత్పత్తి పెరుగవచ్చును. అయొడిన్ వినియోగము ఎక్కువైనా, గళగ్రంథి స్రావకముల వినియోగము ఎక్కువయినా ( Iatrogenic) గళగ్రంధిస్రావక ఆధిక్యత కలుగగలదు. ఎమియోడరోన్ ( Amiodarone ), అయొడిన్ వ్యత్యాస పదార్థాల ( Iodine radiocontrast materials ) వాడుక వలన గళగ్రంథి ఆధిక్యత కలుగవచ్చును.

        ప్రసవము తర్వాత కొందఱి స్త్రీలలో ( 6 లేక 7 శాతపు స్త్రీలలో ) గళగ్రంథి ఆధిక్యత కలిగి (Postpartum hyperthyroidism ) కొద్ది వారములలో సామాన్యస్థితి చేకూరుతుంది. అండకోశములలో గాని యితరత్రా గాని గళగ్రంథి కణజాలముతో పెరుగుదలలు ( Struma ovarii ) ఏర్పడి అవి స్రావకములను ఉత్పత్తి చేయుట వలన కూడా గళగ్రంథి ఆధిక్యత సంభవించవచ్చును.

        పీనసగ్రంథి పెరుగుదలలతో ( Pituitary adenomas ), గళగ్రంథి ప్రేరేపక ( TSH ) ప్రమాణము హెచ్చయి గళగ్రంథి ఆధిక్యత అరుదుగా కలుగవచ్చు. 

గ్రేవ్స్ సమగళగండ స్రావక ఉద్రేకత ( Grave’s disease ) 


        ఇది స్వయంప్రహరణ వ్యాధి( Autoimmune disease ). ఈ వ్యాధికి గుఱైన వారిలో గళగ్రంథిని ప్రేరేపించు ఇమ్యునోగ్లాబ్యులిన్ ప్రతిరక్షకములు ( Thyroid Stimulating immunoglobulin antibodies ) ఉత్పత్తి అవుతాయి . ఈ ప్రతిరక్షకములు ( Antibodies ) గళగ్రంథిలోని గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములతో ( TSH receptors )  సంధానమయి ఆ గ్రాహకములను ప్రేరేపించుట వలన గళగ్రంథి ప్రమాణము సమతులితముగా పెరుగుతుంది. గళగ్రంథి స్రావకముల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. రక్తములో గళగ్రంథి స్రావకముల ప్రమాణము ఎక్కువగుటచే పీనసగ్రంథి ( Pituitary gland) నుంచి గళగ్రంథి ప్రేరేపక స్రావకపు ( Thyroid Stimulating Hormone) ఉత్పత్తి, హైపోథలమస్ నుంచి గళగ్రంథి ప్రేరేపక విమోచిని ( Thyrotropin Releasing Hormone ) విడుదల తగ్గుతాయి. 

          గ్రేవ్స్ వ్యాధి ( Grave’s disease ) కలుగుటకు కారణాలు స్పష్టముగా తెలియవు. జన్యు కారణములు, పరిసరముల ప్రభావము యీ వ్యాధికి దారితీయవచ్చును. ఈ వ్యాధి కొన్ని కుటుంబాలలో ఎక్కువగా కనిపిస్తుంది. కవలపిల్లలలో ఒకరికి యీ వ్యాధి కలుగుతే రెండవ వారిలో కలుగుటకు ముప్పది శాతము అవకాశాలు ఉంటాయి. ఇతర స్వయంప్రహరణ వ్యాధులు ( మొదటి తరగతి మధుమేహ వ్యాధి ( Type 1- Diabetes), రుమటాయిడ్ కీళ్ళనొప్పులు ( Rheumatoid arthritis ) వంటివి ) ఉన్నవారిలో సమగళగండము ( Diffuse goiter), గళగండ స్రావకఆధిక్యత ఎక్కువగా పొడచూపుతాయి.

         గ్రేవ్స్ సమగళగండ స్రావకఉద్రేకత ( Grave’s disease ) కలిగిన వారిలో గళగండస్రావక ఆధిక్యతతో ( Hyperthyroidism) బాటు వెలిగుడ్లు (Exophthalmos ), నేత్ర వైకల్యము ( opthalmopathy ), జంఘికాస్థుల ముందు ఉబ్బుదలలు ( pretibial myxedema ) కూడా కలుగుతాయి.

పరీక్షలు 


         గళగ్రంథి ఆధిక్యత ఉన్నవారిలో గళగ్రంథి ప్రేరేపకపు ( TSH ) విలువలు రక్తములో తక్కువగా ఉంటాయి. గళగ్రంథి స్రావకముల విలువలు ( T-4, T-3 ) ఎక్కువగా ఉంటాయి. Grave’s disease ఉన్నవారిలో గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములకు ప్రతిరక్షకములను ( Antibodies to TSH receptors ) రక్తపరీక్షలతో కనుగొన వచ్చును. రేడియోధార్మిక అయొడిన్ I-131 లేక, I -123 నియమిత మోతాదులో యిచ్చి గళగ్రంథిలో వాటి గ్రహణమును ( Uptake ) కొలిచి గళగ్రంథి చైతన్యమును నిర్ధారించవచ్చును. గామా ఛాయా గ్రాహకములతో గళగ్రంథి చిత్రములను తీసుకొని గళగ్రంథిలో చైతన్యకేంద్రములను పసిగట్టవచ్చును. 

         గళగ్రంథి ఆధిక్యత కలిగిన వారిలో రక్తములో చక్కెర విలువలు అధికమవవచ్చును. వీరిలో కొలెష్టరాలు విలువలు తక్కువగా ఉండవచ్చును.

చికిత్స 


         గళగ్రంథి స్రావక ప్రభావము వలన వచ్చే లక్షణములను అదుపులో పెట్టుటకు, నిర్దిష్ట చికిత్స జరిగే వఱకు తాత్కాలిక ఉపశమనము కొఱకు బీటా ఎడ్రినెర్జిక్  గ్రాహక అవరోధకములను ( ప్రొప్రనలాల్ , మెటాప్రొలోల్, లేక, ఎటినలాల్ ) వాడుతారు. ఇవి సహవేదన నాడీమండల ఉధృతి వలన వచ్చే గుండెదడ, ఆందోళన, హస్తకంపనములు, రక్తపుపోటు వంటి ఫలితములను అదుపులో ఉంచుటకు తోడ్పడుతాయి. 

         తాత్కాలికముగా గళగ్రంథి ఉధృతి హెచ్చినపుడు కూడా బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక అవరోధములు ( Beta adrenergic receptor blockers ) ఉపయోగపడుతాయి.

         బీటా గ్రాహక అవరోధకములు ఉపయోగించలేని పరిస్థితులలో ( ఉబ్బసవ్యాధి వంటి వ్యాధులు ఉన్నవారిలో ), వెరాపమిల్ ( Verapamil ) వంటి కాల్సియమ్ మార్గ అవరోధకములను ( calcium channel blockers ) ఉపయోగించవచ్చును .
     
         నిర్దిష్ట చికిత్సకు మూడుమార్గములు ఉన్నాయి.

1. రేడియోధార్మిక అయొడిన్ ( Radioactive Iodine) :


        దేహము గ్రహించే అయొడిన్ లో హెచ్చు భాగము గళగ్రంథిలో చైతన్య కేంద్రాలకు చేరుతుంది. రేడియోధార్మిక అయొడిన్ చికిత్సకు వాడినపుడు అది గళగ్రంథిలో సాంద్రమయి గళగ్రంథి విధ్వంసమునకు దారితీస్తుంది. గ్రేవ్స్ వ్యాధి ఉన్నవారికి రేడియో ధార్మిక అయోడిన్ చికిత్స ఉత్తమము.

         బహుళ కిణ గళగండము ( Multinodular goiter), గళగండములోని పెరుగుదలలలో ( Adenomas )  గళగ్రంథి స్రావకములు అధికము అయినపుడు కూడ రేడియో ధార్మిక అయొడిన్ ని ఉపయోగిస్తారు. గర్భిణీ స్త్రీలలో రేడియోధార్మిక అయొడిన్ వాడకూడదు.

        రేడియోధార్మిక అయొడిన్ చికిత్సకు ముందు థయోనమైడులు ( Thionamides ), అయొడిన్ ల వాడుక ఆపివేయాలి. రేడియో ధార్మిక అయొడిన్ గ్రహణ ( Radioactive Iodine uptake) పరీక్షతో అవసరమైన మోతాదును నిశ్చయించి యిస్తారు. నెలకొకసారి రక్తములో గళగ్రంథిస్రావకము T-4 ( థైరాక్సిన్ ) , TSH ల పరీక్షలు చేస్తూ గళగ్రంథి హీనత ( Hypothyroidism ) కలుగుతే గళగ్రంథి స్రావక ( Levothyroxine ) చికిత్స మొదలు పెట్టాలి.

        రేడియోధార్మిక అయొడిన్ చికిత్స వలన చాలా మందిలో గళగ్రంథి పూర్తిగా విధ్వంసమయి గళగ్రంథి హీనత కలుగుతుంది. రేడియోధార్మిక అయొడిన్ చికిత్స వలన కొందఱిలో గళగ్రంథిలో నిక్షిప్తమయిన స్రావకములు విడుదలయి తాత్కాలికముగా రెండువారములు పాటు వాటి ఉద్రిక్తత హెచ్చుకావచ్చును. హృద్రోగములు ఉన్న వారికి ఆ ఉద్రిక్తతను తగ్గించుటకు తాత్కాలికముగా ధయోనమైడులతో చికిత్స అవసరమవవచ్చును. రేడియోధార్మిక అయొడిన్ చికిత్స వలన కర్కటవ్రణములు ( Malignancy) కలుగవు. చికిత్స తదనంతరము గర్భము దాల్చిన స్త్రీల శిశువులకు చికిత్స వలన జన్మతః వ్యాధులు ( Congenital diseases ) సంక్రమించవు.


2. థయోనమైడులు ( Thionamides )


         థయోనమైడులు గళగ్రంథిలో థైరోగ్లాబ్యులిన్ తో అయొడిన్ సంధానమును నిరోధించి గళగ్రంథి స్రావకముల ఉత్పత్తిని ఆటంకపరుస్తాయి. ప్రొపైల్ థయోయురసిల్  థైరాక్సిన్ ( Thyroxine , T4 ) ట్రైఅయిడో థైరొనిన్  గా ( T-3 ) మారుటను కూడా నిరోధిస్తుంది. గర్భిణీ స్త్రీలలోను, గళగ్రంథి తాపములోను ( Thyroiditis ), అయొడిన్ వినియోగము ఎక్కువగుటలన, ఎమియోడరోన్ ( amiodarone ) వంటి మందులవలన తాత్కాలికముగా గళగ్రంథి ఆధిక్యత కలిగినప్పుడు, రేడయోధార్మిక అయొడిన్ వాడుకకు ఇష్టపడని వారిలోను, థయోనమైడులను ఉపయోగిస్తారు. కార్బిమజాల్ ( Carbimazole ), మిథైమజాల్ ( Methimazole ), ప్రొపైల్ థయోయురసిల్ ( Propylthiouracil ) థయోనమైడులకు ఉదహరణములు. వీటి ప్రభావము కనిపించుటకు కొద్ది వారములు పడుతుంది. ముందు హెచ్చు మోతాదులలో వాడినా తరువాత వీటి మోతాదును రక్తపరీక్షలబట్టి తగ్గించాలి.

        దద్దురులు, చర్మతాపము ( Dermatitis), కీళ్ళనొప్పులు, జ్వరము, కాలేయతాపము ( Hepatitis), తెల్లకణముల ఉత్పత్తి తగ్గుట ( agranulocytosis ) వంటి అవాంఛిత ఫలితములను జాగ్రత్తగా గమనించాలి. పచ్చకామెరలు, గొంతునొప్పి, చలిజ్వరము కలుగుతే వెంటనే థయోనమైడులను ఆపివేసి రక్తపరీక్షలు చెయ్యాలి. ఈ మందుల వాడుక ఆపివేస్తే అవాంఛిత ఫలితములు సాధారణముగా ఉపశమిస్తాయి. అవాంఛిత ఫలితముల గురించి రోగులకు అవగాహన సమకూర్చాలి.

3. గళగ్రంథి విచ్ఛేదన (Thyroidectomy )


        గళగ్రంథి కర్ణికలలో హెచ్చు భాగములను శస్త్రచికిత్సచే తొలగించి ( Subtotal thyroidectomy ) గళగ్రంథి ఆధిక్యతను అరికట్టవచ్చును. ఈ దినములలో శస్త్రచికిత్సను అరుదుగా చేస్తారు. రేడియోధార్మిక అయొడిన్ చికిత్సకు ఇష్టపడనివారికి, థయోనమైడులతో గళగ్రంథి స్రావక ఉధృతి అదుపుకాని వారికి, థయోనమైడుల వలన అవాంఛిత ఫలితములు కలిగినవారికి శస్త్రచికిత్స అవసరమవుతుంది. శస్త్రచికిత్సకు ముందు థయోనమైడులతో గళగ్రంథి స్రావక ఆధిక్యతను తగ్గించాలి. వీరికి శస్త్రచికిత్సకు ముందు రెండువారములు అయొడిన్ చికిత్స అవసరము. బీటా గ్రాహక అవరోధకముల చికిత్స కూడా అవసరము. శస్త్రచికిత్స తదుపరి కొద్దివారములు యీ చికిత్సలు కొనసాగించాలి. 

       శస్త్రచికిత్సలో సహగళగ్రంథులు ( Parathyroid glands ) తొలగించబడితే సహగళగ్రంథి హీనత ( Hypoparathyroidism ) కలిగే అవకాశము ఉన్నది. స్వరతంత్రి నాడులకు (  nerves innervating vocal chords  ) హాని కలుగుతే స్వరతంత్రుల వాతము ( Vocal chord paralysis) కలుగవచ్చును. అపుడు బొంగురు గొంతు, రెండు ప్రక్కల నాడులకు హాని కలుగతే శ్వాసకు ఇబ్బంది కలుగుతాయి. శస్త్రచికిత్స పిమ్మట గళగ్రంథిహీనత కలుగుతే కృత్రిమ గళగ్రంథి స్రావకములతో ( Levothyroxine ) చికిత్స అవసరము. 

         బహుళ కిణ గళగండములు ( Multinodular goiters ) ఉన్నవారిలో గళగ్రంథి స్రావకముల విలువలు సాధారణ పరిమితులలో ఉన్నపుడు, ఏ యితర యిబ్బందులు లేనప్పుడు శస్త్రచికిత్సలు గాని, విపరీతముగా పరిశోధనలు గాని అనవసరము. ఒకే ఒక కిణము ( Solitary nodule ) పొడచూపినప్పుడు సూది, పిచికారులతో కణములను పీల్చి కర్కటవ్రణములకై కణపరీక్షలు సలుపవచ్చును. కణపరీక్షలు సక్రమముగా ఉంటే యితర చికిత్సలు అనవసరము.



వైద్యవిషయములు నా శక్తిమేఱకు తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తమనుకుంటే పంచుకొనండి )

దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి



                                    దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి

                       ( Chronic Obstructive Pulmonary Disease )


                                                                             డా. గన్నవరపు నరసింహమూర్తి

                                                                       ( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )

                            ఇంటికి సెగనుం బెట్టరు
                             కంటికిఁ బొగబెట్టిరేని కారును జలముల్
                             పెంటా యూపిరితిత్తులు ? ?
                             మంటలఁ దెగఁ బాలుసేయ , మానక పొగలన్ ! !


                                                శ్వాసక్రియ 


    శరీర కణజాల జీవవ్యాపారములో ప్రాణవాయువు ( Oxygen) గ్రహించబడి బొగ్గుపులుసు వాయువు ( Carbon dioxide ) విడుదల అవుతుంది. వివిధ అవయవముల కణజాలమునకు రక్తము ద్వారా ప్రాణవాయువు అందించబడుతుంది. ఆయా కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు రక్తములోనికి చేరుతుంది. ఊపిరితిత్తులు ప్రాణవాయువుని రక్తమునకు అందించి రక్తమునుంచి బొగ్గుపొలుసు వాయువుని గ్రహించి బయటకు విసర్జిస్తాయి. నిరంతరము ప్రాణవాయువును రక్తమునకు చేర్చుటకు, బొగ్గుపులుసు వాయువును విసర్జించుటకు ఊపిరితిత్తులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో గాలి ప్రసరణ, ఊపిరితిత్తులకు రక్తప్రసరణ అవసరము.


    వాతావరణములో ఉన్న గాలి ముక్కు, గొంతుక  స్వరపేటికల ద్వారా శ్వాసనాళమునకు ( Trachea) చేరుతుంది. శ్వాసనాళము రెండు పుపుసనాళములుగా ( Bronchi ) చీలి రెండు ఊపిరితిత్తుల వాయుప్రసరణకు సహాయపడుతుంది. ప్రతి ఊపిరితిత్తిలో పుపుసనాళము ద్వితీయ, తృతీయ, అంతిమ పుపుస నాళములుగా ( secondary tertiary and terminal bronchi ) శాఖలై పిదప శ్వాసనాళికలు ( Respiratory bronchioles), పుపుసగోళ నాళికలుగా ( Alveolar ducts ) చీలి చిట్టచివర పుపుస గోళములను ( Alveoli ) ధరిస్తాయి. ఈ పుపుస గోళములు, వాటి దరిని ఉండు రక్తకేశనాళికల ( Capillaries ) మధ్య వాయువుల మార్పిడి జరుగుతుంది. పుపుసగోళములలోని గాలినుంచి ప్రాణవాయువు కేశనాళికలలోని రక్తమునకు చేరి, కేశనాళికల రక్తములోని బొగ్గుపులుసువాయువు పుపుసగోళముల లోనికి చేరుతుంది. ఊపిరితిత్తులకు రక్తము పుపుస ధమని ( Pulmonary Artery ) ద్వారా చేరి తిరిగి పువుస సిరల ( Pulmonary veins) ద్వారా హృదయమునకు చేరుకుంటుంది.


దీర్ఘకాలిక శ్వాసావరోధవ్యాధి 

( Chronic Obstructive Pulmonary Disease ) 



    ఊపిరితిత్తులలో దీర్ఘకాలము పదేపదే తాపప్రక్రియ ( irritation and inflammation ) జరుగుటచే కలిగే విధ్వంసము వలన వాయుప్రసరణకు ( ముఖ్యముగా నిశ్వాసమునకు ) అవరోధము కలిగి దీర్ఘకాలిక శ్వాస అవరోధ వ్యాధి ( Chronic Obstructive Pulmonary Disease - COPD ) కలుగుతుంది. దీని వలన దగ్గు, కఫము, ఆయాసము కలుగుతాయి. 

    ఈ వ్యాధిలో ఊపిరితిత్తుల ఉబ్బుదల ( Emphysema), దీర్ఘకాలిక పుపుస, శ్వాసనాళికల తాపము ( Chronic Bronchitis), రెండు ప్రక్రియలను గమనిస్తాము. తాప ప్రక్రియ వలన పుపుసగోళముల విధ్వంసము, సాగుకణజాలపు విధ్వంసము జరిగి శ్వాస వృక్షపు చివరలో గాలి ఎక్కువై ఉబ్బుదల కనిపిస్తుంది. కఫముతో కూడిన దగ్గు సంవత్సరములో మూడు నెలలు చాలా దినములు, వరుసగా రెండు సంవత్సరాలు ఉంటే దానిని దీర్ఘకాలిక పుపుస నాళికల తాపముగా ( Chronic Bronchitis) నిర్ణయించవచ్చును. ఈ వ్యాధి క్రమ క్రమముగా తీవ్రము అవుతుంది. ఊపిరితిత్తులలో పుపుసగోళముల, పుపుస నాళికల, శ్వాస నాళికల విధ్వంసము, నష్టము శాశ్వతము అగుట వలన ఊపిరితిత్తుల వ్యాపారము సామాన్య స్థితికి తిరిగి రాదు. ఉబ్బసకు దీనికి అదే తేడా. 

వ్యాధికి కారణములు 


    పుపుస నాళికలలో పరంపరలుగా తాప ప్రక్రియ జరుగుటకు ప్రధాన కారణము ధూమపానము. ధూమపానము సలిపే వారిలో 20 నుంచి 50 శాతపు మందిలో దీర్ఘకాలిక శ్వాస అవరోధవ్యాధి జీవిత కాలములో పొడచూపుతుంది. వయస్సు పెరిగిన కొలది వ్యాధిలక్షణములు హెచ్చవుతాయి.

    హానికరమైన యితర గాలులు, గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్ళలో వంట పొయ్యిల నుంచి వచ్చే పొగవలన, బొగ్గుగనులు, బంగారు గనులలో ధూళి, పొగలు , రసాయనములు, హానికర యితర వాయువులు పీల్చుటవలన వాటిలో పనిచేసే కార్మికులకు ఈ వ్యాధి కలుగ వచ్చును. పట్టణాలలో వాతావరణ కాలుష్యము ఈ వ్యాధికి దోహదకారి అవుతుంది.
    
    జన్యు పరముగా వచ్చే ఆల్ఫా- 1 ఏంటిట్రిప్సిన్ లోపము ( alpha-1 Antitripsin deficiency ) వలన దీర్ఘకాలిక శ్వాస అవరోధక వ్యాధి పిన్నవయస్సులో రావచ్చును. ఈ వ్యాధి ఉన్నవారిలో ఆల్ఫా -1 ఏంటిట్రిప్సిన్ లోపము ఉన్నవారు 2 శాతము వఱకు ఉండవచ్చును. ఇతర కుటుంబసభ్యులకు ఈ వ్యాధి ఉన్నా, 45 సంవత్సరముల వయస్సు లోపల ఈ వ్యాధి కనిపించినా, ఊపిరితిత్తుల క్రింద భాగములలో ఉబ్బుదల ఎక్కువగా ఉన్నా ఆల్ఫా- 1 ఏంటిట్రిప్సిన్ కు తప్పకుండా పరీక్ష చెయ్యాలి. 

వ్యాధిగతి 


     దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ఊపిరితిత్తులలో పరంపరలుగా కలిగే తాపము ( Inflammation), మాంసకృత్తు విచ్ఛేదనములు ( Proteinases ) మాంసకృత్తుల అవిచ్ఛేదనముల (Antiproteinases ) మధ్య తారతమ్యములు, ఆమ్లజనీకరణము ( Oxidation), కణజాలపు సహజమృతుల ( Apoptosis ) వలన పురోగమిస్తుంది. పుపుసనాళికలు పుపుసగోళములలో తాపము వలన వాపు, అధికముగా శ్లేష్మపు ఉత్పత్తి ( mucous production ), పుపుసగోళముల విధ్వంసము, తంతీకరణము ( fibrosis), సాగుకణజాలపు ( elastic tissue) విధ్వంసము జరిగి ఊపిరితిత్తుల ఉబ్బుదల ( emphysema) కలుగ జేస్తాయి. పుపుస రక్తనాళములపై కూడా ఈ తాప ప్రభావము ఉంటుంది.

    పై మార్పులు ఊపిరిపైన ఫలితము చూపిస్తాయి. నిశ్వాసము మందగిస్తుంది. ఊపిరి వదలుట శ్రమతో కూడిన పని అవుతుంది. నిశ్వాస వాయు ప్రసరణము తగ్గుతుంది. పుపుసగోళములలో గాలి ఎక్కువగా చేరుకొని ఊపిరితిత్తులు ఉబ్బుతాయి. వాయు ప్రసరణ తగ్గుటవలన, తాపము వలన, పుపుసగోళముల విధ్వంసము వలన పుపుసగోళములు  రక్తకేశనాళికల మధ్య ప్రాణవాయువు బొగ్గుపులుసు వాయువుల మార్పిడి మందగిస్తుంది. పుపుస ధమనులలో రక్తపుపోటు కూడా హెచ్చవుతుంది ( Pulmonary hypertension ). అందువలన వ్యాధి బాగా ముదిరిన వారిలో హృదయపు కుడి జఠరికపై ( Right ventricle) పనిభారము అధికమై హదయ వైఫల్యమునకు ( congestive heart failure ) దారితీస్తుంది. వ్యాధి ప్రకోపించి చివరి దశలలో రక్తములో ప్రాణవాయువు పరిమాణము తగ్గి, బొగ్గుపులుసు వాయువు పరిమాణము పెరిగి  శ్వాస వైఫల్యము ( Respiratory failure), రక్త ఆమ్లీకరణలకు ( Respiratory acidosis) దారితీస్తుంది.

    శ్వాస అవరోధవ్యాధి కలవారిలో గుండెజబ్బులు, గుల్ల ఎముకలవ్యాధి ( Osteoporosis ), కండరముల నీరసము ఎక్కువగా కలుగుతాయి.


వ్యాధి లక్షణములు 


    ఊపిరితిత్తుల వ్యాపారము బాగా దెబ్బతినే వఱకు ( FEV1 50 శాతమునకు మించి క్షీణించే వఱకు ) ఏ లక్షణములు పొడచూపవు. దీర్ఘకాలిక శ్వాస అవరోధవ్యాధి తీవ్రమయిన వారికి తఱచు దగ్గు, కఫము, ఆయాసము, ఊపిరి వదిలేటప్పుడు పిల్లికూతలు కలుగుతాయి. ప్రారంభ దశలో ఆయాసము పనిచేస్తున్నపుడు, శారీరక శ్రమ ఎక్కువయిన సమయములలో కలిగినా వ్యాధి ముదిరాక విశ్రాంత సమయములలో కూడా కలుగుతుంది. సూక్ష్మజీవులు, విషజీవాంశములు ( viruses ), హానికర వాయువులు వలన ఊపితిత్తులలో తాపము కలిగినపుడు, వ్యాధి లక్షణములు హెచ్చుగా కన్పిస్తాయి. ఆయాసము పెరిగినపుడు ఆందోళన కూడా కలుగుతుంది. కఫమునకు సాధారణ స్థితులలో రంగు ఉండదు. సూక్ష్మజీవుల వలన తాపము కలిగినప్పుడు కఫము చీము రంగులోను, పచ్చరంగులోను ఉంటుంది. రక్తములో బొగ్గుపులుసు గాలి పెరిగితే అతినిద్ర, అపస్మారక స్థితి కలుగవచ్చును. 

    వీరిలో ఊపితిత్తుల ఉబ్బుదల వలన ఛాతి పీపా ఆకారములో ఉంటుంది. ఛాతి ముందు నుంచి వెనుక ప్రమాణము ఎక్కువవుతుంది. ఆయాసము ఉన్నవారిలో ఊపిరి కొఱకు కంఠ కండరముల వంటి అదనపు కండరములు కూడా శ్రమించుట గమనిస్తాము. వినికిడి గొట్టముతో విన్నపుడు ఛాతిలో ఊపిరి శబ్దములు మందకొడిగా ఉంటాయి. నిశ్వాస శబ్దముల నిడివి పెరుగుతుంది. పిల్లికూతలు ( Wheezing) వినిపిస్తాయి. ఛాతిపై వేళ్ళుపెట్టి వానిని రెండవచేతి మధ్యవేలుతో కొడితే ప్రతిధ్వని మోత ఎక్కువగా ( hyper resonance ) ఉంటుంది.

వ్యాధి నిర్ణయము 


     దీర్ఘకాలము పొగ త్రాగినవారిలోను, వృత్తిపరముగా హానికర వాయువులను, దుమ్ములను పీల్చే వారిలోను, గనులలో పనిచేసేవారిలోను దగ్గు, కఫము, ఆయాసము కలుగుతే శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary function tests ), ఛాతికి ఎక్స్ - రేలు చేయుట వలన వ్యాధిని నిర్ణయించవచ్చును. చాలా సంవత్సరాలు పొగ త్రాగినవారిలోను, తాప జనక వాయువులను పీల్చిన వారిలోను వ్యాధి లక్షణములు పొడచూపక మునుపే శ్వాస వ్యాపార పరీక్షలు చేసి వ్యాధిని త్వరగా కనిపెట్టుట మంచిది.

శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary Function Tests )


    శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary function tests ) శ్వాసకు అవరోధమును కనుగొనుటకు సహాయపడతాయి. శ్వాసమాపకము ( Spirometer ) అనే పరికరమును శ్వాసవ్యాపార పరీక్షలకై ఉపయోగిస్తారు. సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసము ( forced inspiration ), తదుపరి సత్వర సుదీర్ఘ నిశ్వాసములను ( forced expiration) ఈ పరికరముతో కొలుస్తారు. బలమైన దీర్ఘ ఉచ్ఛ్వాసము తర్వాత బలమైన దీర్ఘ నిశ్వాసముతో వదిలే గాలి ఘనపరిమాణమును సంపూర్ణ శ్వాస ప్రమాణముగా (Forced Vital Capacity, FVC ) పరిగణిస్తారు.

    బల ఉచ్ఛ్వాసముతో గాలి పీల్చిన పిదప బల నిశ్వాసముతో మొదటి సెకండులో వదిలే గాలి పరిమాణమును ( Forced Expiratory Volume - first second ; FEV1 ), మొదటి సెకండులో నిశ్వాసముతో వదల గలిగే గాలి / సంపూర్ణశ్వాస ప్రమాణము FEV1 / FVC ) నిష్పత్తిని ఉపయోగించి అవరోధక పుపుస వ్యాధులను ( Obstructive lung diseases ), నిర్బంధ పుపుస వ్యాధులను ( Restrictive lung diseases ) వేఱుపఱచ వచ్చును.

అవరోధక పుపుసవ్యాధులు ( Obstructive pulmonary diseases ) 


     అవరోధక శ్వాసవ్యాధులు ( ఉబ్బస, దీర్ఖకాలిక శ్వాసావరోధము, ఊపిరితిత్తుల ఉబ్బుదల ) ఉన్న వారిలో సంపూర్ణశ్వాస ప్రమాణము ( FVC ) కొంత తగ్గినా, బలనిశ్వాస వాయుపరిమాణము -1 ( మొదటి సెకండులో బలముగా వదల గలిగే గాలి పరిమాణము FEV1 ) విశేషముగా ( 70 శాతము కంటె తక్కువగా ) తగ్గుతుంది. 

    శ్వాసనాళిక వ్యాకోచ చికిత్స అనంతరము ( Post bronchodilator treatment ) దీర్ఘకాలిక శ్వాసావరోధము గల వారిలో శ్వాస వ్యాపార పరీక్షలు కొద్దిగా మాత్రము మెఱుగవుతాయి. ఉబ్బస వ్యాధిగ్రస్థులలో శ్వాసనాళ వ్యాకోచ చికిత్సతో శ్వాస వ్యాపారము చాలా మెఱుగవుతుంది. మొదటి సెకండు నిశ్వాస వాయు పరిమాణము ( FEV-1 ) విశేషముగా వృద్ధి చెందుతుంది.

నిర్బంధ పుపుస వ్యాధులు ( Restrictive lung diseases ) 


    ఊపిరితిత్తులలో తంతీకరణము ( Pulmonary Fibrosis ), పుపుసవేష్టన వ్యాధులు ( Diseases of Pleura ) వలన ఉచ్ఛ్వాసమునకు అడ్డంకి కలిగిన వారిలో సంపూర్ణ శ్వాసప్రమాణము ( FVC ), మొదటి సెకండులో నిశ్వాసప్రమాణము ( FEV1 ) సమాంతరముగా తగ్గుతాయి. 

    ఈ వ్యాధులు లేనివారలలో శ్వాసవ్యాపార పరీక్షలు సాధారణ పరిమితిలో ఉంటాయి.

    బలనిశ్వాస వాయు ప్రమాణము-1 ( FEV1 ) వయస్సు, ఎత్తు, బరువు, లింగముల బట్టి ఉండవలసిన విలువను అంచనా వేసి ఆ విలువ కంటె తగ్గుదల బట్టి దీర్ఘకాలిక శ్వాస అవరోధ తీవ్రతను నిర్ణయిస్తారు.

వ్యాధి వర్గీకరణము  


    FEV -1 అంచనాలో 80 % కంటె ఎక్కువగా ఉంటే మితము

    FEV -1. అంచనాలో 50 - 79 % లో ఉంటె తీవ్రము

    FEV-1 అంచనాలో 30- 49 % లో ఉంటే తీవ్రతరము

    FEV-1 అంచనాలో 30 % కంటె తక్కువయితే తీవ్రతమము అని వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తారు.

    ఊపిరితిత్తులలో కార్బన్ మోనాక్సైడు ప్రసరణ సామర్థ్యత ( Diffusing capacity of the Lungs for carbon monoxide DLCO ఈ వ్యాధి ఉన్నవారిలో తగ్గుతుంది. ఈ పరీక్ష రక్తపు ప్రాణవాయువు సంగ్రహణ శక్తిని సూచిస్తుంది.

    వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో రక్తములో బైకార్బొనేట్ ( bicarbonate) విలువ పెరుగుతుంది. ఊపిరితిత్తులచే తగినంతగా విసర్జింపబడని బొగ్గపులుసు వాయువు ( carbon dioxide) రక్తములో బైకార్బొనేట్ గా నిలువ అవుతుంది. మూత్రాంగములు ( kidneys ) యీ బైకార్బొనేట్ ను విసర్జించుటకు కృషి చేసినా ఆ కృషి చాలకపోవచ్చును.
   
    శ్వాస అవరోధ వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో ధమని రక్తవాయువుల ( Arterial Blood Gases ) పరీక్ష అవసరము. ధమని రక్తములో ప్రాణవాయువు పీడనమును ( PaO2 ), బొగ్గుపులుసు వాయువు పీడనము ( PaCO2 ) రక్తపు ph లను కొలిచి శ్వాస వైఫల్యమును ( Respiratory failure ) పసిగట్టవచ్చును. 
    
    ఈ వ్యాధి గల వారిలో ఎఱ్ఱ రక్తకణముల సంఖ్య పెరుగవచ్చును. రక్తములో దీర్ఘకాలము ప్రాణవాయువు ప్రమాణము తగ్గుట వలన శరీరము ఎఱ్ఱకణముల ఉత్పత్తిని పెంచుట దీనికి కారణము.

    ఛాతి ఎక్స్ రే చిత్రములలో ఊపిరితిత్తుల ఉబ్బుదలచే ఉదరవితానపు వంకలు తగ్గి సమతలముగా ఉండవచ్చును. ఛాతి ముందు - వెనుకల పరిమాణము పెరుగుతుంది. ఊపిరితిత్తులలో గాలి ఎక్కువగుట వలన పారదర్శకత పెరిగి, రక్కనాళముల గుర్తులు ( vascular markings ) తగ్గుతాయి. గాలి బుడగలు ( bullae ) కనిపించవచ్చును. 

    ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ), పుసవేష్టనములో వాయువు ( Pneumothorax ), హృదయ వైఫల్యము వలన ఊపిరితిత్తులలో నీరు పట్టుట ( Pulmonary edema ), కర్కటవ్రణములు ( Cancers ) వంటి ఇతర వ్యాధులను కనుగొనుటకు ఎక్స్ రేలు ఉపయోగపడుతాయి.

    ఛాతి గణనయంత్ర చిత్రీకరణములు ( Cat scans ) ఊపిరితిత్తులలో విపరీతముగా ఉబ్బిన భాగము తొలగించే శస్త్రచికిత్సలకు ( Lung Volume Reduction Surgery ) ముందు, ఊపిరితిత్తుల మార్పు శస్త్రచికిత్సలకు ( Lung Transplantation ) ముందు, కర్కటవ్రణములను ( Cancers ) కనుగొనుటకు వాడుతారు.

వ్యాధి చికిత్స 


    దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధిలో ఊపిరితిత్తులలో కణజాల విధ్వంసము, నష్టము కలుగుట వలన వ్యాధికి ఉపశమనము చేకూర్చుట తప్ప వ్యాధిని సంపూర్ణముగా నయము చేయుట కుదరదు.

    పొగత్రాగడము మానివేయుట, హానికర వాయువులు, దుమ్ము, ధూళులకు దూరముగా ఉండుట, ఊపిరితిత్తులను విషజీవాంశముల ( viruses ), సూక్ష్మజీవుల ( bacteria ) బారి నుంచి కాపాడుట వలన వ్యాధి పురోగమనమును మందగింప చేయవచ్చును. మధ్య మధ్యలో కలిగే వ్యాధి ఉద్రేకతలను అరికట్టవచ్చును.

    శ్వాసవ్యాధులు కలవారు ప్రతి ఐదు సంవత్సరములకు ఒకసారి ఊపిరితిత్తుల తాపము అరికట్టు టీకాను ( Pneumonia vaccine ) ప్రతిసంవత్సరము ఫ్లూ రాకుండా ఇన్ఫ్లుయెంజా టీకాను ( Influenza vaccine ) వేసుకోవాలి.

ఔషధములు  


శ్వాస నాళికా వ్యాకోచకములు 

    ఈ వ్యాధిలో శ్వాసకు అవరోధమును తగ్గించుటకై పుపుస శ్వాసనాళికలలో ఉన్న మృదుకండరముల బిగుతును తగ్గించి ఆ నాళికలను వ్యాకోచింపజేసే మందులను పీల్పువుల ( Inhalers ) ద్వారా గాని, తుంపరులుగా శీకర యంత్రములతో ( nebulizers ) గాని వాడుకోవాలి.

బీటా- 2 ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు ( Beta-2 adrenergic receptor agonists ) 


    వ్యాధి ఉద్రేకించినపుడు తక్షణ ఉపశమనమునకు సత్వరముగ పనిచేసే బీటా 2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములను ( Short acting Beta2- adrenergic agonists SABA s ) పీల్పువుల ( Inhaler ) ద్వారా వాడాలి.

    ఎక్కువ వాడకములో ఉండే ఔషధము ఆల్బుటెరాల్ ( Albuterol ) పీల్పువు. దీనిని రెండు పీల్పులు ప్రతి 4 - 6 గంటలకు లేక శీకరయంత్రము ద్వారా 2.5 మి. గ్రా.లు ప్రతి 6-8 గంటలకు తుంపరులుగా వాడవచ్చును.

    లీవాల్బుటెరాల్ ( Levalbuterol ) మరో మందు. దీనిని రెండు పీల్పులు ప్రతి 4-6 గంటలకు లేక శీకర యంత్రము ద్వారా 0.63 - 1.25 మి. గ్రా.లు ప్రతి 6-8 గంటలకు వాడవచ్చు. ఇవి పుపుస,శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తాయి. అందు వలన గాలి బాగా ప్రసరిస్తుంది.

    పిర్ బ్యుటెరాల్ ( Pirbuterol ) మరో మందు, రెండు పీల్పులు ప్రతి 4-6 గంటలకు వాడుకొనవచ్చును.


ఎసిటైల్ ఖొలీన్ అవరోధకములు ( Anticholenergics - Muscarine Antagonists ) 


    ఇప్రట్రోపియమ్ బ్రోమైడును ( Ipratropium bromide ) పీల్పువు ద్వారా గాని, శీకర యంత్రము ద్వారా గాని ఆల్బుటరాల్ తోను, లేక లీవాల్బుటరాల్ తోను కలిపి, లేక ఒంటరిగాను అందించవచ్చును. ఇది పుపుస, శ్వాస నాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింప జేస్తుంది. ఇప్రట్రోపియమ్ మోతాదులు కొద్ది గంటలే పనిచేస్తాయి ( Short acting Muscarine Antagonist  SAMAs ) కాబట్టి దీనిని దినమునకు 2 పీల్పులు ప్రతి 4-6 గంటలకు లేక 0.5 మి.గ్రా.లు ప్రతి 6-8 గంటలకు శీకరయంత్రము ద్వారా గాని వాడాలి.

    సాల్మెటరాల్ ( Salmeterol ), ఫార్మెటరాల్ ( Formoterol ), దీర్ఘకాలిక బీటా ఉత్తేజకములను ( Long Acting Beta Agonists  LABAs ) విడిగా గాని, కార్టీకోస్టీరాయిడులతో ( Fluticasone or Mometasone ) కలిపి గాని పీల్పువులుగా ఉపయోగించ వచ్చును.

    ఒలొడటెరాల్ ( Olodaterol ) రోజుకు రెండు పీల్పులుగా వాడాలి.

    టియోట్రోపియమ్ ( Tiotropium ) దీర్ఘకాలిక ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము ( Long acting Muscarine Antagonist LAMA ). దీనిని దినమునకు రెండు పీల్పులుగా వాడాలి. దీర్ఘకాలిక బీటా ఉత్తేజకము ఓలొడటెరాల్ తో ( Olodaterol ) కలిపి పీల్పువుగా కూడా టియోట్రోపియమ్ లభ్యము.

    యుమిక్లిడినియమ్ ( Umeclidinium ) దీర్ఘకాలము పనిచేసే ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము ( Long Acting Muscarine Antagonist LAMA ). దినమునకు ఒక మోతాదుని పీల్పువు ద్వారా వాడుకోవాలి.

    కార్టికోస్టీరాయిడ్ పీల్పువులు ( Inhaled corticosteroids. ) పుపుస, శ్వాస నాళికలలో తాపమును తగ్గించి ఊపిరికి అడ్డంకిని తగ్గిస్తాయి. వ్యాధి తీవ్రతరము అయినపుడు, వ్యాధి ఉద్రేకించినపుడు వీని ప్రయోజనము కలదు. కాని ఇవి వ్యాధి నిరోధకశక్తిని తగ్గించుట వలన ఊపితిత్తులు సూక్ష్మజీవుల బారికి గుఱి అయే అవకాశములు పెరుగుతాయి. ఈ పీల్పువులను వాడిన పిమ్మట నోటిపూతలు కలుగకుండా ఉండుటకు నోటిని నీళ్ళతో పుక్కిలించాలి.

థియాఫిలిన్ ( Theophylline ) 


    థియాఫిలిన్ కు ( Theophylline) పుపుస, శ్వాసనాళికలను వ్యాకోచింపజేసే గుణము కలదు. వ్యాధి లక్షణములు మిగిలిన మందులతో లొంగని వారికి థియోఫిలిన్ ను నెమ్మదిగా విడుదలయే బిళ్ళల రూపములో వాడవచ్చును. ఆందోళన, వణకు, గుండెదడ, కడుపులో వికారము, వాంతులు, మూర్ఛ దీని వలన కలిగే అవాంఛిత ఫలితములు. థియాఫిలిన్ వాడే వారిలో మధ్యమధ్యలో రక్తప్రమాణములను పరీక్షించాలి.

కార్టికోష్టీరాయిడులు ( Corticosteroids ) 


    నోటి ద్వారా గాని సిరల ద్వారా గాని కార్టికోస్టీరాయిడులను వ్యాధి ఉద్రేకించినపుడు, తీవ్రతరమయినపుడు తాత్కాలికముగాను వీలయినంత తక్కువ మోతాదులలోను వాడుతారు.
Alpha - 1 Antitrypsin లోపించిన వారిలో దానిని వారమునకు ఒకసారి సిరల ద్వారా యిస్తే ప్రయోజనము చేకూరుతుంది. 

ప్రాణవాయువు ( oxygen ) 


    ధమని రక్తపు ప్రాణవాయువు సంపృక్తత ( oxygen saturation ) 88 శాతము కంటె తక్కువయిన వారికి ప్రాణవాయువును ముక్కు గొట్టము ద్వారా అందించాలి. 

    రక్తములో బొగ్గుపులుసు వాయువు ప్రమాణము పెరిగిన వారికి, శ్వాస వైఫల్యము ప్రారంభదశలో ఉన్నవారికి నిరంతర పీడనముతో గాని ( Continual Positive airway pressure  CPAP ), ఉచ్ఛ్వాస నిశ్వాసములలో పీడనము మార్చి గాని ( Bilevel positive airway pressure BiPAP ) ప్రాణవాయువును ముక్కుపై కప్పుతో ( mask ) నిద్రలో ఉన్నపుడు, అవసరమయితే పగలు కొన్ని గంటలు అందిస్తారు. 

ఊపిరితిత్తుల పరిమాణము తగ్గించే శస్త్రచికిత్స

( Lung Volume Reduction Surgery ) 


    వాయువుల మార్పిడికి దోహదపడకుండా, పనిచేసే ఊపిరితిత్తుల భాగముల మీద పీడనము పెట్టి ఊపిరికి అంతరాయము కలిగించే ఉబ్బుదల భాగములను తొలగించు శస్త్రచికిత్స కొందఱికి ఉపయోగపడవచ్చును. 
    ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స ( Lung Transplantation surgery ) FEV-1 20 శాతము కంటె తక్కువగా ఉండి వ్యాధి తీవ్రతమమయినపుడు కొందఱికి అనుకూలము కావచ్చును. 

వ్యాధి ఉద్రేకత ( Acute exacerbations of COPD ) 


    దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి లక్షణములు అధికమయి ఆయాసము, దగ్గు అధికమయినపుడు వైద్యాలయములలో చేరిక అవసరము అవవచ్చును. సూక్ష్మాంగజీవులు ( bacteria ), విషజీవాంశములు ( viruses ), తాప జనకములు, వాతావరణ కల్మషముల వలన వ్యాధి ఉద్రేకించవచ్చును. అట్టి పరిస్థితులలో తఱచు పుపుస, శ్వాసనాళిక వ్యాకోచకములను ( bronchodilators ) అందించుటతో పాటు, సూక్ష్మజీవి నాశకములు ( Antibiotics ), కార్టికోస్టీరాయిడులు, ప్రాణవాయువులతో కూడా చికిత్స చేస్తారు. 

    వ్యాధి తీవ్రతరమయితే ధమని రక్తమును వాయువులకు పరీక్షించి శ్వాస వైఫల్యము నిర్ధారణ అయితే కృత్రిమ శ్వాసలు అందించాలి.

వ్యాధి నివారణ 


    దీర్ఘకాలిక శ్వాస అవరోధమునకు పొగత్రాగుట అధిక శాతములో ప్రధాన కారణము. కావున వ్యాధిని నివారించాలన్నా అదుపులో ఉంచాలన్నా పొగత్రాగడము మానివేయుట చాలా ముఖ్యము. ఒక యత్నములో చాలా మంది పొగత్రాగుట మానలేరు. అందువలన పదే పదే పొగత్రాగుట మానుటకు యత్నించాలి. సలహా సహాయములను తీసుకోవాలి. అవసరము అనుకుంటే ధూమపానము మానుటకు మందులను ఉపయోగించవచ్చును. 

    బొగ్గుగనులు, యితరగనులలో గాలి ప్రసరణ పెంచి, గాలిలో కల్మషములను ధూళిని తొలగించి, కార్మికులకు పరిశుభ్రమైన గాలిని ముక్కు, నోటిపై అమరు మూతల ( masks ) ద్వారా అందించి నల్ల ఊపిరితిత్తుల వ్యాధిని ( Black lung disease ) అరికట్టే ప్రయత్నాలు చెయ్యాలి.


( వైద్యవిషయములు నా శక్తిమేఱకు తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి ). 

ఉబ్బస ( Bronchial Asthma )


( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )

                                ఉబ్బస 

( Bronchial Asthma )

                                            డా. గన్నవరపు నరసింహమూర్తి.

                                                                              

                                                                  శ్వాసక్రియ 

           
    శరీర కణజాలపు జీవప్రక్రియలో ప్రాణవాయువు ( Oxygen) గ్రహించబడి బొగ్గుపులుసు వాయువు ( Carbon dioxide ) విడుదల అవుతుంది. వివిధ అవయవముల కణజాలమునకు రక్తము ద్వారా ప్రాణవాయువు అందించబడుతుంది. ఆయా కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు రక్తములోనికి చేరుతుంది. ఊపిరితిత్తులు ప్రాణవాయువును రక్తమునకు అందించి రక్తమునుంచి బొగ్గుపులుసు వాయువును గ్రహించి బయటకు విసర్జిస్తాయి. నిరంతరము ప్రాణవాయువును రక్తమునకు చేర్చుటకు, బొగ్గుపులుసు వాయువును విసర్జించుటకు ఉచ్ఛ్వాస నిశ్వాసాల శ్వాసక్రియ, ఊపిరితిత్తులుకు రక్తప్రసరణ అవసరము.
    వాతావరణములో ఉన్న గాలి ముక్కు, గొంతుక, స్వరపేటికల ద్వారా శ్వాసనాళమునకు ( Trachea) చేరుతుంది. శ్వాసనాళము రెండు పుపుసనాళములుగా ( Bronchi ) చీలి రెండు ఊపిరితిత్తుల వాయుప్రసరణకు సహాయపడుతుంది. ప్రతి ఊపిరితిత్తిలో పుపుసనాళము ద్వితీయ, తృతీయ, అంతిమ పుపుస నాళములుగా ( secondary tertiary and terminal bronchi ) శాఖలై పిదప శ్వాసనాళికలు ( Respiratory bronchioles), పుపుసగోళ నాళికలుగా ( Alveolar ducts ) చీలి చిట్టచివర పుపుస గోళములను ( Alveoli ) ధరిస్తాయి. ఈ పుపుస గోళములు, వాని దరిని ఉండు  రక్తకేశనాళికల ( Capillaries ) మధ్య వాయువుల మార్పిడి జరుగుతుంది. 

    శ్వాసనాళము, పుపుసనాళముల గోడలలో ఉన్న మృదులాస్థి ( Cartilage ), పుపుసనాళికల, శ్వాసనాళికల గోడలలో ఉండు అనిచ్ఛా మృదుకండరములు ( Smooth muscles ) ఆ నాళములను, నాళికలను నిత్యము తెఱిచి ఉంచుతాయి. పుపుసగోళముల బయట ఉండు సాగుకణజాలము ( Elastic tissue ) పుపుసగోళములు పూర్తిగా అణిగిపోవుటను అరికడుతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలన శ్వాసవృక్షములో ( Bronchial tree ) వాయు చలనము జరుగుతుంది. ఈ వాయు చలనానికి అవరోధము ఏర్పడినప్పుడు రక్తమునకు ప్రాణవాయువు చేరుటకు, రక్తమునుంచి బొగ్గుపులుసు వాయువు తొలగించబడుటకు అంతరాయము ఏర్పడుతుంది. శ్వాసవృక్షములో వాయు చలనమునకు అవరోధము కలిగించే రుగ్మతలలో ఉబ్బసవ్యాధి ( Bronchial Asthma) ఒకటి.


                                                  ఉబ్బస 



    ఉబ్బసవ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధివలన శ్వాసపథములో దీర్ఘకాలిక తాపప్రక్రియ (inflammation ) కలిగి మధ్య మధ్యలో వ్యాధి ముమ్మరిస్తుంటుంది. సూక్ష్మాంగజీవులు ( bacteria ), విషజీవాంశములు ( Viruses ) ఊపిరితిత్తులపై దాడి జరిపినపుడు, పడని పదార్థములు ( allergens), వృత్తులలోను యితరత్రా తాపజనకముల ( irritants) బారికి దేహము గుఱి అయినప్పుడు ఊపిరితిత్తుల విపరీత స్పందన వలన ఉబ్బసవ్యాధి లక్షణములు ప్రకోపిస్తాయి.

    ఉబ్బస పొడచూపినపుడు పరంపరలుగా దగ్గు, ఆయాసము, ఛాతిబిగువు, ఊపిరి వదిలేటప్పుడు పిల్లికూతలు ( wheezings ) కలుగుతాయి. వ్యాధి విపరీతమయితే శ్వాస వైఫల్యము కలిగి, తీవ్రత హెచ్చయితే మరణము కూడా సంభవించవచ్చును. వ్యాధి దానంతట అది కాని, చికిత్సతో గాని కొన్ని నిముషముల నుంచి కొన్ని గంటలలో ఉపశమించవచ్చు.

ఉబ్బసకు కారణములు 


    ఉబ్బస వ్యాధి ప్రంపంచమంతటా ఉన్నా అభివృద్ధి చెందిన దేశాలలో అధికముగా కనిపిస్తుంది. కొన్ని జాతులలో ఉబ్బసవ్యాధి అధికముగా కనిపించినా ఆర్ధిక, సామాజిక, పరిసరముల ప్రభావము దానికి కారణము కావచ్చును. జన్యువులు, క్రోమోజోములు యీ వ్యాధి కలుగుటకు కారణమయినా వాతావరణ, పరిసర ప్రభావములు యీ వ్యాధిపై హెచ్చుగా కలిగి ఉంటాయి, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ( Respiratory Syncytial Virus RSV ), రైనోవైరస్ ( Rhinovirus ) వంటి విషజీవాంశములు (viruses ), పొగాకు పొగ, యితర పొగలు, స్వచ్ఛత కొఱకు వాడే సబ్బులు వంటి రసాయనములు, యితర రసాయనములు, తాపకారులు ( Irritants ), పుప్పొడి, ధూళిక్రిములు, బొద్దింకల విసర్జనములు, పెంపకపు జంతువుల బొచ్చు, సుగంధపరిమళములు, బూజులు వంటి అసహన పదార్థములు ( Allergens ), శీతలవాయువులు శ్వాసపథములో తాపము కలుగజేసి వ్యాధి పొడచూపుటకు కారణము అవుతాయి. వ్యాయామము, ఆటలు, మానసిక ఆందోళనలు కూడా ఉబ్బసవ్యాధి ఉద్రేకించుటకు కారణము కాగలవు.

    బీటా 2-ఎడ్రినలిన్ గ్రాహక అవరోధకములు ( Beta 2- adrenergic receptor blockers ), ఏస్పిరిన్ , స్టీరాయిడులు కాని - తాప హరములు ( non steroidal anti inflammatory drugs  ) ఉబ్బసవ్యాధిని ప్రకోపించవచ్చును.

వ్యాధి విధానము 


    ఉబ్బసవ్యాధి కలిగిన వారి శ్వాసపథములో గాలి చలనమునకు అవరోధము కలుగుతుంది. ఈ అవరోధము ముఖ్యముగా నిశ్వాసమునకు ఏర్పడుతుంది. అందువలన ఊపిరితిత్తులు గాలితో ఉబ్బి ఉంటాయి. శ్వాసనాళముల, పుపుస నాళముల, పుపుస నాళికల గోడలలోను, శ్లేష్మపు పొరలలోను ( mucosa ), ఆమ్లాకర్షణ కణములు ( Eosinophils - ఇవి శ్వేతకణములలో ఒక రకము ), స్తంభ కణములు ( mast cells), భక్షక కణములు ( macrophages), రసి కణములు ( T- lymphocytes ) చేరి తాపము ( inflammation ) కలుగజేస్తాయి. తాపకణముల నుంచి, నాళముల లోపొర నుంచి వెలువడు జీవరసాయనక పదార్థముల వలనను, నాడీ ప్రసారిణుల ( Neuro transmitters ) ప్రభావము వలనను శ్వాస, పుపుస నాళికలలోఉన్న మృదుకండరములు సంకోచిస్తాయి. అందుచే ఆ నాళికల ప్రమాణములు తగ్గుతాయి. ఈ మృదుకండరముల పరిమాణము కూడా పెరుగుతుంది.

    శ్వాసనాళికల లోపొర భాగములు తాపము వలన విచ్ఛేదమయి నాళములలో బిరడాలుగా ఏర్పడి గాలి ప్రసరించుటకు అవరోధము కలిగిస్తాయి.

    శ్వాసవృక్ష  శ్లేష్మపుపొర క్రింద శ్లేష్మగ్రంథులు సంఖ్యాపరముగాను, పరిమాణములోను వృద్ధి చెంది శ్లేష్మమును ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అధిక శ్లేష్మము వాయుచలనమునకు అడ్డుపడుతుంది.

    శ్వాసనాళికల తాపప్రక్రియలో భాగముగా కొత్త సూక్ష్మరక్తనాళికలు పుడతాయి. మాన్చు ప్రక్రియలో నాళికలలో లోపొర ( అంతస్త్వక్కు ) క్రింద తంతుకణములు ( fibroblasts) పీచువంటి కొల్లజెన్ ( Collagen ) తంతువులను ఉత్పత్తి చేయుట వలన తంతీకరణ ( fibrosis ) జరిగి నాళములు కుచించుకు పోతాయి.
    పై కారణములు అన్నిటి వలన శ్వాసవృక్షములో ఊపిరి బంధించబడుతుంది. రక్తములో ప్రాణవాయువు చేరికకు, బొగ్గుపులుసువాయువు విసర్జనకు భంగము ఏర్పడుతుంది.

ఉబ్బస లక్షణములు 


    ఉబ్బస కలిగినప్పుడు పరంపరలుగా దగ్గు, ఆయాసము, ఛాతిలో బిగుతు, శ్రమతో కూడిన నిశ్వాసములు, పిల్లికూతలు ( wheezing) కలుగుతాయి. గుండెదడ, అధికస్వేదము కూడా పొడచూపవచ్చును. వ్యాధి తగ్గుతూ అప్పుడప్పుడు ముమ్మరించుట ఉబ్బస లక్షణము. అసహన చర్మతాపము ( Atopic Dermatitis ), వివిధ పదార్థములకు వికట లక్షణములు కలుగుట, కుటుంబములో ఇతరులకు ఈ వ్యాధి ఉండుట వంటి లక్షణముల వలనను, ప్రత్యక్షముగా వ్యాధిగ్రస్థులను పరీక్షించుట వలనను వైద్యులు రోగ నిర్ణయము చేయగలుగుతారు. వైద్యులు వినికిడిగొట్టముతో ఛాతిపై విన్నపుడు నిశ్వాస సమయము హెచ్చుగా ఉండుట గమనిస్తారు. చాల మందిలో నిశ్వాసములో పిల్లికూతలు కూడా వినగలరు. కొందఱిలో పిల్లికూతలు వినిపించక పోవచ్చును.
    ఆయాసము ఊపిరితిత్తుల తాపము వలన ( Pneumonitis ), వాయు పుపుస వేష్టనము వలన ( Pneumothorax ; ఊపిరితిత్తిని ఆవరించు ఉండు పుపుస వేష్టనపు రెండు పొరల మధ్య గాలి చేరుట ), ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల వలన, హృదయ వైఫల్యము ( Congestive heart failure) వంటి గుండెజబ్బుల వలన, పుపుస ధమనిలో రక్తపుగడ్డలు వలన ( Pulmonary embolism), రక్తహీనత వలన, అనేక యితర కారణముల వలన కలుగవచ్చును.

వ్యాధి నిర్ణయము 


    వ్యాధి లక్షణములతో వైద్యులు వ్యాధిని నిర్ణయించగలుగుతారు. వాయు పుపుసవేష్టనము ( Pneumothorax), హృదయ  వైఫల్యము వలన ఊపిరితిత్తులలో నీరుపట్టుట ( Congestive heart failure) , ఊపిరితిత్తుల తాపముల ( Pneumonitis ) సంశయము ఉంటే ఛాతికి ఎక్స్ రే ( chest x-ray ) అవసరము. ఆ సంశయము లేకపోతే ఎక్స్ రేల అవసరము లేదు. 
    చికిత్సతో తగ్గనపుడు, ఆయాసము ఎక్కువగా ఉన్నపుడు, ఎక్స్ రే వ్యత్యాస పదార్థములతో ఛాతికి గణనయంత్ర చిత్రీకరణము ( CAT Scan ) చేస్తే పుపుసధమనులలో అవరోధకములు ( Pulmonary embolism ) కనుగొనుటకు లేక, లేవని నిర్ధారించుటకు ఉపయోగపడుతుంది. 
    ఆయాసము తీవ్రముగా ఉండి శ్వాస వైఫల్యమునకు ( Respiratory failure ) అవకాశము ఉంటే, ఉబ్బసకు తక్షణ చికిత్సతో బాటు కృత్రిమశ్వాసలు  ( artificial respirations ) అందించుటకు కూడా వైద్యులు సన్నద్ధులు కావాలి. గరిష్ఠ వాయు ప్రవాహము ( Peak flow ) 25 శాతమునకు తగ్గినపుడు, రక్తములో ప్రాణవాయువు బాగా తగ్గినపుడు, బొగ్గుపులుసు వాయువు బాగా పెరిగినపుడు, ఊపిరి మందగించి నపుడు వైద్యులు కృత్రిమ శ్వాసలు అందించాలి.

శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary function tests )


    ఉబ్బస వ్యాధిని ధ్రువపఱచుటకు శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary function tests ) సహాయపడుతాయి. ఆ పరీక్షలకు శ్వాసమాపకము ( Spirometer ) అనే పరికరము ఉపయోగిస్తారు. సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసమును ( forced inspiration ), తదుపరి సత్వర సుదీర్ఘ నిశ్వాసమును ( forced expiration) ఈ పరికరముతో కొలుస్తారు. బలమైన దీర్ఘ ఉచ్ఛ్వాసము తర్వాత బలమైన దీర్ఘ నిశ్వాసముతో వదిలే గాలి ఘనపరిమాణమును సంపూర్ణ శ్వాస ప్రమాణముగా (Total Vital Capacity TVC ) పరిగణిస్తారు. బల నిశ్వాసముతో మొదటి సెకండులో వదిలే గాలి పరిమాణము ( Forced Expiratory Volume  first second ; FEV 1 ),  FEV 1 / TVC నిష్పత్తులను ఉపయోగించి అవరోధక పుపుస వ్యాధులను ( Obstructive lung diseases ), నిర్బంధ పుపుస వ్యాధులను ( Restrictive lung diseases ) వేఱుపఱచ వచ్చును. ఉబ్బస అవరోధక శ్వాసవ్యాధి. ఉబ్బస ఉన్నపుడు వారిలో మొదటి సెకండులో బలనిశ్వాస వాయుపరిమాణము  ( FEV 1) విశేషముగా తగ్గుతుంది. శ్వాసనాళికల వ్యాకోచ చికిత్స అనంతరము ( Post bronchodilator treatment ) ఉబ్బస వ్యాధిగ్రస్థులలో శ్వాసవ్యాపారము చాలా మెఱుగవుతుంది. మొదటి సెకండు నిశ్వాస వాయు పరిమాణము విశేషముగా వృద్ధి చెందుతుంది. ఉబ్బస లేనపుడు శ్వాస వ్యాపార పరీక్షలు సాధారణముగా ఉండవచ్చును.

గరిష్ఠ ( వాయు  ) ప్రవాహమానిక  ( Peak flow meter ) 


    గరిష్ఠ ( వాయు ) ప్రవాహ మానికతో ( Peak flow meter ) సంపూర్ణ దీర్ఘ ఉచ్ఛ్వాసము తర్వాత సత్వర దీర్ఘనిశ్వాసము చేయించి గరిష్ఠ ప్రవాహము ( Peak flow ) కొలిచి ఉబ్బసవ్యాధిని నిర్ధారించి, దాని తీవ్రతను అంచనా వేయవచ్చును. ఇవి సులభ పరికరములు, చౌకగా లభిస్తాయి.

    శ్వాసవ్యాపార పరీక్ష ఫలితములు సామాన్య పరిధులలో ఉంటే మెథాఖొలిన్ యిచ్చి శ్వాసనాళికల స్పందనను శ్వాసవ్యాపార పరీక్షలతో పరిశీలించి ఉబ్బస నిర్ధారణ చేయవచ్చును.

    ఉబ్బస వ్యాధి ఉన్నవారికి  అసహన పదార్థములకై ( Allergens) పరీక్షలు సలుపవచ్చును.

చికిత్స 


    ఉబ్బస ప్రకోపించినపుడు ఉబ్బస తీవ్రతను గరిష్ఠ ప్రవాహము ( peak flow ) బట్టి అంచనా కట్టాలి. వ్యాధి ఉపశమన చికిత్సలు తక్షణము మొదలుపెట్టాలి.

     వ్యాధి లక్షణములు పొడచూపే తఱచుదనము, తీవ్రతల బట్టి అంతరిత ( Intermittent ), నిరంతర ( Persistent ) : అల్ప , మధ్యమ, తీవ్ర వ్యాధులుగా పరిగణిస్తారు. 


శ్వాస నాళికా వ్యాకోచకములు 

బీటా-2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు ( Beta 2 adrenergic agonists ) 


    తక్షణ ఉపశమనమునకు సత్వరముగ పనిచేసే బీటా 2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములను ( Short acting Beta2- adrenergic agonists SABA s ) పీల్పువుల ( Inhaler ) ద్వారా వాడాలి.
    ఎక్కువగా వాడబడే ఔషధము ఆల్బుటరాల్ పీల్పువు. ఉబ్బస పొడచూపినపుడు దీనిని రెండు నుంచి ఆరు పీల్పులు  ప్రతి ఇరవై నిమిషములు ఉబ్బస తగ్గే వఱకు వాడాలి. లీవాల్బుటెరాలు ( Levalbuterol ) మరో మందు. దీనిని రెండు నుంచి ఎనిమిది పీల్పులు వఱకు వాడవచ్చు. ఈ మందులను గాలి, లవణజలములతో మిశ్రీకరించి తుంపరులుగా శీకర యంత్రముతో ( Nebulizer ) కూడా వాడవచ్చును. ఇవి పుపుసనాళికల, శ్వాసనాళికల మృదుకండరాలను సడలించి వాటిని వ్యాకోచింపజేస్తాయి. అందుచే గాలి కదలిక మెఱుగవుతుంది.
    ఇదివఱలో బీటా2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు ( Beta2-Receptor agonist s) ఎపినెఫ్రిన్, టెర్బుటలిన్ లను చర్మము క్రింద సూదిమందులుగా వాడే వారు. పీల్పువులు, శీకర యంత్రములతో ఔషధములను యివ్వగలిగినప్పుడు అట్టి అవసరము లేదు. గుండెవ్యాధులు ఉన్నవారికి ఆ సూదిమందులు యివ్వకూడదు.

ఎసిటైల్ ఖొలీన్ అవరోధకములు( Anticholenergics - Muscarine Antagonists ) 


    ఇప్రట్రోపియమ్ బ్రోమైడును ( Ipratropium bromide ) పీల్పువు ద్వారా గాని, శీకర యంత్రము ( Nebulizer ) ద్వారా గాని ఆల్బుటరాల్ తోను, లేక లీవాల్బుటరాల్ తోను కలిపికాని, లేక ఒంటరిగాను ఊపిరితిత్తులకు అందించవచ్చును. ఇది పుపుస, శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తుంది. ఇప్రట్రోపియమ్ మోతాదులు కొద్ది గంటలే పనిచేస్తాయి ( Short acting Muscarine Antagonist SAMA ) కాబట్టి దీనిని దినమునకు పలు పర్యాయములు వాడుకోవాలి.

    యుమిక్లిడినియమ్ ( Umeclidinium ) దీర్ఘకాలము పనిచేసే ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము ( Long Acting Muscarine Antagonist LAMA ). దీనిని దినమునకు ఒక మోతాదు పీల్పువుగా వాడుకోవాలి.

కార్టికోస్టీరాయిడ్ పీల్పువులు 


    ట్రయామ్సినలోన్ ( Triamcinolone ), బెక్లోమిథసోన్ ( Beclomethasone ), బ్యుడినొసైడ్ ( Budenoside ), ఫ్లునిసొలైడ్ ( Funisolide ), ఫ్లుటికసోన్ ( Futicasone ), మొమెటసోన్ ( Mometasone ) వంటి కార్టికోస్టీరాయిడ్ ఔషధములు పీల్పువులుగా లభ్యమవుతున్నాయి. ఈ మందులు శ్వాసపథములో తాపమును ( Inflammation ) తగ్గించుటకు ఉపయోగపడుతాయి. వీటి వాడుక వలన శ్వాసపథములో వాపు తగ్గి వాయు చలనము మెఱుగవుతుంది. తక్కువ మోతాదులలో వాడినప్పుడు వాని ప్రభావము శ్వాస వృక్షమునకే పరిమితమైనా ఎక్కువ మోతాదులలో వాడినప్పుడు వాని ప్రభావము దేహములో పొడచూపవచ్చును. అందువలన ఉబ్బస అదుపులోనికి వచ్చిన పిదప క్రమేణ వాని మోతాదులను తగ్గించే ప్రయత్నము చెయ్యాలి.  నిరంతరపు ఉబ్బసను ( Persistent Asthma ) అదుపులో ఉంచుటకు కార్టికోస్టీరాయిడ్ పీల్పుసాధనములు చాలా ప్రయోజనకరము.

    కార్టికోస్టీరాయిడులను పీల్చిన పిదప నోటిని మంచినీళ్ళతో పుక్కిలించుకోవాలి. లేకపోతే నోటిపూత కలిగే అవకాశము ఉన్నది.
దీర్ఘకాలపు ఉబ్బసను అదుపులో ఉంచుటకు దీర్ఘకాలిక బీటా ఉత్తేజకములు ( Long Acting Beta Agonists LABAs ), సాల్మెటరాల్ ( Salmeterol ) గాని, ఫార్మెటరాల్ ( Formeterol ) గాని, కార్టీకోస్టీరాయిడులతో కలిపి పీల్పువులుగా ఉపయోగించవచ్చును. 

కార్టికోష్టీరాయిడులు ( Corticosteroids ) 


    ఉబ్బస తీవ్రముగా ఉన్నప్పుడు కార్టికోస్టీరాయిడులను నోటిద్వారా గాని, సిరలద్వారా గాని వైద్యులు వాడుతారు.

ఇతర మందులు 


    ఉబ్బస తీవ్రముగా ఉన్నప్పుడు సిర ద్వారా మెగ్నీషియమ్ సల్ఫేట్  శ్వాసనాళికలను వ్యాకోచింపజేయుటకు ఉపయోగిస్తారు.

    తాపప్రక్రియ తగ్గించే మాంటెలుకాస్ట్ ( Montelukast ), జఫిర్లుకాస్ట్ ( Zafirlukast ), స్తంభ కణములను ( Mast cells ) సుస్థిరపఱచు క్రొమొలిన్ సోడియమ్ ( Cromolyn sodium ), IGE ప్రతిరక్షకము ఒమలిజుమాబ్ ( Omalizumab ), నెమ్మదిగా విడుదలయే థియాఫిలిన్ మందుబిళ్ళలను కూడా దీర్ఘకాలపు ఉబ్బసను అదుపులో ఉంచుటకు వాడుతారు.

  నివారణ 

    ఉబ్బస ఉన్నవారు  అసహన పదార్థములను ( allergens), నివారించుకొనుటకు ప్రయత్నించాలి. ధూమపానము చేయరాదు. వ్యాయామములకు ఆటలకు ముందుగా శ్వాసనాళిక వ్యాకోచములు ( Bronchodilators ) పీల్చుకొని ఉబ్బసను అరికట్టుకోవాలి.
    ఉబ్బస పొడచూపినపుడు, ప్రాణవాయువు సంపృక్తత ( Oxygen saturation ) 92 శాతము కంటె తగ్గుతే ప్రాణవాయువు అందించాలి.
    శ్వాసవైఫల్యము ( Respiratory failure) కలుగుతే కృత్రిమ శ్వాస ( Mechanical ventilation) అందించుట అవసరము.
    ఉబ్బస ఉన్నవారికి నాసికాకుహర వ్యాధులు ( Rhinosinusitis, nasal polyps ) ఉంటే వాటిని నివారించాలి.
    జఠర అన్ననాళ తిరోగమన ( Gastro esophageal reflux disease ) వ్యాధి ఉంటే హిష్టమిన్ 2 గ్రాహక అవరోధకములు ( H-2 Receptor blockers) గాని, ప్రోటాన్ యంత్రనిరోధములను ( Proton pump inhibitors) గాని వాడి జఠరామ్లమును తగ్గించాలి.
    స్థూలకాయము ఉన్న వారు బరువు తగ్గించుకోవాలి.
    నిద్రావరోధక శ్వాసభంగము ( Obstructive sleep apnea ) ఉన్నవారికి తగిన చికిత్స అవసరము.

వైద్యవిషయములు నా శక్తిమేఱకు తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )


విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...