7, జులై 2019, ఆదివారం

ధూమపానము

                                                   
                                              ఇంటికి సెగనుం బెట్టరు,
                                              కంటికిఁ బొగ పెట్టిరేని కారును జలముల్ ;
                                              పెంటా ? యూపిరితిత్తులు  ?
                                              మంటలఁ దెగఁ బాలుసేయ మానక పొగలన్ ! 

                                                    
                                              
  ( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో  ):

                               పొగాకు ; ధూమపానము


                                                           డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .


పొగాకు వ్యసనము 



    పొగాకు అమెరికా ఖండములో చాలా శతాబ్దాల క్రితమే  పుట్టినా పదిహైనవ శతాబ్దములో స్పైనుకు చేరి  క్రమంగా యూరప్, ఆసియా, ప్రపంచ మంతా వ్యాపించింది. చుట్టలు, సిగరెట్లు, బీడీలు, పైపులూ ద్వారా ధూమరూపములోను, నస్యరూపములోను పీల్చబడి, గూట్కా రూపములోను, నములుడు పొగాకుగాను మ్రింగబడి  వినియోగించబడుతుంది.
    
    పొగాకు వినియోగము ఆరంభములో నాగరికత చిహ్నముగా పరిగణించబడినా పందొమ్మిదవ శతాబ్దములో దానివలన కలిగే దుష్ఫలితాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ దుష్ఫలితాల తీవ్రత కారణంగా పొగాకు వినియోగమును ఒక వ్యాధిగా పరిగణించవలసిన పరిస్థితి ఏర్పడింది.

    ధూమపానమువలన కలిగే దుష్ఫలితాలను నేను వైద్యవిద్యార్థిగా నేర్చుకొన్నా, వైద్యమును అభ్యసిస్తున్న కొద్ది సంవత్సరములలోనే ప్రత్యక్షముగా చూడడము వలన పొగాకు కలిగించే ప్రమాదాలు ప్రస్ఫుటముగా తెలిసాయి. పొగత్రాగేవారు సగటున పది సంవత్సరాల ఆయువును కోల్పోతున్నట్లు గమనించాను.  అదే విషయము వైజ్ఞానిక పత్రికలలో ప్రచురించబడుట చూసాను. ధూమపానము ఊపిరితిత్తుల పుట్టకురుపులకు ( Cancers ) కారణమని తెలిసినా, అంతకంటే ఎక్కువగా ధూమపానము చేసేవారు  నడివయస్సులోనే గుండెపోటులకు ( Heart attacks ), మస్తిష్క విఘాతములకు ( Cerebrovascular accidents ) గురికావడము, మరణించడము కూడా గమనించాను. శ్వాసకోశవ్యాధులు ( Pulmonary diseases) కూడా విపరీతముగా పొగత్రాగేవారిలోనే చూస్తాము. దీర్ఘకాల శ్వాసఅవరోధక వ్యాధులు (  Chronic obstructive pulmonary diseases ) ఊపిరితిత్తుల వ్యాకోచవ్యాధులు ( Emphysema ) కలిగి పొగత్రాగేవారు దగ్గు, ఆయాసాలతో బాధపడి చాలా జీవితకాలము కోల్పోవుట వైద్యులము నిత్యం చూస్తాము. పొగత్రాగేవారిలో కనీసము ఏభై శాతమునకు తగ్గకుండా  అనారోగ్య దుష్ఫలితాలకు గుఱి అవుతారు. ధమనీ కాఠిన్యము ( Atherosclerosis) కలిగి రక్త ప్రసరణ లోపాలతో వివిధ అవయవాలు దెబ్బతినడమువలన, పెక్కు కర్కటవ్రణములు ( cancers )  కలిగించే రసాయనములు ( Carcinogens) వలన ఊపిరితిత్తులు, మరియు యితర అవయవాలలో కర్కట వ్రణములు ( Cancers ) పుట్టడము వలన  ఆయుః క్షీణము, నడివయస్సు  మరణాలు సంభవిస్తాయి. అందువలన, నా రోగులకే కాక, మిత్రులకు, బంధువులకు, పొగ త్రాగుట వలదని సలహా ఇస్తాను. పాఠకులలోను, మిత్రులలోను పొగ త్రాగేవారుంటే ఒక నిర్ణీత ప్రణాళిక ప్రకారము త్వరగా ఆ అలవాటును మాన్చుకోవలసిందిగా వినతి చేస్తున్నాను. ఆ అలవాటును దరి చేరనీయరాదని పిల్లలకు, పాపలకు చెప్పుకోవాలి. పొగాకు వినియోగము, ధూమపానాల వలన కలిగే వ్యాధులను ఇక్కడ ఒక జాబితాగా పొందుపరుస్తాను.

కర్కటవ్రణములు  ( Cancers ) 


    పుట్టకురుపులుగా ప్రచారములో ఉన్న యీ క్రొత్త పెరుగుదలలు జన్యువులలో మార్పులు ( Mutations ) కలిగి కణములు శిథిలము చెందక త్వరితముగా పెరిగి విభజనలు పొందుట వలన పుడతాయి. ఈ పెరుగుదలలు అవయవముల లోనికి మూలములతో ఎండ్రకాయల కాళ్ళ వలె చొచ్చుకుపోవడము వలన వాటికి కర్కటవ్రణములు అని (cancers ) పేరు కలిగింది. ఈ వ్రణముల కణములు ఆ యా అవయవ కణజాలములుగా పరిణతి చెందకుండా విభజనలతో పెరుగుదలలుగా వృద్ధి పొందుతాయి. కొన్ని కణములు రక్తనాళములలోనికి, రసనాళికలలోనికి ( lymphatic channels ) ప్రవేశించి  రక్తప్రసరణ ద్వారా వివిధ అవయవములకు, రసనాళికల ద్వారా రసగ్రంథులకు ( lymph nodes ) వ్యాప్తిచెంది అచ్చట కొత్త వ్రణములను ( metastasis ; అవయవాంతర వ్యాప్తి ) సృష్టిస్తాయి. ఇవి పోషకపదార్థాలను సంగ్రహిస్తాయి. ఈ వ్రణములు అవయవాల దైనందిక వ్యాపారములకు అంతరాయము కలిగిస్తాయి. పోషకపదార్థాలు అవయవాలకు తగినంతగా చేరకపోవుటవలన, ఆకలి తగ్గుటవలన, అరుచి కలుగుటవలన రోగులు చిక్కిపోతుంటారు. తగిన చికిత్స జరుగకపోయినా, చికిత్సకు అనుకూలించకపోయినా ఇవి మరణమునకు దారితీయవచ్చును.

    పొగాకు పొగలో ఉండే బెంజోపైరీన్ ( Benzopyrene ) వంటి పోలిసైక్లిక్ ఏరొమేటిక్ హైడ్రోకార్బనులు కణములలో డీ ఎన్ ఏ  కు ( D .N.A ) అంటుకొని మార్పులు ( mutations ) ద్వారా వాటిని కర్కటవ్రణ కణములుగా మారుస్తాయి. పొగాకు పొగలో పెక్కు కర్కటవ్రణజనకములు ( Carcinogens ) ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

    పొగత్రాగనివారి కంటె పొగత్రాగేవారిలో ఊపిరితిత్తుల పుట్టకురుపులు యిరవైరెట్లు అధికముగా కలుగుతాయి. పొగత్రాగేవారిలో ఊపిరితిత్తులలోనే కాక, మూత్రాంగములలోను ( Kidneys ), స్వరపేటికలలోను ( Larynx), మూత్రాశయములలోను ( Urinary bladder), అన్నవాహికలలోను ( Esophagus), జీర్ణాశయములలోను ( Gastric cancers ), క్లోమములలోను ( Pancreas) పుట్టకురుపులు కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇతర అవయవాలలో కర్కటవ్రణములు పుట్టుటకు కూడా ధూమపానము సహకరిస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఊపిరితిత్తులలో వచ్చే కాన్సరులు ప్రస్ఫుటమయ్యేసరికి తొంబయి శాతముమందిలో శస్త్రచికిత్స స్థాయిని దాటిపోతాయి. అందుచే చికిత్స  ఫలప్రదమయ్యే అవకాశము చాలామందిలో తక్కువ. పొగత్రాగకుండా వాటిని నిరోధించుట చాలా మేలు.

శ్వాసకోశవ్యాధులు ( Pulmonary diseases) 


    శ్వాసనాళ శాఖలలోను, వాటి చివరల ఉండే పుపుస గోళములలోను ( Alveoli) సాగుదల ఉంటుంది. ఆ సాగుదల ( Elasticity) వలన ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు బాగా జరిగి గాలి కదలికలు సరిగ్గా జరుగుతాయి. పొగత్రాగేవారిలో సాగు కణజాలము ( Elastic tissue) చెడి ఆ సాగుదల దెబ్బతింటుంది. అందువలన గాలి కదలికలకు అవరోధము కలుగుతుంది. సాగుదల త్రగ్గుటవలన ఊపిరితిత్తులు వ్యాకోచము ( ఊపిరితిత్తుల ఉబ్బు ; emphysema ) చెందుతాయి . శ్వాసనాళికల పూతకణములకు ఉండే కదలాడే సూక్ష్మకేశములు ( cilia ) కూడా పొగత్రాగేవారిలో పనిచెయ్యవు. అందుచే  శ్లేష్మస్రావకములు ( mucous secretions) తొలగించబడవు. వీరిలో తఱచు సూక్ష్మజీవులవలన వ్యాధులు కలుగుతాయి. వీరికి శ్వాస సరిగా ఆడక ఆయాసము, దగ్గు వస్తుంటాయి. వాయువుల మార్పిడి తగ్గుటవలన రక్తములో బొగ్గుపులుసు వాయువు ( Carbon dioxide) పరిమాణము పెరుగుట, ప్రాణవాయువు ( Oxygen) పరిమాణము తగ్గుట కూడా కలుగవచ్చును. శ్వాస అవరోధవ్యాధిని ( Obstructive pulmonary disease) చాలామంది ధూమపానీయులలో  వైద్యులు నిత్యము చూస్తారు .

క్షయ వ్యాధి 


ధూమపానము సలిపేవారికి క్షయవ్యాధి సోకే అవకాశములు కూడా పెరుగుతాయి. పొగత్రాగే వారికి క్షయవ్యాధి సోకితే వారిలో  ఔషధములుకు వ్యాధి ప్రతిఘటన ఎక్కువయి చికిత్స క్లిష్టతరము అవుతుంది. 


హృద్రోగములు, రక్తనాళపు వ్యాధులు                     

    రక్తనాళములలో ధమనుల గోడలమధ్య  వయస్సు పెరుగుతున్నకొలది కొలెష్ట్రాలు ( Cholesterol ), ఇతర కొవ్వులు చేరి మార్పులు జరిగి ధమనీకాఠిన్యత ( Atherosclerosis) కలుగుతుంది. పొగత్రాగేవారిలో  అల్పసాంద్రపు కొలెష్ట్రాలు ( LDL ) పెరుగుటయే కాక, ఆ కొలెష్ట్రాలు నాళములలో చేరి ధమనీ కాఠిన్యతను వేగపరుస్తుంది. ధమనులు కాఠిన్యత పొందినప్పుడు నాళపరిమాణము తగ్గి రక్తప్రవాహమునకు అవరోధము కలుగవచ్చు. రక్తము గడ్డకట్టుటకు తోడ్పడే తాంతవజని ( Fibrinogen ), రక్తఫలకములు ( Platelets ) కూడా పొగత్రాగేవారిలో విరివిగా ఉత్పత్తి చెందుతాయి.

    హృదయ ధమనులలో( Coronary arteries ) కాఠిన్యత పెరిగి రక్తము గడ్డకడితే హృదయకండరములకు రక్తప్రసరణ లోపించి గుండెపోటులు రావచ్చును. అదే విధముగా మెదడు రక్తప్రసరణకు అవరోధము కలుగుతే మస్తిష్క ( రక్తనాళ ) విఘాతములు ( Cerebrovascular accidents ) కలిగి పక్షవాతములు సంభవిస్తాయి.


    దూరధమనులలో రక్తప్రసరణ లోపాలు ( Peripheral arterial  diseases ) కలుగవచ్చును. రక్తప్రసరణ లోపాల వలన కాళ్ళు కోల్పోయినవారు తఱచు ధూమపానీయులే ! పొగత్రాగేవారిలో వారు పీల్చే కార్బను మోనాక్సైడు ( Carbon monoxide) ఎఱ్ఱకణాల హీమోగ్లోబిన్ తో ( Hemoglobin )  జతకూడుట వలన అవి పంపిణీ చేసే ప్రాణవాయువు ( Oxygen ) తగ్గుతుంది.

    ధమనీ కాఠిన్యత వలన పురుషులలో నపుంసకత్వము ( impotency ) కూడా కలుగుతుంది. మూత్రాంగముల వ్యాపారము కూడా పొగత్రాగేవారిలో క్షీణిస్తుంది. వివిధ అవయవాల వ్యాపారము దెబ్బతినుట వలన అంతర్గతముగాను, బాహ్యముగాను పొగత్రాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు  త్వరితగతిలో ప్రస్ఫుటము అవుతాయి. పిన్నవయస్సులోనే చర్మములో ముడుతలు పొడచూపుతాయి .

    ఈ వ్యాసములో పేర్కొన్న విషయాలను వైద్యవృత్తిలో ఉండుట వలన ప్రత్యక్షముగా ప్రతిదినము చూస్తాను. ధూమపానము వీడుట వలన చాలా రోగములు నివారించగలుగుతాము. ఎనభై, తొంబై సంవత్సరాలకు వచ్చే రోగములు, మరణములు నలభై, ఏభై సంవత్సరాలలో కలుగకుండా నివారించుట ఎంతో మేలు కదా !

    అందువలన  పొగత్రాగేవారు మొండివాదనలు, సాకులు, నెపాలు  మాని త్వరగా పొగత్రాగుట మానివేయుట ఉత్తమము. వైద్యులు, మందులు సహకరించినా, నా అనుభవములో ఆయా వ్యక్తుల పట్టుదల, లక్ష్యములే పొగత్రాగడము మానివేయుటకు తోడ్పడుతాయి. పిల్లలకు చిన్నతనము నుంచే పొగత్రాగరాదని  నూరిపొయ్యవలసిన అవసరము చాలా ఉంది.

పదజాలము :

Alveoli = పుపుస గోళములు ( గ.న )
Atherosclerosis = ధమనీ కాఠిన్యము 
Cancers = పుట్టకురుపులు ; కర్కటవ్రణములు ( గ.న )
Carcinogens = కర్కటవ్రణ జనకములు ( గ.న )
Cerebrovascular accidents = మస్తిష్క ( రక్తనాళ ) విఘాతములు ( గ.న )
Chronic obstructive pulmonary disease = దీర్ఘకాలిక శ్వాస అవరోధక వ్యాధి ( గ.న )
Cilia = కదలాడే సూక్ష్మకేశములు  ( గ.న )
Elastic tissue = సాగు కణజాలము ( గ.న )
Emphysema = ఊపిరితిత్తుల వ్యాకోచవ్యాధి ; ఊపిరితిత్తుల ఉబ్బు ( గ.న )
Fibrinogen = తాంతవజని 
Genetic mutation  = జన్యువుల మార్పు ; జన్యుపరివర్తనము ( గ.న )
Heart attack = గుండెపోటు
Lymphatic channels = రసనాళికలు 
Lymph nodes = రసగ్రంథులు
Metastasis = అవయవాంతర వ్యాప్తి ( గ.న )
Peripheral arterial  disease = దూరధమనుల వ్యాధి ( గ.న )
Platelets = రక్తఫలకములు ( గ.న )
Pulmonary diseases = శ్వాసకోశ వ్యాధులు 

( ఈ వ్యాసమును స్వేచ్ఛగా పంచుకొని  ప్రతులు తీసుకొని మీ, మీ బంధుమిత్రులు ధూమపానము , పొగాకు వాడుకలు మానుటకు సహకరించ ప్రార్థన )

18, జూన్ 2019, మంగళవారం

ఉష్ణసంబంధ రుగ్మతలు ( Heat related illnesses )

( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో )

                      ఉష్ణ సంబంధ రుగ్మతలు

                       ( Heat related illnesses 


                                                                                        డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .


    శరీరములో ఉష్ణ నియంత్రణ కేంద్రము మెదడులో హైపోథలమస్ లో ( Hypothalamus )  ఉంటుంది. ఉష్ణము శరీరములో అధికముగా జనించినపుడు, వాతావరణ ఉష్ణము ఎక్కువగా ఉన్నపుడు, శరీరము అధిక ఉష్ణమును బయటకు ప్రసరించుటలో లోపము ఉన్నచో ఉష్ణ సంబంధ రుగ్మతలు కలుగుతాయి.

    అధిక ఉష్ణోగ్రతలలో పనిచేసేవారిలోను, వ్యాయామము, క్రీడలలో పాల్గొనేవారిలోను, సైనికులలోను, దళసరి వస్త్రధారణ చేసేవారిలోను, గృహవసతి లేనివారిలోను, ఇతర అనారోగ్యములు కలవారిలోను, మద్యము, యితర మాదక ద్రవ్యములు వాడే వారిలోను, మానసిక ఔషధములు, యితర ఔషధములు వాడే వారిలోను అధిక ఉష్ణము వ్యాధులు కలిగించే అవకాశములు ఎక్కువ.

    ఉష్ణము శరీరమునుంచి దేహానికి అంటిఉన్న దుస్తులు మొదలగు చల్లని వస్తువులకు వహనము ( conduction ) వలన, దేహముపై ప్రసరించు గాలికి సంవహనము( convection ) వలన, విద్యుత్ అయస్కాంత తరంగముల ( electromagnetic waves ) వికిరణము ( radiation ) వలన, చెమట ఆవిరి చెందుట వలన బయటకు ప్రసరింపబడుతుంది. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినపుడు, కండరముల శ్రమ పెరిగినపుడు, శరీర వ్యాపార క్రియ ( metabolism ) పెరిగినపుడు స్వేదము ఎక్కువగా స్రవించి ఉష్ణము బయటకు ప్రసరించుటకు, దోహదపడుతుంది. హృదయ వేగము, సంకోచము ( contractility ) పెరిగి, హృదయము నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తప్రమాణము ( cardiac output ) పెరిగి, చర్మమునకు రక్తప్రసరణ పెరిగి ఉష్ణప్రసరణను పెంచుతాయి. జీర్ణమండలము, ఇతర ఉదరాంతర అవయవములలో ( viscera )  రక్తనాళములు ఎక్కువగా సంకోచించుట వలన చర్మమునకు రక్తప్రసరణ పెరుగుతుంది. చెమట ఉత్పత్తి ఎక్కువయినపుడు దేహములో ప్రసరణ రక్తప్రమాణము ( circulating blood volume ) తగ్గుతుంది. శరీరములో జల లవణముల ప్రమాణము తగ్గి శోషణ ( dehydration ) కలుగుతుంది. దేహములో జనించు ఉష్ణము ఉష్ణ నష్టము కంటె అధికమయినపుడు శరీరాంతర ఉష్ణోగ్రత ( core body temperature ) క్రమముగా పెరుగుట మొదలవుతుంది. 


                                అధిక ఉష్ణముచే కలుగు స్వల్ప అస్వస్థతలు  



వడ పొంగు ( Heat edema ) 


    శరీర ఉష్ణము పెరుగుట వలన కాళ్ళలో రక్తనాళములు వ్యాకోచము చెంది, రక్త సాంద్రత పెరిగి  కాళ్ళలోను పాదముల లోను పొంగులు కనిపించవచ్చును. చల్లని ప్రదేశములలో కాళ్ళను ఎత్తుగా పెట్టి పడుకుంటే యీ పొంగులు తగ్గిపోతాయి. మూత్రకారకములను ( diuretics ) యీ పొంగులకు వాడకూడదు. 

కండరముల పీకులు , నొప్పులు ( Muscle cramps ) 


    పరిసరముల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు క్రీడలు, వ్యాయామము, శ్రమ జీవనముల వలన కండరములలో పీకులు, నొప్పులు కలుగవచ్చును. ఉదర కుడ్యపు కండరములు ( abdominal wall muscles ), ఊరు కండరములు ( quadriceps muscles of thighs ), కాలిపిక్కల కండరములలో ( gastrocnemius muscles ) యీ నొప్పులు సాధారణముగా కలుగుతాయి. జల, లవణ నష్టములే కాక నాడీ కండర ప్రేరేపణలు ( neuromuscular stimuli ) యీ నొప్పులకు కారణము కావచ్చును. చల్లని ప్రదేశములలో విశ్రాంతి, లవణసహిత ద్రవపానములు, మర్దనములతో యీ పీకులను నివారించగలము.

చెమట పొక్కులు ; చెమట కాయలు (Heat rash ) 


    ఎండలు, వేడి ఎక్కువయినపుడు చెమట ఎక్కువగా పడుతుంది. స్వేద రంధ్రములు పూడుకొనిపోతే చెమట స్వేద నాళములలో యిరుక్కొని ఎఱ్ఱని చెమట కాయలు, పొక్కులు, చీముకాయలు ( Pustules ) ఏర్పడుతాయి. ఇవి సాధారణముగా వస్త్రములతో కప్పబడు శరీర భాగములలో కనిపిస్తాయి. చల్లని ప్రదేశములకు చేరి అధిక వస్త్రధారణ మానుట వలన, చర్మపు తేమ తగ్గించుకొనుట వలన చెమట కాయలు తగ్గుతాయి.

వడ సొమ్మ ; ఉష్ణ మూర్ఛ ( Heat Syncope ) 


    ఎక్కువసేపు వ్యాయామము చేసినప్పుడు సొమ్మసిల్లుట సంభవించవచ్చును. వ్యాయామములో దేహములో పుట్టే వేడిమికి శరీరపు క్రింద భాగములలో రక్తనాళములు వ్యాకోచించుట ( Peripheral vasodilation ) వలనను, ఎక్కువ చెమటచే కలుగు జల లవణముల నష్టము వలనను, దేహ రక్తప్రమాణము తగ్గుట ( hypovolemia ) వలనను, రక్తనాళములలో బిగుతు తగ్గుట ( decreased vasomotor tone ) వలనను స్థితి ప్రేరిత అల్ప రక్తపీడనము ( postural hypotension ) కలిగి మెదడునకు రక్తప్రసరణ తగ్గి యీ మూర్ఛ కలుగుతుంది. వెల్లకిల పడుకో బెట్టి కాళ్ళు ఎత్తిపెట్టి ఉంచగానే రక్తపీడనము తేరుకొని వారికి స్మారకము కలుగుతుంది. ఈ స్థితి నుంచి 15, 20 నిమిషములలో పూర్తిగా తేరుకుంటారు. వీరిచే ఉప్పుతో కూడిన ద్రవపదార్థములను సేవింపజేసి చల్లని ప్రదేశములలో విశ్రాంతి చేకూర్చాలి. హృదయ సంబంధ వ్యాధులు వలన కూడ అపస్మారము కలుగవచ్చును. హృద్రోగ లక్షణములు, ఆ అవకాశములు కలవారిలోను, వయస్సు మీఱినవారిలోను హృద్రోగములకై శోధించాలి . 


                               అధిక ఉష్ణముచే కలుగు తీవ్రరుగ్మతలు


వడ బడలిక ( Heat exhaustion ) 


    తీవ్ర వ్యాయామము, శారీరక శ్రమ, క్రీడల వలన అధికమైన జీవవ్యాపార క్రియకు ( metabolism )  పరిసరముల అధిక ఉష్ణోగ్రత తోడయినపుడు వడ బడలిక ( heat exhaustion ) కలిగే అవకాశము ఉన్నది. ఎక్కువ వేడికి చెమట ఎక్కువయి జల, లవణ నష్టము కలుగుతుంది. వడబడలిక కలిగిన వారికి అలసత్వము, ఒళ్ళు తూలడము, ఒంట్లో నలత, తలనొప్పి, వమన భావన ( nausea ), వాంతులు కలుగవచ్చు. చెమట బాగా పట్టి చర్మము చల్లబడుతుంది. శరీరాంతర ఉష్ణోగ్రత ( core body temperature ) 101 - 104 ఫాహ్రెన్ హైట్ ( 38.3 - 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ) వఱకు చేరవచ్చును. వీరు నిలుచున్నప్పుడు రక్తపీడనము బాగా పడిపోవచ్చును ( postural hypotension ). వీరి మానసికస్థితి మాత్రము మాఱదు. మతిభ్రంశము కలిగితే, శరీర ఉష్ణోగ్రత ఎంత ఉన్నా సరే దానిని వడదెబ్బగానే ( ఉష్ణఘాతము : Heat stroke ) పరిగణించాలి.

    వడబడలిక అయినా, వడదెబ్బ అయినా సంశయము కలిగినపుడు శరీరాంతర ఉష్ణోగ్రతను త్వరగా తగ్గించు ప్రయత్నములు చేయాలి. రోగులను చల్లని ప్రదేశములకు చేర్చాలి. అధిక వస్త్రములను తొలగించాలి. చల్లని నీటి తుంపరలతోను, పంకాలతోను శారీరక ఉష్ణోగ్రతను 101 ఫాహ్రెన్ హైట్ డిగ్రీలకు తగ్గించు ప్రయత్నము చేయాలి. నోటి ద్వారా గాని, సిరల ద్వారా గాని లవణసహిత ద్రవపదార్థములను ఇచ్చి శోషణ ( dehydration ) తగ్గించాలి. వెల్లకిల పడుకోబెట్టి కాళ్ళను ఎత్తుగా ఉంచాలి .

    వీరికి సంపూర్ణ రక్తకణ పరీక్షలు, జీవవ్యాపార రక్తపరీక్షలు ( విద్యుద్వాహక లవణములు సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేటులు ; గ్లూకోజ్,యూరియా నైట్రొజెన్, క్రియటినిన్, కాలేయ వ్యాపార పరీక్షలు, రక్తములో మయోగ్లోబిన్ ( myoglobin ), మూత్ర పరీక్షలు, రక్త ఘనీభవన పరీక్షలు ( blood coagulation tests ) చేయాలి.

    అధిక ఉష్ణోగ్రతల వద్ద జీవోత్ప్రేరకములు ( enzymes ), యితర మాంసకృత్తులు వికృతి పొందే ( denature ) అవకాశము, కణజాలము విధ్వంసము పొందే అవకాశము ఉన్నాయి. అస్థికండర కణవిధ్వంసము ( rhabdomyolysis ) జరిగి కండరముల నుంచి మయోగ్లోబిన్ అనే వర్ణకము ( pigment) విడుదల కావచ్చును. 

    విద్యుద్వాహక లవణములలో తేడాలు ( electrolyte imbalance ), అస్థికండర కణవిధ్వంసము ( rhabdomyolysis ). కాలేయకణ విధ్వంసము ( hepatocellular injury ), మూత్రాంగ వైఫల్యము ( renal failure ) వంటి ఉపద్రవములు కలిగే అవకాశములు ఉన్నాయి. అట్టి పరిణామములను గమనించి వాటికి తగిన చికిత్స చేయాలి. 

వడదెబ్బ ( ఉష్ణఘాతము Heat stroke ) 


    వడదెబ్బ ( ఉష్ణఘాతము ) తగిలిన వారికి శరీరాంతర ఉష్ణోగ్రత ( core body temperature ) 105 డిగ్రీల ఫాహ్రెన్ హైట్ ( 40.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ) గాని, అంతకు మించి గాని ఉండి కేంద్ర నాడీమండల వ్యాపారములో విలక్షణములు కనిపిస్తాయి. వీరిలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ లోపిస్తుంది.

    వడదెబ్బను అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. సత్వరముగా చికిత్స చేసినట్లయితే ప్రాణాపాయమును నివారించవచ్చును. చికిత్స ఆలస్యము అయినకొలది రోగులు మృత్యువాత పడే అవకాశములు హెచ్చవుతుంటాయి.

    వడదెబ్బ శారీరకశ్రమ సహితము ( exertional ) గాని, శారీరక శ్రమరహితము ( nonexertional ) గాని కావచ్చును. 

    శరీర ఉష్ణోగ్రత తీవ్రతరము అయినపుడు శరీరములో మాంసకృత్తులు వికృతము ( denature ) చెందగలవు. అందువలన శరీర వ్యాపారక్రియలు ( metabolic activities ) మందగించుటే గాక, అంతర జీవవిషములు ( endotoxins ) కూడా విడుదల అవుతాయి. శరీరములో తాప ప్రతిస్పందన ( inflammatory response ) కూడా ప్రారంభము అవుతుంది. వివిధ అవయవములలో విలక్షణములు కలిగి అవయవ వ్యాపారములు వైఫల్యము చెంది మరణమునకు దారి తీస్తాయి.

వడదెబ్బ ( ఉష్ణఘాత ) లక్షణములు 


    వడదెబ్బకు గుఱైనవారిలో శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫాహ్రెన్ హైట్ గాని అంతకు మించి గాని ఉంటుంది. మానసిక ఆందోళన, అలజడి, గందరగోళము, కలవరము, మూర్ఛలు, స్మృతిభ్రంశము, అపస్మారకము వంటి మానసిక అవలక్షణములు కలుగుతాయి. వీరు నేలపై కూలిపోయి కనిపిస్తారు. చర్మము వేడిగా ఉంటుంది. చెమటలు బాగా పోయవచ్చును. చెమటలు లేనప్పుడు చర్మము పొడిగా ఉండవచ్చును. వీరిలో గుండె వేగము హెచ్చుగా ఉంటుంది. శ్వాస వేగము హెచ్చయి ఆయాసము పొడచూపవచ్చును. రక్తపీడనము తగ్గుతుంది. వడదెబ్బ ప్రభావము మెదడు, కాలేయములపై అధికముగా ఉంటుంది. చిన్నమెదడు ( cerebellum ) పై కూడా అధిక ప్రభావము ఉంటుంది. శరీర అస్థిరత ( ataxia ) తొలి లక్షణము కావచ్చును. 

    తీవ్ర జ్వరము ( hyperthermia ), అపస్మారకములను కలిగించే ఇతర వ్యాధులను దృష్టిలో పెట్టుకున్నా, పరిసరముల ఉష్ణోగ్రత, శారీరక ప్రయాస వంటి పరిస్థితుల బట్టి వడదెబ్బను ( heat stroke ) పసిగట్టి సత్వర వైద్యమును సమకూర్చాలి. వ్యాధిగ్రస్థుడు నేలకు కూలబడిన 30 నిమిషముల వ్యవధిలో చికిత్స మొదలు పెడితే మృత్యువును నూరు శాతము నివారించవచ్చును. శరీరాంతర ఉష్ణోగ్రత ఆసుపత్రులకు చేరేటప్పుడు 105.8 డిగీలు దాటి ఉన్నవారిలోను, హెచ్చుకాలము తీవ్రజ్వరము ఉన్నవారిలోను మృత్యువు అవకాశము 80 శాతము వఱకు ఉండవచ్చును. అందువలన రోగిని చల్లపఱచే ప్రక్రియలను వైద్యాలయములకు తరలించుటకు ముందే మొదలుపెట్టి మార్గములో కూడా కొనసాగించాలి.

    వడదెబ్బ తగిలిన వారిని వారి ఉష్ణోగ్రత తగ్గించుటకు ( తల తప్పించి మిగిలిన శరీరమును ) చల్లని నీటిలో ( 50 F ) గాని, మంచునీటిలో గాని ( 35.6 F - 41 F ) ముంచి ఉంచుట ఉత్తమ మార్గము.

    చల్లనీరు, మంచునీరు లభ్యము కానప్పుడు గోరువెచ్చని నీటిని ( 68 F) వాడవచ్చును. వారి శరీరాంతర ఉష్ణోగ్రతను ( core body temperature ) ఉష్ణమాపకము పురీషనాళములో ఉంచి కొలవాలి. శరీరాంతర ఉష్ణోగ్రత 101 F డిగ్రీలకు దిగేవఱకు చల్లపఱచే యత్నములను కొనసాగించాలి. 

    తడిగుడ్డలతో కప్పుట, పెద్ద ధమనులు ఉండే చోట్ల ( చంకలు, మెడ, మొలలు వద్ద ) మంచు పొట్లములు ఉంచుట, పంకాగాలులు, చల్లనీరు జల్లుల వంటి ప్రక్రియలను ఉయోగించినా వడదెబ్బ చికిత్సకు అవి అంత ఫలవంతములు కాదు.

    శరీరమును చల్లార్చే ప్రయత్నములు కొనసాగిస్తూ వ్యాధిగ్రస్థులను అత్యవసర వైద్యాలయములకు తరలించాలి. వైద్యాలయములలో శరీరాంతర ఉష్ణోగ్రతను 101 F డిగ్రీలకు తగ్గించే ప్రక్రియలు కొనసాగిస్తూ సిరల ద్వారా చల్లని లవణ జలములు ( cold saline ) ఇవ్వాలి. 

    జ్వరము తగ్గించు మందులు ( antipyretics ), డాంట్రొలీన్ ( Dantrolene ) వడదెబ్బకు పనిచేయవు.

    వడదెబ్బ ప్రాధమిక చికిత్స కొనసాగిస్తూ, వారికి రక్తకణ పరీక్షలు, జీవవ్యాపార పరీక్షలు [ complete metabolic panel ; విద్యుద్వాహక లవణములు ( electrolytes ), మూత్రాంగ వ్యాపార పరీక్షలు ( యూరియా నైట్రొజెన్ BUN, క్రియటినిన్ ( creatinine ), కాలేయ వ్యాపార పరీక్షలు ( liver function tests ), క్రియటినిన్ కైనేజ్ ( creatinine kinase )], మయోగ్లోబిన్ ( myoglobin ) ప్రమాణములు, రక్తఘనీభవన పరీక్షలు ( blood coagulation tests ), మూత్ర పరీక్షలు చెయ్యాలి. 

    వడదెబ్బకు లోనయిన వారిలో మూత్రాంగముల వైఫల్యము, శ్వాస వైఫల్యము, కాలేయపు అవలక్షణములు, అస్థికండర కణ విధ్వంసము ( rhabdomyolysis ), విద్యుద్వాహక లవణ భేదములు ( electrolyte imbalances ), విస్తృత రక్తనాళాంతర రక్తఘనీభవనము ( disseminated intravascular coagulation ) వంటి అవలక్షణములు కలిగే అవకాశము ఉన్నది. ఆయా అవలక్షణములు కనిపెట్టి తగిన చికిత్సలు చెయ్యాలి.

    వడదెబ్బ నుంచి కోలుకున్నవారు కనీసము వారము దినములు ఎట్టి శ్రమ, వ్యాయామములలో పాల్గొనకూడదు. పూర్తిగా కొలుకున్నాక చల్లని వాతావరణములో వ్యాయామము, క్రీడలు, శారీరక శ్రమలలో పరిమితముగ పాల్గొనుట మొదలిడి క్రమముగా కార్యకలాపములను పెంచవచ్చును.

ఉష్ణసంబంధ వ్యాధుల నివారణ 


    వేడి వాతావరణములో శ్రమించువారు, వసించువారు తఱచు ద్రవ పదార్థములను సేవించాలి. మంచినీళ్ళు, చక్కెరపానీయాలు రెండు మూడు లీటరుల వఱకు సేవించినా, లవణ సహిత పానీయములను కూడా సేవించుట మేలు. పలుచని, వదులు, లేతవర్ణపు దుస్తులు ధరించాలి.

    వేడి వాతావరణమునకు క్రమేణ అలవాటుపడాలి. పరిసర ఉష్ణోగ్రత అధికముగా ఉన్నపుడు పరిశ్రమ చేయకూడదు. తప్పనిసరి అయితే విరామ సమయములు తీసుకొని, చల్లని పానీయములు సేవిస్తూ ఉండాలి. లవణ నష్టములను కూడా పూరించాలి. మంచినీరు, చక్కెర పానీయాలు మాత్రమే అధికముగా ( మూడులీటరులకు మించి ) సేవించి, లవణనష్టములను పూరించకపోతే రక్తములో సోడియమ్ ప్రమాణములు తగ్గవచ్చును ( hyponatremia ). అధిక వాతావరణ ఉష్ణోగ్రతలు కలచోట్ల పనిచేసే వైద్య బృందములకు ఉష్ణ సంబంధ వ్యాధులను కనిపెట్టుటలోను, నిరూపిత చికిత్సా పద్ధతులలోను ( evidence based medical standards ) తగు శిక్షణ ఇయ్యాలి.

    వేసవి తీవ్రత హెచ్చుగా ఉన్నపుడు, వడగాడ్పులు వీచుతున్నపుడు వృద్ధులకు, గృహ విహీనులకు ప్రభుత్వములు సమాజములు శీతల వసతి గృహములను తాత్కాలికముగానైనా ఏర్పాటు చెయ్యాలి.


పదజాలము :
Ataxia = శరీర అస్థిరత ( గ.న )
Cardiac output = హృదయ ప్రసరణ ( రక్త ) ప్రమాణము
Circulating blood volume = దేహప్రసరణ రక్తప్రమాణము (గ.న )
Conduction = వహనము 
Contractility = సంకోచము 
Convection = సంవహనము
Core body temperature = శరీరాంతర ఉష్ణోగ్రత ( గ.న )
Dehydration = శోషణము
Diuretics = మూత్రకారకములు
Disseminated intravascular coagulation = విస్తృత రక్తనాళాంతర రక్తఘనీభవనము ( గ.న )
Endotoxins = అంతర జీవవిషములు
Enzymes = జీవోత్ప్రేరకములు ( గ.న )
Heat edema = వడ పొంగు ( గ.న )
Heat exhaustion = వడబడలిక ( గ.న )
Heat rash = చెమట కాయలు ; చెమట పొక్కులు ( గ.న )
Hyperthermia = తీవ్రజ్వరము ( గ.న )
Heat stroke = ఉష్ణఘాతము ; వడదెబ్బ
Heat syncope =  వడసొమ్మ ( గ.న )
Hypovolemia = రక్తప్రమాణ హీనత (గ.న )
Inflammatory response = తాప ప్రతిస్పందన ( గ.న )
Metabolism = శరీరవ్యాపకము ; జీవవ్యాపారము ( గ.న )
Peripheral vasodilation = దూర రక్తనాళ వ్యాకోచము ( గ.న )
Postural hypotension = స్థితి ప్రేరిత అల్ప( రక్త )పీడనము ( గ.న )
Radiation = వికిరణము 
Rhabdomyolysis = అస్థికండరకణ విధ్వంసము ( గ.న )
Viscera = ఉదరాంతర అవయవములు ( గ.న )

( వైద్యవిషయాలను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము .
ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

2, జూన్ 2019, ఆదివారం

ఆరోగ్యము - వైద్యము




                             ఆరోగ్యము - వైద్యము 



డా. గన్నవరపు నరసింహమూర్తి 
                                                                                                  
   

     శరీరము స్వస్థత కలిగి  రోగములేవీ లేకుండా ఉండుటయే ఆరోగ్యము. ‘ అరోగస్య భావః ఆరోగ్యమ్ ‘ అని పద వ్యుత్పత్తి.

     రోగాలు పలు రకాలు. పుట్టుకతో శరీరనిర్మాణ లోపాల వలన వచ్చే రుగ్మతలు పుట్టువ్యాధులు ( Congenital diseases ).ఈ రుగ్మతలు అవయవ నిర్మాణ లోపాలు, అవయవ కార్యనిర్వహణ లోపాలు, జీవరసాయనాల ఉత్పత్తి లోపాలు, లేక జీవప్రక్రియ లోపాలు వలన కలుగుతాయి

    కొన్ని వ్యాధులు జన్యు సంబంధమైనవి ( Genetic disorders ). జన్యు సంబంధ వ్యాధులు కొన్ని పుట్టుకతోనే  కనిపించినా, కొన్ని పుట్టుకతో  పొడచూపక  ఆ తరువాత ఎప్పుడో కనిపించవచ్చును. 

    గాయములు, ప్రమాదాలు, క్షతములు, అనారోగ్యమును కలిగించవచ్చును.

    ఏకకణ సూక్ష్మాంగ జీవులు ( Bacteria ), శిలీంధ్రములు, బూజుల జాతికి చెందిన జీవులు ( Fungi ), విషజీవాంశములు (Viruses ) శరీరములో చొచ్చుకొని ఆక్రమిత  వ్యాధులను ( Infections ) కలిగించ వచ్చును.  పరాన్నభుక్తులు ( Parasites ) శరీరములో ప్రవేశించి స్థావరము  ఏర్పఱుచుకొని ( infestation ) వ్యాధులను కలిగించ వచ్చు.

    జీవవ్యాపార లోపాల వలన కొన్ని రుగ్మతలు కలుగుతాయి.మధుమేహవ్యాధి ( Diabetes ), గళగ్రంథి స్రావకము ( Thyroxine ) తక్కువ లేక ఎక్కువ అగుట ( Hypo or Hyperthyroidism   ) అడ్రినల్ హార్మోనులు ఎక్కువ, లేక తక్కువ అగుట, క్రొవ్వు పదార్ధాలు ఎక్కువ అవుట ఇట్టి వ్యాధులకు ఉదాహరణలు. 

    కొత్త పెరుగుదలలు ( Neoplasms ) రుగ్మతలు కలిగించ వచ్చును. ఈ పెరుగుదలలు నిరపాయకరమై ( benign ) నెమ్మదిగా పెరిగి ఎట్టి హాని కలిగించక ఉండవచ్చును. మరి ప్రమాదకరమైన కర్కట వ్రణములు,( Cancers ) అపాయకరము ( malignant ). పుట్టకుఱుపులు  ( Cancers ) త్వరగా పెరుగుతాయి. శరీరములో వివిధ అవయవాలలోను ఈ పెరుగుదలలు పొడచూపవచ్చును. ఒకచోట ప్రారంభమైన యీ వ్రణాలు ఆ అవయవములలోను, మిగిలిన అవయవాలకు వ్యాప్తి చెంది ప్రమాదభరితము అవుతాయి .

     శరీరములో అవయవాల శైథిల్యము వలన శిథిల వ్యాధులు ( Degenerative diseases ) వస్తాయి. వృద్ధాప్యములో అవయవాల  క్షీణత చూస్తుంటాము.

     పొగత్రాగుట, పొగాకు వినియోగము, మితము దాటి మద్యము త్రాగడము, మాదక ద్రవ్యాల వినియోగము, పోషకపదార్థాల లోపము, శరీర అవసరాలకు మించి తినుట, భౌతిక జడత్వము వంటి  జీవన రీతులు ( life styles  ) వ్యాధులకు దారితీయ వచ్చును.

    ఇవి కాక మానసిక వ్యాధులు కొందఱిని పీడిస్తాయి. క్రుంగుదల ( Depression  ) ద్విధ్రువ వ్యాధి ( Bipolar disorder ) మనోవైకల్యము ( schizophrenia  ) వంటి వ్యాధులు ఊహాత్మకము కాదు. తెచ్చిపెట్టుకున్నవి కాదు. అవి నిజమైన రుగ్మతలే. 

    రుగ్మతలను నిరోధించడము, వ్యాధినిర్ణయముచేయుట, వచ్చే వ్యాధులకు చికిత్స చేసి, నిర్మూలించడము, పూర్తిగా నయము కాని వానిని  అదుపులో పెట్టుట వైద్యుల లక్ష్యము. చికిత్సకు వ్యాధులు లొంగని పరిస్థితులలో ( ఉదా ; చికిత్సకు లొంగని కర్కటవ్రణములు ) ఉపశమనము కలిగించి రోగుల బాధ నివారించుటకు యత్నము చేస్తారు. 

    రోగి బాధలను, రోగ చరిత్రను విని, రోగిని పరీక్షించి, అవసరమైన రక్త పరీక్షలు ( Blood counts and Blood chemistry tests ), యితర పరీక్షలు, ఎక్సరేలు ( X-rays ), శ్రవణాతీత ధ్వని చిత్రీకరణములు ( Ultrasonography ), హృదయ విద్యుల్లేఖనములు ( electrocardiography )  యింకా అధునాతనమైన గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణములు ( Computerised axial tomography ), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు ( magnetic resonance imaging ), అంతర్దర్శనములు ( endoscopy and laparoscopy )  వంటి  పరీక్షలు చేస్తే అవి వ్యాధి నిర్ణయానికి తోడ్పడుతాయి. 

    అవసరము, వ్యయము దృష్టిలో పెట్టుకొని ఏ పరీక్షలు కావాలో వైద్యులు నిర్ణయించాలి. కొన్ని వ్యాధులకు నిపుణులను సంప్రదించాలి.

    వైద్యము ఒకే ఒక శాస్త్రము కాదు. వైద్యశాస్త్రము ఒక వినియుక్త శాస్త్రము. వైద్యవిద్యార్థులు దేహనిర్మాణ శాస్త్రమును ( Anatomy  ), శరీర వ్యాపార శాస్త్రము ( Physiology ), జీవరసాయన శాస్త్రము ( Biochemistry  ), వ్యాధివిజ్ఞాన శాస్త్రము ( Pathology ), సూక్ష్మజీవుల శాస్త్రము, ( Microbiology  ), పరాన్నజీవ శాస్త్రము ( Parasitology ), ఔషధ శాస్త్రములను ( Pharmacology  )  అభ్యసించి తరువాత వైద్య శాస్త్రము ( Medicine ), శస్త్రచికిత్స( Surgery ), కంటి వైద్యము( Opthalmology ) చెవి ముక్కు ,గొంతు వ్యాధులను ( Otorhinolaryngology ) స్త్రీ,ప్రసూతి శాస్త్రములను ( Gynaecology and Obstetrics  ) అభ్యసిస్తారు. మరి రసాయన శాస్త్రము ( Chemistry ) భౌతిక శాస్త్రములలో ( Physics )  ప్రాథమిక జ్ఞానము కూడా తప్పనిసరే. 

    భౌతిక, రసాయనక, ఔషధ శాస్త్రాలలో పరిశోధనలు జరిగి, క్రొత్త విషయాలు, కొత్త పరికరాలు, క్రొత్త మందులు లభ్యమైతే, అవి వైద్యానికి ఉపయుక్తమయితే  అవి వైద్యశాస్త్రములో యిమిడి పోతాయి. వైద్యశాస్త్రము కూడా నిత్యము పరిణామము చెందుతుంది.

    ప్రజాబాహుళ్యములో అక్షరాస్యత పెరిగి, శాస్త్రీయదృక్పథము అలవడితే రోగులకు, వైద్యులకు కూడా ఆ విజ్ఞానము ఉభయతారకము అవుతుంది. పాఠశాలలలో నేర్చుకొనే విజ్ఞానశాస్త్రముతో  బాటు వైద్యశాస్త్రములో  ప్రాథమిక విజ్ఞానము కూడా అందఱికీ అవసరము. 


పదజాలము :

Anatomy  = దేహనిర్మాణ శాస్త్రము
Bacteria  = సూక్ష్మాంగ జీవులు
Biochemistry = జీవరసాయన శాస్త్రము 
Cancers  = కర్కట వ్రణములు ; పుట్టకురుపులు
Congenital diseases = పుట్టువ్యాధులు
Computerized axial tomography = గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము
Degenerative diseases = శిథిలవ్యాధులు 
Diabetes = మధుమేహవ్యాధి 
Electrocardiography = హృదయవిద్యుల్లేఖనము ; విద్యుత్ హృల్లేఖ
Endoscopy = అంతర్దర్శనము
Fungi = శిలీంధ్రములు
Genetic disorders  = జన్యు సంబంధ వ్యాధులు
Infections = ఆక్రమిత  వ్యాధులు ( గ.న )
life styles  = జీవనరీతులు 
Magnetic resonance imaging = అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు
Microbiology  = సూక్ష్మజీవుల శాస్త్రము 
Neoplasms = కొత్త పెరుగుదలలు 
Parasites = పరాన్నభుక్తులు
Pathology = వ్యాధివిజ్ఞాన శాస్త్రము
Pharmacology = ఔషధశాస్త్రము
Physiology = శరీరవ్యాపార శాస్త్రము 
Ultrasonography = శ్రవణాతీత ధ్వని చిత్రీకరణములు 
Viruses = విషజీవాంశములు 

ఆటాలమ్మ ( Chicken pox ) ; అగ్గిచప్పి / అగ్నిసర్పి / ఒడ్డాణపు చప్పి / మేఖల విసర్పిణి ( Shingles /Hepes Zoster )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )




ఆటాలమ్మ ( Chicken pox ) : అగ్గిచప్పి  / అగ్నిసర్పి / ఒడ్డాణపు చప్పి / మేఖల విసర్పిణి  /  ( Shingles / Herpes Zoster )


                                                                                 డాక్టరు గన్నవరపు నరసింహమూర్తి.                   


    ఆటాలమ్మ ( Chicken pox, Varicella ) ; అగ్గిచప్పి / అగ్నిసర్పి (Shingles / Herpes Zoster ) వ్యాధులు ఆటాలమ్మ - అగ్నిసర్పి విషజీవాంశము ( Varicella Zoster Virus - VZV  ) వలన కలుగుతాయి. VZV, హెర్పీస్ కుటుంబపు విషజీవాంశములలో ( viruses ; from Latin vīrus“slime, poison”; akin to Sanskrit viṣá- विष) ఒకటి. హెర్పీస్ విషజీవాంశములు డి ఎన్ ఎ తరగతికి (  DNA viruses ) చెందినవి. ఇవి రెండు పోగుల డీ ఆక్సీరైబోన్యూక్లియక్ ఏసిడ్ జన్యు సముదాయమును కలిగి ఉంటాయి. ఆ జన్యు సముదాయము వింశతి ( ఇరువది ) ఫలక ఆకారములో ఉన్న మాంసకృత్త్తు పెంకులో ( Icosahedral capsid ) యిమిడి ఉంటుంది. ఇవి కణములకు సోకి ఆ కణములలోనికి చొచ్చుకొన్నపుడు ఆ కణముల న్యూక్లియస్ లలోవిషజీవాంశ డి ఎన్ ఎ లు ఉత్పత్తయి కణద్రవము లోనికి విడుదలయి ఆ విషజీవాంశములు ( Viruses ) సంఖ్యాపరముగా వృద్ధి చెందుతాయి.

                             ఆటాలమ్మ ( Varicella or Chickenpox ) 


    చాలా మందికి చిన్నతనములోనే ఆటాలమ్మ సోకి ఉంటుంది. నవతరములో వారికి ఆటాలమ్మ టీకాలు వేయుట వలన సుమారు డెబ్బది శాతపు పిల్లలకు వ్యాధినిరోధక శక్తి పెరిగి ఆటాలమ్మ సోకదు. అందు వలన వ్యాధి అరుదయే అవకాశము ఉన్నది.

    ఆటాలమ్మను కలిగించే వి.జి.విషజీవాంశములు ( VZV ) గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వ్యాధి గలవారు తుమ్ములు, దగ్గుల లాలాజల తుంపరులతో విషజీవాంశములను వెదజల్లుతారు. విషజీవాంశములు ఉన్న గాలిని పీల్చుట వలన గాని, లేక చర్మ విస్ఫోటపు పొక్కులను తాకుట వలన గాని వ్యాధి సోకుతుంది. అగ్గిచప్పి ( మేఖల విసర్పిణి: Herpes Zoster / Shingles ) పొక్కులను తాకుట వలన కూడా వ్యాధినిరోధక శక్తి లేని వారికి ఆటాలమ్మ సోకవచ్చును.

    ఆటాలమ్మ విషజీవాంశములు శరీరములో ప్రవేశించాక 10 నుంచి 21 దినముల వఱకు వ్యాధి లక్షణములు పొడచూపవు. ఈ అంతర్గతస్థితి కాలములో ( Incubation Period ) విషజీవాంశములు వృద్ధి చెందుతుంటాయి. ప్రారంభదశలో చిన్న పిల్లలలో ఏ లక్షణాలు కనిపించక పోవచ్చును. తరుణ వయస్కులలోను, పెద్దవారిలోను, నలత ( malaise ), వమనభావన ( Nausea ), ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరము, ముక్కు కారుట వంటి లక్షణములు కనిపించవచ్చును.




    ఆపై విస్ఫోటము ( Rash ) పొడచూపుతుంది. తొలుత చిన్న చిన్న ఎఱ్ఱటి మచ్చలు అచ్చటచ్చట కనిపిస్తాయి. ఈ మచ్చలు విరివిచెంది, పొక్కులుగాను ( papules ) తరువాత దినములలో నీటి పొక్కులుగాను ( vesicles ), ఆపై చీము పొక్కులుగాను ( pustules ) పరిణామము చెందుతాయి. తరువాత దినములలో పొక్కులు మాడి, పెచ్చులు కట్టి ఆ పెచ్చులు రాలిపోతాయి. ఈ పొక్కులు పరంపరలుగా వచ్చుట వలన ఒకే సమయములో వివిధ దశల స్ఫోటకములు కనిపిస్తాయి. ఈ విస్ఫోటము వలన దుఱద కలుగవచ్చును. నొప్పి కలుగదు.

    కొందఱిలో దౌడలలోను అంగుడిలోను చిన్న పొక్కులుగాని, పుళ్ళుగాని పొడచూపుతాయి. నొప్పి, దురద యీ పొక్కులవలన కలుగవచ్చును.

    ఆటాలమ్మలో విస్ఫోటము ఛాతిపైన, వీపుపైన, ఉదరముపైనా, తల, చేతులు, ముంజేతులు, తొడలు, కాళ్ళ పైనా కనిపిస్తుంది.

    విస్ఫోటము కనిపించుటకు రెండు దినములు ముందునుంచి వ్యాధిగ్రస్థులు విషజీవాంశములను తుమ్ము, దగ్గుల ద్వారా వ్యాపింప జేస్తారు. పొక్కులు పూర్తిగా మాడి పెచ్చులు కట్టేవఱకు ( సుమారు నాలుగైదు దినములు ) వీరు ఆటాలమ్మను వ్యాపించగలరు.

    సాధారణముగా ఆటాలమ్మ రెండు వారములలో తగ్గిపోతుంది. వయోజనులలో జ్వరము, విరివిగా విస్ఫోటము కలిగి వ్యాధి ఎక్కువ దినాలు ఉండవచ్చును. వయోజనులలోను, వ్యాధి నిరోధకశక్తి తగ్గినవారిలోను ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ) కలుగవచ్చును.

    గర్భిణీ స్త్రీలలో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉండవచ్చును. గర్భిణీ స్త్రీలకు వ్యాధి కలిగి పిండమునకు వ్యాధి సోకిన గర్భస్థ శిశువు పెరుగుదలకు, అవయవముల అభివృద్ధికి అవరోధము కలిగి పుట్టుకతో కొన్ని వ్యాధులు ( జన్మవ్యాధులు ; Congenital diseases) కలుగవచ్చును.

    సాధారణముగా ఆటాలమ్మ ప్రమాదకరము కాదు గాని, వ్యాధినిరోధక శక్తి తగ్గినవారిలో, వ్యాధి తీవ్రతరమయి చాలా అరుదుగా ( 50 వేల మంది వ్యాధిగ్రస్థులలో ఒకఱికి ) మరణము సంభవిస్తుంది.


పరీక్షలు 


    వ్యాధి లక్షణములు, విస్ఫోటపు లక్షణములు, సమాజములో వ్యాధి ప్రాబల్యము బట్టి వైద్యులు వ్యాధినిర్ణయము చేయగలరు. రక్తములో VZV కి ప్రతిరక్షకముల పరీక్ష చేసి సత్వర IgM ప్రతిరక్షకములను ( antibodies ) కనిపెట్టిన వ్యాధి నిర్ణయమైనట్లే. IgG ప్రతిరక్షకములు దీర్ఘకాలమునవి. అవి కనిపించుటకు కొద్ది వారములు పడుతాయి. అవి వ్యాధినిరోధక శక్తిని సూచిస్తాయి. పొక్కులనుంచి సేకరించిన రసిని గాజుపలకపై పొరగా నెఱపి Tzanck వర్ణకముతో సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి వ్యాధిని నిర్ణయించవచ్చును. పొక్కుల రసినుంచి డి ఏన్ ఎ గుణకార చర్యతో ( DNA Polymerase chain reaction ) విషజీవాంశములను గుర్తించవచ్చును.

చికిత్స 


    చాలా మందికి జ్వరము, వంట్లో నలత తగ్గించుటకు పారసిటమాల్, లేక ఎసిటెమైనోఫెన్లను వాడవచ్చును. దుఱద ఎక్కువగా ఉంటే డైఫెన్ హైడ్రొమెన్ వంటి హిష్టమిన్ అవరోధకములను ( antihistamines ) వాడవచ్చును. పొక్కులను ప్రతిదినము గోరువెచ్చని నీటితో శుభ్రపరచి జింక్ ఆక్సైడు గల లేపనములను పూయవచ్చును.

    పిల్లలలో ఎసైక్లొవీర్ ( Acyclovir ) వంటి విషజీవాంశ నాశకములు ( Antiviral medicines ) వ్యాధిపై ఫలితములను చూపవు. అందువలన ఒక మాసముపైన, 12 సంవత్సరములలోపు వయస్సు ఉన్న వారికి విషజీవాంశములను అదుపులో పెట్టు మందులను వాడరు.

    వయోజనులలో వ్యాధి పొడచూపిన 48 గంటల లోపల వాడే ఎసైక్లొవీర్, వాలసైక్లొవీర్ ( valacyclovir ) వంటి మందులు వ్యాధి త్వరితముగా తగ్గుటకు ఉపయోగపడుతాయి. గర్భిణీ స్త్రీలు, వ్యాధినిరోధక శక్తి కొఱవడినవారికి యీ మందులను త్వరగా మొదలుపెట్టుట మంచిది. వ్యాధి తీవ్రముగా ఉన్నవారికి, యితర చిక్కులు, సమస్యలు కలిగినవారికి ప్రతిరక్షకముల గ్లాబ్యులిన్ ( Varicella Zoster Immune Globulin - VZIG ను వాడుతారు.

వ్యాధినిరోధము 


    పిల్లలకు ఆటాలమ్మ టీకాలు వేయుటవలన అధిక సంఖ్యలో ( 80 శాతము మందిలో ) వ్యాధిని నిరోధించగలము. వ్యాధిగ్రస్థులను మిగిలిన వారికి దూరముగా ఉంచుట వలన వ్యాధి వ్యాప్తిని అరికట్టగలము.


అగ్గిచప్పి / అగ్నిసర్పి / ఒడ్డాణపు చప్పి / మేఖల విసర్పిణి , ( Shingles / Herpes Zoster ) 



    అగ్నిసర్పి ( అగ్గిచప్పి, ఒడ్డాణపు చప్పి, మేఖలవిసర్పిణి ) సాధారణముగా పెద్దవారిలోను, వ్యాధి నిరోధకశక్తి కొఱవడినవారిలోను కనిపిస్తుంది. పిల్లలలోను తరుణ వయస్సు కలవారిలోను అరుదుగా కనిపిస్తుంది. అదివఱకు ఆటాలమ్మ కలిగినవారిలో ఆ విషజీవాంశములు ( Viruses) శరీర రక్షణ యంత్రాంగముచే తొలగించబడినా, కొన్ని చర్మము నుంచి జ్ఞాననాడుల ద్వారా నాడీకణముల లోనికి ప్రవేశించి వానిలో నిద్రాణమై మసలవచ్చును.

    వెన్నుపాము నుంచి వెలువడు నాడులకు పూర్వనాడీ మూలము ( ముందఱ ఉండు anterior nerve root), పరనాడీ మూలము ( వెనుక నుండు posterior nerve root ) ఉంటాయి. పూర్వనాడీ మూలములో చలననాడుల పోగులు ( motor nerve fibers ) ఉంటాయి. పరనాడీ మూలములలో జ్ఞాననాడుల పోగులు ( sensory nrve fibers )  ఉంటాయి. పరనాడీ మూలములలో నాడీ కణములతో నాడీగ్రంథులు ( nerve root ganglions ) ఉంటాయి. ఆటాలమ్మ-మేఖలవిసర్పిణి విషజీవాంశములు ( Varicella Zoster Viruses ) యీ నాడీగ్రంథుల నాడీకణములలోను, ముఖ చర్మమునుంచి స్పర్శ మొదలగు జ్ఞానములను సేకరించు త్రిశాఖనాడీ గ్రంథి ( Trigeminal nerve ganglion ) లోను నిక్షిప్తమై ఉండగలవు. శరీర వ్యాధినిరోధక శక్తి వయస్సువలన, యితర వ్యాధులవలన, ఔషధములవలన, కర్కట వ్రణములవలన తగ్గినపుడు, యీ విషాంశములు చైతన్యవంతమయి నాడీకణములలో వృద్ధిచెందినచో అవి నాడీ తంతువుల ద్వారా చర్మమునకు చేరి చర్మములో తాపము కలిగించి పొక్కులతో మేఖల విసర్పిణి ( అగ్గిచప్పి /Shingles /Herpes Zoster ) కలుగజేస్తాయి.

మేఖల విసర్పిణి లక్షణములు 


    మేఖల విసర్పిణి పొడచూపే ముందు శరీరములో నలత, జ్వరము, తలనొప్పి కలుగవచ్చు. కొద్ది దినములకు ముందు ప్రభావిత భాగములో తిమ్మిరి, మంట, సలుపు, పీకుట, నొప్పి కలుగవచ్చును. ఛాతి ప్రభావితమైనపుడు ఛాతినొప్పి, ఉదర భాగము ప్రభావితమయితే కడుపునొప్పి కలుగవచ్చును.




     ఈ బాధ కలిగిన రెండు మూడు దినములు లేక కొద్ది వారముల పిదప ప్రభావిత ప్రాంతములో విస్ఫోటము ( rash ) కనిపిస్తుంది. ఈ విస్ఫోటము ఆరంభదశలో గులాబిరంగు లేక ఎఱుపు రంగులో దద్దుర్లు వలె కనిపిస్తుంది. ఈ విస్ఫోటము సర్వసాధారణముగా శరీరములో ఒక ప్రక్క ప్రభావిత నాడీపాలిత చర్మవిభాగమునకు ( Dermatome ) పరిమితమై ఉంటుంది. ఈ విస్ఫోటము శరీర మధ్యరేఖను అతిక్రమించదు. శరీర వ్యాధినిరోధక శక్తి విశేషముగా క్షీణించిన వారిలో ఈ వ్యాధి తీవ్రమయి విశేషవ్యాప్తి చెందవచ్చును.

    తొలుత దద్దుర్లుగా ఉండి తర్వాత నీటిపొక్కులు ఏర్పడి, ఆ పిమ్మట నల్లబడి, పెచ్చులు కట్టి, తర్వాత పెచ్చులు రాలిపోతాయి. అరుదుగా పుళ్ళు కలిగి, మచ్చలు కూడా కట్టవచ్చును. రెండు, నాలుగు వారములలో విస్ఫోటము మానిపోతుంది. కొంతమందిలో నెలలు లేక కొద్ది సంవత్సరముల పాటు నరాల సలుపు ( Post herpetic neuralgia ) బాధించవచ్చును.

ముఖములో మేఖల విసర్పిణి 

    
     త్రిశాఖనాడిలో ( Trigeminal nerve ) నేత్రకుహర నాడి ( Opthalmic nerve ), హనువు నాడి ( Maxillary nerve ), అధోహనువు నాడి ( Mandibular nerve ) అను మూడు శాఖలు ఉంటాయి. ఈ మూడు శాఖలలో నేత్రకుహర నాడి అగ్గిచప్పికి తఱచు లోనవుతుంది.

    నేత్రప్రాంతములో మేఖల విసర్పిణి కలుగుతే నుదుటి ప్రాంతములోను, కనురెప్పలపైనా ఎఱ్ఱదనము, వాపు, పొక్కులు పొడచూపుతాయి . కంటి పైపొర తాపము వలన కండ్లకలక ( Conjunctivitis ) ; స్వచ్ఛపటల తాపము ( Keratitis ), కృష్ణపటల తాపము ( Uveitis ), చక్షునాడి వాతములు ( Optic nerve palsies) వలన కంటిలో సలుపు, నీరు కారుట, నుదుటి ప్రాంతములో ఒకపక్క తలనొప్పి, దృష్టిలోపములు, అంధత్వము కూడా కలుగవచ్చును.

    హనువునాడి ( maxillary nerve ) ప్రభావితమైతే నోటిలో పైదవుడ, అంగుడు, పైదంతపు ఇగుళ్ళలో చిన్న పొక్కులు, పుళ్ళు, పైదవుడ చర్మముపై విస్ఫోటము పొడచూపుతాయి.

    అధోహనువు నాడి ( mandibular nerve ) ప్రభావితమైతే నోటిలో క్రిందిదవుడ, నాలుక, క్రిందిదవుడ యిగుళ్ళలో పొక్కులు, పుళ్ళు కలుగుతాయి. క్రింది దవుడ చర్మముపై విస్ఫోటము పొడచూపవచ్చును. నోటిలో అగ్గిచప్పి వలన పొక్కులు పుళ్ళు ఏర్పడితే అవి ఒక ప్రక్కనే ఉండుట వలన వ్యాధిని వైద్యులు పసిగడుతారు. నోటిలో మేఖల విసర్పిణి కలుగుతే నాడులతో బాటు రక్తనాళములు తాప ప్రభావమునకు లోనయితే దంతపు వ్యాధులు, యిగుళ్ళ వ్యాధులు, దంత నష్టము, దౌడ యెముకలలో అస్థి నిర్జీవత ( osteonecrosis ), ఎముకల విచ్ఛిన్నము సంభవించవచ్చును.

వ్యాధినిర్ణయము 


    విస్ఫోటము దేహములో ఒక ప్రక్కకు ఒక నాడీపాలిత చర్మ విభాగమునకు ( Dermatome ) ఒక పట్టీ వలె పరిమితమయి అగ్గిచప్పిని ( మేఖల విసర్పిణి ) సూచిస్తాయి. ఈ వ్యాధిలో సలుపు, మంట, నొప్పి ఎక్కువగా ఉండి దురద పాలు తక్కువయి అగ్గిచప్పిని సూచిస్తాయి. పొక్కుల రసితో డి.ఎన్.ఎ గుణకార చర్యతో ( Polymerase Chain Reaction ) విషజీవాంశములను కనుగొనవచ్చును. రసిని గాజు పలకపై నెఱపి Tzanck వర్ణకముతో  సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి వ్యాధి ధ్రువీకరణ చేయవచ్చును. రక్తపరీక్షలలో VZV కి IgM ప్రతిరక్షకములను కనుగొని వ్యాధిని నిర్ధారించవచ్చును.

చికిత్స 


నొప్పి మందులు 


    విస్ఫోటమునకు జింక్ ఆక్సైడు పూతలు కొంత ఉపశమనము కలిగిస్తాయి. నొప్పికి ఎసిటెమైనోఫెన్, పారసిటమాల్ లు వాడవచ్చును. కొందఱికి కొడీన్, హైడ్రోకొడీన్, నల్లమందు (Opium) వంటి మత్తిచ్చే నొప్పి మందులు అవసరము పడవచ్చును. లైడొకేన్ వంటి మందులతో తాత్కాలికముగా స్పర్శను, వ్యధను ఆయా ప్రాంతములలో అరికట్టవచ్చును.

విషజీవాంశ నాశకములు ( Antiviral medicines ) 


     VZV పై పనిచేసే ఎసైక్లొవీర్ (Acyclovir), వాలసైక్లొవీర్ (Valacyclovir), ఫామ్ సైక్లొవీర్ (famciclovir) లలో ఏ మందైనా వ్యాధి లక్షణములు పొడచూపిన 48- 72 గంటలలో మొదలుపెడితే వ్యాధి తీవ్రతను, వ్యాధి కాలపరిమితిని తగ్గించగలుగుతాము. ఎసైక్లొవీర్ దినమునకు ఐదు పర్యాయములు వాడాలి. వాలసైక్లొవీర్, ఫామ్ సైక్లొవీర్ లను దినమునకు మూడు పర్యాయములు వాడాలి. వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉన్నవారిలోను, యితర సమస్యలు కలిగినపుడు సిరల ద్వారా వాడుటకు ఎసైక్లొవీర్ లభ్యము.

    అగ్గిచప్పి తరువాత కలిగే నాడీ వ్యధకు (Post herpetic neuralgia) గాబాపెంటిన్ (Gabapentin), ప్రీగాబలిన్ (Pregabalin) లను, నొప్పి మందులను వాడవచ్చును .

వ్యాధినివారణ 


    అగ్గిచప్పికి టీకాలు లభ్యము. ఇవి వ్యాధిని చాలా శాతము మందిలో నివారిస్తాయి. టీకాలు తీసుకొన్నవారిలో వ్యాధి పొడచూపినా వ్యాధి తీవ్రత పరిమితముగా ఉంటుంది.


పదజాలము :

Antibodies =  ప్రతిరక్షకములు
Anterior nerve root = పూర్వ నాడీమూలము ( గ.న )
Antiviral medicines = విషజీవాంశ నాశకములు (గ.న )
Chicken pox, Varicella = ఆటాలమ్మ 
Congenital diseases = జన్మ వ్యాధులు (గ.న )
Dermatome = నాడీపాలిత చర్మవిభాగము ( గ.న )
DNA polymerase chain reaction = డి ఎన్ ఎ గుణకార చర్య ( గ.న )
Incubation Period = అంతర్గతస్థితి కాలము
Keratitis = స్వచ్ఛపటల తాపము ( గ.న )
Malaise = నలత 
Mandibular nerve = అధోహనువు నాడి (గ.న )
Maxillary nerve = హనువు నాడి ( గ.న )
Nausea = వమనభావన ( గ.న ) , డోకు
Neuralgia = నాడీవ్యధ ( గ.న )
Post herpetic neuralgia = సర్పి అనంతర నాడీవ్యధ
Opthalmic nerve = నేత్రకుహర నాడి ( గ.న )
Osteonecrosis = అస్థి నిర్జీవత ( గ.న )
Papules = పొక్కులు ( గ.న )
Pneumonitis = ఊపిరితిత్తుల తాపము ( గ.న )
Pustules = చీము పొక్కులు ( గ.న )
Rash = విస్ఫోటము
Shingles , Herpes Zoster = అగ్గిచప్పి ; మేఖల విసర్పిణి ( గ.న ) ; ఒడ్డాణపు చప్పి ( గ.న )
Trigeminal nerve = త్రిశాఖనాడీ గ్రంథి 
Uveitis = కృష్ణపటల తాపము  ( గ.న )
Vesicles = నీటి పొక్కులు ( గ.న )
Viruses = విషజీవాంశములు ( గ.న )

( తెలుగులో నా శక్తి మేఱకు వైద్యవిషయాలు తెలుపుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తమనుకుంటే యథేచ్ఛగా పంచుకొనండి )

1, జూన్ 2019, శనివారం

అధిక రక్తపీడనము ( Hypertension )

    అధిక రక్తపీడనము

  (Hypertension )


   (తెలుగుతల్లి, కెనడా వారి సౌజన్యముతో )

                                                                           డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .                   
                                                                                                    .

    రక్తప్రసరణము వలన దేహములో వివిధ అవయవాలకు, కణజాలమునకు ప్రాణవాయువు ( oxygen), పోషక పదార్థములు అందింపబడి, వానినుండి బొగ్గుపులుసువాయువు ( Carbon di-oxide ), మిగిలిన వ్యర్థపదార్థములు తొలగించబడుతాయి. హృదయ సంకోచ, వికాసముల వలన రక్తనాళముల ద్వారా రక్తప్రసరణము జరుగుతుంది.

    హృదయములో ఎడమ జఠరిక ( Left Ventricle ) రక్తమును వివిధ అవయవములకు బృహద్ధమని ( Aorta ), దాని శాఖలు, ధమనుల ద్వారా  చేర్చితే, వివిధ అవయవముల నుండి తిరిగి ఆ రక్తము ఉపసిరలు, ఊర్ధ్వ బృహత్సిర ( Superior Venacava ), అధో బృహత్సిరల ( Inferior Venacava ) ద్వారా హృదయములో కుడి భాగమునకు చేరుతుంది. కుడికర్ణిక నుంచి కుడి జఠరికకు , కుడి జఠరిక నుంచి పుపుస ధమని  ( Pulmonary artery ) ద్వారా ఊపిరితిత్తులకు రక్తము చేరి, ఊపిరి తిత్తులలో వాయువుల మార్పిడి జరిగాక ( బొగ్గుపులుసు వాయువు తొలగి, ప్రాణవాయువు కూడి ) పుపుస సిరల ( Pulmonary Veins ) ద్వారా రక్తము గుండె ఎడమ భాగానికి చేరుతుంది.

రక్తపీడనము 


    రక్త ప్రసరణకు కొంత పీడనము అవసరము. హృదయములో జఠరికలు వికసించినప్పుడు ( Diastole ) రక్తప్రవాహముతో అవి నిండుతాయి. అప్పుడు బృహద్ధమని, పుపుస ధమనుల మూలములలో ఉన్న కవాటములు మూసుకొని ఉంటాయి. అప్పుడు  ధమనులలో ఉండే పీడనమును వికాస పీడనము ( Diastolic pressure  ) అంటారు. జఠరికలు ముడుచుకున్నప్పుడు ( Systole ) రక్తప్రవాహము వలన ధమనులలో పీడనము పెరుగుతుంది. అప్పటి పీడనమును ముకుళిత పీడనము ( Systolic Pressure  ) అంటారు. హృదయ సంకోచ, వికాసముల వలన రక్తనాళములలో రక్తము పరంపరలుగా ప్రవహిస్తుంది. రక్తపీడనమును పాదరస మట్టముతో కొలుస్తారు. ధమనులలో ఉండే రక్తపీడనము గురించి చర్చిస్తాను.
                 
    వయోజనులలో ముకుళిత పీడనము ( ఈ సంఖ్యను పైన సూచిస్తారు. ) 100 నుంచి 140 మిల్లీమీటర్ల పాదరస ప్రమాణములోను, వికాసపీడనము ( ఈ సంఖ్యను క్రింద సూచిస్తారు ) 60  నుంచి 90 మిల్లీమీటర్ల పాదరస ప్రమాణములోను ఉండుట సామాన్యముగా పరిగణించబడుతుంది.

అధిక రక్తపీడనము 

    రక్తపీడనము నిలకడగా 140 / 90 మి.మీ. దాటి ఉంటే దానిని వైద్యులు  అధిక రక్తపీడనముగా 
(రక్తపు పోటు; Hypertension ) పరిగణిస్తారు. ఏదో ఒక్కక్క సారి ఆందోళన, భయము వంటి కారణముల వలన రక్త పీడనము కొంచెము హెచ్చినంత మాత్రమున దానిని రక్తపు పోటుగా పరిగణించరాదు. విశ్రాంతముగా కొద్దిసేపు కూర్చున్నాక రెండు, మూడు  పర్యాయములు, లేక దినములో పెక్కు సార్లు పరిపాటిగా దినదిన కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నపుడు తీసుకొనే రక్తపీడనపు విలువలు ( Ambulatory Pressures ) బట్టి రక్తపుపోటుని నిర్ణయించాలి.

    రక్తపుపోటు  అదుపులో లేక ఎక్కువ కాలము ఉండుట వలన గుండెపోటు, గుండె బలహీనత, హృదయ వైఫల్యము ( Congestive Heart failure ), మస్తిష్క విఘాతాలు ( Cerebro Vascular Accidents ), మూత్రాంగముల వైఫల్యము ( Renal failure ), దృష్టి లోపములు వంటి విషమ పరిణామములు కలుగుతాయి. అందువలన రక్తపు పోటును అదుపులో పెట్టుకోవలసిన అవసరము ఉన్నది .
  
    అధిక సంఖ్యాకులలో  అధికపీడనము ( 95 శాతమునకు మించి ) ప్రధాన అధికపీడనము ( Primary Hypertension ). అంటే దానికి యితర కారణాలు ఉండవు. కొద్దిమందిలో  ( సుమారు 5 శాతము మందిలో ) అది యితర వ్యాధుల వలన కలుగుతుంది. అప్పుడు దానిని అప్రధాన అధికపీడనముగా ( Secondary Hypertension ) పరిగణిస్తారు. గళగ్రంథి స్రావకములు ( Thyroid hormones) ఎక్కువ అవడము, తక్కువ అవడము, అడ్రినల్ కార్టికో స్టీరాయిడ్ లు ( adrenal corticosteroids ) ఎక్కువ కావడము ( Cushing Syndrome ) ), ఆల్డోస్టీరోన్ ( aldosterone ) ఎక్కువ కావడము ( Primary Hyperaldosteronism  ), సహగళగ్రంథి స్రావకము ( Parathyroid hormone ) ఎక్కువ అవడము వంటి వినాళగ్రంధుల వ్యాధులు, ఫియోఖ్రోమోసైటోమా,  మూత్రాంగముల వ్యాధులు ( kidney diseases ), మూత్రాంగ ధమనుల ఇరకటము ( Renal artery stenosis ) వలన కలిగే రక్తపుపోటులు అప్రధానపు రక్తపుపోటులు. అప్పుడు రక్తపు పోటును అదుపులో పెట్టుకొని అసలు వ్యాధులకు చికిత్స చెయ్యాలి. శస్త్రచికిత్సలు కూడా అవసరము కావచ్చును.

    ఇతర కారణాలు లేకుండా కలిగే ప్రధాన అధికపీడనము జన్యుసంబంధమైనది కావచ్చును. ఉప్పు వాడుక ఎక్కువగుట, వ్యాయామలోపము, మద్యము వినియోగము, మాదక ద్రవ్యాల వినియోగము, పొగ త్రాగుట , స్థూలకాయము రక్తపుపోటు కలుగుటకు తోడ్పడుతాయి.

రక్తపీడనము ఎలా కలుగుతుంది ?


    రక్తప్రసరణకు రక్తనాళముల నుండి కలిగే ప్రతిఘటన వలన రక్తపీడనము కలుగుతుంది. దేహములో రెనిన్, ఏంజియోటెన్సిన్ల వ్యవస్థ, సహవేదన నాడీమండలము ( Sympathetic Nervous system ) రక్తనాళములలోని మృదుకండరాల ( Smooth muscles ) బిగుతును ( Constriction) నియంత్రిస్తాయి. 

     మూత్రాంగములలో రెనిన్ ఉత్పత్తి చెంది రక్తములోనికి విడుదల అవుతుంది. ఈ రెనిన్ కాలేయములో ఉత్పత్తి అయే ఏంజియోటెన్సినోజన్ ( Angiotensinogen ) ని ఏంజియోటెన్సిన్ -1 గా మారుస్తుంది.ఏంజియోటెన్సిన్ -1 కణజాలములో ఉండే ఏంజియోటెన్సిన్ కన్వెర్టింగ్ ఎంజైము వలన  ఏంజియోటెన్సిన్ -2 గా  ( angiotensin-2 ) మారుతుంది. ఏంజియోటెన్సిన్ -2 రక్తనాళ కండరాలను సంకోచింపజేసి, రక్తనాళముల బిగుతును పెంచుతుంది. ఏంజియోటెన్సిన్ -2 ఎడ్రినల్ గ్రంథుల నుంచి ఆల్డోస్టెరోన్ ని ( aldosterone ) కూడా విడుదల కావిస్తుంది . ఆల్డోస్టెరోన్  శరీరములో సోడియం ని పెంచుతుంది.

    సహవేదన నాడీమండలము, ఎడ్రినల్ గ్రంథుల నుంచి విడుదల అయే ఎడ్రినలిన్, నారడ్రినలిన్ హార్మోనులు ( Catecholamines ) కూడా రక్తనాళపు మృదుకండరాలను నియంత్రిస్తాయి. ఇవి గుండె వేగమును, గుండె సంకోచ ప్రక్రియను ( contractility ) ఇనుమడింపజేస్తాయి.

    పై ప్రక్రియల ప్రభావము ఎక్కువయి నప్పుడు రక్తపీడనము పెరిగి అధిక రక్తపీడనము కలుగుతుంది.

రక్తపుపోటు లక్షణములు 

    చాలా మందిలో రక్తపుపోటు చాలాకాలము ఎట్టి లక్షణాలు, నలతలు చూపించదు. రక్తపీడనము కొలుచుట వలనే ఈ రుగ్మతను  కనిపెట్టగలము.

    తలనొప్పి, కళ్ళు తిరగడము, ఒళ్ళు తూలిపోవడము వంటి  లక్షణములు కొందఱిలో కలుగవచ్చును. ఒంట్లో బాగానే ఉందని రక్తపుపోటుని నిర్లక్ష్యము చేయకూడదు. మధ్య మధ్యలో కొలుచుకోకుండా రక్తపుపోటు అదుపులోనే ఉన్నదని భ్రమించకూడదు.

    గుండె వ్యాధులు, మూత్రాంగముల వైఫల్యము ( renal failure ), మస్తిష్క విఘాతములు ( cerebral strokes ), దూర రక్తనాళ ప్రసరణ లోపములు ( Peripheral Vascular insfficiency ), అంధత్వము వంటి పరిణామముల వలనే రక్తపు పోటు కొంతమందిలో తొలిసారిగా కనుగొనబడవచ్చును. లక్షణాలు పొడచూపక పెక్కు అవయవాలపై చెడు ప్రభావము చూపిస్తుంది కాబట్టి మధ్య మధ్య రక్తపీడనము పరీక్షించుకోవలసిన అవసరము ఉన్నది. ఎక్కువగా ఉంటే చికిత్స అవసరము.

పరీక్షలు 

    రక్తపు పోటు ఉన్నదని నిర్ధారణ చేసాక కొన్ని పరీక్షలు అవసరము. రక్తకణ గణనములు ( Complete Blood Counts ), రక్త రసాయన పరీక్షలు ( Blood Chemistry  ), మూత్రాంగముల వ్యాపార పరీక్షలు ( Renal functions ), మూత్రపరీక్షలు, అవసరమనిపిస్తే, హార్మోను పరీక్షలు, విద్యుత్ హృల్లేఖనము ( electrocardiography ) వంటి పరీక్షలు అవసరము. నేత్రబింబ పరీక్షలు ( Fundoscopy ) కూడా అవసరమే .

    సంకోచ పీడనము (Systolic Pressure  ) 180 మి. మీ.మెర్క్యురీ పైన, వికాస పీడనము ( Diastolic Pressure ) 110 మి.మీ  మెర్కురీ దాటితే దానిని అధిక రక్తపీడన సంక్షోభముగా ( Hypertensive Crisis ) పరిగణిస్తారు. హృదయము, మెదడు, మూత్రాంగములు, కళ్ళపై దీని ప్రభావము కనిపిస్తే ఈ పీడన సంక్షోభాన్ని అత్యవసర పరిస్థితిగా పరిగణించి చికిత్స చెయ్యాలి.సిరాంతర ఔషధాలు ( Intravenous drugs ) అవసరము అవవచ్చును. ఎట్టి విపత్తులు లేకపోతే  నోటి ద్వారా మందులు ఇచ్చి  చికిత్స చెయ్యవచ్చును.

  చికిత్స 

    రక్తపుపోటు ఉన్నదని నిర్ధారణ చేసాక, యితరవ్యాధి లక్షణాలు లేవని రూఢీ చేసి, తగిన పరీక్షలు చేస్తూ, వ్యాధికి చికిత్స చెయ్యాలి. అధిక పీడనము సాధారణ పరిమితులకు దగ్గఱలో ఉన్నప్పుడు ఔషధముల అవసరము లేకుండా జీవనశైలి మార్పులతో దానిని అదుపులో పెట్టగలిగే అవకాశము ఉన్నది. అదుపులో ఉంచలేనపుడు, పీడనపు విలువలు అధికముగా ఉన్నప్పుడు మందులు వాడుక అవసరము.

జీవన శైలి మార్పులు 

        
    శరీరానికి తగినంత వ్యాయామము చాలా అవసరము. శ్రామికులు ఆరోగ్యవంతులుగాను దీర్ఘాయుష్కులుగాను ఉండుట గమనిస్తుంటాము. ఈ వాహన యుగములో ప్రజలకు నడక, వ్యాయామము తగ్గింది. తగినంత వ్యాయామము చేయుట, ఉప్పు, కొవ్వుపదార్థాల వాడుక తగ్గించుట, మితముగా భుజించుట, స్థూలకాయములను తగ్గించుట, పొగత్రాగుట మానుట, మద్యవినియోగమును మితములో ఉంచుకొనుట, మాదకద్రవ్యాల వినియోగములు మానుట రక్తపుపోటును అదుపులో ఉంచుటకు చాలా అవసరము .

ఔషధములు 


మూత్రకారకములు ( Diuretics )     

      

    అధిక రక్తపీడనమును అదుపులో ఉంచుటకు వివిధ తరగతుల ఔషధాలు ఉన్నాయి. ప్రప్రథమముగా, సాధు మూత్రకారకములను ( Diuretics ) వినియోగిస్తాము. ఇవి లవణ నష్టమును, జల నష్టమును కలుగజేసి, రక్త పరిమాణమును తగ్గించి రక్తనాళముల పీడనమును తగ్గిస్తాయి. కణముల లోపల సోడియం తగ్గినప్పుడు రక్తనాళములలోని కండరముల బిగుతు తగ్గుతుంది. థయజైడ్ ( Thiazide ) మూత్రకారకములను రక్తపుపోటుకు తఱచు వాడుతారు. స్పైరనోలాక్టోన్ ( spironolactone ) వంటి ఆల్డోష్టిరోన్ అవరోధకములను కూడా థయజైడ్ మూత్రకారకములకు జతపఱచవచ్చును. కొందఱిలో మూత్రాంకముల ( nephrons ) మెలికలపై ( loops ) పనిచేయు ఫ్యురొసిమైడ్ ( Furosemide ) వంటి మూత్రకారకములను ( Loop diuretics ) ఉపయోగిస్తారు. మూత్రకారకములు వాడేటపుడు  విద్యుద్వాహక లవణములకు ( electrolytes ) రక్తపరీక్షలు మధ్యమధ్యలో చేయాలి.

బీటా ఎడ్రినల్ గ్రాహక అవరోధకములు ( beta adrenergic receptor blockers ) 

   
        బీటా ఎడ్రినల్ గ్రాహక అవరోధకములు  బీటా అడ్రినల్ గ్రాహకములను ( beta adrenergic receptors ) అవరోధించి ఎడ్రినలిన్, నారెడ్రినలిన్ వంటి ఖాటికాలైమన్ల ( catecholamines ) ప్రభావమును తగ్గిస్తాయి. అందువలన రక్తనాళములలో బిగుతు తగ్గుతుంది. ఇవి హృదయవేగమును తగ్గించి, హృదయ వికాసమును పెంచి అధికపీడన నివారణకు తోడ్పడుతాయి. 

ఏంజియోటెన్సిన్ కన్వెర్టింగ్ ఎంజైం ఇన్హిబిటర్లు ( Angiotensin Converting Enzyme inhibitors ) 

 
    ఇవి ఏంజియోటెన్సిన్ 1 ను ఏంజియోటెన్సిన్ -2 గా మార్పు చెందకుండా అరికట్టి, రక్తనాళములలో బిగుతు తగ్గించి, రక్తపు పోటు తగ్గిస్తాయి. ఈ ఔషధములను వాడేటపుడు కొద్ది వారములు తఱచు మూత్రాంగ వ్యాపార పరీక్షలకు, పొటాసియము విలువలకు రక్తపరీక్షలు చేసి వాటిని గమనించాలి. రక్తములో క్రియటినిన్ ప్రారంభపు విలువకంటె 30 శాతము పెరుగకుండ వైద్యులు గమనిస్తూ ఉండాలి. రక్తద్రవపు పొటాసియం ( serum potassium ) పరిమితులు దాటకుండా గమనించాలి. 0.7 శాతము మందిలో చర్మము క్రింద గాని, శ్లేష్మపు పొరల ( mucous membranes ) క్రిందగాని పెదాలు, నాలుక, కనుల క్రింద కణజాలములో అసహనపు పొంగు ( Angioedema ) కలిగే అవకాశము ఉంది. వారిలో  ACE inhibitors ను ఆపివేయాలి. ఇవి కొందఱిలో దగ్గు కలుగజేస్తాయి. దగ్గు తీవ్రముగా ఉన్నవారిలో కూడ ఈ ఔషధములకు ప్రత్యమ్నాయములను వాడుకోవాలి.
 

ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు ( Angiotensin Receptor Blockers )       

      

        ఇవి ఏంజియొటెన్సిన్ 2 గ్రాహకములను  అడ్డుకొనుట వలన ఏంజియోటెన్సిన్ 2 నిర్వీర్యమయి ధమనికల బిగుతు తగ్గుతుంది. రక్తపుపోటు తగ్గుతుంది. ఆల్డోస్టెరోన్ ఉత్పత్తిని కూడా ఇవి తగ్గిస్తాయి. ACE inhibitors  సహించని వారిలో వీటిని ప్రయత్నించవచ్చును. వీటిని వాడేటపుడు కూడా తఱచు రక్తపరీక్షలతో మూత్రాంగ వ్యాపారమును, పొటాసియమ్ విలువలను పరిశీలిస్తూ ఉండాలి.

ఆల్ఫా ఎడ్రినెర్జిక్  గ్రాహక అవరోధకములు ( Alpha adrenergic receptor blockers )   

  

      ఇవి ఆల్ఫా అడ్రినల్ గ్రాహకములను  నిరోధించి రక్తనాళములపై అడ్రినల్ హార్మోనుల ప్రభావమును తగ్గిస్తాయి. ధమనికల బిగుతును తగ్గిస్తాయి. ప్రాజొసిన్ ( Prazosin ), టెరజోసిన్ ( Terazosin ), డోక్సొజొసిన్ ( doxazosin ) ఈ తరగతికి చెందిన ఔషధములు. రక్తపీడనమును తగ్గించుటలో మిగిలిన తరగతులకు చెందిన ఔషధములు వీనికంటె మెరుగైనవి. ఇవి తొలిదినము రక్తపీడనమును తగ్గించినట్లు తరువాత తగ్గించవు. కళ్ళు తిరుగుట, నిట్టనిలువు స్థితిలో రక్తపీడనము తగ్గుట ( orthostatic hypotension ), తలనొప్పి వంటి అవాంఛిత ఫలితములు ముందు కలిగినా అవి క్రమేణా తగ్గుతాయి.

కాల్సియమ్ మార్గ  అవరోధకములు ( Calcium channel blockers )   


    ఈ ఔషధములు కణముల కాల్సియం మార్గములను బంధించి కాల్సియం గమనమును అరికట్టి రక్తనాళములలో మృదుకండరముల సంకోచమును తగ్గించి ధమనులను వ్యాకోచింపజేసి, రక్తపీడనమును తగ్గిస్తాయి. ఇవి హృదయమునకు  రక్తప్రసరణ పెంచుతాయి. హృద్ధమనుల ప్రసరణ లోపములు ( Ischemia  ), అధిక రక్తపీడనము కలవారిలోను, ఇతర ఔషధములతో  రక్తపీడనము లొంగనివారిలోను వీటి ప్రయోజనము కలదు. వీనిలో డైహైడ్రోపైరిడిన్ ( dihydropyridines ) తరగతికి చెందని వెరాపమిల్ ( Verapamil ), డిల్టియజెమ్ ( Diltiazem  ) హృదయ మాంద్యమును ( bradycardia ) కలిగించగలవు. హృదయ కండరముల సంకోచమును ( contractility ) తగ్గించగలవు. అందుచే హృదయ మాంద్యము, ప్రేరణ ప్రసరణ లోపములు ( Impulse conduction defects ) కలవారిలోను, హృదయ వైఫల్యము ( Congestive heart failure ) కలవారిలోను వీటి వాడుకలో జాగ్రత్త అవసరము. డైహైడ్రోపైరిడిన్ తరగతికి చెందిన ఏమ్లోడైపిన్ ( amlodipine ), ఫెలోడైపిన్ ( felodipine ) వంటి మందులు హృదయ మాంద్యమును కలిగించవు, హృదయ సంకోచమును అంతగా తగ్గించవు. కాని వీటి వలన పాదములలో పొంగు కలుగవచ్చును. నారంగకాలేయ వ్యాధిగ్రస్థులలో ( cirrhosis of liver ) కాల్సియం మార్గ అవరోధకముల మోతాదులు తగ్గించవలసి ఉంటుంది.

మస్తిష్క కేంద్ర ఔషధములు ( Centrally acting adrenergic agents ) 


    క్లానిడిన్ ( Clonidine ) ఈ కోవకు చెందిన మందు. ఇది మస్తిష్క మూలములో ఆల్ఫా -2 గ్రాహకములను ఉత్తేజపఱచి కాటిఖాలమైన్ల ( catecholamines ) విడుదలను తగ్గించి రక్తనాళముల బిగుతును తగ్గించి రక్తపీడనమును తగ్గిస్తుంది. దీని వలన హృదయ మాంద్యము ( bradycardia ), మత్తుదల ( drowsiness ), నోరు పిడచకట్టుకొనుట వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. సత్వర ఉపసంహరణము ( acute withdrawal ) వలన రక్తపీడనము బాగా పెరుగుట, గుండెవేగము పెరుగుట , ఒళ్ళు చెమర్చుట వంటి లక్షణములు కనిపిస్తాయి. 

ప్రత్యక్ష  రక్తనాళ వ్యాకోచకములు ( Direct vasodilators ) 


    ఈ ఔషధములు ప్రత్యక్షముగా రక్తనాళములపై పనిచేసి వాటి బిగుతును తగ్గించి రక్తపీడనము తగ్గిస్తాయి. మిగిలిన ఔషధములకు తగ్గని రక్తపు పోటునకు వీటిని వాడుతారు. 

    హైడ్రాలజిన్ ను( Hydralazine ) గర్భిణీ స్త్రీలలో రక్తపీడనము అదుపులో పెట్టుటకు కూడా ఉపయోగిస్తారు. హైడ్రాలజిన్ వలన గుండెవేగము హెచ్చి హృద్ధమని వ్యాధిగ్రస్థులలో గుండెనొప్పి , గుండెపోటులు కలుగగలవు. ఇది రెనిన్ విలువలు పెంచి శరీర ద్రవపరిమాణమును పెంచగలదు. 
ఈ అవాంఛిత ఫలితములను అరికట్టుటకు దీనిని బీటా గ్రాహక అవరోధకములతోను ( beta adrenergic receptor blockers ), మూత్రకారకములతోను ( diuretics ) కలిపి వాడుతారు. లూపస్ వంటి వ్యాధి దీని వలన కలిగితే ఈ మందును ఆపివేయాలి. దీని వలన తలనొప్పి, వాంతులు, గుండెవేగము పెరుగుట, నిట్టనిలువు స్థితిలో రక్తపీడనము తగ్గుట ( postural hypotension ) వంటి అవాంఛిత ఫలితములు కొందఱిలో కలుగుతాయి.

    మినాక్సిడిల్ ( Minoxidil ) వాడే వారిలో బరువు హెచ్చుట, రోమములు ఎక్కువగా పెరుగుట (hypertrichosis), హృత్కోశములో నీరుపట్టుట ( pericardial effusion ) వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. 

    ఇంకా పలురకాల మందులు అధికపీడన నివారణకు ఉన్నాయి.

    ఏ ఔషధమైనా అనుకూల ఫలితాలనే గాక ప్రతికూల ఫలితాలను కూడా కలిగించవచ్చును. కాబట్టి వైద్యులు వాటిని గమనిస్తూ ఉండాలి. మూత్రకారకములను వాడేటపుడు, పొటాసియము విలువలను మధ్య మధ్య పరీక్షించాలి.

    రక్తపుపోటును అదుపులో ఉంచుటకు కొందఱికి అనేక ఔషధాల అవసరము కలుగవచ్చును.

    రక్తపుపోటు ఎక్కువగా ఉన్నపుడు ఎట్టి నలత చూపించకపోయినా, అవయవాలపై దీర్ఘకాలిక దుష్ఫలితాలను కలిగిస్తుంది. అధికపీడన సంక్షోభము సంభవిస్తే గుండెపోటు, మస్తిష్క విఘాతము, దృష్టిలోపము, మూత్రాంగ వైఫల్యము, హృదయ వైఫల్యము వంటి విషమ సంఘటనలు కలుగవచ్చును.అందువలన వీలు కలిగించుకొని, అప్పుడప్పుడు రక్తపీడనము పరీక్షించుకోవాలి. వైద్యులను సంప్రదించి వారి సలహాలు అనుసరించాలి. ఆరోగ్యవిషయ పరిజ్ఞానము సమకూర్చుకొనుట చాలా మంచిది. కాని సంపూర్ణ పరిజ్ఞానము, అవగాహన, అనుభవము ఆ వృత్తిలో లేనివారికి కలుగదు కాబట్టి వైద్యుల సలహాలను పాటించుట అవసరము.


పదజాలము :

Aorta = బృహద్ధమని
Atrium  = కర్ణిక
Diastolic pressure = వికాసపీడనము ( గ.న )
 Hypertension = అధిక రక్తపీడనము ; అధిక రక్తపుపోటు 
Hypertensive crisis = అధిక ( రక్త ) పీడన సంక్షోభము ( గ.న )
Inferior venacava = అధోబృహత్సిర
Intravenous drugs = సిరాంతర ఔషధములు ( గ.న )
Pulmonary artery = పుపుస ధమని
Pulmonary vein = పుపుస సిర
Smooth muscle  మృదుకండరము
Superior venacava = ఊర్ధ్వ బృహత్సిర
Systolic pressure = ముకుళిత పీడనము ( గ.న ) ; సంకోచపీడనము ( గ.న )
Ventricles = జఠరికలు

( వైద్యవిషయములను తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమతమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగ పంచుకొనండి. )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...