18, జూన్ 2019, మంగళవారం

ఉష్ణసంబంధ రుగ్మతలు ( Heat related illnesses )

( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో )

                      ఉష్ణ సంబంధ రుగ్మతలు

                       ( Heat related illnesses 


                                                                                        డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .


    శరీరములో ఉష్ణ నియంత్రణ కేంద్రము మెదడులో హైపోథలమస్ లో ( Hypothalamus )  ఉంటుంది. ఉష్ణము శరీరములో అధికముగా జనించినపుడు, వాతావరణ ఉష్ణము ఎక్కువగా ఉన్నపుడు, శరీరము అధిక ఉష్ణమును బయటకు ప్రసరించుటలో లోపము ఉన్నచో ఉష్ణ సంబంధ రుగ్మతలు కలుగుతాయి.

    అధిక ఉష్ణోగ్రతలలో పనిచేసేవారిలోను, వ్యాయామము, క్రీడలలో పాల్గొనేవారిలోను, సైనికులలోను, దళసరి వస్త్రధారణ చేసేవారిలోను, గృహవసతి లేనివారిలోను, ఇతర అనారోగ్యములు కలవారిలోను, మద్యము, యితర మాదక ద్రవ్యములు వాడే వారిలోను, మానసిక ఔషధములు, యితర ఔషధములు వాడే వారిలోను అధిక ఉష్ణము వ్యాధులు కలిగించే అవకాశములు ఎక్కువ.

    ఉష్ణము శరీరమునుంచి దేహానికి అంటిఉన్న దుస్తులు మొదలగు చల్లని వస్తువులకు వహనము ( conduction ) వలన, దేహముపై ప్రసరించు గాలికి సంవహనము( convection ) వలన, విద్యుత్ అయస్కాంత తరంగముల ( electromagnetic waves ) వికిరణము ( radiation ) వలన, చెమట ఆవిరి చెందుట వలన బయటకు ప్రసరింపబడుతుంది. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినపుడు, కండరముల శ్రమ పెరిగినపుడు, శరీర వ్యాపార క్రియ ( metabolism ) పెరిగినపుడు స్వేదము ఎక్కువగా స్రవించి ఉష్ణము బయటకు ప్రసరించుటకు, దోహదపడుతుంది. హృదయ వేగము, సంకోచము ( contractility ) పెరిగి, హృదయము నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తప్రమాణము ( cardiac output ) పెరిగి, చర్మమునకు రక్తప్రసరణ పెరిగి ఉష్ణప్రసరణను పెంచుతాయి. జీర్ణమండలము, ఇతర ఉదరాంతర అవయవములలో ( viscera )  రక్తనాళములు ఎక్కువగా సంకోచించుట వలన చర్మమునకు రక్తప్రసరణ పెరుగుతుంది. చెమట ఉత్పత్తి ఎక్కువయినపుడు దేహములో ప్రసరణ రక్తప్రమాణము ( circulating blood volume ) తగ్గుతుంది. శరీరములో జల లవణముల ప్రమాణము తగ్గి శోషణ ( dehydration ) కలుగుతుంది. దేహములో జనించు ఉష్ణము ఉష్ణ నష్టము కంటె అధికమయినపుడు శరీరాంతర ఉష్ణోగ్రత ( core body temperature ) క్రమముగా పెరుగుట మొదలవుతుంది. 


                                అధిక ఉష్ణముచే కలుగు స్వల్ప అస్వస్థతలు  



వడ పొంగు ( Heat edema ) 


    శరీర ఉష్ణము పెరుగుట వలన కాళ్ళలో రక్తనాళములు వ్యాకోచము చెంది, రక్త సాంద్రత పెరిగి  కాళ్ళలోను పాదముల లోను పొంగులు కనిపించవచ్చును. చల్లని ప్రదేశములలో కాళ్ళను ఎత్తుగా పెట్టి పడుకుంటే యీ పొంగులు తగ్గిపోతాయి. మూత్రకారకములను ( diuretics ) యీ పొంగులకు వాడకూడదు. 

కండరముల పీకులు , నొప్పులు ( Muscle cramps ) 


    పరిసరముల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు క్రీడలు, వ్యాయామము, శ్రమ జీవనముల వలన కండరములలో పీకులు, నొప్పులు కలుగవచ్చును. ఉదర కుడ్యపు కండరములు ( abdominal wall muscles ), ఊరు కండరములు ( quadriceps muscles of thighs ), కాలిపిక్కల కండరములలో ( gastrocnemius muscles ) యీ నొప్పులు సాధారణముగా కలుగుతాయి. జల, లవణ నష్టములే కాక నాడీ కండర ప్రేరేపణలు ( neuromuscular stimuli ) యీ నొప్పులకు కారణము కావచ్చును. చల్లని ప్రదేశములలో విశ్రాంతి, లవణసహిత ద్రవపానములు, మర్దనములతో యీ పీకులను నివారించగలము.

చెమట పొక్కులు ; చెమట కాయలు (Heat rash ) 


    ఎండలు, వేడి ఎక్కువయినపుడు చెమట ఎక్కువగా పడుతుంది. స్వేద రంధ్రములు పూడుకొనిపోతే చెమట స్వేద నాళములలో యిరుక్కొని ఎఱ్ఱని చెమట కాయలు, పొక్కులు, చీముకాయలు ( Pustules ) ఏర్పడుతాయి. ఇవి సాధారణముగా వస్త్రములతో కప్పబడు శరీర భాగములలో కనిపిస్తాయి. చల్లని ప్రదేశములకు చేరి అధిక వస్త్రధారణ మానుట వలన, చర్మపు తేమ తగ్గించుకొనుట వలన చెమట కాయలు తగ్గుతాయి.

వడ సొమ్మ ; ఉష్ణ మూర్ఛ ( Heat Syncope ) 


    ఎక్కువసేపు వ్యాయామము చేసినప్పుడు సొమ్మసిల్లుట సంభవించవచ్చును. వ్యాయామములో దేహములో పుట్టే వేడిమికి శరీరపు క్రింద భాగములలో రక్తనాళములు వ్యాకోచించుట ( Peripheral vasodilation ) వలనను, ఎక్కువ చెమటచే కలుగు జల లవణముల నష్టము వలనను, దేహ రక్తప్రమాణము తగ్గుట ( hypovolemia ) వలనను, రక్తనాళములలో బిగుతు తగ్గుట ( decreased vasomotor tone ) వలనను స్థితి ప్రేరిత అల్ప రక్తపీడనము ( postural hypotension ) కలిగి మెదడునకు రక్తప్రసరణ తగ్గి యీ మూర్ఛ కలుగుతుంది. వెల్లకిల పడుకో బెట్టి కాళ్ళు ఎత్తిపెట్టి ఉంచగానే రక్తపీడనము తేరుకొని వారికి స్మారకము కలుగుతుంది. ఈ స్థితి నుంచి 15, 20 నిమిషములలో పూర్తిగా తేరుకుంటారు. వీరిచే ఉప్పుతో కూడిన ద్రవపదార్థములను సేవింపజేసి చల్లని ప్రదేశములలో విశ్రాంతి చేకూర్చాలి. హృదయ సంబంధ వ్యాధులు వలన కూడ అపస్మారము కలుగవచ్చును. హృద్రోగ లక్షణములు, ఆ అవకాశములు కలవారిలోను, వయస్సు మీఱినవారిలోను హృద్రోగములకై శోధించాలి . 


                               అధిక ఉష్ణముచే కలుగు తీవ్రరుగ్మతలు


వడ బడలిక ( Heat exhaustion ) 


    తీవ్ర వ్యాయామము, శారీరక శ్రమ, క్రీడల వలన అధికమైన జీవవ్యాపార క్రియకు ( metabolism )  పరిసరముల అధిక ఉష్ణోగ్రత తోడయినపుడు వడ బడలిక ( heat exhaustion ) కలిగే అవకాశము ఉన్నది. ఎక్కువ వేడికి చెమట ఎక్కువయి జల, లవణ నష్టము కలుగుతుంది. వడబడలిక కలిగిన వారికి అలసత్వము, ఒళ్ళు తూలడము, ఒంట్లో నలత, తలనొప్పి, వమన భావన ( nausea ), వాంతులు కలుగవచ్చు. చెమట బాగా పట్టి చర్మము చల్లబడుతుంది. శరీరాంతర ఉష్ణోగ్రత ( core body temperature ) 101 - 104 ఫాహ్రెన్ హైట్ ( 38.3 - 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ) వఱకు చేరవచ్చును. వీరు నిలుచున్నప్పుడు రక్తపీడనము బాగా పడిపోవచ్చును ( postural hypotension ). వీరి మానసికస్థితి మాత్రము మాఱదు. మతిభ్రంశము కలిగితే, శరీర ఉష్ణోగ్రత ఎంత ఉన్నా సరే దానిని వడదెబ్బగానే ( ఉష్ణఘాతము : Heat stroke ) పరిగణించాలి.

    వడబడలిక అయినా, వడదెబ్బ అయినా సంశయము కలిగినపుడు శరీరాంతర ఉష్ణోగ్రతను త్వరగా తగ్గించు ప్రయత్నములు చేయాలి. రోగులను చల్లని ప్రదేశములకు చేర్చాలి. అధిక వస్త్రములను తొలగించాలి. చల్లని నీటి తుంపరలతోను, పంకాలతోను శారీరక ఉష్ణోగ్రతను 101 ఫాహ్రెన్ హైట్ డిగ్రీలకు తగ్గించు ప్రయత్నము చేయాలి. నోటి ద్వారా గాని, సిరల ద్వారా గాని లవణసహిత ద్రవపదార్థములను ఇచ్చి శోషణ ( dehydration ) తగ్గించాలి. వెల్లకిల పడుకోబెట్టి కాళ్ళను ఎత్తుగా ఉంచాలి .

    వీరికి సంపూర్ణ రక్తకణ పరీక్షలు, జీవవ్యాపార రక్తపరీక్షలు ( విద్యుద్వాహక లవణములు సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేటులు ; గ్లూకోజ్,యూరియా నైట్రొజెన్, క్రియటినిన్, కాలేయ వ్యాపార పరీక్షలు, రక్తములో మయోగ్లోబిన్ ( myoglobin ), మూత్ర పరీక్షలు, రక్త ఘనీభవన పరీక్షలు ( blood coagulation tests ) చేయాలి.

    అధిక ఉష్ణోగ్రతల వద్ద జీవోత్ప్రేరకములు ( enzymes ), యితర మాంసకృత్తులు వికృతి పొందే ( denature ) అవకాశము, కణజాలము విధ్వంసము పొందే అవకాశము ఉన్నాయి. అస్థికండర కణవిధ్వంసము ( rhabdomyolysis ) జరిగి కండరముల నుంచి మయోగ్లోబిన్ అనే వర్ణకము ( pigment) విడుదల కావచ్చును. 

    విద్యుద్వాహక లవణములలో తేడాలు ( electrolyte imbalance ), అస్థికండర కణవిధ్వంసము ( rhabdomyolysis ). కాలేయకణ విధ్వంసము ( hepatocellular injury ), మూత్రాంగ వైఫల్యము ( renal failure ) వంటి ఉపద్రవములు కలిగే అవకాశములు ఉన్నాయి. అట్టి పరిణామములను గమనించి వాటికి తగిన చికిత్స చేయాలి. 

వడదెబ్బ ( ఉష్ణఘాతము Heat stroke ) 


    వడదెబ్బ ( ఉష్ణఘాతము ) తగిలిన వారికి శరీరాంతర ఉష్ణోగ్రత ( core body temperature ) 105 డిగ్రీల ఫాహ్రెన్ హైట్ ( 40.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ) గాని, అంతకు మించి గాని ఉండి కేంద్ర నాడీమండల వ్యాపారములో విలక్షణములు కనిపిస్తాయి. వీరిలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ లోపిస్తుంది.

    వడదెబ్బను అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. సత్వరముగా చికిత్స చేసినట్లయితే ప్రాణాపాయమును నివారించవచ్చును. చికిత్స ఆలస్యము అయినకొలది రోగులు మృత్యువాత పడే అవకాశములు హెచ్చవుతుంటాయి.

    వడదెబ్బ శారీరకశ్రమ సహితము ( exertional ) గాని, శారీరక శ్రమరహితము ( nonexertional ) గాని కావచ్చును. 

    శరీర ఉష్ణోగ్రత తీవ్రతరము అయినపుడు శరీరములో మాంసకృత్తులు వికృతము ( denature ) చెందగలవు. అందువలన శరీర వ్యాపారక్రియలు ( metabolic activities ) మందగించుటే గాక, అంతర జీవవిషములు ( endotoxins ) కూడా విడుదల అవుతాయి. శరీరములో తాప ప్రతిస్పందన ( inflammatory response ) కూడా ప్రారంభము అవుతుంది. వివిధ అవయవములలో విలక్షణములు కలిగి అవయవ వ్యాపారములు వైఫల్యము చెంది మరణమునకు దారి తీస్తాయి.

వడదెబ్బ ( ఉష్ణఘాత ) లక్షణములు 


    వడదెబ్బకు గుఱైనవారిలో శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫాహ్రెన్ హైట్ గాని అంతకు మించి గాని ఉంటుంది. మానసిక ఆందోళన, అలజడి, గందరగోళము, కలవరము, మూర్ఛలు, స్మృతిభ్రంశము, అపస్మారకము వంటి మానసిక అవలక్షణములు కలుగుతాయి. వీరు నేలపై కూలిపోయి కనిపిస్తారు. చర్మము వేడిగా ఉంటుంది. చెమటలు బాగా పోయవచ్చును. చెమటలు లేనప్పుడు చర్మము పొడిగా ఉండవచ్చును. వీరిలో గుండె వేగము హెచ్చుగా ఉంటుంది. శ్వాస వేగము హెచ్చయి ఆయాసము పొడచూపవచ్చును. రక్తపీడనము తగ్గుతుంది. వడదెబ్బ ప్రభావము మెదడు, కాలేయములపై అధికముగా ఉంటుంది. చిన్నమెదడు ( cerebellum ) పై కూడా అధిక ప్రభావము ఉంటుంది. శరీర అస్థిరత ( ataxia ) తొలి లక్షణము కావచ్చును. 

    తీవ్ర జ్వరము ( hyperthermia ), అపస్మారకములను కలిగించే ఇతర వ్యాధులను దృష్టిలో పెట్టుకున్నా, పరిసరముల ఉష్ణోగ్రత, శారీరక ప్రయాస వంటి పరిస్థితుల బట్టి వడదెబ్బను ( heat stroke ) పసిగట్టి సత్వర వైద్యమును సమకూర్చాలి. వ్యాధిగ్రస్థుడు నేలకు కూలబడిన 30 నిమిషముల వ్యవధిలో చికిత్స మొదలు పెడితే మృత్యువును నూరు శాతము నివారించవచ్చును. శరీరాంతర ఉష్ణోగ్రత ఆసుపత్రులకు చేరేటప్పుడు 105.8 డిగీలు దాటి ఉన్నవారిలోను, హెచ్చుకాలము తీవ్రజ్వరము ఉన్నవారిలోను మృత్యువు అవకాశము 80 శాతము వఱకు ఉండవచ్చును. అందువలన రోగిని చల్లపఱచే ప్రక్రియలను వైద్యాలయములకు తరలించుటకు ముందే మొదలుపెట్టి మార్గములో కూడా కొనసాగించాలి.

    వడదెబ్బ తగిలిన వారిని వారి ఉష్ణోగ్రత తగ్గించుటకు ( తల తప్పించి మిగిలిన శరీరమును ) చల్లని నీటిలో ( 50 F ) గాని, మంచునీటిలో గాని ( 35.6 F - 41 F ) ముంచి ఉంచుట ఉత్తమ మార్గము.

    చల్లనీరు, మంచునీరు లభ్యము కానప్పుడు గోరువెచ్చని నీటిని ( 68 F) వాడవచ్చును. వారి శరీరాంతర ఉష్ణోగ్రతను ( core body temperature ) ఉష్ణమాపకము పురీషనాళములో ఉంచి కొలవాలి. శరీరాంతర ఉష్ణోగ్రత 101 F డిగ్రీలకు దిగేవఱకు చల్లపఱచే యత్నములను కొనసాగించాలి. 

    తడిగుడ్డలతో కప్పుట, పెద్ద ధమనులు ఉండే చోట్ల ( చంకలు, మెడ, మొలలు వద్ద ) మంచు పొట్లములు ఉంచుట, పంకాగాలులు, చల్లనీరు జల్లుల వంటి ప్రక్రియలను ఉయోగించినా వడదెబ్బ చికిత్సకు అవి అంత ఫలవంతములు కాదు.

    శరీరమును చల్లార్చే ప్రయత్నములు కొనసాగిస్తూ వ్యాధిగ్రస్థులను అత్యవసర వైద్యాలయములకు తరలించాలి. వైద్యాలయములలో శరీరాంతర ఉష్ణోగ్రతను 101 F డిగ్రీలకు తగ్గించే ప్రక్రియలు కొనసాగిస్తూ సిరల ద్వారా చల్లని లవణ జలములు ( cold saline ) ఇవ్వాలి. 

    జ్వరము తగ్గించు మందులు ( antipyretics ), డాంట్రొలీన్ ( Dantrolene ) వడదెబ్బకు పనిచేయవు.

    వడదెబ్బ ప్రాధమిక చికిత్స కొనసాగిస్తూ, వారికి రక్తకణ పరీక్షలు, జీవవ్యాపార పరీక్షలు [ complete metabolic panel ; విద్యుద్వాహక లవణములు ( electrolytes ), మూత్రాంగ వ్యాపార పరీక్షలు ( యూరియా నైట్రొజెన్ BUN, క్రియటినిన్ ( creatinine ), కాలేయ వ్యాపార పరీక్షలు ( liver function tests ), క్రియటినిన్ కైనేజ్ ( creatinine kinase )], మయోగ్లోబిన్ ( myoglobin ) ప్రమాణములు, రక్తఘనీభవన పరీక్షలు ( blood coagulation tests ), మూత్ర పరీక్షలు చెయ్యాలి. 

    వడదెబ్బకు లోనయిన వారిలో మూత్రాంగముల వైఫల్యము, శ్వాస వైఫల్యము, కాలేయపు అవలక్షణములు, అస్థికండర కణ విధ్వంసము ( rhabdomyolysis ), విద్యుద్వాహక లవణ భేదములు ( electrolyte imbalances ), విస్తృత రక్తనాళాంతర రక్తఘనీభవనము ( disseminated intravascular coagulation ) వంటి అవలక్షణములు కలిగే అవకాశము ఉన్నది. ఆయా అవలక్షణములు కనిపెట్టి తగిన చికిత్సలు చెయ్యాలి.

    వడదెబ్బ నుంచి కోలుకున్నవారు కనీసము వారము దినములు ఎట్టి శ్రమ, వ్యాయామములలో పాల్గొనకూడదు. పూర్తిగా కొలుకున్నాక చల్లని వాతావరణములో వ్యాయామము, క్రీడలు, శారీరక శ్రమలలో పరిమితముగ పాల్గొనుట మొదలిడి క్రమముగా కార్యకలాపములను పెంచవచ్చును.

ఉష్ణసంబంధ వ్యాధుల నివారణ 


    వేడి వాతావరణములో శ్రమించువారు, వసించువారు తఱచు ద్రవ పదార్థములను సేవించాలి. మంచినీళ్ళు, చక్కెరపానీయాలు రెండు మూడు లీటరుల వఱకు సేవించినా, లవణ సహిత పానీయములను కూడా సేవించుట మేలు. పలుచని, వదులు, లేతవర్ణపు దుస్తులు ధరించాలి.

    వేడి వాతావరణమునకు క్రమేణ అలవాటుపడాలి. పరిసర ఉష్ణోగ్రత అధికముగా ఉన్నపుడు పరిశ్రమ చేయకూడదు. తప్పనిసరి అయితే విరామ సమయములు తీసుకొని, చల్లని పానీయములు సేవిస్తూ ఉండాలి. లవణ నష్టములను కూడా పూరించాలి. మంచినీరు, చక్కెర పానీయాలు మాత్రమే అధికముగా ( మూడులీటరులకు మించి ) సేవించి, లవణనష్టములను పూరించకపోతే రక్తములో సోడియమ్ ప్రమాణములు తగ్గవచ్చును ( hyponatremia ). అధిక వాతావరణ ఉష్ణోగ్రతలు కలచోట్ల పనిచేసే వైద్య బృందములకు ఉష్ణ సంబంధ వ్యాధులను కనిపెట్టుటలోను, నిరూపిత చికిత్సా పద్ధతులలోను ( evidence based medical standards ) తగు శిక్షణ ఇయ్యాలి.

    వేసవి తీవ్రత హెచ్చుగా ఉన్నపుడు, వడగాడ్పులు వీచుతున్నపుడు వృద్ధులకు, గృహ విహీనులకు ప్రభుత్వములు సమాజములు శీతల వసతి గృహములను తాత్కాలికముగానైనా ఏర్పాటు చెయ్యాలి.


పదజాలము :
Ataxia = శరీర అస్థిరత ( గ.న )
Cardiac output = హృదయ ప్రసరణ ( రక్త ) ప్రమాణము
Circulating blood volume = దేహప్రసరణ రక్తప్రమాణము (గ.న )
Conduction = వహనము 
Contractility = సంకోచము 
Convection = సంవహనము
Core body temperature = శరీరాంతర ఉష్ణోగ్రత ( గ.న )
Dehydration = శోషణము
Diuretics = మూత్రకారకములు
Disseminated intravascular coagulation = విస్తృత రక్తనాళాంతర రక్తఘనీభవనము ( గ.న )
Endotoxins = అంతర జీవవిషములు
Enzymes = జీవోత్ప్రేరకములు ( గ.న )
Heat edema = వడ పొంగు ( గ.న )
Heat exhaustion = వడబడలిక ( గ.న )
Heat rash = చెమట కాయలు ; చెమట పొక్కులు ( గ.న )
Hyperthermia = తీవ్రజ్వరము ( గ.న )
Heat stroke = ఉష్ణఘాతము ; వడదెబ్బ
Heat syncope =  వడసొమ్మ ( గ.న )
Hypovolemia = రక్తప్రమాణ హీనత (గ.న )
Inflammatory response = తాప ప్రతిస్పందన ( గ.న )
Metabolism = శరీరవ్యాపకము ; జీవవ్యాపారము ( గ.న )
Peripheral vasodilation = దూర రక్తనాళ వ్యాకోచము ( గ.న )
Postural hypotension = స్థితి ప్రేరిత అల్ప( రక్త )పీడనము ( గ.న )
Radiation = వికిరణము 
Rhabdomyolysis = అస్థికండరకణ విధ్వంసము ( గ.న )
Viscera = ఉదరాంతర అవయవములు ( గ.న )

( వైద్యవిషయాలను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము .
ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...