16, సెప్టెంబర్ 2019, సోమవారం

శరీర రక్షణ వ్యవస్థ ( Immune System )






( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో  )


                       శరీర రక్షణ వ్యవస్థ

                      ( Immune System )


                                                                                              డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి

                                                  

    జంతుజాలపు మనుగడకు శరీరరక్షణ వ్యవస్థ చాలా అవసరము. సూక్ష్మాంగ జీవులు ( bacteria), విషజీవాంశములు ( viruses; First recorded in 1590–1600; from Latin vīrus“slime, poison”; akin to Sanskrit viṣá-, ), శిలీంధ్రములు ( fungi ), పరాన్నభుక్తులు ( parasites), జీవ విషములు ( toxins ), ఇతర మాంసకృత్తులు ( proteins  ), శర్కర మాంసకృత్తులు ( glycoproteins )  శరీరము లోనికి చొచ్చుకొని నిత్యము దాడి చేస్తుంటాయి. శరీర రక్షణ వ్యవస్థ వానిని తటస్థీకరించుటకు, నిర్మూలించుటకు యత్నిస్తుంది.

    దాడి చేసే సూక్ష్మజీవులు, విషజీవాంశములు, జీవవిషములు శరీరములోనికి ప్రవేశించకుండా చర్మము, శ్వాసపథము, జీర్ణమండలము, మూత్ర జననాంగములను కప్పే శ్లేష్మపు పొరలు ( mucous membranes ) చాలా వఱకు నివారిస్తూ దేహమునకు  రక్షణ చేకూరుస్తుంటాయి.

    దేహము దగ్గు, తుమ్ము  ప్రక్రియల వలన శ్వాస మార్గములోని వ్యాధి కారకములను ( pathogens  ), ప్రకోపకములను ( irritants ) శరీరము బయటకు నెట్టగలుగుతుంది. శ్వాస మార్గములోను, జీర్ణ మండలము లోను శ్లేష్మము ( mucous ) వ్యాధి కారకములను బంధించి తొలగించ గలుగుతుంది. జీర్ణాశయములోని ఉదజ హరికామ్లము ( hydrochloric acid ), జీర్ణాశయములోని రసములు, జీవోత్ప్రేరకములు ( enzymes  ) సూక్ష్మాంగ జీవులను నిర్మూలించుటకు ఉపయోగపడుతాయి.

    చెమటలోను, కన్నీళ్ళలోను, స్తన్యములోను, శ్వాసపథ స్రావములలోను, మూత్ర, జననాంగ పథములోను ఉండే రసాయనములు, lysozyme  వంటి  జీవోత్ప్రేరకములు ( enzymes ), సూక్ష్మాంగ జీవులను ధ్వంసము చేయుటకు ఉపయోగపడుతాయి.

    శరీరమునకు గాయములు తగిలిన వెంటనే స్రవించు రక్తము గడ్డకట్టి గాయములను పూడ్చుటకు తోడ్పడుతుంది. ఆపై గాయములను మాన్చు ప్రక్రియకు దేహము పూనుకుంటుంది. రోగ జనకములు ( pathogens ) గాయముల ద్వారా శరీరములోనికి చొరబడనీయకుండా నివారించుటకు ప్రయత్నము చేస్తుంది.

    అంతేకాక శరీరములో ప్రత్యేక రక్షణ వ్యవస్థ నిక్షిప్తమై ఉన్నది. ఎముకలలోని మజ్జలో బహుళ సామర్థ్య మూలకణముల  ( pluripotent stem cells ) నుంచి శ్వేత కణములు ఉత్పత్తి చెంది శరీర రక్షణలో పాల్గొంటాయి.


థైమస్ గ్రంథి ( Thymus gland ) 


    థైమస్ గ్రంథి ( thymus)  గళగ్రంథి ( thyroid gland ) క్రింద నుంచి ఛాతి పైభాగములో యిమిడి ఉంటుంది. ఇందులో టి - రసికణములు ( T- Lymphocytes ) ఉత్పత్తి చెంది, పరిపక్వము పొందుతాయి. టి- రసికణములు ( T- Lymphocytes  ) శరీర రక్షణలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. స్వయంప్రహరణ కణముల ( auto reactive ) నిర్మూలనము కూడా థైమస్ గ్రంథిలో జరుగుతుంది. స్వయంప్రహరణ వ్యాధులను ( auto immune diseases ) నివారించుటకు థైమస్ ( thymus ) గ్రంథి తోడ్పడుతుంది.


రసిగ్రంథులు ( Lymph glands ) 


    శరీరములో గజ్జలలోను, బాహుమూలములలోను, మెడలోను, ఉదరము లోపల, ఛాతి లోపల సముదాయములుగా ఉండే  రసిగ్రంథులు ( lymph glands ) వ్యాధి కారకములను ( pathogens) వడగట్టి అవి కలిగించు వ్యాధులను ( infections ) ఆ యా ప్రాంతములకు పరిమితము చేస్తాయి. 


ప్లీహము ( Spleen ) 


    ఉదరములో ఉండే ప్లీహము ( spleen ) రక్తము ద్వారా వచ్చే ప్రతిజనకములను ( antigens ) వడగట్టుతుంది. ఇందులో ఉండే రసికణములు ( lymphocytes ), ప్రతిజనకములను విచ్ఛేదించి, వాటికి ప్రతిరక్షకములను ( antibodies ) స్రావక కణముల ( Plasma cells ) ద్వారా తయారుచేయు ప్రక్రియకు దోహదకారి అవుతాయి.

    గొంతులో ఉండే గవదలు ( tonsils ), చిన్నప్రేవుల ( small intestines ) లోను, క్రిముకము ( appendix ) లోను ఉండే రసికణజాలము ( lymphoid tissue ) రక్షణ వ్యవస్థలో భాగములే.

    చర్మము, శ్లేష్మపు పొరల ( శ్లేష్మ త్వచము ; mucous membranes  ) ద్వారా వ్యాధి కారకములు ( pathogens ) శరీరములోనికి చొచ్చుకొన్నపుడు శరీర రక్షణ వ్యవస్థ రోగ జనకములను ( pathogens ) నిర్మూలించి, వాటిని  తటస్థీకరణము చేయుటకు ప్రయత్నిస్తుంది. ఈ రక్షణ వ్యవస్థ నిర్మాణము, వ్యాపారము క్లిష్టతరమైనను శాస్త్రజ్ఞుల కృషి వలన చాలా విషయములు ఎఱుకలోనికి వచ్చాయి. 

    ఈ శరీరరక్షణ వ్యవస్థలో  వివిధ కణములు, స్రావములు  ( secretions ) పాలుపంచుకుంటాయి. 

    రక్తములో ఎఱ్ఱకణములు ( erythrocytes ), తెల్లకణములు ( leukocytes ), రక్తఫలకములు ( platelets ), రక్త ద్రవము ( plasma ) ఉంటాయి. ఎఱ్ఱకణములు ప్రాణవాయువును కణజాలమునకు చేర్చుటకు ఉపయోగపడుతాయి. రక్తఫలకములు రక్తము గడ్డకట్టుటకు, రక్తస్రావము నివారించుటకు తోడ్పడుతాయి. తెల్లకణములు రోగ జనకములను  ( pathogens ) కబళించుటకు, నిర్మూలించుటకు ఉపయోగపడుతాయి. రక్తద్రవములో ( plasma ) ఉండే ప్రతిరక్షకములు ( antibodies ), ఇతర స్రావములు వ్యాధి కారకములను తటస్థీకరించుటకు తోడ్పడుతాయి.


                                                               కణ రక్షణ

తెల్లకణములు ( Leukocytes ) 




    తెల్లకణములు శరీర రక్షణలో పాల్గొంటాయి. తెల్లకణములు ఎముకల మజ్జలో బహుళ సామర్థ్య మూలకణముల ( pluripotent stem cells ) నుంచి ఉద్భవిస్తాయి. తెల్లకణములను కణికలు గల కణములు ( granulocytes ), కణికలు లేని కణములుగా ( non granulocytes ) విభజించవచ్చును.

    వీనిలో కణికల కణములు ( granulocytes ) అధికశాతములో ఉంటాయి. కణికల కణములలో న్యూక్లియస్ లు పలు కణుపులతో భాగములుగా ( మూడు నుంచి ఐదు వఱకు ) విభజించబడి ఉంటాయి. హెమటాక్సొలిన్ - యూసిన్ వర్ణకములు ( hematoxylin - eosin  pigments ) కలిపి సూక్ష్మదర్శినితో చూసినపుడు కణద్రవములో  కణికలు ( granules ) చుక్కలు వలె కనిపిస్తాయి. కణికల రంగు బట్టి ఇవి తటస్థ కణములు ( Neutrophils ), ఆమ్లాకర్షణ కణములు ( Acidophils or Eosinophils ), క్షారాకర్షణ కణములు (  Basophils ) అని మూడు రకములు.

తటస్థకణములు ( Neutrophils )


     రక్తములో హెచ్చు శాతపు ( 60- 70 శాతము )  శ్వేతకణములు తటస్థ కణములు. హెమటాక్సిలిన్, యూసిన్ వర్ణకములు (hematoxylin, eosin ) చేర్చినపుడు  వీటి కణద్రవములలో( plasma ) కణికలు లేత ఊదా రంగులో చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి. సూక్షజీవులు, శిలీంధ్రములు ( fungi ) శరీరములో ప్రవేశించినపుడు వీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి సూక్ష్మజీవులను, శిలీంధ్ర కణములను ( fungi ) కబళిస్తాయి ( phagocytosis ). పలు సూక్ష్మజీవులను కబళించి, వాటిని  నిర్మూలించిన పిదప ఈ కణములు మరణించుటచే చీము ఏర్పడుతుంది.

ఆమ్లాకర్షణ కణములు ( Eosinophils , Acidophils ) 


    హెమటాక్సిలిన్ - యూసిన్ వర్ణకములతో   కణద్రవములో వీటి కణికలు ( granules )  నారింజ రంగులో ఉంటాయి.  వీటి న్యూక్లియస్లు సాధారణముగా ఒక కణుపుతో రెండు భాగములుగా చీలి ఉంటాయి. రక్తపు శ్వేతకణములలో వీటి శాతము 2- నుంచి 4 వఱకు ఉంటుంది. కొక్కెపు క్రిములు ( hookworms  ), ఏటిక క్రిములు ( roundworms ), నారి క్రిములు ( Tape worms ) వంటి  పరాన్నభుక్తులు ( parasites ) దేహములో ప్రవేశించినపుడు, అసహన ( allergies ) వ్యాధులు కలిగినపుడు, ఉబ్బస వంటి వ్యాధులు కలిగినపుడు వీటి సంఖ్య పెరుగుతుంది. ఇవి విడుదల చేసే రసాయనములు పరాన్నభుక్తులను చంపుటకు ఉపయోగపడుతాయి. ఈ ఆమ్లాకర్షణ కణములు భక్షణలో ( phagocytosis ) పాల్గొనవు.

క్షారాకర్షణ కణములు ( Basophils ) 


    ఈ కణములలో న్యూక్లియస్లు రెండు, లేక మూడు భాగములుగా విభజించబడి ఉంటాయి. హెమటాక్సిలిన్, యూసిన్ ( hematoxylin, eosin ) వర్ణకములు కలిపినపుడు కణద్రవములో కణికలు ముదురు ఊదా రంగులో ఉంటాయి. ఈ కణికలలో హిష్టమిన్ ( histamine  ), హిపరిన్ ( heparin  ), ప్రోష్టాగ్లాండిన్స్ ( prostaglandins ) వంటి రసాయనములు ఉంటాయి. రక్తపు శ్వేతకణములలో వీటి శాతము 0.5 ఉంటుంది. కణజాలములో ఉండే స్తంభకణముల ( mast cells ) వలె ఇవి ఐజి-ఇ ని (  immunoglobulin E,  IgE ) ఆకర్షిస్తాయి. ప్రతిజనకములు ( antigens ) ఈ కణములపై ఉండు ఐజి-ఇ తో ( IgE ) సంధానము అయినపుడు రసాయనములను విడుదల చేసి అసహనములు (allergies  ), రక్షణ వికటత్వములను ( anaphylaxis ) కలిగిస్తాయి. తాప ప్రక్రియలలో కూడా ఇవి పాల్గొంటాయి.

కణికలు లేని శ్వేతకణములు 


రసికణములు ( lymphocytes ) 


    రసికణములు ( lymphocytes ) రక్తములో తెల్లకణములలో సుమారు ఇరవైశాతము ఉంటాయి. కణిక కణముల కంటె పరిమాణములో చిన్నవిగా ఉంటాయి. వీనిలో న్యూక్లియస్లు పెద్దవిగా ఉండి కణద్రవ ( cytoplasm ) పరిమాణము తక్కువగా ఉంటుంది. ఈ రసికణములు రెండు రకాలు. బి - రసికణములు ( B Lymphocytes  ), టి - రసికణములు ( T- Lymphocytes  ). రక్తప్రసరణలో 10- 15 శాతపు రసికణములు బి- రసికణములు ( B -lymphocytes ), 70- 80 శాతపు రసికణములు టి.రసికణములు ( T- lymphocytes ). సూక్ష్మదర్శినిలో ఒకేలా కనిపించినా, ప్రతిరక్షకములను ( antibodies ) ఉపయోగించి వీటిని వేఱుగా గుర్తించ వచ్చును. 

    బి - రసికణములు ( B-lymphocytes ) ప్రతిరక్షకముల ( antibodies ) ఉత్పత్తికి తోడ్పడుతాయి. టి - రసికణములు ( T- lymphocytes ) శరీరములో కణముల ద్వారా జరిగే  ఆలస్య  రక్షణ ప్రతిస్పందనల లోను ( delayed Immunological reactions ), మార్పిడి అవయవముల తిరస్కరణ ( transplant rejection ) లోను పాల్గొంటాయి.


ఏకకణములు ( Monocytes ) 



    రక్తములో 3 నుంచి 10 శాతపు తెల్లకణములు ఏక కణములు. మిగిలిన తెల్లకణముల కంటె ఇవి పెద్దవిగా ఉంటాయి. వీటి న్యూక్లియస్లు చిక్కుడు గింజల ఆకారములో ఉంటాయి. వీటి కణ ద్రవములో కణికలు ఉండవు. ఇవి సూక్ష్మజీవులను భక్షిస్తాయి. రోగ కారకములను ( pathogens ) భక్షించి వాటి భాగములను టి - రసికణములకు ( T- lymphocytes  ) జ్ఞప్తికై అందిస్తాయి. భవిష్యత్తులో ఆ రోగ కారకములు దేహములోనికి చొచ్చుకొన్నపుడు వాటిని రక్షణ స్రావకములతో ( immunoglobulins ) ఎదుర్కొనుటకు ఈ చర్య తోడ్పడుతుంది. ఈ ఏకకణములు ( monocytes ) ప్లీహములో ఎక్కువగా నిలువ ఉంటాయి. 

     ఏకకణములు రక్తమునుంచి అవయవముల కణజాలములకు కూడా చేరి పృధుభక్షక కణములుగా ( macrophages ) మార్పు చెందుతాయి. పృధుభక్షక కణములు  ( macrophages ) సూక్ష్మజీవులను భక్షిస్తాయి. మరణించిన కణజాల అవశేషములను, సూక్ష్మజీవుల అవశేషములను తొలగించుటకు, జీర్ణించుకొనుటకు ఈ పృధుభక్షక కణములు ( macrophages ) తోడ్పడుతాయి. 


స్రావక కణములు ( Plasma cells )  



    స్రావక కణములలో ( plasma cells ) న్యూక్లియస్లు ఒక ప్రక్కగా ఒరిగి ఉంటాయి. న్యూక్లియస్లలో డి ఎన్ ఎ పదార్థము చుక్కలుగా  గడియారపు ముఖము, లేక బండిచక్ర ఆకారములో పేర్చబడి ఉంటుంది. కణద్రవము క్షారకాకర్షణమై నీలవర్ణములో కనిపిస్తుంది. స్రావక కణములు, బి- రసికణములు ( B- lymphocytes ) నుంచి ఉద్భవిస్తాయి. ప్రతిజనకములను ( antigens ) కబళించిన బి రసికణములు ( B- lymphocytes ), ఏకకణములు ( monocytes ) ఆ ప్రతిజనకములను పెప్టైడు ( peptide ) ఖండములుగా  భేదించి ఆ ఖండములను టి-రసికణములకు ( T-Lymphocytes ) చేరుస్తాయి. ఆ టి-రసికణముల ప్రేరణతో  రసిగ్రంథులలోను ( lymph glands ), ప్లీహములోను ( spleen ) బి- రసికణములు ( B- Lymphocytes  ) స్రావక కణములుగా ( Plasma cells ) మార్పు చెందుతాయి. స్రావక కణములు ప్రతిరక్షకములను ( antibodies ) ఉత్పత్తి చేసి ఆ ప్రతిరక్షకములను రక్తములోనికి స్రవిస్తాయి. ప్రతిరక్షకములు ( antibodies  ) ప్రతిజనకములను ( antigens ) తటస్థీకరించు ప్రక్రియలో పాల్గొంటాయి.

                                      

               స్రావక రక్షణము ( Humoral immunity ) 



    శరీరములో రసికణములు ( Lymphocytes  ), స్రావక కణములు ( plasma Cells ) స్రవించు ప్రతిరక్షకములు ( antibodies, immunoglobulins ) సూక్ష్మజీవులను ( bacteria ), విషజీవాంశములను ( viruses ), జీవవిషములను ( toxins ) నిర్మూలించుటకు, తటస్థీకరించుటకు తోడ్పడుతాయి. 

    శరీరములోనికి చొచ్చుకొను సూక్ష్మజీవులు, శిలీంధ్రములు ( fungi  ), విషజీవాంశములు ( viruses ), జీవవిషములు ( toxins ), ప్రతిజనకములుగా ( antigens ) గుర్తించబడుతాయి. ప్రతిజనకముల ప్రేరణ వలన టి- రసికణములు ( T- Lymphocytes ), ఏకకణములు ( monocytes ) విడుదల చేయు సైటోకైన్లు ( cytokines  ) బి రసికణముల సమరూప వృద్ధిని ( cloning ) ప్రేరేపిస్తాయి. 

    ఈ బి రసికణములు ( B - Lymphocytes ) స్రావక కణములుగా ( plasma cells ) మార్పు చెందుతాయి. సమరూప స్రావక కణములు ఆ యా ప్రతిజనకములకు ప్రతిరక్షకములను ( antibodies ) ఉత్పత్తి చేస్తాయి.

    కొన్ని బి - రసికణములు మాత్రము జ్ఞాపక కణములుగా ( memory B cells ) మిగిలి ఉంటాయి. భవిష్యత్తులో అవే ప్రతిజనకములు ( antigens ) శరీరములోనికి చొచ్చుకొన్నపుడు ఈ జ్ఞాపక కణములు (  memory B cells ) వృద్ధిచెంది స్రావక కణములుగా ( plasma cells ) మారి ప్రతిరక్షకములను ( antibodies ) ఉత్పత్తి చేస్తాయి. ఆ విధముగా స్ఫురణ రక్షణ ( recall- immunity ) కలుగుతుంది. 

    తొలిసారిగా ఒక ప్రతిజనకము ( antigen, రోగజనకము - pathogen ) శరీరములోనికి చొచ్చుకున్నపుడు మొదటి 4-5 దినములు ప్రతిరక్షకములు ( antibodies ) రక్తములో కనిపించవు. ఆపై రెండవ దశలో మొదట ఐజిఎమ్ ( immunoglobulin-M, IgM ) ప్రతిరక్షకములు హెచ్చు ప్రమాణములో ఉత్పత్తి అవుతాయి. తరువాత  6-10 దినములకు ఆ ప్రతిజనకములకు ఐజి-జి IgG ప్రతిరక్షకముల ( immunoglobulin- G ) ఉత్పత్తి జరుగుతుంది. మూడవదశలో ప్రతిరక్షకముల ప్రమాణములు స్థిరపడి, నాల్గవ దశలో ప్రతిరక్షకముల ప్రమాణములు మందగిస్తాయి. ఐజి-జి ( IgG ) ప్రతిరక్షకములు చాలా కాలము రక్తములో ఉండి దీర్ఘకాలిక రక్షణను ( long term immunity ) సమకూర్చుతాయి. 

    శరీరములో ప్రతిరక్షకములు ( antibodies, immunoglobulins ) శర్కరమాంసకృత్తులు ( glycoproteins ). ఇవి Y ఆకారములో ఉంటాయి. ప్రతి ప్రతిరక్షకము ( immunoglobulin ) లోను రెండు తేలిక గొలుసులు ( light chains ), రెండు బరువు గొలుసులు ( heavy chains  ) ఉంటాయి. ఈ గొలుసులు చక్కెర ( oligosaccharides, glycans ), పెప్టైడుల ( పెప్టైడులు ఎమైనో ఆమ్ల సంధానము వలన ఏర్పడుతాయి. ) సముదాయములను కలిగి ఉంటాయి. 





    క్షీరదములలో ప్రతిరక్షకములను ఐదు తరగతులుగా విభజించవచ్చును.

 ప్రతిరక్షకము G ( immunoglobulin G, IgG )  


    ఇవి ప్రతిజనకము శరీరములో చొచ్చుకొన్న 10- 14 దినముల పిదప ఉత్పత్తి అవుతాయి. అందువలన ఇవి  ద్వితీయ రక్షణలో ( secondary immunity ) పాల్గొంటాయి. భవిష్యత్తులో శరీరము ప్రతిజనకముల పాలయినప్పుడు జ్ఞాపక కణములచే ( memory B cells ) ఇవి విరివిగా ఉత్పత్తి అయి స్ఫురణ రక్షణప్రక్రియకు ( recall immunity  ) తోడ్పడుతాయి. ప్రతిరక్షకములు జి లు ( IgG ) పరిమాణములో చిన్నవి, కణజాలము మధ్యకు చొచ్చుకొని ప్రతిజనకములను ( antigens, వ్యాధికారకములు, pathogens ) నిర్మూలించుటకు తోడ్పడుతాయి. 


   ప్రతిరక్షకము ఎమ్ ( immunoglobulin M - IgM ) 


    ప్రతిజనకములు శరీరములో చొచ్చుకున్నపుడు తొలిదినములలో ప్రతిరక్షకము ఎమ్ ( IgM ) లు ఉత్పత్తి అవుతాయి. అందువలన ఇవి ప్రాధమిక రక్షణలో పాల్గొంటాయి. ఇవి పరిమాణములో పెద్దవి. ప్రతిజనకములతో ( antigens ) కలిసి గుమికట్టి ( agglutination ) వాటి విచ్ఛేదనమునకు తోడ్పడుతాయి. 

ప్రతిరక్షకము ఎ ( immunoglobulin A, IgA ) 


    ఇవి శ్లేష్మపు పొరలలో ( mucosa ) ఉండి శ్లేష్మపు పొరలకు రక్షణ సమకూర్చుతాయి. ఇవి శ్వాస మార్గము, జీర్ణ మండలము, మూత్ర మార్గములకు రక్షణ ఇస్తాయి. కన్నీరు, లాలాజలము, క్షీరము వంటి బహిస్స్రావకములలో కూడా ప్రతిరక్షకము ఎ ( IgA ) లు ఉండి ప్రతిజనకములను ఎదుర్కొంటాయి. 

 

ప్రతిరక్షకము డి ( Immunoglobulin D, IgD ) 


    ఇవి రక్తములో తక్కువ ప్రమాణములలో ఉంటాయి. బి రసికణములపై ( B Lymphocytes ) ఉండి ప్రతిజనకములకు గ్రాహకములుగా ( receptors ) పనిచేస్తాయి. ఇవి క్షారాకర్షణ కణములను ( basophils ), స్తంభకణములను ( mast cells ) ఉత్తేజపరచి సూక్ష్మజీవులను విధ్వంసపఱచే రసాయనములను విడుదల చేయిస్తాయి. 


 ప్రతిరక్షకము ఇ ( Immunoglobulin E, IgE ) 


    ఇవి రక్తములో తక్కువ పరిమాణములో ఉంటాయి. అసహనములు ( atopy and allergy ) కలవారిలో వీటి ప్రమాణము అధికమవవచ్చును. ప్రతిజనకములు ( antigens ) శరీరములో ప్రవేశించినపుడు ఇవి ఉత్పత్తి చెంది క్షారాకర్షణ కణములకు ( basophils ), స్తంభకణములకు ( mast cells ) అంటుకొని ఉంటాయి. ప్రతిజనకములు మఱల శరీరములో ప్రవేశించినపుడు వాటితో సంధానమయి ఆ కణముల నుంచి హిష్టమిన్ ( histamine ), leukotrienes, interleukins వంటి తాప జనకములను విడుదలను చేయిస్తాయి. ఇవి పరాన్నభుక్తులను ఎదుర్కొనుటకు సహాయపడతాయి. ఇవి అసహనము ( allergy ), రక్షణ వికటత్వము ( anaphylaxis ) కలిగించుటలో  పాత్ర వహిస్తాయి. 


  సంపూరక వ్యవస్థ ( Complement system ) 


    శరీర రక్షణలో ప్రతిరక్షకములతో ( antibodies ) బాటు సంపూరక వ్యవస్థ ( Complement system ) ప్రముఖపాత్ర వహిస్తుంది. సంపూరక వ్యవస్థలో కణద్రవములో ఉండే కొన్ని మాంసకృత్తులు, శర్కర మాంసకృత్తులు ( glycoproteins ), కణముల పొరలపై ఉండే గ్రాహకములు ( receptors ) పాలుపంచుకుంటాయి. 

    ఈ సంపూరకములు శరీరముపై దాడి చేసే సూక్ష్మాంగ జీవుల భక్షణకు ( phagocytosis ), సూక్ష్మజీవుల కణకుడ్యముల విధ్వంసమునకు ( cell wall destruction ), తాప ప్రక్రియను ప్రోత్సహించి భక్షక కణములను ( phagocytes ) ఆకర్షించుటకు సహాయపడతాయి. 

    సంపూరకములు ( complements ) సూక్ష్మజీవులకు అంటుకొని తదుపరి భక్షక కణముల గ్రాహకములతో  ( receptors of phagocytes ) సంధానమవుతాయి. అప్పుడు భక్షక కణములు ఆ సూక్ష్మజీవులను భక్షించి వాటిని ధ్వంసము చేస్తాయి.

    ఇవి తాప ప్రక్రియను ప్రోత్సహించి భక్షక కణములను ( phagocytes ) రోగజనకముల ( pathogens ) దగ్గఱకు ఆకర్షిస్తాయి.

    సంపూరకములు ( complements - c5b, c6, c7, c8, c9 ) వ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల కణముల పొరలపై పరంపరముగా సంధానమయి కణవేష్టన ఆక్రమణ వ్యవస్థలను ( membrane attack complexes- MACs ) ఏర్పరుస్తాయి. ఈ కణవేష్టన ఆక్రమణ వ్యవస్థలు ( MACs ) సూక్ష్మజీవుల కణముల పొరలలో చిల్లులు పొడిచి సూక్ష్మజీవులను ధ్వంసము చేస్తాయి.

    సంపూరకములు విషజీవాంశముల ( viruses ) ధ్వంసములో కూడా తోడ్పడుతాయి.

    దేహములో రక్షణ వ్యవస్థ సక్రమముగా పనిచేయుట వలన శరీరము అనేక వ్యాధుల నుంచి సహజముగా కోలుకోగలుగుతు ఉంటుంది. సూక్ష్మాంగ జీవులు, శిలీంధ్రములు, విషజీవాంశములు, జీవ విషముల ఉధృతి అధికమయినపుడు తగిన ఔషధముల ప్రయోజనము బాగుగా కనిపించినా, సహజ వ్యవస్థలో లోపములు విస్తృతముగా ఉన్నపుడు ఔషధములు కూడా దీర్ఘకాలము ప్రయోజనము చేకూర్చజాలవు.




పదజాలము :


Viruses =  విషజీవాంశములు ( గ.న )
Toxins =  జీవ విషములు (గ.న )
Glycoproteins =  శర్కర మాంసకృత్తులు ( గ.న )
Immune system = దేహ రక్షణ వ్యవస్థ ( గ.న )
Mucosa =  శ్లేష్మపు పొర
Pathogens =  వ్యాధి కారకములు , రోగ జనకములు
Enzymes =  జీవోత్ప్రేరకములు ( గ.న )  ( జీవ + ఉత్ప్రేరకము ( Catalyst )
Pluripotent stem cells = బహుళ సామర్థ్య మూలకణములు ( గ.న )
Stem cells = మూల కణములు ( గ.న )
Thyroid = గళగ్రంథి 
Auto immune disease = స్వయంప్రహరణ వ్యాధులు ( గ.న )
Antigen = ప్రతిజనకము
Antibody = ప్రతిరక్షకము
Lymphocytes = రసికణములు  ( గ.న )
Platelets = రక్తఫలకములు ( గ.న )
Plasma= రక్తద్రవము ( గ.న )
Plasma cells = స్రావక కణములు ( గ. న )
Granulocytes = కణికల కణములు ( గ.న )
Non granulocytes = కణికరహిత కణములు ( గ.న )
Acidophils , Eosinophils = ఆమ్లాకర్షణ కణములు ( గ.న )
Basophils = క్షారాకర్షణ కణములు ( గ.న )
Neutrophils = తటస్థ కణములు ( గ.న )
Monocytes = ఏకకణములు ( గ.న )
Allergy = అసహనము ( గ.న )
Phagocytes = భక్షక కణములు
Mast cells , mastocytes = స్తంభ కణములు ( గ.న )
Macrophages = పృధుభక్షక కణములు (గ.న )
Humoral immunity = స్రావక రక్షణము ( గ.న )
Memory cells = జ్ఞాపక కణములు ( గ.న )
Recall immunity = స్ఫురణ రక్షణ ( గ.న )
Complement = సంపూరకము
Membrane attack complexes (MACs) = కణవేష్టన ఆక్రమణ వ్యవస్థలు ( గ.న )



( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )


21, ఆగస్టు 2019, బుధవారం

రక్షణ వికటత్వము ( Anaphylaxis )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) 


                             రక్షణ వికటత్వము           

                                ( Anaphylaxis )


                                                                         డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.

    జీవరాశులు అన్నీ యితర జీవులు, జీవాంశముల ఆక్రమణకు గురి అవుతుంటాయి. అందువలన అవి స్వరక్షణకు బయట, లోపల కూడా రక్షణ వ్యవస్థలను వృద్ధిచేసుకుంటాయి. జంతువులు, పక్షుల  రక్షణ వ్యవస్థలలో రక్షక కణములు, రక్షక స్రావకములు, రసిగ్రంథులు ( lymph glands, ప్లీహము ( spleen ) ముఖ్యపాత్రను నిర్వహిస్తాయి.

    విషజీవాంశములు ( viruses ; First recorded in 1590–1600; from Latin vīrus“slime, poison”; akin to Sanskrit viṣá-,), సూక్ష్మజీవులు ( bacteria ), పరాన్నభుక్తులు ( parasites  ), సొంత దేహమునకు చెందని మాంసకృత్తులు (foreign Proteins ), శర్కర మాంసకృత్తులు ( glycoproteins ) వంటి  పదార్థములు  దేహము లోనికి చొచ్చుకొన్నపుడు అవి రక్షణ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. రక్షణవ్యవస్థ స్పందనము వలన ప్రతిరక్షకములు ( antibodies ) ఉత్పత్తి అవుతాయి. ప్రతిరక్షకముల ఉత్పత్తిని ప్రేరేపించు పదార్థములు ప్రతిజనకములుగా ( antigens ) వ్యవహరింపబడుతాయి. దేహము  రక్షణ కణములతోను, ప్రతిరక్షకములు ( antibodies  ) తోను, ఇతర రక్షణ స్రావకముల తోను దాడిని ప్రతిఘటించి, దాడి సలిపే సూక్ష్మజీవులను చంపుటకు, విషజీవాంశములను ( viruses ), విషపదార్థములను తటస్థీకరించుటకు యత్నము చేస్తుంది. శరీర రక్షణకు ఈ ప్రక్రియ అవసరము .

    కాని ప్రతిజనకములకు ( antigens  ) ప్రతికూలముగా  రక్షణవ్యవస్థ  స్పందించుట వలన దేహమునకు ఒక్కొక్క సారి ప్రతికూల ఫలితములు  కలుగ వచ్చును. వీటిలో అసహనము ( allergy  ) వివిధ స్థాయిలలో ఉండవచ్చును. 

  రక్షణవ్యవస్థ ప్రతిస్పందన వలన తీవ్ర పరిణామములు త్వరగా వాటిల్లి రక్షణ వికటత్వము ( anaphylaxis ) కలుగవచ్చును. తీవ్ర రక్షణ వికటత్వమును ( anaphylaxis ) అత్యవసర పరిస్థితిగా పరిగణించి చికిత్స చేయాలి. రక్షణ వికటత్వము వలన ప్రాణాపాయము కూడా వాటిల్ల వచ్చును.


కారణములు 


రక్షణవ్యవస్థ ద్వారా కలిగే  వికటత్వము  ( Anaphylaxis mediated by Immune system ) 


    ఆహార పదార్థములు ; వేరుశనగ పిక్కలు, ఇతర పిక్కలు, కాయలు, పలుకులు, పాలు, గ్రుడ్లు, చేపల వలన, తేనెటీగలు ( bees ), కందిరీగలు ( wasps ), పులిచీమలు ( fire ants ) కుట్టడము వలన, ఔషధముల ( medicines ) వలన, రబ్బరు, రబ్బరుపాలు ( latex ) వలన, రక్తము, రక్తాంశముల వలన రక్షణవ్యవస్థ ఉత్పత్తి చేయు ప్రతిరక్షకములు ( immunoglobulins) కలిగించే రక్షణ వికటత్వము కలుగ వచ్చును. సాధారణముగ  ప్రతిరక్షకము -ఇ ( Immunoglobulin- E, IgE ) వలన ఈ వికటత్వము కలుగుతుంది. అసాధారణముగా ప్రతిరక్షకము - g ( immunoglobulin- G, IgG ) వలన వికటత్వము కలుగవచ్చును.

    ఉబ్బస వ్యాధి గలవారిలోను, ఇదివరలో ప్రతిజనకముల ( antigens ) బారిపడి ఐజి-ఇ  IgE ఉత్పత్తిచే అసహనము, వికటత్వము పొందిన వారిలోను ఈ వికటత్వము కలిగే అవకాశములు హెచ్చు.

రక్షణవ్యవస్థ ప్రమేయము లేక కలిగే రక్షణ వికటత్వములు

( Anaphylaxis not mediated by immune system ) 


    ఎక్స్ రే వ్యత్యాస పదార్థములు ( Radio contrast materials ), కొన్ని ఔషధములు ( తాప అవరోధకములు ( non steroidal antiinflammatory agents ), నల్లమందు సంబంధిత మందులు ( opioids ), ఏస్ ఇన్హిబిటర్లు ( ACE inhibitors  ), వేంకోమైసిన్ ( vancomycin ), కండర విశ్రామకములు ( muscle relaxants ), భౌతిక కారణములు ( శీతలము, వ్యాయామము ), రక్తశుద్ధి చికిత్సలు ( Hemodialysis ) రక్షణ వికటత్వమును కలిగించ వచ్చును.

    ఏబది సంవత్సరముల వయస్సు దాటిన వారిలోను, హృదయ వ్యాధులు, మూత్రాంగ వ్యాధులు కలవారిలోను, యిదివఱలో వికటత్వ లక్షణములు కలిగిన వారిలోను, అసహనములు ( allergies ) కలవారిలోను ఈ వికటత్వము కలిగే అవకాశములు హెచ్చు.

    అయొడిన్ అసహనము వలన కాని , జలచరములకు అసహనము కలిగిన వారిలో కాని రేడియో వ్యత్యాస పదార్థములకు ( Radio contrast materials ) అసహనము కలుగదు.

    స్తంభకణ వ్యాధి ( mastocytosis ) కల వారిలో స్తంభ కణములు అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యాధి కల వారిలో రక్షణ వికటత్వములు కలిగే అవకాశములు హెచ్చు.


వ్యాధి విధానము ( Pathophysiology )


    ప్రతిజనకములు ( antigens ) శరీరములోనికి ప్రవేశించినపుడు రక్షక కణములు ప్రేరేపించబడి ఆ ప్రతిజనకములను ఎదుర్కొనే ప్రతిరక్షకములను ( antibodies ) ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రతిరక్షకములలో ప్రతిరక్షకము - ఇ ( Immunoglobulin E, IgE ) అసహన ప్రక్రియను ( allergy ), వికటత్వ ప్రక్రియను ( anaphylaxis ) కలిగించుటలో పాల్గొంటుంది. ఈ ప్రతిరక్షకము - ఇ  ( IgE ) క్షారాకర్షణ కణములకు ( Basophils  ), సంధాన కణజాలములో  ( connective tissue  ) ఉండు స్తంభ కణములకు ( mast cells ) అంటుకొని ఉంటుంది.

    ప్రతిజనకములు  ( antigens  ) మరల శరీరములోనికి చొచ్చుకున్నపుడు అవి ప్రతిరక్షకము - ఇ ( IgE ) కి సంధానమయి  క్షారాకర్షణ కణముల ( basophils ) పైన, స్తంభకణముల ( mast cells ) పైన ఉండు fc గ్రాహకములకు ( fragment crystallizable receptors  ) చేర్చబడుతాయి. అపుడు ఆ కణములు ప్రేరేపించబడి వాటిలో కణికల ( granules ) రూపములో ఉన్న హిష్టమిన్ ( histamine  ), సీరోటోనిన్ ( Serotonin ), హెపరిన్ ( heparin ) వంటి  రసాయనములను విడుదల చేస్తాయి.

    ఈ రసాయనముల వలన సూక్ష్మరక్తనాళికలు స్రవించుట ( capillary leakage ), కణజాలములో పొంగు, మృదు కండరముల సంకోచములు దేహమంతటా కలిగి వికటత్వ లక్షణములను కలుగజేస్తాయి.

    రక్షణ వ్యవస్థ ప్రమేయము లేకుండా వికటత్వము కలిగించు పదార్థములు ప్రత్యక్షముగా క్షారాకర్షణ కణములు  ( basophils ), స్తంభకణములు ( mast cells ) నుంచి కణిక రూపములో ( granules ) ఉన్న రసాయనములను విడుదల చేసి వికటత్వ లక్షణములను కలిగిస్తాయి.


రక్షణ వికటత్వ లక్షణములు 


    అసహనము ఉండుటచే రక్షణ వికటత్వము ప్రతిరక్షకము -ఇ ( immunoglobulin E ) ద్వారా కలిగినా, అసహనము లేకుండా కలిగినా వికటత్వ లక్షణములలో తేడా ఉండదు. వ్యాధి లక్షణములు ప్రతిజనకముల ( antigens ) బారిపడిన  కొద్ది నిముషములలో కాని కొద్ది గంటలలో కాని పొడచూపవచ్చును.

    కొందఱిలో వ్యాధి లక్షణములు రెండు దశలలో కలుగవచ్చును. కొద్ది మందిలో లక్షణముల నుంచి చాలా గంటల వఱకు ఉపశమనము కలుగక పోవచ్చును. అందువలన వ్యాధిగ్రస్థులను చాలా గంటలు పర్యవేక్షించాలి.

    దుఱద, దద్దుర్లు ( urticaria ), చర్మము ఎఱుపెక్కుట, రక్తనాళములు స్రవించి పొంగులు ( angioedema ), కలుగుతాయి.

    స్వరపేటికలో పొంగు ( laryngeal edema ), స్వరపేటిక కండర దుస్సంకోచము ( laryngeal spasm ), శ్వాస నాళికల దుస్సంకోచముల ( bronchospasm ) వలన ఆయాసము, శ్వాసకు ఇబ్బంది, శ్వాస వైఫల్యము ( Respiratory failure ) కలుగ వచ్చును.

    రక్తనాళములలో బిగుతు తగ్గుట వలనను, రక్తనాళములు స్రవించుటచే రక్తనాళములలో రక్తపరిమాణము తగ్గుట వలనను  రక్తపీడనము తగ్గి వివిధ అవయవములకు రక్తప్రసరణ తగ్గవచ్చును. రక్తపీడనము బాగా తగ్గి అవయవములకు  రక్తప్రసరణ తగ్గుటను వైద్యులు ఆఘాతముగా ( Shock ) వర్ణిస్తారు.

    మృదు కండరముల సంకోచము, బిగుతుల వలన కడుపు, పొత్తి కడుపులలో పీకు, నొప్పి, వమన భావన ( వాంతి కలిగేటట్లు అనిపించుట nausea ), వాంతులు, విరేచనములు కలుగ వచ్చును.

    రక్తప్రసరణ వైఫల్యము, శ్వాస వైఫల్యము మృత్యువునకు దారితీయవచ్చును. అందువలన రక్షణ వికటత్వమును ( anaphylaxis ) అత్యవసర పరిస్థితిగా ఎంచి తక్షణ చికిత్స అందించవలసి ఉంటుంది. వైద్యులు రోగి నుంచి రోగ సమాచారమును త్వరగా తీసుకొంటూ, సత్వర పరీక్ష చేస్తూనే, చికిత్స కూడా వెంటనే ప్రారంభించాలి. కాలయాపన తగదు.

    రోగి సమాచారములో, ఏ మందులు, ఏ ఆహారములు, లేక, ఏ ఇతర కారణముల వలన వికటత్వము కలిగినదో తెలుసుకోవాలి. వాటి బారినపడిన ఎంత సమయములో వ్యాధి లక్షణములు కలిగాయో, ఏ లక్షణములు పొడచూపాయో తెలుసుకోవాలి.

    జీవ లక్షణములు ( vital signs  ): ధమని వేగము ( pulse rate ), రక్తపీడనము ( blood pressure), శ్వాస వేగము ( respiratory rate ) ధమనీ ప్రాణవాయు సంపృక్తత ( pulse Oxygen saturation ) లను నిర్ణయించాలి.

    నోటిని, అంగుటిని, నాలుకను పొంగులకు, శ్వాస అవరోధమునకు పరీక్షించాలి. స్వరపేటికలో పొంగు ( laryngeal edema ), స్వరపేటిక బిగుతులకు ( laryngeal spasm ), ఊపిరితిత్తులను పరీక్షించి, శ్వాసనాళికల బిగుతును, శ్వాస స్థితిని తెలుసుకోవాలి.

    హృదయ పరీక్ష, ఉదర పరీక్షలు కూడా త్వరగా నిర్వర్తించాలి. చర్మమును దద్దుర్లకు, విస్ఫోటమునకు ( rash ), ఎఱ్ఱదనమునకు, పొంగులకు  పరీక్షించాలి.

    రక్షణ వికటత్వ లక్షణముల తీవ్రత తక్కువగాను, మధ్యస్థముగాను, ఎక్కువగాను ఉండవచ్చును.


  రక్షణ వికటత్వమును పోలు ఇతర వ్యాధులు 


    ఆహార పదార్థములలో సల్ఫైటుల వలన, పాడయిన చేపలలో హిష్టమిన్ ను పోలిన పదార్థములు ఉండుట వలన ముఖము, శరీరము ఎఱ్ఱబడి రక్షణ వికటత్వమును పోలవచ్చును.

    వేంకోమైసిన్ ( vancomycin )  అనే ఔషధమును  సిరల ద్వారా బొట్లధారగా త్వరగా  ఇచ్చునపుడు ముఖము, దేహము ఎఱ్ఱబడి, దురదను, మంటను కలిగించవచ్చును. దీనిని Redman syndrome గా వర్ణిస్తారు. అది అసహనము ( allergy ) కాదు. హిష్టమిన్ అవరోధకములను ( antihistamines ) ముందు ఇచ్చి, వేంకోమైసిన్ ( vancomycin ) బొట్లధారను నెమ్మదిగా ఇచ్చుటచే  ఈ ఎఱ్ఱ మనిషి ఉపద్రవమును అరికట్టవచ్చును.

    కార్సినాయిడ్ సిండ్రోమ్ ( carcinoid syndrome ) అనే వ్యాధిలోను, ఫియోఖ్రోమోసైటోమా ( pheochromocytoma ) వ్యాధిలోను కూడా పరంపరలుగా ముఖము, దేహము ఎఱ్ఱబడుతాయి. మద్యము తాగినవారిలోను ఎఱ్ఱదనము కనిపించవచ్చును.

    హృద్రోగముల వలన, రక్తస్రావము వలన, సూక్ష్మజీవ విషమయ వ్యాధుల ( sepsis ) వలన రక్తపీడనము తగ్గి ఆయాసము, ముచ్చెమటలు కలుగవచ్చును. ఆఘాతమునకు ( shock ) సరియైన కారణమును నిర్ణయించాలి.

వ్యాధి నిర్ణయము 


    రక్షణ వికటత్వమును సత్వరముగ రోగ లక్షణములతో ధ్రువపఱచి వెనువెంటనే చికిత్స చేయాలి. రక్తపరీక్షలైనా , ఇతర పరీక్షలయినా ఇతర వ్యాధులను కనుగొనుటకు అసహనతలకు కారణాలు తెలుసుకొనుటకు మాత్రమే ఉపయోగపడుతాయి.

    రక్తములో సంబంధించిన ఐజి-ఇ ( IgE ) ప్రతిరక్షకములను  ( antibodies ) కనిపెట్టి వాటి విలువలతో అసహనములను నిర్ణయించవచ్చును.

    రక్తములో ట్రిప్టేజ్ ( tryptase ) ప్రమాణములను కనుగొనవచ్చును. రక్షణ వికటత్వము కలిగిన ఒక గంటలో ట్రిప్టేజ్ విలువలు పెరుగుతాయి. ఆరు గంటల పిదప ఈ విలువలు క్రమముగా తగ్గుతాయి.

    చర్మపు పైపొరలో ( intradermal ) చాలా తక్కువ మోతాదులలో, వినీలపఱచి  అనుమానము ఉన్న పదార్థములను సూదిమందుగా ఇచ్చి అసహనములను గుర్తించవచ్చును. ఈ పరీక్షలు నిర్వహించునపుడు జాగ్రత్త అవసరము. వికటత్వ లక్షణములు పొడచూపితే తక్షణ చికిత్స అవసరము.


చికిత్స 



    రక్షణ వికటత్వమును ( Anaphylaxis  ) రోగ సమాచారము, లక్షణములబట్టి  త్వరగా గుర్తించి చికిత్సను సత్వరముగా అందించాలి.

    రక్షణ వికటత్వమునకు చికిత్స ఎపినెఫ్రిన్ ( Epinephrine ). ఎపినెఫ్రిన్ ను ఎడ్రినలిన్ అని కూడా వ్యవహరిస్తారు. దీనిని తొడ వెలుపలి భాగపు కండరములలో సూదిమందుగా ( intramuscular injection  ) ఇయ్యాలి. ( తొడ వెలుపలి భాగములో ముఖ్యమైన రక్తనాళములు, నాడులు ఉండవు. ) వయోజనులలో  0.3 మి.గ్రా నుంచి 0.5 మి.గ్రా. వఱకు (1 : 1000 ద్రావణములో 0.3 - 0.5 మి.లీ ) సూదిమందుగా ఇవ్వవచ్చును. రక్తపీడనము తక్కువగా ఉన్నవారిలోను, శ్వాస యిబ్బంది కొనసాగేవారిలోను ప్రతి 10- 15 నిముషములకు ఈ మోతాదును మఱల మఱల కొనసాగించాలి.

    పిల్లలలో ఎపినెఫ్రిన్ ను 0.01 మి.గ్రా / 1 కిలో శరీరపు బరువు చొప్పున మొత్తము 0.1 మి.గ్రా నుంచి 0.3 మి.గ్రా వఱకు ఇవ్వాలి ( 1 : 1000 ద్రావణములో 0.1 - 0.3 మి.లీ )

    రక్తపీడనము తక్కువగా ఉన్నవారిలోను, శ్వాస శ్రమ అధికముగా ఉన్నవారిలోను ఎపినెఫ్రిన్ ను నాలుక క్రింద ( sublingual ) కూడా ఈయవచ్చును.

    కేంద్ర సిరల ద్నారా ( Internal jugular vein, or Subclavian vein or Femoral vein ) ద్వారా కూడా ఎపినెఫ్రిన్  3 - 5 మి.లీ 1: 10,000  ద్రావణమును ఈయవచ్చును.

    శ్వాస నాళములో శ్వాసకై ( శ్వాసనాళాంతర ) కృత్రిమ నాళము ( endotracheal tube ) అమర్చితే, ఆ నాళము ద్వారా కూడా ఎపినెఫ్రిన్  3-5 మి.లీ  1 : 10,000 ద్రావణమును 10 మి.లీ లవణ ద్రావణములో వినీలపఱచి ఈయవచ్చును.

    వ్యాధిగ్రస్థుల శ్వాసక్రియను పరిశీలించాలి. 100 % ప్రాణవాయువు అందఱికీ అందించాలి.

    శ్వాస నాళికలలో మృదుకండరముల బిగుతు ఎక్కువయితే బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములను ( beta adrenergic receptor agonists ) శ్వాస ద్వారా ఇయ్యాలి.

    నాలుక, కొండనాలుక, గొంతుకలలో పొంగు ఉన్నా, స్వరపేటికలో పొంగు ఉన్నా, స్వరపేటికలో కండరములు బిగించుకుపోయినా ( laryngeal spasm ),  శ్వాస వైఫల్యము ఉన్నా, శ్వాస నాళములోనికి నోటి ద్వారా  కాని ముక్కు ద్వారా కాని  కృత్రిమ ( శ్వాసనాళాంతర ) నాళమును ( endotracheal tube ) చొప్పించి కృత్రిమశ్వాసలు అందించాలి.

    కృత్రిమ శ్వాసనాళమును చొప్పించుట సాధ్యము కాని వారిలో స్వరపేటిక క్రింద ఉన్న  క్రైకో-థైరాయిడ్ పొరలో రంధ్రము చేసికాని ( crico thyroidotomy ), శ్వాస నాళములో రంధ్రము చేసికాని ( Tracheostomy ) శ్వాస నాళములోనికి కృత్రిమ నాళమును శ్వాసకై అమర్చి కృత్రిమ శ్వాసలను అందించాలి.


ద్రావణములు 


    రక్షణ వికటత్వము కల వారికి సిరల ద్వారా లవణ ద్రావణములను ( normal saline ) ఇవ్వాలి. రక్తపీడనము తక్కువగా ఉంటే 500 - 1000 మి.లీ లవణ ద్రావణమును ( normal saline ) సిర ద్వారా 15-30 నిముషములలో త్వరగా యిచ్చి ఆపై అవసరమునకు తగ్గట్టు సిరల ద్వారా ద్రావణములను ఇయ్యాలి.

గ్లూకగాన్ ( Glucagon ) 


    బీటా గ్రాహక అవరోధకములు ( beta adrenergic receptor blockers ) వాడే వారిలో రక్షణ వికటత్వ లక్షణములు తీవ్రముగా ఉండి చికిత్సకు ప్రతిఘటన ఉంటుంది. వీరు త్వరగా కోలుకోరు. వీరికి గ్లూకగాన్ ( Glucagon ) అవసరము. 1 మి.గ్రా. సిర ద్వారా యిచ్చి ఆపై సిర ద్వారా గంటకు 1 మి. గ్రా ను బొట్లధారగా  ఇవ్వాలి.

గ్లూకోకార్టికాయిడ్స్ ( Glucocorticoids ) 


    రక్షణ వికటత్వము గల వారిలో గ్లూకోకార్టికాయిడ్స్ వలన తక్షణ ప్రయోజనము చాలా తక్కువ. దశల వారిగా వికటత్వము తిరుగబడకుండా ఉండుటకు మిథైల్ ప్రెడ్నిసలోన్  (methylprednisolone ) దినమునకు శరీరపు  ప్రతి కిలోగ్రాము బరువునకు  1-2 మి.గ్రా. చొప్పున ఒకటి, రెండు దినములు వాడవచ్చును.

హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ( Antihistamines ) 


    దురద, దద్దుర్లు, చర్మ విస్ఫోటము గల వారిలో  డైఫెన్ హైడ్రమిన్ (  diphenhydramine  (Benadryl ) 25 మి.గ్రా - 50 మి.గ్రా లు కండరముల ద్వారా కాని, సిర ద్వారా కాని ఈయవచ్చును. వీటి వలన  వికటత్వ లక్షణములు వెంటనే ఉపశమించవు.

    వీరిలో హిష్టమిన్ -2 గ్రాహక అవరోధకములను కూడా వాడవచ్చును.

    తేనెటీగలకు, కందిరీగలకు, పులిచీమలకు అసహనము కలవారు, వికటత్వ లక్షణములు కలిగినవారు తేనెటీగలు, కందిరీగలు కుట్టిన వెంటనే సత్వరముగ తమకు తాము ఎపినెఫ్రిన్ ను తొడ కండరములలో తీసుకొనుటకు EpiPen లు లభ్యము .

నివారణ 


    అసహనము కల ఆహారపదార్థములను, ఔషధములను వాడకూడదు.

    తేనెటీగలు, కందిరీగలకు దూరముగా ఉండాలి. వాటికి దగ్గఱలో మసలేటప్పుడు వాటిని రెచ్చగొట్టకూడదు.

     వైద్యులు వేంకోమైసిన్ ( vancomycin )  సిరల ద్వారా  బొట్లగా ఇచ్చేటపుడు తగిన వ్యవధిలో నెమ్మదిగా ఇవ్వాలి. అవసరమైతే డైఫెన్ హైడ్రమిన్ ను ( Diphenhydramine ) కూడా ముందుగా ఈయవచ్చును.

    రేడియో వ్యత్యాస పదార్థములను ఎక్స్ - రే ల కొఱకు వాడునపుడు అవసరమైన వారికి ముందుగా ప్రెడ్నిసోన్ ( Prednisone ), డైఫెన్ హైడ్రమిన్ ( Diphenhydramine ) వాడాలి.

      వైద్యులు , వైద్యశాలలు ఎపినెఫ్రిన్ ను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుకొవాలి.

  
    రక్షణ వికటత్వము కలిగిన రోగులకు అత్యవసర చికిత్స అవసరము కాబట్టి దగ్గఱలో ఉన్న వైద్యుల ఒద్దకో దగ్గఱలో అందుబాటులో ఉన్న వైద్యశాలలకో  వెళ్ళుట మేలు. చికిత్సకై ఎపినెఫ్రిన్  వాడుటకు వైద్యులు సంశయించకూడదు. చికిత్సలో జాప్యము కూడదు.

రక్షణ చికిత్స ( Immunotherapy  ) 


    వినీల ప్రతిజనకములను ( allergens ) తక్కువ మోతాదులలో మొదలుపెట్టి యిస్తూ, క్రమరీతిలో మోతాదులను పెంచుకొంటూ, శరీరములో అసహనమును అణచు రక్షణ చికిత్సలు ( suppressive immunotherapies ) లభ్యము. తేనెటీగలు, కందిరీగలు, పులిచీమల విషములకు రక్షణ చికిత్సలను విరివిగా వాడుతారు.



పదకోశము :



Allergies = అసహనములు
Anaphylaxis = రక్షణ వికటత్వము ( గ.న )
Antibodies = ప్రతిరక్షకములు  
antigens = ప్రతిజనకములు 
Anti inflammatory agents = తాప అవరోధకములు ( గ.న )
Antihistamines = హిష్టమిన్ అవరోధకములు ; హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ( గ.న )
Bacteria = సూక్ష్మజీవులు 
Basophils = క్షారాకర్షణ కణములు ( గ.న )
Beta adrenergic receptor agonists = బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములు (గ.న )
Beta adrenergic receptor blockers = బీటా గ్రాహక అవరోధకములు ( గ.న )
Central veins = కేంద్ర సిరలు ( గ.న )
Contrast materials =  వ్యత్యాస పదార్థములు 
Connective tissue = సంధాన కణజాలము 
Endotracheal tube = శ్వాసనాళాంతర ( కృత్రిమ ) నాళము
Glycoproteins = శర్కర మాంసకృత్తులు ( గ.న )
Granules =  కణికలు
Immunoglobulins = రక్షక మాంసకృత్తులు ; ప్రతిరక్షకములు ( గ.న )
Laryngeal edema = స్వరపేటికలో పొంగు ( గ.న )
Lymph glands = రసిగ్రంథులు 
Laryngeal spasm = స్వరపేటిక బిగుతు ( గ.న )
Mast cells = స్తంభ కణములు ( గ.న )
Mastocytosis = స్తంభకణ వ్యాధి ( గ.న )
Muscle relaxants = కండర విశ్రామకములు ( గ.న )
Nausea = వమన భావన ( గ.న ) ; డోకు
Oxygen saturation= ప్రాణవాయు సంపృక్తత 
Parasites  = పరాన్నభుక్తులు 
Rash = విస్ఫోటము
Respiratory failure = శ్వాస వైఫల్యము 
Sepsis  = సూక్షజీవ విషమయము ( గ.న )
Shock = ఆఘాతము 
Spleen = ప్లీహము
Suppressive immunotherapies = అసహనమును అణచు రక్షణచికిత్సలు 
Urticaria = దద్దుర్లు 
Viruses  = విషజీవాంశములు ( గ.న )
Vital signs  = జీవ లక్షణములు ( గ.న )

( ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )

7, జులై 2019, ఆదివారం

ధూమపానము

                                                   
                                              ఇంటికి సెగనుం బెట్టరు,
                                              కంటికిఁ బొగ పెట్టిరేని కారును జలముల్ ;
                                              పెంటా ? యూపిరితిత్తులు  ?
                                              మంటలఁ దెగఁ బాలుసేయ మానక పొగలన్ ! 

                                                    
                                              
  ( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో  ):

                               పొగాకు ; ధూమపానము


                                                           డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .


పొగాకు వ్యసనము 



    పొగాకు అమెరికా ఖండములో చాలా శతాబ్దాల క్రితమే  పుట్టినా పదిహైనవ శతాబ్దములో స్పైనుకు చేరి  క్రమంగా యూరప్, ఆసియా, ప్రపంచ మంతా వ్యాపించింది. చుట్టలు, సిగరెట్లు, బీడీలు, పైపులూ ద్వారా ధూమరూపములోను, నస్యరూపములోను పీల్చబడి, గూట్కా రూపములోను, నములుడు పొగాకుగాను మ్రింగబడి  వినియోగించబడుతుంది.
    
    పొగాకు వినియోగము ఆరంభములో నాగరికత చిహ్నముగా పరిగణించబడినా పందొమ్మిదవ శతాబ్దములో దానివలన కలిగే దుష్ఫలితాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ దుష్ఫలితాల తీవ్రత కారణంగా పొగాకు వినియోగమును ఒక వ్యాధిగా పరిగణించవలసిన పరిస్థితి ఏర్పడింది.

    ధూమపానమువలన కలిగే దుష్ఫలితాలను నేను వైద్యవిద్యార్థిగా నేర్చుకొన్నా, వైద్యమును అభ్యసిస్తున్న కొద్ది సంవత్సరములలోనే ప్రత్యక్షముగా చూడడము వలన పొగాకు కలిగించే ప్రమాదాలు ప్రస్ఫుటముగా తెలిసాయి. పొగత్రాగేవారు సగటున పది సంవత్సరాల ఆయువును కోల్పోతున్నట్లు గమనించాను.  అదే విషయము వైజ్ఞానిక పత్రికలలో ప్రచురించబడుట చూసాను. ధూమపానము ఊపిరితిత్తుల పుట్టకురుపులకు ( Cancers ) కారణమని తెలిసినా, అంతకంటే ఎక్కువగా ధూమపానము చేసేవారు  నడివయస్సులోనే గుండెపోటులకు ( Heart attacks ), మస్తిష్క విఘాతములకు ( Cerebrovascular accidents ) గురికావడము, మరణించడము కూడా గమనించాను. శ్వాసకోశవ్యాధులు ( Pulmonary diseases) కూడా విపరీతముగా పొగత్రాగేవారిలోనే చూస్తాము. దీర్ఘకాల శ్వాసఅవరోధక వ్యాధులు (  Chronic obstructive pulmonary diseases ) ఊపిరితిత్తుల వ్యాకోచవ్యాధులు ( Emphysema ) కలిగి పొగత్రాగేవారు దగ్గు, ఆయాసాలతో బాధపడి చాలా జీవితకాలము కోల్పోవుట వైద్యులము నిత్యం చూస్తాము. పొగత్రాగేవారిలో కనీసము ఏభై శాతమునకు తగ్గకుండా  అనారోగ్య దుష్ఫలితాలకు గుఱి అవుతారు. ధమనీ కాఠిన్యము ( Atherosclerosis) కలిగి రక్త ప్రసరణ లోపాలతో వివిధ అవయవాలు దెబ్బతినడమువలన, పెక్కు కర్కటవ్రణములు ( cancers )  కలిగించే రసాయనములు ( Carcinogens) వలన ఊపిరితిత్తులు, మరియు యితర అవయవాలలో కర్కట వ్రణములు ( Cancers ) పుట్టడము వలన  ఆయుః క్షీణము, నడివయస్సు  మరణాలు సంభవిస్తాయి. అందువలన, నా రోగులకే కాక, మిత్రులకు, బంధువులకు, పొగ త్రాగుట వలదని సలహా ఇస్తాను. పాఠకులలోను, మిత్రులలోను పొగ త్రాగేవారుంటే ఒక నిర్ణీత ప్రణాళిక ప్రకారము త్వరగా ఆ అలవాటును మాన్చుకోవలసిందిగా వినతి చేస్తున్నాను. ఆ అలవాటును దరి చేరనీయరాదని పిల్లలకు, పాపలకు చెప్పుకోవాలి. పొగాకు వినియోగము, ధూమపానాల వలన కలిగే వ్యాధులను ఇక్కడ ఒక జాబితాగా పొందుపరుస్తాను.

కర్కటవ్రణములు  ( Cancers ) 


    పుట్టకురుపులుగా ప్రచారములో ఉన్న యీ క్రొత్త పెరుగుదలలు జన్యువులలో మార్పులు ( Mutations ) కలిగి కణములు శిథిలము చెందక త్వరితముగా పెరిగి విభజనలు పొందుట వలన పుడతాయి. ఈ పెరుగుదలలు అవయవముల లోనికి మూలములతో ఎండ్రకాయల కాళ్ళ వలె చొచ్చుకుపోవడము వలన వాటికి కర్కటవ్రణములు అని (cancers ) పేరు కలిగింది. ఈ వ్రణముల కణములు ఆ యా అవయవ కణజాలములుగా పరిణతి చెందకుండా విభజనలతో పెరుగుదలలుగా వృద్ధి పొందుతాయి. కొన్ని కణములు రక్తనాళములలోనికి, రసనాళికలలోనికి ( lymphatic channels ) ప్రవేశించి  రక్తప్రసరణ ద్వారా వివిధ అవయవములకు, రసనాళికల ద్వారా రసగ్రంథులకు ( lymph nodes ) వ్యాప్తిచెంది అచ్చట కొత్త వ్రణములను ( metastasis ; అవయవాంతర వ్యాప్తి ) సృష్టిస్తాయి. ఇవి పోషకపదార్థాలను సంగ్రహిస్తాయి. ఈ వ్రణములు అవయవాల దైనందిక వ్యాపారములకు అంతరాయము కలిగిస్తాయి. పోషకపదార్థాలు అవయవాలకు తగినంతగా చేరకపోవుటవలన, ఆకలి తగ్గుటవలన, అరుచి కలుగుటవలన రోగులు చిక్కిపోతుంటారు. తగిన చికిత్స జరుగకపోయినా, చికిత్సకు అనుకూలించకపోయినా ఇవి మరణమునకు దారితీయవచ్చును.

    పొగాకు పొగలో ఉండే బెంజోపైరీన్ ( Benzopyrene ) వంటి పోలిసైక్లిక్ ఏరొమేటిక్ హైడ్రోకార్బనులు కణములలో డీ ఎన్ ఏ  కు ( D .N.A ) అంటుకొని మార్పులు ( mutations ) ద్వారా వాటిని కర్కటవ్రణ కణములుగా మారుస్తాయి. పొగాకు పొగలో పెక్కు కర్కటవ్రణజనకములు ( Carcinogens ) ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

    పొగత్రాగనివారి కంటె పొగత్రాగేవారిలో ఊపిరితిత్తుల పుట్టకురుపులు యిరవైరెట్లు అధికముగా కలుగుతాయి. పొగత్రాగేవారిలో ఊపిరితిత్తులలోనే కాక, మూత్రాంగములలోను ( Kidneys ), స్వరపేటికలలోను ( Larynx), మూత్రాశయములలోను ( Urinary bladder), అన్నవాహికలలోను ( Esophagus), జీర్ణాశయములలోను ( Gastric cancers ), క్లోమములలోను ( Pancreas) పుట్టకురుపులు కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇతర అవయవాలలో కర్కటవ్రణములు పుట్టుటకు కూడా ధూమపానము సహకరిస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఊపిరితిత్తులలో వచ్చే కాన్సరులు ప్రస్ఫుటమయ్యేసరికి తొంబయి శాతముమందిలో శస్త్రచికిత్స స్థాయిని దాటిపోతాయి. అందుచే చికిత్స  ఫలప్రదమయ్యే అవకాశము చాలామందిలో తక్కువ. పొగత్రాగకుండా వాటిని నిరోధించుట చాలా మేలు.

శ్వాసకోశవ్యాధులు ( Pulmonary diseases) 


    శ్వాసనాళ శాఖలలోను, వాటి చివరల ఉండే పుపుస గోళములలోను ( Alveoli) సాగుదల ఉంటుంది. ఆ సాగుదల ( Elasticity) వలన ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు బాగా జరిగి గాలి కదలికలు సరిగ్గా జరుగుతాయి. పొగత్రాగేవారిలో సాగు కణజాలము ( Elastic tissue) చెడి ఆ సాగుదల దెబ్బతింటుంది. అందువలన గాలి కదలికలకు అవరోధము కలుగుతుంది. సాగుదల త్రగ్గుటవలన ఊపిరితిత్తులు వ్యాకోచము ( ఊపిరితిత్తుల ఉబ్బు ; emphysema ) చెందుతాయి . శ్వాసనాళికల పూతకణములకు ఉండే కదలాడే సూక్ష్మకేశములు ( cilia ) కూడా పొగత్రాగేవారిలో పనిచెయ్యవు. అందుచే  శ్లేష్మస్రావకములు ( mucous secretions) తొలగించబడవు. వీరిలో తఱచు సూక్ష్మజీవులవలన వ్యాధులు కలుగుతాయి. వీరికి శ్వాస సరిగా ఆడక ఆయాసము, దగ్గు వస్తుంటాయి. వాయువుల మార్పిడి తగ్గుటవలన రక్తములో బొగ్గుపులుసు వాయువు ( Carbon dioxide) పరిమాణము పెరుగుట, ప్రాణవాయువు ( Oxygen) పరిమాణము తగ్గుట కూడా కలుగవచ్చును. శ్వాస అవరోధవ్యాధిని ( Obstructive pulmonary disease) చాలామంది ధూమపానీయులలో  వైద్యులు నిత్యము చూస్తారు .

క్షయ వ్యాధి 


ధూమపానము సలిపేవారికి క్షయవ్యాధి సోకే అవకాశములు కూడా పెరుగుతాయి. పొగత్రాగే వారికి క్షయవ్యాధి సోకితే వారిలో  ఔషధములుకు వ్యాధి ప్రతిఘటన ఎక్కువయి చికిత్స క్లిష్టతరము అవుతుంది. 


హృద్రోగములు, రక్తనాళపు వ్యాధులు                     

    రక్తనాళములలో ధమనుల గోడలమధ్య  వయస్సు పెరుగుతున్నకొలది కొలెష్ట్రాలు ( Cholesterol ), ఇతర కొవ్వులు చేరి మార్పులు జరిగి ధమనీకాఠిన్యత ( Atherosclerosis) కలుగుతుంది. పొగత్రాగేవారిలో  అల్పసాంద్రపు కొలెష్ట్రాలు ( LDL ) పెరుగుటయే కాక, ఆ కొలెష్ట్రాలు నాళములలో చేరి ధమనీ కాఠిన్యతను వేగపరుస్తుంది. ధమనులు కాఠిన్యత పొందినప్పుడు నాళపరిమాణము తగ్గి రక్తప్రవాహమునకు అవరోధము కలుగవచ్చు. రక్తము గడ్డకట్టుటకు తోడ్పడే తాంతవజని ( Fibrinogen ), రక్తఫలకములు ( Platelets ) కూడా పొగత్రాగేవారిలో విరివిగా ఉత్పత్తి చెందుతాయి.

    హృదయ ధమనులలో( Coronary arteries ) కాఠిన్యత పెరిగి రక్తము గడ్డకడితే హృదయకండరములకు రక్తప్రసరణ లోపించి గుండెపోటులు రావచ్చును. అదే విధముగా మెదడు రక్తప్రసరణకు అవరోధము కలుగుతే మస్తిష్క ( రక్తనాళ ) విఘాతములు ( Cerebrovascular accidents ) కలిగి పక్షవాతములు సంభవిస్తాయి.


    దూరధమనులలో రక్తప్రసరణ లోపాలు ( Peripheral arterial  diseases ) కలుగవచ్చును. రక్తప్రసరణ లోపాల వలన కాళ్ళు కోల్పోయినవారు తఱచు ధూమపానీయులే ! పొగత్రాగేవారిలో వారు పీల్చే కార్బను మోనాక్సైడు ( Carbon monoxide) ఎఱ్ఱకణాల హీమోగ్లోబిన్ తో ( Hemoglobin )  జతకూడుట వలన అవి పంపిణీ చేసే ప్రాణవాయువు ( Oxygen ) తగ్గుతుంది.

    ధమనీ కాఠిన్యత వలన పురుషులలో నపుంసకత్వము ( impotency ) కూడా కలుగుతుంది. మూత్రాంగముల వ్యాపారము కూడా పొగత్రాగేవారిలో క్షీణిస్తుంది. వివిధ అవయవాల వ్యాపారము దెబ్బతినుట వలన అంతర్గతముగాను, బాహ్యముగాను పొగత్రాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు  త్వరితగతిలో ప్రస్ఫుటము అవుతాయి. పిన్నవయస్సులోనే చర్మములో ముడుతలు పొడచూపుతాయి .

    ఈ వ్యాసములో పేర్కొన్న విషయాలను వైద్యవృత్తిలో ఉండుట వలన ప్రత్యక్షముగా ప్రతిదినము చూస్తాను. ధూమపానము వీడుట వలన చాలా రోగములు నివారించగలుగుతాము. ఎనభై, తొంబై సంవత్సరాలకు వచ్చే రోగములు, మరణములు నలభై, ఏభై సంవత్సరాలలో కలుగకుండా నివారించుట ఎంతో మేలు కదా !

    అందువలన  పొగత్రాగేవారు మొండివాదనలు, సాకులు, నెపాలు  మాని త్వరగా పొగత్రాగుట మానివేయుట ఉత్తమము. వైద్యులు, మందులు సహకరించినా, నా అనుభవములో ఆయా వ్యక్తుల పట్టుదల, లక్ష్యములే పొగత్రాగడము మానివేయుటకు తోడ్పడుతాయి. పిల్లలకు చిన్నతనము నుంచే పొగత్రాగరాదని  నూరిపొయ్యవలసిన అవసరము చాలా ఉంది.

పదజాలము :

Alveoli = పుపుస గోళములు ( గ.న )
Atherosclerosis = ధమనీ కాఠిన్యము 
Cancers = పుట్టకురుపులు ; కర్కటవ్రణములు ( గ.న )
Carcinogens = కర్కటవ్రణ జనకములు ( గ.న )
Cerebrovascular accidents = మస్తిష్క ( రక్తనాళ ) విఘాతములు ( గ.న )
Chronic obstructive pulmonary disease = దీర్ఘకాలిక శ్వాస అవరోధక వ్యాధి ( గ.న )
Cilia = కదలాడే సూక్ష్మకేశములు  ( గ.న )
Elastic tissue = సాగు కణజాలము ( గ.న )
Emphysema = ఊపిరితిత్తుల వ్యాకోచవ్యాధి ; ఊపిరితిత్తుల ఉబ్బు ( గ.న )
Fibrinogen = తాంతవజని 
Genetic mutation  = జన్యువుల మార్పు ; జన్యుపరివర్తనము ( గ.న )
Heart attack = గుండెపోటు
Lymphatic channels = రసనాళికలు 
Lymph nodes = రసగ్రంథులు
Metastasis = అవయవాంతర వ్యాప్తి ( గ.న )
Peripheral arterial  disease = దూరధమనుల వ్యాధి ( గ.న )
Platelets = రక్తఫలకములు ( గ.న )
Pulmonary diseases = శ్వాసకోశ వ్యాధులు 

( ఈ వ్యాసమును స్వేచ్ఛగా పంచుకొని  ప్రతులు తీసుకొని మీ, మీ బంధుమిత్రులు ధూమపానము , పొగాకు వాడుకలు మానుటకు సహకరించ ప్రార్థన )

18, జూన్ 2019, మంగళవారం

ఉష్ణసంబంధ రుగ్మతలు ( Heat related illnesses )

( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో )

                      ఉష్ణ సంబంధ రుగ్మతలు

                       ( Heat related illnesses 


                                                                                        డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .


    శరీరములో ఉష్ణ నియంత్రణ కేంద్రము మెదడులో హైపోథలమస్ లో ( Hypothalamus )  ఉంటుంది. ఉష్ణము శరీరములో అధికముగా జనించినపుడు, వాతావరణ ఉష్ణము ఎక్కువగా ఉన్నపుడు, శరీరము అధిక ఉష్ణమును బయటకు ప్రసరించుటలో లోపము ఉన్నచో ఉష్ణ సంబంధ రుగ్మతలు కలుగుతాయి.

    అధిక ఉష్ణోగ్రతలలో పనిచేసేవారిలోను, వ్యాయామము, క్రీడలలో పాల్గొనేవారిలోను, సైనికులలోను, దళసరి వస్త్రధారణ చేసేవారిలోను, గృహవసతి లేనివారిలోను, ఇతర అనారోగ్యములు కలవారిలోను, మద్యము, యితర మాదక ద్రవ్యములు వాడే వారిలోను, మానసిక ఔషధములు, యితర ఔషధములు వాడే వారిలోను అధిక ఉష్ణము వ్యాధులు కలిగించే అవకాశములు ఎక్కువ.

    ఉష్ణము శరీరమునుంచి దేహానికి అంటిఉన్న దుస్తులు మొదలగు చల్లని వస్తువులకు వహనము ( conduction ) వలన, దేహముపై ప్రసరించు గాలికి సంవహనము( convection ) వలన, విద్యుత్ అయస్కాంత తరంగముల ( electromagnetic waves ) వికిరణము ( radiation ) వలన, చెమట ఆవిరి చెందుట వలన బయటకు ప్రసరింపబడుతుంది. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినపుడు, కండరముల శ్రమ పెరిగినపుడు, శరీర వ్యాపార క్రియ ( metabolism ) పెరిగినపుడు స్వేదము ఎక్కువగా స్రవించి ఉష్ణము బయటకు ప్రసరించుటకు, దోహదపడుతుంది. హృదయ వేగము, సంకోచము ( contractility ) పెరిగి, హృదయము నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తప్రమాణము ( cardiac output ) పెరిగి, చర్మమునకు రక్తప్రసరణ పెరిగి ఉష్ణప్రసరణను పెంచుతాయి. జీర్ణమండలము, ఇతర ఉదరాంతర అవయవములలో ( viscera )  రక్తనాళములు ఎక్కువగా సంకోచించుట వలన చర్మమునకు రక్తప్రసరణ పెరుగుతుంది. చెమట ఉత్పత్తి ఎక్కువయినపుడు దేహములో ప్రసరణ రక్తప్రమాణము ( circulating blood volume ) తగ్గుతుంది. శరీరములో జల లవణముల ప్రమాణము తగ్గి శోషణ ( dehydration ) కలుగుతుంది. దేహములో జనించు ఉష్ణము ఉష్ణ నష్టము కంటె అధికమయినపుడు శరీరాంతర ఉష్ణోగ్రత ( core body temperature ) క్రమముగా పెరుగుట మొదలవుతుంది. 


                                అధిక ఉష్ణముచే కలుగు స్వల్ప అస్వస్థతలు  



వడ పొంగు ( Heat edema ) 


    శరీర ఉష్ణము పెరుగుట వలన కాళ్ళలో రక్తనాళములు వ్యాకోచము చెంది, రక్త సాంద్రత పెరిగి  కాళ్ళలోను పాదముల లోను పొంగులు కనిపించవచ్చును. చల్లని ప్రదేశములలో కాళ్ళను ఎత్తుగా పెట్టి పడుకుంటే యీ పొంగులు తగ్గిపోతాయి. మూత్రకారకములను ( diuretics ) యీ పొంగులకు వాడకూడదు. 

కండరముల పీకులు , నొప్పులు ( Muscle cramps ) 


    పరిసరముల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు క్రీడలు, వ్యాయామము, శ్రమ జీవనముల వలన కండరములలో పీకులు, నొప్పులు కలుగవచ్చును. ఉదర కుడ్యపు కండరములు ( abdominal wall muscles ), ఊరు కండరములు ( quadriceps muscles of thighs ), కాలిపిక్కల కండరములలో ( gastrocnemius muscles ) యీ నొప్పులు సాధారణముగా కలుగుతాయి. జల, లవణ నష్టములే కాక నాడీ కండర ప్రేరేపణలు ( neuromuscular stimuli ) యీ నొప్పులకు కారణము కావచ్చును. చల్లని ప్రదేశములలో విశ్రాంతి, లవణసహిత ద్రవపానములు, మర్దనములతో యీ పీకులను నివారించగలము.

చెమట పొక్కులు ; చెమట కాయలు (Heat rash ) 


    ఎండలు, వేడి ఎక్కువయినపుడు చెమట ఎక్కువగా పడుతుంది. స్వేద రంధ్రములు పూడుకొనిపోతే చెమట స్వేద నాళములలో యిరుక్కొని ఎఱ్ఱని చెమట కాయలు, పొక్కులు, చీముకాయలు ( Pustules ) ఏర్పడుతాయి. ఇవి సాధారణముగా వస్త్రములతో కప్పబడు శరీర భాగములలో కనిపిస్తాయి. చల్లని ప్రదేశములకు చేరి అధిక వస్త్రధారణ మానుట వలన, చర్మపు తేమ తగ్గించుకొనుట వలన చెమట కాయలు తగ్గుతాయి.

వడ సొమ్మ ; ఉష్ణ మూర్ఛ ( Heat Syncope ) 


    ఎక్కువసేపు వ్యాయామము చేసినప్పుడు సొమ్మసిల్లుట సంభవించవచ్చును. వ్యాయామములో దేహములో పుట్టే వేడిమికి శరీరపు క్రింద భాగములలో రక్తనాళములు వ్యాకోచించుట ( Peripheral vasodilation ) వలనను, ఎక్కువ చెమటచే కలుగు జల లవణముల నష్టము వలనను, దేహ రక్తప్రమాణము తగ్గుట ( hypovolemia ) వలనను, రక్తనాళములలో బిగుతు తగ్గుట ( decreased vasomotor tone ) వలనను స్థితి ప్రేరిత అల్ప రక్తపీడనము ( postural hypotension ) కలిగి మెదడునకు రక్తప్రసరణ తగ్గి యీ మూర్ఛ కలుగుతుంది. వెల్లకిల పడుకో బెట్టి కాళ్ళు ఎత్తిపెట్టి ఉంచగానే రక్తపీడనము తేరుకొని వారికి స్మారకము కలుగుతుంది. ఈ స్థితి నుంచి 15, 20 నిమిషములలో పూర్తిగా తేరుకుంటారు. వీరిచే ఉప్పుతో కూడిన ద్రవపదార్థములను సేవింపజేసి చల్లని ప్రదేశములలో విశ్రాంతి చేకూర్చాలి. హృదయ సంబంధ వ్యాధులు వలన కూడ అపస్మారము కలుగవచ్చును. హృద్రోగ లక్షణములు, ఆ అవకాశములు కలవారిలోను, వయస్సు మీఱినవారిలోను హృద్రోగములకై శోధించాలి . 


                               అధిక ఉష్ణముచే కలుగు తీవ్రరుగ్మతలు


వడ బడలిక ( Heat exhaustion ) 


    తీవ్ర వ్యాయామము, శారీరక శ్రమ, క్రీడల వలన అధికమైన జీవవ్యాపార క్రియకు ( metabolism )  పరిసరముల అధిక ఉష్ణోగ్రత తోడయినపుడు వడ బడలిక ( heat exhaustion ) కలిగే అవకాశము ఉన్నది. ఎక్కువ వేడికి చెమట ఎక్కువయి జల, లవణ నష్టము కలుగుతుంది. వడబడలిక కలిగిన వారికి అలసత్వము, ఒళ్ళు తూలడము, ఒంట్లో నలత, తలనొప్పి, వమన భావన ( nausea ), వాంతులు కలుగవచ్చు. చెమట బాగా పట్టి చర్మము చల్లబడుతుంది. శరీరాంతర ఉష్ణోగ్రత ( core body temperature ) 101 - 104 ఫాహ్రెన్ హైట్ ( 38.3 - 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ) వఱకు చేరవచ్చును. వీరు నిలుచున్నప్పుడు రక్తపీడనము బాగా పడిపోవచ్చును ( postural hypotension ). వీరి మానసికస్థితి మాత్రము మాఱదు. మతిభ్రంశము కలిగితే, శరీర ఉష్ణోగ్రత ఎంత ఉన్నా సరే దానిని వడదెబ్బగానే ( ఉష్ణఘాతము : Heat stroke ) పరిగణించాలి.

    వడబడలిక అయినా, వడదెబ్బ అయినా సంశయము కలిగినపుడు శరీరాంతర ఉష్ణోగ్రతను త్వరగా తగ్గించు ప్రయత్నములు చేయాలి. రోగులను చల్లని ప్రదేశములకు చేర్చాలి. అధిక వస్త్రములను తొలగించాలి. చల్లని నీటి తుంపరలతోను, పంకాలతోను శారీరక ఉష్ణోగ్రతను 101 ఫాహ్రెన్ హైట్ డిగ్రీలకు తగ్గించు ప్రయత్నము చేయాలి. నోటి ద్వారా గాని, సిరల ద్వారా గాని లవణసహిత ద్రవపదార్థములను ఇచ్చి శోషణ ( dehydration ) తగ్గించాలి. వెల్లకిల పడుకోబెట్టి కాళ్ళను ఎత్తుగా ఉంచాలి .

    వీరికి సంపూర్ణ రక్తకణ పరీక్షలు, జీవవ్యాపార రక్తపరీక్షలు ( విద్యుద్వాహక లవణములు సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేటులు ; గ్లూకోజ్,యూరియా నైట్రొజెన్, క్రియటినిన్, కాలేయ వ్యాపార పరీక్షలు, రక్తములో మయోగ్లోబిన్ ( myoglobin ), మూత్ర పరీక్షలు, రక్త ఘనీభవన పరీక్షలు ( blood coagulation tests ) చేయాలి.

    అధిక ఉష్ణోగ్రతల వద్ద జీవోత్ప్రేరకములు ( enzymes ), యితర మాంసకృత్తులు వికృతి పొందే ( denature ) అవకాశము, కణజాలము విధ్వంసము పొందే అవకాశము ఉన్నాయి. అస్థికండర కణవిధ్వంసము ( rhabdomyolysis ) జరిగి కండరముల నుంచి మయోగ్లోబిన్ అనే వర్ణకము ( pigment) విడుదల కావచ్చును. 

    విద్యుద్వాహక లవణములలో తేడాలు ( electrolyte imbalance ), అస్థికండర కణవిధ్వంసము ( rhabdomyolysis ). కాలేయకణ విధ్వంసము ( hepatocellular injury ), మూత్రాంగ వైఫల్యము ( renal failure ) వంటి ఉపద్రవములు కలిగే అవకాశములు ఉన్నాయి. అట్టి పరిణామములను గమనించి వాటికి తగిన చికిత్స చేయాలి. 

వడదెబ్బ ( ఉష్ణఘాతము Heat stroke ) 


    వడదెబ్బ ( ఉష్ణఘాతము ) తగిలిన వారికి శరీరాంతర ఉష్ణోగ్రత ( core body temperature ) 105 డిగ్రీల ఫాహ్రెన్ హైట్ ( 40.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ) గాని, అంతకు మించి గాని ఉండి కేంద్ర నాడీమండల వ్యాపారములో విలక్షణములు కనిపిస్తాయి. వీరిలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ లోపిస్తుంది.

    వడదెబ్బను అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. సత్వరముగా చికిత్స చేసినట్లయితే ప్రాణాపాయమును నివారించవచ్చును. చికిత్స ఆలస్యము అయినకొలది రోగులు మృత్యువాత పడే అవకాశములు హెచ్చవుతుంటాయి.

    వడదెబ్బ శారీరకశ్రమ సహితము ( exertional ) గాని, శారీరక శ్రమరహితము ( nonexertional ) గాని కావచ్చును. 

    శరీర ఉష్ణోగ్రత తీవ్రతరము అయినపుడు శరీరములో మాంసకృత్తులు వికృతము ( denature ) చెందగలవు. అందువలన శరీర వ్యాపారక్రియలు ( metabolic activities ) మందగించుటే గాక, అంతర జీవవిషములు ( endotoxins ) కూడా విడుదల అవుతాయి. శరీరములో తాప ప్రతిస్పందన ( inflammatory response ) కూడా ప్రారంభము అవుతుంది. వివిధ అవయవములలో విలక్షణములు కలిగి అవయవ వ్యాపారములు వైఫల్యము చెంది మరణమునకు దారి తీస్తాయి.

వడదెబ్బ ( ఉష్ణఘాత ) లక్షణములు 


    వడదెబ్బకు గుఱైనవారిలో శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫాహ్రెన్ హైట్ గాని అంతకు మించి గాని ఉంటుంది. మానసిక ఆందోళన, అలజడి, గందరగోళము, కలవరము, మూర్ఛలు, స్మృతిభ్రంశము, అపస్మారకము వంటి మానసిక అవలక్షణములు కలుగుతాయి. వీరు నేలపై కూలిపోయి కనిపిస్తారు. చర్మము వేడిగా ఉంటుంది. చెమటలు బాగా పోయవచ్చును. చెమటలు లేనప్పుడు చర్మము పొడిగా ఉండవచ్చును. వీరిలో గుండె వేగము హెచ్చుగా ఉంటుంది. శ్వాస వేగము హెచ్చయి ఆయాసము పొడచూపవచ్చును. రక్తపీడనము తగ్గుతుంది. వడదెబ్బ ప్రభావము మెదడు, కాలేయములపై అధికముగా ఉంటుంది. చిన్నమెదడు ( cerebellum ) పై కూడా అధిక ప్రభావము ఉంటుంది. శరీర అస్థిరత ( ataxia ) తొలి లక్షణము కావచ్చును. 

    తీవ్ర జ్వరము ( hyperthermia ), అపస్మారకములను కలిగించే ఇతర వ్యాధులను దృష్టిలో పెట్టుకున్నా, పరిసరముల ఉష్ణోగ్రత, శారీరక ప్రయాస వంటి పరిస్థితుల బట్టి వడదెబ్బను ( heat stroke ) పసిగట్టి సత్వర వైద్యమును సమకూర్చాలి. వ్యాధిగ్రస్థుడు నేలకు కూలబడిన 30 నిమిషముల వ్యవధిలో చికిత్స మొదలు పెడితే మృత్యువును నూరు శాతము నివారించవచ్చును. శరీరాంతర ఉష్ణోగ్రత ఆసుపత్రులకు చేరేటప్పుడు 105.8 డిగీలు దాటి ఉన్నవారిలోను, హెచ్చుకాలము తీవ్రజ్వరము ఉన్నవారిలోను మృత్యువు అవకాశము 80 శాతము వఱకు ఉండవచ్చును. అందువలన రోగిని చల్లపఱచే ప్రక్రియలను వైద్యాలయములకు తరలించుటకు ముందే మొదలుపెట్టి మార్గములో కూడా కొనసాగించాలి.

    వడదెబ్బ తగిలిన వారిని వారి ఉష్ణోగ్రత తగ్గించుటకు ( తల తప్పించి మిగిలిన శరీరమును ) చల్లని నీటిలో ( 50 F ) గాని, మంచునీటిలో గాని ( 35.6 F - 41 F ) ముంచి ఉంచుట ఉత్తమ మార్గము.

    చల్లనీరు, మంచునీరు లభ్యము కానప్పుడు గోరువెచ్చని నీటిని ( 68 F) వాడవచ్చును. వారి శరీరాంతర ఉష్ణోగ్రతను ( core body temperature ) ఉష్ణమాపకము పురీషనాళములో ఉంచి కొలవాలి. శరీరాంతర ఉష్ణోగ్రత 101 F డిగ్రీలకు దిగేవఱకు చల్లపఱచే యత్నములను కొనసాగించాలి. 

    తడిగుడ్డలతో కప్పుట, పెద్ద ధమనులు ఉండే చోట్ల ( చంకలు, మెడ, మొలలు వద్ద ) మంచు పొట్లములు ఉంచుట, పంకాగాలులు, చల్లనీరు జల్లుల వంటి ప్రక్రియలను ఉయోగించినా వడదెబ్బ చికిత్సకు అవి అంత ఫలవంతములు కాదు.

    శరీరమును చల్లార్చే ప్రయత్నములు కొనసాగిస్తూ వ్యాధిగ్రస్థులను అత్యవసర వైద్యాలయములకు తరలించాలి. వైద్యాలయములలో శరీరాంతర ఉష్ణోగ్రతను 101 F డిగ్రీలకు తగ్గించే ప్రక్రియలు కొనసాగిస్తూ సిరల ద్వారా చల్లని లవణ జలములు ( cold saline ) ఇవ్వాలి. 

    జ్వరము తగ్గించు మందులు ( antipyretics ), డాంట్రొలీన్ ( Dantrolene ) వడదెబ్బకు పనిచేయవు.

    వడదెబ్బ ప్రాధమిక చికిత్స కొనసాగిస్తూ, వారికి రక్తకణ పరీక్షలు, జీవవ్యాపార పరీక్షలు [ complete metabolic panel ; విద్యుద్వాహక లవణములు ( electrolytes ), మూత్రాంగ వ్యాపార పరీక్షలు ( యూరియా నైట్రొజెన్ BUN, క్రియటినిన్ ( creatinine ), కాలేయ వ్యాపార పరీక్షలు ( liver function tests ), క్రియటినిన్ కైనేజ్ ( creatinine kinase )], మయోగ్లోబిన్ ( myoglobin ) ప్రమాణములు, రక్తఘనీభవన పరీక్షలు ( blood coagulation tests ), మూత్ర పరీక్షలు చెయ్యాలి. 

    వడదెబ్బకు లోనయిన వారిలో మూత్రాంగముల వైఫల్యము, శ్వాస వైఫల్యము, కాలేయపు అవలక్షణములు, అస్థికండర కణ విధ్వంసము ( rhabdomyolysis ), విద్యుద్వాహక లవణ భేదములు ( electrolyte imbalances ), విస్తృత రక్తనాళాంతర రక్తఘనీభవనము ( disseminated intravascular coagulation ) వంటి అవలక్షణములు కలిగే అవకాశము ఉన్నది. ఆయా అవలక్షణములు కనిపెట్టి తగిన చికిత్సలు చెయ్యాలి.

    వడదెబ్బ నుంచి కోలుకున్నవారు కనీసము వారము దినములు ఎట్టి శ్రమ, వ్యాయామములలో పాల్గొనకూడదు. పూర్తిగా కొలుకున్నాక చల్లని వాతావరణములో వ్యాయామము, క్రీడలు, శారీరక శ్రమలలో పరిమితముగ పాల్గొనుట మొదలిడి క్రమముగా కార్యకలాపములను పెంచవచ్చును.

ఉష్ణసంబంధ వ్యాధుల నివారణ 


    వేడి వాతావరణములో శ్రమించువారు, వసించువారు తఱచు ద్రవ పదార్థములను సేవించాలి. మంచినీళ్ళు, చక్కెరపానీయాలు రెండు మూడు లీటరుల వఱకు సేవించినా, లవణ సహిత పానీయములను కూడా సేవించుట మేలు. పలుచని, వదులు, లేతవర్ణపు దుస్తులు ధరించాలి.

    వేడి వాతావరణమునకు క్రమేణ అలవాటుపడాలి. పరిసర ఉష్ణోగ్రత అధికముగా ఉన్నపుడు పరిశ్రమ చేయకూడదు. తప్పనిసరి అయితే విరామ సమయములు తీసుకొని, చల్లని పానీయములు సేవిస్తూ ఉండాలి. లవణ నష్టములను కూడా పూరించాలి. మంచినీరు, చక్కెర పానీయాలు మాత్రమే అధికముగా ( మూడులీటరులకు మించి ) సేవించి, లవణనష్టములను పూరించకపోతే రక్తములో సోడియమ్ ప్రమాణములు తగ్గవచ్చును ( hyponatremia ). అధిక వాతావరణ ఉష్ణోగ్రతలు కలచోట్ల పనిచేసే వైద్య బృందములకు ఉష్ణ సంబంధ వ్యాధులను కనిపెట్టుటలోను, నిరూపిత చికిత్సా పద్ధతులలోను ( evidence based medical standards ) తగు శిక్షణ ఇయ్యాలి.

    వేసవి తీవ్రత హెచ్చుగా ఉన్నపుడు, వడగాడ్పులు వీచుతున్నపుడు వృద్ధులకు, గృహ విహీనులకు ప్రభుత్వములు సమాజములు శీతల వసతి గృహములను తాత్కాలికముగానైనా ఏర్పాటు చెయ్యాలి.


పదజాలము :
Ataxia = శరీర అస్థిరత ( గ.న )
Cardiac output = హృదయ ప్రసరణ ( రక్త ) ప్రమాణము
Circulating blood volume = దేహప్రసరణ రక్తప్రమాణము (గ.న )
Conduction = వహనము 
Contractility = సంకోచము 
Convection = సంవహనము
Core body temperature = శరీరాంతర ఉష్ణోగ్రత ( గ.న )
Dehydration = శోషణము
Diuretics = మూత్రకారకములు
Disseminated intravascular coagulation = విస్తృత రక్తనాళాంతర రక్తఘనీభవనము ( గ.న )
Endotoxins = అంతర జీవవిషములు
Enzymes = జీవోత్ప్రేరకములు ( గ.న )
Heat edema = వడ పొంగు ( గ.న )
Heat exhaustion = వడబడలిక ( గ.న )
Heat rash = చెమట కాయలు ; చెమట పొక్కులు ( గ.న )
Hyperthermia = తీవ్రజ్వరము ( గ.న )
Heat stroke = ఉష్ణఘాతము ; వడదెబ్బ
Heat syncope =  వడసొమ్మ ( గ.న )
Hypovolemia = రక్తప్రమాణ హీనత (గ.న )
Inflammatory response = తాప ప్రతిస్పందన ( గ.న )
Metabolism = శరీరవ్యాపకము ; జీవవ్యాపారము ( గ.న )
Peripheral vasodilation = దూర రక్తనాళ వ్యాకోచము ( గ.న )
Postural hypotension = స్థితి ప్రేరిత అల్ప( రక్త )పీడనము ( గ.న )
Radiation = వికిరణము 
Rhabdomyolysis = అస్థికండరకణ విధ్వంసము ( గ.న )
Viscera = ఉదరాంతర అవయవములు ( గ.న )

( వైద్యవిషయాలను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము .
ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...