14, మార్చి 2020, శనివారం

జీర్ణవ్రణములు ( Peptic Ulcers )


( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )


                      జీర్ణ వ్రణములు ( Peptic ulcers )


                                                                        డా. గన్నవరపు నరసింహమూర్తి  



జీర్ణమండలము 


    మనము భుజించే ఆహారము అన్ననాళము ( Esophagus ) ద్వారా జీర్ణాశయము లోనికి చేరుతుంది. జీర్ణాశయములో జీర్ణమయి చిక్కని ద్రవముగా మారిన ఆహారము జీర్ణాశయ నిర్గమము ( Pylorus ) ద్వారా చిన్నప్రేవులకు చేరుతుంది. చిన్నప్రేవులను ప్రథమాంత్రము (Duodenum ), మధ్యాంత్రము (Jejunum ), శేషాంత్రము ( Ileum ) అని మూడు భాగములుగా విభజించ వచ్చును. చిన్నప్రేవులలో జీర్ణ ప్రక్రియ పూర్తయి ఆహార పదార్థాల గ్రహణము ( absorption ) పూర్తయి, శేషము నీటితో సహా పెద్ద ప్రేవులకు చేరుతుంది. పెద్ద ప్రేవులలో ( బృహదాంత్రము ) నీరు గ్రహించబడి మిగిలినది మలముగా విసర్జింపబడుతుంది. ఆహార పదార్థాల జీర్ణము జీర్ణమండలములో స్రవించబడే జీర్ణ రసములు, వానిలోని జీవోత్ప్రేరకములపై ( Enzymes ) ఆధారపడుతుంది. నోటిలో స్రవించే లాలాజలములో టయాలిన్ ( ptyalin ) చక్కెర గ్రహణమునకు తోడ్పడుతుంది. జఠరములో జఠర రసము స్రవించబడి అందులో ఉన్న పెప్సిన్ మాంసకృత్తుల జీర్ణమునకు తోడ్పడుతుంది. క్లోమమములో ఉత్పత్తి అయే క్లోమ రసములో ఎమిలేజ్ Amylase ) పిండిపదార్థాల జీర్ణమునకు, లైపేజ్ ( Lipase ) క్రొవ్వుల జీర్ణమునకు, ట్రిప్సినోజెన్ ( Trypsinogen ), ఖైమో ట్రిప్సినోజెన్ లు ( Chymotrypsinogen ) ఆంత్రములలో ట్రిప్సిన్ ( Trypsin), ఖైమోట్రిప్సిన్ లుగా ( Chymotrypsin) మారి మాంసకృత్తులను జలవిచ్ఛేదన ( Hydrolysis) ప్రక్రియ ద్వారా పెప్టైడులు ( Peptides), ఎమినో ఆమ్లములుగా ( Amino acids ) విచ్ఛేదించి వాని గ్రహణమునకు తోడ్పడుతాయి. కాలేయములో ఉత్పత్తి అయే పైత్య రసములోని పైత్యము క్రొవ్వుపదార్థాల జీర్ణమునకు తోడ్పడుతుంది.

    జఠరాశయమును నాలుగు భాగములుగా గుర్తిస్తారు. అవి పైకప్పులా ఉండే జఠర మూలము ( Fundus ), కాయము ( Body ), అంతిమకుహరము ( Antrum ), నిర్గమము ( Pylorus). జఠరపు లోపొరలో ( శ్లేష్మపు పొర - Mucosa ) ఉన్న జఠర గ్రంథుల నుంచి శ్లేష్మము( Mucus ), ఉదజ హరికామ్లము ( Hydrochloric acid ), పెప్సినోజెన్, విటమిను బి 12 గ్రహణమునకు ఉపయోగపడే అంతరాంశము ( B12 Intrinsic factor ), గాస్ట్రిన్ ( Gastrin ) అనే వినాళ రసము, హిస్టమిన్ లు( Histamine) ఉత్పత్తి అవుతాయి. ఇందులో శ్లేష్మము జఠరపు లోపొరకు రక్షణ చేకూరుస్తుంది. ఆహార చలనమునకు తోడ్పడుతుంది.

    పెప్సినోజెన్ నుంచి విడుదల అయే పెప్సిన్ మాంసకృత్తుల జీర్ణమునకు ఉపయోగపడుతుంది. పెప్సిన్ ఆమ్ల మాధ్యమములో బాగా పనిచేస్తుంది. పి హెచ్ ఎక్కువయిన క్షార ద్రవములలో పనిచేయదు. ఉదజహరికామ్లము సూక్ష్మాంగజీవులను సంహరించుటకు, పెప్సిన్ సలిపే జీర్ణక్రియకు దోహదకారిగాను ఉపయోగపడుతుంది.
    
    అంతిమకుహరము ( Antrum ) ఆహారముతో ఉబ్బినపుడు, జఠరములో పి.హెచ్ పెరిగి ఆమ్లము తగ్గినపుడు జి కణములు ( G- cells ) గాస్ట్రిన్ ని ఉత్పాదించి రక్తములోనికి విడుదల చేస్తాయి. గాస్ట్రిన్ ఉదజహరికామ్లము, పెప్సిన్ ల విడుదలకు, జఠర కండరములను ప్రేరేపించి జఠర చలనము పెంచుటకు తోడ్పడుతుంది. జీర్ణాశయములో ఆమ్లము ఎక్కువయి నప్పుడు గాస్ట్రిన్ విడుదల తగ్గిపోతుంది. గాస్ట్రిన్ ఎంటెరోక్రోమఫిన్ ( Enterochromaffin cells ) కణములనుంచి హిస్టమిన్ ని విడుదల చేయిస్తుంది. హిస్టమిన్ జఠర కుడ్య కణములలో ( parietal cells ) ఉండే ప్రోటాను యంత్రముల ( Proton pumps - Hydrogen / Potassium Adenosine triphoshatase Enzyme System ) ద్వారా రక్తము లోనికి బైకార్బొనేట్ ను, జఠర కుహరములోనికి ఉదజనిని ( Hydrogen- ప్రోటాన్లు ) విడుదల చేయిస్తుంది. ఉదజనిని అనుసరించి క్లోరైడు పరమాణువులు కూడా జఠర కుహరములోనికి విడుదల అవుతాయి. మెదడు నుంచి వచ్చే వేగస్ కపాల నాడులు ( Vagal nerves ) కూడా ఆహారపు తలపు, వాసన, రుచులకు స్పందించి జఠరములో ఉదజహరికామ్లము, పెప్సినోజెన్ ల విడుదలను, గాష్ట్రిన్ విడుదలను కలిగిస్తాయి.


జీర్ణ వ్రణములు ( Peptic ulcers ) 



    జఠర రసము ( Gastric juice ) ఆహారమును జీర్ణించుట కొఱకు ఉత్పత్తి అవుతుంది. జఠర రసములో ఉండే పెప్సినోజెన్, ఉదజహరికామ్లముల ఫలితముగా జీర్ణమండలపు లోపొర ( శ్లేష్మపు పొర Mucosa ) జీర్ణమయి వ్రణములు కలిగే అవకాశము ఉన్నది. ఈ జీర్ణ వ్రణములు జఠరాశయములోను ( Stomach ), ప్రథమ ఆంత్రములోను ( Duodenum), అన్ననాళములోను ( Esophagus ) అంతిమ ఆంత్రములో ( Ileum) అవశేషముగా మిగిలే మెకెల్ సంచిలోను ( Meckel ‘s diverticulum ) కాని కలుగ వచ్చును. ఉదజహరికామ్లము ఎక్కువగా ఉత్పత్తి అయినా, లో శ్లేష్మపు పొర నిరోధక శక్తి తగ్గినా యీ పుళ్ళు కలుగుతాయి. జఠరముతో సంధించబడిన ఆంత్రములోను యీ వ్రణములు ( సంధాన వ్రణములు ; Anastomotic ulcers ) కలుగవచ్చును .



జీర్ణ వ్రణములకు కారణములు 


    1). హెలికోబాక్టర్ పైలొరై ( Helicobacter pylori ) అనే సూక్ష్మాంగ జీవుల వలన ఏభై శాతపు జీర్ణ వ్రణములు కలుగుతాయి. మూడవ ప్రపంచ దేశములలో యీ శాతము డెబ్భై వఱకు ఉండవచ్చును. జఠరములో హెలికోబాక్టర్ సూక్ష్మాంగ జీవులు ఉన్నవారిలో ఇరువది శాతపు ప్రజలలో యీ వ్రణములు కలుగుతాయి. హెలికోబాక్టర్ సూక్ష్మజీవులు కలుషిత ఆహారము, నీరు ద్వారా జఠరమునకు చేరుతాయి. జఠరములో శ్లేష్మమును చొచ్చుకొని కణములకు దగ్గరయి ఆమ్లమునకు దూరమయి తమ చుట్టూ యూరియేజ్ అనే జీవోత్ప్రేరకముతో అమ్మోనియాను ఉత్పత్తి చేసుకొని జఠరామ్లము బారి నుంచి తప్పించుకుంటాయి.
    2). కీళ్ళనొప్పులకు వాడే స్టీరాయిడులు కాని తాపహరములు ( Nonsteroidal anti inflammatory agents NSAIDS ) దీర్ఘకాలము వాడే వారిలో 15 నుంచి 25 శాతపు ప్రజలలో యీ కురుపులు రావచ్చును. ఐబుప్రొఫెన్ ( Ibuprofen), నేప్రొక్సిన్ ( Naproxen), డైక్లొఫెనెక్ ( ( Diclofenec ), ఇండోమిథసిన్ ( Indomethacin ), మెలోక్సికమ్ ( Meloxicam ), సేలిసిలేట్లు ( ( Salicylates ) NSAIDS కి ఉదహరణలు.
    3). గుండెపోటులు ( heart attacks ),మస్థిష్క విఘాతాలను ( strokes ) అరికట్టుటకు వాడే ఏస్పిరిన్ వలన యీ వ్రణములు కలుగవచ్చును.
    4). స్టీరాయిడ్ ఔషధములు దీర్ఘకాలముగా వాడేవారిలో యీ కురుపులు రావచ్చును.
    5). క్లోమములో కాని యితర ప్రదేశములలో కాని కలిగే గాస్ట్రినోమా ( Gastrinoma ) అనే పెరుగుదలల వలన రక్తములో గాస్ట్రిన్ ఎక్కువయి దాని మూలముగా ఉదజ హరికామ్లము, పెప్సిన్ ఉత్పత్తి అధికమయి వారిలో యీ వ్రణములు కలుగుతాయి. సుమారు ఒక శాతపు జీర్ణ వ్రణములకు గాస్ట్రినోమాలు కారణము.
    6). తీవ్రతరమైన యితర అనారోగ్యములతో ఉన్నవారిలోను, కృత్రిమశ్వాస యంత్రములపై ఉన్నవారిలోను యీ వ్రణములు రావచ్చును.
    7). కొందఱిలో తెలియని కారణాల ( Idiopathic ) వలన జీర్ణ వ్రణములు కలుగుతాయి.
    8). జీర్ణాశయములో కలిగే కర్కట వ్రణములు ( Gastric cancers ), లింఫోమాలు వ్రణములుగా కనిపించవచ్చును.
    9). పొగాకు వినియోగించే వారిలో జీర్ణ వ్రణములు ఎక్కువగా కలుగతాయి.

కారము, మసాలాలు తినుటవలన, జీవితములో కలిగే మనోక్లేశము వలన, తొందఱ వలన యీ జీర్ణ వ్రణములు కలుగవు. అట్టి ఆరోపణలు నిజము కాదు.


జీర్ణవ్రణ లక్షణములు 


   కడుపులో పుళ్ళున్న వారిలో చాలా మందికి కడుపు నొప్పి ఉంటుంది. అన్ననాళములో పుళ్ళున్న వారిలో భోజనము మ్రింగుతున్నపుడు, జఠరాశయములో పుళ్ళున్నవారిలో తిన్న వెంటనే, ప్రథమాంత్రములో ( duodenum ) వ్రణములు ఉన్నవారిలో భోజనము చేసిన గంట, గంటన్నర పిదప యీ నొప్పి సాధారణముగా కలుగుతుంది. జఠర వ్రణములు ఉన్నవారిలో పొట్ట పై భాగములో నొప్పి సాధారణముగా కలుగుతుంది. ప్రథమాంత్రములో పుండున్న వారికి ఏమైనా తిన్న వెంటనే కొంత ఉపశమనము తాత్కాలికముగా కలుగుతుంది. ఈ వ్రణములు ఉన్నవారిలో కుక్షి పై భాగములో తాకుతే నొప్పి కలుగవచ్చును. మృదు క్షారములు ( Antacids ) ఆమ్లమును బలహీనపఱచి తాత్కాలిక ఉపశమనము కలిగిస్తాయి.
    కడుపు నొప్పి ఉన్న వారందరిలో యీ వ్రణములు ఉన్నాయని చెప్పలేము. వారి నొప్పికి యితర కారణాలు ఉండవచ్చును. జీర్ణ వ్రణములు గల అందరిలో నొప్పి ఉండకపోవచ్చును.
    కొందఱిలో జీర్ణవ్రణముల వలన కలిగే ఉపద్రవముల లక్షణములే తొలిసారిగా కనిపించవచ్చును. 

ఉపద్రవములు ( Complications ) 


    రక్తస్రావము ( bleeding), జఠరనిర్గమ బంధము ( Pyloric stenosis ), ఆంత్రములో రంధ్రము ఏర్పడుట ( ఆంత్ర ఛిద్రము - perforation ), జీర్ణ వ్రణముల వలన కలిగే ప్రమాదాలు.

    రక్త స్రావము కలిగేవారిలో రక్తపు వాంతులు కలుగవచ్చును. వాంతులు కాఫీగుండ రంగులో ఉండవచ్చును. వారి విరేచనములో రక్తము కనిపించవచ్చు, లేక తారు వలె నల్లటి విరేచనములు కలుగవచ్చును. నెమ్మదిగా పెక్కుదినములు రక్తస్రావము జరిగిన వారిలో పాండురోగము ( anemia ) ఉంటుంది. అధిక రక్తస్రావము వలన రక్తపీడనము పడిపోవచ్చును.

    జఠర నిర్గమ సంకీర్ణత ( ఆంత్రముఖ సంకీర్ణత :  Pyloric stenosis  ) కలుగుతే జఠరము నుంచి ఆంత్రము లోనికి ఆహార గమనము మందగిస్తుంది. తక్కువ తినగానే కడుపు నిండుట, కడుపులో బరువుగా అనిపించుట, పుల్ల తేనుపులు, వాంతులు, వాంతులలో ముందు దినాలు తిన్న పదార్థములు ఉండుట, శరీరము చిక్కి బరువు తగ్గుట కలుగుతాయి.

    ప్రధమాంత్రములో చిల్లు పడిన వారిలో ( ఆంత్ర ఛిద్రము ; Duodenal perforation  ) ఆకస్మికముగా భరించలేని విపరీతమయిన కడుపునొప్పి కలుగుతుంది. వీరికి అత్యవసర శస్త్రచికిత్స అవసరము. అత్యవసర శస్త్రచికిత్స చేయకపోతే వారికి ప్రాణాపాయము కలిగే అవకాశములు చాలా ఎక్కువ.

రోగనిర్ణయ పరీక్షలు 


    రక్తహీనము( Anemia), రక్తస్రావము( bleeding ), తక్కువ తిండితో ఆకలి తీరుట, బరువు తగ్గుట, ఎడతెఱపి లేకుండా వాంతులు, ఎగువ కడుపులో పెరుగుదల ( growth ), ఆమ్లము తగ్గించే మందులతో ఉపశమనము లేకపోవుట వంటి అపాయకర సూచనలు కలవారికి అన్ననాళ - జఠర - ఆంత్రదర్శన ( Esophagogastroduodenoscopy ) సత్వరమే చేయాలి. దీనితో జీర్ణ వ్రణములను కనిపెట్టడమే కాక వ్రణము నుంచి చిన్న తునకలను కణపరీక్షకు, హెలికోబాక్టరు పైలొరై పరీక్షకు గ్రహించవచ్చు. కర్కట వ్రణములను ( cancers ) త్వరగా కనిపెట్టవచ్చు.

అన్ననాళ - జఠర - ఆంత్రదర్శన పరీక్షలో అన్ననాళమును, జీర్ణాశయమును, ప్రథమాంత్రమును శోధించి కడుపులో పుళ్ళను నిర్ధారించవచ్చును. ఈ పరీక్ష ప్రామాణిక పరీక్ష.

    బేరియం ద్రవమును త్రాగించి ఎక్స్ - రే ల ద్వారా జీర్ణ వ్రణములను కనుగొనవచ్చును. కాని ఈ పరీక్షలో చిన్న చిన్న వ్రణములు, జఠర తాపము ( Gastritis), ఒరిపిడులు ( gastric erosions ) కనుగొనుట సాధ్యము కాదు. కణపరీక్షలకు అవకాశము ఉండదు. బేరియం పరీక్షలు అంతర్దర్శన పరీక్షలు లభ్యమయ్యాక చాలా తగ్గిపోయాయి.

హెలికోబాక్టర్ పైలొరై పరీక్షలు:


    రక్తమును హెలికోబాక్టర్ పైలొరై ప్రతిరక్షకములకు ( antibodies ) పరీక్షించవచ్చును. కాని సూక్షాంగ జీవులను నిర్మూలించిన 18 మాసముల వఱకు ఈ ప్రతిరక్షకములు రక్తములో ఉండవచ్చును. ప్రస్తుత సమయములో హెలికోబాక్టర్ పైలొరై సూక్ష్మాంగ జీవులు సజీవముగా జఠరములో ఉన్నట్లు యీ పరీక్షతో నిర్ధారించజాలము.

    రేడియో ధార్మిక కార్బను గల యూరియా శ్వాస పరీక్షతో ( Carbon labeled urea breath test ) హెచ్. పైలొరైని నిర్ధారించవచ్చును.

    మలములో హెలికోబాక్టర్ సంబంధ ప్రతిజనకములు ( antigens) కనుగొని హెచ్. పైలొరై ని నిర్ధారించవచ్చును.

చికిత్స 


    జఠరామ్లమును అణచివేయుట చికిత్సలో మూలభాగము. ప్రోటాను యంత్ర అవరోధకములు ( proton pump inhibitors) విరివిగా ప్రాచుర్యములో ఉన్నాయి. ఇవి ఉదజని స్రావమును అణచివేస్తాయి. ఆమ్లము అంటే ఉదజనే.
    ఒమిప్రజోల్ ( Omeprazole ) లాన్సప్రజోల్ ( Lansoprazole ), పాన్టొప్రజోల్ ( Pantoprazole ) ప్రోటాను యంత్ర అవరోధకములకు ఉదహరణములు.
    హిస్టమిన్ - 2 గ్రాహక అవరోధకములు ( Histamine -2 receptor blockers) జఠర కణములపై హిస్టమిన్ ప్రభావమును అరికట్టి ఉదజ హరికామ్ల స్రావమును అణచివేస్తాయి.
     సైమెటిడిన్ ( Cimetidine), రెనెటిడిన్ ( Ranitidine ) ఫెమొటిడిన్ ( Famotidine ), నైజటిడిన్ ( Nizatidine ) హిస్టమిన్ -2 అవరోధకములకు ఉదహరణలు.
    ఆమ్ల హరములు ( Antacids ) ; మృదు క్షారములు సత్వర ఉపశమునకు ఉపయోగపడుతాయి. కాని వ్రణముల చికిత్సకు ప్రోటాను యంత్ర నిరోధకములు కాని, హిస్టమిన్ -2 గ్రాహక అవరోధకములను గాని వాడాలి.

    హెలికోబాక్టర్ నిర్మూలనకు ప్రోటాను యంత్ర అవరోధకములతో బాటు సూక్ష్మజీవి నాశకములు ( Antibiotics ) రెండైనా కలిపి వాడాలి. ఎమాక్సిసిలిన్, మెట్రానిడజాల్, క్లెరిథ్రోమైసిన్, పెప్టోబిస్మాల్, టెట్రాసైక్లిన్ లతో వివిధ మేళనములు లభ్యము.
    సుక్రాల్ఫేట్ ( Sucralfate ) వ్రణములపై పూతగా ఏర్పడి వ్రణములపై జఠరికామ్లపు ప్రభావమును తొలగిస్తుంది. జీర్ణ వ్రణముల మానుదలకు యీ ఔషధము ఉపయోగకారే.
    స్టీరాయిడులు కాని తాపహరములను ( NSAIDS ) మానివేయాలి. ఏస్పిరిన్ కూడా అవకాశము ఉంటే ( హృద్ధమని వ్యాధులు గలవారిలో జాగ్రత్త అవసరము. ) మానివేయుట వ్రణముల మానుదలకు దోహదకారి. కార్టికోస్టీరాయిడులను కూడా వీలయితే క్రమేణా తగ్గించుకొని మానివేయాలి.
    ధూమపానము చేసే వారిలో జీర్ణ వ్రణముల మానుదల మందగిస్తుంది. పొగత్రాగే వారిలో కడుపులో పుండ్లు ఎక్కువగా కలుగుతాయి. అందువలన పొగత్రాగుట మానివేయాలి.


శస్త్రచికిత్సలు 


    మొదటి హిస్టమిన్ -2 అవరోధకము సైమెటిడిన్ కనుగొనక ముందు ఆమ్ల హరములకు ( antacids ) లొంగని జీర్ణ వ్రణములకు శస్త్రచికిత్సలు విరివిగా చేసేవారు. ఆమ్లపు ఉత్పత్తిని తగ్గించుటకు  వేగస్ నాడుల విచ్ఛేదన + జఠర, ఆంత్ర సంధానము ( Vagotomy + Gastrojejunostomy ) పాక్షిక జఠర విచ్ఛేదన,( Partial gastrectomy ) వంటి శస్త్రచికిత్సలే వ్యాధిగ్రస్థులకు శరణ్యము అయేవి. ఈ దినములలో జటిలతరమైన వ్రణములకు, రక్తస్రావమును అరికట్టలేని సందర్భములలోనే అఱుదుగా శస్త్రచికిత్సలు జరుగుతాయి.
    వ్రణముల నుంచి రక్తస్రావము జరిగితే అంతర్దర్శిని ( endoscope ) ద్వారా విద్యుద్దహనీకరణము ( electric cauterization), సూచికతో ఎపినెఫ్రిన్ చికిత్స ( injection therapy using epinephrine ) వంటి ప్రక్రియలతో రక్తస్రావమును అరికట్టే అవకాశములు ఉన్నవి. పరరక్త దానము ( blood transfusion ) కూడా అవసరము అవవచ్చును. ఈ ప్రక్రియలకు లొంగకపోతే శస్త్రచికిత్స అవసరము.
    జఠరనిర్గమ సంకీర్ణత ( ఆంత్రముఖ సంకీర్ణత ; Pyloric stenosis ) : అంతర్దర్శిని ద్వారా బుడగతో ఆంత్రముఖమును ( pylorus ) వ్యాకోచింపజేయ వచ్చును. సంకీర్ణత తీవ్రమయితే జఠర ఆంత్ర సంధానము ( Gastro jejunostomy ) వంటి శస్త్రచికిత్సలు అవసరము.

జీర్ణవ్రణముల నివారణ 


    హెలికోబాక్టర్ పైలొరై ని నిర్మూలించుట, స్టీరాయిడులు కాని తాపహరముల వాడుక తగ్గించుకొనుట, వాటి వాడుక తప్పనిసరి అయితే ప్రోటాను యంత్ర అవరోధకములను, హెచ్-2 అవరోధకములను వాడుకొనుట, ధూమపానము సలుపకపోవుట జీర్ణ  వ్రణములను నివారించుటకు సహాయపడుతాయి.


( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనండి )

ఉబ్బుసిరలు ( Varicose veins )


( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) 

:

                          ఉబ్బు సిరలు

                    ( Varicose Veins )

                                                                                                 డా. గన్నవరపు నరసింహమూర్తి

                                                          

                                               సిరలు ( Veins )


    హృదయము నుంచి రక్తము వివిధ అవయవాల కణజాలమునకు ధమనుల ద్వారా అందించబడుతుంది. ధమనులు సూక్ష్మ ధమనులుగా శాఖలు చెంది కణజాలములో  రక్తకేశనాళికలుగా ( capillaries ) చీలికలవుతాయి. కేశనాళికలలోని రక్తము నుంచి ప్రాణవాయువు, పోషక పదార్థములు కణజాలమునకు చేరి, కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు, వ్యర్థ పదార్థములు రక్తములోనికి ప్రవేశిస్తాయి. సూక్ష్మ రక్తనాళికలు కలయికచే సిరలు ఏర్పడుతాయి. సిరల పాయలు కలిసి పెద్ద సిరలు ఏర్పడి తుదకు ఊర్ధ్వబృహత్సిర ( superior venacava ), అధోబృహత్సిరల ( inferior venacava ) ద్వారా రక్తమును హృదయపు కుడి కర్ణికకు తిరిగి చేరుస్తాయి.
    సిరల గోడలలో మూడు పొరలు ఉంటాయి. బయట పొరలో ( tunica externa )  పీచుకణజాలము ( collagen ), సాగుకణజాలము ( elastin ) ఉంటాయి. మధ్యపొరలో ( tunica media ) మృదుకండరములు ఉంటాయి. లోపొరలో ( tunica intima ) పూతకణములు మూలాధారపు పొరను ( basement membrane) అంటిపెట్టుకొని ఉంటాయి. సిరల బయటపొర, మధ్య పొరల మందము ధమనుల పొరల మందము కంటె బాగా తక్కువ. 
    గుండె ఎడమ జఠరికలో ( left ventricle ) రక్తపీడనము అత్యధికముగా ఉండి ధమనులు, సిరలు చివరకు కుడి కర్ణికకు ( Right atrium ) వచ్చేసరికి ఆ పీడనము క్రమముగా తగ్గుతుంది. ఎడమ జఠరిక ముకుళించుకున్నప్పుడు ధమనులలో పీడనము పెరిగి అలలుగా రక్తము ముందుకు ప్రవహిస్తుంది. పీడన వ్యత్యాసము వలన రక్తము సిరలలోనికి ఆపై కుడి కర్ణికకు చేరుతుంది. వికసించుకున్నపుడు కుడికర్ణికలో పీడనము బాగా తగ్గుతుంది. అందువలన కుడికర్ణిక బృహత్సిరలనుంచి రక్తమును గ్రహించగలుతుంది.
    ఉబ్బుసిరలు సాధారణముగా కాళ్ళలో చూస్తాము. సిరలు మూడు రకములు. 

బాహ్యసిరలు ( superficial veins ) 


    చర్మము క్రింద, కండర ఆచ్ఛాదమునకు ( deep fascia ) పైన ఉంటాయి.

నిమ్నసిరలు ( deep veins ) 


    కండర ఆచ్ఛాదమునకు ( deep fascia ) లోపల ఉంటాయి.

ఛిద్రసిరలు ( perforator veins ; సంధానసిరలు ) 


    బాహ్యసిరలను, నిమ్నసిరలతో కలుపుతాయి. ఇవి కండర ఆచ్ఛాదమును చొచ్చుకొని లోపలకు ప్రవేశిస్తాయి. సాధారణ స్థితులలో రక్తము బాహ్యసిరలనుంచి నిమ్నసిరలలోనికి ఛిద్ర సిరల ద్వారా ప్రవహిస్తుంది. సిరలలో ఉండే ద్విపత్రకవాటములు తిరోగమన ప్రవాహమును నిరోధిస్తాయి.

                                          కాలి సిరలు ( Veins in lower extremity )


    కాళ్ళలో బాహ్యసిరలు పాదమునుంచి బయలుదేరుతాయి. పాదము పైభాగములో కనిపించే ఊర్ధ్వపాద సిరచాపము ( dorsal venous arch of foot ) మధ్యస్థముగా ( medially ) చీలమండ (ankle ) ఎముకకు ముందుగా కాలిపైకి గరిష్ఠ దృశ్యసిరగా ( great saphenous vein ) ఎగబ్రాకుతుంది. తొడ లోపలి భాగములో యీ గరిష్ఠ దృశ్యసిర ( great saphenous vein ) పయనించి తొడ పైభాగములో దృశ్యసిర రంధ్రము ( saphenous orifice ) ద్వారా లోపలకు దూరి ఊరుసిరతో ( femoral vein ; తొడసిర ) కలుస్తుంది.
    ఊర్ధ్వపాద సిరచాపము (dorsal venous arch of foot ) పార్శ్వ భాగమున చిటికెనవేలు పైభాగపు అంగుళిక సిరతో ( digital vein ) కలిసి కనిష్ఠ దృశ్యసిరగా ( Lesser Saphenous vein ) చీలమండలము పార్శ్వభాగపు ఎముకకు వెనుకగా పైకి ప్రాకి కాలు వెనుక భాగములో పయనిస్తుంది. కాలి పైభాగములో మోకాలు వెనుక ఈ సిర కండరఆచ్ఛాదనము ( deep fascia ) లోనికి చొచ్చి జానుసిరతో ( popliteal vein ) కలుస్తుంది. జానుసిర, ఊరుసిరగా ( femoral vein ) తొడలోపల పయనిస్తుంది.కటివలయములో ( pelvis )  ఊరుసిర బాహ్య శ్రోణిసిరయై ( external ileac vein ), అంతర శ్రోణిసిరతో ( internal ileac vein ) కలసి శ్రోణిసిర ( common ileac vein ) అవుతుంది .
    వామ, దక్షిణ శ్రోణిసిరల సంధానము వలన అధోబృహత్సిర ( inferior venacava ) ఏర్పడుతుంది.
    పీడన వ్యత్యాసము వలన దూరసిరల నుంచి రక్తము ముందుకు ప్రవహించి హృదయములో కుడికర్ణికకు చేరుతుంది. కాళ్ళలో కండరములు ముకుళించుకొన్నపుడు నిమ్నసిరలపై ఒత్తిడి కలిగి రక్తము ముందుకు నెట్టబడుతుంది. సిరలలో కవాటములు తిరోగమన ప్రవాహమును నిరోధిస్తాయి. కండరములు విరామస్థితికి చేరినపుడు నిమ్నసిరలలో పీడనము తగ్గి బాహ్యసిరలలోని రక్తము ఛిద్రసిరల ద్వారా నిమ్మసిరలలోనికి ప్రవహిస్తుంది. 
    సిరలు సాగి, ఉబ్బి, మెలికలు తిరిగి ఉబ్బుసిరలుగా ( varicose veins ) మారవచ్చును. ఉబ్బుసిరలను కాళ్ళలో సామాన్యముగా చూస్తాము. 

ఉబ్బుసిరలు ఏర్పడుటకు కారణములు  


    ఉబ్బుసిరలు జన్యుపరముగా రావచ్చును. ఉబ్బుసిరలు పురుషులలో కంటె స్త్రీలలో హెచ్చుగా కలుగుతాయి. ఇవి స్థూలకాయము కలవారిలోను, గర్భిణీ స్త్రీలలోను ఎక్కువగా కలుగుతాయి. కటివలయములో పెరుగుదలల వలన శ్రోణిసిరలపై ఒత్తిడి పెరిగితే ఉబ్బుసిరలు కలుగవచ్చును. బాహ్యసిరలలో తాప ప్రక్రియ ( inflammation ) కలిగి కవాటములు చెడిపోతే తిరోగమన రక్తప్రవాహము వలన సిరలు ఉబ్బగలవు. సిరలు వ్యాకోచము చెందినపుడు కవాటముల సామర్థ్యత తగ్గుతుంది. ఛిద్రసిరల కవాటములు పనిచేయనిచో నిమ్నసిరల నుంచి రక్తము బాహ్య సిరలలోనికి ప్రవహించి వాటిని వ్యాకోచింప జేస్తాయి. 
    రక్తములో హోమోసిష్టిన్ ప్రమాణములు పెరిగితే ( hyperhomocysteinemia ) సిరల గోడలలోని సాగుకణజాలము ( elastin ) పీచుపదార్థము ( collagen ) ధ్వంసమయి సిరలు ఉబ్బగలవు.
    వయస్సు పెరిగిన వారిలోను, వ్యాయామము తక్కువైన వారిలోను, దినములో ఎక్కువగా నిలబడి ఉండేవారిలోను ఉబ్బుసిరలు ఎక్కువగా కలుగుతాయి. 

వ్యాధిలక్షణములు 


    ఉబ్బుసిరలు కంటికి కనిపిస్తాయి. ఉబ్బుసిరలు వ్యాకోచము పొంది, సాగి, పొడవయి, మెలికలు కలిగి ఉంటాయి. సులభముగా అణచబడుతాయి. వీటి వలన కాళ్ళలో పీకు, బరువు, లాగుతున్నట్లు నొప్పి కలుగవచ్చు. చీలమండ, పాదములలో పొంగు, వాపు కలుగవచ్చు. చర్మములో గోధుమ వర్ణకము కనిపించవచ్చును. చీలమండ పైభాగములో చర్మముక్రింద కొవ్వుతోను ( subcutaneous fat ), పీచుకణజాలముతోను ( fibrous tissue ) గట్టిపడి ( lipodermatosclerosis ) చుట్టూ నొక్కినట్లు ( ఆకుంచనము ; constriction ) కనిపించవచ్చును. చర్మములో తెల్లని మచ్చలు కలుగవచ్చును. 

ఉబ్బుసిరల వలన కొన్ని ఉపద్రవములు ( complications ) కలుగవచ్చు.


నిశ్చలన చర్మతాపము ( stasis dermatitis )  


    ఉబ్బు సిరలలో రక్తస్థంభపు ( column of blood ) పెరుగుదల వలన  కేశనాళికలలో పీడనము పెరిగి కణజాలములో ద్రవసాంద్రత ( congestion ) పెరుగుతుంది. ఎఱ్ఱ రక్తకణములు కూడా కణజాలములో చేరి వానినుంచి వెలువడు రక్తవర్ణకము ( hemoglobin ) హీమోసిడరిన్ గా ( hemosiderin ) నిక్షిప్తమవుతుంది. చర్మమునకు అద్దే లేపనములు వికటించి తాపము కలిగించవచ్చును. ఈ కారణములు అన్నీ చర్మతాపమును కలిగించగలవు.
    చర్మతాపము కలిగిన వారికి దురద, నొప్పి కలుగుతాయి. చర్మములో వాపు, ఎఱ్ఱదనము, గోధుమవర్ణకము కలుగుతాయి. చర్మపు మందము తగ్గుతుంది. చర్మములో పగుళ్ళు , పుళ్ళు కలుగవచ్చును. ఆపై సూక్ష్మాంగజీవుల ఆక్రమణ వలన చర్మములోను, చర్మముక్రింద కణజాలములోను తాపప్రక్రియ ( inflammation  ) కలుగవచ్చును.
    నిశ్చలన చర్మతాపము ఉబ్బుసిర వ్రణములకు ( varicose venous ulcers ) దారితీయవచ్చును.
    మానుదల లేని దీర్ఘకాలపు ఉబ్బుసిర వ్రణములలో కర్కట వ్రణములు ( carcinomas,  or Sarcomas ) పొడచూపవచ్చును.
    ఉబ్బుసిరలలో రక్తపుగడ్డలు ఏర్పడవచ్చును. అసాధారణముగా యీ రక్తపుగడ్డలు నిమ్నసిరలకు వ్యాపించవచ్చును. ఈ రక్తపు గడ్డలు కుడి కర్ణిక, కుడి జఠరికల ద్వారా , పుపుసధమనికి చేరితే అపాయకరము. 

పరీక్షలు 


    ఉబ్బుసిరలు ఉన్న వ్యక్తిని పడుకోబెట్టి ఆ కాలును ఎత్తిపెట్టి సిరలు సంకోచించాక మొలక్రింద దృశ్యసిర ( saphenous vein ) ఊరుసిరతో ( femoral vein )  సంధానమయే చోటను, ఛిద్రసిరల స్థానముల వద్దను పట్టీలు బిగించి, వ్యక్తిని నిలుచో బెట్టి పట్టీలు ఒక్కక్కటి తీసి నిమ్నసిరల నుంచి బాహ్యసిరల లోనికి ప్రవాహము ఎచ్చట తిరోగమనము చెందుతున్నదో నిర్ణయించవచ్చును. 
    ఇదివరలో ఊర్ధ్వపాద సిరచాపములోనికి ( dorsal venous arch ) సూది ద్వారా వ్యత్యాస పదార్థములను ( contrast materials ) ఎక్కించి ఎక్స్ - రే లతో సిరలను చిత్రీకరించేవారు. 
    ఈ దినములలో శ్రవణాతీతధ్వని సాధనములతో ( ultrasonic equipment ) కాళ్ళలోని దృశ్యసిరలను ( saphenous veins ), నిమ్నసిరలను ( deep veins ) చిత్రీకరించవచ్చును. రక్తప్రవాహము తిరోగమనము చెందు స్థానములను కూడా నిర్ణయించవచ్చును. 

చికిత్సలు 


కాళ్ళు ఎత్తులో పెట్టుట 


    కాళ్ళు హృదయము కంటె ఎత్తుగా ఉంచుట వలన సిరలలో  సాంద్రత ( congestion ) తగ్గుతుంది. పాదములలోను, చీలమండలలోను పొంగు, వాపు తగ్గుతాయి. తాపప్రక్రియ కూడా తగ్గుతుంది.

వ్యాయామము 


    నడక, వ్యాయామము సిరలలో  సాంద్రతను తగ్గిస్తాయి. కండరముల బిగుతును పెంచుతాయి .

సాగు మేజోళ్ళు ( elastic stockings ) 


    తగిన పీడనము గల మేజోళ్ళు మొలవఱకు గాని మోకాళ్ళ వఱకు గాని ధరిస్తే అవి సిరలలో రక్తప్రవాహమునకు తోడ్పడుతాయి. సిరలలో  సాంద్రతను తగ్గిస్తాయి. కాళ్ళు, చీలమండలము ( ankle ), పాదాలలో పొంగును, వాపును తగ్గిస్తాయి. కణజాలములో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మములో తాప ప్రక్రియను తగ్గిస్తాయి. ఉబ్బుసిర వ్రణముల మానుదలకు తోడ్పడుతాయి. దూరధమని వ్యాధి ( Peripheral Arterial Disease ) గలవారు సాగు మేజోళ్ళు వాడకూడదు.

సవిరామ వాయుపీడన సాధనములు ( intermittent pneumatic compression devices ) 


    సిరలలో రక్తప్రసరణను మెరుగుపఱచుటకు ఉపయోగపడుతాయి. కాళ్ళ పొంగులను, వాపులను తగ్గిస్తాయి.ఉబ్బుసిర వ్రణములు మానుటకు తోడ్పడుతాయి.

ఉబ్బుసిరల విధ్వంసము 


    ఉబ్బుసిరలలో తంతీకరణ రసాయనములతో ( sclerosing agents ) తాపప్రక్రియ ( inflammation) కలుగజేసి వాటిని ధ్వంసము చేసి పీచుకణజాలముచే గట్టిపఱచ ( sclerosis) వచ్చును. 
    శీతల శలాకలతోను ( cryoprobes ), ఉష్ణ శలాకలతోను, విద్యుచ్ఛక్తి శలాకలతోను సిరాంతర విధ్వంస ( Endovenous ablation ) ప్రక్రియచే ఉబ్బుసిరలను ధ్వంసము చేయవచ్చును.
    ఉబ్బు సిరలను లేసర్ కాంతికిరణ ప్రసరణముతోను, ఆవిరిని ప్రసరింపజేసి కూడా ధ్వంసము చేయవచ్చును. శ్రవణాతీతధ్వని సాధనములు శలాకలను సిరలలోనికి చేర్చుటకు ఉపయోగపడుతాయి. ధ్వంసమయిన సిరలు పీచుకణజాలముతో గట్టిపడుతాయి.

( వైద్యవిషయములను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును.)


పదజాలము :


Arteries = ధమనులు
Basement membrane = మూలాధారపు పొర గ.న )
Collagen = పీచుకణజాలము ( గ.న )
Cryoprobes  = శీతల శలాకలు
Deep veins = నిమ్నసిరలు ( గ.న )
Digital vein  = అంగుళికసిర ( గ.న )
Dorsal venous arch of foot = ఊర్ధ్వపాదసిరచాపము ( గ.న )
Elastin = సాగుకణజాలము ( గ.న )
Endovenous ablation  = సిరాంతరవిధ్వంసము ( గ.న )
External ileac vein = బాహ్యశ్రోణిసిర (గ.న ) 
Fascia = కండరాచ్ఛాదము ( గ.న )
Femoral vein  = ఊరుసిర 
Great saphenous vein  = గరిష్ఠ దృశ్యసిర ( గ.న )
Common ileac vein = శ్రోణిసిర ( గ.న )
Inferior venacava = అధోబృహత్సిర
Intermittent pneumatic compression devices = సవిరామ వాయుపీడన సాధనములు ( గ.న )
Internal ileac vein = అంతరశ్రోణిసిర ( గ.న )
Lesser Saphenous vein  = కనిష్ఠ దృశ్యసిర ( గ.న )
Perforator veins = ఛిద్ర సిరలు ( గ.న )
Popliteal vein = జానుసిర ( గ.న )
Saphenous orifice = దృశ్యసిర రంధ్రము ( గ.న )
Sclerosing agents = తంతీకరణ రసాయనములు ( గ.న )
Stasis dermatitis = నిశ్చలన చర్మతాపము ( గ.న )
Superficial veins  = బాహ్యసిరలు
Superior venacava = ఊర్ధ్వబృహత్సిర 
Varicose veins = ఉబ్బుసిరలు ( గ.న )
Varicose venous ulcers = ఉబ్బుసిర వ్రణములు ( గ.న )
Veins = సిరలు
Capillaries =సూక్ష్మరక్తనాళికలు

వ్యాపక జ్వరము ( Influenza )

                                                      వ్యాపక జ్వరము

                                                       ( Influenza )


                                                                                              డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .

( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో ) :

    వ్యాపక జ్వరాలు ( Influenza ) ప్రతి సంవత్సరము చాలా దేశాలలో పొడచూపుతాయి. ఫ్లూ బహుళ వ్యాపక వ్యాధిగా ( epidemic ) చాలామందికి కలుగవచ్చును. చాలా మందిలో దానంతట అది తగ్గిపోయినా, ఈ జ్వరాలు ప్రపంచము అంతటా వ్యాపించి చాలా మృత్యువులకు కారణమయిన సంఘటనలు ఉన్నాయి. దీని ప్రభావము అనేక జనులపై ఉండుట వలన ఈ వ్యాధికి Influenza అనే పేరు కలిగింది.
    సాధారణముగా ఈ వ్యాపక జ్వరాలు పశ్చిమ దేశాలలో ఆకురాల్చు కాలములోను, శీతాకాలములోను పొడచూపుతాయి.
    వ్యాపక జ్వరములు ఇన్ఫ్లుయెంజా A , B, C, D అనే విషజీవాంశములు ( Viruses , First recorded in 1590–1600; from Latin vīrus“slime, poison”; akin to Sanskrit viṣá-,) వలన కలుగుతాయి.

    విషజీవాంశములు ( viruses ) అతిసూక్ష్మమైనవి. వీటికి కణ నిర్మాణము ఉండదు. వాటంతట అవి మనజాలవు. వాటంతట అవి ప్రత్యుత్పత్తి చెందజాలవు. వీటిలో జీవరాశులలో వలె జీవ వ్యాపారక్రియలు జరుగవు. ఈ విషజీవాంశములు యితర జీవకణాలలో ప్రత్యుత్పత్తి అవుతాయి. ఇవి న్యూక్లియక్ ఆమ్లములతో ( Nucleic acids ) నిర్మితమవుతాయి. వీనిలో పొందుపఱచబడిన న్యూక్లియక్ ఆమ్లము బట్టి డీఆక్సీరైబోజ్ న్యూక్లియక్ ఆమ్ల విషజీవాంశములు ( DNA Viruses ), రైబోజ్ న్యూక్లియక్ ఆమ్ల విషజీవాంశములు ( RNA Viruses) గాను వీనిని విభజించవచ్చు.
    వ్యాపక జ్వరాలు ( Influenza ) కలిగించే విషజీవాంశములు రైబోజ్ న్యూక్లియక్ ఆమ్ల విషజీవాంశములు RNA Viruses). ఇవి Orthomyxoviridae సముదాయమునకు చెందుతాయి. 
    Influenza - A మనుజులకే కాక యితర క్షీరదములకు, పక్షులకు కూడా వ్యాధిని కలిగించగలవు. వీటి వలనే విశ్వవ్యాపక వ్యాధులు ( Pandemics ), తీవ్రవ్యాధులు కలుగుతాయి. ఈ జీవాంశముల ఉపరితలముపై హీమగ్లూటినిన్ hemagglutinin ( HA ) న్యూరెమినిడేజ్ neuramidinase (NA) అనే ప్రతిజనకములు ( antigens ) ఉంటాయి. ఆ ప్రతిజనకములలో విభాగముల బట్టి ఈ విషజీవాంశములను విభజిస్తారు. వీనిలో జన్యు పదార్థము ఎనిమిది ఒంటి పోగుల RNA తునుకలుగా ఉంటుంది. అందువలన కొత్త విషాంశముల ప్రత్యుత్పత్తి జరిగినపుడు జన్యు పదార్థపు మార్పులు ( mutations ) కలిగే అవకాశములు మెండు. అందువలన ఒకసారి వ్యాపక జ్వరము - ఎ బారిన పడినవారు మరల ఆ వ్యాధికి గుఱి అయ్యే అవకాశములు ఉన్నాయి.
    Influenza -B మనుజులలోనే చూస్తాము. సీలుచేపలకు, ఫెరెట్ పిల్లులకు ఈ వ్యాధి కలుగవచ్చు. ఈ విషజీవాంశములలో మార్పులు ( mutations ) తఱచు జరగవు. అందువలన చాలా మందికి ఒకసారి సోకగానే వ్యాధిని ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. విశ్వవ్యాపక వ్యాధులు దీని వలన కలుగవు.
    Influenza - C మనుజులకే కాక పందులకు, కుక్కలుకు కూడా సోకగలదు. ఈ వ్యాధి అసాధారణమైనా తీవ్రముగా ఒక్కొక్క ప్రాంతములో వ్యాప్తి జెందగలదు.
    Influenza - D వ్యాధి పశువులకు పందులకు సోకుతుంది. మనుజులకు సోకగలిగినా యింతవఱకు మనుజులలో యీ వ్యాధి కలిగిన సూచనలు లేవు.

వ్యాపక జ్వరాలు వ్యాప్తి 


    వ్యాపక జ్వరము సోకిన వారు దగ్గు తుమ్ముల ద్వారా విషజీవాంశ రేణువులను గాలిలోనికి వెదజల్లుతారు. దగ్గఱలో ఉన్నవారు ఆ నలుసులను పీల్చినా, లేక ఆ నలుసులు పడిన వస్తువులను తాకి ఆ చేతితో ముక్కు, నోరు,కళ్ళను తాకినా, ఆ విషజీవాంశములు శరీరములోనికి ప్రవేశిస్తాయి. వ్యాధి గలవారిని స్పర్శించుట వలన, వారితో కరచాలనములు చేయుట వలన ఆ విషాంశములను అంటించుకొనే అవకాశము ఉన్నది.

    ఈ విషజీవాంశములు వస్తువుల ఉపరితలములపైన 24 నుంచి 48 గంటల వఱకు మనగలవు. తుమ్ములు, దగ్గుల వలన గాలిలో వెదజల్లబడినా అవి త్వరగానే వాటి బరువుకు క్రిందకు చేరుకుంటాయి. గాలిలో ఎక్కువ కాలము ఉండవు. తేమ ఎక్కువగా ఉన్నా, సూర్యకాంతిలో అతినీలలోహిత కిరణాల వలన ( ultraviolet rays ) ఈ విషాంశములు త్వరగా ధ్వంసము అవుతాయి, సబ్బు, బట్టలసోడా, ఆల్కహాలు ఈ విషాంశములను నశింప చేస్తాయి.
    విషజీవాంశములు ముక్కు, గొంతుక, ఊపిరితిత్తుల కణముల పొరలకు హీమెగ్లూటినిన్ ల ద్వారా అంటుకొని పిదప కణముల లోనికి చొచ్చుకుంటాయి. ఆ కణములలో వాటి ప్రత్యుత్పత్తి జరిగి అనేక విషజీవాంశములు కణముల నుంచి విడుదలవుతాయి. ఆక్రమించబడిన కణములు ధ్వంసమవుతాయి. 

వ్యాపక జ్వర లక్షణములు  


    స్వల్ప తీవ్రత గల వారిలో ఏ లక్షణములు కనిపించకపోవచ్చును. వ్యాధి సోకిన వారిలో ఒంటినొప్పులు, కండరముల పీకు, శరీరమంతా నలత, గొంతునొప్పి, ముక్కుకారుట, జ్వరము,వణుకు, తలనొప్పి, దగ్గు, కలుగుతాయి. ఈ లక్షణములు రెండు దినముల నుంచి వారము వఱకు ఉండి క్రమేణ రోగులు కోలుకుంటారు. పిల్లలలో వాంతులు, విరేచనములు కలుగవచ్చు. ముక్కు కారుట కొంత ఉన్నా సాధారణ జలుబులో వలె ఎక్కువగా ఉండదు. సాధారణ జలుబు చేసిన వారిలో జ్వరము ఎక్కువగా ఉండదు. ఫ్లూ కలిగిన వారిలో ఒంటినొప్పులు, జ్వరము ఎక్కువగా ఉంటాయి.
    వ్యాధినిరోధక శక్తి తక్కువయిన వారిలోను, వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలోను వ్యాపక జ్వరముతో ఊపిరితిత్తుల తాపము ( Pneumonitis ) విషజీవాంశముల ( viruses ) వలన కాని, ఆ పిమ్మట దాడి సలిపే సూక్ష్మజీవుల ( bacteria ) వలన, లేక రెండిటి వలన కాని కలుగ వచ్చును. విషజీవాంశముల వలన కలిగే ప్రాథమిక పుపుస తాపములో ( Primary pneumonia ) రోగులు త్వరగా కోలుకోక జ్వరము కొనసాగి, పొడి దగ్గు, లేక తక్కువ కఫముతో దగ్గు, ఆయాసము కలుగుతాయి. 
    సూక్ష్మజీవుల వలన ఊపిరితిత్తుల తాపము కలిగిన వారిలో ( Secondary bacterial pneumonia ) ముందు జ్వరము తగ్గినా మళ్ళీ జ్వరము, దగ్గు పుంజుకుంటాయి. వీరిలో కఫము ఎక్కువగా ఉంటుంది. ఆయాసము కూడా కలుగవచ్చును. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా ( Streptococcus Pneumoniae ), స్టాఫిలోకోకస్ ఆరియస్ ( Staphylococcus Aureus ), హీమోఫిలస్ ఇన్ ఫ్లుయెంజా ( Haemophilus Influenzae ) సూక్షాంగజీవుల వలన తఱచు ఈ ఊపిరితిత్తుల తాపము ఉపద్రవముగా సంక్రమిస్తుంది.  ఊపిరితిత్తుల తాపము ఎక్స్ రే చిత్రములలో ప్రస్ఫుటముగా కనిపిస్తుంది. 
    ఊపిరితిత్తుల తాపము తీవ్రతరమయితే శ్వాసవైఫల్యము ( respiratory failure ) కూడా కలిగే ప్రమాదము గలదు. 
    వ్యాధిగ్రస్థులలో  క్రొత్త విషజీవాంశముల ప్రత్యుత్పత్తి కలిగినపుడు వాటి జన్యుపదార్థములో ( genome ) మార్పులు ( mutations ) స్వల్పముగానో ( viral drift ), ఎక్కువగానో జరిగినపుడు ( viral shift ) వ్యాపక జ్వరముల తీవ్రత అధికము కావచ్చును, వాటి ఉగ్రత అధికమయి వ్యాధి అధిక సంఖ్యాకులకు సోకి త్వరగా వ్యాపించవచ్చును.

వ్యాధి నిర్ణయము 


    వ్యాపక జ్వరములు ప్రబలముగా ఉన్నపుడు వ్యాధి లక్షణముల బట్టి వ్యాధిని నిర్ణయించవచ్చును. జ్వరము, దగ్గు ఎక్కువగా ఉండి ముక్కు కారుట తక్కువగా ఉంటే వ్యాపక జ్వరము ( influenza ) అయే అవకాశములు హెచ్చు. ముక్కు, గొంతుకల నుంచి  సేకరించిన శ్లేష్మమును ప్రతిజనకములకు ( antigens ) పరీక్షించి వ్యాధిని నిర్ణయించవచ్చును. polymerase Chain Reaction తో ప్రతిజనకములు ఉత్పత్తి చేసి జన్యు పదార్థములను కనుగొనవచ్చును. ప్రతిరక్షకములను direct fluorescent antibody test తో కనుగొనవచ్చును. శ్లేష్మములోని విషజీవాంశములను వృద్ధిచేసి ( culture ) వ్యాధిని నిర్ణయించ వచ్చును.

వ్యాధి చికిత్స 


    వ్యాపక జ్వరాలు ఉన్నవారిలో చాలామందికి ఉపశమన చికిత్సలు సరిపోవచ్చును. ఎసిటెమైనోఫిన్ , పారాసిటమాల్ జ్వరమునకు తలనొప్పికి వాడవచ్చును. పిల్లలలో ఏస్పిరిన్ రేయీస్సిండ్రోమ్ ( Reye’s Syndrome) కలిగించవచ్చు, కాబట్టి ఏస్పిరిన్ వాడకూడదు. తగినంతగా ద్రవ పదార్థములు, ఆహారము, విశ్రాంతి సమకూర్చాలి. వీరు మద్యము సేవించరాదు. పొగత్రాగుట మంచిది కాదు. వ్యాధి తీవ్రత పొగత్రాగుట, మద్యముల వలన ఎక్కువ అవుతుంది.

మందులు :  న్యూరమిడినేజ్ నిరోధకములు ( Neuramidinase inhibitors )  

    ఇవి విషజీవాంశముల పొరపై గల న్యురమిడినేజ్ అనే జీవోత్ప్రేరకమునకు ( enzyme ) అవరోధము కలిగించి విషజీవాంశముల విడుదలను నిరోధిస్తాయి. ఓసెల్టమివీర్ ( Oseltamivir -( Tamiflu ) వయోజనులలో 75 మి.గ్రాలు దినమునకు రెండు పర్యాయములు, జెనమివీర్ ( Zanamivir ( Relenza ) వయోజనులలో 10 మి.గ్రా లు పీల్పువుగా దినమునకు రెండు సారులు 5 దినములు వ్యాధి చికిత్సకు, నివారణకు కూడా వాడవచ్చు.
    ఎమాంటడిన్ ( Amantadine ) ఇన్ ఫ్లుయెంజా ఏ కి వాడవచ్చు. ఈ ఔషధములను వ్యాధి కలిగిన 24 - 48 గంటలలో మొదలుపెడితే ప్రయోజనము ఎక్కువ.
    సూక్ష్మజీవ నాశకములు ( antibiotics) ఫ్లూ జ్వరము తర్వాత సూక్షజీవులు ( bacteria) దాడి చేసి కలిగించే ఊపిరితిత్తుల తాపమునకు ( Pneumonia), శ్వాసనాళిక పుపుసనాళికల తాపమునకు ( Bronchitis) ఉపయోగిస్తారు. విషజీవాంశములపై వాటి ప్రభావము శూన్యము.
    వ్యాధితీవ్రముగా ఉన్నవారికి వైద్యాలయములలో చికిత్సలు అందించాలి. 

వ్యాపక జ్వరముల నివారణ  


    వ్యాపక జ్వరముల నివారణకు టీకాలు లభ్యము. 6 మాసములు నుంచి 18 సంవత్సరముల వారు, 50 సంవత్సరములు నిండిన వారు, ఫ్లూ కాలములో గర్భిణీ స్త్రీలు, ఫ్లూ కాలములో గర్భము దాల్చబోయే స్త్రీలు, ఉబ్బస, మధుమేహము, శ్వాసకోశపు వ్యాధులు, హృద్రోగములు వంటి ఇతర వ్యాధులు ఉన్న వారు, ఆరోగ్య విధులలో పనిచేసేవారు టీకాలు వేసుకొనుట మేలు.
    వ్యాపక జ్వరాలు ఉన్నవారికి దూరముగా ఉండుట, స్పర్శ, కరచాలనములు  పాటించక పోవుట వలన, నోరు ముక్కులపై కప్పులను ( masks ) ధరించుట వలన, చేతులను తఱచు శుభ్రము చేసుకొనుట వలన, నోరు, ముక్కు, కనులు, ముఖములపై చేతులను చేర్చకపోవుట వలన వ్యాపక జ్వరములను కొంతవఱకు నివారించ గలుగుతాము. 
    దగ్గు, తుమ్ములు ఉన్న వారు మోచేతిని గాని ఆచ్ఛాదనములను ( masks )  కాని నోటికి, ముక్కుకి అడ్డుపెట్టుకొని దగ్గుట, తుమ్ముట చేస్తే తుంపరలను వ్యాప్తి చేయరు. 

పదజాలము :

Antibiotics = సూక్ష్మజీవ నాశకములు
Antigens  = ప్రతిజనకములు
Bacteria = సూక్షాంగజీవులు 
Enzyme = జీవోత్ప్రేరకము  ( గ.న )
Epidemic = బహుళవ్యాపక వ్యాధి
Genome = జన్యుపదార్థము ( గ.న )
Influenzas  = వ్యాపక జ్వరములు ( గ.న )
Masks = కప్పులు ; ఆచ్ఛాదనములు
Pandemics = విశ్వవ్యాపక వ్యాధులు ( గ.న )
Pneumonitis  = ఊపిరితిత్తుల తాపము ; పుపుసతాపము ( గ.న )
Viruses = విషజీవాంశములు ( గ.న )

( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును )

16, ఫిబ్రవరి 2020, ఆదివారం

శిలీంధ్ర చర్మవ్యాధులు -2 ( Fungal skin diseases-2 )

   శిలీంధ్ర చర్మ వ్యాధులు - 2

             ( Fungal skin diseases - 2 )

                                                                            
                                                                                  డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.
                                                

   
     ఇది వఱకు కొన్ని శిలీంధ్ర వ్యాధులను వర్ణించాను. ఇపుడు మరి కొన్నిటి గుఱించి వ్రాస్తాను.


                                     గడ్డపు తామర ( Tinea barbae  )


    గడ్డపు తామర, చర్మాంకురములు ( Dermatophytes )  ట్రైఖోఫైటన్ మెన్టగ్రోఫైట్స్  ( Trichophyton  mentagrophytes ), ట్రైఖో ఫైటన్ వెర్రుకోసమ్  (Trichophyton verrucosum ) వలన కలుగుతాయి. ఇవి మనుజుల నుంచి మనుజులకు లేక జంతువుల నుంచి మనుజులకు,  వ్యాప్తి చెంది రుగ్మతలను కలిగిస్తాయి. ఒకరి గడ్డపు కత్తె మరొకరు ఉపయోగించుట వలన కూడా శిలీంధ్రములు వ్యాపించగలవు.

    రైతులలో ఎక్కువగా ఈ వ్యాధులు పొడచూపుతాయి. ఉష్ణ ప్రాంతములలో నివసించే వారిలో గడ్డపు తామర కలిగే అవకాశములు ఎక్కువ. గడ్డము, మీసపు ప్రాంతములలో చర్మమును, రోమ కూపములను, రోమములను ఆశ్రయించి శిలీంధ్రములు తాపము కలిగిస్తాయి.

వ్యాధిలక్షణములు 




    గడ్డపు చర్మములో ఇవి తామర కలుగ జేసినపుడు ఎఱుపు లేక గులాబి రంగు గుండ్రని మచ్చలు కలుగుతాయి. కొందఱిలో వ్యాధి రోమ కూపములలోనికి చొచ్చుకొని తాపము కలుగజేసి చిన్న చీము పొక్కులను ( pastules ), పుళ్ళను ( furuncles ) కలిగిస్తాయి. కొందఱిలో తాప ప్రక్రియ హెచ్చయి పుళ్ళతో మెత్తని ‘రోమ కూప శిలీంధ్ర వ్రణములు ( Kerions ) ‘ఏర్పడుతాయి. చర్మపు లోపలి భాగములలో తాపము వ్యాపించినపుడు ఎఱ్ఱని దళసరి కణుతులు ( nodules ) ఏర్పడవచ్చును. ఈ వ్యాధి వలన దురద కలుగుతుంది. తాపము గడ్డపు క్రింద రసి గ్రంధులకు ( lymph glands ) వ్యాపిస్తే అవి వాచుతాయి. జ్వరము కూడా రావచ్చును.

వ్యాధి నిర్ణయము 


    అనుభవజ్ఞులైన వైద్యులు చూచి వ్యాధిని చాలా పర్యాయములు నిర్ణయించగలరు. చర్మమును శస్త్రకారుల  చురకత్తితో గోకి వచ్చిన పొట్టును గాని, వెండ్రుకలను పీకి గాని వాటికి పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు వేసి సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి శిలీంధ్రపు పోగులను ( hyphe ) గుర్తించి వ్యాధిని నిర్ణయించవచ్చును. చర్మము నుంచి, వెండ్రుకల నుంచి  ప్రయోగశాలలలో శిలీంధ్రములను పెంచవచ్చును (fungal cultures ). వ్యాధికి లోనైన చర్మ భాగములతో కణ పరీక్షలు ( biopsies ) చేసి కూడ వ్యాధిని నిర్ణయించవచ్చును.

చికిత్స 

   
    గడ్డపు తామర ఆరంభదశలో ఉన్నపుడు ఆ ప్రాంతమునకు , పరిసర ప్రాంతములకు క్లోట్రిమజాల్ ( Clotrimazole ) గాని, మికనొజాల్ ( micanozole ), గాని, టెర్బినఫిన్ ( terbinafine ) గాని లేపనములను  ( anti fungal creams ) రెండు నుంచి నాలుగు వారములు  రాస్తే వ్యాధి నయము కావచ్చును. గడ్డము గీసినపుడల్లా కొత్త బ్లేడులు వాడాలి, లేకపోతే శుభ్రపఱచిన వాటిని వాడుకోవాలి. పెంపుడు జంతువులను జంతు వైద్యులచే పరీక్ష చేయించి వాటికి శిలీంధ్ర వ్యాధులు ఉంటే తగిన చికిత్స చేయించాలి.

    సాధారణముగా గడ్డపు తామర  లేపనములకు నయము కాదు. రెండు వారములలో సత్ఫలితములు కలుగకపోయినా, వ్యాధి తీవ్రత అధికముగా ఉన్నా నోటి ద్వారా మందులు అవసరము.
  
     గ్రైసియోఫల్విన్ ( Griseofulvin ) దినమునకు 500 మి.గ్రా. నుంచి ఒక గ్రాము వఱకు రెండు మూడు వారములు వాడితే ఫలితములు కనిపిస్తాయి. టెర్బినఫిన్ ( Terbinafine ) దినమునకు 250 మిల్లీ గ్రాములు గాని, ఇట్రాకొనజోల్ ( Itraconazole ) దినమునకు  200 మి.గ్రాలు  గాని రెండు మూడు వారములు వాడినా సత్ఫలితములు కలుగుతాయి.

    తాప ప్రక్రియ ( inflammation ) అధికముగా ఉన్నపుడు తాపమును తగ్గించుటకు  శిలీంధ్ర నాశకములతో పాటు ప్రెడ్నిసోన్ ( Prednisone ) 40 మి.గ్రాలు దినమునకు మొదలుపెట్టి క్రమేణా వైద్యుల పర్యవేక్షణలో  తగ్గిస్తూ మానివేయాలి.

     శిలీంధ్ర నాశకములను నోటి ద్వారా ఎక్కువ దినములు వాడినపుడు రక్తకణ పరీక్షలు, కాలేయ వ్యాపార పరీక్షలు నెలకు ఒకసారైనా చేయించుకొవాలి.


            సోబి ; సుబ్బెము ( Tinea versicolor : Pityriasis versicolor ) 





    సోబి లేక సుబ్బెముగా వ్యవహారములో ఉన్న వ్యాధి  మలస్సీజియా ఫర్ ఫర్ ( Malassezia  furfur ), లేక మలస్సీజియా గ్లోబోజా ( Malassezia globosa )  అనే మధు శిలీంధ్రములు ( yeast ) వలన కలుగుతుంది.

    మలస్సీజియా ద్విరూపి ( dimorphic ). ఇది మొగ్గలు తొడిగే ( budding ) మధు శిలీంధ్రపు రూపములో గాని, శాఖలు కట్టే  పోగుల ( branching hyphae ) శిలీంధ్ర రూపములో గాని, రెంటిగా గాని ( spaghetti  and meat ball appearance ) సూక్ష్మదర్శిని క్రింద కనిపిస్తుంది.
       
    మలస్సీజియీ చాలామందిలో చర్మము పై హాని కలిగించకుండా మనుగడ సాగిస్తాయి. కొందఱిలో మాత్రము ముఖ్యముగా, వ్యాధి నిరోధక శక్తి లోపించిన వారిలోను, కార్టికోష్టీరాయిడులు ( corticosteroids ) వాడే వారిలోను, గర్భిణీ స్త్రీలలోను, ఆహార లోపములు ఉన్నవారిలోను, మధుమేహ వ్యాధి కలవారిలోను, సోబిని కలిగించవచ్చును. వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు, వాతావరణములో తేమ అధికముగా ఉన్నపుడు చెమట ఎక్కువగా పట్టే వారిలోను సోబి తఱచు కనిపిస్తుంది .

    సోబి  కలిగిన వారిలో చర్మముపై  గోధుమరంగు, గులాబి రంగు , ఎఱుపు రంగు, రాగి రంగు మచ్చలు పొడచూపుతాయి. ఈ మచ్చలు విడివిడిగా కాని కలిసిపోయి కాని కనిపించవచ్చును. మచ్చల అంచులు నిర్దుష్టముగా ఉంటాయి. వీటిపై సన్నవి పొలుసులు ( scales ) ఏర్పడి బూడిదలా పొట్టు రావచ్చును. తెల్లగా ఉన్నవారిలో వేసవి కాలములో చర్మపు రంగు ఎక్కువ అగుటచే , సోబి మచ్చలు బాగా కనిపిస్తాయి.

    కొందఱిలో మలాస్సీజియా ఫర్ ఫర్ ఎజెలైక్ ఆమ్లము  ( azelaic acid ) ఉత్పత్తి చేయుట వలన ఆ ఆమ్లము టైరొసినేజ్ ( tyrosinase ) అనే జీవోత్ప్రేరకమును ( enzyme ) నిరోధించి, మెలనిన్ ( melanin ) అను చర్మ వర్ణకపు ఉత్పత్తిని తగ్గించుట వలన  సోబి మచ్చలు వర్ణహీనత ( hypopigmentation ) పొందుతాయి.

వ్యాధి నిర్ణయము 


    సోబిని ( Tinea versicolor ) సాధారణముగా చూసి పసిగట్టవచ్చును. అతినీలలోహిత దీపముతో ( Wood’s ultraviolet light ) చర్మమును పరీక్షించునపుడు సోబి మచ్చలు తెల్లని బంగారు రంగులో ప్రతిదీప్తిస్తాయి.

    చర్మపు పై పొరలను గాజు పలకతో కాని, శస్త్రకారుల చురకత్తితో కాని గోకి వచ్చిన పొట్టుకు పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు కలిపి సూక్ష్మదర్శినితో పరీక్షించి మధు శిలీంధ్రమును ( yeast ), శిలీంధ్రపు పోగులను ( hyphae ) గుర్తించి వ్యాధిని నిర్ణయించవచ్చును.

చికిత్స 


    సోబికి సెలీనియమ్ సల్ఫైడు ( selenium sulphide ) షాంపూ 2.5 % ను గాని, 2 % కీటోకొనజోల్ ని ( Ketoconazole ) గాని పొడి చర్మపుపై లేపనముగా ప్రతిదినము ఒకసారి పూసి పది నిముషములు ఉంచి పిదప కడిగివేస్తూ వారము పది దినములు  చికిత్స చేస్తే సోబి తగ్గుతుంది. సైక్లోపిరాక్స్ ( ciclopirox ), మికొనజోల్ ( miconazole ), టెర్బినఫిన్ ( terbinafine ), క్లోట్రిమజాల్ ( clotrimazole ) వంటి శిలీంధ్రనాశక లేపనములకు సోబి తగ్గుతుంది. జింక్ పైరిథియోన్ ( zinc Pyrithione ) సబ్బుతో స్నానము వలన సోబిని అదుపులో ఉంచవచ్చును.

    నోటి ద్వారా ఫ్లుకొనజోల్ ( fluconazole ) 150 మి.గ్రా. కాని,  కీటోకొనజోల్ ( ketoconazole ) 200 మి.గ్రాలు కాని  ఒకే ఒక్క మోతాదుగా గాని, లేక తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి  వారమునకు ఒక సారి చొప్పున నాలుగు వారముల విరామ చికిత్స గాని ( Pulse therapy ) చేయవచ్చును .


               గోటి తామర ; నఖ శిలీంధ్రవ్యాధి ( Tinea unguium ) 



    శిలీంధ్రములు గోళ్ళను కాని గోటి క్రింద చర్మమును ( నఖక్షేత్రము ) కాని లేక రెంటినీ కాని ఆక్రమించి గోటి తామర ( నఖ శిలీంధ్రవ్యాధి ) కలుగజేస్తాయి. చేతి గోళ్ళలో కంటె కాలి గోళ్ళలో శిలీంధ్ర వ్యాధిని ఎక్కువగా చూస్తాము.



    వృద్ధులలోను, పురుషులలోను, అదివరకు సోరియాసిస్ ( psoriasis  ) వంటి గోటి వ్యాధులు కలవారిలోను, దూరధమని వ్యాధిగ్రస్థులలోను ( peripheral arterial disease  ), మధుమేహ ( diabetes mellitus ) వ్యాధిగ్రస్థులలోను, పాదములలో తామర కలవారిలోను, వ్యాధి నిరోధకశక్తి లోపించిన వారిలోను గోటి తామర తఱచుగా చూస్తాము.

    ట్రైఖోఫైటాన్ రూబ్రమ్ ( Trichophyton rubrum ) వంటి చర్మాంకురములు ( dermatophytes ) 60-75 శాతపు గోటి తామరలను కలుగజేస్తాయి. ఏస్పర్జిల్లస్ ( Aspergillus ), స్కోప్యులారియోప్సిస్ ( Scopulariopsis ), ఫ్యుసేరియమ్ ( Fusarium ) వంటి శిలీంధ్రములు, మధు శిలీంధ్రములు ( Candidiasis ) వలన యితర నఖ శిలీంధ్ర వ్యాధులు కలుగుతాయి.

వ్యాధి లక్షణములు 


    నఖములు శిలీంధ్ర వ్యాధికి లోనగునపుడు వాటిపై తెల్లని, లేక పసుపు పచ్చని, లేక నల్లని మచ్చలు పొడచూపుతాయి. ఆ గోళ్ళు దళసరి కట్టి వికారము అవుతాయి. గోళ్ళు పెళుసుకట్టి సులభముగా విఱిగిపోతుంటాయి. గోళ్ళ తామర మూడు విధములుగా కనిపించవచ్చును.

    1). గోటి చివర వ్యాధి కనిపించి గోరు దళసరి కట్టి, వివర్ణత చెంది, కెరటిన్ , యితర శిధిలములు గోటి క్రింద చేరి , గోరు దిగువ చర్మము నుంచి ఊడిపోవచ్చును ( Onycholysis  ).

    2). నఖ మూలములో వ్యాధి కనిపించవచ్చును. వ్యాధి నిరోధక శక్తి తగ్గినవారిలో నఖమూలములలో వ్యాధి ఎక్కువగా కలుగుతుంది.

    3). కొందఱిలో తెల్లని సుద్ద వంటి పొట్టు గోటి క్రింద కనిపిస్తుంది.

    చాలా మందిలో నొప్పి, బాధ ఉండవు, కాని కొందఱిలో చర్మములో కణ తాపము ( cellulitis ) కలిగే అవకాశము కలదు.

వ్యాధి నిర్ణయము 


    అనుభవజ్ఞులైన వైద్యులు చూసి వ్యాధిని పసిగట్టగలరు.  కత్తిరించిన గోళ్ళను, గోటి క్రింద భాగములను గోకి వాటిని పొటాసియమ్ హైడ్రాక్సైడ్ తో శిలీంధ్రములకై సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించ వచ్చును. కత్తిరించిన గోళ్ళను, గోళ్ళ క్రింద చర్మమును గోకి ఆ భాగములతో శిలీంధ్రములను ప్రయోగశాలలో పెంచి ( fungal cultures ) వ్యాధిని నిర్ణయించ వచ్చును. వాటితో పొలిమెరేజ్ గుణకారచర్య ( polymerase chain reaction  PCR ) పరీక్షతో శిలీంధ్రములను త్వరగా గుర్తించవచ్చును. కత్తిరించిన గోళ్ళను, నఖ శిధిలములను  పెర్ ఐయోడిక్ ఏసిడ్ స్కిఫ్ ( Periodic acid schiff  ) వర్ణకముతో సూక్ష్మదర్శినితో పరీక్షించి శిలీంధ్ర వ్యాధిని నిర్ణయించవచ్చును.

    సోరియాసిస్ ( psoriasis  ) నఖవ్యాధి, లైఖెన్ ప్లానస్ ( lichen planus ) నఖవ్యాధి, యితర నఖ వ్యాధులు శిలీంధ్ర వ్యాధులను పోలి ఉండవచ్చు. కాబట్టి తగిన పరీక్షలతో చికిత్సకు పూర్వము  వ్యాధిని నిర్ణయించవలసిన అవసరము ఉన్నది.

చికిత్స 


      గోటి తామరలు అన్నిటికీ చికిత్స అవసరము లేదు. వ్యాధి తీవ్రత లేనప్పుడు, రోగికి బాధ లేనప్పుడు, యితర ఉపద్రవములు కలుగనప్పుడు , చికిత్స అవసరము లేదు.  చికిత్స వలన అందఱికీ సత్ఫలితములు కనిపించవు. ఫలితములు చేకూరినా, వ్యాధి మఱల వచ్చే అవకాశములు ఎక్కువ.

    టెర్బినఫిన్ ( terbinafine ), కీటోకొనజోల్ ( ketoconazole ) వంటి మందులు దీర్ఘకాలము వాడినపుడు కాలేయ పరీక్షలు, రక్త పరీక్షలు చేస్తూ అవాంఛిత ఫలితములు రాకుండా జాగ్రత్త పడాలి. అందువలన వృద్ధులైన నా రోగులలో బాధ పెట్టని నఖ శిలీంధ్ర వ్యాధుల చికిత్స విషయములో ( గోటితో పోయే దానికి. పోయేది గోరే కదా ? కాలేయమును సురక్షితముగా ఉంచుదాము  అనుకుంటూ ) రోగులు కూడా నాతో అంగీకరించినపుడు నేను  చాలా సంయమనము పాటిస్తాను. 

    కాని కణ తాపము ( cellulitis  ) కలిగిన వారిలోను, మధుమేహవ్యాధి ( diabetes ) కలిగి కణ తాపము వంటి ఉపద్రవములు కలిగే అవకాశము ఉన్న వారిలోను, ఇతర బాధలు ఉన్న వారిలోను, రోగులు చికిత్స కావాలని కోరినపుడు చికిత్సలు అవసరము.

    గోళ్ళకు 8 %  సైక్లోపిరాక్స్ (  ciclopirox ) కాని, 10 % ఎఫినకొనజోల్ ( efinaconazole ) కాని, 5 % ఎమొరోల్ఫిన్ ( amorolfine ) కాని, పూతగా పూయుట వలన 30 శాతము మందిలో ఫలితములు కనిపిస్తాయి.

    టెర్బినఫిన్ నోటి ద్వారా దినమునకు 250 మి. గ్రాములు చొప్పున చేతి గోళ్ళకు 6 వారములు, కాలి గోళ్ళకు 12 వారములు కాని, లేక నెలలో దినమునకు 250 మి. గ్రాములు చొప్పున ఒక వారము మాత్రము ఇస్తూ విరామ చికిత్సను ( pulse therapy ) ఫలితములు కనిపించే వరకు కొనసాగిస్తే 70 - 80 శాతము మందిలో ఫలితములు కనిపిస్తాయి.
 
    ఇట్రాకొనజోల్ ( Itraconazole ) దినమునకు 200 మి.గ్రాములు రెండు సారులు చొప్పున నెలలో ఒక వారము చొప్పున మూడు నెలలు చికిత్స చేస్తే 40-50 శాతము మందిలో ఫలితములు కనిపిస్తాయి.

    ఫలితములు కలిగినా 10 నుంచి 40 శాతము మందిలో వ్యాధి తిరిగి రావచ్చును. రోగులు గోళ్ళను పొట్టిగా కత్తిరించుకోవాలి. వారు పాత పాదరక్షలను మరల వాడకూడదు. చెమటను పీల్చే కాలి తొడుగులు వాడుకోవాలి.  పాదములకు గాలి బాగా సోకనీయాలి. చేతులు పొడిగా ఉంచుకొనుటకు ప్రయత్నించాలి.

   ( చిత్రములను అభిమానముతో అందజేసిన నా ఆప్తమిత్రులు, చర్మవ్యాధి నిపుణులు డాక్టరు. గండికోట రఘురామారావు గారికి కృతజ్ఞతలతో .)


పదజాలము :

Abscesses  = చీముతిత్తులు ( గ.న )
Alopecia = బట్టతల మచ్చలు ( గ.న )
Antibiotics = సూక్ష్మజీవ సంహారకములు ( గ.న )
Antifungals = శిలీంధ్ర నాశకములు ( గ.న )
Biopsies = కణపరీక్షలు 
Bullae = బొబ్బలు ( గ.న )
Cellulitis = కణతాపము ( గ.న )
Dermatophytes = చర్మాంకురములు ( గ.న )
Dimorphic  = ద్విరూపి 
Enzyme = జీవోత్ప్రేరకము ( గ.న )
Hyphae = శిలీంధ్రపు పోగులు 
Hypopigmentation = వర్ణహీనత ( గ.న )
Intertriginous tinea pedis = అంగుళాంతర వ్యాధి ( గ.న )
Fungal Spores = శిలీంధ్ర బీజములు
Fungi = శిలీంధ్రములు 
Furuncles = సెగగడ్డ
Kerions =   రోమకూప శిలీంధ్ర వ్రణములు ( గ.న )
Nail bed = నఖక్షేత్రము ( గ.న )
Nodules = కణుతులు ( గ.న )
Pastules = చీము పొక్కులు ( గ.న )
Peripheral arterial disease  = దూరధమని వ్యాధి ( గ.న )
Pulse therapy = విరామ చికిత్స ( గ.న )
Scales = పొలుసులు
Tinea barbae  = గడ్డపు తామర ( గ.న )
Tinea capitis = తల తామర ( గ.న )
Tinea carporis = ఒంటి తామర ( గ.న )
Tinea cruris = తొడమూలపు తామర ( గ.న )
Tinea Pedis = పాదశిలీంధ్ర వ్యాధి ( గ.న )
Tinea unguium ; Onychomycosis = గోటి తామర ; నఖ శిలీంధ్రవ్యాధి ( గ.న )
Tinea versicolor = సోబి ; సుబ్బెము ( Pityriasis versicolor )
 Ultraviolet light = అతినీలలోహిత దీపము ( గ.న )
Ultraviolet rays = అతినీలలోహిత కిరణములు ( గ.న )
Vesicles = నీటి పొక్కులు
Yeast ; Candida = మధుశిలీంధ్రము

( వైద్య విషయములను తెలుగులో నా శక్తి మేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించవలెను. వైద్యులు ప్రత్యక్షముగా చూసి తగిన పరీక్షలు చేసి వ్యాధి నిర్ణయము చేసి చికిత్స చేయుట నైతికము , ధర్మము. ఉపయుక్తము అనుకుంటే నా వ్యాసములను నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )
 

                                     

                                           

                                           

Sent from my iPad

26, జనవరి 2020, ఆదివారం

శిలీంధ్ర చర్మవ్యాధులు ( Skin diseases caused by fungi )


                                  శిలీంధ్ర చర్మవ్యాధులు - 1

                             ( Fungal skin diseases - 1 )


                                                              డాక్టరు గన్నవరపు నరసింహమూర్తి.


( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో  )


    శిలీంధ్రములు వృక్షజాతులకు జంతుజాలమునకు విభిన్నమైన జీవరాశులు. ఇవి ఆహారమునకు ఇతర జీవులపై ఆధారపడుతాయి. వీని కణ కవచములు ఖైటిన్ అను బహుళ శర్కరను కలిగి ఉంటాయి. ఇవి మృతకణములపై జీవిస్తాయి. 

    చర్మ శిలీంధ్రములు పైచర్మము ( epidermis ) పొరలోను గోళ్ళలోను ఉండు  కెరటిన్ ( keratin  ) లోని మృత కణములపైన, కేశములపైన జీవించి వ్యాధులను కలిగిస్తాయి. ఇవి ఒకరి నుంచి వేఱొకరికి, జంతువుల నుంచి మనుజులకు, ఒక్కోసారి మట్టినుంచి మనుజులకు సంక్రమించగలవు. 
  
    కణ రక్షణ వ్యవస్థలో లోపములు ఉన్నవారిలో [ ప్రాధమిక రక్షణ లోపము ( Primary immune deficiency ) గలవారిలోను, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను, హెచ్ ఐ వి వ్యాధిగ్రస్థులలోను ] శిలీంధ్రవ్యాధులు ఎక్కువగా కలుగుతాయి.

    మధు శిలీంద్రము ( yeast, Candida ), Epidermophyton, Microsporum, Trichophyton జాతుల చర్మాంకురములు ( Dermatophytes), శిలీంధ్ర వ్యాధులను కలుగజేస్తాయి. స్థానముల బట్టి  వ్యాధులను వర్ణిస్తారు.

                                 తొడమూలపు తామర ( Tinea cruris ) 


    వేసవి కాలములో, చెమట ఎక్కువగా పట్టి, గజ్జలలో తేమ అధికముగా ఉన్నపుడు, ఇరుకైన వస్త్రములు ధరించువారిలోను, స్థూలకాయులలోను, ఒరిపిడులు కలుగు వారిలోను, ఈ వ్యాధి ప్రాబల్యము ఎక్కువ. పురుషులలో ఈ వ్యాధిని ఎక్కువగా చూస్తాము. Trichophyton rubrum, Trichophyton mentagrophytes గజ్జల తామరను ఎక్కువగా కలుగజేస్తాయి. 



    దీని వలన దురద కలుగుతుంది. తామర గుండ్రని రాగి రంగు మచ్చలుగ తొడమూలములో  లోపలి భాగములో పొడచూపుతాయి. ఇవి అంచులలో వ్యాప్తి చెందుతూ, మధ్య భాగములో నయము అవుతూ కనిపిస్తాయి. మచ్చలలో గఱుకుదనము కనిపిస్తుంది. ఒరిపిడి, చెమట ఎక్కువయి నానుడుతనము ఉండవచ్చును. దీర్ఘకాలము వ్యాధి ఉన్నవారిలో మచ్చలు గట్టిపడి తోలువలె దళసరి కట్టవచ్చును.

    అనుభవజ్ఞులైన వైద్యులు చూసి వ్యాధిని నిర్ణయించగలరు.  గాజు పలకతో గాని, శస్త్రకారుని చురకత్తి అంచుతో గాని జాగ్రత్తగా మచ్చల అంచులను గోకి వచ్చిన పొట్టును గాజు పలకపై  పొరగా నెఱపి పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు వేసి పది పదిహైను నిమిషముల తరువాత సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి గడలు వలె ఉండి శాఖలు కలిగిన శిలీంధ్రపు పోగులను ( hyphae ) గుర్తించి వ్యాధి నిర్ణయము చేయవచ్చును.

చికిత్స 


    శిలీంధ్రములను అరికట్టు కీటోకొనజాల్ ( ketoconazole ), క్లోట్రిమజాల్ ( Clotrimazole ),ఎకొనజోల్ ( Econazole ), మికొనజాల్ ( Miconazole ),టెర్బినఫిన్ ( Terbinafine ), సైక్లోపిరాక్స్ ( Ciclopirox ) లేపనములలో దేనినైనా దినమునకు రెండు సారులు పూచి మర్దనా చేస్తూ రెండు మూడు వారములు వాడితే ఫలితము చేకూరుతుంది

    దీర్ఘకాలము వ్యాధి ఉన్నవారిలోను, వ్యాధి విస్తారముగా ఉన్నవారిలోను, పూతల చికిత్సకు లొంగని వారిలోను ఇట్రాకొనజాల్ ( Itraconazole ) రోజుకు 200 మి.గ్రాలు గాని టెర్బినఫిన్ ( Terbinafine ) దినమునకు 250 మి.గ్రాలు గాని నోటి ద్వారా 3 నుంచి 6 వారములు వాడితే ఫలితములు కనిపిస్తాయి.

    నోటి ద్వారా మందులు వాడేటప్పుడు తఱచు ( మూడు నాలుగు వారములకు ఒకసారి ) రక్త కణముల పరీక్షలు, కాలేయ వ్యాపార పరీక్షలు చేయాలి.

                                     ఒంటి తామర ( Tinea carporis ) 


    ఒంటి తామర దేహములో ముఖము, ఛాతి, వెన్ను, బొజ్జ, కాళ్ళు, చేతులలో పొడచూపవచ్చును. ఇది ఎఱుపు, లేక గులాబి రంగులో గుండ్రని పొలుసుల మచ్చలుగా గాని, పలకలుగా గాని కనిపిస్తుంది. ఈ మచ్చల అంచులలో చిన్న పొక్కులు ఉండవచ్చును. ఇవి మధ్యలో మానుతూ అంచులలో వ్యాప్తి చెందుతాయి. Trichophyton rubrum, Trichophyton mentagrophytes, Microsporum canis లు ఈ వ్యాధిని కలిగిస్తాయి. 



    మచ్చలు, పలకల లక్షణములబట్టి వ్యాధి నిర్ణయము చేయవచ్చును. చర్మమును గోకి వచ్చిన పొట్టును పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలతో గాజు పలకపై సన్నని పొరగా నెఱపి సూక్షదర్శినితో పరీక్షించి శిలీంధ్రపు పోగులను ( hyphae ) గుర్తించవచ్చును.

చికిత్స 


    సైక్లోపిరాక్స్ ( Ciclopirox ) లేపనమును కాని, టెర్బినఫిన్ (Terbinafine ) లేపనమును కాని రోజుకు రెండుసారులు పూసి మర్దించి, రెండు లేక మూడు వారములు వాడి ఫలితములు పొందవచ్చును. 

    వ్యాధి విస్తారముగా ఉన్నపుడు, లేపనములకు లొంగనపుడు, నోటిద్వారా ఇట్రాకొనజాల్ ( Itraconazole ) దినమునకు 200 మి.గ్రాలు లేక టెర్బినఫిన్ ( Terbinafine ) రోజుకు 300 మి.గ్రాలు 3 నుంచి 6 వారములు వాడవలసి ఉంటుంది. 

                                పాద శిలీంధ్ర వ్యాధి ( Tinea Pedis ) 




    పాదములలో తామర సోకినపుడు వ్యాధి నాలుగు విధములుగా కనిపించ వచ్చును. 

    1) అరికాళ్ళలో చర్మము దళసరి కట్టి, పొలుసులు కట్టి వ్యాధి అరికాళ్ళలో ముందు వ్యాపించి ఆపై పాదముల ప్రక్కలకు, మీదకు కూడా వ్యాపించ వచ్చును. Trichophyton rubrum తఱచు యీ వ్యాధికి కారణము.

    2).అంగుళాంతర వ్యాధి ( Intertriginous tinea pedis ): ఈ వ్యాధిలో తేమ వలన పాదములో వేళ్ళ మధ్య  ఒరుపులు కలిగి తెల్లని పొరలుగా చర్మము చిట్లుతుంది. ఎఱ్ఱదనము కూడా పొడచూపుతుంది.

    3) వేళ్ళ మధ్య ఒరుపులతో పుళ్ళు కలిగి ( ulcerative tinea pedis ) తాపము చర్మము క్రింద కణజాలమునకు ( cellulitis ), రసి నాళములకు ( lymphangitis ) వ్యాపించవచ్చును. T. mentagrophytes var. interdigitale ఇట్టి తీవ్ర వ్యాధిని కలిగిస్తుంది.   

    4). కొందఱిలో చిన్న చిన్న పొక్కులు ఏర్పడి అవి బొబ్బలు కడుతాయి ( vesiculobullous tinea pedis ). వాతావరణపు ఉష్ణము, తేమ ఎక్కువగా ఉన్నపుడు ఇరుకైన పాదరక్షలు ధరించే వారిలో ఈ బొబ్బలు కలుగుతాయి.

    వైద్యులు  పాదములను పరీక్షించి వ్యాధి నిర్ణయము చేయగలుగుతారు. అవసరమయితే చర్మపు పై పొరలను గోకి వచ్చిన పొట్టును పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలతో సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి శిలీంధ్రపు పోగులను ( hyphae ), బీజములను ( spores ) గుర్తించి వ్యాధిని నిర్ణయించవచ్చును.

చికిత్స 


    శిలీంధ్ర వ్యాధులను అరికట్టు లేపనములను పూతగా వాడుతారు. వేళ్ళ మధ్య తేమ ఉన్నపుడు మికొనొజాల్ ( miconazole ) పొడిని వాడవచ్చును. తేమను తగ్గించుటకు 5% అల్యూమినియమ్ సబ్ ఎసిటేట్ లేక 20% అల్యూమినియమ్ క్లోరైడు ద్రావకములను పూతగా పూయవచ్చును.
           
    వ్యాధి తీవ్రత ఎక్కువయిన వారిలోను పదే పదే వ్యాధి కలిగే వారిలోను  నోటి ద్వారా ఇట్రాకొనజోల్ ( itraconazole ) దినమునకు 200 మి.గ్రా లు చొప్పున నెల దినములు లేక, టెర్బినఫెన్ ( Terbinafine ) దినమునకు 250 మి.గ్రాలు చొప్పున నెల నుంచి ఆరు వారములు వాడుతారు.

    పాదములలోను పాదరక్షలలోను తేమ లేకుండాను, గాలి ప్రసరణ బాగున్నట్లు చూసుకోవాలి. బూట్ల కంటె చెప్పులు ధరించుట మంచిది. స్నానము తరువాత అరికాళ్ళను, వేళ్ళ మధ్యను పొడి తువ్వాళ్ళతో  వత్తుకోవాలి .

                        శిరస్సు శిలీంధ్ర వ్యాధి ; తల తామర ( Tinea capitis ) 


    శిరస్సుపై శిలీంధ్ర వ్యాధులను చర్మాంకురములు ( Dermatophytes ) కలిగిస్తాయి. Trichophyton tonsurans, Microsporum canis, Microsporum audouinii, Trichophyton schoenleinii, Trichophyton violaceum జాతుల శిలీంధ్రములు ఈ వ్యాధులను కలిగిస్తాయి. ఇవి పిల్లలలో తఱచు కలుగుతాయి. ఒకరి నుంచి వేఱొకరికి అంటు వ్యాధులుగా సంక్రమిస్తాయి. వ్యాధి కలిగిన వారిలో తలపై పొలుసులతో గుండ్రని మచ్చలు కాని, చుండు మచ్చలు ( dandruff ) కాని, లేక గుండ్రని బట్టతల మచ్చలు ( alopecia ) కాని అగుపిస్తాయి. బట్టతల మచ్చలు కలవారిలో కేశములు తల మట్టములో కాని, తలకు కొంచెము ఎగువగా కాని తెగిపోయి నల్లని బట్టతల మచ్చలు కాని, నెరసిన బట్టతల మచ్చలు కాని కలిగిస్తాయి. కొందఱిలో చిన్న చిన్న పుళ్ళు కలుగుతాయి. 



   కొందఱిలో పుళ్ళు పుట్టి తాప ప్రక్రియ వలన మెత్తని కాయలు ‘ రోమకూప శిలీంధ్ర వ్రణములు ( Kerions ) ‘ ఏర్పడుతాయి. ఈ కాయలపై చీము పొక్కులు, పెచ్చులు ఉండుట వలన  వైద్యులు కూడా  వాటిని చూసి చీము తిత్తులుగా ( abscesses ) భ్రమించవచ్చును. చీము తొలగించుట వలన, సూక్ష్మజీవ సంహారకముల ( antibiotics ) వలన  యివి నయము కావు. 


                                                            రోమకూప శిలీంధ్రవ్రణము

 వ్యాధి నిర్ణయము 


    అనుభవజ్ఞులయిన వైద్యులు తలపై పొడచూపు శిలీంధ్ర వ్యాధులను చూసి నిర్ధారించగలరు. ఆ ప్ర్రాంతములో వెండ్రుకలు పెఱికి గాని, పొలుసులను, పెచ్చులను గ్రహించి గాని, వాటికి పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు కలిపి సూక్ష్మదర్శిని క్రింద చూసి శిలీంధ్రముల పోగులను ( hyphae ), శిలీంధ్ర బీజములను ( spores ) పోల్చి వ్యాధులను నిర్ణయించవచ్చు. వెండ్రుకలు, పొలుసులు, పెచ్చులను గ్రహించి ప్రయోగశాలలలో శిలీంధ్రములను పెంచి ( fungal cultures ) వ్యాధులను నిర్ణయించవచ్చును.

    అతి నీలలోహిత దీపకాంతిని ( ultraviolet rays from Wood’s lamp ) ప్రసరించినపుడు Microsporum canis, Microsprum audouinii ల వలన కలిగే మచ్చలు నీలాకుపచ్చ రంగులను ప్రతిదీప్తిస్తాయి. 

చికిత్స 


    శీర్ష శిలీంధ్ర చర్మవ్యాధులకు శిలీంధ్ర నాశక ఔషధములు ( antifungals ) నోటి ద్వారా వాడవలసి ఉంటుంది. పిల్లలలో గ్రైసియోఫల్విన్ ( Griseofulvin ) కాని, టెర్బినఫిన్ ( terbinafine ) కాని వాడుతారు. మందులు వ్యాధి పూర్తిగా నయమయే వఱకు సుమారు 4- 6 వారములు వాడవలసి ఉంటుంది. పెద్దలలో టెర్బినఫిన్ కాని, ఇట్రాకొనజాల్ ( Itraconazole ) కాని వాడుతారు. 

    తలపై సైక్లోపిరాక్స్ ( ciclopirox ) లేపనము గాని, సెలీనియమ్ సల్ఫైడు ( Selenium sulphide ) కాని పూతగా పూసి వ్యాధి వ్యాప్తిని నిరోధించగలము.

    తాపము ( inflammation ) అధికమయి పుళ్ళతో కాయలు ( kerions ) ఏర్పడితే తాపము తగ్గించుటకు కొన్ని దినములు శిలీంధ్ర నాశకములతో బాటు ప్రెడ్నిసోన్ ( prednisone ) వాడి దాని మోతాదును క్రమముగా తగ్గిస్తూ రెండు వారములలో  ఆపివేయాలి.


( వైద్యవిషయాలను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి . )


విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...