14, మార్చి 2020, శనివారం

ఉబ్బుసిరలు ( Varicose veins )


( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) 

:

                          ఉబ్బు సిరలు

                    ( Varicose Veins )

                                                                                                 డా. గన్నవరపు నరసింహమూర్తి

                                                          

                                               సిరలు ( Veins )


    హృదయము నుంచి రక్తము వివిధ అవయవాల కణజాలమునకు ధమనుల ద్వారా అందించబడుతుంది. ధమనులు సూక్ష్మ ధమనులుగా శాఖలు చెంది కణజాలములో  రక్తకేశనాళికలుగా ( capillaries ) చీలికలవుతాయి. కేశనాళికలలోని రక్తము నుంచి ప్రాణవాయువు, పోషక పదార్థములు కణజాలమునకు చేరి, కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు, వ్యర్థ పదార్థములు రక్తములోనికి ప్రవేశిస్తాయి. సూక్ష్మ రక్తనాళికలు కలయికచే సిరలు ఏర్పడుతాయి. సిరల పాయలు కలిసి పెద్ద సిరలు ఏర్పడి తుదకు ఊర్ధ్వబృహత్సిర ( superior venacava ), అధోబృహత్సిరల ( inferior venacava ) ద్వారా రక్తమును హృదయపు కుడి కర్ణికకు తిరిగి చేరుస్తాయి.
    సిరల గోడలలో మూడు పొరలు ఉంటాయి. బయట పొరలో ( tunica externa )  పీచుకణజాలము ( collagen ), సాగుకణజాలము ( elastin ) ఉంటాయి. మధ్యపొరలో ( tunica media ) మృదుకండరములు ఉంటాయి. లోపొరలో ( tunica intima ) పూతకణములు మూలాధారపు పొరను ( basement membrane) అంటిపెట్టుకొని ఉంటాయి. సిరల బయటపొర, మధ్య పొరల మందము ధమనుల పొరల మందము కంటె బాగా తక్కువ. 
    గుండె ఎడమ జఠరికలో ( left ventricle ) రక్తపీడనము అత్యధికముగా ఉండి ధమనులు, సిరలు చివరకు కుడి కర్ణికకు ( Right atrium ) వచ్చేసరికి ఆ పీడనము క్రమముగా తగ్గుతుంది. ఎడమ జఠరిక ముకుళించుకున్నప్పుడు ధమనులలో పీడనము పెరిగి అలలుగా రక్తము ముందుకు ప్రవహిస్తుంది. పీడన వ్యత్యాసము వలన రక్తము సిరలలోనికి ఆపై కుడి కర్ణికకు చేరుతుంది. వికసించుకున్నపుడు కుడికర్ణికలో పీడనము బాగా తగ్గుతుంది. అందువలన కుడికర్ణిక బృహత్సిరలనుంచి రక్తమును గ్రహించగలుతుంది.
    ఉబ్బుసిరలు సాధారణముగా కాళ్ళలో చూస్తాము. సిరలు మూడు రకములు. 

బాహ్యసిరలు ( superficial veins ) 


    చర్మము క్రింద, కండర ఆచ్ఛాదమునకు ( deep fascia ) పైన ఉంటాయి.

నిమ్నసిరలు ( deep veins ) 


    కండర ఆచ్ఛాదమునకు ( deep fascia ) లోపల ఉంటాయి.

ఛిద్రసిరలు ( perforator veins ; సంధానసిరలు ) 


    బాహ్యసిరలను, నిమ్నసిరలతో కలుపుతాయి. ఇవి కండర ఆచ్ఛాదమును చొచ్చుకొని లోపలకు ప్రవేశిస్తాయి. సాధారణ స్థితులలో రక్తము బాహ్యసిరలనుంచి నిమ్నసిరలలోనికి ఛిద్ర సిరల ద్వారా ప్రవహిస్తుంది. సిరలలో ఉండే ద్విపత్రకవాటములు తిరోగమన ప్రవాహమును నిరోధిస్తాయి.

                                          కాలి సిరలు ( Veins in lower extremity )


    కాళ్ళలో బాహ్యసిరలు పాదమునుంచి బయలుదేరుతాయి. పాదము పైభాగములో కనిపించే ఊర్ధ్వపాద సిరచాపము ( dorsal venous arch of foot ) మధ్యస్థముగా ( medially ) చీలమండ (ankle ) ఎముకకు ముందుగా కాలిపైకి గరిష్ఠ దృశ్యసిరగా ( great saphenous vein ) ఎగబ్రాకుతుంది. తొడ లోపలి భాగములో యీ గరిష్ఠ దృశ్యసిర ( great saphenous vein ) పయనించి తొడ పైభాగములో దృశ్యసిర రంధ్రము ( saphenous orifice ) ద్వారా లోపలకు దూరి ఊరుసిరతో ( femoral vein ; తొడసిర ) కలుస్తుంది.
    ఊర్ధ్వపాద సిరచాపము (dorsal venous arch of foot ) పార్శ్వ భాగమున చిటికెనవేలు పైభాగపు అంగుళిక సిరతో ( digital vein ) కలిసి కనిష్ఠ దృశ్యసిరగా ( Lesser Saphenous vein ) చీలమండలము పార్శ్వభాగపు ఎముకకు వెనుకగా పైకి ప్రాకి కాలు వెనుక భాగములో పయనిస్తుంది. కాలి పైభాగములో మోకాలు వెనుక ఈ సిర కండరఆచ్ఛాదనము ( deep fascia ) లోనికి చొచ్చి జానుసిరతో ( popliteal vein ) కలుస్తుంది. జానుసిర, ఊరుసిరగా ( femoral vein ) తొడలోపల పయనిస్తుంది.కటివలయములో ( pelvis )  ఊరుసిర బాహ్య శ్రోణిసిరయై ( external ileac vein ), అంతర శ్రోణిసిరతో ( internal ileac vein ) కలసి శ్రోణిసిర ( common ileac vein ) అవుతుంది .
    వామ, దక్షిణ శ్రోణిసిరల సంధానము వలన అధోబృహత్సిర ( inferior venacava ) ఏర్పడుతుంది.
    పీడన వ్యత్యాసము వలన దూరసిరల నుంచి రక్తము ముందుకు ప్రవహించి హృదయములో కుడికర్ణికకు చేరుతుంది. కాళ్ళలో కండరములు ముకుళించుకొన్నపుడు నిమ్నసిరలపై ఒత్తిడి కలిగి రక్తము ముందుకు నెట్టబడుతుంది. సిరలలో కవాటములు తిరోగమన ప్రవాహమును నిరోధిస్తాయి. కండరములు విరామస్థితికి చేరినపుడు నిమ్నసిరలలో పీడనము తగ్గి బాహ్యసిరలలోని రక్తము ఛిద్రసిరల ద్వారా నిమ్మసిరలలోనికి ప్రవహిస్తుంది. 
    సిరలు సాగి, ఉబ్బి, మెలికలు తిరిగి ఉబ్బుసిరలుగా ( varicose veins ) మారవచ్చును. ఉబ్బుసిరలను కాళ్ళలో సామాన్యముగా చూస్తాము. 

ఉబ్బుసిరలు ఏర్పడుటకు కారణములు  


    ఉబ్బుసిరలు జన్యుపరముగా రావచ్చును. ఉబ్బుసిరలు పురుషులలో కంటె స్త్రీలలో హెచ్చుగా కలుగుతాయి. ఇవి స్థూలకాయము కలవారిలోను, గర్భిణీ స్త్రీలలోను ఎక్కువగా కలుగుతాయి. కటివలయములో పెరుగుదలల వలన శ్రోణిసిరలపై ఒత్తిడి పెరిగితే ఉబ్బుసిరలు కలుగవచ్చును. బాహ్యసిరలలో తాప ప్రక్రియ ( inflammation ) కలిగి కవాటములు చెడిపోతే తిరోగమన రక్తప్రవాహము వలన సిరలు ఉబ్బగలవు. సిరలు వ్యాకోచము చెందినపుడు కవాటముల సామర్థ్యత తగ్గుతుంది. ఛిద్రసిరల కవాటములు పనిచేయనిచో నిమ్నసిరల నుంచి రక్తము బాహ్య సిరలలోనికి ప్రవహించి వాటిని వ్యాకోచింప జేస్తాయి. 
    రక్తములో హోమోసిష్టిన్ ప్రమాణములు పెరిగితే ( hyperhomocysteinemia ) సిరల గోడలలోని సాగుకణజాలము ( elastin ) పీచుపదార్థము ( collagen ) ధ్వంసమయి సిరలు ఉబ్బగలవు.
    వయస్సు పెరిగిన వారిలోను, వ్యాయామము తక్కువైన వారిలోను, దినములో ఎక్కువగా నిలబడి ఉండేవారిలోను ఉబ్బుసిరలు ఎక్కువగా కలుగుతాయి. 

వ్యాధిలక్షణములు 


    ఉబ్బుసిరలు కంటికి కనిపిస్తాయి. ఉబ్బుసిరలు వ్యాకోచము పొంది, సాగి, పొడవయి, మెలికలు కలిగి ఉంటాయి. సులభముగా అణచబడుతాయి. వీటి వలన కాళ్ళలో పీకు, బరువు, లాగుతున్నట్లు నొప్పి కలుగవచ్చు. చీలమండ, పాదములలో పొంగు, వాపు కలుగవచ్చు. చర్మములో గోధుమ వర్ణకము కనిపించవచ్చును. చీలమండ పైభాగములో చర్మముక్రింద కొవ్వుతోను ( subcutaneous fat ), పీచుకణజాలముతోను ( fibrous tissue ) గట్టిపడి ( lipodermatosclerosis ) చుట్టూ నొక్కినట్లు ( ఆకుంచనము ; constriction ) కనిపించవచ్చును. చర్మములో తెల్లని మచ్చలు కలుగవచ్చును. 

ఉబ్బుసిరల వలన కొన్ని ఉపద్రవములు ( complications ) కలుగవచ్చు.


నిశ్చలన చర్మతాపము ( stasis dermatitis )  


    ఉబ్బు సిరలలో రక్తస్థంభపు ( column of blood ) పెరుగుదల వలన  కేశనాళికలలో పీడనము పెరిగి కణజాలములో ద్రవసాంద్రత ( congestion ) పెరుగుతుంది. ఎఱ్ఱ రక్తకణములు కూడా కణజాలములో చేరి వానినుంచి వెలువడు రక్తవర్ణకము ( hemoglobin ) హీమోసిడరిన్ గా ( hemosiderin ) నిక్షిప్తమవుతుంది. చర్మమునకు అద్దే లేపనములు వికటించి తాపము కలిగించవచ్చును. ఈ కారణములు అన్నీ చర్మతాపమును కలిగించగలవు.
    చర్మతాపము కలిగిన వారికి దురద, నొప్పి కలుగుతాయి. చర్మములో వాపు, ఎఱ్ఱదనము, గోధుమవర్ణకము కలుగుతాయి. చర్మపు మందము తగ్గుతుంది. చర్మములో పగుళ్ళు , పుళ్ళు కలుగవచ్చును. ఆపై సూక్ష్మాంగజీవుల ఆక్రమణ వలన చర్మములోను, చర్మముక్రింద కణజాలములోను తాపప్రక్రియ ( inflammation  ) కలుగవచ్చును.
    నిశ్చలన చర్మతాపము ఉబ్బుసిర వ్రణములకు ( varicose venous ulcers ) దారితీయవచ్చును.
    మానుదల లేని దీర్ఘకాలపు ఉబ్బుసిర వ్రణములలో కర్కట వ్రణములు ( carcinomas,  or Sarcomas ) పొడచూపవచ్చును.
    ఉబ్బుసిరలలో రక్తపుగడ్డలు ఏర్పడవచ్చును. అసాధారణముగా యీ రక్తపుగడ్డలు నిమ్నసిరలకు వ్యాపించవచ్చును. ఈ రక్తపు గడ్డలు కుడి కర్ణిక, కుడి జఠరికల ద్వారా , పుపుసధమనికి చేరితే అపాయకరము. 

పరీక్షలు 


    ఉబ్బుసిరలు ఉన్న వ్యక్తిని పడుకోబెట్టి ఆ కాలును ఎత్తిపెట్టి సిరలు సంకోచించాక మొలక్రింద దృశ్యసిర ( saphenous vein ) ఊరుసిరతో ( femoral vein )  సంధానమయే చోటను, ఛిద్రసిరల స్థానముల వద్దను పట్టీలు బిగించి, వ్యక్తిని నిలుచో బెట్టి పట్టీలు ఒక్కక్కటి తీసి నిమ్నసిరల నుంచి బాహ్యసిరల లోనికి ప్రవాహము ఎచ్చట తిరోగమనము చెందుతున్నదో నిర్ణయించవచ్చును. 
    ఇదివరలో ఊర్ధ్వపాద సిరచాపములోనికి ( dorsal venous arch ) సూది ద్వారా వ్యత్యాస పదార్థములను ( contrast materials ) ఎక్కించి ఎక్స్ - రే లతో సిరలను చిత్రీకరించేవారు. 
    ఈ దినములలో శ్రవణాతీతధ్వని సాధనములతో ( ultrasonic equipment ) కాళ్ళలోని దృశ్యసిరలను ( saphenous veins ), నిమ్నసిరలను ( deep veins ) చిత్రీకరించవచ్చును. రక్తప్రవాహము తిరోగమనము చెందు స్థానములను కూడా నిర్ణయించవచ్చును. 

చికిత్సలు 


కాళ్ళు ఎత్తులో పెట్టుట 


    కాళ్ళు హృదయము కంటె ఎత్తుగా ఉంచుట వలన సిరలలో  సాంద్రత ( congestion ) తగ్గుతుంది. పాదములలోను, చీలమండలలోను పొంగు, వాపు తగ్గుతాయి. తాపప్రక్రియ కూడా తగ్గుతుంది.

వ్యాయామము 


    నడక, వ్యాయామము సిరలలో  సాంద్రతను తగ్గిస్తాయి. కండరముల బిగుతును పెంచుతాయి .

సాగు మేజోళ్ళు ( elastic stockings ) 


    తగిన పీడనము గల మేజోళ్ళు మొలవఱకు గాని మోకాళ్ళ వఱకు గాని ధరిస్తే అవి సిరలలో రక్తప్రవాహమునకు తోడ్పడుతాయి. సిరలలో  సాంద్రతను తగ్గిస్తాయి. కాళ్ళు, చీలమండలము ( ankle ), పాదాలలో పొంగును, వాపును తగ్గిస్తాయి. కణజాలములో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మములో తాప ప్రక్రియను తగ్గిస్తాయి. ఉబ్బుసిర వ్రణముల మానుదలకు తోడ్పడుతాయి. దూరధమని వ్యాధి ( Peripheral Arterial Disease ) గలవారు సాగు మేజోళ్ళు వాడకూడదు.

సవిరామ వాయుపీడన సాధనములు ( intermittent pneumatic compression devices ) 


    సిరలలో రక్తప్రసరణను మెరుగుపఱచుటకు ఉపయోగపడుతాయి. కాళ్ళ పొంగులను, వాపులను తగ్గిస్తాయి.ఉబ్బుసిర వ్రణములు మానుటకు తోడ్పడుతాయి.

ఉబ్బుసిరల విధ్వంసము 


    ఉబ్బుసిరలలో తంతీకరణ రసాయనములతో ( sclerosing agents ) తాపప్రక్రియ ( inflammation) కలుగజేసి వాటిని ధ్వంసము చేసి పీచుకణజాలముచే గట్టిపఱచ ( sclerosis) వచ్చును. 
    శీతల శలాకలతోను ( cryoprobes ), ఉష్ణ శలాకలతోను, విద్యుచ్ఛక్తి శలాకలతోను సిరాంతర విధ్వంస ( Endovenous ablation ) ప్రక్రియచే ఉబ్బుసిరలను ధ్వంసము చేయవచ్చును.
    ఉబ్బు సిరలను లేసర్ కాంతికిరణ ప్రసరణముతోను, ఆవిరిని ప్రసరింపజేసి కూడా ధ్వంసము చేయవచ్చును. శ్రవణాతీతధ్వని సాధనములు శలాకలను సిరలలోనికి చేర్చుటకు ఉపయోగపడుతాయి. ధ్వంసమయిన సిరలు పీచుకణజాలముతో గట్టిపడుతాయి.

( వైద్యవిషయములను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును.)


పదజాలము :


Arteries = ధమనులు
Basement membrane = మూలాధారపు పొర గ.న )
Collagen = పీచుకణజాలము ( గ.న )
Cryoprobes  = శీతల శలాకలు
Deep veins = నిమ్నసిరలు ( గ.న )
Digital vein  = అంగుళికసిర ( గ.న )
Dorsal venous arch of foot = ఊర్ధ్వపాదసిరచాపము ( గ.న )
Elastin = సాగుకణజాలము ( గ.న )
Endovenous ablation  = సిరాంతరవిధ్వంసము ( గ.న )
External ileac vein = బాహ్యశ్రోణిసిర (గ.న ) 
Fascia = కండరాచ్ఛాదము ( గ.న )
Femoral vein  = ఊరుసిర 
Great saphenous vein  = గరిష్ఠ దృశ్యసిర ( గ.న )
Common ileac vein = శ్రోణిసిర ( గ.న )
Inferior venacava = అధోబృహత్సిర
Intermittent pneumatic compression devices = సవిరామ వాయుపీడన సాధనములు ( గ.న )
Internal ileac vein = అంతరశ్రోణిసిర ( గ.న )
Lesser Saphenous vein  = కనిష్ఠ దృశ్యసిర ( గ.న )
Perforator veins = ఛిద్ర సిరలు ( గ.న )
Popliteal vein = జానుసిర ( గ.న )
Saphenous orifice = దృశ్యసిర రంధ్రము ( గ.న )
Sclerosing agents = తంతీకరణ రసాయనములు ( గ.న )
Stasis dermatitis = నిశ్చలన చర్మతాపము ( గ.న )
Superficial veins  = బాహ్యసిరలు
Superior venacava = ఊర్ధ్వబృహత్సిర 
Varicose veins = ఉబ్బుసిరలు ( గ.న )
Varicose venous ulcers = ఉబ్బుసిర వ్రణములు ( గ.న )
Veins = సిరలు
Capillaries =సూక్ష్మరక్తనాళికలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...