1, జూన్ 2019, శనివారం

మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents )

                              మస్తిష్క రక్తనాళ విఘాతములు

                                          ( Cerebro Vascular Accidents )


( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )

                                                                                డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.  

                                               మెదడు నిర్మాణము  


    మన శరీరములో వివిధ అవయవాలు నాడీ మండలపు ( nervous system ) ఆధీనములో ఉంటాయి. నాడీ మండలములో కేంద్ర నాడీ మండలము ( central nervous system ), వికేంద్ర నాడీ మండలము ( Peripheral nervous system ) భాగములు. కేంద్ర నాడీ మండలములో పెద్దమెదడు ( cerebrum ), చిన్నమెదడు ( cerebellum  ), వారధి ( pons ), మెడుల్లా ఆబ్లాంగేటా ( medulla oblongata ), కపాల నాడులు ( cranial nerves ) వివిధ భాగములు. వికేంద్ర నాడీ మండలములో వెన్నుపాము ( spinal cord ), వెన్నునాడులు ( spinal nerves ), సహవేదన నాడీవ్యవస్థ ( sympathetic nervous system), పరానుభూత నాడీ వ్యవస్థ ( ParaSympathetic nervous system ) భాగములు.

    పెద్దమెదడు ఆలోచనలకు, విషయ గ్రహణమునకు, జ్ఞాపకశక్తికి, విచక్షణా జ్ఞానమునకు, విషయ చర్చలకు, వివిధ భావములకు స్థానము. పంచేంద్రియములు గ్రహించు వాసన, దృష్టి, వినికిడి, రుచి, స్పర్శాది సమాచారములు జ్ఞాననాడుల ( sensory nerves) ద్వారా ప్రసరించి  పెద్దమెదడులో జ్ఞానముగా రూపొందుతాయి.

    పెద్దమెదడులో రెండు అర్ధ గోళములు ( hemispheres ) ఉంటాయి. రెండు అర్ధ గోళములు corpus Callosum  అనబడే శ్వేత తంతువుల బంధనముచే కలుపబడి ఉంటాయి. ప్రతి అర్ధ గోళములోను లలాట భాగము ( frontal lobe ), పార్శ్వ భాగము ( parietal lobe ), కర్ణ భాగము ( temporal lobe ), పృష్ఠ భాగము ( occipital lobe ఉంటాయి.



    లలాట భాగములు పెద్దమెదడుకు ముందు భాగములో ఉంటాయి. ఇవి పార్శ్వ భాగముల నుంచి మధ్య గర్తములతోను ( central sulci ), కర్ణ భాగముల నుంచి పార్శ్వ గర్తములతోను ( lateral sulci ) వేఱుచేయబడి ఉంటాయి. స్వయం నియంత్రణ, విచక్షణ, ప్రణాళికా రచన, తర్కము  వంటి క్రియలు లలాట భాగములపై  ఆధారపడి ఉంటాయి. 

    లలాట భాగములో ( Frontal lobe ) మధ్య గర్తమునకు ముందున్న మెలికలో చలన వల్కలము ( motor cortex ) ఉంటుంది. చలన వల్కలములోని నాడీ కణములపై ( neurons ) శరీరములోని ఇచ్ఛా కండరముల ( voluntary muscles ) ఇచ్ఛా చలనములు ఆధారపడి ఉంటాయి. కుడి చలన వల్కలము శరీరపు ఎడమ భాగపు ఇచ్ఛా కండరములను, ఎడమ చలన వల్కలము శరీరములోని  కుడి భాగపు ఇచ్ఛా కండరములను నియంత్రిస్తాయి.



    చలన వల్కలములో ( motor cortex ) నాడీ కణములను ఊర్ధ్వ చలన నాడీకణములుగా ( upper motor neurons ) పరిగణిస్తారు. వీని నుంచి వెలువడు అక్షతంతులు ( axons ) మెదడులో క్రిందకు సాగుచు ఆంతర గుళిక ( internal capsule ) అను భాగములో గుమికూడి ఆపై మస్తిష్క మూలమునకు ( brain stem ) చేరుతాయి.  ఈ అక్షతంతులు రెండవ ప్రక్కకు దాటుకొని కపాల నాడుల కేంద్రములలో ఉన్న  అధశ్చలన నాడీ కణములతోను ( lower motor neurons of cranial nerve nuclei ), వెన్నుపాములోని అధశ్చలన నాడీకణములతోను ( lower motor neurons of spinal cord ) సంధానము అవుతాయి.

    కపాల నాడుల కేంద్రములలో అధశ్చలన నాడీకణముల నుంచి వెలువడు అక్షతంతులు ( axons ) కపాలనాడుల ( cranial nerves ) ద్వారాను, వెన్నుపాములోని అధశ్చలన నాడీకణముల అక్షతంతులు వెన్నునాడుల ( spinal nerves ) ద్వారాను పయనించి వివిధ కండరములకు చేరుకుంటాయి.

    మధ్యగర్తమునకు ( central sulcus ) వెనుక పార్శ్వ భాగములో ( parietal lobe ) జ్ఞాన వల్కలము ( sensory cortex ) ఉంటుంది. శరీరములో వివిధ భాగముల నుంచి జ్ఞాననాడులు సమీకరించే స్పర్శ, కంపనము ( vibration sense ), నొప్పి, ఉష్ణోగ్రత జ్ఞాన సంజ్ఞలు మెదడులో థలమస్ ( thalamus ) లకు ఆపై జ్ఞాన వల్కలములకు చేరుట వలన ఆయా జ్ఞానములు కలుగుతాయి. కుడి జ్ఞాన వల్కలము వలన శరీరపు ఎడమ భాగములో స్పర్శాది జ్ఞానములు, ఎడమ జ్ఞాన వల్కలము వలన శరీరపు కుడి భాగములో స్పర్శాది జ్ఞానములను పొందుతాము.

    మెదడు కర్ణ భాగములలో ( temporal lobes ) శ్రవణ వల్కలములు ( auditory cortices ) ఉంటాయి. వినికిడి, వినిన పదములను, భాషణములను అర్థము చేసుకొనుట ఈ శ్రవణ వల్కలముల వలన కలుగుతుంది.

    దృశ్య సంజ్ఞల బట్టి చూసిన వస్తువులను గుర్తుపట్టుట, దీర్ఘకాల జ్ఞాపకము కూడ మస్తిష్కములోని కర్ణ భాగముల వలన కలుగుతాయి.

    మెదడు పృష్ఠ భాగములలో ( occipital lobes ) దృష్టి వల్కలములు ( visual cortices ) ఉంటాయి. కంటి తెరలపై ( Retinas ) నుంచి వచ్చే సంజ్ఞలను బోధ చేసుకొని దృష్టి వల్కలములు దృష్టి జ్ఞానమును కలుగ జేస్తాయి.

    వాక్కు మెదడులో వివిధ భాగములపైన ఆధారపడి ఉన్నా మెదడులో బ్రోకా ప్రాంతముగా ( Broca’s area )  పరిగణించబడే లలాట భాగపు  ( frontal lobe ) వెనుక క్రింది భాగము పలుకులు పలుకుటలో ప్రముఖపాత్ర నిర్వహిస్తుంది.

    చిన్నమెదడు ( cerebellum ) చలన ప్రక్రియలను సమన్వయపఱచుటకు ( coordination ), శరీరమును సమస్థితిలో ( balance ) ఉంచుటకు తోడ్పడుతుంది.


మస్తిష్క రక్తప్రసరణము ( Cerebral circulation ) 





    మెదడునకు రక్తము అంతర కంఠధమనులు ( Internal carotid arteries ), వెన్ను ధమనులు
( vertebral arteries ) ద్వారా ప్రసరిస్తుంది. రెండు పక్కలా కంఠ ధమనులు ( common carotid arteries ) కంఠములో బాహ్య కంఠధమనులు ( external carotid arteries ) అంతర కంఠధమనులుగా ( internal carotid arteries ) చీలుతాయి. అంతర కంఠధమనులు ( internal carotids ) కపాలము లోనికి ప్రవేశించి పురోమస్తిష్క ధమనులు ( anterior cerebral arteries ) అను శాఖలు  ఇస్తాయి. పురోమస్తిష్క ధమనులు మెదడులో లలాట భాగముల ( frontal lobes ) ముందు భాగములకు రక్తప్రసరణ చేకూరుస్తాయి.

    రెండు పురోమస్తిష్క ధమనులు పురోసంధాన ధమనులు  ( anterior communicating arteries  ) అను  శాఖలతో  ఒకదానితో వేఱొకటి కలుపబడుతాయి.

    పురోమస్తిష్క ధమని శాఖలను ఇచ్చిన పిదప  అంతర కంఠధమనులు మధ్య మస్తిష్క ధమనులుగా ( middle cerebral arteries ) కొనసాగి లలాట భాగపు వెనుక భాగములకు, పార్శ్వ భాగములకు ( parietal lobes ) రక్తప్రసరణ చేకూరుస్తాయి.

    కుడి, ఎడమ వెన్నుధమనులు ( vertebral arteries ) కపాలము వెనుక నుంచి పయనించి  కపాలములో  మూలిక ( basilar artery ) ధమనిగా ఒకటవుతాయి. మూలిక ధమని మజ్జాముఖమునకు  (మెడుల్లాకు), వారధికి ( Pons ), చిన్న మెదడుకు శాఖలు ఇచ్చి రెండు పృష్ఠమస్తిష్క ధమనులుగా ( posterior cerebral arteries ) చీలుతుంది. 
  
    పృష్ఠ మస్తిష్క ధమనులు మెదడు వెనుక భాగములకు ( occipital lobes ) కర్ణ భాగములకు ( temporal lobes ) రక్తమును ప్రసరింపజేస్తాయి. ప్రతి పృష్ఠమస్తిష్క ధమని నుంచి పృష్ఠ సంధాన ధమనిగా ( posterior communicating artery ) ఒక శాఖ వెలువడి అంతర కంఠ ధమనితో ( internal carotid artery ) కలుస్తుంది. సంధాన ధమనులతో కలుపబడి మస్తిష్క ధమనులు మెదడు క్రిందభాగములో ధమనీ చక్రము (arterial circle of Willis ) ఏర్పరుస్తాయి.

    మెదడును కప్పుతూ డ్యూరా ( Dura ), ఎరఖ్నాయిడ్ ( Arachnoid ), పయా ( pia ) అను మూడు పొరలు ఉంటాయి.

                  మస్తిష్క  (రక్తనాళ ) విఘాతములు ( Cerebrovascular accidents )

                     

    మస్తిష్క ( రక్తనాళ ) విఘాతములు ( Cerebrovascular accidents ) పక్షవాతముగానో, అపస్మారకము గానో పొడచూపుతాయి. ఇవి రక్త నాళములలో ధమనీ కాఠిన్యము ( atherosclerosis ) వలన రక్తపు గడ్డలు ఏర్పడి రక్త ప్రసరణకు భంగము కల్పించుట వలన ( thrombosis ) గాని, రక్త ప్రవాహములో రక్తపు గడ్డలు, యితర అవరోధక పదార్థములు ( emboli ) పయనించి సుదూర ప్రాంతములలో సన్నని నాళములలో అడ్డుపడి ( embolism ) రక్త ప్రసరణకు భంగము కలిగించుట  వలన గాని, రక్తస్రావము వలన ( hemorrhage) గాని కలుగుతాయి.

 మస్తిష్క విఘాత లక్షణములు 


    మస్తిష్క విఘాత లక్షణములు మస్తిష్క విఘాతము ( Cerebral stroke ) ఏర్పడిన తీరు, స్థానము, తీవ్రతలపై ఆధారపడుతాయి.

    రక్తప్రసరణ లోపము ( ischemia ) వలన కలిగినపుడు లక్షణములు ఆకస్మికముగా కలిగినా లక్షణములలో  హెచ్చుతగ్గులు ( fluctuations ) సాధారణముగా  కనిపిస్తాయి.

    కంఠ ధమనిలో ( carotid artery ) దోషము ఉన్నపుడు ఆవలి పక్కనున్న దేహములో పక్షవాతము ( paralysis ) కలిగి కండరములు శక్తిని పూర్తిగానో, కొంతో నష్టపోతాయి. స్పర్శజ్ఞానములో నష్టము కలుగవచ్చును. సగంచూపు నష్టము ( అర్ధాంధత్వము ; hemianopsia ), మాట పోవుట ( వాగ్నష్టము / వాజ్ఞ్నష్టము / aphasia ), పలుకులో తొట్రుపాటు ( dysarthria ) రావచ్చును. జ్ఞానేంద్రియాలు అందించిన సమాచారము మెదడు గ్రహించలేకపోతే, వస్తువులను, తెలిసిన మనుష్యులను, శబ్దములను, వాసనలను, రుచులను గుర్తుపట్టలేని స్థితి ( agnosia ) కలుగవచ్చును.

    రక్తప్రసరణ దోషము వెన్నుధమని ( vertebral artery ), మూలధమని ( basilar artery ) శాఖలలో ఉంటే, దేహములో ఒకపక్క గాని లేక  రెండుపక్కలా గాని చలన నష్టము ( loss of motor function ), స్పర్శనష్టము  ( sensory loss ) కలుగుటయే కాక తలతిప్పుట ( vertigo ), కళ్ళుతిరుగుట, దేహమునకు అస్థిరత ( ataxia ), ద్విదృష్టి ( diplopia -  ఒక వస్తువు రెండుగా కనిపించుట ) కలుగవచ్చును.



    గుండె లయలో ( rhythm ) అసాధారణలు, మర్మర శబ్దములు ( murmurs ), కంఠధమనులలో హోరుశబ్దములకై ( bruits ) వైద్యులు పరీక్ష చేస్తారు.

    మెదడు కణజాలములో రక్తస్రావము ( hemorrhage ) జరిగినపుడు చలన నష్టము, స్పర్శ నష్టము వంటి  నాడీమండల వ్యాపార లోపములతో బాటు తీవ్రమైన తలనొప్పి, వాంతులు, మాంద్యము ( lethargy ), అపస్మారకము కూడా కలుగవచ్చును.

    ఎరఖ్ నాయిడ్ పొర క్రింద రక్తస్రావము ( subarachnoid hemorrhage ) కలిగి నపుడు జీవితములో ఎన్నడూ కలుగనంత  తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది. వాంతులు, మూర్ఛ, చేతులలోను, కాళ్ళలోను కంపనము ( seizures ), జ్వరము, నడుమునొప్పి, మాంద్యము ( lethargy ) లేక అపస్మారకము కూడా కలుగవచ్చును.

    సిరాపరిఖలలో రక్తపుగడ్డలు ( cerebral venous sinus thrombosis ) ఏర్పడినచో తలనొప్పి, మసకచూపు, దృష్టిబింబములో పొంగు ( papilloedema  ) వంటి  కపాలములో ఒత్తిడి పెరిగిన లక్షణములు కనిపిస్తాయి.

మస్తిష్కవిఘాతమును పోలు ఇతర వ్యాధులు 


    పార్శ్వపు తలనొప్పి ( migraine headache ) కలిగినపుడు చలనలోప, స్పర్శలోపముల వంటి నాడీమండల లక్షణాలు తాత్కాలికముగా పొడచూపవచ్చును. మూర్ఛరోగము ( seizure ) కలిగినపుడు తాత్కాలిక పక్షవాత లక్షణములు కలుగవచ్చును. రక్తములో చక్కెర ( glucose ) విలువలు బాగా తగ్గినపుడు అపస్మారకస్థితి, నీరసము  కలిగి పక్షవాతమును అనుకరించవచ్చును.

పరీక్షలు 


    మస్తిష్క విఘాత లక్షణములు కనిపించిన వారికి ప్రాథమిక రక్తపరీక్షలు అవసరము. వివిధ రక్తకణముల గణనములు ( complete blood counts ), రక్తఫలకముల లెక్కింపు ( Platelet count ), రక్తము గడ్డకట్టు సమయ పరీక్షలు ( Protime / INR, Partial Thromboplastin Time ), చక్కెర ( glucose ), విద్యుద్వాహక లవణములు ( electrolytes ) పరీక్షలు చేయాలి. విద్యుత్ హృల్లేఖ ( electrocardiograph ) వలన గుండె లయలో మార్పులు, ఇతర హృదయ విలక్షణములు తెలుస్తాయి.

    మస్తిష్క విఘాత లక్షణములు పొడచూపిన వారికి త్వరగా వ్యత్యాస పదార్థములు ( contrast materials ) ఇవ్వకుండ మెదడుకు గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము ( Computerized Axial Tomography  with out contrast materials ) చెయ్యాలి. ఈ పరీక్షలో మెదడు కణజాలములో రక్తస్రావము ( intraparenchymal hemorrhage ), ఎరఖ్ నాయిడ్ పొర క్రింద రక్తస్రావము ( subarachnoid hemorrhage) ఉంటే త్వరగానే కనిపిస్తాయి.

    రక్తపుగడ్డలు ( thrombi ), రక్తనాళ అవరోధక పదార్థములు ( emboli ) కలిగించు రక్తప్రసరణ లోపము ( ischemia ) వలన కలిగే మస్తిష్క విఘాతములు ఈ చిత్రీకరణలలో కనిపించుటకు 48 నుంచి 72 గంటలు పట్టవచ్చును.

    గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణములో రక్తస్రావపు ( hemorrhage ) లక్షణములు కనిపించకపోతే రక్తస్రావము ( hemorrhage ) జరుగలేదని నిర్ధారణ చేసి రక్తము గడ్డకట్టుటను ( thrombosis ) నివారించు చికిత్సలు మొదలుపెట్టవచ్చును.

    అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములో ( Magnetic Resonance Imaging ) మస్తిష్క విఘాతములు త్వరగానే కనిపిస్తాయి. కాని రోగిని పరీక్షించినపుడు మస్తిష్క విఘాత లక్షణములు స్పష్టముగా కనిపించినపుడు  MRI Scan వలన ఎక్కువ ప్రయోజనము లేదు.

    అయస్కాంత ప్రతిధ్వని రక్తనాళ చిత్రీకరణములతో ( Magnetic Resonance Angiogram) మెదడులో రక్త నాళములను పరీక్షించ వచ్చును.

    శ్రవణాతీత ధ్వని చిత్రీకరణముతో ( ultrasonography) కంఠ ధమనులను పరీక్షిస్తే కంఠధమని సంకుచితములు ( carotid artery stenosis ) పసిగట్టవచ్చును.

    హృదయ  ప్రతిధ్వని చిత్రీకరణముతో ( echocardiogram) హృదయములో రక్తపు గడ్డలను, కవాటములపైన మొలకలను { vegetations ; సూక్ష్మజీవులు గుండె లోపొరను ఆక్రమించి వృద్ధి పొంది హృదయాంతర తాపము ( endocarditis ) కలుగ జేస్తే యీ మొలకలు కనిపిస్తాయి. ఇవి విచ్ఛిన్నమయి రక్తప్రవాహములో అవరోధకములు ( emboli ) కలుగజేయగలవు.}, కవాటముల సంకోచమును ( valvular stenosis ), కవాటములలో తిరోగమన ప్రవాహములను ( regurgitation ), గుండె మధ్య కుడ్యములో రంధ్రములను ( విభాజన రంధ్రములు ; septal defects ) కనుగొనవచ్చును.

    మస్తిష్క ధమనీ చిత్రీకరణ ( cerebral angiogram ) : కంఠధమని ద్వారా వ్యత్యాస పదార్థములను ( contrast materials ) ఎక్కించి మెదడులో ధమనులను ఎక్స్ రేలతో చిత్రీకరించవచ్చును. ధమనులలో బుడగలను ( aneurysms), ధమనీ వైకల్యములను ( arterial malformations ) యీ చిత్రములతో కనుగొనవచ్చును.

    ఎరఖనాయిడ్ పొర క్రింద రక్తస్రావము ( subarachnoid hemorrhage ) కనుగొనుటకు వెన్నులో సూదిని దింపి నాడీద్రవము ( cerebrospinal fluid ) గ్రహించి పరీక్షలు సలుప వచ్చును .

 చికిత్స 


        మస్తిష్క విఘాత లక్షణములు కనిపించిన వారికి సత్వరముగా వైద్యశాలలలో తలకు గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణములు ( computerized  axial tomography ) చేసి కారణమును నిర్ధారించాలి. ఈ చిత్రీకరణలో రక్తస్రావము ( hemorrhage ) కనిపించకపోతే వ్యాధి కారణము రక్తప్రసరణ లోపముగా ( ischemia) ఎంచాలి. రోగి రక్తపుపోటు, హృదయ వేగము, ఉష్ణోగ్రత, ప్రాణవాయువు సంతృప్తతలు ( oxygen saturation ) పరిశీలించాలి.

రక్తపుపోటు నియంత్రణ 


    మస్తిష్క విఘాతములు కలిగిన వారిలో రక్తపుపోటు నియంత్రణలో చాలా జాగ్రత్త వహించాలి. వీరిలో తొలుత రక్తపుపోటు హెచ్చుగా ఉన్నా, తరువాత దినములలో దానంతట అదే క్రమేణ తగ్గుతుంది. రక్తనాళములో ప్రవాహమునకు అడ్డు ఉన్న  పై భాగములో రక్తపుపోటు తగ్గి కణజాలమునకు  ప్రసరణ సరిపోదు. అందువలన మస్తిష్క కణజాలానికి తగిన ప్రసరణ చేకూర్చుటకు రక్తపుపోటు కొంత ఎక్కువ ఉండుట అవసరము. రక్తపుపోటును బాగా తగ్గిస్తే నాడీమండల స్థితి క్షీణించే అవకాశములు ఎక్కువ అవుతాయి. అందువలన రక్తపుపోటును త్వరితముగా సామాన్య స్థితికి తగ్గించే ప్రయత్నములు చేయకూడదు. రక్తపుపోటు విషమస్థితికి చేరితే ; ముకుళితపు పోటు ( systolic pressure ) 220 మి. మీ. మెర్కురీ మించిన వారిలోను, వికాసపు పోటు ( diastolic pressure ) 120 మి.మీ. దాటినవారిలోను, హృదయ వైఫల్యము ఉన్నవారిలోను, రక్తపుపోటును జాగరుకతతో నెమ్మదిగా తగ్గించే ప్రయత్నము చెయ్యాలి. దినమునకు 15 శాతమునకు మించి రక్తపుపోటును తగ్గించకూడదు.

    సిరల ద్వారా తగినంత లవణజల ద్రావణము ( 0.9 % Normal saline ) ఎక్కిస్తూ రక్తప్రమాణము పెంచి మెదడుకు  ప్రసరణ బాగుగా జరిగేటట్లు చూడాలి .

    కపాలములో రక్తస్రావము ( intracranial hemorrhage ) జరిగితే  రక్తపుపోటు హెచ్చుగా ఉంటే క్రమముగా ఔషధములతో దానిని తగ్గించాలి. తల భాగమును శరీరము కంటె 15 డిగ్రీల ఎత్తులో ఉంచాలి. ఎరఖ్ నాయిడ్ క్రింద రక్తస్రావము ( subarachnoid hemorrhage ) జరిగితే ఆ యా కారణములకు చికిత్స అవసరము. ధమనుల బుడగలకు ( aneurysms ) శస్త్రచికిత్స అవసరము.

            విశ్రాంతి, అవసరమైతే నొప్పి తగ్గించు మందులు, నిద్రకు మందులు, విరేచన దోహదకారులు వాడి కపాలము లోపల ఒత్తిడి ( intracranial pressure ) పెరుగుదలను అరికట్టాలి.

నెత్తురు గడ్డల విచ్ఛేదనము ( thrombolysis ) 



    రక్తనాళములలో నెత్తురు గడ్డలు ఏర్పడి ( thrombosis ), రక్తప్రసరణ లోపించి, మస్తిష్క విఘాతములు ( strokes ) కలుగుతే నెత్తురు గడ్డల విచ్ఛేదనము ( thrombolytic therapy ) ప్రయోజనము చేకూర్చే అవకాశము ఉన్నది. మస్తిష్క విఘాత లక్షణములు పొడచూపిన మూడు గంటల లోపల నెత్తురు గడ్డలు విచ్ఛేదించు ఔషధములు ( thrombolytics : Recombinant tissue plasminogen activator ) వాడితే వారిలో ఫలితములు మెరుగుగా ఉంటాయి. మస్తిష్క విఘాత లక్షణములు తీవ్రము కానప్పుడు, ఆ లక్షణముల నుంచి త్వరగా తేరుకుంటున్న వారిలోను, ఇటీవల కాలములో శస్త్రచికిత్సలు అయిన వారిలోను, ఇటీవల తలదెబ్బలు తగిలిన వారిలోను, జఠర మండలములోను, మూత్రాంగములలోను రక్తస్రావములు ఉన్న వారిలోను, రక్తపుపోటు హెచ్చుగా ఉన్నవారిలోను, రక్తఘనీభవన అవరోధకములు ( anticoagulants ) వాడుతున్న వారిలోను, మెదడులో అదివఱకు రక్తస్రావము జరిగిన వారిలోను, రక్తఫలకములు ( platelets ) తక్కువగా ఉన్నవారిలోను  రక్తపుగడ్డలు విచ్ఛేదించు మందులు వాడకూడదు. ఈ మందుల వలన మెదడులో రక్తస్రావము కలిగే అవకాశము కలదు.

    కృత్రిమనాళిక ( catheter ) ద్వారా ధమనులలో నెత్తురు గడ్డలను విచ్ఛేదించు చికిత్స కొన్ని చోట్ల లభ్యము.

 ఏస్పిరిన్ 


    ఏస్పిరిన్ దినమునకు 325 మి.గ్రా. మొదటి రెండు దినములు ఆపై దినమునకు 81 మి.గ్రా రక్తప్రసరణ లోపము వలన కలిగే విఘాతములకు ఉపయోగిస్తారు. రక్తఫలకములు ( platelets ) గుమికూడుటను ఏస్పిరిన్ అరికట్టి రక్తము గడ్డకట్టుటను మందగింపజేస్తుంది.

క్లొపిడోగ్రెల్ 


    క్లొపిడోగ్రెల్ ( clopidogrel ) కూడా రక్తఫలకలు గుమికూడుటను అవరోధిస్తుంది. ఏస్పిరిన్ ను సహించని వారిలోను, ఏస్పిరిన్ వలన అవలక్షణములు కలిగిన వారిలోను క్లొపిడోగ్రెల్ ను వాడవచ్చును.

రక్తఘనీభవన అవరోధకములు ( Anticoagulants ) 


    కర్ణికా ప్రకంపనము (atrial fibrillation ) గలవారిలోను, కృత్రిమ హృదయకవాటములు ( prosthetic valves ) కలవారిలోను హృదయములో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. వీరిలో రక్తము గడ్డకట్టుటను మందగించు రక్తఘనీభవన అవరోధకములను ( anticoagulants ) మస్తిష్క విఘాతములు నివారించుటకు ఉపయోగిస్తారు. Warfarin, Apixaban, Rivaroxaban, Dabigartan, కొన్ని ఉదహరణలు.


    మస్తిష్క విఘాతములు కలిగిన వారిలో మింగు కండరములలో ( muscles of deglutition ) నీరసము ఉంటే ఆహారము ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి ( aspiration ) వాటిలో తాపము ( Pneumonia ) కలిగించవచ్చును. మింగుట యిబ్బంది ఉన్నవారికి ముక్కు ద్వారా కడుపులోనికి మృదు కృత్రిమ నాళములు ( nasogastric tubes ) చొప్పించి వాటి ద్వారా ద్రవ పదార్థములు ఆహారముగా యివ్వాలి.

శస్త్రచికిత్సలు 


    కంఠధమనిలో పలక ( plaque ) ఏర్పడి రక్తనాళము 60 శాతము మించి సంకోచించిన వారిలో ( Carotid artery stenosis  > 60% ) ఆ పలకను తొలగించే  శస్త్రచికిత్స ( Carotid endarterectomy ) మస్తిష్క విఘాతములు కలిగే అవకాశములను తగ్గిస్తుంది. శస్త్రచికిత్స వలన 3-4% మందిలో ఉపద్రవములు  కలుగవచ్చును.

    చిన్నమెదడులో విఘాతముల ( cerebellar strokes ) వలన  వాపు కలిగి మెదడు మూలముపై ( brainstem ) ఒత్తిడి పెంచినా, నాడీద్రవ ప్రసరణకు భంగము కలిగించి జలశిరస్సును ( hydrocephalus ) కలిగించినా అత్యవసర శస్త్రచికిత్సలు అవసరము.


వ్యాయామ చికిత్స ( physical therapy ), వాగ్చికిత్స ( speech therapy ), వృత్తి చికిత్స  (  occupational therapy ) 


        మస్తిష్క విఘాతములు కలిగిన వారికి వ్యాయామ చికిత్స, వృత్తి చికిత్స కండరములలో శక్తిని పెంచుటకు, నడకతీరు సరిచేయుటకు, దైనందిన కార్యక్రమములు చేసుకొనుటకు  తోడ్పడుతాయి. 

        వాగ్చికిత్సలో ( మాటల శిక్షణ /  speech therapy ) ముఖ కండరములకు, నమలు కండరములకు ( muscles of mastication), మ్రింగు కండరములకు ( muscles of  deglutition ), నాలుక కండరములకు శిక్షణ ఇస్తారు.

నివారణ :


    అరవై శాతపు మస్తిష్క విఘాతములు ధమనీ కాఠిన్యము ( atherosclerosis ) వలన కలుగుతాయి. అందువలన రక్తపుపోటును అదుపులో ఉంచుకోవాలి. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. కొలెష్టరాలు అధికముగా ఉంటే దానిని తగ్గించుకోవాలి. పొగ త్రాగకూడదు. ఊబకాయమును తగ్గించుకోవాలి. తగినంత వ్యాయామము చేస్తుండాలి. ఈ చర్యలు ధమనీ కాఠిన్యతను మందగించుతాయి. ఆహారములో ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, అపరాలు, ఆలివ్ నూనె వాడుట మంచిది. మాంసాహారము తినేవారు చేపల వాడుక పెంచుకొని మిగిలిన మాంసములను మితపరచుకొనుట మేలు. మద్య వినియోగమును మితములో ఉంచుకోవాలి.
    కర్ణికా ప్రకంపనము ( atrial fibrillation ) గలవారు, కృత్రిమ హృదయకవాటములు ఉన్న వారు రక్తపుగడ్డలు నివారించు మందులు ( anticoagulants ) వాడుకోవాలి.



పదజాలము :

Aneurysms = ధమనులలో బుడగలు, ధమనీ బుద్బుదములు ( గ.న )
Anterior cerebral artery = పురోమస్తిష్క ధమని ( గ.న )
Anterior communicating artery = పురో సంధాన ధమని (గ.న )
Anticoagulants = రక్తఘనీభవన అవరోధకములు ( గ.న )
Aphasia = మాట పోవుట ( వాగ్నష్టము / వాజ్ఞ్నష్టము ) ( గ.న )
Arterial circle of Willis = మస్తిష్క ధమనీ చక్రము )
Arterial malformations = ధమనుల వైకల్యములు ( గ.న )
Ataxia = దేహ అస్థిరత ( గ.న )
Atherosclerosis = ధమనీ కాఠిన్యము 
Atrial fibrillation = కర్ణికా ప్రకంపనము ( గ.న )
Axons = అక్షతంతులు 
Auditory cortex = శ్రవణవల్కలము గ.న )
Brain stem = మస్తిష్క మూలము
Carotid artery stenosis = కంఠధమని సంకుచితము ( గ.న )
Catheter = కృత్రిమ నాళము ( శరీరములోనికి దూర్చు నాళము )
Central nervous system = కేంద్ర నాడీమండలము 
Central sulcus = మధ్యగర్తము ( గ.న )
Cerebellum  = చిన్నమెదడు 
Cerebrovascular accidents = మస్తిష్క ( రక్తనాళ ) విఘాతములు ( గ.న )
Cerebral angiogram = మస్తిష్క ధమనీ చిత్రీకరణ ( గ.న )
Cerebrum  = పెద్దమెదడు  
Computerized Axial Tomography = గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము ( గ.న )
Cranial nerves  = కపాలనాడులు 
Diastolic pressure = వికాస పీడనము ( గ.న )
Diplopia = ద్విదృష్టి ( గ.న )
Dysarthria = పలుకు తొట్రుపాటు ( గ.న )
Echocardiogram = హృదయ  ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న )
Electrocardiograph = విద్యుత్ హృల్లేఖ 
Endocarditis  = హృదయాంతర తాపము ( గ.న )
External carotid artery = బాహ్య కంఠ ధమని ( గ.న )
Frontal lobe = ( మస్తిష్క ) లలాట భాగము  ( గ.న )
Internal capsule = అంతర గుళిక ( గ.న )
Internal carotid artery = అంతర కంఠధమని ( గ.న )
Intracranial pressure = కపాలాంతర పీడనము ( గ.న )
Intraparenchymal hemorrhage = ( మస్తిష్క ) కణజాలాంతర రక్తస్రావము  ( గ.న )
Hemianopsia = అర్ధాంధత్వము ( గ.న )
Hemorrhage = రక్తస్రావము 
Hydrocephalus = జలశిరస్సు , జలశీర్షము
Lateral sulcus = పార్శ్వగర్తము
Lower motor neurons   = అధో చలన నాడీకణములు ( గ.న )
Magnetic Resonance Imaging  = అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న )
Magnetic Resonance Angiogram = అయస్కాంత ప్రతిధ్వని రక్తనాళ చిత్రీకరణము ( గ.న )
Murmurs = మర్మర శబ్దములు ( గ.న )
Nasogastric tube =   నాసికా జఠర నాళము 
Nervous system = నాడీమండలము
Neurons = నాడీకణములు
Middle cerebral artery = మధ్య మస్తిష్కధమని ( గ.న )
Motor cortex = చలన వల్కలము ( గ.న )
Occipital lobe = ( మస్తిష్క ) పృష్ఠభాగము ( గ.న )
Occupational therapy = వృత్తి చికిత్స  
Oxygen saturation = ప్రాణవాయువు సంతృప్తత ( గ.న )
Papilloedema  = కనుబింబపు పొంగు ( గ.న )
Paralysis = పక్షవాతము
Parietal lobe = ( మస్తిష్క ) పార్శ్వ భాగము ( గ.న )
ParaSympathetic nervous system = పరానుభూత నాడీ వ్యవస్థ
Peripheral nervous system = వికేంద్ర నాడీమండలము 
Physical therapy = వ్యాయామ చికిత్స ( గ.న )
Pons =  మస్తిష్క వారధి ( గ.న )
Posterior cerebral artery = పృష్ఠ మస్తిష్కధమని ( గ.న )
Posterior communicating artery = పృష్ఠ సంధాన ధమని ( గ.న )
Platelets = రక్తఫలకములు ( గ.న )
Sensory cortex = జ్ఞాన వల్కలము ( గ.న )
Sensory loss = స్పర్శ నష్టము  ( గ.న )
Septal defects = విభాజక రంధ్రములు ( గ.న )
Speech therapy = వాగ్చికిత్స  ( మాటల శిక్షణ / మాట కఱపు ) ( గ.న )
Spinal cord = వెన్నుపాము 
Spinal nerves = వెన్నునాడులు 
Sympathetic nervous system = సహవేదన నాడీవ్యవస్థ 
Systolic pressure = ముకుళిత పీడనము ( గ.న )
Temporal lobe = ( మస్తిష్క ) కర్ణ భాగము ( గ.న )
Thrombolytics = రక్తఖండ విచ్ఛేదనములు ( గ.న )
Valvular stenosis = కవాట సంకోచము ( గ.న )
Vertebral arteries = వెన్ను ధమనులు ( గ.న )
Visual cortex = దృష్టి వల్కలము ( గ.న )
Voluntary muscles = ఇచ్ఛా కండరములు
Upper motor neurons = ఊర్ధ్వ చలన నాడీకణములు ( గ.న )

( ఉపయుక్తమనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. తెలుగులో  వైద్యవిషయములను నా శక్తి కొలది   తెలియపఱచుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...