1, జూన్ 2019, శనివారం

ముఖపక్షవాతము ( Facial Palsy )

                       ముఖ పక్షవాతము 

                          ( Facial Palsy )


     ( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )
                                                                                           
                                                                                డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.


 ముఖ నాడులు ( Facial nerves )   


    ముఖ కండరముల ( Facial muscles ) చలనము వలన ముఖ కవళికలు కలుగుతాయి. ముఖ కండరముల చలనములు వామ ( ఎడమ ), దక్షిణ ( కుడి ) ముఖ నాడుల ( Facial nerves ) సంజ్ఞలపై ఆధారపడుతాయి.

    శరీరములో నాడులను కపాల నాడులు ( Cranial nerves ), వెన్ను నాడులుగా ( Spinal nerves ) విభజించవచ్చును. కపాల నాడులు మెదడు వివిధభాగములు, మస్తిష్క మూలము ( brain stem ) నుంచి మొదలిడి కపాలములో వివిధ రంధ్రముల ద్వారా బహిర్గతమవుతాయి. వెన్ను నాడులు వెన్నుపాము నుండి మొదలిడి వెన్నుపూసల మధ్య రంధ్రముల ద్వారా వెలువడుతాయి.
    
మనుజులలో 12 జతల కపాల నాడులు ఉంటాయి. ముఖ నాడులు 7 వ జత కపాలనాడులు
    
    ముఖ నాడులు మస్తిష్క మూలములో ( Brain stem ) వారధి ( Pons ) రెండు వైపుల నుంచి వెలువడుతాయి. అవి కపాలపు వెనుక భాగములో పయనించి అంతర శ్రవణరంధ్రము ( Internal auditory meatus ) ద్వారా  కర్ణాస్థి ( temporal bone ) లోనికి ప్రవేశించి ముఖనాడి నాళము ( facial canal ) ద్వారా పయనించి స్టైలాయిడ్ రంధ్రము ( styloid foramen ) నుంచి కపాలము బయటకు వచ్చి చెవి చెంతన ఉన్న శ్రవణమూల లాలాజలగ్రంథి ( parotid salivary gland ) లోనికి చొచ్చి వివిధశాఖలుగా చీలుతుంది. ఆ శాఖలు లాలాజల గ్రంథి  ముందు భాగము నుంచి బయలుపడి వివిధ ముఖ కండరములకు నాడీప్రసరణ కావిస్తాయి. లాలాజల గ్రంథులకు, బాష్ప గ్రంథులకు కూడా ముఖనాడులు నాడీ ప్రసరణ సమకూర్చుతాయి. నాలుక ముందు రెండింట మూడు భాగములలో రుచి కూడా ముఖ నాడులపై ఆధారపడి ఉంటుంది.

    ముఖ కండరములు ముఖ కవళికలను కలుగజేయుటే గాక కనురెప్పలతో కనులను పూర్తిగా మూసి ఉంచి కనులకు రక్షణ కలిగించుటకు, పెదవులను మూసి ఉంచి నోటి నుంచి లాలాజలము కారకుండా ఉండుటకు తోడ్పడుతాయి.

ముఖ కండరములు ( Facial muscles ) 




    పృష్ఠశిర లలాట కండరములు ( Occipito frontalis muscles ) : ఈ కండరములు తల వెనుక భాగము నుంచి నుదుటికి వ్యాపిస్తాయి. ఈ కండరముల లలాట భాగములు కనుబొమలను పైకెత్తుటకు, నుదుటిలో ముడుతలు ( wrinkles ) కలిగించుటకు ఉపయోగపడుతాయి.

    నేత్రమండలిక ( Orbicularis oculi ) కండరములు : కనుగుంటల చుట్టూ మండలాకారాములో ఉంటాయి. ఇవి కనులు గట్టిగా మూసుకొనుటకు తోడ్పడుతాయి .

    భ్రుకుటి కండరములు ( corrugator supercilli muscles ) : ఇవి కనుబొమల లోభాగము వద్ద ఉంటాయి. కనుబొమలు ముడిపడుటకు ( frowning ) తోడ్పడుతాయి.
    
    వక్త్రమండలిక కండరము ( Orbicularis oris ) : నోటి చుట్టూ వివిధ దిశలలో పోగులు ఉండి పెదవుల చుట్టూ ఉండే యీ కండరము పెదవులను ముడుచుటకు, ఊళవేయుటకు, సన్నాయి, వేణువుల వాయిద్యములకు ఉపయోగపడుతుంది. చొంగ కారుటను అరికడుతుంది.

    వక్త్రకోణ నిమ్న కండరములు ( Depressor anguli oris muscles ) : ఇవి కనుబొమలు ముడిచి నపుడు పెదవి కోణాలను క్రిందకు లాగుతాయి.

    అధరోద్ధరణ కండరములు ( Levator labii superioris muscles ) : పై పెదవిని మీదకు చలింప జేస్తాయి.

    వక్త్రకోణ ఉద్ధరణ కండరములు ( Levator anguli oris muscles ) : ముఖమునకు చెరివైపు ఉండే ఈ కండరము  ఆ ప్రక్క నోటి కోణమును ముక్కువైపు మీదకు లాగుటకు ఉపయోగపడుతుంది

    కపోలికలు ( బుగ్గ కండరములు ; Buccinators ) : బుగ్గలలో ఉండే కండరములు బుగ్గలను దంతములకు అదిమి ఉంచి ఆహారము నములుటకు ఉపయోగపడుతాయి.

    చిబుక కండరములు ( Mentalis muscles ) : మూతి ముడుచుకొనుటకు, పెదవి విఱుచుటకు ఈ కండరములు ఉపయోగ పడుతాయి.

    కుడి ముఖకండరములకు కుడి ముఖనాడి,  ఎడమ ముఖకండరములకు ఎడమ ముఖనాడి
నాడీప్రసరణ  సమకూరుస్తాయి.

    మెదడు నుంచి సంజ్ఞలు నాడులలో విద్యుత్తు ద్వారాను, నాడీతంతు నాడీకణ సంధానముల వద్దను, నాడీతంతు కండర సంధానముల ( neuromuscular junctions) వద్దను నాడీ ప్రసారిణుల ( neurotransmitters ) ద్వారా సంజ్ఞలు ప్రసరిస్తాయి. నాడితంతువుల నుంచి సంజ్ఞలు కండరములకు చేరునపుడు కండరములు ముకుళించుకొంటాయి.


 ముఖ పక్షవాతము ( Facial paralysis ) 


    ముఖనాడిలో ( facial nerve ) వివిధ కారణముల వలన స్తంభనము ఏర్పడి నప్పుడు ఆ పక్క ముఖకండరములలో పక్షవాతము వస్తుంది. ఆ ముఖకండరములు ఇచ్ఛాపూర్వక చలనమును కోల్పోతాయి. ఆ కండరముల బిగుతు కూడా తగ్గుతుంది.

      ముఖనాడీ కేంద్రము ( Facial nerve nucleus ) మస్తిష్క మూలములో వారధి ( Pons ) భాగములో ఉంటుంది. ఈ కేంద్రమునకు మెదడులో చలన వల్కలము ( motor cortex ) నుంచి నాడీ తంతువులు వచ్చి ఆ కేంద్రములో ఉన్న నాడీకణములతో సంధానము అవుతాయి. ముఖనాడీ కేంద్రము నుంచి ముఖనాడులు వెలువడుతాయి

    నాడీకేంద్రము లోను, నాడీకేంద్రము పైన కలిగే రుగ్మతల వలన కలిగే పక్షవాతమును ఊర్ధ్వచలననాడీ పక్షవాతము ( upper motor neuron paralysis) గాను, నాడీకేంద్రము దిగువ, నాడిలో కలిగే రుగ్మతల వలన కలిగే పక్షవాతమును అధశ్చలననాడీ పక్షవాతము ( Lower motor neuron paralysis) గాను పరిగణిస్తారు.


కారణములు 


    ముఖనాడుల పక్షవాతమునకు సాధారణ కారణము బెల్స్ పక్షవాతము ( Bell’s Palsy ). ముఖ పక్షవాతము వివిధ సమాజములలో చాలా కాలముగా గుర్తించబడినా సర్. ఛార్లెస్ బెల్ 1826 లో దీనిని ముగ్గురు రోగులలో గమనించి లక్షణములను వర్ణించుటచే దీనికి Bell’s Palsy పేరు స్థిరపడింది. డెబ్బయి శాతపు ముఖ పక్షవాతములకు బెల్స్ పక్షవాతము కారణము.
   
    సుమారు ముప్పయి శాతము మందిలో మెదడుపై గల పొరలలో కలిగే తాపము వలన ( meningitis),  ప్రమాదములలో కలిగే దెబ్బల ( trauma ) వలన, కొత్త పెరుగుదలల ( tumors ) వలన, మస్తిష్కరక్తనాళ విఘాతముల వలన ( Cerebrovascular accidents ), మధుమేహవ్యాధి ( Diabetes mellitus ), సార్కాయిడోసిస్ ( Sarcoidosis ), లైమ్స్ వ్యాధుల ( Lyme’s disease) వలన ముఖ పక్షవాతము కలుగ గలదు. కాని వీరిలో ఆ యా వ్యాధుల యితర లక్షణములు ఉంటాయి. నాడీమండలములో యితర భాగములపై కూడా ఆ యా వ్యాధుల ప్రభావము ఉండుట చేత యితర నాడీమండల లక్షణములు కూడా పొడచూపుతాయి.

    ఇతర నాడీమండల లక్షణములు లేకుండా, యితర వ్యాధి లక్షణములు లేనివారిలో కనిపించే ముఖ పక్షవాతమును బెల్స్ పక్షవాతముగా పరిగణించవచ్చును. 

    

వ్యాధి విధానము ( Pathogenesis ) 


    బెల్స్ పక్షవాతము అధశ్చలననాడీ పక్షవాతమును కలిగిస్తుంది. బెల్స్ పక్షవాతమునకు కారణము తెలియదు. పరిశోధనలలో కొంతమందిలో జ్వరం పొక్కులు కలిగించే హెర్పీస్ సింప్లెక్స్ విషజీవాంశములు ( Herpes Simplex viruses HSV1 ),కొంతమందిలో ఆటాలమ్మ, మేఖల విసర్పిణి జీవాంశములు ( herpes zoster viruses ) కనుగొనబడ్డాయి.

    వీరిలో సన్నని ముఖనాడి నాళములో ( facial canal ) పయనించే ముఖనాడిలో ( facial nerve ) తాపము ( inflammation ), వాపు కలిగి అస్థినాళము యిరుకయి ముఖనాడిపై కలిగే ఒత్తిడి వలన, రక్తప్రసరణ తగ్గుట వలన, తాపము వలన కలిగే విధ్వంసము వలన, నాడిపై గల కొవ్వుపొరకు ( myelin sheath ) కలిగే విధ్వంసము వలన నాడీ వ్యాపారమునకు భంగము ఏర్పడి  సంజ్ఞల ప్రసరణకు భంగము కలుగుతుంది. అందువలన ముఖ కండరములలో నీరసము ( వాతము ) కలుగుతుంది. బెల్స్ పక్షవాతము చాలా మందిలో తాత్కాలిక ప్రక్రియ. చికిత్సతోను, చికిత్స లేకపోయినా క్రమముగా కొద్ది వారములలో వ్యాధి నయమవుతుంది. కొంతమందిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి  ఉపశమనము త్వరగా  కలుగుతుంది.

ముఖనాడి పక్షవాత ( facial palsy ) లక్షణములు  


    ఈ లక్షణముల తీవ్రత వివిధస్థాయిలలో ఉంటుంది. సాధారణముగా ముఖములో ఒకపక్కే పక్షవాతము కనిపిస్తుంది. అసాధారణముగా రెండు ముఖనాడులు పక్షవాతమునకు గుఱి కావచ్చును. వ్యాధి లక్షణములు అకస్మాత్తుగా కలిగి రెండు మూడు దినములలో ఉధృతి పొందుతాయి. జలుబు, తలనొప్పి, చెవి కింద చుట్టూ బాధ, కింద దవడలో నొప్పి కలుగవచ్చు. మిగిలిన శరీర భాగములలో పక్షవాతము ఉండదు. ముఖ కండరములలో అదురు, నీరసము కలుగవచ్చును. ఆ ప్రక్క  కనుబొమ, నోటిభాగములు  వాలి ఉంటాయి . వ్యాధికి గుఱైన వైపు నుదుటిలో ముడుతలు లోపిస్తాయి. ఆ వైపు కంటిని పూర్తిగా మూయలేరు. కన్నీరు స్రావము తగ్గి కంటిలో ఆర్ద్రత తగ్గుతుంది.

    ఆ పక్క నేత్రమండలిక కండరములో బిగుతు తగ్గుట వలన కన్నీళ్ళు బయటకు ఒలుకుతుంటాయి. నాసోష్ఠ వళిక ( nasolabial fold ) రూపు తగ్గి ఉంటుంది. నోటి కోణము క్రిందకు ఒరిగి ఉంటుంది. ఆ ప్రక్క చొంగ కారవచ్చును. ఊళ సరిగా వేయలేరు. ఆ పక్క నాలుకలో ముందు భాగములో రుచి లోపిస్తుంది. లాలాజల స్రవము తగ్గి నోరు పొడిగా ఉండవచ్చు. బుగ్గలలో గాలి పట్టి ఉంచలేరు. మాటలాడుటకు, తిండి తినుటకు, నీళ్ళు  త్రాగుటకు యిబ్బంది ఉంటుంది. చెవులలో గింగురు శబ్దము, మాటలధ్వని,  శబ్దముల హోరు హెచ్చయి అసౌఖ్యము కలుగవచ్చును.

వ్యాధి నిర్ణయము 

     
    ఇతర నాడీమండల వ్యాధి లక్షణములు, ఇతర వ్యాధుల లక్షణములు లేకుండా ఒకపక్క ముఖ పక్షవాత లక్షణములు ఒకటి రెండు దినములలో పొడచూపినపుడు వ్యాధి లక్షణముల బట్టి తాత్కాలిక ముఖ పక్షవాతముగా ( Bell’s Palsy ) నిర్ధారణ చేయవచ్చును. వీరిలో యితర శరీరభాగములు పక్షవాతమునకు గురికావు.
  
    ఈ వ్యాధి ( Bell’s Palsy ) నిర్ధారణకు ప్రత్యేకమైన రక్తపరీక్షలు గాని యితర పరీక్షలు గాని లభ్యములో లేవు. ఈ వ్యాధి తాత్కాలికమైనది, వ్యాధి లక్షణములు కార్టికోష్టీరాయిడులతోను, ఏస్పిరిన్ తోను కొద్దివారములలో ఉపశమిస్తాయి కాబట్టి విస్తృతముగా ఖరీదైన పరీక్షలు చేయుట అనవసరము.

    విద్యుత్ కండరలేఖనము ( Electromyography ) పరీక్షతో ముఖనాడిలో హానిని, హానితీవ్రతను పసిగట్టవచ్చును.

    మధుమేహ వ్యాధి, సార్కాయిడోసిస్ ( Sarcoidosis ), లైమ్స్ వ్యాధులను ( Lyme’s disease ) రక్తపరీక్షతో నిర్ధారణ చేయవచ్చును.

    లైమ్స్ వ్యాధి ( Lyme’s disease ) ఉత్తర భూగోళవాసులలో చూస్తాము. ఈ వ్యాధి బొర్రీలియా సూక్ష్మజీవుల వలన కలుగుతుంది. వీరిలో ప్రథమదశలో  ఎద్దుకన్ను ( Bull eye ) రూపములో చర్మముపై  ఎఱ్ఱని దద్దురు కనిపిస్తుంది. శరీరములో అనేక లక్షణాలు కలిగించే యీ వ్యాధి వలన కొందఱిలో ముఖనాడి పక్షవాతము  కలుగుతుంది. లేడి పురుగులు ( deer ticks )  కుట్టుట వలన యీ వ్యాధి సంక్రమిస్తుంది. వీరిలో కొందఱికి  రెండు పక్కలా ముఖ పక్షవాతము కలుగవచ్చును.

    ఇతర కపాల నాడులలోను, నాడీ మండలములో యితర భాగములలోను రుగ్మత లక్షణములు ఉన్నపుడు, ముఖ పక్షవాత చిహ్నములు మూడువారములలో ఉధృతమయినా, నాలుగు వారములలో తగ్గుదల చూపకపోయినా, యితర వ్యాధులకు పరిశోధించాలి.

    మస్తిష్క విఘాతములను ( Cerebro vascula accidents ), కొత్త పెరుగుదలలను ( new growths ), సూక్ష్మాంగజీవ వ్యాధులను కనుగొనుటకు గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణములు ( Computerized Axial Tomography ), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు ( Magnetic Resonance Imaging Scans ) అవసరము.

    మధ్యచెవిలో సూక్ష్మజీవుల వలన తాపము ( Otitis media ) కలిగిన వారిలో చెవినొప్పి, చెవినుంచి స్రావము కారుట వంటి లక్షణములతో ముఖ పక్షవాతము కలుగవచ్చును. వారికి చెవి తాపమునకు చికిత్స, వారి మధ్య చెవిలో తాపము వలన Cholesteotoma అనే పెరుగుదల ఏర్పడితే  దానికి శస్త్రచికిత్స అవసరము.
    
    మస్తిష్క రక్తనాళ విఘాతముల ( Cerebro vascular accidents ) వలన కలిగే స్పర్శనష్టము, చలననష్టము ముఖము లోనే గాక ఆ పక్క చేతులలోను, కాళ్ళలోను కూడా కనిపిస్తాయి. వీరిలో లలాట భాగములో వాతపు లక్షణములు రెండవ పక్క ముఖనాడి తంతులు కొన్ని ఈవల లలాట కండరమునకు ప్రసరణ చేయుట వలన తీవ్రముగా ఉండవు. నుదుటిలో ముడుతలు పూర్తిగా పోవు .

    ముఖ పక్షవాతముతో బాటు  బయట చెవిపైన, చెవి ప్రాంతములోను  విస్ఫోటము ( Rash ) ఉన్నట్లయితే అది  ఆటాలమ్మ - మేఖల విసర్పిణి విషజీవాంశముల  ( Varicella - Herpes Zoster viruses ) వలన కలిగినదని నిర్ధారణ చేయవచ్చును. దానిని Ramsay Hunt Syndrome గా వర్ణిస్తారు.

చికిత్స 


    ఒక ముఖనాడికే పరిమితమయిన పక్షవాతము హెచ్చుశాతము మందిలో ముఖపక్షవాతముగా ( Bell’s Palsy ) పరిగణించవచ్చును. చాలా మందిలో దానంతట అది తగ్గినా, త్వరిత ఉపశమనము కొఱకు, అవశిష్ట లక్షణములను అరికట్టుటకు చికిత్సలు అవసరము.

    వీరికి ముఖనాడిలో తాపమును ( inflammation ) పరిమితము చేసి, లక్షణములు తొలగించుటకు తాప నిరోధకములైన కార్టికోష్టీరాయిడులను ( Corticosteroids ) ముఖ్యముగా ప్రెడ్నిసోన్ ను ( Prednisone ) వాడుతారు. వీటి వలన హెచ్చుశాతపు మందిలో వ్యాధి లక్షణములు త్వరగా తగ్గుతాయి.

    విషజీవాంశ నాశకము - ఎసైక్లొవీర్ ని ( antiviral drug- acyclovir ) కార్టికోష్టీరాయిడులతో బాటు వాడుట వలన అదనపు ప్రయోజనము చేకూరవచ్చును. పరిశోధనల ఫలితములు నిర్దిష్టముగా లేవు.

    నొప్పి తగ్గించుటకు ఏస్పిరిన్, ఎసిటెమైనొఫెన్, ఐబుప్రొఫెన్ లను వాడవచ్చు.

కంటికి రక్షణ 


    కనురెప్ప పూర్తిగా మూసుకొనక కన్నీళ్ళు బయటకు ఒలుకుట వలన, కన్నీళ్ళ స్రావము తగ్గుట వలన కనుగుడ్డు ఆర్ద్రత కోల్పోయి ఆరిపోవుటకు, తాపమునకు గుఱి అగుటకు  అవకాశము గలదు. కాబట్టి కంటికి రక్షణ చేకూర్చాలి. కృత్రిమ బాష్పములను వాడి, కనురెప్పను మూసిఉంచి ( ప్రత్యేకముగా నిదురించునపుడు ) దానిపై కనుకప్పు ( eye patch ) ఉంచి కంటికి రక్షణ చేకూర్చాలి.

వ్యాయామ, భౌతిక చికిత్సలు 


    ముఖకండరములకు వ్యాయమ చికిత్సలు కండరముల బిగుతును కాపాడుటకు, శాశ్వత సంకోచములను అరికట్టుటకు ఉపయోగపడుతాయి.

    కాపడము వంటి ఉష్ణచికిత్సల వలన నొప్పి తగ్గే అవకాశము ఉన్నది. విద్యుత్ప్రేరణ చికిత్సల ( electrical stimulation of nerve ) వలన పరిశోధనలలో సత్ఫలితములు కనిపించలేదు.

    ముఖనాడిపై ఒత్తిడి తగ్గించే శస్త్రచికిత్సల ( decompression ) వలన ప్రయోజనము తక్కువ.
చాలా నెలల పిమ్మట కూడా ముఖ కవళికలలో వికృతము పోని వారికి పునర్నిర్మాణ శస్త్రచికిత్సల ( Reconstructive surgeries ) వలన ప్రయోజనము చేకూరవచ్చును.

    ఇతర వ్యాధుల వలన ముఖ పక్షవాతము కలిగితే ఆయా వ్యాధులకు చికిత్సలు చేయాలి.

    తాత్కాలిక ముఖ పక్షవాతము ( Bell’s Palsy ) కలిగిన వారిలో రెండు మూడు వారములలో క్రమముగా వాత లక్షణములు తగ్గుముఖము పడుతాయి. చాలామందిలో మూడు, ఆరు మాసములలో లక్షణములు పూర్తిగా తగ్గిపోతాయి. చాలా తక్కువ శాతము మందిలో కండరముల శక్తి పూర్వస్థితికి రాకపోవచ్చును.

    కొంతమందిలో వ్యాధి వలన  ధ్వంసము చెందిన ముఖనాడి తంతువులు పునరుజ్జీవనము ( Regeneration ) చెందినపుడు వాటి  గమ్యస్థాన గతులు తప్పుతాయి. నేత్ర మండలిక కండరపు నాడీతంతులు వక్త్ర ( నోటి ) కండరములకు  చేరుకుంటే కన్ను మూసినపుడు వక్త్రకోణము పైకి లేస్తుంది. ఊర్ధ్వ లాలాజల కేంద్రము ( Superior salivary nucleus ) నుంచి వెలువడు నాడీతంతులు బాష్పగ్రంథులకు ( lacrimal glands ) చేరుకుంటే తినుబండారముల వాసన తగిలినప్పుడు, భోజన సమయములందు  కన్నీళ్ళు కారవచ్చును. వీటిని మొసలి కన్నీళ్ళుగా వర్ణిస్తారు.


( వైద్యవిజ్ఞానిక విషయములను తెలుగులో నా శక్తిమేరకు చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తమనుకుంటే నా వ్యాసములను నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...