28, మార్చి 2020, శనివారం

మూత్రాంగములు ( Kidneys )


తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో :



                                             మూత్రాంగములు 

                                                 ( Kidneys )


                                                                            డాక్టరు . గన్నవరపు నరసింహమూర్తి.





    శరీరములో వివిధ అవయవముల కణజాలములో జరిగే జీవవ్యాపార ప్రక్రియలో 
( metabolism ) వ్యర్థ పదార్ధములు ఉత్పత్తి అయి రక్తములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థపదార్థములను రక్తమునుంచి ఎప్పటి కప్పుడు తొలగించి రక్తమును శుద్ధిచేసి శరీర అవయవములను పరిరక్షించి శరీర వ్యాపారమును ఆరోగ్యకరముగా నడిపించుట చాలా అవసరము. జంతుజాలములోను పక్షులలోను ఆ బాధ్యత మూత్రాంగములు ( మూత్రపిండములు / kidneys ) నిర్వహిస్తాయి. 
           
    మూత్రాంగములలో రక్తము నిత్యము వడపోయబడి వ్యర్థ పదార్థములు నీటితో బాటు తొలగించబడుతాయి. వడపోత ద్రవము ( filtrate ) నుంచి దేహమునకు అవసరమయే చక్కెర ( glucose  ), సోడియం, బైకార్బొనేట్, ఏమైనో ఆమ్లములు ( aminoacids ) వంటి పదార్థములు, ఎక్కువైన నీరు క్లిష్టమైన ప్రక్రియతో తిరిగి రక్తములోనికి గ్రహించబడుతాయి. మిగిలిన వడపోత ద్రవము వ్యర్థ పదార్థములతో మూత్రముగా విసర్జింపబడుతుంది. రక్తములో అధికమయిన పొటాసియమ్, ఉదజని 
( hydrogen ), అమ్మోనియా, యూరికామ్లము ( uric acid ) మూత్రాంగములలో మూత్రములోనికి స్రవించబడుతాయి.

    శరీరములో నీరు, విద్యుద్వాహక లవణములు ( electrolytes ), ఇతర  ఖనిజ లవణముల పరిమాణములను, ఆమ్ల - క్షారకముల సమతుల్యతను ( Acid- base balance ) నిర్వహించుటలోను, రక్తపీడన నియంత్రణలోను మూత్రాంగములు ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి. రక్తోత్పాదిని ( erythropoietin ) అనే జీవోత్ప్రేరకము ( enzyme ) మూత్రాంగములలో ఉత్పత్తి అయి ఎముకల మజ్జలో ఎఱ్ఱ రక్తకణముల ఉత్పాదనకు తోడ్పడుతుంది.

    మూత్రంగములు వివిధ కారణముల వలన సత్వర ఘాతములకు ( acute insults ) లోనయితే సత్వర మూత్రాంగ వైఫల్యము ( Acute Renal failure) కలుగవచ్చును. దీర్ఘకాల వ్యాధుల వలన దీర్ఘకాల  మూత్రాంగ వైఫల్యము ( Chronic Renal failure ) కలుగవచ్చును. వీని గురించి తరువాత చర్చిస్తాను. మూత్రాంగముల నిర్మాణము, వ్యాపారముల గురించి స్థూలముగా ఇపుడు వ్రాస్తాను.

    మనుజులలో రెండు మూత్రాంగములు కుడి, ఎడమ ప్రక్కల ఉదరాంత్ర వేష్టనమునకు ( peritoneum ) వెనుక ఉంటాయి. ఇవి చిక్కుడు గింజల ఆకారములో ఉంటాయి. వయోజనులలో  ఒక్కక్కటి సుమారు 11 సెంటీమీటరుల పొడవు కలిగి ఉంటుంది. మూత్రాంగము వెలుపల పక్క కుంభాకారమును, లోపల ప్రక్క పుటాకారమును కలిగి ఉంటుంది. లోపల మధ్య భాగములో ఉండు నాభి ( hilum ) నుంచి మూత్రనాళము ( ureter ) వెలువడుతుంది. బృహద్ధమని ( aorta ) శాఖ అయిన ముత్రాంగ ధమని ( Renal artery ) నాభి ద్వారా ప్రవేశించి మూత్రాంగమునకు రక్త ప్రసరణను చేకూర్చుతుంది. మూత్రాంగ నాభి నుంచి మూత్రంగ సిర ( Renal vein ) వెలువడి రక్తమును అధోబృహత్సిరకు ( Inferior venacava ) చేర్చుతుంది. మూత్రాంగముల నుంచి వెలువడు మూత్రనాళములు ( Ureters ) దిగువకు పయనించి శరీరపు కటిస్థలములో ( Pelvis ) ఉండు మూత్రాశయమునకు ( urinary bladder ) మూత్రమును చేరుస్తాయి. 



    మూత్రాశయములో మూత్రము నిండుతున్నపుడు దాని గోడలో కల మృదు కండరము ( detrusor muscle ) సాగి  మూత్రాశయపు పరిమాణము పెరుగుటకు సహకరిస్తుంది. మూత్రాశయము నిండినపుడు  మూత్రము మూత్ర ద్వారము ( urethra ) ద్వారా విసర్జింపబడుతుంది. మూత్రాశయము, మూత్ర ద్వారముల మధ్య నుండు నియంత్రణ కండరము ( sphincter ) వలన మూత్ర విసర్జనపై మనకు ఆధీనత కలుగుతుంది. మూత్రాశయ కండరము ( detrusor muscle ) సంకోచించి, నియంత్రణ కండరపు బిగువు తగ్గుట వలన మూత్ర విసర్జన జరుగుతుంది.


    మూత్రాంగములలో( kidneys ) కణజాలము బహిర్భాగము ( cortex ), అంతర్భాగములుగా ( medulla ) గుర్తించబడుతుంది. అంతర్భాగము ( medulla ) గోపురములు  ( pyramids ) వలె అమర్చబడి ఉంటుంది. ఈ గోపురముల కొనల నుంచి మూత్రము గరాటు ఆకారములో ఉండు మూత్రకుండిక ( మూత్రపాళియ ; Renal Pelvis ) లోనికి కుండిక ముఖద్వారముల ( calyces ) ద్వారా చేరుతుంది. మూత్రకుండిక క్రమముగా సన్నబడి మూత్రనాళముగా మూత్రాంగము నుంచి బయల్వడుతుంది.

    మూత్రాంగములలో మూత్రము మూత్రాంకములలో ( nephrons ) ఉత్పత్తి అవుతుంది. మూత్రాంకముల తొలిభాగములు మూత్ర ముకుళములు ( Renal corpuscles ). మూత్ర ముకుళములు మూత్ర నాళికలుగా ( renal tubules ) కొనసాగుతాయి. ప్రతి మూత్ర ముకుళములోనికి ఒక సూక్ష్మ ప్రవేశిక ధమనిక ( afferent arteriole ) ప్రవేశించి, కేశరక్తనాళిక గుచ్ఛముగా ( Glomerulus ) ఏర్పడుతుంది. ఈ కేశనాళికల గుచ్ఛము నుంచి నిష్క్రమణ ధమనిక ( efferent arteriole ) ఏర్పడి మూత్ర ముకుళము నుంచి బయటకు వెలువడుతుంది. నిష్క్రమణ ధమనులు మూత్రనాళికల చుట్టూ మరల కేశనాళికలుగా చీలుతాయి. ఈ కేశనాళికలు కలిసి నిష్క్రమణ సిరలను ( efferent venules ) ఏర్పరుస్తాయి. నిష్క్రమణ సిరల కలయికచే మూత్రాంగ సిర ( renal vein ) ఏర్పడుతుంది.



    మూత్ర ముకుళము రెండు పొరల కణములను కలిగి ఉంటుంది. కేశనాళిక గుచ్ఛములలోని రక్తము మూత్ర ముకుళముల ( Renal corpuscles ) లోపలి పొర ద్వారా వడపోయబడుతుంది. గుండె నుంచి బృహద్ధమనికి ( aorta ) ప్రసరించు రక్తములో 20 శాతము మూత్ర ధమని ద్వారా మూత్రాంగములకు ప్రసరించి వడపోయబడుతుంది. వడపోత ద్రవము ( Glomerular filtrate ) మూత్రనాళికల (renal  tubules ) లోనికి ప్రవేశిస్తుంది.

    మూత్రనాళికల తొలి భాగము చుట్టగా ఉంటుంది ( proximal convoluted tubule ). తర్వాత భాగము  చెంపపిన్ను వలె ఒక మెలిక  ( loop of Henle  ) కలిగి ఉంటుంది. మెలికలో తొలి భాగము  మూత్రాంగ అంతర్భాగము ( medulla ) లోనికి దిగు మెలికగా ( అవరోహి భుజము ; descending limb of loop of Henle ) దిగి, తిరిగి వెనుకకు ఎగు మెలికగా ( ఆరోహి భుజము ; ascending limb of loop of Henle ) మూత్రాంగపు వెలుపలి భాగము ( cortex ) లోనికి వచ్చి మరల మరో చుట్టగా ( తుది చుట్ట / distal  convoluted tubule ) ఉంటుంది. ఈ తుది చుట్ట సమీపములో ఉన్న సమీకరణ నాళము ( collecting duct ) లోనికి  ప్రవేశిస్తుంది. సమీకరణ నాళములు మూత్రమును మూత్రకుండికకు ( మూత్రపాళియ ; renal pelvis ) చేరుస్తాయి. మూత్రకుండిక నుంచి మూత్రము మూత్రనాళముల ( ureters ) ద్వారా మూత్రాశయమునకు చేరుతుంది.

    మూత్రనాళికలలో ( renal tubules ) వడపోత ద్రవము ప్రవహించునపుడు చాలా భాగపు నీరు, విద్యుద్వాహక లవణములు ( electrolytes ), గ్లూకోజు, ఎమైనో ఆమ్లములు ( amino acids ), మూత్రనాళికల నుంచి మూత్రాంగముల అంతర కణజాలము ( interstitial tissue ) లోనికి, ఆపై మూత్ర నాళికలను అనుసరించు రక్తకేశనాళికల లోని రక్తము లోనికి మఱల గ్రహించబడుతాయి.

    వయోజనులలో మూత్రాంగములు ( Kidneys ) దినమునకు సుమారు 180 లీటరులు వడపోత ద్రవమును ఉత్పత్తి చేస్తాయి. ఇందులో తిరిగి సుమారు 178- 178.5 లీటరుల నీరు తిరిగి రక్తములోనికి గ్రహించబడి 1.5 - 2 లీటరులు మాత్రము మూత్రముగా విసర్జింపబడుతుంది. వడపోత ద్రవపు సాంద్రీకరణ ( concentration ) చాలా భాగము మూత్రనాళికల దిగు మెలికలలో ( అవరోహిక భుజములు ; descending limbs of loops of Henle ), జరుగుతుంది. శరీర వ్యాపార క్రియలో జనితమయే యూరియా ( urea ), యూరికామ్లము ( uric acid ), క్రియటినిన్ ( creatinine ) వంటి వ్యర్థ పదార్థములు సాంద్రీకరింపబడి తక్కువ నీటితో మూత్రముగా విసర్జింపబడుతాయి.

    మూత్రాంగములు వ్యర్థపదార్థములను విసర్జించు ప్రక్రియ చాలా క్లిష్టమైనది, సమర్థవంతమైనది . మూత్రాంగముల వైఫల్యము గురించి వేఱే వ్యాసములలో చర్చిస్తాను.

( వైద్యవిషయములను  నా శక్తిమేరకు  తెలుగులో తెలుపుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను సంప్రదించ ప్రార్థన. ఉపయుక్తము అనుకుంటే నా వ్యాసములను నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...