20, జూన్ 2020, శనివారం

అంటురోగముల నివారణ ( Controlling contagious diseases )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )


                          అంటు రోగముల నివారణ

                 (Controlling contagious diseases )

                                                                                   
                                         డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.

 

                                                  ఆ.వె. అంటుకొనుట మాని యంటించి చేజోడి
                                                            నైదుపదిగఁ జేసి యాదరమ్ము
                                                            సేయుటదియు కరము క్షేమంబు సర్వత్ర
                                                            అందుచేతఁ గొనుడు వందనమ్ము !

                                                                                      🙏🏻

                                            ( ఐదుపదిగఁ జేయు =  నమస్కరించు ; ఆదరము = మన్నన )


         
    మనుజుల నుంచి మనుజులకు చాలా వ్యాధులు వ్యాపిస్తుంటాయి. వీటిని అంటురోగములుగా పరిగణిస్తారు. కొన్ని అంటురోగములు జంతువులు, పక్షుల నుంచి మనుజులకు సంక్రమిస్తాయి. వీటిని జంతు జనిత వ్యాధులుగా ( Zoonosis ) పరిగణిస్తారు. ఈ వ్యాధులను సూక్ష్మజీవులు ( bacteria ), కాని, విషజీవాంశములు ( viruses ) కాని, పరాన్నభుక్తులు ( parasites ) కాని, శిలీంధ్రములు ( fungi )  కాని కలిగిస్తాయి.

  సూక్ష్మజీవులు ( bacteria ) 


     సూక్ష్మజీవులు ఏకకణ జీవులు. వీటికి కణ కవచము ( cell wall ), కణ వేష్టనము ( cell membrane ) ఉన్నా, పొరలలో అమరిన న్యూక్లియస్లు, మైటోఖాండ్రియాలు ఉండవు. సూక్ష్మజీవులను గ్రామ్స్ వర్ణకము ( Gram’s stain ) చేర్చి   సూక్ష్మదర్శిని క్రింద చూసి అవి గ్రహించు వర్ణకముల బట్టి గ్రామ్ పోజిటివ్, గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులుగా విభజిస్తారు. గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు ఊదా రంగులో ఉంటాయి. గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులు గులాబి రంగులో ఉంటాయి. ఆకారమును బట్టి వీనిని గోళములు ( cocci ), కోలలు ( rods ), సర్పిలములుగా ( spirals ) వర్ణిస్తారు. చాలా సూక్ష్మాంగ జీవులు మన శరీరము పైన, శరీరము లోపల హాని కలిగించకుండా జీవిస్తున్నా, కొన్ని  అవకాశము చిక్కినపుడు శరీర అవయవములు, కణజాలముల లోనికి చొచ్చుకొని వ్యాధులు కలిగిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు కలుషిత ఆహారము, కలుషిత పానీయములు, లేక కలుషిత వాయయువు ద్వారా శరీరములోనికి చొచ్చుకొని వ్యాధులకు కారణమవుతాయి. మనుజుల నుంచి మనుజులకు కూడా సూక్ష్మజీవులు వ్యాపించగలవు.

విషజీవాంశములు ( Viruses ) 


    విషజీవాంశములు ( viruses  ) జీవ కణములలో వృద్ధి చెంది విసర్జింపబడే జన్యు పదార్థములు. ఇవి రైబోన్యూక్లియక్ ఆమ్లమును ( Ribo Nucleic Acid )  కాని డీఆక్సీరైబో న్యూక్లియక్ ఆమ్లమును
( Deoxyribo Nucleic Acid ) కాని కలిగి ఉంటాయి. బయట మాంసకృత్తు ఆచ్ఛాదనను ( capsid) కలిగి ఉంటాయి. కొన్ని కొవ్వు ఆచ్ఛాదనను కలిగి ఉంటాయి. వీటికి జీవము లేకపోయినా యితర జీవకణముల లోనికి చేరినపుడు ఆ కణములలో వృద్ధి పొందుతాయి. జీవులలో ఇవి వ్యాధులను కలుగజేయగలవు. ఈ విషజీవాంశములకు యితర జీవవ్యాపార క్రియలు ఉండవు.

పరాన్నభుక్తులు ( Parasites ) 


    ఇవి ఇతర జీవులలో జీవించే జీవులు. ఇవి ఏకకణ జీవులు ( ఉదా : మలేరియా పరాన్నభుక్తు )
 కాని, బహుకణ జీవులు కాని కావచ్చును. ఇవి వాటి జీవనమునకు, వృద్ధికి ఇతర జీవులపై ఆధారపడుతాయి. పేలు, నల్లులు వంటి పరాన్నభుక్తులు శరీరము బయట ఉన్నా మనుజుల నుండి మనుజులకు వ్యాపించగలవు. గజ్జి క్రిములు ( Sarcoptes scabiei ) కూడా మనుజులు ఒకరికొకరు సన్నిహితముగా ఉండుట వలన వ్యాపిస్తాయి.

 శిలీంధ్రములు ( fungi )

        
    ఇవి  వృక్షజాతులకు జంతుజాలమునకు విభిన్నమైన జీవరాశులు. ఆహారమునకు ఇతర జీవులపై ఆధారపడుతాయి. వీని కణ కవచములు ఖైటిన్ అను బహుళ శర్కరను కలిగి ఉంటాయి. ఇవి మృతకణములపై జీవిస్తాయి.

    అంటురోగములను కలిగించే వ్యాధి జనకములు ( pathogens  ) వ్యాధిగ్రస్థుల నుంచి ఇతరులకు ప్రాకి వారికి కూడా వ్యాధులను కలిగిస్తాయి. ఇప్పుడు ‘ కోవిడ్ 19 ‘ చైనాలో హుయాన్ నగరములో పొడచూపి ప్రపంచము అంతటా అనతి కాలములో బహుళముగా వ్యాప్తి చెందుట చూస్తే, వ్యాధుల వ్యాప్తిని అరికట్టుటలో మన జాగ్రత్తలు చాలవు అనియు, ఆ జాగ్రత్తలు లోప భూయిష్ఠములు అనియు  తెలుస్తుంది.

    వైద్యులు, వైద్య రంగములో పనిచేయు సిబ్బంది  అంటువ్యాధుల బారి పడుతూనే ఉంటారు. వీరి నుంచి ఆ వ్యాధులు ఇతర రోగులకు కూడా వ్యాప్తి చెందగలవు. అందువలన ఆ రోగముల వ్యాప్తిని అరికట్టుటకు తీసుకోవలసిన జాగ్రత్తలను చర్చిస్తాను.

ప్రత్యేక జాగ్రత్తలు 


దూరము 


    మనుజుల మధ్య సాధారణ పరిస్థితులలో కూడా కొంచెమైనా దూరము పాటించుట మేలు. జలుబు, వ్యాపకజ్వరము ( Influenza ), కోవిడ్ 19 వంటి వ్యాధులను కలిగించు విషజీవాంశములు ( viruses  ) గల తుంపరులు ( droplets ) 5 మైక్రోమీటరులను మించిన పరిమాణములో ఉంటాయి. ఇవి తుమ్ము, దగ్గు, మాటల తుంపరుల ద్వారా గాలిలో కొద్ది సేపు ఉండి పిదప క్రిందకు భూతలము పైన, వస్తువుల ఉపరితలముల పైన ఒరిగి పోతాయి. అందువలన ఇవి 3 నుంచి ఆరడుగుల దూరము లోపల ఉన్న యితరులకు తుంపరల ద్వారా వ్యాప్తి చెందగలవు. వ్యాధిగ్రస్థుల నుంచి 6 అడుగుల దూరము పాటించుట వలన,

    వస్తువులను తాకిన చేతులను సబ్బు నీళ్ళతో కాని ఆల్కహాలు గల శుద్ధి పదార్థములతో ( sanitizers ) కాని శుభ్రము చేసుకొనుట వలన, సబ్బునీళ్ళు లేక ఆల్కహాలు గల శుద్ధి పదార్థములతో శుద్ధి చేసుకొనని చేతులను ముఖముపై చేర్చక పోవుట వలన ఈ వ్యాధులను నివారించవచ్చును.

    వ్యాధిగ్రస్థులు, తుమ్ములు, దగ్గులు కలవారు నోటికి, ముక్కుకి, ఆచ్ఛాదనములు ( కప్పులు masks ) ధరించాలి.
  
     వైద్యశాలలలో వీరిని ఒంటరి గదులలో ఉంచాలి. ఈ రోగులకు సేవలు అందించు వైద్యులు, వైద్య సిబ్బంది గాలిని 95% వడకట్టు N-95 ఆచ్ఛాదనములను ( N-95% masks ) ధరించాలి.

    కళ్ళకు రక్షక కంటద్దములను ( safety goggles ) ధరించాలి.  చేతులకు చేదొడుగులు ( gloves ) ధరించాలి దుస్తులపై శస్త్రచికిత్సకుల నిలువుటంగీలను ( surgical gowns ) ధరించాలి.

    వ్యాధిగ్రస్థులకు సేవలు అందించి వారి గదుల నుంచి బయటకు వచ్చాక వాటిని  జాగ్రత్తగా తొలగించుకోవాలి. చేదొడుగులు ధరించినా చేతులను సబ్బు నీళ్ళతో శుభ్రము చేసుకోవాలి. పాదరక్షలను కూడా రోగజనక విధ్వంసకములతో ( disinfectants ) శుభ్రము చేసుకోవాలి.

    కొన్ని సూక్ష్మజీవులు, విషజీవాంశముల పరిమాణము 5 మైక్రోమీటర్లు కంటె తక్కువ ఉండుట వలన అవి గాలిలో చాలా గంటల సేపు తేలియాడుతు ఉండగలవు. వేపపువ్వు / తట్టు ( measles ), ఆటాలమ్మ ( chickenpox ) వ్యాధులు కలిగించే విషజీవాంశములు ఈ కోవకు చెందినవి. గాలి ద్వారా ఈ వ్యాధులు వ్యాపించగలవు. వ్యాధి నిరోధక శక్తి లోపించిన వారు, శరీర రక్షణ వ్యవస్థ లోపములు కలవారు, గర్భిణీ స్త్రీలు ఈ రోగుల పరిసరములలో చొరకూడదు. వైద్యశాలలలో ఉన్న ఈ రోగులను ఋణ వాయుపీడనము కల ( negative air pressure ) ప్రత్యేకపు ఒంటరి గదులలో ఉంచాలి. వీరిని సందర్శించువారు నోరు, ముక్కులను కప్పే  N- 95 ఆచ్ఛాదనములను ( masks కప్పులు ) ధరించాలి.

    వ్యాధిగ్రస్థులు వారి గదుల నుంచి బయటకు రావలసిన అవసరము కలిగితే వారు శస్త్రచికిత్సకుల
ఆచ్ఛాదనములను ( surgical masks  ) ధరించాలి.

సాధారణ జాగ్రత్తలు 


    వైద్యులు, వైద్యసిబ్బంది రోగులను పరీక్షించే ముందు, పరీక్షించిన పిదప చేతులను శుద్ధి పదార్థములతో ( sanitizers ) రోగికి, రోగికి మధ్య  శుభ్రము చేసుకోవాలి. వైద్యులు, నర్సులు వారు వాడే వినికిడి గొట్టాలను ( stethoscopes ) కూడా ఆల్కహాలుతో శుభ్రము చేసుకొనుట మేలు.

    Clostridium difficile వ్యాధిగ్రస్థులను పరీక్షించాక చేతులను సబ్బు, నీళ్ళతోనే శుభ్రము చేసుకోవాలి. ఈ సూక్ష్మజీవులు పెద్దప్రేవులలో తాపము కలిగించి అతిసారమును కలిగిస్తాయి. వీటి బీజములు ( spores ) ఆల్కహాలు వలన నశింపవు.

    రోగి శరీర ద్రవములు ( రక్తము, చీము, లాలాజలము, శ్లేష్మము వగైరా ) అంటుకొనే అవకాశములు ఉన్నపుడు చేతొడుగులను ( gloves ) తప్పక ధరించాలి. శరీర ద్రవములు  ( body fluids ) దుస్తులపై చిమ్మే అవకాశము ఉన్నపుడు దుస్తుల పైన నిలువుటంగీలను ( gowns ) ధరించాలి.  రోగి శరీర ద్రవములు కళ్ళలో చిందే అవకాశము ఉన్నపుడు కళ్ళ రక్షణకు అద్దాలను ( safety goggles ) కాని పారదర్శక కవచములను ( transparent shields ) కాని ధరించాలి.

    రోగులపై శస్త్రచికిత్సలు, శరీరము లోనికి సూదులు, ఇతర పరికరములు చొప్పించే  పరీక్షలు, ప్రక్రియలు ( invasive procedures ) సలిపేటప్పుడు కూడా వ్యాధిజనక రహిత ( sterile ) నిలువుటంగీలు, చేదొడుగులు, నోటి - ముక్కు కప్పులు ధరించాలి .

    రోగులపై వాడిన సూదులు, పరికరములు, వారి దెబ్బలకు, పుళ్ళకు కట్టిన కట్టులు, వాడిన చేదొడుగులు నిలువుటంగీలను సక్రమముగా ఇతరులకు హాని కలుగకుండా విసర్జించాలి. తిరిగి వాడే పరికరములను వ్యాధిజనక రహితములుగా ( sterilize ) చెయ్యాలి .

ఏకాంత వాసము ( isolation ) 


    సులభముగా ఇతరులకు సంక్రమించు అంటురోగములు కలవారిని, ప్రమాదకరమైన అంటురోగములు కలవారిని ఏకాంత వాసములో ( isolation ) ఉంచాలి. వీరిని సందర్శించువారు నిలువుటంగీలు, నోటి - ముక్కు కప్పులు, చేదొడుగులు ధరించి వారి గదుల నుంచి బయటకు వచ్చాక వాటిని జాగ్రత్తగా విసర్జించాలి. ఆపై చేతులను సబ్బు నీళ్ళతో కడుగుకొనాలి. ఆ రోగులకు వాడే  ఉష్ణ మాపకములు ( thermometers ), వినికిడి గొట్టములు ( stethoscopes ) ప్రత్యేకముగా వారికొఱకు ఉంచాలి. అట్టి రోగులను వారి గదుల నుంచి వివిధ పరీక్షలకు తీసుకువెళ్ళేటప్పుడు వారికి నిలువుటంగీలు, నోటి - ముక్కులకు ఆచ్ఛాదనలు ( masks ) తొడగాలి.

శ్వాసపథ రక్షణ ( Airway protection ) 


    శరీరమును ఆక్రమించే చాలా వ్యాధి జనకములు శ్వాస పథము ద్వారా ప్రవేశిస్తాయి. దగ్గులు, తుమ్ములు, మాటల వలన తుంపరుల రూపములో కాని, నిశ్వాస క్రియలో వాయు వాహనులుగా ( airborne ) గాని వ్యాధి జనకములు వెదజల్లబడి ఇతరుల శ్వాస పథము లోనికి  గాలి పీల్చునపుడు ప్రవేశించగలవు.

    అందువలన అంటురోగములు ( జలుబు, ఇన్ఫ్లుయెంజా, ఆటాలమ్మ ( chickenpox ) వంటి మనము చిన్న వ్యాధులుగా పరిగణించే వ్యాధులైనా సరే ) కలవారు నోటి - ముక్కు కప్పులను ధరించాలి. ఈ చిన్న వ్యాధులు ఆపై నాసికా కుహరములలో తాపము ( sinusitis ), పుపుస నాళములలో తాపము ( bronchitis ), ఊపిరితిత్తులలో తాపములకు ( pneumonias ) దారితీయవచ్చును.

    వైద్యశాలలలో వైద్యులు, ఇతరసిబ్బంది, రోగులను సందర్శించువారు నోటి ముక్కు కప్పులు ధరించుట మేలు.  

    విమానములు, ఎ.సి కారులు, ఎ.సి రైళ్ళలో ప్రయాణించునపుడు మూసి ఉంచిన స్థలములలో చాలా మంది కలసి, చాలా సమయము గడిపి, చాలా దూరము ప్రయాణిస్తారు. అందువలన ఈ ప్రయాణీకులకు నోటి ముక్కు కప్పుల ధారణ తప్పనిసరి చేసి, ప్రయాణ సాధనములను వ్యాధి జనక విధ్వంసకములతో ( disinfectants ) శుభ్రము చేయుట వలన అనేక శ్వాసపథ వ్యాధులను నివారించగలము. దూర ప్రయాణీకులు ప్రయాణముల తర్వాత వ్యాధిగ్రస్థులు అగుట వైద్యులు చాలా సారులు గమనిస్తారు.

కరచాలనములు 


      కరచాలనముల వలన చాలా అంటురోగములు వ్యాప్తి చెందుతాయి. ఆరోగ్య రంగములో పనిచేసేవారు కరచాలనములు చేయకూడదు. ఇతరులు కూడా కరచాలనముల అలవాటును వదల్చుకోవాలి. పరులతో ఒకరినొకరు తాకకుండా ఆదరాభిమానములు చూపించుకొనుట ఉత్తమము.

ఎంగిలి 


    ఆహార పానీయములు సేవించే టప్పుడు ఎవరి పాత్రలు వారికే ఉండాలి. ఒకరు వాడే పలుదోము కుంచెలు క్షుర కత్తెరలు, దువ్వెనలు,  తువ్వాళ్ళు వేరొకరు వాడకూడదు.

ఆహార పానీయముల శౌచ్యము 

   
    జీర్ణాశయము, ప్రేవులలో సూక్ష్మజీవులు కలిగించే కలరా, టైఫాయిడ్, అతిసారము, వంటి అంటురోగములను సమాజములో ప్రజలు అందఱికీ పరిశుద్ధమైన మరుగు దొడ్లను అందుబాటులో చేసి మలమును వ్యాధిజనక రహితముగా మలచుట వలన, నిర్మూలించే అవకాశము కలదు. పశ్చిమ దేశాలలో వాడే మరుగుదొడ్ల తొట్టెలను శుభ్రముగా ఉంచుట తేలిక.

    మనము తినే ఆహారపదార్థాలు, త్రాగే పానీయములు శుచిగా ఉండాలి. ఆహార పదార్థాలపై ఈగలు, క్రిములు చేరకుండా జాగ్రత్తపడాలి.

    అంటురోగములను నివారించుటకు, చికిత్స చేయుటకు చాలా రసాయన పదార్థములను వాడుతాము. ఇవి :

   రోగజనక విధ్వంసకములు ( disinfectants )


    ఇవి  వస్తువులపై ఉన్న   సూక్ష్మజీవులను ( bacteria ), శిలీంధ్రములను ( fungi ), విషజీవాంశములను ( viruses ) ధ్వంసము చేసే రసాయన పదార్థములు. వీటిలో కొన్ని మృదు పదార్థములను ( alcohol, hydrogen peroxide, dettol, betadine ) చేతులు , చర్మమును శుభ్రము చేసుకొందుకు వాడినా, వ్రణముల పైన వాడకూడదు, దేహము లోపలకు  తీసుకో కూడదు. ఇవి ఔషధములు కాదు. వీటిని ఇంటి అరుగులు, వస్తువుల ఉపతలములు, పరికరములను శుద్ధి చేయుటకు వాడుతారు.

 సూక్ష్మజీవ సంహారక రసాయనములు ( Antiseptics )


        ఇవి చర్మమునకు, దెబ్బలకు, పుళ్ళకు పూయబడే సూక్ష్మజీవ సంహారక రసాయన పదార్థములు. వీటిని శరీరము లోనికి తీసుకోకూడదు .

 సూక్ష్మజీవ నాశకములు ( Antibiotics ) 


    ఇవి శరీరములోనికి నోటి ద్వారా, కండరముల ద్వారా, సిరల ద్వారా తీసుకొనే సూక్ష్మజీవులను నశింపచేయు  ఔషధములు.

విషజీవాంశ నాశకములు 


    విషజీవాంశ నాశకములు ( Antivirals ) : ఇవి   విషజీవాంశముల ( viruses )  వృద్ధిని అరికట్టు ఔషధములు. వీటిని చర్మము పైన కాని, శరీరము లోపలకు కాని వాడుతారు.
    చాలా సమాజములలో వారి వారి సంస్కృతులు, అలవాటులు తరతరాలుగా జీర్ణించుకొని ఉంటాయి. ఏ సంస్కృతి పరిపూర్ణము, దోషరహితము కాదు. సకల సంస్కృతులను గౌరవిస్తూనే ఆరోగ్యానికి భంగకరమైన అలవాటులను మనము విసర్జించాలి. వైద్యులు, శాస్త్రజ్ఞులు, విద్వాంసులు అందులకు కృషి చెయ్యాలి.
                                        
                                                                                                                                                                                                         

పదజాలము :

 Zoonosis = జంతు జనిత వ్యాధులు ( గ.న ) ; జంతువుల నుంచి సంక్రమించు వ్యాధులు
Antibiotics = సూక్ష్మజీవ నాశకములు  ( గ.న )
Aiirborne = వాయు వాహనులు ( గ.న )
Antiseptics =   సూక్ష్మజీవ సంహారకములు ( గ.న )
Antivirals  =  విషజీవాంశ నాశకములు ( గ.న )
Cell membrane = కణ వేష్టనము
Disinfectants =  రోగజనక విధ్వంసకములు ( గ.న ) 
Fungi = శిలీంధ్రములు
Gloves = చేదొడుగులు
Influenza = వ్యాపక జ్వరము
invasive procedures = ఆక్రమణ ప్రక్రియలు ( గ.న )
Masks = కప్పులు ; ఆచ్ఛాదనములు 
Parasites = పరాన్నభుక్తులు 
Pathogens= వ్యాధి జనకములు 
Sanitizer = శుద్ధి పదార్థములు
Sinusitis = నాసికా కుహర తాపము ( గ.న )
Sterile = వ్యాధి జనక రహితము ( గ.న )
Surgical gowns = నిలువుటంగీలు
Viruses  = విషజీవాంశములు ( గ.న )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...