16, జులై 2020, గురువారం

మద్యపాన వ్యసనము ( Alcoholism )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )

                                   మద్యపాన వ్యసనము

                                        ( Alcoholism )


                                             డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.  

      మద్యము లేక సారాయిగా వ్యవహరించబడే రసాయన పదార్థమును రసాయన శాస్త్రములో ఎథనాల్ ( Ethanol ), లేక ఇథైల్ ఆల్కహాలు ( Ethyl alcohol ) CH3-CH2-OH ( C2H6O ) గా వ్యవహరిస్తారు. చక్కెరలను మధుశిలీంధ్రముతో ( yeast ) పులియబెట్టి సారాయిని తయారుచేస్తారు. చైనా, భారతదేశముల వంటి  ప్రాచీన సంస్కృతులలో మద్యము తయారి, వాడుకలు ఉన్నాయి. దేవతలు, రాక్షసులు క్షీరసాగరమథనము చేసినపుడు ‘ సుర ‘ ఆవిర్భవించినట్లు వర్ణించబడింది. ఆరబ్ దేశములలో సారాయి బట్టీపట్టు ప్రక్రియ ( distillation ) ప్రథమముగా వాడుకలో వచ్చినట్లు చెబుతారు.

    మద్యములలో బార్లీసారా ( beer ), ద్రాక్షసారా ( wine ), తాటికల్లు ( Palmyra toddy ), ఈతకల్లు
 ( Date tree toddy ), ఇప్పసారాయి వంటి బట్టీపట్టని ( fermented but not distilled ) సారాయిలలో మద్యము 4 నుంచి 16 శాతము వఱకు ఉండవచ్చును. బట్టీపట్టిన ( distilled ) విస్కీ, జిన్, వోడ్కా, బ్రాందీ వంటి మద్యములలో మద్యము  20 శాతము మించి ఉంటుంది

    మితము తప్పిన మద్యము వాడుక వలన శారీరక, మానసిక, సామాజిక దుష్ఫలితములు కలుగుతాయి. కొందఱిలో మద్యము వ్యసనముగా పరిణమిస్తుంది. మద్యము  త్రాగుట మొదలిడిన వారు మితము తప్పినపుడు, దాని కొఱకు పరితపించుట ( craving ), తప్పనిసరిగా త్రాగాలనుకొనుట ( compulsion ), మద్యము వాడుకను ఆధీనములో ఉంచుకొనలేకపోవుట ( loss of control ), దైనందిన జీవితములో మద్యముపై ఆధారపడుట ( alcohol dependence ), త్రాగిన ఫలితమునకు ఎక్కువ మోతాదులలో త్రాగవలసివచ్చుట ( tolerance ) సారాయి వ్యసనములో కలిగే వివిధ స్థాయిలు. మద్యము వాడుక వలన వ్యక్తిగత, చట్టపరమైన సమస్యలు కలిగినపుడు ఆ అలవాటును మద్యము దుర్వినియోగముగా ( alcohol abuse ) పరిగణించాలి.

    మితము తప్పి మద్యము వినియోగించే వారిలో శారీరక, మానసిక, సామాజిక దుష్ఫలితములు కలుగుతాయి.

                                            శారీరక దుష్ఫలితములు 


     మితము తప్పి మద్యము త్రాగేవారు సగటున 12 సంవత్సరములు జీవనప్రమాణమును కోల్పోతారు. కొందఱు ప్రమాదాలకు గుఱి అయి, కొందఱు అధికమోతాదులలో త్రాగి సత్వర పరిణామముల వలన పిన్నవయస్సులో ప్రాణములు కోల్పోతారు. మరి కొందఱిలో దీర్ఘకాల అనారోగ్య పరిణామముల వలన మరణములు సంభవిస్తాయి. ప్రపంచములో 4 శాతపు మరణములు సారాయి వలన కలుగుతాయి.


                         మద్య కాలేయ వ్యాధులు ( Alcoholic liver diseases )


సుర కాలేయ వసవ్యాధి ( Alcoholic steatosis ) 


    మద్యము ఎక్కువగా త్రాగేవారి కాలేయ కణములలో ( hepatocytes ) వసామ్లములు ( fatty acids ) చేరి గ్లిసరాల్ ( glycerol ) తో కూడి ట్రైగ్లిసరైడ్స్ గా ( triglycerides ) రూపొందుతాయి. ట్రైగ్లిసరైడ్స్ కొవ్వుపదార్థములు. ఇవి కాలేయ కణములలో అధికముగా కూడితే కాలేయ వసవ్యాధి కలిగిస్తాయి.

 సుర కాలేయతాపము ( Alcoholic hepatitis ) 


    అధికముగా మద్యపానము  చేసేవారిలో 15 నుంచి 35 శాతము మందిలో కాలేయ తాపము ( hepatitis ) కలుగుతుంది. కాలేయ తాపము వలన కొన్ని కాలేయ కణములు మరణిస్తాయి ( necrosis and apoptosis ). తాపప్రక్రియ పర్యవసానముగా తంతీకరణము ( fibrosis ) కూడా జరుగుతుంది.

 నారంగ కాలేయవ్యాధి ( Cirrhosis of Liver ) 


    అధికముగా మద్యము త్రాగేవారిలో 10 నుంచి 20 శాతము మందిలో, కాలేయ తాపము ( hepatitis ), కణ విధ్వంసము ( necrosis  ), తంతీకరణము ( fibrosis ) పదేపదే జరిగి నారంగ కాలేయవ్యాధికి ( cirrhosis of liver ) దారితీస్తాయి. సారాయి వాడుక కొనసాగించినపుడు  నారంగ కాలేయవ్యాధి తీవ్రమయి కాలేయ వైఫల్యము ( hepatic failure ), మరణము కలుగుతాయి. పచ్చకామెరలు ( jaundice  ), జలోదరము ( ascites ), నారంగ కాలేయవ్యాధిలో కొన్ని లక్షణములు. పచ్చకామెరులు వలన వీరి కాలేయము నారింజపండు రంగులో ఉంటుంది.

                                               జీర్ణాశయ వ్యాధులు 


    మద్యపానము సలిపే వారి జీర్ణాశయములో ఉదజ హరికామ్లము ( hydrochloric acid ) అధికముగా స్రవించి జీర్ణాశయ తాపము ( Gastritis ) కలిగిస్తుంది. జీర్ణాశయ తాపము కలిగిన వారిలో వాంతి భావన, వాంతులు, కడుపునొప్పి, ఆకలి మందగించుట, కడుపు ఉబ్బు  పొడచూపుతాయి. వీరి జీర్ణాశయములు హెలికోబేక్టర్ పైలొరై ( Helicobacter Pylori ) అనే సూక్ష్మాంగజీవుల బారి పడితే వారిలో జీర్ణ వ్రణములు ( Peptic ulcers ) కలిగే అవకాశము ఉన్నది. జీర్ణ వ్రణములు కలవారు మద్యపానము చేస్తే  ఆమ్లము అధికముగా ఉత్పత్తి అయి ఆ వ్రణములు తీవ్రము అవుతాయి. త్వరగా మానవు.

                                          క్లోమ తాపము ( Pancreatitis ) 


    ఎక్కువ మోతాదులలో మద్యపానము చేసేవారిలో సత్వర క్లోమ తాపము ( Acute pancreatitis  ),  దీర్ఘకాల క్లోమతాపము ( Chronic Pancreatitis ) కలిగే అవకాశములు హెచ్చు.

                                              హృదయ వ్యాధులు 


    మద్యపానము ఎక్కువగా చేసే వారి రక్తములో ట్రైగ్లిసరైడులు పెరిగి ధమనీ కాఠిన్యత ( Atherosclerosis ) త్వరితముగా కలుగుతుంది. అందువలన వీరిలో హృదయ ధమనీ వ్యాధులు ( Coronary artery disease ), హృదయ వైఫల్యము ( Congestive heart failure ) కలిగే అవకాశములు ఎక్కువ. వీరిలో  థయమిన్ విటమిన్ లోపము ( thiamine deficiency ) వలన బెరిబెరీ ( Beriberi ) వ్యాధి కూడా కలిగే అవకాశము ఉన్నది.

                                                                అంటు వ్యాధులు 

   
మితము తప్పి సారాయి త్రాగే వారిలో రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. వీరికి అంటురోగములు కలిగే అవకాశములు హెచ్చు.

                                       మస్తిష్కముపై మద్యప్రభావము 


 సత్వర ప్రభావము 


    రక్తములో మద్యప్రమాణముల బట్టి మస్తిష్కముపై వాటి ప్రభావము ఉంటుంది. రక్తములో మద్యప్రమాణము త్రాగిన మోతాదు పైనా,  త్రాగినపుడు జీర్ణాశయస్థితి పైన, వ్యక్తి వయస్సు, లింగము, ఆరోగ్యస్థితుల పైనా ఆధారపడుతుంది. ఖాళీ కడుపుతో మద్యము సేవించినపుడు అది త్వరగా రక్తములోనికి చేరుతుంది. స్త్రీల శరీరములలో కొవ్వు శాతము హెచ్చవుట వలన ఒకే మోతాదు త్రాగిన పురుషులలో కంటె, స్త్రీలలో రక్త  మద్యప్రమాణములు ఎక్కువగా ఉంటాయి. రక్తము లోనికి చేరిన మద్యము కణజాలములోనికి సులభముగా ప్రవేశిస్తుంది. మద్యము మస్తిష్క కణములను మందగింపజేస్తుంది. తక్కువ ప్రమాణములలో మద్యము విశ్రాంతిని, ఉల్లాస భావమును కలిగిస్తుంది. ఆపై మాటలలో నియంత్రణ పోతుంది. ముఖము ఎఱ్ఱబారుతుంది. స్మృతి, ప్రజ్ఞ, విషయ గ్రహణశక్తి క్షీణిస్తాయి. మతిమఱపు కలుగుతుంది. చలన వ్యవస్థపై మందకొడి ప్రభావము వలన కండరముల సమన్వయము ( coordination ) తగ్గుతుంది. నడకలో పట్టు తగ్గి తూలుతుంటారు. మాటలలో తొట్రుపాటు కలుగుతుంది. స్పర్శజ్ఞానము తగ్గుతుంది. రక్తములో మద్యప్రమాణములు యింకా ఎక్కువయినప్పుడు, మతిమఱపు పెరుగుతుంది. ఆపై మైకము, మత్తు పెరుగుతాయి. ఆపై అపస్మారకత కలుగుతుంది. హెచ్చు మోతాదులలో మద్యము సేవించిన వారిలో శ్వాసక్రియ మందగిస్తుంది. మస్కిష్క వ్యాపారము బాగా అణగినపుడు ప్రాణాపాయము కలుగుతుంది.

 దీర్ఘకాల ప్రభావము 


         దీర్ఘకాలము మద్యము సేవించువారిలో పలు నాడులు బలహీనపడుతాయి ( polyneuropathy ). వీరిలో థయమిన్ ( thiamine; vitamin B1 ) లోపించి నేత్ర కండరముల బలహీనత ( opthalmoplegia ), మతిభ్రమణము ( confusion ), అస్థిర గమనము ( ataxia ) కలుగుతాయి. ఈ మూడు లక్షణములు గల వ్యాధి Wernicke encephalopathy గా ప్రాచుర్యము పొందింది. ఈ వ్యాధిగ్రస్థులకు థయమిన్ సమకూర్చి చికిత్స చేయనిచో వారు మృత్యువాత పడే అవకాశములు ఉన్నాయి.

      దీర్ఘకాలము మద్యము వినియోగించేవారిలో మస్తిష్కకణ నష్టము కలిగి వారి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కొత్త విషయములకు మతిమఱపు ( antegrade amnesia ), పాత విషయములకు మతిమఱపు ( retrograde amnesia ), అప్పటి సంగతులకు మతిమఱపు ( amnesia of fixation), గందరగోళము, చూస్తాము. చిన్న మెదడుపై మద్య ప్రభావము వలన వీరి చేతులలో కంపనము, అస్థిర చలనము, తూలిపడుట కలుగుతాయి. కండర సమన్వయము తగ్గుతుంది.

                             మద్యపానము వలన కలుగు మానసిక రుగ్మతలు 


    మద్యపానము వలన మానసిక రుగ్మతలు కూడా కలుగుతాయి. ఆందోళన ( anxiety ), గాభరా, మానసిక క్రుంగు ( depression ), మతిభ్రమ ( psychosis ), స్మృతిభ్రంశము (delirium ) మద్యపానము సలిపే వారిలో తఱచు కలుగుతాయి. మద్యపానము సలిపేవారిలో ఆత్మహత్యల శాతము మిగిలిన వారిలో కంటె ఎక్కువ. మద్యపాన వ్యసనము కలవారిలో మిగిలిన మాదక ద్రవ్యముల వినియోగము కూడా హెచ్చు.

అవయవ లోపములు 


    గర్భిణీ స్త్రీలు మద్యపానము చేస్తే వారి శిశువులకు పుట్టుకతో అవయవ లోపములు కలిగే అవకాశము ఉన్నది. గర్భిణీ స్త్రీలు మద్యము సేవించకూడదు.

                       మద్యపానము వలన కలుగు సామాజిక దుష్ఫలితములు 


    మద్యపానము సలిపి వాహనములు నడిపే వారి వలన వాహన ప్రమాదములు తఱచు జరుగుతాయి. మద్యపానము సలిపే వారి వలన జన సమూహములలో గొడవలు కలుగుతుంటాయి. మద్యపానము సలిపే వారి వలన సమాజములో నేరములు పెరుగుతాయి. వీరు హింసలో పాల్గొనవచ్చును, హింసల బారి పడవచ్చును. మద్యపాన వ్యసనము వలన వివాహములు చెడిపోతాయి.  గృహ హింసలు అధికముగా జరుగుతాయి. వీరి పిల్లల సంరక్షణ దెబ్బతింటుంది. చాలా కుటుంబములు చితికిపోతాయి. వీరు ఉద్యోగ బాధ్యతలను సరిగా నిర్వహింపజాలరు. వీరు ఆర్ధిక యిబ్బందులకు లోనయే అవకాశములు ఎక్కువ. స్త్రీలు మద్యపానమునకు లోనయినప్పుడు వారు హింసకు, మానభంగములకు గుఱి అయే అవకాశములు హెచ్చు.  ఇష్టము లేకుండా గర్భము తాల్చే అవకాశము కలదు.

                  సత్వర మద్య పరిత్యజనము (Acute alcohol withdrawal ) 


    దీర్ఘకాలము మద్యపానము చేయువారు ఒక్క సారిగా మద్యమును మానివేసినపుడు ఆందోళన, గడబిడ, కంపనము,మూర్ఛ ( seizures ), మతిభ్రంశము ( delirium tremens ), వంటి సత్వర పరిత్యజన లక్షణములు ( acute withdrawl symptoms ) పొడచూపే అవకాశము ఉన్నది. ఈ లక్షణములకు సత్వర విషహరణము ( detoxification  ) అవసరము.

    మద్యపానము పరిత్యజించిన మూడు నుంచి ఆరు వారముల వరకు ఆందోళన, క్రుంగు ( depression ) నిద్రలేమి, నీరసము చాలామందిలో కలుగుతాయి. కొంతమందిలో ఆందోళన, క్రుంగుదల పెక్కు నెలలు కొనసాగే అవకాశము ఉన్నది.

    అందు వలన వీరికి మానసిక వైద్యము, కుటుంబసభ్యుల, మిత్రుల సహాయ సహకారములు చాలా అవసరము. మద్యపరిత్యజన వలన కలిగే లక్షణములను ఎదుర్కొనలేక కొందఱు తిరిగి మద్యపానము మొదలు పెడతారు.


వ్యాధినిర్ణయము 


         మద్య వ్యసనము బారిపడినవారు తామంత తాము చికిత్సకు రావచ్చు. కొన్ని సందర్భములలో కుటుంబసభ్యులు వారిని వైద్యుల ఒద్దకు  తీసుకొనిరావచ్చును. మితము మించి మద్యపానము  చేసే వారిని పసిగట్టుటకు వైద్యులు  క్రింది ప్రశ్నలు వేస్తారు.

    (1) మీరు ఎప్పుడైనా మద్యపానము తగ్గించవలసిన అవసరము ఉందని భావించారా ?

    (2) ఎవరైనా మీ మద్యపానపు అలవాటుని విమర్శించి మిమ్ములను ఇబ్బంది పెట్టారా ?

    (3) మీ మద్యపానము గుఱించి ఎప్పుడైనా అపరాధ భావము పొందారా ?

    (4) ఉదయము నిద్ర లేవగానే ఎపుడైనా మద్యమును సేవించారా ?

    ఇవి కాక మరికొన్ని ప్రశ్నలతో చాకచక్యముగా వైద్యులు మద్యపానము ఎక్కువగా చేసే వారిని పసిగట్టగలరు. మద్యపాన వ్యసనము  ఒక వ్యాధి అని తలచి వైద్యులు  వైద్యము సమకూర్చాలి. మద్యపానము సలిపే వారిని అపరాధులుగా తలచకూడదు.

 పరీక్షలు 


    మద్యపాన వ్యసనము కనిపెట్టుటకు ప్రత్యేక పరీక్షలు లేవు. మద్యపానము కలుగజేసే కాలేయ వ్యాధులు, క్లోమ తాపము ( pancreatitis ), మూర్ఛవ్యాధి,  మానసిక స్థితులు, మస్తిష్క వ్యాధులు, తఱచు పడిపోవుట వలన గాయములు మద్యపానమును సూచించవచ్చును.

 రక్తపరీక్షలు 


    మద్యపానము అధికముగా చేసేవారిలో పృథురక్తకణ రక్తహీనత ( macrocytic anemia ) ఉండవచ్చును. రక్తములో  కాలేయ జీవోత్ప్రేరకముల ( Aspartate transaminase, Alanine transaminase, Gamma glutamyl transferase ) పరిమాణములు ఎక్కువగా ఉండవచ్చును. రక్తములో ట్రైగ్లిసరైడులు అధికముగా ఉండవచ్చును. ఇవి అసాధారణముగా ఉన్నపుడు మద్యపానము గుఱించి వైద్యులు ప్రశ్నించి సమాచారము గ్రహించాలి.

 చికిత్స 


    మద్యపానము అధికముగా చేసేవారిలో ఆహార లోపములు ఉండే అవకాశము ఉంది. వారికి థయమిన్ ( విటమిన్ బి -1 ) అందించాలి. ఫోలికామ్లము వంటి మిగిలిన విటమిన్ లోపములను సరిదిద్దాలి. రక్తపరీక్షలలో విద్యుద్వాహక లవణముల లోపములను సరిదిద్దాలి.

    మద్యపాన వ్యసనము మానుటకు మార్గము మద్యపానము పూర్తిగా మానివేసి దాని జోలికి వెళ్ళక పోవుటయే. వ్యసనమునకు లోబడిన వారు పూర్తిగా మానివేయుటకు నిర్ణయము తీసుకోవాలి. స్మృతి ప్రవర్తన చికిత్స ( Cognitive behavioral therapy ) వారికి తోడ్పడుతుంది.

మద్యమునకు లోబడిన వారు

    ( 1 ) నేను  మద్యపానమును మానుట ఈ దినము మొదలుపెడుతాను
    ( 2 ) ఈ దినము నుంచి మద్యపానమును ఇంత మేరకు తగ్గించుకు పోతాను
    ( 3 ) ఈ దినము నుంచి మద్యపానమును పూర్తిగా విరమిస్తాను.
    ( 4 )  ఆ పై ఎన్నడూ మద్యము జోలికి పోను అని నిర్ణయించుకోవాలి.

       వారు వారి మద్యము సేవించు పద్ధతులను, వారిని మద్యపానమునకు ప్రోత్సహించు పరిస్థితులను, అవకాశములను, వారు సేవించే మద్య పరిమాణమును దినచర్య పుస్తకములో వ్రాసుకోవాలి. అట్టి పరిస్థితులు, అవకాశముల నుంచి దూరముగా ఉండాలి. వారికి మద్యపానము విరమించుటలో మానసిక చికిత్సకులు కాని, మానసిక సలహాదారులు కాని, కుటుంబసభ్యులతో పాటు తోడ్పడవలసిన అవసరము ఉంటుంది. మానసిక చికిత్సకులు అందుబాటులో లేనపుడు కుటుంబసభ్యులు కాని, స్నేహితులు కాని ఆ స్థానమును భర్తీ చేయుటకు పూనుకోవాలి. మద్యపాన వ్యసనమునకు లోనయిన వారు చెప్పేది సానుభూతితో వినుట, వారికి తగిన సలహాలను ఇచ్చుట, వారిచేతనే వారి లక్ష్యములను నిర్ణయింపచేయుట, ఆ లక్ష్యములను సాధించుటలో తోడ్పడుట సలహాదారులు బాధ్యతగా తీసుకోవాలి. సలహాదారులు ( counselors ) ప్రతి పర్యాయము పది పదిహైను నిమిషములు వఱకు కాలము వెచ్చిస్తూ ఒక సంవత్సరము  కల్పించుకుంటే సత్ఫలితములు కలుగుతాయి..

 విషహరణము ( Detoxification ) 

                
    ఇది మద్యపాన వ్యసన నివృత్తిలో ముఖ్యమైన భాగము. నిజానికి ఈ ప్రక్రియలో విషపదార్థములు ఏమీ తొలగించబడవు. కాని మస్తిష్కములో రసాయనముల మార్పుల వలన కలిగే హానికర పరిణామములకు పరిష్కరణ చేకూర్చబడుతుంది.

    మద్యము మెదడులో ఉండే GABA-A ( Gamma Amino Butyric Acid - A receptors ) గ్రాహకములను ఉత్తేజపఱుస్తుంది . ఈ గ్రాహకములు ( receptors ) మెదడు వ్యాపారమును మందకొడి పరుస్తాయి. మద్యము వాడుతు ఉంటే  మద్యమునకు GABA-A గ్రాహకమముల స్పందన తగ్గుతుంది. అందువలన త్రాగేవారు ఉల్లాసానికి, మత్తుకు సారాయి ప్రమాణములను పెంచుకుపోతుంటారు. ఒక్కసారి వారు మద్యపానము మానివేసినపుడు మెదడుపై GABA - A గ్రాహకముల మందకొడి ప్రభావము తగ్గి డోపమిన్ ( Dopamine ), గ్లుటమేట్ ( Glutamate ), ఎన్ మిథైల్- డి - ఏస్పర్టిక్ ఏసిడ్ ( N- Methyl- D- Aspartic acid NMDA ) వంటి మస్తిష్కమును ఉత్తేజపఱచే నాడీరసాయనముల ( neurotransmitters ) ప్రభావము పెరిగి గాభరా, ఆందోళన ( anxiety ), శరీరకంపనము ( tremors  ), మూర్ఛ ( seizures ), మతిభ్రమలు ( hallucinations ), మతిభ్రంశము ( delirium ) కలుగుతాయి.

    మద్యము పరిత్యజించిన లక్షణములు సాధారణముగా మద్యము వీడిన 6 నుంచి 24 గంటలలో మొదలవుతాయి. తీవ్రస్థాయి మతిభ్రంశ కంపనము ( Delirium tremens ) మద్యమును విడనాడిన రెండు మూడు దినములలో పొడచూపుతుంది.

    ఈ మద్యము పరిత్యజించిన లక్షణములకు ( alcohol withdrawal symptoms  ) సమర్థవంతముగా చికిత్స చెయ్యాలి. మద్య వర్జన చికిత్సకు డయజిపామ్ ( Diazepam ), క్లోర్ డయజిపాక్సైడు ( Chlordiazepoxide ), లొరజిపామ్ ( Lorazepam ), ఆక్సజిపామ్ ( Oxazepam ) వంటి బెంజోడయజిపిన్స్ ( Benzodiazepines ) మగతనిద్ర కలిగించుటకు కావలసిన మోతాదులలో మొదలుపెట్టి  దినదినము మోతాదులను తగ్గించుకుపోతారు. హృదయవేగము, రక్తపీడనములు పెరిగిన వారిలో బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక అవరోధకములను ( Beta adrenergic receptor blockers ), క్లోనిడిన్ ( clonidine ) లను తక్కువ మోతాదులలో  వాడవచ్చును. కాని వీటిని వాడిన వారిలో  మతిభ్రంశము ( delirium  ) కలిగే అవకాశము ఎక్కువ. అలజడిని ( agitation ) అరికట్టుటకు హేలోపెరిడాల్ ( Haloperidol ) వాడవచ్చును. కాని హేలోపెరిడాల్ వాడిన వారిలో మూర్ఛ ( seizures  ) కలిగే అవకాశములు హెచ్చు.

    మూర్ఛలు ఇదివరలో కలిగిన వారికి మద్యపాన విసర్జన తదనంతరము  మూర్ఛలు, ఇతర లక్షణములు పొడచూపక మునుపే  దీర్ఘకాలము పనిచేసే బెంజోడయజిపిన్స్ ( benzodiazepines ) మొదలుపెట్టాలి.

    మద్యపానము మఱల మొదలపెట్టకుండా ఉండుటకు బహుళ శిక్షణ ప్రక్రియలు ( multidisciplinary actions ) అవసరము. వీరికి స్మృతివర్తన చికిత్సలు ( cognitive behavioral therapy ) మొదలుపెట్టాలి. త్రాగుట అధిగమించు నైపుణ్యములు అలవరచాలి. మద్యపానము విసర్జించాక కలిగే ఆందోళన, క్రుంగుదలలకు తగిన చికిత్స చెయ్యాలి.


మద్యపానమును అరికట్టు ఔషధములు 


         

నల్ ట్రెక్సోన్ ( Naltrexone )   


    మద్యపాన వ్యసన నివృత్తికి ఉపయోగకరమైన ఔషధము. ఇది ఓపియాయిడ్ గ్రాహక అవరోధకము ( opioid receptor antagonist ). ఈ ఔషధము మద్యముపై ఆసక్తిని తగ్గిస్తుంది. కాలేయ తాపము ఉన్నవారిలోను, నల్లమందు సంబంధిత మందులు తీసుకొనేవారిలోను నల్ ట్రెక్సోన్ వాడకూడదు.

ఎకాంప్రొసేట్ ( Acomprosate ) 


    మద్యపానము విడనాడిన తర్వాత కలుగు పరిణామములను అరికట్టుటకు, మద్యపానమును తగ్గించుటకు, అరికట్టుటకు యీ ఔషధము ఉపయోగపడుతుంది. ఎకాంప్రొసేట్  మద్యపానము విరమించుకున్నవారిలో గ్లుటమేట్ (glutamate) ప్రభావమును అణగతొగ్గుతుంది. మూత్రాంగ వ్యాధిగ్రస్థులు ఎకాంప్రొసేట్ వాడకూడదు.

డైసల్ఫిరామ్ ( Disulfiram ) 


    మద్యపానమును అరికట్టుటకు ఏంటబ్యూజ్ గా ( Antabuse ) ప్రసిద్ధికెక్కిన డైసల్ఫిరామ్ మరి ఒక ఔషధము. మద్యము ( ఇథైల్ ఆల్కహాలు, CH3-CH2-OH ) కాలేయములో జీవవ్యాపార క్రియచే విచ్ఛిన్నము అవుతుంది. ప్రప్రథమముగా ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్  ( Alcohol dehydrogenase ) అనే జీవోత్ప్రేరకము ( enzyme ) వలన ఎసిటాల్డిహైడ్ గా ( acetaldehyde ; CH3-CH-O ) మారుతుంది. ఎసిటాల్డిహైడ్, ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ ( Aldehyde dehydrogenase ) అనే జీవోత్ప్రేరకము వలన  ఎసిటేట్ గా ( CH3-COO ) మారి ఆపై  బొగ్గుపులుసు వాయువు ( CO2 ), నీరుగా విచ్ఛిన్నము అవుతుంది.

    డైసల్ఫిరామ్ ( Disulfiram  ) ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ ని అణచి ఎసిటాల్డిహైడ్ విచ్ఛిన్నమును మందగింపజేస్తుంది. అందుచే డైసల్ఫిరామ్ తీసుకొని మద్యపానము చేసేవారిలో ఎసిటాల్డిహైడు కూడుకొని,  శరీరము ఎఱ్ఱబారుట ( flushing ), తలనొప్పి, వాంతులు కలుగుతాయి. డైసల్ఫిరామ్ తీసుకొనేవారు  మద్యము త్రాగుటకు ఇచ్చగింపరు. డైసల్ఫిరామ్ మరిఒకరు పర్యవేక్షిస్తూ ఇవ్వాలి. డైసల్ఫిరామ్ కాలేయములో విచ్ఛిన్నమవుతుంది. కాలేయ వ్యాధులు కలవారు ఈ ఔషధము, ఇతర ఔషధముల వాడుకలోను జాగ్రత్త వహించాలి. డైసల్ఫిరామ్ వాడేవారు ఆల్కహాలు ఉండే పుక్కిలింత ద్రవములు, జలుబు మందులు వాడకూడదు.

    కాల్సియమ్ కార్బిమైడ్ ( Calcium Carbimide ) కూడా డైసల్ఫిరామ్ వలె పనిచేస్తుంది .

    వైద్యులు, మానసికవైద్యులు, మానసిక సలహాదారులే కాక, సమాజములలో స్వయం సహాయక సమూహములు, స్వచ్ఛంద సంస్థలు మద్యము వాడుకను మాన్పించుటకు కృషి చేస్తున్నాయి. భారతదేశములో ఇట్టి స్వచ్ఛంద సంస్థల అవసరము చాలా ఉన్నది.

    మద్యము మొదలుపెట్టాక అది వ్యసనముగా పరిణమించే అవకాశము ఉన్నది. కావున మద్యపు జోలికి పోకుండుట మేలు.


( వైద్యసంబంధ విషయములను తెలుగులో నా శక్తిమేరకు వ్రాయడము నా వ్యాసముల లక్ష్యము. ఉపయుక్తము అనుకుంటే నా వ్యాసములను నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. వ్యాధిగ్రస్థులు వారి వారి వైద్యులను సంప్రదించాలి. )


   పదజాలము :

Yeast = మధుశిలీంధ్రము
Distillation = బట్టీపట్టుట
Alcoholic Steatosis = సుర కాలేయ వసవ్యాధి ( గ.న )
Fatty acids = వసామ్లములు
Alcoholic hepatitis = సుర కాలేయతాపము ( గ.న )
Cirrhosis of liver = నారంగ కాలేయవ్యాధి ( గ.న )
Fibrosis = తంతీకరణము
Ascites =  జలోదరము
Gastritis = జఠరతాపము , జీర్ణాశయతాపము (గ.న )
Peptic ulcer = జీర్ణవ్రణము ( గ.న )
Pancreatitis = క్లోమతాపము
Atherosclerosis =  ధమనీకాఠిన్యత
Coronary arteries = హృద్ధమనులు
Ataxia = అస్థిరగమనము
Mental Depression =   మానసిక క్రుంగుదల 
Delirium = స్మృతిభ్రంశము
Alcohol withdrawal = మద్యపరిత్యజనము ; మద్యవర్జనము ( గ.న )
Detoxification = విషహరణము 
Cognitive behavioral therapy = స్మృతిప్రవర్తన చికిత్స ( గ.న )
Enzyme = జీవోత్ప్రేరకము ( గ.న )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...