23, ఆగస్టు 2021, సోమవారం

జఠర అన్ననాళ ఆమ్ల తిరోగమన వ్యాధి ( Gastro esophageal reflux disease )



( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో )









        ఆమ్ల తిరోగమనము ( జఠర - అన్ననాళ ఆమ్ల తిరోగమనము )

                      ( Gastro Esophageal Reflux Disease )


                                                              డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి

    కడుపులో నుంచి ఆమ్ల పదార్థములు అన్ననాళము లోనికి  వెనుకకు మఱలిరావడము వలన ఛాతిలో మంట కలుగడము  తఱచు వైద్యులు చూస్తారు. సుమారు 20 శాతము మంది వయోజనులు ఈ ఆమ్ల తిరోగమనమునకు ( Acid reflux ) గుఱి అవుతారు. ఆమ్ల తిరోగమనము వలన కొన్ని ఉపద్రవములు కూడా కలుగ వచ్చు.

అన్ననాళము 


    అన్న నాళము ( అన్న వాహిక / oesophagus ) ఆహార పానీయాలను గొంతు నుంచి కడుపునకు చేర్చే ఒక ఒక కండర నాళము. ఇది కంఠము మధ్య భాగములో మొదలిడి ఛాతి నడిమిలో క్రిందకు దిగి ఉదరవితానములో ( విభాజకము / diaphragm ) అన్నవాహిక రంధ్రము ( esophageal hiatus ) ద్వారా ఉదర కుహరము ( abdomen ) లోనికి ప్రవేశించి జఠరము ( stomach ) లోనికి అంతము అవుతుంది. 

    ఉదరవితానము ఉరఃపంజరము ( chest ), ఉదర కుహరములను ( Abdomen ) విభజించే ఒక కండర పటకము .

     అన్ననాళము వయోజనులలో సుమారు తొమ్మిది అంగుళముల ( 28 సెం.మీ ) పొడవు కలిగి ఉంటుంది. లోపల శ్లేష్మపు పొరతో ( mucous membrane ) కప్పబడి ఉంటుంది. ఈ శ్లేష్మపు పొరలో మూడు వరుసల పొలుసుల కణములు ( squamous cells ) దొంతరలుగా ఉంటాయి. 
        జఠర శ్లేష్మపు పొరలో ఒక వరుస స్తంభాకార కణములు ( columnar cells ) ఉంటాయి. అన్న నాళ జఠర సంధాన రేఖ వంకర టింకరగా ఉంటుంది.
   
    అన్ననాళపు శ్లేష్మపు పొరలో నిలువుగా ముడతలు ఉంటాయి. అన్న కబళముతో గాని గాలితో కాని విచ్చుకొని సాగినపుడు ఆ  ముడుతలు పోతాయి. శ్లేష్మపు పొర క్రింద వదులుగా సంధాన కణజాలము ( alveolar connective  tissue ) ఉంటుంది. శ్లేష్మపు పొర, సంధాన కణజాలముల మధ్య నిలువుగా కండర తంతులు ఉండి శ్లేష్మ కండరము ( muscularis mucosa ) ఏర్పరుస్తాయి. శ్లేష్మపు పొర క్రింద అన్ననాళ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల నాళికలు అన్ననాళము లోనికి తెఱుచుకొని శ్లేష్మ స్రావకములను ( mucous secretions ) విడుదల చేస్తాయి. ఈ స్రావకములు మృదు క్షారగుణము కలిగి ఉంటాయి. జఠరము నుంచి తిరోగమనము అయే ఆమ్లమును తటస్థీకరించుటకు ఇవి తోడ్పడుతాయి. అన్నవాహిక గోడలో బయట నిలువు పోగులతో ఒక కండరము ( longitudinal muscle ), దానికి లోపల గుండ్రని పోగులతో మరొక కండరము ( circular muscle ) ఉంటాయి. ఈ కండరముల చలనము ( peristalsis ) వలన ఆహారము ముందుకు నెట్టబడుతుంది. 

    అన్న నాళము పై భాగములోను, క్రింది భాగములోను నియంత్రణ కండరములు ( sphincters ) ఉంటాయి. గొంతులోని పదార్థములను మ్రింగునపుడు పై నియంత్రణ కండరము బిగుతు తగ్గి పదార్థములను అన్ననాళము లోనికి ప్రవేశింప జేస్తుంది. ఆ పదార్థములు కండర చలనముతో ( peristalsis ) క్రిందకు చేరాక, క్రింది నియంత్రణ కండరపు బిగుతు తగ్గి  పదార్థములు జఠరములోనికి ప్రవేశించుటకు అనుకూలిస్తుంది. 

    అన్ననాళము క్రింది నియంత్రణ కండరపు బిగుతు వలన, ఉదరవితానము అన్ననాళమును నొక్కి ఉంచుట వలన, అన్ననాళము జఠరముల మధ్య కోణము లఘుకోణము ( acute angle ) అగుట వలన జఠరములోని పదార్థములు అన్ననాళము లోనికి సాధారణముగా ప్రవేశించవు. ఆమ్ల పదార్థములు అన్ననాళము లోనికి ఎప్పుడైనా ప్రవేశిస్తే క్షారగుణము కల అన్ననాళ స్రావములు, నోటి నుంచి వచ్చే లాలాజలము ఆ ఆమ్లమును తటస్థీకరింపజేస్తాయి. అన్ననాళ కండరముల సంకోచ వికాసములతో ఆ పదార్థములు తిరిగి కడుపు లోనికి నెట్టబడుతాయి.

    జఠరములో స్రవించు  ఉదజ హరికామ్లము ( hydrochloric acid ) జఠర రసమునకు ఆమ్ల గుణము ఇస్తుంది.  ఈ ఆమ్లము అన్నవాహిక లోనికి తఱచు, ఎక్కువ కాలము తిరోగమనము చెందుతే అన్నవాహికలో తాపము ( inflammation ), ఒరపిడులు ( erosions ), వ్రణములు ( ulcers ) కలుగ గలవు .

 ఆమ్ల తిరోగమనమునకు కారణములు

     కడుపులోని పదార్థములు  అన్ననాళము లోనికి చాలా కారణముల వలన తిరోగమించగలవు. 

 రంధ్ర గళనము ( Hiatal hernia) :



    అన్ననాళ రంధ్రము ( Oesophageal hiatus ) ద్వారా జఠరపు మీది భాగము ఛాతిలోనికి జాఱుట వలన ఆమ్లము అన్నవాహిక లోనికి తిరోగమించ గలదు. కొందఱిలో జఠరపు పై భాగము అన్ననాళముతో మీదకు ( sliding hernia ) భ్రంశము చెందితే, కొద్ది మందిలో అన్ననాళమునకు ప్రక్కగా మీదకు భ్రంశము ( para esophageal  hernia ) చెందుతుంది.
                                
    అన్ననాళపు క్రింది నియంత్రణ కండరపు బిగుతు అనుచితముగా తగ్గుట వలన కొందఱిలో ఆమ్ల తిరోగమనము జరుగుతుంది. బరువు ఎక్కువయిన వారిలోను, గర్భిణీ స్త్రీలలోను, పొగత్రాగేవారిలోను ఆమ్ల తిరోగమనము కలిగే అవకాశములు హెచ్చు. 

    స్క్లీరోడెర్మా ( Scleroderma ) వ్యాధిగ్రస్థులలోను, అన్నవాహిక చలనములో ఇతర దోషములు కలవారిలోను అన్ననాళము లోనికి మఱలే ఆమ్లము త్వరగా జీర్ణాశయము లోనికి తిరిగి మళ్ళించబడదు. వీరిలో ఆమ్ల తిరోగమన వ్యాధి లక్షణములు ఎక్కువగా చూస్తాము. 

       కాఫీ, టీ, చాకొలేట్లు, మద్యపానముల వలన, కొన్ని ఔషధముల {   బైఫాస్ఫొనేట్లు ( biphophonates ) కాల్సియమ్ మార్గ అవరోధకములు ( Calcium channel blockers ), ట్రైసైక్లిక్ క్రుంగుదల నివారణ మందులు, బెంజోడయజిపామ్స్  } వలన ఆమ్ల తిరోగమన లక్షణములు కలుగవచ్చును.

 ఆమ్ల తిరోగమన వ్యాధి లక్షణములు :


      కడుపులో పదార్థములు నోటిలోనికి వచ్చుట, ఛాతిలో మంట తఱచు కలిగే లక్షణాలు. దగ్గు, గొంతునొప్పి, గొంతు బొంగురు పోవుట, ఆయాసము, ఛాతిలో పిల్లికూతలు, దంతములలో ఎనామిల్ నష్టము ఆమ్ల తిరోగమనము వలన కలిగే ఇతర లక్షణములు. కొందఱిలో గుండెనొప్పిలా ఈ వ్యాధి కనిపించవచ్చును. వారిలో హృద్ధమని వ్యాధులకు తొలిగా శోధించాలి. 

 ఆమ్ల తిరోగమనమును పోలెడి ఇతర వ్యాధులు :


ఆమ్లాకర్షణ కణ అన్ననాళ తాపము ( Eosinophilic esophagitis) :


     ఈ వ్యాధిలో అన్నవాహిక శ్లేష్మపు పొరలో ఆమ్లాకర్షణ కణములు కూడుకుంటాయి. ఈ వ్యాధిగ్రస్థులలో అసహన చర్మతాపము ( atopy ), అసహన నాసికా తాపము ( allergic rhinitis ), ఉబ్బస ( Asthma ) వంటి వ్యాధులు సామాన్యము. కొన్ని ఆహార పదార్థములకు అసహనము యీ వ్యాధికి కారణము కావచ్చును. వీరిలో మింగుటకు కష్టము ( కష్ట కబళనము /  dysphagia ), ఆహార పదార్థములు అన్ననాళములో ఇరుక్కుపోవుట ( food impaction ), ఛాతిలో మంట, వంటి లక్షణములు కలుగవచ్చు. అంతర్దర్శినితో పరీక్షించినపుడు అన్ననాళము కుచించుకు పోవుట, లోపొరలో బొఱియలు ( furrows ), పగుళ్ళు, కాలువల వంటి పల్లములు ( corrugations ), తెల్లని ఫలకలు ( plaques ) కనిపించ వచ్చును. చిన్న తునుక తీసుకొని కణపరీక్ష చేస్తే ఆమ్లాకర్షణ కణాలు ( eosinophils ) 15 / HPF మించి ఉంటాయి. రెండు నెలల ఆమ్లయంత్ర నిరోధక ఔషధములు ( proton pump inhibitors ) వాడి అంతర్దర్శినితో ( endoscopy ) పరీక్షించి సత్ఫలితములు రాని వారిలో స్థానికముగా పనిచేసే కార్టికోష్టీరాయిడులు ఫ్లుటికసోన్ ( fluticasone ), కాని బ్యుడినొసైడ్ ( budenoside ) కాని వాడవచ్చును. కొందఱిలో నోటి ద్వారా ప్రెడ్నిసోన్ అవసరమవవచ్చును. అసహనములుగా ఋజువయిన  ఆహారపదార్థములు  మానివేయాలి.

 ఆక్రమణ వ్యాధులు (Infectious diseases) :


     వ్యాధి నిరోధకశక్తి తగ్గిన వారిలోను ( హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్థులు, పర అవయవ దానములు ( organ transplantation ) కలవారు, కర్కణవ్రణ వ్యాధిగ్రస్థులు, మధుమేహ వ్యాధిగ్రస్థులు ), సూక్ష్మజీవ నాశకములు ( antibiotics ), కార్టికోష్టీరాయిడులు వాడే వారిలోను,స్క్లీరోడెర్మా ( scleroderma ), అన్ననాళపు క్రింది నియంత్రణ కండరపు బిగింపు ( achalasia cardia ) వంటి అన్ననాళ కండర చలన దోషములు కలవారిలోను, మధుశిలీంధ్రములు ( Candida ), హెర్పీస్ సింప్లెక్స్ విషజీవాంశములు ( HSV ), సైటోమెగాలో వైరస్లు ( Cytomegalovirus - CMV ), అన్నవాహిక శ్లేష్మపు పొరను ఆక్రమించి అన్నవాహికలో తాపము కలిగించ గలవు. వీరిలో మింగుడు కష్టమగుట ( dysphagia ), మింగునపుడు నొప్పి ( odynophagia ) వంటి లక్షణములు కనిపిస్తాయి. అంతర్దర్శినితో అన్ననాళమును పరీక్షించుట వలన, తునకలను తీసుకొని కణపరీక్షలు చేయుట వలన వ్యాధులను నిర్ధారించవచ్చును. ఆపై ఆ వ్యాధులకు చికిత్స చెయ్యాలి.

  రసాయన పదార్థములు కలిగించు అన్ననాళ తాపములు (Chemical oesophagitis) :


    తీవ్ర క్షారములు, ఆమ్లములు మింగుట వలన, పొటాసియమ్, డాక్సీసైక్లిన్, క్వినిడిన్, ఏస్పిరిన్, తాప హరములు ( anti inflammatory agents ) వంటి ఔషధములు మింగుట వలన అన్ననాళములో కణవిధ్వంసము, ఒరపిడులు ( erosions ), తాపములు కలిగి మింగుట ఇబ్బంది కావచ్చును.


 పరీక్షలు :


    గుండెమంట, ఆమ్ల పదార్థములు తఱచు నోటిలోనికి వచ్చేవారికి ఆమ్లయంత్ర నిరోధక ఔషధములు ( proton pump inhibitors ) రెండు నెలలు వాడి వారి వ్యాధి లక్షణములు నివారించబడితే వారికి వేఱే పరీక్షల అవసరము లేదు.

     అప్రయత్నముగా బరువు తగ్గుట, పాండురోగము ( anemia ), ఆహారము మ్రింగుట కష్టమగుట, మ్రింగునపుడు నొప్పి కలుగుట, రక్తస్రావము వంటి ఆందోళనకర లక్షణములు కలవారిని ఇతర వ్యాధులకై అంతర్దర్శినితో ( endoscopy ) అన్ననాళ, జఠర, ఆంత్రములను శోధించి ( Esophago Gastro Duodenoscopy ) చిన్న శకలములను గ్రహించి కణ పరీక్షలకు పంపాలి. అన్ననాళములో అప్రమాదకరమైన సంకోచములు ఉంటే బుడగ సాధనములతో వైద్యులు సంకోచములను వ్యాకోచింప జేయగలరు. వీరిలో రక్తగణ పరీక్షలు, రక్తద్రవ రసాయన పరీక్షలు కూడా అవసరమే. 

    మధుశిలీంధ్ర అన్ననాళ తాపము ( Candidial esophagitis ), విషజీవాంశ తాపములు, సంకోచములు ( strictures ), కండర చలన దోషములు, జీర్ణ వ్రణములు ( peptic ulcers ), కర్కట వ్రణములు ( cancers ) వంటి ప్రమాదకర వ్యాధులను ఆలస్యము కాకుండా కనుగొనుటకు అంతర్దర్శన పరీక్షలు ఉపయోగపడుతాయి.

  పి హెచ్ పర్యవేక్షణ :


   శలాక (probe) సాధనముతో అన్ననాళములోని పి.హెచ్ ను ( ఆమ్ల, క్షార పరిమాణము తెలుపు సూచిక ) నిరంతరము ఒక దినము పర్యవేక్షించి అన్ననాళములో ఆమ్ల తిరోగమనములను, వాటి తీవ్రతను నిర్ధారించవచ్చును. ఆమ్లనిరోధకములు వాడినా వ్యాధి లక్షణాలు తగ్గని వారిలో ఈ పరీక్ష ప్రయోజనకారి. 

అన్ననాళ  పీడన పర్యవేక్షణ ( esophageal manometry ) కండర చలన దోషములు కనుగొనుటకు ఉపయోగపడుతుంది.

 చికిత్స :


జీవనశైలి మార్పులు :


     శరీరపు బరువు ఎక్కువైన వారు ఆహారములో కేలరీలు తగ్గించుకొని, వ్యాయామము చేస్తూ బరువు తగ్గే ప్రయత్నాలు చెయ్యాలి. భోజనము తర్వాత రెండు గంటల వఱకు నడ్డి వాల్చకూడదు. పడుక్కొనేటప్పుడు తల పక్క ఎత్తుగా పెట్టుకోవాలి. నిదురించేటపుడు ఎడమవైపుకు తిరిగి ఉండుటకు యత్నించాలి. కాఫీ, టీ, చాకొలేట్, మద్యములను మితపరచుకోవాలి. ధూమపానము మానివేయాలి. ఈ సూచనలు అనుసరిస్తూ తగిన మందులు కూడా అవసరమయితే వాడుకోవాలి.

 ఆమ్ల తిరోగమనము లక్షణములు తఱచు కలిగే వారికి ఔషధములు అవసరము . 

 ఆమ్లహరములు ( Antacids):


    మృదు క్షారములు అల్యూమినియమ్ హైడ్రాక్సైడ్, మెగ్నీషియమ్ హైడ్రాక్సైడు, మెగ్నీషియమ్ కార్బొనేట్ లను ఒక్కక్కటిగా గాని, మిశ్రమములుగా గాని జఠరామ్లమును తటస్థీకరించుటకు అవసమయినపుడు లేక భోజనమునకు గంటన్నర, రెండుగంటల తర్వాత నిర్ణీత సమయాలలో గాని వాడవచ్చు. ఆమ్ల తిరోగమనము తీవ్రము కాని వారిలోను, అప్పుడప్పుడు కలిగే వారిలోను, తాత్కాలిక ఉపశమనమునకు మృదుక్షారములు ఉపయోగకరము. మూత్రాంగ వైఫల్యము ఉన్నవారిలో మెగ్నీషియమ్ లవణముల వాడుకలో చాలా జాగ్రత్త అవసరము. వీరు అల్యూమినియమ్ హైడ్రాక్సైడు వాడుకొనుట మేలు.


   హిష్టమిన్ -2 గ్రాహక అవరోధకములు (Histamine-2-receptor blockers) :


    ఇవి జఠర కణములపై హిస్టమిన్ ప్రభావమును అరికట్టి ఉదజ హరికామ్ల స్రావమును అణచివేస్తాయి. సైమెటిడిన్ ( Cimetidine), రెనెటిడిన్ ( Ranitidine ) ఫెమొటిడిన్ ( Famotidine ), నైజటిడిన్ ( Nizatidine ) హిస్టమిన్ -2 అవరోధకములకు ఉదహరణలు. హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ఏబది శాతము మందిలో ఆమ్ల తిరోగమన లక్షణాలను అరికడతాయి. వీటిని దినమునకు ఒకసారి గాని రెండు సారులు గాని భోజనములకు ముందు వాడుకోవాలి. 

  ప్రోటాను (ఆమ్ల) యంత్ర అవరోధకములు ( Proton pump inhibitors) :


     ఇపుడు ప్రోటాను యంత్ర అవరోధకములు ( proton pump inhibitors) విరివిగా ప్రాచుర్యములో ఉన్నాయి. ఇవి ఉదజని ( ఆమ్ల ) స్రావమును అణచివేస్తాయి. 
    ఒమిప్రజోల్ ( Omeprazole ), ఎసొమిప్రజోల్ ( Esomeprazole ), లాన్సప్రజోల్ ( Lansoprazole ), పాన్టొప్రజోల్ ( Pantoprazole ) ప్రోటాను యంత్ర అవరోధకములకు ఉదహరణములు. జఠర ఉదజ హరికామ్ల స్రావమును అరికట్టుటలో ఇవి మిక్కిలి సమర్థవంతమైనవి. దినమునకు ఒకసారి గాని, రెండు సారులు గాని తగిన మోతాదులలో వాడుకోవాలి. ముందు హెచ్చు మోతాదులలో వాడినా రెండు, మూడు మాసముల పిమ్మట అవసరమైన మోతాదులకు పరిమితము చేసుకోవాలి. దీర్ఘకాలము వీటిని వాడుకొనే వారిలో అస్థి సాంద్రత ( bone mineral density ) తగ్గుటకు, విటమిన్ బి -12 పరిమాణములు తగ్గుటకు, సూక్ష్మజీవులు వలన ఊపిరితిత్తుల తాపములు ( pneumonias ) కలుగుటకు అవకాశము కలదు. కాని వీటి వలన చేకూరే ప్రయోజనమే హాని కంటె అధికము. 

 నియంత్రణ కండరపు బిగువు పెంచు మందులు :


    బెక్లొఫెన్ ( Baclofen ) అనే మందు అన్ననాళపు దిగువ నియంత్రణ కండరము వదులు కాకుండా చేసి ఆమ్లము వెనుకకు అన్ననాళములోనికి పోవుటను అరికడుతుంది. కాని దీని వలన అవాంఛిత ఫలితములు కలుగుతాయి కనుక ఎక్కువగా వాడరు. 

    మెటోక్లోప్రమైడ్ ( Metoclopramide  ) అన్ననాళము, జఠరములలో  కండర చలనమును ఉత్తేజపరచి ఆమ్ల తిరోగమనమును అరికడుతుంది. దీనిని దీర్ఘకాలము వాడేవారిలో తల, చేతులలో వణకు వంటి అసాధారణ చలనములు కలుగగలవు. అందుచే దీనిని ఎక్కువగా వాడరు.

 శస్త్ర చికిత్స :


    ఔషధములకు లొంగక ఆమ్ల తిరోగమనము ఎక్కువగా ఉన్నవారు, ఔషధములను సహించని వారు జీర్ణాశయపు పై భాగమును అన్న నాళము చుట్టూ చుట్టబెట్టి నిలిపే శస్త్రచికిత్స ( Nissan’s fundo plication ) గుఱించి యోచించాలి. ఈ శస్త్రచికిత్స వలన వెంటనే ఫలితములు ఉన్నా, దీర్ఘకాలములో మింగుట కష్టమగుట, తేన్పులు కష్టమగుట, కడుపు ఉబ్బరము, మొదలైన అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. మందులతో ఉపశమనము పొందేవారు శస్త్రచికిత్స జోలికి వెళ్ళకపోవుట మంచిది. 

 ఉపద్రవములు (Complications) :


  అన్ననాళములో ఒరపిడులు, వ్రణములు ( Erosions, Ulcers) :


  ఇవి ఎక్కువగా అన్నవాహిక దిగువ భాగములో జీర్ణాశయమునకు దగ్గఱలో కలుగుతాయి. అరుదుగా వీటి వలన రక్తస్రావము, రక్తనష్టము, పాండురోగము కలుగగలవు. అంతర్దర్శినితో ( Endoscopy ) వీటిని వైద్యులు కనుగొనగలరు.


  అన్ననాళములో ఇరకటములు / సంకోచములు ( Esophageal strictures) :

     

     వ్రణములు , ఒరపిడులు పదే పదే కలిగి తంతీకరణముతో ( fibrosis  ) మానుట వలన అన్ననాళములో ఇరకటములు ( సంకోచములు / strictures ) ఏర్పడుతాయి. ఈ ఇరకటములు సన్నబడినప్పుడు ఘనపదార్థములు మ్రింగుట ఇబ్బందికరము అవుతుంది. అంతర్దర్శినితో కనుగొని బుడగ సాధనములతో వీటిని వ్యాకోచింప జేయవచ్చును. వీరు ఆమ్లయంత్ర అవరోధక ఔషధములను ( Proton pump inhibitors ) నిరంతరముగా వాడుకోవాలి.

బేరట్స్ అన్ననాళము (Barret’s Esophagus) :


    ఆమ్ల తిరోగమన వ్యాధిగ్రస్థులలో అన్ననాళ శ్లేష్మపు పొరలో ఆంత్ర పరిణామములు  ( intestinal metaplasia ) కలుగవచ్చును. వీరిలో లేత గులాబి వర్ణము బదులు ఆ భాగములు ముదురు ఎఱుపు గోధుమ వర్ణములలో ఉంటాయి. వీరిలో కర్కట వ్రణములు (cancers) కలిగే అవకాశములు పెరుగుతాయి. దీర్ఘకాలము ఆమ్ల తిరోగమన వ్యాధి కలవారిలో 50 సంవత్సరములు పైదాటిన వారిని అంతర్దర్శినితో పరీక్షించి అసాధారణ భాగముల నుంచి తునుకలు గ్రహించి కణ పరీక్షలు చెయ్యాలి. ప్రమాదకర కణ పరిణామములు ( dysplasia ) ఉంటే ఆ ఆంత్ర పరిణామ  ( intestinal metaplasia ) భాగములను వివిధ ప్రక్రియలలో ఒక దానిని ఎన్నుకొని ( radio frequency ablation, laser ablation, or photo ablation ) విధ్వంసము చెయ్యాలి. అన్ననాళములో ఆంత్ర పరిణామములు ( intestinal metaplasia ) ఉన్నవారికి మూడు సంవత్సరములకు ఒక సారైనా అంతర్దర్శిని పరీక్షలు, కణ పరీక్షలు ( biopsies ) చెయ్యాలి. అన్ననాళ కర్కట వ్రణములకు శస్త్రచికిత్సలు అవసరము. బేరట్స్ అన్ననాళ లక్షణములు ఉన్నవారికి ఆమ్లయంత్ర నిరోధకములతో ( proton pump inhibitors ) చికిత్స నిరంతరముగా కొనసాగించాలి.


(వైద్యవిషయములు నా శక్తిమేఱకు తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను సంప్రదించాలి. ఉపయుక్తము అనుకొంటే పంచుకొనవచ్చును.)












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...