20, ఫిబ్రవరి 2024, మంగళవారం
నీటి ప్రమాదాలు (వికీపీడియాలో నిలిపిన వ్యాసము)
18, అక్టోబర్ 2023, బుధవారం
డాలస్లో మంచు
డాక్టరు. గన్నవరపు వరాహ నరసింహమూర్తి.
2010 ఫిబ్రవరి 11/12 తారీకుల్లో మా డల్లసులో 12 అంగుళాల మంచుపడింది. మామగారైన హిమవంతుడి "మంచు" భాష్పాలు...మహాశివుడి "లింగోద్భవన" మహాశివరాత్రి సందర్భాన వ్రాసుకొన్న పద్యాలు.
#1 మంచు
సీసం .
పాలకడలి పొంగి నేల ముంచిన భంగి
వెల్లదనము పూచె పల్లె యంత
ధవళ ప్రభల రాశి ధరణి రాలు సరణి
సితము వఱలె నుర్వి సీమ యంత
కప్పురపు పొడులు కప్పెఁ గాశ్యపి నన
శ్వేతచూర్ణము చిందె భూతలమ్ము
వసుమతీజములందు కుసుమవల్లుల తీరు
శుక్లపుంజము విచ్చె సురభిపైన
తే.గీ. అంచపిండులఁ బోలుచు మంచు పొరలు
పంచదారలు కరణిని ముంచె నవని
హేమరాశుల పూర్ణమై యిలయు వెలయ
ధవళవస్త్రము గట్టె మా ధరణి మాత !
కడలి =సముద్రము :
వెల్లదనము = ధవళ = సితము= శ్వేత = తెలుపు :
వసుమతీజము= వృక్షము :
వసుమతి = ధరణి = అవని = కాశ్యపి =భూమి :
అంచ పిండులు = హంసల సముదాయము
#2 గిరిజా కళ్యాణం
దక్షు నింట తన భర్త పరమ శివుని అవమానమునకు ఓర్వ లేక సతి ప్రాణముల నర్పించినది. మరల హిమవంతుని కూతురై పుట్టినది.
కం. పశుపతికై సతి వీడిచె
నసువులు తన తండ్రి యింట నలుకన దక్షున్
పశుపతికై సతి పుట్టెను
పస దీఱిన రాజు నింట పర్వత తనయై.
కం. గిరిసుత పెచ్చిన ముద్దుల
పెరిగెను నగనాధు నింట పెన్నిధి గాదే
అరయక ముద్దులు దీర్చెడి
గిరిరాజుకు పట్టి యౌట క్షేమము గాదే !
ఆ.వె. పెళ్ళియీడు రాగ మళ్ళెను హృదయము
పరమశివునిపైనఁ బార్వతికిని
తనువు మనము నిల్పి తపముఁ దా సలుపుచు
గెలిచెఁ బరమశివుని గిరిజ భక్తి.
చం. తపముల గెల్చెఁ బార్వతియు తన్మత నొందుచుఁ గామవైరినిన్
‘సఫలత నొందె జన్మ’మనె సాధ్వికిఁ దండ్రగు పర్వతీశుడున్
‘నెపములు నేల నింకయును నెయ్యము వియ్యము సేయు డం’చటన్
విపులతఁ బల్కినారు వినువీధుల దేవత దైవగణ్యులున్.
ఆ.వె. పెళ్ళి నిశ్చయంబు పెద్దలు సేయంగ
మంచుకొండ పట్టి మదిని మురిసె
హిమము నేల నొంపె హిమవంతు డారాజు
సంతసించి కంటిజలము గార్చె
అప్పుడు పెళ్ళికి సన్నిద్ధుడై, బ్రహ్మ, విష్ణువు, సకల దేవతలు, యక్ష, గంధర్వ, కింపురుష, కిన్నెరలు, అశ్వనీ దేవతలు, ప్రమథి గణంబుల సపరివారముతో ,
సీసం. జటలందు జలకన్య జలకమ్ము లాడంగ
నెలవంక వెలుగులు నెమ్మి నీయ
శితికంఠమున ఫణి శిరమును నూపంగ
చేతిలో ఢమఢక్క చిందులేయ
కరిచర్మము తనువు గాంతులు వెదజల్ల
శూలంబు దిక్కులఁ జొచ్చుచుండ
భస్మంబు దేహప్రభావము వర్ధింప
పునుక నిండుగ మెఱపులను గురియ
తే.గీ. నందికేశుడు ఱంకెల నాట్య మాడ
ప్రమథి గణములు భక్తితో ప్రస్తుతింప
పెళ్ళికొమరుడు శుభముల పెన్నిధుండు
పరమశివు డరుదెంచె నా పద్మముఖికి.
(హరికథా భాగవతారిణి శ్రీమతి జయంతి సావిత్రి గారు నా పద్యమును వారి ‘ గిరిజా కల్యాణం’ కథలో చేర్చి పాడడం నా అదృష్టం.)
అప్పుడు,
ఉ. చల్లని మంచుకొండ మనసారగ మెచ్చుచు నల్లు నీశ్వరున్
మెల్లన గార్చె బాష్పములు, మేదిని నంతట హేమవర్షమున్
ఝల్లన గుండె లీశ్వరుని చర్మము జల్లెను భస్మరాశులన్
దెల్లయె ధాత్రి యంతయును దిక్కుల నన్నిట శైవరాత్రిలో.
ఈ కధ చదివిన వినిన పుణ్య జనంబులకు సకల పాపములు తొలగి యిహలోక పరలోక సౌఖ్యములు కలుగుతాయి.
పశుపతి = ఈశ్వరుడు : నగము = కొండ : నగనాధుడు = పర్వత రాజు : శితి కంఠుడు = నీల కంఠుడు : పట్టి = కూతురు, కొడుకు : పునుకు = పుఱ్ఱె
4, జులై 2023, మంగళవారం
అన్ననాళంలో అతుకు మచ్చ (Esophageal Inlet patch)
అన్ననాళంలోనికి జీర్ణాశయం నుండి ఆమ్లం తిరోగమించి తాపం కలిగించడం వైద్యులు తఱచు చూస్తారు. అంతర్దర్శినితో పరీక్షించినపుడు ఈ తాప లక్షణాలు సాధారణంగా అన్ననాళం క్రింద భాగంలో కనిపిస్తాయి. వీటికి విరుద్ధంగా కొందఱిలో అన్ననాళం తొలిభాగంలో మచ్చలు అతికించినట్లు కనిపిస్తాయి. ఈ అతుకు మచ్చలు అన్నవాహిక కణజాలానికి బదులు జీర్ణాశయ కణజాలం కలిగి ఉంటాయి. చాల అరుదుగా వీటి వలన లక్షణాలు కాని ఉపద్రవాలు కాని కలుగుతాయి.
అన్ననాళ ద్వారంలో అతుకు మచ్చ (Esophageal Inlet patch)
సుమారు 1-12 శాతము మందిలో అన్ననాళపు తొలి భాగంలో లోపొరలో ‘ఎఱ్ఱని ముకమలు’ వలె అతుకు పెట్టినట్లు కనిపించే మచ్చలు (ఇన్ లెట్ పాచెస్) ఉంటాయి. వీటి వలన చాలా మందిలో ఏ లక్షణాలు కాని ఇబ్బందులు కాని ఉండవు. ఇతర కారణాల వలన అంతర్దర్శిని పరీక్ష (ఎండోస్కొపీ) చేసినపుడు ఇవి కనిపిస్తాయి. వీటితో బాటు కొందఱిలో అన్ననాళములో పలుచని పొరల కవాటాలు ఉండవచ్చు.
అన్ననాళంలో అతుకు మచ్చ
కారణాలు
గర్భంలో పిండం వృద్ధి చెందుచున్నప్పుడు కంఠభాగంలో ఉండే జీర్ణాశయపు శ్లేష్మపుపొరలో కొన్ని భాగాలు అన్ననాళంలో అవశేషాలుగా మిగిలిపోయి పరస్థానం చెందడం వలన ఈ అతుకు మచ్చలు పుట్టుకతో ఉండవచ్చు. కొందఱిలో జీర్ణాశయంలోని ఆమ్లము తిరోగమనం చెందడం వలన అన్ననాళపు శ్లేష్మపు పొర కణజాలం మార్పు చెందడం వలన ఈ అతుకు మచ్చలు కలుగవచ్చు.
లక్షణాలు
పెద్దశాతం మందిలో ఈ మచ్చల వలన ఏ లక్షణాలు ఉండవు. ఏ ఇబ్బంది ఉండదు. ఏ ఉపద్రవాలు కలుగవు. చాలా అరుదుగా కొందఱిలో గొంతుకలో అడ్డున్నట్లు, నిండుతనము కలుగవచ్చు. కొందఱిలో మింగుటలో ఇబ్బంది కలుగవచ్చు. దగ్గు రావచ్చును. చాలా అరుదుగా ఈ అతుకు మచ్చలలో కర్కటవ్రణాలు (కేన్సర్లు) కలిగే అవకాశం ఉంది.
వ్యాధి నిర్ణయం
అంతర్దర్శినితో
ఇతర లక్షణాలకు అంతర్దర్శిని (ఎండోస్కొపీ) పరీక్ష చేసినపుడు అన్ననాళంలో ఎఱ్ఱని ముకములులా కనిపించే మచ్చ అతుకు పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ అతుకుమచ్చ భాగం నుంచి చిన్నముక్కలు సేకరించి కణపరీక్షకు పంపవచ్చు. కణపరీక్షలో పొలుసుల అన్ననాళ కణములకు బదులు స్తంభాకారపు జీర్ణాశయ కణములు కనిపిస్తాయి. జఠర మూలంలో వలె వీటిలో శ్లేష్మం స్రవించు గ్రంథులుండవచ్చు, లేక జీర్ణాశయపు మధ్యభాగంలో వలె ఆమ్లము స్రవించే గ్రంథులుండవచ్చు.
బేరియం ఎక్స్ రే పరీక్షతో
వీరిచే బేరియం మ్రింగించి ఎక్స్- రే చిత్రం తీసినపుడు అన్ననాళంలో నొక్కులు కనిపించవచ్చు. ఆ నొక్కులు కనిపించినపుడు అంతర్దర్శిని పరీక్ష, కణపరీక్షలతో అతుకు మచ్చలు నిర్ధారించవచ్చును.
చికిత్స
పెక్కుశాతం మందిలో ఈ అతుకు మచ్చలకు చికిత్స అనవసరం. ఈ మచ్చలలో ఆమ్లము స్రవించే గ్రంథులుండి గుండె మంట, మింగుటలో ఇబ్బంది ఉంటే ఒమిప్రజాల్ వంటి ప్రోటాన్ యంత్ర అవరోధకాలు వాడవచ్చు. అన్ననాళంలో సంకోచాలు ఉన్నా, పొరలు ఉన్నా వ్యాకోచ చికిత్సలు చెయ్యాలి.
శ్లేష్మగ్రంథులు ఉండి గొంతుకలో అడ్డుపడినట్లు, నిండుతనం ఉన్నవారిలో విద్యుద్దహన చికిత్సతో కాని, ఆర్గాన్ వాయువుతో నిర్మూలన చికిత్సతో కాని, రేడియో తరంగాలతో కాని ఈ అతుకు మచ్చలను తొలగించవచ్చు
30, డిసెంబర్ 2022, శుక్రవారం
13, డిసెంబర్ 2022, మంగళవారం
బొమ్మలకు పద్యాలు
బొమ్మలకు పద్యాలు
( Thanks to @success pictures :మా ఆంధ్రవైద్య కళాశాల సహాధ్యాయులకు అంకితము )
డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.
ఆ.వె.
మనసు పుట్టెనేని మార్గమ్ము లేదని
వగవనేల క్రుంగి వసుధలోన?
బుద్ధిపెట్టి కనుము పూని పుడమినందు
తొలచి తొలచి వెదుకు, దొఱకు దారి
ఆ.వె.
శిఖర మెత్తనుచును శిరమందు తలచునా
శిశువు దృష్టి నిలుచు చివర నెపుడు
మొదటి మెట్టులోని ముసిరెడి యిక్కట్లు
కడకు వచ్చుసరికి కరగిపోవు
( ముసురు= క్రమ్ము)
ఆ.వె.
పనులు కూడుటెట్లు పనిముట్లు సరిగాక
చీలు నదిమి త్రిప్ప చీల కదలు
విషయ మెఱిగి దాని విరుగుడు కనుగొన
జగతి గాంచగలదు మిగుల ప్రగతి
( చీలు = చీలిక, పగులు; మర = యంత్రము )
ఆ.వె.
ఆశ విడవకన్న ఆయువున్న వఱకు
అంతకుండునైన గొంతు పట్టి
అదిమి నపుడు పలుకు, హరియైన హరుడైన
దయను చూపువాడు దైవమగును
(అంతకుడు=యమధర్మరాజు)
ఆ.వె.
కపటి నెయ్యుడైన కడగండ్లు సమకూడు
మంచి మాటలాడి మసలి వాడు
మత్సరమ్ము తోడ మ్రగ్గును మదిలోన
విషము పెంచి తుదకు వెన్నుపొడుచు

ఆ.వె.
సభ్యు లనుచు పలికి సభ్యలోకమునందు
ధరణి గతియె మార్చె ధనము నేడు
ముందు డబ్బు గొనరె మునిగిపోవుచునుండ,
వెలికితీయు వాటి వెలలు వేఱు

ఆ.వె.
మెదడు మేలు చెట్టు మేనులో నరయగ
మేపవలయు దాని మేలు చదువు;
ఎఱుక కలుగ బ్రతుకు పురుషుండు పుడమిలో
నెఱుక లేక జగతి నీదు టెట్లు ?
ఆ.వె.
నీవు భిన్నరీతి నెగడిన జగతిలో
నెల్లజనులు నిన్ను నేవగించి
నీదు రీతిలోన నెగడని కతమున
తఱచు తిట్టుకొనరె తమ్ము తాము ?

ఆ.వె.
పరుగులిడుచు క్రిందపడుచు నోడుచు లేచి
దెబ్బలెన్నొ తగిలి జబ్బుపడుచు
మరల కోలుకొనుచు మానిన గాయాల
పరుగు పెట్టి గెలుచు బ్రతుకు బాట
ఆ.వె.
పొరుగువానితోడ పోలిక మనకేల
ఎంచి చూడ కాడు హీను డెవడు
బంటు చేత చిక్కు బందీగ భూపతి
సృష్టిలోన సమతదృష్టి మేలు

ఆ.వె.
పడవలోన చిల్లు పైనుండ లేదని
చంక గుద్దుకొనుట సభ్యతగునె
ముందు వెనుకొ గాని మునుగరే వారంత
చిల్లు పూడ్చు టదియు చెలువు గాదె ?
ఆ.వె.
గెలుపు వెనుక నుండు క్లేశము లెన్నియో
కనగ కంటబడదు కష్టమంత
చూచుటకును మించు, సుళువైన దేదిరా?
మెచ్చుకొనుట మాని మేల మేల?
( క్లేశములు = కష్టాలు; మేలము = పరిహాసము)
ఆ.వె.
వెంటబడుచు పొందు వేవేల యిక్కట్లు
నరుడు జగతి లోన నలిగి నలిగి
విలువ నరయకుండ వెంబడింప తగదు
పరము లేదు పుడమి బ్రతుకు కంటె
( అరయు = తెలియు చూచు; పరము = శ్రేష్ఠము )
ఆ.వె.
పక్కవాని గూర్చి పరుల కేమి తెలియు
గుణము లెంచ తరమె గుడ్డిగాను ?
బ్రహ్మ మొకడె తెలియు బాధ లతడు పొంద
ఒరులు తీర్పు చెప్పు టొప్పు కాదు.
ఆ.వె.
ఒప్పు నేనటంచు తప్పు లెన్నుట తప్పు
పరుల దెసను గాంచ పరగు నొప్పు
తావు బట్టి మారు తప్పైన నొప్పైన
తావు మారి కనగ తగవు తీరు
ఆ.వె.
పడిన పాట్లు గాంచి పరులు గుర్తింతురే ?
పరుల దృష్టి నిలుచు ఫలము పైన !
ఫలము పొందదగును వరయంత్రములు వాడి
అబ్బురంబు గాదె యంత్రయుగము !

ఆ.వె.
ఎముక లేని నాల్క యెంత మెత్తనిదైన
కర్కశమ్ము నూన కఠిన మగును;
శరము కంటె పదును శాపములను పల్కి
గుండె చీల్చునట్టి గునప మదియు.
ఊను = వహించు
ఆ.వె.
బలము లేని వారు బలగముగా కూడి
బలులు కారె ! బాహుబలులు వారె!!
బలియు డొక్కడైన బలహీనుడై వాడు
చులక నగును మంద చుట్టుముట్ట
( బలగము = మంద, సమూహము ; బలియుడు=బలవంతుడు )
ఆ.వె.
ఉప్పు పంచదార యొక్క పోలిక నుండు
చప్పరింప నోట చవులు తేలు
మర్మమెరిగి మసల మనుజుల నైజము
బాధలొందు వేళ బైటపడును
( చవులు = రుచులు ; తేలు = పొడచూపు )
ఆ.వె.
సంతసమ్ము కలుగు సంతృప్తుడైనచో
తనివి తీరు వాడు, ధనికు డవని ;
సకలమున్న నరుడు సంపన్ను డెట్లౌను
తృప్తిలేక, వాడు దీను డగును !
తనివి = తృప్తి : దీనుడు = దరిద్రుడు
ఆ.వె.
నేటి వర్తనమ్ము నేటితో ముగియదు
భావిలోన నదియు ప్రస్ఫురించు
భావి దలచి నేడు వర్తించుటయు మేలు
కాల మొక్క రీతి గడువ దనుచు
ప్రస్ఫురించు = కనిపించు
ఆ.వె.
మంద లనుసరించు మార్గము మనకేల
మంచిదారి యుండ మరియు నొకటి
బ్రతుకు నీడ్చవచ్చు పదివేల తెరవుల
మనసు చూపు బాట మంచి బాట
ఆ.వె
మాట జాఱవలదు మదిని చింతింపక
మాట నోట జాఱ మఱలి రాదు
మాట విలువ తెలియు మనుజుడు యోచించి
మాటలాడు లేక, మౌనమూను
(ఊను = వహించు)
ఆ.వె.
ఇంట గొడవలుండి యిక్కట్లు పెనగొని
తలకు భారమైన తరుణమందు
నెమ్మి నీకు కలుగ నిశ్శబ్దమగునట్టి
తావు నొకటి వెదకి దాగుకొమ్ము !
( నెమ్మి = సుఖము, శాంతి ; తావు = స్థానము )

ఆ.వె.
చెవులు కండ్లు తనకు చేర్చు సంగతులెల్ల
కలయబోసి తుదకు తలపు లిడెడి
ఉత్తమాంగ మొక్క యుత్పత్తిశాలని
మంచి చేర్చ వలయు మనిషి తలకు
( ఉత్తమాంగము = తల ; ఉత్పత్తిశాల = కర్మాగారము )

ఆ.వె.
గుంపు లనుసరించి, గుడ్డిగా జనులెల్ల
ఇడుమలందు చొచ్చి యిరుకుకొనగ
దూరదృష్టి కలిగి దూరమై గములకు,
బుధులు సత్య మరసి పోవు రందు
( ఇడుమలు = కష్టములు;ఇరుకుకొను = చిక్కుకొను; గమి = సమూహము; అరయు = చూచు, తెలుసుకొను )

ఆ.వె.
లావు నెంచ ‘మేలులక్షణం బిది’యని
అడవికెల్ల రాజు హస్తి యగును
బుద్ధి నెన్నవలయు బుధులెల్ల పుడమిలో
ప్రభువు నెంచువేళ ప్రజల కెల్ల
ఆ.వె.
నీట మునుగువాని నిర్లక్ష్యమొనరించి
చిత్రమగ్ను లగుట చేటు కాదె ?
చిత్రజగతి లోన చిత్రమౌ చేష్ఠలు
చిత్రమందు చూప శ్రేష్ఠమయ్యె !
విషయసూచిక
1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...
-
1. కాఫీకి గురుఁడు గొఱ్ఱె కం. కాపరి గాచిన గొఱ్ఱెలు కాఫీ యాకులను మేసి గంతులు వైచెన్ ; కాఫీ ద్రాగిరి మనుజులు కాపరితోఁ గూడి ; గొఱ్ఱె కాదే గ...
-
( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) : మధుమేహవ్యాధి ( Diabetes mellitus ...
-
బొమ్మలకు పద్యాలు ( Thanks to @success pictures : మా ఆంధ్రవైద్య కళాశాల సహాధ్యాయులకు అంకితము ) ...
-
( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) ఆటాలమ్మ ( Chicken pox ) : అగ్గిచప్పి / అగ్నిసర్పి / ఒడ్డాణపు చప్పి / మేఖల విసర్పిణి / ( Shingles...
-
అధిక రక్తపీడనము (Hypertension ) (తెలుగుతల్లి, కెనడా వారి సౌజన్యముతో ) ...
-
( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ): గుల్ల ఎముకల జబ్బు ( Osteoporosis ) ...
-
Abdominal Aorta = ఉదర బృహద్ధమని ( గ.న ) Abdominal Aortic Aneurysm = . ఉదర బృహద్ధమని బుద్బుదము ( బుడగ ) ( గ.న ) Abdominal Cavity = ఉదరకుహ...
-
ఆరోగ్యము - వైద్యము డా. గన్నవరపు నరసింహమూర్తి ...