24, ఏప్రిల్ 2024, బుధవారం

అంతర్దర్శనము (వికీపీడియాలో నిలిపిన వ్యాసము)

 అంతర్శనము (ఎండోస్కోపీ), లేదా కుహరాంతర దర్శనము శరీరపు లోపలి భాగాలను పరిశీలించే వైద్య పరీక్ష. ఎండోస్కోపీ అనగా లోపల చూడడము; ఈ పరీక్షకు ఉపయోగించే పరికరంను అంతర్దర్శిని (ఎండోస్కోప్) అని వ్యవహరిస్తారు. వీటిని వివిధ అవయవాల్లో చాలా రకాల వ్యాధులను గుర్తించడానికి, వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ అంతర్దర్శిని పరీక్షలు చేసేటప్పుడు అవసరంబట్టి వ్యక్తులకు నిద్రమందులు లేక మత్తుమందులు ఇస్తారు.

తొలిగా ముక్కు, చెవి, గొంతు, స్వరపేటిక, శ్వాసనాళము, అన్నవాహిక ( అన్ననాళం) పురీషనాళము, గర్భాశయద్వారాలను పరీక్షించుటకు లోహాలతో చేసిన వంపులుపోని సరళ అంతర్దర్శినులు వాడుకలోనికి వచ్చాయి. వీటి ద్వారా దీపకాంతి ప్రసరింపచేసో లేక వీటి చివర దీపాలు అమర్చో  లోపల ఉన్న కుహరాలు పరీక్షిస్తారు. కణపరీక్షలకు తునుకలను లేక కుంచెలు లేక శలాకలతో కణసముదాయాన్ని కూడా గ్రహించగలరు. వంకలు తిరగని నిటారు అంతర్దర్శినులతో శరీరంలో కొన్ని భాగాలనే పరీక్ష చేయగలరు. 

గాజుతంతువుల ద్వారా కాంతిని ప్రసరించు సాంకేతికత లభ్యమై తంతు దృశాశాస్త్రం ( ఫైబర్ ఆప్టిక్స్) అభివృద్ధి చెందడంతో వంపులు తిరిగే నమన అంతర్దర్శినులు (ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్) వాడుకలోనికి వచ్చాయి. తంతువుల సముదాయంతో నిర్మించబడు ఈ అంతర్దర్శినులు కొద్ది మిల్లీమీటర్లనుండి సుమారు ఒక సెంటీమీటరు వ్యాసపరిమాణంలో అవసరమైన పొడవు కలిగి వంపులు తిరిగే గొట్టాలవలె ఉంటాయి. ఈ అంతర్దర్శినులలో వంగే గాజు లేక ప్లాస్టిక్ తంతువులు శరీరం లోపలిభాగాల ప్రతిబింబాలను వైద్యుల కళ్ళకు కటకాల ద్వారా అందిస్తాయి. 

ఆపై నవీనతరంలో దృశ్యదర్శినులు (విడియోస్కోప్స్) వాడుకలోకి వచ్చాయి. ఇవి అవయవాల నాళము లేక కుహరములోనికి కాంతిని ప్రసరించి, వీటి చివర ఉండే చిత్రగ్రాహకాలతో అవయవాల లోపలి చిత్రాలు గ్రహించి ఆ చిత్రాలను తీవెల ద్వారా దూరదర్శిని తెరపైకి ప్రసరింపజేస్తాయి. 

అంతర్దర్శినుల పైన అమర్చిన చోదనచక్రాలు తిప్పి అంతర్దర్శిని కొనను పైకి, క్రిందకు, కుడిపక్కకు, ఎడమ ప్రక్కకు పూర్తిగా వంచగలుగుట వలన పరీక్షిస్తున్న అవయవ నాళంని (కుహరంని) అనుసరించి అంతర్దర్శినిని ముందుకు నడిపించి పరీక్ష చేయగలుగుతారు. ఈ అంతర్దర్శినులలో ప్రత్యేకమార్గం ద్వారా అవయవాలలోనికి గాలి పంపించి అవయవాల నాళాలను, తిత్తులను తెఱిచి ఉంచగలరు. మరో ప్రత్యేక ద్వారంలోంచి సన్ననితీగ వంటి శ్రావణం చొప్పించి అవయవాలనుంచి కణపరీక్షకు చిన్న చిన్న తునుకలు గ్రహించవచ్చు. అవసరమైతే నీటిని చిందించి చిత్రగ్రాహకాన్ని కడిగి శుభ్రం చేయవచ్చును. 

కడుపులో పుళ్ళు కనిపెట్టుటకు, పెద్దప్రేవులలో కర్కటవ్రణముల శోధనకు, కంతుల (పోలిప్స్) నిర్మూలనకు అంతర్దర్శినులు విరివిగా వాడుకలోకి వచ్చినా, ఈ దినాలలో వివిధ వైద్యరంగాలలో అంతర్దర్శినులు ప్రాచుర్యము  పొందాయి. వ్యాధులను కనుగొనుటకే గాక, చికిత్సా ప్రక్రియలకు కూడ అంతర్దర్శినులు ఉపయోగపడుతున్నాయి.


ఉపయోగములు 


జీర్ణమండలము


వాంతులు, వమనవికారము, మింగుటలో కష్టము, అన్నవాహికలో ఆహారం అడ్డుపడడం, కడుపునొప్పి, విరేచనాలు, నల్లవిరేచనాలు, రక్తస్రావము, బరువు తగ్గుట, పాండురోగము, వంటి రుగ్మతలు కలవారిలో అన్నవాహిక-జఠర-ఆంత్రదర్శన (ఇసోఫేగో గాస్ట్రో డుయోడినోస్కోపీ) పరీక్షలు, బృహదాంత్ర దర్శన (కొలనోస్కొపీ) పరీక్షలు ఉపయోగపడుతాయి.


   
అన్నవాహికలో ఇరకటము, తాపము


అన్ననాళంలో (అన్నవాహికలో) తాపం (ఇసోఫెజైటిస్), ఆమ్లతిరోగమన వ్యాధి (ఏసిడ్ రిఫ్లెక్స్), అన్ననాళంతో జఠరభ్రంశం (హయెటల్ హెర్నియా) అన్ననాళంలో ఇరకటాలు, లియోమయోమాలు అనే అప్రమాదకరపు పెరుగుదలలు, ప్రమాదకర కర్కటవ్రణములు (కాన్సర్లు), అన్ననాళంలో ఉబ్బుసిరలు (ఇసోఫేజియల్ వేరిసిస్) వైద్యులు అంతర్దర్శినితో కనుగొనగలరు.


                                               జీర్ణాశయంలో జీర్ణవ్రణము


జీర్ణకోశం లో తాపం (గాస్ట్రైటిస్), జీర్ణవ్రణాలు (పెప్టిక్ అల్సర్స్), కంతులు (పోలిప్స్), లియోమయోమాలు అనే అప్రమాదకరపు పెరుగుదలలు, కర్కటవ్రణాలు (కాన్సర్స్) వైద్యులు అన్ననాళ జఠరాంత్ర దర్శినితో అంతర్దర్శనం చేసి కనుగొనగలరు. కణపరీక్షలకు, హెలికోబాక్టర్ బాక్టిరై అనే సూక్ష్మజీవుల పరీక్షకు చిన్న తునుకలు గ్రహించగలుగుతారు. 


చికిత్సాపరంగా ,


అన్నవాహికలో

 ఇరకటాలను బుడగల సాధనాలతో వ్యాకోచింపజేయుటకు, ఉబ్బుసిరలను పట్టీలతో బంధించుటకు, ఉబ్బుసిరలలో రక్తస్రావాన్ని బుడగల పీడనంతో ఆపుటకు, అన్నవాహిక దిగువ నియంత్రణకండరాన్ని బిగుతు చేయుటకు, ఇరుక్కొన్న బయటి వస్తువులను, భోజన కబళాలను తొలగించుటకు అన్నవాహిక జఠరాంత్రదర్శనం ఉపయోగపడుతుంది. 


జీర్ణకోశంలో  

కంతులను ఛేదించుటకు, రక్తస్రావం జరుగునపుడు రక్తస్రావ ప్రాంతాలలో ఎపినెఫ్రిన్ వంటి ఔషధాలు సూదులద్వారా చొప్పించో లేక విద్యద్దహనీకరణంతోనో రక్తస్రావమును నిలువరింపజేయుటకు, జఠర అధోద్వారంలో ఇరకాటాలను ( పైలోరిక్ స్టెనోసిస్) బుడగసాధనంతో వ్యాకోచింపజేయుటకు, జీర్ణాశయం ద్వారా క్లోమపుతిత్తులలో కూడుకొన్న ద్రవాలను తొలగించుటకు అన్నవాహిక జఠరాంత్ర దర్శనం ఉపయోగపడుతుంది.


ఇతర ప్రక్రియలు

జీర్ణకోశం లోనికి బయటిచర్మంద్వారా కృత్రిమ ఆహారనాళం చొప్పించుటకు, శ్రవణాతీతధ్వని సాధనాలతో అన్నవాహిక, జీర్ణకోశం, క్లోమంను, పైత్యనాళాలను పరీక్షించుటకు, క్లోమనాళాన్ని, పైత్యనాళాలను ఎక్స్ - రే వ్యత్యాసపదార్థాలు చొప్పించి పరీక్షించుటకు జఠరాంత్రదర్శినులు ఉపయోగపడుతాయి.

చిన్న ప్రేగు

ప్రథమాంత్రంలో (డుయోడినమ్) జీర్ణవ్రణాలు (పెప్టిక్ అల్సర్స్), తాపం (డుయోడినైటిస్) జఠరాంత్ర దర్శనం వలన కనుగొనగలరు. సీలియక్ వ్యాధిని కూడా జఠరాంత్ర దర్శినితో ప్రథమాంత్రం, మధ్యాంత్రంలో (జెజునమ్) మొదటి భాగాన్ని పరీక్షించి తునుకలు గ్రహించి కణపరీక్షలతో కనుగొనగలరు. చిన్నప్రేగును పూర్తిగా సూక్ష్మాంత్ర దర్శినితో (ఎంటెరోస్కోప్) పరీక్షించవచ్చు. ఇది శ్రమతో కూడిన పని. చిన్నప్రేగులో తాపములు, జీర్ణవ్రణాలు, రసికణపు పెరుగుదలలు (లింఫోమాలు), సీలియక్ వ్యాధి అంతర్దర్శినులతో కనుగొనవచ్చు.


బృహదాంత్ర దర్శనం

పెద్దప్రేగును బృహదాంత్రం అని కూడా అంటారు. వైద్యులు బృహదాంత్రదర్శినితో (కొలనోస్కోప్) పురీషనాళాన్ని (రెక్టమ్), పెద్దప్రేవులను , శేషాంత్రంలో (ఇలియమ్) చివరి భాగాన్ని పరీక్షించగలరు. ప్రమాదకరం కాని కంతులు (పోలిప్స్),


                                     బృహదాంత్రములో  ప్రమాదకరము కాని కంతె


                                                     కంతెను విద్యద్దహనీకరణించుట

                                  ఛేదించిన కంతెను చిక్కంతో బయటకు తొలగించుట


                   పెద్దప్రేవులో కర్కటవ్రణము వలన ఇరకాటము.                                   

                                     బృహదాంత్రంలో కర్కటవ్రణము 


ప్రమాదకరమైన కర్కటవ్రణాలు ( పుట్టకురుపులు/కాన్సర్స్), తాపక వ్యాధులు (క్రోన్స్ వ్యాధి, అల్సరేటివ్ కొలైటిస్, ఇతర తాపకవ్యాధులు), బుద్బుదాలు (డైవెర్టిక్యులోసిస్), ఇరకాటాలు (స్ట్రిక్చర్స్) బృహదాంత్ర దర్శనం (కొలొనోస్కొపీ) వలన కనుగొంటారు. కంతులు ప్రమాదకరం కాని పెరుగుదలలైనా (బినైన్ ట్యూమర్స్), అవి కాలక్రమేణా ప్రమాదకర కర్కటవ్రణాలుగా పరిణామం చెందే అవకాశం ఉంది. అందువలన వైద్యులు వాటిని విద్యుద్దహనీకరణంచేత తొలగిస్తారు.

పైత్యనాళం, క్లోమనాళం

కాలేయంలో పైత్యరసం స్రవించబడుతుంది. పైత్యరసం చిన్న చిన్న పైత్యనాళికల ద్వారా ప్రవహిస్తుంది. పైత్యనాళికల కలయికచే కుడి ఎడమ కాలేయనాళాలు (హెపాటిక్ డక్ట్స్) ఏర్పడుతాయి. కాలేయం బయట ఈ కుడి ఎడమ కాలేయనాళాలు కలసి ఉమ్మడి కాలేయనాళంగా (కామన్ హెపాటిక్ డక్ట్) ఒకటవుతాయి. ఉమ్మడి కాలేయనాళం పిత్తాశయవాహినితో కలసి పైత్యరసనాళం (కామన్ బైల్ డక్ట్) అవుతుంది. పైత్యరసం పిత్తాశయవాహిని ద్వారా పిత్తాశయంలోనికి చేరి పిత్తాశయం ముకుళించుకొన్నపుడు తిరిగి పైత్యనాళంలోనికి ఆపై ప్రథమాంత్రంకి (డుయోడినమ్)  ప్రవహిస్తుంది. పైత్యనాళం క్లోమనాళంతో కలసి క్రోవిగా (ఏంపుల్లా ఆఫ్ వేటర్) ఏర్పడుతుంది.ఈ క్రోవి ప్రథమాంత్రం (డుయోడినమ్) లోనికి మధ్యస్థంగా విచ్చుకొంటుంది. పైత్యనాళంలో రాళ్ళు, కర్కటవ్రణాలు (కాన్సర్స్), సంకోచాలు, క్లోమంలో కర్కటవ్రణాలు పైత్య ప్రవాహానికి అవరోధం కలిగిస్తే అవరోధపు పచ్చకామెర్లు కలుగుతాయి. అంతర్దర్శన తిరోగమన పైత్యనాళ క్లోమనాళ చిత్రీకరణ (ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ ఖొలాంజియో పాంక్రియేటోగ్రఫీ): ఈ పరీక్షలో అంతర్జర్శినితో అన్నవాహిక, జఠరాల ద్వారా ప్రథమాంత్రం లోనికి వెళ్ళి క్రోవి (ఏంపుల్లా) లోనికి సన్నని నాళం చొప్పించి ఎక్స్ రే వ్యత్యాసపదార్థం పైత్యనాళాలలోనికి క్లోమనాళం లోకి చొప్పించి ప్రతిదీప్తి దర్శనంతో (ఫ్లోరోస్కొపీ) చిత్రాలు తీసి రుగ్మతలు తెలుసుకుంటారు. ఈ పరీక్షతో పైత్యనాళంలో రాళ్ళను, కర్కటవ్రణాలను, తాపం వలన కలిగే ఇరకటాలను (స్ట్రిక్చర్స్) క్లోమంలో కర్కటవ్రణాలను, దీర్ఘకాల క్లోమతాపాన్ని, కనుగొనవచ్చు. ఈ ప్రక్రియలో 3.5-5% మందిలో క్లోమతాపం వంటి అవాంఛిత ఫలితాలు కలిగే అవకాశం ఉండడం వలన, కేవలం రోగనిర్ణయం కొఱకు ఈ ప్రక్రియ చెయ్యరు. పైత్యనాళంలో రాళ్ళను తొలగించడానికి, పైత్యనాళంలో సంకోచాలను వ్యాకోజింపజేసి వ్యాకోచనాళాలు (స్టెంట్స్) అమర్చి పైత్యరస ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, చికిత్సకు తోడ్పడు సందర్భాలలో ఈ ప్రక్రియను నిపుణులు ఉపయోగిస్తారు. అయస్కాంత ప్రతిధ్వని పైత్యనాళ క్లోమనాళ చిత్రీకరణ (మాగ్నెటిక్ రెజొనెన్స్ ఖొలాంజియో పాంక్రియేటోగ్రఫీ), అంతర్దర్శన శ్రవణాతీతధ్వని చిత్రీకరణ(ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్) కర్కటవ్రణాలను, దీర్ఘకాల క్లోమతాపాలను కనుగొనుటకు ఉపయోగిస్తారు.


శ్వాసవ్యవస్థ


ఎగువ శ్వాసమార్గం

ముక్కు ముందు భాగాన్ని నాసికా వివృతి (నేసల్ స్పెక్యులమ్) అనే సాధనంతో ముక్కుపుటాలను ఎడం చేసి దీపం వెలుగును ప్రసరించి పరీక్ష చేయవచ్చు. ముక్కు వెనుక భాగాన్ని పరనాసికా దర్శినితో (పోస్టీరియర్ రైనోస్కోప్) నోటి ద్వారా వెళ్ళి మృదుతాలువు వెనుక మీద ఉన్న నాసికా గళంను (నేసోఫేరిన్స్), మృదుతాలువు క్రింద ఉన్న వక్త్రగళాన్ని (ఓరోఫేరిన్స్) పరీక్షించవచ్చును.


గొంతు

నాసికా గళ స్వరపేటికా దర్శనం కు (నేసో ఫెరింగో లెరింగోస్కొపీ) నాసికా గళ స్వరపేటికా దర్శిని అనే సన్నని నమన (వంగే) అంతర్దర్శినిని లేక దృశ్యదర్శినిని (విడియోస్కోప్) నిపుణులు ఉపయోగిస్తారు. ముక్కు శ్లేష్మపుపొరలో మత్తు కలిగించు లైడొకేన్ వంటి మందుల తుంపరులు జల్లి ఈ పరీక్షచేస్తారు. అంతర్దర్శినిని ముక్కులో నెమ్మదిగా చొప్పించి ప్రత్యక్షంగా ముక్కులో భాగాలు పరీక్షిస్తూ ముక్కు వెనుక ఉన్న నాసికాగళాన్ని, ఆపై నోటివెనుక ఉన్న వక్త్రగళాన్ని, తరువాత నోటిక్రింద ఉన్న అధోగళాన్ని, స్వరపేటికను పరీక్షిస్తారు. ఈ పరీక్ష ఊపిరికి అడ్డంకులున్నవారిలో, నిద్రలో శ్వాసకు అంతరాయాలు కలిగేవారిలో, గొంతునొప్పి, మ్రింగుటకు ఇబ్బంది, బొంగురుగొంతు వంటి గొంతుకలో మార్పులు ఉన్నవారిలోను, ముక్కులోను గొంతులోను రక్తస్రావం ఉన్నవారిలోను ఉపయోగకరం[8]. నాసికా గళ అంతర్దర్శనంతో ముక్కులో కంతులు (పోలిప్స్), నడిమిగోడ ఒక ప్రక్కకు ఒఱుగుట (సెప్టల్ డీవియేషన్), నాసికాశుక్తుల అతివృద్ధి (హైపర్ ట్రఫీ ఆఫ్ నేసల్ కాంఖె), రక్తస్రావం జరిగితే కారణాలు, ముక్కులోను, గళంలోను గల  పెరుగుదలలు, నిద్రలో కలిగే శ్వాసభంగాలకు కారణాలు, స్వరతంత్రుల కదలికలలో లోపాలు, స్వరతంత్రుల పొంగు, స్వరపేటికలో పెరుగుదలలు శ్వాసనాళ దర్శనం


శ్వాసనాళ, పుపుసనాళాల దర్శన పరీక్ష


దిగువ శ్వాసమార్గంలో శ్వాసనాళాన్ని, శ్వాసనాళపు శాఖలను వంగని లోహపు సరళ శ్వాసనాళదర్శినితో (రిజిడ్ బ్రోంకోస్కోప్) పరీక్షించవచ్చును. బయట వస్తువులు శ్వాసనాళంలోను పుపుసనాళాలలోను చిక్కుకొన్నప్పుడు వాటిని తొలగించుటకు వంగని నిటారు శ్వాసనాళదర్శినులు ఉపయోగపడుతాయి. రోగి నోటిలోను, గొంతులోను శ్లేష్మపుపొరపై, మత్తుమందు జల్లి, రోగికి మత్తుమందు ఇచ్చి ఈ పరికరాన్ని నోటి ద్వారా గొంతులోనికి చొప్పించి, ఆపై స్వరతంత్రుల మధ్యనుండి శ్వాసనాళంలోనికి వెళ్ళి శ్వాసనాళాన్ని దాని రెండు శాఖలను పరీక్షించవచ్చును. వాటిలో చిక్కుకొన్న బయటి వస్తువులను శ్వాసనాళదర్శినిలోంచి తీయవచ్చును. పుపుసనాళాలలో రక్తస్రావాన్ని విద్యుద్దహనీకరణంతో ఆపుటకు కూడ ఇవి ఉపయోగపడతాయి. చికిత్సాపరంగా ఉపయోగపడేటపుడే సరళ శ్వాసనాళదర్శినులు వాడుతారు. 


వంచగలిగే సన్నని నమన శ్వాసనాళ దర్శినులు (ఫ్లెక్సిబిల్ బ్రోంకోస్కోప్స్), దృశ్యదర్శినులు (విడియోస్కోప్స్) విస్తృతంగా వాడుకలోనికి వచ్చాయి. వీటితో శ్వాసనాళాన్ని, శ్వాసనాళపు శాఖలను, ఉపశాఖలను పరీక్షించి వాటినుంచి కణపరీక్షకు తునుకలు, లేక కుంచెలతో కణజాలములను గ్రహించవచ్చును. వాటిలో ఇరుక్కొన్న బయటి వస్తువులను, శ్లేష్మాన్ని, రక్తస్రావం జరిగితే రక్తాన్ని తొలగించవచ్చు.


మూత్రాశయ దర్శనం


మూత్రాశయంను మూత్రమార్గంను (యురిత్రా), మూత్రాశయదర్శినితో (సిస్టోస్కోప్) వైద్యనిపుణులు పరీక్షిస్తారు.


మూత్రాశయదర్శన పరీక్షలు


రక్తమూత్రం (హెమచ్యూరియా) కలవారిలోను, మూత్రపథం సూక్ష్మజీవుల ఆక్రమణలకు తఱచు గురి అయేవారిలో, మూత్రవిసర్జనలో నొప్పి, అవరోధములు కలిగినవారిలో, కటివలయంలో నొప్పి దీర్ఘకాలంంగా ఉన్నవారిలో, మూత్రవిసర్జన కండరములపై ఆధీనత తప్పినవారిలో, మూత్రపరీక్షలో అసాధారణ కణములు ఉన్నప్పుడు, మూత్రాశయంలో కంతులు (పోలిప్స్), కర్కటవ్రణములు (క్యాన్సర్లు), ఇతర పెరుగుదలలు కనుగొనుటకు, మూత్రాశయంలోను, మూత్రనాళాలలోను రాళ్ళు చిక్కుకొన్నప్పుడు అవసరమవుతాయి. 


సాధారణంగా ఈ పరీక్ష మూత్రమార్గంలో లైడొకేన్ వంటి తిమ్మిరి మందులతో నొప్పి లేకండా చేసి నిర్వహిస్తారు. సరళ మూత్రాశయదర్శినిలో (రిజిడ్ సిస్టోస్కోప్స్) అమర్చిన కటకాల వలన ఇది దూరదర్శిని వలె పనిచేస్తుంది. దీని ద్వారా కాంతిని ప్రసరింపజేసి మూత్రమార్గంను, మూత్రాశయంని పరీక్షించగలరు. మూత్రాశయంలో తెఱుచుకొనే మూత్రనాళాలలోనికి వ్యత్యాస పదార్థాలను చిందించి ఎక్స్-రే లతో మూత్రనాళాలను చిత్రీకరించవచ్చు. 


నమన మూత్రాశయ దర్శినులలో (ఫ్లెక్సిబిల్ సిస్టోస్కోప్స్) దృశాతంతువులు (ఆప్టికల్ ఫైబర్స్) చిత్రాలను ప్రసరింపజేస్తాయి. దృశ్యదర్శినులలో (విడియోస్కోప్స్) చిత్రగ్రాహకాలు చిత్రాలను దూరదర్శిని తెరమీదకు ప్రసరింపజేస్తాయి.వీటి ద్వారా లోపలకు కాంతి ప్రసరింపజేసి మూత్రమార్గం, మూత్రాశయాలనే కాక మూత్రనాళాలలోనికి చొప్పించి మూత్రానాళాలను కూడా పరీక్షించే అవకాశం ఉంది. మూత్రనాళాలను పరీక్షించేటపుడు రోగులను నిద్రపుచ్చుటకు మత్తుమందులు అవసరమవుతాయి వీటిలోని ప్రత్యేకమార్గం ద్వారా శ్రావణాలతో కణపరీక్షలకు తునియలు గ్రహించవచ్చు. చిక్కాలతో మూత్రాశయంలోని రాళ్ళను, మూత్రనాళాలలోని రాళ్ళను తొలగించే అవకాశం ఉంది. ప్రత్యేక తంతువు ద్వారా లేజర్ కాంతితో మూత్రాశయంలోని, మూత్రనాళాలలోని రాళ్ళను ఛేదించే వీలుంది. విద్యద్దహనీకరణంతో మూత్రాశయంలోని కంతులు ఛేందించు వంటి యితర చికిత్సాప్రక్రియలకు కూడా అవకాశం ఉంటుంది.


స్త్రీ జననేంద్రియ వ్యవస్థ


గర్భాశయ గ్రీవ దర్శనం


గర్భాశయగ్రీవదర్శిని (కాల్పోస్కోప్) యోనిపైన , లోపల కాంతిని పరసరింపజేసి, యోని బయటి భాగాలను, లోపలి భాగాలను, గర్భాశయ గ్రీవాన్ని (సెర్విక్స్) పెద్దవిగా జేసి పరీక్షించడానికి  తోడ్పడే సూక్ష్మదర్శిని. అదివఱకు గర్భాశయ గ్రీవంనుంచి సేకరించిన కణజాలంలో (పాప్ స్మియర్ తో) అసాధారణలు కలవారిలోను, గర్భంలో ఉన్నపుడు స్టిల్ బెస్టరాలుకి గురి అయినవారిలోను, ఇతర అసాధారణలు కలవారిలోను కర్కటవ్రణాలకు (కేన్సర్స్) దారితీసే అసాధారణ మార్పులు కనుగొనుటకు గర్భాశయ గ్రీవ దర్శనం (కాల్పోస్కొపీ) పరీక్ష చేస్తారు. 


ఈ పరీక్షను యోనిని వివృతి సాధనంతో (స్పెక్యులమ్) తెఱిచి కాంతి ప్రసరింపజేసి చేస్తారు. అసాధారణ మార్పులు పసిగట్టుటకు ఎసిటిక్  పూతలు, అయొడిన్ పూతలు కూడ తోడ్పడుతాయి. అసాధారణ కిణాలను తొలగించో లేక వాటినుంచి తునియలు గ్రహించో కణపరీక్షలకు పంపవచ్చు. కర్కటవ్రణాలను నివారించుటకు లేక ప్రారంభదశలో కనుగొని చికిత్సలు చేయుటకు గర్భాశయగ్రీవ దర్శనం తోడ్పడుతుంది.


గర్భాశయగ్రీవంలో హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరస్ అనే విషజీవాంశాల వలన చాలా కర్కటవ్రణాలు కలుగుతాయి. పొగత్రాగేవారిలో కూడా ఈ కర్కటవ్రణాలు కలుగవచ్చు. వీటిని త్వరగా కనుగనుటకు పాప్ స్మియర్స్ తో కణపరీక్షలు, గర్భాశయగ్రీవదర్శన పరీక్షలు చాలా ఉపయోగపడుతాయి. ప్రారంభదశలో ఉన్న గర్భాశయ కర్కటవ్రణాలను (కేన్సర్స్) చికిత్సలతో పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయి.


గర్భాశయ దర్శనం


ఈ పరీక్షకు గర్భాశయదర్శిని (హిష్టెరోస్కోప్) అనే వంచగలిగే నమన పరికరం వాడుతారు. దీనిలో కాంతి ప్రసరించుటకు, దృశ్యంను ప్రసరించుటకు మార్గాలు లేక తంతులు ఉంటాయి. గాలి లేక ద్రవాలు చొప్పించి గర్భాశయ కుహరంను పరీక్షించుటకు అనువుగా విస్తృతపరచుటకు, కణపరీక్షలకు, శస్త్రచికిత్సలకు పరికరములు చొప్పించుటకు మార్గాలుంటాయి. అన్నిటికీ తొడుగుగా కోశముంటుంది. దీనిని గర్భాశయగ్రీవం బాహ్యద్వారం ద్వారా ప్రవేశింపజేస్తారు. అవసరమయితే పరీక్షకు ముందు గర్భాశయ బాహ్యద్వారంను, గర్భాశయమార్గంను వ్యాకోచినులతో (డైలేటర్స్) అంచెలుగా వ్యాకోచింపజేస్తారు. గర్భాశయమార్గంలోనికి, ఆపై గర్భాశయ కుహరంలోనికి ప్రత్యక్షముగా చూస్తూ ప్రవేశించి పరీక్షిస్తారు.  


సాధారణంగా గర్భాశయ దర్శనం ఋతుస్రావం అయిన కొద్ది దినాలలో చేస్తారు. అపుడు గర్భాశయపు గోడ మందం తక్కువగా ఉంటుంది.స్థానికంగా మత్తు కలిగించో, లేక పూర్తిగా రోగిని నిద్రపుచ్చో ఈ పరీక్ష చేయవచ్చు.


గర్భాశయదర్శనం అసాధారణ రక్తస్రావం కలిగినవారిలో పరీక్షకు, గర్భాశయపు లోపలిపొరలో కంతులు తొలగించుటకు, గర్భాశయపు లోపలిపొరను తొలగించుట లేక ధ్వంసం చేయుటకు, లోపలిపొరలో చిక్కుకుపోయిన గర్భనిరోధక సాధనాలను తొలగించుటకు,గర్భాశయకుడ్యంలోని కండర తంతుకణజాల అప్రమాదకర పెరుగుదలలను (ఫైబ్రోలియోమయోమాస్ / ఫైబ్రోయిడ్స్)తొలగించుటకు, గర్భస్రావము జరిగినవారిలో మిగిలిపోయిన పిండసంబంధ కణజాలములను తొలగించుటకు ఉపయోగపడుతుంది.


అండవాహక (ఫెల్లోపియన్) నాళ దర్శనం


అండవాహక నాళదర్శిని సూక్ష్మ అంతర్దర్శిని. దీనిని గర్భాశయదర్శిని ద్వారా గర్భాశయకుహరంలో తెఱుచుకొను అండవాహకనాళ ద్వారంగుండా చొప్పించి నాళమును పరీక్షిస్తారు. అండవాహకనాళ దర్శనం అండవాహక వంధ్యత్వం ( నాళములలో లోపముల వలన సంతానహీనత) కలవారిలో కారణములు కనుగొనుటకు, పరిష్కరించుటకు ఉపయోగపడగలదు. ఈ పరీక్ష మత్తుమందిచ్చి చేస్తారు.


శరీర కుహరాలు


ఉదరకుహర దర్శనం


ఉదరకుహరంను ( ఎబ్డోమినల్ కేవిటీ), కూపకకుహరంను (పెల్విక్ కేవిటీ) వైద్యులు ఉదరకుహర దర్శినితో ( లేపరోస్కోప్) పరీక్షించగలరు. శస్త్రచికిత్సలు కూడా ఉదరదర్శిని (లేపరోస్కొప్) ద్వారా నిర్వహించగలరు. ఉదరకుహర దర్శినులు సాధారణంగా వంగని సరళదర్శినులు. అందువలన ఉదరకుహరంలో ఏ దిశలోనైనా చొప్పించి వివిధ అవయవాలను సమీపించుటకు, పరీక్షించుటకు, శస్త్రచికిత్సలు చేయుటకు అనువుగా ఉంటాయి. వీటి చివర దృశ్య చిత్రగ్రాహకాలు (విడియో కెమేరాలు) కాని అంకాత్మక (డిజిటల్) చిత్రగ్రాహకాలు కాని ఉంటాయి. ఉదరకుహరంను, కూపకంను (పెల్విస్), పేగులను, ఉదరంలో ఇతర అవయవాలను కప్పుచు ఉదరాంత్రవేష్టనం (పెరిటోనియమ్) అనే పొర ఉంటుంది. ఉదరకుడ్యంపై చిన్న చిన్న రంధ్రముల ద్వారా ఉదరదర్శినులను ఉదరకుహరంలోనికి లేక కూపకకుహరంలోనికి చొప్పించి లోపలి అవయవాలను పరీక్షిస్తారు. ఈ పరీక్షలో ఉదరకుహరంను బొగ్గుపులుసు గాలితో ఉబ్బింపచేయడం వలన పేగులను, అవయవాలను వేర్పఱచుటకు వీలవుతుంది. బొగ్గుపులుసు గాలి దహించని గాలి. విద్యుద్దహనీకరణలలో మంటలు రేగవు. బొగ్గుపులుసుగాలి కణజాలంచే గ్రహించబడి ఆపై ఊపిరితిత్తుల ద్వారా విసర్జింపబడుతుంది. ఉదరకుహర దర్శినుల ద్వారా కత్తెరలు, పటకారులు, శలాకలు,వంటి శస్త్రచికిత్సలకు అవసరమగు సన్నని పరికరాలను చొప్పించవచ్చును.


ఉదరకుహర దర్శినులను ఉపయోగించి గర్భాశయం, అండవాహక (ఫెల్లోపియన్) నాళం, అండాశయాలు (ఓవరీస్), క్రిముకం (ఎపెండిక్స్), జీర్ణకోశం ప్రేవులు, పిత్తాశయం, మూత్రపిండములపైన శస్త్రచికిత్సలు చేయగలరు. ఉదరకుహరదర్శనంతో (లేపరోస్కొపీ) చేయు శస్త్రచికిత్సల్లో గాయములు చిన్నవగుటచే వీరిలో నొప్పి తక్కువగా ఉంటుంది, రక్తనష్టము తక్కువగా ఉంటుంది, రోగులు త్వరగా కోలుకుంటారు. 


పుఫుసకుహర దర్శనం


వక్షములో గుండె, ఊపిరితిత్తులు ముఖ్యమైన అవయవాలు. ఊపిరితిత్తులను ఆవరిస్తూ పుఫుసవేష్టనం (ప్లూరా) ఉంటుంది. పుఫుసవేష్టనపు లోపలి పొర ఊపిరితిత్తులను కప్పుతూ ఉంటే, రెండవపొర ఱొమ్ము గోడను కప్పుతూ ఉంటుంది. పుఫుసవేష్టనపు రెండుపొరల మధ్య చాలా తక్కువ ద్రవముండి ఆ పొరలు ఒకదానిపై ఇంకొకటి కదలుటకు కందెన వలె పనిచేస్తుంది. ఈ పొరలమధ్య స్థలము పుఫుసకుహరం. పుఫుసకుహరంను వక్షోదర్శినితో (థొరకోస్కోప్) పరీక్షించి, అవసరమయితే కణపరీక్షలకు తునుకలు గ్రహించవచ్చును. అసాధారణంగా ద్రవాలు చేరుకుంటే వాటిని తొలగించి పరీక్షకు పంపవచ్చును. పుఫుసకుహరదర్శనంతో  శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంది. వక్షోదర్శిని చివరలో కటకం (లెన్స్) కాని, దృశ్యచిత్రగ్రాహకం (విడియో కెమేరా) కాని ఉండి  దూరదర్శిని తెరపైకి చిత్రం ప్రసరింపజేస్తాయి. దీనిలో శస్త్రచికిత్స పరికరాలను చొప్పించుటకు మార్గాలుంటాయి.


మధ్యవక్షోదర్శనం


రెండు ఊపిరితిత్తుల నడిమి ఉండే మధ్యవక్షంను (మీడియేష్టినమ్) మధ్యవక్షోదర్శిని (మీడియేష్టినో స్కోప్) తో పరీక్షించవచ్చును. మధ్యవక్షంలో ఉన్న రసగ్రంథుల (లింఫ్ నోడ్స్) నుంచి కణపరీక్షలకు తునుకలు గ్రహించవచ్చు.


సంధ్యంతర దర్శనం


కీలు (సంధి) లోపలకు సంధ్యంతర దర్శిని (ఆర్థ్రోస్కొప్) అనే సన్నని అంతర్దర్శన పరికరం చొప్పించి కీలు (సంధి) లోపలి భాగాలను పరీక్షించి కీలులో ఏర్పడిన గాయాలను, స్నాయువుల (లిగమెంట్స్) చిరుగులను, వ్యాధులను వైద్యులు కనుగొనగలుగుతున్నారు. మోకాలి కీలులో  స్నాయువుల చిరుగులను సంధ్యంతర దర్శనంతో (ఆర్థ్రోస్కొపీ) చక్కబఱచగలుగుతున్నారు. మోకాలి కీలులోని అర్ధచంద్రాకార మృదులాస్థి బింబాలలో (మినిస్కై) చీలికలను చూచి చికిత్స చేయగలరు. తుంటికీలు, భుజసంధి, మణికట్టుకీలు ఇతర కీళ్ళను పరీక్షించుటకు, వాటిలో చికిత్సలు చేయుటకు అంతర్దర్శినులు లభ్యం. చికిత్సలు చేసేటపుడు కీలులోనికి అంతర్దర్శినిని చొప్పించుటకు ఒక రంధ్రం, పరికరాలను చొప్పించుటకు వేఱొక చిన్న రంధ్రం చేస్తారు. ఈ శస్త్రచికిత్సలతో రోగులు త్వరగా కోలుకొంటారు.


గర్భిణీ స్త్రీలలో


ఉల్బదర్శనం


గర్భిణీ స్త్రీలలో నెలలు నిండి కాన్పుకు సిద్ధముగా ఉన్నవారిలో కాన్పు ఆలస్యమయి గర్భస్థశిశువు ఆపదలో ఉన్నపుడు వ్యాకోచించిన గర్భాశయగ్రీవం ద్వారా ఉల్బదర్శినిని (ఏమ్నియోస్కోప్) చొప్పించి మావిసంచిని (ఏమ్నియాటిక్ సాక్) పరిశీలించుట / ఉల్బదర్శనం (ఏమ్నియోస్కొపీ) వలన ప్రయోజనము చాలా చాలా తక్కువ. సూక్ష్మజీవుల ఆక్రమణకు గుఱిచేయుట, మావిసంచిని చించుట వంటి ప్రమాదాలకు అవకాశం ఉండడం వలన ఉల్బదర్శనం వాడుక తక్కువే


గర్భస్థ పిండదర్శనం


గర్భిణీ స్త్రీలలో వైద్యులు గర్భాశయంలోనికి సన్నని నమన దృశ్యదర్శినిని ( ఫ్లెక్సిబుల్ విడియోస్కోప్) చొప్పించి పిండము(ల)ను పరీక్షించి కొన్ని పుట్టువ్యాధులకు (కంజెనిటల్ డిసీజెస్) వికిరణ వర్ధిత కాంతికిరణ శస్త్రచికిత్సలు (లేజర్ సర్జరీస్) చేయగలుగుతున్నారు. కవల పిల్లలలో రక్తప్రసరణ అసమానంగా ఉన్నపుడు ఒక పిండం నుండి రెండవ పిండానికి రక్తం తరలించు రక్తనాళాలను మూయించి రెండు పిండాలకు రక్తప్రసరణ సమంగా చేస్తారు


మావిసంచి నుంచి కణజాలాలు పట్టీలుగా (ఏమ్నియాటిక్ బేండ్స్) ఏర్పడి పిండము చుట్టూ అల్లుకొని కుంచించునపుడు వాటిని పిండదర్శనం ద్వారా ఛేదించి అవయవాల రక్తప్రసరణకు అడ్డంకులు తొలగించగలరు. అవయవాలు అప్పుడు సక్రమంగా వృద్ధిచెందుతాయి


విరూప సవరణ శస్త్రచికిత్సల్లో (ప్లాస్టిక్ సర్జరీస్) కూడా అంతర్దర్శినులను వినియోగిస్తారు. 


నవీన వైద్యంలో అంతర్దర్శినుల వినియోగం చాలా ప్రాముఖ్యత వహిస్తుంది.


20, ఫిబ్రవరి 2024, మంగళవారం

నీటి ప్రమాదాలు (వికీపీడియాలో నిలిపిన వ్యాసము)

 

  ప్రమాదవశమున నీటిలో మునిగిపోయి ఊపిరాడకపోవుట వలన మరణాలు తఱచు కలుగుతుంటాయి. ఎవరైనా గమనించి వారిని బయటకు తీసి త్వరగా పునరుజ్జీవింపజేస్తే కోలుకొన్నవారిలో ఊపిరి ఇబ్బందులు, వాంతులు, గందరగోళము, అపస్మారకత వంటి ఇబ్బందులు కొన్నిగంటల తర్వాత కూడ పొడచూపగలవు. పిల్లలలోను, యవ్వనంలో ఉన్నవారిలోను కలిగే మొత్తం మరణాలలో నీటి ప్రమాదాలు ఒక ముఖ్యకారణం. వయోజనులలో కూడా నీటి ప్రమాదాల మరణాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. చాలా ప్రమాదాలు నీటిలో మునిగిపోవుట వలన కలిగినా, కొన్ని పరిశ్రమలలో ఇతర రసాయనిక ద్రవాలలో మునిగిపోవు ప్రమాదాలు జరుగుతాయి. తగు జాగ్రత్తలతో చాలా ప్రమాదాలు నివారించవచ్చు. ప్రతియేటా ప్రపంచంలో సుమారు 236,000 మరణాలు ప్రమాదవశాత్తు మునిగిపోవుట వలన కలుగుతాయని ఐక్యరాజ్యసమితి అంచనా. జూలై 25 వ తేదీ ప్రపంచ నీటి ప్రమాదాల నివారణ దినముగ ఐక్యరాజ్యసమితి 2021 లో ప్రకటించింది. భారతదేశములో ప్రతియేటా సుమారు 38,000 మంది నీటి ప్రమాదాలలో మునిగిపోయి మరణిస్తుంటారు. నీటి ప్రమాదాల వలన కలిగే మరణాలలో 85% మించి ఈత పాఠాలు, పర్యవేక్షణ, ప్రజలలో అవగాహన పెంచుట, నియమావళి, సాంకేతికతల వలన నివారించ గలిగినవే

  ఒక వ్యక్తి నీటిలో కాని మరో ద్రవంలో గాని ముక్కు, నోరు మునిగిపోయి ఊపిరి ఆడక తగినంత సమయం ఉండి, ఊపిరి తీసుకొనుటకు బయటకు రాలేనపుడు రక్తంలో ప్రాణవాయువు విలువలు తగ్గిపోతాయి (ప్రాణవాయువు హీనత / hypoxia), బొగ్గుపులుసువాయువు విలువలు పెరిగిపోతాయి (hypercapnea). ప్రాణవాయువు హీనత, పలు అవయవాలపై తీవ్రనష్టము కలిగిస్తుంది. ద్రవాలలో మునిగిపోవుట వలన మరణాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. బయటపడి బ్రతికినవారిలో దీర్ఘకాలిక రుగ్మతలు కూడ కలుగవచ్చు. కొందఱు పూర్తిగా కోలుకొంటారు.

  నీటిలో మునిగిపోవుటలు తొంబై శాతము మంచినీళ్ళలో (చెరువులు, సరస్సులు, నదులు, ఈతకొలనులలో) జరుగుతాయి. పదిశాతము ప్రమాదాలు సముద్రపు నీటిలో జరుగుతాయి. చాలా తక్కువ శాతపు ప్రమాదాలు ఇతర ద్రవాలలో పారిశ్రామిక ప్రమాదాలలో జరుగుతాయి. వ్యక్తులు జలాశయాలలో స్నానం చేయుటకు గాని, ఈతకు గాని దిగినపుడు మునిగిపోవచ్చు. పడవలు మునిగిపోవడం వలన కొందఱు మునిగిపోతారు. వఱదలలో కొందఱు మునిగిపోతారు. ప్రమాదవశాత్తు చిన్నపిల్లలు కొందఱు నీటికొలనులులలో పడిపోతారు. ఇళ్ళలో స్నానపు తొట్టెలలోను, బొక్కెనలలోను, మరుగుదొడ్లులోను చిన్నపిల్లలు మునిగిపోవు ప్రమాదాలు జరుగగలవు. చిన్నపిల్లలు, నీటితొట్టెలు, నీటికొలనులలో మునిగిపోయే అవకాశాలు ఎక్కువయితే, యువకులు వయోజనులు ప్రకృతిలో గల జలాశయాలలో మునిగిపోయే అవకాశం హెచ్చు.


ప్రమాదావకాశాలు



* ఈత పాఠాలలో శిక్షణ పొందని పిల్లలలో మునిగిపోయే ప్రమాదాలు ఎక్కువ.పిల్లలకు 1 సంవత్సరం నుండి 4 సంవత్సరాల వయస్సులోపల ఈతలో శిక్షణ ఇవ్వడం మేలు.

* 5 సంవత్సరాల లోపు పిల్లలలోను, 15 నుండి 24 సంవత్సరాల వయస్సు యౌవనంలో ఉన్నవారిలోను నీటిప్రమాదాలు హెచ్చుగా జరుగుతాయి. 4 సంవత్సరముల లోపు పిల్లలు ఇళ్ళలో ఉన్న ఈతకొలనులలో మునిగిపోయే అవకాశాలు హెచ్చు. యౌవనంలో ఉన్నవారు, వయోజనులు ప్రకృతిలో గల జలాశయాలలో హెచ్చుగా మునిగిపోతుంటారు.

* సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన పిల్లలలో నీటి ప్రమాదాల అవకాశాలు హెచ్చు. కారణం వారికి అనుభవజ్ఞులచేత ఈత పాఠాలలో శిక్షణ లేకపోవుట, వారు నీటిలోనికి వెళ్ళినపుడు పర్యవేక్షణ లేకపోవుట. ఉత్తర అమెరికా దేశములో నల్లజాతీయులలో నీటిలో మునిగిపోయే ప్రమాదాలు ఎక్కువ.

* మగపిల్లలలో హెచ్చు శాతం ప్రమాదాలు జరుగుతాయి.

* మద్యం, మాదకద్రవ్యాలు సేవించిన వారిలో చురుకుదనం లోపించి సమయస్ఫూర్తి తక్కువగుటచే ప్రమాదాలు హెచ్చు.

* మూర్ఛరోగం వంటి రోగాలవలన తాత్కాలికంగా స్పృహ కోల్పోయే వైకల్యాలు ఉన్నవారిలో మునిగిపోవు ప్రమాదాలు ఎక్కువ.

* హృదయ లయల రుగ్మతలు (cardiac arrhythmias) కలవారిలోను, జన్యుపరంగా ఆకస్మిక హృదయ మరణాల అవకాశాలున్నవారిలోను నీటిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. వీరు చల్లనీటిలో మునిగినపుడు, నీటిలో వ్యాయామం చేసినపుడు హృదయపు లయ తప్పి, స్పృహ కోల్పోయే అవకాశం ఉంది.

* బాగా అలసిపోయిన పిదప నీటిలోనికి ప్రవేశించినపుడు మునిగిపోయే అవకాశాలు హెచ్చు. భయం, ఆందోళనల వలన కలిగే కదలికలు అలసటను పెంచుతాయి. మితిమీరిన సాహసంతో చాలాదూరం నేల తగలని లోతు స్థలాలలోనికి చొచ్చుకుపోతే వెనుకకు తిరిగిరావడం కష్టమయి మునిగిపోయే అవకాశం ఉంది.

* నీటిలోపల అపాయకరమైన శ్వాసస్తంభన ప్రక్రియలు చేసేవారిలో మునిగిపోయే అవకాశాలు హెచ్చు.

* పర్యవేక్షణ లోపం ఉన్నపుడు పిల్లలు నీటిలో మునిగిపోయే అవకాశం హెచ్చు.

* చిన్నపిల్లలకు స్వతంత్రంగా నీటిలో ప్రవేశించే అవకాశాలు ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. ఈతకొలనుల ప్రవేశానికి కంచెలు, దడులవంటి అడ్డంకులు ఉండాలి.

* పడవ ప్రయాణీకులు ప్రాణకవచాలు (Life jackets) ధరించకుండా ప్రయాణాలు చేసినపుడు ప్రమాదాలు జరిగితే చాలా మంది మునిగిపోతుంటారు. ప్రతిదినము సుమారు 80 మంది మత్స్యకారులు ప్రపంచంలో నీటిప్రమాదాలలో చనిపోతారని అంచనా.

* మత్స్యకారులు, మత్స్యపారిశ్రామిక కార్మికులు నీటిలో దూకునపుడు, పడవ ప్రమాదాలలో చిక్కుకొన్నపుడు ప్రాణకవచాలు ధరించకపోతే మునిగిపోయే అవకాశాలు హెచ్చు. మత్స్యకారులలో వృత్తిపరముగా ఇతర వృత్తులలో కంటె ఎక్కువ మరణాలు కలుగుతాయి



వ్యాధి విధానం


ప్రాణవాయువు హీనత


  నీటిలో ( లేక ఇతర ద్రవాలలో) మునిగిపోయినపుడు ఊపిరాడక స్తంభించిపోతుంది. అందువలన రక్తపు ప్రాణవాయువు విలువలు క్షీణిస్తాయి. మెదడులో ప్రాణవాయువు హీనత (హైపాక్సియా) వలన మెదడువాపు కలుగగలదు. మెదడులో కణజాల నష్టం, మెదడు వ్యాపారంలో శాశ్వత లోపాలు కలుగగలవు. గుండెలో ప్రాణవాయువు హీనత వలన హృదయపు లయ తప్పుట, గుండెపోటులు, గుండె ఆగిపోవుట కలుగగలవు.

  శరీర కణజాలమునకు తగినంత ప్రాణవాయువు అందకపోవుట వలన రక్తంలో లాక్టికామ్లపు విలువలు పెరిగి జీవవ్యాపార సంబంధ ఆమ్లీకృతం (metabolic acidosis) కలుగుతుంది. 

  నీటిలో మునిగిపోయినపుడు తొలిదశలో ఊపిరి స్తంభించి ప్రాణవాయువు హీనత (హైపాక్సియా) కలుగుతుంది. ఆపై రక్తంలో బొగ్గుపులుసు వాయువు విలువలు క్రమంగా ఒక స్థాయికి పెరిగి శ్వాసక్రియను ప్రేరేపిస్తాయి. అప్పుడు ఊపిరిని బిగపెట్టుట కుదరదు. నీటిలో మునిగి ఊపిరి తీసుకొనే ప్రయత్నంలో కొంత నీరు శ్వాసపథంలోనికి ప్రవేశిస్తుంది. అపుడు దుస్సంకోచం కలిగి స్వరపేటిక మూసుకుపోతుంది. ఈ స్థితిలో నీటిలో మునిగిన వారిని రక్షించి బయటకు తీసుకురాగలిగితే వారు బాగా కోలుకొనే అవకాశాలు ఎక్కువ.  

శ్వాసపథంలో నీటి ప్రవేశం


  కాని ఇంకా నీటిలో మునిగిఉంటే కొంతసేపటికి స్వరపేటిక సంకోచం సడలిపోయి నీరు శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. ఇంకా నీటిలో మునిగిఉంటే ప్రాణవాయువు హీనత వలన స్పృహతప్పి శ్వాసక్రియ ఆగిపోతుంది. తరువాత గుండె కూడ లయ తప్పి ఆగిపోతుంది. 

  నీటిలో మునిగిపోయి, బయటపడినవారిలో మూడవవంతు మంది ఉపద్రవాలకు గురి అవుతారు. వీరిలో ఊపిరితిత్తులలోనికి  నీటితోబాటు ఇతర రేణువులు కూడా  ప్రవేశించి ఉండవచ్చు. కడుపులోని పదార్థాలు కూడ తిరోగమనం చెంది శ్వాసపథంలోనికి ప్రవేశించగలవు. వీటి వలన అపుడు ఊపిరితిత్తులలో తాపం (న్యుమోనియా), ఊపిరితిత్తులలో నీటిఉబ్బు (pulmonary edema), ఇతర పదార్థ రేణువుల వలన ఊపిరితిత్తులలో రసాయనిక తాపం (chemical pneumonitis) కూడ కలుగగలవు. ఊపిరితిత్తులలో నీరు, యితర పదార్థాలు ప్రవేశించుట వలన గాలిబుడగలలో (alveoli) సర్ఫేక్టంట్ అనే రసాయనపు ఉత్పత్తి మందగించి అవి మూసుకుపోగలవు. వికాసం తగ్గి ఊపిరితిత్తులు బిరుసెక్కగలవు. అప్పుడు వాటిలో వాయుచలనం తగ్గి శ్వాసవైఫల్యం కలుగుతుంది. సూక్ష్మజీవుల వలన ఊపిరితిత్తుల తాపం కూడ కలుగగలదు. ఈ కారణాలచే కూడ ప్రాణవాయువుహీనత (hypoxia), రక్తంలో బొగ్గుపులుసు వాయువు విలువలు పెరుగట (hypercapnea) జరుగగలవు. శ్వాసవైఫల్యంతో రక్తపు బొగ్గుపులుసు వాయువు విలువలు పెరుగుటచే  శ్వాసవ్యాపార ఆమ్లీకృతం (respiratory acidosis) కలుగుతుంది.

అల్పోష్ణగ్రత


  చన్నీళ్ళలో మునిగిపోయినపుడు శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గి అల్పోష్ణోగ్రత (35 డిగ్రీల సెంటీగ్రేడు లేక తక్కువకు/ హైపోథెర్మియా) స్థాయికి పడిపోవచ్చు. అల్పోష్ణగ్రత  మరో సమస్య అయినా, దాని వలన కొన్ని ప్రయోజనాలు కలుగగలవు. 21 డిగ్రీల సెంటీగ్రేడ్ (70 డిగ్రీల ఫారెన్ హీట్) కంటె చన్నీళ్ళలో ముఖం మునిగినపుడు గాలి పీల్చుకొను క్షీరదాలలో జరిగే ‘మునుగుటకు ప్రతిక్రియ’ (డైవింగ్ రిఫ్లెక్స్) చైతన్యమవుతుంది. దాని ప్రభావం పరానుభూత నాడీమండలంపై ఉంటుంది. అపుడు గుండె వేగం తగ్గుతుంది, దూరధమనుల సంకోచించి రక్తప్రవాహం కాళ్ళు, చేతులు, ప్రేవులనుంచి ప్రధాన అవయవాలైన గుండెకు, మెదడుకు మళ్ళించబడుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుట వలన అవయవాల ప్రాణవాయువు అవసరాలు తగ్గి ప్రాణవాయువు హీనత పరిణామాలు మందగించబడుతాయి. బ్రతకగల సమయం పెరుగుతుంది. అవయవాలలో కణనష్టం మందగించబడుతుంది. పిల్లలలో చన్నీళ్ళ రక్షణప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాని ఈ రక్షణప్రభావం నీటి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటె తక్కువైనపుడే కనపడుతుంది.

  చాలా శీతల జలాలలో మునిగినపుడు దేహం శీతల విఘాతానికి (cold shock) గుఱి అవుతుంది. దీని ప్రభావం సహవేదన నాడీమండలంపై (sympathetic nervous system) ఉంటుంది. శీతల విఘాతం వలన గుండె వేగం పెరుగుతుంది. ఆపుకోలేని అధికశ్వాసలు (hyperventilations) కలుగుతాయి.నీరు శ్వాసపథంలోనికి పీల్చుకోబడుతుంది. రక్తపుపోటు పెరుగుతుంది. చేతుల, భుజాల, కాళ్ళకండరాలు శక్తిని, సమన్వయాన్ని కోల్పోయి నిస్సత్తువతో నిశ్చేష్టత పొందుతాయి. అందువలన ఈదలేక మనుజులు మునిగిపోతారు. శరీరం ఉష్ణం కోల్పోయి అల్పోష్ణ స్థితి (hypothermia) పొందుటకు సుమారు గంటసేపు పట్టవచ్చును.

  వ్యక్తిగత ప్లవన సాధనాలు  (personal floating devices) ధరించినవారు చన్నీళ్ళలో మునిగిపోయే అవకాశాలు తక్కువ. వారు రక్షించబడుటకు అవకాశాలు హెచ్చు.


హృదయంలో అసాధారణ లయలు


  చన్నీళ్ళలో మునిగిపోయినవారిలో అసాధారణ హృదయ లయలు కలుగవచ్చు. అసాధారణ హృదయ లయల వలన మునిగిపోయే అవకాశం కలదు.

అపాయకర శ్వాసబంధనాలు


  ఈతగాళ్ళు కొన్నిసార్లు నీటిలో ప్రమాదకరంగా ఊపిరి బిగపెట్టే ప్రయత్నాలు తెలియక చేస్తారు.

అధిక దీర్ఘశ్వాసలు (Hyperventilations)


   కొందఱు నీళ్ళలో మునిగేముందు రక్తంలో ప్రాణవాయువు విలువలు పెంచుకొనే ఉద్దేశంతో ఎక్కువసార్లు పెద్ద ఊపిర్లు తీసుకుంటారు. సామాన్యపు ఊపిర్లతోనే రక్తంలో ప్రాణవాయువు సంతృప్తత నూరు శాతంకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వీరిలో అధికశ్వాసల వలన ప్రాణవాయువు విలువలు అదనంగా హెచ్చుగా పెరిగిపోవు. కాని అధికశ్వాసల వలన రక్తంలో బొగ్గుపులుసువాయువు విలువలు బాగా పడిపోతాయి. రక్తంలో బొగ్గుపులుసువాయువు విలువలు మళ్ళీ ఒక స్థాయికి పెరిగినపుడే శ్వాసక్రియ ప్రేరేపించబడుతుంది. అధికశ్వాసలు తీసుకొని నీటిలో మునిగి ఈదినపుడు ఊపిరి బిగపెట్టుట వలన ప్రాణవాయువు విలువలు బాగా పడిపోయినా బొగ్గుపులుసువాయువు ప్రమాణాలు త్వరగా పెరగవు, శ్వాసక్రియ ప్రేరేపించబడదు. ప్రాణవాయువు హీనత వలన స్పృహకోల్పోయి మునిగిపోయే ప్రమాదం ఉంది.

ప్రాణవాయువు హీనత శిక్షణలు


  వీరు ఊపిరి బిగపెట్టి నీటిక్రింద ఎక్కువదూరం ఈదే ప్రయత్నాలు చేస్తారు. వీరిలో ప్రాణవాయువు విలువలు బాగా క్షీణించి ప్రాణవాయువు హీనత వలన స్పృహకోల్పోయే ప్రమాదం ఉంది.

నిశ్చల శ్వాసబంధనాలు


  వీరు నీటి క్రింద మునిగి నిశ్చలంగా ఉండి ఊపిరి బిగపెట్టే ప్రయత్నం (పందేలు వేసుకొని) చేస్తారు. వీరిలో ప్రాణవాయువు హీనత కలిగి స్పృహకోల్పోయి, నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది.

గాయాలు, ఇతర దెబ్బలు


  నీటిలో పడిపోవుట వలన తలకు, మెడకు, ఎముకలకు, చర్మానికి, అంతర్గత అవయవాలకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది.

మునిగిపోవుట లక్షణాలు



  నీటిలోను ఇతర ద్రవాలలోను మునిగిపోతున్నపుడు ఆందోళన, భయం, ఆయాసం కలుగుతాయి. ఈతరాని చిన్నపిల్లలు చాలా తక్కువ కాలంలో, ఒక నిమిషంలోపునే మునిగిపోతారు. నీటిలోనుంచి తీసిన తర్వాత గాభరా, ఆందోళన, వాంతులు, ఊపిరితీసుకొన్నపుడు పిల్లికూతలవంటి శబ్దాలు, అపస్మారకం కలుగవచ్చు. శ్వాసలో ఇబ్బంది, శ్వాసవేగం ఎక్కువగుట, గుండెదడ, ప్రక్కటెముకల మధ్యభాగాలు ఊపిరితో లోనికిపోవుట, దేహం నీలబడుట మొదలగు లక్షణాలు శ్వాసవైఫల్యాన్ని సూచిస్తాయి. ఈ లక్షణాలు కొన్ని గంటల పిమ్మట పొడచూపవచ్చు. దెబ్బలు గాయాల లక్షణాలు కూడా గమనించాలి.

పరీక్షలు


  నీటిలో(ఇతరద్రవాలలోను) మునిగిపోయి బయటపడినవారిని త్వరగా పూర్తిగా పరీక్షించాలి. గాయాలకై శోధించాలి. ప్రాణవాయువు సంతృప్తత పరీక్షించి లోపముంటే ధమనీరక్తపు పరీక్షలు చేయాలి. ఛాతికి ఎక్స్-రే, హృదయ విద్యల్లేఖనాలు కూడ అవసరమే. శరీరాంతర ఉష్ణోగ్రత తీసుకోవాలి. మూర్ఛ, మద్యం, గుండెపోటు, తక్కువ చక్కెరవిలువల వంటి కారణాలకు శోధించాలి. రక్తకణ గణనలు, విద్యుద్వాహక లవణ పరీక్షలు (electrolytes) చెయ్యాలి. తలకు, మెడకు దెబ్బలు తగిలిన అవకాశాలుంటే, గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణలు (cat scans) అవసరం.

చికిత్స


పునరుజ్జీవన యత్నాలు


నీటిలో మునిగినవారిని నీటిపైకి తీసుకురాగానే వారు ఊపిరితీసుకొనకపోతే వెంటనే కృత్రిమశ్వాసలు అందించాలి. కృత్రిమశ్వాసలు అందిస్తూనే వారిని నీటి బయటకు తీసుకురావాలి. కృత్రిమశ్వాసలు  ఇచ్చేటపుడు దవడను ముందుకు జరిపి, మెడను వంచకుండా, చిబుకాన్ని ఎత్తకుండా ఇవ్వాలి. మెడలో వెన్నెముక దెబ్బతిన్నదను అనుమానముంటే మెడను తటస్థస్థితిలో కదలనీయకుండ పట్టీ అమర్చాలి. కృత్రిమ శ్వాసలతో రోగి కోలుకొనకపోయినా, గుండె ఆగిపోయినా  రక్తప్రసరణను పునరుద్ధరించడానికి ఛాతిపై అదుముడులు కూడా మొదలుపెట్టాలి. పునరుజ్జీవన ప్రయత్నాలు కొనసాగిస్తూనే అత్యవసర వైద్యసేవకులను పిలిపించాలి.  ఉదరంపై అదుముట వంటి నీటిని కక్కించి ప్రయత్నాలు చేయకూడదు. ఉదరంనుంచి తిరోగమించు పదార్థాలు ఊపిరితిత్తులలోనికి ప్రవేశించే ప్రమాదముంది. అవకాశం రాగానే ప్రాణవాయువును అందించాలి. రోగి తనంతట తాను ఊపిరి తీసుకోలేకపోయినా, శ్వాసవైఫల్య లక్షణాలు ఉన్నా శ్వాసనాళంలో కృత్రిమనాళం చొప్పించి దానిద్వారా కృత్రిమశ్వాసలు కొనసాగించాలి. అల్పోష్ణగ్రత ఉంటే రోగిని వెచ్చబెట్టు ప్రయత్నాలు చెయ్యాలి. తడిబట్టలు తొలగించి, శరీరాన్ని పొడిగా తుడిచి దుప్పటితో కప్పాలి. చన్నీళ్ళలో మునిగినవారికి పునరుజ్జీవన ప్రయత్నాలు చాలాసేపు కొనసాగించాలి. త్వరగా విరమించకూడదు.

వైద్యాలయాలలో 


  ప్రాణవాయువు హీనత గల వారిని, ఇతర అవలక్షణాలున్న రోగులను వైద్యాలయాలలో చేర్చి జాగ్రత్తగా పర్యవేక్షించాలి. వారికి ప్రాణవాయువు అందించి ప్రాణవాయువు సంతృప్తత విలువలు సంతృప్తికరంగా ఉంచాలి. ధమనీ రక్త వాయుపరీక్షలు జరిపి ప్రాణవాయువు విలువలు, బొగ్గుపులుసువాయువు విలువలు సంతృప్తికరంగా లేకపోతే కృత్రిమశ్వాస యంత్రంతో శ్వాసలు అందించాలి[5]. తగిన పీడనంతో గాలిబుడగలు మూసుకుపోకుండా చూడాలి. శ్వాసయంత్రంతో  ప్రాణవాయువు సంతృప్తత సాధించలేకపోతే దేహమునకు వెలుపల ప్రాణవాయువు అందించు యంత్రంతో రక్తానికి ప్రాణవాయువు అందించాలి. శ్వాసనాళికలలో సంకోచం తొలగించుటకు శ్వాసనాళికా వ్యాకోచకాలు (బ్రాంకో డైలేటర్స్) వాడాలి. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిలో సర్ఫేక్టంట్ అనే ఉపరితల రసాయనికం వాడి గాలిబుడగలను తెఱచి ఉంచాలి. ఊపిరితిత్తుల తాపం గలవారిలో తగిన సూక్ష్మజీవనాశకాలు వాడాలి.

దేహాంతర్గత ఉష్ణోగ్రతను గమనిస్తూ అల్పోష్ణోగ్రతను సరిచెయ్యాలి. దెబ్బలకు, గాయాలకు ఇతర రుగ్మతలకు చికిత్సలు చెయ్యాలి.

రోగి కుశలత


  చాలా తక్కువ కాలం మాత్రమే నీటిలో మునిగిపోయిన వారిలోను, పునరుజ్జీవన ప్రయత్నాలు త్వరగా చేపట్టబడిన వారిలోను, చన్నీళ్ళలో మునిగిపోయినవారిలోను, పిన్నవయస్కులలోను, ఇతర రుగ్మతలు తీవ్రగాయాలు లేనివారిలోను, రసాయనికాలు, రేణువులు ఊపిరితిత్తులలో చేరనివారిలోను కోలుకొనే అవకాశాలు హెచ్చు.

నీటి ప్రమాదాల నివారణ


  నిప్పున్నచోట అగ్నిప్రమాదాల అవకాశాలు ఉన్నట్లే, నీరున్నచోట మునిగిపోయే ప్రమాదాలు జరుగగలవనే స్పృహ కలిగి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి ప్రమాదాలు వాటి నివారణల గుఱించి ప్రజలలో అవగాహన పెంచాలి. 

మద్యం, మాదకద్రవ్యాలు వాడకపోవుట


ఈతకు వెళ్ళేవారు, పడవ ప్రయాణాలు చేసేవారు, పిల్లలను పర్యవేక్షించేవారు మద్యం, మాదక ద్రవ్యాలు వాడకూడదు.

ఈతలో జాగ్రత్తలు తీసుకొనుట


  ఈతగాళ్ళు వాతావరణాన్ని, నీటి పరిస్థితిని తెలుసుకొని విచక్షణా జ్ఞానం ఉపయోగించాలి.  ప్రమాదకరమైన జలప్రవాహాలలో ఈతకు దిగకూడదు. చలివేసినప్పుడు ఈత మాని నీళ్ళబయటకు వచ్చేయాలి. చన్నీళ్ళలో దిగకూడదు. ఈత బాగా తెలిసినవారితో కలసి ఈదుట మేలు. ఒకరి కింకొకరు రక్షకులుగా ఉండాలి. నీళ్ళలో దిగేముందు అధిక శ్వాసలు తీసుకోకూడదు. ఊపిరి బిగపెట్టి నీటి క్రింద ఎక్కువసేపు ఈదకూడదు. నీళ్ళలో ఎక్కువ లోతులకు గెంతకూడదు. సముద్ర కెరటాలలో ఈదేటప్పుడు కెరటాలకు ఎదురీదకుండా, సమాంతరంగా ఈదాలి.

ఈతకొలనుల తూములకు మూతలు


  ఈతకొలనులలో ఉండే నీటిని పీల్చుకొను తూములకు తగిన మూతలు ఏర్పాటు చేయాలి. మూతలు లేకపోతే ఈదేవారి జుట్టు, ఇతర శరీర భాగాలు వాటిలో చిక్కుకొనే అవకాశం ఉంది. 

ప్రాణరక్షకులు


  జనావళి ఈతకొట్టే సముద్రపు టొడ్డుల దగ్గఱ, కొలనుల వద్ద, సరస్సుల వద్ద శిక్షణ పొందిన ప్రాణరక్షకులను ప్రభుత్వాలు కాని, ఇతర సంస్థలు కాని ఏర్పాటు చెయ్యాలి. వీరు నీటిలో మునిగిన వారిని బయటకు తీయుటలోను, పునరుజ్జీవన ప్రక్రియలు చేయుటలోను మంచి శిక్షణ పొందినవారై ఉండాలి. 
ప్రాణరక్షణకు ఉపయోగించు తేల్చుసాధనాలు, ప్రాణ కవచాలు (life jackets), కొక్కీకఱ్ఱలు, అత్యవసర శ్వాస పరికరాలు, ప్రంకపన నివారిణులు (defibrillators) అందుబాటులో ఉండాలి.

అత్యవసర వైద్యసేవకులను పిలవగలిగే ఏర్పాట్లు కూడ అవసరం. నీటిలో మునిగిపోతున్న లేక మునిగిన వారిని రక్షించేవారు తాము మునిగిపోకుండ జాగ్రత్తలు తీసుకోవాలి.

యాంత్రిక మనుజ రక్షకులు


  నీటిలో మునిగిపోతున్నవారిని, మునిగిపోయినవారిని రక్షించుటకు, వారిని బయటకు తీసుకొని వచ్చుటకు యాంత్రిక మనుజులను (robots), ఎగురు సాధనాలను (drones) సురక్షితంగా వాడగలిగే సాంకేతికత అందుబాటులో ఉంది. అవి వారికి రక్షణ కవచాలు, యితర తేల్చెడి సాధనాలను త్వరగా అందజేయడమే కాక  వారిని బయటకు చేర్చగలవు కూడా.

పిల్లల సంరక్షణ


  ఈతకొలనులలో పిల్లలకు నిరంతర పర్యవేక్షణ ఉండాలి. పిల్లలు రక్షక కవచాలను గాని, ఇతర తేల్చుసాధనాలను కాని ధరించాలి. పిల్లలకు 1-4 సంవత్సరములలోనే ఈత పాఠాలు నేర్పాలి. స్నానపు తొట్టెలవద్ద, మరుగుదొడ్ల వద్ద,  నీరున్న ప్రతిచోట పిల్లలకు సమీపంలోనే పెద్దలు ఉండి నిరంతరం వారిని కంటికి రెప్పలా కాచుకోవాలి.

ఈతకొలనులకు కంచెలు


  దడులు కాని, కంచెలు గాని చుట్టూ  ఏర్పాటు చేసి పిల్లలు వారంతట వారు ఈతకొలనులలోనికి ప్రవేశించలేనట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

పడవ ప్రయాణీకుల సంరక్షణ


  పడవ ప్రయాణీకులు ప్రతిఒక్కరు ప్రాణకవచం ధరించిన తర్వాతే పడవలోనికి ఎక్కనివ్వాలి[5]. ప్రాణకవచం లేకుండా ఎవరూ పడవ ప్రయాణం చేయకూడదు. వాతావరణ, నీటి ప్రవాహ పరిస్థితులు బాగున్నపుడే పడవ ప్రయాణాలకు అనుమతులివ్వాలి. పడవ నడిపేవారు సుశిక్షితులై ఉండాలి. ప్రయాణీకులు పడవలో వారికి కేటాయించిన స్థానాలలోనే ఉండాలని హెచ్చరించి వారు గుమికూడుటను అరికట్టాలి. పడవలలో నిర్ణీత సంఖ్యకు మించి ప్రయాణీకులను ఎక్కించకూడదు. పడవలు నడిపే తీరులను ప్రభుత్వాంగాలు గమనిస్తూ వారు ప్రయాణీకుల సంక్షేమ నియమాలు ఉల్లంఘించకుండా గమనించాలి. పడవలలో ప్రయాణించేవారు మద్యం, మాదక ద్రవ్యాలు వినియోగించకూడదు. పడవలు నడిపేవారికి, ప్రయాణీకులకు కూడ నీటిప్రమాదాల గుఱించి అవగాహన కలిగేటట్లు బోధించాలి. విమానాలలో వలె పడవలు బయలుదేరే ముందు సురక్షిత సందేశాలు బోధించాలి.

మత్స్యకారుల సంరక్షణ


మత్స్యకారులకు ప్రాణకవచాలు లేక ఇతర వ్యక్తిగత ప్లవనసాధనాల అవసరము బోధించి వాటిని ధరించుట అలవరచాలి. అత్యవసర పరిస్థితులలో సందేశములు పంపి సహాయము కోరుటకు అవసరమగు సాంకేతిక పరికరములు ఏర్పాటు చెయ్యాలి

ఆరోగ్య సమస్యలు కలవారికి రక్షణ


మూర్ఛ, హృదయ లయలలో సమస్యలు ఉన్నవారికి, ఈతకొలనులలోను, పడవలలోను ప్రత్యేక పర్యవేక్షణ అవసరము.

18, అక్టోబర్ 2023, బుధవారం

డాలస్లో మంచు - గిరిజా కళ్యాణము - పద్యాలు

                                                                          డాక్టరు. గన్నవరపు వరాహ నరసింహమూర్తి.

2010 ఫిబ్రవరి 11/12 తారీకుల్లో మా డల్లసులో 12 అంగుళాల మంచుపడింది. మామగారైన హిమవంతుడి "మంచు" భాష్పాలు...మహాశివుడి  "లింగోద్భవన" మహాశివరాత్రి సందర్భాన వ్రాసుకొన్న పద్యాలు. 


#1 మంచు 



 

సీసం .
పాలకడలి పొంగి నేల ముంచిన భంగి
వెల్లదనము పూచె పల్లె యంత
ధవళ ప్రభల రాశి ధరణి రాలు సరణి 
సితము వఱలె నుర్వి సీమ యంత
కప్పురపు పొడులు కప్పెఁ గాశ్యపి నన
శ్వేతచూర్ణము చిందె భూతలమ్ము
వసుమతీజములందు కుసుమవల్లుల తీరు
శుక్లపుంజము విచ్చె సురభిపైన 

తే.గీ. అంచపిండులఁ బోలుచు మంచు పొరలు
పంచదారలు కరణిని ముంచె నవని 
హేమరాశుల పూర్ణమై యిలయు వెలయ
ధవళవస్త్రము గట్టె మా ధరణి మాత ! 

 

(హరికథా భాగవతారిణి శ్రీమతి జయంతి సావిత్రి గారు నా పద్యమును వారి ‘ గిరిజా కల్యాణం’ కథలో చేర్చి పాడడం నా అదృష్టం.)

 
కడలి =సముద్రము :  

వెల్లదనము = ధవళ = సితము= శ్వేత = తెలుపు :  

వసుమతీజము= వృక్షము :

వసుమతి = ధరణి = అవని = కాశ్యపి =భూమి :
అంచ పిండులు = హంసల సముదాయము 

#2    గిరిజా కళ్యాణం 


దక్షు నింట తన భర్త పరమ శివుని అవమానమునకు ఓర్వ లేక సతి ప్రాణముల నర్పించినది. మరల హిమవంతుని కూతురై పుట్టినది.

 

  కం. పశుపతికై సతి వీడిచె
       నసువులు తన తండ్రి యింట నలుకన దక్షున్
       పశుపతికై సతి పుట్టెను
       పస దీఱిన రాజు నింట పర్వత తనయై.


 కం.  గిరిసుత పెచ్చిన ముద్దుల
       పెరిగెను నగనాధు నింట పెన్నిధి గాదే
       అరయక ముద్దులు దీర్చెడి
       గిరిరాజుకు పట్టి యౌట క్షేమము గాదే !

 

ఆ.వె. పెళ్ళియీడు రాగ మళ్ళెను హృదయము
        పరమశివునిపైనఁ బార్వతికిని
        తనువు మనము నిల్పి తపముఁ దా సలుపుచు
        గెలిచెఁ బరమశివుని గిరిజ భక్తి.

 

చం. తపముల గెల్చెఁ  బార్వతియు తన్మత నొందుచుఁ గామవైరినిన్

      ‘సఫలత నొందె జన్మ’మనె సాధ్వికిఁ  దండ్రగు  పర్వతీశుడున్
      ‘నెపములు నేల నింకయును  నెయ్యము వియ్యము సేయు డం’చటన్
      విపులతఁ బల్కినారు వినువీధుల దేవత దైవగణ్యులున్.

 

 ఆ.వె. పెళ్ళి నిశ్చయంబు పెద్దలు సేయంగ
        మంచుకొండ పట్టి మదిని మురిసె
        హిమము నేల నొంపె హిమవంతు డారాజు
        సంతసించి నేత్రజలము గార్చె

 

అప్పుడు పెళ్ళికి సన్నిద్ధుడై, బ్రహ్మ, విష్ణువు, సకల దేవతలు, యక్ష, గంధర్వ, కింపురుష, కిన్నెరలు, అశ్వనీ దేవతలు, ప్రమథి గణంబుల సపరివారముతో ,


 సీసం.  జటలందు జలకన్య జలకమ్ము లాడంగ
          నెలవంక వెలుగులు నెమ్మి నీయ
          శితికంఠమున ఫణి శిరమును నూపంగ
          చేతిలో ఢమఢక్క చిందులేయ
          కరిచర్మము తనువు గాంతులు వెదజల్ల
          శూలంబు  దిక్కులఁ జొచ్చుచుండ
          భస్మంబు దేహప్రభావము వర్ధింప
          పునుక నిండుగ మెఱపులను గురియ 


 తే.గీ. నందికేశుడు ఱంకెల నాట్య మాడ
        ప్రమథి గణములు భక్తితో ప్రస్తుతింప
        పెళ్ళికొమరుడు శుభముల పెన్నిధుండు
        పరమశివు డరుదెంచె నా పద్మముఖికి. 

 


(హరికథా భాగవతారిణి శ్రీమతి జయంతి సావిత్రి గారు నా పద్యమును వారి ‘ గిరిజా కల్యాణం’ కథలో చేర్చి పాడడం నా అదృష్టం.)


 అప్పుడు,

 

 ఉ. చల్లని మంచుకొండ మనసారగ మెచ్చుచు నల్లు నీశ్వరున్

    మెల్లన గార్చె బాష్పములు, మేదిని నంతట హేమవర్షమున్ 

    ఝల్లన గుండె లీశ్వరుని చర్మము జల్లెను భస్మరాశులన్
    దెల్లయె ధాత్రి యంతయును దిక్కుల నన్నిట శైవరాత్రిలో. 

 

 ఈ కధ చదివిన వినిన పుణ్య జనంబులకు సకల పాపములు తొలగి యిహలోక పరలోక సౌఖ్యములు కలుగుతాయి.

                               

                                                                       

 


పశుపతి = ఈశ్వరుడు : నగము = కొండ : నగనాధుడు = పర్వత రాజు : శితి కంఠుడు = నీల కంఠుడు : పట్టి = కూతురు, కొడుకు : పునుకు = పుఱ్ఱె

 

 

4, జులై 2023, మంగళవారం

అన్ననాళంలో అతుకు మచ్చ (Esophageal Inlet patch)

 


అన్ననాళంలోనికి జీర్ణాశయం నుండి ఆమ్లం తిరోగమించి తాపం కలిగించడం వైద్యులు తఱచు చూస్తారు. అంతర్దర్శినితో పరీక్షించినపుడు ఈ తాప లక్షణాలు సాధారణంగా అన్ననాళం క్రింద భాగంలో కనిపిస్తాయి. వీటికి విరుద్ధంగా కొందఱిలో అన్ననాళం తొలిభాగంలో మచ్చలు అతికించినట్లు కనిపిస్తాయి. ఈ అతుకు మచ్చలు అన్నవాహిక కణజాలానికి బదులు జీర్ణాశయ కణజాలం కలిగి ఉంటాయి. చాల అరుదుగా వీటి వలన లక్షణాలు కాని ఉపద్రవాలు కాని కలుగుతాయి. 

అన్ననాళ ద్వారంలో అతుకు మచ్చ (Esophageal Inlet patch)

 

సుమారు 1-12 శాతము మందిలో అన్ననాళపు తొలి భాగంలో లోపొరలో ఎఱ్ఱని ముకమలు వలె అతుకు పెట్టినట్లు కనిపించే మచ్చలు (ఇన్ లెట్ పాచెస్) ఉంటాయి. వీటి వలన చాలా మందిలో ఏ లక్షణాలు కాని ఇబ్బందులు కాని ఉండవు. ఇతర కారణాల వలన అంతర్దర్శిని పరీక్ష (ఎండోస్కొపీ) చేసినపుడు ఇవి కనిపిస్తాయి. వీటితో బాటు కొందఱిలో అన్ననాళములో పలుచని పొరల కవాటాలు ఉండవచ్చు.


                                               అన్ననాళంలో అతుకు మచ్చ

కారణాలు 


గర్భంలో పిండం వృద్ధి చెందుచున్నప్పుడు కంఠభాగంలో ఉండే జీర్ణాశయపు శ్లేష్మపుపొరలో కొన్ని భాగాలు  అన్ననాళంలో అవశేషాలుగా మిగిలిపోయి పరస్థానం చెందడం వలన ఈ అతుకు మచ్చలు పుట్టుకతో ఉండవచ్చు. కొందఱిలో జీర్ణాశయంలోని ఆమ్లము తిరోగమనం చెందడం వలన అన్ననాళపు శ్లేష్మపు పొర కణజాలం మార్పు చెందడం వలన ఈ అతుకు మచ్చలు కలుగవచ్చు.


లక్షణాలు


పెద్దశాతం మందిలో ఈ మచ్చల వలన ఏ లక్షణాలు ఉండవు. ఏ ఇబ్బంది ఉండదు. ఏ ఉపద్రవాలు కలుగవు. చాలా అరుదుగా కొందఱిలో గొంతుకలో అడ్డున్నట్లు, నిండుతనము కలుగవచ్చు. కొందఱిలో మింగుటలో ఇబ్బంది కలుగవచ్చు. దగ్గు రావచ్చును. చాలా అరుదుగా ఈ అతుకు మచ్చలలో కర్కటవ్రణాలు (కేన్సర్లు) కలిగే అవకాశం ఉంది.

 

వ్యాధి నిర్ణయం


 అంతర్దర్శినితో


ఇతర లక్షణాలకు అంతర్దర్శిని (ఎండోస్కొపీ) పరీక్ష చేసినపుడు అన్ననాళంలో ఎఱ్ఱని ముకములులా కనిపించే మచ్చ అతుకు పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ అతుకుమచ్చ భాగం నుంచి చిన్నముక్కలు సేకరించి కణపరీక్షకు పంపవచ్చు. కణపరీక్షలో పొలుసుల అన్ననాళ కణములకు బదులు స్తంభాకారపు జీర్ణాశయ కణములు కనిపిస్తాయి. జఠర మూలంలో వలె వీటిలో శ్లేష్మం స్రవించు గ్రంథులుండవచ్చు, లేక జీర్ణాశయపు మధ్యభాగంలో వలె ఆమ్లము స్రవించే గ్రంథులుండవచ్చు.


బేరియం ఎక్స్ రే పరీక్షతో


వీరిచే బేరియం మ్రింగించి ఎక్స్- రే చిత్రం తీసినపుడు అన్ననాళంలో నొక్కులు కనిపించవచ్చు. ఆ నొక్కులు కనిపించినపుడు అంతర్దర్శిని పరీక్ష, కణపరీక్షలతో అతుకు మచ్చలు నిర్ధారించవచ్చును.

 

చికిత్స


పెక్కుశాతం మందిలో ఈ అతుకు మచ్చలకు చికిత్స అనవసరం. ఈ మచ్చలలో ఆమ్లము స్రవించే గ్రంథులుండి గుండె మంట, మింగుటలో ఇబ్బంది ఉంటే ఒమిప్రజాల్ వంటి ప్రోటాన్ యంత్ర అవరోధకాలు వాడవచ్చు. అన్ననాళంలో సంకోచాలు ఉన్నా, పొరలు ఉన్నా వ్యాకోచ చికిత్సలు చెయ్యాలి.


శ్లేష్మగ్రంథులు ఉండి గొంతుకలో అడ్డుపడినట్లు, నిండుతనం ఉన్నవారిలో విద్యుద్దహన చికిత్సతో కాని, ఆర్గాన్ వాయువుతో నిర్మూలన చికిత్సతో కాని, రేడియో తరంగాలతో కాని ఈ అతుకు మచ్చలను తొలగించవచ్చు

 

 

13, డిసెంబర్ 2022, మంగళవారం

బొమ్మలకు పద్యాలు


                       బొమ్మలకు పద్యాలు 

( Thanks to @success pictures :మా ఆంధ్రవైద్య కళాశాల సహాధ్యాయులకు అంకితము )

                                                    డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.                                                         

                  



                  



ఆ.వె.

మనసు పుట్టెనేని మార్గమ్ము లేదని

వగవనేల క్రుంగి వసుధలోన?

బుద్ధిపెట్టి కనుము పూని పుడమినందు

తొలచి తొలచి వెదుకు, దొఱకు దారి






ఆ.వె.

శిఖర మెత్తనుచును శిరమందు తలచునా

శిశువు దృష్టి నిలుచు చివర నెపుడు

మొదటి మెట్టులోని ముసిరెడి యిక్కట్లు

కడకు వచ్చుసరికి కరగిపోవు


( ముసురు= క్రమ్ము)




ఆ.వె.

పనులు కూడుటెట్లు పనిముట్లు సరిగాక

చీలు నదిమి త్రిప్ప చీల కదలు

విషయ మెఱిగి దాని విరుగుడు కనుగొన

జగతి గాంచగలదు మిగుల ప్రగతి


( చీలు = చీలిక, పగులు; మర = యంత్రము )





ఆ.వె.

ఆశ విడవకన్న ఆయువున్న వఱకు

అంతకుండునైన  గొంతు పట్టి

అదిమి నపుడు పలుకు, హరియైన హరుడైన

దయను చూపువాడు దైవమగును


(అంతకుడు=యమధర్మరాజు)




B

ఆ.వె.

కపటి నెయ్యుడైన కడగండ్లు సమకూడు

మంచి మాటలాడి మసలి వాడు

మత్సరమ్ము తోడ  మ్రగ్గును మదిలోన

విషము పెంచి తుదకు వెన్నుపొడుచు





ఆ.వె.

సభ్యు లనుచు పలికి సభ్యలోకమునందు

ధరణి గతియె మార్చె ధనము నేడు

ముందు డబ్బు గొనరె మునిగిపోవుచునుండ,

వెలికితీయు వాటి వెలలు వేఱు 





ఆ.వె.

మెదడు మేలు చెట్టు మేనులో నరయగ

మేపవలయు దాని మేలు చదువు;

ఎఱుక కలుగ బ్రతుకు పురుషుండు పుడమిలో

నెఱుక లేక జగతి నీదు టెట్లు ?




ఆ.వె.

నీవు భిన్నరీతి నెగడిన జగతిలో

నెల్లజనులు నిన్ను నేవగించి

నీదు రీతిలోన నెగడని కతమున

తఱచు తిట్టుకొనరె తమ్ము తాము ?





ఆ.వె.

పరుగులిడుచు క్రిందపడుచు నోడుచు లేచి

దెబ్బలెన్నొ తగిలి జబ్బుపడుచు

మరల కోలుకొనుచు మానిన గాయాల

పరుగు పెట్టి గెలుచు బ్రతుకు బాట




















ఆ.వె.

పొరుగువానితోడ పోలిక మనకేల

ఎంచి చూడ కాడు హీను డెవడు

బంటు చేత చిక్కు బందీగ భూపతి

సృష్టిలోన సమతదృష్టి మేలు






ఆ.వె.

పడవలోన చిల్లు పైనుండ లేదని

చంక గుద్దుకొనుట సభ్యతగునె

ముందు వెనుకొ గాని మునుగరే వారంత

చిల్లు పూడ్చు టదియు చెలువు గాదె ?






ఆ.వె.

గెలుపు వెనుక నుండు క్లేశము లెన్నియో

కనగ కంటబడదు కష్టమంత

చూచుటకును మించు, సుళువైన దేదిరా?

మెచ్చుకొనుట మాని మేల మేల?


( క్లేశములు = కష్టాలు; మేలము = పరిహాసము)





ఆ.వె.

వెంటబడుచు పొందు వేవేల యిక్కట్లు

నరుడు జగతి లోన నలిగి నలిగి

విలువ నరయకుండ వెంబడింప తగదు

పరము లేదు పుడమి బ్రతుకు కంటె


( అరయు = తెలియు చూచు; పరము = శ్రేష్ఠము )




















ఆ.వె.

పక్కవాని గూర్చి పరుల కేమి తెలియు

గుణము లెంచ తరమె గుడ్డిగాను ?

బ్రహ్మ మొకడె తెలియు బాధ లతడు పొంద

ఒరులు తీర్పు చెప్పు టొప్పు కాదు.







ఆ.వె.

ఒప్పు నేనటంచు తప్పు లెన్నుట తప్పు

పరుల దెసను గాంచ పరగు నొప్పు

తావు బట్టి మారు తప్పైన నొప్పైన

తావు మారి కనగ తగవు తీరు






ఆ.వె.

పడిన పాట్లు గాంచి పరులు గుర్తింతురే ?

పరుల దృష్టి నిలుచు ఫలము పైన !

ఫలము పొందదగును వరయంత్రములు వాడి

అబ్బురంబు గాదె యంత్రయుగము !





ఆ.వె.

ఎముక లేని నాల్క యెంత మెత్తనిదైన

కర్కశమ్ము నూన కఠిన మగును;

శరము కంటె పదును శాపములను పల్కి

గుండె చీల్చునట్టి గునప మదియు.


ఊను = వహించు




ఆ.వె.

బలము లేని వారు బలగముగా కూడి

బలులు కారె ! బాహుబలులు వారె!!

బలియు డొక్కడైన బలహీనుడై వాడు

చులక నగును మంద చుట్టుముట్ట


( బలగము = మంద, సమూహము ; బలియుడు=బలవంతుడు )





ఆ.వె.

ఉప్పు పంచదార యొక్క పోలిక నుండు

చప్పరింప నోట చవులు తేలు

మర్మమెరిగి మసల మనుజుల నైజము

బాధలొందు వేళ బైటపడును


( చవులు = రుచులు ; తేలు = పొడచూపు )



ఆ.వె.

సంతసమ్ము కలుగు సంతృప్తుడైనచో

తనివి తీరు వాడు, ధనికు డవని ;

సకలమున్న నరుడు సంపన్ను డెట్లౌను

తృప్తిలేక, వాడు దీను డగును !


తనివి = తృప్తి : దీనుడు = దరిద్రుడు




ఆ.వె.

నేటి వర్తనమ్ము నేటితో ముగియదు

భావిలోన నదియు ప్రస్ఫురించు

భావి దలచి నేడు వర్తించుటయు మేలు

కాల మొక్క రీతి గడువ దనుచు


ప్రస్ఫురించు = కనిపించు



ఆ.వె.

మంద లనుసరించు మార్గము మనకేల

మంచిదారి యుండ మరియు నొకటి

బ్రతుకు నీడ్చవచ్చు పదివేల తెరవుల

మనసు చూపు బాట మంచి బాట




ఆ.వె

మాట జాఱవలదు మదిని చింతింపక

మాట నోట జాఱ మఱలి రాదు

మాట విలువ తెలియు మనుజుడు యోచించి

మాటలాడు లేక, మౌనమూను


(ఊను = వహించు)




ఆ.వె.

ఇంట గొడవలుండి యిక్కట్లు పెనగొని

తలకు భారమైన తరుణమందు

నెమ్మి నీకు కలుగ  నిశ్శబ్దమగునట్టి

తావు నొకటి వెదకి దాగుకొమ్ము !


( నెమ్మి = సుఖము, శాంతి ; తావు = స్థానము )






ఆ.వె.

చెవులు కండ్లు తనకు చేర్చు సంగతులెల్ల

కలయబోసి తుదకు తలపు లిడెడి

ఉత్తమాంగ మొక్క యుత్పత్తిశాలని

మంచి చేర్చ వలయు మనిషి తలకు


( ఉత్తమాంగము = తల ; ఉత్పత్తిశాల = కర్మాగారము )




ఆ.వె.

గుంపు లనుసరించి, గుడ్డిగా జనులెల్ల

ఇడుమలందు చొచ్చి యిరుకుకొనగ

దూరదృష్టి కలిగి దూరమై గములకు,

బుధులు సత్య మరసి పోవు రందు


( ఇడుమలు = కష్టములు;ఇరుకుకొను = చిక్కుకొను;  గమి = సమూహము;  అరయు = చూచు, తెలుసుకొను )





ఆ.వె.

లావు నెంచ ‘మేలులక్షణం బిది’యని

అడవికెల్ల రాజు హస్తి యగును

బుద్ధి నెన్నవలయు బుధులెల్ల పుడమిలో

ప్రభువు నెంచువేళ ప్రజల కెల్ల





ఆ.వె.

నీట మునుగువాని నిర్లక్ష్యమొనరించి

చిత్రమగ్ను లగుట చేటు కాదె ?

చిత్రజగతి లోన చిత్రమౌ చేష్ఠలు

చిత్రమందు చూప శ్రేష్ఠమయ్యె !






ఆ.వె.
నేలబావికిఁ జని నీరు దోడుచుఁ దోడి
నెమ్మి పాత్రలందు నింపి నింపి
నెలవుఁ జేర్చువాడు నెఱయగా నెఱుగగ
నీటి విలువ నొరులు నేర్వ గలరె ?

నెమ్మి = సంతోషము ;నెలవు= నివాస స్థలము ; నెఱయగ= బాగుగా




ఆ.వె.
దీనుడనుచుఁ దాను దానంబు నడుగగా
దయను జూపి మిగుల ధనము నొసగ
వేగఁ గొనుచు దాని భోగములకుఁ బోయు
నెయ్యు డెట్టివాడొ నిజము గనుము !



ఆ.వె.
త్రాడు దాచుకొనుచు, రక్షించుచున్నట్లు
చేయిజాపి, చాపి, చేసి నటన,
సాయ మించుకైన చేయనివారలు
గోముఖముల తోడ  కోలుపులులు

కోలుపులి=పెద్దపులి


ఆ.వె.
గురిని గుండె నిల్పి  తిరముగా యత్నింప 
కేళిలందు పొందు గెలుపు వాడు
పొరుగువాని పైన గురిని నిలిపినేని 
పొరుగువాడె గెలుపు పొందుచుండు .

తిరము = స్థిరము

     


  ఆ. వె. 
       ఎట్టి మునియొ గాని గట్టి శాపము నిచ్చి
       కఠిన శిలగ మార్చ కరుణ లేక
       దయను వీడకుండ ద్రవియించి హృదిలోన
       తరుణి నీరు పెట్టె తరువు కిపుడు !




కం.

నక్కితివి మొగిలు చాటున
నిక్కుచు మెల్లంగ వచ్చి నేత్రములందుం
జిక్కితివి చందమామా !
దక్కెను దోబూచులాట ధర నీతోడన్!!

మొగిలు= మేఘము; ధర= భూమి






విషయసూచిక

   1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogs...