16, జులై 2020, గురువారం

మద్యపాన వ్యసనము ( Alcoholism )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )

                                   మద్యపాన వ్యసనము

                                        ( Alcoholism )


                                             డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.  

      మద్యము లేక సారాయిగా వ్యవహరించబడే రసాయన పదార్థమును రసాయన శాస్త్రములో ఎథనాల్ ( Ethanol ), లేక ఇథైల్ ఆల్కహాలు ( Ethyl alcohol ) CH3-CH2-OH ( C2H6O ) గా వ్యవహరిస్తారు. చక్కెరలను మధుశిలీంధ్రముతో ( yeast ) పులియబెట్టి సారాయిని తయారుచేస్తారు. చైనా, భారతదేశముల వంటి  ప్రాచీన సంస్కృతులలో మద్యము తయారి, వాడుకలు ఉన్నాయి. దేవతలు, రాక్షసులు క్షీరసాగరమథనము చేసినపుడు ‘ సుర ‘ ఆవిర్భవించినట్లు వర్ణించబడింది. ఆరబ్ దేశములలో సారాయి బట్టీపట్టు ప్రక్రియ ( distillation ) ప్రథమముగా వాడుకలో వచ్చినట్లు చెబుతారు.

    మద్యములలో బార్లీసారా ( beer ), ద్రాక్షసారా ( wine ), తాటికల్లు ( Palmyra toddy ), ఈతకల్లు
 ( Date tree toddy ), ఇప్పసారాయి వంటి బట్టీపట్టని ( fermented but not distilled ) సారాయిలలో మద్యము 4 నుంచి 16 శాతము వఱకు ఉండవచ్చును. బట్టీపట్టిన ( distilled ) విస్కీ, జిన్, వోడ్కా, బ్రాందీ వంటి మద్యములలో మద్యము  20 శాతము మించి ఉంటుంది

    మితము తప్పిన మద్యము వాడుక వలన శారీరక, మానసిక, సామాజిక దుష్ఫలితములు కలుగుతాయి. కొందఱిలో మద్యము వ్యసనముగా పరిణమిస్తుంది. మద్యము  త్రాగుట మొదలిడిన వారు మితము తప్పినపుడు, దాని కొఱకు పరితపించుట ( craving ), తప్పనిసరిగా త్రాగాలనుకొనుట ( compulsion ), మద్యము వాడుకను ఆధీనములో ఉంచుకొనలేకపోవుట ( loss of control ), దైనందిన జీవితములో మద్యముపై ఆధారపడుట ( alcohol dependence ), త్రాగిన ఫలితమునకు ఎక్కువ మోతాదులలో త్రాగవలసివచ్చుట ( tolerance ) సారాయి వ్యసనములో కలిగే వివిధ స్థాయిలు. మద్యము వాడుక వలన వ్యక్తిగత, చట్టపరమైన సమస్యలు కలిగినపుడు ఆ అలవాటును మద్యము దుర్వినియోగముగా ( alcohol abuse ) పరిగణించాలి.

    మితము తప్పి మద్యము వినియోగించే వారిలో శారీరక, మానసిక, సామాజిక దుష్ఫలితములు కలుగుతాయి.

                                            శారీరక దుష్ఫలితములు 


     మితము తప్పి మద్యము త్రాగేవారు సగటున 12 సంవత్సరములు జీవనప్రమాణమును కోల్పోతారు. కొందఱు ప్రమాదాలకు గుఱి అయి, కొందఱు అధికమోతాదులలో త్రాగి సత్వర పరిణామముల వలన పిన్నవయస్సులో ప్రాణములు కోల్పోతారు. మరి కొందఱిలో దీర్ఘకాల అనారోగ్య పరిణామముల వలన మరణములు సంభవిస్తాయి. ప్రపంచములో 4 శాతపు మరణములు సారాయి వలన కలుగుతాయి.


                         మద్య కాలేయ వ్యాధులు ( Alcoholic liver diseases )


సుర కాలేయ వసవ్యాధి ( Alcoholic steatosis ) 


    మద్యము ఎక్కువగా త్రాగేవారి కాలేయ కణములలో ( hepatocytes ) వసామ్లములు ( fatty acids ) చేరి గ్లిసరాల్ ( glycerol ) తో కూడి ట్రైగ్లిసరైడ్స్ గా ( triglycerides ) రూపొందుతాయి. ట్రైగ్లిసరైడ్స్ కొవ్వుపదార్థములు. ఇవి కాలేయ కణములలో అధికముగా కూడితే కాలేయ వసవ్యాధి కలిగిస్తాయి.

 సుర కాలేయతాపము ( Alcoholic hepatitis ) 


    అధికముగా మద్యపానము  చేసేవారిలో 15 నుంచి 35 శాతము మందిలో కాలేయ తాపము ( hepatitis ) కలుగుతుంది. కాలేయ తాపము వలన కొన్ని కాలేయ కణములు మరణిస్తాయి ( necrosis and apoptosis ). తాపప్రక్రియ పర్యవసానముగా తంతీకరణము ( fibrosis ) కూడా జరుగుతుంది.

 నారంగ కాలేయవ్యాధి ( Cirrhosis of Liver ) 


    అధికముగా మద్యము త్రాగేవారిలో 10 నుంచి 20 శాతము మందిలో, కాలేయ తాపము ( hepatitis ), కణ విధ్వంసము ( necrosis  ), తంతీకరణము ( fibrosis ) పదేపదే జరిగి నారంగ కాలేయవ్యాధికి ( cirrhosis of liver ) దారితీస్తాయి. సారాయి వాడుక కొనసాగించినపుడు  నారంగ కాలేయవ్యాధి తీవ్రమయి కాలేయ వైఫల్యము ( hepatic failure ), మరణము కలుగుతాయి. పచ్చకామెరలు ( jaundice  ), జలోదరము ( ascites ), నారంగ కాలేయవ్యాధిలో కొన్ని లక్షణములు. పచ్చకామెరులు వలన వీరి కాలేయము నారింజపండు రంగులో ఉంటుంది.

                                               జీర్ణాశయ వ్యాధులు 


    మద్యపానము సలిపే వారి జీర్ణాశయములో ఉదజ హరికామ్లము ( hydrochloric acid ) అధికముగా స్రవించి జీర్ణాశయ తాపము ( Gastritis ) కలిగిస్తుంది. జీర్ణాశయ తాపము కలిగిన వారిలో వాంతి భావన, వాంతులు, కడుపునొప్పి, ఆకలి మందగించుట, కడుపు ఉబ్బు  పొడచూపుతాయి. వీరి జీర్ణాశయములు హెలికోబేక్టర్ పైలొరై ( Helicobacter Pylori ) అనే సూక్ష్మాంగజీవుల బారి పడితే వారిలో జీర్ణ వ్రణములు ( Peptic ulcers ) కలిగే అవకాశము ఉన్నది. జీర్ణ వ్రణములు కలవారు మద్యపానము చేస్తే  ఆమ్లము అధికముగా ఉత్పత్తి అయి ఆ వ్రణములు తీవ్రము అవుతాయి. త్వరగా మానవు.

                                          క్లోమ తాపము ( Pancreatitis ) 


    ఎక్కువ మోతాదులలో మద్యపానము చేసేవారిలో సత్వర క్లోమ తాపము ( Acute pancreatitis  ),  దీర్ఘకాల క్లోమతాపము ( Chronic Pancreatitis ) కలిగే అవకాశములు హెచ్చు.

                                              హృదయ వ్యాధులు 


    మద్యపానము ఎక్కువగా చేసే వారి రక్తములో ట్రైగ్లిసరైడులు పెరిగి ధమనీ కాఠిన్యత ( Atherosclerosis ) త్వరితముగా కలుగుతుంది. అందువలన వీరిలో హృదయ ధమనీ వ్యాధులు ( Coronary artery disease ), హృదయ వైఫల్యము ( Congestive heart failure ) కలిగే అవకాశములు ఎక్కువ. వీరిలో  థయమిన్ విటమిన్ లోపము ( thiamine deficiency ) వలన బెరిబెరీ ( Beriberi ) వ్యాధి కూడా కలిగే అవకాశము ఉన్నది.

                                                                అంటు వ్యాధులు 

   
మితము తప్పి సారాయి త్రాగే వారిలో రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. వీరికి అంటురోగములు కలిగే అవకాశములు హెచ్చు.

                                       మస్తిష్కముపై మద్యప్రభావము 


 సత్వర ప్రభావము 


    రక్తములో మద్యప్రమాణముల బట్టి మస్తిష్కముపై వాటి ప్రభావము ఉంటుంది. రక్తములో మద్యప్రమాణము త్రాగిన మోతాదు పైనా,  త్రాగినపుడు జీర్ణాశయస్థితి పైన, వ్యక్తి వయస్సు, లింగము, ఆరోగ్యస్థితుల పైనా ఆధారపడుతుంది. ఖాళీ కడుపుతో మద్యము సేవించినపుడు అది త్వరగా రక్తములోనికి చేరుతుంది. స్త్రీల శరీరములలో కొవ్వు శాతము హెచ్చవుట వలన ఒకే మోతాదు త్రాగిన పురుషులలో కంటె, స్త్రీలలో రక్త  మద్యప్రమాణములు ఎక్కువగా ఉంటాయి. రక్తము లోనికి చేరిన మద్యము కణజాలములోనికి సులభముగా ప్రవేశిస్తుంది. మద్యము మస్తిష్క కణములను మందగింపజేస్తుంది. తక్కువ ప్రమాణములలో మద్యము విశ్రాంతిని, ఉల్లాస భావమును కలిగిస్తుంది. ఆపై మాటలలో నియంత్రణ పోతుంది. ముఖము ఎఱ్ఱబారుతుంది. స్మృతి, ప్రజ్ఞ, విషయ గ్రహణశక్తి క్షీణిస్తాయి. మతిమఱపు కలుగుతుంది. చలన వ్యవస్థపై మందకొడి ప్రభావము వలన కండరముల సమన్వయము ( coordination ) తగ్గుతుంది. నడకలో పట్టు తగ్గి తూలుతుంటారు. మాటలలో తొట్రుపాటు కలుగుతుంది. స్పర్శజ్ఞానము తగ్గుతుంది. రక్తములో మద్యప్రమాణములు యింకా ఎక్కువయినప్పుడు, మతిమఱపు పెరుగుతుంది. ఆపై మైకము, మత్తు పెరుగుతాయి. ఆపై అపస్మారకత కలుగుతుంది. హెచ్చు మోతాదులలో మద్యము సేవించిన వారిలో శ్వాసక్రియ మందగిస్తుంది. మస్కిష్క వ్యాపారము బాగా అణగినపుడు ప్రాణాపాయము కలుగుతుంది.

 దీర్ఘకాల ప్రభావము 


         దీర్ఘకాలము మద్యము సేవించువారిలో పలు నాడులు బలహీనపడుతాయి ( polyneuropathy ). వీరిలో థయమిన్ ( thiamine; vitamin B1 ) లోపించి నేత్ర కండరముల బలహీనత ( opthalmoplegia ), మతిభ్రమణము ( confusion ), అస్థిర గమనము ( ataxia ) కలుగుతాయి. ఈ మూడు లక్షణములు గల వ్యాధి Wernicke encephalopathy గా ప్రాచుర్యము పొందింది. ఈ వ్యాధిగ్రస్థులకు థయమిన్ సమకూర్చి చికిత్స చేయనిచో వారు మృత్యువాత పడే అవకాశములు ఉన్నాయి.

      దీర్ఘకాలము మద్యము వినియోగించేవారిలో మస్తిష్కకణ నష్టము కలిగి వారి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కొత్త విషయములకు మతిమఱపు ( antegrade amnesia ), పాత విషయములకు మతిమఱపు ( retrograde amnesia ), అప్పటి సంగతులకు మతిమఱపు ( amnesia of fixation), గందరగోళము, చూస్తాము. చిన్న మెదడుపై మద్య ప్రభావము వలన వీరి చేతులలో కంపనము, అస్థిర చలనము, తూలిపడుట కలుగుతాయి. కండర సమన్వయము తగ్గుతుంది.

                             మద్యపానము వలన కలుగు మానసిక రుగ్మతలు 


    మద్యపానము వలన మానసిక రుగ్మతలు కూడా కలుగుతాయి. ఆందోళన ( anxiety ), గాభరా, మానసిక క్రుంగు ( depression ), మతిభ్రమ ( psychosis ), స్మృతిభ్రంశము (delirium ) మద్యపానము సలిపే వారిలో తఱచు కలుగుతాయి. మద్యపానము సలిపేవారిలో ఆత్మహత్యల శాతము మిగిలిన వారిలో కంటె ఎక్కువ. మద్యపాన వ్యసనము కలవారిలో మిగిలిన మాదక ద్రవ్యముల వినియోగము కూడా హెచ్చు.

అవయవ లోపములు 


    గర్భిణీ స్త్రీలు మద్యపానము చేస్తే వారి శిశువులకు పుట్టుకతో అవయవ లోపములు కలిగే అవకాశము ఉన్నది. గర్భిణీ స్త్రీలు మద్యము సేవించకూడదు.

                       మద్యపానము వలన కలుగు సామాజిక దుష్ఫలితములు 


    మద్యపానము సలిపి వాహనములు నడిపే వారి వలన వాహన ప్రమాదములు తఱచు జరుగుతాయి. మద్యపానము సలిపే వారి వలన జన సమూహములలో గొడవలు కలుగుతుంటాయి. మద్యపానము సలిపే వారి వలన సమాజములో నేరములు పెరుగుతాయి. వీరు హింసలో పాల్గొనవచ్చును, హింసల బారి పడవచ్చును. మద్యపాన వ్యసనము వలన వివాహములు చెడిపోతాయి.  గృహ హింసలు అధికముగా జరుగుతాయి. వీరి పిల్లల సంరక్షణ దెబ్బతింటుంది. చాలా కుటుంబములు చితికిపోతాయి. వీరు ఉద్యోగ బాధ్యతలను సరిగా నిర్వహింపజాలరు. వీరు ఆర్ధిక యిబ్బందులకు లోనయే అవకాశములు ఎక్కువ. స్త్రీలు మద్యపానమునకు లోనయినప్పుడు వారు హింసకు, మానభంగములకు గుఱి అయే అవకాశములు హెచ్చు.  ఇష్టము లేకుండా గర్భము తాల్చే అవకాశము కలదు.

                  సత్వర మద్య పరిత్యజనము (Acute alcohol withdrawal ) 


    దీర్ఘకాలము మద్యపానము చేయువారు ఒక్క సారిగా మద్యమును మానివేసినపుడు ఆందోళన, గడబిడ, కంపనము,మూర్ఛ ( seizures ), మతిభ్రంశము ( delirium tremens ), వంటి సత్వర పరిత్యజన లక్షణములు ( acute withdrawl symptoms ) పొడచూపే అవకాశము ఉన్నది. ఈ లక్షణములకు సత్వర విషహరణము ( detoxification  ) అవసరము.

    మద్యపానము పరిత్యజించిన మూడు నుంచి ఆరు వారముల వరకు ఆందోళన, క్రుంగు ( depression ) నిద్రలేమి, నీరసము చాలామందిలో కలుగుతాయి. కొంతమందిలో ఆందోళన, క్రుంగుదల పెక్కు నెలలు కొనసాగే అవకాశము ఉన్నది.

    అందు వలన వీరికి మానసిక వైద్యము, కుటుంబసభ్యుల, మిత్రుల సహాయ సహకారములు చాలా అవసరము. మద్యపరిత్యజన వలన కలిగే లక్షణములను ఎదుర్కొనలేక కొందఱు తిరిగి మద్యపానము మొదలు పెడతారు.


వ్యాధినిర్ణయము 


         మద్య వ్యసనము బారిపడినవారు తామంత తాము చికిత్సకు రావచ్చు. కొన్ని సందర్భములలో కుటుంబసభ్యులు వారిని వైద్యుల ఒద్దకు  తీసుకొనిరావచ్చును. మితము మించి మద్యపానము  చేసే వారిని పసిగట్టుటకు వైద్యులు  క్రింది ప్రశ్నలు వేస్తారు.

    (1) మీరు ఎప్పుడైనా మద్యపానము తగ్గించవలసిన అవసరము ఉందని భావించారా ?

    (2) ఎవరైనా మీ మద్యపానపు అలవాటుని విమర్శించి మిమ్ములను ఇబ్బంది పెట్టారా ?

    (3) మీ మద్యపానము గుఱించి ఎప్పుడైనా అపరాధ భావము పొందారా ?

    (4) ఉదయము నిద్ర లేవగానే ఎపుడైనా మద్యమును సేవించారా ?

    ఇవి కాక మరికొన్ని ప్రశ్నలతో చాకచక్యముగా వైద్యులు మద్యపానము ఎక్కువగా చేసే వారిని పసిగట్టగలరు. మద్యపాన వ్యసనము  ఒక వ్యాధి అని తలచి వైద్యులు  వైద్యము సమకూర్చాలి. మద్యపానము సలిపే వారిని అపరాధులుగా తలచకూడదు.

 పరీక్షలు 


    మద్యపాన వ్యసనము కనిపెట్టుటకు ప్రత్యేక పరీక్షలు లేవు. మద్యపానము కలుగజేసే కాలేయ వ్యాధులు, క్లోమ తాపము ( pancreatitis ), మూర్ఛవ్యాధి,  మానసిక స్థితులు, మస్తిష్క వ్యాధులు, తఱచు పడిపోవుట వలన గాయములు మద్యపానమును సూచించవచ్చును.

 రక్తపరీక్షలు 


    మద్యపానము అధికముగా చేసేవారిలో పృథురక్తకణ రక్తహీనత ( macrocytic anemia ) ఉండవచ్చును. రక్తములో  కాలేయ జీవోత్ప్రేరకముల ( Aspartate transaminase, Alanine transaminase, Gamma glutamyl transferase ) పరిమాణములు ఎక్కువగా ఉండవచ్చును. రక్తములో ట్రైగ్లిసరైడులు అధికముగా ఉండవచ్చును. ఇవి అసాధారణముగా ఉన్నపుడు మద్యపానము గుఱించి వైద్యులు ప్రశ్నించి సమాచారము గ్రహించాలి.

 చికిత్స 


    మద్యపానము అధికముగా చేసేవారిలో ఆహార లోపములు ఉండే అవకాశము ఉంది. వారికి థయమిన్ ( విటమిన్ బి -1 ) అందించాలి. ఫోలికామ్లము వంటి మిగిలిన విటమిన్ లోపములను సరిదిద్దాలి. రక్తపరీక్షలలో విద్యుద్వాహక లవణముల లోపములను సరిదిద్దాలి.

    మద్యపాన వ్యసనము మానుటకు మార్గము మద్యపానము పూర్తిగా మానివేసి దాని జోలికి వెళ్ళక పోవుటయే. వ్యసనమునకు లోబడిన వారు పూర్తిగా మానివేయుటకు నిర్ణయము తీసుకోవాలి. స్మృతి ప్రవర్తన చికిత్స ( Cognitive behavioral therapy ) వారికి తోడ్పడుతుంది.

మద్యమునకు లోబడిన వారు

    ( 1 ) నేను  మద్యపానమును మానుట ఈ దినము మొదలుపెడుతాను
    ( 2 ) ఈ దినము నుంచి మద్యపానమును ఇంత మేరకు తగ్గించుకు పోతాను
    ( 3 ) ఈ దినము నుంచి మద్యపానమును పూర్తిగా విరమిస్తాను.
    ( 4 )  ఆ పై ఎన్నడూ మద్యము జోలికి పోను అని నిర్ణయించుకోవాలి.

       వారు వారి మద్యము సేవించు పద్ధతులను, వారిని మద్యపానమునకు ప్రోత్సహించు పరిస్థితులను, అవకాశములను, వారు సేవించే మద్య పరిమాణమును దినచర్య పుస్తకములో వ్రాసుకోవాలి. అట్టి పరిస్థితులు, అవకాశముల నుంచి దూరముగా ఉండాలి. వారికి మద్యపానము విరమించుటలో మానసిక చికిత్సకులు కాని, మానసిక సలహాదారులు కాని, కుటుంబసభ్యులతో పాటు తోడ్పడవలసిన అవసరము ఉంటుంది. మానసిక చికిత్సకులు అందుబాటులో లేనపుడు కుటుంబసభ్యులు కాని, స్నేహితులు కాని ఆ స్థానమును భర్తీ చేయుటకు పూనుకోవాలి. మద్యపాన వ్యసనమునకు లోనయిన వారు చెప్పేది సానుభూతితో వినుట, వారికి తగిన సలహాలను ఇచ్చుట, వారిచేతనే వారి లక్ష్యములను నిర్ణయింపచేయుట, ఆ లక్ష్యములను సాధించుటలో తోడ్పడుట సలహాదారులు బాధ్యతగా తీసుకోవాలి. సలహాదారులు ( counselors ) ప్రతి పర్యాయము పది పదిహైను నిమిషములు వఱకు కాలము వెచ్చిస్తూ ఒక సంవత్సరము  కల్పించుకుంటే సత్ఫలితములు కలుగుతాయి..

 విషహరణము ( Detoxification ) 

                
    ఇది మద్యపాన వ్యసన నివృత్తిలో ముఖ్యమైన భాగము. నిజానికి ఈ ప్రక్రియలో విషపదార్థములు ఏమీ తొలగించబడవు. కాని మస్తిష్కములో రసాయనముల మార్పుల వలన కలిగే హానికర పరిణామములకు పరిష్కరణ చేకూర్చబడుతుంది.

    మద్యము మెదడులో ఉండే GABA-A ( Gamma Amino Butyric Acid - A receptors ) గ్రాహకములను ఉత్తేజపఱుస్తుంది . ఈ గ్రాహకములు ( receptors ) మెదడు వ్యాపారమును మందకొడి పరుస్తాయి. మద్యము వాడుతు ఉంటే  మద్యమునకు GABA-A గ్రాహకమముల స్పందన తగ్గుతుంది. అందువలన త్రాగేవారు ఉల్లాసానికి, మత్తుకు సారాయి ప్రమాణములను పెంచుకుపోతుంటారు. ఒక్కసారి వారు మద్యపానము మానివేసినపుడు మెదడుపై GABA - A గ్రాహకముల మందకొడి ప్రభావము తగ్గి డోపమిన్ ( Dopamine ), గ్లుటమేట్ ( Glutamate ), ఎన్ మిథైల్- డి - ఏస్పర్టిక్ ఏసిడ్ ( N- Methyl- D- Aspartic acid NMDA ) వంటి మస్తిష్కమును ఉత్తేజపఱచే నాడీరసాయనముల ( neurotransmitters ) ప్రభావము పెరిగి గాభరా, ఆందోళన ( anxiety ), శరీరకంపనము ( tremors  ), మూర్ఛ ( seizures ), మతిభ్రమలు ( hallucinations ), మతిభ్రంశము ( delirium ) కలుగుతాయి.

    మద్యము పరిత్యజించిన లక్షణములు సాధారణముగా మద్యము వీడిన 6 నుంచి 24 గంటలలో మొదలవుతాయి. తీవ్రస్థాయి మతిభ్రంశ కంపనము ( Delirium tremens ) మద్యమును విడనాడిన రెండు మూడు దినములలో పొడచూపుతుంది.

    ఈ మద్యము పరిత్యజించిన లక్షణములకు ( alcohol withdrawal symptoms  ) సమర్థవంతముగా చికిత్స చెయ్యాలి. మద్య వర్జన చికిత్సకు డయజిపామ్ ( Diazepam ), క్లోర్ డయజిపాక్సైడు ( Chlordiazepoxide ), లొరజిపామ్ ( Lorazepam ), ఆక్సజిపామ్ ( Oxazepam ) వంటి బెంజోడయజిపిన్స్ ( Benzodiazepines ) మగతనిద్ర కలిగించుటకు కావలసిన మోతాదులలో మొదలుపెట్టి  దినదినము మోతాదులను తగ్గించుకుపోతారు. హృదయవేగము, రక్తపీడనములు పెరిగిన వారిలో బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక అవరోధకములను ( Beta adrenergic receptor blockers ), క్లోనిడిన్ ( clonidine ) లను తక్కువ మోతాదులలో  వాడవచ్చును. కాని వీటిని వాడిన వారిలో  మతిభ్రంశము ( delirium  ) కలిగే అవకాశము ఎక్కువ. అలజడిని ( agitation ) అరికట్టుటకు హేలోపెరిడాల్ ( Haloperidol ) వాడవచ్చును. కాని హేలోపెరిడాల్ వాడిన వారిలో మూర్ఛ ( seizures  ) కలిగే అవకాశములు హెచ్చు.

    మూర్ఛలు ఇదివరలో కలిగిన వారికి మద్యపాన విసర్జన తదనంతరము  మూర్ఛలు, ఇతర లక్షణములు పొడచూపక మునుపే  దీర్ఘకాలము పనిచేసే బెంజోడయజిపిన్స్ ( benzodiazepines ) మొదలుపెట్టాలి.

    మద్యపానము మఱల మొదలపెట్టకుండా ఉండుటకు బహుళ శిక్షణ ప్రక్రియలు ( multidisciplinary actions ) అవసరము. వీరికి స్మృతివర్తన చికిత్సలు ( cognitive behavioral therapy ) మొదలుపెట్టాలి. త్రాగుట అధిగమించు నైపుణ్యములు అలవరచాలి. మద్యపానము విసర్జించాక కలిగే ఆందోళన, క్రుంగుదలలకు తగిన చికిత్స చెయ్యాలి.


మద్యపానమును అరికట్టు ఔషధములు 


         

నల్ ట్రెక్సోన్ ( Naltrexone )   


    మద్యపాన వ్యసన నివృత్తికి ఉపయోగకరమైన ఔషధము. ఇది ఓపియాయిడ్ గ్రాహక అవరోధకము ( opioid receptor antagonist ). ఈ ఔషధము మద్యముపై ఆసక్తిని తగ్గిస్తుంది. కాలేయ తాపము ఉన్నవారిలోను, నల్లమందు సంబంధిత మందులు తీసుకొనేవారిలోను నల్ ట్రెక్సోన్ వాడకూడదు.

ఎకాంప్రొసేట్ ( Acomprosate ) 


    మద్యపానము విడనాడిన తర్వాత కలుగు పరిణామములను అరికట్టుటకు, మద్యపానమును తగ్గించుటకు, అరికట్టుటకు యీ ఔషధము ఉపయోగపడుతుంది. ఎకాంప్రొసేట్  మద్యపానము విరమించుకున్నవారిలో గ్లుటమేట్ (glutamate) ప్రభావమును అణగతొగ్గుతుంది. మూత్రాంగ వ్యాధిగ్రస్థులు ఎకాంప్రొసేట్ వాడకూడదు.

డైసల్ఫిరామ్ ( Disulfiram ) 


    మద్యపానమును అరికట్టుటకు ఏంటబ్యూజ్ గా ( Antabuse ) ప్రసిద్ధికెక్కిన డైసల్ఫిరామ్ మరి ఒక ఔషధము. మద్యము ( ఇథైల్ ఆల్కహాలు, CH3-CH2-OH ) కాలేయములో జీవవ్యాపార క్రియచే విచ్ఛిన్నము అవుతుంది. ప్రప్రథమముగా ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్  ( Alcohol dehydrogenase ) అనే జీవోత్ప్రేరకము ( enzyme ) వలన ఎసిటాల్డిహైడ్ గా ( acetaldehyde ; CH3-CH-O ) మారుతుంది. ఎసిటాల్డిహైడ్, ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ ( Aldehyde dehydrogenase ) అనే జీవోత్ప్రేరకము వలన  ఎసిటేట్ గా ( CH3-COO ) మారి ఆపై  బొగ్గుపులుసు వాయువు ( CO2 ), నీరుగా విచ్ఛిన్నము అవుతుంది.

    డైసల్ఫిరామ్ ( Disulfiram  ) ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ ని అణచి ఎసిటాల్డిహైడ్ విచ్ఛిన్నమును మందగింపజేస్తుంది. అందుచే డైసల్ఫిరామ్ తీసుకొని మద్యపానము చేసేవారిలో ఎసిటాల్డిహైడు కూడుకొని,  శరీరము ఎఱ్ఱబారుట ( flushing ), తలనొప్పి, వాంతులు కలుగుతాయి. డైసల్ఫిరామ్ తీసుకొనేవారు  మద్యము త్రాగుటకు ఇచ్చగింపరు. డైసల్ఫిరామ్ మరిఒకరు పర్యవేక్షిస్తూ ఇవ్వాలి. డైసల్ఫిరామ్ కాలేయములో విచ్ఛిన్నమవుతుంది. కాలేయ వ్యాధులు కలవారు ఈ ఔషధము, ఇతర ఔషధముల వాడుకలోను జాగ్రత్త వహించాలి. డైసల్ఫిరామ్ వాడేవారు ఆల్కహాలు ఉండే పుక్కిలింత ద్రవములు, జలుబు మందులు వాడకూడదు.

    కాల్సియమ్ కార్బిమైడ్ ( Calcium Carbimide ) కూడా డైసల్ఫిరామ్ వలె పనిచేస్తుంది .

    వైద్యులు, మానసికవైద్యులు, మానసిక సలహాదారులే కాక, సమాజములలో స్వయం సహాయక సమూహములు, స్వచ్ఛంద సంస్థలు మద్యము వాడుకను మాన్పించుటకు కృషి చేస్తున్నాయి. భారతదేశములో ఇట్టి స్వచ్ఛంద సంస్థల అవసరము చాలా ఉన్నది.

    మద్యము మొదలుపెట్టాక అది వ్యసనముగా పరిణమించే అవకాశము ఉన్నది. కావున మద్యపు జోలికి పోకుండుట మేలు.


( వైద్యసంబంధ విషయములను తెలుగులో నా శక్తిమేరకు వ్రాయడము నా వ్యాసముల లక్ష్యము. ఉపయుక్తము అనుకుంటే నా వ్యాసములను నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. వ్యాధిగ్రస్థులు వారి వారి వైద్యులను సంప్రదించాలి. )


   పదజాలము :

Yeast = మధుశిలీంధ్రము
Distillation = బట్టీపట్టుట
Alcoholic Steatosis = సుర కాలేయ వసవ్యాధి ( గ.న )
Fatty acids = వసామ్లములు
Alcoholic hepatitis = సుర కాలేయతాపము ( గ.న )
Cirrhosis of liver = నారంగ కాలేయవ్యాధి ( గ.న )
Fibrosis = తంతీకరణము
Ascites =  జలోదరము
Gastritis = జఠరతాపము , జీర్ణాశయతాపము (గ.న )
Peptic ulcer = జీర్ణవ్రణము ( గ.న )
Pancreatitis = క్లోమతాపము
Atherosclerosis =  ధమనీకాఠిన్యత
Coronary arteries = హృద్ధమనులు
Ataxia = అస్థిరగమనము
Mental Depression =   మానసిక క్రుంగుదల 
Delirium = స్మృతిభ్రంశము
Alcohol withdrawal = మద్యపరిత్యజనము ; మద్యవర్జనము ( గ.న )
Detoxification = విషహరణము 
Cognitive behavioral therapy = స్మృతిప్రవర్తన చికిత్స ( గ.న )
Enzyme = జీవోత్ప్రేరకము ( గ.న )

20, జూన్ 2020, శనివారం

అంటురోగముల నివారణ ( Controlling contagious diseases )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )


                          అంటు రోగముల నివారణ

                 (Controlling contagious diseases )

                                                                                   
                                         డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.

 

                                                  ఆ.వె. అంటుకొనుట మాని యంటించి చేజోడి
                                                            నైదుపదిగఁ జేసి యాదరమ్ము
                                                            సేయుటదియు కరము క్షేమంబు సర్వత్ర
                                                            అందుచేతఁ గొనుడు వందనమ్ము !

                                                                                      🙏🏻

                                            ( ఐదుపదిగఁ జేయు =  నమస్కరించు ; ఆదరము = మన్నన )


         
    మనుజుల నుంచి మనుజులకు చాలా వ్యాధులు వ్యాపిస్తుంటాయి. వీటిని అంటురోగములుగా పరిగణిస్తారు. కొన్ని అంటురోగములు జంతువులు, పక్షుల నుంచి మనుజులకు సంక్రమిస్తాయి. వీటిని జంతు జనిత వ్యాధులుగా ( Zoonosis ) పరిగణిస్తారు. ఈ వ్యాధులను సూక్ష్మజీవులు ( bacteria ), కాని, విషజీవాంశములు ( viruses ) కాని, పరాన్నభుక్తులు ( parasites ) కాని, శిలీంధ్రములు ( fungi )  కాని కలిగిస్తాయి.

  సూక్ష్మజీవులు ( bacteria ) 


     సూక్ష్మజీవులు ఏకకణ జీవులు. వీటికి కణ కవచము ( cell wall ), కణ వేష్టనము ( cell membrane ) ఉన్నా, పొరలలో అమరిన న్యూక్లియస్లు, మైటోఖాండ్రియాలు ఉండవు. సూక్ష్మజీవులను గ్రామ్స్ వర్ణకము ( Gram’s stain ) చేర్చి   సూక్ష్మదర్శిని క్రింద చూసి అవి గ్రహించు వర్ణకముల బట్టి గ్రామ్ పోజిటివ్, గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులుగా విభజిస్తారు. గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు ఊదా రంగులో ఉంటాయి. గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులు గులాబి రంగులో ఉంటాయి. ఆకారమును బట్టి వీనిని గోళములు ( cocci ), కోలలు ( rods ), సర్పిలములుగా ( spirals ) వర్ణిస్తారు. చాలా సూక్ష్మాంగ జీవులు మన శరీరము పైన, శరీరము లోపల హాని కలిగించకుండా జీవిస్తున్నా, కొన్ని  అవకాశము చిక్కినపుడు శరీర అవయవములు, కణజాలముల లోనికి చొచ్చుకొని వ్యాధులు కలిగిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు కలుషిత ఆహారము, కలుషిత పానీయములు, లేక కలుషిత వాయయువు ద్వారా శరీరములోనికి చొచ్చుకొని వ్యాధులకు కారణమవుతాయి. మనుజుల నుంచి మనుజులకు కూడా సూక్ష్మజీవులు వ్యాపించగలవు.

విషజీవాంశములు ( Viruses ) 


    విషజీవాంశములు ( viruses  ) జీవ కణములలో వృద్ధి చెంది విసర్జింపబడే జన్యు పదార్థములు. ఇవి రైబోన్యూక్లియక్ ఆమ్లమును ( Ribo Nucleic Acid )  కాని డీఆక్సీరైబో న్యూక్లియక్ ఆమ్లమును
( Deoxyribo Nucleic Acid ) కాని కలిగి ఉంటాయి. బయట మాంసకృత్తు ఆచ్ఛాదనను ( capsid) కలిగి ఉంటాయి. కొన్ని కొవ్వు ఆచ్ఛాదనను కలిగి ఉంటాయి. వీటికి జీవము లేకపోయినా యితర జీవకణముల లోనికి చేరినపుడు ఆ కణములలో వృద్ధి పొందుతాయి. జీవులలో ఇవి వ్యాధులను కలుగజేయగలవు. ఈ విషజీవాంశములకు యితర జీవవ్యాపార క్రియలు ఉండవు.

పరాన్నభుక్తులు ( Parasites ) 


    ఇవి ఇతర జీవులలో జీవించే జీవులు. ఇవి ఏకకణ జీవులు ( ఉదా : మలేరియా పరాన్నభుక్తు )
 కాని, బహుకణ జీవులు కాని కావచ్చును. ఇవి వాటి జీవనమునకు, వృద్ధికి ఇతర జీవులపై ఆధారపడుతాయి. పేలు, నల్లులు వంటి పరాన్నభుక్తులు శరీరము బయట ఉన్నా మనుజుల నుండి మనుజులకు వ్యాపించగలవు. గజ్జి క్రిములు ( Sarcoptes scabiei ) కూడా మనుజులు ఒకరికొకరు సన్నిహితముగా ఉండుట వలన వ్యాపిస్తాయి.

 శిలీంధ్రములు ( fungi )

        
    ఇవి  వృక్షజాతులకు జంతుజాలమునకు విభిన్నమైన జీవరాశులు. ఆహారమునకు ఇతర జీవులపై ఆధారపడుతాయి. వీని కణ కవచములు ఖైటిన్ అను బహుళ శర్కరను కలిగి ఉంటాయి. ఇవి మృతకణములపై జీవిస్తాయి.

    అంటురోగములను కలిగించే వ్యాధి జనకములు ( pathogens  ) వ్యాధిగ్రస్థుల నుంచి ఇతరులకు ప్రాకి వారికి కూడా వ్యాధులను కలిగిస్తాయి. ఇప్పుడు ‘ కోవిడ్ 19 ‘ చైనాలో హుయాన్ నగరములో పొడచూపి ప్రపంచము అంతటా అనతి కాలములో బహుళముగా వ్యాప్తి చెందుట చూస్తే, వ్యాధుల వ్యాప్తిని అరికట్టుటలో మన జాగ్రత్తలు చాలవు అనియు, ఆ జాగ్రత్తలు లోప భూయిష్ఠములు అనియు  తెలుస్తుంది.

    వైద్యులు, వైద్య రంగములో పనిచేయు సిబ్బంది  అంటువ్యాధుల బారి పడుతూనే ఉంటారు. వీరి నుంచి ఆ వ్యాధులు ఇతర రోగులకు కూడా వ్యాప్తి చెందగలవు. అందువలన ఆ రోగముల వ్యాప్తిని అరికట్టుటకు తీసుకోవలసిన జాగ్రత్తలను చర్చిస్తాను.

ప్రత్యేక జాగ్రత్తలు 


దూరము 


    మనుజుల మధ్య సాధారణ పరిస్థితులలో కూడా కొంచెమైనా దూరము పాటించుట మేలు. జలుబు, వ్యాపకజ్వరము ( Influenza ), కోవిడ్ 19 వంటి వ్యాధులను కలిగించు విషజీవాంశములు ( viruses  ) గల తుంపరులు ( droplets ) 5 మైక్రోమీటరులను మించిన పరిమాణములో ఉంటాయి. ఇవి తుమ్ము, దగ్గు, మాటల తుంపరుల ద్వారా గాలిలో కొద్ది సేపు ఉండి పిదప క్రిందకు భూతలము పైన, వస్తువుల ఉపరితలముల పైన ఒరిగి పోతాయి. అందువలన ఇవి 3 నుంచి ఆరడుగుల దూరము లోపల ఉన్న యితరులకు తుంపరల ద్వారా వ్యాప్తి చెందగలవు. వ్యాధిగ్రస్థుల నుంచి 6 అడుగుల దూరము పాటించుట వలన,

    వస్తువులను తాకిన చేతులను సబ్బు నీళ్ళతో కాని ఆల్కహాలు గల శుద్ధి పదార్థములతో ( sanitizers ) కాని శుభ్రము చేసుకొనుట వలన, సబ్బునీళ్ళు లేక ఆల్కహాలు గల శుద్ధి పదార్థములతో శుద్ధి చేసుకొనని చేతులను ముఖముపై చేర్చక పోవుట వలన ఈ వ్యాధులను నివారించవచ్చును.

    వ్యాధిగ్రస్థులు, తుమ్ములు, దగ్గులు కలవారు నోటికి, ముక్కుకి, ఆచ్ఛాదనములు ( కప్పులు masks ) ధరించాలి.
  
     వైద్యశాలలలో వీరిని ఒంటరి గదులలో ఉంచాలి. ఈ రోగులకు సేవలు అందించు వైద్యులు, వైద్య సిబ్బంది గాలిని 95% వడకట్టు N-95 ఆచ్ఛాదనములను ( N-95% masks ) ధరించాలి.

    కళ్ళకు రక్షక కంటద్దములను ( safety goggles ) ధరించాలి.  చేతులకు చేదొడుగులు ( gloves ) ధరించాలి దుస్తులపై శస్త్రచికిత్సకుల నిలువుటంగీలను ( surgical gowns ) ధరించాలి.

    వ్యాధిగ్రస్థులకు సేవలు అందించి వారి గదుల నుంచి బయటకు వచ్చాక వాటిని  జాగ్రత్తగా తొలగించుకోవాలి. చేదొడుగులు ధరించినా చేతులను సబ్బు నీళ్ళతో శుభ్రము చేసుకోవాలి. పాదరక్షలను కూడా రోగజనక విధ్వంసకములతో ( disinfectants ) శుభ్రము చేసుకోవాలి.

    కొన్ని సూక్ష్మజీవులు, విషజీవాంశముల పరిమాణము 5 మైక్రోమీటర్లు కంటె తక్కువ ఉండుట వలన అవి గాలిలో చాలా గంటల సేపు తేలియాడుతు ఉండగలవు. వేపపువ్వు / తట్టు ( measles ), ఆటాలమ్మ ( chickenpox ) వ్యాధులు కలిగించే విషజీవాంశములు ఈ కోవకు చెందినవి. గాలి ద్వారా ఈ వ్యాధులు వ్యాపించగలవు. వ్యాధి నిరోధక శక్తి లోపించిన వారు, శరీర రక్షణ వ్యవస్థ లోపములు కలవారు, గర్భిణీ స్త్రీలు ఈ రోగుల పరిసరములలో చొరకూడదు. వైద్యశాలలలో ఉన్న ఈ రోగులను ఋణ వాయుపీడనము కల ( negative air pressure ) ప్రత్యేకపు ఒంటరి గదులలో ఉంచాలి. వీరిని సందర్శించువారు నోరు, ముక్కులను కప్పే  N- 95 ఆచ్ఛాదనములను ( masks కప్పులు ) ధరించాలి.

    వ్యాధిగ్రస్థులు వారి గదుల నుంచి బయటకు రావలసిన అవసరము కలిగితే వారు శస్త్రచికిత్సకుల
ఆచ్ఛాదనములను ( surgical masks  ) ధరించాలి.

సాధారణ జాగ్రత్తలు 


    వైద్యులు, వైద్యసిబ్బంది రోగులను పరీక్షించే ముందు, పరీక్షించిన పిదప చేతులను శుద్ధి పదార్థములతో ( sanitizers ) రోగికి, రోగికి మధ్య  శుభ్రము చేసుకోవాలి. వైద్యులు, నర్సులు వారు వాడే వినికిడి గొట్టాలను ( stethoscopes ) కూడా ఆల్కహాలుతో శుభ్రము చేసుకొనుట మేలు.

    Clostridium difficile వ్యాధిగ్రస్థులను పరీక్షించాక చేతులను సబ్బు, నీళ్ళతోనే శుభ్రము చేసుకోవాలి. ఈ సూక్ష్మజీవులు పెద్దప్రేవులలో తాపము కలిగించి అతిసారమును కలిగిస్తాయి. వీటి బీజములు ( spores ) ఆల్కహాలు వలన నశింపవు.

    రోగి శరీర ద్రవములు ( రక్తము, చీము, లాలాజలము, శ్లేష్మము వగైరా ) అంటుకొనే అవకాశములు ఉన్నపుడు చేతొడుగులను ( gloves ) తప్పక ధరించాలి. శరీర ద్రవములు  ( body fluids ) దుస్తులపై చిమ్మే అవకాశము ఉన్నపుడు దుస్తుల పైన నిలువుటంగీలను ( gowns ) ధరించాలి.  రోగి శరీర ద్రవములు కళ్ళలో చిందే అవకాశము ఉన్నపుడు కళ్ళ రక్షణకు అద్దాలను ( safety goggles ) కాని పారదర్శక కవచములను ( transparent shields ) కాని ధరించాలి.

    రోగులపై శస్త్రచికిత్సలు, శరీరము లోనికి సూదులు, ఇతర పరికరములు చొప్పించే  పరీక్షలు, ప్రక్రియలు ( invasive procedures ) సలిపేటప్పుడు కూడా వ్యాధిజనక రహిత ( sterile ) నిలువుటంగీలు, చేదొడుగులు, నోటి - ముక్కు కప్పులు ధరించాలి .

    రోగులపై వాడిన సూదులు, పరికరములు, వారి దెబ్బలకు, పుళ్ళకు కట్టిన కట్టులు, వాడిన చేదొడుగులు నిలువుటంగీలను సక్రమముగా ఇతరులకు హాని కలుగకుండా విసర్జించాలి. తిరిగి వాడే పరికరములను వ్యాధిజనక రహితములుగా ( sterilize ) చెయ్యాలి .

ఏకాంత వాసము ( isolation ) 


    సులభముగా ఇతరులకు సంక్రమించు అంటురోగములు కలవారిని, ప్రమాదకరమైన అంటురోగములు కలవారిని ఏకాంత వాసములో ( isolation ) ఉంచాలి. వీరిని సందర్శించువారు నిలువుటంగీలు, నోటి - ముక్కు కప్పులు, చేదొడుగులు ధరించి వారి గదుల నుంచి బయటకు వచ్చాక వాటిని జాగ్రత్తగా విసర్జించాలి. ఆపై చేతులను సబ్బు నీళ్ళతో కడుగుకొనాలి. ఆ రోగులకు వాడే  ఉష్ణ మాపకములు ( thermometers ), వినికిడి గొట్టములు ( stethoscopes ) ప్రత్యేకముగా వారికొఱకు ఉంచాలి. అట్టి రోగులను వారి గదుల నుంచి వివిధ పరీక్షలకు తీసుకువెళ్ళేటప్పుడు వారికి నిలువుటంగీలు, నోటి - ముక్కులకు ఆచ్ఛాదనలు ( masks ) తొడగాలి.

శ్వాసపథ రక్షణ ( Airway protection ) 


    శరీరమును ఆక్రమించే చాలా వ్యాధి జనకములు శ్వాస పథము ద్వారా ప్రవేశిస్తాయి. దగ్గులు, తుమ్ములు, మాటల వలన తుంపరుల రూపములో కాని, నిశ్వాస క్రియలో వాయు వాహనులుగా ( airborne ) గాని వ్యాధి జనకములు వెదజల్లబడి ఇతరుల శ్వాస పథము లోనికి  గాలి పీల్చునపుడు ప్రవేశించగలవు.

    అందువలన అంటురోగములు ( జలుబు, ఇన్ఫ్లుయెంజా, ఆటాలమ్మ ( chickenpox ) వంటి మనము చిన్న వ్యాధులుగా పరిగణించే వ్యాధులైనా సరే ) కలవారు నోటి - ముక్కు కప్పులను ధరించాలి. ఈ చిన్న వ్యాధులు ఆపై నాసికా కుహరములలో తాపము ( sinusitis ), పుపుస నాళములలో తాపము ( bronchitis ), ఊపిరితిత్తులలో తాపములకు ( pneumonias ) దారితీయవచ్చును.

    వైద్యశాలలలో వైద్యులు, ఇతరసిబ్బంది, రోగులను సందర్శించువారు నోటి ముక్కు కప్పులు ధరించుట మేలు.  

    విమానములు, ఎ.సి కారులు, ఎ.సి రైళ్ళలో ప్రయాణించునపుడు మూసి ఉంచిన స్థలములలో చాలా మంది కలసి, చాలా సమయము గడిపి, చాలా దూరము ప్రయాణిస్తారు. అందువలన ఈ ప్రయాణీకులకు నోటి ముక్కు కప్పుల ధారణ తప్పనిసరి చేసి, ప్రయాణ సాధనములను వ్యాధి జనక విధ్వంసకములతో ( disinfectants ) శుభ్రము చేయుట వలన అనేక శ్వాసపథ వ్యాధులను నివారించగలము. దూర ప్రయాణీకులు ప్రయాణముల తర్వాత వ్యాధిగ్రస్థులు అగుట వైద్యులు చాలా సారులు గమనిస్తారు.

కరచాలనములు 


      కరచాలనముల వలన చాలా అంటురోగములు వ్యాప్తి చెందుతాయి. ఆరోగ్య రంగములో పనిచేసేవారు కరచాలనములు చేయకూడదు. ఇతరులు కూడా కరచాలనముల అలవాటును వదల్చుకోవాలి. పరులతో ఒకరినొకరు తాకకుండా ఆదరాభిమానములు చూపించుకొనుట ఉత్తమము.

ఎంగిలి 


    ఆహార పానీయములు సేవించే టప్పుడు ఎవరి పాత్రలు వారికే ఉండాలి. ఒకరు వాడే పలుదోము కుంచెలు క్షుర కత్తెరలు, దువ్వెనలు,  తువ్వాళ్ళు వేరొకరు వాడకూడదు.

ఆహార పానీయముల శౌచ్యము 

   
    జీర్ణాశయము, ప్రేవులలో సూక్ష్మజీవులు కలిగించే కలరా, టైఫాయిడ్, అతిసారము, వంటి అంటురోగములను సమాజములో ప్రజలు అందఱికీ పరిశుద్ధమైన మరుగు దొడ్లను అందుబాటులో చేసి మలమును వ్యాధిజనక రహితముగా మలచుట వలన, నిర్మూలించే అవకాశము కలదు. పశ్చిమ దేశాలలో వాడే మరుగుదొడ్ల తొట్టెలను శుభ్రముగా ఉంచుట తేలిక.

    మనము తినే ఆహారపదార్థాలు, త్రాగే పానీయములు శుచిగా ఉండాలి. ఆహార పదార్థాలపై ఈగలు, క్రిములు చేరకుండా జాగ్రత్తపడాలి.

    అంటురోగములను నివారించుటకు, చికిత్స చేయుటకు చాలా రసాయన పదార్థములను వాడుతాము. ఇవి :

   రోగజనక విధ్వంసకములు ( disinfectants )


    ఇవి  వస్తువులపై ఉన్న   సూక్ష్మజీవులను ( bacteria ), శిలీంధ్రములను ( fungi ), విషజీవాంశములను ( viruses ) ధ్వంసము చేసే రసాయన పదార్థములు. వీటిలో కొన్ని మృదు పదార్థములను ( alcohol, hydrogen peroxide, dettol, betadine ) చేతులు , చర్మమును శుభ్రము చేసుకొందుకు వాడినా, వ్రణముల పైన వాడకూడదు, దేహము లోపలకు  తీసుకో కూడదు. ఇవి ఔషధములు కాదు. వీటిని ఇంటి అరుగులు, వస్తువుల ఉపతలములు, పరికరములను శుద్ధి చేయుటకు వాడుతారు.

 సూక్ష్మజీవ సంహారక రసాయనములు ( Antiseptics )


        ఇవి చర్మమునకు, దెబ్బలకు, పుళ్ళకు పూయబడే సూక్ష్మజీవ సంహారక రసాయన పదార్థములు. వీటిని శరీరము లోనికి తీసుకోకూడదు .

 సూక్ష్మజీవ నాశకములు ( Antibiotics ) 


    ఇవి శరీరములోనికి నోటి ద్వారా, కండరముల ద్వారా, సిరల ద్వారా తీసుకొనే సూక్ష్మజీవులను నశింపచేయు  ఔషధములు.

విషజీవాంశ నాశకములు 


    విషజీవాంశ నాశకములు ( Antivirals ) : ఇవి   విషజీవాంశముల ( viruses )  వృద్ధిని అరికట్టు ఔషధములు. వీటిని చర్మము పైన కాని, శరీరము లోపలకు కాని వాడుతారు.
    చాలా సమాజములలో వారి వారి సంస్కృతులు, అలవాటులు తరతరాలుగా జీర్ణించుకొని ఉంటాయి. ఏ సంస్కృతి పరిపూర్ణము, దోషరహితము కాదు. సకల సంస్కృతులను గౌరవిస్తూనే ఆరోగ్యానికి భంగకరమైన అలవాటులను మనము విసర్జించాలి. వైద్యులు, శాస్త్రజ్ఞులు, విద్వాంసులు అందులకు కృషి చెయ్యాలి.
                                        
                                                                                                                                                                                                         

పదజాలము :

 Zoonosis = జంతు జనిత వ్యాధులు ( గ.న ) ; జంతువుల నుంచి సంక్రమించు వ్యాధులు
Antibiotics = సూక్ష్మజీవ నాశకములు  ( గ.న )
Aiirborne = వాయు వాహనులు ( గ.న )
Antiseptics =   సూక్ష్మజీవ సంహారకములు ( గ.న )
Antivirals  =  విషజీవాంశ నాశకములు ( గ.న )
Cell membrane = కణ వేష్టనము
Disinfectants =  రోగజనక విధ్వంసకములు ( గ.న ) 
Fungi = శిలీంధ్రములు
Gloves = చేదొడుగులు
Influenza = వ్యాపక జ్వరము
invasive procedures = ఆక్రమణ ప్రక్రియలు ( గ.న )
Masks = కప్పులు ; ఆచ్ఛాదనములు 
Parasites = పరాన్నభుక్తులు 
Pathogens= వ్యాధి జనకములు 
Sanitizer = శుద్ధి పదార్థములు
Sinusitis = నాసికా కుహర తాపము ( గ.న )
Sterile = వ్యాధి జనక రహితము ( గ.న )
Surgical gowns = నిలువుటంగీలు
Viruses  = విషజీవాంశములు ( గ.న )

17, మే 2020, ఆదివారం

దీర్ఘకాల మూత్రాంగవ్యాధి ( Chronic Kidney Disease )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో  )

                                 దీర్ఘకాల మూత్రాంగవ్యాధి

                                ( Chronic Kidney disease )


                                              డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.  


    శరీరములో వివిధ అవయవముల కణజాలములలో జరిగే జీవవ్యాపార ప్రక్రియ వలన ( metabolism ) వ్యర్థ పదార్ధములు ఉత్పత్తి అయి రక్తములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థ పదార్థములను రక్తమునుంచి ఎప్పటి కప్పుడు తొలగించి రక్తమును శుద్ధిచేసి శరీరావయవములను పరిరక్షించి శరీర వ్యాపారమును ఆరోగ్యకరముగా నడిపించుట చాలా అవసరము. జంతుజాలములోను, పక్షులలోను ఆ బాధ్యత   మూత్రాంగములు ( Kidneys ) నిర్వహిస్తాయి.

    వివిధ వ్యాధుల వలన మూత్రాంగముల నిర్మాణములో మార్పులు కలిగి వ్యాపారము నెలలు, సంవత్సరాలలో మందగిస్తే దానిని దీర్ఘకాల మూత్రాంగవ్యాధి ( Chronic Kidney Disease  CKD  ) లేక దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యముగా ( Chronic renal failure ) పరిగణిస్తారు.


దీర్ఘకాల మూత్రాంగ వ్యాధికి కారణములు 


    దీర్ఘకాల మూత్రాంగ వ్యాధి ( వైఫల్యము ) ఎక్కువ శాతము మందిలో శరీరపు ఇతర రుగ్మతల వలన కలుగుతుంది. అధిక రక్తపీడనము ( hypertension  ), మధుమేహవ్యాధి ( diabetes mellites ), స్వయంప్రహరణ వ్యాధులు ( autoimmune diseases  ex ; Systemic Lupus Erythematosus ) కలవారిలో దీర్ఘకాల మూత్రాంగ వ్యాధి పొడచూపవచ్చును. వయోజనులలో అధిక రక్తపుపోటు కలవారిలో 20 శాతము మందిలోను  మధుమేహ వ్యాధి కలవారిలో 30 శాతము మందిలోను దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము కనిపిస్తుంది.

    మూత్రాంగములలో కలిగే వ్యాధులు మూత్రాంగ వైఫల్యమునకు దారితీయగలవు. మూత్ర ముకుళములలో ( renal corpuscles  ) కేశనాళికా గుచ్ఛ వ్యాధులు ( glomerular diseases ; IgA nephropathy, membranoproliferative glomerulonephritis, nephrotic syndrome, post infectious glomerulonephritis ) దీర్ఘకాల మూత్రాంగ వ్యాధి ( chronic kidney disease  ) కలుగజేయగలవు.

    జన్యుపరముగా వచ్చే బహుళ బుద్బుద మూత్రాంగవ్యాధి ( polycystic kidney disease ) మూత్రాంగ వైఫల్యమునకు దారితీయవచ్చును.

    కొంతమందిలో తెలియని కారణాల ( idiopathic ) వలన మూత్రాంగ వైఫల్యము కలుగుతుంది.

దీర్ఘకాల మూత్రాంగ వ్యాధి దశలు 


    మూత్ర ముకుళములలోని కేశనాళికా గుచ్ఛముల  వడపోత ద్రవప్రమాణము ( Glomerular filtration rate - GFR ) బట్టి దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిని 5 దశలుగా విభజిస్తారు.

రక్తములో క్రియటినిన్ విలువలు స్థిరముగా ఉన్నపుడు GFR ను క్రింద సూత్రముతో  అంచనా చేస్తారు.

కేశనాళికా గుచ్ఛముల వడపోత ద్రవప్రమాణము ( GFR ) ml / minute / 1.73 m2 =

( 140 - వయస్సు ) x (కిలోలలో ఉండవలసిన బరువు  ) / (72 x రక్తద్రవములో క్రియటినిన్ ప్రమాణము మి.గ్రా / డె.లీ ) x ( 0.85 స్త్రీలలో  )


    వడపోత ద్రవప్రమాణము ( GFR ) బట్టి వ్యాధిని ఐదు దశలుగా విభజిస్తారు.

    మొదటి దశలో వడపోత ద్రవప్రమాణము ( GFR ) 90 మించి ఉంటుంది.  
    రెండవ దశలో  GFR 60 - 89, మూడవ దశలో 30 - 59, నాల్గవ దశలో 15 - 29, ఐదవ దశలో 15 కంటె తక్కువ ఉంటుంది

    మొదటి రెండు దశల మూత్రాంగ వ్యాధిలో కేశనాళికా గుచ్ఛముల వడపోత ప్రమాణములు సామాన్య పరిమితులలో ఉన్నా మూత్రములో మాంసకృత్తులు ( Proteinuria & albuminuria ), మూత్రములో రక్తము ( hematuria ) మూత్రాంగ నిర్మాణ, వ్యాపారములలో మార్పులను సూచిస్తాయి. మూత్రములో ఆల్బుమిన్ ప్రమాణముల బట్టి కూడా వ్యాధి తీవ్రతను గుర్తిస్తారు.

వ్యాధి లక్షణములు 


    మూత్రాంగ వ్యాధి లక్షణములు మూత్రాంగ వ్యాపారము బాగా క్షీణించే వఱకు ( నాలు గైదు దశల వఱకు ) వ్యాధిగ్రస్థులకు కనిపించవు.

     కాని దీర్ఘకాల మూత్రాంగ వ్యాధి మూడవ దశలో ఉన్నపుడు అధిక రక్తపుపోటు ( hypertension ), పాండురోగము ( anaemia ), ఖనిజలవణముల సంబంధిత ఎముకల వ్యాధులు ( mineral bone disorders - Renal osteodystrophy, Secondary hyperparathyroidism  ) పొడచూపవచ్చును. అవి పొడచూపినపుడు పరీక్షలతో మూత్రాంగ వ్యాధికి శోధించాలి.

    వ్యాధి నాలుగు, ఐదు దశలలో ఉన్నపుడు రక్తములో యూరియా విలువలు పెరుగుట వలన నీరసము, ఆకలి మందగించుట, వాంతి భావన, వాంతులు, కాళ్ళలో పొంగు కనిపించవచ్చును. బరువు తగ్గుట, కండరములు సన్నగిల్లుట కనిపించవచ్చును. యూరియా విలువలు బాగా హెచ్చయితే  యూరియా చెమటలో విసర్జింపబడి చెమట ఆవిరి అయిన పిదప చర్మముపై  యూరియా తెల్లని పొడిగా ( urea frost ) కనిపిస్తుంది. రక్తము ఆమ్లీకృతమయితే ( metabolic acidosis ) శ్వాసవేగము పెరుగుతుంది. యూరియా విలువలు బాగా పెరిగినపుడు గందరగోళము, మతిభ్రమణము కలుగవచ్చును.

పరీక్షలు 


మూత్రపరీక్షలు 



    రక్తములో యూరియా , క్రియటినిన్ విలువలు పెరిగి మూత్రాంగ వ్యాధిని సూచిస్తాయి. పరీక్షలతో మూత్రములో ఎఱ్ఱకణములు ( erythrocytes ), తెల్లకణములు ( leukocytes  ), రక్తము ( hematuria ), మూసలు ( casts ), మాంసకృత్తులకై శోధించాలి. మూత్రములో ఆల్బుమిన్ / క్రియటినిన్  నిష్పత్తి తెలుసుకోవాలి.

రక్త పరీక్షలు 


    రక్తములో క్రియటినిన్ విలువలు నుంచి కేశనాళికా గుచ్ఛముల వడపోత ప్రమాణము ( Glomerular Filtration Rate - GFR ) అంచనా వేసి దీర్ఘకాల మూత్రాంగ వ్యాధి ఏ దశలో ఉన్నదో నిర్ణయిస్తారు.
రక్తపరీక్షలతో పాండురోగము ( anaemia ) ఉన్నదో, లేదో తెలుసుకోవాలి. రక్తములో చక్కెర విలువలు, విద్యుద్వాహక లవణముల ( electrolytes ) విలువలు  ఆల్బుమిన్ విలువలు, కొలెష్ట్రాలు, కొవ్వుపదార్థాల విలువలు కూడా తెలుసుకోవాలి. కాల్సియమ్, సహగళ గ్రంథి స్రావక విలువలు ( Parathyroid hormone ) కూడా తెలుసుకోవాలి.

శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ 


      శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ ( ultrasonography  ) పరీక్షలతో మూత్రాంగముల పరిమాణము, ప్రతిధ్వనిత్వము ( echogenicity ), నిర్మాణములను పరీక్షించాలి. బహుళ బుద్బుద వ్యాధి ( polycystic kidney disease ), జలమూత్రాంగము ( hydronephrosis  ), మూత్రనాళములలో శిలలు ( ureteric calculi ), ఇతర అవరోధములు, మూత్రాశయములో అసాధారణములు ఈ పరీక్ష వలన తెలుస్తాయి.

కణపరీక్షలు 


    మూత్ర ముకుళములలో  కేశనాళిక గుచ్ఛముల వ్యాధుల ( glomerular diseases ) సంశయము ఉన్నపుడు మూత్రాంగముల కణపరీక్ష  ( biopsy ) చేయాలి.

చికిత్స 


    దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిని ( chronic kidney disease  ) నిర్ణయించాక అది ఏ దశలో ఉన్నదో కూడా నిర్ణయించాలి. వ్యాధిని అదుపులో పెట్టుటకు తొలిగా మూత్రాంగ వ్యాధిని కలుగజేసిన రక్తపీడనము, మధుమేహవ్యాధి, స్వయంప్రహరణ వ్యాధులను ( autoimmune diseases ) అదుపులో పెట్టాలి.

    రక్తపీడనము 140 / 90 m.m hg లోపల అదుపులో ఉంచాలి. మధుమేహ వ్యాధిగ్రస్థులలో రక్తపు చక్కెర విలువలను అదుపులో ఉంచి  Hb A1c  7% లోపల ఉంచే ప్రయత్నము చెయ్యాలి. మూత్ర ప్రవాహమునకు అవరోధములు ఉంటే వాటిని తొలగించు ప్రయత్నము చెయ్యాలి.

    మూత్రాంగములకు రక్తప్రసరణ లోపములు ఉంటే వాటిని సరిదిద్దాలి. ద్రవప్రమాణ హీనతను  ( hypovolemia  ) సరిదిద్దాలి. హృదయ వైఫల్యము ( Congestive heart failure ), జలోదరము ( ascites ) వంటి వ్యాధులకు తగిన చికిత్సలు చేసి మూత్రాంగముల  రక్తప్రసరణను మెరుగుపఱచాలి.

    కీళ్ళనొప్పులకు వాడే ఐబుప్రోఫెన్ వంటి ష్టీరాయిడులు కాని తాపహరముల ( NonSteroidal Anti Inflammatory Drugs ) వాడుక మానివేయాలి. వీని వలన GFR తగ్గగలదు.

    Angiotensin Converting Enzyme inhibitors ( ACE inhibitors ), Angiotensin Receptor Blockers వలన GFR తగ్గ గలదు. వీటి వలన రక్తద్రవములో క్రియటినిన్ విలువలు 30 % కంటె పెరుగుతే ఆ మందుల మోతాదులను వైద్యులు తగ్గిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్థులలో మూత్రములో ఆల్బుమిన్ విసర్జన ( albuminuria ) తగ్గించి మూత్రాంగ వ్యాధిని అదుపులో పెట్టుటకు ACE inhibitors, ARBS ఉపయోగపడుతాయి. ఈ ఔషధములు కేశనాళిక గుచ్ఛములలో పీడనము తగ్గించి మూత్రాంగ రక్షణకు తోడ్పడుతాయి. వీని వలన రక్తములో పొటాసియమ్ విలువలు పెరిగే అవకాశము ఉన్నది కాబట్టి  ఆ రెంటినీ కలిపి వాడుట మంచిది కాదు. వీటిని వాడినపుడు రక్తములో పొటాసియమ్ విలువలు, క్రియటినిన్ విలువలు గమనిస్తూ ఉండాలి. అవసరమయితే మందుల మోతాదులు సరిదిద్దాలి.
    మూత్రాంగములపై విష ప్రభావము గల amino glycoside antibiotics వంటి మందులు వీలయినంత వఱకు వాడకూడదు. తప్పనిసరి అయితే రక్తములో ఆ ఔషధముల విలువలు విష స్థాయిలో ( toxic range ) లేనట్లు జాగ్రత్తపడాలి.

    మూత్రాంగ వ్యాధిగ్రస్థులలో ఎక్స్ రే వ్యత్యాస పదార్థాల ( x- ray contrast materials  ) వాడుకలను కూడా నియంత్రించాలి. మూత్రాంగములకు వీటి వలన హాని కలుగవచ్చును.


 ఆహార నియంత్రణ ( Dietary restrictions ) 


 సోడియం 


    దీర్ఘకాల మూత్రాంగ వ్యాధి  కలవారు భోజనములో సోడియం ని ( ఉప్పు ) తగ్గించుకోవాలి. దినమునకు  సోడియమ్ వాడుకను 3 గ్రాములకు మితము చేసుకోవాలి. హృదయ వైఫల్యము ( CHF ) కూడా ఉంటే దినమునకు సోడియం వాడుక 2 గ్రాములకు తగ్గించాలి.

పొటాసియం 


    వీరు పొటాసియం వాడుకను దినమునకు 60 m.eq నియంత్రించుకోవాలి. నారింజ నిమ్మ రసములు, టొమోటాలు, అరటిపళ్ళు , బంగాళదుంపల లో పొటాసియం ఎక్కువగా ఉంటుంది. వీని వాడుకను బాగా తగ్గించుకోవాలి. రక్తములో పొటాసియమ్ విలువలు ఎక్కువగా ఉన్నవారికి సోడియమ్ పోలిష్టైరీన్ సల్ఫొనేట్ ( sodium polystyrene sulfonate ) వాడుతారు.

    రక్తద్రవములో పొటాసియమ్ విలువలు ప్రమాదకర ప్రమాణములలో ఉండి ( 6 meq / dL మించి ), విద్యుత్ హృల్లేఖనములో ( electro cardiogram ) మార్పులు ఉంటే, హృదయ రక్షణకు కాల్సియమ్ గ్లూకొనేట్ ( calcium gluconate ) సిరల ద్వారా ఇస్తారు. రక్తద్రవములోని పొటాసియమును కణముల లోపలకు మళ్ళించుటకు ఇన్సులిన్ + గ్లూకోజుల మిశ్రమమును సిరలద్వారా ఇస్తారు. బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములను ( beta adrenergic receptor agonists ) పీల్పుసాధనముల ద్వారా ఇచ్చి పొటాసియమ్ ను కణములలోనికి మళ్ళించవచ్చును. రక్తము ఆమ్లీకృతము అయితే ( acidosis ) సోడియమ్ బైకార్బొనేట్ ( sodium bicarbonate ) కూడా ఇవ్వవచ్చును. ఆపై శరీరములో పొటాసియమును తగ్గించుటకు sodium polystyrene sulfonate  వంటి ఋణపరమాణు వినిమయ ఔషధములు ( cation echange resins ) వాడాలి. ద్రవపరిమాణ లోపము ( hypovolemia ) లేనివారిలో మూత్రకారకములు ( diuretics  ) వాడి పొటాసియము విసర్జనను పెంచవచ్చును.

ఫాస్ఫేటులు 


    ఆహారములో ఫాస్ఫేటుల ( phosphates ) వాడుకను 1  గ్రామునకు నియంత్రించుకోవాలి. వివిధరకముల పిక్కలు ( nuts ), నల్లని శీతల పానీయాలలో ఫాస్ఫేటు ప్రమాణములు హెచ్చుగా ఉంటాయి.

అధిక రక్త పీడనము 


    రక్తపీడనమును 140/ 90 మి.మీ. మెర్క్యురీ లోపు అదుపులో ఉంచుకోవాలి. అధిక రక్తపీడనమునకు Angiotensin Converting Enzyme inhibitors లను ,కాని  Angiotensin Receptor Blockers లను కాని ప్రథమముగా ఎంచుకుంటారు. ఈ మందులు మూత్రాంగములకు రక్షణ చేకూరుస్తాయి. వీని వాడుక వలన రక్తములో క్రియటినిన్ ప్రమాణములు కొంత పెరుగుతాయి. మూల విలువలు కంటె 30 % మించి పెరుగుతే వాని మోతాదును తగ్గించాలి. ACE inhibitors, ARBs  రక్తద్రవపు పొటాసియమ్ విలువలను పెంచుతాయి కాబట్టి రెంటినీ కలిపి వాడుట మంచిది కాదు.
    శరీరములో ద్రవభారము ( fluid overload ) పెరిగి కాళ్ళు పొంగుతే మూత్రకారకములు ( diuretics ) అవసరము కావచ్చును.

పాండురోగము ( Anemia )  


    మూత్రాంగములలో రక్తోత్పాదిని ( erythropoietin ) అనే రసాయనము ఉత్పత్తి  అవుతుంది. అది ఎముకల మజ్జపై పనిచేసి ఎఱ్ఱకణముల ఉత్పత్తికి దోహదపడుతుంది. మూత్రాంగ వ్యాధి మూడవ దశలో ఉన్నా , దాటినా రక్తపరీక్షలతో రక్తవర్ణకపు ( hemoglobin ) విలువలు తెలుసుకోవాలి. తగ్గుతే రక్తములోను, శరీరములోను ఇనుము  విలువలు తెలుసుకొని లోపములు ఉంటే ఇనుము లవణములు నోటి ద్వారా గాని, సిరల ద్వారా గాని ఇచ్చి లోపమును సరిదిద్దాలి.
    ఇనుము లోపాలు, ఇతర పోషక పదార్థముల లోపాలు సరిదిద్దినా రక్తవర్ణకపు విలువ 10 గ్రాలు / డె.లీ కంటె తక్కువగా ఉంటే కృత్రిమ రక్తోత్పాదుల ( erythropoiesis stimulating agents : ESAs ) వాడుక అవసరము అవవచ్చును. వీటిని వాడునపుడు రక్తవర్ణకపు ( hemoglobin ) ప్రమాణములు 11 గ్రా.లు దాటకుండా  జాగ్రత్త పడాలి.

ఎముకల బలహీనత 


    దీర్ఘకాల మూత్రాంగ వ్యాధి మూడవ దశకు చేరినవారిలో విటమిన్ డి తగ్గుతుంది. [ విటమిన్ D3   ఖోలికాల్సిఫెరాల్  ( Cholecalciferol  ) చర్మము దిగువభాగములో సూర్యరశ్మి సహాయముతో ఉత్పత్తి అవుతుంది .  కాలేయములో ఖోలికాల్సిఫెరాల్  హైడ్రాక్సిలేట్ అనే ఉత్ప్రేరకముతో  25- హైడ్రాక్సీ ఖోలికాల్సిఫెరాల్ గా మార్పుచెందుతుంది. 25 హైడ్రాక్సీ ఖోలికాల్సిఫెరాల్ మూత్రాంగములలో ఉత్తేజకరమై 1-25- డై హైడ్రాక్సీ ఖోలికాల్సిఫెరాల్  లేక కాల్సిట్రయాల్ Calcitriol గా మారుతుంది. ]

    మూత్రాంగవ్యాధి కలవారిలో కాల్సిట్రయాల్ లోపించి రక్తములో కాల్సియమ్ విలువలు తగ్గుతాయి. ఫాస్ఫేటు విలువలు పెరుగుతాయి. కాల్సియమ్ జీవవ్యాపారముపై సహగళ గ్రంథుల ( parathyroid glands ) ప్రభావము ఉంటుంది. రక్తములో కాల్సియమ్ విలువలు తగ్గినపుడు సహగళగ్రంథులు సహగళగ్రంథి స్రావమును ( parathyroid hormone ) ఎక్కువగా స్రవిస్తాయి. సహగళగ్రంథి స్రావము ఎముకల నుంచి కాల్సియమ్ ని రక్తములోనికి తరలిస్తుంది. ఎముకలు అందుచే బలహీనపడుతాయి ( osteomalacia ).  ఆ పై ఎముకలలో  తంతు బుద్బుదములు ఏర్పడి Osteitis fibrosa cystica అనే వ్యాధికి దారితీస్తాయి. వీరిలో ఎముకల నొప్పులు, ఎముకలు సులభముగా విఱుగుట కలుగుతుంటాయి.

    రక్తములో కాల్సియం తగ్గుటచే  సహగళగ్రంథి స్రావము అధికమగుటను ద్వితీయ సహగళగ్రంథి ఆధిక్యతగా ( secondary hyperparathyroidism ) పరిగణిస్తారు. శరీరములో విటమిన్ డి లోపమును సరిదిద్దుటకు  Secondary hyperparathyroism ను నివారించుటకు ఉత్తేజకర 1-25 డై హైడ్రాక్సీ వైటమిన్  డి ( 1-25- dihydroxy vitamin D ) ని గాని, లేక దాని సమధర్మిని ( analog ) గాని వాడవలసిన అవసరము కలదు.

    హెచ్చయిన ఫాస్ఫేటు విలువలను తగ్గించుటకు ఫాస్ఫేట్ బంధకములను ( phosphate binders ) వాడుతారు. కాల్సియం కార్బొనేట్ ( CaCO3 ), కాల్సియం ఎసిటేట్, లాంథనమ్ కార్బొనేట్ ( Lanthanum carbonate ), సెవెలమెర్ కార్బొనేట్ (  Sevelamer carbonate ) కొన్ని ఫాస్ఫేటు బంధకములు. ఇవి జీర్ణమండలములో ఫాస్ఫేటు గ్రహణమును నివారిస్తాయి.

రక్త ఆమ్లీకృతము ( Metabolic acidosis ) 


    దీర్ఘకాల మూత్రాంగవ్యాధి కలవారిలో శరీరములో జనించే ఆమ్లపు విసర్జన మందగిస్తుంది. అందుచే రక్తము ఆమ్లీకృతమవుతుంది. ఇది జీవవ్యాపార ఆమ్లీకృతము ( metabolic acidosis ).
[ శ్వాసవైఫల్యము కలవారిలో బొగ్గుపులుసు వాయువు విసర్జన తగ్గి రక్తములో బొగ్గుపులుసు వాయువు (CO2 ) ప్రమాణములు పెరుగుటచే కలిగే ఆమ్లీకృతము  శ్వాసవ్యాపార ఆమ్లీకృము ( Respiratory acidosis ) ].
    
    వీరిలో రక్తములో బైకార్బొనేట్ విలువలు తగ్గుతాయి. వారికి సోడియమ్ బైకార్బొనేట్  నోటి ద్వారా ( 650 మి.గ్రాలు - 1300 మి.గ్రా లు దినమునకు రెండు మూడు పర్యాయములు ఇచ్చి రక్తములో బైకార్బొనేట్ విలువలు 22 meq / L సమీపములో ఉండేటట్లు చూడాలి. సోడియం బైకార్బొనేట్ వలన శరీరములో లవణ, ద్రవ భారములు పెరుగుటకు, రక్తపుపోటు పెరుగుటకు, కాళ్ళలో పొంగులు కలుగుటకు అవకాశము ఉన్నది .

ధమనీ కాఠిన్యత, హృద్రోగములు 


    దీర్ఘకాల మూత్రాంగ వ్యాధులు కలవారిలో ధమనీ కాఠిన్యత ( atherosclerosis  ), హృద్రోగములు, హెచ్చుగా ఉంటాయి. కొవ్వులు, కొలెష్టరాలు తగ్గించే ష్టాటిన్ ( statins ) మందులు వాడుట వలన హృద్రోగములు, ధమనీ వ్యాధులు తగ్గించగలుగుతాము.

మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( Renal replacement therapy ) 


    కేశనాళికా గుచ్ఛముల వడపోత ద్రవ ప్రమాణము ( Glomerular filtration Rate - GFR ) క్షీణించి దీర్ఘకాల మూత్రాంగవ్యాధి తీవ్రతరమయి  ఐదవ దశకు చేరినపుడు మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్సలు అవసరము అవుతాయి.

    GFR విలువలే కాక రోగి పోషణ, జీవవ్యాపార స్థితులు క్షీణించినపుడు ప్రత్యామ్నాయ చికిత్స మొదలు పెట్టుట మేలు.
    ఉదరాంత్ర వేష్టనము ద్వారా రక్తమును శుద్ధిచేయు ప్రక్రియ Peritoneal dialysis. దీనిని అరుదుగా వాడుతారు. రక్తనాళములలోని  రక్తమును శుద్ధిచేయు ప్రక్రియ Hemodialysis. ఇది తఱచు వాడబడే ప్రక్రియ.
పరమూత్రాంగ దాన  ( renal transplantation ) చికిత్సలో గ్రహీతకు అనుకూల  మూత్రాంగమును శస్త్రచికిత్సతో   చేరుస్తారు. 
     
 రక్తపీడనమును, మధుమేహ వ్యాధిని అదుపులో పెట్టుకొని దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిని నివారించుట, అదుపులో ఉంచుకొనుట వాంఛనీయము.


పదజాలము :

Anti Inflammatory Drugs =  తాపహరములు ( గ.న )
 Beta adrenergic receptor agonists = బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములు ( గ.న )
 Cation echange resins = ఋణపరమాణు వినిమయ ఔషధములు ( గ.న )
 Diuretics  = మూత్రకారకములు 
 Echogenicity = ప్రతిధ్వనిత్వము ( గ.న )
Hemodialysis = రక్తశుద్ధి
 Hydronephrosis = జలమూత్రాంగము ( గ.న )
 Hypovolemia = రక్తప్రమాణ హీనత ( గ.న )
Glomerular diseases = కేశనాళికా గుచ్ఛవ్యాధులు ( గ.న )
Glomerular filtration rate =  కేశనాళికా గుచ్ఛముల వడపోత ప్రమాణము ( గ.న )
Metabolic acidosis = జీవవ్యాపార ఆమ్లీకృతము ( గ.న )
Osteitis fibrosa cystica = తంతు బుద్బుద అస్థి వ్యాధి ( గ.న )
 Peritoneal dialysis = ఉదరవేష్టన రక్తశుద్ధి ( గ.న )
Polycystic kidney disease = బహుళ బుద్బుద మూత్రాంగవ్యాధి ( గ.న )
Renal replacement therapy = మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( గ.న )
Renal transplantation: పరమూత్రాంగ దానము ( గ.న )
Respiratory acidosis = శ్వాసవ్యాపార ఆమ్లీకృతము ( గ.న )
Ultrasonography = శ్రవణాతీత ధ్వనిచిత్రీకరణ ( గ.న )
Ureteric calculi = మూత్రనాళ శిలలు 

( వైద్యవిషయములను తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్తులు తమ తమ వైద్యులను సంప్రదించ ప్రార్థన. ఉపయుక్తము అనుకుంటే నా వ్యాసములను నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )

21, ఏప్రిల్ 2020, మంగళవారం

సత్వర మూత్రాంగ విఘాతము ( Acute kidney injury )

( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో )


           సత్వర మూత్రంగ విఘాతము

                                       ( Acute Kidney Injury )

       
                                                                                       డా. గన్నవరపు నరసింహమూర్తి.                        .

                         
    శరీరములో వివిధ అవయవముల కణజాలములో జరిగే జీవవ్యాపార ప్రక్రియలో
( metabolism ) వ్యర్థ పదార్ధములు ఉత్పత్తి అయి రక్తములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థ పదార్థాలను రక్తము నుంచి ఎప్పటి కప్పుడు తొలగించి రక్తమును శుద్ధిచేసి శరీర అవయవములను పరిరక్షించి శరీర వ్యాపారమును ఆరోగ్యకరముగా నడిపించుట చాలా అవసరము. జంతుజాలములోను పక్షులలోను ఆ బాధ్యత మూత్రాంగములు ( Kidneys ) నిర్వహిస్తాయి.

    మూత్రాంగములు వివిధ కారణముల వలన ఘాతములకు ( injuries & insults  ) లోనయితే వాటి నిర్మాణములో మార్పులతో పాటు  వాటి వ్యాపారము కూడా మందగించవచ్చును. ఈ మూత్రాంగ విఘాతము తక్కువ కాలములో త్వరగా ( 7 దినములలో ) కలిగితే దానిని  సత్వర మూత్రాంగ విఘాతము ( Acute Kidney Injury ) లేక సత్వర మూత్రాంగ వైఫల్యముగా ( Acute Renal Failure )  పరిగణిస్తారు.

    తక్కువ సమయములో రక్తద్రవములో  క్రియటినిన్ ( serum creatinine  ) ప్రమాణములు పెరుగుట కాని, మూత్రవిసర్జన ( urine output ) పరిమాణము బాగా తగ్గుట కాని సత్వర మూత్రాంగ విఘాతమును సూచిస్తాయి.

కారణములు 


    సత్వర మూత్రాంగ విఘాతమునకు ( Acute Kidney Injury ) కారణములు మూత్రాంగములకు ముందు గాని ( Prerenal ), మూత్రాంగములలో గాని ( Renal parenchyma ), మూత్రాంగముల తరువాత గాని ( Post renal) ఉండవచ్చును.

మూత్రాంగ పూర్వ ( మూత్రాంగములకు ముందు ఉండు ) కారణములు ( Pre renal causes ) 


    మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుట వలన మూత్రాంగ వైఫల్యము, మూత్రాంగ విఘాతము కలుగగలవు . వాంతులు, విరేచనములు, రక్తస్రావము ( hemorrhage) వలన ), ఇతర కారణముల వలన రక్త ప్రమాణము తగ్గితే ( hypovolemia ) మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది.

    హృదయ వైఫల్యము ( Congestive Heat Failure ), కాలేయ వైఫల్యము ( Hepatic Failure  ), నెఫ్రాటిక్ సిండ్రోమ్ లలో ( Nephrotic syndrome ) శరీర ద్రవ ప్రమాణము పెరిగినా, వివిధ అవయవాలకు సమర్థవంతముగా ప్రసరించు రక్త ప్రమాణము ( effective circulatory volume ) తగ్గి మూత్రాంగములకు కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది. ఉదర శస్త్రచికిత్సల తర్వాత శరీర ద్రవములు కణజాలముల ( Tissues ) లోనికి ఎక్కువగా చేరుట వలన అవయవాలకు ప్రసరించు రక్త ప్రమాణము తగ్గుతుంది. నారంగ కాలేయవ్యాధిలో ( cirrhosis of Liver ) ఉదరకుహరములో ( peritoneal cavity ) ద్రవము చేరుకొని జలోదరమును ( ascites ) కలిగించునపుడు కూడా సమర్థముగా ప్రసరించు రక్త పరిమాణము ( effective circulating volume ) తగ్గుతుంది. జలోదరము ( ascites ) విశేషముగా ఉండి ఉదరకుహరములో పీడనము ఎక్కువయినపుడు మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది. మూత్రసిరల నుంచి ప్రసరించు రక్త ప్రమాణము కూడా తగ్గుతుంది.
      
    కాలేయ వ్యాధుల వలన సత్వర కాలేయ వైఫల్యము ( acute hepatic failure ) కలగిన వారిలో hepatorenal syndrome కలుగుతే మూత్రాంగ ధమనులు సంకోచిస్తాయి. మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది.

    మూత్రాంగములకు రక్తప్రసరణ లోపించుట వలన మూత్రాంగముల నిర్మాణ, వ్యాపారములలో మార్పులు జరిగి సత్వర మూత్రాంగ విఘాతముగా ( acute Kidney Injury ) పరిణమించ వచ్చును. దాని వలన సత్వర మూత్రాంగ వైఫల్యము కలుగుతుంది.

మూత్రాంగ కారణములు ( Renal parenchymal causes ) 


    సత్వర మూత్రాంగ వైఫల్యమునకు కారణములు మూత్రాంగముల ( Kidneys ) లోనే ఉండవచ్చును.


    1). సత్వర మూత్ర నాళికా కణధ్వంసము ( acute tubular necrosis ) : మూత్రాంకముల నాళికలలో ( tubules of nephrons ) కణముల విధ్వంసము జఱిగి సత్వర మూత్రాంగ విఘాతము కలుగవచ్చును. సూక్ష్మజీవులు శరీరమును ఆక్రమించుకొనుట వలన రక్తము సూక్ష్మజీవ విషమయము (bacterial sepsis ) అయితే అది మూత్రనాళికల కణవిధ్వంసమునకు దారి తీయవచ్చును.

    2). మూత్రాంగ విషములు ( nephrotoxins ), వేంకోమైసిన్ ( vancomycin ), జెంటామైసిన్
 ( Gentamicin ), టోబ్రామైసిన్  ( Tobramycin ) వంటి ఎమైనోగ్లైకొసైడ్ సూక్ష్మజీవి వినాశక ఔషధములు ( amino glycoside antibiotics ), ఏంఫోటెరిసిన్ -బి ( amphotericin B ), సిస్ ప్లాటిన్ ( cisplatin ), సిరల ద్వారా ఇవ్వబడు  వ్యత్యాస పదార్థములు (  I.V. contrast materials ), ఇతర ఔషధముల వలన మూత్రనాళికలలో సత్వర కణధ్వంసము ( acute tubular necrosis ) కలుగ వచ్చును.

    3). లింఫోమా ( lymphoma ), లుకీమియా వంటి కర్కట వ్రణ ( cancer ) వ్యాధిగ్రస్థులలో రసాయనక చికిత్స పిదప కర్కటవ్రణ కణధ్వంసము ( lysis of cancer cells  ) జరుగుటచే  రక్తములోను, మూత్రములోను యూరికామ్లపు  ( uric acid ) విలువలు పెరిగి అవి మూత్రనాళికలలో ( tubules ) పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ వైఫల్యమును కలిగించగలవు.

    4). Multiple myeloma వ్యాధిగ్రస్థులలో ఇమ్యునోగ్లాబ్యులిన్ల భాగములు మూత్రనాళికలలో పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ విఘాతము కలిగించవచ్చును. 

    5) ఎసైక్లొవీర్ ( acyclovir ), ఇండినవీర్, సల్ఫానమైడులు వంటి  ఔషధములు కూడా మూత్రనాళికలలో పేరుకొని అవరోధము కలిగించి మూత్రాంగ విఘాతమును కలిగించవచ్చును.

    6). రక్తనాళ పరీక్షలు, చికిత్సలలో ( vascular procedures ), ప్రమాదవశమున ధమనీ ఫలకములు ( atheromas ) ఛిద్రమయి రక్త ప్రవాహములో మూత్రాంగములకు చేరి మూత్రాంగ విఘాతమును కలిగించగలవు.

    7). అస్థికండర కణవిచ్ఛేదనము ( Rhabdomyolysis ) జరిగిన వారిలో కండర వర్ణకము ( myoglobin ) విడుదలయి మూత్రనాళికలలో పేరుకుంటే మూత్రాంగ విఘాతము కలుగవచ్చును.

    8). స్వయంప్రహరణ వ్యాధులు ( autoimmune diseases ) వలన  కేశనాళికా గుచ్ఛములలో ( glomeruli )  తాపము ( glomerulo nephritis ) కలిగి మూత్రాంగ విఘాతము కలిగించవచ్చును.

    9). కొన్ని వ్యాధుల వలన, కొన్ని ఔషధముల వలన  మూత్రాంగములలో మూత్రాంకముల ( nephrons ) మధ్యనుండు కణజాలములో తాపము ( interstitial nephritis )  కలిగి మూత్రాంగ వైఫల్యము కలిగించవచ్చును.

    మూత్రాంగ విఘాతములను రెండుగా విభజించవచ్చును. దినమునకు 500 మి.లీ లోపు మూత్రమును విసర్జిస్తే మితమూత్ర మూత్రాంగ విఘాతము ( oliguric AKI ). 500 మి.లీ కంటె ఎక్కువగా మూత్ర విసర్జన ఉంటే అది అమిత మూత్ర మూత్రాంగ విఘాతము ( non oliguric AKI ). మితమూత్ర మూత్రాంగ విఘాతము తీవ్రమైనది.

 మూత్రాంగ పర ( మూత్రాంగములు తర్వాత) కారణములు ( post renal causes ) 


    మూత్రాంగములలో ఉత్పత్తి అయే మూత్ర ప్రవాహమునకు, విసర్జనకు అవరోధములు ఏర్పడితే మూత్ర నాళములలో పీడనము పెరిగి ఆ పీడనము వలన  మూత్రాంగ విఘాతము కలుగుతుంది. వయస్సు పెరిగిన పురుషులలో ప్రాష్టేటు గ్రంథి ( prostate gland ) పెరుగుదలలు, పిల్లలలో జన్మసిద్ధముగా మూత్ర పథములో కలుగు వైపరీత్యములు ( congenital urinary tract abnormalities ), మూత్ర పథములో శిలలు (calculi in urinary tract ), కటిస్థలములో కర్కట వ్రణములు మూత్ర ప్రవాహమునకు అవరోధము కలిగించి సత్వర మూత్రాంగ విఘాతమునకు ( acute kidney injury ) దారితీయగలవు.

సత్వర మూత్రాంగ విఘాత లక్షణములు 


    మూత్రాంగ విఘాతము వలన మూత్రంగ వ్యాపారము మందగించి రక్తములో యూరియా ( urea ), క్రియటినిన్ ( creatinine ) వంటి వ్యర్థ పదార్థముల పరిమాణములు త్వరితముగా పెరుగుతాయి. అందువలన వ్యాధిగ్రస్థులలో ఒంట్లో నలత, అరుచి, వాంతి కలిగే వికారము, వాంతులు, నీరసము, అలసట, కలుగుతాయి. తలనొప్పి ఉండవచ్చును. మూత్రాంగములలో తాపముచే మూత్రాంగముల పరిమాణము పెరుగుతే వాటిని ఆవరించు ఉండు పీచుపొర సాగుట వలన ఉదరములో పార్శ్వ భాగములలో నొప్పి కలుగ వచ్చును.

    మూత్రాంగ విఘాతమునకు మూలకారణముల వలన యితర లక్షణములు కలుగుతాయి.
 శరీర ఆర్ద్రత తగ్గుట ( dehydration ), రక్త ప్రమాణము తగ్గుట ( hypovolemia ) వలన మూత్రాంగ విఘాతము కలిగిన వారిలో దాహము పెరుగుట, నోరు పిడచకట్టుకొనుట, శరీరస్థితి మార్పులతో, ( పడుకొన్నవారు , కూర్చున్నపుడు, లేచి నిలుచున్నపుడు ) రక్తపీడనము తగ్గి ( postural hypotension  ) కళ్ళు తిరుగుట, ఒళ్ళు తూలుట కలుగవచ్చును. శరీర స్థితితో ధమని వేగములో మార్పులు కలుగుతాయి. వీరిలో నాలుక, నోటి శ్లేష్మపు పొరలలోను ( mucosa ), చర్మములోను ఆర్ద్రత ( తడి ) తగ్గి పొడిగా కనిపిస్తాయి. గుండె వేగము పెరుగుతుంది. రక్తపీడనము తక్కువగా ఉండవచ్చు. నిలుచున్నపుడు రక్తపీడనము తగ్గుతుంది.

    సూక్ష్మజీవుల వలన రక్తము విషమయము అయితే ( bacterial sepsis  ) వారిలో జ్వరము , నీరసము , సూక్ష్మజీవుల బారికి గుఱి అయిన అవయవములలో కలిగే లక్షణములు కనిపిస్తాయి.

     Systematic lupus erythematosis ( SLE ) వంటి స్వయంప్రహరణ వ్యాధులు ( auto immune diseases ) కలవారిలో కీళ్ళనొప్పులు, చర్మములో పొక్కులు, విస్ఫోటముల ( rashes )  వంటి లక్షణములు కనిపిస్తాయి.

    మూత్ర ప్రవాహమునకు అవరోధములు ఉన్నవారిలో మూత్ర విసర్జనలో యిబ్బంది,   నొప్పి, పొత్తికడుపులో నొప్పి, కడుపు పక్కలందు నొప్పి, మూత్రము విసర్జించునపుడు మంట, నొప్పి, మూత్రములో రక్తము ( hematuria ) వంటి లక్షణములు ఉండవచ్చు.

    ప్రాష్టేటు గ్రంథి పెరుగుదలలను, మూత్రాశయపు నిండుతనమును ( urinary bladder distension ), పొత్తికడుపులో పెరుగుదలలను వైద్యులు రోగులను పరీక్షించునపుడు గమనించగలరు. మూత్ర ప్రవాహమునకు అవరోధము కలుగుటచే మూత్రాశయము ( urinary bladder) పొంగి ఉంటే మూత్రాశయములోనికి కృత్రిమనాళము ( catheter ) రోగజనక రహితముగా  (sterile technique) చొప్పించి మూత్ర ప్రవాహమునకు సదుపాయము కల్పిస్తే మూత్రాంగ విఘాతమునకు కారణము తెలియుటే కాక చికిత్స కూడా సాధించగలము.

పరీక్షలు 


మూత్ర పరీక్ష 


    మూత్రాంగపూర్వ ( prerenal ) కారణములచే మూత్రాంగ విఘాతములు కలిగిన వారిలో మూత్ర పరీక్షలో  తేడా కనిపించదు.
    మూత్రనాళికల కణవిధ్వంసము ( acute tubular necrosis  ) గల వారిలో మూత్రమును సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించినపుడు మట్టిరంగు కణికలు గల మూసలు  (muddy granular casts ) కనిపిస్తాయి.

    ఎఱ్ఱరక్తకణముల మూసలు ( erythrocyte casts ), మూత్రములో మాంసకృత్తులు ( proteinuria ) కేశనాళికా గుచ్ఛముల వ్యాధిని ( glomerular disease ) సూచిస్తాయి.

    తెల్లకణముల మూసలు ( leukocyte casts, ఆమ్లాకర్షణ కణములు ( eosinophils  ) మూత్రాంగములలో అంతర కణజాల తాపమును ( Interstitial nephritis ) సూచిస్తాయి.

    మూత్రములో రక్తవర్ణకము ఉండి, రక్తకణములు లేకపోతే ఆ వర్ణకము కండర వర్ణకము ( myoglobin ) కావచ్చును.అది కండరములు విచ్ఛిన్నతను (Rhabdomyolysis )  సూచిస్తుంది.

    మూత్రమును సూక్ష్మదర్శినితో పరీక్షించునపుడు యూరికామ్లపు స్ఫటికములు ( uric acid crystals), యితర స్ఫటికములు ( ethylene glycol, ) కనిపిస్తే వ్యాధి కారణములు తెలుసుకొనవచ్చును.

రక్తపరీక్షలు 


    రక్తపరీక్షలలో యూరియా, క్రియటినిన్ ల ప్రమాణములు పెరుగుతాయి. యూరియా, క్రియటినిన్ లతో విద్యుద్వాహక లవణములు ( electrolytes ) సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేట్, కాల్సియమ్, ఫాస్ప్ ట్, యూరికామ్లముల విలువలు, చక్కెర, ఆల్బుమిన్ విలువలు, రక్తకణముల విలువలు వైద్యులు పరిశీలిస్తారు.


    మూత్రాంగపూర్వ ( prerenal ) మూత్రాంగ విఘాతములలో రక్తములో యూరియా / క్రియటినిన్ నిష్పత్తి 20: 1 కంటె హెచ్చుగా ఉంటుంది. మూత్రాంగ ( కారణ ) మూత్రాంగ విఘాతములలో ఈ నిష్పత్తి 20:1 కంటె తక్కువగా ఉంటుంది.

 మూత్రములో సోడియమ్, క్రియటినిన్ విలువలు, ఆస్మొలాలిటీ ( osmolality ) కూడా తెలుసుకోవాలి.


    మూత్రాంగ పూర్వ మూత్ర్రాంగ విఘాతములలో రక్తప్రమాణము తగ్గుట వలన శరీరములో వినాళగ్రంథులు స్పందించి నీరును, సోడియమ్ ను పదిల పఱుస్తాయి. అందుచే మూత్రపు సాపేక్ష సాంద్రత ( specific gravity ) 1.020  కంటె ఎక్కువగా ఉంటుంది ; మూత్రపు ఆస్మలాలిటీ ( urine osmolality ) 500 mOsm/kg కంటె ఎక్కువగా ఉంటుంది. మూత్రములో సోడియమ్ సాంద్రత 10 meq / L లోపల ఉంటుంది.

    మూత్రములో ఎఱ్ఱకణముల మూసలు ( erythrocyte casts ), ఎఱ్ఱకణములు, మాంసకృత్తులు ( proteins ) ఉంటే అవి కేశనాళికల గుచ్ఛములలో ( glomeruli ) వ్యాధిని సూచిస్తాయి. వారికి వివిధ స్వయంప్రహరణ వ్యాధులకు ( autoimmune diseases ), రక్తనాళికల తాపము ( vasculitis )  కలిగించే కాలేయ తాపములు ఎ, బి లకు ( hepatitis B & C ) పరీక్షలు చెయ్యాలి.

శ్రవణాతీత ధ్వని చిత్రీకరణము ( ultrasonography ) 


    శ్రవణాతీత ధ్వని చిత్రీకరణములతో  ( ultrasonography ), మూత్రనాళ శిలలను (ureteric calculi ), ఇతర అవరోధములను, మూత్రాశయములో వైపరీత్యములను, ప్రాష్టేట్ పెరుగుదలలను, అవరోధము వలన ఉబ్బిన మూత్రనాళములు ( ureters ), ఉబ్బిన మూత్రకుండిక ( మూత్రపాళియ ; renal pelvis ) మూత్రకుండిక ముఖద్వారములతో ( calyces of  kidneys) జల మూత్రాంగమును (hydronephrosis ),కటిస్థలములో ( pelvis ) పెరుగుదలలను కనుగొనవచ్చును.

చికిత్స 


    మూత్రాంగ విఘాతపు చికిత్స రెండు భాగములు. ప్రధమముగా మూత్రాంగ విఘాతానికి కారణములను పరిష్కరించాలి. అదేసమయములో మూత్రాంగ విఘాతము వలన కలిగిన ఉపద్రవములను కూడా పరిష్కరించాలి. 

మూత్రాంగ విఘాత కారణముల పరిష్కరణ  


    మూత్రాంగపూర్వ కారణములను, మూత్రాంగపర కారణములను సత్వరముగా పరిష్కరించుట వలన మూత్రాంగ విఘాతమును నిలువరించ గలుగుతాము.

మూత్రాంగపూర్వ కారణముల పరిష్కరణ 


     శరీరపు ఆర్ద్రక్షీణతను ( dehydration), రక్తపరిమాణ లోపములను ( hypovolemia ) దిద్దుబాటు చేసి మూత్రాంగముల రక్తప్రసరణ లోపమును సరిదిద్దాలి. దేహములో నీరు, ఉప్పు (sodium chloride) ఒకదానితో మరొకటి అనుబంధము కలిగి ఉంటాయి. అందువలన శరీరపు ఆర్ద్రత తగ్గినపుడు లవణ ద్రావణము  ( normal saline ) సిరల ద్వారా ఎక్కించి ఆర్ద్ర క్షీణతను ( dehyration ) సరిదిద్దాలి. రక్తహీనము ( anemia ) ఎక్కువగా ఉంటే రక్తకణ సముదాయములను ( packed redblood cells ) ఎక్కించాలి. నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో ( cirrhosis of liver ) రక్తములో ఆల్బుమిన్ ( albumin ) బాగా తగ్గి జలోదరము ( ascites ) ఉంటే ఆల్బుమిన్  సిరలద్వారా ఇవ్వాలి.

    మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గించు తాపహరముల ( nonsteroidal antiinflammatory agents ) వంటి ఔషధములను ఆపివేయాలి. శరీర ఆర్ద్రత తగ్గినపుడు మూత్రకారకములు ( diuretics ) ఆపివేయాలి. రక్తద్రవములో క్రియటినిన్ ( serum creatinine ) విలువలు 50 శాతము కంటె పెరుగుతే  Angiotensin Converting Enzyme Inhibitors, Angiotensin Receptor Blockers  మోతాదులను తగ్గించాలి. లేక పూర్తిగా మానివేయాలి. రక్తపీడనము తగ్గిన వారిలో ( hypotension ) రక్తపుపోటు మందులు తగ్గించాలి, లేక నిలిపివేయాలి.

మూత్రాంగపర కారణముల పరిష్కరణ 


    మూత్ర విసర్జనకు, మూత్ర ప్రవాహమునకు అవరోధములు ఉంటే వాటిని పరిష్కరించాలి. మూత్రాశయములో కృత్రిమ నాళము అమర్చి మూత్ర ప్రవాహము సుగమము చేయాలి. మూత్రనాళములలో శిలలు ఉంటే వాటిని తొలగించాలి. మూత్రాశయమునకు ( urinary bladder ) ఎగువ తొలగించలేని ఇతర అవరోధములు ఉంటే మూత్రకుండికకు ( renal pelvis ) శస్త్రచికిత్సతో కృత్రిమ ద్వారము ( nephrostomy ) బయటకు అమర్చి మూత్ర విసర్జనకు సదుపాయము కల్పించాలి. మూత్ర ప్రవాహము సుగమము చేయుట వలన మూత్రాంగములపై పీడనము తగ్గి మూత్ర విఘాతమును నిలువరించగలుగుతాము.

మూత్రాంగ కారణములకు చికిత్స 


    మూత్రాంగములపై విష ప్రభావము కలిగించు ఔషధములను ( aminoglycosides, cisplatin, amphoterin-b ) తప్పనిసరి కాకపోతే వెంటనే నిలిపివేయాలి. కండర విచ్ఛేదనము ( rhabdomyolysis ) జరిగిన వారికి సిరల ద్వారా లవణ ద్రావణము ( normal saline ) ఇచ్చి మూత్ర పరిమాణము పెంచి కండర వర్ణకము ( myoglobin ) మూత్రనాళికలలో ( tubules ) పేరుకుపోకుండా చెయ్యాలి. 

    మూత్రాంగముల కేశనాళిక గుచ్ఛములలో ( glomeruli ) వ్యాధి కలిగించు స్వయంప్రహరణ వ్యాధులను ( autoimmune disease ) ఇతర కొల్లజెన్ రక్తనాళిక వ్యాధులను ( collgen vascular diseases ) కనుగొని వాటికి తగిన చికిత్సలు చెయ్యాలి.

    జలోదరము ( ascites ) వలన ఉదరకుహరములో పీడనము అధికముగా ఉంటే ఉదరకుహరములో ద్రవమును తొలగించాలి.

    కారణములను పరిష్కరిస్తే మూత్రాంగములు విఘాతము నుంచి కోలుకొనే అవకాశము ఉంటుంది.

     మూత్రాంగవిఘాతము వలన కలిగే ఉపద్రవముల పరిష్కారము 

    
    ఇది చికిత్సలో చాలా ముఖ్యాంశము. మూత్రాంగ విఘాతము వలన వ్యాధిగ్రస్థులకు అరుచి కలిగి తగినంత ద్రవములు నోటితో తీసుకోలేకపోతే రక్తపరిమాణ లోపమును ( hypovolemia ), ఆర్ద్రక్షీణతను ( dehydration  ) సరిదిద్దుటకు సిరల ద్వారా లవణ ద్రవణములు ఇయ్యాలి. శరీర ద్రవభారము ( fluid overload ) అధికమయితే మూత్రకారకములతో ( diuretics ) దానిని పరిష్కరించాలి.

    రక్తద్రవపు పొటాసియమ్  ( serum Potassium ) విలువలు అధికమయితే ఆహారములో పొటాసియమ్  తగ్గించాలి. అరటిపళ్ళు, నారింజరసము, బంగాళదుంపలు, కొబ్బరినీళ్ళలో పొటాసియము ఎక్కువగా ఉంటుంది. వీటిని వాడకూడదు. 
      
    పొటాసియమ్ విలువలు ప్రమాదకర ప్రమాణములలో ఉండి ( 6 meq / dL మించి ), విద్యుత్ హృల్లేఖనములో ( electro cardiogram ) మార్పులు ఉంటే, హృదయ రక్షణకు కాల్సియమ్ గ్లూకొనేట్ ( calcium gluconate ) సిరల ద్వారా ఇస్తారు. రక్తద్రవములోని పొటాసియమును కణముల లోపలకు మళ్ళించుటకు ఇన్సులిన్ + గ్లూకోజుల మిశ్రమమును సిరలద్వారా ఇస్తారు. బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములను ( beta adrenergic receptor agonists ) పీల్పుసాధనముల ద్వారా ఇచ్చి పొటాసియమ్ ను కణములలోనికి మళ్ళించవచ్చును. రక్తము ఆమ్లీకృతము అయితే ( acidosis ) సోడియమ్ బైకార్బొనేట్ ( sodium bicarbonate ) కూడా ఇవ్వవచ్చును. ఆపై శరీరములో పొటాసియమును తగ్గించుటకు sodium polystyrene sulfonate  వంటి ఋణపరమాణు వినిమయ ఔషధములు ( cation echange resins ) వాడవలెను. ద్రవపరిమాణ లోపము ( hypovolemia ) లేనివారిలో మూత్రకారకములు వాడి పొటాసియము విసర్జనను పెంచవచ్చును.

    రక్తము ఆమ్లీకృతమయితే ( acidosis ) నోటి ద్వారా సోడియమ్ బైకార్బొనేట్ యిచ్చి దానిని సవరించవచ్చును. ఆమ్లీకృతము తీవ్రముగా ఉండి రక్తపు pH 7.2 కంటె తక్కువగా ఉన్నపుడు సోడియమ్ బైకార్బొనేట్ సిరల ద్వారా ద్రావణములతో ఇవ్వవచ్చును. కాని దాని వలన ద్రవభారము ( fluid overload ) కలుగకుండా, రక్తద్రవపు కాల్సియమ్ విలువలు పడిపోకుండా, రక్తము క్షారీకృతము ( alkalosis ) కాకుండాను తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  
    { ధమని రక్తపు pH 7.37 నుంచి 7.43 వఱకు ఉంటుంది. pH 7.37 కంటె తక్కువైతే ఆమ్లీకృతము ( acidosis ) గాను, 7.43 కంటె ఎక్కువైతే క్షారీకృతము ( alkalosis ) గాను పరిగణిస్తారు.}

    రక్తములో ఫాస్ఫేట్ విలువలు పెరుగుతే ఫాస్ఫేట్ బంధకములను ( phosphate binding agents - calcium carbonate, calcium acetate, aluminum hydroxide, sevelamer hydrochloride  ) వాడి వాటిని అదుపులో తేవలెను.

    మూత్రాంగ విఘాతము కల రోగులలో రక్తపీడనము కొద్దిగా పెరుగుతే ( ముకుళిత పీడనము 150 - 160 mmhg లోపు ) దానికి చికిత్సలు చేయకూడదు. రక్తపీడనము తీవ్రముగా పెరిగిన వారికి సగటు ధమనీ పీడనము ( mean arterial pressure ) 10- 15 శాతము తగ్గించుటకు చికిత్స అవసరము. వీరిలో ACE inhibitors, ARBs వాడకూడదు.

    మూత్రాంగ విఘాతము కలిగిన వారిలో మందుల విసర్జన తగ్గుతుంది కాబట్టి అవసరమయిన మందుల మోతాదులను సవరించాలి. అనవసరపు మందులు వాడకూడదు. వీరిలో నిరూపితము కాని ఔషధములు చికిత్సలో వాడకూడదు. అవి మూత్రాంగములపై కలిగించు శ్రమ వలన, మూత్రాంగములపై వాటి విష ప్రభావము ( toxicity ) వలన కలిగే నష్టమే ఎక్కువ.

మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( Renal replacement therapy ; Dialysis ) 


    సత్వర మూత్రాంగ విఘాతమునకు గుఱియగు వారిలో కొందఱికి మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స అవసరము కావచ్చును. 

   1). విశేషమైన అరుచి, వాంతికలిగే భావన, మందులకు తగ్గని వాంతులు పెక్కు దినములు ఉన్నవారికి,
   2). ఔషధములకు తగ్గని ప్రమాదకర రక్తద్రవపు పొటాసియమ్ ( serum potassium ) విలువలు కలవారికి,
   3). మూత్రకారకములకు ( diuretics ) తగ్గని ద్రవభారము ( fluid overload ) కలవారికి, 
   4). రక్తము ప్రమాదకరముగా ఆమ్లీకృతము ( acidosis  ) అయినవారికి, 
   5). యూరియా వంటి వ్యర్థ పదార్థములు ఎక్కువగా పెరిగి  మతిభ్రమణము, మతిలో యితర మార్పులు,  మూర్ఛలు కలిగిన వారికి,
   6). యూరియా వలన హృదయ వేష్టనములో తాపము (uremic pericarditis ) కలిగిన వారికి,               
   7) . మూత్రాంగ విఘాతము తీవ్రముగా ఉండి, నయము కాగల అవకాశము లేక రక్తద్రవపు క్రియటినిన్ (Serum creatinine ) విలువలు అధికస్థాయికి పెరుగుతున్న వారికి 

    మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( renal replacement therapy ; dialysis ) అవసరము.

    మెథనాల్  ( methanol ), ఎథిలిన్ గ్లైకాల్ (  ethylene glycol ; antifreeze ), సేలిసిలేట్స్ ( salicylates ) విషముల వలన మూత్రాంగ విఘాతము కలిగిన వారికి విషపదార్థములు తొలగించుటకై  రక్తశుద్ధిచికిత్స ( hemodialysis ) అవసరము అవుతుంది.


( ఈ వ్యాసము కొంచెము క్లిష్టమైనది . వైద్యుల ప్రమాణములో వ్రాయబడినది. అయినా సామాన్యప్రజలకు కొంతైనా అర్థము అవుతుంది.
    నా సామర్థ్యపు మేరకు తెలుగులో వైద్యవిషయాలను చెప్పడము నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను సంప్రదించ ప్రార్థన .
ఉపయుక్తమనుకుంటే నా వ్యాసములు నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )



12, ఏప్రిల్ 2020, ఆదివారం

దూరధమని వ్యాధి ( Peripheral arterial disease )


                                దూర( మేర ) ధమని వ్యాధి

                             ( Peripheral Arterial Disease )

                                                   డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి      .
( తెలుగుతల్లి కెనడా వారి సౌజన్యముతో ) :

    దూర( మేర ) ధమనులలో రక్తప్రసరణకు అంతరాయము కలుగుతే దానిని దూర ( మేర ) ధమని వ్యాధిగా ( Peripheral Arterial Disease ) పరిగణిస్తారు. ఈ దూర ( మేర ) ధమని వ్యాధికి ముఖ్యకారణము ధమనీ కాఠిన్యత ( arteriosclerosis ).

                                        కాళ్ళ ధమనులు                                        

                                        ( Arteries of lower extremities )


    శరీరములో వివిధ అవయవాలకు ధమనుల ద్వారా రక్తప్రసరణ జరిగి వాటి కణజాలమునకు ప్రాణవాయువు, పోషకపదార్థములు అందించబడుతాయి. గుండె ఎడమజఠరిక ( left ventricle ) నుంచి బయల్వడు బృహద్ధమని ( aorta ) ఛాతి నుంచి ఉదరములో ఉదర బృహద్ధమనిగా ( abdominal aorta ) వివిధ శాఖలను ఇచ్చి, కటివలయములో ( pelvis ) రెండు శ్రోణి ధమనులుగా ( ileac arteries ) చీలుతుంది. ప్రతి శ్రోణిధమని బాహ్య శ్రోణిధమని ( external ileac artery ), అంతర శ్రోణిధమని ( internal ileac artery ) శాఖలను ఇస్తుంది. బాహ్య శ్రోణి ధమని తొడ లోనికి తొడ ధమనిగా ( ఊరుధమని femoral artery ; ఊరువు = తొడ )  ప్రవేశిస్తుంది. ఊరు ధమని నిమ్నోరు ధమని ( Profunda femoris artery ) శాఖను యిచ్చి బాహ్యోరు ధమనిగా ( Superficial femoral artery ) తొడలో కొనసాగి మోకాలి వెనుకకు జాను ధమనిగా ( Polpliteal artery ) ప్రవేశించి పూర్వ జంఘికధమని ( anterior tibial artery ), పృష్ఠ జంఘిక ధమని (Posterior tibilal artery ) శాఖలుగా చీలుతుంది. ఈ ధమనులు కాళ్ళకు, పాదములకు రక్త ప్రసరణ చేకూరుస్తాయి. 



    పూర్వ జంఘిక ధమని ( anterior tibial artery ) పైపాదములో ఊర్ధ్వపాద ధమనిగా ( Dorsalis pedis artery ) కొనసాగుతుంది. ఊర్ధ్వపాద ధమని ( dorsalis pedis artery ) నుంచి మధ్యపాద ధమని శాఖ ( metatarsal artery, ( or ) arcuate artery ) వెలువడి మధ్యస్థము ( medial ) నుంచి నడిపాదములో ఊర్ధ్వపాద చాపముగా ( dorsal plantar arch ) పార్శ్వభాగమునకు కొనసాగుతుంది. ఊర్ధ్వపాదధమని, ఊర్ధ్వపాద చాపముల నుంచి అంగుళిక ధమనులు ( digital arteries ) కాలివేళ్ళ పైభాగములకు రక్తప్రసరణ చేకూరుస్తాయి.
    పృష్ఠ జంఘికధమని ( posterior tibial artery ) అరపాదమునకు చేరి మధ్యస్థ పాదతల ధమని ( medial plantar artery ), పార్శ్వ పాదతల ధమనులుగా ( lateral plantar artery ) శాఖలు చెంది అరకాలికి రక్తప్రసరణ సమకూర్చుతాయి . పార్శ్వ పాదతల ధమని ( lateral plantar artery ) కాలి మడమనుంచి పాదములో ప్రక్క భాగమునకు పయనించి పిదప మధ్య భాగమువైపు పాదతల ధమనీ చాపముగా ( Plantar arterial arch ) విల్లు వలె సాగి పాదతలమునకు చొచ్చుకొను ఊర్ధ్వ పాదధమని శాఖయైన నిమ్నపాద ధమనితో ( deep plantar artery of dorslis pedis artery ) కలుస్తుంది. పాదతల ధమనీ చాపము ( plantar arterial arch) నుంచి అంగుళిక ధమనీ శాఖలు ( digital arteries ) కాలివేళ్ళకు రక్తప్రసరణ సమకూర్చుతాయి.

ధమనుల నిర్మాణము 


    ధమనుల గోడలలో బయటపొర ( tunica externa or advenitia ), మధ్యపొర ( tunica media ),లోపొర ( tunica interna or intima ) అనే మూడు పొరలు ఉంటాయి. బయట పొరలో సాగుకణజాలము ( elastic tissue ), పీచుకణజాలము ( fibrous tissue ) ఉంటాయి. మధ్య పొరలో మృదుకండరములు ( smooth muscles ), సాగుకణజాలము ( elastic tissue ), పీచుకణజాలము ( fibrous tissue ) పీచుపదార్థము ( collagen ) ఉంటాయి. నాళపు లోపొర పూతకణములు ( lining cells: endothelium ), సాగుపదార్థము ( elastin ), పీచుపదార్థముల ( collagen ) మూలాధారమును ( basement ) అంటిపెట్టుకొని ఉంటాయి. పెద్ద రక్తనాళములకు రక్తము సరఫరా చేసే రక్తనాళ రక్తనాళికలు ( vasa vasorum ) కూడా రక్తనాళపు గోడలలో ఉంటాయి.


                                     దూర ధమనుల వ్యాధి 


    ధమనీ కాఠిన్యత ( arteriosclerosis ) శైశవమునుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత కనిపించి వృద్ధాప్యములో తీవ్రతరము అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొరలో ( intima ) పూతకణముల క్రింద మాతృకలో (matrix) కొవ్వులు, కొలెష్టరాలు, కాల్సియం, తాపకణములు పేరుకొని ఫలకలుగా ( plaques ) పొడచూపుతాయి.
ఈ పలకలు రక్తనాళముల లోపలి పరిమాణమును తగ్గిస్తాయి. ధమనుల లోపలి పరిమాణము ఎక్కువగా తగ్గితే కణజాలమునకు రక్తప్రసరణ తగ్గుతుంది. ధమనుల లోపొరలోని పలకలు చిట్లుతే వాటిపై తాపప్రక్రియ కలిగి, రక్తపుగడ్డలు ఏర్పడి ( thrombosis ) రక్తప్రసరణకు ఆకస్మిక అవరోధము కలుగజేయగలవు. 
       దూరధమనుల వ్యాధి సాధారణముగా కాళ్ళలో చూస్తాము. ఈ వ్యాధివలన రక్తప్రసరణకు ఆటంకము ఏర్పడుతుంది. అమెరికాలో అరవై సంవత్సరాలు దాటిన వారిలో 12 నుంచి 20 శాతపు వారిలోను ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వారిలో 50 శాతపు వారిలోను దూరధమని వ్యాధి పొడచూపుతుంది. ప్రపంచములో 20 కోట్లమంది యీ వ్యాధిగ్రస్థులు ఉంటారు. 

కారణములు 


    వృద్ధాప్యము వలన ధమనీకాఠిన్యత కలిగినా పిన్నవయస్సులోనే యీ వ్యాధిని తీవ్రతరము చేసే కారణములను వైద్యులు , శాస్త్రజ్ఞులు చాలా సంవత్సరముల పూర్వమే పసిగట్టారు. ఇవి :

ధూమపానము 


    దూరధమని వ్యాధిని కలుగజేసే కారణములలో పొగత్రాగుట ప్రధమస్థానములో నిలుస్తుంది. దూరధమని వ్యాధి కలిగేవారిలో 80 నుంచి 90 శాతము మంది ప్రస్తుతపు, లేక పాత ధూమపానీయులే.
ఇతరుల నుంచి పొగ పీల్చినవారిలో కూడా యీ వ్యాధి కలిగే అవకాశములు ఉన్నాయి. వీరిలో రక్తనాళముల లోపొరలో జరిగే మార్పుల వలన ధమనీ కాఠిన్యత వేగము పెరుగుతుంది. దినమునకు కాల్చే పొగాకు, ధూమపానము చేసిన సంవత్సరములతో వ్యాధి అనుపాత నిష్పత్తితో ముడిపడి ఉంటుంది.

మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) 


    మధుమేహవ్యాధి కాలము, తీవ్రతతో దూరధమని వ్యాధి కలిగే అవకాశములు పెరుగుతాయి. మధుమేహవ్యాధి కలవారిలో దూరధమనివ్యాధి కలిగే అవకాశము రెండింతలు అవుతుంది.

కొవ్వులు, కొలెష్టరాలు 


    అల్ప సాంద్రపు కొలెష్టరాలు (low density lipoprotein ) హెచ్చుగా ఉన్నవారిలోను, అధిక సాంద్రపు కొలెష్టరాలు ( high density lipoprotein ) తక్కువగా ( 40 మి.గ్రా/ డె.లీ కంటె తక్కువ ) ఉన్నవారిలోను, ట్రైగ్లిసరైడులు హెచ్చుగా ఉన్న వారిలోను ఈ వ్యాధి ప్రాబల్యము హెచ్చు. రక్తపీడనము అధికమైన ( hypertension ) వారిలోను, దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిగ్రస్థులలోను ( chronic kidney disease ) దూరధమని వ్యాధి ప్రాబల్యము అధికముగా ఉంటుంది.

వ్యాధిలక్షణములు 


    దూరధమని వ్యాధిగ్రస్థులలో ప్రామాణిక లక్షణము సవిరామపు పోటు ( intermittent claudication ). ఈ పోటు కాలిపిక్కలో ( calf ) కొంతదూరము నడిచిన పిదప క్రమరీతిలో కలిగి, విశ్రాంతి తీసుకొన్న పది నిమిషములలో క్రమరీతిలో ఉపశమిస్తుంది. ఈ పోటు సలుపుగా గాని, నొప్పిగా గాని, పోటుగా గాని, నీరసము వలె గాని పొడచూపవచ్చును. నడిచేటపుడు కాలి కండరములకు రక్తప్రసరణ అవసరము పెరుగుతుంది. ధమనుల నాళ పరిమాణము తగ్గుటవలన అవసరములకు తగినంత రక్తప్రసరణ, ప్రాణవాయువు సరఫరా లోపించి కండరములలో నొప్పి, పోటు, కలుగుతాయి. కాని సుమారు పది శాతపు మందిలోనే యీ పోటు ప్రామాణికముగా ఉంటుంది. నలభై శాతము మందిలో నొప్పిగాని, బాధగాని ఉండదు. కొందఱిలో నొప్పి కాలి పిక్కలలో కలుగక పోవచ్చును. కొందఱిలో నొప్పి నడక ఆపివేయునంత తీవ్రముగా ఉండకపోవచ్చును. కొందఱిలో నొప్పి పది నిముషముల విశ్రాంతితో ఉపశమించక పోవచ్చును.
వ్యాధి తీవ్రత హెచ్చయినవారిలో నొప్పి విశ్రాంత సమయములలో కూడా కలుగుతుంది. సాధారణముగా యీ విశ్రాంతపు నొప్పి ( rest pain ) రాత్రుళ్ళు పడుకున్నప్పుడు కలిగి, కాలు క్రింద పల్లములో పెట్టాక తగ్గుతుంది. అపుడు కాలికి రక్తప్రసరణ కలిగి పాదములో ఎఱ్ఱదనము పొడచూపుతుంది. రక్తప్రసరణ లోపము వలన కణజాల నష్టము, పాదములలో ‘ బెజ్జములు కొట్టినట్లు ‘ కనిపించే మానని పుళ్ళు (non healing  ulcers with punched out appearance ) కలుగవచ్చును.
    రక్తప్రసరణకు పూర్తిగా ఆటంకము కలిగినపుడు కాలు చల్లబడుతుంది. నొప్పి విపరీతముగా ఉంటుంది. కాలు పాలిపోయి ఉంటుంది. కణజాలములు మరణిస్తే, వేళ్ళలోను, పాదములోను కుళ్ళుదల ( gangrene ) కలుగుతుంది. దూరధమని వ్యాధి కలవారిలో వ్యాధి ఉన్న కాలి చర్మములో రోమములు తగ్గిపోతాయి. చర్మము దళసరి తగ్గి నున్నబడి మెరుస్తూ ఉంటుంది. కండరములు క్షయము పొందుతాయి. ధాతునాడులు ( dorsalis pedis and posterior tibial artery pulses ) నీరసిస్తాయి. నాడి చేతికి తగలక పోవచ్చును. కాళ్ళు, పాదములు ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతాయి. వ్యాధి తీవ్రముగా ఉంటే కాలు పైకెత్తినపుడు పాలిపోయి క్రిందకు దింపాక ఎఱ్ఱబడుతుంది. బెజ్జములు కొట్టినట్లు ( punched out appearance) మానుదలలేని పుళ్ళు ఉండవచ్చు. కణజాలము రక్తప్రసరణ లేక చనిపోతే, ఆ భాగము నల్లబడి కుళ్ళుదల ( gangrene ) చూపవచ్చును.




పరీక్షలు ( investigations ) 


    కాళ్ళలో దూరధమని వ్యాధిని కనుగొనుటకు డాప్లర్ శ్రవణాతీతధ్వని సాధనముతో చీలమండ ( ankle ) వద్ద ఊర్ధ్వపాద ధమనిలో ( dorsalis pedis artery ) ముకుళిత రక్తపీడనమును ( systolic blood pressure ) బాహుధమనిలో ( brachial artery ) ముకుళిత రక్తపీడనమును కొలిచి వాని నిష్పత్తిని ( చీలమండ రక్తపీడనము / బాహు రక్తపీడనము = Ankle Brachial Index ABI index ) లెక్కకట్టాలి. ఆ నిష్పత్తి 0.9 కంటె తక్కువయితే దూరధమని వ్యాధిని సూచిస్తుంది. ఈ పరీక్ష సున్నితమైనది ( sensitive ) మఱియు నిశితమైనది ( specific ). తొంభైయైదు శాతపు వ్యాధిగ్రస్థులలో ఈ నిష్పత్తి వ్యాధిని పసిగట్టుతుంది.
    అధిక రక్తపీడనము ( hypertension ), మధుమేహవ్యాధి ( diabetes mellitus ), దీర్ఘకాల మూత్రాంగ వ్యాధుల ( chronic kidney disease ) వలన అతిసూక్ష్మ ధమనులు సంకోచించి ప్రసరణలోపము ( small vessel disease ) కలుగజేసినపుడు యీ నిష్పత్తి వ్యాధిని పసిగట్టక పోవచ్చును. 
    ధమనీ కాఠిన్యత హెచ్చయి రక్తనాళముల గోడలలో కాల్సియమ్ పేరుకొనుట వలన చీలమండ దగ్గఱ రక్తనాళములు అణచుటకు వీలుబడకపోతే ( Noncompressible vessels ) అంగుళి రక్తపీడనము / బాహు రక్తపీడనముల ( toe pressure / upper arm pressure ) నిష్పత్తిని వ్యాధి నిర్ణయమునకు పరిగణించవచ్చును. 
    వ్యాధి లక్షణములు ఉండి చీలమండ / బాహు రక్తపీడనముల నిష్పత్తి సాధారణ పరిమితులలో ఉంటే నడక యంత్రముపై ( treadmill ) ఐదు నిమిషముల వ్యాయామము చేయించిన తర్వాత ఆ యా రక్తపీడనములు కొలిచి చీలమండ / బాహువుల ముకుళిత రక్తపీడనముల నిష్పత్తిని తీసుకొని వ్యాధి నిర్ణయము చేయవచ్చును. వ్యాధిగ్రస్థులలో వ్యాయామము పిదప చీలమండ / బాహువుల నిష్పత్తి 20 శాతము తగ్గుతుంది.
    శ్రవణాతీతధ్వని చిత్రీకరణముతో ( ultrasonography )  రక్తనాళముల చిత్రములను గ్రహించి సంకుచితములు పొందిన భాగములను గుర్తించవచ్చును. రక్తనాళముల లోనికి సన్నని నాళికను ( catheter ) చొప్పించి దాని ద్వారా వ్యత్యాస పదార్థములను ( contrast material ) ఎక్కించి ఎక్స్ -రేలతో రక్తనాళములను చిత్రీకరించ వచ్చును. వ్యత్యాస పదార్థములు యిచ్చి గణనయంత్ర ( త్రిమితీయ ) ధమనీ చిత్రీకరణములను ( CT Angiograms ), అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణములను ( magnetic resonance Angiography ) చేసి వ్యాధిని ధ్రువీకరించ వచ్చును.

ఇతర సమస్యలు 


    దూరధమని వ్యాధిగ్రస్థులు ధమనీ కాఠిన్యత ప్రభావమువలన హృద్ధమని వ్యాధులకు ( Coronary artery disease ), మస్తిష్క రక్తనాళ విఘాతములకు ( cerebro vascular accidents ) అధిక సంఖ్యలో పాలవుతారు. ఉదర బృహద్ధమనిలో బుడగలు ( abdominal aortic aneurysms ) కూడా వీరిలో కలుగవచ్చును. అందువలన ఆ వ్యాధులను కనుగొను పరీక్షలు, వాటికి చికిత్సలు కూడా అవసరమే.

చికిత్స 


జీవనశైలిలో మార్పులు ( Life style modification ) 


ధూమపాన విరమణ 


    దూరధమని వ్యాధిగ్రస్థులు ధూమపానమును ( tobacco smoking ) తప్పక విరమించాలి. నా నలుబది సంవత్సరముల వైద్యవృత్తి ప్రత్యక్ష అనుభవములో రక్తప్రసరణ లోపము వలన కాళ్ళు కోల్పోయిన వారిలో 95 శాతము మంది ధూమపానీయులే. అందువలన పొగత్రాగుట తప్పకుండా మానాలి.

వ్యాయామము ( exercise ) 


    దూరధమని వ్యాధిగ్రస్థుల శిక్షణపూర్వక వ్యాయామము అవసరము. నడక యంత్రములపై గాని ( treadmills, exercise bicycles, and ellipticals ), నేలపైన గాని కాళ్ళలో నొప్పులు పుట్టే సమయమునకు కొంచెము సమయము తగ్గించి నడుస్తూ, విరామము తీసుకుంటూ దినమునకు 30 నుంచి 60 నిమిషముల వ్యాయమము చేస్తే సత్ఫలితములు కలుగుతాయి. కాళ్ళ వ్యాయామము వలన చిన్న ( శాఖలు ) ధమనుల పరిమాణము పెరిగి కణజాలమునకు ప్రత్యామ్నాయ ప్రసరణను ( collateral circulation ) పెంపొందిస్తాయి. వ్యాయామము వలన హృద్ధమని సంఘటనలు, ( cardiovascular events ), మస్తిష్క విఘాత సంఘటనలు ( cerebro vascular events ) కూడా తగ్గుతాయి. వీరు నొప్పి కలుగకుండా నడవగలిగే దూరము, సమయము కూడా పెరుగుతాయి.

    మధుమేహవ్యాధిని, ఆహారనియమముతోను, వ్యాయామముతోను, తగిన ఔషధములతోను అదుపులో పెట్టుకోవాలి.
    రక్తపుపోటు ఎక్కువయితే దానిని ఆహారనియమము, వ్యాయామము, ఔషధములతో అదుపులో పెట్టుకోవాలి.
    అల్పసాంద్రపు కొలెష్టరాలుని ( Low density Lipoprotein ) ఆహారనియమము, స్టాటిన్ (statins ) మందులతో తగ్గించుకోవాలి. అధికసాంద్రపు కొలెష్టరాలుని ( High Density Lipoprotein) పెంచుకోవాలి.
ట్రైగ్లిసరైడులను ( triglycerides ) ఆహారనియమము, మందులతో తగ్గించుకోవాలి.

ఏస్పిరిన్ ( Aspirin ) 


    దూరధమనివ్యాధి లక్షణములు కలవారిలో ఏస్పిరిన్ వాడుక వలన ధమనులలో రక్తపుగడ్డలు ఏర్పడుట తగ్గుతుంది. హృద్ధమని సంఘటనలు, మస్తిష్క విఘాత సంఘటనలు తగ్గుతాయి. ఏస్పిరిన్ రక్తఫలకలు గుమికూడుటను ( platelet aggregation ) నివారిస్తుంది. కణజాల విధ్వంసము తగ్గిస్తుంది.

క్లొపిడోగ్రెల్ ( Clopidogrel ) 


    ఏస్పిరిన్ వాడలేనివారిలో రక్తఫలకములు గుమికూడుటను నివారించి రక్తపు గడ్డలను అరికట్టుటకు క్లొపిడోగ్రెల్ ను ఉపయోగిస్తారు. ఏస్పిరిన్  క్లొపిడోగ్రెల్ రెండూ కలిపి వాడుట వలన పరిశోధనలలో అదనపు ప్రయోజనము కనబడలేదు. రెండిటి వాడకము వలన రక్తస్రావ ప్రమాదములు ఎక్కువయే అవకాశములు ఉన్నాయి.
    ఇదివరలో గుండెపోటు కలిగినవారిలో టికగ్రిలార్ ( ticagrelor ( Brilinta ) ) ప్రమాదకర హృదయ సంఘటనలను ( Major Adverse Cardiac Events - MACE ) తగ్గించుటకు ఏస్పిరిన్ తో పాటు ఉపయోగిస్తారు.

సిలొష్టజోల్ ( Cilostazol ) 


    సిలొష్టజోల్ వాడుక వలన దూరధమని వ్యాధిగ్రస్థులు నడవగలిగే దూరము పెరుగవచ్చును. కాని పరిశోధనలలో దీర్ఘకాలిక ప్రయోజనములు కనిపించలేదు. హృద్ధమని సంఘటనలు, మర్త్యత్వములలో ( mortality ) తేడా కనిపించలేదు. సిలోష్టజోల్ వలన కాళ్ళలో పొంగులు కలుగవచ్చును. 
    హృదయవైఫల్యపు లక్షణములు అధికము కావచ్చును. దీనివలన కళ్ళుతిరుగుట, కడుపు పీకు, వంటి విలక్షణములు కలుగవచ్చును
    పెంటాక్సిఫిలిన్ ( Pentoxifylline ) చాలా సంవత్సరములు వాడుకలో ఉన్నా దీనివలన ప్రయోజనము అనుమానాస్పదమే.
    విటమిన్ బి -12, ఫోలిక్ ఏసిడ్ ల వలన ప్రయోజనము కలుగదు.

ధమనీ పునరుద్ధరణ చికిత్సలు ( Revascularization procedures ) 


    దూర ధమనులలో వ్యాధి తీవ్రత హెచ్చయినప్పుడు, విరామ సమయములలో నొప్పి కలుగునపుడు ధమనీ పునరుద్ధరణ ( revascularization ) అవసరము.
    కృత్రిమ నాళికపు బుడగతో ధమనిలో సంకుచించిన భాగమును వ్యాకోచింపజేయవచ్చును ( balloon angioplasty). శ్రోణిధమని ( ileac artery ), ఊరుధమనులలో (femoral artery ) వ్యాధి ఉంటే యీ ప్రక్రియ వలన ప్రయోజనము కలుగవచ్చును. క్రింద ధమనుల వ్యాధిగ్రస్థులలో ఫలితములు తక్కువ. 
ధమనిని వ్యాకోచింపజేసిన ( angioplasty ) పిమ్మట వ్యాకోచ నాళికలు ( stents ) పొందుపఱచుట వలన ఫలితములు మెరుగుగా లేవు. ధమనీ కాఠిన్య ఫలకల తొలగింపు ( atherectomy ) వలన, ధమనిని వ్యాకోచింపజేయుటకంటె దీర్ఘకాలిక ఫలితములు మెరుగుగా లేవు.

అధిగమన శస్త్రచికిత్సలు ( bypass surgeries) 


    ధమనులలో సంకుచిత భాగమును దాటుకొని రక్తప్రసరణను పునరుద్ధరించుటకు అధిగమన శస్త్రచికిత్సలు ( bypass surgeries) అందుబాటులో ఉన్నాయి. రోగి దృశ్యసిరను కాని ( Great saphenous vein ), కృత్రిమ నాళమును ( Gore-Tex graft ) కాని, ధమనిలో సంకుచిత భాగమునకు ముందు ఒకకొనను, వెనుకను రెండవ కొనను కలిపి కణజాలమునకు రక్తప్రసరణను పునరుద్ధింప జేస్తారు.

రక్తపుగడ్డల తొలగింపు ( Embolectomy ) ; రక్తపుగడ్డల విచ్ఛేదన ( Thrombolytic therapy ) 


    ధమనులలో రక్తపు గడ్డలు ఏర్పడినా ( thrombosis ), ప్రవాహములో వచ్చి పేరుకొనినా ( emboli ) వాటిని శస్త్రచికిత్సతో కృత్రిమ నాళికపు బుడగలను ఉపయోగించి తొలగిస్తారు. అలా తొలగించ లేనపుడు రక్తపు గడ్డల విచ్ఛేదకములను ( tissue plasminogen activator- tPA / thrombolytic agents ) వాడి వాటిని కరిగింపజేస్తారు.

అంగవిచ్ఛేదనము ( amputation ) 


    రక్తప్రసరణ కోల్పోయి కణజాలము మరణించినపుడు  ( gangrene formation ), పుళ్ళుపడి సూక్ష్మజీవుల ఆక్రమణ అధ్వాన్నమయినపుడు, రక్తప్రసరణ పునరుద్ధరణ సాధ్యము కానప్పుడు బాధ ఉపశమునకు, ప్రాణరక్షణకు అంగవిచ్ఛేదన ( amputation ) అవసరము. రక్తప్రసరణకు అవరోధము ఎచట ఉన్నదో దానిని బట్టి ఎచ్చట విచ్ఛేదనము చెయ్యాలో వైద్యులు నిర్ణయిస్తారు.
    దూరధమని వ్యాధిగ్రస్థులలో హృద్ధమని వ్యాధులు, గుండెపోటులు, మస్తిష్క విఘాతములు వలన మృత్యువు కలిగే అవకాశములు, అంగనష్టము కలిగే అవకాశము కంటె హెచ్చు.
                                         
పదకోశము :

 Peripheral Arterial Disease = దూర ధమని వ్యాధి ( గ.న )
 abdominal aorta = ఉదర బృహద్ధమని ( గ.న )
 ileac arteries = శ్రోణి ధమనులు
 external ileac artery = బాహ్య శ్రోణిధమని 
 internal ileac artery = అంతర శ్రోణి ధమని
 femoral artery =  ఊరు ధమని ( గ.న )(ఊరువు = తొడ )
 Profunda femoris artery = నిమ్నోరు ధమని ( గ.న )
Superficial femoral artery = బాహ్యోరు ధమని ( గ.న )
Polpliteal artery = జానుధమని ( గ.న )
 anterior tibial artery = పూర్వ జంఘిక ధమని ( గ.న )
 Posterior tibilal artery = పృష్ఠ జంఘిక ధమని ( గ.న )
 Dorsalis pedis artery = ఊర్ధ్వపాద ధమని ( గ.న )
 metatarsal artery ,( or ) arcuate artery = మధ్యపాద ధమని శాఖ ( గ.న )
 dorsal plantar arch = ఊర్ధ్వపాదచాపము ( గ.న )
 digital arteries  = అంగుళిక ధమనులు ( గ.న )
medial plantar artery = మధ్యస్థ పాదతల ధమని ( గ.న )
 lateral plantar artery =  పార్శ్వ పాదతలధమని ( గ.న )
 deep plantar artery of dorslis pedis artery = నిమ్నపాద ధమని ( గ.న )
 plantar arterial arch = పాదతల ధమనీచాపము ( గ.న )
 elastic tissue = సాగుకణజాలము ( గ.న )
 fibrous tissue = పీచుకణజాలము ( గ.న ) , తంతుకణజాలము
 arteriosclerosis = ధమనీకాఠిన్యత
 intermittent claudication  = సవిరామపు పోటు ( గ.న )
 Ankle Brachial Index ABI index = చీలమండ రక్తపీడనము / బాహు రక్తపీడనము 
 treadmill = నడకయంత్రము
 magnetic resonance Angiography = అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణము ( గ.న )
 CT Angiogram  = గణనయంత్ర త్రిమితీయ ధమనీ చిత్రీకరణము ( గ.న )
 abdominal aortic aneurysms = . ఉదర బృహద్ధమని బుద్బుదము ( గ.న )
 collateral circulation = ప్రత్యామ్నాయ ప్రసరణ 
 Revascularization procedures = ధమనీ పునరుద్ధరణ చికిత్సలు ( గ.న )
 bypass surgeries = అధిగమన శస్త్రచికిత్సలు ( గ.న )

( గ.న ) : డా.గన్నవరపు నరసింహమూర్తిచే కూర్చబడిన పదములు )

( తెలుగులో వైద్యవిషయములపై సమాచారము నా శక్తిమేరకు అందించుట నా వ్యాసముల లక్ష్యము.
వ్యాధిలక్షణములు గలవారు తమ తమ వైద్యులను తప్పక సంప్రదించాలి. ఉపయుక్తము అనుకుంటే నిరభ్యంతరముగా పంచుకొనవచ్చును. )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...